కొద్ది నెలలుగా రకరకాల అంచనాలు అంటున్న మాటే... అనుకుంటున్న మాటే... మళ్ళీ ఖరారైంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమనే కీర్తి ఇక భారత్‌దేనని ఈసారి ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది. అంచనాలు పాతవైనా, లబ్ధప్రతిష్ఠులు మరొకరు తొలిసారి అధికారికంగా సమర్థించడం విశేషమే. అందుకే, జనసంఖ్యలో దశాబ్దాలుగా ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న భారత్... ఈ ఏడాది మధ్యకల్లా 142.8 కోట్ల జనాభాతో, 30 లక్షలకు పైగా అధిక్యంతో, 142.5 కోట్ల చైనాను దాటేసి, నంబర్ వన్ అవుతుందన్న వార్త పతాకశీర్షికలకు ఎక్కింది.
‘ఐక్యరాజ్యసమితి జనాభా నిధి’ (యూఎన్‌ఎఫ్‌పీఏ) ఈ ఏటి ‘ప్రపంచ జనాభా స్థితిగతుల నివేదిక’లో ఈ సంగతి వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారం మేరకు తాము ఈ అంచనా కట్టినట్టు ఐరాస బుధవారం తెలిపింది. ఇంతకీ ఈ అత్యధిక జనాభా భారత్‌కు లాభమా, నష్టమా అన్నది అసలు పెద్ద చర్చ.
జనాభాలో చైనాను భారత్ దాటేయడం 2020లలో జరుగుతుందన్నది ఎప్పటి నుంచో ఉన్న జోస్యమే. 2027లో ఇది జరుగుతుందని మొదట అంచనా. ఆ తర్వాత 2025కే జరుగుతుందని మాట సవరించారు. తీరా ఇది 2023లోనే జరిగిపోనుందని నిరుటి ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్’ నివేదిక పేర్కొంది. తాజాగా ఐరాస జనాభా నిధి ఈ ఏడాది మధ్యకల్లా అది నిజమవుతోందని తేల్చింది.
ఈ లెక్కల్ని బట్టి 804.5 కోట్ల ప్రపంచ జనాభాలో మూడో వంతు పైగా భారత, చైనాలదే. అయితే, రెండు దేశాల్లోనూ జనాభా పెరుగుదల వేగం గతంతో పోలిస్తే తగ్గుతోంది. ఆ మాటకొస్తే, 1950 నుంచి ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు ప్రపంచ జనాభా పెరుగుదల అతి తక్కువ వేగంతో సాగుతోంది. నిరుడు ఇదే ఐరాస నివేదికతో పోలిస్తే చైనా జనసంఖ్య ఒక్క ఏడాదిలో 2.3 కోట్ల మేర తగ్గింది. ఉన్నట్టుండి పడిపోయిన చైనా జనసంఖ్య వల్లే భారత్ అధిక జనాభా పట్టం దక్కుతోంది.
నిజానికి, భారత సొంత అంచనాల కన్నా ఐరాస నివేదిక తాజా జనాభా అంచనాలు కొంత ఎక్కువే. ఈ పరిస్థితుల్లో దేశంలో లెక్కకట్టి ఇందరే ఉన్నారని అసలు కథ చెప్పడం పదేళ్ళకోసారి చేసే జనగణనతో కానీ సాధ్యం కాదు. అలాగని అదీ పూర్తిగా దోషరహితమేమీ కాదు. 2011 జనగణన లోనూ ప్రతి వెయ్యి మందిలో 23 మందిని లెక్కపెట్టనే లేదట.
అసలు 2011 తర్వాత మళ్ళీ ఆ గణన జరగనే లేదు. నిర్ణీత గడువైన 2021లో జరగాల్సిన జనగణన కరోనా పేరిట వాయిదా పడింది. తర్వాత అన్నీ సాధారణ స్థితికి చేరుకున్నా, కేంద్రం మాత్రం ‘చేస్తాం చేస్తా’మంటూ ఊరిస్తోందే తప్ప విధాన రూపకల్పనలో అతి కీలకమైన ఈ జనగణనకు నిర్ణీత షెడ్యూల్ ప్రకటించట్లేదు. ఏర్పాట్లూ చేయట్లేదు. ఈ జాప్యం ప్రతికూల పర్యవసానాలకు దారితీసే ప్రమాదం ఉంది.
దేశపౌరులందరికీ ప్రాథమిక జీవన నాణ్యతా ప్రమాణాలను సైతం అందించడానికి ఇప్పటికీ సతమతమవుతున్న దేశానికి ఈ అధిక జనాభా ఒక రకంగా అవకాశం, మరో రకంగా సవాలు! కొందరి వాదన ప్రకారం 142 కోట్ల జనాభా అంటే అన్ని కోట్ల అవకాశాలు. ‘జనసంఖ్యతో వచ్చే లబ్ధి’ ఉంటుందని వారి మాట. నిజమే.
జనాభాలో నూటికి 68 మంది యువత, అందులోనూ శ్రమ చేసే వయసులోని వారు కావడమనేది సానుకూలత. తద్వారా ప్రపంచంలో అతిపెద్ద శ్రామికశక్తి భారత్‌కు ఉన్నట్టవుతుంది. మరోపక్క జపాన్, దక్షిణ కొరియా లాంటి అనేక దేశాల్లో జనాభా తగ్గుతోంది. వయసు పైబడ్డ వారు పెరిగి, శ్రామికశక్తి తగ్గుతోంది! సమీప భవిష్యత్తులో ఆ దేశాల్లో శ్రామికులకు కొరత వస్తుంది. దీన్ని అందిపుచ్చుకొని, మన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఆ దేశాల శ్రామికశక్తి అవసరాలను తీర్చాలి. అలా చేయగలిగితే అధిక జనాభా మనకు కలిసొచ్చిన అదృష్టమే.
అలాగని అధిక జనాభాతో వాటంతట అవే ప్రయోజనాలు ఊడిపడవు. ఒకదానికొకటి ముడిప డిన పలు అంశాలపై విధాననిర్ణేతలు దృష్టిపెట్టాలి. ‘జనాభా లబ్ధి’కే వస్తే, 2055 వరకు... భారత్‌లో వేరొకరిపై ఆధారపడ్డ వారి వాటాతో పోలిస్తే, 15 నుంచి 64 ఏళ్ళ లోపు వయసు శ్రామికశక్తి జనాభా వేగంగా పెరగనుంది. ఈ పెరిగే జనాభాకు మెరుగైన విద్య, ఉపాధి, ఆరోగ్య, గృహవసతి కల్పన ఒక సవాలు.
అంటే పెరిగే జనాభాకు తగ్గట్టు ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన ధ్యేయంగా పాలకులు నడవాలి. కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలు తీరాక, అందరికీ ఉపాధి, వయోవృద్ధుల సంరక్షణ, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం రెండో అంశం. ఈ ప్రజాకాంక్షలకు తగ్గట్టు ప్రభుత్వాలు అడుగులు వేయలేకపోతే అసంతృప్తి పెచ్చరిల్లుతుంది. అలాగే, కొన్నేళ్ళ తర్వాత ఇప్పటి ఈ యువ జనాభా వృద్ధులవడంతో నేటి సానుకూలత పోయి, కొత్త సమస్య వస్తుందనీ గుర్తించాలి.
సువిశాల భారతంలో సంతాన సాఫల్యతా రేటు మొత్తం మీద తగ్గుతున్నా, ప్రాంతాల్ని బట్టి తేడాలున్నాయి. నిరుపేద ఉత్తరాదిలో జనాభా వేగంగా పెరుగుతుంటే, సంపన్న దక్షిణాదిలో తగ్గుతోంది. ఫలితంగా దక్షిణాదికి వలసలింకా ఎక్కువవుతాయి. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వర్తించాలి. వలస కార్మికుల అనుకూల విధానాలు, పథకాలు చేపట్టాలి. అలాగే, మరో మూడేళ్ళలో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది.
ఇప్పుడున్న దాని కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో జనసంఖ్య పెరుగుతున్నందున, జనాభా నియంత్రణే పాపమైనట్టు దక్షిణాది నియోజక వర్గాలు తగ్గిపోకుండా చూడాలి. ప్రాంతీయ, రాజకీయ ప్రాతినిధ్యాల్లో సమతూకం కాపాడాలి. మరో పక్క ఫలానా కులమతాల్లో జనాభా పెరుగుతోందన్న వాట్సప్ అజ్ఞాన అసత్య ప్రచారాలను సహించరాదు. జనాభా నియంత్రణకు కొత్త చట్టాల లాంటి యత్నాలూ చివరకు లింగనిష్పత్తిలో తేడాలకు కారణమవుతాయని గ్రహించాలి. వెరసి... అత్యధిక జనాభా కీర్తి మనదేశానికి ఓ ముళ్ళ గులాబీ.
ఈ జనాభాతో లాభమేనా?
Published Fri, Apr 21 2023 2:38 AM | Last Updated on Fri, Apr 21 2023 2:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment