mid term polls
-
US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే
ఎస్.రాజమహేంద్రారెడ్డి అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పాలకపక్షం తన ఎజెండాను బలవంతంగా తమపై రుద్దే ప్రమాదం నుంచి ప్రజలు ఒకరకంగా బయట పడ్డారనే చెప్పుకోవాలి. రాష్ట్రానికి ఇద్దరు చొప్పున వంద మంది సభ్యులుండే సెనేట్‌పై అధికార డెమొక్రాట్ పార్టీ ఒకే ఒక్క సీటు ఆధిక్యంతో పట్టు నిలబెట్టుకుంది. 435 మంది సభ్యులుండే ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్ పార్టీ 221 సీట్లలో నెగ్గి ఆధిక్యం ప్రదర్శించింది. డెమొక్రాట్లు 213 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు జో బైడెన్ ఇకపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంతమాత్రం ఉండదు. ప్రజలకు నచ్చని ఏ నిర్ణయాన్నైనా రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో అడ్డుకుని తీరతారు. ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండే, వారికి లబ్ధి చేకూర్చే నిర్ణయాలే చట్టాలవుతాయి. అమలవుతాయి. కాదు, కూడదు అంటే రిపబ్లికన్ల నుంచి బైడెన్‌కు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవడం ఖాయం. నెత్తిన పాలు పోసిన ట్రంప్ ఈ మధ్యంతర ఎన్నికలకు ముందు ఎర్ర (రిపబ్లికన్ పార్టీ) గాలి కాస్త గట్టిగానే వీచింది. అది తుఫాన్‌లా మారి డెమొక్రాట్లను తుడిచిపెట్టడం ఖాయమనుకున్నారు. డెమొక్రాట్లకు సెనేట్‌లో పరాభవం తప్పదని, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోతారని పరిశీలకులు అంచనా వేశారు. బైడెన్ ఇరకాటంలో పడతారని భావించారు. కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. డెమొక్రాట్లు ఫర్వాలేదనిపించారు. బైడెన్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదంతా బైడెన్‌పై సానుకూలత కాదని, రిపబ్లికన్లను ఇప్పటికీ శాసిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత అని రాజకీయ పండితులు తేల్చారు. ‘అమెరికా ఫస్ట్’ అంటూ గొప్పలకు పోయిన ట్రంప్ అధ్యక్షునిగా ఉండగా ప్రదర్శించిన దూకుడు, నాలుగేళ్ల పాలనలో తీసుకున్న ఒంటెత్తు నిర్ణయాలు 2020లో ఆయన ఓటమికి దారితీయడం తెలిసిందే. ఇప్పుడు మధ్యంతరంలోనూ ట్రంప్ నీడ ఓటర్లను బాగా భయపెట్టింది. అందుకే, భారీ మెజార్టీ ఖాయమనుకున్న రిపబ్లికన్ పార్టీ కాస్తా ప్రతినిధుల సభను కేవలం అత్తెసరు ఆధిక్యంతో మాత్రమే గెలుచుకోగలిగింది. సెనేట్‌పై పట్టు బిగించడంలో విఫలమైంది. ట్రంప్‌కు రిపబ్లికన్లు ఇక స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నది పరిశీలకుల అభిప్రాయం. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిని తానేనని ఇప్పట్నుంచే బాహాటంగా చెప్పుకుంటున్న ఆయనను నిలువరిస్తేనే పార్టీ పరిస్థితి బాగుపడుతుందన్న చర్చ కూడా ఊపందుకుంది. అధికార పక్షాలకు ఎదురుగాలే...! అధికార పార్టీ మధ్యంతర ఎన్నికల్లో భారీగా సీట్లను కోల్పోయినట్టు గత రెండు ఫలితాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక మధ్యంతరంపై ప్రభావం చూపడం ఆనవాయితీగా వస్తోంది. 2014 మధ్యంతరంలో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో డెమొక్రాట్ పార్టీ సెనేట్‌లోనూ, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోయింది. 2018లో ట్రంప్ హయాంలో అధికార పార్టీగా రిపబ్లికన్లు సెనేట్‌లో కాస్త పర్వాలేదనిపించినా సభలో మాత్రం ఏకంగా 42 సీట్లు కోల్పోయి ఘోరంగా దెబ్బ తిన్నారు! తాజా మధ్యంతరంలోనూ రిపబ్లికన్ పార్టీ విపక్షంలో ఉండి కూడా జనాల్లో ఉన్న ట్రంప్ వ్యతిరేకత పుణ్యమా అని ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయింది!! సెనేట్ను చేజార్చుకోవడమే గాక ప్రతినిధుల సభలోనూ అత్తెసరు ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది! మన మాదిరిగా కాదు... మన దగ్గర మధ్యంతర ఎన్నికలంటే అదేదో అరుదైన విశేషంగా కనిపిస్తుంది. అంచనాలు, లెక్కలు వేగంగా మారిపోతుంటాయి. అధికార పక్షం మళ్లీ అధికారంలోకి వస్తుందా, లేక ప్రతిపక్షానికి దాసోహమంటుందా అన్నదే చర్చనీయాంశమవుతుంది. ఫలితాలను బట్టి పాలకపక్షంతో పాటు పాలకుడూ మారవచ్చు, మారకపోనూ వచ్చు. కానీ చట్టసభలో సభ్యులు మాత్రం కచ్చితంగా మారతారు. మళ్లీ గెలిచే సిట్టింగులు తప్ప మొత్తమ్మీద కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రివర్గం... ఇలా కొద్దిరోజులు హంగామా, హడావుడి ఉంటాయి. కానీ అమెరికా మధ్యంతరం మరో విధంగా ఉంటుంది. ప్రత్యక్ష విధానంలో నాలుగేళ్ల పదవీకాలానికి అధ్యక్ష ఎన్నిక జరిగిన రెండేళ్లకు వచ్చే ఎన్నికలు గనుక వీటిని మధ్యంతరం (మిడ్ టర్మ్) అంటారు. ఇందులో ప్రతినిధుల సభలోని మొత్తం 435 సీట్లకు, సెనేట్‌లో మొత్తం వంద స్థానాలకు గాను 35 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. మధ్యంతర ఫలితమెలా ఉన్నా ప్రత్యక్ష విధానంలో ఎన్నికైన అధ్యక్షుడు మారడు. మిగతా రెండేళ్లూ పదవిలో కొనసాగుతాడు. పాలక పక్షమూ మారదు. మంత్రివర్గమూ యథాతథంగా కొనసాగుతుంది. అధికారమైతే ఉంటుంది. కానీ చట్టసభల్లో ఆధిక్యం కోల్పోతే ఆ ప్రభావం అధికార నిర్ణయాల అమలుపై పడుతుంది. 2020లో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టి ఈ నవంబర్‌తో రెండేళ్లవడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఒకరకంగా అధ్యక్షుని రెండేళ్ల పాలనకు రెఫరెండం వంటివి. అలాగే మిగతా రెండేళ్ల పదవీకాలంలో పనితీరు మార్చుకోవడానికి ఓ మంచి అవకాశం కూడా. అధ్యక్షునికి మరోసారి పోటీ చేసే అవకాశముంటే ఈ అనుభవం చక్కని పెట్టుబడి అవుతుంది. అమెరికాలో ఒక వ్యక్తి గరిష్టంగా రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టవచ్చన్నది తెలిసిందే. -
US midterm elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రిపబ్లికన్లు 218 సీట్లు, అధికార డెమొక్రాట్లు 211 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్షం మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. బైడెన్ నిర్ణయాలు, చర్యలను ప్రతిపక్షం నిలువరించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభలో రిపబ్లికన్ పార్టీ బలం పుంజుకోవడంతో అధ్యక్షుడి దూకుడుకి అడ్డుకట్ట పడనుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ప్రతినిధుల సభ స్పీకర్‌గా రిపబ్లికన్లు తమ నాయకుడు కెవిన్ మెక్కర్తీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ ఉన్నారు. కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని, రిపబ్లికన్లు వారిని ముందుకు నడిపించబోతున్నారని మెక్‌కర్తీ ట్వీట్ చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన మెక్కర్తీకి ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఉద్ఘాటించారు. రా బోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెనేట్‌పై డెమొక్రాట్ల పట్టు మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని చెప్పారు. ధరలు, జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. జనం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్‌లోని మరో సభ అయిన సెనేట్‌లో అధికార డెమొక్రాట్లు పట్టు నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 100 స్థానాలకు గాను, వారు ఇప్పటిదాకా 50 స్థానాలు దక్కించుకున్నారు. జార్జియా రాష్ట్రం కూడా వారి ఖాతాలో పడనుంది. దీంతో సెనేట్‌లో మెజారిటీ సాధించబోతున్నారు. -
తప్పిన అంచనాలు
‘డెమోక్రసీకి ఇది శుభదినం!’ అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల సరళిని చూసి, ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. అమెరికాలోని డెమోక్రసీ మాటెలా ఉన్నా, బైడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాటిక్ పార్టీకి మాత్రం దాదాపు సార్వత్రిక ఎన్నికల లాంటి ఈ పోల్స్ కొంత శుభప్రదంగా పరిణమించాయి. భారీ ద్రవ్యోల్బణం, ప్రజల్లో బైడెన్‌పై పెరిగిన అసంతృప్తి ఆసరాగా రిపబ్లికన్ల జెండా రంగైన ‘ఎర్ర గాలి’ దేశమంతటా వీస్తుందన్న అంచనా తప్పింది. అమెరికన్ కాంగ్రెస్‌లో ఇటు ప్రతినిధుల సభలోనూ, అటు ఎగువ సభ సెనేట్‌లోనూ తిరుగులేని ఆధిక్యం తమదే అవుతుందన్న రిపబ్లికన్ పార్టీ అంచనాలను మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలు నీరుగార్చాయి. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 218 స్థానాల మెజారిటీకి రిపబ్లికన్లు మెల్లగా దగ్గరవుతున్నారు. సెనేట్‌లో నువ్వానేనా పోటీ నడుస్తోంది. అయితే, నేవడా, అరిజోనా రాష్ట్రాల ఫలితాల్లో తప్పని జాప్యం – డిసెంబర్ 6న జరిగే జార్జియా ఎన్నిక వల్ల పార్లమెంట్లో అంతిమ బలాబలాలు తెలియడానికి మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే మధ్యంతర ఎన్నికలపై అంతర్జాతీయంగా ఏమంత ఆసక్తి వ్యక్తం కాదు. ఏ రాష్ట్రానికి ఎవరు గవర్నర్ అయ్యారు, ఎవరు సెనేటర్ అయ్యారనేది ప్రపంచానికి పెద్దగా పట్టని వ్యవహారం. కానీ, ట్రంప్ హయాం నుంచి పరిస్థితి మారింది. అయితే, మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలంతగా అందరి దృష్టినీ ఆకర్షించినవి చాలాకాలంగా మరేవీ లేవనే చెప్పాలి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికలివే. ఆ ఎన్నికల ఫలితాలను మసిపూసి మారేడుకాయ చేశారన్న అప్పటి ట్రంప్ తప్పుడు వాదననే ఇప్పుడీ నవంబర్ 8 నాటి మధ్యంతర ఎన్నికల్లోనూ రిపబ్లికన్లు తెగ ఊదరగొట్టడం గమనార్హం. అలా చివరకు ఈ ఎన్నికలు ట్రంప్వాదపు దీర్ఘకాల మన్నికకు అగ్నిపరీక్షగా, అమెరికన్ ప్రజాస్వామ్యం ఏ మేరకు ఒత్తిడిని తట్టుకుంటుందో పరీక్షించే గీటురాయిగా మారాయి. ప్రపంచం ఆసక్తిగా చూసేలా చేశాయి. అభ్యర్థుల ఎంపికలో దూకుడు చూపిన ఎర్రరంగు రిపబ్లికన్లకూ, అధికార పీఠంపై అస్తుబిస్తు అవుతున్న నీలిరంగు డెమోక్రాట్లకూ ఈ ఎన్నికలు పాఠాలు నేర్పాయి. నిజానికి, అమెరికాలో అధ్యక్షుడి నాలుగేళ్ళ పదవీకాలంలో దాదాపు మధ్యలో జరిగే మధ్యంతర ఎన్నికలు అధికార పార్టీ, దేశాధ్యక్షుల పనితీరుపై రిఫరెండమ్ లాంటివి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ప్రతి మిడ్‌టర్మ్ పోల్స్‌లోనూ అధికార పార్టీ సగటున 26 స్థానాలు సర్వప్రతినిధి సభలో, 4 సీట్లు సెనేట్‌లో కోల్పోతుందని లెక్క. ఆ లెక్కన అధికార డెమోక్రాట్ పార్టీకీ ఎదురు దెబ్బలు అనూహ్యమేమీ కాదు. కానీ, దిగువసభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తున్నా అంచనాలకు తగ్గట్టు భారీ సంఖ్యలో విజయాలు రాలేదు. భయపడినంత గట్టిదెబ్బ డెమోక్రాట్లకు తగలలేదు. ఇది సర్వేలు సైతం అంచనా వేయని ఆశ్చర్యకర పరిణామం. పెన్సిల్వేనియా లాంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్ల గెలుపుతో, ఫలితాలు తాము అనుకున్నదాని కన్నా మెరుగ్గా ఉన్నాయని బైడెనే ఒప్పుకున్నారు. ఇక, ట్రంప్ గట్టిగా బలపరిచిన పలువురు మితవాదులు వివిధ రాష్ట్రాల్లో ఓటమి పాలవడం విడ్డూరం. మిగిలిన బైడెన్ పదవీకాలం ఎలా గడుస్తుంది, అమెరికా రాజకీయాలపై ట్రంప్ నీడ ఏ మేరకు పరుచుకుంటుంది లాంటివన్నీ ఇక ఆసక్తికరం. మునుపెన్నడూ లేని విధంగా దేశం నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో, దిగువసభలో రిపబ్లికన్ల ఆధిక్యం బైడెన్‌కు కష్టాలు తేనుంది. ఒకప్పుడు ఎరుపు, నీలం పార్టీలు రెంటికీ సమాన బలాబలాలుండి, అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా నిలిచిన ఫ్లోరిడా రాష్టంలో ఇప్పుడు దాదాపు 20 శాతం పాయింట్ల పైగా భారీ తేడాతో రిపబ్లికన్ అభ్యర్థి డీశాంటిస్ గెలవడం గమనార్హం. ఆ రాష్ట్రం అంతకంతకూ ఎరుపుమయం అవుతోందనడానికి ఇది నిదర్శనం. వచ్చే అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంలో ట్రంప్‌కు గట్టి సవాలు ఆయన నుంచే ఎదురుకావచ్చు. ఏమైనా, ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలను బట్టి ఒకటి స్పష్టమవుతోంది. అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శకం అస్వాభావికమేమీ కాదు. ఆ సంగతి గ్రహించిన అమెరికా మిత్రపక్షాలు రానున్న రోజుల్లో నాటో, ఉక్రెయిన్లకు మద్దతు లాంటి వాటిపై ఎలా వ్యవహరిస్తాయన్నదీ ఆసక్తికరమే. ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పలువురి నేపథ్యాలు వైవిధ్యానికి ప్రతీకగా నిలవడం చెప్పుకోదగ్గ అంశం. భారత అమెరికన్లు అయిదుగురు ప్రతినిధుల సభకు ఎన్నికైతే, మేరీల్యాండ్‌కు గవర్నర్‌గా నల్లజాతీయుడు, లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ అరుణా మిల్లర్, ఇతర రాష్ట్రాల్లో ఒక స్వలింగ సంపర్క మహిళ, ఒక ట్రాన్స్‌జెండర్ గవర్నర్లుగా గెలవడం విశేషం. వీరందరూ డెమో క్రాట్ అభ్యర్థులే కావడం గమనార్హం. ఇలాంటి పరిణామాలు బాగున్నా, అమెరికా రాజకీయాలు అంతకంతకూ రెండు విరుద్ధ వర్గాల విద్వేషంగా మారుతున్నాయనే బెంగ పుట్టిస్తోంది. ఇప్పటి దాకా దిగువ, ఎగువ సభలు రెంటిలోనూ ఆధిక్యం డెమోక్రాట్లదే. ఎన్నికల తుది ఫలితాలతో రేపు బలాబలాల్లో తేడా వస్తే బైడెన్ అజెండా భవితవ్యం ప్రశ్నార్థకమే. ప్రతినిధుల సభ పూర్తిగా రిపబ్లికన్ల చేతిలోకి వెళితే, మిగిలినవన్నీ పక్కకు పోయి బైడెన్, ఆయన కుటుంబంపై దర్యాప్తుల పరంపర మొదలవుతుంది. సెనేట్ గనక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కైవసమైతే న్యాయ నియామకాల్లోనూ అధ్యక్షుడు బైడెన్ సత్తా కుంటుపడుతుంది. వెరసి, అమెరికన్ రాజకీయాల్లో మరిన్ని మలుపులు ఖాయం. -
'షిండే సర్కార్ కూలిపోతుంది.. మధ్యంతర ఎన్నికలు ఖాయం'
ముంబై: మహారాష్ట్రలో సీఎం ఏక్నాథ్ షిండే సర్కార్ త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు ఆదిత్య థాక్రే. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం అన్నారు. శివ్ సంవాద్ యాత్రలో భాగంగా పైఠణ్లో శివసేన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఉద్ధవ్ థాక్రేను శివసేన రెబల్ ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు ఆదిత్య థాక్రే. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు అదను చూసి ద్రోహం చేశారని విమర్శించారు. పైఠణ్ ఎమ్మెల్యే, షిండే వర్గంలో ఒకరైన సందీపన్ భుమ్రేపై విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ హయాంలో నిధులు మంజూరు చేయలేదని ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయనకు ఐదుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలకు తాము చేసిందంతా తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని, కానీ ఇది ఏడవాల్సిన సమయం కాదు పోరాడాల్సిన సమయం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొందరు బలవంతం చేయడం వల్లే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తన తండ్రిపై తిరుగుబాటు చేశారని ఆదిత్య థాక్రే ఆరోపించారు. వారంతా తిరిగి తమతో కలవాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చన్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి ఊహించని షాక్ ఇచ్చారు ఏక్నాథ్ షిండే. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో సీఎం పదవి చేజిక్కుంచుకున్నారు. శివసేన తమదే అని ఇప్పుడు థాక్రే, షిండే వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ బలం నిరూపించుకోవాలని ఎన్నికల సంఘం సూచించిన విషయం తెలిసిందే. చదవండి: ఎన్డీఏకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాహుల్ -
‘మధ్యంతర ఎన్నికలు రావొచ్చు’
బెంగళూరు : త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తొలుత కాంగ్రెస్ తమకు ఐదేళ్ల పాటు పూర్తి మద్దతిస్తానని చెప్పిందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల పద్దతి చూస్తూంటే.. త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. పేరుకే కుమారస్వామి సీఎం అని.. పెత్తనం మొత్తం కాంగ్రెస్ చేతిలోనే ఉందన్నారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలన్నింటిని జేడీఎస్ ఒప్పుకుందని తెలిపారు. వీటన్నింటిని కర్ణాటక ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. Former PM & JDS leader HD Deve Gowda in Bengaluru: There is no doubt that there will be mid-term polls. They said they will support us for 5 years but look at their behaviour now. Our people are smart. #Karnataka pic.twitter.com/OjGsy2lKYW — ANI (@ANI) June 21, 2019 సంకీర్ణ కూటమిలో ఉండే కష్టాలేంటో తనకు బాగా తెలుసన్నారు దేవేగౌడ. అందుకే కూటమిలో భాగంగా కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలని తాను కోరుకోలేదన్నారు. తన కుమారుడి బదులు మల్లికార్జున ఖర్గేను సీఎంగా చేయమని రాహుల్ గాంధీని కోరానని తెలిపారు. అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. అంతేకాక కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కూటమి ఏర్పాటుకు ఒప్పుకున్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీన పడుతుందని.. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఆ పార్టీ ఓటమి పాలయ్యిందన్నారు దేవేగౌడ. -
ట్రంప్ దూకుడుకు కళ్లెం!
ప్రతినిధుల సభలో మెజారిటీ చేతులు మారడం ట్రంప్ దూకుడుకు కళ్లెం వేస్తుందని భావిస్తున్నారు. వలసలు, ఆర్థికం, వాణిజ్యం, ఆరోగ్యం తదితర రంగాల్లో ఏకపక్షంగా అమలుచేస్తున్న అధ్యక్షుడి విధానాల్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష డెమొక్రాట్లకు తాజా ఫలితాలతో మంచి అవకాశం లభించనుంది. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల్ని మూకుమ్మడిగా ఎదిరిస్తామని కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇదివరకే ప్రకటించడం తెల్సిందే. ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల బలం పెరగడంతో ట్రంప్‌పై ఉన్న వివిధ కేసుల దర్యాప్తు ముమ్మరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడి దుందుడుకు, విపరీత వైఖరిని కట్టడి చేయడానికి డెమొక్రాట్ల ముందున్న కొన్ని మార్గాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ స్థాయీ సంఘాలపై డెమొక్రాట్లకు మరింత నియంత్రణ లభిస్తే ట్రంప్‌పై ఆరోపణలు వచ్చిన పలు కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలపై విచారణలు ఊపందుకుంటాయి. ట్రంప్‌పై అభిశంసన చేపట్టేందుకు చర్యలు తీసుకునే చాన్సుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన డెమోక్రాట్లు బడ్జెట్ విషయంలో ట్రంప్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటిలా ట్రంప్ తనకు కావలసిన నిధుల కోసం ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉండదు. ట్రంప్ గతంలో వెల్లడించడానికి నిరాకరించిన వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్ పత్రాలను వెలుగులోకి తెచ్చేందుకు డెమొక్రాట్లు ప్రయత్నిస్తారు. ఈసారి కూడా ట్రంప్‌ను రిటర్న్స్ కోసం అడుగుతామని, ఆయన తిరస్కరిస్తే తమకున్న అధికార పరిధిలో చట్టబద్ధంగా వాటిని తీసుకుంటామని హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీకి నాయకత్వం వహించనున్న రిచర్డ్ నీల్ చెప్పారు. అక్రమ వలసల కట్టడికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ విస్తృతంగా ప్రచారం చేశారు. సంఖ్యాబలం పెరగడంతో డెమొక్రాట్లు గోడ నిర్మాణాన్ని ఆపేసేందుకు చర్యలు తీసుకోవచ్చు. ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని కొనసాగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి పెంచే చాన్సుంది. -
సెనెట్ నీది ‘హౌస్’ నాది!
వాషింగ్టన్: అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు రెఫరెండంగా భావించిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ప్రతిపక్షానికి బాసటగా నిలిచే ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రతినిధుల సభ డెమొక్రటిక్ పార్టీ వశమైందని ప్రాథమిక ఫలితాలు తేల్చాయి. కానీ, ఎగువ సభ సెనెట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని నిలబెట్టుకుంది. 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్లు సాధారణ మెజారిటీ కన్నా కనీసం 23 సీట్లు అధికంగా గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 235 సీట్లు, డెమొక్రాట్లకు 193 సీట్లున్నాయి. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్ల నుంచి డెమొక్రాట్లు సుమారు 27 సీట్లు కైవసం చేసుకున్నారని ప్రాథమిక ఫలితాలు వెల్లడించాయి. కొత్త సభ వచ్చే జనవరిలో కొలువుదీరుతుంది. నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికయ్యారు. వారంతా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే. ఈసారి రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభకు ఎన్నికయ్యారు. అందులో 28 మంది తొలిసారి ఈ సభలో అడుగుపెట్టబోతున్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల నాన్సీ పెలోసి ప్రతినిధుల సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యే చాన్సుంది. ఈ పదవి భారత్‌లో లోక్‌సభ స్పీకర్ హోదాతో సమానం. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబ్, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందారు. మరోవైపు, 35 స్థానాలకు ఎన్నికలు జరిగిన సెనెట్ (మొత్తం సభ్యులు 100)లో రిపబ్లికన్లు తమ ఆధిక్యతను కొనసాగించారు. తాజా ఎన్నికల తరువాత ఎగువ సభలో వారి బలం 51 పైనే ఉందని స్థానిక మీడియా తేల్చింది. ఇండో–అమెరికన్ల విజయం.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికవగా, మరో డజను మందికి పైగా రాష్ట్రాల స్థాయిలో జరిగిన అసెంబ్లీ, సెనెట్, అటార్నీ జనరల్ ఎన్నికల్లో గెలుపొందారు. ఇలినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాలో రాజా క్రిష్ణమూర్తి మళ్లీ గెలిచారు. కాలిఫోర్నియా 7వ కాంగ్రెషనల్ జిల్లాలో అమీ బేరా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. సిలికాన్ వ్యాలీలో రో ఖన్నా గెలిచారు. ప్రతినిధుల సభలో ఏకైక మహిళా ఇండో అమెరికన్ ప్రమీలా జయపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. విస్కాన్సిస్ రాష్ట్రంలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జోష్ కౌల్.. అటార్నీ జనరల్‌గా ఎన్నికై, ఈ పదవి దక్కించుకున్న తొలి ఇండో–అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీకే చెందిన నీమా కులకర్ణి కెంటుకీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అమీశ్, కెవిన్ థామస్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ముజతబా మొహమ్మద్ ఉత్తర కరోలినాసెనెట్కు ఎన్నికయ్యారు. మీడియాపై ట్రంప్ ఫైర్ వాషింగ్టన్: మీడియాపై ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. మధ్యంతర ఎన్నికలు ముగిసిన తరువాత బుధవారం శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా సీఎన్ఎన్ పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ట్రంప్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి నిరాకరించి మైక్రోఫోన్‌కు దూరంగా జరిగారు. ట్రంప్ నేరగాళ్లుగా అభివర్ణించిన మధ్య అమెరికా ప్రజల వలసల గురించి సీఎన్ఎన్ పాత్రికేయుడు ప్రశ్నించగా..‘మీ పని మీరు చూసుకోండి..దేశ పాలనను నన్ను చేయనీయండి’ అని ట్రంప్ బదులిచ్చారు. రిపబ్లికన్ పార్టీ శ్వేత జాతీయులకు మద్దతిస్తోందా? అని మహిళా జర్నలిస్ట్ అడగ్గా.. ఆమె జాత్యహంకార ప్రశ్నలు వేస్తోందని మండిపడ్డారు. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన సీఎన్ఎన్ విలేకరి ప్రెస్ ప్రవేశ అర్హతా పత్రాల్ని వైట్‌హౌజ్ రద్దుచేసింది. మీడియాకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రవర్తన హద్దులు మీరిందని సీఎన్ఎన్ ఆరోపించింది. -
మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం వెల్లడైన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోగా.. ట్రంప్ రిపబ్లిక్ పార్టీ సెనేట్ ఆధిక్యం సాధించింది. ప్రతినిధుల సభలోని 435 స్థానాల్లో ఎన్నికలు జరగగా 419 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 223 స్థానాల్లో డెమోక్రాట్లు గెలుపొందగా, 196 స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. గతంలో రిపబ్లికన్లు గెలిచిన 28 స్థానాలను కూడా డెమోక్రాట్లు కైవసం చేసుకోవడంతో హౌస్‌లో డెమోక్రాట్లు మోజార్టీని పొందారు. ఇక సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్ పార్టీ ఎట్టకేలకు తమ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్ జరగగా.. 32 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలనంతరం సెనేట్‌లో రిపబ్లికన్లు 51 మంది, డెమోక్రాట్లు 46 మంది అయ్యారు. ఇందులో డెమోక్రాట్లు రెండు సీట్లను కోల్పోయారు. ఇంకా మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇక 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు జరగగా ఇప్పటికి 33 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తాజా ఫలితాలతో డెమోక్రటిక్ గవర్నర్లు గతం కంటే ఏడుగురు పెరిగారు. రిప్రజెంటేటివ్స్ హౌస్, సెనేట్ను కలిపి అమెరికా కాంగ్రెస్‌గా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. -
ట్రంప్‌కు ఎదురుగాలి
వాషింగ్టన్: మధ్యంతర ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురుగాలి వీస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మార్చుకుని విజయం దిశగా సాగిపోయారు. తాజా ఫలితాల సరళి చూస్తోంటే డెమొక్రాట్ల ‘బ్లూ వేవ్‘ను అడ్డుకోగలుగుతానన్న ట్రంప్ నమ్మకానికి గండి పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో డెమోక్రాట్లు మెజార్టీ దిశగా దూసుకుపోతూ పట్టు సాధించారు. అటు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు సెనేట్‌లో ఆధిక్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్ జరిగింది. తాజా ఫలితాల ప్రకారం 218 స్థానాల్లో డెమెక్రాట్లు గెలుపొందితే ప్రతినిధుల సభలో మెజార్టీ ఖాయం చేసుకుంది. మిచిగాన్, ఇల్లినాయిస్, కాన్సాస్,వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సీల్వేనియా తదితర రాష్ట్రాల్లో డెమోక్రాట్లు గెలుపొందారు. ఇండియానా, టెక్సాస్, నాత్ డకోటా తదితర స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్‌లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 89మంది హౌస్‌కు ఎంపిక కాగా తొలిసారిగా సెనేట్‌కు ఇద్దరు ముస్లిం మహిళలు రషిదా త్లయీబా ఇహాన్ ఒమర్లతోపాటు మసాచుసెట్స్ నుంచి తొలిసారిగా నల్లజాతీయురాలైన కాంగ్రెస్ మహిళ, అరిజోనా, టెన్నీసీ ప్రాంతాల నుంచి ఇద్దరు మహిళా సెనేటర్లు గెలుపొందడం విశేషం. జారెడ్ పోలీస్ అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎంపికైన తొలి గే గా చరిత్ర కెక్కనున్నారు. కాగా రెండేళ్ళ కన్నా తక్కువకాలంలోనే తన ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని అమెరికా అద్యక్షుడు డో నాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార సభలో చెప్పుకొచ్చారు. తన విదేశాంగ విధానాలు, పాలన ప్రజలకు ఆమోదయోగ్యమయ్యాయని, 50 రాష్ట్రాలకు గాను పలు రాష్ట్రాల్లో ఓటర్లు తనకే పట్టం కడతారని ట్రంప్ విశ్వాసం ప్రకటించగా.. అటు డెమొక్రాట్లు తమదే విజయమని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
‘మధ్యంతర’ బరిలో భారతీయులు
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్‌కు మధ్యంతర ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం ఆరు లేదా ఏడు గంటలకు (భారత కాలమానంలో మంగళవారం సాయంత్రం) దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ఓటర్ల కోసం తెరచుకోనున్నాయి. అన్నిచోట్లా 12 గంటలపాటు పోలింగ్ కేంద్రాలు తెరిచి ఉంటాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 100 సీట్లలో 35 సీట్లకు ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈసారి అమెరికా ఎన్నికల్లో భారీ సంఖ్యలో భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న ఐదుగురు భారతీయ అమెరికన్లు అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, శివ అయ్యాదురైలు మధ్యంతర ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమీ బెరా కాలిఫోర్నియా నుంచి ఇప్పటికే మూడు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికవ్వగా, కృష్ణమూర్తి, ప్రమీల, రో ఖన్నాలు ఇప్పటికి ఒక్కసారే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచారు. వీరు నలుగురూ ప్రస్తుతం ప్రతినిధుల సభకే పోటీ పడుతున్నారు. అటు శివ అయ్యాదురై మసాచూసెట్స్ స్థానం నుంచి సెనెట్‌కు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికల్లో వీరంతా సునాయాసంగా విజయం సాధిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు ఎన్నిక కాని మరో ఏడుగురు భారతీయ అమెరికన్లు కూడా ఈ మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్నారు. వీరిలో హిరాల్ తిపిర్నేని, శ్రీ కులకర్ణి, అఫ్తాబ్ పురేవాల్‌లు ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్నారని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. మొత్తం వంద మందికిపైగా పోటీ అమెరికా కాంగ్రెస్‌కే కాక పలు రాష్ట్రాల శాసనసభలు, స్థానిక మండళ్లకు కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నిచోట్లా కలిపి వంద మందికి పైగానే భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు దేశంలోకి విదేశీయుల రాకను(వలసలు) నియంత్రించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడానికి భారతీయ అమెరికన్లు పోటీ పడుతున్నారు. రాజకీయంగా బలపడాలని భారతీయ అమెరికన్లు కోరుకుంటున్నారనీ, ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచిన వారి సంఖ్యే ఇందుకు నిదర్శనమని మాజీ రాయబారి రిచ్ వర్మ అన్నారు. ‘అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల హవా పెరుగుతుండటం నమ్మశక్యంకాని నిజం’ అని అన్నారు. అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్లు ఒక శాతం వరకు (40లక్షలు) ఉన్నారు. ‘సమోసా’ సత్తా చాటేనా? అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న ఐదుగురు భారతీయ–అమెరికన్ సభ్యులను కలిపి ‘సమోసా కాకస్’ అని అనధికారికంగా పిలుస్తారు. కృష్ణమూర్తే ఈ పేరు ను బృందానికి పెట్టారు. తాజా మధ్యంతర ఎన్నికలతో ‘సమోసా’ బృందంలోని సభ్యుల సంఖ్య పెరుగుతుందని అంచనా. ఈ ఎన్నికలు చాలామంది కొత్త వారిని ప్రతినిధుల సభ, రాష్ట్రాల శాసన సభలకు పంపుతాయని రిచ్ వర్మ తెలిపారు. ఆరిజోనా నుంచి టెక్సాస్, ఒహయో, మిషిగాన్‌ల వరకు.. పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌లో మన బలం పెరుగుతుందన్న నమ్మకం ఉందంటున్నారు కృష్ణమూర్తి. ట్రంప్ విధానాలతో అమెరికన్లు, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారనీ, తమ భయాన్ని, నిరసనను గట్టిగా చెప్పడం కోసమే ఈసారి అనేక మంది భారతీయ అమెరికన్లు బరిలోకి దిగారని వర్మ తెలిపారు. మధ్యంతరంలో పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్లలో ఎక్కువ మంది డెమొక్రటిక్ పార్టీ తరఫున నిలబడ్డారు. -
రిపబ్లికన్లా? డెమొక్రాట్లా?
అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లో ఉన్న 100 స్థానాల్లో 35 స్థానాలకు ఈ నెల 6న మధ్యంతర ఎన్నికలు (మిడ్ టర్మ్ ఎలక్షన్స్) జరగనున్నాయి. అధ్యక్షుడి పాలనా కాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీటిని మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తారు. ప్రతినిధుల సభ, సెనేట్‌తో పాటు 39 రాష్ట్రాలు, ప్రాదేశిక పాలనా మండళ్లకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఎవరికి వారు తామే మెజారీటీ సీట్లు దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 22 నెలల పాలనపై రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ (రిపబ్లికన్లు)గెలిస్తే ఆయన వివాదాస్పద నిర్ణయాలు, అమెరికా ఆధిపత్య చర్యలు పెరుగుతాయనీ, ఆయనకు అడ్డూ అదుపూ ఉండదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే డెమొక్రాట్లు గెలిస్తే ట్రంప్ దూకుడుకు ముకుతాడు పడుతుందని, ఆయన తీరు ప్రజలకు నచ్చలేదన్న సంగతి స్పష్టమవుతుందని వారంటున్నారు. ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనేట్లలో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 241 స్థానాలు, డెమొక్రాట్లకు 194 సీట్లు ఉన్నాయి. సెనెట్‌లో 52 రిపబ్లికన్లవయితే, 48 డెమొక్రాట్లవి. అయితే దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి మధ్యంతర ఎన్నికలు అచ్చిరావడం లేదని గత ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 1934 నుంచి ఇంత వరకు 21 సార్లు మధ్యంతర ఎన్నికలు జరగ్గా కేవలం మూడు సార్లు మాత్రమే అధ్యక్ష పార్టీ గెలిచింది. ట్రంప్ పాలనపై రెఫరెండం అమెరికా అధ్యక్ష పదవి చేపటాక ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు ఆ దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ వివాదాస్పదమయ్యాయి. అమెరికన్లకు ఉద్యోగ ప్రయోజనాలు కలిగేలా వలస నిబంధనలను కఠినతరం చేస్తుండటం, ఏడు ముస్లిం దేశాల పౌరులకు అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించడం, చైనాతో వాణిజ్య యుద్ధం, గత ప్రభుత్వం ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగడం, ఐక్యరాజ్య సమితి సంస్థల నుంచి కూడా తప్పుకోనున్నట్టు ప్రకటించడం తదితర తీవ్ర, వివాదస్పద నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నారు. వీటిని ట్రంప్ పార్టీలోనే చాలా మంది తప్పుబడుతున్నారు. ఇప్పటికి ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టి 22 నెలలు అవుతోంది. దీంతో మధ్యంతర ఎన్నికలను ట్రంప్ పాలనపై రెఫరెండంగా భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్ పార్టీ ఒబామా కేర్‌గా పేరొందిన ఆరోగ్య బీమా చట్టం కొనసాగింపును ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ట్రంప్ ప్రకటించిన పన్నుల కోతనూ తమకనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తోంది. అటు రిపబ్లికన్లు వీసాలు, అక్రమ వలసలపై దృష్టి పెట్టడంతో పాటు ఆర్థిక పునరుజ్జీవానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేసిన వారిలో 51శాతం మంది ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారనీ, ఇది డెమొక్రాట్లకు లాభం కలిగిస్తుందని సర్వేలో వెల్లడయింది. విదేశీ జోక్యం 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనీ, దాని ప్రమేయం వల్ల ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో కూడా రష్యా, చైనాలు జోక్యం చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎన్నికలను రష్యా నియంత్రిస్తోందని ఆరు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉమ్మడి నివేదికలో స్పష్టం చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా రష్యా అమెరికన్లను ప్రభావితం చేస్తోందని ఆ సంస్థలు ఆరోపించాయి. మధ్యంతర ఎన్నికల్లో రష్యా చురుకుగా జోక్యం చేసుకుంటుండటం వాస్తవమేనని, అదింకా కొనసాగుతోందని గత ఆగస్టులో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ అధ్యక్ష భవనంలో మీడియాతో చెప్పారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అధికంగా ముందస్తు పోలింగ్ మధ్యంతర ఎన్నికలకు పోలింగ్ మంగళవారం జరగనున్నప్పటికీ ముందుగానే ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది. పోలింగ్ రోజు రద్దీని తగ్గించేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఈ ముందస్తు పోలింగ్‌ను గతంలో కన్నా ఈసారి చాలా ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారనీ, ముఖ్యంగా యువత ముందున్నారని అధికారులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతే డాది కన్నా ఈ ఏడాది రెట్టింపు ముందస్తు ఓటిం గ్ నమోదైందన్నారు. అమెరికా వ్యాప్తంగా 3.15 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటేశారు. -
‘మధ్యంతర ఎన్నికలకు సిద్ధం.. మళ్లీ గెలుస్తాం’
ముంబయి: మధ్యంతర ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ శివసేన పార్టీకి స్పష్టతనిచ్చారు. ప్రజలు తమతోనే ఉన్నారని విశ్వాసం తనకు ఉందని అన్నారు. రైతుల ఆందోళన, నిరసనలు, వ్యవసాయ సంక్షోభం కారణంగా మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు సవాల్ చేశారు. ‘కొంతమంది ప్రజలు(శివసేన పార్టీ నేతలు) మా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. వారి మద్దతు ఉపసంహరించుకుంటామని చెబుతున్నారు. మధ్యంతర ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. మేం మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’ అని ఫడ్నవీస్ నేరుగా శివసేన పార్టీ పేరును ప్రస్తావించకుండా చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలు ప్రకటించకుంటే తాము మద్దతును ఉపసంహరించుకుంటామని శివసేన ఎంపీ సంజయ్ రావత్ ఓ మరాఠీ టీవీ చానెల్‌కు చెప్పిన నేపథ్యంలో ఫడ్నవీస్ చేసిన ఈ సవాల్ ప్రాధాన్యం సంతరించుకుంది.