Indian population
-
అమెరికాలో భారతీయం
అమెరికా మొత్తం ఓటర్లు 16.1 కోట్ల పై చిలుకు. అందులో భారతీయ అమెరికన్ల సంఖ్య మహా అయితే 21 లక్షలు. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏ మాత్రమూ విస్మరించే పరిస్థితి లేదు. అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈసారి ఏకంగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దాంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే గాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా కొన్నేళ్లుగా వారి హవా బహుముఖంగా విస్తరిస్తోంది. దాంతో సహజంగానే అధికార సాధనలో వారి మద్దతు నానాటికీ కీలకంగా మారుతోంది.స్వింగ్ స్టేట్లలోనూ హవాఅధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్లలో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దాంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గత రెండు మూడు అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్ భాగ్యరేఖలు స్వింగ్ స్టేట్లలోని ఇండియన్ ఓటర్ల మనోగతంపై గట్టిగానే ఆధారపడ్డాయంటే అతిశయోక్తి కాదంటారు డాక్టర్ మిశ్రా.→ స్వింగ్ స్టేట్లుగా పేరుబడ్డ 10 రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లే మెజారిటీ.→ స్వింగ్ స్టేట్లలో పెన్సిల్వేనియాను అత్యంత కీలకమైనదిగా చెప్తారు. అలాంటి రాష్ట్రంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది నిర్ణయాక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఇండియన్లదే!→ దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది పై చిలుకు యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు మిశ్రా వివరించారు.→ గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71 శాతం మంది ఓటేశారు. తాజా ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఏకంగా 91 శాతానికి పైగా ఈసారి ఓటేస్తామని చెప్పారు!పార్టీలకు నిధుల వెల్లువభారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. అమెరికన్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలకు వారినుంచి నిధులు పోటెత్తుతున్నట్టు డెమొక్రటిక్ పార్టీ నేషనల్ ఫైనాన్స్ కమిటీ (డీఎన్ఎఫ్సీ) సభ్యుడు అజయ్ భుటోరియా చెబుతున్నారు. ‘‘నేను 20 ఏళ్లకు పైగా నిధుల సేకర్తగా వ్యవహరిస్తున్నా. మనవాళ్లు ఈ స్థాయిలో రాజకీయ విరాళా లివ్వడం గతంలో ఎన్నడూ లేదు’’ అంటూ విస్మయం వెలిబుచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. డీఎన్ఎఫ్సీలో 5 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. భూరి విరాళాలిస్తున్న వారితో పాటు పార్టీలకు, వాటి ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు చిన్న మొత్తాలు అందజేస్తున్న అమెరికన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని ఆసియన్ అమెరికన్ డయాస్పొరాలో అతి పెద్దదైన రాజకీయ కార్యాచరణ కమిటీ ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. 2012 నుంచీ ఇండియన్ అమెరికన్లలో ఈ ధోరణి బాగా పెరుగుతోందని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగయ్ మిశ్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పీఠానికి దారి సిలికాన్ వ్యాలీ గుండా వెళ్తుందన్నది నానుడి. కీలకమైన ఆ టెక్ రాజధానిలో భారతీయులదే హవా. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు పోగయ్యాయి! వాటిలో మనవారి నుంచి వసూలైనవే ఎక్కువ. డెమొక్రాట్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు న్నారు. వీరిలో పారిశ్రామిక దిగ్గజం ఇంద్రా నూయీ మొదలుకుని ఏఐ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా దాకా పలువురి పేర్లున్నాయి.రిపబ్లికన్లకూ...రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సంపత్ శివాంగి, హోటల్ పరిశ్రమ దిగ్గజం డానీ గైక్వాడ్ వంటి పలువురు ఎన్నారైలు ట్రంప్ ప్రచార కార్యకలాపాలకు భారీ విరాళాలిస్తున్నారు. అయితే 2020 నుంచీ ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది.అధికార పదవుల్లోనూ...అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ అధికార పదవుల్లో కూడా భారతీయుల హవా సాగుతోంది. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు మొదలుకుని సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డుల దాకా, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.→ యూఎస్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు.→ అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.→ బైడెన్–హారిస్ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు.→ హారిస్ అధ్యక్షురాలిగా నెగ్గితే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా.→ అమెరికా జనాభాలో యూదులు 2 శాతమే అయినా కాంగ్రెస్‌లో వారి సంఖ్య 10 శాతం. కొన్నేళ్లలో భారతీయులు అమెరికా సమాజంపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారన్నది ఒక అంచనా.సగానికి పైగా డెమొక్రాట్లే!→ తాజా సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లలో ఏకంగా 55 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నారు.→ 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నారు.→ స్వతంత్రులు, తటస్థులు 15 శాతం మందిగా లెక్క తేలారు. మిగతావాళ్లు తమ రాజకీయ మొగ్గుదలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జనశక్తి... శ్రమయుక్తి...
సగం నీళ్ళున్న గాజు గ్లాసును చూసి... సగం నిండుగా ఉందని ఆశావహ దృక్పథం అవలంబించవచ్చు. సగం ఖాళీయే అని నిరాశ పడనూవచ్చని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రపంచ జనాభా గురించి, అందులోనూ భారత జనాభా పొంగు కుంగుల గురించి తాజాగా వెల్లడైన లెక్కల్ని చూసినప్పుడు సరిగ్గా ఇలాగే ఎవరి ఆలోచనలు, అంచనాలు వారివి. ఐక్యరాజ్యసమితి (ఐరాస) గత వారం విడుదల చేసిన ‘ప్రపంచ జనాభా దృశ్యం’ (డబ్ల్యూపీపీ) నివేదికలోని సమాచారం విస్తృత చర్చనీయాంశమైంది అందుకే! ప్రాథమికంగా ఈ నివేదిక ప్రపంచ జనసంఖ్య ఎలా మారనున్నదీ అంచనా వేసి, వివిధ ప్రాంతాలు, దేశాలపై దాని ప్రభావం ఎలా ఉండనుందో భవిష్యత్ దర్శనం చేస్తోంది. ప్రపంచ జనాభా గణనీయంగా పెరగనుందనీ, 2080ల నాటికి 1000 కోట్లు దాటుతుందనీ నివేదిక అంచనా. ఆ తరువాత నుంచి మొత్తం మీద జనాభా క్రమంగా తగ్గుతుందట. అలాగే, ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమని పేరుబడ్డ మన భారత్ గురించి కూడా ఈ నివేదిక కీలక అంచనాలు కట్టింది. ఫలితంగా ఈ నివేదిక ఆసక్తి రేపి, ఆలోచనలు పెంచుతోంది.అసలు 2011 తర్వాత మనం దేశంలో అధికారిక జనగణన జరగనే లేదు. దశాబ్దానికి ఒకసారి జరిపే కీలకమైన ఈ ప్రక్రియ నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కరోనా కాలంలో ఈ బృహత్తర ప్రయత్నాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆ మహమ్మారి కథ ముగిసిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఎందుకనో దానికి మోక్షం కలగనే లేదు. దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కల్పించి, పాలకులకూ, సంక్షేమ పథకాలకూ ఒక దిక్సూచిగా నిలవగలిగిన జనగణనపై ప్రభుత్వం ఎందుకనో ఇప్పటికీ ఉదాసీనత చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ఐరాస వెలువరించిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూపీపీ నివేదిక మనకు మార్గదర్శి. లింగ, వయో భేదాల వారీగా వచ్చే 2100 వరకు భారత జనాభా ఎలా ఉండవచ్చనే అంచనాలను ఈ నివేదిక వివరంగా పేర్కొంది. జనసంఖ్యా సంబంధమైన సమాచారంలో ఈ ఐరాస నివేదిక ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైనది కాబట్టి, సరిగ్గా ఉపయోగించు కుంటే భవిష్యత్ వ్యూహ రచన విషయంలో మన పాలకులకు ఇది బాగా పనికొస్తుంది. అధికారిక లెక్కలు లేకపోయినా, గడచిన 2023 జనవరి – జూలై నెలల మధ్యలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వార్తలొచ్చాయి. గత వారపు ఐరాస లెక్క ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 145 కోట్లు. సమీప భవిష్యత్తులోనూ జనసంఖ్య విషయంలో చైనా కన్నా భారతే ముందుండనుంది. 2060లలో కానీ భారత జనాభాలో తగ్గుదల మొదలు కాదు. పెరుగుతున్న ఈ జనాభా తీరుతెన్నులు, మంచీచెడుల పట్ల సహజంగానే రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జనాభాతో పాటు పెరిగే కనీస అవసరాలను తీర్చడం అంత సులభమేమీ కాదన్నది నిజమే. అలాగని అధిక జనాభా అన్ని విధాలా నష్టమని అతిగా భయ పడాల్సిన అవసరమూ లేదు. అందుబాటులో ఉండే ఈ మానవ వనరులను సవ్యంగా వినియోగించుకోగలిగితే, ఏ దేశానికైనా దాని జనసంఖ్య అయాచిత వరమే అవుతుంది. ఐరాస నివేదిక ప్రకారం 2060ల వరకు, అంటే వచ్చే నాలుగు దశాబ్దాల పాటు భారత్‌కు అధిక జనాభా తప్పదు. దాన్ని సానుకూలంగా మార్చుకొని, ఎలా దేశాభివృద్ధికి సాధనం చేసుకోవాలన్నది కీలకం.పనిచేసే వయసు జనాభా భారత్‌లో ప్రస్తుతం 86 కోట్లుంది. 2049 వరకు ఈ సంఖ్య పెరు గుతూ పోయి, అప్పటికి వంద కోట్లు దాటుతుందట. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవత రించాలని సంకల్పం చెబుతున్న మన పాలకులు నివేదికలోని ఈ అంచనాపై లోతుగా దృష్టి పెట్టాలి. పనిచేసే వయసులోని ఈ వంద కోట్ల మందిని ఎంత నిపుణులుగా తీర్చిదిద్దుతామన్నదాన్ని బట్టి దేశ పురోగతి ఉంటుంది. ఇటీవల గుజరాత్లో 10 ఉద్యోగాలకు 1,800 మంది – ముంబయ్‌లో 2 వేల ఉద్యోగాలకు 22 వేల మంది హాజరవడం, తొక్కిసలాట జరగడం దేశంలోని నిరుద్యోగ తీవ్రతకు మచ్చుతునక.‡ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సమకాలీన అవసరాలకు తగ్గ నైపుణ్యాభివృద్ధిని కల్పించి, యువజనులను సరైన ఉపాధి మార్గంలో నడపడం ముఖ్యం. అలా చేయగలిగితే ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. లేదంటే ఇదే జనశక్తి ఆర్థిక, రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది. ప్రపంచం సంగతికొస్తే రాగల దశాబ్దాల్లో సోమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహా ప్రధానంగా ఆఫ్రికా ప్రాంతంలో జనాభా పెరగనుంది. విలువైన సహజ వనరులకు అవి నెలవైనందున భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం ఘర్షణలు తలెత్తవచ్చు. మన దాయాది పాకిస్తాన్ సైతం దాదాపు 39 కోట్ల జనాభాతో అమెరికాను సైతం దాటి, ప్రపంచ జనాభాలో మూడో స్థానంతో కీలకంగా మారనుంది. ఐరాస నివేదికలో మరో కీలకాంశం – ప్రపంచ జనాభా పతాక స్థాయికి చేరడానికి రెండు దశాబ్దాల ముందే 2060ల నుంచి భారత జనాభా తగ్గడం మొదలుపెడుతుంది. అదే సమయంలో పనిచేసే వయసులోని వారి సంఖ్య 2050 నుంచే తగ్గిపోనుంది. పనిచేసే వయసు (15నుంచి 65 ఏళ్ళు) కన్నా తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉంటూ ఇతరులపై ఆధారపడేవారి నిష్పత్తి 2040 నుంచే పెరగనుంది. అంటే, నేటి యువశక్తి నైపుణ్యాలనూ, ఆర్జన మార్గాలనూ భవిష్యత్ అవసరాలకూ, ఆధారపడేవారికీ సరిపడేలా తీర్చిదిద్దడం ముఖ్యం. వృత్తివిద్యా శిక్షణ, అప్రెంటిస్ షిప్‌లతో మన చదువుల్ని కొంత పుంతలు తొక్కించాలి. లేదంటే, ఆధారపడేవారి సంఖ్య పెరిగాక చిక్కులు తప్పవు. ఏమైనా, రాగల మూడు దశాబ్దాలు ఇటు జనశక్తి, అటు శ్రమయుక్తితో సంఖ్యాపర మైన సానుకూలత మనదే. వాటితో ముడిపడ్డ చిక్కుల్ని ఎదుర్కొంటూ, ఈ శక్తిని సమర్థంగా వినియోగించుకోవడమే సవాలు. అందులో తడబడితే... అక్షరాలా ‘అమృతకాలం’ దాటిపోయినట్టే! -
ఈ జనాభాతో లాభమేనా?
కొద్ది నెలలుగా రకరకాల అంచనాలు అంటున్న మాటే... అనుకుంటున్న మాటే... మళ్ళీ ఖరారైంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమనే కీర్తి ఇక భారత్‌దేనని ఈసారి ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది. అంచనాలు పాతవైనా, లబ్ధప్రతిష్ఠులు మరొకరు తొలిసారి అధికారికంగా సమర్థించడం విశేషమే. అందుకే, జనసంఖ్యలో దశాబ్దాలుగా ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న భారత్... ఈ ఏడాది మధ్యకల్లా 142.8 కోట్ల జనాభాతో, 30 లక్షలకు పైగా అధిక్యంతో, 142.5 కోట్ల చైనాను దాటేసి, నంబర్ వన్ అవుతుందన్న వార్త పతాకశీర్షికలకు ఎక్కింది. ‘ఐక్యరాజ్యసమితి జనాభా నిధి’ (యూఎన్ఎఫ్పీఏ) ఈ ఏటి ‘ప్రపంచ జనాభా స్థితిగతుల నివేదిక’లో ఈ సంగతి వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారం మేరకు తాము ఈ అంచనా కట్టినట్టు ఐరాస బుధవారం తెలిపింది. ఇంతకీ ఈ అత్యధిక జనాభా భారత్‌కు లాభమా, నష్టమా అన్నది అసలు పెద్ద చర్చ. జనాభాలో చైనాను భారత్ దాటేయడం 2020లలో జరుగుతుందన్నది ఎప్పటి నుంచో ఉన్న జోస్యమే. 2027లో ఇది జరుగుతుందని మొదట అంచనా. ఆ తర్వాత 2025కే జరుగుతుందని మాట సవరించారు. తీరా ఇది 2023లోనే జరిగిపోనుందని నిరుటి ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్’ నివేదిక పేర్కొంది. తాజాగా ఐరాస జనాభా నిధి ఈ ఏడాది మధ్యకల్లా అది నిజమవుతోందని తేల్చింది. ఈ లెక్కల్ని బట్టి 804.5 కోట్ల ప్రపంచ జనాభాలో మూడో వంతు పైగా భారత, చైనాలదే. అయితే, రెండు దేశాల్లోనూ జనాభా పెరుగుదల వేగం గతంతో పోలిస్తే తగ్గుతోంది. ఆ మాటకొస్తే, 1950 నుంచి ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు ప్రపంచ జనాభా పెరుగుదల అతి తక్కువ వేగంతో సాగుతోంది. నిరుడు ఇదే ఐరాస నివేదికతో పోలిస్తే చైనా జనసంఖ్య ఒక్క ఏడాదిలో 2.3 కోట్ల మేర తగ్గింది. ఉన్నట్టుండి పడిపోయిన చైనా జనసంఖ్య వల్లే భారత్ అధిక జనాభా పట్టం దక్కుతోంది. నిజానికి, భారత సొంత అంచనాల కన్నా ఐరాస నివేదిక తాజా జనాభా అంచనాలు కొంత ఎక్కువే. ఈ పరిస్థితుల్లో దేశంలో లెక్కకట్టి ఇందరే ఉన్నారని అసలు కథ చెప్పడం పదేళ్ళకోసారి చేసే జనగణనతో కానీ సాధ్యం కాదు. అలాగని అదీ పూర్తిగా దోషరహితమేమీ కాదు. 2011 జనగణన లోనూ ప్రతి వెయ్యి మందిలో 23 మందిని లెక్కపెట్టనే లేదట. అసలు 2011 తర్వాత మళ్ళీ ఆ గణన జరగనే లేదు. నిర్ణీత గడువైన 2021లో జరగాల్సిన జనగణన కరోనా పేరిట వాయిదా పడింది. తర్వాత అన్నీ సాధారణ స్థితికి చేరుకున్నా, కేంద్రం మాత్రం ‘చేస్తాం చేస్తా’మంటూ ఊరిస్తోందే తప్ప విధాన రూపకల్పనలో అతి కీలకమైన ఈ జనగణనకు నిర్ణీత షెడ్యూల్ ప్రకటించట్లేదు. ఏర్పాట్లూ చేయట్లేదు. ఈ జాప్యం ప్రతికూల పర్యవసానాలకు దారితీసే ప్రమాదం ఉంది. దేశపౌరులందరికీ ప్రాథమిక జీవన నాణ్యతా ప్రమాణాలను సైతం అందించడానికి ఇప్పటికీ సతమతమవుతున్న దేశానికి ఈ అధిక జనాభా ఒక రకంగా అవకాశం, మరో రకంగా సవాలు! కొందరి వాదన ప్రకారం 142 కోట్ల జనాభా అంటే అన్ని కోట్ల అవకాశాలు. ‘జనసంఖ్యతో వచ్చే లబ్ధి’ ఉంటుందని వారి మాట. నిజమే. జనాభాలో నూటికి 68 మంది యువత, అందులోనూ శ్రమ చేసే వయసులోని వారు కావడమనేది సానుకూలత. తద్వారా ప్రపంచంలో అతిపెద్ద శ్రామికశక్తి భారత్‌కు ఉన్నట్టవుతుంది. మరోపక్క జపాన్, దక్షిణ కొరియా లాంటి అనేక దేశాల్లో జనాభా తగ్గుతోంది. వయసు పైబడ్డ వారు పెరిగి, శ్రామికశక్తి తగ్గుతోంది! సమీప భవిష్యత్తులో ఆ దేశాల్లో శ్రామికులకు కొరత వస్తుంది. దీన్ని అందిపుచ్చుకొని, మన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఆ దేశాల శ్రామికశక్తి అవసరాలను తీర్చాలి. అలా చేయగలిగితే అధిక జనాభా మనకు కలిసొచ్చిన అదృష్టమే. అలాగని అధిక జనాభాతో వాటంతట అవే ప్రయోజనాలు ఊడిపడవు. ఒకదానికొకటి ముడిప డిన పలు అంశాలపై విధాననిర్ణేతలు దృష్టిపెట్టాలి. ‘జనాభా లబ్ధి’కే వస్తే, 2055 వరకు... భారత్‌లో వేరొకరిపై ఆధారపడ్డ వారి వాటాతో పోలిస్తే, 15 నుంచి 64 ఏళ్ళ లోపు వయసు శ్రామికశక్తి జనాభా వేగంగా పెరగనుంది. ఈ పెరిగే జనాభాకు మెరుగైన విద్య, ఉపాధి, ఆరోగ్య, గృహవసతి కల్పన ఒక సవాలు. అంటే పెరిగే జనాభాకు తగ్గట్టు ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన ధ్యేయంగా పాలకులు నడవాలి. కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలు తీరాక, అందరికీ ఉపాధి, వయోవృద్ధుల సంరక్షణ, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం రెండో అంశం. ఈ ప్రజాకాంక్షలకు తగ్గట్టు ప్రభుత్వాలు అడుగులు వేయలేకపోతే అసంతృప్తి పెచ్చరిల్లుతుంది. అలాగే, కొన్నేళ్ళ తర్వాత ఇప్పటి ఈ యువ జనాభా వృద్ధులవడంతో నేటి సానుకూలత పోయి, కొత్త సమస్య వస్తుందనీ గుర్తించాలి. సువిశాల భారతంలో సంతాన సాఫల్యతా రేటు మొత్తం మీద తగ్గుతున్నా, ప్రాంతాల్ని బట్టి తేడాలున్నాయి. నిరుపేద ఉత్తరాదిలో జనాభా వేగంగా పెరుగుతుంటే, సంపన్న దక్షిణాదిలో తగ్గుతోంది. ఫలితంగా దక్షిణాదికి వలసలింకా ఎక్కువవుతాయి. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వర్తించాలి. వలస కార్మికుల అనుకూల విధానాలు, పథకాలు చేపట్టాలి. అలాగే, మరో మూడేళ్ళలో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఇప్పుడున్న దాని కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో జనసంఖ్య పెరుగుతున్నందున, జనాభా నియంత్రణే పాపమైనట్టు దక్షిణాది నియోజక వర్గాలు తగ్గిపోకుండా చూడాలి. ప్రాంతీయ, రాజకీయ ప్రాతినిధ్యాల్లో సమతూకం కాపాడాలి. మరో పక్క ఫలానా కులమతాల్లో జనాభా పెరుగుతోందన్న వాట్సప్ అజ్ఞాన అసత్య ప్రచారాలను సహించరాదు. జనాభా నియంత్రణకు కొత్త చట్టాల లాంటి యత్నాలూ చివరకు లింగనిష్పత్తిలో తేడాలకు కారణమవుతాయని గ్రహించాలి. వెరసి... అత్యధిక జనాభా కీర్తి మనదేశానికి ఓ ముళ్ళ గులాబీ. -
వృద్ధ భారత్‌కు పరిష్కారమేది?
భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2061 నాటికి దేశంలో ప్రతి నాలుగో వ్యక్తి 60 ఏళ్లకు పైబడిన వారే ఉంటారు. ఒక దేశంగా, కుటుంబాలు, వ్యక్తులుగా ఇంత వేగంగా పెరుగుతున్న ఈ అంశాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే అసలైన ప్రశ్న. పైగా భారత్ సంపన్న దేశం కావడానికి ముందే వృద్ధాప్యంలో కూరుకుపోనుంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, ముసలివాళ్లలోనే దారిద్య్ర స్థాయి ఎక్కువ. వీరిలో ఆర్థికంగా పూర్తిగా ఆధారపడేవారు 52 శాతం కాగా, పాక్షికంగా ఆధారపడేవారు 18 శాతం. తప్పనిసరి ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరు అరవై ఏళ్లు దాటినా పని చేస్తున్నారు. కార్పొరేట్లు, పౌర సమాజం తోడ్పాటుతో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో క్రియాశీలకమైన విధానాలతో వృద్ధాప్య సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే, ప్రస్తుతం మన యువత పేలవమైన నైపుణ్యాలతో సతమతమవుతున్నట్లుగానే భవిష్యత్తులో వృద్ధాప్యం కూడా పరిష్కరించలేని సమస్యగా మారిపోతుంది. దశాబ్దాలుగా సంతాన నిరోధక చర్యలు, మరణాల రేటును తగ్గించడంలో భారత్ ఎంతో సముచితంగా వ్యవహరించింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో జనాభాపరమైన పరివర్తన కారణంగా దేశవ్యాప్తంగా 60 సంవత్సరాలకు పైబడిన జనాభా పెరుగుతున్న పరిస్థితి వైపు మనం అడుగు లేస్తున్నాము. అయితే ప్రభుత్వం, పలు ఇతర ఏజెన్సీలు వెలువరించిన జనాభా ధోరణులను పరిశీలిస్తే... వృద్ధాప్యం భారత్‌కు ఆందోళనకరమైన సమస్యగా మారబోతోంది. ఇది రాజకీయపరంగా, విధానపరంగా తీవ్రమైన, తక్షణ ప్రభావాలను కలిగించనుంది. యాభై ఏళ్లలో నాలుగు రెట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశ జనాభా మొత్తంలో వృద్ధుల శాతం (8.6 శాతం) తక్కువ గానే కనిపిస్తున్నప్పటికీ, వృద్ధుల సంఖ్య (10.4 కోట్లు) ఎక్కువగానే ఉంది. 2036 నాటికి ఇది రెట్టింపై 22.5 కోట్లకు పెరగనుందనీ, 2061 నాటికి 42.5 కోట్లకు చేరనుందనీ అంచనా. అంటే 50 ఏళ్లలో వీరి సంఖ్య నాలుగు రెట్లు పెరగనుంది. మొత్తం జనాభాలో వృద్ధుల నిష్పత్తి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటోంది. ఈశాన్య, మధ్య భారత రాష్ట్రాల్లో తక్కువగానూ, దక్షిణాదిలో ఎక్కువగానూ ఉంది. బిహార్‌లో ఇది 7.4 శాతం కాగా, కేరళలో 12.6 శాతం. ఈ లెక్కప్రకారం, 2041 నాటికి బిహార్‌లో 11.6 శాతం, కేరళలో 23.9 శాతానికి పెరుగుతుందని అంచనా. వివిధ రాష్ట్రాల్లో వృద్ధుల కోసం ప్రణాళికలు రూపొందిం చడానికి విభిన్నమైన వైఖరి చేపట్టవలసిన అవస రాన్ని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. భారతదేశంలో వృద్ధాప్యం శరవేగంతో విస్తరి స్తోంది. ఫ్రాన్స్, స్వీడన్లలో వీరి జనాభా 7 నుంచి 14 శాతానికి అంటే రెట్టింపు కావడానికి 110, 80 సంవత్సరాల సమయం పట్టింది. కానీ భారత్‌లో ఈ పరిణామం సంభవించడానికి 20 ఏళ్లు మాత్రమే పడుతుందని అంచనా. 2011 నుంచి 2061 వరకు, అంటే 50 ఏళ్ల కాలంలో మన జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 32 కోట్లకంటే ఎక్కువ కాబోతోందని అంచనా. 2030 నాటికి జనాభాలో 12.5 శాతం అవుతుందనీ, 2050 నాటికి 20 శాతానికి చేరుకుంటుందనీ అంచనా. 2061కి 25 శాతం కానుంది. అంటే అప్పటికి భారతీయుల్లో ప్రతి నాలుగో వ్యక్తి 60 ఏళ్లకు పైబడినవారే అయివుంటారు. ఒక దేశంగా, కుటుంబాలు, వ్యక్తులుగా ఈ సమస్యను ఎదు ర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే అసలైన ప్రశ్న. అరవై దాటినా తప్పని పని భారత్ సంపన్న దేశం కావడానికి ముందే వృద్ధాప్యంలో కూరుకుపోనుంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ 2012లో చేసిన అధ్యయనం ప్రకారం, ముసలివాళ్లలోనే దారిద్య్ర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో ఆర్థికంగా పూర్తిగా ఆధారపడేవారు 52 శాతం కాగా, పాక్షికంగా ఆధారపడేవారు 18 శాతం. తప్పనిసరి ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరిలో చాలామంది పని చేయడం కొనసాగిస్తున్నారు. 2019–20లో మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద లబ్ధి పొందినవారిలో 93 లక్షల మంది 61 ఏళ్ల పైబడిన వారే అనేది దీనికి రుజువుగా నిలుస్తోంది. 2021లో ఈ పథకం కింద లబ్ధిపొందిన వారిలో 10 శాతం మంది 61, లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారే. భారతదేశంలోని శ్రామికుల్లో 90 శాతం మంది అనియత రంగంలోనే ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. వీరు పొదుపు చేయగలిగేది సాపేక్షికంగా తక్కువే కాబట్టి, సామాజిక రక్షణ పెద్దగా ఉండదనేది వాస్తవం. పెన్షన్ అందు కుంటున్నవారిలో 85 శాతం మంది ఆహారం, ఇతర జీవన అవసరాలు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి కోసమే తమ పించన్ ఉపయోగించుకుంటూ ఉంటారు. 60 ఏళ్ల వయస్సు వచ్చిన వారిలో 10 శాతం (సుమారు కోటిమంది) మంది శారీరకంగా కదలలేని స్థితిలో ఉంటున్నారు. మరో పది శాతం మంది ప్రతి సంవత్సరం ఆసుపత్రి పాలవు తుంటారు. ఇక 70 సంవత్సరాల వయస్సులో 50 శాతం మంది ఒకటి లేదా ఎక్కువ దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక 60 నుంచి 84.1 సంవత్సరాల పైబడిన వారిలో ప్రతి 1000 మందిలో 51.8 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నారు. అదే సాధారణ జనాభాలో వెయ్యిమందిలో 22.1 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నారు. మన దేశంలో ముసలివాళ్లకు ఎన్నో పథకాలు ఉంటున్నాయి కానీ అవి వారి జీవితాలపై అర్థవంతమైన ప్రభావం కలిగించడం లేదు. 1999లో వృద్దుల విషయంలో ఒక జాతీయ విధానాన్ని దేశం తీసుకొచ్చింది. తర్వాత సంవత్స రాలపాటు విధాన పథకాలను అమలు చేశారు. చెప్పాలంటే వృద్ధాప్యంపై ‘మాడ్రిడ్ ఇంటర్నేషనల్ యాక్షన్ ప్లాన్’ను ముందుకు తీసుకుపోయిన ఘనత భారత్‌కు దక్కాలి. ఒకరకంగా ఆ ప్లాన్‌ని భారత్ ప్రభావితం చేసిందని కూడా చెప్పాల్సి ఉంటుంది. వృద్ధుల జనాభా భారీ సంఖ్యలో ఉన్న కేరళ వంటి రాష్ట్రాలు పంచాయతీ స్థాయి నుంచి వృద్ధుల కోసం బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వచ్చాయి. గత రెండేళ్లకాలంలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కొన్ని సృజనాత్మకమైన పరిష్కా రాలతో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అయినా కూడా వీటిని పూర్తిగా అమలు చేయడానికి ఈ శాఖకు ఆర్థిక మద్దతు కష్టంగా ఉంటోంది. కాబట్టి వృద్ధుల పేలవమైన ఆర్థిక ప్రతిపత్తి, అమల వుతున్న పథకాలకు ఆర్థిక మద్దతు లేకపోవడం నేపథ్యంలో ఈ అంశంపై అత్యున్నత స్థాయిలో రాజకీయ జోక్యం అవసరం. విధానపరమైన జోక్యం అవసరం ఈ రంగానికి సంబంధించినంతవరకు తైవాన్, చైనా వంటి దేశాల అనుభవాల నుంచి మనం నేర్చుకోవలిసింది చాలానే ఉంది. కార్పొరేట్లు, పౌర సమాజం తోడ్పాటుతో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో క్రియాశీలకమైన విధానాలు, కార్య క్రమాలను చేపట్టడం ద్వారా వృద్ధాప్య సమస్యలను ఇప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే, ప్రస్తుతం మన యువత పేలవమైన నైపుణ్యాలతో సతమతమవుతున్నట్లు గానే, వృద్ధాప్య సమస్య కూడా పరిష్కరించలేని సమస్యగా మారిపోతుంది. దశాబ్దాలకు ముందు నుంచే యువత సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్ల వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గ్రహించాలి. దేశ సామూహిక చైతన్యం నుంచి వృద్ధులు పక్కకు తొలిగే పరిస్థితిని భారత్ భరించలేదు. – వెంకటేశ్ శ్రీనివాసన్, దేవీందర్ సింగ్ ‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫంఢ్’లో ఇండియా మాజీ ఉద్యోగులు -
ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా!
ముంబై: భారత జనాభాలో కనీసం సగం మందికి వచ్చే ఫిబ్రవరి నాటికి కరోనా సోకే ప్రమాదముందని కరోనా వైరస్ అంచనాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల్లో ఒకరైన అగ్రవాల్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 75 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానం భారత్‌దే. సెప్టెంబర్ మధ్య నాటికి అత్యధిక స్థాయికి చేరిన కరోనా వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని, సగటున రోజూ 61,390 కొత్త కేసులు నమోదౌతు న్నాయని తెలిపారు. ‘మేం అనుసరించిన మోడల్ అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఇప్పుడు దాదాపు 30 శాతం జనాభా కరోనా బారిన పడ్డారు, ఇది ఫిబ్రవరి నాటికి 50 శాతానికి చేరవచ్చు’అని ప్రభుత్వ కమిటీ సభ్యులు, కాన్పూర్ ఐఐటికి చెందిన మణీంద్ర అగ్రవాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సీరోలాజికల్ సర్వేలతో పోల్చుకుంటే కరోనా వ్యాప్తి అధికంగా ఉందని ఈ కమిటీ అంచనా వేసింది. అతి తక్కువ జనాభాతో సర్వే చేయడంతో, సీరోలాజికల్ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా లేవని అగ్రవాల్ తెలిపారు. సామాజిక దూరం, మాస్క్ ధరించడం నిర్లక్ష్యం చేస్తే కేసుల సంఖ్య ఒక్క నెలలో 26 లక్షలకు చేరే ప్రమాదముందని కమిటీ హెచ్చరించింది. దుర్గా పూజ, దీపావళి పండుగ సీజన్లో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. -
చైనాను భయపెడుతున్న మహిళల సంఖ్య
2019 సంవత్సరం అంతానికి చైనా జనాభా 140.05 కోట్లకు చేరుకుందని ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం శుక్రవారం ప్రకటించింది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో శిశు జననాలు ఎన్నడు లేనంతగా కనిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ జనాభా 140 కోట్లను దాటింది. చైనాలో గత మూడేళ్లుగా శిశు జననాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీని వల్ల చైనాలో స్త్రీ, పురుషుల సంఖ్య మధ్య వ్యత్యాసం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అక్కడ స్త్రీలకన్నా పురుషులు మూడు కోట్ల మంది ఎక్కువగా ఉన్నారు. స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం ఎక్కువైతే పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయన్న విషయాన్ని గ్రహించిన చైనా ప్రభుత్వం స్త్రీల సంతానాన్ని ప్రోత్సహించడం కోసం 40 ఏళ్లపాటు అమలు చేసిన ఏక సంతాన విధానాన్ని ఎత్తివేసింది. అయినప్పటికీ ఇప్పటికీ మూడు కోట్ల వ్యత్యాసం ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. శిశు జననాల సంఖ్య ప్రతి వెయ్యికి 10.48కి పడిపోయింది. అక్కడి మొత్తం జనాభాలో 18.1 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారు ఉండడంతో పనిచేసే జనాభా సంఖ్య కూడా తగ్గిపోయింది. చైనా నిబంధనల ప్రకారం 16 నుంచి 59 ఏళ్ల వరకే పని చేయడానికి అవకాశం. 59 ఏళ్లు నిండగానే పదవీ విరమణ చేయాల్సిందే. 60 ఏళ్లు దాటిన సంఖ్య పెరగడంతో పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. భారత్ జనాభా 130 కోట్లకు చేరుకుందన్న విషయం తెల్సిందే. -
‘మూడో బిడ్డను కంటే ఓటు హక్కు రద్దు చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : జనభాను నియంత్రించడానికి భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఆదివారం ఆయన హరిద్వార్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏ మతానికి చెందిన వారైనా సరే అధిక సంతానాన్ని కనకూడదని ఆయన సూచించారు. ‘భారత జనాభా మరో 50 ఏళ్ల పాటు 150 కోట్లకు మించకూడదు. అంతకు మించి జనాభాకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి మనం సిద్ధంగా లేము. దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి. ఒక వేళ వారు మూడో బిడ్డను కంటే.. ఆ బిడ్డను ఓటు హక్కుకు దూరం చేసేలా చట్టం రూపొందించాలి. అలాగే, అతడు\ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి. ఎటువంటి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలి’ అని రాందేవ్ సూచించారు. అలాగే మన దేశంలో గోవధలపై పూర్తిగా నిషేధం విధించాన్నారు. అలాంటప్పుడే ఆవుల అక్రమ రవాణాదార్లు, గోరక్షకులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగిపోతాయని రాందేవ్ వ్యాఖ్యానించారు. -
చైనాను దాటిపోనున్న భారత జనాభా
న్యూఢిల్లీ: భారతదేశంలో శిశు జననాల రేటు చైనా కంటే ఎక్కువగా ఉందని, 2028 నాటికి మన జనాభా చైనాను దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ జనాభా అంచనాల ప్రకారం భారత జనాభా వేగంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో మంగళవారం తెలిపారు. జనాభా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కొంత వరకు ఫలితాన్నిస్తున్నాయన్నారు. 1991-2000 మధ్యకాలంలో 21.54 శాతంగా ఉన్న జనాభా వృద్ధిరేటు.. 2001-2011 దశాబ్దానికి 17.64కు తగ్గిపోయిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆషా సంస్థల ద్వారా గర్భ నిరోధక సాధనాలను ఇంటివద్దకు అందించే కార్యక్రమం జరుగుతున్నదని నడ్డా చెప్పారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీలో మగువలకు అవకాశాలెన్నో...
మేరీ క్యూరీ.. రోజాలిండ్ ఫ్రాంక్లిన్.. కల్పనాచావ్లా.. టెస్సీథామస్.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఘనవిజయాలు సాధించిన మహిళలు! భారతదేశ జనాభాలో 48 శాతం ఉన్నా.. నేటికీ సైన్స్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం 30శాతానికి లోపే ఉంది. ఈ రంగంలో నిష్ణాతులైన మానవ వనరులు కలిగిన దేశం వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. దేశాభివృద్ధికి చోదక శక్తి .. సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాంటి శాస్త్ర సాంకేతిక రంగంలో లింగ వివక్షకు తావులేదు. ఆసక్తి ఉన్నవారెవరైనా ఇందులోకి ప్రవేశించవచ్చు. ప్రతిభతో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళలకు స్కాలర్షిప్స్, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక ఫోకస్.. భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే కొంత నిరాశ కలుగుతుంది. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ప్రదానం చేస్తున్న మొత్తం పీహెచ్‌డీల్లో మహిళల శాతం కేవలం 37. మిగతా 63 శాతం పీహెచ్‌డీలను పురుషులు సొంతం చేసుకుంటున్నారు. ఐటీ, బయోటెక్నాలజీ, ప్యూర్ సైన్స్ రంగాల్లో మహిళలు 30 శాతంలోపే ఉన్నారు. దాంతో ఇందులో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయి వరకు మహిళలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం వీరికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తోంది. పలు సంస్థలు ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నాయి. స్కాలర్షిప్ను మంజూరు చేస్తున్నాయి. ఉమెన్ సైంటిస్ట్‌లు/రీసెర్చర్లకు పలు రకాల రీసెర్చ్ గ్రాంట్లు, ఫెలోషిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆఫర్ చేస్తున్న కొన్ని సంస్థల గురించి తెలుసుకుందాం.. డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ పరిశోధనల్లో మహిళా సైంటిస్ట్‌ల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళా సైంటిస్ట్‌ల కెరీర్ డెవలప్మెంట్కు ప్రాధాన్యం ఇస్తోంది. వెబ్సైట్: http://dbtindia.nic.in/index.asp యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సైన్స్‌లో అడ్వాన్స్డ్ స్టడీస్, రీసెర్చ్ రంగాల్లో మహిళా అభ్యర్థులను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను ఆఫర్ చేస్తోంది. పీహెచ్డీ పూర్తిచేసి, ఉద్యోగం లేని మహిళా అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌లు పొందడానికి అర్హులు. వెబ్సైట్: www.ugc.ac.in సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఇన్ సెన్సైస్(సీఐసీఎస్) పేటెంట్ ఫెసిలిటేటింగ్ సెంటర్, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్(టీఐఎఫ్ఏసీ)తో కలిసి సీఐసీఎస్... పేటెంట్ వ్యవహారాల్లో మహిళా సైంటిస్ట్లకు శిక్షణ ఇస్తోంది. వీరికోసం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ... స్కాలర్షిప్ స్కీమ్‌ను కూడా ప్రారంభించింది. సైన్స్, ఇంజనీరింగ్ వంటి అర్హతలు కలిగిన మహిళలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్లపై పరిజ్ఞానం కల్పిస్తారు. దేశవ్యాప్తంగా నాలుగు చోట్ల సీఐసీఎస్, చెన్నై; టీఐఎఫ్ఏసీ, న్యూఢిల్లీ; యూఆర్డీఐపీ, పుణె; ఐఐటీ, ఖరగ్‌పూర్‌లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా దాదాపు 100 మందికి శిక్షణ ఇస్తారు. ఎల్ ఓరియల్ ఇండియా ఫర్ యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సైన్స్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్న యువ మహిళా పరిశోధకులకు అండగా నిలిచేందుకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను 2003లో ప్రవేశపెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన యువతులకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతిఏటా రూ.2.5 లక్షలు అందజేస్తారు. గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీలో సైన్స్ కోర్సులు చదువుతు న్నవారు అర్హులు. వెబ్సైట్: www.foryoungwomeninscience.com ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా ఇండియన్ ఆయిల్కార్పొరేషన్(ఐఓసీ) దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావం తులైన విద్యార్థినులకు స్కాలర్షిప్లు అందజేస్తోంది. వికలాంగులకు ప్రాధాన్యం ఉంటుంది. వెబ్సైట్: www.iocl.com అగ్రికల్చర్.. బయోటెక్నాలజీ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ రంగాలు శరవేగంగా వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఈ రంగాల్లో విద్యార్థులకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ రంగంలో మహిళలు అవకాశాలు అందుకోవచ్చు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కార్యక్రమాలు కూడా మరింత మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఐసీఏఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర,రాష్ట్ర విభాగాలు సైతం మహిళా సైన్స్ గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తున్నాయి. మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం పలు స్కీమ్స్‌ను నిర్వహిస్తూ శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ సంబంధిత కంపెనీలు ప్రారంభించేలా రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీలతో కలిసి నాబార్డ్ మహిళా గ్రాడ్యుయేట్లకు ఆర్థిక చేయూతనూ అందిస్తోంది. ఇన్పుట్స్: ఎంప్లాయ్మెంట్ న్యూస్ డిపార్ట్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యక్తిగత, అనివార్య కారణాల వల్ల సైన్స్ రంగంలో కెరీర్ నుంచి మధ్యలోనే తప్పుకున్న మహిళలను తిరిగి రప్పించి, పరిశోధనలను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. మహిళా సైంటిస్ట్లకు, టెక్నాలజిస్ట్‌లకు ఉపకార వేతనాలను అందిస్తోంది. వెబ్సైట్: www.dst.gov.in మహిళా పరిశోధకుల కోసం.. ఏ డీఎస్టీస్ ఉమెన్ సైంటిస్ట్స్ స్కీమ్ వెబ్సైట్: www.iisc.ernet.in ఏ యంగ్ సైంటిస్ట్ స్కీమ్ ఆఫ్ డీఎస్టీ వెబ్సైట్: www.dst.gov.in ఏ ఉమెన్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ ఆఫ్ డీబీటీ వెబ్సైట్: http://dbtindia.nic.in/index.asp ఏ బయో-కేర్ ప్రోగ్రామ్/అవార్డ్స్ ఫర్ ఉమెన్ సైంటిస్ట్స్ వెబ్సైట్: http://dbtindia.nic.in/index.asp ఏ యూఆర్డీఐపీ ఉమెన్ సైంటిస్ట్ స్కాలర్షిప్ స్కీమ్ వెబ్సైట్: www.helpbiotech.blogspot.in ఏ సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ వెబ్సైట్: www.wcd.nic.in ఏ నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వెబ్సైట్: www.nmew.gov.in ఏ మదర్ థెరెసా ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్: www.motherteresacharities.org ఏ విజన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్: www.visionfoundationofindia.in మహిళలకు ప్రోత్సాహం ‘‘సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళలకు విస్తృత అవకాశాలున్నాయి. మహిళలు సైతం సామాజిక పరిస్థితులను ఎదుర్కొని శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు మహిళలను సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నాయి. ఫెలోషిప్‌లు అందిస్తూ మహిళల అభ్యున్నతికి తోడ్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళలకు స్కాలర్షిప్లు అందిస్తోంది. ఆశించిన స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళల పాత్ర పెరగాలంటే వారిలో స్వీయ ప్రోత్సాహం ఉండాలి. మనోధైర్యంతో ముందుకు సాగాలి. విస్తృత పరిజ్ఞానంతో ఆలోచించాలి. సమాజంలో ఉన్నత విద్యనభ్యసించిన మహిళలు కూడా కుటుంబాలకే పరిమితమవుతున్నారు. చిన్నపాటి ఉద్యోగాల్లో చేరుతున్నారు. సామాజిక పరిస్థితులు అందుకు కారణమై ఉండొచ్చు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అవకాశాలను అందిపుచ్చుకుని కెరీర్లో ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేయాలి. ఉన్నత విద్యాభ్యాసానికి అందిస్తున్న ఫెలోషిప్లను వినియోగించుకోవాలి. గృహిణులుగా స్థిరపడిన మహిళలు కూడా మళ్లీ పరిశోధనలవైపు మరల్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. - డా. డి. శారద అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఐఐటీ, హైదరాబాద్. -
దుకాణం: ఆన్లైన్ షాపింగ్ భయాలు !
భారత జనాభా 120 కోట్లు. సంఖ్యలో రెండో స్థానం. అక్షరాస్యత కూడా మరీ తక్కువేం కాదు. కానీ... ఇండియాలో జరిగే ఆన్లైన్ షాపింగ్ మాత్రం చాలా తక్కువ. ఎందుకు? కారణాలు అనేకం. భయాలు, అనుమానాలు, అపనమ్మకాలు...! అయితే వీటిల్లో వాస్తవం ఎంత? ఆన్లైన్ షాపింగ్ మొదటి ఉపయోగం... కాలు బయటపెట్టాల్సిన అవసరం ఉండదు. పెరుగుతున్న పనివేళలు, ప్రయాణ సమయాలు, ట్రాఫిక్ల నుంచి తప్పించుకునే పెద్ద అవకాశం ఇది. షాపింగ్ చేయడం ఒక వినోదమే గానీ ప్రతి వస్తువు కొనుగోలులో అలాంటి ఆనందమే ఉండదు. మాల్‌కు వెళ్లి బట్టలు కొనడం ఆనందమే గాని, కొట్టుకు వెళ్లి నూనె కొనడం ఎవరికి ఆనందం చెప్పండి. అందుకే ఆన్లైన్ షాపింగ్‌కు ఆదరణ మొదలైంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఇంకా చాలామందిలో ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిఉన్నాయి. భయాలు ఆన్లైన్లో డబ్బు చెల్లించడంపైన ఇండియాలో ఇప్పటికీ చాలామందికి భయాలున్నాయి. క్రెడిట్ కార్డు వివరాలు, బ్యాంకు వివరాలు అందులో నమోదు చేస్తాం కాబట్టి భవిష్యత్తులో మన కార్డుకు లేదా అకౌంట్‌కు భద్రత ఉంటుందా? డబ్బు కట్టాక వస్తువు మనకు రాకపోతే ఏం చేయాలి? ఎవరినడగాలి? ఒకవేళ అది వచ్చినా ఆ వివరాలతో మనకు సంబంధం లేనివి మన అకౌంట్లో డబ్బులు తీసుకుని అంటగట్టేస్తారా? వీటన్నింటికీ ఒకటే సమాధానం. నమ్మకమైన వెబ్సైట్లలో షాపింగ్ చేస్తే ఈ భయాలు ఏవీ ఉండవు. మీ ఆర్థిక లావాదేవీ సమాచారం వారి దగ్గర భద్రపరుచుకోరు. ట్రాన్షాక్ష న్స్ అన్నీ అకౌంట్ టు అకౌంట్ కాబట్టి మీ సొమ్ము ఎక్కడికీ పోదు. ట్రాన్షాక్షన్ ఫెయిలైనా కొన్ని రోజుల్లో మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఈ విషయంలో మీకు సాయం చేయడానికి అటు వెబ్సైట్ కాల్‌సెంటర్/బ్యాంకు వాళ్లు పూర్తి సాయం చేస్తారు. మీ వస్తువు ఇంటికి చేరుకోవడంలో ఆలస్యం కావచ్చునేమో గాని బుకింగ్ మీకు చేరకపోవడం అంటూ ఉండదు. ఏ వస్తువు కొన్నా అది ఎపుడు, ఎలా వస్తుందన్న వివరాలన్నీ మీకు అందుబాటులో ఉంచుతారు. అనుమానాలు వస్తువుల నాణ్యత ఉత్పత్తి చేసే కంపెనీని బట్టి ఉంటుంది. ప్రముఖ కంపెనీ వస్తువులు ఉదా: ఫోన్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు మీరు బయట దుకాణాల్లో కొంటే ఎంత నాణ్యతగా ఉంటాయో ఆన్లైన్ స్టోర్లలో కొన్నా అంతే నాణ్యతగా ఉంటాయి. కొన్ని లోకల్ ఉత్పత్తులు లేదా బ్రాండ్ లేని వస్తువులు కొనేటపుడు మాత్రం... బాగా పేరుమోసిన ఆన్లైన్ స్టోర్లలోనే కొనాలి. టీవీలో ప్రకటనల్లో వచ్చేవన్నీ ఫేమస్ అని, టీవీల్లో రానివి ఫేమస్ కాదని మీరు భావించొద్దు. నమ్మకమైన వెబ్‌సైట్స్‌ను తెలిసిన వారి ద్వారానో లేదా గూగుల్‌లో టాప్ 10, టాప్ 20 సైట్స్ అని వెతికి గాని తెలుసుకోవచ్చు. అప నమ్మకాలు ఆన్లైన్లో కొంటే ధర ఎక్కువనీ, వస్తువు పాడైనది వస్తే తిరిగి పంపలేమనీ, వస్తువు ఇంటికి రాదనే భయాలు వదిలేయండి. ఇపుడున్న టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పు చేసి అంత సులువుగా తప్పించుకునే పరిస్థితి లేదు. అంతకంటే ముందు ఆన్లైన్లో కొంటే అసలు ధర తెలుస్తుంది. మీరు ఒకటీవీ కొనాలనుకుంటే ఆ టీవీ మోడల్ తెలుసుకుంటే అది బయట ఎంత ఉందో, ఏ సైట్లో ఎంత ధర ఉందో సులువుగా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ప్రముఖ కంపెనీ టీవీ అయితే ఎక్కడ కొన్నా మీకు నాణ్యతలో తేడా ఉండదు. తక్కువ ధర ఉన్న వెబ్సైటు ఏదైనా కనపడితే మీరు కనుక్కున్న నమ్మకమైన సైట్ల జాబితాలో అది ఉంటే అక్కడ కొనేయడమే. భారీ ఉపయోగాలు: ఆన్లైన్లో వినియోగదార్ల సంఖ్య పెంచుకోవడానికి ఆయా నిర్వహకులు లాభం కాస్త తగ్గించుకుని ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రతి వస్తువుపై ఇస్తున్నారు. ఉప్పు పప్పు మొదలుకొని బంగారం వరకు అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఆన్లైన్ షాపింగ్‌లో అతి వేగంగా అమ్ముడవుతున్నవి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్త్రీల దుస్తులు, ఇమిటేట్ జువెలరీ ఉన్నాయి. బయట కొనడానికి మొహమాటపడే రొమాంటిక్ లో దుస్తులు, కండోమ్‌లు వంటివి ఆన్లైన్లో విపరీతమైన వృద్ధిని నమోదుచేస్తున్నాయి. బయటషాపింగ్కు, ఆన్లైన్ షాపింగ్‌కు ఒక పెద్ద తేడా ఉంది. ఎంత పెద్ద షాపింగ్ మాల్‌కు వెళ్లినా మీకు అక్కడ దొరికే మోడల్స్ కంటే ఎక్కువ మోడల్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఇక్కడయితే ఒకదాన్నుంచి ఇంకో స్టోరుకు మధ్య దూరం ఒక్క క్లిక్. అదే మీరు ఒక షాపింగ్ మాల్లో నచ్చకపోతే ఇంకోదానికి వెళ్లాలంటే....గంటలు వృథా, ప్రయాస!