నాలుగేళ్ళ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు తొలి అడుగు పడింది. హిమాలయ సరిహద్దు వెంట కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత, చైనాల మధ్య అంగీకారం కుదిరింది. విస్తృతమైన సరిహద్దు వివాదం అలాగే అపరిష్కృతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయ ఘర్షణలకు ముందున్న పరిస్థితికి తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతోంది.
చైనా సైతం పాల్గొన్న ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని వెళ్ళే ముందు గత వారమే ఈ ఒప్పందం గురించి వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ చర్యలు తుది రూపానికి వచ్చాయి. ఒప్పందంలోని మరిన్ని వివరాలు విశదం కావాల్సి ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ఫలితంగా నెలకొనే ప్రాంతీయ సుస్థిరతకు ఇది ఓ సానుకూల పరిణామమని చెప్ప వచ్చు. ఆసియా ఖండంలోని రెండు భారీ శక్తుల మధ్య రాజకీయ, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు మళ్ళీ మార్గం సుగమం కానుందని భావించవచ్చు.
2020 జూన్‌లో చైనా సైనిక బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. భారత బలగాలు సైతం త్వరితగతిన అందుకు దీటుగా బదులిచ్చాయి. బాహాబాహీ సాగిన ఆ ఘర్షణల్లో రెండు పక్షాల నుంచి గణనీయమైన సంఖ్యలో సైనికులు మరణించారు. గాయపడ్డారు. 1975 తర్వాత రెండు దేశాల మధ్య మళ్ళీ అంతటి ఉద్రిక్తతకు అది కారణమైంది. సరిగ్గా ఆ ఘర్షణలు జరిగిన గాల్వాన్ లోయ ప్రాంతం వద్దే ఇప్పుడు శాంతి, సాంత్వన యత్నానికి శ్రీకారం చుట్టడం ఒక రకంగా శుభపరిణామం.
నాలుగేళ్ళ ప్రతిష్టంభన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కొంత మెరుగయ్యేందుకు ముందడుగు వేసినందుకు ఇరుపక్షాలనూ అభినందించాల్సిందే. ఇరు పక్షాల మధ్య అనేక వారాలుగా సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా భారత, చైనా భూభాగాలను విభజించే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట, తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని దెప్సాంగ్, దెమ్‌ఛోక్ మైదాన ప్రాంతాల్లో భారత, చైనా సైనిక బలగాలను తగ్గించడం ఇప్పటికే మొదలైంది. అలాగే, గతంలో అంగీకరించిన పద్ధతిలోనే గస్తీ పునఃప్రారంభం కానుంది.
వ్యూహాత్మకంగా ఇటీవల ‘బ్రిక్స్’ సమిట్ సమయంలోనే ఈ గస్తీ ఒప్పందాల గురించి బయటకు చెప్పడం గమనార్హం. తద్వారా రెండు దేశాల మధ్య వైషమ్యాలను దూరం పెట్టి, ఆర్థిక సహకార పునరుద్ధరణకు బాటలు పరవాలనుకోవడం మంచిదే. అందుకు తగ్గట్లుగా ‘బ్రిక్స్’ సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సుహృద్భావ పూర్వక భేటీ జరిగింది. సమావేశానికి కొద్ది రోజుల ముందే కుదిరిన ఈ సరిహద్దు గస్తీ ఒప్పందం, దరిమిలా ఆ భేటీ వల్ల ఉద్రిక్తతలు కొంత సడలడం ఖాయం.
అలాగని ఈ ఒప్పందాన్ని కేవలం సైనిక సమన్వయ చర్యగా తక్కువ చేసి చూడడం సరికాదు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలనూ, అలాగే అంతర్జాతీయ స్థాయిలో దౌత్య సంబంధాలనూ పునర్ నిర్వచించే సామర్థ్యం కూడా ఈ ఒప్పందానికి ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందంతో భారత, చైనాల మధ్య రాత్రికి రాత్రి అపూర్వ సత్సంబంధాలు నెలకొంటాయని అనుకొంటే అత్యాశే. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
నిజానికి, భారత – చైనాలది సుదీర్ఘమైన 3440 కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దు. నదులు, సరస్సులు, హిమఖండాలతో కూడిన ఆ దోవలో విభజన రేఖను నిర్దుష్టంగా పేర్కొనడమూ చిక్కే. ఈ పరిస్థితుల్లో భూటాన్ – నేపాల్‌ల మధ్య సిక్కిమ్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఇరుపక్షాల సైనికులు ముఖాముఖి ఎదురుపడి, ఘర్షణకు దిగడం జరుగుతున్నదే. దానికి తోడు భారత భూభాగంలోకి పదేపదే జొరబడుతూ చైనా చూపుతున్న విస్తరణ కాంక్ష తెలియనిదీ కాదు.
ఈ పరిస్థితుల్లో ఎల్‌ఏసీ వెంట రోడ్లు, నివాసాల సహా ప్రాథమిక వసతి సౌకర్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచి, ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనే ప్రయత్నం రెండు వైపులా సాగింది. ఆ నేపథ్యమే గాల్వాన్ ఘర్షణకూ దారి తీసింది. రెండు దేశాల మధ్య సాధారణ స్థితి రావాలంటే, తూర్పు లద్దాఖ్‌కే పరిమితమైన ఒప్పందంతో సరిపోదు. మొత్తం ఎల్‌ఏసీ వెంట సాధారణ పరిస్థితులకు కృషి సాగాలి. దానికి ఇరుపక్షాలలోనూ చిత్తశుద్ధి ముఖ్యం. డ్రాగన్ సైతం చెప్పేదొకటి, చేసేదొకటి విధానాన్ని ఇకనైనా మానుకోవాలి.
భారత్, చైనాలు కేవలం పొరుగుదేశాలే కాదు, ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశాలు. కాబట్టి, పరస్పర స్నేహ సౌహార్దాల వల్ల రెండిటికీ లాభమే. భారత అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వా ముల్లో అమెరికాతో పాటు చైనా ఒకటి. సరుకుల నుంచి టెలికమ్యూనికేషన్ల హార్డ్‌వేర్, భారతీయ ఫార్మా రంగానికి ముడి పదార్థాల దాకా అనేకం భారత్‌కు అందించే అతి పెద్ద వనరు చైనాయే.
గాల్వాన్ ఘటన తర్వాత చైనా పెట్టుబడులు, వీసాలు, యాప్‌లపై మన దేశం సహజంగానే తీవ్ర షరతులు పెట్టింది. అవన్నీ తొలగాలంటే, మళ్ళీ పరస్పరం నమ్మకం పాదుకొనే చర్యలు ముఖ్యం. గస్తీ ఒప్పందం కుదిరింది కదా అని నిర్లక్ష్యం వహించకుండా భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే. అవతలి పక్షాన్ని విశ్వసిస్తూనే, అంతా సజావుగా సాగుతున్నదీ లేనిదీ నిర్ధరించుకోవాల్సిందే.
ఒప్పందాల మాట ఎలా ఉన్నా... సరిహద్దు వెంట సన్నద్ధతను మానరాదు. సరిహద్దులో ప్రాథమిక వసతి సౌకర్యాల నిర్మాణాలను కొనసాగించడమే దీర్ఘకాలంలో మన దేశానికి ఉపకరిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే భారత్ బలీయంగా తయారైందని గాల్వాన్‌లో మన సైన్యాల దీటైన జవాబు రుజువు చేసింది. ఆ బలాన్ని కాపాడుకుంటూనే, డ్రాగన్‌తో బంధాన్ని పటిష్ఠం చేసుకోవడమే మార్గం.
ఒక ముందడుగు!
Published Tue, Oct 29 2024 4:32 AM | Last Updated on Tue, Oct 29 2024 4:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment