అగ్రస్థానం అందరూ ఆశించేదే, ఆనందించేదే! కానీ, ఒక్కోసారి కొన్ని అంశాల్లో ప్రథమ స్థానం అంటే ఉలిక్కిపడాల్సి వస్తుంది. ఆగి, ఆలోచించాల్సి వస్తుంది. వచ్చే ఏడాది కల్లా ప్రపంచ జనాభాలో మన దేశమే నంబర్ వన్ అవుతుందన్న ‘ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం’ (యూఎన్‌పీడీ) తాజా అంచనా అలాంటి పరిస్థితే కల్పించింది. ప్రపంచ జనాభాలో ఇప్పటి దాకా చైనా తర్వాత రెండో స్థానంలో మనం ఉన్నాం. వచ్చే ఏడాది కల్లా చైనాను అధిగమించి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించనుంది. అలాగే, ఈ నవంబర్ 15 నాటికే ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం ఐరాస వెలువరించిన ఈ తాజా నివేదిక అంచనా. దేశంలో ఇంతటి జనాభా పెరుగుదల మంచికా, చెడుకా అనే చర్చ మొదలైంది. మిగిలిన అంశాల్లో కాకున్నా కనీసం జనాభాలోనైనా అగ్రరాజ్యమైన చైనాను అధిగమిస్తున్నామని సంబరపడాలన్నది కొందరి వ్యంగ్య చమత్కృతి. అయితే, జనాభా పెరుగుదలతో సవాళ్ళే కాక, సమీక్షించుకొనే వీలూ చిక్కిందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తుండడం విశేషం.
ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లయితే, అంతకన్నా కొద్దిగా తక్కువగా భారత జనాభా 141.2 కోట్లు. వచ్చే ఏడాది కల్లా ఈ పరిస్థితి తారుమారై, చైనాను భారత్ దాటేస్తుందన్నది ఇప్పుడు పతాక శీర్షికలకు ఎక్కింది. నిజానికి, 2027 నాటికి జనాభాలో మనం చైనాను దాటతామని గతంలో ఐరాస అంచనా. తీరా తాజా లెక్కల ప్రకారం అంతకన్నా నాలుగేళ్ళ ముందరే 2023లో ఆ ‘జనాభా ఘనత’ మనం సాధిస్తున్నామన్నమాట. దీనికి కారణం – జనాభా విధానాన్ని మన దేశం సక్రమంగా అమలు చేయకపోవడం కాదు. చైనాలో సంతాన సాఫల్యత అనుకున్న దాని కన్నా తక్కువ కావడం! ఒక్క బిడ్డే ఉండాలంటూ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు చైనా కఠినంగా జనాభా నియంత్రణ చేసింది. కానీ, 2016లో దాన్ని సడలించి, ఇద్దరు పిల్లల విధానానికి ఓకే చెప్పింది. 2021 నుంచి మరింత సడలించి, మూడో సంతానానికీ సరేనంది. తీరా అప్పటికే ఒకే బిడ్డ పద్ధతికే చైనాలో అలవాటు పడిపోయారు. ఫలితంగా డ్రాగన్ దేశంలో జీవితకాల సంతాన సాఫల్యతా రేటు (టీఎఫ్‌ఆర్) 1.16 మాత్రమే. అదే మన దేశంలో 2 ఉందని తాజా ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) తేల్చింది. అలా మన జనాభా గత అంచనా కన్నా ముందే చైనాను దాటేస్తోంది.
దేశంలో జనగణన ఆధారంగా భవిష్యత్ జనాభాను అంచనా కట్టే రిజిస్ట్రార్ జనరల్ 2011 నాటి జనగణన ఆధారంగా 2019లో ఓ అంచనా విడుదల చేశారు. ఆ లెక్కలో చూస్తే మనం చైనాను దాటడానికి 2023 కన్నా కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది. వారి వారి అంచనాలను బట్టి తేదీలు మారినా, రేపు కాకుంటే ఎల్లుండైనా జనాభాలో చైనాను భారత్ దాటేయడం నిస్సందేహమని అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే, ఏ దేశమైనా జనాభా స్థిరీకరణ సాధించాలంటే టీఎఫ్‌ఆర్ 2.1 ఉండాలని యూఎన్‌పీడీ ఉవాచ. మన దేశంలో ఇప్పుడు ఆ రేటు 2 గనక, మరికొన్నేళ్ళు మనం అదే రేటును కొనసాగించగలిగితే చాలు. మనం అత్యంత కీలకమైన జనాభా స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్టే! ఒకప్పుడు కుటుంబ నియంత్రణ విధానాన్ని గట్టిగా మొదలుపెట్టినప్పుడు టీఎఫ్‌ఆర్ 6 ఉన్న మన దేశం ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం చెప్పుకోదగ్గ విజయమే!
చైనా లాంటి చోట్ల అమలు చేసిన నిర్బంధ కుటుంబ నియంత్రణకూ, మన దేశంలో అవగాహన, చైతన్యంతో ఒప్పించి సాధించిన జనాభా నియంత్రణకూ చాలా తేడా ఉంది. అయితే, ఇప్పటికీ లింగ వివక్ష ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి అనేక ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా ఎక్కువ టీఎఫ్‌ఆర్ ఉంది. ఇది ఆందోళనకరం. అక్కడ ప్రజల్ని జన నియంత్రణకు ఉద్యుక్తుల్ని చేయాలి. నిజానికి, దేశంలో 70 కోట్ల మంది దాకా ఉన్న మహిళల్ని చైతన్యపరచాలి. జనాభా నియంత్రణ సహా సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనలో స్త్రీలను భాగం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని గ్రహించాలి. ఒకప్పుడు ‘చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం’ అన్నాం. పెరిగిన సగటు ఆయుః ప్రమాణాలతో రాబోయే దశాబ్దాల్లో పిన్నలు తగ్గి, పెద్దలు పెరిగాక చిన్న కుటుంబాలతోనూ సమస్యలుంటాయని గుర్తించాలి. వ్యక్తిగత ప్రయోజనాల వ్యష్టి జీవన విధానం కన్నా, పెద్దలను పిల్లలు చూసుకొనే సమష్టి భారతీయ కుటుంబ వ్యవస్థను ఆశ్రయించడమే అందుకు పరిష్కారం.
ఐరాస ప్రధాన కార్యదర్శి అన్నట్టు, పుడమి సంరక్షణలో మనందరి బాధ్యతను మరోసారి గుర్తు చేసుకోవడానికి ఇదే సరైన సందర్భం. చేసుకున్న బాసలను నెరవేర్చడంలో ఇప్పటికీ ఎక్కడ వెనుకబడి ఉన్నామో ఆగి, ఆలోచించుకోవాల్సిన తరుణం. ఇప్పుడు జనసంఖ్య ఎంత ఉందనే దాని కన్నా, వారికి ఎంత నాణ్యమైన జీవితం గడిపే వీలు కల్పిస్తున్నామన్నదే ఆలోచించాల్సిన అంశం. అందరికీ కూడు, గూడు, గుడ్డ ముఖ్యం. దారిద్య్రాన్ని తగ్గించడం, జనాభా అంతటికీ విద్య, వైద్య వసతులు కల్పించడంపై దృష్టి మరల్చాలి. 25 నుంచి 64 ఏళ్ళ లోపు వారు ఎక్కువున్నందున ఉత్పాదకత, ఆదాయం రెండూ పెరిగే నైపుణ్యాలను వారికి అందించాలి. విజ్ఞానాధారిత ఆర్థికవ్యవస్థలోకి ప్రయాణంలో యువతకు అవసరమైన సామర్థ్యాల్ని అందించాలి. దేశంలో 65 ఏళ్ళ పైబడిన వర్గం శరవేగంతో పెరుగుతున్నందున, పెద్ద వయసువారికి సామాజిక భద్రత కల్పనపై పాలకులు సమయం వెచ్చించాలి. ప్రపంచంలో ప్రథమ స్థానానికి పరుగులు తీస్తూ ‘జన భారత్’ అనిపించుకుంటున్న మనం అదే నోట ‘జయ భారత్’ అనిపించుకొనే రోజూ రావాలి! ఈ దేశానికి ఇప్పుడదే కావాలి!!
Comments
Please login to add a commentAdd a comment