Indian Americans
-
అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన పార్లమెంట్ దిగువసభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు హిందువులు శుక్రవారం సభలో అడుగుపెట్టారు. అమెరికాలో మైనారిటీ వర్గమైన హిందువులు ఒకేసారి నలుగురు దిగువసభకు ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుగురు భారతీయ మూలాలున్న వ్యక్తులు ఈసారి దిగువసభ ఎన్నికల్లో గెలవగా వారిలో నలుగురు హిందువులుకావడం విశేషం. గెలిచిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో క్రైస్తవేతర, యూదుయేతర మతవిశ్వాసం ఉన్న వ్యక్తులు కేవలం 14 మంది మాత్రమే. వీరిలో హిందువులు నలుగురు, ముస్లింలు నలుగురు, బౌద్ధులు ముగ్గురు, ఏ మతాన్ని ఆచరించని వాళ్లు ముగ్గురు ఉన్నారు. హిందువులు సుహాస్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం, రో ఖన్నా, శ్రీ థానేదార్ తాజాగా ఎన్నికల్లో విజయపతాక ఎగరేయడం తెల్సిందే. భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్ ప్రమీలా జయపాల్ తన మతం ఏమిటనేది పేర్కొనలేదు. భారతీయ మూలాలున్న మరో సీనియర్ దిగువసభ సీనియర్ సభ్యుడు డాక్టర్ అమీ బెరా దేవుడొక్కడే అనే విశ్వాసాన్ని తాను నమ్ముతానని చెప్పారు. ‘‘12 ఏళ్ల క్రితం నేను దిగువసభలో ప్రమాణంచేసేటపుడు నేనొక్కడినే భారతీయఅమెరికన్ను. ఇప్పుడు మా బలం ఆరుకు పెరిగింది’’అని అమీబెరీ అన్నారు. మొత్తం సభ్యుల్లో క్రైస్తవులదే మెజారిటీ కాగా 31 మంది(ఆరు శాతం) యూదు మతస్థులున్నారు. గెలిచిన రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో 98 శాతం మంది, డెమొక్రటిక్ పార్టీ సభ్యుల్లో 75 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. స్పీకర్‌గా మళ్లీ మైక్ 52 ఏళ్ల మైక్ జాన్సన్ ప్రతినిధుల సభ స్పీకర్‌గా మళ్లీ ఎన్నికయ్యారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా కేవలం మూడు ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన నెగ్గారు. గత వందేళ్ల చరిత్రలో ఇంత తక్కువ మెజారిటీతో గెలిచిన స్పీకర్‌గా మైక్ చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ బరిలో దిగారు. దిగువసభలో 219 మంది రిపబ్లికన్లు ఉండగా, 215 మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఈయనకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 215 మంది పడ్డాయి. డెమొక్రటిక్ సభ్యుడు హకీమ్ జెఫ్రీస్ సైతం మైక్‌కే ఓటేయడం విశేషం. స్వల్ప మెజారిటీతో నెగ్గిన మైక్ వెంటనే స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. -
అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ హవా
-
US Election2024: ఆరుగురు భారతీయుల విజయకేతనం
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఆరుగురు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు. ప్రస్తుత కాంగ్రెస్‌లో ఐదుగురు ప్రతినిధులు ఉండగా.. ఈ ఎన్నికలతో అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ల సంఖ్య ఆరుకు పెరిగింది. వర్జీనియా నుంచి ఎన్నికైన తొలి భారతీయుడిగా న్యాయవాది సుహాస్ సుబ్రమణ్యం చరిత్ర సృష్టించారు.అమీ బెరా.. డెమొక్రాట్ అభ్యర్థిగా కాలిఫోరి్నయాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమీ బెరా విజయం సాధించారు. రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్టీన్ బిష్ను ఆయన ఓడించారు. యూఎస్ ప్రతినిధుల సభలో ఆయన సీనియర్ భారతీయ అమెరికన్. 2012లో రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించిన బెరా 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహించారు. యూఎస్ ప్రతినిధుల సభకు చేరిన మూడో భారతీయ వ్యక్తిగా నిలిచారు. 1957లో కాలిఫోరి్నయా 29వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కాలు పెట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా దలీప్ సింగ్ సౌంద్ చరిత్ర సృష్టించిన 50 ఏళ్ల తరువాత అమీ బెరా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. మొదట స్వల్ప ఓట్ల తేడాతో గెలిచినా.. తరువాత పర్యాయాల్లో ఆధిక్యాన్ని కొనసాగించారు. థానేదార్ రెండోసారి.. మిషిగన్‌లోని పదమూడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు థానేదార్ రెండోసారి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓడించారు. తాను అందించిన సేవలు, శ్రామికులు, యూనియన్ల పక్షాన నిలబడటం, అబార్షన్ హక్కుల కోసం పోరాటం తన విజయానికి కారణమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు మద్దతు తెలిపిన యూనియన్లు, గ్రూపులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా రాజ్యాంగ హక్కులకోసం తాను పోరాడతానని హామీ ఇచ్చారు. రోఖన్నా.. 2016 నుంచికాలిఫోరి్నయాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్ ప్రతినిధి రో ఖన్నా మూడోసారి ఎన్నికయ్యారు. డెమొక్రాట్లకు బలమైన పట్టున్న 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అనితా చెన్ను సునాయాసంగా ఓడించారు. 2016లో మైక్ హోండాను ఓడించి ఖన్నా తొలిసారి అమెరికా సభకు ఎన్నికయ్యారు. ఖన్నా హౌస్ ఆర్మ్డ్ సరీ్వసెస్ కమిటీలో, పర్యవేక్షణ, జవాబుదారీ కమిటీల్లో పనిచేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణాన సిలికాన్ వ్యాలీలోని కొన్ని భాగాలను కలిగి ఉన్న డిస్ట్రిక్ట్.. 1990 నుంచి డెమొక్రాట్లకు కంచుకోటగా ఉంది. ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యా రు. రిపబ్లికన్ అభ్యర్థి మార్క్ రిక్‌పై దాదా పు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో కృష్ణమూర్తి విజయం సాధించారు. 2016లో తొలిసారి కాంగ్రెస్‌కు ఎన్నికైన ఆయన.. చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో అనుమానిత కార్యకలాపాలపై దృష్టి సారించిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న న్యాయవాది అయిన కృష్ణమూర్తి.. మాజీ డిప్యూటీ స్టేట్ కోశాధికారితో సహా రాష్ట్రం తరఫున అనేక పదవులు నిర్వహించారు. ప్రమీలా జయపాల్వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రమీలా జయపాల్ మరోసారి గెలుపొందారు. మలయాళీ అయిన జయపాల్ నాయర్ రిపబ్లికన్ అభ్యర్థి డాన్ అలెగ్జాండర్‌ను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. జయపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్లామ్–డంక్ లిబరల్ సీటు. ఇది డెమొక్రాట్లకు బలమైన జిల్లా. గెలుపు అనంత రం ఎక్స్ వేదికగా మద్దతు దారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘వాషింగ్టన్ 7వ జిల్లా కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంది. అందరితో కలిసి పురోగతి కోసం పనిచేయడానికి, అవకాశాల కోసం పోరాటం కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను. నాకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరూ హృదయపూర్వక కృతజ్ఞతలు’అని ఆమె పేర్కొన్నారు. సుహాస్ సుబ్రమణ్యం రికార్డు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం. ఇప్పటివరకు వర్జీనియా స్టేట్ సెనేటర్‌గా ఉన్న సుబ్రమణ్యం.. వర్జీనియానుంచి ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. డెమొక్రటిక్‌లకు కంచుకోట అయిన వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసి రిపబ్లికన్ పారీ్టకి చెందిన మైక్ క్లాన్సీని ఓడించారు. ప్రస్తుతం ఐదుగురు భారతీయ అమెరికన్లతో కూడిన కాంగ్రెస్‌లో ఆయన సమోసా కాకస్‌లో చేరారు. సుబ్రమణ్యం తండ్రిది బెంగళూరు. తండ్రిది చెన్నై. తాత మిలటరీలో పనిచేయడంతో తండ్రి ఎక్కువకాలం సికింద్రాబాద్‌లో గడిపారు. బెంగళూరులోని మెడికల్ కాలేజీలో చదువుకున్న ఇద్దరూ పెళ్లి చేసుకుని 70వ దశకంలో అమెరికాకు వలస వచ్చారు. తమ కొడుకు యూఎస్ కాంగ్రెస్‌లో ఉంటారని ఊహించి ఉండదు. సుహాస్ భార్య మిరాండాది వర్జీనియా. ఇద్దరు కుమార్తెలు. ‘ఈ జిల్లాకు సేవలందించడం గౌరవంగా భావిస్తున్నా’ అని సుబ్రమణ్యం పేర్కొన్నారు. అలాగే ‘నా పేరెంట్స్ కొన్ని విలువలు నేర్పారు. నా భారతీయ మూలాలు కోల్పోకూడదన్నది అందులో ఒకటి. అందుకే వేసవిలో ఇండియాకు వెళ్తుంటా. ఇప్పటికీ అక్కడ నాకు కుటుంబం ఉంది. ఆ వారసత్వాన్ని కొనసాగించడం నాకు చాలా ముఖ్యం. నా నేపథ్యం, నా వారసత్వం గురించి గర్వంగా చెప్పుకుంటా’అని చెప్పే సుబ్రమణ్యం.. భారత్–అమెరికా మధ్య బలమైన బంధం ఉండాలని కోరుకుంటున్నారు. -
అమెరికా ఎన్నికల్లో ఎన్నారైల సత్తా.. ఎంతమంది గెలిచారంటే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని విజయాన్ని నమోదు చేసుకున్నారు. పాపులర్ ఓటింగ్ ద్వారానే ఆయన తన గెలుపును ఖరారు చేశారు. అదే సమయంలో.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతి పౌరులు (ఎన్నారై) సైతం తమ సత్తా చాటారు. అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. వీరిలో ఆరుగురు విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోసారి బరిలోకి దిగిన ఐదుగురు సీనియర్ నాయకులు.. విజయాన్ని దక్కించుకున్నారు.1. రాజా కృష్ణమూర్తి(51): డెమోక్రాటిక్ పార్టీకి చెందిన బలమైన నాయకుడు రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్(8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా అయిదోసారి గెలుపొందారు. 2017 నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2. రో ఖన్నా(48): డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రో ఖన్నా..2017 నుంచి కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడే బరిలో దిగిన ఆయన మరోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి అనితా చెన్ను ఓడించి విజయం సాధించారు.3. సుహాస్ సుబ్రమణ్యం(38): డెమొక్రాటిక్ అభ్యర్థిగా వర్జీనియా (10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి బరిలో దిగిన సుహాస్ సుబ్రమణ్యం.. రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ క్లాన్సీని ఓడించి విజయం సాధించారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా వ్యవహరిస్తున్న ఆయన... డెమొక్రాట్లకు కంచుకోట రాష్ట్రంగా పేరున్న వర్జీనియా నుంచి విజయం దక్కించుకున్నారు. దీంతో వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా సుబ్రమణ్యన్ రికార్డు సృష్టించారురు. గతంలో అధ్యక్షుడు ఒబామాకు వైట్ హౌస్ సలహాదారుగా కూడా సుహాస్ పనిచేశారు.4. శ్రీథానేదార్(69): మిచిగాన్ (13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి బరిలోకి దిగిన శ్రీ థానేదార్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన ప్రత్యర్ధి రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతం ఓట్ల తేడాతో ఓడించి, రెండవసారి గెలుపును దక్కించుకున్నారు. ఈయన 2023 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.5. డాక్టర్ అమిబెరా(59): వృత్తి పరంగా వైద్యుడు అయిన అమిబెరా.. సీనియర్ మోస్ట్ ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యుడు.2013 నుంచి కాలిఫోర్నియా(6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి బరిలోకి దిగిన అమిబెరా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయాన్ని సాధించారు.6. ప్రమీలా జయపాల్(59): డెమోక్రటిక్ నేత ప్రమీలా జయపాల్ వాషింగ్టన్( 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ నేత డాన్ అలెగ్జాండర్‌ను ఓడించి తిరిగి ఎన్నికయ్యారు.అమిష్ షా: భారతీయ సంతతికి చెందిన అమిష్ షా... అరిజోనా(1వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అతను రిపబ్లికన్‌కు చెందిన డేవిడ్ ష్వీకర్ట్ కంటే ముందంజలో ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు విజయం దక్కించుకున్న రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ స్క్యూకెర్ట్‌తో అమిష్ తలపడుతుండడం గమనార్హం. కాగా అరిజోనా రాష్ట్ర అసెంబ్లీకి వరుసగా మూడు సార్లు(2018, 2020, 2022) ఎన్నికయ్యారు షా. -
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్‌హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్‌కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్‌మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్‌ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్‌కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్‌లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్‌కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్‌లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్‌కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్‌కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్‌కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్‌హౌజ్‌లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
భారతీయ అమెరికన్లలో హారిస్‌కు తగ్గిన ఆదరణ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదు కబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది! భారత మూలాలున్న కమలా హారిస్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. సోమవారం వెలువడ్డ ‘ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్’ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్‌కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్‌కు 22 శాతం మాత్రమే జైకొట్టారు!→ ఇండియన్ అమెరికన్ మహిళా ఓటర్లలో 67 శాతం మంది హారిస్‌కు జైకొట్టారు. ట్రంప్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 22 శాతమే.→ 40 ఏళ్ల పైచిలుకు వయసు వారిలో ఏకంగా 70 శాతం మహిళలు, 60 శాతం పురుషులు హారిస్‌కు జైకొట్టారు.→ 40 ఏళ్ల లోపువారిలో మాత్రం 60 శాతం మహిళలే హారిస్‌కు మద్దతిచ్చారు.→ ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్‌కు, 39 శాతం మంది ట్రంప్‌కు ఓటేస్తామని చెప్పారు.→ 40 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రం ట్రంప్‌దే పైచేయి కావడం విశేషం. ఆయనకు 48 శాతం, హారిస్‌కు 44 శాతం జైకొట్టారు.→ యువ ఇండియన్ అమెరికన్లలో మాత్రం ట్రంప్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.→ అమెరికాలో 52 లక్షలకు పైగా భారత సంతతి వారున్నారు. వారిలో ఓటర్ల సంఖ్య 26 లక్షల పై చిలుకు.→ హిందూయేతరులతో పోలిస్తే హిందువుల్లో ట్రంప్ మద్దతుదారులు అధికంగా ఉండటం విశేషం. ఆయనకు ఓటేస్తామని 58 శాతం మంది హిందువులు తెలిపారు. 35 శాతం హిందువులు హారిస్‌కు మద్దతిస్తామన్నారు.→ హిందూయేతర భారతీయ అమెరికన్లలో 62 శాతం హారిస్‌కు, 27 శాతం ట్రంప్‌కు మద్దతిచ్చారు.→ 17 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.→ ఉపాధి, ఆర్థిక అవ్యస్థ, అబార్షన్ ప్రధానాంశాలని 13 శాతం చెప్పారు.→ భారత్–అమెరికా సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన వారు కేవలం 4 శాతమే. -
అమెరికాలో భారతీయం
అమెరికా మొత్తం ఓటర్లు 16.1 కోట్ల పై చిలుకు. అందులో భారతీయ అమెరికన్ల సంఖ్య మహా అయితే 21 లక్షలు. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏ మాత్రమూ విస్మరించే పరిస్థితి లేదు. అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈసారి ఏకంగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దాంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే గాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా కొన్నేళ్లుగా వారి హవా బహుముఖంగా విస్తరిస్తోంది. దాంతో సహజంగానే అధికార సాధనలో వారి మద్దతు నానాటికీ కీలకంగా మారుతోంది.స్వింగ్ స్టేట్లలోనూ హవాఅధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్లలో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దాంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గత రెండు మూడు అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్ భాగ్యరేఖలు స్వింగ్ స్టేట్లలోని ఇండియన్ ఓటర్ల మనోగతంపై గట్టిగానే ఆధారపడ్డాయంటే అతిశయోక్తి కాదంటారు డాక్టర్ మిశ్రా.→ స్వింగ్ స్టేట్లుగా పేరుబడ్డ 10 రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లే మెజారిటీ.→ స్వింగ్ స్టేట్లలో పెన్సిల్వేనియాను అత్యంత కీలకమైనదిగా చెప్తారు. అలాంటి రాష్ట్రంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది నిర్ణయాక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఇండియన్లదే!→ దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది పై చిలుకు యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు మిశ్రా వివరించారు.→ గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71 శాతం మంది ఓటేశారు. తాజా ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఏకంగా 91 శాతానికి పైగా ఈసారి ఓటేస్తామని చెప్పారు!పార్టీలకు నిధుల వెల్లువభారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. అమెరికన్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలకు వారినుంచి నిధులు పోటెత్తుతున్నట్టు డెమొక్రటిక్ పార్టీ నేషనల్ ఫైనాన్స్ కమిటీ (డీఎన్ఎఫ్సీ) సభ్యుడు అజయ్ భుటోరియా చెబుతున్నారు. ‘‘నేను 20 ఏళ్లకు పైగా నిధుల సేకర్తగా వ్యవహరిస్తున్నా. మనవాళ్లు ఈ స్థాయిలో రాజకీయ విరాళా లివ్వడం గతంలో ఎన్నడూ లేదు’’ అంటూ విస్మయం వెలిబుచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. డీఎన్ఎఫ్సీలో 5 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. భూరి విరాళాలిస్తున్న వారితో పాటు పార్టీలకు, వాటి ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు చిన్న మొత్తాలు అందజేస్తున్న అమెరికన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని ఆసియన్ అమెరికన్ డయాస్పొరాలో అతి పెద్దదైన రాజకీయ కార్యాచరణ కమిటీ ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. 2012 నుంచీ ఇండియన్ అమెరికన్లలో ఈ ధోరణి బాగా పెరుగుతోందని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగయ్ మిశ్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పీఠానికి దారి సిలికాన్ వ్యాలీ గుండా వెళ్తుందన్నది నానుడి. కీలకమైన ఆ టెక్ రాజధానిలో భారతీయులదే హవా. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు పోగయ్యాయి! వాటిలో మనవారి నుంచి వసూలైనవే ఎక్కువ. డెమొక్రాట్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు న్నారు. వీరిలో పారిశ్రామిక దిగ్గజం ఇంద్రా నూయీ మొదలుకుని ఏఐ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా దాకా పలువురి పేర్లున్నాయి.రిపబ్లికన్లకూ...రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సంపత్ శివాంగి, హోటల్ పరిశ్రమ దిగ్గజం డానీ గైక్వాడ్ వంటి పలువురు ఎన్నారైలు ట్రంప్ ప్రచార కార్యకలాపాలకు భారీ విరాళాలిస్తున్నారు. అయితే 2020 నుంచీ ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది.అధికార పదవుల్లోనూ...అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ అధికార పదవుల్లో కూడా భారతీయుల హవా సాగుతోంది. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు మొదలుకుని సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డుల దాకా, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.→ యూఎస్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు.→ అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.→ బైడెన్–హారిస్ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు.→ హారిస్ అధ్యక్షురాలిగా నెగ్గితే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా.→ అమెరికా జనాభాలో యూదులు 2 శాతమే అయినా కాంగ్రెస్‌లో వారి సంఖ్య 10 శాతం. కొన్నేళ్లలో భారతీయులు అమెరికా సమాజంపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారన్నది ఒక అంచనా.సగానికి పైగా డెమొక్రాట్లే!→ తాజా సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లలో ఏకంగా 55 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నారు.→ 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నారు.→ స్వతంత్రులు, తటస్థులు 15 శాతం మందిగా లెక్క తేలారు. మిగతావాళ్లు తమ రాజకీయ మొగ్గుదలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
యూఎస్.. మనదే జోష్
భారతీయ అమెరికన్లు...టెక్నాలజీ ప్రపంచం రూపురేఖలు మారుస్తున్నారు..వైద్యుల రూపంలో ప్రాణాలు కాపాడుతున్నారు..విద్యావేత్తలుగా భావితరాలను తీర్చిదిద్దుతున్నారు..కళాకారులుగా సాంస్కృతిక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు..మేధావులుగా జ్ఞానాన్ని పంచుతున్నారు..శాస్త్రవేత్తలుగా విశ్వం రహస్యాలను ఛేదిస్తున్నారు.. పట్టుదల.. నైపుణ్యం.. వైవిధ్యతల కలబోతగా అమెరికన్ సమాజాన్ని సమృద్ధం చేస్తున్నారు. ఈ విజయాలు, గాథలు.. అమెరికా పురోగతి, సమైక్యతల్లో భారతీయ అమెరికన్ల పాత్రకు తార్కాణాలు!!’’.. ఇది భారతీయుల గురించి మనకు మనం చెప్పుకుంటున్న గొప్పలు కాదు.. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కన్సల్టింగ్ సంస్థ బీసీజీ గ్లోబల్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించిన అచ్చమైన వాస్తవం.దశాబ్దాల క్రితం ఉపాధి కోసం, సంపాదన కోసం ఖండాలు దాటి అగ్రరాజ్యం అమెరికాలో అడుగిడిన భారతీయులు అక్కడి సమాజంతో మమేకమైపోయారు. భారత్‌లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంటే.. అమెరికాలో మాత్రం మనవాళ్లు ఐదో వంతు మంది ఇప్పటికీ తాతముత్తాతల ఇళ్లలోనే ఉంటున్నారు. సంపాదించే ప్రతి డాలర్లో కొంత దాచుకునే ప్రయత్నం, పిల్లలకు మంచి చదువులు చెప్పించడం వంటివి కూడా మన భారతీయ అలవాట్లే. అంతేకాదు.. ప్రతి భారతీయ అమెరికన్ తన కోసం, తన కుటుంబం బాగు కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ.. అక్కడి సమాజానికి, ఆ దేశ పురోగతి మొత్తానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. దీనిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..భారతీయ అమెరికన్లు అమెరికా సమా జానికి, ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన స్థాయి లో సేవలు అందిస్తున్నారు. వలస వచ్చి ఒక దేశంలో బతకడమే కష్టమనుకునే పరిస్థితుల్లో.. భారతీయులు అక్కడి సమాజంతో మమేకం అవడమే కాకుండా టెక్నాలజీ, వైద్యం, విద్య, వ్యాపారాల్లో రాణించి అమెరికన్లకూ మేలు చేయగలుగుతున్నారు. సుమారు 30 కోట్ల జనాభా ఉన్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)’లో భారతీయుల సంఖ్య యాభై లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే అక్కడి జనాభాలో సుమారు రెండు శాతం. కానీ ఆ దేశంలోని 60% హోటళ్లు, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు ఇతర వ్యాపా రాలలో వీరికి భాగస్వామ్యం ఉంది. కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. వందల కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీలు స్థాపించగలిగారు. టాప్ టెక్నాలజీ కంపెనీల సీఈవోల నుంచి ట్రక్ డ్రైవర్ల దాకా ఎన్నో ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అమెరికా స్థానికుల కంటే సగటు భారతీయ అమెరికన్ కుటుంబం రెట్టింపు వార్షికాదాయాన్ని కలిగి ఉందంటేనే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.చదువే పెట్టుబడిగా..భారతీయ అమెరికన్లు తమ పిల్లలకు మంచి విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. కనీసం 70శాతం మంది బ్యాచిలర్స్ డిగ్రీ వరకూ చదువుకుంటున్నారు. 2007 నుంచి 2023 ఏప్రిల్ మధ్య 16 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భారతీయ అమెరికన్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు 40 శాతం ఉంటే.. అమెరికా స్థానికులలో ఇది కేవలం 13 శాతమే కావడం గమనార్హం. భారతీయ అమెరికన్లు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ రంగాల కోర్సులు చేస్తున్నారు. బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉండటం భారతీయ అమెరికన్ కుటుంబాల్లోని భావితరాలకు మరో వరం అని చెప్పవచ్చు. ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలు 34 సార్లు జరిగితే అందులో 28సార్లు ఇండియన్ అమె రికన్లే విజేతలుగా నిలిచారు.మంచి చదువు, నైపుణ్యాలతో.. మనవాళ్లు ఏ రంగంలో స్థిర పడ్డా బాగా రాణించగలుగుతున్నారు. జీతా లు మెరుగ్గా ఉంటున్నాయి. భారతీయ అమెరికన్ కుటుంబం సగటు వార్షికా దాయం 1,23,700 డాలర్లు (కోటి రూపా యలకుపైనే) ఉంది. అమెరికా స్థానిక కుటుంబాలతో పోలిస్తే ఇది సుమారు రెట్టింపు కావడం గమనార్హం.330కోట్ల డాలర్లుఅమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నభారతీయ విద్యార్థులు పెడుతున్న ఖర్చులు, చెల్లిస్తున్న ఫీజులు కలిపి సుమారు 330 కోట్ల డాలర్లు ఉంటాయని అంచనా. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ సొమ్ము కూడా కీలకమే.విద్యారంగం పైనా మన ముద్రభారతీయ అమెరికన్లు అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తు న్నారు. అగ్రరాజ్యంలో విద్యారంగంపై తమదైన ముద్ర వేస్తున్నారు. డాక్టర్ నీలి బెండపూడి పెన్‌స్టేట్ యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించగా.. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూని వర్సిటీకి చెందిన ‘డోయిర్ స్కూల్ ఆఫ్ సస్టెయిన బిలిటీ తొలి డీన్‌గా అరుణ్ మజుందార్ పనిచేస్తు న్నారు. శుభ్ర సురేశ్ కార్నెగీ మెలన్ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఉండగా.. యూనివర్సిటీ అఫ్ కాలిఫో ర్నియా చాన్సలర్‌గా ప్రదీప్ ఖోస్లా వ్యవహరిస్తున్నారు. ఇదే యూనివర్సిటీ బర్క్లీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ డీన్‌గా ఎస్.శంకర శాస్త్రి ఉన్నారు. అంతేకాదు మరెన్నో వర్సిటీల్లో భారతీయ అమెరికన్లు అధ్యాపకులుగా పనిచేస్తు న్నారు. ఒక అంచనా ప్రకారం అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీలన్నింటిలో కలిపి సుమారు 22 వేల మంది భారతీయ అమెరికన్ అధ్యాపకులు ఉన్నారు. మొత్తం అధ్యాపకుల్లో మనవాళ్ల వాటా 2.6 శాతం. సిలికాన్ వ్యాలీలోని హార్వర్డ్ లా స్కూల్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ సభ్యు డిగా వివేక్ వాధ్వా సేవలందిస్తుండగా.. ఆన్లైన్ విద్య విప్లవానికి నాంది పలికిన ‘ఎడ్ఎక్స్’ కంపెనీ సీఈవో, ఎంఐటీ అధ్యాపకుడు అనంత్ అగర్వాల్ కూడా భారతీయ అమెరికనే.ఆర్థిక ఇంధనంఅమెరికా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2023లో 27.36 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో భార తీయ అమెరికన్ల వాటా సుమారు లక్ష కోట్ల డాలర్లు. ఖర్చు పెట్టగల స్థోమత, పన్నుల చెల్లింపు, వ్యాపారాల ద్వారా ఇంత మొత్తాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థకు జోడించగలుగుతున్నారు మనవాళ్లు. ఏటా భారతీయ అమెరికన్లు చెల్లించే పన్నులు 30,000 కోట్ల డాలర్లుగా అంచనా.భారతీయ అమెరికన్లు అక్కడ ఏర్పాటు చేసిన హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయం 70,000 కోట్ల డాలర్లు. భారతీయ అమెరికన్లు రోజువారీ సరుకులు మొదలు.. వినోద, విహారాల దాకా ఏటా పెడుతున్న ఖర్చు 37,000 కోట్ల డాలర్ల నుంచి 46,000 కోట్ల డాలర్ల వరకూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వానికి అందే సేల్స్ ట్యాక్స్, ఇతర పన్నుల రూపంలో భారీగానే ఆదాయం సమకూరుతోంది.పరిశోధనలు, పేటెంట్లతోనూ..యూనివర్సిటీలు, కాలేజీల పాలన, బోధన మాత్రమే కాకుండా.. పరిశోధనల ద్వారా కూడా భారతీయ అమెరికన్లు విద్యా వ్యవస్థలో భాగమవుతున్నారు. అమెరికాలో 2023లో ప్రచురితమైన పరిశోధన వ్యాసాలన్నింటిలో భారతీయ సంతతి పరిశోధకుల భాగస్వామ్యం 13 శాతానికిపైగా ఉండటం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. అలాగే పది శాతం పేటెంట్లు కూడా మనవాళ్ల పేరుతోనే జారీ అవుతున్నాయి. పరిశోధనలకు అందించే ఎన్ఐహెచ్ గ్రాంట్లలోనూ భారతీయ అమెరికన్ల వాటా 11 శాతం కంటే ఎక్కువే.విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యంగూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ శాంతను నారాయణన్.. మనం తరచూ ఈ పేర్లువింటుంటాం. ప్రపంచంలోనే టాప్ కంపెనీలను నడుపుతున్న భారతీయ అమెరికన్లు వారు. అంతేకాదు అమెరికాలో భారతీయులు సృష్టించిన వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. ప్రపంచం గతిని మార్చేసిన సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీల్లో 15.5 శాతం భారతీయ సంతతి వాళ్లు ఏర్పాటు చేసినవే. టెక్ కంపెనీలే కాదు.. ప్రతి వీధి చివర ఒక సూపర్ మార్కెట్, లేదంటే హోటల్ నడుపుతున్నది మనవాళ్లే. అమెరికా మొత్తమ్మీద ఉన్న హోటళ్లలో 60శాతం భారతీయులవే.ఉద్యోగ కల్పనకు ఇతోధిక తోడ్పాటుగూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి 16 పెద్ద కంపెనీలను నడిపిస్తున్న భారతీయ అమెరికన్లు.. ఉద్యోగ కల్పన విషయంలోనూ ముందున్నారు. ఈ కంపెనీల్లో సుమారు 27 లక్షల మంది అమెరికన్లు ఉద్యోగం చేస్తున్నారు. వంద కోట్ల డాలర్లకుపైగా విలువైన యూనికార్న్ కంపెనీలు అమెరికాలో 648 వరకూ ఉంటే.. అందులో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసినవే 72. వీటి మొత్తం విలువ 195 బిలియన్ డాలర్లు. సుమారు 55,000 మంది ఉపాధి పొందుతున్నారు. మరోవైపు అమెరికాలోని హోటళ్లలో 60శాతం భారతీయ అమెరికన్లవే. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని అంచనా. అంటే భారతీయ అమెరికన్లు 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు లెక్క. చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్ల ద్వారా మరో 3.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మొత్తంగా భారతీయ అమెరికన్లు కోటి మంది జీవనానికి సాయపడుతున్నట్టు అంచనా.స్టార్టప్‌ల స్థాపనలోనూ..సోషల్ నెట్వర్కింగ్ అనగానే ట్విట్టర్, ఫేస్బుక్ వంటివి గుర్తుకొస్తాయి. అలా కాకుండా ఆడియో ద్వారా కూడా సోషల్ ప్లాట్‌ఫామ్ నడపవచ్చని నిరూపించారు భారతీయ అమెరికన్ రోహన్ సేథ్. ‘క్లబ్‌హౌస్’ పేరుతో ఆయన అభివృద్ధి చేసిన అప్లికేషన్ ఇప్పుడు పాపులర్. షేర్ల వ్యాపారం చేసే రాబిన్‌హుడ్, ఇంటికే సరుకులు తీసుకొచ్చిన ‘ఇన్‌స్టాకార్ట్’ వంటి స్టార్టప్‌లు భారతీయ అమెరికన్ల బుర్రల్లోంచి పుట్టుకొచ్చినవే.టాప్ భారతీయ అమెరికన్లు వీరే..జయ్ చౌధురి సీఈవో, జెడ్ స్కేలర్ (సైబర్ సెక్యూరిటీ రంగంలో అగ్రగామి సంస్థ)వినోద్ ఖోస్లా సన్ మైక్రో సిస్టమ్స్సహ వ్యవస్థాపకుడు, ఖోస్లా వెంచర్స్ అధినేతరొమేశ్ టి.వాధ్వానీ సింఫనీ టెక్నాలజీగ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవోరాకేశ్ గంగ్వాల్ ఇండిగో విమానాల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడుఅనిల్ భుస్రీక్లౌడ్ ఆధారిత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘వర్క్‌డే’ సహ వ్యవస్థాపకుడునీరజ్ షా ఇంటి సామన్లు అమ్మే ఈ–కామర్స్ కంపెనీ వేఫెయిర్ సీఈవో, సహ వ్యవస్థాపకుడుబైజూ భట్ కమీషన్ లేకుండా ట్రేడింగ్ సౌకర్యం అందించే కంపెనీ రాబిన్ హుడ్ వ్యవస్థాపకుడురోహన్ సేథ్ఆడియో ఆధారిత సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్ ‘క్లబ్‌హౌస్’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. -శాన్ఫ్రాన్సిస్కో నుంచి కంచర్ల యాదగిరిరెడ్డి -
సెప్టెంబర్‌లో అమెరికాకు మోదీ
న్యూయార్క్: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ నగర పరిధిలోని లాంగ్ ద్వీపంలో భారతీయ అమెరికన్లనుద్దేశించి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 16వేల సీటింగ్ సామర్థ్యమున్న నసావూ కొలీసియం ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 22వ తేదీన మోదీ ప్రసంగించనున్నారు. న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యాలయంలో సర్వ ప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్తున్నారు. భారతీయ అమెరికన్లతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. 2014లో తొలిసారిగా ఆయన ప్రధాని అయ్యాక ఐరాసలో వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో వేలాది మంది భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. దానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మళ్లీ భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
అమెరికాలో ఎన్ఆర్ఐల అతిపెద్ద కమ్యూనిటీ సెంటర్
ప్రవాస భారతీయులకు సంబంధించి అమెరికా చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. జూన్ 15న ఇల్లినాయిస్లోని షాంబర్గ్‌లో మొట్టమొదటి, అతిపెద్ద యూఎస్ ఇండియన్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ నేషనల్ ఇండియా హబ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అహింసా విశ్వభారతి వ్యవస్థాపకుడు ఆచార్య డాక్టర్ లోకేష్ ముని సమక్షంలో యోగా ఫెస్ట్ నిర్వహించారు.కమ్యూనిటీ, సాంస్కృతిక, వినోద కేంద్రం అయిన ఈ హబ్ భారతీయ అమెరికన్ల ఐక్యతకు దోహదం చేస్తుంది. లాభాపేక్షలేని కేంద్రం లక్ష్యం అన్ని యూఎస్ కమ్యూనిటీలను, అన్ని వయసుల వర్గాలను సానుకూలంగా ప్రభావితం చేయడానికి రూపొందించిన సమగ్ర సేవలు, కార్యకలాపాలను అందించడం, ఆశావాదం, పురోగతి భావాన్ని పెంపొందించడం.1,10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన క్లాస్-ఏ భవనమైన నేషనల్ ఇండియా హబ్‌ను కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, చికాగో ఇండియన్ కాన్సులేట్ గౌరవ కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి, రాయబారి డాక్టర్ ఔసఫ్ సయీద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నేషనల్ ఇండియా హబ్ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఇది యూఎస్‌లో మోడల్ కమ్యూనిటీ సెంటర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నేషనల్ ఇండియా హబ్ ఫౌండర్, చైర్మన్ హరీష్ కొలసాని వార్తా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్రం లక్ష్యం, విజన్ ను పంచుకున్నారు. ఈ ఐకానిక్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్ గా నిలుస్తుందని, సరిహద్దులు లేకుండా సమాజానికి సేవ చేయడానికి అంకితమైన 60కి పైగా సేవా సంస్థలు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకే గొడుగు కింద అత్యధిక సేవా సంస్థలను కలిగి ఉన్న హబ్ ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కు అర్హత సాధించిందని వివరించారు. -
అమెరికా రాజకీయాల్లో భారతీయులు
సిద్ధాంతపరంగా అమెరికా రెండు పార్టీల రాజకీయ వ్యవస్థను కలిగి ఉంది. కానీ ఆచరణలో, రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు రెండూ తమలో తామే సంకీ ర్ణాలుగా ఉంటున్నాయి. రిపబ్లికన్ పార్టీ దాని ఆధిపత్య స్థానంలోని కరడుగట్టిన మితవాదులకూ, పార్టీ లోపలే తమ వాణిని అట్టిపెట్టుకోవడానికి ఘర్షణ పడుతున్న గతకాలపు సంప్రదాయవాదులకూ మధ్య గొప్ప అంతర్యుద్ధానికి సాక్షీభూతంగా ఉంది. ఇక డెమోక్రటిక్ పార్టీ శిబిరం...సెంట్రిస్టులు, సెంటర్– లెఫ్టిస్టులు, లెఫ్టిస్టులకు నిలయంగా ఉంటోంది. అయితే, మితవాద పక్షం నుంచి ప్రగతిశీల వామపక్షాల వరకు, అమెరికాకు చేతనత్వం కలిగిస్తున్న ఐదు రాజకీయ పక్షాలలోనూ భారతీయ అమెరికన్ నాయకులు ప్రధాన పాత్రధారులుగా ఉండటమే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. కరుడుగట్టిన మితవాదం (ఫార్–రైట్)తో ప్రారంభిద్దాం. ఈ రాజకీయ ధోరణి, కింది విధానాలను కలిగివుంది. 1.కార్పొరేట్ పన్ను తగ్గింపుల ద్వారా ఆర్థిక స్థితిస్థాపకతను నిర్మించడంపై అమెరికా దృష్టి కేంద్రీకరించాలి. ఇంధన వాడకాన్ని ఎంతకైనా పెంచాలి. ఇప్పటికే ఉన్న ట్రేడింగ్ ఏర్పాట్లపై పూర్తిగా తిరోగమించాలి. 2. అమెరికా తన అంతర్జాతీయ కట్టుబాట్లను తగ్గించుకోవాలి. ఐరోపా నుండి వెనక్కి తగ్గాలి. ఎక్కువగా చైనాపై దృష్టి పెట్టాలి. 3. అమెరికా తన సరిహద్దులను పటిష్టంగా కాపాడు కోవాలి. సామాజిక జనాభా మార్పులు సంఘర్షణలను ఆహ్వానిస్తున్నాయి. వలసదారులు శ్వేత క్రైస్తవ జనాభా రాజకీయ ఆధిపత్యానికి కలగబోయే ముప్పును సూచిస్తున్నారు. 4. అమెరికా ‘మేలుకొలుపు’ (వోకిజం) రాజకీయాలను తిప్పికొట్టాలి. అవి లైంగికత లేదా జాత్య హంకారంపై విద్యా బోధన లేదా నిశ్చయాత్మక చర్య లేదా యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు వంటివి ఏవైనా కావచ్చు. 5. అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం, నిఘా సంస్థలు రాజకీయంగా రాజీ పడ్డాయి. వీటి సిబ్బందిని తగ్గించడంతో సహా నాటకీయంగా రీబూట్ చేయడం అవసరం. డోనాల్డ్ ట్రంప్ ఈ ధోరణికి నిజమైన మార్గదర్శకుడు, ముఖ చిత్రం కూడా. అయితే, ఈ రోజు ఈ ఉద్యమం తదుపరి తరం ముఖా లలో వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. నిజానికి, వాషింగ్టన్ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ రాజకీయ కార్యాచరణ సమావేశంలో, ట్రంప్ ఉపాద్యక్షుడి ఎంపికగా రామస్వామి కూడా ఫేవరెట్లలో ఒకరుగా ఉద్భ వించారు. మధ్యేవాద–సంప్రదాయవాద ధోరణిని పరిశీలిద్దాం. ఈ అంతరి స్తున్న మితవాద రిపబ్లికన్ ల తరం మూడు కీలక అంశాలలో, కరుడు గట్టిన మితవాదం నుండి భిన్నంగా ఉంటుంది. 1. అంతర్జాతీయ కట్టు బాట్ల పరంగా, అమెరికా బలం... పొత్తులపై, ‘నాటో’ కూటమి పట్ల నిబద్ధతపై, భాగస్వామ్యాలపై ఆధారపడి ఉంటుందని ఈ స్కూల్ విశ్వసిస్తుంది. ఐరోపాలో రష్యా సవాలును, ఇండో–పసిఫిక్‌లో చైనా సవాలును, పశ్చిమాసియాలో ఇరాన్‌ను అమెరికా కలిసి ఎదుర్కోవాలని నమ్ముతుంది. 2. సంస్కృతీ యుద్ధాల పరంగా – మితవాద రిప బ్లికన్ లు అబార్షన్, తుపాకీ హక్కులు, విద్యపై పార్టీ ఎజెండాతో సరిపెట్టుకుంటారు. అన్నింటికీ మరీ ఎక్కువ ఆందోళన చెందకుండా విభిన్న దృక్కోణాల పట్ల అంగీకారంగా ఉంటారు. 3. మితవాద రిప బ్లికన్ లు అమెరికన్ సంస్థలపై విశ్వాసం కలిగి ఉంటారు. అలాగే ప్రజా స్వామ్య నియమాలకు కట్టుబడి ఉంటారు. ఇది యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ మీద జనవరి 6న జరిగిన మూక దాడి సమర్థకుల నుండి వైరుధ్యాన్ని సూచిస్తుంది. సెనేట్‌లో మిచ్ మెక్కానెల్ ఈ విభాగానికి నాయకత్వం వహిస్తుండగా, నిక్కీ హేలీ ఇప్పుడు మితవాద రిపబ్లికన్ పార్శా్వనికి ప్రజా ముఖంగా ఉన్నారు. ఆమె అయోవా, న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలలో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. తన సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలోనూ ఓడారు. నెవాడాలో అయితే ‘ఈ అభ్యర్థులు ఎవరూ కారు’ విభాగంలో పోల్ అయిన ఓట్ల కంటే తక్కువ ఓట్లను పొందడం అనేది ఈ భావజాలం ఈరోజు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉందో చూపి స్తుంది. కానీ మొత్తంగా నియోజకవర్గాల పరంగా ఈ వర్గం ప్రభావం చూపుతుంది. న్యూ హాంప్‌షైర్‌లో హేలీకి వచ్చిన 43 శాతం ఓట్లు, సౌత్ కరోలినాలో వచ్చిన 39 శాతం ఓట్లలో ఇది కనిపిస్తుంది. గెలవడానికి సరిపోదు కానీ, ఈ వర్గాలు ఇంటిలోనే ఉంటే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ట్రంప్ అవకాశాలు నాటకీయంగా మసక బారుతాయి. డెమోక్రాట్లలో సెంట్రిస్టులు, సెంటర్ లెఫ్టులు, లెఫ్టులు... ఇక మనం డెమోక్రటిక్ పార్టీ శిబిరానికి మరలుదాం. డెమోక్రటిక్ సెంట్రిస్ట్లకు, సెంటర్–లెఫ్ట్‌కు అధ్యక్షుడు జో బైడెన్ నాయకత్వం వహిస్తున్నారు. వివిధ ప్రపంచ రంగాల్లో అమెరికా పాత్రకు సంబంధించి మధ్యేవాద రిపబ్లికన్ల నిబద్ధతను ఈ స్కూల్ కూడా పంచుకుంటుంది. ఇది కరుడుగట్టిన మితవాద, ప్రగతిశీల భావజాలాలు రెండింటినీ కలుపుకొని, అమెరికాలో పెట్టుబడి వికాసంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని నడిపించింది. ఇది అబార్షన్ హక్కులపై ప్రగతిశీల దృక్ప థాన్ని కనబరుస్తుంది. అయితే దీనిని ప్రజారోగ్య సమస్యగా, మహిళల హక్కుల సమస్యగా చూస్తుంది. ఇది నిర్మాణాత్మక జాతి వివక్షను గుర్తిస్తుంది కానీ పెరుగుతున్న సంస్కరణలను కూడా విశ్వసిస్తుంది. అధిక లోటును దృష్టిలో ఉంచుకుని సామాజిక భద్రతా వలయాన్ని విస్తరించేందుకు ఇది కట్టుబడి ఉంది. వలసలపై, మరింత కఠినమైన చట్ట అమలు, మరింత మానవీయ విధానం రెండింటి మధ్య సమ తుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది. భారతీయ అమెరికన్లలో, ఇల్లినాయికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మధ్యేవాది(సెంట్రిస్ట్). కానీ సిలికాన్ వ్యాలీ నుండి హౌస్ రిప్రజెంటేటివ్‌గా ఉన్న రో ఖన్నా మాత్రం సెంటర్–లెఫ్ట్ వర్గా నికి చెందిన అత్యంత ప్రముఖ హక్కుదారు. ఆయన మధ్యేవాదులకు, అభ్యుదయవాదులకు కుడివైపున ఉన్న స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. పైగా 2028లో అధ్యక్ష ఎన్నికల కోసం తానూ ఒక రాయి విసరాలని భావిస్తున్నారు. మార్కెట్‌కు సాంకేతిక పరిజ్ఞానం, మధ్య అమెరికాలో శ్రామిక వర్గానికి ఆర్థిక దేశభక్తి గురించి ఈయన మాట్లాడతారు. బహుళవాదం, మైనారిటీలకు ప్రాతినిధ్యం గురించి మాట్లాడతారు. చైనాపై కఠినమైన జాతీయ భద్రతా చర్యలు, గాజాలో కాల్పుల విరమణ, కార్పొరేట్ దోపిడీ, ప్రచార సంస్కరణల భాష గురించి కూడా మాట్లాడతారు. చివరగా, ప్రగతిశీల ధోరణిలోకి వెళ్లి చూడండి. వారు తమ సొంత అంతర్గత వైరుధ్యాలను కలిగి ఉన్నప్పటికీ, విస్తృతంగా చెప్పా లంటే, ప్రగతిశీలురు స్వేచ్ఛా వాణిజ్యంపై సందేహాస్పదంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ చర్యలను సైనిక–పారిశ్రా మిక సముదాయం నడపడాన్ని వ్యతిరేకిస్తారు. అసమానత, దాన్ని ఎదుర్కొనే విధానపరమైన నిర్ణయాల్లో జాతి, లింగవివక్షలను ప్రాథమిక అంశాలుగా తీసుకుంటారు. కార్పొరేట్ అధికారానికి బలమైన ప్రత్యర్థులు. అధిక పన్నుల ప్రతిపాదకులకు వ్యతిరేకులు. తీవ్రమైన వాతావరణ విధాన రక్షకులు. ప్రపంచంలోని మానవ హక్కుల వంటి సమస్యలపై మరింత చురుకైన అమెరికన్ జోక్యానికి లాబీయిస్టులు. ఈ విభాగంలోని ప్రముఖ ముఖాలు దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, హౌస్ ప్రోగ్రెసివ్ కాకస్ చైర్ ప్రమీలా జయపాల్. పురోగామి విశ్వాసాలను కమలా హారిస్ పంచుకుంటున్నప్పటికీ, విదేశాంగ విధా నాల విషయంలో మాత్రం ఆమె సెంట్రిస్ట్ వైఖరికి మారినట్టు కనిపిస్తోంది. ఈ ఐదు రకాల ధోరణులు... అమెరికా రాజకీయాలు ఈరోజు ఎందుకు సందడిగా విభజించబడి ఉన్నాయో, పైగా మునుపెన్నడూ లేనంత సంక్లిష్టంగా ఎందుకు ఉన్నాయో వివరించడంలో సహాయ పడవచ్చు. పైగా భారతీయ అమెరికన్లు అక్కడ తమ కొత్త నేల భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్యబద్ధంగా, తరచుగా ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అమెరికాలో భారతీయుని దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో భారతీయులు, భారతీయ అమెరికన్లపై దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన శాస్త్రీయ నృత్య కళాకారుడొకరిని దుండగులు కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిస్సోరిలోని సెంట్ లూయీస్‌లో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లా సూరికి చెందిన అమర్నాథ్ ఘోష్(34) పీహెచ్డీ కోసం అమెరికాలోని వెళ్లారు. వాషింగ్టన్ వర్సిటీలో చేరారు. మంగళవారం ఉదయం 7.15 గంటల సమయంలో నడిచి వెళ్తుండగా సెంట్ లూయీస్ అకాడమీ సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడి ఆయన అక్కడికకక్కడే చనిపోయారు. అమర్నాథ్కు తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరు. ఆయన మృతి విషయం బంధువులకు ఆలస్యంగా చేరింది. కూచిపూడి, భరతనాట్యాల్లో నిపుణుడైన ఆయన బాలె నేర్చుకుంటూ పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నట్లు ఆయన స్నేహితులు హిమా కుప్ప, రవి కుప్ప తెలిపారు. ఘోష్ మృతిపై షికాగోలోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు, యూనివర్సిటీ అధికారుల తో చర్చించింది. ఆయనను పొట్టన బెట్టుకున్న దుండగులను తక్షణమే పట్టుకోవాలని కోరింది. -
Ayodhya Ram Mandir: ప్రపంచ నలుమూలల్లోనూ ఘనంగా ప్రాణప్రతిష్ట వేడుకలు
వాషింగ్టన్/పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో చూసి ప్రపంచవ్యాప్తంగా భక్తులు పులకించిపోయారు. ఆస్ట్రేలియా నుంచి అమెరికా దాకా సంబరాలు జరుపుకున్నారు. న్యూయార్క్‌లో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద భారీ తెరలపై వందలాది భారతీయ అమెరికన్లు వేడుకను వీక్షించారు. సంప్రదాయ వస్త్రధారణలో భజనలు, కీర్తనలు చేశారు. పాకిస్తానీ ముస్లింలు సైతం.. అమెరికాలో వర్జీనియా రాష్ట్రం ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలోని శ్రీవెంకటేశ్వర లోటస్ టెంపుల్ వద్ద సిక్కులు, ముస్లింలు, పాకిస్తానీ అమెరికన్లు, క్రైస్తవులు సైతం వేడుకల్లో పాలుపంచుకున్నారు. అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్ ‘నాస్డాక్’ స్క్రీన్ మీదా కోదండరాముని చిత్రాన్ని ప్రదర్శించారు. లాస్ఏంజిలెస్లో 1,000 మందికిపైగా 250 కార్ల ర్యాలీ చేపట్టారు. పారిస్‌లో ఈఫిల్ టవర్ వద్ద భారతీయులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ట్రినిడాడ్, టొబాగో, మారిషస్, ఫిజీ, స్పెయిన్ తదితర దేశాల్లో సంబరాలు జరిగాయి. మెక్సికోలో తొలి రామాలయాన్ని అయోధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తంలోనే ప్రారంభించారు. -
సంస్కృతంలో వాళ్లెందుకు రాయరు?
సంస్కృతాన్ని ఇష్టపడే కొందరు భారతీయ అమెరికన్లు తమ పుస్తకాలను సంస్కృతంలో ఎందుకు రాయరు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను, విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి, రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. కానీ, ఇప్పుడు వాళ్లూ సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. అయినా ఆ అంతర్ధానానికి మాత్రం మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. దాదాపుగా భారతీయ అమెరికన్లతో కూడిన రాజీవ్ మల్హోత్రా నేతృత్వంలోని బృందం ఇటీవల ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ: ఎ క్రిటిక్ ఆఫ్ హిందూఫోబిక్ స్కాలర్స్’ పుస్తకాన్ని ప్రచురించింది. ఇంగ్లిషులో రాసిన ఈ పుస్తకం... ఈ రచయితతో సహా రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, శశిథరూర్, రామచంద్ర గుహ, దేవదత్ పట్నాయక్, షెల్డన్ పొలాక్, వెండీ డోనిగర్, ఆద్రీ త్రూష్కే, మైకేల్ విట్జెల్లను విమర్శించింది. మల్హోత్రా బృందం ఈ పండితులను పౌరాణిక పాత్ర అయిన రావణుడితో పోల్చింది. ఈ పండితులు ప్రాచీన సంస్కృత పుస్తకాలు ప్రబోధించిన ధర్మాన్ని చంపేశారని ఆరోపించింది. ‘చారిత్రక రావణుడికి మల్లే ఈ పండితుల రచనల్లో నేడు చాలామంది హిందువులు అధర్మంగా భావిస్తున్న అంశాలు ఉన్నాయి కాబట్టే ఈ పుస్తకంలో పది మంది సమకాలీన విద్వాంసులను లక్ష్యంగా’ ఎంచుకున్నట్లు మల్హోత్రా తన పరిచయంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో లక్ష్యంగా ఎంచుకున్న నలుగురు విదేశీ పండితులు సంస్కృత భాషపై కృషి చేశారు. చాలాకాలం వివిధ పాశ్చాత్య విశ్వ విద్యాలయాలలో సంస్కృత భాషను బోధించారు. మరోవైపు, మల్హోత్రాకు అమెరికాలో ‘ఇన్ఫినిటీ ఫౌండేషన్’ అనే ఆర్థిక నెట్వర్క్ ఉంది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఢిల్లీలోని ‘గరుడ ప్రకాశన్ ’ సంస్థనూ నడుపుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే: సంస్కృతాన్ని ఇష్టపడే ఈ భారతీయ అమెరికన్లు తమ పుస్తకాన్ని సంస్కృతంలో ఎందుకు రాయలేదు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. సంస్కృతాన్ని గొప్ప ప్రపంచ సజీవ భాష అంటారు, కానీ ఆ భాషలో ఏ గ్రంథాన్నీ రాయరు. సంస్కృతాన్ని మృత భాష అని షెల్డన్ పొల్లాక్ సరిగ్గానే అన్నారు. తమ దైనందిన జీవితంలో సంస్కృతాన్ని ఉప యోగించే, అందులో భావ వ్యక్తీకరణ చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఒక భాషను స్థానికంగా మాట్లాడేవారు లేనప్పుడు భాష మరణిస్తుంది. ఆధిపత్య నియంత్రణను కొనసాగించడానికి సంస్కృతాన్ని ఉపయోగించే వ్యక్తుల సమూహమే ఆ భాషను చంపేసింది. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను లేదా విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి లేదా రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఇప్పుడు వాళ్లూ ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. కానీ ఆ అంతర్ధానానికి మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. ఇతర సంస్కృతులకు చెందిన యూదుల వంటివారు తమ ఆధునిక పుస్తకాలను హీబ్రూలో రాస్తున్నారు. యువల్ నోవా హరారీ ప్రభావవంతమైన రచన ‘సేపియన్స్– ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్’ను మొదట హీబ్రూలోనే రాశారు. అలాగే గ్రీకులు గ్రీకు భాషలో రాస్తారు. అరబ్బులు అరబిక్‌లోనే రాస్తారు. బ్రాహ్మణ వాదులు మాత్రం సంస్కృతంలో రాయరు. శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీ కాన్ని మోసం చేయడానికి మాత్రమే సంస్కృతాన్ని పొగడటాన్ని నేటికీ కొనసాగిస్తున్నారా? బ్రాహ్మణవాద మేధావులకు ఆరెస్సెస్, బీజేపీ ఆర్థికంగా, సంస్థాగతంగా మద్దతు ఇస్తున్నాయి. భారతదేశ వ్యవసాయ చేతివృత్తుల చరిత్రను విస్మరిస్తూ సంస్కృత గతాన్ని మాత్రమే వీరు కీర్తిస్తున్నారు. వివిధ విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న జ్ఞానాన్నంతటినీ సంస్కృత గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, రామాయణం, మహాభారతాల నుండే దొంగిలించారనే భావనను ప్రచారం చేస్తారు. బ్రాహ్మణవాద శాస్త్రవేత్తలు కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలన్నీ ప్రాచీన సంస్కృత పుస్తకాలలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పండితుల్లో ఎంతమంది సంస్కృతంలో ఆ పుస్తకాలను చదివారు? సంస్కృతంలో ఇంత అపారమైన సృజనాత్మక శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ మేధావులు... ప్రపంచ తాత్విక, మే«ధాపరమైన రచనలను హరారీ వంటి వ్యక్తులకు ఎందుకు వదిలివేస్తున్నారు? భారతదేశ చరిత్ర పొడవునా సంస్కృతాన్ని ‘మాతృభాష’గా కాకుండా ‘పితృభాష’గా పరిగణిస్తూ వచ్చారు. సంస్కృతాన్ని ద్విజ కుటుంబాలలో కూడా మాతృభాషగా మారడానికి అనుమతించలేదని గుర్తుంచుకోవాలి. తల్లి, ఆమె బిడ్డల మధ్య సంభాషణతో సహా ఇంటిలో రోజువారీ జీవితంలో ఒక భాషను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మాత్రమే దానిని ‘మాతృభాష’గా పరిగణించవచ్చు. కులీన గృహాలలో కూడా సంస్కృతాన్ని మాతృభాషగా మారడానికి అనుమతించనప్పుడు, ఉత్పత్తి వర్గాల్లో దాన్ని స్వీకరించే ప్రశ్న తలెత్తదు. ఈ పరిస్థితుల దృష్ట్యా, నాగరికతకు రక్షణకర్తలుగా తమను తాము గుర్తించుకునే ఈ భారతీయ అమెరికన్ల సమూహం... సంస్కృతంలో తమ పుస్తకాలను ఎందుకు రాయడం లేదని ప్రశ్నించాల్సి ఉంది. ఈ బృందం ప్రధానంగా అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో నివసిస్తున్న వ్యక్తులలోని భారతీయ ఆలోచనా విధానాన్ని నిర్వలసీకరించడం, ఆర్థిక వనరులను సమీకరించడం లక్ష్యంగా పెట్టు కుంది. కానీ, భారతదేశంలో స్థాపించిన సంస్కృత పాఠశాలలు,సంస్కృత విశ్వవిద్యాలయాలకు వారు తమ పిల్లలను ఎందుకు పంపరు? బదులుగా వారు తమ పిల్లలను ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఎందుకు పంపాలని భావిస్తున్నారు? ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ’ పుస్తకాన్ని రచించిన ఈ వ్యక్తులు,సంస్కృత పుస్తకాల నుండి వచ్చిన భారతదేశ నాగరికత మా లాంటి ఎవరికీ తెలియదని ఆరోపించారు. నాగరికత అంటే వారి దృష్టిలో అర్థం ఏమిటి? పుస్తకాల ద్వారా నాగరికతను నిర్మించవచ్చా? సంస్కృత పుస్తకాలకు చెందిన ఏదైనా అనువాదాన్ని చదివితే... శూద్ర, దళిత, ఆదివాసీ వర్గాల నుండి సామాజిక శక్తులు ఏవీ లేవని అది సూచిస్తుంది. ఇవి యుద్ధం, యజ్ఞాలు, క్రతువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఆహార ఉత్పత్తి, సేకరణ, జంతువుల మేతకు చెందిన వ్యవస్థలను ఈ పుస్తకాలలో ఏ కోశానా పొందుపర్చలేదు. ఈ హిందూత్వ రచయితలతో సహా మానవులందరూ శూద్ర వ్యవసాయా ధారిత ప్రజానీకం ఉత్పత్తి చేసే ఆహారంతోనే జీవిస్తున్నారని గుర్తించడం ముఖ్యం. ఆ ‘సంస్కృత యుగం’లో భూమిని పండించిన వారి గురించి, జంతువుల మేత ద్వారా మాంసాన్ని, పాలను ఉత్పత్తి చేసిన వారి గురించి ఎప్పుడూ రాయలేదు. హాస్యాస్పదంగా, ఈ భారతీయ అమెరికన్ కులీన వర్గాలు, ప్రత్యేకించి అమెరికాలో కుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించే ఇన్ఫినిటీ ఫౌండేషన్ సభ్యులు తమను తాము ‘మేధావులైన క్షత్రియులు’గా పేర్కొంటారు. అది కులతత్వం కాదా? మరోవైపున వీరి సంస్కృత యుగం పట్ల దళితులు, ఆదివాసీలు, శూద్రులకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇంగ్లిష్ యుగంలోకి వెళ్లాలనీ, జ్ఞానోత్పత్తికి సంబంధించిన అన్ని కేంద్రాల నుండి ఈ శక్తులను స్థానభ్రంశం చేయాలనీ, ఆహార ఉత్పత్తి, జ్ఞానోత్పత్తి మధ్య సంబంధాన్ని ప్రతిష్ఠించాలనీ వారు కోరుకుంటున్నారు. ఇది అమృత్ కాల్ కాదు; నిజానికి ఇది శూద్ర కాలం. ఈ యుగంలో సంస్కృత పుస్తకాలలో వర్ణించినట్లుగా ఉత్పత్తి అనేది లోకువైనది కాదు; ఇక్కడ ఉత్పత్తి చాలా పవిత్రమైనది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
గ్రీన్‌కార్డు ఆశలు తీరే మార్గం.. భారతీయ అమెరికన్లకు శుభవార్త!
వాషింగ్టన్: గ్రీన్‌కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయ అమెరికన్లకు శుభవార్త. 1992 నుంచి నిరుపయోగంగా ఉన్న 2.30 లక్షలకు పైగా గ్రీన్‌కార్డులను స్వాధీనం చేసుకుని, పునరి్వనియోగించాలన్న సిఫారసుపై అధ్యక్షుడి సలహా మండలి ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా, మరింత మంది గ్రీన్‌కార్డులను అందుకునేందుకు వీలు ఏర్పడింది. దీని ప్రకారం..ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్‌కార్డులకు అదనంగా 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటిని జారీ చేస్తారని ప్రముఖ భారతీయ అమెరికన్ అజయ్ భుటోరియా చెప్పారు. అధ్యక్షుడు బైడెన్‌కు ఆసియన్ అమెరికన్ల సలహా మండలిలో భుటోరియా సభ్యుడు. ఇందుకు సంబంధించిన సిఫారసులను మండలికి గురువారం అందజేసినట్లు ఆయన తెలిపారు. గ్రీన్‌కార్డు అంటే అమెరికాలో వలసదారులకు అందజేసే శాశ్వత నివాస పత్రం. ఉపయోగంలో లేని గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, మున్ముందు గ్రీన్‌కార్డుల వృథాను అరికట్టేందుకు పలు సిఫారసులను చేశామన్నారు. వీటి అమలుతో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతో ఊరటనిస్తుందని చెప్పారు. తమ కమిషన్ సిఫారసులకు ఆమోదం తెలిపిన బైడెన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ, ఉద్యోగ ప్రాతిపదికన వలసదారులకు ఏటా నిరీ్ణత సంఖ్యలో గ్రీన్‌కార్డులను జారీ చేసే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)కి కాంగ్రెస్ ఇస్తుంటుంది. అయితే, పరిపాలనా పరమైన జాప్యంతో జారీ అయిన గ్రీన్‌కార్డుల్లో కొన్ని నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. అనేక ఏళ్లుగా ఇలా కార్డులు లక్షలుగా పేరుకుపోయాయని భుటోరియా వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు చర్యలను తాము సూచించినట్లు వెల్లడించారు. అందులో ఒకటి...1992 నుంచి ఉపయోగంలో గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్‌కార్డులకు తోడుగా స్వాధీనం చేసుకున్న 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటినీ జారీ చేయాలి. రెండోది..ఆ ఆర్థిక సంవత్సరంలో సంబంధిత పత్రాలను ఏజెన్సీలు ప్రాసెస్ చేయలేకపోయినప్పటికీ, అన్ని గ్రీన్ కార్డ్‌లు వార్షిక పరిమితి ప్రకారం అర్హులైన వలసదారులకు అందుబాటులో ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావడం. కొత్త విధానం అమల్లోకి రాకముందే ఉపయోగించని గ్రీన్ కార్డ్‌లను తిరిగి పొందేందుకు ఈ విధానాన్ని ముందస్తుగా వర్తింపజేయడం’అని ఆయన వివరించారు. ఈ సిఫారసులు అమల్లోకి వస్తే ఎన్నో కుటుంబాలు, వ్యక్తులతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిరుపయోగంగా ఉండే గ్రీన్‌కార్డుల ప్రభావం ముఖ్యంగా భారతీయ అమెరికన్లు, ఫిలిపినో అమెరికన్లు, చైనీస్ అమెరికన్ల కుటుంబాలపైనే ఉంటుందని చెప్పారు. గ్రీన్‌కార్డుల కొరత ప్రభావం తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే హెచ్–1బీ వీసాదారులపై ఉంటుందని, వారి పిల్లల వలస హోదాపైనా పడుతోందన్నారు. 2020 గణాంకాల ప్రకారం 42 లక్షల కుటుంబాలు సగటున ఆరేళ్లుగా గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయ ఐటీ నిపుణులు గ్రీన్‌కార్డు కోసం సగటున దశాబ్ద కాలంపాటు ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితులున్నాయి. -
మిడిసిపడుతున్నారు!
శాంటాక్లారా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. దేవుడి కంటే తమకే ఎక్కువ తెలుసు అని భారతదేశంలో కొందరు మిడిసిపడుతున్నారని, అలాంటివారిలో మోదీ కూడా ఒకరని అన్నారు. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటాక్లారాలో మంగళవారం ‘మొహబ్బత్ కీ దుకాణ్’ పేరిట ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన సదస్సులో వందలాది మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ ప్రపంచం చాలా పెద్దదని, అందరూ అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా కష్టమని వివరించారు. భారత్‌లో ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం తమకు అన్నీ తెలుసని వాదిస్తుంటారని అన్నారు. వారు తమకు అన్నీ తెలుసంటూ ఎవరినైనా ఒప్పించగల ఘనులు అని చెప్పారు. చరిత్ర గురించి చరిత్రకారులకు, సైన్స్ గురించి సైంటిస్టులకు, యుద్ధరీతుల గురించి సైన్యానికి పాఠాలు బోధించగల సమర్థులు అని ఎద్దేవా చేశారు. దేవుడితో సమానంగా కూర్చొని, ప్రపంచంలో ఏం జరుగుతోందో దేవుడికే చెప్పగలరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇతరులు చెప్పేది మాత్రం వారు వినబోరని పేర్కొన్నారు. అలాంటి ‘నమూనా’ మనుషుల్లో ప్రధాని మోదీ కూడా ఉన్నారనడంలో సందేహం లేదన్నారు. ఈ సృష్టి ఎలా పనిచేస్తోందో దేవుడికి మోదీ చక్కగా పాఠాలు చెప్పగలరని తెలిపారు. అప్పుడు తాను సృష్టించిన ఈ సృష్టి పట్ల దేవు డు అయోమయానికి గురికావడం ఖాయమని వెల్లడించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో సభామందిరం నవ్వులతో దద్దరిల్లిపోయింది. సెంగోల్ పేరిట ఆర్భాటం భారత్ అనే భావన ఇప్పుడు దాడికి గురవుతోందని, సవాళ్లు ఎదుర్కొంటోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్వేష వ్యాప్తి వంటి సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని, వాటిని పరిష్కరించేవారే లేకుండాపోయారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవమని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి చట్టసభల్లో చర్చించడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే సెంగోల్ (రాజదండం) పేరిట ఆర్భాటం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ సర్కారు పచ్చి అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. అమెరికాలో భారతదేశం జెండాను సగర్వంగా ఎగురవేస్తున్న భారతీయ అమెరికన్లపై రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు భారత్‌లో నేడు పేదలు, మైనార్టీ వర్గాల ప్రజలు నిస్సహాయులుగా మారిపోతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులు సహజంగా ఒకరినొకరు ద్వేషించుకోరని అన్నారు. దేశంలో వ్యవస్థను, మీడియాను నియంత్రిస్తున్న కొందరు వ్యక్తులు ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వివరించారు. రాజకీయ వ్యవస్థ, వ్యాపారాలు, పాలక వర్గంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాల్సిందేనని రాహుల్ తేల్చిచెప్పారు. ఖలిస్తానీ మద్దతుదారుల కలకలం శాంటాక్లారాలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తుండగా ఖలిస్తానీ మద్దతుదారులు కాసేపు హంగామా సృష్టించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. రాహుల్ నవ్వుతూ ప్రతిస్పందించారు. ‘‘స్వాగతం, స్వాగతం.. విద్వేషం అనే బజారులో ప్రేమ అనే దుకాణానికి స్వాగతం’’ అని అన్నారు. తాము అందరినీ ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెప్పారు. ఎవరినీ ద్వేషించబోమని, ఇతరులు చెప్పేది వింటామని పేర్కొన్నారు. ఇంతలో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఖలిస్తానీ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌కు ఏమీ తెలియదు: బీజేపీ అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నకిలీ గాంధీ అని విమర్శించారు. రాహుల్ దృష్టిలో చరిత్ర అంటే ఆయన కుటుంబేమేనని అన్నారు. ఆయనకు ఏమీ తెలియదని, కానీ, అన్నింట్లోనూ నిష్ణాతుడయ్యాడని ఎద్దేవా చేశారు. భారతీయులు తమ చరిత్ర పట్ల గర్వపడతారని వివరించారు. రాహుల్ మాత్రం భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి విదేశీ గడ్డను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన విమర్శలను పలువురు బీజేపీ ముఖ్య నేతలు తప్పుపట్టారు. రాహుల్‌పై బీజేపీ నేతలు చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ట్విట్టర్లో ఖండించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ మాట్లాడారని స్పష్టం చేశారు. ప్రజలు సమస్యల్లో కూరుకుపోయిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, ఆయన భజనపరులు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. -
ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు... కీలక పదవులు
వాషింగ్టన్: మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలో కీలక పదవులు లభించాయి. ఫ్లెక్స్ సీఈఓ రేవతీ అద్వైతి, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈఓ మనీశ్ బప్నాలకు వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించారు. అమెరికా వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై ఇది సలహాలు సూచనలు అందిస్తుంది. ‘‘అద్వైతి పలు కంపెనీల్లో కీలక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. వరుసగా నాలుగేళ్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆర్థికవేత్త అయిన బప్నాకు పలు సంస్థల్లో కీలక హోదాల్లో పని చేసిన విశేషానుభవముంది’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
బైడెన్ సలహా కమిటీలో ఇద్దరు భారతీయ అమెరికన్లు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇద్దరు భారతీయ అమెరికన్లను తమ వాణిజ్య విధానం, చర్చల సలహా కమిటీలో నియమించారు. వారిలో ఒకరు ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి, మరొకరు నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈవో మనీష్ బాప్నా. ప్రెసిడెంట్ నియమించిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ సిఫార్సు చేసినవారు 45 మంది వరకు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వాణిజ్యం, పెట్టుబడి, అభివృద్ధి అంశాలలో నైపుణ్యం కలిగి వారు, ఫెడరల్ ప్రభుత్వాలకు సంబంధం లేని కార్మిక, పరిశ్రమ, వ్యవసాయం, స్మాల్ బిజినెస్, సేవల ప్రతినిధులను ఇందులో సభ్యులుగా నియమిస్తారు. పరిశ్రమలు, రిటైలర్లు, ప్రభుత్వేతర పర్యావరణ, పరిరక్షణ సంస్థలు, వినియోగదారుల సంస్థలకు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం ఉంటుంది. వరుసగా నాలుగు సార్లు పవర్ఫుల్ బిజినెస్ వుమెన్ ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీ వ్యూహాత్మక దిశను రూపొందించి తయారీ రంగంలో కొత్త శకాన్ని నిర్వచిస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. ఫ్లెక్స్‌కు ముందు అద్వైతి ఈటన్ కంపెనీ ఎలక్ట్రికల్ సెక్టార్ వ్యాపారానికి ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చేశారు. అమెరికాస్, హనీవెల్‌లో కూడా పని చేసిన ఆమె ఉబెర్, కేటలిస్ట్ కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా సేవలందించారు. అద్వైతి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ సీఈవో కమ్యూనిటీకి ఉపాధ్యక్షత వహిస్తున్నారు, సీఈవో క్లైమేట్ లీడర్స్ డబ్ల్యూఈఎఫ్ అలయన్స్‌లో చేరారు. రేవతి వరుసగా నాలుగు సార్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతమైన వ్యాపార జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే భారత్‌లోని బిజినెస్ టుడే సంస్థ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఎంపికయ్యారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఆమె థండర్బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. పర్యావరణ రంగంలో విశేష అనుభవం దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా అనేక ముఖ్యమైన పర్యావరణ మైలురాళ్లు, పర్యావరణ చట్టాల రూపకల్పన వెనుక మనీష్ బాప్నా ప్రెసిడెంట్, సీఈవోగా ఉన్న నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్ఆర్డీసీ) ఉందని వైట్ హౌస్ తెలిపింది. మనీష్ బాప్నా 25 ఏళ్ల అనుభవంలో పేదరికం, వాతావరణ మార్పుల మూలాలను కనుగొనేందుకు విశేష కృషి చేశారు. ఆయన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆర్థికవేత్త కూడా అయిన మనీష్ బాప్నా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో న్యాయవాద వృత్తిని కొనసాగించే ముందు మెకిన్సే అండ్ కంపెనీ, ప్రపంచ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బిజినెస్‌తో పాటు పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఆయన మాస్టర్ డిగ్రీలు పొందారు. అంతకుముందు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. -
అమెరికా ఎగుమతుల మండలిలో ఇద్దరు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ విభాగంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ప్రధాన జాతీయ సలహా మండలి ఎక్స్పోర్ట్ కౌన్సిల్‌కు కార్పోరేట్ రంగానికి చెందిన పునీత్ రంజన్, రాజేశ్ సుబ్రమణియమ్‌లను ఎన్నుకున్నట్లు వైట్‌హౌస్ బుధవారం ప్రకటించింది. రంజన్ గతంలో డెలాయిట్ కన్సల్టింగ్‌కు సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం డెలాయిట్ గ్లోబల్ సీఈఓ ఎమిరిటస్‌గా ఉన్నారు. ఫెడ్ఎక్స్కు సీఈవో, అధ్యక్షునిగా సుబ్రమణియమ్ కొనసాగుతున్నారు. సుబ్రమణియమ్‌ను ఈ ఏడాది భారతప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్‌తో సత్కరించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యం పనితీరు, ఎగుమతులను ప్రోత్సహించడం, వ్యాపార, పరిశ్రమల, వ్యవసాయ, కార్మిక, ప్రభుత్వ విభాగాల మధ్య తలెత్తే సమస్యలపై చర్చించి ఈ ఎగుమతుల మండలి పరిష్కారానికి కృషిచేస్తుంది. ఈ అంశాలపై అధ్యక్షుడు బైడెన్‌కు సలహాలు, సూచనలు చేస్తోంది. -
USA: బైడెన్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్టు
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. -
అమెరికా మంచు తుపానులో గుంటూరు దంపతులు మృతి
పెదనందిపాడు(గుంటూరు జిల్లా): అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో నివాసముంటున్న గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సరస్సు దాటుతున్న క్రమంలో గల్లంతయ్యారు. ఈ ఘటనలో భార్య హరిత మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నారాయణ, అతడి స్నేహితుడు ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తమ ఇద్దరు పిల్లలు, స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫీనిక్స్‌లో ఉన్న సరస్సు దాటే క్రమంలో మంచు ఫలకలు కుంగాయి. దీంతో నారాయణ, ఆయన భార్య హరిత, స్నేహితుడు సరస్సులో పడిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో హరిత మృతదేహం లభించింది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని అమెరికాలోని నారాయణ స్నేహితులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా ఈ ఘటనలో చిన్నారులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు. పాలపర్రుకు చెందిన ముద్దన వెంకట సుబ్బారావు, వెంకటరత్నం దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో కుమారుడు నారాయణ పెద్దవాడు. కష్టపడి చదివి విదేశాల్లో స్థిరపడిన కుమారుడు కుటుంబానికి అసరాగా ఉంటున్న సమయంలో విధి ఇలా చేస్తుందని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులు రోదిస్తున్నారు. కనీసం కడసారి చూపులకైనా మృతదేహాలను స్వగ్రామానికి తరలించేలా ప్రభుత్వం కృషి చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నవించారు. ఇదీ చదవండి: బయల్దేరే సమయానికి మంచు తుపాను...ఏకంగా 18 గంటల పాటు కారులో -
అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్
కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన మైకి హోతి అనే వ్యక్తి అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ‘లోది’ నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర చరిత్రలోనే తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్ సృష్టించారు. మాజీ మేయర్ మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం పూర్తవగా నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక కోసం బుధవారం భేటీ అయ్యారు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు. బుధవారం జరిగిన సమావేశంలో.. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్వుమన్ లీసా క్రెయిగ్.. హోతి పేరును మేయర్‌గా ప్రతిపాదించారు. ఆయనను మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. మరోవైపు.. లీసా క్రెయిగ్‌ను ఉప మేయర్‌గా ఎన్నుకున్నారు. అంతకు ముందు మైకి హోతి.. 5వ జిల్లాకు కౌన్సిలర్‌గా, ఉప మేయర్‌గానూ సేవలందించారు. మేయర్‌గా ఎన్నికైన విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘ లోది నగర 117వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. ’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు మైకి హోతి. మైకి హోతి తల్లిదండ్రులు భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వారు. ఆర్మ్‌స్ట్రాంగ్ రోడ్లో సిక్కు ఆలయాన్ని స్థాపించడంలో ఆయన కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. Honored to be sworn in as the 117th Mayor of the City of Lodi #lodica #209 pic.twitter.com/dgmrYyz5gk — Mikey Hothi (@mikey_hothi) December 23, 2022 ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్! -
భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మకు కీలక పదవి
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మ (54) అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్, రీసోర్సెస్ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులు కానున్నారు. అధ్యక్షుడు బైడెన్ ఈ మేరకు ప్రతిపాదించారు. ఇందుకు సెనేట్ ఆమోదం తెలిపితే విదేశాంగ శాఖలో అత్యున్నత పదవి చేపట్టనున్న భారతీయ అమెరికన్ వర్మ అవుతారు. ఆయన 2015–17 మధ్య భారత్‌లో అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు. ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం మాస్టర్ కార్డ్ సంస్థ చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా పని చేస్తున్నారు. -
అమెరికా మధ్యంతరంలో ఐదుగురు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ దిగువ సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు బరిలో దిగారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ స్థానం నుంచి 57 ఏళ్ల అమీ బేరా ఆరోసారి రేసులో ఉన్నారు. 46 ఏళ్ల రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని ఏడో స్థానం నుంచి 57 ఏళ్ల జయపాల్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మిషిగన్‌లోని 13వ స్థానం నుంచి శ్రీ థనేదర్ పోటీకి సిద్ధమయ్యారు. రిపబ్లిక్ అభ్యర్థులతో పోలిస్తే బేరా, రాజా, ఖన్నా, ప్రమీలా బలంగా ఉన్నట్లు సమాచారం. ఇక 67 ఏళ్ల థనేదర్ అరంగేట్రం చేస్తున్నారు. ఐదుగురిలో ప్రమీలా జయపాల్ ఒక్కరే మహిళా అభ్యర్థి. హోరాహోరీ పోరు ఉండే స్థానాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. 50 రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తారు. సెనేట్‌లో మాత్రం 100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సమప్రాధాన్యత అంటే రెండు సీట్లు ఉంటాయి. మరోవైపు మేరీలాండ్ రాష్ట్రంలో డెమొక్రటిక్ మహిళా అభ్యర్థిగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం 57 ఏళ్ల అరుణా మిల్లర్ పోటీపడుతున్నారు. ఆమె గెలిస్తే ఈ పదవి చేపట్టే తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. ప్రతినిధుల సభకు నవంబర్ ఎనిమిదో తేదీన పోలింగ్ జరగనుంది. -
అమెరికాలో వెల్లివిరుస్తున్న 'భారతీయం'.. మునుపు ఎన్నడూ లేనంతగా!
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు అనటం కంటే కూడా అగ్రరాజ్యంలో మునుపు ఎన్నడూ లేనంతగా ఉనికి చాటుకొనేలా, అందరూ గుర్తించేలా మనవాళ్లు ఉంటున్నారని చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్వయంగా వైట్‌హౌస్‌లో దివాలి వేడుకలు చెయ్యటం, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా దివాలి వేడుకలలో పాల్గొనటం మనవాళ్ల ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది. వైట్‌హౌస్‌లో దీపావళి... బైడెన్ ఆతిధ్యంపై భారతీయుల సంతోషం అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో నిలిచిపోయేలా అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ వేళ వైట్‌హౌస్ దీపాల వెలుగులతో మెరిసిపోయింది. బైడెన్ దంపతులు ఈ సందర్భంగా నిర్వహించిన ‘దీపావళి రిసెప్షన్’కి 200 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ సంబరాలలో పూర్తి భారతీయత కనిపించడం విశేషం. సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. సితారిస్ట్ రిషబ్ శర్మ, ఎస్ఏ డ్యాన్స్ కంపెనీ ట్రూపు ఆధ్వర్యాన సాగిన ఆర్టిస్టుల డ్యాన్సులు, వారి పర్ఫామెన్స్ కట్టి పడేశాయి. గెస్టుల వస్త్ర ధారణ చూస్తే ఇండియాలోనే ఉన్నట్టు అనిపించేలా కనిపించిందని చెబుతున్నారు. దీపావళి సందర్భంగా జోబైడెన్ దంపతుల విశిష్ట ఆదరణను మరిచిపోలేమని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అతుల్ కేశప్ వ్యాఖ్యానించారు. ఈ ఆతిథ్యాన్ని అందుకోవడం ఓ గొప్ప ప్రివిలేజ్ అని టీవీ ఏసియా సీఈఓహెచ్ఆర్ షా పేర్కొన్నారు. అలాగే ఆసియన్ అమెరికన్స్ పై గల అడ్వైజరీ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటారియా .. దక్షిణాసియా వాసులను బైడెన్ ప్రభుత్వం ఎంతగా గౌరవిస్తుందో ఈ ఈవెంట్ నిరూపిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం 130 మందికి పైగా ఇండియన్ అమెరికన్లను ఉన్నత స్థానాల్లో నియమించిందని ఆయన చెప్పారు. అంతకు ముందు బైడెన్ దంపతులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ.. ‘మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు పెద్దసంఖ్యలో ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా-దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరవంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అమెరికా వృద్ధిలో ఇండో అమెరికన్ల కృషి చాలా ఉందని బైడెన్ చెప్పారు. కరోనా సమయంలో సైతం ఇక్కడి ప్రవాస భారతీయులు దేశ సేవకే అంకితమయ్యారని ఆయన ప్రశంసించారు. వీరి కృషిని తాము సదా గుర్తుంచుకుంటామన్నారు. దేశం ఆర్థికంగా ఎదిగేందుకు తాము ప్రవాస భారతీయుల సేవలను ఎప్పుడూ ఉపయోగించుకుంటామన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు ప్రత్యేక అతిథులు ఈ దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఆహ్వానించారు. దీని ద్వారా డిఫర్డ్ యాక్షన్ లీగల్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏఎల్‌సీఏ) పిల్లలకు సంఫీుభావం తెలుపుతున్న సందేశాన్ని ఆయన అందించారని భావిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలసి అమెరికా వెళ్లి, అక్కడ నివసించడానికి తగిన పత్రాలు లేని పిల్లలు డీఏసీఎల్‌ఏలో ఉన్నారు. వీరిని ఎప్పుడైనా అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. డీఏఎల్‌సీఏ పిల్లల తరఫున పోరాడుతున్న ‘ఇంప్రూవ్ ద డ్రీమ్’సంస్థ వ్యవస్థాపకుడు దీప్ పటేల్‌తోపాటు పరీన్ మహత్రే, అతుల్య రాజ్‌కుమార్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధ్యక్షుడు బైడన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలసి దీపావళి వేడుకల్లో పాల్గొనడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శుక్రవారం(అక్టోబర్ 28) నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారి నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరికీ కమలా హ్యారిస్ దంపతులు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు. కమలా హ్యారిస్.. అతిథులతో కలిసి బాణాసంచా కాల్చారు. దీపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని వ్యాఖ్యానించారు. ‘అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటిని తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి’అని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. అమెరికాలో భారతీయ సంతతి వారి ప్రభావం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దీపావళి పండుగ.. అమెరికాలో ముఖ్య వేడుకగా ప్రాముఖ్యం సంతరించుకుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాల్లోనూ దీపావళి వేడుకలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దీపావళి వేడుకలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగోలో(ఫ్లోరిడా రాష్ట్రం) పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు భారతీయ అమెరికన్లతోపాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, జగదీశ్ ప్రభలతోపాటు అనేక మంది తెలుగు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన శలభ్‌కుమార్, సతీష్ వేమన, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ, దీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో పలు ప్రధాన విషయాలను ట్రంప్ ప్రస్తావించారు. భారతదేశం, అమెరికా దౌత్య సంబంధాలు.. పరస్పర సహాయ సహకారాలు ఉన్నత శ్రేణిలో కొనసాగాలని ఆకాంక్షించారు. అదే విధంగా తన 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వాన్ని, సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే కాలంలో ఈ సహకారం ఇలాగే అందించాలని విజ్ఞప్తి చేస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చి.. సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో భాగస్వాములను చేస్తామని.. శలభ్ కుమార్‌ను తమ తరపు భారత రాయబారిగా నియమిస్తామని తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పధాన్ని అవలంభించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను మట్టుబెడతామన్నారు. భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలోఐనా కస్టపడి, సానుకూల దృక్పధంతో సాగే వారి స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టిందని, మంచి ఎక్కడున్నా అందరూ అవలంబించాలని, నేర్చుకోవాలని సూచిస్తూ.. విభిన్న వ్యక్తులు, భాషలు, ప్రాంతాలు, దేశాల సమాహారమే అమెరికా అని, ప్రతిభకు పట్టం కట్టే విధానంతో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని ఉద్ఘాటించారు. అదే విధంగా భారతీయుల పట్ల, హిందువుల సంస్కృతీ, సంప్రదాయాలపట్ల తనకు గౌరవమని.. వారి అపార ప్రతిభ పాటవాలు పరస్పరం ఇరుదేశాల అభివృద్ధికి తోడ్పడాలని అభిలషిస్తూ, భారత అమెరికా సంబంధాలు అత్యున్నత స్నేహపూర్వకంగా నిలిపేందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సాంప్రదాయక విందు పలువురిని ఆకర్షించింది. పూర్తి సంప్రదాయ బద్దంగా అన్ని భాషల, రాష్ట్రాల వంటల రుచులను ప్రత్యేకంగా అతిధులకు అందించటం జరిగింది.. ఒక్కొక్క అతిథికి విందుకు సుమారు 85,000 రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేశారు. కాగా కార్యక్రమం నిర్వాహకులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే అతిథులను ఈ వేడుకలకు అనుమతించారు. ఇలా వచ్చిన వారిలో కేవలం ఇద్దరు తెలుగు వారికి మాత్రమే ట్రంప్‌తో కలిసి ఫొటో దిగే అవకాశం లభించడం గమనార్హం. వారిలో తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు, జగదీశ్ ప్రభల కూడా ఉన్నారు. భారత్ అంటే ఎంతో అభిమానమన్న ట్రంప్ తన నివాసం ‘మార్-ఎ-లాగో’లో దీపావళి వేడుకలు నిర్వహించినందుకు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ హిందూ కోఅలియేషన్ (ఆర్‌హెచ్‌సీ) సహకారంతోనే కీలకమైన ప్రాంతాల్లో 4 లక్షల మంది ఓటర్లు తమ పార్టీకి ఓటేసినట్లు ఆయన అంగీకరించారు. ఈ క్రమంలోనే ఆర్ఎన్సీ, ఎన్ఆర్సీసీ, ఎన్ఎస్ఆర్సీ వంటి హిందూ కోఅలియేషన్లకు చైర్మన్‌గా షల్లీ కుమార్ (శలభ్ కుమార్)ను నియమించాలని ట్రంప్ ప్రతిపాదించారు. 2024లో తాను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే ఆ సమయంలో తన హిందూ కోలియేషన్ విభాగం అధినేతగా షల్లీ కుమార్‌ను నియమిస్తానని చెప్పారు. ఆర్‌హెచ్‌సీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోని నైపుణ్యాలను మెచ్చుకున్న ట్రంప్.. తాను అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే ఆర్‌హెచ్‌సీ సభ్యులను పరిపాలనలో భాగం చేస్తానని హామీ ఇచ్చారు. హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని తాను కూడా సందర్శిస్తానని, ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానిస్తానని అన్నారు. పాకిస్తాన్‌కు మిలటరీ ఆయుధాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటానని, ఎఫ్16 విమానాల అమ్మకాన్ని కూడా అడ్డుకుంటాన్నారు. చైనా దిగుమతులపై పన్నులు కొనసాగిస్తానని చెప్పారు. అలాగే షల్లీ కుమార్ రచిస్తున్న ‘చైనీస్ కాలనైజేషన్ ఆఫ్ అమెరికా 2049 అండ్ ది ఓన్లీ మ్యాన్ హు కెన్ స్టాప్ ఇట్’అనే పుస్తకానికి తన వంతు సహకారం చేస్తానని, ఆ పుస్తకం ‘ముందుమాట’ను రచిస్తానని ట్రంప్ మాటిచ్చారు. డీఏఎల్‌సీఏ చిన్నారులు దేశ బహిష్కరణకు గురికాకుండా కాపాడటానికి కృషి చేస్తానని, గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. భారతదేశం, హిందువులు అంటే తనకు చాలా అభిమానమని చెప్పిన ట్రంప్.. ‘షల్లీ అండ్ ట్రంప్ సబ్సే అచ్ఛే దోస్త్.. అండ్ భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్ఛే దోస్త్’ అంటూ తన ప్రసంగం ముగించారు. టెక్సాస్ గవర్నర్ ఇంట్లో దీపావళి వేడుకలు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్, సతీమణి సిసిలియా దంపతులు టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ పట్టణంలో తమ నివాస గృహంలో అక్టోబర్ 23న వైభవంగా దీపావళి వేడుకలు జరిపారు. ఆ వేడుకలకు టెక్సాస్ రాష్ట్రం నుంచి అనేక మంది భారతీయ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భగా గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్ మాట్లాడుతూ.. ‘దీపావళి పండుగ ముందరి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకురావాల’ని అన్నారు. తానా మాజీ అధ్యక్షులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర.. గవర్నర్ దంపతులకు అభినందనలు తెలిపారు. (క్లిక్ చేయండి: బ్రిటన్ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ) న్యూయార్క్‌లో టైం స్క్వేర్ వద్ద దీపావళి వేడుకలు న్యూయార్క్ నగరం లోని కొందరు భారతీయ ప్రముఖులు కలిసి అక్టోబర్ 15న న్యూ యార్క్ నగర బొడ్డున వున్నా టైం స్క్వేర్ సెంటర్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. న్యూ యార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ముఖ్య అతిధిగా వచ్చి భారతీయ సంతతిని, భారతీయ సంస్కృతిని, పండుగలను అభినందించారు. 2023 నుంచి న్యూయార్క్ నగరంలోని అన్ని పబ్లిక్ స్కూల్స్‌కి దీపావళి పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని ప్రకటించారు. తెలుగు వారిలో ప్రముఖులైన డాక్టర్ నోరి దత్తాత్రేయులుని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సన్మానించారు. తెలుగు నాయకులు రాజేందర్ డిచ్పల్లి.. మేయర్ ఎరిక్ ఆడమ్స్కి అభినందనలు తెలిపారు. - వేంకట సుబ్బారావు చెన్నూరి అమెరికాలో ప్రచురితమయ్యే తెలుగు టైమ్స్ సంపాదకులు