వాల్మీకి మహర్షి రచించిన సీతారాముల కథ ఇతివృత్తంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 రకాల రామాయణాలు అందుబాటులో ఉన్నాయని ఒక అంచనా ఉన్నది. ఇండియాతో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, మైన్మార్, లావోస్, కంబోడియా, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియా మొదలైన దేశాల్లో శ్రీరామకథ ప్రాచుర్యంలో ఉంది. వీటిలో అనువాదాలు కొన్ని మాత్రమే, అనుసరణలే ఎక్కువ. ప్రధాన పాత్రలను, సారాంశాన్ని మాత్రమే తీసుకుని ఎవరికి తోచిన విధంగా వారు రాసుకున్నారు. జానపద కళల రూపాల్లో మరికొన్ని వేల రామాయణాలు జనబాహుళ్యంలో జీవించి ఉన్నాయి.
నేపాల్ ప్రధానమంత్రి కామ్రేడ్ కేపీ శర్మ ఓలీ ఇప్పుడు రామాయణ కథను సరికొత్త పద్ధతిలో చెప్పడం ప్రారంభించారు. కథ మొత్తం చెబుతారో లేదో తెలియదు కానీ, ప్రారం భిస్తూనే వివాదానికి తెరలేపారు. అసలు సిసలైన రామజన్మ భూమి నేపాల్‌లోనే ఉన్నదని ఆయన వాదన. దక్షిణ నేపాల్‌లోని బీర్‌గంజ్ సమీపంలో థోరీ వద్ద ఉన్నదే అసలైన అయోధ్య అని ఆయన చెబుతున్నారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి ఆశ్రమం కూడా నేపాల్‌లోనే ఉందట. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా నేపాల్‌లోనే ఉన్నదని, అసలు దశరథుడు నేపాల్ రాజేనని కామ్రేడ్ ఓలీ చెబుతున్నారు. రామ జన్మభూమిపై భారతదేశంలో విభేదాలున్నాయి గానీ, నేపాల్‌లో ఏకాభిప్రాయం ఉందని, అందువలన రాముడు తమవాడేనని ఆయన వాదన. రామజన్మభూమి వివాదంతో భారతదేశంలో బలపడి అధికారంలో స్థిరపడిన భారతీయ జనతా పార్టీపై విసిరిన సెటైర్లుగా ఓలీ వ్యాఖ్యలను కొందరు పరిగణిస్తున్నారు. అదే నిజమైతే, మదపుటేనుగును చిట్టెలుక వెక్కిరించడం ఎలా సాధ్యమైంది? భారత్‌పై నేపాల్ సెటైర్లు వేయడమేమిటి? చిట్టె లుక వెక్కిరింపుల వెనుక డ్రాగన్ ప్రోద్బలం ఉన్నదా? (ఒక్క రాముడేంటి, అన్ని గ్రహాలు నేపాల్వే..)
ఎంతోకాలం నుంచి భారతదేశపు సహాయ సహకారాల మీద ఆధారపడి నెట్టుకొస్తున్న దేశం నేపాల్. ఇటీవలికాలంలో దాని స్వరం మారుతున్నది. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. నేపాల్ రూపొందించుకున్న నూతన రాజ్యాంగానికి వ్యతిరేకంగా దక్షిణ నేపాల్‌లోని భారత సరిహద్దు మైదాన ప్రాంతంలో నివసించే మధేశీలు ఆందోళన లేవదీశారు. ఉత్తర బిహార్‌లో కూడా వీరి జనాభా ఉన్నది. మధేశీల ఆందోళనకు భారత్ సంపూర్ణంగా మద్దతునిచ్చింది. నేపాల్ మెడలు వంచడానికి మధేశీ ఆందోళన కారులు భారత్ నుంచి వచ్చే నిత్యావసరాల సరఫరాను అడ్డు కున్నారు. ఈ దిగ్బంధనానికి భారత్ మద్దతు ఉందని నేపాల్ ఆరోపించింది. దిగ్బంధన కాలంలో నేపాల్ అష్టకష్టాలు పడింది. తన అవసరాలకోసం ఒకే దేశంపై ఆధారపడటం ఎంత ప్రమాద కరమో నేపాల్‌కు అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. ప్రవేశం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న చైనాకోసం ఉత్తర (సరి హద్దు) ద్వారాన్ని ఓపెన్ చేసింది. ఈ నాలుగేళ్ల కాలంలోనే నేపాల్–చైనాల స్నేహబంధం సమస్త జీవన రంగాల్లోకి ప్రవేశిం చింది. (శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది!)
దేశ మౌలిక రంగంలో చైనా పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. భారత్ అందజేస్తున్న సహాయం కంటే అనేకరెట్లు ఎక్కువ సాయాన్ని అందజేయడం మొదలుపెట్టింది. నేపాల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాలను కూడా చైనా భరిస్తున్నది. అందుకు ప్రతిఫలంగా నేపాల్ బడిపిల్లలు ద్వితీయ భాషగా మాండరిన్ (చైనీస్)ను నేర్చుకుంటున్నారు. సహస్రాబ్దుల సాంస్కృతిక సారూప్యతలున్న భారతీయ భాష లకు దక్కని గౌరవం నేపాల్‌లో చైనీస్‌కు దక్కింది. చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా ఇటీవల నేపాల్ కమ్యూనిస్టు నేతలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు. నేపాల్ అభివృద్ధి ప్రణాళికపై చర్చించినట్టు పైకి చెబుతున్నారు. కానీ చైనా విస్తరణ వ్యూహా లకు అనుగుణమైన ఆదేశాలు ఈ సందర్భంగా నేపాల్ నేతలకు అందివుంటాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఈ సమావేశాల అనంతరమే నేపాల్ తన దేశపు కొత్త మ్యాప్‌ను ప్రకటించింది.
భారతదేశంలో భాగంగా కొనసాగుతున్న లిపులేఖ్, కాలా పానీ, లింపియాథుర పర్వత ప్రాంతాలను నేపాల్ తన దేశపు మ్యాప్‌లో చేర్చింది. నేపాల్ పడమటి సరిహద్దును ఆనుకుని ఉత్తరాఖండ్ ఈశాన్య దిక్కులో ఉన్న 370 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమదేనని నేపాల్ ఇప్పుడు కొత్త పేచీని ముందుకు తెచ్చింది. ఈ పర్వత ప్రాంతంలోని లిపులేఖ్ పాస్ చైనా (టిబెట్)లోకి ప్రవేశించడానికి అనువైన మార్గం. హిందువులకు పరమ పవిత్రమైన మానస సరోవరం, కైలాస పర్వతాలకు వెళ్లడానికి లిపులేఖ్ పాస్ దగ్గరి దారి. ఉత్తరాఖండ్ మిగిలిన ప్రాంతంతో కలుపుతూ లిపులేఖ్ వరకు 80 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి మే నెలలోనే రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేశారు. లిపులేఖ్ పాస్ గుండా ఎప్పుడైనా దురాక్రమణ దాడులు ఎదురైన పక్షంలో సైనిక బలగాల తక్షణ తరలింపునకు అవస రమైన రక్షణ వ్యూహం కూడా ఈ రోడ్డు మార్గం నిర్మాణం వెనుక ఉండవచ్చు. శంకుస్థాపన కార్యక్రమం జరిగిన అనంతరమే చైనా కమ్యూనిస్టు నేతలతో నేపాల్ నేతల వీడియో కాన్ఫరెన్స్, ఆ తరువాతనే నేపాల్ కొత్త మ్యాప్‌ను ప్రకటించడం అనేక అను మానాలకు తావిస్తున్నాయి.
ఈ ప్రాంతం తమదేనని చెప్పడానికి నేపాల్ లేవనెత్తిన వాదన కూడా వింతగొలుపుతున్నది. నేపాల్‌కు పడమరగా, భారత్‌కు తూర్పుగా కాళీ నదిని సరిహద్దుగా గుర్తించారు. చైనా (టిబెట్), భారత్ సరిహద్దులో లింపియాథుర ప్రాంతం నుంచి పడమటిపాయ, లిపులేఖ్ పాస్ సమీపం నుంచి తూర్పు పాయ ప్రవహించి కాలాపానీ దిగువన ‘్గ’ ఆకారంలో కాళీ నదిగా సంగమిస్తాయి. కాళీ నది సరిహద్దు కనుక ఉత్తర దిశన ఉన్న ఈ రెండు పాయల మధ్య ప్రాంతం కూడా తమదేనని నేపాల్ కొత్త వాదన. ఇదే వాదన భారత్ కూడా చేయడానికి అవకాశం వుందనే అంశాన్ని నేపాల్ ఉద్దేశపూర్వంగానే విస్మరిస్తున్నది. ఎందుకంటే ఈ రెండు నదీపాయల నడుమనే వ్యూహాత్మకమైన లిపులేఖ్ పాస్ ఉన్నది. ఈ ప్రాంతం నేపాల్ అధీనంలోకి వెళితే ఆ తదుపరి జరిగే పరిణామం...ఎంటర్ ద డ్రాగన్.
గడిచిన పుష్కరకాలంగా ఇబ్బడిముబ్బడిగా సాధించిన ఆర్థికాభివృద్ధి దన్నుతో, దశాబ్దాల కాలంగా దహించి వేస్తున్న విస్తరణ కాంక్షతో ప్రపంచ పటంపైకి చైనా తన లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించింది. ఇండో–పసిఫిక్ మహాసముద్రాల ప్రాంతంలో ఆధిపత్యం కోసం అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా లతో తలపడేందుకు సైతం సిద్ధపడుతున్నది. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇండియాను దిగ్బంధం చేసే విధంగా ఇప్పటికే ‘ముత్యాల హారం’ వ్యూహాన్ని అమలుచేసింది. ఇందులో భాగంగా తూర్పున బంగాళాఖాతం తీరంలో క్యాప్యూ (మైన్మార్) రేవును, పడమట అరేబియా తీరంలో గ్వదర్ (పాకిస్తాన్) రేవును, దక్షిణ దిశన హంబటోటా (శ్రీలంక) రేవునూ సైనిక, వాణిజ్య అవసరాలకోసం సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలోని అత్యంత కీలకమైన జలసంధులపై ఆధిపత్యానికి ప్లాన్ సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో ఇండియన్ సబ్ కాంటినెంట్‌గా కూడా పిలుచుకునే దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకొని రాకుండా ఇండియన్ ఓషన్‌లో తన సహజ హక్కులకోసం ఒంటరి భారతదేశం పోరాడలేదు. ఇక్కడ తన పలుకుబడి నిలబడాలంటే దక్షిణాసియాతోపాటు ఆగ్నేయాసియా దేశాల (ఏసియాన్ కూటమి)తోను భారత్‌కు మైత్రీపూర్వక సంబం ధాలు ఉండి తీరవలసిందే. ఈ వాస్తవికతను గుర్తించిన కారణం గానే నరేంద్రమోదీ మొదటిసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు దక్షిణాసియా దేశాధినేతలందరినీ అతిథులుగా పిలుచుకున్నారు. రెండోసారి పదవిని చేపట్టే సమయంలో ఇరుగుపొరుగుగా వున్న బిమ్‌స్టెక్(ఇందులో ఆగ్నేయాసియా దేశాలే అధికం) దేశాధినేతలను పిలుచుకున్నారు. కానీ ఆచరణే ఎక్కడో తప్పటడుగులు వేసింది. అనాలోచిత చర్య కారణంగా నేపాల్ చైనా గుప్పిట్లోకి వెళ్లింది. బిహార్‌లో మధేశీ ఓట్లకోసమే నేపాల్ దిగ్బంధాన్ని ప్రోత్సహించారన్న రాజకీయ ఆరోపణే ఒకవేళ నిజమైతే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. పాకిస్తాన్ మొదటినుంచీ స్వయం ప్రకటిత శత్రుదేశమే. ఇప్పుడు చైనా కూటమిలో కీలకదేశం.
అమెరికా తాలిబన్‌ల మధ్యన జరిగిన ఒప్పందం కారణంగా మరో ఏడాదిన్నరలోగా అఫ్గాని స్తాన్ తాలిబన్‌ల వశమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే అప్ఘాన్ పునర్నిర్మాణం కోసం ఇన్నాళ్లూ భారత్ పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. బంగ్లాదేశ్‌తో సంబంధాల్లో భాగంగా 70 ఏళ్ల నుంచి వున్న భూవివాదాన్ని పరిష్కరించి మోదీ శుభారంభాన్ని అందించారు. కానీ ఎన్‌ఆర్‌సీ కారణంగా మళ్లీ రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. భూటాన్ ఒక్కటే ఇప్పుడు నికరంగా భారత్ వైపున నిలబడింది. అందుకు కారణం చైనాతో దానికి ఉన్న సరిహద్దు పేచీ. అధికారంలోకి రాజపక్స సోదరుల పునరాగమనంతో శ్రీలంకలో కూడా చైనాయే స్కోర్ చేసినట్టయింది. ఆగ్నేయాసియా దేశాల్లో లావోస్, కంబోడియాలు చైనాకు నమ్మకమైన మిత్రులు. ఏసియాన్ కూటమిలో అతిపెద్ద దేశం మైన్మార్. నేపాల్ లాగానే అటు చైనాతోనూ, ఇటు భారత్‌తోనూ ఈ దేశానికి కూడా సరి హద్దులున్నాయి.
నేపాల్ లాగానే భారత్‌తో చిరకాల సన్నిహిత సంబంధాలున్న దేశం ఇది. బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. కానీ రోహింగ్యాల విషయంలో భారత్ తీసుకున్న ప్రజాస్వామ్యబద్ధమైన వైఖరి ఈ దేశానికి నచ్చలేదు. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం కూడా భారీగా పెరిగింది. చైనా నుంచి ఏటా వచ్చే లక్షలాది పర్యాటకుల కారణంగా మైన్మార్ టూరిజం అభి వృద్ధి చెందింది. మౌలిక వసతుల అభివృద్ధికి చైనా పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో మైన్మార్‌పై కూడా చైనా ప్రభా వమే ఎక్కువగా కనబడుతున్నది.
చైనా విస్తరణవాద దూకుడును ఎదుర్కోవడానికి ఇప్పటి కైనా భారత్ ఒక స్పష్టమైన విదేశాంగ విధానాన్ని అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు భారత్ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి : ఇరుగుపొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకునే డిఫెన్స్ వ్యూహం. దీనికి దీర్ఘకాలం పడుతుంది. రెండు: టిబెట్ విషయంలో చైనాను దోషిగా నిలబెట్టి టిబెటన్ల హక్కులకోసం ఎలుగెత్తడం. ఇది ఎదురుదాడి వ్యూహం. ఈ వ్యూహం సత్ఫలితాలనిస్తే చైనా కలల సౌధం కుప్పకూలుతుంది. భారతదేశం క్రియాశీలం కావ లసిన సమయం ఆసన్నమైంది. లేకపోతే చైనాలో తయారైన మరిన్ని సరికొత్త రామాయణాలను, భారతాలను, భాగవతా లను పొరుగు దేశాల నుంచి మనం వినవలసి రావచ్చు.
వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment