భారత సాఫ్ట్‌వేర్ మార్కెట్ @ 10 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్‌లో గతేడాది సాఫ్ట్‌వేర్ మార్కెట్ 10 శాతం వృద్ధితో 476 కోట్ల డాలర్లకు చేరిందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, గార్ట్‌నర్ పేర్కొంది. క్లౌడ్ ఆధారిత సేవల జోరు పెరగడమే దీనికి కారణమని అంటోన్న ఈ సంస్థ భారత సాఫ్ట్‌వేర్ మార్కెట్‌పై వెల్లడించిన కొన్ని
ముఖ్యాంశాలు...,
2012లో భారత సాఫ్ట్‌వేర్ మార్కెట్ 433 కోట్ల డాలర్లుగా ఉంది.
గత ఏడాది భారత సాఫ్ట్‌వేర్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. 2012లో 86.5 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం 2013లో 11 శాతం వృద్ధితో 95.73 కోట్ల డాలర్లకు చేరింది. భారత సాప్ట్‌వేర్ మార్కెట్లో ఈ కంపెనీ వాటా 20 శాతంగా ఉంది.
7 శాతం మార్కెట్ వాటా, 50 కోట్ల డాలర్ల ఆదాయంతో ఒరాకిల్ రెండో స్థానంలో ఉంది. బిజినెస్ ఇంటెలిజెన్స్, ఎనలిటిక్స్, డేటా బేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌పై వినియోగదారుల పెట్టుబడుల కారణంగా ఒరాకిల్ ఆదాయం పెరిగింది.
44. 6 కోట్ల డాలర్లతో ఐబీఎం మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సాప్(32.43 కోట్ల డాలర్లు), వివివేర్(9.44 కోట్ల డాలర్లు), సీఏ టెక్నాలజీస్(5.27 కోట్ల డాలర్లు), ఎడోబ్ (4.25 కోట్ల డాలర్లు)లు నిలిచాయి. సాస్, హెచ్‌పీలు కూడా చెప్పుకోదగ్గ ఆదాయాలను సాధించాయి.
{బిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల్లో భారత్‌లోనే సాఫ్ట్‌వేర్ మార్కెట్ అత్యధిక వృద్ధి సాధించింది. అంతేకాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా కూడా సాఫ్ట్‌వేర్ మార్కెట్ వృద్ధిలో భారతే ముందంజలో ఉంది.
గత కొన్నేళ్లలో విదేశీ మార్కెట్లపైననే ఆధారపడిన భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు దేశీయంగా కూడా కొత్త అవకాశాలు లభిస్తున్నాయి.
ఆర్థిక మందగమన పరిస్థితులున్నప్పటికీ, భారత వాణిజ్య సంస్థలు టెక్నాలజీపై సముచితంగానే పెట్టుబడులు పెడుతున్నాయి. భారీ సంస్థలే కాకుండా చిన్న, మధ్యతరహా వ్యాపార(ఎస్‌ఎంబీ) సంస్థలు కూడా టెక్నాలజీపై వ్యయాలను పెంచుతున్నాయి.