ప్రమీలా జయపాల్, అమీ బెరా, శివ అయ్యాదురై, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్‌కు మధ్యంతర ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం ఆరు లేదా ఏడు గంటలకు (భారత కాలమానంలో మంగళవారం సాయంత్రం) దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ఓటర్ల కోసం తెరచుకోనున్నాయి. అన్నిచోట్లా 12 గంటలపాటు పోలింగ్ కేంద్రాలు తెరిచి ఉంటాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 100 సీట్లలో 35 సీట్లకు ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈసారి అమెరికా ఎన్నికల్లో భారీ సంఖ్యలో భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న ఐదుగురు భారతీయ అమెరికన్లు అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, శివ అయ్యాదురైలు మధ్యంతర ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అమీ బెరా కాలిఫోర్నియా నుంచి ఇప్పటికే మూడు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికవ్వగా, కృష్ణమూర్తి, ప్రమీల, రో ఖన్నాలు ఇప్పటికి ఒక్కసారే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచారు. వీరు నలుగురూ ప్రస్తుతం ప్రతినిధుల సభకే పోటీ పడుతున్నారు. అటు శివ అయ్యాదురై మసాచూసెట్స్ స్థానం నుంచి సెనెట్‌కు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికల్లో వీరంతా సునాయాసంగా విజయం సాధిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు ఎన్నిక కాని మరో ఏడుగురు భారతీయ అమెరికన్లు కూడా ఈ మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్నారు. వీరిలో హిరాల్ తిపిర్నేని, శ్రీ కులకర్ణి, అఫ్తాబ్ పురేవాల్‌లు ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్నారని ఎన్‌బీసీ న్యూస్ పేర్కొంది.
మొత్తం వంద మందికిపైగా పోటీ
అమెరికా కాంగ్రెస్‌కే కాక పలు రాష్ట్రాల శాసనసభలు, స్థానిక మండళ్లకు కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నిచోట్లా కలిపి వంద మందికి పైగానే భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు దేశంలోకి విదేశీయుల రాకను(వలసలు) నియంత్రించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడానికి భారతీయ అమెరికన్లు పోటీ పడుతున్నారు. రాజకీయంగా బలపడాలని భారతీయ అమెరికన్లు కోరుకుంటున్నారనీ, ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచిన వారి సంఖ్యే ఇందుకు నిదర్శనమని మాజీ రాయబారి రిచ్ వర్మ అన్నారు. ‘అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల హవా పెరుగుతుండటం నమ్మశక్యంకాని నిజం’ అని అన్నారు. అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్లు ఒక శాతం వరకు (40లక్షలు) ఉన్నారు.
‘సమోసా’ సత్తా చాటేనా?
అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న ఐదుగురు భారతీయ–అమెరికన్ సభ్యులను కలిపి ‘సమోసా కాకస్’ అని అనధికారికంగా పిలుస్తారు. కృష్ణమూర్తే ఈ పేరు ను బృందానికి పెట్టారు. తాజా మధ్యంతర ఎన్నికలతో ‘సమోసా’ బృందంలోని సభ్యుల సంఖ్య పెరుగుతుందని అంచనా. ఈ ఎన్నికలు చాలామంది కొత్త వారిని ప్రతినిధుల సభ, రాష్ట్రాల శాసన సభలకు పంపుతాయని రిచ్ వర్మ తెలిపారు. ఆరిజోనా నుంచి టెక్సాస్, ఒహయో, మిషిగాన్‌ల వరకు.. పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌లో మన బలం పెరుగుతుందన్న నమ్మకం ఉందంటున్నారు కృష్ణమూర్తి. ట్రంప్ విధానాలతో అమెరికన్లు, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారనీ, తమ భయాన్ని, నిరసనను గట్టిగా చెప్పడం కోసమే ఈసారి అనేక మంది భారతీయ అమెరికన్లు బరిలోకి దిగారని వర్మ తెలిపారు. మధ్యంతరంలో పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్లలో ఎక్కువ మంది డెమొక్రటిక్ పార్టీ తరఫున నిలబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment