అంతులేని అనిశ్చితి! | Sakshi Editorial On Political Uncertainty | Sakshi
Sakshi News home page

అంతులేని అనిశ్చితి!

Published Wed, Jul 17 2024 12:42 AM | Last Updated on Wed, Jul 17 2024 12:42 AM

Sakshi Editorial On Political Uncertainty

అయిదేళ్ళలో అయిదో ప్రధానమంత్రి వచ్చారు. పొరుగున నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఇదే దర్పణం. అనుభవజ్ఞుడైన కమ్యూనిస్టు రాజకీయ నేత ఖడ్గ ప్రసాద్‌ (కె.పి) శర్మ ఓలీ నూతన ప్రధానిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయడంతో... కష్టాల్లో ఉన్న తమ దేశానికి మంచి రోజులు రావచ్చేమో అని నేపాలీయులు ఆశగా చూస్తున్నారు. దేశంలోకి పెట్టుబడులు, దరిమిలా కొత్తగా ఉద్యోగాలొస్తాయని నిరీక్షిస్తున్నారు. అయితే ఓలీకి ఇది కత్తి మీద సామే. 2018లో లాగా ఆయనేమీ శక్తిమంతమైన కమ్యూనిస్ట్‌ ప్రభుత్వానికి సారథ్యం వహించట్లేదు. ఇప్పుడాయన సంకీర్ణ ప్రభుత్వ సారథి. 

పైగా, సంకీర్ణంలో ఆయన పార్టీ మైనారిటీ. అది మరో బలహీనత. సైద్ధాంతికంగా పరస్పర విరుద్ధ భావాలున్న నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్‌సీ), కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌–యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ (సీపీఎన్‌–యూఎంఎల్‌)లు రెండూ 2027లో ఎన్నికల వరకు ప్రధాని పదవిని సమాన కాలం పంచుకోవాలన్న అవగాహనతో అనైతికంగా జట్టు కట్టాయి. ఇది ఏ మేరకు ఫలిస్తుందో తెలీదు. అది నేపాల్‌ సమస్యనుకున్నా, చైనా అనుకూల ఓలీ గద్దెనెక్కడం భారత్‌కు ఇబ్బందికరమే! 

నేపాల్‌లో 239 ఏళ్ళ రాచరికాన్ని 2008లో రద్దు చేశారు. అదేమి శాపమో రాజరిక వ్యవస్థ రద్దయి రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి దేశం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికి 13 ప్రభుత్వాలు మారాయి. ఏణ్ణర్ధ కాలంలో నాలుగుసార్లు సభలో బలపరీక్షను తట్టుకొని బయట పడ్డ ప్రధాని, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ – మావోయిస్ట్‌ సెంటర్‌ (సీపీఎన్‌–ఎంసీ) నేత పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ శుక్రవారం జూలై 12న మాత్రం ఓడిపోయారు. అధికార సంకీర్ణ భాగస్వామి అయిన మితవాద సీపీఎన్‌– యూఎంఎల్‌ మద్దతు ఉపసంహరణతో ఆయనకు ఓటమి తప్పలేదు. 

72 ఏళ్ళ ఓలీ నాయకత్వంలో కొత్త సంకీర్ణ సర్కార్‌ గద్దెనెక్కింది. ఇప్పుడొచ్చింది 14వ ప్రభుత్వం. ప్రధాని పదవి ఓలీకి కొత్త కాదు. ఆయన పగ్గాలు పట్టడం ఇది నాలుగోసారి. ఏ ప్రభుత్వం వచ్చినా నేపాల్‌లో వెంటాడే పాత సమస్యలు ఓలీకీ తప్పవు. మరో రెండు నెలల్లో పార్లమెంట్‌లో మెజారిటీ నిరూపించుకోవాల్సిన ఆయన పరస్పర విరుద్ధ సిద్ధాంతాలతో నిండిన కూటమితో ప్రభుత్వాన్ని ఎలా నడపగలరో చూడాలి. ప్రచండ ప్రభుత్వాన్ని కూల్చి, కొత్త కూటమి కట్టి దేశంలోని రెండు పెద్ద పార్టీలు ఎన్‌సీ, యూఎంఎల్‌ సాహసమే చేశాయి. సుపరిపాలన, రాజకీయ సుస్థిరతలో ఈ సంకీర్ణం విఫలమైతే అది మొత్తం రాజ్యాంగం, వ్యవస్థల వైఫల్యమేనని ప్రజలు భావించే ప్రమాదం ఉంది.  

నిజానికి, ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల్లో నేపాల్‌ ఒకటి. రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టేవారు కరవయ్యారు. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. లక్షలాది యువకులు ఉద్యోగం, ఉపాధి నిమిత్తం మలేసియా, దక్షిణ కొరియా, మధ్యప్రాచ్యం దారి పట్టారు. పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే, గద్దెనెక్కిన ప్రభుత్వాలేవీ దేశాభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదు గనక మళ్ళీ రాచరికాన్నే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ జనం అడపాదడపా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. 

భారత్‌తో పాటు పొరుగున ఉన్న మరో పెద్ద దేశం చైనా సైతం నేపాల్‌ లోని రాజకీయ పరిణామాలను ఆది నుంచి ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నాయి. ఈ హిమాలయ దేశాభి వృద్ధికి ఆర్థిక సాయం అందించి, ప్రాథమిక వసతి సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాల్లో ప్రాబల్యం సంపాదించాలని సహజంగానే ఢిల్లీ, బీజింగ్‌ల యత్నం. 

భౌగోళికంగా భారత, చైనాల మధ్య చిక్కుకుపోయిన నేపాల్‌కు మొదటి నుంచి మనతో స్నేహ సంబంధాలు ఎక్కువే. కానీ గత దశాబ్ద కాలంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. కమ్యూనిస్ట్‌ నేత ఓలీ తొలివిడత నేపాల్‌ ప్రధానిగా వ్యవహరించినప్పుడు 2015–16లో చైనాతో ప్రయాణ, సరుకు రవాణామార్గ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా, నేపాల్‌ విదేశీ వాణిజ్యంపై అప్పటి దాకా భారత్‌కు ఉన్న ఆధిపత్యానికి తెర పడింది. 

తాజాగా పడిపోయిన ప్రచండ సర్కార్‌ సైతం చైనా వైపు మొగ్గింది. నిన్న గాక మొన్న పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ముందు ఆయన నేపాల్‌తో చైనాను కలిపే రైలు మార్గానికి పచ్చజెండా ఊపడం గమనార్హం. ఇది అనేక వందల కోట్ల డాలర్లతో డ్రాగన్‌ చేపట్టిన ప్రతిష్ఠాత్మక బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్ట్స్‌ కింద కొస్తుంది. దీంతో నేపాల్‌ – చైనా సరిహద్దు వెంట వసతులు పెరుగుతాయని పైకి అంటున్న మాట. నిజానికి సరిహద్దులో చైనాకు పట్టు పెంచే ఈ చర్య భారత్‌కు తలనొప్పి!

అసలు బీఆర్‌ఐ ప్రాజెక్టుల వెనక చైనా వ్యూహం వేరు. చిన్న చిన్న దేశాలకు పెద్దయెత్తున అప్పులిస్తూ, ఋణ దౌత్యం ద్వారా ఆ యా ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయాల్లో పైచేయి సాధించడం డ్రాగన్‌ ఎత్తుగడ. అందుకే, ప్రపంచ దేశాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్ట్‌లు సంబంధిత చిన్నదేశాలకు భరించలేని భారమవుతాయి. చివరకు ఆ దేశాలు చైనా మాటకు తలూపాల్సి వస్తుంది. గతంలో చైనా ఇలాగే శ్రీలంకలో హంబన్‌తోట పోర్ట్‌కు ఋణమిచ్చింది. బాకీలు తీర్చడంలో విఫలమైన సింహళం చివరకు బాకీకి బదులు ఈక్విటీలిచ్చి, 2017లో ఆ పోర్ట్‌ను 99 ఏళ్ళ లీజుకు చైనాకు అప్పగించింది. 

ఇలాంటి కారణాల వల్లే బీఆర్‌ఐ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలున్నాయి. అలాగే బీఆర్‌ఐ కింద చైనా–పాక్‌ ఆర్థిక నడవా ప్రాజెక్ట్‌ అంటూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా దాన్ని చేపట్టడాన్ని భారత్‌ నిరసించింది. ఇప్పుడు భారత్‌ కన్నా చైనాకు మరింత సన్నిహితుడైన ఓలీ వల్ల నేపాల్‌ కూడా చైనా గుప్పిట్లోకి జారిపోవచ్చు. మనం తక్షణమే అప్రమత్తం కావాలి. మనతో సన్నిహిత సంబంధాలు కీలకమని ఓలీ గుర్తించేలా చేయాలి. ఓలీ సంకీర్ణంలో అధిక సంఖ్యాబలమున్న ఎన్‌సీ చిరకాలంగా భారత అనుకూల పార్టీ కావడం ఉన్నంతలో కొంత ఊరట.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement