కాలం అందరికీ... వ్యక్తులకైనా, సంస్థలకైనా అన్నీ నేర్పుతుంది. పదిహేనేళ్ల క్రితం అప్పట్లో ఆర్థికంగా జవసత్వాలు పుంజుకుంటున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో బ్రిక్‌గా ఏర్పడిన సహకార కూటమి అనంతరకాలంలో దక్షిణాఫ్రికాను కూడా కలుపుకొని బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసే సమయానికి మరో ఆరు దేశాలకు– సౌదీ అరేబియా, యూఏఈ, అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్, ఈజిప్టులకు ఈ సారి సభ్యత్వం లభించింది.
ఈ దేశాల భాగస్వామ్యం వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇకపై దీన్ని బ్రిక్స్–11గా వ్యవహరిస్తారు. ఆరంభంలో ఆ కూటమి వైపు పెద్దగా దృష్టి సారించని దేశాలు అందులో భాగస్వాములై ఎదగాలని ఇప్పుడు తహతహలాడటం అనివార్య పరిణామం. కరోనా మహమ్మారితో, ఉక్రెయిన్ యుద్ధంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు విధానాలు ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పశ్చి మార్ధ గోళ దేశాల ఆధిపత్యాన్ని, ముఖ్యంగా అమెరికా పెత్తనాన్ని బలహీన పరచాలని చూస్తున్న రష్యా, చైనాలకు ఈ పరిణామం సహజంగానే బలాన్నిస్తోంది.
అయితే ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పీకల్లోతు కూరుకుపోయి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అభిశంసనకు గురయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాలేని నిస్సహాయస్థితిలో పడ్డారు. ఆ కోర్టులో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా ఉండటం వల్ల అది పుతిన్‌పై జారీచేసిన అరెస్టు వారెంట్‌ను అమలుపరచక తప్పదు. నిజంగా దక్షిణాఫ్రికా ఆ పని చేస్తుందా లేదా అన్న సంగతి అటుంచితే ఈ స్థితిలో హాజరు కావటం పుతిన్‌కే అవమానకరమవుతుంది.
దాంతో ఆయన శిఖరాగ్ర సదస్సును ద్దేశించి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అయితే ఇప్పటికిప్పుడు బ్రిక్స్ దేశాలు అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసే స్థితి లేదు. మన దేశం, బ్రెజిల్ అమె రికాకూ, ఇతర పాశ్చాత్య దేశా లకూ సన్నిహితంగా ఉంటున్నాయి. ఆ మాటకొస్తే చైనా సైతం వివిధ అంశాల్లో అమెరికాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, దానితో బాహాటంగా ఘర్షణకు దిగాలనుకోవటం లేదు.
రణరంగంలో నిలిచిన రష్యా ఒక్కటే ఇందుకు మినహాయింపు. సదస్సు ప్రారంభంలోనే ఈ ధోరణి కనబడింది. బ్రిక్స్ దేశాధినేతల్లో ఇతరులు సమానత్వం ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలుండాలని మాట్లా డితే... పుతిన్ మాత్రం ఏ రకమైన పెత్తందారీ పోకడలకైనా తాము బద్ధ విరోధులమని కుండ బద్దలు కొట్టారు. తన శత్రువులు నయా వలసవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆరోపించారు. పనిలో పనిగా ఉక్రెయిన్‌లో వర్తమాన సంక్షోభానికి పాశ్చాత్య దేశాల పెత్తందారీతనమే కారణమన్నారు.
కూటమి విస్తరణ, దాని అమరిక ఎప్పుడూ ఒకేలా ఉండదు. సాధారణ పరిస్థితుల్లో ఉన్న కూటమి సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు చెల్లాచెదురు కావొచ్చు. కొత్త దేశాలొచ్చి అందులో చేరవచ్చు కూడా. తన ప్రయోజనాలకు అనుగుణంగా బ్రిక్స్ విస్తరణ ఉండాలని చైనా ఏడాదిగా ప్రయత్నిస్తోంది. మన దేశం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. నిరుడు బీజింగ్‌లో జరిగిన సదస్సులోనే విస్తరణపై ఆలోచన బయల్దేరింది. సభ్యత్వానికి అర్హతలు, కూటమిలో చేరాక ఆ దేశాలు అనుసరించాల్సిన విధానాలు వగైరాలకు ఈ ఏడాదికాలంలో తుది రూపం ఇచ్చారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలు, మెరుగైన వృద్ధి రేటు ఉండేవాటినే సభ్యదేశాలుగా చేర్చుకోవాలని బ్రిక్స్ మూలవిరాట్టు లైన అయిదు దేశాలూ ఏకాభిప్రాయానికొచ్చాయి.
అలాగే ఇకపై కూడా అయిదు దేశాలూ ఏకాభి ప్రాయానికొస్తే తప్ప ఏ దేశానికీ సభ్యత్వం ఇవ్వరాదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు అంగీకారం లభించింది. బహుళత్వం, సుస్థిర, శాంతియుత అభివృద్ధి, పరస్పర సహకారంతో ఎదుగుదల, సంస్థాగత అభివృద్ధి, బ్రిక్స్ దేశాల ప్రజానీకం మధ్య సంబంధాలు నెలకొల్పటం వగైరాల సాధనకు కృషి చేయాలన్న జోహన్నెస్‌బర్గ్ డిక్లరేషన్ సంకల్పం నెరవేరే దిశగా అడుగులు పడితే సంస్థ భవిష్యత్తులో మరింత బలపడుతుంది. ఎప్పటిలాగే ఘర్షణల విషయం వచ్చేసరికి డిక్లరేషన్ ఆచితూచి వ్యవహరించిందనాలి. నిర్మాణాత్మక చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చి ఊరుకుంది. అంతేతప్ప ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించలేదు.
బ్రిక్స్ స్వభావరీత్యా స్వేచ్ఛా వాణిజ్య కూటమి వంటిది కాదు. దేశాల మధ్య సమన్వయం సాధించి, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఎదగాలన్నది ఈ కూటమి ప్రధాన ధ్యేయం. బ్రిక్స్ కరెన్సీ అంటూ ప్రత్యేకించి లేకపోయినా ఆయా దేశాల కరెన్సీలు బలపడేందుకు అవసరమైన సాయాన్ని అందించటం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. ఈసారి శిఖరాగ్ర సదస్సులో ఉమ్మడి కరెన్సీ గురించిన ఆలోచన చేస్తారని వినబడినా అదేం జరగలేదు. అయితే 2015లో కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవెలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) సమర్థవంతంగానే పనిచేస్తోంది. కూటమిలో కొంత వెనకబడిన దేశాలకు ఈ సంస్థ ద్వారానే సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఇప్పటికైతే బ్రిక్స్‌లో చేరడానికి దక్షిణార్ధ గోళ దేశాల ఉత్సాహాన్ని సంపన్న దేశాలు ఒక హెచ్చరికగా పరిగణించక తప్పదు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న దేశాల ఆకాంక్షలను గుర్తించి తగినవిధంగా వ్యవహరించకుంటే బ్రిక్స్ మాత్రమే కాదు... భవిష్యత్తులో మరిన్ని కూటములు ఉనికిలోకొస్తాయి. ఒకటైతే నిజం – ఆవిర్భవించి పదిహేనేళ్లయినా బ్రిక్స్ సంస్థాగత స్వభావాన్ని సంతరించుకోలేదు. ఆ దేశాలమధ్య పరస్పర ఐక్యతగానీ, ఉమ్మడి లక్ష్యాలుగానీ లేవు. ఆ లోపాన్ని సవరించుకుంటే బ్రిక్స్ మరింత పటిష్టవంతమైన కూటమిగా రూపుదిద్దుకోవటం ఖాయం.
బ్రిక్స్‌కు కొత్త బలం!
Published Fri, Aug 25 2023 2:58 AM | Last Updated on Fri, Aug 25 2023 9:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment