అమెరికాలో భారతీయం | Indian Americans are a growing political force | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయం.. అగ్రరాజ్యంలో మనోళ్ల హవా

Published Sat, Oct 19 2024 4:46 AM | Last Updated on Sat, Oct 19 2024 4:00 PM

Indian Americans are a growing political force

అమెరికా రాజకీయాల్లో ప్రబల శక్తి 

వారి మద్దతు పార్టీలకు కీలకం

అమెరికా మొత్తం ఓటర్లు 16.1 కోట్ల పై చిలుకు. అందులో భారతీయ అమెరికన్ల సంఖ్య మహా అయితే 21 లక్షలు. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏ మాత్రమూ విస్మరించే పరిస్థితి లేదు. 

అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఈసారి ఏకంగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దాంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే గాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా కొన్నేళ్లుగా వారి హవా బహుముఖంగా విస్తరిస్తోంది. దాంతో సహజంగానే అధికార సాధనలో వారి మద్దతు నానాటికీ కీలకంగా మారుతోంది.

స్వింగ్‌ స్టేట్లలోనూ హవా
అధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్‌ స్టేట్లలో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దాంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్‌ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గత రెండు మూడు అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్‌ భాగ్యరేఖలు స్వింగ్‌ స్టేట్లలోని ఇండియన్‌ ఓటర్ల మనోగతంపై గట్టిగానే ఆధారపడ్డాయంటే అతిశయోక్తి కాదంటారు డాక్టర్‌ మిశ్రా.

→ స్వింగ్‌ స్టేట్లుగా పేరుబడ్డ 10 రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లే మెజారిటీ.
→ స్వింగ్‌ స్టేట్లలో పెన్సిల్వేనియాను అత్యంత కీలకమైనదిగా చెప్తారు. అలాంటి రాష్ట్రంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో బక్స్‌ కౌంటీది నిర్ణయాక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఇండియన్లదే!
→ దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది పై చిలుకు యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు మిశ్రా వివరించారు.
→ గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71 శాతం మంది ఓటేశారు. తాజా ఆసియన్‌ అమెరికన్‌ ఓటర్‌ సర్వేలో ఏకంగా 91 శాతానికి పైగా ఈసారి ఓటేస్తామని చెప్పారు!

పార్టీలకు నిధుల వెల్లువ
భారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. అమెరికన్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలకు వారినుంచి నిధులు పోటెత్తుతున్నట్టు డెమొక్రటిక్‌ పార్టీ నేషనల్‌ ఫైనాన్స్‌ కమిటీ (డీఎన్‌ఎఫ్‌సీ) సభ్యుడు అజయ్‌ భుటోరియా చెబుతున్నారు. ‘‘నేను 20 ఏళ్లకు పైగా నిధుల సేకర్తగా వ్యవహరిస్తున్నా. మనవాళ్లు ఈ స్థాయిలో రాజకీయ విరాళా లివ్వడం గతంలో ఎన్నడూ లేదు’’ అంటూ విస్మయం వెలిబుచ్చారు. 

రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్‌ అమెరికన్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. డీఎన్‌ఎఫ్‌సీలో 5 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. భూరి విరాళాలిస్తున్న వారితో పాటు పార్టీలకు, వాటి ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు చిన్న మొత్తాలు అందజేస్తున్న అమెరికన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని ఆసియన్‌ అమెరికన్‌ డయాస్పొరాలో అతి పెద్దదైన రాజకీయ కార్యాచరణ కమిటీ ఏఏపీఐ విక్టరీ ఫండ్‌ చైర్మన్‌ శేఖర్‌ నరసింహన్‌ చెప్పుకొచ్చారు. 

2012 నుంచీ ఇండియన్‌ అమెరికన్లలో ఈ ధోరణి బాగా పెరుగుతోందని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంగయ్‌ మిశ్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పీఠానికి దారి సిలికాన్‌ వ్యాలీ గుండా వెళ్తుందన్నది నానుడి. కీలకమైన ఆ టెక్‌ రాజధానిలో భారతీయులదే హవా. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు పోగయ్యాయి! వాటిలో మనవారి నుంచి వసూలైనవే ఎక్కువ. డెమొక్రాట్‌ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్‌ అమెరికన్లు న్నారు. వీరిలో పారిశ్రామిక దిగ్గజం ఇంద్రా నూయీ మొదలుకుని ఏఐ ఇన్వెస్టర్‌ వినోద్‌ ఖోస్లా దాకా పలువురి పేర్లున్నాయి.

రిపబ్లికన్లకూ...
రిపబ్లికన్‌ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్‌ అమెరికన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సంపత్‌ శివాంగి, హోటల్‌ పరిశ్రమ దిగ్గజం డానీ గైక్వాడ్‌ వంటి పలువురు ఎన్నారైలు ట్రంప్‌ ప్రచార కార్యకలాపాలకు భారీ విరాళాలిస్తున్నారు. అయితే 2020 నుంచీ ఇండియన్‌ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్‌ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది.

అధికార పదవుల్లోనూ...
అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ అధికార పదవుల్లో కూడా భారతీయుల హవా సాగుతోంది. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు మొదలుకుని సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డుల దాకా, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

→ యూఎస్‌ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు.
→ అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
→ బైడెన్‌–హారిస్‌ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు.
→ హారిస్‌ అధ్యక్షురాలిగా నెగ్గితే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా.
→ అమెరికా జనాభాలో యూదులు 2 శాతమే అయినా కాంగ్రెస్‌లో వారి సంఖ్య 10 శాతం. కొన్నేళ్లలో భారతీయులు అమెరికా సమాజంపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారన్నది ఒక అంచనా.

సగానికి పైగా డెమొక్రాట్లే!
→ తాజా సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లలో ఏకంగా 55 శాతం మంది డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నారు.
→ 25 శాతం మంది రిపబ్లికన్‌ పార్టీకి మద్దతిస్తున్నారు.
→ స్వతంత్రులు, తటస్థులు 15 శాతం మందిగా లెక్క తేలారు. మిగతావాళ్లు తమ రాజకీయ మొగ్గుదలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement