కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెలో గుబులు పడుతుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గజగజ వణికించింది. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కరోనా ఉధృతితో పేద, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీని బాధితులుగా మారారు. ఊహించని ముప్పుతో ప్రాణాలు విడిచారు. అంతలా ప్రజలను భయాందోళనకు గురిచేసిన మహమ్మారి పీడ ప్రస్తుతం విరిగిపోయినట్లే కనిపిస్తుంది. భారత్‌లో గత కొన్ని నెలలుగా వైరస్ కేసులు పెద్దగా కనిపించడం లేదు.
దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలు హమ్మయ్యా అనుకుంటూ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆలోపే మరో ప్రమాదం ముంచుకొస్తుంది. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈజీ. 5 (EG.5) అనే వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.
ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ జాతికి చెందిన ప్రస్తుతమున్న ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌బీబీ 1.9.2 స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో అదనంగా ఒక మ్యూటేషన్ (జన్యుమార్పు) కలిగి ఉందని, ఇది 465 స్థానంలో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. శరీరంలోని కణాలకు వైరస్ సోకేందుకు స్పైక్ ప్రోటీన్ కీలకమన్న విషయం తెలిసిందే.
చదవండి: మళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్..
అయితే ఈ కొత్త మ్యూటేషన్ ఇంతకముందు ఇతర కరోనా వేరియంట్లలో కూడా కనిపించిందని వెల్లడించారు. మరోవైపు ఈజీ.5 నుంచి ఇప్పటికే ఈజీ.5.1 (EG.5.1) అని పిలవబడే మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది కూడా వేగంగా వ్యాపిస్తోంది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ డా. డేవిడ్ హో ఈ వైరస్‌పై పరిశోధన చేస్తున్నారు. కరోనా టీకాలతో శరీరంలో ప్రేరేపితమైన యాంటీబాడీల నుంచి ఈ వైరస్ ఏమేరకు తప్పించుకుంటోందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కరోనా నిరోధక యాంటీబాడీల నుంచి ఈ రెండు కొత్త వేరియంట్లు కొంత మేర తప్పించుకోగలుగుతున్నాయని గుర్తించారు. ఫలితంగా ఇవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. XBB సిరీస్‌లోని ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఇది రోగ నిరోధకవ్యవస్థ నుంచి మరింత సమర్థవంతంగా తప్పించుకుంటోందని పేర్కొన్నారు. అయితే కొత్త వేరియంట్స్‌తో వ్యాధి తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈజీ.5 వేరియంట్ ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, జపాన్, చైనాలలో కూడా వేగంగా వృద్ధి చెందుతోంది.
మరోవైపు ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్‌లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి.. ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్‌లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment