మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా యూరప్‌ దేశాలు | Global COVID-19 cases near 4 crore mark In over 11 lakh dead | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ @ 4 కోట్లు

Published Mon, Oct 19 2020 4:23 AM | Last Updated on Mon, Oct 19 2020 5:25 AM

Global COVID-19 cases near 4 crore mark In over 11 lakh dead - Sakshi

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కొనసాగుతోంది. కంటికి కనిపించని ఆ వైరస్‌ సోకిన వారి సంఖ్య ఆదివారం నాలుగు కోట్లకు చేరింది. ఇప్పటిదాకా దీని బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 3 కోట్లు మించిపోగా, మృతి చెందిన వారి సంఖ్య 11 లక్షలు దాటింది. పది నెలల కాలంలోనే ఒక వైరస్‌ 200 పైగా దేశాల్లో నాలుగు కోట్ల మందికి సోకడం చరిత్రలో ఇదే తొలిసారి. అగ్రరాజ్యం అమెరికా అత్యధిక కేసులతో ముందుంటే ఆ తర్వాత స్థానం భారత్‌దే. బ్రెజిల్, రష్యా, స్పెయిన్‌ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత ఏడాది చైనాలోని వూహాన్‌లో బట్టబయలైన కరోనా వైరస్‌ జన్యుపరంగా అధికంగా మార్పులు చెందుతూ వస్తోంది.

దీంతో ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే కరోనా జాగ్రత్తలపై  ప్రజల్లో అవగాహన కల్పించడంలో చాలా దేశాలు విజయవంతమయ్యాయి. అయినప్పటికీ ఆర్థిక రంగం, ఆరోగ్య రంగం మధ్య సమతుల్యత పాటించడంలోనూ, కలసికట్టుగా వైరస్‌పై పోరాడడంలోనూ ప్రపంచదేశాలు విఫలం అవుతున్నాయని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియా గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది దారిద్య్రరేఖ దిగువకి వెళ్లిపోయారని ప్రభుత్వాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కేసుల్లోనే కాక మరణాల్లో కూడా అగ్రరాజ్యం అమెరికా పట్టికలో అగ్రభాగాన ఉంది. ఆ దేశంలో వైరస్‌ సోకిన ప్రతీ అయిదుగురిలో ఒకరు మరణించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం.

యూరప్‌లో సెకండ్‌ వేవ్‌
కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినట్టే పట్టి యూరప్‌ దేశాల్లో మళ్లీ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. చలికాలంలో ఆ ప్రాంతంలో వైరస్‌ రెట్టింపు వేగంతో విజృంభిస్తోంది. యూకే, రష్యా, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, ఫ్రాన్స్, బెల్జియం, తదితర దేశాల్లో కొత్తగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. యూకేలో ఏకంగా 40శాతం కేసులు పెరిగిపోయాయి. ఈ శీతాకాలంలో లక్షా 20 వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటారని ఒక అంచనా.

యూరప్‌ వ్యాప్తంగా సగటున రోజుకి లక్షా 50 వేల కేసులు నమోదవుతుంటే, ఒక్కో దేశంలో రోజుకి సగటున 7 వేల నుంచి 15 వేల వరకు కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో చాలా దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. లండన్, పారిస్‌ మహా నగరాల్లో కోవిడ్‌ ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు 4 లక్షల కేసులు నమోదు కావడంతో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి. చెక్‌ రిపబ్లిక్‌ కరోనాని జయించామన్న ఉత్సాహంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసింది. దీంతో అక్కడ కరోనా మళ్లీ విజృంభించి ప్రతీ లక్ష మందిలోనూ 400 మందికి వైరస్‌ సోకుతోంది.  

కరోనా ప్రభావం ఇలా..
► కరోనా వైరస్‌ తగ్గిపోయాక కూడా శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. రెస్పిరేటర్‌ మెడ్‌ఆర్‌విక్స్‌ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో వైరస్‌ తగ్గిన నాలుగు నెలల తర్వాత కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది.
► నిస్సత్తువ, కండరాల నొప్పులు, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి


శీతలీకరణ పదార్థాల ప్యాకేజీతోనూ కరోనా..
శీతలీకరించిన ఆహార పదార్థాలతోనూ కరోనా వ్యాపిస్తుందని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) వెల్లడించింది. ఇలా ఆహార పదార్థాల ప్యాకేజీతో కరోనా సోకుతుందని తేలడం ఇదే తొలిసారి. శీతలీకరించిన ఆహార పదార్థాలు వైరస్‌తో కలుషితమైతే వాటి ద్వారా కరోనా సోకుతుందని ప్రకటించిన చైనా 19 దేశాలకు చెందిన 56 కంపెనీల ఫ్రోజెన్‌ ఫుడ్‌ దిగుమతులపై నిషేధం విధించింది. గత వారం చైనా పోర్ట్‌ సిటీ కింగ్‌డావోలో కరోనా కేసులు వెలుగులోకి రావడానికి నౌకల్లో ఉన్న వారికి ఫుడ్‌ ప్యాకెట్ల ద్వారా వైరస్‌ సోకడమే కారణమని చైనా వివరించింది. అయితే మంచుతో గడ్డకట్టే ఆహార పదార్థాల్లో నిర్జీవంగా మారిపోయే వైరస్‌ నుంచి సోకే అవకాశం లేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement