కరోనా: మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలు | Global coronavirus cases cross 5 million in less than 6 months | Sakshi
Sakshi News home page

ప్రపంచంపై కరోనా పంజా

Published Thu, May 21 2020 5:20 AM | Last Updated on Thu, May 21 2020 9:54 AM

Global coronavirus cases cross 5 million in less than 6 months - Sakshi

చైనాలో తొలి కరోనా కేసు వెలుగు చూసి ఆరు నెలలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేసులు అరకోటి దాటేశాయి. 3 లక్షల 25వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 213 దేశాలకు వైరస్‌ విస్తరించింది. ఇప్పటివరకు ఏ వ్యాధి కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలను భయపెట్టలేదు. వ్యాక్సిన్‌ ఇప్పుడప్పుడే వస్తుందన్న ఆశ లేకపోవడంతో కరోనాతో కలిసి బతుకు బండిని సాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆర్థికం, ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించడం కోసమే దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేసింది. ఇప్పుడు రష్యా, బ్రెజిల్, యూకేలో విజృంభిస్తోంది.  

అమెరికాకి తగ్గని కోవిడ్‌ దడ  
కోవిడ్‌–19తో అమెరికా ఇంకా వణుకుతూనే ఉంది. 15 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 93 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. న్యూయార్క్, న్యూజెర్సీలు శవాలదిబ్బలుగా మారితే ఇప్పుడు అమెరికాలో మారుమూల ప్రాంతాలకూ వైరస్‌ విస్తరిస్తోంది. అయితే తాము అత్యధికంగా చేస్తున్న కోవిడ్‌ పరీక్షల కారణంగానే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించుకుంటున్నారు.  (మలేరియా మందు భేష్‌!)

ష్యాలో విజృంభణ
ప్రపంచ దేశాల్లో కోవి డ్‌–19 కేసుల్లో రష్యా రెండోస్థానానికి చేరుకుంది. కేసులు 3 లక్షలు దాటేశాయి. 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు, మూడు వారాలుగా ప్రతిరోజూ దాదాపుగా 10 వేల కేసులు నమోదవుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మాత్రం తక్కువగా ఉండడం ఊరటనిస్తోంది. వైరస్‌ సోకిన వారిలో ఒక్కశాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారు.  

వూహాన్‌ వెలుపల వణికిస్తోంది  
గత రెండు వారాలుగా చైనాలోని వూహాన్‌ వెలుపల కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన పెంచుతోంది. చైనా ఉత్తర ప్రావిన్స్‌లలో 46 కేసుల వరకు నమోదయ్యాయి. అయితే వూహాన్‌లో వైరస్‌కి, ఇక్కడ వైరస్‌కి మధ్య తేడాలు చాలా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు వైరస్‌ సోకిన 14 రోజుల్లో రోగిలో లక్షణాలు బయటకు వస్తున్నాయి. షులాన్, జిలిన్, షెంగ్యాంగ్‌ నగరాల్లో వైరస్‌ సోకిన రెండు వారాలు దాటినా బయట పడడం లేదంటూ అక్కడ రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ కుయీ ఆందోళన వ్యక్తం చేశారు. 83 వేల కేసులు, 4,634 మృతులని చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  
 
యూకేలో ఎల్‌ టైప్‌ వైరస్‌  
యూరప్‌లో కోవిడ్‌–19 వణికిస్తున్న దేశాల్లో యూకే ప్రధానమైనది. బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ కరోనాపై పోరాటం చేసి కోలుకున్నప్పటికీ ఆ దేశంలో కేసుల్ని అరికట్టడంలో విఫలమవుతున్నారు. 2 లక్షల 50 వేలకు పైగా కేసులు నమోదైతే, 35 వేల మంది కంటే ఎక్కువే మృతి చెందారు. బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగుతున్నా కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. మొదట్లో ఎస్‌ టైప్‌ వైరస్‌ స్ట్రెయిన్స్‌ వస్తే, ఇప్పుడు ఎల్‌ టైప్‌ స్ట్రెయిన్స్‌ కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది. ఈ ఎల్‌ తరహా వైరస్‌ కేసుల సంఖ్యని త్వరితగతిన పెంచేస్తోంది. అందుకే లాక్‌డౌన్‌ నిబంధనల్ని మరింత కట్టుదిట్టం చేసి వీధుల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది కనిపించకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  
 
బ్రెజిల్‌ బెంబేలు
లాటిన్‌ అమెరికా దేశాల్లోని బ్రెజిల్‌లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటలీ, యూకేని దాటేసి నాలుగో స్థానంలోకి చేరుకుంది. కేసులు 2 లక్షల 70 వేలు దాటితే, 18 వేల మంది వరకు మరణించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరా కరోనాని అసలు పట్టించుకోలేదు. వైరస్‌ వస్తే ఏమవుతుంది ? అంటూ వ్యాఖ్యలు చేసి ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆంక్షలు కూడా విధించకపోవడంతో కేసులు అంతకంతకూ పెరిగిపోయి ఆస్పత్రి సౌకర్యాలు లేక రోగులకు చికిత్స అందివ్వడమే కష్టంగా మారింది. దీంతో మృతుల రేటు 6 శాతం నమోదవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement