Vardelli murali
-
పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్‌బుక్’ పడగ
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియాపై కూడా చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంతో వేధింపులకు తెగించింది. పత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఎమర్జెన్సీ రోజుల నాటి అరాచకాలకు తెరతీసింది. టీడీపీ కూటమి సర్కారు అసమర్థ, అవినీతి పరిపాలనను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచుతున్న ‘సాక్షి’ మీడియా గ్రూప్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రాజ్యాంగ సూత్రాలు, పార్లమెంటు చేసిన చట్టాలకు విరుద్ధంగా విజయవాడ పోలీసులు గురువారం ‘సాక్షి’ ఎడిటర్ వి.మురళి, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దమననీతికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దుర్నీతి, కక్ష సాధింపులు ఇలా ఉన్నాయి...పత్రికా ధర్మం నిర్వర్తిస్తున్నందుకే చంద్రబాబుకు కంటగింపుటీడీపీ కూటమి రెడ్‌బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాలు, దాడులు, వేధింపులను ఎక్కడికక్కడ ఎండగడుతూ ‘సాక్షి’ బాధితులకు అండగా ఉంటోంది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పాటుపడుతోంది. ఈ క్రమంలో గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో టీడీపీ రౌడీమూకలు బరితెగించి పాల్పడుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతోంది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీని ప్రజలకు వివరించి చైతన్యపరుస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై కక్ష గట్టింది. సాక్షి టీవీ చానల్ ప్రసారాలకు ఆటంకాలు కల్పిస్తోంది. కేబుల్ ఆపరేటర్లను భయపెట్టి సాక్షి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేస్తోంది. మరోవైపు సాక్షి పత్రికపై కూడా కక్ష గట్టింది. సర్కారు అలసత్వంతో ఇటీవల విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు వస్తాయని వాతావరణ శాఖ నాలుగు రోజుల ముందే స్పష్టమైన సమాచారం ఇచ్చి హెచ్చరించినా సరే చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదు. దీంతో వరదలు ముంచెత్తి విలయం సృష్టించాయి. 50 మందికిపైగా దుర్మరణం చెందగా ఏకంగా రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. వరదల సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు వరద బాధితులకు సహాయ, పునరావాస వ్యయం, పరిహారం పంపిణీలో భారీ అవినీతికి పాల్పడింది. భోజనాలు, అగ్గిపెట్టెలు, మంచినీళ్ల సీసాలు తదితర వ్యయాన్ని భారీ ధరలతో అమాంతం పెంచేసింది.దీనిపై పూర్తి సాక్ష్యాధారాలతో ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. వామపక్ష పార్టీలు కూడా ఈ విషయంపై పూర్తి ఆధారాలతో ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘సాక్షి’ కథనంతో తమ అవినీతి బండారం బట్టబయలైందని ఆందోళన చెందిన చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. ఈ క్రమంలో దొంగదారిలో కక్ష సాధింపు చర్యలకు తెర తీసింది.కుట్రపూరితంగా ఎఫ్ఐఆర్ నమోదుపత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తగిన చర్యలు తీసుకునేందుకు మన చట్టంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. పత్రికలో ప్రచురితమైన కథనంపై అభ్యంతరం తెలుపుతూ ఖండన ఇవ్వవచ్చు. ఇంకా తమ పరువుకు భంగం వాటిల్లిందని భావిస్తే న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేయవచ్చు. దానిపై న్యాయస్థానం విచారించి తగిన తీర్పు వెలువరిస్తుంది. ఇదీ చట్టపరమైన విధానం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టపరమైన మార్గాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే న్యాయస్థానంలో కేసు వేస్తే.. సాక్షి పత్రిక పూర్తి ఆధారాలతో తన వాదనను వినిపిస్తుంది. అందుకే దొంగదెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. విజయవాడకు చెందిన గుడిపాటి లక్ష్మీనారాయణ అనే న్యాయవాదితో ‘సాక్షి’ కథనానికి వ్యతిరేకంగా పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఆ ఫిర్యాదును పోలీసులు స్వీకరించకూడదు. ఎందుకంటే ‘సాక్షి’ కథనంతో ఆ న్యాయవాదికి ఎలాంటి సంబంధం లేదు. ఆ న్యాయవాదిని ఉద్దేశించి ఆ కథనం రాయలేదు. ఆయన పరువుకు ఎక్కడా భంగం కలగలేదు. ఆ కథనంలో ప్రభుత్వ అవినీతి గురించే పేర్కొన్నారు. ఆ న్యాయవాది ప్రభుత్వ అధికార వ్యవస్థలో భాగం కూడా కాదు. అయినా సరే నిబంధనలకు విరుద్ధంగా ఆ న్యాయవాదితో ఫిర్యాదు చేయించారు. ఆయన ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు ఏకంగా ‘సాక్షి’కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మరింత విడ్డూరం. కేవలం చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అసమర్థ పరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా.. ‘సాక్షి’ని కట్టడి చేయాలన్న కుట్రతోనే ఈ అక్రమ కేసు బనాయించారన్నది సుస్పష్టం. ఇక తిరుపతిలోనూ ఇదే విధంగా ‘సాక్షి’పై ఫిర్యాదు చేయించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ‘సాక్షి’ మీడియా గ్రూప్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగటాన్ని యావత్ పాత్రికేయ రంగంతోపాటు మీడియా నిపుణులు తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.సుప్రీం ఆదేశాలు పట్టవా?‘ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు ఈ నెల 4వతేదీన ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వ అధికారుల్లో కుల సమీకరణాలను ఉద్దేశించి జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్ రాజ్’ శీర్షికన ఓ కథనం రాశారు. దీనిపై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 20న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ హృషికేశ్‌రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘జర్నలిస్టు రాసినవి కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయనే కారణంతో క్రిమినల్ కేసులు పెట్టవద్దు’ అని స్పష్టం చేసింది. జర్నలిస్టులపై దూకుడు చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఫిర్యాదు వచ్చిందే తడవుగా విజయవాడ పోలీసులు సాక్షి ఎడిటర్‌పై కేసు నమోదు చేసిన తీరుపై జర్నలిస్టులతో పాటు న్యాయవాదులు విస్తుపోతున్నారు. కుట్రతో కూడిన ఈ కేసుపై సుప్రీం కోర్టు వరకు వెళతామని ప్రకటించారు.చట్ట ప్రకారం కేసులు చెల్లవుఒక కథనం విషయంలో ఎడిటర్‌పై కేసు పెట్టడం అంటే భావ ప్రకటనా సేచ్ఛను ఆటంకం పరిచినట్టే. వాస్తవాలను బయట పెట్టకుండా బెదిరించే ప్రయత్నం ఇది. ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకోవచ్చు. పత్రికలు చాలా జవాబుదారీతనంతో నడుస్తాయి. అలాంటి పత్రికా ఎడిటర్‌పై కేసులు పెట్టడం అప్రజాస్వామికం. ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండాల్సింది. రాజకీయ ఒత్తిళ్లతో ఆ పని చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి కేసులు చట్ట ప్రకారం నిలబడవు. – సుప్రీం కోర్టు న్యాయవాదులుఅభ్యంతరాలుంటే ఖండన ఇవ్వాలిరాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదు. విపత్తుల సమయంలో ప్రభుత్వ పనితీరును తెలియచేసిన ‘సాక్షి’ ఎడిటర్‌పై పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అకాల వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల కష్టాలను, ప్రభుత్వ చర్యలను రిపోర్టు చేయడం మీడియా బాధ్యత. ఇటీవల విజయవాడ వరదల నేపథ్యంలో బాధితులకు అందిన సహాయంపై ‘సాక్షి’ అదే పని చేసింది. పత్రికలో ప్రచురించిన కథనంపై అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అందులో అసత్యాలు ఉన్నాయని భావిస్తే మొదట వాస్తవ గణాంకాలను చెబుతూ ఖండన ఇవ్వాలి. సాక్షి ఆ వివరణను ప్రచురించకపోతే న్యాయ స్థానాలను ఆశ్రయించాలి. అంతేగానీ పోలీసు కేసు పెట్టడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీయడమే. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసత్య కథనాలపై సంబంధిత శాఖ ఖండనను ప్రచురించకుంటే న్యాయస్థానానికి వెళ్లే వెసులుబాటును అధికార యంత్రాంగానికి కల్పిస్తూ జీవో తీసుకొచ్చారు. అప్పట్లో దీనిపై ప్రతిపక్షాలు నానా హంగామా చేశాయి. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పక్షాలు గొడవ చేశాయి. ఆనాడు జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో సరైందని అంగీకరించాకే ఇప్పుడు ముందుకు వెళ్లాలి. ఎవరైనా తప్పు వార్త రాస్తే ఖండించాలి. ఖండన ప్రచురించకుంటే పరువు నష్టం దావా వేసుకోవచ్చు. అంతేగానీ ఎవరో ఒకరి చేత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించి దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమాత్రం సరికాదు’ – దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, మన తెలంగాణ దినపత్రిక సంపాదకుడు కచ్చితంగా కక్ష సాధింపేమీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపులు సరికాదు. సాక్షిపై కేసు పెట్టడం అప్రజాస్వామికం. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు సాయం అందడం లేదన్న వాస్తవాన్ని రాసినందుకు సాక్షిపై కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకోవడం దారుణం. ప్రజా సమస్యలపై విస్తత కథనాల ద్వారా మీడియా తన బాధ్యతగా ప్రభుత్వం, సమాజం దృష్టికి తెస్తుంది. మీడియా ప్రచురించిన కథనాలపై ఎటువంటి అభ్యంతరం ఉన్నా సంబంధిత బాధ్యులు ఖండన ఇవ్వవచ్చు.అందుకు విరుద్ధంగా కేసులు పెట్టి బెదిరింపులతో మీడియాను కట్టడి చేయాలనే ప్రయత్నం ఏ మాత్రం వాంఛనీయం కాదు. చంద్రబాబు డైరెక్షన్లో ఒక లాయర్‌తో ఫిర్యాదు ఇప్పించి ఆగమేఘాలపై కేసు నమోదు చేయించడం కచ్చితంగా కక్ష సాధింపే. మీడియాపై పోలీసులను పురిగొల్పి బెదిరించే ధోరణిని కూటమి ప్రభుత్వం మార్చుకోవాలి. – మలసాని మనోహర్‌రెడ్డి,వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారని ‘సాక్షి’పై కేసు నమోదు చేయడం అత్యంత దారుణం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే. రోజురోజుకీ గతి తప్పి వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం ఓ నియంతలా మారుతోంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదల తర్వాత సహాయక పనుల్లో రూ.534 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలను అధికారులు స్వయంగా ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. అందులో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, భోజనాలు, నీళ్ల బాటిల్స్ కోసం ఖర్చు చేసినట్లు చూపిన మొత్తం.. ఆ గణాంకాలు వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దాన్ని ప్రస్తావిస్తూ, వాస్తవంగా అయ్యే ఖర్చును వివరిస్తూ.. వరద సహాయ పనుల్లో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ రాయడం తప్పా? నిజానికి అది మీడియా బాధ్యత. అదే పని ‘సాక్షి’ చేసింది. వరద సహాయక చర్యల్లో చోటు చేసుకున్న అంతులేని అవినీతిని ఎండగట్టింది. అందువల్ల ‘సాక్షి’పై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం మరింత దిగజారి ఏకంగా కేసు నమోదు చేయడం హేయమైన చర్య. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి సాక్షి ఛానల్ ప్రసారాలను అడ్డుకుంది. ఇప్పుడు పత్రికపైనా కత్తి కట్టారు. వెంటనే ‘సాక్షి’పై కేసును ఉపసంహరించుకోవాలి. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రిమీడియా స్వేచ్ఛను హరించడమే..వాస్తవాలను బయటపెడితే కూటమి ప్రభుత్వం సహించలేకపోతోంది. విజయవాడ వరదలకు సంబంధించి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి పత్రికలను టార్గెట్ చేస్తోంది. సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టడమంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. నిర్భయంగా, నిష్పాక్షికంగా వార్తలు రాసి వాస్తవాలు బయటపెట్టే విలేకరుల గొంతు నొక్కడమే. ఇది అత్యంత గర్హనీయం. దీనిపై మా అసోసియేషన్ తరఫున ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేస్తాం. ఇలా కేసులు పెట్టేవారిని ఏ ప్రభుత్వం ప్రోత్సహించకూడదు. బేషరతుగా కేసును ఉపసంహరించుకోవాలి. – వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ -
‘భూత్’ బంగ్లా సర్కార్!
దేశంలోని ప్రస్తుత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఫోర్–ఓ (4.0) వెర్షన్. పదిహేనేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్‌లైన్‌తో తిరిగారు. ఇంతటి అనుభవశాలి ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షో భానికి లోనవుతున్నవి. విజ్ఞత విలుప్తమైపోతున్నది. ఆయన జనంలోకి వెళితే ఈయన జ్వరపీడితుడవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది.విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సందర్భాన్నే తీసుకుందాము. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిల బడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి.మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు.ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవు తారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొల కెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తున్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. రెండున్నర మాసాల్లోనే ‘95 మోడల్’ చూపెట్టిన చిన్న ఝలక్ మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం. పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేట్ గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. అందుకే ‘రైతు భరోసా’ ఆగిపోయింది.‘విద్యా దీవెన’, ‘విద్యా కానుక’లు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్లాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసు కున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేదల బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఈ ’95 మోడల్ వచ్చీరాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్‌ను అటకెక్కించారు. ఇంగ్లిషు మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.పేదలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన ‘95 మోడల్’ భూతంగా పరిగణిస్తున్నది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకనూ దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్ చేయడం, దుష్ప్రచారానికి ఒడి గట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 1848లో కార్ల్ మార్క్స్ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ‘యూరోప్‌ను కమ్యూనిస్టు భూతం వెంటాడుతున్నది’ అనే వాక్యంతో ప్రారంభమైంది. కమ్యూనిస్టు భావజాలాన్ని భూతంగా భావించే నాటి పాలక ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికగా మార్క్స్ ఈ వాక్యాన్ని రాశారు.ఇప్పుడూ అంతే! ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బయ్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణ గారిన జీవితాలనూ, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట! దాన్నిప్పుడు ప్రైవేట్ పెట్టు బడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట! దయ్యాలు వేదాలు వల్లించడమంటే అచ్చంగా ఇదే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేస్తున్నారు.ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజ కీయమో, ఎవరిది దయ్యాలు – భూతాల రాజకీయమో తేల్చడా నికి ఇంకో చర్చ కూడా ఉన్నది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించినది కాదు. ఎమ్మెల్యేలను గెలిపించిందీ ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి, ఎమ్మెల్యేలను ‘వైస్రాయ్’లో నిర్బంధించి, మీడియాతో కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసు కుని దొడ్డిదారిన అధికార పీఠమెక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవలసి వచ్చింది. అయినా తలొగ్గ కుండా జనంలోకి వెళ్లారు. అలవికాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చినవారా? దొడ్డి దారిన ప్రవేశించిన వారా?ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నాలుగో దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు. కాళ్లావేళ్లా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో 68 శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత తీరిగ్గా నాలుగు రోజుల సమయం తీసుకొని 81 శాతం పోలైనట్టు ప్రకటించింది. ఇది అసాధార ణమని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ) అనే సంస్థ వాదిస్తున్నది. గతంలో ఎన్నడూ ఈ తేడా ఒక శాతం కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5 శాతంగా నమోదైంది. ఈవీ ఎమ్ల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కార ణమని వీఎఫ్‌డీ ఆరోపిస్తున్నది. ఎన్డీఏ మౌత్‌పీస్‌గా పనిచేసే ఓ జాతీయ చానల్ కూడా నిన్న ప్రసారం చేసిన ఒక సర్వే వివరాల్లో చంద్రబాబుకు 44 శాతం ప్రజల మద్దతున్నట్టు తేల్చింది. కూటమికి పడిన 56 శాతం ఓట్లలో ఇది 12 శాతం కోత. వీఎఫ్‌డీ చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్ సరిపోతున్నది.వీఎఫ్‌డీ ఈ వ్యవహారంపై ఒక సమగ్రమైన రిపోర్టును విడుదల చేసి, నెలరోజులు దాటినా ఇప్పటివరకూ ఎన్నికల సంఘం స్పందించలేదు. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కార ణంగా కేంద్రంలోనూ, ఏపీ, ఒడిషాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకూ, లెక్కించిన ఓట్లకూ కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలయినట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లలో దయ్యాలు, భూతాలు దూరితేనే సాధ్యమవుతుంది.ఆ దయ్యాలూ, భూతాలు ఎట్లా దూరాయన్న రహస్యం విజేతలకు మాత్రమే తెలుస్తుంది. వారికి అనుబంధంగా పని చేసిన ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు, అనుమానం ఉన్న నియో జకవర్గాల్లో 5 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతున్నది. ఈవీఎమ్‌లపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అను మానాలకు తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈ అంశంపై నోటికి తాళం వేసుకున్నది. కచ్చితంగా ఏదో జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎమ్‌ల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలూ, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీట్ పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగు తున్నాయి."మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్రబాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొలకెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తు న్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేక పోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి." – వర్ధెల్లి మురళి -
పౌర సమాజమా... పారాహుషార్!
అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్. జాగ్తే రహో!మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త!విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పాయిజనస్ గ్యాస్ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్ వెపన్స్ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్ కంట్రీస్ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్ రోగ్స్ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్ జగన్ ప్రభుత్వం.ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్‌కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్‌లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!జగన్ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్ విజిట్ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అనే నల్ల చట్టాన్ని జగన్ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్‌కు నాణ్యతా ప్రమాణాలేమిటి?విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్ పరమవుతుంది.ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.అందుకే జగన్ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! వర్దెల్లిమురళి -
ఇక పూటకో ప్యాకేజీ స్టార్!
ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ శిబిరం రూపొందించిన ఒక పాట బాగా పాపులరయింది. ‘జెండలు జతకట్టడమే మీ ఎజెండా... జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా’ అనే పల్లవితో పాట మొదలవుతుంది. ‘నల్లగొండ గద్దర్’గా పేరు గాంచిన నర్సిరెడ్డి గొంతుక ఈ పాటకు ప్రాణం పోసింది. వైసీపీ అభిమానులకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పెళ్లి వేడుక జరిగినా ఈ పాటకు స్టెప్స్ వేయడం ఓ కార్యక్రమంగా మారింది. నాలుగు పార్టీలను కూడగట్టి అతుకుల బొంత అలయెన్స్‌లను కుట్టుకోవడం తప్ప ప్రజా సంబంధమైన ఎజెండా ప్రతిపక్షాలకు లేనేలేదని ఈ పాట ఎద్దేవా చేస్తుంది. అదే సందర్భంలో ప్రజలకు అండదండగా నిలబడుతూ వారి ఆద రణను జగన్ చూరగొంటున్నారనేది ఈ పల్లవి భావన.ఈ అభిప్రాయాన్ని ప్రతిపక్ష శిబిరం కూడా నిర్ధారిస్తున్నది. తాడేపల్లిగూడెం సమీపాన మొన్న తెలుగుదేశం–జనసేన పార్టీలు ఉమ్మడిగా జరిపిన సభకు కూడా ‘జెండా’ అనే నామ కరణాన్నే కూటమి వారు ఎంపిక చేసుకున్నారు. ‘తెలుగు–జన విజయకేతన’ జెండా అనే పేరుతో వేదికను అలంకరించారు. ‘తెలుగు జన’ అనే రెండు పదాలు రెండు పార్టీ పేర్లకు గుర్తనేది కవి హృదయం. కేతనం అన్నా కూడా జెండా అనే అర్థం. మరి కేతన జెండా అంటే? నొక్కి చెప్పడం కావచ్చు. లేదా ఒకరిది కేతనం, ఒకరిది జెండా అని కావచ్చు. అర్థం ఏమైనప్పటికీ‘జెండాలు జతకట్టడమే మా ఎజెండా’ అని వారు కూడా నర్సిరెడ్డి పాటకు కోరస్ పాడినట్టు కనిపించింది. రెండు పార్టీల అగ్రనాయకులిద్దరూ ఒకరి జెండా కర్రను మరొకరు చేత పుచ్చుకొని అటూ ఇటూ ఊపుతూ కార్యక్రమాన్ని లయబద్ధం చేశారు. మూడో జెండాను కూడా ఊపడానికి చాలాకాలం ఎదురు చూశారు కానీ ఎందుకో బీజేపీ వాళ్లు కనికరించలేదు. సభలో ప్రజలు కూర్చోవడానికి కేటాయించిన పదిహేను ఎకరాల్లోకి ఆరు లక్షలమందిని సమీకరిద్దామని సంకల్పం చెప్పుకున్నారు. పదిహేను ఎకరాల్లో ఆరు లక్షల మంది ఎలా కూర్చుంటారని ప్రశ్నించవద్దు. అగస్త్య మహాముని సప్త సముద్రాలను పుక్కిట పట్టలేదా? అలాంటి విద్యనే ప్రదర్శించి వుండేవాళ్లం, కానీ ఆర్టీసీ సహకరించనందు వల్ల అంతమంది రాలేదని సర్ది చెప్పుకున్నారు. టార్గెట్‌లో పదోవంతు మందిని సమీకరించగలిగినందుకు యెల్లో మీడియా ఆ పార్టీలను అభినందనల్లో ముంచెత్తింది. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి పదోవంతు సీట్లు గెలిచినా కూడా యెల్లో మీడియా అభినందిస్తుందేమో చూడాలి. జనసమీకరణ దృష్ట్యా చూస్తే ‘సిద్ధం’ సభలు గోదావరి ప్రవాహాలైతే ‘తెలుగు జన’ సభ పిల్లవాగులా తోచింది. ఎన్ని పిల్లవాగులైతే ఒక గోదావరి కావాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్జన సామాన్యంలో వైసీపీ ప్రభావాన్ని గోదావరితో పోల్చితేఈ రెండు పార్టీలను పిల్లవాగుతో పోల్చాలి. ఇది నేటి యథార్థ దృశ్యం.ఈ దృశ్యాన్ని సరిగ్గా అంచనా వేయడానికి కష్టపడి సర్వేలు కూడా చేయనవసరం లేదు. రాష్ట్రంలో అక్కడక్కడా పర్యటిస్తూ జనంతో ముచ్చటిస్తే చాలు నాడి తెలిసిపోతున్నది. పేద వర్గాల ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం వెనుక సమీకృతమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ అయిదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వారి జీవితాలు స్పష్టమైన మార్పుకు లోనయ్యాయని ఈ ప్రాంత మేధావులు చెబుతున్నారు. ఈ మార్పు పట్ల మధ్య తరగతి మేధావి వర్గం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇటువంటి మార్పుకోసమే గదా... పేద ధనిక తేడా లేకుండా అందరికీ సమానావకాశాలు లభ్యం కావాలన్న ఆశ యంతోనే కదా... చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగిందీ, ఎన్నో విప్లవాలు చెలరేగిందీ! అటువంటి విప్లవం నిశ్శబ్దంగా ఇప్పుడు పేదవాడల్లోకి ప్రవేశిస్తున్నది. ఈ అద్భుతాన్ని కులమతాలకు అతీతంగా అభ్యుదయ కాముకులందరూ నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. ఇందుకు కారణమైన జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఒక డజన్‌కు పైగా స్వతంత్ర సర్వేలు బయటకు వచ్చాయి. వాళ్లంతా వైసీపీ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి శాంపిల్ సైజ్ పరిమితుల వల్ల జనంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న మద్దతును పూర్తిగా అంచనా వేయలేకపోతున్నామనే అభిప్రాయం సర్వే సంస్థల్లో పని చేసే వారిలోనే ఉన్నది. వైసీపీకి పురుష ఓటర్లలో ఉన్న ఆధిక్యత కంటే మహిళా ఓటర్లలో ఎక్కువ ఆధిక్యత కనిపిస్తున్నది. ఇది అన్ని సర్వేల్లో వ్యక్తమైంది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. కానీ సర్వే సంస్థల శాంపిల్స్‌లో చాలావరకు పురుష ఓటర్లే ఎక్కువగా ఉంటున్నారు. శాంపిల్స్ జనాభా ప్రాతిపదిక మీద, వర్గాల నిష్పత్తి ప్రకారం కచ్చితంగా లెక్కగట్టి తీసుకోగలిగితే వైసీపీకి ఉన్న ఆధిక్యతను సరిగ్గా అర్థం చేసు కోగలుగుతాము. ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ సంస్థ తరఫున సర్వే పర్యవేక్షణకు వచ్చిన ఒక కీలక వ్యక్తి అంచనా ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ, వైసీపీ ఓటు షేర్ 50 శాతానికి పైగానే ఉన్నది. వందకు పైగా నియోజక వర్గాల్లో 55 శాతంకంటే ఎక్కువ ఓటర్ల మద్దతు వైసీపీకి లభించే అవకాశం ఉన్నదని కూడా ఆయన చెప్పారు. మొత్తం 25 పార్లమెంట్ సీట్లూ వైసీపీకే దక్కుతాయనీ, అసెంబ్లీ సీట్లు కూడా గతం కంటే ఒక్కటి కూడా తగ్గబోదనీ ఆయన పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన కార్య క్రమాలను ప్రజలు సంపూర్ణంగా ఆమోదిస్తున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితేనే పేదవర్గాల నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని జనం నమ్ముతున్నారు కనుకనే క్షేత్ర స్థాయిలో వైసీపీ పటిష్ఠంగా ఉన్నది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జనంలో ఇటువంటి విశ్వాసాన్ని కలిగించలేకపోయారు. కిందటిసారి గెలిచినప్పుడు హామీలను అమలు చేయలేక మేనిఫెస్టోను మార్కెట్ నుంచి కనుమరుగు చేయడం కూడా ప్రజల మనోఫలకం నుంచి చెరిగిపోలేదు.రెండు ప్రభుత్వాలనూ జనం బేరీజు వేసుకుంటున్నారు. సహ జంగానే మార్కులు జగన్ ప్రభుత్వానికే పడుతున్నాయి. తమ జీవితాల్లో వెలుగులు పూయించి, బిడ్డల భవిష్యత్తు మీద కొండంత విశ్వాసాన్ని నింపుతున్న జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగాఎందుకు ఓటేయాలని జనసామాన్యం ప్రశ్నిస్తున్నారు. ఇదిగో ఈ సింపుల్ లాజిక్ వచ్చే ఎన్నికల్లో మరో సునామీని సృష్టించ బోతున్నది.జనం గుండెల్లో గుడి కట్టుకోవడానికి చంద్రబాబుకు అవకాశం లేదు. ఆయనకో జీవితకాలం ఆలస్యమైపోయింది. అందుకే జెండాలు జతకట్టుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం మీద అపోహలు సృష్టించడానికి, దుమ్మెత్తిపోయడానికి రక రకాల కుట్రలకు తెరతీస్తున్నారు. యెల్లో మీడియా ప్రాపగాండా సరిపోవడం లేదని సరికొత్త ప్యాకేజీ స్టార్లను ప్రయోగిస్తున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు కనిపించిన ప్రతి గడ్డిపోచ మీద కూడా ఆశ పెట్టుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి సరిగ్గా అదే! జగన్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి వివిధ టాస్క్‌లను తెలుగుదేశం డిజైన్ చేసింది. ఒక్కో టాస్క్‌కు ఒక్కో ప్యాకేజి స్టార్. వాళ్లందరికీ వెలకట్టాలి. ఎన్నికల్లో వెదజల్లాలి. అందుకు డబ్బు కావాలి. సొంత ముల్లెను విప్పడానికి ఇంట్లో వాళ్లు చస్తే ఒప్పుకోరు.అందుకని పెత్తందారీ మనస్తత్వం కలిగిన డబ్బున్న వారి మీద వలలు విసిరారు. బాబు గెలిస్తే ఇష్టారాజ్యంగా దండు కోవచ్చన్న కక్కుర్తితో చాలామంది రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ, అధిక వడ్డీల పేరుతో 650 కోట్లు సేకరించి ఎన్నికల గమ్యస్థానాలకు చేర్చారని వినిపించింది. గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తాడని భావిస్తున్న ఒకాయన 800 కోట్లను ఇప్పటికే సిద్ధం చేశాడట. వాటిని గమ్యస్థానాలకు చేర్చడమెట్లా అని మల్లగుల్లాలు పడు తున్నట్టు సమాచారం. ఇటువంటి పెత్తందార్లు గెలిస్తే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే! పవన్ కల్యాణ్‌కు వైసీపీ వాళ్లు ‘ప్యాకేజి స్టార్’ అనే టైటిల్‌ను తగిలించారు. ఈ మాట అన్నందుకు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఒక సభలోనైతే ఈ ఆరోపణపై పాదరక్షలను సంధించారు. కానీ ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు కని పిస్తున్నది. మొన్నటి తెలుగు – జనసభలోనైతే తనను తాను అవమానించుకొని, తన పార్టీనీ తానే అవమానించి చంద్ర బాబుకు జైకొట్టారు. ఈ విపరీత ప్రవర్తనకు జనసైనికులే విస్తుపోతున్నారు. తాను స్వతంత్రంగా నిలబడి తన పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా తెలుగుదేశంతో బేరమాడి ఉంటే పవన్ కల్యాణ్ తనపై పడ్డ మచ్చను తొలగించుకోగలిగి ఉండే వాడు. కానీ అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నాడు. ఇంకో సారి ఆరోపణలపై విరుచుకుపడే నైతిక బలాన్ని ఆయన కోల్పోయాడు. తెలంగాణ తన మెట్టినిల్లనీ, కర్మభూమనీ నమ్మబలికిన షర్మిల హఠాత్తుగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం వెనుక చక్రం తిప్పింది ఎవరు? డీకే శివకుమార్ ద్వారా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో రాయబారం నడిపిందెవరు? షర్మిల పర్యటనల కోసం విమాన సౌకర్యాల కల్పన వెనుకనున్న అజ్ఞాతవ్యక్తి ఎవరు? వైఎస్ జగన్ వ్యతిరేక శక్తులతో ఆమెకు సమన్వయాన్ని ఏర్పాటుచేసిన వారెవరు? ఆమె ఉపన్యాసాల్లో చెప్పవలసిన అంశాలను, జగన్‌పై చేయాల్సిన ఆరోపణలను అందిస్తున్నదెవరు? ఆమె సభలకు కమ్యూనిస్టు నాయకులను కూడా జతచేసి పంపిస్తున్న వారెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లాడికి కూడా తెలుసు! చంద్రబాబు విజయావకాశాలు రోజురోజుకూ కొడిగట్టి పోతున్న స్థితిలో ఇప్పుడు నర్రెడ్డి సునీత ముసుగును తొలగించారు. జగన్మోహన్రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తూ చంద్ర బాబు మహానుభావుడని ఆమె సర్టిఫికేట్ ఇచ్చేశారు. గతంలో తన తండ్రి హత్యకు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలే కారణ మని చెప్పిన సునీత ఇలా ‘చంద్ర’ముఖిలా ఎందుకు మారి పోయారు. తన తండ్రికి రెండో వివాహం ద్వారా కలిగిన కుమా రునికి ఆస్తిలో హక్కు దక్కకుండా చేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? వివేకా రక్తపు మడుగులో ఉన్న ఫోటోలను పీఏ కృష్ణారెడ్డి పంపించింది సునీత దంపతులకే గదా! అయినా గుండెపోటు థియరీని ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి ఎందుకు ప్రచారంలో పెట్టినట్టు? హత్య సమ యంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆమె భర్తకూ, ఆయన సోదరుడికీ సన్నిహితులన్న విషయం అందరికీ తెలుసు. అప్పుడు చూపుడు వేలు ఎటువైపు చూపెడుతుంది? హంతకులు వివేకాతో లేఖ రాయించిన విషయాన్నిగోప్యంగా ఉంచాలని సునీత ఎందుకు ఆదేశించినట్టు? హత్య తరువాత హంతకులు వివేకా రెండో భార్యకు రాసిన ఆస్తి పత్రాలను తస్కరించే అవకాశం ఎవరికి ఉన్నది? అసలు దోషులను రక్షించి పరులపై నింద వేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? వారి అవసరంతో రాజకీయ ప్రయోజనం ముడిపడి ఉన్న పెద్దమనిషి ఎవరు? ఇప్పుడు సునీతను ‘చంద్ర’ ముఖిగా మార్చి చిలక పలుకులు చెప్పిస్తున్న నాయకుడెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటీవల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఆరోపణలు చేసి ప్రభు త్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరించిన హనుమ విహారి వెనుక కూడా ప్యాకేజీ ట్రాప్ ఉన్నదనే విషయం వెలుగులోకి వస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకెంతమంది ప్యాకేజీ స్టార్స్ రంగంలోకి వస్తారో చూడాలి. ప్యాకేజీ దండగే తప్ప ఇటువంటి ప్రయోగాలకు విలువ ఉంటుందా? పండగ లప్పుడు వచ్చిపోయే పిట్టల దొరల ప్రగల్భాలకు జనం నవ్వు కుంటారు తప్ప సీరియస్‌గా తీసుకుంటారా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మహిళాశక్తిపై మారీచ యుద్ధం!
పవన్ కల్యాణ్ అమ్ముల పొదిలో అన్నీ పచ్చబాణాలే ఉంటా యన్న నిజం ఎప్పటికప్పుడు నిగ్గుదేలుతూనే వస్తున్నది. ఇటీవల ఆయన వదిలిన ఒక పచ్చబాణం మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది. ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంత నిబద్ధత లేనప్పుడు, స్వార్థ ప్రయోజనాలే ఆ పార్టీ కార్యక్రమంగా ఉన్నప్పుడు... మాయోపాయాలతో కూడిన వ్యూహాలనూ,ఎత్తుగడలనూ ఆశ్రయిస్తుంది. అటువంటి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. తాను అధికారంలోకి రావడానికి కారణమైన ఎన్నికల మ్యానిఫెస్టోను మాయం చేసి, వెబ్సైట్లోంచి కూడా తొలగించిన ఏకైక పార్టీ తెలుగుదేశం. పార్టీ అధ్యక్షుడు తన సిద్ధాంతగ్రంథంగా వెలువరించిన ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని కూడా మార్కెట్లో ఎక్కడా లభ్యం కాకుండా మాయం చేసిన ఘనత ఆ పార్టీదే. ఇటువంటి ఘనత ప్రపంచంలో మరో పార్టీకి లేదు. స్వార్థ ప్రయోజనాలకూ, సిద్ధాంత నిబద్ధతకూ చుక్కెదురు. తన ఆశయ గ్రంథాన్నీ, ఎన్నికల హామీలనూ జనంలో లేకుండా దాచేయడం సిద్ధాంత నిబద్ధత లేదనడానికి నిదర్శనం. స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పటికెయ్యది ప్రయోజనమో అప్పటికా జెండా ఎత్తడాన్ని ఆ పార్టీ ఒక వ్యూహంగా అనుసరిస్తూ వస్తు న్నది. ప్రత్యర్థి పార్టీ ఒక భావజాల నిబద్ధతతో ఉన్నప్పుడు, తాను ప్రకటించిన కార్యక్రమాలను వరుసగా అమలు చేస్తున్న ప్పుడు, తన మ్యానిఫెస్టోకు పటం కట్టి, ఇంటింటికీ వెళ్లి మీరే మార్కులేయండని అడుగుతున్నప్పుడు... ఈ పారదర్శకతను ఎదుర్కోవడం, ఈ నిబద్ధతతో తలపడటం స్వార్థపక్షానికి సాధ్య మవుతుందా? కాదు కనుకనే వైసీపీపై మారీచ యుద్ధ వ్యూహాన్ని టీడీపీ ఎంచుకున్నది. వైసీపీ అమలు చేస్తున్న పేదల అనుకూల కార్యక్రమాలన్నింటిపైనా దుష్ప్రచారం చేయడమే ఎజెండాగా అది తలకెత్తుకున్నది. ఇందులో ఎల్లో మీడియా, రాజకీయ భాగ స్వామిగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్ పార్టీ తమకు తాము నిర్దేశించిన పాత్రలను పోషిస్తున్నాయి. పేదల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఒక్క పైసా వృధా కాకుండా ఇప్పటికి రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేసింది. ఈ కార్యక్రమం వల్ల ఏపీ మరో శ్రీలంక కాబోతున్నదని వీరు చేసిన ప్రచారం సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ కార్యక్రమం రాష్ట్రాన్ని మాంద్యంలోకి జారకుండా కాపాడిందనీ, జీఎస్డీపీ వృద్ధికి దోహదపడిందనీ ఆర్థికవేత్తలు పలువురు ప్రశంసించడంతో వారి గొంతులో వెలక్కాయ పడింది. నగదు బదిలీ అంశాన్ని వదిలిపెట్టి అడ్డ గోలు అప్పులు చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం తప్పని మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విడుదల చేసిన రాష్ట్రాల వారీ అప్పుల జాబితా రుజువు చేసింది. పేద పిల్లల ఇంగ్లీషు మీడియం చదువుపై చేసిన దుష్ప్ర చారం కూడా ఈ కోవలోదే. భాషాభిమానులను రెచ్చగొట్టడానికి చేతనైనంత ప్రయత్నం చేశారు. నిన్న మొన్నటి దాకా రాజ్యాంగ పదవులు నిర్వహించిన ఒకరిద్దరి సేవలను కూడా ఇందుకు ఉపయోగించుకున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే నగరం మైలపడిపోతుందని కోర్టుకెక్కారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి కాలనీలు ఏర్పాటు చేస్తుంటే చేసిన తప్పుడు ప్రచారం కూడా అప్పుడే మరిచిపోయేది కాదు. ఇటువంటి ఉదాహరణలు కొన్ని వందలు ఇవ్వొచ్చు. జగన్ ప్రభుత్వం మహిళా సాధికారత కార్య క్రమం కూడా ఇప్పుడు వీటి సరసన చేరింది. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్య కార్యక్రమాల్లో మహిళా సాధికా రత ఒకటి. చంద్రబాబు – పవన్ – ఎల్లో మీడియా కూటమికి సిద్ధాంత నిబద్ధత లేకపోవడంతో పాటు ప్రత్యేకంగా మహిళా సాధికారత పట్ల వ్యతిరేకత, మహిళల పట్ల వివక్ష వారి స్వభావా ల్లోనే ఉన్నది. బహిరంగంగా వారు మాట్లాడిన మాటల ద్వారానే ఈ సంగతిని గ్రహించవచ్చు. వీరి మహిళా వ్యతిరేక వైఖరిని ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ఎండగట్టిన విషయం తెలిసిందే. ఇటువంటి మనస్తత్వమున్న వ్యక్తులు మహిళా సాధికారతను ఎలా సహిస్తారు? అలాగని ఆ భావనను బహిరంగంగా వ్యతిరేకించలేరు. అందుకని దుష్ప్రచా రాలతో చేసే పరోక్ష దాడినే ఎంచుకున్నారు. ఈ దాడిలో తొలి బాణాన్ని వేసే బాధ్యతను పవన్ కల్యాణ్‌కు అప్పగించారు చంద్రబాబు. గోదావరి జిల్లాల పర్యటనలో పవన్ కల్యాణ్ ఈ దాడులకు దిగారు. పవన్ ప్రసంగంలోని రెండు అంశాలను మహిళా సాధికారతపై పరోక్షంగా జరిగిన దాడిగా విశ్లేషకులు పరిగణి స్తారు. మొదటి అంశం – ‘ఉమన్ ట్రాఫికింగ్’. రాష్ట్రం నుంచి మూడేళ్లలో 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందనీ, ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నదనీ పవన్ ఆరోపించారు. రెండో అంశం – ‘వలంటీర్ వ్యవస్థ’. ఒంటరి మహిళలు, వితంతువులు, నిస్సహాయుల వివ రాలు సేకరించి వలంటీర్లు సంఘవిద్రోహ శక్తులకు అప్పగించారనీ, అందువల్లనే ఇన్ని వేలమంది అక్రమ రవాణా సాధ్య మైందనీ ఆయన ఆరోపణ. ఈ వలంటీర్లలో 55 శాతం మంది మహిళలే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. మహిళా సాధికారత కార్యక్రమాలు ఒక ఉద్యమంగా సాగుతున్న తరు ణంలో ఈ తరహా వ్యాఖ్యలు కచ్చితంగా బురద జల్లడానికీ, పక్కదోవ పట్టించడానికీ ఉద్దేశించినవేననే అభిప్రాయం కలుగు తున్నది. మహిళా సాధికారత అంటే ఏమిటో అర్థమైతే ఈ తరహా దాడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతుంది. మహిళా సాధికారత అనే అంశానికి చాలామంది చాలా రకాలుగా నిర్వచ నాలు చెప్పారు. వాటన్నింటినీ క్రోడీకరిస్తే తేలే విషయం ఒక్కటే. ‘సమస్త జీవన రంగాల్లో భాగస్వామిగా ఉండగలిగే స్వేచ్ఛ – అందలాలను అందుకోవడానికి, వనరులను వినియో గించుకోవడానికి, నిర్ణయాధికార స్వాతంత్య్రానికి సంబంధించి సమాన అవకాశాలు – సాంఘిక కట్టుబాట్లు, వివక్ష లేకుండా తన జీవితంపై తాను సంపూర్ణ హక్కులు కలిగి ఉండటం.’ ఇటు వంటి పరిస్థితులన్నీ ఒనగూడితేనే మహిళా సాధికారత సిద్ధించిందని భావించవలసి ఉంటుంది. ఇటువంటి వ్యవస్థ సాధ్యమవు తుందా అనేది పితృస్వామిక వ్యవస్థల్లో తలెత్తే మొదటి ప్రశ్న. గడచిన కొన్ని దశాబ్దాల పరిణామాలను, కొన్ని పశ్చిమ దేశాలు సాధించిన గణనీయమైన పురోగతిని పరిశీలిస్తే ఇది అసాధ్య మైన విషయం కాదని బోధపడుతుంది. కాకపోతే, ఇందుకు ప్రభుత్వాలు, వ్యవస్థలు, సంస్థలు ఈ దిశలో పట్టుదలగా పని చేయవలసి ఉంటుంది. మహిళా సాధికారతకు దోహదపడే అంశాలేమిటి? అందుకు అడ్డుపడే అంశాలేమిటి? స్థూలంగా ఒక ఐదు అంశాలు సాధికారతకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. 1. సాధికారతకు ‘విద్య’ తొలి మెట్టు. తమ జీవిత లక్ష్యాలను ఎంచు కోవడానికి, చేరుకోవడానికి, అందుకు సంబంధించిన నిర్ణ యాలను స్వయంగా తెలివిడితో తీసుకోవడానికి, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా మెలగడానికి విద్య దోహదపడుతుంది. 2. రెండో మెట్టు – ‘ఆర్థిక స్వాతంత్య్రం’. ఉత్పాదక రంగంలో స్త్రీల ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తిలో పెరగాలి. ఆర్థిక వనరులు వారికి కూడా అందుబాటులో ఉండాలి. నిర్ణయాధికార స్థానాల్లో వారికి సమాన అవకాశాలు ఉండాలి. 3. ‘ఆరోగ్యం–సంక్షేమం’ మూడో ముఖ్యాంశం. వైద్య–ఆరోగ్య అవకాశాలు అందు బాటులో ఉండటం. వివక్షకు, హింసకు దూరంగా ఉండటం. 4. ‘రాజకీయ ప్రాతినిధ్యం’ నాలుగోది. వివిధ స్థాయిల్లో వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. వారి జీవితాలపై ప్రభావం చూపే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాలి. 5. సాంఘిక కట్టుబాట్లు ఐదో అంశం. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలి మారకుండా అవరోధంగా ఉండే శృంఖలాలను తెంచుకుంటూ లింగ వివక్షను తొలగించడం. ఈ ఐదు అంశాల్లో పురోగతి సాధిస్తే సూత్రప్రాయంగా మహిళా సాధికారత సాధించినట్టే! ఈ ఐదు అంశాలకూ విరు ద్ధంగా పనిచేస్తే అవే సాధికారతకు ఆటంకాలుగా మారుతాయి. మహిళా సాధికారతలో ప్రభుత్వాల చిత్తశుద్ధి, కృషి ముఖ్యం. ఈ పదాన్ని ఉపయోగించకపోయినా భారత రాజ్యాంగంలో ఇదే తరహా కర్తవ్యబోధ ఉన్నది. రాజ్యాంగ పీఠికల్లోనూ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో వివక్షలేని మహిళా భ్యున్నతికి సంబంధించిన అధికరణాలున్నాయి. పేదరికం, పెరుగుతున్న అసమానతలు, పర్యావరణ ముప్పు అనే మూడు భూతాలు మొత్తం భూగోళానికే ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచ రాజ్యాలన్నీ 2015లో సమావేశమై మెరుగైన ప్రపంచం కోసం 17 లక్ష్యాలను ఏర్పర చుకున్నాయి. ఈ లక్ష్యాలను 2030లోగా సాధించాలన్న గడు వును కూడా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాల్లో ఐదవది మహిళా సాధికారత. తీర్మానమైతే చేసుకున్నారు కానీ, చాలా దేశాల్లో సంకల్పం కొరవడినట్టు కనిపిస్తున్నది. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించిన స్పృహే ఉన్నట్టు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణాలు – రాజకీయ నేతలు స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకోవడం! పేదరికం నుంచి ప్రజ లను బయటకు తీసుకురావడంపై, అసమానతల తొలగింపుపై వారికి అవసరమైన సామాజిక దృక్పథం లేకపోవడం! ఈ ధోరణికి ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్లుగా సాగుతున్న వైఎస్ జగన్ పరిపాలన భిన్నమైనది. అంబేడ్కర్ రాజ్యాంగ ఆశయాలను జగన్ ప్రభుత్వం ఔదలదాల్చింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గీటురాళ్లుగా పెట్టు కున్నది. ఇందుకు మనం అనేక ఉదాహరణలు ఉటంకించవచ్చు. పేదరికం నుంచి విముక్తి, అసమానతల నిర్మూలన కోసం పెద్ద ఎత్తున ఉద్యమస్థాయి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఇదిగో ఈ ఉద్యమంపైనే చంద్రబాబు – ఎల్లో మీడియా – పవన్ కల్యాణ్ టీమ్ బురదజల్లింది. ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారు తుందని శాపనార్థాలు పెట్టింది కూడా దీనిపైనే. మహిళా సాధికా రత విషయంలోనూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని పనిచేస్తున్నది. మహిళా సాధికారతకు దోహదపడే అంశాలను అధ్యయనం చేసి అందుకు అనుగుణమైన చర్యలను తీసుకున్నది. నాణ్యమైన విద్యావకాశాలను అందరికీ అందు బాటులో తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు చదువులకు దూరం కాకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతే అమ్మాయిలకు పెళ్లి కానుక (కల్యాణమస్తు, షాదీ తోఫా) వర్తిస్తుందనే నియమం వెనుక బాల్య వివాహాలను నిరోధించడంతోపాటు కనీసం ఇంటర్మీడి యట్ పూర్తయ్యే వరకైనా బాలికలు డ్రాపవుట్లుగా మిగలకుండా ఉంటారనే ఆశాభావం కూడా ఉన్నది. ఈ నిబంధనను కూడా విమర్శించి తన సామాజిక స్పృహ స్థాయేమిటో ప్రతి పక్షం వెల్లడించింది. ఈ నాలుగేళ్ల చర్యల ఫలితంగాæ పాఠశాలల్లో బాలికల సంఖ్య పెరిగింది. అమ్మ ఒడి కూడా అందుకు దోహదపడింది. ఇప్పుడు పాఠశాలల్లో బాలికల సంఖ్య సుమారు 48 శాతానికి చేరుకున్నది. డ్రాపౌట్ల సంఖ్య స్థిరంగా తగ్గుతున్నది. ఆర్థిక రంగంలో మహిళల పురోభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘చేయూత’ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో పదహారున్నర లక్షల మంది మహిళలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడమో, పాత వ్యాపారాలను వృద్ధి చేసుకోవడమో జరిగింది. చంద్రబాబు నమ్మకద్రోహంతో నిస్తేజ మైన పొదుపు సంఘాలను ‘ఆసరా’ పథకం ఆదుకున్నది. పునరుజ్జీవం పొందిన పొదుపు సంఘాలకు ఈ నాలుగేళ్లలో బ్యాంకులు ఒక లక్షా పదహారు వేల కోట్ల రుణాలను అంద జేశాయి. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పొదుపు సంఘాలు క్రియాశీల పాత్రను పోషిస్తున్నాయి. 30 లక్షలమంది మహిళలకు ఇళ్ల పట్టాలు లభించి, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రభుత్వ పథకాల ప్రధాన లబ్ధిదారులుగా మహిళలే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది. బాబు కేబినెట్లో ఇద్దరు మహిళలుంటే ఇప్పుడు నలుగురున్నారు. గతం కంటే ముఖ్యమైన శాఖలను వారు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, సర్పంచ్‌లు, మండలాధ్యక్షులు, జడ్పి చైర్మన్ పదవుల్లో 55 శాతం మంది మహిళలే. 50 శాతం నామినేటెడ్ పదవులను వారికి రిజర్వ్ చేశారు. గ్రామ సచివాలయాల్లో 1,38,026 మందిని నియమిస్తే అందులో 77,935 మంది మహిళలు. వలంటీర్లలో 55 శాతం మంది మహిళలు. ఆరోగ్య శాఖలో చేసిన 48 వేల నియామకాల్లో అత్యధికులు మహిళలు. ఈ సంవత్సరం డిగ్రీ పూర్తిచేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పొందిన లక్షా ముప్ఫయ్‌వేల మందిలో 60 శాతం అమ్మాయిలు. మహిళా సాధికారత దిశలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన కలిగిన ఫలితాల్లో ఇవి కొన్ని మాత్రమే! గర్భిణీలు, బాలింతల దగ్గర నుంచి మహిళల ఆరోగ్య పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వేధింపులకు విరుగుడుగా తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ సూపర్ హిట్టయ్యింది. ఈ విజయాలను పక్కదారి పట్టించడానికే వ్యూహం ప్రకారం మహిళల అక్రమ రవాణా అంశాన్ని పవన్ కల్యాణ్ తెరపైకి తెచ్చారని అభిప్రాయం కలుగుతున్నది. ఎందుకంటే పవన్ చెప్పినట్టు ఈ మూడేళ్లలో 30 వేలమంది మహిళల అక్రమ రవాణా జరగలేదు. కేంద్రం పార్లమెంట్‌కు సమర్పించిన నివే దిక, రాష్ట్ర పోలీసు అధికారుల వివరణ ప్రకారం ఈ మూడేళ్లలో 26,099 మంది ‘అదృశ్య’మయ్యారు. వీటిని మిస్సింగ్ కేసులు అంటారు. ట్రాఫికింగ్ అనరు. ఈ మొత్తంలో 2019కి ముందు అదృశ్యమై అప్పటికి ఆచూకీ లభించని వారి సంఖ్య కూడా కలిసి ఉన్నది. ఈ అదృశ్యమైన వారిలో 23,394 మందిని గుర్తించి, తిరిగి ఇంటికి చేర్చడం కూడా జరిగింది. ఇక మిగిలింది 2705 మంది. ఇది 2021 డిసెంబర్ 31 నాటి లెక్క. ఆ తర్వాత ఇందులో మరెంతమంది ఇల్లు చేరారనే అంశంపై పోలీసు శాఖ ఆ యా కేసులను పరిశీలించవలసి ఉన్నది. కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉన్నది. కానీ, పవన్ తీసిన రాగం, దానికి యెల్లో మీడియా, చంద్రబాబు చేసిన రాద్ధాంతం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే వేలాది మంది అదృశ్యమయ్యారనే అపోహ కలుగుతుంది. ఈ అపోహ కలిగించడమే వారి లక్ష్యం. వందలు, వేలు కాదు. పదిమంది అదృశ్యమైనా, ఒక్కరు అక్రమంగా రవాణా అయినా ఆందోళన చెందవలసిన విష యమే. సిగ్గుపడవలసిన సంగతే! ఈ పరిస్థితులకు కారణాలే మిటి? పేదరికం, అవిద్య, నిస్సహాయత – ఇటువంటివన్నీ కారణాలవుతాయి. మహిళా సాధికారత ద్వారానే వీటిని జయించగలుగుతారు. ఆ దిశలో పనిచేస్తున్న జగన్ ప్రభుత్వ విజయా లను మరపించేందుకే ట్రాఫికింగ్‌ను ముందుకు తెచ్చారనే వాదనకు బలం చేకూరుతున్నది. సాధికారతకు దోహదపడే అంశాలను బలపరచకపోగా అడ్డంకిగా ఉండే సాంఘిక రుగ్మత లను మాత్రం తెలుగుదేశం కూటమి ఎగదోస్తున్నది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ అంటూ చంద్ర బాబు చేసే ప్రచారం ఈ రుగ్మతలకు ఆజ్యం పోసేదే! పైగా ఈ ముఠాలోని ముఖ్యనేతలంతా గతంలో మాట్లాడిన మాటలూ, చేసిన చేష్టలూ మహిళను సాటి మనిషిగా కాక, ఆట వస్తువుగా పరిగణించే దృక్పథానికి ప్రతీకలు. ఇటువంటి శక్తులు మహిళా సాధికారతను సహిస్తాయా? చస్తే సహించవు. లక్షన్నరమంది మహిళలు ఒక్కసారిగా వలంటీర్లుగా సేవారంగంలోకి అడుగు పెట్టి క్రియాశీలంగా వ్యవహరిస్తుంటే తట్టుకోలేని ప్రబుద్ధుడు వారిపై నిందలు మోపడం ఈ అసహనానికి పరాకాష్ఠ! వర్ధెళ్లి మురళి, Vardhelli959@gmail.com -
విశ్వసనీయతే ‘సాక్షి’ పునాది..
సాక్షి, హైదరాబాద్: నాణేనికి మరో కోణాన్ని చూపించి, ‘సత్యమేవ జయతే’ నానుడిని సాకారం చేయాలనే లక్ష్యంతో విశ్వసనీయత పునాదిగా పుట్టిన ‘సాక్షి’.. అదే బాటలో తన ప్రస్థానం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో సాక్షి దినపత్రిక 15వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా భారతీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతాన్ని విశ్లేషించుకోవడానికి, భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి వార్షి కోత్సవాలు వేదిక కావాలన్నారు. కచ్చితత్వంతో కూడిన సమాచారం ఆధారంగా కథనాలు అందించేటప్పుడు తప్పనిసరిగా అవతలి వ్యక్తుల వివరణ తీసుకోవడం వంటి స్వచ్ఛతతో కూడిన పాత్రికేయ ప్రమాణాలు పాటించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకంజ వేయనవసరం లేదన్నారు. పాఠకులకు సులభంగా చేరేలా, జనహితంగా కథనాలు సాగాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ వర్ధెల్లి మురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, సీఈఓ అనురాగ్ అగర్వాల్, డైరెక్టర్లు రాణిరెడ్డి, వైఈపీ రెడ్డి, కేఆర్పీ రెడ్డి, ఏఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేన్సర్ బాధిత చిన్నారులతో.. ‘సాక్షి’ వార్షిక వేడుకల్లో భాగంగా వై.ఎస్.భారతీరెడ్డి కేన్సర్ బాధిత చిన్నారులను కలసి ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ బాధలను మరచిపోయిన చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్ ద్వారా కేన్సర్‌కు ఉచితంగా చికిత్స పొందుతున్న చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ట్రెజర్ హంట్ – ఎంపవర్మెంట్!
ఆశయాల నడుమ సంఘర్షణ సహజం. సిద్ధాంతాల నడుమ వైరుద్ధ్యాలు సహజం. ఈ వైరుద్ధ్యాల్లోంచే, సంఘర్షణలోంచే సత్యం ప్రభవిస్తుందని నమ్ముతారు. అందుకే వికాస ప్రియులందరూ భిన్న ఆశయాలను స్వాగతిస్తారు. విభిన్నమైన ఆలోచనల స్వేచ్ఛా ప్రసా రానికి కిటికీలు తెరుస్తారు. జగమెరిగిన మావో జెడాంగ్ సుభాషితాన్ని కూడా మరోసారి ప్రస్తావించవచ్చు. నూరు పువ్వులు వికసించాలి, వెయ్యి భావాలు పోటీ పడాలన్నారు మావో. ఈ భావ సంఘర్షణ కాలక్రమంలో రకరకాల పరిణామాలకు లోనై ఉండవచ్చు. ఎన్నెన్నో సరికొత్త ఛాయలను ఆవిష్కరించి ఉండవచ్చు. నేటి ఆంధ్రప్రదేశ్‌లో అది కొందరి ఆశలకు, కోట్లాదిమంది ఆకాంక్ష లకు మధ్యన ఏర్పడిన ఘర్షణగా మారింది. ఇక్కడ ప్రధాన రాజకీయ భూమికగా మారిన ఇతివృత్తం కూడా ఇదే. కొందరి ఆశ – ట్రెజర్ హంట్ అనే మృగయా వినోదం. కోట్లమంది ఆకాంక్ష –ఎంపవర్మెంట్తో సమకూరే ఆత్మగౌరవం. ఈ ట్రెజర్ హంట్ (నిధుల వేట) అనేది ఎంత అమాన వీయమైనదో, ఎంత నేరపూరితమైనదో, ఎంత క్రూరముఖీ నమైనదో మనకు తెలియని విషయం కాదు. ‘మెకన్నాస్ గోల్డ్’ నుంచి ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ వరకు ఎన్నెన్నో సినిమాలు ఆ కర్కశ స్వభావాన్ని మనకు తెరపరిచాయి. నవలల్లో, కథల్లో కూడా చదివి వుండవచ్చు. విని ఉండవచ్చు. ఇక్కడున్న ట్రెజర్ హంట్ ముఠా కార్యస్థానం రాజకీయం కనుక, ప్రజల ఓట్లతోనే పబ్బం గడుస్తుంది కనుక దూసే కత్తులు మెత్తగా, పువ్వుల గుత్తుల్లా ఉంటాయి. మోముల్లో క్రౌర్యానికి బదులు మోసపూరితమైన నవ్వులుంటాయి. కానీ స్వభావం నేరపూరితమే. లక్ష్యం స్వార్థమే. అప్పుడప్పుడూ ఈ వ్యాఘ్రం తగిలించుకున్న గోముఖం ముఖోటా జారిపోతూనే ఉంటుంది. కప్పుకున్న మేక తోలు చెదిరిపోతూనే ఉంటుంది. సాధికారత కోరుకుంటున్న బలహీన వర్గాలపై ఛీత్కారాలు బహిరంగమవుతూనే ఉంటాయి. ఈ చర్చలో ముఖోటాలకూ, ముసుగులకూ తావు లేదు. ఆ ట్రెజర్ హంట్ ముఠా తెలుగుదేశం పార్టీ, దాని అనుంగు ఎల్లో కూటమే. ఇది ఆరోపణ కాదు. విభజిత రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉండగా ఆ పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాలు, ప్రతిపక్షంగా ఈ మూడున్నరేళ్లలో చేపట్టిన కార్యక్రమాల విశ్లేషణ అనంతరమే ఈ నిర్ధారణ. తెలుగుదేశం పార్టీ తీసుకున్న విధానాలు, కార్యక్రమాలు తెలిసినవే కనుక సొంతంగా విశ్లేషించడానికి ఎవరైనా పూనుకోవచ్చు. సత్యాన్ని నిర్ధారించుకోవచ్చు. పరంపరగా వస్తున్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అరకొరగా అమలు చేయడం తప్ప పేదవర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. రాజధాని పేరుతో అమరావతి పలవరింత, కమీషన్ల కోసం పోలవరాన్ని పట్టాలు తప్పించడం మినహా మరో మహత్కార్యం తెలుగుదేశం పార్టీ ఖాతాలో లేదు. ఈ రెండూ ట్రెజర్ హంట్‌లో భాగం కావడమే అవి చేసుకున్న మహద్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్ర నిధులతో కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలి. కేంద్రమే నిర్మిస్తే తమకు కమీషన్లు ముట్టవు కదా అనే దుగ్ధ తెలుగుదేశం అధినేతలకు ఏర్పడింది. అప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వాములుగా ఉన్నారు కనుక ఆ పలుకుబడిని వాడుకొని నిర్మాణ కార్యక్రమాన్ని తామే చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టారు. తమ పార్టీ ఎంపీ కంపెనీకి పనులు అప్పగించారు. ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదని తెలిసినా కమీషన్ల కక్కుర్తితో లక్ష్యపెట్టలేదు. చేతగాని సంస్థ బిల్లులెత్తుకోవడమే తప్ప పనులు చేయకుండా కాలయాపన చేసింది. పుణ్యకాలం గడిచిపోతున్న నేపథ్యంలో పట్టిసీమ పేరుతో ఎత్తిపోతల పథకాన్ని రంగంలోకి తెచ్చారు. పోలవరానికి దిగువ నుంచి నీళ్లు ఎత్తి ప్రధాన ప్రాజెక్టు కుడి కాల్వలో పోసే పథకం. ఈ పోలవరం కుడి కాలువ 90 శాతం రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తయింది. పోలవరం పూర్తయితే ఈ ఎత్తిపోతల ఆరో వేలు అవుతుంది. అయినా 1900 కోట్లు దీని మీద తగలేయడమంటే, సదరు ఔదార్యం వెనుకనున్న మతలబు కమీషన్లేనన్న విషయం సామాన్యుడికి కూడా అర్థమైంది. అలాగే ఎడమ కాలువ గట్టుమీద 1900 కోట్లతో పురుషో త్తమపట్నం ఎత్తిపోతలను తలకెత్తుకున్నారు. ఈ 3800 కోట్లు ప్రధాన ప్రాజెక్టుపై ఖర్చు చేసి ఉంటే కథ వేరుగా ఉండేది. ప్రధాన ప్రాజెక్టులో ఇంకో ఘనకార్యముంది. కాలూ చెయ్యి కదిలించలేకపోయిన సొంత పార్టీ కాంట్రాక్టర్‌ను తప్పించి మరో అస్మదీయ సంస్థను రంగంలోకి దించారు. ప్రాజెక్టుల ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన డ్యామ్ కట్టే ప్రదేశానికి ఎగువన... దిగువన మట్టి కట్టలు (కాఫర్ డ్యామ్) కట్టి, స్పిల్‌వే, స్పిల్ ఛానల్ గుండా ప్రవాహాన్ని మళ్లించిన తర్వాతనే ప్రధాన డ్యామ్‌కు పునాది వేయాలి. ఈ పునాదినే డయాఫ్రమ్ వాల్ అంటారు. మట్టి కట్టలు కడితే కమీషన్లేం గిట్టు బాటవుతాయి. అందుకని ఎగువ కాఫర్ డ్యామ్‌ను కొంత మేరకు కట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. 2019లో వరదలు వచ్చి నప్పుడు మట్టి కట్ట గ్యాప్లోంచే మొత్తం ప్రవాహం వెళ్లాల్సి రావడంతో ఉరవడి పెరిగి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. దాంతో కథ మొదటికి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పిల్‌వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసినప్పటికీ డయాఫ్రమ్ వాల్ సంగతి తేలవలసి ఉన్నది. ‘చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద’ అనే సామెత తెలుగుదేశం పార్టీ వ్యవహారానికి అతికినట్టు సరిపోతుంది. ట్రెజర్ హంట్ వ్యామోహంలో పడి ప్రాజెక్టు పనిని కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మార్చిపారేసింది. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం మొన్న ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను ఎల్లో మీడియా కవర్ చేసిన తీరును చూస్తే చాలు, ట్రెజర్ హంట్ ముఠా అమరావతి విషయంలో ఎంత ఆకలితో ఉన్నదో, ఎంత ఆత్రంతో ఉన్నదో అర్థమవుతుంది. అమరా వతే రాజధానిగా కేంద్రం అఫిడవిట్లో పేర్కొన్నట్టు, రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదని తేల్చినట్టు పత్రికల్లో, ఛానళ్లలో పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు. కేంద్రం ఆ మాట ఎక్కడా అనలేదు. అందులో కేంద్రం ప్రస్తావించిన అంశాలు ఇవి. 1. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, సెక్షన్ 5 ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజ ధానిగా ఉంటుంది. 2. సెక్షన్ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజ ధానిని సూచించడానికి నిపుణుల కమిటీని నియమించాలి. ఆమేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్‌ను నియమించడం, ఆ కమిటీ నివేదికను సమర్పించడం జరిగింది. కమిటీ ఇచ్చిన నివేదికను తదుపరి చర్యల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 3. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడం జరిగింది. 4. సెక్షన్ 94 ప్రకారం కొత్త రాజధానిలో వసతుల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయవలసి ఉన్నది. ఇందుకోసం 2500 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రానికి అందజేసింది. 5. 2020లో రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలను తీసుకొచ్చింది. సీఆర్డీఏ (తొలగింపు) చట్టంతోపాటు వికేంద్రీకరణ – అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టాలను రాష్ట్రం చేసింది. దీని ప్రకారం అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉంటాయి. ఈ వ్యవహా రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపలేదు, కనుక పిటిషన్లో లేవనెత్తిన అంశాలతో కేంద్రానికి సంబంధం లేదని మాత్రమే అఫిడవిట్లో పేర్కొన్నారు. రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించినదిగానే కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తున్నది. పార్లమెంట్ సభ్యులు గతంలో అడిగిన ప్రశ్నలకు కూడా ఇదే వైఖరితో సమాధానాలు ఇచ్చింది. అఫిడవిట్‌ను పరిశీలిస్తే కూడా అదే అంశం స్పష్టమవుతుంది. చట్టం ప్రకారం కేంద్రం నిపుణుల కమిటీని వేసిందనీ, ఆ నివేదికను రాష్ట్రానికి పంపించిందనీ పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేసిందనే చెప్పారు తప్ప నిపుణుల కమిటీ సిఫారసులకు భిన్నంగా రాజధానిని ఎంపిక చేయడాన్ని కూడా ఎత్తిచూపలేదు. ఎందుకంటే మొదటినుంచీ కేంద్రం దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయంగానే పరిగణిస్తున్నది కనుక! రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన 2500 కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 600 కోట్లతో అద్భుతంగా నిర్మించిన తెలంగాణా కొత్త సచివాలయం కళ్లెదుట కనిపిస్తుంటే అంత డబ్బును బాబు ఏం చేసి ఉంటాడనే ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ ఒక కీలకమైన అంశం. తద్వారా పాలనలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. అవినీతి తగ్గుతుంది. ఆమేరకు ప్రజల సాధికారత పెరుగుతుంది. రాష్ట్ర విభజనకు ముందు వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్, రాజధాని గుర్తింపు కోసం వేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా ఈ అంశాలను ప్రస్తావించాయి. వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యా మన్న అభిప్రాయంతో ఉన్నారని విభజనకు ముందే శ్రీకృష్ణ కమిషన్ గుర్తించింది. పరిపాలనను వీలైనంతమేరకు వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కొత్తగా రాజధాని నిర్మాణానికి (గ్రీన్‌ఫీల్డ్) పూనుకోవద్దనీ, రాజధాని కోసం పంట భూములను వాడుకోవద్దనీ, విజయవాడ – గుంటూరు నగరాల మధ్యన అసలే వద్దని నిపుణుల కమిటీ సూచించింది. ఈ మూడు కీలక సూచనలనూ చంద్రబాబు ప్రభుత్వం నగ్నంగా ఉల్లంఘించింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడానికి కూడా చంద్రబాబు అప్పటి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేశారు. అది నిపుణుల కమిటీ కాదు. నారాయణ రిటైర్డ్ న్యాయమూర్తో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారో కాదు. పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణుడో, ఆర్థికవేత్తో కాదు. విద్యను వ్యాపారంగా దిగజార్చిన బేహారుల్లో ముఖ్యుడు. ‘ఆకలితో చావనైనా చస్తాను గానీ సరస్వతీ దేవిని అంగట్లో పెట్టన’ని ప్రతిన చేసి, అమ్మవారి కాటుక కంటి నీరు తుడిచిన పోతన పుట్టిన తెలుగు నేలపై చదువుకు ఖరీదు కట్టి తూకం వేసిన వారిలో అగ్రగణ్యుడు నారాయణ. అటువంటి నారాయణతో కమిటీ వేయడమంటే అది అక్షరాలా ట్రెజర్ హంట్ కాకుంటే మరేముంటుంది? అదే నిజమని ఆచరణలో తేలిపోయింది. బినామీ పేర్లతో వేలాది ఎకరాల సమీకరణ వెనుకనున్న రహస్యం, సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న అభివృద్ధి ఒప్పందాల వెనుకనున్న లోగుట్టు లక్షలకోట్ల కుంభకోణంగా అంచనా వేస్తున్నారు. అరవైమంది ఆందోళనకారులు ఆధార్ కార్డులను చూపలేక చేతు లెత్తేయడంతో అమరావతి రైతుల ఉద్యమం బినామీల ఉద్యమంగా తేలిపోయింది. ఈ మూడున్నరేళ్లలో అమరావతి ట్రెజర్ హంట్ కోసం ఆందోళన చేయడం, అడ్డుగా ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టడం, ఆడిపోసుకోవడం, విష ప్రచారాలు ఎక్కు పెట్టడం తప్ప ఎల్లో కూటమి చేసిన ఘన కార్యాలేమీ లేవు. ఇందుకు పూర్తి భిన్నంగా పేద ప్రజల పక్షాన వైఎస్ జగన్ ప్రభుత్వం నిలబడింది. పరిపాలనా వికేంద్రీకరణను అత్యున్నత స్థాయికి తీసుకొని వెళ్లి పేదవాడి ఇంటి తలుపు తట్టింది. ధనికుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశాన్ని పేద పిల్లలకూ కలుగజేసింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతా లలోని కడగొట్టు వ్యక్తికి కూడా ఆరోగ్య హక్కును కల్పించి, ప్రజారోగ్య విప్లవ పతకాన్ని ఎగురవేసింది. చిన్నరైతు కూడా తలెత్తుకొని నిల బడగలిగేలా చేయందిస్తున్నది. మహిళా సాధికారత కోసం చేపట్టిన పలు కార్యక్రమాలు విజయవంతంగా ఫలాలనందిస్తున్నాయి. పేద ప్రజల సాధికారత ఈ మూడున్నరేళ్లలో ఉద్యమ రూపం దాల్చింది. పేద ప్రజల ఎంపవర్మెంట్కూ – పెత్తందార్ల ట్రెజర్ హంట్కూ పొత్తు పొసగదు. యుద్ధం జరగవలసిందే. అదే జరుగుతున్నది. పెత్తందార్లది స్వార్థపూరిత యుద్ధం. పేద ప్రజలది న్యాయమైన పోరాటం. న్యాయమే గెలవాలి. గెలుస్తుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
తోడేళ్ల మందతో తస్మాత్ జాగ్రత్త!
వాడి పేరు మారీచుడైతేనేమి.. సుబాహుడైతే నేమి? ఆవిడ పేరు తాటకైతేనేమి... శూర్పణఖ అయితేనేమి? అందరూ దైత్యులే! రావణభృత్యులే! అతడు రామోజీ అయితేనేమి... చంద్ర బాబు అయితేనేమి? ఆ గొట్టాలు ఏబీఎన్ అయి తేమీ, టీవీ5 అయితేమీ? ఈ వ్యవస్థలో మొలకెత్తిన విషపు విత్తులే! పెత్తందారీ వ్యవస్థ తొత్తులే! తోడేళ్ల గుంపును అదుపులో పెట్టుకొని వాటి వికృతమైన, భయంకరమైన అరుపులతో సమాజంపై పెత్తనం చేయడానికి అల వాటుపడిన కూటమి ఇది. లోక కల్యాణార్థం అలనాటి రుషులు తలపెట్టిన యజ్ఞ యాగాదులను రాకాసి మూకలు ఏనాడూ సహించలేదు. యజ్ఞ వాటికలపై నెత్తురు గుమ్మరించి మాంసం ముద్దలను విసిరి భగ్నం చేసేవారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మనుషుల సుఖసంతోషాలు రాక్షసగణ ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక. ఇప్పుడూ అదే జరుగు తున్నది. అడవి లోని తోడేళ్లు మనిషిని పెంచుకుంటే వాడు మోగ్లీ (జంగిల్‌బుక్) అవుతాడు. కానీ పెత్తందార్లు తోడేళ్లను తయారు చేసుకొని పోషిస్తే అవి రాక్షసత్వం సంతరించుకుంటాయి. మేఘనాథ, కుంభ కర్ణ, అతి కాయ, ప్రహస్త వంటి రావణ సేనాపతులవుతారు. ఎంతోదూరం వెళ్లడం దేనికి? గడిచిన వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న§ ó మిటి? తోడేళ్ల గుంపు మొరుగుతున్న దేమిటి? వచ్చేనెల మూడు నాలుగు తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ విశాఖలో జరగబోతున్నది. ఇందుకు సన్నాహకంగా ఢిల్లీలో జరిగిన భేటీకి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఏకంగా 48 దేశాల రాయబారులు, ప్రతినిధులూ ఈ సమావేశంలో పాల్గొనడం ఒక విశేషం. కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ముసురుకుంటున్న మాంద్యం పరిస్థి తులను ఎదిరించి తమ రాష్ట్రం 11.48 శాతం ఆర్థిక వృద్ధిని ఎలా నమోదు చేసిందో, దేశంలోనే అగ్రస్థానంలో ఎలా నిలబడిందో వివరిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ప్రతినిధులను ఆకట్టుకున్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరసగా తమ రాష్ట్రం ఎలా ముందువరసలో కొనసాగుతున్నదో కూడా ఆయన వివరించారు. రాజకీయ నాయకుడి మాటల్లోని నిజాయితీని అంచనా వేయడంలో వ్యాపార వేత్తల కంటే నిపుణులైన వారు ఎవరూ ఉండరు. అందుకే గతంలోనే ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని బహిరంగంగా మెచ్చుకున్నవారిలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ, డిక్సన్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ, సెంచురీ ప్లైవుడ్ చైర్మన్ సజ్జన్ భజాంకా తదితరులున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కియా, టోరే, క్యాడ్బరీస్, సెయింట్ గోబియాన్, అపాచీ – హిల్‌టాప్, ఎవర్టన్ టీ ఇండియా వగైరా కంపెనీల ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని కొనియాడారు. అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జగన్మోహన్ రెడ్డే పెద్ద ఆస్తిగా అభివర్ణించారు. భారత్ బయోటెక్ కో– ఫౌండర్ సుచిత్ర ఎల్లా కూడా సీఎంని ప్రశంసించారు. మొన్నటి యూనియన్ బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన అనేక కార్యక్రమాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతుండటం ఒక విశేషం. చిరు ధాన్యాల ప్రోత్సాహానికి బడ్జెట్లో ‘శ్రీఅన్న’ పథకాన్ని ప్రకటించారు. ఈ తరహా మిల్లెట్ (చిరుధాన్యాలు) పాలసీ ఆంధ్ర ప్రదేశ్‌లో అమలవుతున్నది. ‘పీఎం మత్స్య సమృద్ధి యోజన’ పథకానికి కూడా అడుగుజాడ ఆంధ్రప్రదేశ్‌దే. రాష్ట్రం ఇప్పటికే 26 ఆక్వా హబ్‌లు, 14 వేల అవుట్లెట్ల ఏర్పాటుకు అడుగులేస్తున్నది. ప్రతి పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు లక్ష్యాన్ని బడ్జెట్లో ప్రకటించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభమైంది. 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో 30 స్కిల్ హబ్స్, 26 స్కిల్ కాలేజీలు, రెండు యూనివర్సిటీల ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్న బడ్జెట్ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు–నేడు’ కార్య క్రమమే ప్రేరణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కదా విజినరీ లక్షణం. మరికొన్ని రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ తన ఆలోచనలేనని మన ఎల్లో విజినరీ ప్రకటించుకున్నా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. ఈ బడ్జెట్లో కేంద్రం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రకటిం చింది. ఈ కార్యక్రమానికి కూడా స్ఫూర్తి ఆంధ్రప్రదేశే కావడం మరో విశేషం. ప్రభుత్వ అండదండలతో రాష్ట్రంలో ఏడు లక్షల మంది రైతులు ప్రకృతి సాగును అనుసరిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ప్రేరణా నిపుణుడు నిక్ వుజిసిక్ గురించి చాలామందికి తెలిసి ఉండవచ్చు. కాళ్లూ చేతులూ లేకుండా పుట్టిన తనను లోకమంతా చిన్నచూపు చూసినా చలించకుండా తనను తాను ఒక అద్భుతమైన ఆయుధంగా మలుచుకున్న ధీరుడు. తన జీవిత కథను దీపంగా మలిచి ప్రపంచవ్యాప్తంగా యువతీ యువకుల మనసుల్లోని చీకట్లను పారద్రోలుతున్న వ్యక్తిత్వ నిపుణుడు. దేశాటనలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణను చూసి ఆయన చకితుడయ్యారు. పాఠశాల నిర్వహణ మీద ప్రభుత్వాలు ఇంత శ్రద్ధ పెట్టడాన్ని తాను మరెక్కడా చూడలేదని ఆయన చెప్పారు. చెప్పడమేకాదు స్వయంగా సీఎంని కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేసే ఇన్ని పరిణామాలు గడిచిన ఒక్క వారంలోనే చోటుచేసుకున్నప్పటికీ ఇవి మన ఎల్లో మీడియాకుగానీ, దాని వెనకనున్న తోడేళ్లకు గానీ ససేమిరా కనిపించవు. వాళ్లు చూడరు. లోకాన్ని చూడనివ్వరు. లోకం చూడకుండా ఉండటానికి వాళ్ల దగ్గర కొన్ని నైపు ణ్యాలున్నాయి. మధుబాబు డిటెక్టివ్ నవలల్లోంచి, చందమామ భేతాళ కథల్లోంచి, పేదరాశి పెద్దమ్మ కథల్లోంచి కొన్ని ఘట్టాలను లేపేసి వాటికి తాజా రంగులద్ది వార్తలుగా ప్రచారంలో పెడతారు. ఈవారం కూడా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి లభించిన మెచ్చుకోళ్లను పూర్వ పక్షం చేయడానికి కుళ్లిన కోడిగుడ్డు వాసన వెదజల్లే హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌తో వండి వార్చిన కొన్ని కథలను ఎల్లో మీడియా జనంలోకి వదిలింది. ఎల్లో మీడియాకూ, సీబీఐ దర్యాప్తు సంస్థకూ మధ్యన ‘ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడివేసెనో’ అనే అనుమానం ఎవరికైనా వస్తే తప్పుపట్టలేము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అప్పటి కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ భాగస్వాములుగా చేరి జగన్మోహన్రెడ్డిపై రాజకీయ కేసులు బనాయించి సీబీఐ దర్యాప్తు వేయించిన దరిమిలా జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు కారణాలు. ఆనాడు దర్యాప్తు అధికారుల మనసులో మాటేమిటో ఎల్లో మీడి యాకు క్షణాల్లో తెలిసిపోయేది. ఎల్లో మీడియా ఏ కవిత్వం రాసినా దర్యాప్తు సంస్థకు అభ్యంత రాలుండేవి కాదు. అంతటి దృఢమైన బంధం ఇప్పుడైతే ఉన్నదో లేదో తెలియదు కానీ, ఎల్లో మీడియా కవిత్వం మాత్రం ఆగడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమ యంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గుర య్యారు. ఈ విషయం వివేకానందరెడ్డి బావమరిది ఫోన్ చేసి చెబితే అవినాశ్‌రెడ్డికి తెలిసింది. జమ్మల మడుగు ప్రయాణంలో ఉన్న అవినాశ్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది మీడియా ద్వారా అందరికీ తెలిసిన సమాచారం. అక్కడికి వెళ్లిన తర్వాత ఈ సమాచారం చెప్పడానికి సహజంగానే ఆయన ఫోన్లు చేసి ఉండవచ్చు. చనిపోయిన వివేకానందరెడ్డి స్వయాన జగన్ మోహన్‌రెడ్డి బాబాయ్ కనుక ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించడంలో విశేషమేమున్నది. ఆ ఫోన్‌ను ఇంట్లో అటెండరో, మరొకరో రిసీవ్ చేసుకుంటే వింతేమున్నది? ఇందులో కుట్రకోణం గానీ, కుంభకోణం గానీ ఎక్కడున్నది? అటువంటి లంబకోణం ఏదైనా వుంటే అప్పుడున్న తెలుగు దేశం ప్రభుత్వం ఎందుకని ఉచ్చు బిగించలేదు. మృతదేహం దగ్గర దొరికిన లేఖను దాచిపెట్టమని వివేకా అల్లుడు మృతుని పీఏని ఎందుకు ఆదేశించాడు? వెంటనే పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? ఇలా ఇవ్వకూడదనే సలహా ఆయనకు ఎవరు ఇచ్చారు? ఇక్కడ కదా దర్యాప్తు ప్రారంభం కావలసింది. హత్యలో తమ పార్టీవారి ప్రమేయం ఉన్నందువల్ల వారిని తప్పించడం మీదనే దృష్టిపెట్టి తెలుగుదేశం ప్రభుత్వం దర్యా ప్తును తాత్సారం చేసిందా? ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రతిష్ఠతో కడుపు మండి కాకమ్మ కథలతో చెలరేగుతున్నారా? విచారణ కోసం, సమాచారం కోసం సీబీఐ నోటీసులు ఇస్తే ఎవరైనా వెళ్తారు. తమకు తెలిసిన సంగతులు చెప్తారు. దీన్ని ఆసరా చేసుకొని వీవీఐపీ కుటుంబం మీద బురద జల్లడానికి బరితెగిస్తారా? వైసీపీ నాయకుడు కొడాలి నాని చేసిన డిమాండ్‌కు ప్రజాస్వామ్య ప్రేమికులందరూ మద్దతు పలకవలసి వస్తున్నది. కొన్ని సంవత్సరాల క్రితం తన సోదరుడైన చంద్రబాబు మీద విమర్శలు చేసిన తర్వాత నారా రామ్మూర్తి నాయుడు ప్రజల్లో కనిపించడం లేదట! రామ్మూర్తి నాయుడు ఒక దఫా శాసన సభ్యుడిగా కూడా పనిచేశారు. కనుక ఆయన ఉనికిని, బాగోగులను తెలుసుకోవలసిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉన్నది. అట్లాగే ఎన్టీఆర్ మరణంపై తనకు అనుమానాలున్నాయనీ, విచారణ జరిపించాలనీ ఆనాడే హరికృష్ణ కోరినట్టు కొడాలి నాని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మరణం వల్ల ప్రధానంగా లబ్ధి జరిగింది చంద్రబాబుకే కనుక ఆయన విచారణకు అంగీకరించలేదని కూడా నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఎనిమిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి, అగ్రశ్రేణి కళాకారుడైన ఎన్టీ రామారావు మృతిపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికైనా విచారణ జరగాల్సిందే. మకుటం లేని మహారాజులాగా వెలుగొందిన వ్యక్తి దయనీయ స్థితికి దిగ జారడానికి కారకులైన వ్యక్తులు ఎవ రెవరున్నారో లెక్క తేలవలసిందే. ఆలస్యమైనా సరే న్యాయం జరగవలసిందే. తప్పుడు ప్రచార దుర్గంధాన్ని వెదజల్లడంలో భాగంగా కొన్ని పాచిపోయిన పాతకాలపు ఎత్తుగడలను కూడా ఆశ్రయిస్తున్నారు. అందులో ఒకటి వైసీపీ నుంచి వలసలు ప్రారంభ మయ్యాయనీ, చాలామంది బయటకు రాబోతున్నారనే ప్రచారం. సర్వేలు చెబుతున్నాయి తెలుగుదేశం గెలవ బోతున్నదని మరో ప్రచారం. ఎల్లో మీడియాకు పాఠకులు విజ్ఞప్తి చేయ వలసిన విషయం ఒకటున్నది – ‘2019 ఎన్నికలకు ముందు మీరు అచ్చేసిన సర్వే ఫలితాలను ముందుగా ప్రకటించండి. ఆ తర్వాత కొత్త సర్వేల గురించి రాయాల’ని డిమాండ్ చేయాలి. పార్లమెంట్ ఎన్నికలకు ఓ రెండేళ్ల ముందే బీజేపీ తన ఎన్నికల కసరత్తును ప్రారంభిస్తుంది. తమ పార్టీ ఇమేజ్ పెరిగినట్టు నిరూపించడానికి కొన్ని సర్వే సంస్థలను (ట్రాక్ రికార్డ్ సరిగా లేని) రంగంలోకి దించుతుంది. ఇప్పుడా కాంట్రాక్టు ‘సీ వోటర్’ అనే సంస్థకు దక్కింది. బీజేపీ బలం చెక్కు చెదరలేదని చెప్పడం కోసం ఆ సంస్థ ప్రధానితో సహా బీజేపీ ముఖ్యమంత్రులందరి రేటింగ్‌ను పెంచేసింది. ఆమేరకు నాన్–బీజేపీ ముఖ్యమంత్రుల రేటింగ్‌ను కొంచెం తగ్గించేసింది. ఇంకేముంది మన కోతికి కొబ్బరికాయ దొరికింది. జగన్ మోహన్‌రెడ్డి రేటింగ్ తగ్గిందనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. నూటికి నూరుపాళ్లు సక్సెస్ రేటు ఉన్న అత్యంత విశ్వస నీయమైన ఒక సర్వే సంస్థ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఫలితాలు దాదాపు పునరావృతం కానున్నాయి. ప్రతి పక్షాల పొత్తుల వల్ల పాలక పార్టీకి నష్టం కంటే లాభమే ఎక్కువ జరుగుతుందని ఆ సంస్థ అభిప్రాయపడినట్టు సమాచారం. బహుశా అందువల్లనే ప్రతిపక్ష తోడేళ్ల మందను ముఖ్యమంత్రి పెద్దగా ఖాతరు చేస్తున్నట్టు లేదు. ఆ ధీమాతోనే మొన్న ఒక సభలో సింహం–తోడేళ్ల ప్రస్తావన కూడా తెచ్చి ఉండొచ్చు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా నిత్యం ప్రజల్లో ఉండాలనీ, అలా ఎవరైనా లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం కుదరదనే సందేశాన్ని ఇస్తున్నాడనీ ఎల్లో మీడియానే చాలాసార్లు రాసింది. టికెట్ లభించడం కష్టమని సెల్ఫ్ ఎసెస్మెంట్ ద్వారా నిర్ధారణకు వచ్చిన వాళ్లు కొందరు పక్క చూపులు చూడవచ్చు. అటువంటి వాళ్లను చేరదీసి టిక్కెట్ ఇస్తామనే హామీని తోడేళ్ల మంద ఇవ్వ వచ్చు. ఆ తోడేళ్లను నమ్మడానికి కొన్ని గొర్రెలు సిద్ధపడితే ఎవరేం చేయగలరు? చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న లోకేశ్‌బాబు పాదయాత్ర తుస్సు మన్నది. దాన్ని పైకి లేపడం తమ వల్ల కాదని ఎల్లో మీడియా పెద్దలు కూడా తేల్చేశారట. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమా లను మసకపరచడానికి రాక్షస యుద్ధానికి తోడేళ్ల మంద తెగించింది. ‘అక్క ఆరాటం తప్ప బావ బతికేది లేద’నే సామెత ఉండనే ఉన్నది. ఎన్ని కోట్ల అరచేతుల్ని అడ్డం పెడితే సూర్యకాంతి ఆగుతుంది? ఎన్ని అబద్ధాలను పోగేసి కప్పినా నిప్పులాంటి నిజం దాగుతుందా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
హైపర్ బాబు – సుడిగాలి పవర్!
‘‘తమ కార్యంబు బరిత్యజించియు బరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్, తమ కార్యంబు ఘటించుచున్ బర హితార్థ వ్యాప్తుల్ మధ్యముల్, తమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భం గము గావించెడి వారలెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్?’’ భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషితాలకు ఏనుగు లక్ష్మణకవి చేసిన తెలుగు సేతలో ఒక పద్యం ఇది. సొంత పనిని పక్కన పెట్టయినా సరే అవసరంలో ఉన్నవారికి తోడ్పడేవాడు సజ్జనుడు. తన పని చేసుకుంటూనే ఇతరులకు కూడా తోడ్పడే వాడు మధ్యముడు. తన స్వార్థం కోసం ఇతరులను పణంగా పెట్టేవాడు దైత్యుడు... అంటే రాక్షసుడు అని ఈ సుభాషితానికి అర్థం. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తన తదుపరి స్థానం తన వారసుడైన లోకేశ్బాబుకే దక్కాలనేది చంద్రబాబు సంకల్పం. కానీ ఆ పార్టీలోని దిగువశ్రేణి కార్యకర్తల నుంచి నాయకుల దాకా ఈ వ్యవహారం మింగుడుపడటం లేదనేది బహిరంగ రహస్యం. ఆయనకు నాయకత్వ ప్రతిభ లేనే లేదని పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయం. ఈ పూర్వరంగంలో ఎల్లో మీడియా రుషిపుంగవులు చంద్రబాబు చెవిలో ఒక తరుణోపాయాన్ని ఉపదేశించారట. కాశీయాత్ర చేసి గంగలో మునకేస్తే చేసిన పాపాలన్నీ కొట్టుకొని పోయి పుణ్యాత్ముడుగా తిరిగి వస్తారన్న నమ్మకం పూర్వకాలంలో ఉండేది. అలాగే, ‘‘మన లోకేశ్‌బాబును రోడ్ల వెంట నడిపిస్తే ఎల్లో మీడియా ప్రతిరోజూ టాప్ న్యూస్‌గా ప్రచారంలో పెడుతుంది. ఏడాది తిరిగేసరికల్లా నాయకుడిగా తయారుచేసే బాధ్యత మాదేన’’ని విశ్వామిత్రుడు దశరథ మహారాజుకు ఇచ్చినంత గట్టి హామీని ఇచ్చారట! ఇంతవరకు బాగానే ఉన్నది. లోకేశ్‌బాబు పాదయాత్ర అనుకున్నట్టుగానే ప్రారంభమైంది. పది అడుగులు పడ్డాయో లేదో, లోకేశ్ వెనకనే నడుస్తున్న నందమూరి తారకరత్న దురదృష్టవశాత్తు కుప్పకూలిపోయాడు. వెంటనే స్పృహ కూడా కోల్పోయాడు. పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు అర్థమౌతూనే ఉన్నది. అయినా లోకేశ్ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే కదిలారు. నందమూరి వారసుడూ, ఎన్టీఆర్ మనుమడూ మీకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చి ప్రమాదంలో చిక్కు కున్నప్పుడు, మీ కార్యక్రమాన్ని కాస్సేపు పక్కన పెట్టడం సంస్కారం కదా? కనీసం సాయంత్రం జరిగే సభనైనా రేపటికి వాయిదా వేద్దామని కొందరు సూచించారట. జనసమీకరణ కోసం పేమెంట్లు కూడా పూర్తయినందున ఆపేయలేమని నిర్వాహకులు అంగీకరించలేదు. ఏడాదిపాటు చేయవలసిన పాదయాత్రకు ఆదిలోనే అపశ్రుతి దొర్లినందున కనీస సంస్కారాన్నయినా ప్రదర్శించి ఉంటే ఎంతోకొంత ప్రాయశ్చిత్తం లభించేదేమో. భర్తృహరి వర్గీకరణ ప్రకారం ఈ రకమైన కుసంస్కారం దైత్యుల కిందకు వస్తుందా? ఇంతకంటే కఠినమైన మాటను ఉపయోగించాలా? పూర్వకాలంలో రాజులు దండయాత్రలు చేసినట్టే ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు రథయాత్రలు, పాదయాత్రలు చేయడం రివాజుగా మారింది. ఇందులో తప్పులెన్నవలసిన అవసరం కూడా లేదు. రథ గజ తురగ పదాతి తదాది యాత్రికులందరినీ స్వాగతించవలసినదే. విరాట రాజకుమా రుడూ – ప్రగల్భ వీరుడైన ఉత్తర కుమారుడు మహావీరులైన కౌరవ సేనపైకి యుద్ధానికి వెళ్తానంటే ఎవరు అడ్డుకున్నారు? అంతఃపుర కాంతలు ఆశీర్వచనాలు చెప్పి హారతులు కూడా ఇచ్చారు. బృహన్నల రూపంలో ఉత్తర కుమారుడికి ఓ తోడు దొరకడం వేరే కథ. ఇక్కడ అప్రస్తుతం. లోకేశ్‌బాబు పాద యాత్రకు కూడా ఆలయాల్లో ఆశీర్వచనాలు, అంతఃపురంలో హారతులు, వీరతిలకాలు వగైరాలన్నీ సమకూరాయి. ఈ పాదయాత్రలో తాను ఒంటరిని కాదనీ, పవన్ కల్యాణ్ వారాహి రథయాత్ర కూడా తన వెంట తోడుగా ఉంటుందనీ పరోక్షంగానైనా సభాముఖంగానే ప్రకటించారు. వారాహినీ, యువ గళాన్నీ ఆపలేరంటూ గట్టిగా హెచ్చరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని గజగజలాడించేందుకు లోకేశ్‌బాబు శక్తి మేరకు ప్రయత్నించారు. రిపబ్లిక్ డే నాడు అచ్చుగుద్దినట్టు ఇదే ప్రయత్నాన్ని పవన్ కల్యాణ్ కూడా చేశారు. ‘ఎవడ్రా నా వారాహిని ఆపేద’ని ఆయన గర్జించారు. నాటకాల్లో రాజు వేషం వేసే నటుడు గట్టిగా చప్పట్లు చరిచి ‘ఎవరక్కడ?’ అంటాడు. ఎవరూ రారు. ఇదీ అంతే! వారాహిని అడ్డుకుంటామని అధికార పార్టీ వారు గానీ, ప్రభుత్వంలోని వారుగానీ ఎవ్వరూ అనలేదు. పైపెచ్చు స్వాగతించినట్టున్నారు కూడా! మనసు నిండా మాలిన్యం నింపుకొని గంగలో మునకేసినంత మాత్రాన ఎవరూ పవిత్రులు కాలేరు. సహజంగా నాయ కత్వ లక్షణాలున్న వారిని, ప్రజల పట్ల అంకితభావం, సమాజంపై ప్రేమ ఉన్నవారిని పాదయాత్రలు మరింత సాన బడతాయి. అంతే తప్ప అసమర్థుడిని సమర్థుడిగా మలచలేవు. లోకేశ్‌బాబు పాదయాత్ర నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పోల్చడానికి ఎల్లో మీడియా తెగ ప్రయాస పడిపోతున్నది. కొంతమంది తటస్థులమని చెప్పు కునే విశ్లేషకులు కూడా వీరి మాయలో పడి పోతున్నారు. ఇద్దరి మధ్యన ఉన్న హస్తిమశ కాంతారాన్ని గుర్తించకపోవడం కళ్లకు గంతలు కట్టుకోవడంతో సమానం. తాతగారు నిర్మించిన పార్టీని నాన్నారు కబ్జా చేస్తే, ఆ కబ్జాను వంశపారంపర్యం చేసుకోవడానికి తండ్రి చాటున నిలబడి, ఎల్లో మీడియా నీడలో ఆపసోపాలు పడుతున్నవారు లోకేశ్‌బాబు. సొంతంగా పార్టీని నిర్మించుకొని తొమ్మిదేళ్లపాటు అధికార పీఠాలకు, గోబెల్స్ మీడియాలకు ఎదురొడ్డి పోరాడి, ఒంటిచేత్తో తన పార్టీని విజయ తీరాలకు చేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి, తన చేతికో మూడు కీలక శాఖల్ని అప్పజెప్పి, అప్రకటిత నెంబర్ టూగా చలామణి చేసినా ఎమ్మెల్యేగా గెలవలేక చతికిలబడిన గతం లోకేశ్బాబుది. అధినేత్రి అహంభావానికి నిరసనగా ఆ పార్టీ టిక్కెట్‌పై లభించిన పార్లమెంట్ సభ్యత్వాన్ని గడ్డి పరకలా విసిరేసి, స్వతంత్రంగా నిలబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ధనప్రవాహం, శత్రు మీడియాలను తట్టుకొని అఖండ మెజా రిటీతో జాతీయ రికార్డులను బద్దలుకొట్టిన చరిత్ర జగన్ మోహన్‌రెడ్డిది. వారసత్వ రాజకీయాల కోటాలో లోకేశ్‌తోపాటు జగన్ మోహన్‌రెడ్డిని కూడా చేర్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వీరిలో బీజేపీ వగైరా పార్టీలతోపాటు విశ్లేషకులమని చెప్పు కునేవారు కూడా కొందరున్నారు. ఇందుకు కారణం వారి అజ్ఞానమైనా కావచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా విషం చిమ్మడ మైనా కావచ్చు. తండ్రిగారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్రెడ్డి లోక్‌సభకు ఎన్నికైన విషయం వాస్తవం. గెలిచిన నాలుగు నెలలకే వైఎస్సార్ మరణించారు. ఆ తర్వాత ఏడాదిపాటు కాంగ్రెస్ నాయకత్వంతో ఒకపక్క పోరాడు తూనే మరోపక్క ఓదార్పు యాత్ర చేయవలసి వచ్చింది. చివరకు పార్టీ నుంచే నిష్క్రమించవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నిండా ఏడాదిన్నర కూడా ఆయన లేరు. ఆ పదవికి కూడా పార్టీతో పాటు రాజీనామా చేసి స్వతంత్రంగా నిలిచి గెలిచి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. ఆ పార్టీని నిల బెట్టడం కోసం, ఆ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొనడం కోసం ఎండనకా, వాననకా తొమ్మిదేళ్లపాటు కాలికి బలపం కట్టుకొని పడిన కాయకష్టం ఫలితమిచ్చింది. కష్టార్జితం మీద లోకేశ్‌తో సమానంగా వారసత్వం ముసుగు కప్పేందుకు ఎల్లో మీడియా చేస్తున్న కుయుక్తుల్నీ, దగుల్బాజీ విశ్లేషకుల జిత్తులమారితనాన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాము. తన పాదయాత్రను ప్రారంభించే నాటికే రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నెంబర్‌వన్ రాజకీయ నాయ కుడిగా జగన్ ఎదిగారు. అందుకు కారణాలున్నాయి. కష్టాలు న్నాయి. కన్నీళ్లున్నాయి. కడగండ్లున్నాయి. అడుగడుగున మందు పాతరల్లా పొంచివున్న గండాలున్నాయి. ఆ గండాలను అధిగమించి సాగిన ప్రస్థానం ఉన్నది. ప్రజలకు ఇచ్చిన ఒక్క మాట కోసం ఆనాడు ప్రపంచంలో సర్వశక్తిమంతురాలుగా చలా మణి అవుతున్న అధినేత్రి ముందు తలవంచని ఆత్మస్థైర్యం ప్రజలకు నచ్చింది. ఒక లక్ష్యం కోసం పదవుల్ని గిరాటేయడాన్ని జనం మెచ్చారు. లక్షలాదిమంది అవ్వాతాతలను, అక్కా చెల్లె ళ్లను కలిసి వారి గుండె చప్పుళ్లను ఆత్మీయంగా ఆలకించి నప్పుడు, ఇంటింటికి వెళ్లి తడారని కళ్లను తుడిచినప్పుడు, పుండ్లు పడిన దేహాలను సైతం ఆదరాలింగనం చేసుకున్న ప్పుడు ఆ మానవీయ స్పర్శకు ఆంధ్ర దేశం పులకరించింది. పాదయాత్రను ప్రారంభించే నాటికే అఖండ ప్రజా దరణతోపాటు ఆయన చేతిలో ఒక ప్రత్యామ్నాయ మేనిఫెస్టో ఉన్నది. ఆ మేనిఫెస్టోలో పేదరికం నుంచి ప్రజలను విముక్తి చేసే మార్గాలున్నాయి. వాటికి ‘నవరత్నాల’నే పేరును ఆయన పెట్టుకున్నారు. ఆ మేనిఫెస్టోను ఆయన భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా ప్రకటించుకున్నారు. దానికితోడు ఆనాటి ప్రభుత్వపు వైఫల్యాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఎగవేత ఉన్నది. రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేయడం ఉన్నది. డ్వాక్రా మహిళలను వంచించడం ఉన్నది. ఇంటికో ఉద్యోగం వాగ్దాన భంగంగా మిగిలింది. జన్మభూమి కమిటీల దాష్టీకం అసహ్యం పుట్టిస్తున్నది. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో పాలక పార్టీ నేతలే దుశ్శాసనులై వెదజల్లిన దుర్గంధం ముక్కుల్ని బద్దలు కొడు తున్నది. బీసీ కులాలను, ఎస్సీ కులాలను ఈసడించుకుంటున్న రాజకీయ పెత్తందార్ల పుండాకోర్ చేష్టలు జుగుప్స కలిగిస్తున్నవి. ఇదిగో... ఈ నేపథ్యంలో నెంబర్‌వన్ ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడు తన మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటిస్తూ పాదయాత్ర ప్రారంభించాడు. అది సూపర్ హిట్‌గా చరిత్రలో నిలబడిపోయింది. సముద్ర తీరాలను కలుపుతూ జనవారథులను నిర్మించినట్టు, వీధులన్నీ జీవనదులై పోటెత్తి నట్టు ప్రజలు పాలుపంచుకున్నారు. మరి లోకేశ్‌బాబు పాదయాత్ర సంగతి? ఆయన నాయ కుడుగానే ఎదగలేదు. ఎమ్మెల్యేగానే గెలవలేదు. ఆయన వారసత్వంపై పార్టీలోనే అంగీకారం లేదు. ఆయన చేతిలో ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు. జగన్మోహన్రెడ్డి పాద యాత్రకు ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను దాచేసి నట్టుగా ఈ ప్రభుత్వం దాచేయలేదు. పటాలు కట్టించి ఆఫీసుల్లో పెట్టింది. 98 శాతం హామీలను నెరవేర్చినట్టు ప్రకటించింది. ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను రద్దుచేస్తామని లోకేశ్ చెప్పలేడు. గోబెల్స్ విషప్రచారం తప్ప మరో కార్యక్రమమే లేదు. ఎల్లో మీడియా అందజేసే తప్పుడు కథనాల సారాంశమే తప్ప ఆయన మెదడంతా నిస్సారమే! అయినప్పటికీ తొలిరోజు పాదయాత్రను ‘ఘనంగా ముందడుగు’ అనే పతాక శీర్షికతో ‘ఈనాడు’ ప్రకటించింది. వారెవ్వా... కాకిపిల్ల కాకికి ముద్దు. రామోజీరావుకు ‘తాను మునిగిందే గంగ, తాను వలచిందే రంభ’. పాఠకుల్ని కూడా అదే నమ్మమంటాడు, ఖర్మ! ‘యువగళం’ పాదయాత్ర భూపాలం పాడితే... ‘వారాహి రథయాత్ర’ కోరస్ పాడుతుందా! లోకేశ్ మాటల్ని వింటే అంతే అనుకోవాలి. వారాహి, యువగళాలను ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు. రెండూ తమ ఆస్తులేనన్నంత ధీమాగా ఆ రెంటినీ ఎవరూ తాకలేరని చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే పవన్ కల్యాణ్ ఉపన్యాసాలు కూడా సాగుతున్నాయి. పవన్ కల్యాణ్ ఉపన్యాసాలను మొదటి నుంచీ వింటున్న వారికి ఒక మనిషిలో ఇన్ని వైరుద్ధ్యాలు ఎలా సాధ్యమన్న అనుమానం రాకుండా ఉండదు. మొదట్లో చేగువేరా మీద తనకున్న అభిమా నాన్ని ఆయన దాచుకునేవాడు కాదు. అప్పుడప్పుడూ ఆయన చేతిలో కన్పించే పుస్తకాల్లో, ఆయన నటించే సినిమాల్లో బొమ్మలు కనిపించేవి. ఇప్పుడెందుకో చేగువేరాకు గుడ్‌బై చెప్పినట్టు కనిపిస్తున్నది. ఇటీవల గువేరా కూతురు తెలుగు రాష్ట్రాల్లో పాల్గొన్న సభల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులూ పాల్గొన్నారు – ఒక్క జనసేన తప్ప! పవన్ కల్యాణ్ నుంచి ఏదైనా పత్రికా ప్రకటనైనా వస్తుందేమోనని చూశారు. అలాంటిదేమీ లేదు. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లవుతున్నా ఆయన ఉపన్యా సాలపై సినిమాల ప్రభావం పోలేదు. ఆయన చెబుతున్న చాలా విషయాలు వినేవాళ్లకు నమ్మశక్యంగా అనిపించవు. ఇటీవల తానొక బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు వర్ణవివక్షను ఎదుర్కొన్నాననీ, ఎయిర్ హోస్టెస్ తనకు మంచినీళ్లు ఇవ్వలేదనీ చెప్పారు. బ్రిటీష్ ఎయిర్వేస్లో వేలమంది భారతీయులు ఎకానమీ క్లాస్‌లో కూడా ప్రయాణిస్తుంటారు. ఎవ్వరూ ఇటీవలి కాలంలో ఇలాంటి ఆరోపణ చేయలేదు. అలాంటిది బిజినెస్ క్లాసులో ఉన్న పవన్‌కు అవమానం జరగడమేమిటి?... మహాత్మాగాంధీ కూడా తొలి నాళ్లలో దక్షిణాఫ్రికా రైల్లో వర్ణవివక్షను ఎదుర్కొన్నట్టే తాను కూడా ఎదుర్కొన్నట్టు చెబితే సెంటిమెంట్ బాగా పండుతుంది, సినిమా గ్రాండ్‌గా ఉంటుందనుకున్నారా? ఇలాంటి అనేక నమ్మశక్యం కాని విషయాలను పవన్ ప్రసంగాల నుంచి వెతికి మరీ ఔత్సాహికులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. సుమారు ఒక డజన్ వరకు ఇటువంటి కామెడీ పీస్‌లు చక్కర్లు కొడుతున్నాయి. రిపబ్లిక్ డే నాడు మాట్లాడుతూ కమ్యూనిస్టు భావాలు కలిగిన వారి తండ్రిగారు దీపారాధనతో సిగరెట్ వెలిగించు కున్నారని చెప్పారు. కమ్యూనిస్టు భావజాలం మీద ద్వేషం కలిగించడానికి కాకపోతే ఈ సంగతి ఎందుకు చెప్పినట్టు? తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు భావజాలం కలిగినవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. ఎవరైనా ఈ రకంగా ప్రవర్తించినట్టు ఎప్పు డైనా ఒక వార్త వచ్చిందా? అలాంటప్పుడు నిన్న మొన్నటి దాకా తనకు చేగువేరా ఆదర్శమనీ, నక్సలైట్ అవుదామని అనుకున్నా ననీ ఎందుకు చెప్పుకున్నట్టు? ఒక స్థిరత్వం లేదా? నాయకు డన్నవాడు నిజాయితీగా ఉండాలని జనం కోరుకుంటారు. నిజాలు మాట్లాడాలని కోరుకుంటారు. ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం చూపాలని కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా పట్ల పవన్ కల్యాణ్ చేసిన∙వ్యాఖ్యలు, చూపిన హావభావాలు గౌరవపూర్వకంగానే ఉన్నాయా? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడే తీరేనా? యువగళం, వారాహి యాత్రలు రెండూ ఆదిలోనే సంస్కారం అనే పట్టాలను తప్పాయి. పట్టాలు తప్పిన ఈ ప్రయాణాలను ఎవరూ ఆపలేరట! ఈ యాత్రలు ఏ తీరాలకు చేరుతాయో చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చిలుక జోస్యమే చివరి ఆశ!
తూర్పు దిక్కున విచ్చుకుంటున్న ప్రభాత రేకల్ని మనం చూడగూడదు. పడమటి సంధ్యారాగపు విభాత గీతాలాపన మన చెవిన పడగూడదు. తలుపులకూ, కిటికీలకూ ఇనుప తెరలు కప్పేద్దాం. మన పాలితులకు మన సినిమానే చూపిద్దాం. ఆధిపత్య వర్గాలకు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగు బాటయ్యే సమాజాల్లో ఈ భావజాలం రాజ్యం చేస్తుంది. సకల వ్యవస్థలనూ ఈ వర్గాలు పెంపుడు చిలుకలుగా మార్చివేస్తాయి. వార్తలనూ, వ్యాఖ్యానాలనూ ఈ చిలుకల పలుకుల్లోనే మనం గ్రహించాలి. ధర్మమేమిటో, సంప్రదాయమేమిటో, వ్యవహార మేమిటో కూడా ఈ చిలుకలే మనకు బోధిస్తాయి. ‘హెచ్‌ఎమ్‌వి’ రికార్డుల్నే ఈ చిలుకలు వినిపిస్తాయనేది ప్రత్యేకంగా చెప్ప నవసరం లేదు. ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు తాలం వేయని ప్రభుత్వాలు ఏర్పడితే ఇక రణమే. పెంపుడు చిలుకలు కూడా కత్తులు దూస్తాయి. మీడియానే ముందుండి యుద్ధం చేస్తుంది. ఈ పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ కంటే స్పష్టమైన ఉదాహరణ ఇంకొకటి లేదు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో పెంపుడు చిలుకలకు అరాచకమే కనిపిస్తుంది. తొక్కిసలాట నిరోధించే భద్రతా చర్యలైనా, అక్రమ భవంతులను కూల్చివేయడమైనా అప్రజా స్వామికంగానే కనిపిస్తాయి. సూర్యుడు మార్నింగ్ బెల్ కొట్టకముందే వేకువ కిరణాల మాదిరిగా సంక్షేమాన్ని జనం ముంగిటకు చేర్చుతున్న వలంటీర్లలో ఎల్లో మీడియాకు సంఘ విద్రోహులు కనబడుతున్నారు. తనకు కనిపించడమే కాదు, ప్రజలందరూ ఇదే విషయాన్ని నమ్మి తీరాలని కూడా ఎల్లో మీడియా సమాజాన్ని ఆదేశిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థను దేశంలో ఉన్న విజ్ఞులందరితోపాటు ఇంగిత జ్ఞానమున్న సామాన్యులు సైతం ప్రశంసిస్తున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాకారంలో విప్లవాత్మకమైన ముందడుగుగా భావిస్తున్నారు. కానీ, మన పెత్తందారీ వర్గాల పెంపుడు చిలుకలు మాత్రం ఒక దుందుడుకు చర్యగా పరిగణిస్తున్నాయి. వాటి మీద విష ప్రచారాన్ని ఎక్కుపెట్టాయి. రైతు పండించిన ధాన్యానికీ, మద్దతు ధరకూ మధ్యన అడ్డుగోడగా నిలిచిన దళారీ వ్యవస్థను ప్రభుత్వం తొలగించింది. ఇది గిట్టని ఎల్లో మీడియా ప్రతిరోజూ కళ్లల్లో నిప్పులు గుమ్మరించుకుంటూనే ఉన్నది. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువు చెబితే ఎల్లో మీడియాకు కడుపునొప్పి. నాణ్యమైన ఆధునిక విద్యను ఉచితంగా అందజేస్తే అజీర్తి రోగం. అత్యుత్తమమైన ప్రజా వైద్యం పల్లెగడప తొక్కితే మూలశంక వ్యాధి మెలిపెడుతున్నది. మహిళల సాధికారత కోసం పదవులూ, నిధులూ అందు బాటులో ఉంచితే కడుపు తరుక్కుపోతున్నది. సొంత ఇంటి రూపంలో కొంత ఆస్తిని సమకూర్చితే ఎల్లో కూటమి కాలేయం కమిలిపోతున్నది. పేదవర్గాలకు ప్రత్యక్షంగా నగదు బదిలీని చేస్తుంటే తనువెల్లా దహించుకుపోతున్నది. తను ఇంతగా రోగపీడితం కావడానికి కారణమైన ప్రభుత్వంపై ఈ కూటమి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నది. తక్షణం గద్దె దింపాలన్న కోరికతో సెగలు కక్కుతున్నది. అందుకోసం సమాచార విధ్వంసానికి పూనుకుంటున్నది. నందిని పందిగా, పందిని నందిగా ప్రచారం చేయడానికి తెగబడుతున్నది. వ్యవస్థల్లోని పెంపుడు చిలుకలను ఉపయోగించుకొని ప్రజాభిప్రాయాన్ని ‘ఉత్పత్తి’ చేయడానికి ఒడిగడుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెస్తున్న అప్పులపైనా, చేస్తున్న ఖర్చులపైనా ఎల్లో మీడియా ఎంత గోబెల్స్ బీభత్సాన్ని సృష్టించిందో లోకమంతా చూసింది. రాష్ట్రం నేడో, రేపో మరో శ్రీలంక కాబోతున్నదని ప్రజలను బెదరగొట్టే ప్రయత్నాలు చేసింది. డబ్బంతా పప్పు బెల్లాలకే ఖర్చు చేస్తున్నారు తప్ప అభివృద్ధి కోసం పైసా విదల్చడం లేదని చాటింపు వేసి మరీ బాకా ఊదారు. ఇటువంటి కుక్క కాట్లకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ శాఖలే చెప్పుదెబ్బల్లాంటి సమాధానాలిచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వ్యయంలో అభివృద్ధి వాటానే ఎక్కువని బడ్జెట్ గణాంకాలను ఉటంకిస్తూ ఆర్బీఐ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. సామాజిక రంగంపై చేసే ఖర్చు... అంటే విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, గోదాముల నిర్మాణం వంటివన్నీ అభి వృద్ధి ఖాతాలోకే వస్తాయని ఆర్బీఐ తేటతెల్లం చేసింది. 11.43 శాతం వృద్ధిరేటుతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి దేశంలోనే మొదటిస్థానంలో (2021–22) ఉన్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నివేదికల సారాంశం ఎల్లో మీడియాకు నిద్ర పట్టనివ్వడం లేదు. అది వితండవాదానికి తెగబడుతున్నది. అమరావతిలో నాలుగు భవంతుల నిర్మాణమే అభివృద్ధిగా ప్రచారం చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. ప్రపంచమంతటా ఇప్పుడు కొత్త గాలులు వీస్తున్నాయి. నయా ఉదారవాదానికి (Neo Liberalism) కాలం చెల్లినట్టేనని పెట్టుబడిదారీ ఆర్థిక ప్రవక్తలే గట్టిగా వాదిస్తున్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఈ దేశంలో సృష్టించిన కీలుబొమ్మల్లో ముఖ్యుడైన చంద్రబాబు సహా ఆయన పెత్తందారీ ఎల్లో కూటమి ఇంకా దాన్నే పట్టుకొని వేలాడుతున్నాయి. మానవాభివృద్ధి కంటే వస్తుగతాభివృద్ధిలోనే పెత్తందారీ వర్గాల స్వీయ ప్రయోజనాలు ఇమిడి ఉండటమే అందుకు కారణం. గడిచిన నాలుగేళ్లలో ఒకదాని తర్వాత ఒకటి చొప్పున లాటిన్ అమెరికాలో నయా ఉదారవాద ప్రభుత్వాలు కుప్పకూలు తున్నాయి. వాటి స్థానంలో వామపక్ష, వామపక్ష మధ్యేవాద ప్రభుత్వాలను ప్రజలు అధికారంలోకి తెస్తున్నారు. మెక్సికో, అర్జెంటీనా, చిలీ, పెరూ, బొలీవియా, హోండూరస్, బ్రెజిల్ వగైరా డజన్‌కు పైగా లెఫ్టిస్టు ప్రభుత్వాలతో దక్షిణ అమెరికా ఖండం రంగు మారుతున్నది. నయా ఉదారవాదపు అమాన వీయ పంపిణీ విధానాన్ని జనం తిరస్కరిస్తున్నారు. నయా ఉదారవాదం సృష్టించిన అసమానతలు ఎంత అమానుషంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు ఆక్స్‌ఫామ్ విడుదల చేస్తున్న నివేదికలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. మొన్నటి దావోస్ సమావేశాల తొలిరోజు విడుదల చేసిన తాజా నివేదిక మరింత భయంగొలిపే విధంగా ఉన్నది. ఈ రెండున్నరేళ్లలో ప్రపంచం 42 ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టించింది. జనాభాలో ఒక్క శాతం శ్రీమంతుల ఖాతాలో అందులో 67 శాతం సంపద పడి పోయింది. మిగిలిన 99 శాతం మందికి 33 శాతం సంపద. ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక నయా ఉదారవాద అమానుషత్వాన్ని ఎత్తి చూపింది. సంపన్నుల సంపద ఈ పాతికేళ్లలో ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా పేద ప్రజల పేదరికం కూడా పెరిగింది.భారతదేశం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అట్టడుగున ఉండే 50 శాతం మంది పేద ప్రజల చేతిలో 3 శాతం సంపద మాత్రమే ఉన్నది. ఒక్కశాతం కుబేరుల చేతిలో 40 శాతం సంపద పోగుపడింది. ఈ కుబేరుల్లో వరసగా 10 శాతం మందిని లెక్కిస్తే వారందరి చేతిలో కలిపి 80 శాతం సంపద ఉన్నది. అంటే ఈ దేశంలో ఒక వంద రూపాయల సంపద ఉందనుకుంటే, దేశ జనాభా వందమంది అనుకుంటే పంపిణీ ఈవిధంగా ఉంటుంది. పదిమంది ధనవంతుల ఆస్తి 80 రూపా యలు. 50 మంది పేదవారి ఉమ్మడి ఆస్తి 3 రూపాయలు. 40 మంది మధ్య–ఎగువ మధ్యతరగతి వారి ఆస్తి విలువ 17 రూపా యలు. దేశంలోని సమస్త ప్రజలు సమష్టిగా శ్రమించి, అందరికీ చెందవలసిన సహజ వనరులను ఉపయోగించుకుని సృష్టించిన సంపదలో ఈ రకమైన పంపిణీ న్యాయమైనదేనా? ఈ దేశంలోని శ్రీమంతులకూ, పెట్టుబడిదారులకూ ఇంకో సౌలభ్యం కూడా ఉన్నది. వాళ్లు బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్మును అప్పుగా తీసుకొని ఆ తర్వాత ఎగవేయవచ్చు. అలా గడిచిన ఎనిమిదేళ్లలో 12 లక్షల కోట్ల రుణాలను ఎన్పీఏలుగా పరిగణించి కేంద్ర పెద్దల సాయంతో మాఫీ ముద్ర వేసేశారట. ఏ పేదవాడి రుణాన్నయినా ఈ దేశంలోని ఏ బ్యాంకయినా ఇలా మాఫీ చేసిన చరిత్ర ఉన్నదా? చెంబూ, తపేలాలతో సహా ఇంటినీ, ఒంటి మీది గోచీని కూడా వేలంవేసి వసూలు చేయడమే బ్యాంకులకు రివాజు. ఈ నేపథ్యంలోనే నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా కొత్త ఆలోచనలు ముందుకు వచ్చాయి. ఈ ఆలోచనలకే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పట్టం కడుతున్నారు. లాటిన్ అమెరికా దేశా ల్లోని పరిణామాలను కూడా ఈ కోణం నుంచే అర్థం చేసు కోవలసి ఉంటుంది. అసమానతలతో కూడిన అమానవీయ అభివృద్ధికి బదులుగా సమస్త మానవుల అభివృద్ధి, ప్రకృతి వనరుల పరిరక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (Sustainable development) ఎంపిక చేసుకోవాలనేది ఒక ముఖ్యమైన ఆలోచన. ముఖ్యమైన పరిశ్రమలు, కీలక మౌలిక రంగాల మీద ప్రభుత్వరంగ అజమాయిషీయే కొనసాగాలనేది మరో ఆలోచన. ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేయడానికీ, విద్య, వైద్య సౌకర్యాల విస్తరణకూ, వారి సాధికారతకూ ప్రభు త్వాలు పెద్దఎత్తున ఖర్చు చేయాలి. ధనిక–పేద, ఆడ–మగ, జాతి లేదా కులాల మధ్య అంతరాల్లేని అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి. ఈ తరహా ఆలోచనలకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పట్టం కడుతున్నారు. ఈ పూర్వరంగం నుంచి చూసినప్పుడే మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా అర్థమవుతాయి. పేద వర్గాల ప్రజలను నిలబెట్టడానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల కోట్లను ప్రత్యక్షంగా బదిలీ చేయడాన్ని ‘ఈనాడు’ సహిత ఎల్లో మీడియా, ఆంధ్రప్రదేశ్ పెత్తందార్లు, వారి నాయకుడైన చంద్ర బాబు సహించలేకపోతున్నారు. ఇలా ఖర్చుపెడితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారు. ట్యాక్స్ పేయర్ల సొమ్మును ఉచితాలకు తగలేస్తున్నారని మధ్యతరగతి వారిని రెచ్చగొడుతున్నారు. అయ్యా ట్యాక్స్ పేయర్లూ! మీ సొమ్మును ఎవరు కబళించుకుపోతున్నారో కొంచెం బుర్రపెట్టి ఆలోచించండి. ఎల్లో మీడియా మిడిమిడి జ్ఞానపు రాతలకూ, వాట్సప్ యూనివర్సిటీ పోసుకోలు పాఠాలకూ ప్రభావితం కావద్దు. మీ ట్యాక్స్ సొమ్మునే కాదు, పేద ప్రజలు రక్తమాంసాలు కరిగించి చిందించిన చెమట చుక్కల్ని కూడా కుబేరులు దోచుకుంటున్నారు. ఆ కుబేరులు పోగేసుకున్న 80 శాతం సంపదలో కనీసం సగమైనా సామాజిక అభివృద్ధికి తరలించ వలసిన అవసరం లేదా? ఆలోచించండి. ‘యుద్ధం ముగిసిన రణభూమి వృద్ధాప్యం’ అంటారు. చేతులు – కాళ్లు తప్ప మరే ఆస్తిలేని పేదలంతా కరాల బిగువు, నరాల సత్తువ ఉన్నంతవరకూ జీవన పోరాటం చేసి అలసి సొలసి, కొంచెం సాంత్వన కోరుకుంటారు. కన్నబిడ్డలు ఎవరి బతుకు పోరులో వారు నిమగ్నం కాగా, బుక్కెడు బువ్వకోసం, ఓ చిన్న పలకరింపు కోసం అవ్వాతాతలు ఎదురుచూస్తుంటారు. వారి ఇళ్ల వద్దకు వలంటీర్లు వెళ్లి యోగక్షేమాలడిగి పెన్షన్ డబ్బులు చేతిలో పెడితే పాపమా? అది వ్యవస్థ బాధ్యత కాదా? ‘ఈనాడు’–చంద్రబాబు ఎల్లో కూటమి అది పాపమనే అభి ప్రాయపడుతున్నాయి. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చద వడం కూడా పాపమనే భావిస్తున్నాయి. మహిళలకు సమాన స్థాయి సామాజిక – రాజకీయ – ఆర్థిక హోదాను కల్పించడాన్ని కూడా పాపకార్యంగానే భావిస్తున్నాయి. కనుక ఈ తరహా సుస్థిర–మానవీయ అభివృద్ధి లక్ష్యాలను ఎంచుకున్న జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అవి యుద్ధానికి సమాయత్తమవు తున్నాయి. కానీ ఈ కూటమి నమ్ముకున్న నయా ఉదార విధా నాలు ప్రపంచమంతటా మట్టికరుస్తున్నాయి. కొత్త ఆలోచనల ఝంఝామారుతం ప్రచండ వేగంతో వీస్తున్నది. ఇనుప తెరలు ఆ వేగాన్ని తట్టుకోలేవు. ఎన్ని రాజకీయ కూటములను ఏర్పాటు చేసుకున్నా, ఎంతమంది ప్రవచకుల చేత సుభాషితాలు చెప్పించినా, ఎన్ని చిలుక జోస్యాలను ప్రచారంలో పెట్టినా, జగన్ మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసుకున్న పేదవర్గాలు – మధ్యతరగతి ప్రజల ఐక్య సంఘటనను ఎదుర్కోలేవు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పసుపురంగు దేవతావస్త్రం!
రాజుగారి దేవతా వస్త్రాల కథ మనందరికీ తెలిసిన వృత్తాంతమే. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు డంబాచారం ఎక్కువ. అందరికంటే తానే గొప్పవాడని ప్రజలంతా నమ్మాలని అతనికి బలమైన కోరిక. ఒకసారి ఆయన కొలువుకు వచ్చిన ఒక పరదేశి మన రాజుగారికి ఒక వింత విషయం చెబుతాడు. ‘రాజా! నాకు కొంత బంగారం, వెండి ఇప్పించండి. వాటితో నేను అద్భుతమైన దేవతా వస్త్రాలను జరీ అంచుతో తయారు చేస్తాను. అటువంటి వస్త్రాలను ధరించడానికి తమరు మాత్రమే యోగ్యులు. అయితే అవి తెలివైన వారికి మాత్రమే కనిపిస్తాయ’ని నమ్మబలుకుతాడు. దేవతా వస్త్రాలను ధరించే అవకాశం తనకే వస్తుందన్న ఆత్రంతో రాజుగారు సదరు పరదేశీకి కావలసి నంత బంగారాన్నీ, వెండినీ ఇప్పించాడు. కొన్నాళ్ల తర్వాత పరదేశి రాజుగారి దగ్గరకొచ్చి ‘రాజా! ఇదిగో వస్త్రాలు. ధరించండం’టాడు. దుస్తులు కనిపించడం లేదంటే తననందరూ తెలివితక్కువ వాడనుకుంటారన్న భయంతో రాజుగారు ‘వాటిని’ ధరించినట్టు నటిస్తాడు. అందరూ వింతగా చూస్తారే తప్ప ఎవరూ కనిపించడం లేదని చెప్పరు. తన రాజ్యంలో తెలివితక్కువ వాళ్లను గుర్తించాలన్న కోరికతో అవే ‘వస్త్రాలతో’ రాజుగారు రథం మీద కూర్చుని ఊరేగింపుగా బయల్దేరుతారు. వీధుల్లో గుమికూడిన జనం గుడ్లప్పగించి చూస్తారే తప్ప ఎవరూ మాట్లాడరు. నిజం చెబితే తెలివితక్కువ ముద్ర పడుతుందన్న భయంతో నటిస్తుంటారు. ఈ గొడవలేమీ తెలియని ఒక చిన్న పిల్లాడు మాత్రం పిల్లి మెడలో గంట కడతాడు. ‘రాజుగారికి బట్టల్లేవోచ్... పప్పు షేమ్’ అని అరుస్తాడు. జనంలో సంచలనం మొదలవుతుంది. నిజమే... రాజుగారికి బట్టల్లేవు. ఏమైందీయనకు అనుకుంటూ అందరూ నవ్వడం మొదలుపెడతారు. రాజుగారికి విషయం అర్థమవుతుంది. పరాభవ భారంతో మందిరానికి వెళ్లిపోతాడు. క్రీస్తుశకం 1995. యువ నామ సంవత్సరం శ్రావణ మాసంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక అంతఃపుర కుట్ర జరిగింది. ఎల్లో మీడియాకు గ్యాంగ్ లీడర్‌గా లబ్ధప్రతిష్ఠులైన రామోజీరావు పౌరోహిత్యానికి పూనుకోగా చంద్రబాబు నాయుడు ఓ పచ్చల పిడిబాకును పూజించి, దాన్ని ఎన్టీ రామారావు వెన్నులో దించడం, ఆయన్ను సింహాసనంపైనుంచి తోసేయడం జగమెరిగిన గబ్బు వ్యవహారం. ఆ గబ్బును కప్పేయ డానికి అదేరోజు నుంచి ఎల్లో మీడియా చంద్రబాబు చేత దేవతా వస్త్రాన్ని ధరింపజేయడం మొదలుపెట్టింది. ఆ దేవతా వస్త్రం పేరు – ‘అభివృద్ధి’. కథలోని రాజుకు దేవతా వస్త్రం వెనుక ఉన్న మోసం గురించి తెలియదు. ఇక్కడ ఆ వస్త్రాన్ని కప్పించుకున్న కథానాయకుడూ, కప్పిన కథా రచయితలూ మోసంలో భాగస్వాములే! అభివృద్ధి దేవతా వస్త్రాన్ని ఎల్లో మీడియా ఎంతగా ప్రచారంలో పెట్టిందంటే... ఎవరూ కూడా బుర్రను ఉపయో గించి ‘ఏదీ... కనపడదే’ అని గట్టిగా అడగలేనంతగా! ‘చూడూ... మా చూపుడు వేలు వైపే చూడు... మరోవైపు చూడకూ’ అన్న చందంగా ఎల్లో మీడియా నాటి తెలుగు పాఠక మహాశయులకు దిశానిర్దేశం చేసింది. ఒకవేళ ఎవరైనా ధైర్యంచేసి ఆ దేవతా వస్త్రాన్ని తదేకంగా చూసి ఉంటే అరివీర భయంకర నిజరూప దర్శనంతో మూర్ఛ రోగానికి లోనయ్యే వారు. తెలుగు ప్రజల కోసం ఎల్లో మీడియా ఒక కొత్త డిక్షనరీని తయారుచేసింది. అందులో అభివృద్ధి అనే మాటకు చంద్రబాబు అనే అర్థాన్ని తగిలించింది. ‘అన్న అడుగేస్తే అభివృద్ధి, అన్న మడతేస్తే అభివృద్ధి’ అనే బృందగానాన్ని జనంలోకి వదిలింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ హయాం లోనే శంకుస్థాపన చేసిన సైబర్ టవర్ భవనాన్ని అనివార్యంగా కట్టాల్సి వచ్చింది. ఆ కట్టడాన్ని రెండేళ్లు ఆలస్యం చేసి, ఈలోగా తనవాళ్ల చేత చుట్టుపక్కల భూములన్నీ కారుచౌకగా కొనిపిం చారు. అమరావతి స్కెచ్‌కు హైటెక్ సిటీ మినియేచర్ అన్న మాట. సొంత మనుషుల చేత ఆ ప్రాంతంలో వెంచర్లు వేయిం చారే తప్ప మౌలిక వసతుల కల్పనపై పదేళ్ల దూరదృష్టిని కూడా ఆయన ప్రదర్శించలేదు. పదేళ్లు నిండకుండానే అక్కడ రోడ్లను విస్తరింపజేయాల్సి వచ్చిందంటేనే వారి విజన్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈమాత్రం ఘనకార్యానికే బాబును ఐటీ యుగకర్తగా ఎల్లో మీడియా కీర్తించడం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్‌కు వస్తే అది బాబు ఘనతేనని ప్రచారం చేసింది. అమెరికా అధ్యక్షుడంతటోడు హైదరాబాద్‌కు రావడ మేమిటి... బాబుగారి తావీజు మహిమ కాకపోతే... ఈతరహా ప్రజాభిప్రాయాన్ని వండి వార్చింది. ఆ కాలంలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అన్ని రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రారంభమయ్యాయి. వీటిని కనిపెట్టిన వ్యక్తిగా చంద్రబాబు పేరునే ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమై పూర్తయిన ఔటర్ రింగ్‌రోడ్డు, షంషాబాద్ ఎయిర్ పోర్టులను కూడా బాబు ఖాతాలోనే వేసుకున్నారు. మరీ ఘోరమేమిటంటే కేసీఆర్ పట్టాలెక్కించిన మెట్రో ప్రాజెక్టు కూడా బాబు మెదడుకు పుట్టిన బిడ్డేనని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్లలో వాస్తవానికి ఏం జరిగింది? సగం జనాభాను అక్కున చేర్చుకునే వ్యవసాయరంగం కుదేలైంది. పంటచేలలో మృత్యు కంకులు పాలు పోసుకున్నాయి. సస్య క్షేత్రం శ్మశానమైంది. వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసు కున్నారు. కులవృత్తులు కూలిపోయాయి. వందలాదిమంది నేతన్నలు బలవన్మరణాన్ని ఆశ్రయించారు. పేద బిడ్డలు చదు వుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు పాడుబడ్డాయి. లక్షలాది జనం వలసబాట పట్టారు. పల్లెలు బీళ్లయ్యాయి. ఇదీ నాటి సామాజిక నిజరూపం. దీనిపై ఎల్లోమీడియా ‘అభివృద్ధి’ అనే అంగవస్త్రాన్ని కప్పింది. ప్రచారం చేసింది. ప్రజలు నమ్మ లేదు. ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. అలిపిరి దాడి సాకుతో సానుభూతి డ్రామా నడిపినా జనం కనికరించలేదు. మళ్లీ ఇప్పుడు ఆ దేవతా వస్త్రం చంద్రబాబుకు అవసర మైంది. ఎల్లో మీడియా ఇప్పుడు మరోసారి ఆ దేవతా వస్త్రాన్ని జనానికి చూపెట్టే ప్రయత్నం మొదలైంది. ఈసారి ఆయన అధికారంలోకి రాకపోతే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే తప్ప ఆయన కాదట! ఎల్లో మీడియా ప్రజలను బెదిరించడం మొదలుపెట్టింది. సంకేతాన్ని గ్రహించిన చంద్రబాబు కూడా బెదిరిస్తున్నారు. ‘నేను గెలవకపోతే మీకే నష్టమ’ని ప్రజల్నే దబాయిస్తున్నారు. ప్రజలు ఏరకంగా నష్టపోతారన్న ప్రశ్నకు అభివృద్ధి ఆగిపోతుందనేది వారి జవాబు. అసలు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటి? ఈ ప్రశ్నకు వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం పిట్టలదొర సంభాషణకు సరితూగుతుంది. పీవీ సింధుకు బ్యాడ్మింటన్ నేర్పారట! సెల్‌ఫోన్ ఇండియాకు రావడానికి ఆయనే కారణమట! ఆయన లేకపోతే సెల్ఫోన్లను హిమాలయ పర్వతాలు అడ్డగించేవట! సానియా మీర్జాను టెన్నిస్‌లో ప్రోత్సహించిందీ, సత్య నాదెళ్లకు కంప్యూటర్లో ఆసక్తి కలిగించిందీ ఆయనేనని స్వయంగా వారే ప్రచారం చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారం భించిన గ్రామ సచివాలయాలు కూడా తన ఐడియాయేనని ఈమధ్యనే చంద్రబాబు ఓ న్యూక్లియర్ మిసైల్‌ను జనం మీదకు వదిలారు. సచివాలయాలను ప్రారంభించినప్పుడు అదో పనికిరాని కార్యక్రమమని తానే దుమ్మెత్తి పోసిన వైనాన్ని ఆయన మరిచిపోయారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి ఈ వ్యవస్థను పరిశీలించి ప్రశంసిస్తుండటంతో బాబు బాణీ మారింది. ఇంకో రెండు మూడేళ్ల తర్వాత సచివాలయాలను, ఆర్బీకే కేంద్రాలను, వలంటీర్ వ్యవస్థను, ఫ్యామిలీ డాక్టర్‌ను, ‘నాడు–నేడు’ కార్యక్రమాలనూ ఎల్లో మీడియా చంద్రబాబు ఖాతాలో వేయకపోతే ఆశ్చర్యపడవలసిందే! ‘అభివృద్ధి’ అంటే ఏమిటనే ప్రశ్నకు ఈ ముఠా స్పష్టమైన సమాధానం ఎప్పుడూ చెప్పదు. అభివృద్ధి అనగా చంద్రబాబు అంతే! జగన్మోహన్రెడ్డి మూడేళ్ల కాలంలోనే (రెండేళ్లు కరోనా) ప్రభుత్వరంగంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిం చారు. అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తిచేసుకొని వచ్చే యేడు తరగతులను ప్రారంభించబోతున్నాయి. చంద్రబాబు పధ్నాలుగేళ్ల కాలంలో కట్టిన మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా లేదు. 30 వేల కోట్ల ఖర్చుతో జగన్ ప్రభుత్వం నాలుగు గ్రీన్‌ఫీల్డ్ రేవు పట్టణాలను, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. పధ్నాలుగేళ్ల బాబు పరిపాలనలో నిర్మించిన పోర్టు ఏమైనా ఉన్నదా? ఫిషింగ్ హార్బర్ ఒక్కటైనా ఉన్నదా? మత్స్యకారులు గుజరాత్ లాంటి దూరతీరాలకు వెళ్లి దోపిడీకి గురికావడమే కదా చంద్రబాబు హయాంలో జరిగింది. భారీ పరిశ్రమలు, ఎమ్ఎస్ఎమ్ఈలు కలిసి ఈ మూడు న్నరేళ్లలో కల్పించిన ఉద్యోగాలు 2,35,000. చంద్రబాబు మొన్నటి ఐదేళ్లలో ఇందులో సగం ఉద్యోగాలను కూడా పారి శ్రామికరంగంలో కల్పించలేదు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో సగటున ఏటా 11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, ఈ మూడు న్నరేళ్లలో సగటున ఏటా 13 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కోవిడ్ విజృంభించిన కాలం కూడా ఇదేనని గమనంలో ఉంచు కోవాలి. ఇవి కాకి లెక్కలు కావు, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గణాంకాల ఆధారంగా చెబుతున్నవి. ఇక ప్రభుత్వరంగంలో చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన మొత్తం నియామకాలు 34 వేలు. ఈ మూడు న్నరేళ్లలో ప్రభుత్వం చేసిన రెగ్యులర్ నియామకాలే 1,55,000. వీటికి అదనంగా 51 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వో ద్యోగులుగా మార్చడం జరిగింది. అదనంగా 38 వేల కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. ఔట్సోర్సింగ్ ద్వారా 1,10,000 మందిని నియమించారు. గౌరవ వేతనంపై నియమితులైన 2,60,000 మంది వలంటీర్లు వీరికి అదనం. ఎక్కడైనా పోలిక ఉన్నదా? ఈ లెక్కలేవీ చంద్రబాబు పార్టీకీ, మీడియాకూ అవ సరం లేదు. లెక్కల్లోకి పోతే బొక్కబోర్లా పడతామని తెలుసు. అభివృద్ధి అంటే చంద్రబాబు అనే నిర్వచనం చెప్పడం, దాన్ని బ్రాండింగ్ చేయడం, అమ్ముకోవడం, ‘జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న’ అనే భజన గీతాన్ని పాడు కోవడం! ఎదుటి పక్షం మీద గోబెల్స్ ప్రచారం. అంతే! అదే వారి ఎజెండా! అభివృద్ధి అంటే ఏమిటి? కొందరు కోటీశ్వరులు శత కోటీశ్వరులు, సహస్ర కోటీశ్వరులు కావడమా? బహుళ అంత స్తుల భవనాలు లేవడమా? ఇది కాదు అభివృద్ధి నిర్వచనమని ఇప్పుడు విజ్ఞులందరూ చెబుతున్నారు. ఈ భూమి, భూమిపై ఉన్న గాలి, నీరు, వెలుతురు, చెట్టూ పుట్ట గుట్ట అన్నిటిపై సమస్త మానవాళితో పాటు జీవరాశి యావత్తు కూడా హక్కుదారులే. ఈతరం జీవులే కాదు, రానున్న వేలవేల తరాలకూ ఈ భూమాత ఆశ్రయం కల్పించవలసి ఉన్నది. అందువలన పర్యావరణ హితమైన అభివృద్ధి నమూ నాను ఎంచుకోవలసి ఉన్నది. అభివృద్ధి కూడా సమ్మిళిత అభివృద్ధి కావాలి. సమాజ పరిణామ క్రమంలో వెనకబడిన జనసమూహా లన్నీ సాధికారతను సంతరించుకోవాలి. వారి శక్తి మేరకు పని దొరకాలి. అవసరం మేరకు భుక్తి దొరకాలి. ఈ భూగ్రహం అంద రికీ ఉమ్మడి గృహం కావాలి. ఈ సదాశయం తోనే ఐక్యరాజ్య సమితి వారు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డిజి) పేరుతో ఒక ఆచరణీయ కార్యక్రమాన్ని 17 అంశాలతో ప్రతిపాదించారు. 2030లోగా అన్ని దేశాలూ ఈ లక్ష్యాలను సాధించాలని సూచిం చారు. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకూ – మన రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని అంశాలతో సాపత్యం కుదురుతుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దిక్సూచిగా ఎంచు కుంటూ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఏకైక రాష్ట్రం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. బడ్జెట్లకు ప్రేరణగా నిలుస్తున్న ‘నవ రత్నాల’ కార్యక్రమం గానీ, విద్యా రంగంలో, వైద్యరంగంలో, వ్యవసాయంలో తీసుకొస్తున్న విప్లవాత్మక సంస్కరణలు కానీ, ఇంటి గడపకు చేరుకుంటున్న పరిపాలనా, రాజకీయ సంస్కర ణలు గానీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలవైపు పడుతున్న అడుగులే! ఈ అడుగుజాడల్లో బురదను కూర్చడానికి బాబు సమేత ఎల్లో మీడియా ప్రయత్నిస్తున్నది. వారి అభివృద్ధి లక్ష్యం ఒక్కటే – 30 వేల ఎకరాల్లో తలపెట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్ పునః ప్రారంభం కావడం! వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com -
చిలుక పేరు ఛీనాడు!
ఏడేడు సముద్రాల కావల ఒక నిర్జన ద్వీపం ఉండేదట! ఆ ద్వీపంలో ఒక ఊడల మర్రి. ఆ మర్రిచెట్టు తొర్రలో ఓ చిలుక. ఆ చిలుక గొంతులో ఉండేదట మాయల ఫకీరు ప్రాణం. ఆ మాయల ఫకీరు అనేవాడు లోకం మీద పడి నానా అరాచకాలు చేసేవాడు. స్త్రీలను చెరపట్టేవాడు. దోపిడీలు చేసేవాడు. కొన్నేళ్ల పాటు వీడి అఘాయిత్యాలు భరించిన జనం విసిగిపోయారు. చివరకు ఒక యువకుడు ఏడు సముద్రాలను దాటి, చెట్టు తొర్రలోని చిలుక గొంతు నొక్కేస్తే తప్ప ఆ మాయల ఫకీరు పీడ విరగడ కాలేదు. ఇప్పుడైతే అటువంటి చిలుకల్ని సముద్రాలకవతల దాచిపెట్టవలసిన అవసరమే లేదు. హైదరాబాద్ మహానగరం శివార్లలో జాతీయ రహదారిని ఆనుకొని రెండువేల ఎకరాల్లో ఒక మంత్రలోకం విస్తరించి ఉంటుంది. ఓ మూలన ఒక ఒంటరి మట్టి గుట్ట. ఒంటి స్తంభంపై నిలబడినట్టు ఆ గుట్టపై ఒక మేడ. ఆ మేడలో ఒకాయన ఉంటారు. ఆయన పేరు రామోజీరావు. ఆయన ముంజేతిపై ఆ చిలుక ఎల్లప్పుడూ వాలి ఉంటుంది. ఆ చిలుక పేరు ‘ఈనాడు’. పేరుకే అది చిలుక. అరిస్తే కర్ణకఠోరం. యజమాని రామోజీ ఆదేశాలకు అనుగుణంగా ఆ చిలుక అరుస్తుంది. దాని అరుపులే సంకేతాలుగా గ్రహించి పనిచేసే ఒక రాజకీయ వ్యవస్థ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది. ఆ వ్యవస్థ మొత్తాన్ని మాయల ఫకీరు క్యారెక్టర్‌తో పోల్చవచ్చు. వ్యవస్థతో కాదు, వ్యక్తితోనే పోల్చాలి అంటే సదరు వ్యవస్థను మోస్తున్న బాబెవరైతే ఉంటారో ఆ బాబునే మాయల ఫకీరు అనుకోవచ్చు. మాయల ఫకీరు ఏం చేసినా తనకోసం తన ఆనందం కోసమే! ఈ బాబు కూడా ఏం చేసినా తన కోసం, తన వారికోసం! చిలుకబాస్ కళ్లల్లో ఆనందం చూడటం కోసం, ఇంకో నాలుగైదు ట్రెయినీ చిలుకల సంతృప్తి కోసం మాత్రమే! తనకు నచ్చిన వాళ్లను ఒకరకంగా, నచ్చని వాళ్లను మరోరకంగా ‘ఈనాడు’ చిలుక బ్రాండింగ్ చేస్తుంది. తనవాడైతే మాయల ఫకీరును కూడా గౌతమ బుద్ధుడని చెబుతుంది. తనవాడు కాకపోతే గాంధీని కూడా గాడ్సే అని పిలుస్తుంది. తన కూటమి ప్రయోజనాలకు భిన్నంగా ఏ నాయకుడైనా గట్టిగా నిలబడితే అతడి మీద అప్పుడెప్పుడో తానే చేసిన, వీగిపోయిన ఆరోపణల్ని మళ్లీ తవ్వి తీస్తుంది. తన బాబుగారి ఆకాంక్షలకు ఎవరైనా బలంగా అడ్డుపడి నట్లయితే, ‘మన కోహినూర్ వజ్రాన్ని లార్డ్ డల్హౌసీ చేతిలో పెట్టి లంచాలు తిన్నవాడు ఇతనే’నని ఆరోపించగలుగుతుంది. అందుకు సాక్ష్యంగా సమాధుల్లోంచి కొన్ని ప్రేతాత్మలను లేప గలుగుతుంది. తమ ఎల్లో కూటమి అరాచకాలను, దౌర్జన్యాలను ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే... ‘ఇదుగో ఇతగాడు మహ్మద్ గజనీ వెంట దండయాత్రల్లో పాల్గొన్నాడ’ని బ్రాండింగ్ చేయగలుగు తుంది. సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి కొల్లగొట్టిన రత్నరాశుల లెక్కను ఇతడిప్పుడు చెప్పవలసిందేనని నిల దీస్తుంది. తనకు చిత్తం వచ్చినట్టు ఇతరుల మీద బురద చల్లే ‘ఈనాడు’ చిలుక తన యజమాని చట్టవిరుద్ధ కార్యక్రమాలపై, ఎల్లో కూటమి సీఈవో బాబుగారి అవినీతిపై ఎక్కడా చర్చ జరగకుండా పహారా కాస్తుంది. ఎవరైనా తెగించి చర్చిస్తే వారిలోంచి లేని సంఘ విద్రోహశక్తిని వెలికితీసి మొహాన టార్చ్‌లైట్ వేస్తుంది. మావాళ్లు పత్తిత్తులనీ, మచ్చలేని మహా తోపులనీ నమ్మబలుకుతుంది. ఎల్లో కూటమికి సూపర్‌బాస్‌గా వ్యవహరిస్తూ, సాలెగూడు వెనకాల కనపడకుండా కూర్చొని రిమోట్ నొక్కే వ్యక్తి ‘ఈనాడు’ చిలుక బాస్ రామోజీరావు. వారి చట్టవిరుద్ధ కార్యక్రమాలు బహిరంగ రహస్యం. రెండువేల ఎకరాల ఫిలిం సిటీ సామ్రాజ్యాన్ని ఆయన చట్ట విరుద్ధంగానే నిర్మించుకున్నారు. ప్రభుత్వాలు పేదలకిచ్చిన అసైన్మెంట్ భూములను కొనుగోలు చేయడం నేరం. అది నేరమని తెలిసినా ఆయన కొనుగోళ్లు చేశారు. తన సామ్రాజ్య విస్తరణకు సహకరించకుండా, అమ్మకా నికి నిరాకరించిన రైతుల భూములకు దారి లేకుండా చేసి భయపెట్టి విస్తరించగలిగారు. గ్రామాలను కలిపే రహదారు లనూ కబ్జా చేశారు. చెరువులను పూడ్చేసి కలిపేసుకున్నారు. గీత కార్మికులకు ఉపాధినిచ్చే వందలాది తాటిచెట్లను నరికించారు. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు జరగాలంటే భూ వినియోగ మార్పిడి జరగాలి. అటువంటిదేమీ జరగకుండానే ‘నాలా’ చట్టాన్ని హేళన చేస్తూ బహుళ అంతస్థుల భవనాలను డజన్ల కొద్దీ నిర్మించారు. ఫిలిం సిటీలో 147 అక్రమ నిర్మాణాలు న్నాయని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం లెక్క తేల్చింది. వాటిని కూల్చివేస్తామంటూ అప్పుడప్పుడు అధికారులు నోటీసులు పంపిస్తుంటారు. రామోజీరావు పట్టించుకోరు. వీరు కూల్చి వేయరు. ఈ వ్యవహారం ఒక టెలివిజన్ సీరియల్. కానీ ఆయన చట్టవిరుద్ధ కార్యక్రమాలకు సాక్ష్యంగా ఈ 147 అక్రమ నిర్మా ణాలు ఎగరేసిన జెండాల మాదిరిగా రెపరెపలాడుతున్నాయి. అనాజిపూర్ రెవిన్యూ పరిధిలోకి వచ్చే ఒక 60 ఎకరాల భూమిని సీలింగ్ చట్టం ప్రకారం మిగులు భూమిగా తేల్చి పేదలకు అసైన్ చేశారు. ఆ పేదలకు పప్పుబెల్లాలు పంచి రామోజీరావు సదరు భూమిని కబ్జాచేసి వాడుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ రూ.300 కోట్ల పైమాటే. రిజిస్ట్రేషన్ విలువలు రాయడానికి ఆయన చస్తే ఒప్పుకోరు. ఇటీవల వైజాగ్‌కు సంబంధించిన వార్తా కథనంలో రిజిస్ట్రేషన్ వాల్యూ లెక్కించడమేమిటి? ఠాఠ్ బహిరంగ ధరనే లెక్కించాలని ఈనాడు చిలుక దబాయించింది. నాగన్‌పల్లి గ్రామ రెవిన్యూ పరిధిలోని 14 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమి కూడా రామోజీ ఆక్రమణలో ఉన్నట్టు ప్రభుత్వాధికారులు గుర్తించారు. అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అందులో 585 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే ఆ పేదలు ఆ భూముల మీదకు రాకుండా అప్పట్నించీ ఫిలింసిటీ యాజమాన్యం అడ్డుకుంటూనే ఉన్నది. స్థానిక శాసనసభ్యుడు ఫిలింసిటీ తొత్తుగా మారడంతో పేదలకు అన్యాయం జరుగుతున్నది. నిన్న శుక్రవారం రోజున స్థానిక సీపీఎం నాయకుల బృందం ఈ ప్రాంతంలో పర్యటించి రామోజీపై భూకబ్జా కేసును నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. రాజశేఖరరెడ్డి పట్టాలిచ్చిన పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు స్వాధీనం చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తుందో లేదో చూడాలి. ఫిలింసిటీ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని రామోజీ సినిమా షూటింగ్‌లకు అద్దెకిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయులతో యుద్ధం వంటి భారీ షూటింగ్‌లు ఇక్కడ జరుగుతాయి. వీటిపై అద్దె వసూళ్లు కూడా పెద్దమొత్తంలోనే ఉంటాయి. భూమి ప్రభుత్వానిది! అద్దె రామోజీది! ఇదీ లోకానికి నీతులు చెప్పే సుద్దపూస బాగోతం!! నాగన్‌పల్లి – పోల్కంపల్లి గ్రామాల మధ్యన ఉన్న రోడ్డును ఫిలింసిటీ ఆక్రమించి రెండువైపులా గేట్లు పెట్టి తాళాలు వేసింది. పాతికేళ్లు గడిచాయి కానీ, ఆ తాళాలు ఇంతవరకూ తెరవనేలేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు రాజ శేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పట్టాలెక్కి గమ్యాన్ని చేరుకున్నాయి. అయితే అక్కడ విమానాశ్రయం పెట్టాలనే ప్రతిపాదనలు అంతకుముందు నుంచే ఉన్నాయి. చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఈ విషయం తెలుసు కున్న రామోజీ పాల్మాకుల గ్రామ పరిధిలో 431 ఎకరాల భూమిని బినామీల పేరున సేకరించారు. ఈ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అమ్మడానికి ఇష్టపడని వారిని బెదిరించి కొనుగోలు చేశారని గ్రామస్థులు ఇప్పటికీ చెబు తున్నారు. ఈ భూముల్లో కూడా అసైన్డ్ భూములున్నట్టు ప్రభుత్వ యంత్రాంగం నిర్ధారించింది. ఇక విశాఖపట్నం సీతమ్మధారలోని ‘ఈనాడు’ స్థల పురాణం వింటే ఎంతటివాడైనా దిగ్భ్రాంతికి లోనుకావలసిందే! ఆ స్థలం ఒకాయన దగ్గర అద్దెకు తీసుకున్నది. రోడ్డు విస్తరణలో కొంత భూమిని ప్రభుత్వం తీసుకున్నందుకు బదులుగా వేరొక చోట కేటాయించిన భూమిని యజమానికి ఇవ్వకుండా తానే కైంకర్యం చేశాడు రామోజీరావు. ఆయనపై అవినీతి నిరోధక శాఖ పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసింది. ఇక మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారం జగమెరిగిన అక్రమం. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ (1) నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఆయన 2,600 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. ఇందుకు పడాల్సిన శిక్ష రెండేళ్ల జైలు, 5,200 కోట్ల జరిమానా. అక్రమ బండారం బయటపడడంతో ఆయన హడావిడిగా రిలయన్స్ దగ్గర అప్పులు తెచ్చుకొని డిపా జిటర్లకు తిరిగి చెల్లించినట్టు ప్రకటించారు. చేసిన పాపం చెంప లేసుకుంటే పోతుందా? మరి న్యాయశాస్త్రం, చట్టాలు, కోర్టులు ఎందుకున్నట్టు? అందుకే ఈ కథ ఇంకా ముగిసి పోలేదు. మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఎల్లో కూటమిలోని రింగ్ లీడర్ పురాణం ఇట్లా వుంటే ఇక అందులోని దళపతులు, అధిపతులు, కులపతులు వగైరాల బాగోతాలెట్లా ఉండాలి! రెండెకరాల మెట్టభూమి నుండి రెండు లక్షల కోట్ల సంపద ఎత్తుకు ఎదిగిన విభ్రాంతికరమైన తాంత్రిక చరిత్ర చంద్రబాబు జీవితకథ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయవేత్త చంద్రబాబేనని ఇరవయ్యేళ్ల క్రితమే తెహల్కా డాట్‌కామ్ ప్రకటించింది. మొన్నటి ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు అవినీతి బాగోతంపై ఒక గ్రంథాన్ని ప్రచురించవలసి వచ్చింది. ఇక చంద్రబాబుకు దత్తపుత్రుడుగా ప్రచారంలో ఉన్న పవన్ కల్యాణ్ గురించి రెండు ముక్కలు చాలు. ఆయన మాట నిలకడ లేనితనంపై ఇప్పటికే ప్రజలకు ఏవగింపు కలిగింది. ఒకే అంశంపై సందర్భాన్ని బట్టి నాలుక మడతేయడంలో చంద్ర బాబు తర్వాత అంతటి సమర్థుడు పవనే అన్న అభిప్రాయం బలపడుతున్నది. ‘‘ఎవరి ప్రైవేట్ జీవితాలు వారివారి సొంతం, పబ్లిగ్గా నిలబడితే ఏమైనా అంటాం’’ అన్నాడు శ్రీశ్రీ. నాయ కుడుగా రాజకీయాల్లో నిలబడిన వ్యక్తి జీవితం ఆదర్శ ప్రాయంగా ఉండాలని అనుచరులు, ప్రజలు కూడా కోరు కుంటారు. ఆయన మూడు పెళ్లిళ్లు వివాదాస్పదమయ్యాయి. ‘నేను మాత్రం కోరుకున్నానా? ఏదో అలా జరిగిపోయింద’ని ఆ మధ్యనే ఒకసారి కామెంట్ చేశారు. మొన్న బీజేపీ ముసుగును తొలగించే సందర్భంలో మాట్లాడుతూ ‘కావాలంటే ఒకరికి విడాకులిచ్చి మరొకరి చొప్పున మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చ’ని ఇచ్చిన సందేశం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు పవన్ బాజప్తా ఎల్లో కూటమిలోని మనిషి. ఈ కూటమిలో మరో మీడియా మనిషి ఉన్నాడు. ఆయన పేరు నాయుడు. ఆయన గతంలో ‘న్యూజెన్’ పేరుతో ఒక తలనూనెను ప్రమోట్ చేశాడు. అది రాసుకుంటే జుట్టు ఊడిపోదనీ, బట్ట తల మీద కూడా వెంట్రుకలు మొలుస్తాయని ప్రచారం చేసుకున్నాడు. ‘నూనె రాసుకున్న తర్వాత చేతుల్ని గట్టిగా సబ్బుతో కడుక్కోకపోతే అరచేతిలో కూడా వెంట్రుకలు మొలుస్తాయి జాగ్రత్త!’ అని కూడా ప్రచారం చేసుకుని ప్రజల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఒక్క మెతుకు చాలు, ఇతని అవినీతి ఎంత ఉడికిందో చెప్పడానికి! ఇలాంటి బాపతుగాళ్లంతా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్కరుగా జతకూడబోతున్నారు. ప్రజాకంటక చరిత్ర కలిగిన వాళ్లంతా జతకట్టి దానికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే ముద్దుపేరు పెట్టబోతున్నారు. ఈ కూటమిలోకి కుడి ఎడమ పక్షాలను కూడా కన్నుగీటి పిలిచేందుకు సిద్ధపడుతున్నారు. వేటాడే ఓపిక నశించిన పెద్దపులి చేతిలో బంగారు కడియం పట్టుకుని, చెరువు గట్టున ఎదురు చూసిందట బక్రాగాడి కోసం! ఇప్పుడు చంద్ర బాబు – రామోజీలు ప్రజాస్వామ్య కడియం చేతిలో పట్టుకొని అలా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్‌ను కూలదోసి చంద్రబాబును గద్దెనెక్కించడం ఎల్లో కూటమికి ఇప్పుడొక జీవన్మరణ సమస్య. ఎందుకని? ఒక తక్షణ కర్తవ్యం ఉన్నది. ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉన్నది. ఎల్లో కూటమి అమరావతి భూముల్లో పెట్టిన పెట్టు బడికి లాభాలు పిండుకోవడానికి ఈ సర్కార్ ఆటంకంగా ఉన్నది. బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఎల్లో కూటమి శాశ్వతంగా అధికారానికి దూరమవ్వక తప్పదు. అందుకోసం ఆ ప్రయ త్నాలకు కళ్లెం వేయాలి. ఇది దీర్ఘకాలిక వ్యూహం. ఇంతకూ అమరావతి భూముల్లో ఎల్లో కూటమి, దాని అనుబంధ సభ్యులు, ఆత్మీయ సభ్యులు, శ్రేయోభిలాషులు, బ్లడ్ గ్రూపులవారూ అంతా కలిసి ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు? చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో ఆ ప్రాంతంలో 75 వేల ఎకరాల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 35 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ను మినహాయిస్తే సుమారు 40 వేల ఎకరాల్లో పెట్టుబడులు పెట్టి నట్టు ఒక అంచనా! రిజిస్ట్రేషన్ వాల్యూను ‘ఈనాడు’ చిలుక ఒప్పుకోదు కనుక మార్కెట్ వాల్యూనే లెక్కించాలి. చంద్రబాబు అప్పుడు చెప్పిన లెక్క ఎకరాకు 10 కోట్లు. దాని ప్రకారం నాలుగు లక్షలకోట్లు పెట్టుబడిగా పెట్టినట్టా? అందులో సగమైనా, పావలా వంతైనా సరే గుండె జారిపోయే లెక్కే. అందుకే వికేంద్రీకరణ అంటేనే హడలి చస్తున్నారు. పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చేసే పోరాటానికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే పేరు పెట్టుకున్నారు. ఇంతకంటే వింత ఉంటుందా? బలహీనవర్గాలు, మహిళల సాధికారతకు తాను వ్యతిరేకి నని మొదటి నుంచీ ఎల్లో కూటమి చాటుకుంటూనే ఉన్నది. బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కోర్టుకు వెళ్లింది. రాజధానిలో మా పక్కన పేద ప్రజలు ఉండటానికి వీల్లేదని నానాయాగీ చేసింది. ఇంగ్లీషు మీడియానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేయబోయి ప్రజాగ్రహానికి భయపడి తోక ముడిచింది. ఇది తాత్కాలికమే. ప్రజా సాధికారతకు వ్యతి రేకంగా తన కుట్రలను ఈ కూటమి ఆపదు. ప్రజలు సాధించు కుంటున్న విజయాలను కబళించడానికి పొంచి ఉన్నది. కుల మత ప్రాంతాలకు అతీతంగా పేదప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం. ఎల్లో కూటమి ప్రాణం ఫిలిం సిటీలోని ‘ఈనాడు’ చిలుకలో ఉన్నది. ఆ చిలుక పలుకుల మోసంపై అవగాహన పెరగాలి. ఆ చిలుక పలుకుల బండారాన్ని ఎండ గడితేనే ఎల్లో కూటమి అనే మాయల ఫకీరు ఆగడాలు ఆగుతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
స్ఫూర్తిదాయక విజయాలకుప్రోత్సాహమిది
సాక్షి, హైదరాబాద్: విభిన్న రంగాల్లోని వ్యక్తుల విజయాలు స్ఫూర్తిని అందిస్తాయని.. పురస్కారాల ద్వారా ఆ విజయాలకు మరింత విలువ వస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి దేశరక్షణ కోసం ప్రాణాలొడ్డిన సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, సాంకేతిక విప్లవాలతో అద్భుతాలు సృష్టిస్తున్నవారు, నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఇలా భిన్న రంగాల్లో దేశానికి సేవ చేస్తున్నవారికి సెల్యూట్ చేస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అలాంటి వ్యక్తులను, సంస్థలను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో.. వివిధ రంగాల్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల వారికి ‘సాక్షి’ మీడియా గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, వైఎస్ భారతిరెడ్డి, సాక్షి డైరెక్టర్లు రాణిరెడ్డి, ఏఎల్ఎన్ రెడ్డి, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, సాక్షి సీఈవో అనురాగ్ అగర్వాల్, సాక్షి డైరెక్టర్లు కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, వీఐటీ యూనివర్సిటీ ఏపీ క్యాంపస్ వీసీ ఎస్వీ కోటారెడ్డి పురస్కార గ్రహీతల విజయాలు తననెంతో ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధుల విజయాలను ఆయన గుర్తు చేశారు. ‘‘ఒక సమయంలో ఒకే పని చెయ్యి. దానిపైనే నీ సర్వశక్తియుక్తులు కేంద్రీకరించు. మిగిలినవన్నీ మినహాయించు’’ అంటూ ప్రవచించిన వివేకానందుడి సూక్తి ప్రతీ ఒక్కరికీ అనుసరణీయమన్నారు. అనంతరం పలు రంగాలకు చెందినవారికి గవర్నర్, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డిల చేతుల మీదుగా సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వి.మురళి స్వాగతోపన్యాసం చేయగా.. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి వందన సమర్పణ చేశారు. పురస్కారాలకు విజేతలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతల జ్యూరీకి చైర్‌పర్సన్‌గా రెయిన్బో ఆస్పత్రి డైరెక్టర్ ప్రణతిరెడ్డి, సభ్యులుగా పద్మశ్రీ శాంతాసిన్హా, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు, క్రెడాయ్ నేషనల్ జనరల్ సెక్రెటరీ జి.రామిరెడ్డి, ఎన్డీ టీవీ రెసిడెంట్ ఎడిటర్ ఉమా సుధీర్, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినోద్ కె అగర్వాల్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ సభ్యులుగా వ్యవహరించారు. -
సాక్షి ఎడిటర్‌కు ‘కాంబోడియా’ బాధితుల కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తాము స్వదేశానికి రావడంలో ‘సాక్షి’చూపిన చొరవ మరువలేని దని ‘కాంబోడియా’బాధితులు అన్నారు. గురువారం కరీంనగర్‌కు చెందిన యువకులు సలీం, షారుఖ్, షాభాజ్, హాజీ హైదరాబాద్ లోని ‘సాక్షి’ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ వర్ధెల్లి మురళిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి కోసం కాంబోడియా వెళ్లి అక్కడ సైబర్ నేరస్తుల ముఠా చేతిలో చిక్కిన తాము తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. అయితే సాక్షి దినపత్రిక వరుస కథనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించేలా చేసిందని అన్నారు. ఈ సందర్భంగా కాంబోడియాలో సైబర్ నేరస్తుల ముఠా తమను ఎలా హింసించిందన్న విషయాలను వారు ఎడిటర్‌కు వివరించారు. సెప్టెంబర్ 19న ‘కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి’అన్న శీర్షికన కరీంనగర్ యువకులు కాంబోడియాలో చిక్కుకున్న విషయాన్ని ‘సాక్షి‘బయట పెట్టిన విషయం తెలిసిందే. తర్వాత కూడా సాక్షి ప్రచురించిన వరుస కథనాలతో స్పందించిన కరీంనగర్ పోలీసులు, స్థానిక ఎంపీ సంజయ్ చొరవ తీసుకుని ఆ యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. (క్లిక్: ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం) -
లోపలి శత్రువు
ప్రతి మనిషికీ అంతరంగంలో ఆరుగురు శత్రువులు ఉంటారని చెబుతారు. ఆ శత్రువును ఓడించి అదుపులో పెట్టగలిగినప్పుడు ఆ మనిషికి పురోగతి సాధ్యమవుతుంది. అదుపులో పెట్టలేకపోతే పతనం తప్పదు. ఇది మనకు చిరకాలంగా వినిపిస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేవి విడివిడిగా వ్యక్తులకు ఉండే ఆరుగురు అంతః శత్రువులు. వీటినే అరిషడ్వర్గాలు అంటున్నాము. వ్యక్తులపై కాకుండా సమూహాలపై దాడి చేసే అంతః శత్రువులు కూడా ఉంటారు. ఈ శత్రువులు సామాజిక విలువల రూపంలో కూడా ఉండవచ్చు. కట్టుబాట్ల రూపంలో ఉండవచ్చు. ఆచార సంప్రదాయాల రూపంలో కూడా ఉండవచ్చు. ఈ సంప్రదాయాలు మన మెదళ్లలో తిష్ఠ వేసుకొని ఆలోచనలను తమ గుప్పెట్లోకి తీసుకుంటూ ఉండవచ్చు. సమాజం గతిశీలమైనది. నిరంతర చలనం దాని స్వభావం. వస్తుగత మార్పులను ఎప్పటికప్పుడు అది ఆహ్వానిస్తూనే ఉంటుంది. సామాజిక చైతన్యాన్ని శాశ్వత విలువలతో, కట్లుబాట్లతో నియంత్రించడం సాధ్యం కాదు. ఒకప్పుడు సదాచారాలు అనుకున్నవి కాలక్రమంలో దురాచారాలుగా పరిగణించవచ్చు. అటువంటి దురాచారాలను క్రమానుగతంగా మన సమాజం తొలగించుకుంటూ పురోగమిస్తున్నది. అట్లా తొలగించుకోలేక మిగిలిపోయిన దురాచారాలే సమాజ వికాసానికి ప్రతిబంధకాలవుతున్నాయి. కాలానుగుణమైన మార్పుల్ని ఆహ్వానించడం ఒక పురోగామి సూత్రం. అటువంటి మార్పులు మన ఆలోచనల్లో రావాలి. మనం ఏర్పరచుకున్న చట్టాల్లో కూడా రావాలి. మొన్న ఒక అబార్షన్ సంబంధిత కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం చెప్పింది ఇదే. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడం మహిళలకు ఉండే తిరుగులేని హక్కుగా సమున్నత న్యాయస్థానం గుర్తించింది. ఇది వైవాహిక స్థితిగతులతో సంబంధం లేకుండా మహిళలందరికీ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మనదేశంలో పెళ్లి కాకుండానే గర్భం దాలుస్తున్న బాలికలు, యువతుల సంఖ్యకు లెక్కలేదు. ఇటువంటి అవాంఛిత గర్భాలకు వారినే బాధ్యులుగా చేయటం దుర్మార్గం. తాము ఎదిరించలేని వారు, తమ వారు అనుకున్న వారి అఘాయిత్యాల బారిన పడుతున్న యువతులు ఎంతో మంది ఉంటున్నారు. కామాంధుల అత్యాచారాలకు గురవు తున్న వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు. వీరే కాదు, వ్యక్తిగత కారణాల రీత్యా వివాహానికి దూరంగా ఉండదలచిన వారు, విడాకులు తీసుకున్న వారు కూడా చాలామంది ఉంటారు. ఇష్టపూర్వకమైన కలయికలు చట్టవిరుద్ధం కాదని గతంలోనే న్యాయస్థానం తీర్పు చెప్పింది. కలయిక చట్టవిరుద్ధం కానప్పుడు గర్భస్రావం మాత్రం ఎట్లా చట్టవిరుద్ధమవుతుంది? ఈ వైరుద్ధ్యాన్ని సుప్రీంకోర్టు తొలగించింది. పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన స్త్రీలకు పునరుత్పాదక హక్కులనేవి సహజ హక్కులు. ఈ సత్యాన్ని న్యాయస్థానం గుర్తించినట్లయింది. మన న్యాయస్థానాలు అప్పుడప్పుడు ఇటువంటి ప్రగతి శీలమైన తీర్పులనివ్వడం ద్వారా సామాజిక వికాసానికి దోహదం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే అమెరికా సుప్రీంకోర్టు ఇదే విషయంలో భిన్నమైన తీర్పు చెప్పిన నేపథ్యంలో మన సుప్రీం తీర్పు గర్వకారణం. అయితే మన న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో సామాజికాంశాలకు సంబంధించి ప్రగతి నిరోధకమైన తీర్పుల్ని ఇవ్వకపోలేదు. న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే కనుక సామాజిక విలువలుగా చలామణిలో ఉన్న భావజాల ప్రభావం వారిపై కూడా ఉండవచ్చు. పితృస్వామిక వ్యవస్థ భావజాల ప్రభావం నుంచి చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా తప్పించు కోలేకపోతున్నారు. పదేళ్ల కిందట సుప్రీంకోర్టులోనే ఒక విడాకుల పిటిషన్ మీద ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా సరే భర్త బదిలీపై వెళ్ళినప్పుడు భార్య తన ఉద్యోగాన్ని వదిలేసైనా సరే వెళ్లాలని కోర్టు చెప్పింది. సీతాదేవి శ్రీరాముడిని అనుసరించి వెళ్లినట్లు భార్య కూడా భర్తను అనుసరించి వెళ్లాలని కోర్టు అభిప్రాయ పడింది. అంతేకాదు, భార్యల సంపాదనను ‘లిప్‌స్టిక్ మనీ’గా కూడా పోల్చింది. 2018లో కేరళ హైకోర్టులో మరో న్యాయమూర్తి ఒక తీర్పును ఇస్తూ చేసిన వ్యాఖ్యానం మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్నది. భార్యకు ఉండవలసిన లక్షణాలను చెప్పడానికి ఆయన ఒక సంస్కృత∙శ్లోకాన్ని ఉదహరించారు. పితృస్వామిక భావజాలానికి పరాకాష్ఠ ఈ శ్లోకం. బాగా పాపులర్. పురుషుల్లో చాలామందికి నచ్చుతుంది కూడా! ‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి...’! భార్య చూడటానికి లక్ష్మీదేవిలా ఉండా లట! భర్తకు దాసి లాగా సేవ చేయాలి. మంత్రిలా సలహా లివ్వాలి. అమ్మలా తినిపించాలి. రంభలా శయనించాలి. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. పురుషాధిక్య సమాజం కనుక పురుషుని కోణం నుంచి, కోర్కెల నుంచి అల్లిన శ్లోకం బాగానే ఉన్నది. కానీ దీన్నే తిరగేసి స్త్రీల కోణం నుంచి కొత్త శ్లోకం అల్లితే? తమ పురుషునిలో స్త్రీ కోరుకునే లక్షణాలపై పరీక్ష పెడితే ఎంతమంది పురుష పుంగవులు పాస్ మార్కులు తెచ్చు కోగలరు? చెప్పడం కష్టం. ఇటువంటి కాలం చెల్లిన మౌఢ్యాన్ని సమాజం వదిలించుకోలేకపోతే ఇప్పుడు మనకు అవసరమైన పురోగతిని సాధించటం సాధ్యం కాదు. అండపిండ బ్రహ్మాండమైన విశ్వంలో భూగోళమే ఒక పిపీలికం. మన పిపీలికం ఉన్న పాలపుంత ఈ చివరి నుంచి ఆ చివరవరకు కాంతి వేగంతో ప్రయాణం చేస్తే లక్ష సంవత్సరాలు పడుతుందట! ఈ పాలపుంతను పోలిన గెలాక్సీలు విశ్వంలో వందల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నరజాతి సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రతిభ ఎక్కడున్నట్టు? విశ్వ రహః పేటికా విపాటన లక్ష్యం సాధించేది ఎప్పుడు? భూగోళంలో తన చరిత్రను తాను ఇప్పటికీ మానవుడు పూర్తిగా ఆవిష్కరించలేదు. క్రీస్తు పుట్టిన తర్వాత రెండు వేల యేళ్లు, అంతకుముందో వెయ్యేళ్లు తప్ప అంతకుమించి మనకున్నది అరకొర జ్ఞానమే. ఎన్నో మహో న్నతమైన నాగరికతలు ఎందుకు అంతరించాయో తెలియదు. ఆ నాగరికతల పూర్తి వివరాలూ తెలియవు. మూడున్నర వేల ఏళ్లకు పూర్వమే మహిళలకు సురక్షితమైన గర్భస్రావ విధానాలు ఎటువంటి వివక్ష లేకుండా అందుబాటులో ఉన్నాయని ఆధారాలు కూడా ఈజిప్టులో దొరికాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు మనం సుప్రీంకోర్టు తీర్పును గొప్ప ముందడుగుగా వర్ణించుకునే దుఃస్థితిలో ఉన్నాము. ఎటువంటి అరమరికలు, విభేదాలు లేనప్పుడే, ప్రజలం దరూ ఐక్యమైనప్పుడే, విజ్ఞానవంతులైనప్పుడే మానవజాతి శాస్త్ర సాంకేతిక పురోగతి సాధించగలుగుతుంది. కానీ మతాన్ని సంకుచితంగా అన్వయించి, మౌఢ్యంగా అనువదించి విసురు తున్న కత్తులతో, పారిస్తున్న నెత్తురుతో నరజాతి శత్రు శిబిరాలుగా విడిపోతున్నది. మనదేశంలో కులోన్మాదం కలిగిస్తున్న నష్టం ఇంతా అంతా కాదు. వీటితో పాటు ఇంకా మన మెదళ్లలో తిష్ఠవేసిన పితృస్వామిక భావజాలం సగం జనాభాలోని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని చంపేస్తున్నది. ఈ పితృస్వామిక భావజాలం ఓ సైలెంట్ కిల్లర్. మతాలు, కులాలు, దురాచారాలు చేసిన నష్టం కంటే ఎక్కువ నష్టాన్ని నిశ్శబ్దంగా చేసుకుపోతున్నది. అభ్యుదయవాదులు, విప్లవకారు లుగా చెప్పుకునే వాళ్లు కూడా దీని కనికట్టు పట్టులో చిక్కుకుంటు న్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. మన టెలివిజన్లలో వచ్చే కార్యక్రమాల్లో చెత్త కార్యక్రమాలు కోకొల్లలు. సకుటుంబ సపరివార సీరియళ్ల పేరుతో కొన్ని సీరియళ్లు బోలెడంత సామాజిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇన్ని చెత్తల్లో ఒక చెత్త ‘బిగ్ బాస్’. కానీ మన అభ్యుదయవాదుల టార్గెట్ మాత్రం ‘బిగ్ బాస్’ ఒక్కటే. ఎందుకంటే అందులో ఓ పదిమంది అమ్మాయిలు, ఓ పదిమంది అబ్బాయిలు కొంత కాలం పాటు కలిసి ఉంటారట! ఎంతో పరిణతి పొందిన యువతీ యువకులు వీరు. చదువుకున్న వాళ్ళు, స్వతంత్రంగా జీవన గమనాన్ని సాగిస్తున్న వారు. వాళ్ళంతా కలిసి కొన్ని రోజులపాటు ఒకే ఇంట్లో ఉండి ఆటలాడినంత మాత్రాన ఏదో ప్రళయం ముంచుకొస్తుందట! ఆకాశం కుంగిపోతుందట! అగ్ని పర్వతాలు బద్దలవుతాయట! మన సంస్కృతీ సంప్రదాయా లను ఈ కార్యక్రమం మంటగలుపుతున్నదని విమర్శించేవాళ్లు ఉన్నారు. ఏ సంస్కృతిని? కార్యేషు దాసి సంస్కృతినేనా? అది మంటగలిస్తేనే మానవజాతి విముక్తి సాధించగలుగుతుంది. ‘బిగ్‌బాస్’ అనేది సమాజానికి పనికి వచ్చే గొప్ప కార్యక్రమం కాకపోవచ్చు. అంతమాత్రాన అందులో పాల్గొం టున్న యువతీ యువకుల క్యారెక్టర్‌ను దెబ్బతీసే కామెంట్లు చేయడం న్యాయం కాదు. వాళ్ల మీద వేస్తున్న నిందలు అమానుషం. ముఖ్యంగా చాలామంది యువతులు ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని, ఎన్నో మూతివిరుపుల్ని అధిగమించి స్పాట్లైట్లోకి దూసుకొస్తున్నారు. సమాన స్థాయి కోసం ప్రపంచం మీదకు దండెత్తి వస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో, నవ చైతన్యంతో కదం తొక్కుతూ వస్తున్నారు. వీళ్ళూ అందులో భాగమే! వీలైతే స్వాగతిద్దాం. కాకపోతే చచ్చుబడిన మోకాళ్ళను అడ్డం పెట్టకుండా పక్కకు తప్పుకుందాం. మహిళా సాధికారత సాధ్యం కాకుండా ముందు ముందు మరే గొప్ప నాగరికత నిర్మాణం కాబోదు. ఆ సాధికారత సాధ్యం కావాలంటే పితృస్వామిక భావజాలాన్ని ఓడించక తప్పదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కన్నీటి మడుగులో మొసళ్లు!
రాజీవ్‌గాంధీ మన దేశానికి ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. టెలీకమ్యూనికేషన్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న కొత్త గాలులకు ఆయన కాలంలోనే భారత్ తెరచాప లెత్తింది. నూతన ఆర్థిక పంథా వైపు అప్పుడే దేశం అడుగులు వేసింది. ఆ తొలి అడుగులే తదనంతర కాలంలో సంస్కరణల ప్రస్థానంగా మారాయన్న సంగతిని అందరూ అంగీకరిస్తు న్నారు. దురదృష్టవశాత్తు చిన్నవయసులోనే రాజీవ్ తీవ్రవాదుల రక్తదాహానికి బలయ్యారు. భారత క్రీడారంగంలో ఒక అత్యు న్నత పురస్కారాన్ని రాజీవ్ పేరు మీద ఆయన జ్ఞాపకార్థం పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘రాజీవ్ ఖేల్‌రత్న’ పేరుతో క్రీడారంగ పురస్కారాలకు తలమానికంగా ముప్ప య్యేళ్లపాటు ఈ అవార్డు కొనసాగింది. ఏడాది కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులో రాజీవ్ పేరును తొలగించి ధ్యాన్‌చంద్ పేరును చేర్చింది. భారతదేశ క్రీడారంగ కీర్తి పతాకాన్ని దేశదేశాల్లో సమున్నతంగా ఎగరేసిన హాకీ ఎవరెస్ట్ ధ్యాన్‌చంద్. ఈ పేరు మార్పు వల్ల దేశంలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికి, పోరాట పటిమను రగల్చ డానికి ధ్యాన్‌చంద్ పేరే సరైనదని బుద్ధిజీవులందరూ భావిం చారు. ఈ పేరు మార్పు వల్ల రాజీవ్‌గాంధీకి అవమానం జరిగినట్టుగా ఎవరూ అనుకోలేరు. ఆయన ప్రతిష్ఠ మసకబార లేదు. ఆయన ఘనతలకు మకిలంటలేదు. రాజీవ్‌గాంధీ ప్రత్యే కతలూ, విజయాలు చెక్కుచెదరలేదు. క్రీడారంగ మకుటంపైకి మాత్రం చేరవలసిన రత్నమే చేరింది. దాదాపుగా ఇటువంటి సన్నివేశమే ఈ వారం ఆంధ్ర ప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. ఎన్టీఆర్ పేరు స్థానంలో రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును కూడా ఆమోదించింది. తెలుగుదేశం పార్టీ అధినాయ కత్వం అంతరాంతరాల్లో మాత్రం ఈ పరిణామం కొంత ఉప శమనాన్నీ, సాంత్వననూ కలిగించింది. ప్రవాహంలో కొట్టుకు పోయేవాడి చేతికి గడ్డిపరక దొరికితే కలిగే ఉపశమనం లాంటిది. ఆ పార్టీలో, దాని అనుబంధ ఎల్లో కూటమిలో సదరు గడ్డిపరక ఎన్నెన్నో భావాల్ని, ఊహల్ని ఎగదోసింది. ఈ గడ్డిపరకే బ్రహ్మాస్త్రమై మండి రాష్ట్రం రావణకాష్ఠమై కాలుగాక! ధర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలతో జనజీవనం అట్టుడికిపోవుగాక! సప్త సముద్రాలు ఉప్పొంగి విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా పనికిరాకుండా చేయుగాక! జన సమ్మర్దం చెలరేగి తక్షణం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గద్దె దిగును గాక! మన చంద్రన్న అధికారం స్వీకరించాలనీ ఊరూ వాడా ఏకమై అర్జీలు పెట్టుగాక! ఈ రకమైన మంత్రాలు పఠించి వారు గడ్డిపరకను ప్రయోగించారు. ఒకరో ఇద్దరో మంత్రాలు చదవడం కాదు... వేద పఠనం మాదిరిగా సామూహిక మంత్ర పఠనాలు చేయించారు. పత్రికా కార్యాలయాల్లో, టీవీ చర్చల్లో ఈ సామూహిక మంత్ర పఠన, విలేఖన కార్యక్రమాలు జరి గాయి. ఇతర రాజకీయ పార్టీలను సమీకరించి వారి చేతనూ పఠింపజేశారు. తటస్థుల పేరుతో ఇంకొందర్ని అద్దెకు తెచ్చి చదివింపులు చేయించారు. మన సినిమాల్లో సతీసావిత్రి, సతీ సక్కుబాయి వంటి నాయికలు మంత్రతుల్యమగు ఇటువంటి శాపనార్థాలను పెట్ట డంలో ప్రసిద్ధి చెందారు. ఈ మంత్ర శాపాలకు ముందు వారు విధిగా ‘నేనే పతివ్రతను అగుదునేనీ’ అంటూ తమ మహత్తును షరతుగా విధించేవారు. ఎల్లో కూటమి ఈ షరతును పెట్టలేదు. ఎందుకో జడుసుకున్నట్టుంది. మంత్రాలకు చింతకాయలే రాల వంటారు. ఇక గడ్డిపరకలు బ్రహ్మాస్త్రాలవుతాయా? అవలేదు. అక్కడక్కడా ఒక్కపూట ధర్నాలకే శక్తులుడిగిపోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌ను నిజంగా అవమానించింది ఎవరు అనే చర్చ మొదలైంది. అదేదో సినిమాలో ఓ కామెడీ రౌడీ ఉంటాడు. ఆ ముఠా మీద హీరో కాల్పులు జరుపుతాడు. అందరూ పడి పోతారు. ఈ కామెడీ రౌడీ ఒక్కడే నిలబడి ఉంటాడు. ‘అన్నియ్యా! అందర్నీ చంపేశావు, నన్నొక్కడినే వదిలేశావు ఎందుకన్నియ్యా?’ అని అడుగుతాడు కామెడీ రౌడీ. ‘ఒరేయ్! నీకు బాగా కొవ్వెక్కువై తెలియడం లేదు కానీ, నీకు బుల్లెట్ దిగి చాలాసేపైంద’ంటాడు హీరో. ఎన్టీఆర్‌కు అవమానం అనే విషయంలో బుల్లెట్ దిగింది తమకేనన్న విషయం రెండు రోజుల తర్వాత గానీ ఎల్లో కూటమికి అర్థం కాలేదు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే వివరణ ఇచ్చారు. డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి స్వయంగా వైద్యుడు. రాజకీయాల్లోకి రాకముందు పేదల వైద్యుడిగా ప్రసిద్ధికెక్కారు. కేవలం ఒక్క రూపాయి ఫీజుతోనే రోగుల్ని పరీక్షించేవారు. అదీ ఇవ్వలేనివారిని ఉచితంగానే చూసే వారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆరోగ్య రంగంలో అప్పటికి అనూహ్యమైనటువంటి మార్పుల్ని తీసు కొచ్చారు. ఈ మార్పుల వెనుకనున్న ఆలోచనలకు ఆయన చేసిన పాదయాత్ర పాదు చేసింది. వైద్యరంగం కార్పొరేటీకరణ జడలు విప్పిన రోజులవి. ప్రభుత్వం అనధికారికంగా ఆ రంగాన్ని వదిలివేస్తున్న సమయమది. పెద్ద రోగమొస్తే ఆస్తులమ్ము కోవడం, అవీ లేకుంటే చావు కోసం ఎదురు చూడటం తప్ప మరో దారీతెన్నూ లేని దయనీయమైన కాలం అది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ పాడుకాలపు కృతికర్త మరెవరో కాదు... నారా చంద్రబాబు నాయుడు! దైన్యాన్ని కళ్లారా చూసిన డాక్టర్ నాయకుని గుండెకు తట్టిన తక్షణ తరుణోపాయం – ఆరోగ్యశ్రీ. ప్రజారోగ్యానికి ఇది సంజీ వని మూలికలా పనిచేసింది. తదనంతర కాలంలో యావత్తు భారతావనికే ఆదర్శంగా నిలబడిపోయిన పథకమిది. అలాగే 108, 104 ఎమర్జెన్సీ సర్వీసులు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం ఏదో ఒక స్థాయిలో అమలుచేయక తప్పని పరిస్థితిని ఈ సర్వీసులు కల్పించాయి. ఈ కార్యక్రమాల అమలు ద్వారా డాక్టర్ రాజశేఖర రెడ్డి రోగుల పాలిటి ఆత్మబంధువుగా, పేదల పాలిటి పెన్నిధిగా అవతరించారు. అందువల్లనే ఆయన చనిపోయినప్పుడు తెలుగునాట ప్రతి ఇంటి గడపపై శోకదేవత బైఠాయించింది. అందుకే అన్ని వందల గుండెలు పగిలిపోయాయి. ప్రజారోగ్య రంగానికి డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు వాటికవే చాలు... హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడానికి! కానీ, అంతమాత్రం చేతనే మార్చలేదు. కథ చాలా ఉన్నది. వైఎస్సార్ పేరుతో ఏర్పడిన రాజకీయ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది. ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఆయన ఇప్పుడున్న సమాజాన్ని సమూలంగా విప్లవీకరించి సమున్నతంగా నిలబెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందు కోసం వివిధ కీలక రంగాలతోపాటు ప్రజారోగ్య వైద్య వ్యవస్థలో కూడా ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్రం వచ్చిన డెబ్బయ్యేళ్లలో రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే ఇప్పుడు ఒకేసారి 17 కాలేజీలను జగన్ ప్రారం భించారు. 16 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ‘నాడు–నేడు’ పేరుతో ప్రజారోగ్య వ్యవస్థను ప్రజలకు చేరువ చేశారు. గ్రామాల్లో కొత్తగా 1032 వైఎస్సార్ విలేజి క్లినిక్స్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎమ్, ఆశా వర్కర్ నిరంతరం అందుబాటులో ఉంటారు. 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నవీక రించారు. ఆ కేంద్రాల్లో గతంలో ‘డాక్టర్ వస్తాడో రాడో’ అనే పరిస్థితి. ‘నర్సు ఉంటుందో ఉండదో’ తెలియని అనిశ్చిత వాతావరణం ఉండేది. అందువల్ల ఖర్చయినా సరే, చిన్న రోగాలకు సైతం జనం ప్రైవేట్ బాట పట్టేవారు. ఇప్పుడు నిర్దేశించిన కార్యక్రమం ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇద్దరు డాక్టర్లు, నర్సులు సహా పన్నెండుమంది సిబ్బంది ఉంటారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాలను ఇద్దరు డాక్టర్ల మధ్య విభజిస్తారు. ఒక డాక్టర్ కేంద్రంలో ఓపీని చూస్తుంటే, మరో డాక్టర్ 104 మొబైల్ సిబ్బందితో కలిసి తనకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తారు. పెద్ద రోగాలతో బాధపడుతున్న వారి గృహాలకు స్వయంగా వెళతారు. మిగిలిన వారిని మొబైల్ దగ్గర పరీక్షించి అవసరమైన మందులు, సలహాలు ఇస్తారు. కొంతకాలం గడిచేసరికి వారికి కేటాయించిన గ్రామాల్లోని రోగులకు సంబంధించిన సమస్త వివరాలు ఆ డాక్టర్‌కు తెలిసిపోతాయి. రోగుల హెల్త్ ప్రొఫైల్ కూడా తయారవుతుంది. ఆచరణలో ఈ ప్రజలందరికీ ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉంటే చాలా ప్రమాద కరమైన జబ్బులను మొగ్గదశలోనే గుర్తించి నయం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలకు వ్యయ ప్రయాసల భారం తగ్గుతుంది. ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో సైతం ఎగువ మధ్యతరగతి ప్రజలకు కూడా ఒక మంచి ఫిజీషియన్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా మారింది. ముక్కు నొప్పి వస్తే ముక్కు డాక్టర్ దగ్గరికీ, మోకాళ్లు నొప్పిచేస్తే... చిప్పలు మార్చివేయాలని సలహాలిచ్చే ఆర్థోల దగ్గరికీ, గ్యాస్ట్రబుల్తో వెళితే ఇరవై రెండు పరీక్షలు చేసి గుండు గొరిగే పెద్దాసుపత్రుల దగ్గరికీ పరుగెత్తక తప్పడం లేదు. వ్యక్తి ఆరోగ్యాన్ని సమగ్ర దృష్టితో పరీక్షించే ఫిజీషియన్లే దొరక నప్పుడు ఇక ఫ్యామిలీ డాక్టర్ అనే వ్యక్తి ఒక గగన కుసుమం. ఆ గగన కుసుమాన్ని ఇప్పుడు ప్రతి మారుమూల పల్లెలో, నిరుపేదల ఇంటి ముంగిట్లో పూయించడం కోసం ఒక బృహత్తరమైన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపైకి ఎత్తుకున్నది. ఈ తరహా ప్రజారోగ్య ఉద్యమం భారతదేశంలో న భూతో! ఏ కార్యక్రమమైనా ఉద్యమ రూపు దాలిస్తేనే ప్రజలకు చేరువవుతుంది. ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతుంది. ఉద్యమ రూపు దాల్చాలంటే ఆ కార్యక్రమంలోని పాత్రధారు లను ఉత్తేజపరిచే అంశాలు అందుబాటులో ఉండాలి. ఏ ఉద్యమానికైనా తనవైన కొన్ని ప్రతీకలుండాలి. తనదైన కొంత పదజాలం ఏర్పడాలి. తనవైన కొన్ని పేర్లుండాలి. ఉద్యమంలో స్ఫూర్తి నింపగల మూర్తిమత్వం ఉండాలి. ప్రజారోగ్య రంగానికి సంబంధించిన వరకు ఆ మూర్తిమత్వం ఎన్టీఆర్‌లో దొరకదు. వైఎస్సార్‌లో దొరుకుతుంది. అందుకు కారణం ఈ నేపథ్య మంతా! ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి నంతమాత్రాన ఆయనను అవమానించినట్టు కాదు, ఆయనకు అసలైన అవమానం జీవించి ఉన్నప్పుడే జరిగింది. ఆయన కళారంగంలో ఒక ధ్రువతార. మహానటుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. అది నిజమే! ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. రాజకీయ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. పేదల సంక్షేమంలో, పాలనా సంస్కరణల్లో తన కాలానికి ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన చనిపోయి 26 సంవత్స రాలవుతున్నది. ఇందులో 14 సంవత్సరాలపాటు ఆయన స్థాపించిన పార్టీయే అధికారంలో ఉన్నది. ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన విశేషంగా ప్రభావితం చేసిన రంగాల్లో ఏదైనా సంస్థకో, పథకానికో తెలుగుదేశం పార్టీ ఆయన పేరు పెట్టి ఉండవలసింది. ఆ పని చేయలేదు. ఎమ్జీ రామ చంద్రన్‌కు లభించిన ‘భారతరత్న’ పురస్కారం ఎన్టీఆర్‌కు కూడా రావాలని ఆయన అభిమానుల ఆకాంక్ష. చంద్రబాబు రాష్ట్రపతులనూ, ప్రధానమంత్రులనూ నియమించగల స్థితిలో ఉన్నప్పుడు (ఆయనే చెప్పుకున్నట్టు) ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇప్పించగలిగేవారు. కానీ ఎందుకు ఇప్పించలేదో ఇంతవరకూ ఆయన సంజాయిషీ ఇవ్వలేదు. ప్రజారోగ్య రంగంలో ఎన్టీఆర్ చేసిన కృషి స్వల్పం. హెల్త్ యూనివర్సిటీ మకుటంపైకి ఇప్పుడు అర్హమైన రత్నమే చేరింది. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం గౌరవించింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం 14 ఏళ్లలో ఆ పని కూడా చేయలేకపోయింది. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీ నుంచి తొల గించడంపై యాగీ చేసి లబ్ధి పొందాలనుకున్న తెలుగుదేశం ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడి చిందెవరు? ఆయన చావుకు కారకులెవరు? ఆయన పార్టీని అక్రమంగా లాక్కున్నదెవరు? ఆయన జెండానూ, బ్యాంకులో ఉన్న నిధులనూ స్వాధీనం చేసుకున్నదెవరు? ఆయనపై చెప్పులు వేయించిందెవరు? ఎన్టీఆర్‌కు నీతి నియమాలు లేవని ‘ఇండియా టుడే’కు ఇంటర్వ్యూలు ఇచ్చింది చంద్రబాబు కాదా? ఎన్టీఆర్ పరువుప్రతిష్ఠలు దిగజార్చేలా నగ్న కార్టూన్లు వేసి దూషణలతో కూడిన రాతలు రాయించింది రామోజీరావు కాదా? దుర్మార్గులు, కపటులు, మోసగాళ్లని చంద్రబాబు, రామోజీలను ఎన్టీఆర్ విమర్శించలేదా? చంద్రబాబు ఒక మీడియా అధిపతితో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ‘వాడు వీడు’ అని అవాకులు చెవాకులు పేలిన వీడియో బయటకు రాలేదా? ఆ వీడియోపై ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదెందుకు? ఈ రకమైన ప్రశ్నలతో, నాటి పేపర్ల క్లిప్పింగులతో సోషల్ మీడియా నేడు హోరెత్తుతున్నది. ఎన్టీఆర్ పేరుతో బతికి బట్టకడదామనుకున్న ఎల్లో కూటమికి అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతున్నది. ఎన్టీఆర్ పేరు మార్పుపై సరిగ్గా స్పందిం చలేదని జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతులపై దాడికి దిగబోయిన ఎల్లో కూటమి బొక్కబోర్లా పడింది. వారిని అడుగ డుగునా అవమానించిన ఎల్లో కూటమి, జూనియర్ సినిమాలను దొంగ రివ్యూలతో, తప్పుడు ప్రచారాలతో దెబ్బతీయడానికి ప్రయత్నించిన ఎల్లో కూటమి ధర్మపన్నాలను జనం అసహ్యించు కుంటున్నారు. సినీనటుడు బాలకృష్ణ ట్వీట్‌తో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘పండిత పుత్రః పరమ శుంఠః’ అనే నానుడి మరోమారు రుజువైందని చెప్పుకుంటున్నారు. ఎల్లో కూటమి ఎన్టీఆర్ పేరును జపించినంతకాలం... ఆయన ఆత్మ ఆ కూటమిని శపిస్తూనే ఉంటుంది! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బరిగీసిన పెత్తందార్లు
ఇప్పుడు బరిగీసింది పెత్తందార్లే. వారు యుద్ధ సన్నాహాల దశను దాటి దండయాత్రల దశకు చేరుకున్నారు. ‘అమరావతి రైతుల అరసవిల్లి యాత్ర’ అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. దండయాత్రలకెప్పుడూ ముద్దుపేర్లే ఉంటాయి. సారంలో మాత్రం అదొక ఆర్థిక – సాంస్కృతిక సామ్రాజ్యవాదం. ధనస్వాముల స్వార్థ ప్రాయోజితం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమివ్వడం కోసం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానితోపాటు రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం కావడం, కొద్దిగా ప్రోత్సహిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా మారగల అవకాశాలు విశాఖకు ఉండటం కూడా ప్రభుత్వం ఆలోచనకు కారణం. అమరావతి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ ఆలోచన ఆటంబాంబులా తోస్తున్నది. ‘నీకు రాజధాని అర్హత లేదు సుమా! తోక ముడుచుకో విశాఖా! కాదంటే ఖబడ్దార్!!’ అని హెచ్చరించడానికే ఈ దండయాత్రను నడుపుతున్నారు. విశాఖపట్నం గుండెల మీదుగా దండు నడపాలని సంకల్పించారు. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని మెదడున్న మానవకోటి అనుమానించడం అత్యంత సహజం. ఎందుకీ కవ్వింపు?. మనుషుల్ని విడదీయడం కోసం, మెదళ్లలో విషబీజాలు నాటడం కోసం, కల్లోలిత వాతావరణాన్ని కల్పించడం కోసం, అంతిమంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం! ఆయన్నెందుకు గద్దె దించాలి? కారణాలు చరిత్ర నిండా కనిపిస్తాయి. పేద ప్రజలూ, కష్టజీవుల మోముల్లో చైతన్యపు ఛాయలు కదలాడిన ప్రతి సందర్భంలోనూ ధనవంతులు దండధారులౌతారు. దండ యాత్ర చేస్తారు. ఇది నియమం. సంకెళ్లు తెంచుకోవాలనే తలంపు బానిసలకు పదేపదే కలుగుతూనే ఉంటుంది. స్పార్టకస్ వంటి యోధుని స్ఫూర్తిమంతమైన నాయకత్వం లభించి నప్పుడు వారు చెలరేగిపోతారు. రోమ్ మహాసామ్రాజ్య సింహాసనాన్నే ధిక్కరిస్తారు. అప్పుడు ఆ మహాసామ్రాజ్యంలోనే అందరికంటే శ్రీమంతుడైన మార్కస్ క్రాసిస్ అనేవాడు లక్షమంది రోమ్ సైనికుల్ని వెంటేసుకొని వేటకు బయల్దేరు తాడు. బానిస నేతల్ని శిలువేస్తాడు. తన వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటాడు. శ్రమదోపిడీ నుంచి విముక్తి పొందాలని కార్మికుడూ, కర్షకుడూ కోరుకోవడం సహజం. తన కాయాన్ని పిండగా కారిన స్వేదానికి గిట్టుబాటు ధర కోసం ఆరాటపడతాడు. అవసరమైతే పోరాటానికి సిద్ధపడతాడు. ప్యారిస్ కమ్యూన్లను సృష్టించు కుంటాడు. అప్పుడు ఫ్రెంచ్ భూస్వాములు, ధనస్వాముల తరఫున ఒక ఫ్రెంచి ‘జాతీయ’ సైన్యం వేటకు బయల్దేరుతుంది. పొత్తిళ్లలో ఉన్న కమ్యూన్ శిశువును పీక నులిమి చంపేస్తుంది. ఇప్పుడు అమృతోత్సవ చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్న తెలంగాణ సాయుధ పోరాటం కూడా ఇదే కథను చెబుతుంది. దొరలు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల పాలనలో నైజాం గ్రామసీమలు శుష్కించిపోతాయి. కూలీనాలీ బక్కజనం వెట్టి చాకిరీ, దౌర్జన్యాల కింద నలిగిపోతారు. పేద రైతులు పండించిన పంటనంతా లెవీ కింద లెక్కచెప్పి పస్తుల్ని ఆశ్రయిస్తుంటారు. వారి గుండె మంటలకు కమ్యూనిస్టుల ఆజ్యం తోడవుతుంది. బడుగులే పిడుగులవుతారు. బందూకులందుకొని తిరగబడ తారు. దొరలు, పెత్తందార్లు పారిపోతారు. మూడువేల గ్రామాల్లో పేదల ‘స్వరాజ్యం’ ఏర్పడుతుంది. పది లక్షల ఎకరాల భూమిని పంచుకుంటారు. ఉమ్మడి వ్యవసాయానికి సన్నాహాలు చేసుకుంటారు. అదే సమయంలో హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి యూనియన్ సైన్యం బయల్దేరుతుంది. నవాబు సహకారంతో నాలుగు రోజుల్లోనే విలీన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత నాలుగేళ్లపాటు యూనియన్ సైన్యాలు తెలంగాణ పల్లెల్లోనే తిష్ఠవేస్తాయి. పారి పోయిన దొరల్ని పునఃప్రతిష్ఠాపన చేస్తాయి. ఆక్రమించుకున్న భూముల్ని దొరలకు అప్పగిస్తాయి. అన్యాయానికి గురవుతున్న వారు చైతన్యవంతులవుతున్న ప్రతి సందర్భంలో ఆధిపత్య పెత్తందార్లు దాడులకు దిగారు. యుద్ధాలు జరిగాయి. యుద్ధం జరిగిన ప్రతిసారీ ఓడినా, గెలిచినా సరే బలహీనవర్గాలు బలం పుంజుకుంటూ వస్తున్నాయి. ఒక్కొక్కటిగా కనీస ప్రజాస్వామిక హక్కుల్ని సాధించుకుంటూ వచ్చాయి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ధనస్వామ్యం రూపు మార్చుకున్నదంతే! స్వభావాన్ని మార్చుకోలేదు. రాజధాని యాత్ర పేరుతో ప్రారంభమైన దండయాత్ర ఉద్యమాన్ని పెత్తందార్ల ఉద్యమంగా స్వయంగా ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ అభివర్ణించారు. మొన్న శాసనసభ సమావేశాల్లోనే ఆయన ఈ మాటన్నారు. రాజధానుల దగ్గర్నుంచి గ్రామస్థాయి వరకూ పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎంత ఎక్కువ వికేంద్రీకరణ జరిగితే పేదవర్గాలకు అంత ఎక్కువ మంచి జరుగుతుందని ఉదాహరణలతో ఉటంకించారు. తరతరాలుగా అన్యాయానికి, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడం కోసం వికేంద్రీకరణను ఒక మార్గంగా ఎంచుకున్నట్లు చెప్పారు. ఆయన తన ప్రభుత్వ విధాన సహేతుకతను ఎంతో సుబోధకంగా వివరించారని ఆరోజు వచ్చిన ఫీడ్‌బ్యాక్ నిరూపించింది. టీవీలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న మిత్రుడొకరు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసి నప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చేసిన కొన్ని బెస్ట్ ప్రసంగాలను ఎంపిక చేసి, అంతే సంఖ్యలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా చేసిన ప్రసంగాలను కూడా తీసుకోవాలట! అలాగే ప్రతిపక్ష నాయకుల హోదాలో చేసిన ప్రసంగాలను కూడా! వీటిపై నిపుణుల చేత కంటెంట్ ఎనాలసిస్ చేయిస్తే సరిపోతుంది. విజనరీ ఎవరో తేలిపోతుంది. దూరదృష్టి గల నేత ఎవరో తేలిపోతుందంటాడు ఆ ప్రొఫెసర్! చంద్రబాబు ప్రసంగాల్లో ఊకదంపుడు, శుష్కప్రియాలు తప్ప ఏమీ ఉండవనీ, ప్రసంగ పాఠాల్లో నిజాయితీతో కూడిన ప్రమాణాలను పాటించడం కానీ, చెప్పే విషయానికి సరైన ఆధారాలను జోడించడం కానీ చాలా అరుదనీ ఆయన అభిప్రాయం. వైఎస్ జగన్ ప్రసంగాలు ఇందుకు భిన్నంగా విశ్వసనీయత ప్రస్ఫుటమయ్యే విధంగా ఉంటాయని చెప్పు కొచ్చారు. తాను ఖర్చు పెట్టే ప్రతి పైసా సూటిగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పారదర్శకత, వికేంద్రీకరణలతో ఏర్పాటు చేసుకున్న పాలనా వ్యవస్థ ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతా’ లంటాడు తిలక్. తరతరాలుగా కష్టాలతో, నష్టాలతో, బరువు లతో, బాధ్యతలతో కునారిల్లిపోతున్న జనావళి కన్నీళ్లను దూరం చేయడానికి తన ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్లా ఉపయోగ పడుతున్నాయో జగన్ వివరించారు. కన్నీటితో కడిగిన ప్రతి అక్షరం పునీతమవుతుంది. అందుకే జగన్ ప్రసంగాలకు జనంలో అంత విశ్వసనీయత, విలువ! తాను మూడు రాజధా నులు కావాలని ఎందుకు ప్రతిపాదిస్తున్నాడో ఆయన చెప్పారు. అమరావతి ప్రాంతానికి తాను వ్యతిరేకం కానే కాదని, ఇక్కడి అభివృద్ధిని కూడా ప్రాణప్రదంగా కాంక్షిస్తున్నానని చెప్పారు. విజయవాడ – గుంటూరు నగరాల అభివృద్ధిని కూడా చంద్రబాబు ఎంత నిర్లక్ష్యం చేశారనేది ఎత్తిచూపారు. తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల శ్రేయస్సు కోసం, సాధికారత కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై బురదజల్లడానికి ‘దుష్టచతుష్టయం’ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనీ, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతున్నదనీ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత రాద్ధాంతం సృష్టించాయో ప్రజలకు తెలిసిన విషయమే. జీఎస్డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం అగ్రస్థానానికి ఎగబాకిందనీ, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 4.4 శాతం నుంచి 5 శాతానికి పెరిగిందనీ ఆర్బీఐ గణాంకాలను ఉటంకిస్తూ ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే విషయాన్ని రికార్డుల ఆధారంతో నిరూపించారు. ఈ నిరూపణకు సదరు ‘దుష్టచతుష్టయం’ జవాబు చెబుతుందని ఆశించడం దండగ. విపక్ష కూటమి రాజధాని ఆందోళన వెనుక పెత్తందార్ల ప్రయోజనాలున్నాయని సభలో ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో వారి రియల్ ఎస్టేట్ వ్యాపార భయాలు తక్షణ కారణమైతే అవచ్చు గానీ, పేద ప్రజల సాధికారతా కార్యక్రమాలు మొత్తం కూడా ఎల్లో కూటమి పెత్తందార్ల ఉద్యమానికి కారణాలే. ఈ వ్యతిరేకతను అడుగ డుగునా వారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం బోధన దగ్గర్నుంచి మహిళలకు ఇళ్ల పట్టాల వరకు అనేక కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించారు. కనీవినీ ఎరుగని గోబెల్స్ దుష్ప్రచారానికి తెర తీశారు. పేద పిల్లలందరూ ఉన్నత చదువులు, నాణ్యమైన చదువులు చదివితే పెత్తందార్లకు నౌకర్లు, చాకర్లు దొరకరని భయం. డ్రైవర్లు, బంట్రోతులు దొరకరని భయం. వ్యవసాయం లాభసాటిగా మారితే పంట భూముల్ని చౌకగా కొట్టేయలేమని భయం. రైతులు రోడ్డున పడకపోతే చీప్ లేబర్ దొరకదనే భయం. మహిళలకూ, బలహీనవర్గాలకూ పదవులో,్ల పనుల్లో భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో తమ గుత్తాధి పత్యం దెబ్బతింటుందన్న భయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రే స్వయంగా చెప్పినట్టు ఈ ఎల్లో పెత్తందార్లు, వారి బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన భూముల దగ్గరే రాజధాని రావాలి. ఈ పెత్తందార్లు నడిపే పత్రికల్నే ప్రజలంతా చదవాలి. వాళ్లు నడిపే చిట్‌ఫండ్ కంపెనీల్లోనే జనం చిట్టీలు కట్టాలి. వాళ్ల పాల డెయిరీలే ఉండాలి. వాళ్లే సినిమాలు తీయాలి. వాళ్లే పరిశ్రమలు పెట్టాలి. మార్కెట్లో ఇంకొకడు పోటీ ఉండొద్దు. ఇంకొకడు బాగా బతకొద్దు. ఈ దురహంకార పోకడకూ, ఈ స్వార్థ చింతనకూ జగన్ పరిపాలనలో ముకుతాడు పడుతుందనే ఆందోళనతో పెత్తందార్లు అల్లాడుతున్నారు. మూడేళ్లుగా దుర్మార్గమైన విష ప్రచారాన్ని కురిపించినా జగన్ ప్రభుత్వం చెక్కుచెదరలేదు. పైపెచ్చు తల ఎత్తుకొని నిలబడింది. రాష్ట్ర పురోగతిని తల ఎత్తుకునేలా నిలబెట్టగలిగింది. ఆదాయంలో సింహభాగాన్ని సమకూర్చగల మహానగరం లేకపోయినా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెండు లక్షలు దాటిందని తాజా అంచనా. ప్రచారాలతో పని జరగడం లేదని ఇప్పుడు మారీచుడు మాయలేడి వేషం ధరించాడు. ఒక మాయా ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వీయ రియల్ ఎస్టేట్ ప్రయోజ నాన్ని రైతాంగ ప్రయోజనంగా చిత్రిస్తున్నారు. రకరకాల వ్యక్తుల నుంచి, శక్తుల నుంచి, వ్యవస్థల నుంచి, సంస్థల నుంచి మద్దతును చదివించుకొంటున్నారు. దివాళా తీసిన రెండు మూడు పార్టీలను పెద్ద ముత్తయిదువులుగా పేరంటానికి పిలిచి పోరాటం బొట్లు పెట్టారు. ఈ పోరాటం వెనకున్న ఆరాటంపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉన్నది. రాజధాని యాత్ర పేరుతో ప్రారంభమైన దండయాత్ర ఉద్యమాన్ని పెత్తందార్ల ఉద్యమంగా స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివర్ణించారు. మొన్న శాసనసభ సమావేశాల్లోనే ఆయన ఈ మాటన్నారు. రాజధానుల దగ్గర్నుంచి గ్రామస్థాయి వరకూ పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎంత ఎక్కువ వికేంద్రీకరణ జరిగితే పేద వర్గాలకు అంత ఎక్కువ మంచి జరుగుతుందని ఉదాహరణలతో ఉటంకించారు. తరతరాలుగా అన్యా యానికి, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడం కోసం వికేంద్రీకరణను ఒక మార్గంగా ఎంచుకున్నట్లు చెప్పారు. ఆయన తన ప్రభుత్వ విధాన సహేతుకతను ఎంతో సుబోధకంగా వివరించారని ఆరోజు వచ్చిన ఫీడ్‌బ్యాక్ నిరూపించింది. టీవీలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న మిత్రుడొకరు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసినప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చేసిన కొన్ని బెస్ట్ ప్రసంగాలను ఎంపిక చేసి, అంతే సంఖ్యలో వైఎస్ జగన్ ముఖ్య మంత్రిగా చేసిన ప్రసంగాలను కూడా తీసుకోవాలట! అలాగే ప్రతిపక్ష నాయకుల హోదాలో చేసిన ప్రసంగాలను కూడా! వీటిపై నిపుణుల చేత కంటెంట్ ఎనాలసిస్ చేయిస్తే సరిపోతుంది. విజనరీ ఎవరో తేలిపోతుంది. దూరదృష్టి గల నేత ఎవరో తేలి పోతుందంటాడు ఆ ప్రొఫెసర్! ప్రజల శ్రేయస్సు కోసం, సాధికారత కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై బురదజల్లడానికి ‘దుష్ట చతుష్టయం’ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనీ, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతున్నదనీ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత రాద్ధాంతం సృష్టించాయో ప్రజలకు తెలిసిన విషయమే. జీఎస్డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం అగ్రస్థానానికి ఎగబాకిందనీ, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 4.4 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగిందనీ ఆర్బీఐ గణాంకాలను ఉటంకిస్తూ ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే విషయాన్ని రికార్డుల ఆధారంతో నిరూపించారు. ఈ నిరూపణకు సదరు ‘దుష్ట చతుష్టయం’ జవాబు చెబుతుందని ఆశించడం దండగ. విపక్ష కూటమి రాజధాని ఆందోళన వెనుక పెత్తందార్ల ప్రయోజనాలున్నాయని సభలో ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో వారి రియల్ ఎస్టేట్ వ్యాపార భయాలు తక్షణ కారణమైతే అవచ్చు గానీ, పేద ప్రజల సాధికారతా కార్యక్రమాలు మొత్తం కూడా ఎల్లో కూటమి పెత్తందార్ల ఉద్యమానికి కారణాలే. ఈ వ్యతిరేకతను అడుగ డుగునా వారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం బోధన దగ్గర్నుంచి మహిళలకు ఇళ్ల పట్టాల వరకు అనేక కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించారు. కనీవినీ ఎరుగని గోబెల్స్ దుష్ప్రచారానికి తెర తీశారు. పేద పిల్లలందరూ ఉన్నత చదువులు, నాణ్యమైన చదువులు చదివితే పెత్తందార్లకు నౌకర్లు, చాకర్లు దొరకరని భయం. డ్రైవర్లు, బంట్రోతులు దొరకరని భయం. వ్యవసాయం లాభసాటిగా మారితే పంట భూముల్ని చౌకగా కొట్టేయలేమని భయం. రైతులు రోడ్డున పడకపోతే చీప్ లేబర్ దొరకదనే భయం. మహిళలకూ, బలహీన వర్గాలకూ పదవులో,్ల పనుల్లో భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో తమ గుత్తాధిపత్యం దెబ్బతింటుందన్న భయం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కార్యశూరుడూ – కామమ్మ మొగుడు
ఎదిగే పిల్లల మధ్య పోలికలు తేవద్దంటారు మానసిక నిపుణులు. ఇది పెంపకానికి సంబంధించిన సూత్రం. ఎంపిక చేసుకోవడానికి సంబంధించిన సూత్రం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అది కూరగాయల ఎంపికైనా సరే... ఇంకే కొనుగోలు వ్యవహారమైనా సరే! ఎందుకంటే ‘డబ్బులు ఊరికే రావు కదా’! నిగనిగలాడే బోడిగుండుతో ఒకాయన ప్రతిరోజూ టీవీల్లో కనపడి ఈ విషయంపై హెచ్చరిస్తూనే ఉంటాడు. ఈ ఒక్క క్యాంపెయిన్‌తో ఆయన యాంకర్ సుమతో సమానమైన పాపులారిటీ తెచ్చుకోగలిగారు. తన వ్యాపారాన్ని పెంచుకో గలిగారు. అట్లుంటది మరి పబ్లిసిటీతోటి! బ్రాండింగ్, పబ్లిసిటీ, మార్కెటింగ్‌ల సహకారంతో పుచ్చు కూరలూ, పచ్చళ్లు కూడా అమ్ముకోవచ్చు. అలాగే సొంత మీడియా చేతిలో ఉంటే నాయకుల్ని తయారుచేయవచ్చు, వీలైతే గద్దెపై కూడా కూర్చోబెట్టొచ్చునన్న ఆలోచన నేటి యెల్లో మీడియా ఆద్యులకు ఆనాడే వచ్చింది. ‘ఓన్లీ విమల్’ అనే ఒకే ఒక్క యాడ్ క్యాంపెయిన్ టెక్స్‌టయిల్ సింహాసనంపై నుంచి ‘రేమండ్స్’ను దించేసి, ‘రిలయన్స్’ను కూర్చోబెట్టింది. ఈ దృష్టాంతం వారికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు. ‘ఓన్లీ ఎన్టీఆర్’ తరహా ప్రచారంతో కాంగ్రెస్ కోటను కూల్చగలిగారు. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఆయన నిజంగానే ‘ఓన్లీ ఎన్టీఆర్’. ఒన్ అండ్ ఓన్లీ పీస్! పబ్లిసిటీ తోడవగానే కార్యసాధకుడు కాగలిగాడు. ఎన్టీఆర్‌తో తమ సొంత ప్రయోజనాలకు పెద్దగా ఉపయోగం లేదనుకున్న యెల్లో ముఠా ఆయన్ను వదిలించుకొని బాబును గద్దెపై కూర్చోబెట్టడం మనకు తెలిసిన గతం. ప్రత్యామ్నాయ మీడియా లేకపోవడం వల్ల ఏకపక్ష రాతలతో ఈ పరిణామం సాధ్యమైంది. ఈ బాబు స్వతహాగా ఓన్లీ బాబు కాదు, శతకోటి బాబుల్లో చంద్రబాబొకరు! జస్ట్ యావరేజ్. కాకపోతే పాలిటిక్స్‌లో ఇతనిది మాకివెలియన్ స్కూల్. అడ్డదారిలోనైనా లక్ష్యాన్ని చేరాలనే తత్వం. చేతికందిన అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం, ముఠా ప్రయోజనాల కోసం యథేచ్ఛగా వాడుకోగల దూకుడు స్వభావం. ఈ స్వభావం ఫలితంగా బాబుకూ, యెల్లో మీడియా పెద్దలకూ మధ్య ఒక రసాయనిక బంధం ఏర్పడింది. యెల్లో ముఠా పోస్టర్ బాయ్‌గా బాబు అవతరించాడు. చంద్రబాబును ఓన్లీ బాబుగా, ఒన్ అండ్ ఓన్లీ పీస్‌గా భ్రమింపచేయడానికి యెల్లో ముఠా చేయని ప్రయత్నం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో కూడా లాబీయింగ్ చేసి మీడియా మేనేజ్మెంట్కు కూడా దిగజారారు. ఆయన్నొక విజనరీగా చిత్రించడానికి ఆపసోపాలు పడ్డారు. ఈ విజనరీ హయాంలో వ్యవసాయ భూములు బీళ్లుగా మారాయి. పంట పొలాల్లో రైతుల చితిమంటలు వెలిగాయి. లక్షలాదిమంది పేదబిడ్డలు చదువుకొనలేక డ్రాపవుట్లుగా మిగిలిపోయారు. పంతుళ్లకూ, పాఠాలకూ దూరమైన ప్రభుత్వ స్కూళ్లు పాడుబడి పోయాయి. ఆరోగ్యం అంగడి సరుకైంది. రోగం రాకడ... ప్రాణం పోకడగా పేదల పరిస్థితి దిగజారింది. ఇటువంటి వల్లకాటి అధ్వాన్న శకాన్ని బాబు బ్రాండ్ వైభవోజ్జ్వల మహా యుగంగా యెల్లో మీడియా చిత్రించింది. ఈ తరహా చిత్రీకరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిజం చెప్పాలంటే ఆయనొక విఫల ప్రయోగం. ఆ విఫల ప్రయోగాన్ని విజయగాథగా చరిత్రలోకి జొప్పించే కుట్రలు జరుగుతున్నాయి. విధ్వంసకర విధానాల కృతికర్తకు అభివృద్ధి భుజకీర్తులు తగి లించి, ఇంకా స్తోత్రాలు పఠిస్తూనే ఉన్నారు. పళ్లూడి దవడలు జారిన వృద్ధ రంగస్థల నటికి ఊర్వశి వేషం కట్టి లొట్టలేసుకుంటూ చూడాలని ఇంకా ఆర్డర్లు వేస్తూనే ఉన్నారు. నిలువెత్తు స్వార్థ ప్రతిమపై జలతారు మేలిముసుగులు కప్పుతున్నారు. వికృత అవినీతి రూపానికి కాస్మెటిక్ సర్జరీ చేసి సింబల్ ఆఫ్ ఇంటిగ్రిటీగా నమ్మాలని ఆదేశిస్తున్నారు. ‘కామమ్మ మొగుడంటే కామోసు అనుకున్నా’డనే సామెతొ కటి ఉన్నది. పూర్వం ఒక దొంగసాధువు ఒక ఊరి కొచ్చాడట. ఓ గ్రామస్థుడతనికి ఎదురయ్యాడు. చాలాకాలం క్రితం పారి పోయిన కామమ్మ మొగుడి పోలికలు ఆ సాధువులో గ్రామ స్థుడికి కనిపించాయి. ఇంకేముంది ఇదిగో పులి అదిగో తోక! ఆనోటా ఈనోటా అదే మాట. తాను నిజంగానే కామమ్మ మొగుడినని దొంగస్వామి డిసైడై కాపురం చేద్దామని బయల్దే రాడట. సదరు కామమ్మ గట్టిగా నిలదీసేసరికి ‘నాకేం తెలుసు, అందరూ కామమ్మ మొగుడంటుంటే కామోసు అనుకున్నాన’ని వాపోయాడట! చంద్రబాబును ఒక సూపర్ బ్రాండ్‌గా నిలబెట్టడం కోసం గత పాతికేళ్లుగా యెల్లో మీడియా రాసిన కవిత్వమంతా ఆయన మెదళ్లోకి బాగా ఎక్కిపోయింది. అదంతా నిజమేనని నమ్మడం మొదలుపెట్టారు. ఆ భ్రమలోంచే ఆయన అనేక ఆణిముత్యా లను నోటి వెంట తుపుక్కు తుపుక్కుమని పలుమార్లు వెదజల్లారు. ఈ దేశానికి సెల్‌ఫోన్‌ను పరిచయం చేసింది తానేనని చెప్పారు. సత్యా నాదెళ్లను ఐటీలో ప్రోత్సహించింది తానేనని చెప్పారు. పీవీ సింధుకు మోటివేషన్ గురువు తానేనని చెప్పారు. అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతిని చేసింది తానేనని అనేకసార్లు అన్నారు. బస్సులో కూర్చొని తాను తుపాన్లను కంట్రోల్ చేశానన్నారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’ అని ప్రశ్నించి కరోనా కూడా తనను చూసి పారిపోతుందని పరోక్షంగా చెప్పారు. గతంలో తాను రెయిన్‌గన్ చేతబూని, కరువు రక్కసిని తరిమి తరిమి కొట్టానని ప్రకటించుకున్నారు. వేరేవాళ్లెవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వినేవాళ్లు ఏమనుకుంటారు? పూర్వకాలంలో పండుగలకూ పబ్బాలకూ గ్రామాల్లో అడుక్కోవడానికి పలురకాల వేషాలతో పలువురు యాచకులు వచ్చేవారు. వారిలో పిట్టల దొర పాత్ర ఒకటి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పాత్రను ‘లత్కోర్ సాబ్’ అని కూడా పిలుస్తారు. ‘మన్నించండి మారాజా ఆలస్యమైంది. ఏం జేస్తాం మారాజా... పొద్దున లేవంగనే పీఎమ్ ఫోన్, సీఎం ఫోన్, ప్రెసిడెంట్ ఫోన్, గవర్నర్ ఫోన్... వాళ్లందరికీ సర్దిచెప్పి, సలహా చెప్పి, ధైర్యం చెప్పేసరికి పొద్దుపోయింది. బయటకొచ్చి చూస్తే విమానం తోలే డ్రైవర్ రాలే, హెలికాప్టర్ టైర్ల గాలి లేదు. అందుకని నడుచుకుంట వచ్చేసరికి లేటైంది మారాజా...’ ఇట్లా ప్రారంభమౌతాయి పిట్టల దొర డైలాగులు. విదూషకుని మాటలు కనుక జనం కూడా నవ్వుకునేవారు. విదూషకుని మాటల్లానే విజనరీ నేతల మాటలు కూడా ఉంటే ఏం చేయాలి? నవ్వాలా... ఏడవాలా? జనానికి ఇదో సందిగ్ధావస్థ. యెల్లో మీడియాకు, దాని అనుంగు కూటమికి ఇప్పుడు చాలా పెద్ద కష్టమొచ్చిపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును గెలిపించాలి. గెలిపిం చకపోతే దెబ్బకు ఠా దొంగల ముఠా! ఇక యెల్లో ముఠా ఆగడాలకు ముకుతాడు పడినట్లే! అందు కని చావోరేవో తేల్చుకునే పోరుకు తెగించారు. గెలవాలంటే ఏకకాలంలో రెండు పనులు జరగాలి. జావగారిపోతున్న చంద్రబాబు పర్సనాలిటీకి బిగదీసి ప్యాడింగ్ చేయాలి. సకలజన సాధికారత పథకాలతో పెరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇమేజిని డ్యామేజీ చేయాలి. యెల్లోమీడియా, దాని మిత్ర బృందాలు ఈ కర్తవ్య సాధన కోసం కంకణాలు కట్టుకున్నాయి. మూడు షిప్టులూ పనిచేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం అసత్యాలను పోగేసి కాకమ్మ కథలను అచ్చేస్తున్నాయి. యెల్లో మీడియా గ్రూప్ లీడరైన ‘ఈనాడు’ రాస్తున్న బేతాళ కథనాలను సాక్ష్యాధారాలతో చీల్చిచెండాడుతూ ‘సాక్షి’ పత్రిక నిజానిజాలను నిగ్గుతేల్చుతున్నది. అయినా సరే, ‘నవ్విపోదురు గాక నాకేటి వెరపు’ అన్నట్లున్నది ‘ఈనాడు’ ధోరణి. సందర్భం ఏదైనా సరే, స్పందనలు ఎలా ఉన్నా సరే.. చంద్రబాబు రైట్. ముఖ్యమంత్రి రాంగ్. ఇదీ యెల్లో మీడియా రూల్ బుక్‌లో మొదటి పాఠం. మొన్నటి గోదావరి వరదల సందర్భాన్నే తీసుకుందాము. ప్రకృతి విపత్తులను ఎదు ర్కోవడం, సహాయ – పునరావాస చర్యల కోసం ‘డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (డీఆర్ఆర్) పేరుతో ఐక్యరాజ్య సమితి నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ విధానాలను పాటిస్తాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులు రూపొందించిన విధానాలు ఇవి. వరదలు రాగానే ముఖ్యమంత్రి కలెక్టర్ల నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. సహాయ – పునరావాసాలకు అవసరమైన అన్ని వనరులనూ వారికి అందుబాటులో ఉంచారు. ఇతర జిల్లాల నుంచి కూడా అవసరమైనంత మేరకు సిబ్బందిని తరలించారు. ముఖ్యమంత్రి రాజధాని కేంద్రంలో నిరంతరం అందుబాటులో ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మొదటిరోజో, రెండోరోజో ముఖ్యనేత ఆ ప్రాంతాలను సందర్శిస్తే ముఖ్యనేత పర్యటన ఏర్పాట్లలో యంత్రాంగం మునిగిపోతుందని, ఇది వాంఛనీయం కాదని నిపుణులు చెబుతారు. పలు దేశాలు ఈ పద్ధతిని పాటిస్తాయి. వైఎస్ జగన్ ఈ పద్ధతిని అనుసరిస్తూనే దీన్ని మరింత సృజనాత్మకం చేశారు. వారం రోజుల తర్వాత తాను వరద ప్రాంతాలను సందర్శి స్తానని, తమకు ప్రభుత్వ సాయం అందలేదనే గొంతు అప్పుడు వినపడకూడదనే షరతును ముఖ్యమంత్రి అధికారులకు విధించారు. దీంతో అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమించి చరిత్రలో ఎన్నడూ లేనంత సమర్థంగా సహాయ చర్యల్ని చేపట్టింది. వైపరీత్యాల తర్వాత వారం రోజులకు ప్రభుత్వాధినేతలు పర్యటనకు వెళ్లడం మన దేశంలో ఒక సాహసం. సహాయక చర్యలు అందని ప్రజలు తీవ్ర ఆగ్రహా వేశాలతో ఉంటారు. వారిని సముదాయించడం శక్తికి మించిన పనవుతుంది. మొదటి రెండు మూడు రోజుల్లో వెళ్లొస్తే ఈ పరిస్థితులు ఎదురుకావు. కానీ విచిత్రంగా వారం రోజుల తర్వాత పర్యటనకు వెళ్లినా జగన్‌ను బాధితులు ఆత్మబంధువు లాగానే స్వాగతించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తమకు సాయం అందలేదని చెప్పలేదు. ఇందుకు కారణం ముఖ్య మంత్రి అనుసరించిన శాస్త్రీయ కార్యాచరణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠను దెబ్బతీసే రాతలు రాయడం, చంద్రబాబు ఇమేజిని పెంచే ప్రచారం చేయడం అనే యెల్లోమీడియా ఎత్తుగడ ఆత్మహత్యాసదృశం కాబోతున్నది. గతించిన కాలం మాదిరిగా యెల్లో మీడియా ఆడింది ఆట పాడింది పాట అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రత్యామ్నాయ మీడియా ఉన్నది. సోషల్ మీడియా ఉన్నది. రకరకాల మార్గాల్లో ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నవి. వైఎస్ జగన్, చంద్ర బాబుల వ్యక్తిత్వాల పట్ల ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నది. వ్యక్తిత్వంలోగానీ, విజన్‌లో గానీ, పాలనా సామ ర్థ్యంలోగానీ, పారదర్శకతలో గానీ, సామాజిక దృక్పథంలోగానీ జగన్ ముందు చంద్రబాబు సరితూగలేడు. ప్రజలకిచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఆనాడు సర్వ శక్తిమంతురాలైన భారత సామ్రాజ్ఞి హుకుంనామాను ధిక్క రించిన ధీశాలి జగన్. ఆ మార్గంలో వెళితే కష్టాల పాలవుతాననీ, కడగండ్లెదురవుతాయనీ తెలిసినా వెనుకడుగేయని మనో నిబ్బరం జగన్ సొంతం. నమ్మి చేరదీసిన మామను గొంతుకోసి గద్దెనెక్కిన కుటిల స్వభావం చంద్రబాబుది. నిరంతరం కుట్రలూ, కూహకాలలో మునిగితేలుతూ అధికారాన్ని కాపాడుకునే దుర్నీతి బాబుది. అధికారం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోను మాయం చేసి హామీలను అటకెక్కించే మోసపూరిత నడవడి చంద్రబాబుది. ఆనాడు ‘రైతు రుణమాఫీ హామీ’ ఇవ్వకపోతే ఓడిపోతావని పలువురు హెచ్చరించినా ఓటమికైనా సిద్ధపడ తాను కానీ, నిలబెట్టుకోలేని మాటను ఇవ్వలేనని కుండబద్దలు కొట్టిన స్థిరచిత్తం జగన్‌ది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే చేపట్టిన పరిపాలనా సంస్కరణలకు ఈరోజున దేశమంతా జైకొడు తున్నది. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు జగన్ పరిపాలనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపం చంలో ఎన్నిచోట్ల నుండి ఎన్ని ప్రశంసలు వచ్చినా వాటిని ప్రచారంలో పెట్టుకోకపోవడం జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వపు మరో ప్రత్యేకత. మూడేళ్లలో లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపా యలను ప్రజలకు డీబీటీ పద్ధతిలో బదిలీ చేయడం, పైసా దుర్వినియోగం కాకపోవడం దేశంలో ఒక రికార్డు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళల సాధికారత కోసం అమలుచేస్తున్న ఆర్థిక, రాజకీయ ఉద్దీపన కార్యక్రమాలు ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎన్నడూ కనీవినీ ఉండలేదు. బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లుండాలని పార్లమెంట్లో బిల్లు పెట్టిన రాజకీయ పార్టీ ఈ దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. కాగా, బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుది. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఈసడించుకునే దురహంకారం చంద్రబాబు సొంతం. దళితుల్ని ఉపముఖ్యమంత్రులు, కీలక శాఖల సారథులుగా ఎంపిక చేసుకున్న సౌభ్రాతృత్వం జగన్ నైజం. స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్ పనుల్లోనూ, పదవుల్లోనూ సగభాగం మహిళలకు కేటాయించి మంత్రివర్గంలో హోమ్ శాఖతో సహా కీలక శాఖలను కట్టబెట్టిన ఘనత జగన్ ప్రభు త్వానిది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని మాట్లాడే పురుషాహంభావం చంద్రబాబుది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటి గురించి మాట మాత్రపు ప్రస్తావనైనా లేకుండా అక్కడక్కడ దొర్లే చిన్నచిన్న పొరపాట్లపై భూతద్దాలు వేసే వికృత పాత్రికేయానికి యెల్లో మీడియా పాల్పడుతున్నది. ఎగసిపడుతున్న విప్లవ కెరటాలు దాచేస్తే దాగేవి కావు. ఎల్లో మీడియా కళ్లు మూసుకుంటే లోకం చీకటి కాబోదు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వీకెండ్ రుతుపవనం!
ఆరు రుతువులూ గతులు తప్పుతున్నాయిప్పుడు. తప్పుడు అడ్రసుల్లో తలుపులు తడుతున్నాయి. లండన్‌లో ఎండలు మండుతున్నాయి. ఇండియాలో మబ్బులు పగులుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్! భూ మండలాన్ని నరావతారం భ్రష్టుపట్టించిన ఫలితం. భారత రాజకీయాలను కూడా ఇటువంటి ఎఫెక్ట్ ఏదో పట్టి పీడిస్తున్నది. ముఖ్యంగా తెలుగుజాతి రాజకీయాలను! రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను వాటి కక్ష్యల్లో అవి పరిభ్రమించకుండా గతులు తప్పించినందువల్ల కలిగిన దుష్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ వార్మింగ్‌కు ఆదిగురువు చంద్రబాబు అని ప్రత్యేకంగా చెప్ప వలసిన అవసరమే లేదు. దుష్ఫలితాల్లో ఒకటి – వీకెండ్ రుతుపవనం. ఇది ప్రతి వారాంతంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్‌లో కమ్ముకొని యాసిడ్ రెయిన్స్ను కురిపిస్తున్నది. అది కులాల మధ్య చిచ్చుపెట్టే యాసిడ్. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సహజం. పాత పొత్తులు భగ్నమవడం, కొత్త పొత్తులు కుదురుకోవడం కూడా సహజమే. కాకపోతే కొత్త పొత్తులు పొడవడానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. వేళాపాళా లేకుండా ఎవడైనా భూపాలం పాడితే అనుమానించాలి. కారణమేమిటో ఆరా తీయాలి. ‘జనసేన’ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల పొత్తుతో ఆరేడు శాతం ఓట్లను సంపాదించగలిగింది. భారతీయ జనతాపార్టీ జాతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో దాని ప్రభావం పరిమితమైనది. మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, ఒక్క శాతం ఓట్లను మాత్రమే సంపాదించగలిగింది. ఈ రెండు పార్టీలు కలిసి ఒక శుభోదయాన పొత్తు కుదుర్చుకున్నాయి. ఎన్నికలకు ముందు కాదు... ముగిసిన తర్వాత! అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి ఒక సీటు, మరో పార్టీకి సున్నా సీట్లు లభించాయి. కనుక ఈ రెండూ కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేదు. పోనీ పార్లమెంట్లో జనసేన బలంతో బీజేపీకి ఏమన్నా ఉపయోగముంటుందా? బీజేపీకి సొంతంగానే మెజారిటీ ఉంది. ఆపైనా ఎన్డీఏ పక్షాలున్నాయి. అయినా సరే, కరివేపాకులా కలిసి పోదా మనుకున్నా జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా లేదు. పోనీ, భావసారూప్యత వంటి గంభీరమైన అంశమేదైనా ఈ అకాలపొత్తునకు పురికొల్పి ఉంటుందా? ఎన్నికలయ్యేంత వరకు జనసేన పార్టీ వామపక్షాల పొత్తులో ఉన్నది. వామ పక్షాలు – బీజేపీ తూర్పు పడమరల వంటివి. భావజాల పరంగా ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదు. మరి, మన ఏకాకి ఇక్కడ్నుంచి ఎలా వెళ్లింది? ఆ ఇంటి మీద ఎలా వాలింది? కంటికి కనిపించని రహస్యమేదో ఉన్నది. సరిగ్గా అదే సమయంలో సమాంతరంగా తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలను కూడా బేరీజు వేసి చూస్తే రహస్యం గుట్టు విడిపోతుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో నాలుగేళ్ల పాటు సహజీవనం చేసిన చంద్రబాబు ఎన్నికలకు ఏడాది ముందు అడ్డం తిరిగారు. మోదీపై యుద్ధం ప్రకటించారు. రెండు చేతులతో కత్తులు దూశారు. కాంగ్రెస్‌తో, ఇతర నాన్–బీజేపీ పక్షాలతో చుట్టరికం కలుపుకొన్నారు. ప్రధానమంత్రిపై వ్యక్తిగత స్థాయి దూషణలకు కూడా దిగారు. ఆయనను గద్దె దించేది ఖాయమని రణగర్జనల కేసెట్ వినిపించారు. ఫలితాలు రాగానే చల్లబడిపోయారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్ వచ్చింది. చేసిన స్కామ్స్ చంద్రబాబుకు నిద్రపట్టనివ్వలేదు. ప్రచారంలో తాను తిట్టిన తిట్లను మోదీ మనసులో పెట్టుకుంటే, చేసిన కుంభ కోణాల ఫలితాన్ని జైల్లో అనుభవించవలసి వస్తుందని వణికి పోయాడు. యెల్లో సిండికేట్‌తో కలిసి విరుగుడు మంత్రంపై చర్చించారు. బీజేపీలో పలుకుబడి కలిగిన కొందరు దగ్గరి వారి సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన హితులు, సన్నిహితులు, తన ఆస్తుల బినామీలుగా పరిగణించే సుజనా చౌదరి, సీఎమ్ రమేశ్ వగైరా రాజ్యసభ బృందాన్ని బీజేపీలో చేర్పించారు. మోదీ సర్కార్‌కు తనపై ఆగ్రహం కలుగకుండా లాబీయింగ్ చేయడం ఈ సంధి లక్ష్యం. పూర్వకాలంలో రాజులు పొరుగు రాజ్యాలతో సంధి చేసుకొని వియ్యమందుకున్నప్పుడు ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు, వజ్రవైఢూర్యాది కట్నకానుకలతో పాటు కొందరు విదూషకులనూ, చెలికత్తెలనూ కూడా అరణంగా పంపించే వారు. తన పార్టీ వారిని అంతర్గత లాబీయింగ్ కోసం బీజేపీలో చేర్పించడంతోనే చంద్రబాబు సాంత్వన పడలేదు. ఆయన అభీష్టం మేరకు రాష్ట్రంలో బీజేపీకి ఒక మిత్రపక్షంగా జనసేన పార్టీ కూడా సరిగ్గా అదే సమయంలో షరీకైంది. చంద్రబాబు అభీష్టం మేరకే జనసేన పార్టీ బీజేపీని హత్తుకున్నట్లయితే అంతకు ముందు ఎన్నికల్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేస్తుందనే అనుమానం కొందరికి కలగవచ్చు. అది కూడా చంద్రబాబు అభీష్టం మేరకేనని అభిజ్ఞుల అభిప్రాయం. ఇందుకు రెండు కారణాలున్నాయని వారు చెబుతున్నారు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీతో పాటు, బీజేపీ, జనసేన–లెఫ్ట్ కూటమిల మధ్య నెగెటివ్ ఓటు చీలిపోతే తనకు లబ్ధి కలుగుతుందని టీడీపీ భావించింది. ఇక జనసేన అభ్యర్థులను తనకు పనికివచ్చే సామాజిక సమీకరణాలకు అనుగుణంగా నిర్ణయించు కోవచ్చుననేది రెండో కారణం. ఆచరణలో ఈ ఎత్తుగడను అమలు చేశారు. వైసీపీ తరఫున బలమైన అభ్యర్థులున్న ప్రతి చోటా జనసేన తరఫున అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దించారు. కులపరంగా ఓట్లు చీలిపోతే టీడీపీకి లబ్ధి జరుగుతుందని ఆ పార్టీ అధినేత ఓ నాటు లెక్కను వేసు కున్నారు. కాకపోతే ఉద్ధృతంగా వీచిన జగన్ ప్రభంజ నంలో ఈ నాటులెక్కలు కొట్టుకుపోతాయని వారు ఊహించ లేకపోయారు. అధికార లక్ష్యసాధన కోసం కాకుండా అందుకు ఉప యోగపడే పనిముట్టుగానే జనసేన పురుడు పోసుకున్నదనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, అదే నిజం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పద్ధెనిమిది శాతం ఓట్లు ఆ పార్టీకి లభించాయి. బీసీ కేటగిరిలో ఉండే తూర్పు కాపులను మినహాయించినా మిగిలిన కాపు ఉపజాతుల వారు ఏపీ జనాభాలో పది శాతం వరకుంటారనే ఒక అంచనా ఉన్నది. ఇందులో మెజారిటీ ఓటర్లు ప్రజారాజ్యం పార్టీ పట్ల సానుకూలంగా స్పందించారని తేలింది. కాపుల ఆత్మగౌరవ ప్రతీకగా ఎదుగుతున్న వంగవీటి మోహనరంగా హత్యకు ప్రధాన కారకుడిగా చంద్రబాబును కాపులు పరిగణిస్తారు. అందువల్ల నేరుగా వారి మద్దతును సంపాదించడం చంద్ర బాబుకు సాధ్యం కాదు. అందువల్ల చిరంజీవి సోదరుడైన పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించి తనకు అవసరమైనప్పుడు, అవసరమైన రీతిలో ఉపయోగపడే విధంగా ఈ రాజకీయ ప్రయోగం చేశారనే రహస్యం టీడీపీ ముఖ్యనేతలందరికీ తెలిసిన వాస్తవం. టీడీపీ వలన టీడీపీ కొరకు టీడీపీ చేత ప్రభవించిన రాజకీయ వేదికగా జనసేనపై ముద్ర పడింది. పవన్ కల్యాణ్‌కు సినిమా కాల్షీట్లు ఎలానో, పొలిటికల్ కాల్షీట్లూ అలానే! ఈ సీజన్లో ఆయనకు శని, ఆదివారాల కాల్షీట్లు కేటాయించారు. ఈ రెండు రోజులూ యెల్లో మీడియా ఆయనకు విస్తృత ప్రచారం చేస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు యెల్లో మీడియా కాల్షీట్లన్నీ చంద్రబాబుకూ, వాళ్లబ్బాయికీ రిజర్వవుతాయి. మొన్న పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి పర్యటనలో ఉండగానే గోదావరి వరదలు మొదల య్యాయి. స్వతంత్ర రాజకీయ నాయకుడైతే ఇంకో రెండు మూడు రోజులు అక్కడే ఉండేవారు. కానీ ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం ఆయన వెంటనే నిష్క్రమించి, మీడియా స్పేస్‌ను చంద్రబాబుకు అప్పగించారు. తాజా పర్యటనలో పవన్ కల్యాణ్ కొత్త రాగాన్ని అందుకున్నారు. ‘మీకు ఆంధ్రా ఫీలింగ్ ఎలాగూ లేదు. కనీసం కుల ఫీలింగయినా తెచ్చుకొండ’ని తన సామాజిక వర్గాన్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు. కుల ఫీలింగ్‌తో వారు తనను అనుసరించాలనీ తాను చంద్రబాబును అనుసరిస్తాననేది కవిహృదయం. ఈమధ్య కాలంలోనే పవన్ కల్యాణ్ రెండు కీలకమైన ప్రకటనలు చేశారు. వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోమనేది మొదటి ప్రకటన. జనసేన ఏర్పాటు తర్వాత మొదటి ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా టీడీపీకి ప్రచారం చేసిపెట్టారు. రెండో ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకి సహకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నది. కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తనూ తనతోపాటు బీజేపీ కూడా చంద్రబాబు కూటమిలో చేరాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసం బీజేపీ పైనా ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభిప్రాయం మరొక రకంగా ఉన్నది. కేంద్రనాయకత్వం ఏపీ ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడానికి విస్తృతంగా సర్వేలు చేసింది. 52 నుంచి 55 శాతం ఓటర్ల మద్దతు వైసీపీకి ఉన్నదనీ ఈ సర్వేలన్నీ తేల్చాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను బేరీజు వేసుకొని చూసినా ఈ సర్వే ఫలితాలనే బలపరుస్తున్నాయి. అందువల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన అన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వైఎస్సార్సీపీని ఓడించడం సాధ్యం కాదనే నిర్ధారణకు బీజేపీ వచ్చింది. కనుక జనసేన, తాము ఒక కూటమిగా పోటీ చేసి ఈ ఎన్నికల్లో వీలైనంత బలపడాలని ఆ పార్టీ భావిస్తున్నది. మరో ఓటమి తర్వాత టీడీపీ పూర్తిగా బలహీన పడుతుందనీ, తదుపరి ఎన్నికల నాటికి తమ కూటమే ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ గలుగుతుందనేది బీజేపీ రోడ్ మ్యాప్. కానీ వారి పార్ట్నర్... వాస్తవానికి ముసుగేసుకున్న చంద్రబాబు పార్ట్నర్. ఆయనకీ రోడ్‌మ్యాప్ నచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ బీజేపీ తనతో కలిసిరాకున్నా ఆయన మాత్రం హిజ్ మాస్టర్స్ వాయిస్ ప్రకారం టీడీపీతో సహకరించే అవకాశాలు ప్రస్ఫుటం. ఇక పవన్ కల్యాణ్ చేసిన రెండో కీలక ప్రకటన – తన సొంత సామాజిక వర్గం వారిని సంతృప్తిపరచడం కోసం చేసింది. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడనే అభిప్రాయం పోగొట్టడానికి ఆయనొక ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి పోటీలో తాను కూడా ఉన్నట్టు ఒక సందేశాన్ని వదిలారు. పవన్ కల్యాణ్ పార్టీ పుట్టుపూర్వోత్తరాలపై అవగాహన ఉన్న కొందరు టీడీపీ నేతలు ఈ సందేశంపై తీవ్రంగా స్పందించారు. దాంతో ఆయన మళ్లీ దాన్ని పునరుద్ఘాటించే సాహసం చేయలేక పోయారు. ఇప్పుడు తాజాగా కాపు సామాజిక వర్గం తన వెంట రావాలని పిలుస్తున్నారు. తాజా పిలుపుపై ఆయన సామాజిక వర్గం నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రంగా హత్యకు కారకుడైన వ్యక్తిని, ముద్రగడ వంటి పెద్దమనిషి కుటుంబాన్ని వేధించి అవ మానించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నాలకు తాము ఏ పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని పలువురు సామాజిక వర్గ ప్రముఖులు తెగేసి చెబుతున్నారు. పూర్వం ప్రజారాజ్యంలో కీలకంగా పనిచేసి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా వున్న ప్రముఖుడొకరు ఈ నేపథ్యంలో కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘పవన్ కల్యాణ్ అనే వ్యక్తికి ఒక ఐడియాలజీ లేదు, ఒక లక్ష్యం లేదు, నిబద్ధత అసలే లేదు. చివరికి ప్రమాణపూర్వకంగా కోర్టుకు కూడా అసత్యాలు చెప్పిన వ్యక్తి ఆయన’. అటువంటి వ్యక్తిని నాయకునిగా స్వీకరించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ‘‘ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించే సమయంలో, 2007లో అనుకుంటా. ఈయన ‘కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ అనే సంస్థను పెట్టారు. ఆ సమయంలో మాట్లాడుతూ తాను రేణూ దేశాయ్‌తో సహజీవనం చేస్తున్నట్టు, అకీరా నందన్ అనే కొడుకు ఉన్నట్టు మాకు చెప్పారు. తర్వాత కొద్ది రోజులకే మొదటి భార్య విడాకుల కేసులో విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టులో ఒక అఫిడవిట్ వేశారు. అందులో తాను రేణూ దేశాయ్‌తో సహజీవనం చేయడం లేదనీ, తనకు కొడుకు లేడనీ ప్రమాణ పూర్వకంగా చెప్పారు. తర్వాత ఏడాదిన్నరకు 2009లో ఆయన రేణూ దేశాయ్‌ని బహిరంగంగా పెళ్లి చేసుకున్నారు. ఆయన కొడుకు పేరుతో కొందరికి ఆహ్వానాలు కూడా అందాయి. కొంత కాలా నికి పవన్‌తో విడాకుల తర్వాత రేణూ దేశాయ్, ఏబీఎన్ రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఎనిమిదేళ్ల సహజీవనం తర్వాత తమ పెళ్లయిందని ఆమె చెప్పారు. అంటే 2001 నుంచి వారు సహజీవనంలో ఉన్నారు. కానీ 2007లో కోర్టుకు మాత్రం అటువంటిదేమీ లేదని ప్రమాణ పూర్వకంగా చెప్పారు’’. కోర్టుకే అసత్యాలు చెప్పిన వ్యక్తిని నాయకునిగా ఎలా అంగీకరిస్తామన్నది ఇప్పుడా ప్రజారాజ్యం మాజీ నాయకుని ప్రశ్న. జరుగుతున్న రాజకీయ పరిణామాలను సాధారణ ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. కొన్నిసార్లు రాజకీయ పరిశీలకుల కంటే మిన్నగా స్పష్టమైన అంచనాలకు వారు వస్తుంటారు. పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌పై ఆయన సామాజిక వర్గానికే చెందిన ఒక మెడికల్ షాప్ యజమాని విశ్లేషణ చూడండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరకంగా, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో మరోరకంగా ప్రతిపక్షపాత్రను పవన్‌కల్యాణ్ పోషించారట. ‘చంద్రబాబు టైమ్‌లో అన్నీ ఒకరోజు ఉద్యమాలే చేసేవాడు. ఉద్దానంపై ఒక రోజు, రాజధాని రైతుల కోసం ఒకరోజు... అలా! కానీ ఇప్పుడు మాత్రం కౌలు రైతుల పేరుతో వారం వారం సీరియల్లాగా ఉద్యమం చేస్తున్నాడు. అసలు కౌలు రైతుల సమస్యను ఇప్పటి వరకు రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఎవరూ పరిష్కరించనంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారు. అయినా కూడా పవన్‌కు అందులోనే సమస్య కనబడుతున్నది. చంద్రబాబు కోసం కాకపోతే ఎవరికోసమండీ ఈయన రాజకీయమ’ని సదరు మెడికల్ షాపు ఓనర్ ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజల్లో ఇంత రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్నప్పుడు ఈ వీకెండ్ రుతుపవనాలు ఏ ఉత్పాతాలను సృష్టించగలుగుతాయి? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సకల జన సాధికారత!
రాజకీయ పార్టీలు మహాసభలు జరుపుకోవడం సర్వ సాధారణ విషయం. వాటి నియమావళిని బట్టి, వెసులు బాటును బట్టి రెండేళ్లకో మూడేళ్లకో ఈ సభలు జరుగు తుంటాయి. మహాసభలు కొన్ని తీర్మానాలను ఆమోదిస్తాయి. వాటిలో చాలావరకు మొక్కుబడి తీర్మానాలే ఉంటాయి. ఆ తీర్మానంలో పేర్కొన్న అంశాలపై ప్రత్యేకంగా కార్యాచరణ అంటూ ఏమీ ఉండదు. పడికట్టు మాటల తీర్మానాలుగానే అవి మిగిలిపోతాయి. సభకు హాజరైన వాళ్లకు కూడా అవి గుర్తుండవు. కొన్ని మాత్రం భవితకు బాటలు వేసే తీర్మానా లవుతాయి. కొన్నికొన్ని చారిత్రక సందర్భాల్లో కొన్ని రాజకీయ పార్టీల సభలు చేసిన ఇటువంటి తీర్మానాలు చరితార్థమైనాయి. మాటల తీర్మానాల్లో ఈ దేశంలోనే మేటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మాటలు కోటలు దాటును.. అడుగు మాత్రం గడప దాటదు అనడానికి రుజువులు ఆ పార్టీ తీర్మానాలు, నేతల ఉపన్యాసాలు. ఎన్టీ రామారావుకు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రతి మహాసభలో తీర్మానం చేస్తారు. కేంద్రంలో మూడు సందర్భాల్లో అధికార కూటమిలో ఉండి కూడా అందుకోసం కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అదీ... తీర్మానాలపై ఆ పార్టీ చిత్తశుద్ధి! మొన్నటి మహానాడులో ఆ తీర్మానం కూడా చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, దాని అధినేత జగన్ మోహన్‌రెడ్డిని తిట్టడానికే సమయం సరిపోకపోవడంతో ఇతర తీర్మానాలను పక్కనబెట్టేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలనూ విమర్శించడమే పనిగా 15 తీర్మానాలు చేశారు. కానీ తాము అధికారంలోకి వస్తే ఏం చేయ గలమో చెప్పుకోలేని మేథోనిస్తేజం ఆ పార్టీని అలుముకున్నట్టు స్పష్టమయింది. ఇంచుమించు బ్రెయిన్ డెడ్‌తో ఇది సమానం. కొన్ని తీర్మానాలు చరిత్ర గతులను మార్చాయి. 1978 నాటి ‘ఆనంద్‌పూర్ సాహెబ్ తీర్మానం’ అకాలీదళ్ రాజకీయ గమనా నికి దిక్సూచిగా మారింది. సిక్కుల ప్రత్యేక ప్రతిపత్తికి దారి తీసింది. జస్టిస్ పార్టీ 1944 మహాసభల్లో అన్నాదొరై ప్రవేశ పెట్టిన తీర్మానాలు ఆ పార్టీలో చీలికకు దారితీశాయి. పెరియార్ నాయకత్వంలో ‘ద్రవిడ కళగం’ పుట్టుకకు అన్నాదొరై తీర్మానాలు దోహదం చేశాయి. తర్వాత కాలంలో డీకే నుంచి డిఎమ్‌కే వేరుపడడం, తమిళనాడు చరిత్ర మారడం మనకు తెలిసిందే! లాహోర్ కాంగ్రెస్‌లో ‘పూర్ణస్వరాజ్’ తీర్మానం తర్వాతనే స్వాతంత్య్రోద్యమంలో వేగం పెరిగింది. బొంబాయి కాంగ్రెస్ చేసిన ‘క్విట్ ఇండియా’ తీర్మానం తర్వాతనే స్వాతంత్య్ర ప్రకటన అనివార్య పరిణామంగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్య రాజకీయ పార్టీల్లో ఇటువంటి ‘బాటలు వేసే’ తీర్మానాలు చాలా గుర్తుకురావచ్చు. రివల్యూషన్ రెక్క విప్పుతున్నప్పుడే దాని విశ్వరూపాన్ని గుర్తించగలగడం దూరదృష్టికి ఒక కొండగుర్తు. నిన్న, మొన్న మంగళగిరిలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో చేసిన తీర్మానాలను జాగ్రత్తగా గమనించండి. వికసించనున్న విప్లవ కుసుమ పరాగం కనబడుతుంది. రెండు రోజుల్లోనూ ప్రవేశ పెట్టిన తీర్మానాల్లో అంతస్సూత్రంగా ‘సకలజన సాధికారత’ అనే మంత్రం ప్రవహించింది. పేదవర్గాల సాధికారతకు బాటలువేసే ఈ అంశాల అమలు ఇప్పటికే ప్రారంభమైంది. మరింత పట్టుదలతో విజయవంతంగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయబోతున్నామని తీర్మానాలు స్పష్టం చేశాయి. నిరుపేదలకు ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ కోసం జరిగిన పోరాటాలు గత చరిత్రగా మిగిలిపోతున్నాయి. కేవలం బతకడం మాత్రమే కాదు... మనిషిగా బతకడం, తెలివితేటలు అలవర్చు కోవడం, ఉన్నతమైన విద్యను అందుకోవడం, సౌకర్యవంతమైన ఇంటిలో నివాసం ఉండడం... ఒక్కమాటలో తన జీవన గమ నాన్ని తానే నిర్ణయించుకోగలగడం సాధికారత! ‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. దోపిడీ – పీడన పునాదిగా ఏర్పడిన గడచిన పాలనా వ్యవస్థల్లో సాధికారత అనేది పాలకవర్గంలోని పురుషులకు మాత్రమే పరిమితం. వైవిధ్యభరితమైన మనదేశంలో, మన నిచ్చెనమెట్ల సామా జిక దొంతరల్లో అత్యధిక జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనారిటీ మతస్థులు కూడా సాధికారతకు బహుదూరంగా మిగిలిపోయారు. అగ్రకులాలుగా చెప్పుకునే వారి లోని పేద ప్రజల్లో కూడా సాధికారత మృగ్యం. అన్ని వర్గాల్లోనూ నిట్టనిలువునా మహిళలందరూ సాధికారతకు నోచుకోనివారే! శతాబ్దాల పాటు బానిసత్వంలో మగ్గిన ఈ దేశంలో... బహుజనులందరూ నిరక్షరాస్యులుగా, పేదలుగా కునారిల్లిన ఈ దేశంలో... ప్రజాస్వామ్య వ్యవస్థ శోభిల్లాలంటే ప్రజలందరినీ సాధికారత వైపు మళ్లించవలసిన అవసరముందని అప్పటి మన జాతీయ నేతలు, రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. అప్పుడు రాజ్యాంగ సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా ఉండడం, ఆయనే రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉండడం ఈ దేశ బహుజనులు చేసుకున్న పుణ్యఫలితం. దేశ శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు దిశా నిర్దేశం చేస్తూ అందుకు అవసరమైన నిబంధనలను ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల పేరుతో రాజ్యాంగంలో చేర్చారు. వాటిని అమలుచేయమని ఆదేశిం చారు. రాజ్యాంగ స్ఫూర్తినీ, సందేశాన్నీ క్లుప్తంగా గుదిగుచ్చి, రాజ్యాంగానికి ఆత్మ వంటి ఒక పీఠికను రూపొందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సాధికారత సాధనే రాజ్యాంగ పీఠిక సందేశం. ఆనాటి నుంచీ నేటివరకూ కేంద్ర, రాష్ట్రాలను పాలించిన ప్రభుత్వాలు ఓట్ల కోసం మాత్రమే సంక్షేమ మంత్రం జపించాయి తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని సాధికారత సాధన కోసం కృషి చేయలేదు. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తన మంత్రివర్గ కూర్పుతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ పండితులను షాక్‌కు గురిచేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నిటికీ కలిపి యాభై శాతం కంటే కొంచెం తక్కువగానే కేబినెట్ బెర్తులు దొరికేవి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ సంఖ్యను ఎకాయెకిన 70 శాతానికి తీసుకొనిపోయిన జగన్ సాహసానికి రాజకీయ పక్షాలు నివ్వెరపోయాయి. బలమైన వర్గాలను ఎలా సంతృప్తిపరచగలడు? ఎలా సర్కార్‌ను నిలబెట్టుకోగలడని సందేహించిన వారు కూడా ఉన్నారు. ఎవరి సందేహాలనూ ఆయన ఖాతరు చేయలేదు. ఐదు ఉపముఖ్యమంత్రి పదవుల్ని సృష్టించి, అందులో నాలుగు ఈ వర్గాలకే కేటాయించారు. మంత్రి పదవులివ్వడమే కాదు... విద్య, హోం వంటి కీలక శాఖల్ని సైతం బలహీనవర్గాలకే కేటాయించారు. మహిళలకు ముఖ్య శాఖల్ని కట్టబెట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సైతం ఇదే తూకాన్ని పాటించారు. స్థానిక సంస్థల్లోనూ పాత ఫార్ములాను తిరగరాశారు. 70 శాతానికి పైగా బలహీనవర్గాలకు కేటాయించారు. తిరిగి వాటిలో యాభై శాతానికి పైగా మహిళలకే కట్టబెట్టారు. శాసనసభ స్పీకర్, శాసన మండలి ఛైర్మన్ పదవులు రెండూ ఏకకాలంలో ఈ వర్గాలకే ఇవ్వడమనేది గతంలో ఊహకైనా అందని విషయం. నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ యాభై శాతం ఈ వర్గాలకే కేటాయించడాన్ని చట్టబద్ధం చేశారు. అందులోనూ మళ్లీ సగభాగం ముఖ్యమంత్రి మాటల్లో ‘అక్కాచెల్లెమ్మలకే’! ఈ చర్యలు రాజకీయంగా, సాంఘికంగా కూడా బలహీనవర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని వందరెట్లు ఇనుమడింపజేశాయి. అయితే ఈ నియామకాల దగ్గరే జగన్మోహన్రెడ్డి ఆగిపోలేదు. విధానాల రూపకల్పనలో, పరిపాలనా పద్ధతుల్లో ఆయన ప్రవేశపెట్టిన మార్పులను నిశితంగా గమనిస్తే – ఒక విప్లవాత్మకమైన ఆలోచన వీటి వెనుక కనిపిస్తుంది. మహాశిల్పి ఉలితో ఒక శిల్పాన్ని చెక్కడానికి సిద్ధమైనప్పుడు ఎంత కచ్చితమైన లెక్కలు వేసుకుంటాడో అంత కచ్చితమైన అంచనాలతో ‘సకల జనుల సాధికారతా’ శిల్పాన్ని మలచడానికి వైఎస్ జగన్ సిద్ధపడ్డారు. విద్యారంగం, వైద్య – ఆరోగ్య రంగం, వ్యవసాయ రంగా లను సంస్కరించడం ద్వారానూ, పరిపాలనా వికేంద్రీకరణ – పారదర్శకతల తోడుతోనూ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించవచ్చనీ, రాజ్యాంగ విహిత లక్ష్యాలను నెరవేర్చ వచ్చనీ ఏపీ ముఖ్యమంత్రి వేసిన అడుగులు రుజువు చేశాయి. పేద పిల్లలకు కూడా పెద్దవారి పిల్లలతో సమానంగా నాణ్యమైన చదువును ఉచితంగా చెప్పించినట్లయితే, వారికి మాదిరిగానే ఇంగ్లిషు మీడియంలో నేర్పించినట్లయితే, ఆత్మన్యూనత తలెత్తకుండా వారికి మల్లేనే కొత్త బూట్లు, యూనిఫామ్, బెల్ట్, బ్యాగ్‌లు సమకూర్చినట్లయితే, ప్రైవేట్ స్కూళ్లకు తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా సౌకర్యాలతో మురిసిపోయి నట్లయితే... పేదింటి పిల్లలు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఎదుర్కోగలరని భావించిన ముఖ్యమంత్రి ఆ ఏర్పాట్లన్నీ చేశారు. పిల్లల్ని కచ్చితంగా బడికి పంపించడానికి ప్రోత్సాహకంగా ‘అమ్మ ఒడి’ అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ సంస్కరణల అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. ఓ పదేళ్లు గడిస్తే మన సమాజంపై ఈ సంస్కరణ పెను ప్రభావం చూపనుంది. నేటి పేదిళ్లను పెద్దిళ్లుగా మార్చబోతున్న దివ్యాస్త్రం ఇది! రాష్ట్రాన్ని సంపూర్ణ ఆరోగ్య సమాజంగా మార్చే కృషిని చాలా పెద్దయెత్తున వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఈ ఒక్క రంగంలోనే 40 వేల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ప్రతి మండలానికీ రెండేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెట్టి, ఇద్దరేసి డాక్టర్ల చొప్పున నియమించి పటిష్ఠం చేశారు. ప్రతి గ్రామంలోనూ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 16 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నడుం కట్టారు. అంతిమంగా ప్రతి కుటుంబం ఒక డాక్టర్‌తో, అతని ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో, అక్కడి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తో, ఏరియా ఆస్పత్రితో, జిల్లా ఆస్పత్రితో, చివరగా ప్రభుత్వ జనరల్ హాస్పి టల్తో అనుసంధానమయ్యే ఒక వినూత్న పద్ధతిని ముఖ్య మంత్రి డిజైన్ చేశారు. ప్రతి కుటుంబాన్నీ నెలకు రెండుమార్లు పరామర్శించనున్న ఫ్యామిలీ డాక్టర్ వెనుక ఇంత పటిష్ఠమైన ఆరోగ్య వ్యవస్థ రూపుదిద్దుకోబోతున్నది. ఆ వ్యవస్థలో ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్ నిక్షిప్తమై ఉంటుంది. ఈ వ్యవస్థకు పునాదులు ఇప్పుడే పడ్డాయి. పేద – ధనిక తేడా లేకుండా ఆరోగ్య సమాజం అందరికీ ఒకే రకమైన ధీమానిస్తుంది. ఆర్బీకె సెంటర్లను ఇప్పటికే ఎన్ని బృందాలు దర్శించి, హర్షించి వెళ్లాయో లెక్కేలేదు. దీన్ని దేశవ్యాప్తం చేయాలని ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ కూడా ఆలోచిస్తున్నది. రైతుకు కావలసిన నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అదనులోనే అందజేస్తూ, పంటల మార్కెటింగ్‌లోనూ తోడ్పడే విధంగా ఈ వ్యవస్థను ప్లాన్ చేశారు. వ్యవసాయ సంక్షోభానికి ముఖ్య కారణాలైన పెట్టుబడి వ్యయం – గిట్టుబాటు కాని ధర అనే రెండు సమస్యలకూ ఆర్బీకె సెంటర్లు, ఆర్బీకె సెంటర్ల మధ్యవర్తిత్వం వలన పరిష్కారం లభించబోతున్నది. పరిపాలనా వికేంద్రీకరణలో చిట్టచివరి స్థాయికి – ఇంటి గడప వద్దకు ఈ ప్రభుత్వం వెళ్లగలిగింది. వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. విలేజ్ సెక్రటేరియట్ ఒక విప్లవాత్మక ఆలోచన. కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా అర్హత గల ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి ఈ సెక్రటేరియట్ల ద్వారా అవకాశం చిక్కింది. ఎవరి దయాదాక్షిణ్యం అవసరం లేకుండానే, వారికిది అందు తున్నది. పారదర్శకత పెరిగింది. ప్రత్యక్ష నగదు బదిలీ స్కీమ్‌ల ద్వారా ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాని పరిస్థితి ఏర్పడింది. ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మౌలికమైన ఈ మార్పుల ఫలితంగా సకలజన సాధికారతలో ఇప్పుడిప్పుడే ముందడుగులు పడు తున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ కార్యక్రమాలకు జేజేలు పలుకుతూ వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు తీర్మానా లను ఆమోదించాయి. విప్లవాత్మకమైన ఈ సంస్కరణలకు విపక్షాలు వ్యతిరేక వైఖరి తీసుకోవడం వింతల్లోకెల్ల వింత. ఒక రకంగా ఆత్మహత్యా సదృశం. ఏ గొప్ప పథకమైనా... దాని ప్రస్థానంలో అక్కడక్కడా చిన్నచిన్న తప్పులు దొర్లవచ్చు. తప్పటడుగులు పడవచ్చు. అలాంటి వాటిని వెతికి పట్టుకొని, ప్రయాణాన్నే వ్యతిరేకించడం వెర్రితనమే అవుతుంది. ఇంగ్లిషు మీడియాన్ని వ్యతిరేకించి చివాట్లు తిన్నట్టే... ఈ వ్యతిరేక వైఖరితో కూడా విపక్షాలకు చీవాట్లు తప్పకపోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఈ గొప్ప సాధి కారతా యజ్ఞానికి సానుకూలంగా ఉన్నారు. తమ తలరాతలు మార్చే ఈ ప్రయత్నాలకు అండగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీలో ముగింపు ప్రసంగం చేశారు. ‘‘మన రాష్ట్రంలో ఒక యుద్ధం జరుగుతోంది. రెండు సిద్ధాంతాల మధ్య, భావాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయాలనీ, అండగా నిలవాలనీ మనం... ఆ పేదలకు, దిగువ మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయడానికి వీల్లేదని టీడీపీ, ఆ పార్టీకి తోడుగా దుష్టచతుష్టయం ఎలా వాదిస్తున్నాయో.. ఎంత నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తు న్నాయో చూడండి... ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర మీరే’’ అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. అర్జునుడి మరో పేరు విజయుడు. జగన్నాథుడు సారథిగా ఉండగా, అర్జునుడు ఓడిందెన్నడు? ఫలితం స్పష్టం. 2019 ఎన్నికల విజయాన్ని అదే స్థాయిలో యథాతథంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పునరావృతం చేయబోతున్నది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్... ప్లస్/ మైనస్ 1%. - వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కాషాయ బాహుబలి!
హిందూధర్మ పరిరక్షణ పేరుతో ఒక సాంస్కృతిక సంస్థగా పుట్టిన ఆరెస్సెస్ గాంధీజీ హత్యానంతరం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో తనకో రాజకీయ వేదిక అవసరమన్న భావనతో 1951లో ‘భారతీయ జనసంఘ్’ అనే పార్టీకి జన్మనిచ్చింది. సినిమాలో కర్ణుడి పెంపుడు తల్లి రాధ ఆలపించినట్టు ‘అజస్త్ర సహస్ర నిజప్రభలతో అజేయుడవు కావలెరా’ అని ఆరెస్సెస్ కూడా బిడ్డను ఆశీర్వదించే ఉంటుంది. పుట్టిన వెంటనే జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో జనసంఘ్ మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలవగలిగింది. జనసంఘ్ పేరుతో ఉండగా ఆ పార్టీ అత్యధికంగా 35 లోక్‌సభా సీట్లను 1967లో సంపాదించింది. తొమ్మిది శాతానికి పైగా ఓట్లను కూడా అప్పుడే అది రాబట్టగలిగింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఏర్పాటైన జనతా పార్టీలో సంస్థా కాంగ్రెస్, భారతీయ లోక్‌దళ్, కొందరు సోషలిస్టులు వగైరాలతో కలిసి విలీనమైన తర్వాత జనసంఘ్ పునాదులు విస్తరించాయి. జనతా ప్రభుత్వం హయాంలో ఆరెస్సెస్ శ్రేణులు అన్ని కీలక విభాగాల్లోకి వ్యాపించాయన్న అభిప్రాయం ఏర్పడింది. ఆరెస్సెస్ విస్తృతి జనతా పార్టీలోని మిగతా భాగస్వామ్య పక్షాలకు మింగుడు పడలేదు. జనతా పార్టీలో సభ్యులుగా ఉన్నవారు ఇంకో సంస్థలో (ఆరెస్సెస్) కూడా సభ్యులుగా ఉండకూడదన్న వాదాన్ని తీసుకొచ్చాయి. ఈ ద్వంద్వ సభ్యత్వ వివాదమే జనతా పార్టీ పతనానికి కారణమైంది. 1980లో ఇందిరాగాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పేరుతో పాత జనసంఘ్‌ను పునరుద్ధరించారు. కరుడుగట్టిన హిందూ మత పార్టీగా జనసంఘ్‌కు ఉన్న ముద్రకు భిన్నంగా కొంత ఉదారవాద ముఖోటాను పార్టీ తగిలించు కుంది. ఆ ముఖోటా పేరు – అటల్ బిహారీ వాజపేయి. జనతా ప్రయోగం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఆరెస్సెస్‌తో సంబంధం లేని ఇతరేతర రాజకీయ నేతలనేక మంది బీజేపీలో చేరిపోయారు. ఇందిరాగాంధీ హత్యానంతర సానుభూతి ప్రభంజనంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు మాత్రమే గెలవగలిగింది. అందులో ఒకటి తెలంగాణ నుంచి, మరొకటి గుజరాత్ నుంచి! ఇక అక్కడి నుంచి బీజేపీ విజయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. మూడు దశాబ్దాలు గడిచేసరికి కాంగ్రెస్ పార్టీని చిత్తుచేసి ఆధిపత్య స్థానాన్ని దక్కించు కోగలిగింది. ఈ విజయాలు యాదృచ్ఛికమైనవి మాత్రం కావు. ఒక అరడజన్ కారణాలు ఈ పరిణామానికి దోహదపడ్డాయి. 1. కాంగ్రెస్ పార్టీ పతనం, 2. నాన్–కాంగ్రెస్, నాన్–బీజేపీ పక్షాల వైఫల్యం. 3. ఆరెస్సెస్ వ్యూహాలు – కృషి, 4. మారుతున్న కాలానికి అనుగుణమైన ఎత్తుగడలు, 5. హిందూయిజంతో పాటు సబ్ కా వికాస్, ఐదు ట్రిలియన్ డాలర్ల అభివృద్ధిని ఎజెండాలో చేర్చడం, 6. నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణాలేమిటంటే ఏమని చెప్పగలం? ‘నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్, ధరచేత భార్గవుచేత, నరయంగ కర్ణుడీల్గె నార్గురి చేతన్’ అన్నట్టు.... కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేంత దాకా కాంగ్రెస్ ఒక ఉద్యమ పార్టీ. అది రాజకీయ అధికారాన్ని చేపట్టిన తర్వాత రాజకీయ పార్టీ తరహా సంస్థాగత స్వరూపాన్ని సంతరించుకోలేదు. రాజ్యాంగాన్ని పూర్తిగా అవగతం చేసుకొని, రాజ్యాంగం ద్వారా నిర్మితమైన వ్యవస్థలతో కలిసి పనిచేయవలసిన తీరును అలవర్చుకోలేదు. మంత్రులు, ముఖ్యమంత్రుల్లో కొందరు సామంత రాజులుగా మారి ఢిల్లీకి కప్పం చెల్లించే సంప్రదాయానికి తెరతీశారు. పార్టీ వ్యవస్థను పక్కనబెట్టి పైరవీకార్లకు పెద్దపీట వేశారు. స్వతంత్ర దేశంలో తాము భాగస్వాములం కాగలమని ఎదురుచూసిన బలహీనవర్గాల ఆకాంక్షలను, ఆశలను విస్మరించారు. రెండు బర్రెలు, నాలుగు గొర్రెలు, జానెడు ఇంటి జాగాకు మాత్రమే బడుగుల వికాసాన్ని పరిమితం చేశారు. ఆర్థిక వృద్ధికి చేపట్టిన చర్యలను అవినీతి తిమింగలం మింగేసింది. ఆధునిక భారత నిర్మాణానికి అడుగులు వేసినప్పటికీ, ప్రభుత్వరంగంలో భారీ పరిశ్రమలను నెలకొల్పినప్పటికీ, బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించినప్పటికీ వాటి ఫలితా లను అనుభవించే అవకాశం చిక్కని విశాల ప్రజానీకం అభ్యున్నతికి దూరంగా ఉండిపోయారు. ప్రధానంగా జనాభాలో సగభాగమైన ఓబీసీలకు కాంగ్రెస్ ప్రణాళికలో తగిన ప్రాతి నిధ్యం లభించలేదు. మరొకపక్క రాజ్యాంగ నిబద్ధతను, ప్రజాస్వామిక స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించలేదు. గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసే కుటిల నీతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీయే! నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఇందిరాగాంధీ చేపట్టిన మొదటి కార్యక్రమం కేరళలో నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయించడం. గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలను బ్లాక్మెయిల్ చేయడం, రాష్ట్రాల అధికారాల్లో తల దూర్చడం వంటి చర్యలన్నీ కాంగ్రెస్ హయాంలోనే పొడసూపాయి. రాజీవ్‌గాంధీ హయాం నుంచి పార్టీ నాయకత్వ స్థానాలు క్రమంగా పైరవీకార్ల పరమయ్యాయి. అధికారం కోల్పోయినప్పుడు ఈ పైరవీకార్ల పునాదులు పేక మేడల్లా కూలిపోయాయి. ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఉన్నా అందిపుచ్చుకోవడానికి లేచి నిలబడలేని అశక్తతలోకి కాంగ్రెస్ జారిపోయింది. దాని అశక్తత బీజేపీకి ‘శ్రీరామ’రక్ష. భావజాలపరంగా కాంగ్రెస్ మధ్యేవాద పార్టీగా ఉండేది. లౌకికత్వానికి కట్టుబడి ఉండేది. ఆ పార్టీకి వామహస్తం వైపు లెఫ్ట్ పార్టీలుంటే, దక్షిణ హస్తంవైపు బీజేపీ ఉండేది. ఎనభయ్యో దశకం తొలిభాగం వరకు ఈ రెండు శిబిరాలదీ దాదాపు సమాన బలం. భారతదేశంలో కులం ప్రాధాన్యాన్ని అర్థం చేసు కోవడంలో విఫలమైన కమ్యూనిస్టులు బలహీనవర్గాలను నాయకత్వ శ్రేణుల్లోకి ప్రమోట్ చేయలేక వారి విశ్వాసాన్ని కోల్పోయారు. అక్కడే బీజేపీ స్కోర్ చేసింది. తొలిరోజుల్లో బీజేపీకి బ్రాహ్మిణ్ – బనియా పార్టీగా ముద్ర ఉండేది. మందిర్ ఉద్యమం దాని పునాదిని కొంత విస్తృతం చేసింది. పదిశాతం బ్రాహ్మణ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ పీఠం దక్కగానే దానిపై ఓబీసీ వర్గానికి చెందిన కల్యాణ్‌సింగ్‌ను కూర్చోబెట్టింది. క్రమంగా ఓబీసీల్లో, గిరిజనుల్లో పలుకుబడిని విస్తరించుకుంటూ వెళ్లింది. 2019 ఎన్నికల్లో నూటికి 44 మంది ఓబీసీలు బీజేపీకే ఓటేశారని ఒక అంచనా వచ్చింది. మహాభారత యుద్ధంలో అర్జునుని సారథిగా శ్రీకృష్ణుడు పోషించిన పాత్రను బీజేపీ ఎన్నికల విజయాల్లో ఆరెస్సెస్ పోషిస్తున్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందిస్తూ, బీజేపీ ఎన్నికల పోరాటాల్లో ఆరెస్సెస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నదనే విషయం జగమెరిగిన సత్యం. అలక్ష్యానికి గురైన వర్గాల్లోని వ్యక్తులకు ఉన్నతాసనాలు వేయడం ద్వారా ఆయా వర్గాలను ఆకట్టు కోవాలనే ఎత్తుగడ ఆరెస్సెస్‌దే! ఎన్నికలు జరగబోయే కీలక రాష్ట్రాలకు ఆరు నెలల ముందుగానే స్వయంసేవకుల సేనలు తరలివెళ్తాయి. క్షేత్ర స్థాయిలో జెండాలు మోసే బీజేపీ కార్యకర్తలే మనకు కనిపిస్తారు. కానీ కనిపించకుండా ఇల్లిల్లూ తిరిగి ప్రజలను ప్రభావితం చేయడంలో స్వయంసేవకులదే కీలక పాత్ర. రామజన్మభూమి ఉద్యమం దగ్గర్నుంచి, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విడుదల చేయడం దాకా అనేకం – మధ్యతరగతి ప్రజలను తనవైపునకు తిప్పుకోవడం కోసం ఆరెస్సెస్ పన్నిన వ్యూహాలనే చెబుతారు. హిందూ సెంటిమెంట్లను క్యాష్ చేసుకుంటూ మధ్యతరగతి శ్రేణుల్లో చొచ్చుకుపోయిన బీజేపీని క్రమంగా ఓబీసీలు, గిరిజనుల్లోకి కూడా విస్తరింపజేసిన ఘనత ఆరెస్సెస్‌దే! ఈ వ్యూహాన్ని అమలుచేయడంలో సంఘ్‌కు దొరికిన వజ్రాయుధం నరేంద్ర మోదీ. ‘సంఘ్’ చెక్కిన బాహుబలి శిల్పం మోదీ. ఈ శిల్పం జీవం పోసుకుంటుందా? మరో పదేళ్లో ఇరవయ్యేళ్లో దేశ రాజకీయాల్లో బీజేపీ బాహుబలి పాత్ర పోషించగలదా? ఇప్పుడున్న బలాన్ని బేరీజు వేసుకున్నప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై పెద్దగా అనుమానాల్లేవు. నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన ప్రధానిగా మోదీ రికార్డులకెక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్ మాదిరిగా దీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగగలుగు తుందా అన్నది మాత్రం సందేహాస్పదమే. ఎంతమేరకు ఆ పార్టీ విశాల దృక్పథాన్ని అలవర్చుకోగలదన్న వాస్తవికతపైనే దాని దీర్ఘయాత్ర ఆధారపడి ఉంటుంది. బలహీనవర్గాల ప్రతినిధులను నాయకత్వ స్థానాల్లోకి ప్రమోట్ చేసే కార్యక్రమం అవిచ్ఛిన్నంగా సాగించవలసి ఉంటుంది. ప్రపంచ దేశాల్లో గౌరవనీయ స్థానం దక్కాలన్నా, ఈ దేశ యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలన్నా ఆర్థిక వృద్ధి లక్ష్యాలను అందుకోవలసి ఉంటుంది. ఆరెస్సెస్ లక్ష్యాల్లో ‘అఖండ భారత్’ కూడా ఒకటి. దక్షిణ సముద్రానికి ఉత్తరాన హిమాలయ శ్రేణులకు మధ్యనున్న భాగమంతా భారత ఖండమేనని మన పురాణాలు కూడా చెబుతున్నాయట! ఇటీవల ఎస్.వీ. శేషగిరిరావు రాసిన ‘భారతదేశ చరిత్ర – సంస్కృతి’ అనే పుస్తకంలో ఇందుకు ఉదాహరణలిచ్చారు. ఆ లెక్కన అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంకలు కూడా భారత ఖండంలో భాగమే. అవన్నీ ఇండియాలో కలిసిపోవడం ఇప్పుడు అసాధ్యం. కానీ, ఈ దేశాలతో స్నేహ సంబంధాలు మెరుగైతేనే అంతర్జాతీయంగా భారత్‌కు గౌరవం. బీజేపీ సర్కార్ ఈ సవాల్‌ను ఎదుర్కోగలదా! ‘సబ్కా సాథ్... సబ్కా వికాస్’ మాటల గారడీగా మారకుండా చూసుకోవాలి. కేంద్ర – రాష్ట్ర సంబంధాల విష యంలో కాంగ్రెస్ వ్యవహార శైలికీ, బీజేపీ వ్యవహార శైలికీ పెద్ద తేడా లేదు. వాస్తవానికి బీజేపీయే మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది. ఇవన్నీ ఒక ఎత్తు, భిన్న గళాల మీద అసహనం ఒక ఎత్తు. యావత్తు భారతదేశాన్ని ఒకే జాతిగా గుర్తించి గౌరవిస్తేనే బీజేపీ ప్రతిష్ఠ పెరుగుతుంది. అందులోని కులాలు, మతాలు, తెగలు, భాషలు, సంస్కృతులు, ఆరాధనా పద్ధతులు, విశ్వాసాలు సమాన గౌరవాన్ని, ఆదరణను పొందినప్పుడే ఈ దేశం బలపడుతుంది. బీజేపీ బలపడుతుంది. ఆ పార్టీ దక్షిణాది మిషన్‌లో ఇప్పుడు తెలంగాణ చేరింది. వాస్తవానికి ప్రజాదరణ రీత్యా చూస్తే తెలంగాణలో ఇప్పటికిప్పుడు బీజేపీది మూడో స్థానం. ఎకాఎకిన మొదటి స్థానానికి చేరుకోవాలంటే హైజంప్ ప్రాక్టీస్ చాలదు. పోల్‌వాల్ట్ చేయాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
టెన్ జన్‌పథ్‌లో గన్ స్మోక్!
ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీకి 66 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. అందులో 65 మంది కలిసి నూటా పదిహేనేళ్లపాటు ఆ పదవిలో ఉన్నారు. వారి సగటు పదవీకాలం సుమారు ఏడాదిన్నర! ఇందులో నౌరోజీ మొదలుకొని గాంధీ, బోస్, నెహ్రూ, ఇందిర వంటి ఉద్దండులున్నారు. ఒక్క సోనియా గాంధీ మాత్రమే ఆ పదవిలో ఇరవై రెండేళ్లపాటు ఉన్నారు. ఇంకా కొనసాగుతున్నారు. ఆమె పదవీకాలంలో పదేళ్లపాటు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ప్రధాని పదవిని చేపట్ట నప్పటికీ యూపీఏ కూటమి ఛైర్పర్సన్ హోదాలో అప్పుడామే సర్వం సహాధికార సామ్రాజ్ఞిలా చలామణీ అయ్యారు. ప్రపంచం లోని అత్యంత శక్తిమంతుల జాబితాలో ఆమె పేరును కూడా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. పేరుకు మన్మోహన్సింగ్ ప్రధాని. పరిపాలనకు సంబంధిం చిన తుపాకీ ఆయన భుజం మీదనే ఉండేది. ట్రిగ్గర్ మాత్రం సోనియాగాంధీ చేతిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అంతే! వివాదాస్పదమైన, కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు తుపాకీ మోతీలాల్ ఓరా భుజం మీదనో, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఆంథోనీల భుజాల మీదనో ఉండేది. ట్రిగ్గర్ మాత్రం అధినేత్రి చేతిలోనే! అప్పటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష బీజేపీ జనంలో విస్తృత ప్రచారం చేసింది. ఆ ప్రచారం ఆసరా తోనే అది అధికారంలోకి రాగలిగింది. అప్పటి పరిణామాల్లో ఒకటైన ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక ఆస్తుల బదలాయింపుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్నది. ఇందులో భాగంగా ఈ నెలలోనే వేర్వేరు తేదీలలో విచారణకు హాజరవ్వాలని సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోనియాగాంధీ కుటుంబ సభ్యులు ‘నేషనల్ హెరాల్డ్’ ఆస్తులను ఆక్రమించుకున్న విధానం అవినీతి పురాణాల్లోని ఒక అత్యంత కళాత్మకమైన కావ్యం. స్వాతంత్య్రోద్యమ కాలంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ చొరవతో 1938లో ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను స్థాపించారు. పత్రిక స్థాపన, నిర్వహణల కోసం 1937లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) అనే పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా ఐదు వేలమంది స్వాతంత్య్ర సమరయోధులు వాటాదారులుగా ఉన్నారు. ఇంగ్లిష్ పత్రిక నేషనల్ హెరాల్డ్తోపాటు ఒక హిందీ పత్రిక (నవజీవన్)నూ, ఉర్దూ (ఖౌమీ ఆవాజ్) పత్రికనూ ఏజెఎల్ ప్రారంభించింది. స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలాకాలం వరకూ ఈ పత్రికలు లాభాల్లోనే నడిచాయి. క్రమంగా ఆదరణ కోల్పోయి, 2008 నాటికి 90 కోట్ల రూపాయల అప్పు పోగుపడిందన్న నెపంతో మూసివేశారు. అప్పటికి ఈ సంస్థకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు ఐదువేల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. పత్రికల ప్రచురణ ఆగిపోయిన రెండేళ్లకు అదే కార్యాలయం అడ్రస్ (హెరాల్డ్ హౌస్)తో ఒక కొత్త కంపెనీ పుట్టుకొచ్చింది. దానిపేరు ‘యంగ్ ఇండియన్’. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ డైరెక్టర్లు. వారి వాటా 76 శాతం. మిగిలిన 24 శాతం కుటుంబ విధేయులైన మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ల పేరిట ఉన్నది. ఈ కంపెనీ ఏర్పడిన తర్వాత జరి గిన ముఖ్య విషయమేమిటంటే – ఏజెఎల్ సంస్థ తాను అప్పు పడిన 90 కోట్లను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సదరు మొత్తాన్ని వడ్డీ లేకుండా తీసుకోవడానికి ఒప్పందం కుదిరింది. అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాం«ధీ. కోశాధికారి మోతీలాల్ ఓరా. మరి ఈ 90 కోట్లను ఏజెఎల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబట్టుకునేదెలా? అందుకోసం ఆ రికవరీ హక్కును రూ.50 లక్షలకు ‘యంగ్ ఇండియన్’కు అమ్మివేసింది. ఈ 50 లక్షలను కూడా డాటెక్స్ అనే కంపెనీ దగ్గర యంగ్ ఇండియన్ ‘అప్పు’గా తీసుకొని కాంగ్రెస్‌కు చెల్లించింది. ఇక్కడితో కాంగ్రెస్ కథ ఖతం. 90 కోట్లకు 50 లక్షలతో సరి! ఇక ఏజెఎల్ కథ. 90 కోట్ల అప్పును తీర్చే పరిస్థితి లేదు కనుక ఏజెఎల్ షేర్లను ‘యంగ్ ఇండియన్’కు బదలాయించడానికి అంగీకారం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెఎల్ దగ్గర 90 కోట్ల రుణాన్ని వసూలు చేసుకునే కాంట్రాక్టు కోసం ‘యంగ్ ఇండియన్’ తరఫున దాని డైరెక్టర్లలో ఒకరైన మోతీలాల్ ఓరా ప్రతిపాదన పంపించారు. ఇందుకు అంగీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున దాని కోశాధికారి మోతీలాల్ ఓరా సంతకం చేశారు. ఏజెఎల్‌కు ఎమ్డీ కూడా మోతీలాల్ ఓరానే! కనుక ‘యంగ్ ఇండియన్’కు ఏజెఎల్ షేర్లను బదలాయించే ఒప్పందంపై ఏజెఎల్ తరఫున మోతీలాల్ ఓరా సంతకం చేశారు. కుటుంబ విధేయుడైన ఓరా త్రిపాత్రాభినయంతో మూడు సంతకాలు చేసి ఐదువేల కోట్ల విలువైన స్వాతంత్య్ర సమరయోధుల ఆస్తిని సోనియా కుటుంబం చేతిలో పెట్టారు. ఈ వ్యవహారమంతా 2011లో పూర్తయింది. ఇప్పుడు ఈ వ్యవహారంపైనే సోనియా కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు పంపించింది. కాకతాళీయమే కావచ్చు కానీ నోటీసులు అందుకున్న మర్నాడే సోనియా, ప్రియాంకలకు కరోనా కూడా వచ్చింది. కానీ, వారైతే నోటీసుల్లో పేర్కొన్న తేదీల ప్రకారమే ఈడీ ముందు హాజరు కావడానికి సిద్ధమని ప్రకటించారు. కానీ కరోనా భయంతో ఈడీ వాళ్లేమైనా వాయిదా వేసుకుంటారేమో చూడాలి. ఐదువేల కోట్ల విలువైన ఆస్తుల్ని కైంకర్యం చేసిన 2010–2011 కాలంలోనే ‘రాచకుటుంబం’ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిన మరో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది సరిగ్గా ద్విపాత్రాభినయం లాంటి ఉదంతం. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కంచుకోటలా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆపరేషన్ జరిగింది. ఎనిమిదేళ్లపాటు కేంద్రంలో, పదేళ్లపాటు రాష్ట్రంలో అధికార వియోగాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ను రెండుచోట్లా గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ కుటుంబం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం చూపెట్టిన ‘కృతజ్ఞత’కు మచ్చుతునక లాంటి ఆపరేషన్! ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత జనాదరణ పొందిన నాయకుడు వైఎస్సార్. ఆయన హఠాన్మరణంతో రాష్ట్ర ప్రజలు షాక్‌కు గురయ్యారు. వందలాది మంది గుండె పగిలి చనిపోయారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఈ పరిణా మాలు తీవ్రంగా కలచివేశాయి. వైఎస్సార్ ప్రమాదానికి గురైన నల్లకాలువ దగ్గర జరిగిన సంస్మరణ సభలో జగన్ ఉద్వేగానికి గురయ్యారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారందరూ తన ఆత్మబంధువులేనని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులం దరినీ వారి ఇళ్లవద్దకే వెళ్లి పరామర్శిస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అప్పటికే వైఎస్ ప్రజాదరణ పట్ల అసూయ నిండిన అధిష్ఠానం మెదళ్లలో కొందరు కాంగ్రెస్ పెద్దలు ఆజ్యం పోశారు. ఓదార్పు యాత్రను ఆపేయాలని జగన్ మోహన్‌రెడ్డిని అధిష్ఠానం ఆదేశించింది. ఆయన స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లి అధిష్ఠాన దేవతను అభ్యర్థించారు. ఇచ్చిన మాట తప్పడం పాడికాదని విన్నవించారు. అధిష్ఠానం మనసు కరగలేదు. ‘మా మాట వినకుంటే కష్టాలపాలవుతావ’ని కూడా హెచ్చరించింది. ఈ విషయాన్ని నాటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహా రాల ఇన్‌ఛార్జి గులామ్ నబీ ఆజాద్ స్వయంగా ఒక బహిరంగ సభలోనే తదనంతర కాలంలో వెల్లడించారు. తాము చెప్పినట్టు వింటే కేంద్రమంత్రిని చేస్తామనీ, కొంతకాలం తర్వాత ముఖ్య మంత్రిని కూడా చేస్తామనీ చెప్పినా ఆయన వినలేదనీ, తన మార్గాన్నే ఎంచుకున్నారనీ ఆజాద్ చెప్పారు. నిజమే, జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడాలనే బాటనే ఎంచు కున్నారు. ధిక్కారమున్ సైతునా... అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీవ్రంగానే స్పందించింది. 2010 నవంబర్‌లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఒక తెల్ల కాగితంపై లేఖ రాశారు. తేదీ కూడా వేయలేదు. ఒక ఆంగ్లపత్రిక కథనాన్ని మాత్రమే జత చేశారు. కోర్టు ఆ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా పరిగ ణించింది. ప్రతివాదులుగా ఉన్న జగన్మోహన్రెడ్డి తదితరు లకు నోటీసులు జారీచేసింది. ఈ లేఖ రాసినందుకు ప్రతి ఫలంగా శంకర్రావుకు రెండు వారాలు తిరిగేసరికే మంత్రిపదవి లభించింది. మంత్రి హోదాలో మరొకసారి ఆయన హైకోర్టుకు లేఖ రాశారు. 333 పేజీల డాక్యుమెంటును దానికి జతచేశారు. సోనియాగాంధీ ఆదేశంతోనే ఈ పిటీషన్ వేశానని మీడియా ముందే ఆయన ప్రకటించారు. ఆ తర్వాత తెలుగుదేశం నాయ కులు ఎర్రంనాయుడు, అశోక గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి మరో పిటీషన్ వేశారు. ఇది శంకర్రావు వేసిన పిటీషన్‌కు దాదాపు కార్బన్ కాపీ! అంటే రెండూ ఒకరే తయారు చేశారు. ఈ కోర్టు వ్యవహారాన్ని రెండు పార్టీలూ కలిసి జాయింట్‌గా నడిపించాయి. వీరి పిటిషన్లపై ప్రాథమిక విచారణ జరిపి నివే దిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ కక్రూ సీబీఐని ఆదేశించారు. రెండు వారాల్లోనే సీబీఐ సీల్డ్కవర్లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను వెల్లడి చేయకుండానే దర్యాప్తు చేపట్టాలని సీబీఐని జస్టిస్ కక్రూ ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత ఆరు నెలలపాటు సీబీఐ – ఎల్లో మీడియాలు సంయుక్తంగా రోజుకో కథనాన్ని చిలువలు పలువలు చేర్చి ప్రచారంలో పెట్టాయి. 2012 మే 27న జగన్ మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. పదవీ విరమణ చేసిన జస్టిస్ కక్రూను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి వరించింది. ఇంతకూ వారు జగన్మోహన్రెడ్డి మీద పెట్టిన కేసేమిటి? క్విడ్ ప్రోకో! అంటే వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రయోజనాలు పొందిన పారిశ్రామికవేత్తలు జగన్ మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అభియోగం. వాస్తవానికి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో లేరు. రాజకీయాల్లోనూ లేరు. అప్పటికే బెంగుళూరులో ఆయనొక విజయవంతమైన యువ వ్యాపారవేత్త. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సోనియాగాంధీ కుమారుడు రాహుల్‌గాంధీ హోదా లేకుండానే ప్రభుత్వంలో చక్రం తిప్పినట్టు వైఎస్ జగన్ తిప్పలేదు. మొన్నటి చంద్రబాబు ప్రభుత్వంలోకి దొడ్డిదారిన ప్రవేశించిన లోకేశ్ బాబు ప్రభుత్వంపై పెత్తనం చేసినట్టు వైఎస్ జగన్ చేయలేదు. అసలాయన ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే ఉండలేదు. రాష్ట్ర రాజధానిలోనే లేరు. ఆయన ప్రారంభించిన మీడియా, సిమెంటు కంపెనీల్లో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు. వారు కేవలం వైఎస్ జగన్ కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టలేదు. ఇతర కంపెనీల్లోనూ పెట్టారు. వైఎస్సార్ ప్రభుత్వంలో రాయితీలు పొందినవారందరూ పెట్ట లేదు. వందలాది మంది రాయితీలు పొందినవారున్నారు. వారిలో ఐదారుగురు మాత్రమే వైఎస్ జగన్ కంపెనీల్లో వాటాదారులు. అట్లా్లగే ఏ రాయితీలూ పొందనివారు కూడా ఉన్నారు. బంజారాహిల్స్‌లో ఆంక్షలను సడలించి ఫైవ్‌స్టార్ హోటల్‌కు అనుమతులిచ్చినందుకు గాను పెన్నా ప్రతాపరెడ్డి పెట్టుబడులు పెట్టారని క్విడ్ ప్రోకో అభియోగం. అదే ప్రాంతంలో పార్క్ హయత్ సహా మరో ఐదు ఫైవ్‌స్టార్ హోటల్స్‌కు అప్పటి ప్రభుత్వం అనుమతులిచ్చింది. వారెవరికీ వైఎస్ జగన్ కంపెనీల్లో వాటాలు లేవు. కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్‌కు నీటిని కేటాయించినందుకు దాని అధిపతి శ్రీనివాసన్‌పై క్విడ్ ప్రోకో పెట్టారు. వైఎస్ హయాంలో 16 సిమెంట్ పరిశ్రమలకు అటువంటి కేటాయింపులు జరి గాయి. వారెవరూ ఈ ‘క్వ్రిడ్ ప్రోకో’లో లేరు. జడ్చర్ల సమీపం లోని ఫార్మా ఎస్ఈజెడ్లో భూమి కేటాయించారంటూ హెటిరో, అరబిందోలపై క్విడ్ ప్రోకో. అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే వారికి నచ్చ చెప్పి భూములు కేటాయించింది. వారు సొంత నిధులతో అక్కడ అభివృద్ధి చేసిన తర్వాత పలువురు అక్కడ పరిశ్రమలు స్థాపించారు. వాళ్లెవరూ వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టలేదు. గృహ నిర్మాణానికి శ్యాంప్రసాద్‌రెడ్డికి భూముల కేటాయింపుపై కూడా క్విడ్ ప్రోకో. ఈ రకంగా భూములు పొందినవారిలో అప్పటి టీడీపీ నేత నామా నాగేశ్వర రావు సహా అనేకమంది ఉన్నారు. వారెవరూ జగన్ కంపె నీల్లో వాటాలు కొనలేదు. విజయవంతమైన వ్యాపారవేత్తగా వైఎస్ జగన్ తన కొత్త పరిశ్రమలను కూడా పక్కా బిజినెస్ మోడల్స్‌గా రూపుదిద్దారు. తెలుగు మీడియా ప్రపంచం మొత్తం ‘ఒకవైపే చూడు, రెండోవైపు చూడకు’ అన్నట్టుగా నడిచే రోజులవి. ఈ అసత్య వార్తలకు మరోవైపున ఏముందో చూడాలన్న ఆసక్తి జనంలో ఏర్పడిన సమయం. నాణేనికి మరోవైపు అనే స్ఫూర్తితో వచ్చిన ‘సాక్షి’ సూపర్ హిట్టయ్యింది. అప్పటి నంబర్ వన్ పత్రిక కంటే ఎక్కువ సర్క్యులేషన్‌తో ప్రారంభమయింది. జగన్ మోహన్‌రెడ్డి బిజినెస్ ఆలోచన తప్పుకాదని నిరూపించింది. అదే వరసలో భారతి సిమెంట్స్ పరిశ్రమ కూడా ఘన విజయం సాధించింది. వ్యాపారవేత్తలు లాభాల కోసమే ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. ఎక్కడ లాభాలొస్తాయో అంచనా వేసే శక్తి ఆ వ్యాపారవేత్తలకుంటుంది. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారెవరూ కోర్టుకెళ్లలేదు. క్విడ్ ప్రోకో ఫిర్యాదు చేయలేదు. అయినా ఇంత గ్రంథం నడిచింది. స్వాతంత్య్ర సమరయోధుల సొమ్మును కైంకర్యం చేస్తూ ఢిల్లీలో అవినీతికి పాల్పడుతున్న కాలంలోనే ఇక్కడ లేని అవినీతిని శూన్యంలోంచి సృష్టించి, బ్రహ్మరాక్షసిగా చిత్రించిన గారడీ ప్రదర్శన చేయడం వింతల్లోకెల్ల వింత. ఈ వింతకు తానే ఇంధనమై మండించినవారు– చంద్రబాబునాయుడు, ఆయన యెల్లో ముఠా. వాస్తవానికి చంద్రబాబునాయుడి మీద వచ్చి నన్ని ఆరోపణలు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి పైనా రాలేదు. ఇన్వెస్టిగేటివ్ వెబ్సైట్ ‘తెహల్కా డాట్‌కామ్’ 2001లోనే చంద్రబాబంతటి అవినీతి రాజకీయవేత్త ఎవరూ లేరని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయవేత్త బాబేనని ‘తెహల్కా’ ప్రకటించింది. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో వందలాది ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 300 ఎకరాలు, ఒడిషాలో వంద ఎకరాలు, బెంగుళూరు సమీ పంలో 45 ఎకరాలున్నాయని 2001లోనే ‘తెహల్కా’ చెప్పింది. చంద్రబాబు మీద ఉన్న ఆరోపణలకు రెండు వేల పైచిలుకు పేజీల డాక్యుమెంట్లను సాక్ష్యంగా జతచేస్తూ 2011లోనే వైఎస్ విజయమ్మ 110 పేజీల పిటీషన్‌ను హైకోర్టులో వేశారు. ఏలేరు నుంచి ఎంఐజీ కుంభకోణం దాకా డజన్లకొద్దీ స్కామ్‌లకు ఆధారాలను ఆమె సమర్పించారు. విచారణ ఎందుకు జరగ లేదన్నది వేరే విషయం. ఆయన తొమ్మిదేళ్ల పాలన ఒక ఎత్తయితే దానికి వందరెట్ల ఎత్తు చివరి ఐదేళ్ల పాలన. ఈ కాలంలో దేశంలోనే అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. రాజధాని భూసమీకరణ పేరిట లక్ష కోట్ల దందాకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. లింగమనేని గ్రూప్, రామకృష్ణ హౌసింగ్లకు చెందిన వెయ్యి ఎకరాలను సమీకరణ నుంచి తప్పించి లబ్ధి పొందారనేందుకు ఆధారాలు వెల్లడయ్యాయి. స్విస్ ఛాలెంజ్ పేరుతో భారీ కుంభకోణానికి తెరతీశారు. హుద్‌హుద్ తుపాన్‌ను కంట్రోల్ చేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా విశాఖ రోడ్లపై బస్సులో కూర్చు న్నారు. అదే సమయంలో తుపానులో గల్లంతయ్యాయని లక్ష ఎకరాల భూరికార్డులను ట్యాంపర్ చేశారు. విలువ ఎన్ని వేల కోట్లో అంచనా వేయలేము. బాలకృష్ణ చిన్నల్లుడి కుటుంబం కబ్జా చేసిన వెయ్యి కోట్ల భూమిని రాజముద్ర వేసి కట్నంగా సమర్పించారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్‌గా మార్చు కున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రే వాపోయారు. ఈ ఒక్క ప్రాజెక్టులోనే 20 వేల కోట్లు దండుకున్నారని వార్తలొచ్చాయి. సదావర్తి సత్రం భూముల్లో వెయ్యి కోట్లకు కన్నం వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమవుతుంది. రెండు అవినీతి తిమింగలాలు కలిసికట్టుగా నడిపిన కథ ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్నే మార్చేసింది. దొంగే... ‘దొంగా దొంగా’ అని అరిచాడన్న సామెతకు ఇంతకంటే మంచి ఉదాహ రణ ఉండదు. తన అవినీతిపై విచారణ గానీ, దర్యాప్తు గానీ జరగకుండా చూసుకోవడంలోనే చంద్రబాబు తెలివితేటలన్నీ ఉన్నాయి. విచారణ జరగకుండానే తాను నిప్పునని చెప్పు కోవడం ఆయన ప్రత్యేకత. అగ్నిపరీక్షకు సిద్ధపడితే కాలిపోతా నని ఆయనకు పక్కాగా తెలుసు. అందుకే విచారణకు సిద్ధ పడరు. కానీ ఎల్లకాలం తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు. సోనియాగాంధీ అధికారిక నివాసమైన టెన్ జన్‌పథ్ అందుకు సాక్ష్యం. అక్కడ ట్రిగ్గర్ నొక్కిన ఫలితంగా తుపాకీ గొట్టాల నుంచి వెలువడిన గంధక ధూమం ఇంకా గాలిలో ఆవరించి ఉన్నది. ఆ పొగలు ఇంకెన్ని కథలు చెబుతాయో! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మెదళ్లలోకి బుల్డోజర్లు!
భారత రాజకీయాల్లో ఉత్తరాదివారి ఆధిపత్యం ఉంటే ఉండవచ్చు గాక! కానీ, చాలా విషయాల్లో దక్షిణాది నాయకులతో పోలిస్తే ఔత్తరాహులు దిగదుడుపే. ఈమధ్య ఉత్తరాది పాలక నాయకులు కక్షలు తీర్చుకోవడానికి ఒక కొత్త ఆయుధాన్ని కనిపెట్టారు. దాని పేరు బుల్డోజర్. మార్కెట్లో రకరకాల బ్రాండ్ల పేరుతో చలామణీలో ఉన్న బుల్డోజర్లకు సరికొత్త ఉపయోగితా విలువను జోడించిన వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ క్రెడిట్ కొట్టేశారు. ఇప్పుడు లక్నో నుంచి భోపాల్ మీదుగా సదరు బుల్డోజర్ ఢిల్లీకి చేరుకున్నది. కక్షలు తీర్చుకోవడానికి ఈ బుల్డోజర్ అనేది చాలా మొరటైన ఆయుధం. ‘నేను కక్ష తీర్చుకుంటున్నాను చూడండహో’ అని చాటింపు వేస్తున్నట్టుగా రణగొణ ధ్వనులతో దాని ఊచకోత కొనసాగుతుంది. ఊరు ఊరంతా అక్కడ గుమికూడుతుంది. గళ్ల లుంగీ, గుబురు మీసం, బుగ్గన పులిపిరి, చేతిలో చాకుతో కనిపించే డ్రామా విలన్ లాంటి కర్కశమైన ఆయుధాన్ని ఒక సాధువు కనిపెట్టడమే ఆశ్చర్యం గొలిపే విషయం. ఢిల్లీలో ఆ భయంకర బుల్డోజర్ విలన్‌ను ఒక డెబ్బయ్ ఐదేళ్ల వృద్ధ కమ్యూనిస్టు మహిళ బృందా కారత్ ఎదిరించి నిలబడిన దృశ్యం దేశవ్యాప్తంగా భావోద్వేగాలను తట్టిలేపింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమాల్లోని క్లైమాక్స్ సీన్ మాదిరిగా లక్షలాది గుండెల్లో ముద్రితమైపోయింది. పరమ కర్కోటకుడైన విలన్ ఊరి మీద పడి చిత్రహింసలు పెడుతుంటాడు. హీరో వాడిని ఎదిరిస్తాడు. ఇంతలో వర్షం పడుతుంది. గుమిగూడిన జనంలోంచి ఓ పిల్లాడు ‘అన్నా! చంపేయ్ వాణ్ణి’ అని గట్టిగా అరుస్తాడు. జనమంతా ‘చంపేయన్నా... చంపేయన్నా’ అని కోరస్ అందుకుంటారు. ఆ ఉత్తేజంలో హీరో నిజంగానే చంపేస్తాడు వాణ్ణి. ఇది హీరో గొప్పతనం కాదు. విలన్ గొప్పతనమే! మన బుల్డోజర్ ఆయుధానికి కూడా అటువంటి భస్మాసుర శక్తి ఉన్నట్టు కనిపిస్తున్నది. దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లోని ఎల్లో కూటమి ఆయుధాల ముందు, ఉత్తరాది బుల్డోజర్లు ఎందుకూ కొరగావు. కలష్నికోవ్ తుపాకుల ముందు అవి ఈటెలు, బల్లేల వంటివి. రాష్ట్ర రాజకీయాల్లో ఇరవై ఏడేళ్ల కింద పురుడుపోసుకున్న ఎల్లో కూటమి దినదిన ప్రవర్ధమానమై, షోడశ కౌటిల్య కళలు నేర్చిన ‘చంద్ర’బింబం మాదిరిగా వెలిగిపోతున్నది. ‘ Necessity is the mother of invention అంటారు. యూదులంతా కలిసి ఇజ్రాయెల్ పేరుతో ఒక చిన్న దేశంగా ఏర్పడ్డప్పుడు చుట్టూ ఉన్న అరబ్బు దేశాలను ఎదిరించి నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని కొత్త కొత్త ఆయుధాలను, నిఘా వ్యవస్థలను వారు కనిపెట్టవలసి వచ్చింది. మన ఎల్లో కూటమి సోదర సోదరీమణులకు కూడా యూదులంతటి చతురతను ప్రదర్శించవలసి వచ్చింది. ఆ కూటమి పుట్టిన దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగిన మాస్ లీడర్లను ఎదుర్కొని నిలబడవలసిన ఆగత్సం ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటున్న కేసీఆర్‌ను మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారిలో ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్మోహన్రెడ్డి బలమైన ప్రజానాయకులు. ఈ ముగ్గురికీ కామన్ విలన్‌గా నిలబడవలసిన చారిత్రక అవసరం ఎల్లో కూటమికి కలిగింది. వెన్నుపోట్లు, గోబెల్స్ ప్రచారాలు, విషపూరిత కుట్రలు, కోట్లు దండుకొని ఓట్లు కొనుగోలు చేయడం, రాజ్యాంగ వ్యవస్థలను చెరపట్టడం, ఎమ్మెల్యేలను కొనేయడం వగైరా షోడశ కళలు ఎల్లో కూటమి ‘చంద్ర’బింబ కాంతులుగా మారాయి. తప్పుడు ప్రచారానికి గోబెల్స్ పేరు స్థిరపడిపోయింది కాబట్టి ఆ పేరు వాడుతున్నాము కానీ, మన ‘బాబెల్స్’ ప్రచారం ఎదుట గోబెల్స్ ప్రచారం కొనగోటితో సమానం. ఇరవై ఏడేళ్లుగా ఎల్లో కూటమి ప్రదర్శిస్తున్న గారడీ విద్యలన్నీ ప్రజలకు తెలిసినవే. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని యమర్జెంట్‌గా కూల్చివేయవలసిన అవసరం ఎల్లో కూటమికి ఏర్పడినట్టున్నది. ఇప్పుడా కూటమి వేలాది బుల్డోజర్లను బయటకు వదిలింది. రోడ్ల మీదకు కాదు. జనం మెదళ్లలోకి! కంటికి కనిపించని ఈ బుల్డోజర్లు ఎకాయెకిన ప్రజల మెదళ్లలోకి దూసుకొని పోవాలి. అక్కడ మొలకెత్తే ఆలోచనల్ని తొక్కేయాలి. ఇంగితాన్ని తార్కిక శక్తిని కూల్చేయాలి. మెదడు పనిచేయవద్దు. తాము పంపించే డేటా స్టోరేజిలోంచే జ్ఞానాన్ని గ్రహించాలి. బుల్డోజర్లు వాటి పనిని మొదలుపెట్టాయి. డేటా స్టోరేజిలోకి ప్రతిరోజు కొత్త కొత్త కథలు చేరుతున్నాయి. తాజాగా ‘ఆ విద్యుత్ ఆదానిదే’ అనే ఒక కథనాన్ని వదిలారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని చేసుకున్నది. రైతులకు 9 గంటల విద్యుత్‌ను సమకూర్చే ప్రయత్నాల్లో భాగంగా 7 వేల మెగావాట్లను ‘సెకీ’ నుంచి కొనుగోలు చేయడానికి ఈ ఒప్పందం జరిగింది. ‘ఎ’ అనేవాడు తన అవసరం కోసం స్టేట్ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాడనుకుందాము. ఆ బ్యాంకులో ‘ఎ’ ఒక్కడే లోన్ తీసుకోడు. ‘బీ, సీ, డీ’ వగైరాలు చాలామంది తీసుకుంటారు. అట్లాగే ‘డబ్లు్య, ఎక్స్, వై, జడ్’ లాంటి వేలాదిమందికి ఆ బ్యాంకులో డిపాజిట్లు ఉంటాయి. ‘ఎక్స్’ అనేవాడికి బ్యాంకులో డిపాజిట్ ఉంది కనుక, ‘ఎ’ అనేవాడు లోన్ తీసుకున్నాడు కనుక ‘ఎ’ తీసుకున్న లోన్ ‘ఎక్స్’ దగ్గరే అనే వాదనను ఏమనాలి? ‘ఆ విద్యుత్ ఆదానిదే’ అనే వాదన కూడా అటువంటిదే! ‘సెకీ’ అనేది ‘ట్రిపుల్ ఎ’ రేటింగ్ ఉన్న ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ ఆదాని లాంటి అనేకమంది దగ్గర కొనుగోలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆ సంస్థ దగ్గర కొనుగోలు చేసింది. వినేవాళ్లను వెర్రవాళ్ల కింద జమకట్టి వినిపించే కథ కాదా ఇది? శుక్రవారం నాడు ఒంగోలులో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద నిధులు జమచేసే కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి ఆ సభకు హాజరయ్యారు. అంతకు ఒకరోజు ముందు ఎల్లో మీడియా ఒక పిట్టకథతో హడావిడి చేసింది. ఆ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఆదిత్య బిర్లా గ్రూప్ వారి ఒక భారీ పరిశ్రమ ప్రారంభం. ఆ కార్యక్రమానికి ప్రచారం రాకుండా ఈ పిట్టకథనే ఎల్లో మీడియా ఎక్కువ ఫోకస్ చేసింది. ఆ పిట్టకథ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకుడైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరుడైన వేముల శ్రీరాములు కుటుంబ సభ్యులతో కలిసి ఇరవయ్యో తేదీ రాత్రి తిరుపతికి బయల్దేరారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా శాంక్షన్ అయిన కారును అరువు తీసుకొని, ప్రైవేట్ డ్రైవర్‌ను పెట్టుకొని, ఆయన ప్రయాణమయ్యారు. ఒంగోలు వచ్చేసరికి వారికి టిఫిన్ చేయాలనిపించింది. నేషనల్ హైవే మీద ధాబాలున్నప్పటికీ వారు నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్లి ఒంగోలు టౌన్లోనే టిఫిన్ చేయాలని భావించారు. టౌన్లో పార్క్ చేయగానే రవాణా శాఖ హోంగార్డు తిరుపాల్‌రెడ్డి కాగితాలు చూపించమని డ్రైవర్‌ను అడిగాడు. కారు ఫిట్నెస్ గడువు తీరినట్టు గమనించాడు. ఈ విషయాన్ని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అడుసుమిల్లి సంధ్యతో చెప్పారు. ఆమె కారును సీజ్ చేయాలని ఆదేశించారు. కానీ డ్రైవర్‌తో మాత్రం సీఎం కాన్వాయ్ కోసం సీజ్ చేస్తున్నామని చెప్పారు. తిరుపతి యాత్రికుల లగేజీని వాళ్లకిచ్చేశారు. ఆ లగేజీతో వారు బస్టాండ్‌కు వెళ్తున్న దృశ్యాలనూ, ఆటో ఎక్కిన దృశ్యాలనూ ఆ రాత్రిపూట అక్కడ సిద్ధంగా ఉన్న ఎల్లో మీడియా కెమెరాలు షూట్ చేశాయి. ఈ కథలో ఉన్న కంతలను విజ్ఞులెవరైనా గమనించగలుగుతారు. సాధారణంగా ముఖ్యమంత్రులు గానీ, ఆ స్థాయి వీఐపీలు గానీ పర్యటనలో ఉన్నప్పుడు భద్రతా కారణాలతో కొన్ని ట్రాఫిక్ నియంత్రణలు అమలులోకి తెస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ నిబంధనలుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోనైనా, మరే రాష్ట్రంలోనైనా ఉంటాయి. ఈ నియంత్రణలను భూతద్దంలో చూపెట్టి రాద్ధాంతం సృష్టించిన సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. అధికారం కోల్పోయినందుకు తెలుగుదేశం – ఎల్లో కూటమిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్‌లో ఉంది. అందుకు కారకుడైన జగన్మోహన్రెడ్డిపై పీకల దాకా కోపంతో ఆ శ్రేణులు ఊగిపోతున్నాయి. మొన్ననే ఆ పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తరఫున వందమందితో ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉన్నా మని హెచ్చరించారు. ఒకపక్క ఆత్మాహుతి దళాల ఏర్పాటు, మరోపక్క ముఖ్యమంత్రి భద్రతపై విమర్శలతో కూడిన క్యాంపె యిన్... ఇవన్నీ అనుమానాలకూ, ఆందోళనకూ తావివ్వడం లేదా? పోలీసు శాఖ వీటిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదా? విజయవాడ ఆస్పత్రిలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఒక అభాగ్య బాలిక అత్యాచారానికి గురైంది. ప్రభుత్వం వేగంగా స్పందించి, ఆ కుటుంబానికి అండగా నిలబడింది. ప్రతిపక్షం ఈ ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. తప్పేమీ లేదు. ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ఉండదు. కానీ ఒక సైన్యం దండయాత్రగా వెళ్లినట్టు మందకు మంద ఆస్పత్రిలో దూరడమేమిటి? మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై దాడికి దిగడమేమిటి? ఈ సైన్యం సమక్షంలో సీనియర్ రాజకీయ వేత్తయిన చంద్రబాబు రెచ్చిపోయారు. ‘ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకైనా రక్షణ ఉందా’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే బాధ్యత లేకుండా దుర్మార్గులను ఆడబిడ్డల మీదకు పంపించారు. ముఖ్యమంత్రికి పాలించే అర్హత ఉందా? శీలం విలువ తెలుసా? అంటూ చెలరేగిపోయారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉపదేశించిన సుభాషితాలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘మనుషులకు భయం ఉండాలి. ఒక్కొక్కరికీ ఒక్కో పోలీసును పెట్టలేము. ప్రజలకు క్రమశిక్షణ, చట్టనిబద్ధత ఉండాల’’ని ప్రసంగించి, మీ చావు మీరు చావండని చేతులు దులుపుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా అచ్చం అపరిచితుడులాగా మాట్లాడటం ఎలా సాధ్యమవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ రాజకీయవేత్త వ్యక్తిత్వానికి ఇదొక ఉదాహరణ. సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని సృష్టిస్తున్నారనీ, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారనీ, శ్రీలంక పరిస్థితి ఏర్పడబో తున్నదనీ రాయని రాతా లేదు, కూయని కూతా లేదు. స్వతంత్ర దేశమైన శ్రీలంకకూ, దేశంలో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కూ సాపత్యమేమిటో? విదేశీమారకం కరిగిపోయి చెల్లింపులకు స్థోమత లేక దిగుమతులు ఆగిపోయి, ధరలు పెరిగాయి. జీవనాధారమైన టూరిజాన్ని కోవిడ్ దెబ్బకొట్టింది. తొందరపాటు వ్యవసాయ విధానాలతో దిగుబడులు మూడో వంతుకు పడిపోయాయి. ఇవన్నీ కలిసి శ్రీలంకను సంక్షోభంలోకి నెట్టివేశాయి. ఇందులో ఏదైనా అంశం ఆంధ్రప్రదేశ్‌కు నప్పుతుందా? పైగా ఎల్లోకూటమి పాలిట స్వర్ణయుగం రోజుల్లో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోవిడ్ లాంటి ఇడుములు లేకుండా ఆదాయం నాలుగు పాదాల మీద రేసుగుర్రంలా పరుగెత్తుతున్న సమయాన జీఎస్డీపీలో అప్పుల స్థాయి 35 శాతం. ఇప్పుడు కాలాన్నీ, జీవనయానాన్నీ కోవిడ్ కాటేసినప్పటికీ, ఆదాయాలు పడిపోయి పెట్టవలసిన ఖర్చులు పెరిగినప్పటికీ జీఎస్డీపీలో 32.5 శాతానికే అప్పుల్ని పరిమితం చేయగలిగారు. ఆర్థిక నియంత్రణలో ఎవరు మెరుగు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమంపై ఖర్చు పెడుతున్న మాట వాస్తవం. గతం కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మాట కూడా నిక్కమే! అప్పుల పేరుతో, సంక్షోభాల సాకుతో పేదలను ఆదుకునే కార్యక్రమాలను ఆపేయమంటారా అని స్వయంగా ముఖ్యమంత్రే ఎదురుదాడి చేయడంతో ఎల్లో కూటమి బెంబేలెత్తింది. సర్దుబాటు ప్యూహాన్ని తయారు చేస్తున్నది. అసలు సంక్షేమం మీద జగన్మోహన్రెడ్డికి పేటెంటేమీ లేదనీ, ఆ కార్యక్రమాలన్నీ వేదాల్లోనే ఉన్నాయనీ కొత్త పాట పాడేందుకు సన్నాయిమేళాన్ని సిద్ధం చేస్తున్నది. సంక్షేమ కార్యక్రమాలకు బద్ధ విరోధినని స్వయంగా ప్రకటించుకున్న చంద్రబాబు హయాంలోని సంక్షేమంపై కొన్ని ధారావాహికలను ప్రచారం చేస్తారట! ఎల్లో కూటమికి అర్థం కాని విషయం, ఆ మాటకొస్తే తటస్థులకూ, కొందరు మేధావులకు కూడా పూర్తిగా అవగాహన కాని విషయం ఒకటున్నది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కేవలం సంక్షేమం కాదు. సంక్షేమం ఒక భాగం మాత్రమే! సంక్షేమాన్నీ, అభివృద్ధినీ మిళితం చేసిన మానవీయ అభివృద్ధి మోడల్! దాన్నే కొందరు ‘సమ్మిళిత అభివృద్ధి’ అంటున్నారు. కొందరు ‘సమగ్ర అభివృద్ధి’ అంటు న్నారు. అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమనుకునేవారికి ఈ కోణం అర్థం కాదు. సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని జాతులు, కులాలు, ప్రాంతాల ప్రజలందరూ సాధికారత సాధించడానికి అవసరమైన కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించింది. ప్రజలందరూ సాధికార శక్తులుగా రూపొందిన నాడు ఆ సమాజం అభివృద్ధి క్రమంలో సహజం గానే అగ్రస్థానంలో ఉంటుంది. ఇప్పుడు అమలు చేస్తున్న సాధికారతా యజ్ఞంలో సంక్షేమం ఒక భాగం. రైతులూ, డ్వాక్రా మహిళలూ, నడివయసు మహిళలూ... ఇలా నిర్లక్ష్యానికి గురైన వర్గాలన్నీ ఆయా సమూహాల వారీగా సాధికారత సాధించడా నికీ, ఉమ్మడిగా అన్ని వర్గాల సాధికారతకు ఉపకరించే విధంగా విద్య, వైద్య మోడళ్లను ఈ ప్రభుత్వం డిజైన్ చేసింది. చిట్టచివరి ఇంటి గడప దాకా పరిపాలనను వికేంద్రీకరించడం కూడా సాధికారతలో భాగమే. ఈ మొత్తం సాధికారతా విశ్వరూపాన్ని వదిలేసి, సింపుల్‌గా ‘సంక్షేమం’ అనే ఒక్క మాటతోనే ఈ ప్రభుత్వాన్ని బ్రాండింగ్ చేయడం మహా పర్వతాన్ని మరు గుజ్జుగా చూపడమే అవుతుంది. వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com -
దీపస్తంభాల వెలుగులో...
చీకటి తెరలు కరిగిపోయే వేళ, వెలుగు రేకలు ప్రసారమయ్యే క్రమంలో దృగ్గోచరాలపై ఒక స్పష్టత వస్తుంది. లోకం మీద, దాని నడవడి మీద అవగాహన కుదురుకుంటుంది. భారత రిపబ్లిక్ ‘అనే నేను’ పేరుతో ప్రజాపాలన ప్రారంభమై డెబ్బయ్ రెండేళ్లు గడిచింది. ఈ కాలంలో అధికారం చెలాయించిన నాయకుల చిత్తశుద్ధిలో తరతమ భేదాలున్నాయి. అయినప్పటికీ భారత రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం ప్రభావం ఫలితంగా కొందరు పాలకులు నిండు మనసుతో, మరికొందరు అర్ధమనస్కంగా సామాజిక పరివర్తన క్రమానికి లంగరెత్తక తప్పలేదు. ఫలితంగా ‘నిమ్న’ జాతి పొరల్ని చీల్చుకుంటూ సామాజిక నిచ్చెనమెట్లను ఒక్కొక్కటే ఎక్కుకుంటూ కొందరు అధోజగత్ సహోదరులు ‘సోషల్ డెమోక్రసీ’ అనే అంతస్థుకు చేరుకోగలిగారు. చదువు అనే చేదోడు లభించిన కారణంగా వారికీ అధిరోహణ సాధ్యమైంది. ఇరుగుపొరుగు పరిసరాలు వారికిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిచ్చెన కింది మెట్టు మీద నిలబడి ఉన్నప్పుడు విన్న కాకమ్మ కథల డొల్లతనం ఇప్పుడు వెల్లడవుతున్నది. అద్భుతాలుగా వినిపించిన స్వాములోర్ల ప్రతిమల కంటే, సర్దార్ల విగ్రహాల కంటే సమున్నతమైన శిఖర సమానమైన మూర్తిని మనోనేత్రంతో వాళ్లు చూడగలుగుతున్నారు. ఆ మూర్తి చూపుడువేలు ప్రబోధం వారికిప్పుడు సరైన రీతిలో అర్థమవుతున్నది. ఇన్నాళ్లూ మన నాయకులూ, బోధకులూ చెబుతున్నట్టుగా అంబేడ్కర్ కేవలం దళిత నాయకుడు కాదు. జాతీయ నాయకుడు. నేటి దేశావసరాలకు గాంధీ, నెహ్రూల కంటే అంబేడ్కర్ ఎక్కువగా సరితూగగలడని నిరూపణవుతున్నది. ఆయనను కేవలం రాజ్యాంగ రచయితగానే మన పాఠ్య పుస్తకాలు మనకు పరిచయం చేశాయి. కానీ, ఈనాటి సామాజిక, రాజకీయ సమస్యలను కూడా ఏడెనిమిది దశాబ్దాలకు పూర్వమే దర్శించి భాష్యం చెప్పిన మహోపాధ్యాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన పుట్టిన తేదీ ఏప్రిల్ 14. రోజురోజుకూ ఈ తేదీకి ప్రాధాన్యం పెరుగుతున్నది. భారతీయ సమాజం విద్యాప్రపూర్ణమవుతున్న కొలదీ, వివేకపూరితమవుతున్న కొలదీ ఈ తేదీ మరింత కాంతులీనబోతున్నది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏప్రిల్ 14వ తేదీతో ముడిపడిన మరో ఉత్తేజభరితమైన వృత్తాంతం కూడా ఉన్నది. ఉస్మానియా విద్యార్థి నాయకుడైన జార్జిరెడ్డిని పెత్తందారీ శక్తులు కుట్రపూరితంగా మట్టుపెట్టిన రోజది. అది జరిగి ఇప్పటికి యాభయ్యేళ్లయింది. జార్జిరెడ్డిని గురించి ఆనాటి పరిశీలకుల్లో రెండు రకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. జార్జిరెడ్డి ఇంకొంతకాలం జీవించి ఉంటే, రాజకీయాల జోలికి – గొడవల జోలికీ వెళ్లకుండా ఉండి ఉంటే ఈ దేశానికి ఐన్‌స్టీన్ వంటి ఒక గొప్ప శాస్త్రవేత్త లభించి ఉండేవాడని కొందరు అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో జార్జి గోల్డ్‌మెడలిస్ట్. పరిశోధక విద్యార్థి. జార్జి పరీక్ష పేపర్లు దిద్దడానికి ఉస్మానియా ప్రొఫెసర్లు తటపటాయిస్తే, వాటిని బొంబాయి యూనివర్సిటీకి పంపించారట. జార్జి సమాధానాలు చదివిన అక్కడి ప్రొఫెసర్ ఒక్కసారి ఈ యువ మేధావిని వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న కోరికతో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారట. జార్జిరెడ్డి బతికి వుంటే ఇండియాకు ఇంకో చేగువేరా లభించి ఉండేవాడని మరికొందరు వ్యాఖ్యానిస్తుంటారు. గ్రామీణ పేద రైతు కుటుంబాల నుంచీ, బీసీ, ఎస్సీ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ స్థాయికి అప్పుడప్పుడే చేరుకుంటున్న రోజులవి. పెత్తందారీ, సంపన్న వర్గాల పిల్లల్లో కొందరు గూండా తండాలను వెంటేసుకుని యూనివర్సిటీలో అరాచకం సృష్టిస్తున్న రోజులు. గ్రామీణ విద్యార్థుల్ని ర్యాగింగ్ చేయడం, అవమానించడం, వారిపై దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యంగా మారింది. ఈ దశలో యూనివర్సిటీలో ప్రవేశించిన జార్జి గ్రామీణ విద్యార్థులను సంఘటితం చేసి, వారికి అండగా నిలబడ్డాడు. వారికి తిరగబడడం నేర్పించాడు. జార్జి స్వయంగా బాక్సర్. ధైర్యశాలి. అతని ధాటికి గూండా గ్యాంగ్‌లు హడలిపోయేవి. ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందం’ పేరుతో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో జార్జి విజయబావుటా ఎగరేశాడు. ఈ దశలోనే జార్జిరెడ్డి హత్య జరిగింది. విద్యార్థిలోకంపై ఈ హత్య తీవ్రమైన ప్రభావం చూపింది. అనంతర కాలంలో జార్జిరెడ్డి స్ఫూర్తితో వందలాదిమంది విద్యార్థులు విప్లవకారులుగా తయారయ్యారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత కథ అందరికీ తెలిసిందే. అణచివేతను, అవమానాలను స్వయంగా అనుభవించి కృషితో, సాహసంతో ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన ధీశాలి. భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించే వ్యక్తిగా ఆయన పేరును విస్మరించడానికి వీల్లేని దశకు ఆయన ఎదిగారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని దేశంలో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సామాజిక పరివర్తనకు దోహదపడే బాటలు వేశారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అట్టడుగున పడి దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతికి ఆయన రాజ్యాంగంలో చోటు కల్పించారు. భిన్న భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలతో కూడిన ఈ దేశాన్ని ఒక సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలదొక్కుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది రాజకీయ భావన మాత్రమే కాదు. సామాజిక భావన కూడా! ఆర్థిక భావన కూడా! అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల వెనుకబడిపోయిన విశాల ప్రజానీకం మిగిలిన వారితో పోటీపడగలిగే స్థాయికి చేరుకోవడానికి ప్రత్యేక అవకాశాలు కల్పించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ముఖ్యంగా రాజ్యాంగ పీఠిక ఈ దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అద్దంపడతాయి. పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వేచ్ఛ, అవకాశాల్లోఅందరికీ సమానత్వం, వ్యక్తిగత గౌరవాన్ని జాతి సమగ్రతను సంరక్షిస్తూ అందరి నడుమ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం రాజ్యాంగ లక్ష్యాలుగా పీఠికలో సంకల్పం చెప్పుకున్నారు. ఈ రాజ్యాంగ లక్ష్యాలను ఇప్పటికే సంపూర్ణంగా సాధించి ఉన్నట్లయితే సమాజంలో ఇంత విపరీతమైన వ్యత్యాసాలు ఉండేవి కావు. రాజ్యాంగం నిర్దేశించినట్లు అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించి ఉన్నట్లయితే జార్జిరెడ్డి వంటి యువకులు విప్లవ మార్గం వైపు మొగ్గు చూపేవారు కాదు. అంతరాలు లేని రాజ్యాన్ని సృష్టించాలని ఆ మార్గంలో వెళ్లిన వేలాదిమంది యువకులు ఆత్మబలిదానాలు చేశారే తప్ప గమ్యం మాత్రం ఇంతవరకూ కనుచూపు మేరలోకి రానేలేదు. అదే లక్ష్యసాధన కోసం అంబేడ్కర్ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకోసం దారిచూపే పవిత్ర గ్రంథంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. పాలకుల సహాయ నిరాకరణ వలన రాజ్యాంగ లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరకపోయినా కొంతమేరకైనా సత్ఫలితాలనిస్తున్నాయి. నెమ్మదిగానైనా సామాజిక పరివర్తన జరుగుతున్నది. నాణ్యమైన విద్యను దళిత, గిరిజన వెనుకబడిన వర్గాలకు ఉచితంగా అందజేసి ఉన్నట్లయితే పరివర్తన మరింత వేగంగా జరిగేది. దోపిడీ – పీడనా లేని సమాజాన్ని కాంక్షించేవారెవరైనా సరే, మనిషి మనిషిగా ఆత్మగౌరవంతో బతకగలిగే వ్యవస్థను కోరుకునేవారు ఎవరైనా గానీ, పేదరికం లేని కరువు కాటకాలు లేని రోజులు రావాలని కోరుకునేవారందరూ కూడా, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య కావాలని నినదించేవారందరూ కూడా ఆ దిశలో పడుతున్న ప్రతి అడుగునూ స్వాగతించాలి. ప్రేమించాలి. అభినందించాలి. ఆ అడుగు విప్లవకారులదైనా, ప్రజాస్వామికవాదులదైనా సరే! కేంద్ర ప్రభుత్వాలదైనా, రాష్ట్ర ప్రభుత్వానిదైనా సరే! ఒక్కో ముందడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుందని మరిచిపోరాదు. అంబేడ్కర్ జయంతికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. 70 శాతం మంత్రిపదవులను బలహీనవర్గాలకు కేటాయించారు. ఇన్ని పదవులు ఈ సెక్షన్లకు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇది అభినందించదగిన సందర్భం కాదా? ఐదు ఉపముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకు కేటాయించారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే చర్య కాదా? దేశవ్యాప్తంగా దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్న వారిలో దళితులు, మహిళలే అత్యధికంగా ఉన్నారంటూ దశాబ్దాలుగా జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. ఆ సవాల్‌కు జవాబుగా ఒక దళిత మహిళకే హోంశాఖను అప్పగించడాన్ని మనం స్వాగతించలేమా? ఇలా అప్పగించడం వరుసగా ఇది రెండవసారి కూడా! హోం, రెవెన్యూ, వైద్యం–ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్, పురపాలన, పరిశ్రమలు, రవాణా – ఇలా కీలకమైన శాఖలన్నింటినీ ఈ వర్గాలకే కేటాయించడాన్ని ఇదివరకెప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలోగానీ, వేరే రాష్ట్ర చరిత్రలో గానీ, దేశ చరిత్రలో గానీ చవిచూసి ఉన్నామా? గతంలో యాదవ – కురుబ కులాలకు కలిపి జాయింట్‌గా ఒకటి, గౌడ – శెట్టిబలిజలకు కలిపి జాయింట్‌గా ఒకటి, పొలినాటి వెలమ – కొప్పుల వెలమలకు కలిపి ఒకటి చొప్పున కేటాయించే సంప్రదాయాన్ని వదిలిపెట్టి విడివిడిగా మంత్రి పదవులిచ్చారు. రాయలసీమలో జనాధిక్యం కలిగిన బోయలకూ, ఉత్తరాంధ్రలో అధికంగా వుండే తూర్పు కాపులకూ, సముద్ర తీరం వెంబడి నివసించే మత్స్యకారులకూ మంత్రి పదవులు దక్కాయి. ఎక్కువ మంత్రి పదవులను ఇవ్వడమే కాకుండా కీలక శాఖలను కట్టబెట్టడం సాధికారత సాధనలో ఒక గొప్ప ముందడుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ముందు స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు యాభై శాతం కుర్చీలను కట్టబెట్టింది. మొత్తం స్థానిక సంస్థల పదవుల్లో యాభై శాతాన్ని మహిళలకు రిజర్వు చేసింది. నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం, నామినేటెడ్ పనుల్లో యాభై శాతం ఈ వర్గాలకు కేటాయింపును చట్టబద్ధం చేసింది. ఈ మొత్తంలో కూడా సగం మహిళలకు! ఈ చర్యలు రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణమైనవే కదా! గమ్యాన్ని మరింత దగ్గర చేసేవే కదా! విద్య – వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విప్లవాత్మకమైనవిగా ఇప్పటికే నీతి ఆయోగ్, కేంద్రం, ఇతర రాష్ట్రాలు ప్రశంసించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు గానీ, మీడియా గానీ వీటి గురించి ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. వ్యవసాయ రంగంలో చిన్న కమతాలు లాభదాయకం కాదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తల నుంచి సోషలిస్టు ఆర్థికవేత్తల వరకూ అందరూ అభిప్రాయ పడతారు. దీనికి పరిష్కారంగా కార్పొరేట్ వ్యవసాయాన్ని కొందరు సూచిస్తున్నారు. సమష్టి వ్యవసాయాన్ని మరికొందరు సూచిస్తున్నారు. ఇవేవీ కూడా భారతీయ వ్యవసాయ సంస్కృతికి సరిపడేవి కావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్బీకే సెంటర్లు చిన్న కమతాలకు శ్రీరామరక్షగా నిలబడగలుగు తాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని కూడా స్వాగతించలేమా? రాజ్యాంగం నిర్దేశించిన గమ్యాన్ని ముద్దాడే దిశగా పడే ప్రతి అడుగునూ స్వాగతించడం, అభినందించడమే అభ్యుదయమవుతుంది. వ్యతిరేకించడం అభివృద్ధి నిరోధకమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఫ్రాన్స్‌కు పరీక్షా సమయం
యూరప్ ఖండమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి దశ పోలింగ్ ఆది వారం జరగబోతోంది. ఈనెల 24న జరగబోయే మలి దశకు ప్రధానంగా ఎవరు పోటీలో ఉంటారో ఈ పోలింగ్ ఫలితం తేల్చేస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు, మధ్యేవాద పక్ష నాయకుడు ఇమ్మానియేల్ మేక్రాన్ సునాయాసంగా గెలుస్తారని గత నెలలో వెలువడిన సర్వేలు చెప్పినా... ఇటీవల ఆయన ప్రత్యర్థి, తీవ్ర మితవాద పక్షనేత మెరైన్ లీ పెన్ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారని తేలింది. తాను విజయం సాధిస్తే ప్రళయం ఖాయమని స్టాక్ మార్కెట్లు ప్రజల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నాయని లీపెన్ అంటున్నారు. నిజానికి మేక్రాన్‌కు ఎన్నడూ లేనంత అనుకూల పరిస్థితులు న్నాయి. కానీ ఆయన ఎన్నికల ప్రచారం ఆలస్యంగా మొదలుకావడమే లీ పెన్కు వరమైందని నిపు ణుల భావన. అయిదేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రెండో దశ ఎన్ని కల్లో 66 శాతం ఓట్లు సాధించినప్పుడు మేక్రాన్ వయసు 39 ఏళ్లు. నెపోలియన్ బోనపార్ట్ తర్వాత అంత చిన్న వయసులో ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం దక్కించుకున్నవారు మరెవరూ లేరు. అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఇరవై రెండేళ్ల తర్వాత 2012లో విజయకేతనం ఎగరేసిన సోషలిస్టు పార్టీ పాలనలో పూర్తిగా విఫలమై అప్రదిష్టపాలైంది. అధ్యక్షుడిగా పాలించిన హొలాండ్ అసమర్థుడిగా ముద్రపడి, చివరి సమయంలో బెనోయిట్ హమాన్‌కు పీఠం అప్పగించారు. ఆయన కూడా ప్రజలను ఆకట్టు కోలేకపోయారు. అటు లీ పెన్ తీవ్ర మితవాద భావాలతో జనాన్ని హడలెత్తించారు. తాను అధ్యక్షురాలిగా గెలిస్తే నాటో కూటమి నుంచి ఫ్రాన్స్‌ను తప్పిస్తానని, రష్యాతో సంబంధాలు మెరుగు పరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇవన్నీ మార్కెట్లను బెంబేలెత్తించాయి. ఆ పరిస్థితుల్లో మేక్రాన్ సునాయాసంగా గెలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తీవ్ర మిత భావాలు ఫ్రాన్స్ ప్రజానీకానికి రుచించడం లేదన్న నిజాన్ని లీ పెన్ గ్రహించారు. దానికితోడు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో ఆ దేశం ప్రస్తావన, పుతిన్ ప్రస్తావన ఆమె మానుకున్నారు. అలాగే వలసల విషయంలోనూ ఉదారంగా ఉంటున్నారు. ఏ దేశంలో కల్లోలం ఏర్పడినా వేలాదిమంది ఫ్రాన్స్‌కు వచ్చిపడి స్థానికుల అవకాశాలను దెబ్బ తీస్తున్నారని, దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నారని 2017 ఎన్నికల్లో ఆమె విరుచుకుపడేవారు. తాను వచ్చిన వెంటనే వలసల నిరోధానికి చట్టం చేస్తాననేవారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఉక్రెయిన్ వాసులు మన సోదర సోదరీమణులేనని, వారిని ఆదుకోవడం మన కర్తవ్యమని లీ పెన్ చెబుతున్నారు. బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ పడుతున్న అవస్థలు అందరికీ తెలియడంతో యూరొపియన్ యూనియన్(ఈయూ) నుంచి ఫ్రాన్స్ బయటకు రావాలన్న డిమాండ్‌ను ఈసారి ఆమె అటకెక్కించారు. ఆ మాటంటే ఓటమి ఖాయమని లీ పెన్కు అర్థమైంది. గతంతో పోలిస్తే ఆమె అభిప్రాయాలు సరళం కావడం ఓటర్లకు నచ్చి ఉండొచ్చు. అలాగని ఓటర్లలో ఆమె గురించిన భయాందోళనలు పూర్తిగా పోలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆమె ఈయూ నిబంధనలను బేఖాతరు చేసి విదేశీ కార్మికుల స్థానంలో ఫ్రాన్స్ పౌరులకే ఉద్యోగాలు కట్టబెడతామని హామీ ఇస్తున్నారు. అలాగే ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా బురఖా వాడకుండా చర్యలు తీసుకుంటా నంటున్నారు. అయితే ఉక్రెయిన్‌పై దాడి తర్వాత పుతిన్‌పై జర్మనీ వగైరా దేశాల్లో ఏర్పడిన అభిప్రా యమే ఫ్రాన్స్‌లోనూ ఉంది. యూరప్ ఖండానికి ఆయన ముప్పుగా పరిణమిస్తాడన్న భయాందో ళనలున్నాయి. లీపెన్ ఇప్పుడు పుతిన్ ప్రస్తావన మానుకుని ఉండొచ్చు. కానీ ఆమె గెలిస్తే ఫ్రాన్స్ సంక్షోభంలో కూరుకుపోతుందనీ, అది అంతిమంగా ఈయూ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి పుతిన్‌కు పరోక్షంగా తోడ్పడుతుందనీ నమ్ముతున్నవారున్నారు. లీ పెన్ ధోరణులు పుతిన్‌కే ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అందువల్ల తొలి దశలో మేక్రాన్ కంటే ఆధిక్యత తెచ్చుకున్నా, రెండో దశలో ఆమె దెబ్బతినడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్నవారు సమర్థవంతమైన పాలన అందిస్తేనే ప్రజలు వారికి మరోసారి అధి కారం కట్టబెడతారు. అంతేతప్ప ఏవో సాకులు వెదికి, ఎవరివల్లనో ముప్పు వస్తుందని భయపెట్టి ఓట్లడిగే రోజులు పోయాయి. కనీసం ఫ్రాన్స్ ప్రజానీకం అలాంటి అధినేతలను విశ్వసించరు. మేక్రాన్‌ను ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఆయన చెప్పినవన్నీ చేసి ఉండకపోవచ్చుగానీ ఆర్థికంగా ఫ్రాన్స్‌ను మెరుగ్గా నిలిపారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈయూలో ఫ్రాన్స్ పలుకుబడిని పెంచారు. అటు కార్పొరేట్ సంస్థల పన్నులనూ తగ్గించారు. ఇటు మధ్యాదాయ వర్గాలకూ పన్ను పోటు తగ్గించారు. నిరుద్యోగిత 7 శాతానికి పరిమితం చేస్తానన్న మేక్రాన్ 2017 నాటి వాగ్దానానికి కరోనా గండికొట్టింది. కానీ ఆయన అన్ని రకాల చర్యలూ తీసుకుని ఆ హామీని నెరవేర్చారు. వీటితోపాటు ఉగ్ర దాడుల తర్వాత మితవాద ఓటర్ల మనసు గెల్చుకోవడానికి దేశ ముస్లిం జనాభాను ‘విదేశీ ప్రభావం’ నుంచి తప్పించడానికంటూ నిరుడు ఒక చట్టం తీసుకొచ్చారు. ఫ్రాన్స్ శతాబ్దాలుగా నమ్ముతున్న ఉదారవాద విలువలకు ఈ చట్టం సమాధి కట్టిందని వామపక్ష, ఉదారవాద పక్ష నేతలు ఆరోపించగా... మత ఉగ్రవాదం కట్టడికి ఇది సరిపోదని మితవాదులు విమర్శించారు. మొత్తానికి మేక్రాన్, లీ పెన్‌ల మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం తగ్గిందన్న తాజా సర్వేల జోస్యం ఫ్రాన్స్‌లో కలవరం రేపుతోంది. ఆదివారం పోలింగ్ మాటెలా ఉన్నా 24న జరిగే తుది ఎన్నికల నాటికైనా మేక్రాన్ పుంజుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. -
మూకస్వామ్యం!
చూడబోతే ఇది నిషేధాల రుతువులా కనబడుతోంది. కర్ణాటకలో హఠాత్తుగా తెరపైకొచ్చిన హిజాబ్, హలాల్ వివాదాలు రగిల్చిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఈలోగా ఢిల్లీ పరిధిలో బీజేపీ నేతృత్వంలోని తూర్పు, దక్షిణ ఢిల్లీ నగర పాలక సంస్థల మేయర్లు ఈ నెల 2 నుంచి 11 వరకూ జరిగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ ఇద్దరు మేయర్లూ తమ తమ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు లేఖలు రాశారు. అధికారికంగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులేవీ లేకపోయినా ఆ నగర పాలక సంస్థల పరిధుల్లో చాలా మాంసం దుకాణాలు మూసివేశారంటేనే సాధారణ దుకాణదారుల్లో ఎంతగా భయం రాజ్య మేలుతున్నదో అర్థమవుతుంది. దేశ రాజధానిగా ఉన్న ఒక మహా నగరంలో ఇలాంటి పరిస్థితు లుండటం సరికాదన్న కనీస ఆలోచన కూడా మన నేతలకు కొరవడుతోంది. మన దేశంలో పుట్టుక చాలా అంశాలను నిర్ణయిస్తుంది. ఏ మతంలో, ఏ కులంలో పుట్టారు.. ఏ జెండర్ వగైరా అంశాల ఆధారంగా ఎవరెలా నడుచుకోవాలో, ఎలాంటి వస్త్రధారణ అవసరమో ముందుగానే నిర్దేశితమవుతాయి. అలాగే ఆహారపు అలవాట్లు కూడా! రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ 2016లో వెల్లడించిన అంశాల ప్రకారం మన దేశంలో మెజారిటీ జనాభా మాంసాహార ప్రియులు. ఆసక్తి కరమైన అంశమేమంటే ఉత్తరాది రాష్ట్రాల్లో రాజస్థాన్, హరియాణా, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో శాకాహార ప్రియుల శాతం కాస్త ఎక్కువగా ఉంటే దక్షిణాది రాష్ట్రాలన్నిటా పూర్తిగా మాంసాహార ప్రియులదే ఆధిక్యత. మొత్తంగా దేశంలో 71 శాతం మంది పైగా మాంసాహారాన్ని భుజిస్తుంటే... దాదాపు 29 శాతం మంది శాకాహారులు. ఆహారపుటలవాట్ల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. మాంసాహారంలో లభించే ప్రొటీన్లు కొన్ని శాకాహారులకు అందుబాటులో ఉండే అవకాశం లేదని ఆహార నిపుణులు చెబుతారు. వారికోసం కొన్ని ప్రత్యామ్నా యాలు సూచిస్తారు. కొన్నిచోట్ల శాకాహారులుగా ముద్రపడిన కులాలకు చెందినవారు వేరే ప్రాంతాల్లో మాంసాహారులుగా ఉండటం కూడా కనబడుతుంది. ఏడేళ్ల క్రితం మహారాష్ట్రలో బీజేపీ –శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మూడు రోజులపాటు మాంసం అమ్మరాదని నిషేధం విధించింది. జైనుల పండుగ పర్యూషణ్ సందర్భంగా ఈ నిషేధం తెచ్చినట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సంద ర్భంగా బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి ఈ నిషేధంలో చేపల విక్రయాన్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించినప్పుడు.. అది నీటిలోనుంచి బయటకు తీసిన వెంటనే చనిపోతుంది గనుక దాన్ని వధించడమనే ప్రశ్నే తలెత్తదని జవాబిచ్చి అడ్వొకేట్ జనరల్ నవ్వుల పాలయ్యారు. ఇష్టపడిన ఆహారాన్ని తినడం, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, నచ్చిన మతాన్ని అనుస రించడం లేదా మతాతీతంగా ఉండాలనుకోవడం, నచ్చిన వ్యాపారం చేసుకోవడం రాజ్యాంగం ఈ దేశ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కొన్ని. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైనుల పండుగ సందర్భంగా మాంసం విక్రయాన్ని నియంత్రిస్తూ ఇచ్చిన ఆదేశాల చెల్లుబాటును 2008లో ధ్రువీకరిస్తూనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం. ‘ఎవరు ఏం తినాలనేది వ్యక్తుల ఇష్టానిష్టాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా పౌరుల వ్యక్తిగత గోప్యతకూ, వారి జీవించే హక్కుకూ రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిలోకొస్తుంది’ అని స్పష్టం చేసింది. ఈ హక్కును ఉల్లంఘిస్తున్నామనిగానీ, తమ చర్య ద్వారా మెజారిటీ జనాభా ఆహారపు అలవాట్లను నియంత్రిస్తున్నామనిగానీ ఢిల్లీ మేయర్లకూ, అక్కడి బీజేపీ నాయకులకూ తోచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణ పౌరుల హక్కులను గుర్తించి, గౌరవించడమే ఏ పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థకైనా గీటురాయి. కేవలం అయిదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడమే ప్రజాస్వామ్యం అను కునే పాలకులున్న వ్యవస్థ బనానా రిపబ్లిక్‌గానే మిగిలిపోతుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఉల్లి, వెల్లుల్లి వంటివి కూడా తినబోరని, అలాంటి పరిస్థితుల్లో మాంసం బహిరంగ విక్రయం వారి మనోభావాలను దెబ్బతీస్తుందని మేయర్లు వాదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2015లో ముంబై హైకోర్టు మాంసం విక్రయాల నియంత్రణపై తీర్పునిస్తూ ‘జైన మత సోదర, సోదరీ మణులతో సంఘీభావం ప్రకటించడం వేరు... ప్రజానీకానికి మార్కెట్లో మాంసం దొరక్కుండా చర్యలు తీసుకోవడం, వారికి నచ్చిన ఆహారం అందుబాటులో లేకుండా చేయడం వేరు’ అని చెప్పింది. పౌరులు స్వచ్ఛందంగా ఏ పనైనా చేయడం స్వాగతించదగ్గది. కానీ వారితో బలవంతంగా అమలు చేయించాలని చూడటం వివాదాలకూ, అనవసర భయాందోళనలకూ దారితీస్తుంది. ఏం చదవాలో, ఎలా ఆలోచించాలో, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయాలో, ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్దేశించడంతో మొదలుపెట్టి వంటింట్లో ఏం వండాలో కూడా నిర్ణయించే స్థాయికి మన నేతలు చేరడం దురదృష్టకరమైన స్థితి. ఢిల్లీలో కేవలం మందబలం ఆధారంగా ప్రస్తుతం అనధికారికంగా అమలవుతున్న నిషేధాలను పాలనాధికార వ్యవస్థ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం సరికాదు. నిజానిజాలేమిటో ప్రజల ముందుంచాలి. ఇవి అనధికారికమైనవేనని తేల్చి చెప్పాలి. కనీసం న్యాయస్థానాలైనా జోక్యం చేసుకుని బాధ్యులైనవారిపై చర్యలకు ఆదేశించాలి. మూకస్వామ్యం చేటు తెస్తుందని అందరూ గుర్తించాలి. -
బుచాలో రాక్షసకాండ
పొరుగునున్న ఉక్రెయిన్ అనే చిన్న దేశంపై రష్యా దురాక్రమణకు దిగి, అక్కడి ప్రజానీకాన్ని కష్టాలపాలు చేసి ఆరు వారాలు దాటుతోంది. లక్షలాదిమంది పౌరులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వేరే దేశాలకు వలసపోతుంటే, అలా వెళ్లడం సాధ్యపడనివారు వీధుల్లో శవాలుగా మిగులుతున్నారు. మొన్నటివరకూ జనసందోహంతో కిటకిటలాడిన నగరాలు ఇప్పుడు శ్మశానాలను తలపిస్తున్నాయి. నివాస ప్రాంతాలను సైతం గురిచూసి ధ్వంసం చేస్తున్న రష్యా సేనల రాక్షసత్వం కోటిమందికిపైగా పౌరులను స్వదేశంలో నిరాశ్రయులుగా మార్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ శివారు పట్టణమైన బుచాలో రష్యా సైనికులు సాగించిన దుష్కృత్యాలకు మీడియాలో వెల్లడవుతున్న ఛాయాచిత్రాలు అద్దం పడుతున్నాయి. మార్చి మధ్యవారంలో తీసిన ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలను చూస్తే ఎంతటివారికైనా దుఃఖం పొంగుకొస్తుంది. చేతులు వెనక్కి విరిచి కట్టి ఉన్న మృతదేహాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉండటాన్నీ, ఒక వృద్ధురాలు సొంత ఇంట్లోనే నిర్జీవంగా మిగలడాన్నీ చూస్తే రష్యా సైనికులు సాగించిన నరమేధం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 36,000 మంది జనాభా ఉన్న ఆ శివారు పట్టణంలోని వీధుల్లో 300కు పైగా శవాలు కనబడ్డాయని చెబుతున్నారు. ఎక్కడ చూసినా చేతులు వెనక్కి విరిచికట్టి, తల వెనుక నుంచి తూటాలు కాల్చినట్టు ఆనవాళ్లున్న శవాలు దర్శనమిస్తున్నాయి. కీవ్‌లో కొన్ని ప్రాంతాల నుంచి రష్యా దళాలు నిష్క్రమించాక అక్కడ 410 శవాలు లెక్కగట్టారు. పిల్లల వైద్య చికిత్సా కేంద్రం బేస్మెంట్ను చిత్రహింసల శిబిరంగా మార్చుకుని రష్యా సైనికులు పౌరులపై ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఆ చికిత్సా కేంద్రం ఆవరణలో అనేక శవాలను ఖననం చేసిన ఆనవాళ్లున్నాయి. ఇదే నగరంపై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ సేనలు విరుచుకుపడి 1941–43 మధ్య 15 లక్షలమంది పౌరులను పొట్టన బెట్టుకున్నారు. వీరిలో అత్యధికులు యూదులు. ఎనిమిది దశాబ్దాల తర్వాత ఇప్పుడు రష్యా సేనలు సాగించిన దుర్మార్గం దానికేమాత్రం తీసిపోదు. సరిగ్గా నాజీ సేనలు సాగించిన అకృత్యాల మాదిరే ఇంటింటా సోదాలు చేస్తూ, నిత్యావసరాల కోసం రోడ్డెక్కినవారిని అడ్డగిస్తూ రష్యా దళాలు నిలు వునా ప్రాణాలు తీశాయని స్థానికులు అంటున్నారు. బుచా ఘటనలు ప్రపంచ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. ఇంతవరకూ వివిధ అంతర్జాతీయ వేదికల్లో అమెరికా, పాశ్చాత్య దేశాలు తీసుకొచ్చిన తీర్మానాల విషయంలో తటస్థత పాటించిన మన దేశం సైతం బుచా నరమేధం తర్వాత భిన్నంగా స్పందించక తప్పలేదు. ఈ దారుణ మారణకాండపై అంతర్జాతీయ విచారణ అవసరమని ప్రకటించింది. ఏ యుద్ధమైనా, దురాక్రమ ణైనా మానవాళిపై సాగించే నేరమే. అందుకు పురిగొల్పినవారు నేరగాళ్లే అవుతారు. ఇవాళ బుచాలో, కీవ్‌లో రష్యా సాగించిన నేరాలకు సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయి. వీటిని ఖండిస్తున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు తాము దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ దేశాల్లో సాగించిన, సాగిస్తున్న పాపాలను కడిగేసుకోలేవు. ఇరాక్, అఫ్గానిస్తాన్, సిరియా, లిబియా, యెమెన్, సూడాన్, నైజీరియా వంటి చోట్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తాము ఎన్ని లక్షలమంది మరణానికి కారకులమయ్యారో గుర్తు తెచ్చుకోవాలి. అక్కడి దుష్కృత్యాలపై పాశ్చాత్య మీడియా ఇంతగా స్పందించలేదు. పరిమిత స్థాయిలోనే అయినా జూలియన్ అసాంజ్, చెల్సియా మానింగ్, ఎడ్వర్డ్ స్నోడెన్ వంటివారు బయటి ప్రపంచానికి వెల్లడించిన వాస్తవాలు దిగ్భ్రాంతి గొలుపుతాయి. యుద్ధాల్లోనైనా, దురాక్రమణల్లోనైనా మంచివి, చెడ్డవి అనేవి ఉండవు. వాటి సారాంశం హింస తప్ప మరేమీ కాదు. రెండు ప్రపంచ యుద్ధాలు మోసుకొచ్చిన అంతులేని విషాదాలను ప్రత్యక్షంగా చూసిన తరాలు శాంతి కోసం తపించాయి. యుద్ధాలకు, దురాక్రమణలకు తావులేని ప్రపంచాన్ని కాంక్షించాయి. ప్రపంచ శాంతి సంఘం వంటివి ప్రజలను చైతన్యవంతులను చేశాయి. కానీ అగ్రరాజ్యాల విస్తరణవాద కాంక్షతో భూగోళంలో ఏదో ఒక మూల అవి కనబడుతూనే ఉన్నాయి. రష్యా చేస్తున్న వాదనలు ఉత్త బుకాయింపులు, దబాయింపులేనని బుచా నరమేధం నిరూ పిస్తోంది. తాము కేవలం ఉక్రెయిన్ సైనిక స్థావరాలనూ, సైనికులనూ లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతున్నదంతా అబద్ధమని రుజువవుతోంది. అమెరికా ప్రాపకంతో తన పొరుగునున్న ఉక్రెయిన్ తనకు సమస్యలు సృష్టించదల్చుకున్న మాట నిజమే కావొచ్చు. కానీ ఆ వంకన దురాక్రమణకు దిగడం, నరమేధానికి పాల్పడటం క్షమార్హంకాని నేరం. తన దగ్గర పుష్కలంగా ఉన్న సహజవాయు, ముడి చమురు నిక్షేపాలవల్ల తన ఆర్థిక సుస్థిరతకు వచ్చే ఇబ్బందేమీ లేదని పుతిన్ లెక్కలు వేసుకుని ఉండొచ్చు. కానీ బుచా నరమేధం ఆ లెక్కల్ని తారుమారు చేసే అవకాశం ఉంది. పుతిన్ అయినా, మరొకరైనా యుద్ధాన్ని ప్రారంభించగలరు తప్ప ముగింపు వారి చేతుల్లో ఉండదు. ఇప్పటికైతే రష్యా గ్యాస్‌పై ఆధారపడాలా, వద్దా అనే అంశంలో జర్మనీ ఊగిసలాటలో ఉంది. యూరొపియన్ యూనియన్(ఈయూ) రష్యా బొగ్గుపై మాత్రమే నిషేధం విధించింది. భారత్, చైనా వంటి దేశాలు చవగ్గా వస్తున్న ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అందుకే రష్యాకు రోజుకు 1,800 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుస్తున్న చమురు, సహజవాయు ఉత్పత్తిపై ఆంక్షల ప్రభావం పెద్దగా పడలేదు. కానీ ఈ దుర్మార్గాలు ఇలాగే సాగితే మున్ముందు రష్యా చిక్కుల్లో పడొచ్చు. ఆర్థిక వ్యవస్థ బీటలు వారొచ్చు. కనుక ఈ మతిమాలిన యుద్ధానికి పుతిన్ ఇప్పటికైనా స్వస్తి పలకాలి. -
నేపాల్‌తో మళ్లీ సాన్నిహిత్యం
భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా దేశంలో మూడు రోజులు పర్యటించారు. రెండేళ్ల క్రితం సరిహద్దుల విషయంలో వివాదం తలెత్తాక అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. వాటిని మళ్లీ సరిచేసుకోవడమే దేవ్బా తాజా పర్యటన ఆంతర్యం. నిరుడు జూలైలో అయిదోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేవ్బా జరిపిన మొదటి విదేశీ పర్యటన ఇది. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు తలెత్తడం, అవి విభేదాలుగా పరిణమించడం వింతేమీ కాదు. శతాబ్దాలుగా భారత్, నేపాల్ దేశాల మధ్యా సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలున్నాయి. అందుకే అప్పుడప్పుడు పొరపొచ్చాలు ఏర్పడినా, మరో దేశం ఆ సమస్యలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూసినా ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు సంయమనం పాటించి లోటుపాట్లు సరిదిద్దుకుంటున్నాయి. తిరిగి ఒక్కటవుతున్నాయి. దేవ్‌బాకు ముందున్న ప్రధాని కేపీ ఓలి చైనా ప్రభావంతో మన దేశంతో తగాదాకు దిగారు. పర్యవసానంగా ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వచ్చిన దేవ్బా ఆ సంబంధాలను తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు కృషి చేశారు. దానిలో భాగంగానే ఆయన భారత్ పర్యటనకొచ్చారు. నేపాల్‌కు ఇది ఎన్నికల సంవత్సరం కూడా. కనుక రెండు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం సమస్య ఆ ఎన్నికల్లో ప్రముఖంగా ప్రస్తావనకు రావడం ఖాయం. ఉత్తరాఖండ్‌లో భాగంగా ఉన్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను నేపాల్ 2020లో తన మ్యాప్‌లో భాగంగా చూపింది. దానికి సంబంధించిన బిల్లుకు అక్కడి పార్లమెంటులో ఆమోద ముద్ర పడింది. రాబోయే ఎన్నికల్లో దేవ్‌బాను దెబ్బతీయడానికి మాజీ ప్రధాని ఓలి శర్మ, ఇతరులు గట్టిగానే ప్రయత్నిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఈ వివాద పరిష్కారానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. బిహార్‌లోని జయనగర్ నుంచి నేపాల్‌లోని కుర్తా వరకూ నడిచే రైలుకు ఇరు దేశాల ప్రధానులు పచ్చజెండా ఊపారు. 35 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గంలో ఇరు దేశాల మధ్యా ప్రారంభమైన తొలి బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ఇది. దీన్ని మరింత దూరం పొడిగించడానికి మన దేశం సాయపడ బోతోంది. అలాగే మన దేశం నిర్మించిన విద్యుత్ కారిడార్‌ను కూడా లాంఛనంగా దేవ్‌బాకు అప్పగించారు. ఈ కారిడార్ వల్ల అక్కడి ఈశాన్య ప్రాంత మారుమూల పల్లెలకు సైతం నేపాల్ విద్యుత్ సదుపాయం అందించగలుగుతుంది. ఇవిగాక నేపాల్‌లో విద్యుదు త్పత్తి ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయడంతో సహా మరెన్నో ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. మన దేశంతో నేపాల్ క్రమేపీ సన్నిహితమవుతున్న తీరును చైనా గమనిస్తూనే ఉంది. దేవ్బా మన దేశం రావడానికి మూడు రోజుల ముందు నేపాల్‌లో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ పర్య టించారు. ఒక్క మన దేశంతో మాత్రమే కాదు... అమెరికాతో కూడా నేపాల్ దగ్గరవుతుండటాన్ని దృష్టిలో ఉంచుకునే వాంగ్ యీ హుటాహుటీన ఈ పర్యటనకొచ్చారు. నేపాల్‌లో రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒక సంస్థ ద్వారా తాను అందించదల్చుకున్న సాయం అంగీకారమో కాదో మార్చి 28 లోగా చెప్పాలని అమెరికా గడువు విధించింది. 50 కోట్ల డాలర్ల విలువైన ఆ గ్రాంటు స్వీకరించడానికి నేపాల్ కొంత సందేహించింది. అయితే దీన్ని అంగీకరించకపోతే నేపాల్‌తో తన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకుంటానని అమెరికా హెచ్చరించడంతో గడువుకు ఒక్కరోజు ముందు నేపాల్ పార్లమెంటు ఆ గ్రాంటు తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో నేపాల్ ఓటువేసింది. దీనికి కూడా అమెరికా ఒత్తిడే కారణం. చిత్రమేమంటే ఈ రెండు అంశాల్లోనూ ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు సెంటర్, మాధవ్ నేపాల్ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ సోషలిస్టులు ప్రభుత్వానికి మద్దతునిచ్చాయి. చైనాకు అత్యంత సన్నిహితమని ముద్ర ఉన్న మాజీ ప్రధాని శర్మ ఓలి నాయకత్వంలోని యూనిఫైడ్ మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ సైతం తటస్థంగా ఉండిపోయింది. ఈ పరిణామాలతోపాటు భారత్‌లో దేవ్బా పర్యటించడాన్ని కూడా చైనా జీర్ణించుకోలేకపోయింది. నెహ్రూ ఏలుబడిలో దక్షిణాసియా దేశాలతో మన సంబంధాలు సక్రమంగా ఉండటం లేదని నిపుణులు విమర్శించేవారు. ముఖ్యంగా నేపాల్‌తో సంబంధాల విషయంలో మనం పెద్దన్న పోకడలకు పోతే ఆ దేశం చైనాను ఆశ్రయించే అవకాశం ఉన్నదని హెచ్చరించేవారు. చిత్రమేమంటే అనంతరకాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికా రంలో ఉన్నా ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు అంతంతమాత్రమే. అందువల్లే నేపాల్‌కు చైనా సన్నిహితం కాగలిగింది. వేలాదిమంది నేపాలీ విద్యార్థులకు తమ దేశంలోని విద్యాసంస్థల్లో చవగ్గా చదువుకునే అవకాశం కల్పించింది. నేపాల్‌లో మాండరిన్ భాష నేర్పించడానికి పలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటికైతే నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు భారత్, అమెరికాలతో దేవ్బా ప్రభుత్వ సంబంధాలపై నోరెత్తడంలేదు. అయితే ఈ ఏడాది చివరిలో జరగబోయే ఎన్నికలనాటికి అమెరికా మాటెలా ఉన్నా భారత్ వ్యతిరేకతను రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తాయి. కనుక సరిహద్దు అంశంలోనైనా, మరే ఇతర విషయంలోనైనా మన దేశం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో, సామరస్యపూర్వకంగా వ్యవహరించడం అవసరం. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి దేవ్బా తాజా పర్యటన దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగుపడతాయి. -
ఇమ్రాన్ వింత నిర్ణయం
గత కొంతకాలంగా రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు పదవినుంచి నిష్క్రమించారు. పోతూ పోతూ అమెరికాపై పెద్ద బండ పడేశారు. తనను పదవీచ్యుతుణ్ణి చేయడానికి ‘ఒక పెద్ద దేశం’ కుట్ర పన్నుతున్నదంటూ గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్న ఇమ్రాన్.. సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) ఎంపీల సమావేశంలో అమెరికా పేరు చెప్పడంతోపాటు ఆ ప్రభుత్వంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయమంత్రిగా ఉంటున్న డోనాల్డ్ లూ ఇందులో ప్రధాన పాత్ర పోషించారని తేటతెల్లం చేశారు. ఈ కుట్ర సిద్ధాంతం మాటెలా ఉన్నా దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా అమెరికా పేరే వినిపించడం పాకిస్తాన్ పౌరు లకు అలవాటైపోయింది. గతంలో మాదిరే ఇప్పుడు కూడా నిజానిజాలేమిటో వెల్లడయ్యే అవకాశాలు లేవు. సైన్యానికీ, తనకూ సంబంధాలు చెడిన సంగతి బహిరంగ రహస్యమే అయినా ఇమ్రాన్ ఆ మాటెత్తడం లేదు. అటు సైన్యం కూడా ఇలాంటి తెలివే ప్రదర్శిస్తోంది. తమకూ, రాజకీయాలకూ సంబంధం లేదంటున్నది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించడానికి ఇమ్రాన్‌ను ముందుపెట్టి 2018లో సైన్యం ఆడిన డ్రామా ఎవరూ మరిచిపోరు. ఆయన పార్టీ స్థాపనలోనూ, ఆయన సాగించిన ఉద్యమాల్లోనూ సైన్యం ప్రమేయం గురించీ, ఆఖరికి ఎన్నికల్లో రిగ్గింగ్ నడిపించి ఆయన ప్రధాని అయ్యేందుకు తోడ్పడిన వైనం గురించీ తెలియవారెవరూ లేరు. అయితే ఇద్దరిమధ్యా సంబంధాలు ఎందుకు బెడిసికొట్టాయో వెల్లడికావడానికి మరికొంతకాలం పడుతుంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఇమ్రాన్ పోషించిన పాత్రే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆఖరి బంతి వరకూ పోరాడతానని ఆయన ప్రగల్భాలు పలికారు. అందరినీ నమ్మిస్తూ వచ్చారు. తీరా చివరి నిమిషంలో కాడి పడేశారు. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి సాయంతో కావలసినంత గందరగోళం సృష్టించి, అటు తర్వాత దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిసి అసెంబ్లీని రద్దు చేయించారు. తాను సూచించిన వ్యక్తే ఆపద్ధర్మ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనాల్సిన నాయకుడి సత్తా ఏపాటిదో తేలకుండా ఆయన చేసిన సిఫార్సును దేశాధ్యక్షుడు ఎలా ఆమోదించారన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దేశ విభజన పూర్తయి ఒక దేశంగా ఆవిర్భవించినప్పటినుంచీ పాకిస్తాన్‌ను సంక్షోభాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. అక్కడి రాజ్యాంగం దేశాన్ని మత రాజ్యంగా ప్రకటించటంలోనే ఈ సంక్షోభ పరంపరకు బీజాలున్నాయి. మెజారిటీ పౌరుల్లో ఉండే మత విశ్వాసాలను సొమ్ము చేసుకోవడానికి రాజకీయ పక్షాలు ఒకటిని మించి మరొకటి పోటీ పడే క్రమంలో వ్యవస్థలన్నీ అవినీతిలో కూరుకు పోయాయి. నిస్తేజంగా తయారయ్యాయి. దీన్ని సైన్యం తెలివిగా ఉపయోగించుకుంది. దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టు దేశ ప్రజలను నమ్మించి రేషన్ పంపిణీ మొదలుకొని అన్నిటిలోనూ తన ప్రమేయం ఉండేలా చూసుకుని రాజకీయ వ్యవస్థపై పట్టు బిగించింది. ఏ ప్రభుత్వాన్నీ పూర్తి కాలం అధికారంలో కొనసాగనీయకుండా చూడటం, సాధ్యపడకపోతే సైనిక కుట్రలో ప్రభుత్వాలను కూల్చడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం దానికి రివాజు. ఇన్ని దశాబ్దాలుగా అలవాటైన ప్రాణం ఇప్పుడు అందుకు భిన్నంగా తటస్థత పాటించిందని ఎవరూ నమ్మరు. కానీ ఆ మాట ఇమ్రాన్ ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారో అనూహ్యం. ఒకపక్క విపక్షాల అవిశ్వాసాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంపై పార్లమెంటులో గొడవ సాగుతుండగా మాయమైన ఇమ్రాన్.. ఆ తర్వాత టీవీల్లో ప్రత్యక్షమై విపక్షాల అవిశ్వాసం ఓడిపోయిందనీ, అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశాననీ, త్వరలో ఎన్నికలుంటాయనీ ప్రకటించడంతో వ్యవస్థలన్నీ నవ్వులపాలయ్యాయి. ఎటూ పదవి పోవడం ఖాయమనుకున్నప్పుడు హుందాగా అవిశ్వాసాన్ని ఎదుర్కొని ఉంటే ఇమ్రాన్‌కు కొద్దో గొప్పో గౌరవం దక్కేది. కానీ ఆయన రాకలోనే అప్రజాస్వామికత దాగి ఉన్నప్పుడు నిష్క్రమణ అందుకు భిన్నంగా ఉంటుందనుకోవడం దురాశ. ఇమ్రాన్ రాకపోకల మాటెలా ఉన్నా ఉక్రెయిన్ విషయంలో ఎవరి ఒత్తిళ్లకూ లొంగక స్వతం త్రంగా నిర్ణయం తీసుకుందని పదవి ఊడే వేళయిందని గ్రహించాక రెండు సందర్భాల్లో ఆయన భారత్‌ను కొనియాడటం గమనించదగ్గది. ఇది తమ సైన్యం అనుసరిస్తున్న వైఖరిపై ఎత్తిపొడుపు. తాను రష్యాను సమర్థించగా, సైన్యం మాత్రం అమెరికా అనుకూల వైఖరి తీసుకోవడాన్ని తట్టుకోలేక అది ఒత్తిళ్లకు తలొగ్గిందని చెప్పడానికి ఆయన భారత్‌ను ప్రశంసించారు. ఇమ్రాన్ వచ్చేనాటికే పాకిస్తాన్ రూపాయి సంక్షోభంలో చిక్కుకుంది. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు నానాటికీ పెరు గుతూ పోయాయి. చైనా ఆపన్న హస్తం అందిస్తుందని ఆశించినా మత ఛాందసవాదం ఉన్నకొద్దీ వెర్రితలలు వేస్తున్న తీరుతో అది వెనకడుగేసింది. పైగా దానికి చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీలే భయపెట్టేంతగా పెరిగాయి. మొదటినుంచీ వెనకుండి ఇమ్రాన్‌ను నడిపించి ఆర్థిక సంక్షోభానికి కారణమైన సైన్యం ఇప్పుడు ఆయన్ను బలిపశువును చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. పాకిస్తాన్ పరిణామాలపై అక్కడి సుప్రీంకోర్టు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆ తీర్పు ఎలా ఉన్నా వ్యవస్థలను ఆడిస్తున్న సైన్యం తీరు మారనంతవరకూ.. ప్రజలు చైతన్యవంతులు కానంతవరకూ పాకిస్తాన్ వ్యథ తీరదు. అది ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి నిత్యం పయనిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ విఫలరాజ్యంగానే మిగులుతుంది. -
గీత రాత మారేనా?
చిత్రకళ అనాది కళ. చరిత్రకు పూర్వయుగంలోనే మానవాళికి పట్టుబడిన ఆదిమ కళ. మాటలెరుగని తొలి మానవులు ఎరిగిన ఏకైక భావప్రకటన సాధనం చిత్రకళ. గీతల నుంచి పరిణామం చెందిన తర్వాతే రాతలు రాయడం మొదలైంది. గీతలతో చుట్టూ కనిపించే జంతుజాలాన్ని, పరిసరాలను చిత్రించే దశ నుంచి చిత్రలిపి ‘క్యూనిఫామ్’ దశకు చేరుకోవడానికి దశాబ్దాలో శతాబ్దాలో కాదు, ఏకంగా సహస్రాబ్దాల కాలం పట్టింది. ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 30 వేల ఏళ్ల నాడే మొదలైతే, క్రీస్తుపూర్వం 3,400 ఏళ్ల నాటికి గాని తొలినాటి లిపి రూపుదిద్దుకోలేదు. దాదాపు అప్పటి నుంచే భాషల పుట్టుక మొదలైంది. నానా భాషలూ, వాటికి రకరకాల లిపులూ వచ్చాయి. మనిషి మాటలూ రాతలూ నేర్చిన నాటి నుంచి నాగరికత పరిణామ క్రమంలో వేగం పెరిగింది. ముందొచ్చిన గీతల కంటే వెనకొచ్చిన రాతలే వాడి అనేంతగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. నాగరికతల వికాసం మొదలైన నాటి నుంచి పారిశ్రామిక విప్లవ కాలం వరకు, ఆ తర్వాత నేటి అత్యాధునిక కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా చిత్రకళలో అనేకానేక మార్పులు వచ్చాయి. మన దేశంలో ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 5,500 ఏళ్ల నాడే మొదలైంది. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బేట్కా గుహల్లోని చిత్రాలే ఇందుకు నిదర్శనం. సింధులోయ నాగరికత నాటి శిథిలాల్లో నైరూప్య చిత్రకళ ఆనవాళ్లూ ఉన్నాయి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఒకటో శతాబ్ది కాలానికి చెందిన అజంతా గుహల్లోని చిత్రకళ ఆనాటి బౌద్ధ ప్రాభవానికి అద్దంపడుతుంది. మొఘల్ పరిపాలన కాలం వరకు దేశం నలు చెరగులా మధ్యయుగాల చిత్రకళ వివిధ రీతుల్లో అభివృద్ధి చెందింది. మొఘల్ పాలన అంతమయ్యాక డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కంపెనీలు దేశంలోకి అడుగుపెట్టాక మన దేశంలో ఆధునిక చిత్రకళ మొదలైంది. బ్రిటిష్ హయాంలోనే మన దేశంలో చిత్రకళా అధ్యయన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో శాస్త్ర సాంకేతిక అధ్యయన కేంద్రాల అభివృద్ధితో పోల్చుకుంటే, కళా అధ్యయన కేంద్రాల అభివృద్ధి నామమాత్రమే! ఇక చిత్రకళపై తెలుగులో వచ్చిన పుస్తకాల సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చు. తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు ‘చిత్రలేఖనము’ పేరిట 1918లో రాసిన పుస్తకమే బహుశ తెలుగులో వచ్చిన తొలి ఆధునిక చిత్రకళా గ్రంథం. స్వాతంత్య్రా నికి ముందు కళాభిరుచి గల కొందరు బ్రిటిష్ దొరలు ఎందరో భారతీయ చిత్రకారులను ప్రోత్సహించారు. ఆనాటి సంస్థానాలు సైతం చిత్రకళకు ఊతమిచ్చాయి. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో అగ్రగణ్యుడైన రాజా రవివర్మ ట్రావెన్కోర్ సంస్థానాధీశుని ప్రోత్సాహంతో రాణించాడు. ఇద్దరు తెలుగు గురువుల వద్ద, బ్రిటిష్ చిత్రకారుడు థియోడార్ జెన్సన్ వద్ద రవివర్మ తైలవర్ణ చిత్రకళను నేర్చుకున్నాడు. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో రవివర్మ అగ్రగణ్యుడే గానీ, ఆద్యుడు కాదు. ఇప్పటి వరకు దొరుకుతున్న ఆధారాల ప్రకారం తెలుగువాడైన బ్రహ్మస్వామిని తొలి ఆధునిక భారతీయ చిత్రకారుడిగా చెప్పుకోవచ్చు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన బ్రహ్మయ్య గీసిన చిత్రాలు ఫ్రాన్స్ జాతీయ గ్రంథాలయం వెబ్సైట్లో కనిపిస్తాయి. ఆధునిక కాలానికి చెందిన మన తెలుగు చిత్రకారుల గురించి చెప్పుకుంటే కూల్డ్రే దొర ప్రోత్సాహంతోనే తొలితరం ఆధునిక చిత్రకారుల్లో ఒకరైన దామెర్ల రామారావు రాణించారు. దామెర్ల మిత్రుడు వరదా వెంకటరత్నం కూడా కూల్డ్రే ప్రోత్సాహంతోనే చిత్రకళలో రాణించారు. మశూచి బారినపడి దామెర్ల పిన్నవయసులోనే మరణించ డంతో రాజమండ్రిలో ‘రామారావు ఆర్ట్ గ్యాలరీ’ని ఏర్పాటు చేసినది వరదా వెంకటరత్నమే! గడచిన శతాబ్దిలో పలువురు తెలుగు చిత్రకారులు భారతీయ చిత్రకళను సుసంపన్నం చేశారు. అప్పట్లో ‘భారతి’ వంటి పత్రికలు చిత్రకళకు కూడా సముచిత ప్రాధాన్యమిచ్చేవి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న చిత్రకళాకారులు తెలుగునాట చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నా, వారి నైపుణ్యాన్ని, ప్రత్యేకతను బేరీజువేసి పాఠకులకు విశదీకరించగల కళావిమర్శకులే మనకు అరుదైపోయారు. తెలుగునాట వివిధ విశ్వవిద్యాలయాల్లో బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ కోర్సులు నిర్వహి స్తున్నా, ఏటా ఈ డిగ్రీలు తీసుకుని బయటకు వచ్చేవారిలో కనీసం ఒకరిద్దరయినా చిత్రకళా విమర్శ కులుగా తయారు కాలేకపోవడం విచారకరం. ప్రపంచంలోని ఉత్తమ చిత్రకళా విద్యాల యాల్లో తొలి ముప్పయి స్థానాల్లోనైనా మన దేశానికి చెందిన ఏ చిత్రకళా విద్యాలయానికీ చోటులేక పోవడం మరో విషాదం. చిత్రకళపై మనదేశంలో ఇంగ్లిష్ మ్యాగజైన్లు కొద్ది సంఖ్యలో వస్తున్నాయి. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో పూర్తిగా చిత్రకళకు పత్రికలేవీ లేవు. ఒకవేళ వచ్చినా, అవి మనుగడ సాగించగల పరిస్థితులూ లేవు. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటా ‘చిత్రసంతె’ జరుగుతుంది. ‘కరోనా’ వల్ల దీనికి రెండేళ్లు అంతరాయం కలిగినా, ఈసారి యథావిధిగా జరిగింది. వారం కిందట జరిగిన ‘చిత్రసంతె’లో దేశం నలుమూలల నుంచి వచ్చిన చిత్రకారులు పాల్గొన్నారు. కర్ణాటక చిత్రకళా పరిషత్ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాలూ నిర్వహిస్తే బాగుంటుంది. ఏటా దేశంలోని వివిధ నగరాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లే, ‘చిత్రసంతె’ వంటి కార్యక్రమాన్ని కనీసం దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహించేటట్లయితే వర్ధమాన చిత్రకారులకు కొంతైనా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గీత రాత మారుతుంది. -
పిల్లి వచ్చే... ‘వెలుగు’ భద్రం!
నూరు ఎలుకల్ని భోంచేసిన పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరిందట! రైతన్నపై మోయలేని కరెంటు భారాన్ని మోపినందుకు నిరసనగా ఊరేగిన జనంపై కాల్పులు జరిపి మూడు నిండు ప్రాణాలు బలిగొన్నారు. వారే ఇప్పుడు లాంతర్లు పట్టుకొని తిరుగుతున్నారు. గురువుకు నామం పెట్టి అతని సర్వస్వాన్ని దోచుకొని పోయిన ఆషాఢభూతి (పంచతంత్రం కథ) గురుపూజోత్సవం జరిపితే ఎట్లా వుంటుంది? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణ మైన ‘‘నమ్మకద్రోహులు, ఔరంగజేబులు’’ ఇప్పుడాయన ఆద ర్శాలకు స్తోత్ర కైవారాలు సమర్పిస్తుంటే అట్లానే ఉంటున్నది. ఇప్పుడు లాంతర్లు పట్టుకొని తిరుగుతున్నవారి చేతులకు రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఎవ్వరిదా రక్తం? ఎక్కడిదా రక్తం? చంద్రబాబు పోలీసులు పేల్చిన తుపాకీ తూటాలు నవయువకుడైన కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి దేహాన్ని చీల్చినప్పుడు స్రవించిన రక్తధార. ఇంకా వెచ్చగా వున్నది. చంద్రబాబు బందూకులకు బరిగీసి ఎదురొడ్డి నిలబడి నప్పుడు ప్రజాసంఘాల నేత కామ్రేడ్ రామకృష్ణ చిందించిన రక్తపు చారికలు. ఇంకా తడారలేదు. కాంగ్రెస్ కార్యకర్త బాలాస్వామి తనువు నుంచి పిండేసిన మండే నెత్తురు. ఇంకా చల్లారనే లేదు. ‘‘అమరుల రుధిర ధారలురా, ఆరని అగ్నిజ్వాలలురా, నాల్కలు చాచే నాగులురా, అవి అంతం చూసే ఆగునురా’’ అన్నాడొక కవి. ఇప్పుడు ఊరేగుతున్న బషీర్‌బాగ్ హంతకుల చేతుల కంటిన నెత్తుటి మరకలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి చేతుల్లోని గుడ్డి లాంతర్లను ఆ మరకలు వెక్కిరిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబుకు తనదైన ఒక ఫిలాసఫీ ఉండేది. ఆ ఫిలాసఫీని ఆయన బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఒక పుస్తకాన్ని కూడా అచ్చేసి పంచుకున్నారు. ఆ ఫిలాసఫీ ఆధారంగా చంద్ర బాబుకు ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే బిరుదును కూడా కమ్యూనిస్టు పార్టీలు ప్రసాదించాయి. వ్యవసాయం దండగ అనేది ఆ ఫిలాసఫీలో ఒక భాగం. అందుకు తగ్గట్టుగానే ఆయన రైతు వ్యతిరేక విధానాలను అవలంబించేవారు. వ్యవసాయంలో బతుకులను ఈదలేక పెద్దఎత్తున రైతులు ఆ రంగం నుంచి తప్పుకోవాలి. రెక్కలమ్ముకోవడం తప్ప మరే గత్యంతరమూ లేని రిజర్వు లేబర్‌గా వారు పట్టణ మార్కెట్లలో నిలబడి పోవాలి. పారిశ్రామికులకు, వ్యాపారులకు చీప్‌లేబర్ సుల భంగా దొరకాలి. ఇదీ ధ్యేయం. ఆ విధానానికి అనుగుణంగా వ్యవసాయ రంగంపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోయలేనంతగా మోపారు. సమయానికి బిల్లులు చెల్లించలేకపోతే స్టార్టర్లను, మోటర్లను విద్యుత్ సిబ్బంది ఎత్తుకెళ్లేవారు. ఇంటి తలుపుల్ని తీసుకొనిపోయిన ఉదాహరణలు కోకొల్లలు. రైతులపై దొంగ కేసులు బనాయిం చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అవమాన భారాలు తట్టు కోలేక ఎందరో రైతులు ఆత్మహత్యల బాటను ఎంచుకున్నారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలన్న డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకిం చారు. అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకొనే రోజులు వస్తాయని ఎగతాళి చేసేవారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఛార్జీల భారానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఒక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను శాంతిభద్రతల సమస్యగా పరిగణించాలని చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రదర్శన బషీర్‌బాగ్ ప్రాంతాన్ని చేరుకునేసరికి పోలీసు బల గాలు అడ్డగించాయి. హెచ్చరికలు లేకుండానే వారి తుపాకులు గర్జించాయి. చురుగ్గా ఉన్న కార్యకర్తలపై పోలీసులు గురి చూసి మరీ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారకుడైన జనరల్ డయ్యర్ లాంటివాడు మాత్రమే చేయగలిగిన అమానుషకాండ ఇది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. మొన్నటి ఎన్నికల్లో సంభవించిన ఓటమిని ఆ పార్టీ నిభాయించుకోలేక పోతున్నది. ప్రపంచంలోనే అతి పెద్దదయిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించింది. ప్రమోటర్ల పాలిటి కల్పతరువులాంటి ప్రాజెక్టది. అందులోని కుంభకోణానికి ఇప్పుడు అడ్డుకట్ట పడింది. తెలుగుదేశం పెద్దలకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. మనసు మనసులో ఉండటం లేదు. న్యాయాన్యాయ విచికిత్సతో పనిలేదు. ధర్మాధర్మ విచక్షణ జాన్తా నై. తక్షణ కర్తవ్యం అధికారంలోకి రావడం. రియల్ ఎస్టేట్ వెంచర్‌ను తాము ఉద్దేశించిన విధంగా పిండుకోవాలి. ఇందుకు ఏకైక మార్గం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెదించి తాము అధికారంలోకి రావడం. అలా జరగాలంటే దానికి రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి: ఏదో అద్భుతం జరిగి దేవుడు ప్రత్యక్షమైతే వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి తమను ఎక్కించాలని కోరుకోవడం. ఇదంత సులభం కాదు. రెండోది: ఎన్ని మాయోపాయాలైనా ప్రయోగించి ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించాలి. వచ్చే ఎన్నికల్లో గెలవాలి. ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లెవేస్తే అదే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్ ప్రాపగాండా సూత్రాన్ని ఆ పార్టీ బాగా వంట పట్టించుకున్నది. రియల్ ఎస్టేట్ వెంచర్లో రైతు సెంటిమెంట్‌ను రంగరించింది. రక్త కన్నీరు నాటకాన్నీ, రైతుబిడ్డ సినిమానూ ఏకకాలంలో ప్రదర్శించింది. అనుకున్నంతగా రక్తి కట్టలేదు. రోజుకో బట్టను కాల్చి అధికార పార్టీ మీద వేయడం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో దానికో కరెంటు తీగ దొరికింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు పెరుగు తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు పొరుగు రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో ఈ నెల నుంచి ఛార్జీలు పెరుగు తున్నాయి. ఆ పెంపు మా దగ్గరే తక్కువని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో రూ. 1,400 కోట్లను మాత్రమే పెంచు తున్నామనీ, మరో 700 కోట్లు ట్రూఅప్ భారమనీ, ఈ రెండు భారాలూ చంద్రబాబు పాప ఫలితాలనీ ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. కనీసం అరడజనుసార్లు సుదీర్ఘమైన వివరణలు ఇచ్చారు. వారి వాదాన్ని బలపరిచే గణాంకాలను కూడా విడుదల చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ఇందులోని లోతుపాతులపై తార్కికంగా చర్చించే పరిస్థితి లేదు. యురేకా! కరెంటు తీగ దొరికింది. పట్టండి లాంతర్లు.. ఎత్తండి గొంతులు అన్నదొక్కటే ప్రస్తుతం తెలుగుదేశం క్యాంప్ వ్యూహం. వీలైతే విష్ణువర్ధన్ రెడ్డినీ, రామకృష్ణనూ మరిచిపోయి కమ్యూనిస్టులూ, బాలా స్వామిని మరిచిపోయి కాంగ్రెస్ వారూ తమతో కలిసి ఈ పోరాటంలో పాల్గొనాలని బహుశా నేడో రేపో తెలుగుదేశం పార్టీ ఒక పిలుపును కూడా ఇవ్వవచ్చు. మన దగ్గర జరిగే విద్యుదుత్పత్తిలో థర్మల్‌దే పెద్ద వాటా. ఇది బొగ్గు ఆధారిత ఉత్పత్తి. మార్కెట్లో బొగ్గు ధరలు గడిచిన కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. ఏడెనిమిదేళ్ల కిందట ఒక టన్ను విదేశీ బొగ్గు 7 వేల రూపాయలకు దొరికేది. ఇప్పుడది రూ. 18 వేల పైమాటే. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగింది. మనం ఉత్పత్తి చేసుకున్న లేదా కొనుగోలు చేసిన థర్మల్, హైడల్ మాత్రమే సరిపోదు. సంప్రదాయేతర ఇంధనాన్ని ప్రోత్సహించడానికి సౌర, గాలిమరల విద్యుత్తును కూడా కొంతమేర కొనుగోలు చేయాలి. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ సోలార్, విండ్ ప్లాంట్లతో కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నది. ఈ ఒప్పందాలను పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు)లు అంటున్నారు. ఈ పీపీఏలలో బాబు ప్రభుత్వం ఒక మతలబు చేసింది. అప్పటికి మార్కెట్లో ఉన్న ధర కంటే రెట్టింపు ధరకు పీపీఏలు కుదుర్చుకున్నది. ఈ రెట్టింపు ధరను పాతికేళ్లపాటు భరించాలి. ఒప్పందం కుదుర్చుకున్నది కూడా సెకీ (ఎస్ఈసీఐ) లాంటి ప్రభుత్వ సంస్థతో కాదు. ప్రైవేట్ సంస్థలతో. ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా ఒప్పందం చేసుకున్నా రంటే గూడుపుఠాణీ ఉన్నట్టే కదా! ఈ పొరపాటును సరిదిద్ద డానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒప్పందం ప్రకారం యూనిట్‌కు రూ. 4.88 కాకుండా మార్కెట్ ధర ప్రకారం యూనిట్‌కు రూ. 2.43 చెల్లిస్తామని ప్రతిపాదించింది. ప్రైవేట్ వాళ్లు వచ్చే లాభాన్ని ఎందుకు వదులుకుంటారు! వాళ్లు కోర్టుకెక్కారు. ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆమేరకే చెల్లింపులు చేయాలని కోర్టు చెప్పింది. ఫలితంగా విద్యుత్ పంపిణీ చేసే సంస్థలైన డిస్కమ్‌లపై 7,866 కోట్ల రూపాయల భారం పడింది. నిరంతరం విద్యుత్ సరఫరా (24గీ7) చేయడం కోసం బహిరంగ మార్కెట్లో యూనిట్‌కు ఐదు రూపాయల చొప్పున చెల్లించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అట్లాగే వ్యవసాయ రంగానికి పగటి పూటే తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తామన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ అంశాన్ని సమీక్షించడం జరి గింది. ఒకవేళ అవసరమైనంత విద్యుత్ అందుబాటులో ఉన్నా కూడా తొమ్మిది గంటలపాటు పగటిపూట నిరంతరాయంగా సరఫరా చేయడానికి అవసరమైన ఫీడర్లు వగైరాలతో కూడిన మౌలిక వ్యవస్థ అందుబాటులో లేని విషయం బయటపడింది. రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తానని చెప్పడమే తప్ప అందుకు అవసరమైన మౌలిక వసతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. ఒక నిర్ణీత కాలపరిమితిని నిర్ణయించుకొని ఈ రంగంపై వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. ఈరకంగా వేలకోట్ల భారం పడినప్పటికీ అందులో రూ.1,400 కోట్లను మాత్రమే వినియోగ దారునికి బదిలీ చేశామన్నది డిస్కమ్‌ల వాదన. ట్రూఅప్ ఛార్జీల పేరుతో మరో 700 కోట్ల పద్దు ఉన్నది. దీన్ని సర్దుబాటు ఛార్జీలు అంటారు. రాబోయే ఏడాదికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలు ముందస్తు అంచనాలు వేసుకుంటాయి. తమ పరిధిలో వివిధ రంగాల వారీగా ఎంత మేరకు విద్యుత్ డిమాండ్ ఉండవచ్చును? దాన్ని ఎక్కడెక్కడి నుంచి (థర్మల్, హైడల్, గ్యాస్, విండ్, సోలార్) ఎంతమేరకు సమీకరించుకోవాలి? ఎంతమేరకు ఖర్చవుతుంది. సరఫరా – పంపిణీ వ్యయమెంత ఉండవచ్చును? ఏ కేటగిరీకి ఎంత రేటుకు విద్యుత్‌ను సరఫరా చేయాలి? వగైరా లెక్కలతో వార్షిక ఆదాయ–వ్యయ నివేదికల (ఏఆర్ఆర్)ను విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) రూపొందిస్తాయి. వాటిని విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పిస్తాయి. నివేదికలను అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పుచేర్పులతో గానీ, యథాతథంగా గానీ చార్జీలను నిర్ణయిస్తూ మండలి (ఈఆర్సీ) ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఏడాది గడిచిన తర్వాత చూసినప్పుడు ఆదాయ వ్యయాలు అంచనాల మేరకు ఉండవచ్చు లేదా వ్యయం పెరగ వచ్చు. అట్లా ఖర్చు పెరిగినప్పుడు ట్రూ అప్ పేరుతో పెరిగిన ఖర్చును వినియోగదారులకు బదిలీ చేసి సర్దుబాటు చేస్తారు. ఒకవేళ ఖర్చు తగ్గినట్టయితే ట్రూ డౌన్ పేరుతో తగ్గిన మేరకు వినియోగదారులకు జమ చేయాలి. ఇప్పుడు ట్రూ అప్ పేరుతో 700 కోట్లను ఏపీఈఆర్సి వినియోగదారులపై వేసింది. ఈ ట్రూ అప్ ఛార్జీల జన్మ వృత్తాంతాన్ని ఒకసారి పరిశీలించాలి. 2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్ర బాబు ప్రభుత్వం రూ. 3,977 కోట్ల ట్రూ అప్ క్లెయిమ్‌లను పరిష్కరించకుండా వదిలివేసింది. ప్రభుత్వ రంగంలోని జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేసి అధిక ధరలకు ప్రైవేట్ వాళ్ల నుంచి కొనుగోలు చేయించింది. దీంతో విద్యుత్ వ్యయం పెరిగి డిస్కమ్‌ల నడ్డి విరిగినట్లయింది. ఈఆర్సీ నిర్దేశించిన సబ్సిడీని కూడా చంద్ర బాబు ప్రభుత్వం భరించలేదు. ఫలితంగా వర్కింగ్ క్యాపిటల్ కోసం భారీగా రుణాలు తీసుకోవలసి వచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి డిస్కమ్‌ల అప్పులు 29,703 కోట్లు. ఆయన దిగిపోయే నాటికి 68,596 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ హామీ లేకుండా తీసుకున్న అప్పులు కూడా మూడు రెట్లు పెరిగాయి. డిస్కమ్‌లు తీవ్ర సంక్షోభంలోకి కూరుకునిపోయాయి. బాబు వాటి పుట్టి ముంచారు. ఇప్పుడు వాటిని గట్టెక్కించడానికి కొంతమేరకు ట్రూఅప్ అవసరమైందని ప్రభుత్వం చెబుతున్నది. చంద్రబాబు ఐదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ట్రూఅప్ ఛార్జీలు వేయకుండా మేనేజ్ చేయగలిగారని తెలుగు దేశం పార్టీ వారు చెపుతున్నారు. చంద్రబాబు ఛార్జీలు పెంచ లేదన్నది తప్పు. ఆయన పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో పదమూడుసార్లు ఛార్జీలు పెంచారు. ఇందులో ఎక్కువసార్లు గృహవినియోగంపైనే భారం మోపారు. కొన్ని సార్లు మాత్రమే గృహ వినియోగదారుల జోలికి పోకుండా పారిశ్రామిక – వాణిజ్య వర్గాల ఛార్జీలు పెంచారు. చివరిసారి అధికారంలో ఉన్నప్పుడు ట్రూఅప్ ఛార్జీలు వేయకుండా ఎందుకున్నారనే ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం వినబడుతున్నది. చంద్రబాబు తొలి విడత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచే విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ఉద్దేశంతో ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలోనే విద్యుత్ బోర్డు ట్రాన్స్‌కో–జెన్‌కోలుగా ముక్కలైంది. వీటిని పూర్తిగా ప్రైవేటీ కరించే కర్తవ్యాన్ని ఆయన తొమ్మిదేళ్లకాలంలో చేయలేక పోయారు. కానీ ఆ కోర్కె మిగిలే ఉన్నది. వాటిని నిండా మునిగేలా సంక్షోభంలోకి నెట్టివేసి ఆ తర్వాత కారుచౌక బేరంతో ప్రైవేట్‌కు కట్టబెట్టే ఆలోచనతోనే చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేశారని వామపక్ష విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ఫిలాసఫీని అర్థం చేసుకున్న వారికి ఈ వాదనలో నిజమున్నదనే అభిప్రాయం కలుగుతుంది. విద్యుత్ రంగ సంస్కరణల క్రమంలో లక్షలాది రైతు కుటుంబాలను ‘షాక్’కు గురిచేసిన పాలకుడు చంద్రబాబు. అంతంతమాత్రపు వ్యవసాయంలో కరెంటు బిల్లుల కల్లోలం రేపిన రోజులు ఆయన హయాంలోనివే. బషీర్‌బాగ్ రక్తపు మరకల చేతుల్లో జెండాలు పట్టుకొని ఉద్యమాలు చేస్తే జనం హర్షించరు. తెలుగుదేశం పార్టీ ‘నలభయ్యో వార్షికోత్సవాలు’ ఈ వారమే హైదరాబాద్‌లో జరిగాయి. ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో పయనిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటన ఎటువంటి వ్యాఖ్యానం అవసరం లేని ఒక పెద్ద జోక్. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని మరొక్కసారి డిమాండ్ చేశారు. ఆయన మాటల్లోనే చంద్రబాబు రాష్ట్రపతులను ఎంపిక చేసిన వ్యక్తి. ప్రధానులను ఎన్నిక చేయడంలో చక్రం తిప్పిన వాడు. ఒక్క భారతరత్న అవార్డును ఎన్టీఆర్‌కు ఇప్పించలేక పోయాడా అన్న అనుమానం సభికుల్లో పొడసూపకుండా ఉంటుందా? ఈ సభలో చంద్రబాబు చేసిన అతి ముఖ్యమైన రాజకీయ ప్రకటన ఒకటుంది. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లను యువతకే కేటాయిస్తారట. ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోకి సరైన అర్థంలోనే వెళ్లింది. 40 శాతం టిక్కెట్లు యువతకు ఇస్తారు. ఇంకో 40 శాతం పొత్తుల పేర్లతో ఇతర పార్టీలకు ఇస్తారు. పాత కాపులకు మిగిలేది 20 శాతం మాత్రమే. ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా లోకేశ్‌బాబు నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు పార్టీలో ఇరవైశాతం మాత్రమే మిగులుతారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సాహసోపేత నిర్ణయం
అస్సాం, మేఘాలయ మధ్య సరిహద్దు ప్రాంతాల ఒప్పందం కుదిరిన నాలుగు రోజుల్లోనే ‘ఈశాన్యం’ నుంచి మరో మంచి కబురు వినబడింది. అస్సాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అమల్లో ఉంటున్న సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని చాలా ప్రాంతాల్లో ఉపసంహరించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావలసి ఉంది. అస్సాంలో మొత్తం 23 జిల్లాల్లో ఈ చట్టాన్ని పూర్తిగా, ఒక జిల్లాలో పాక్షికంగా ఉపసంహరించు కుంటున్నారు. గత డిసెంబర్లో సైన్యం ఒక వాహనంపై గురిచూసి కాల్పులు జరిపిన ఉదంతంలో 14 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయాక ఈ చట్టం అమలు నిలిపేయాలంటూ ఉద్యమించిన నాగాలాండ్‌లో మూడు జిల్లాల్లో పూర్తిగా, నాలుగు జిల్లాల్లో పాక్షికంగా ఉపసంహరిస్తున్నారు. తరచి చూస్తే ఇక్కడ 25 శాతం ప్రాంతం మాత్రమే ఆ చట్టం నుంచి విముక్తి పొందుతుంది. మణిపూర్‌లో ఆరు జిల్లాల్లో పాక్షికంగా తొలగిస్తున్నారు. కొండ ప్రాంత జిల్లాలన్నీ ఈ చట్టం నీడలోనే ఉంటాయి. బయటినుంచి చూసేవారికి ఒక చట్టం అమలును పూర్తిగానో, పాక్షికంగానో తొలగించడం పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ రాష్ట్రాల పౌరులకు మాత్రం ఇది ఊహకందని అసాధారణ పరిణామం. వారికిది అరవైయ్యేళ్లుగా గుండెల మీది కుంపటి. హక్కుల సంఘాల నేతలు భిన్న సందర్భాల్లో చెప్పినట్టు ఈ చట్టం మృత్యువు పడగనీడ లాంటిది. ఆ పరిధిలో జీవించేవారు ఎవరైనా చిత్రహింసలు అనుభవించాల్సి రావొచ్చు. ఏ పౌరుడి దగ్గరైనా ఆయుధాలున్నాయని లేదా మిలి టెంట్లు తలదాచుకుని ఉండొచ్చని సాయుధ దళాలకు ‘సహేతుక మైన సంశయం’ వస్తే వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయొచ్చు. ప్రమాదకర వ్యక్తిగా అనుమానిస్తే కాల్చి చంపొచ్చు. సైన్యా నికి మాత్రమే కాదు... ఆ మాదిరి విధులు నిర్వర్తించే పోలీసులకు సైతం ఈ అధికారాలన్నీ ఉంటాయి. చట్టంలోని సెక్షన్ 3 కింద ఒక ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన మరుక్షణం నుంచి ఈ అపరిమిత అధికారాలు దఖలు పడతాయి. అందుకే దీన్ని స్వాతంత్య్రానంతరం తీసు కొచ్చిన అత్యంత కఠినమైన చట్టంగా అభివర్ణిస్తారు. కల్లోలిత ప్రాంతాల్లో నకిలీ ఎన్కౌంటర్లు, మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని తరచు ఆరోపణలు రివాజు. ఇదెంతవరకూ వచ్చిందంటే 2004లో మణిపూర్‌లో తంగజం మనోరమ చాను అనే మహిళను అరెస్టుచేసి చంపేశా రని ఆగ్రహించిన మహిళలు సైనికులు బస చేసిన భవనం ముందు వివస్త్రలుగా నిరసనకు దిగారు. ఈ చట్టం రద్దు కోసమే మణిపూర్‌కు చెందిన ఇరోం షర్మిల పదహారేళ్లపాటు నిరాహార దీక్ష చేశారు. సుప్రీంకోర్టులో 2012లో బూటకపు ఎన్కౌంటర్లపై పిటిషన్ దాఖలైన తర్వాతే చట్టం ఎంత కఠినమైనదో దేశమంతటికీ అర్థమైందని చెప్పాలి. 1979 మే మొదలుకొని 2012 వరకూ జరిగిన నకిలీ ఎన్కౌంటర్లలో తమ ఆప్తులు 1,528 మంది బలయ్యారని ఆ పిటిషన్ దాఖలు చేసిన వివిధ కుటుంబాలవారు ఆరోపించారు. వీరంతా మణిపూర్‌కు చెందినవారు. ఇందులో వాస్తవాలు నిర్ధారిం చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆరు ఉదంతాలను ఎంపికచేసి వాటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలంటూ ఒక కమిషన్‌ను నియమించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించాక ఆ ఉదం తాల్లో మరణించినవారు అమాయకులేనని కమిషన్ నిర్ధారించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో, మాజీ ఐపీఎస్ అధికారి ఏకే సింగ్ అందులో సభ్యులు. సాయుధ దళాల చట్టంకింద విధులు నిర్వర్తిస్తుం డగా ఇవి చోటుచేసుకున్నాయి గనుక, తమపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లు కొట్టేయాలని 350 మంది జవాన్లు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శత్రువులని అనుమానం కలిగినంత మాత్రాన, ఆరోపణలొచ్చినంత మాత్రాన పౌరులను కాల్చిచంపడమంటే ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్టేనని 2016లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అధికారంలోకొచ్చాక చట్టాన్ని రద్దుచేస్తామని లేదా సరళీకరిస్తామని చెప్పిన యూపీఏ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. చట్టం రద్దు తక్షణావసరమని కమిషన్ సిఫార్సు చేసింది. అన్ని వర్గాలనుంచీ మద్దతు లభించినా సైన్యం కాదనడంతో యూపీఏ వెనకడుగేసింది. తొలుత 2015లో త్రిపురలో మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం ప్రభుత్వం ఈ చట్టం అమలు నిలిపేసి చరిత్ర సృష్టించగా, తాజాగా మూడు రాష్ట్రాల్లో గణనీయమైన ప్రాంతాల్లో చట్టం ఉపసంహరించి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తాము ఉపసంహరించాలనుకుంటున్నా సైన్యం వినడం లేదని యూపీఏ ఏలుబడిలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం సిగ్గు విడిచి చెప్పడం ఎవరూ మరిచిపోరు. సంకల్పశుద్ధి ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని పక్షాలనూ ఒప్పించడం అసాధ్యమేమీ కాదని కేంద్రం నిరూపించింది. చట్టాన్ని పౌరులు గౌరవించాలంటే ఆ చట్టం పౌరులపట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు అన్నిచోట్లా ప్రధాన మిలిటెంట్ బృందాల ప్రభావం మునుపటితో పోలిస్తే దాదాపు లేనట్టే. పైగా అవన్నీ కేంద్రంతో భిన్న సందర్భాల్లో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒకటి రెండు సంస్థలు ఉనికి చాటుకుంటున్నా వాటికి ప్రజాదరణ లేదు. ఈశాన్యంలో ఇతరచోట్లా, జమ్మూ, కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం సమీప భవిష్యత్తులో ఈ చట్టం రద్దుకు అనువైన పరిస్థితులు ఏర్పడ తాయనీ, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందనీ ఆశించాలి. -
జవాబుదారీతనం ఏదీ?
నేరగాళ్లను సత్వరం పట్టుకునేందుకు, నేరాలను సమర్థంగా అరికడుతుందని చెబుతూ మొన్న సోమవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేర శిక్షాస్మృతి(గుర్తింపు) బిల్లుకు సహజం గానే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ బిల్లు రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను బేఖాతరు చేస్తున్నదని విపక్షాలు ఆరోపించడంతో బిల్లు ప్రవేశానికి ఓటింగ్ నిర్వహించాల్సివచ్చింది. ప్రభుత్వానికి మెజారిటీ ఉంది గనుక బిల్లు సభాప్రవేశం చేసింది. సమాజంలో నేరాలు పెరుగుతూ పోవడం, నేరగాళ్లు తప్పించుకు తిరగడం ఆందోళనకరమే. అందులో సందేహం లేదు. దేశానికి కొత్త కొత్త రూపాల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పుడు కఠిన చట్టాలు అవసరమే కావొచ్చు. కానీ తగిన చట్టాలు లేకనే పరిస్థితులు దిగజారుతున్నాయని ఎవరైనా భావిస్తే పొరపాటు. దర్యాప్తు విభాగాల పని తీరు నాసిరకంగా ఉండటం, ఆ విభాగాలపై రాజకీయ పరమైన ఒత్తిళ్లుండటం అందుకు కారణాలు. మరోపక్క చట్టాల ప్రకటిత లక్ష్యాలను గాలికొదిలి ప్రభుత్వాలు వాటిని దుర్వినియోగం చేసిన సందర్భాలు కోకొల్లలు. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవడానికి, సత్వరం నేరాల గుట్టు వెలికితీయడానికి తాజా బిల్లులో నిబంధనలు రూపొందించామని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే అమల్లో ఉన్న 1920 నాటి ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చే బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు చట్టసభల్లో ప్రభుత్వాలు చేసే గంభీరమైన ఉపన్యాసాలకూ, ఆ బిల్లుల్లో పొందుపరిచే వాస్తవాంశాలకూ తరచుగా సంబంధం ఉండదు. చట్టాలు దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నా మని ప్రతిసారీ ప్రభుత్వాలు చెబుతాయి. ఈ విషయంలో ఈ దేశ పౌరులకు కావలసినంత అనుభవం ఉంది. ఇందిరాగాంధీ హయాంలో 1980లో వచ్చిన జాతీయ భద్రతా చట్టం(నాసా), 1985లో రాజీవ్‌గాంధీ హయాంలో తెచ్చిన ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం(టాడా), 2002లో వాజపేయి హయాంలో ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన ఉగ్రవాద నిరోధక చట్టం(పోటా) ఇందుకు ఉదాహరణలు. టాడా దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు రావడంతో దాన్ని పునరుద్ధరించరాదని 1995లో అప్పటి పీవీ ప్రభుత్వం నిర్ణయించింది. 2004లో యూపీఏ సర్కారు పోటా చట్టాన్ని రద్దు చేసింది. వీటిన్నిటికన్నా ముందే 1967లో ఇందిర ప్రభుత్వం తీసు కొచ్చిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) 2012లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం, ఆ తర్వాత 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సవరణలతో మరింత పదును తేలి ప్రస్తుతం అమలవుతోంది. ఈ చట్టాలన్నీ నేరగాళ్లని భావించినవారిని దీర్ఘకాలం జైళ్లలో ఉంచేందుకు తోడ్పడ్డాయి. వేలాదిమంది అమాయకులు జైళ్ల పాలయ్యారని విమర్శలు వెల్లువెత్తగా, కఠినశిక్షల మాట అటుంచి అత్యధిక కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. రాజకీయ అసమ్మతిని అణచి వేసేందుకూ, ప్రజలను భయపెట్టేందుకూ ప్రభుత్వాలు ఈ చట్టాలు తెస్తున్నాయని బిల్లులపై చర్చ జరిగినప్పుడల్లా విపక్షాలు విమర్శించేవి. 1967లో యూఏపీఏపై వాజపేయి విమర్శ ఇక్కడ ప్రస్తావనార్హం. దేశ ప్రజల్లో నమ్మకం కోల్పోయిన గుప్పెడుమంది ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు. భీమా కోరెగావ్ కేసులో అదే చట్టంకింద అరెస్టయి మూడేళ్లుగా జైళ్లలో మగ్గు తున్న మేధావులు, రచయితల పరిస్థితి చూస్తే చట్టాల అమలు ఎలా ఉంటున్నదో అర్థమవుతుంది. నేర శిక్షాస్మృతి బిల్లు చట్టమైతే శిక్షపడిన ఖైదీలనుంచి మాత్రమేకాక అరెస్టయినవారి నుంచి, ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నవారి నుంచి, ‘ఇతరుల నుంచి’ భౌతిక, జీవసంబంధ నమూ నాలు సేకరించవచ్చు. ‘ఇతరుల’ కింద ఎవరినైనా చేర్చవచ్చు. అంటే లాకప్‌లోకి వెళ్లాల్సివచ్చిన ప్రతి ఒక్కరి నుంచీ నమూనాలు సేకరించే అధికారం ప్రభుత్వాలకు దఖలు పడుతుంది. ఈ ‘నమూనాల’ పరిధిలోకొచ్చేవి ఏమిటన్న వివరణ లేదు. ప్రస్తుత చట్టంలో వేలి ముద్రలు, కాలి ముద్రలు మాత్రమే తీసుకోవచ్చు. ఆ నిబంధన కూడా శిక్ష పడినవారికే వర్తిస్తుంది. జీవసంబంధ నమూనాలంటే రక్తం, జుట్టు, డీఎన్ఏ, ఐరిస్ వగైరాలు ఏమైనా ఉండొచ్చు. పైగా ఈ సేకరణకు ప్రస్తుతం మేజిస్ట్రేట్ అనుమతి అవసరం అవుతుండగా... తాజా బిల్లు చట్టమైతే రాష్ట్ర ప్రభుత్వాధి కారి అనుమతి సరిపోతుంది. ఏం సేకరించాలో హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి నిర్ణయిస్తారు. సేకరణను ప్రతిఘటిస్తే మూడునెలల జైలుశిక్షను ప్రతిపాదించారు. న్యాయవ్యవస్థ అదుపూ, అజ మాయిషీ ఉన్న చట్టాలే దుర్వినియోగమవుతున్న ఉదంతాలు కోకొల్లలుగా కనబడుతుండగా... ఆమాత్రం రక్షణ కూడా లేని చట్టాలు చివరకు ఎటు దారితీస్తాయో సులభంగా గ్రహించవచ్చు. పైగా సేకరించిన నమూనాలు దుర్వినియోగం కావన్న గ్యారెంటీ ఏమీ లేదు. అసలు మైనర్ల నుంచి ఇలా సేకరించవచ్చునా అన్న వివరణ లేదు. మన దేశంలో డేటా పరిరక్షణ గాల్లో దీపంగా ఉన్న వర్త మానంలో సేకరించిన నమూనాలు దారి తప్పితే? జవాబుదారీతనం నిర్ణయించకుండా, బాధ్యులకు శిక్షేమిటో చెప్పకుండా వదిలేస్తే పౌరుల గోప్యత ఏం కావాలి? వారికి లభించే ఉపశమన మేమిటి? నేరాలను అరికట్టాల్సిందే. సమాజంలో అశాంతి సృష్టించే శక్తుల ఆటకట్టాల్సిందే. కానీ ఆ పేరు మీద తీసుకొచ్చే చట్టాల్లో స్పష్టత లోపిస్తే, ప్రభుత్వాలకు జవాబుదారీతనం లేకుంటే అది అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు శరాఘాతమవుతుంది. -
ప్రమాదకర పోకడలు
ఇది భగత్ సింగ్ బలిదానం చేసిన మాసం. తమకు కంటి నిండా కునుకు లేకుండా చేసినందుకు కక్ష బూని 23 ఏళ్ల చిరుప్రాయంలోనే ఈ వీరుణ్ణి పరాయి పాలకులు చిదిమేశారు. మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ జైల్లో గడిపినప్పుడు దేశంలో సాగుతున్న మత ఘర్షణల సంగతి విని ఆయన ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలు ఇప్పటికీ అందరూ స్మరించుకోదగ్గవి. ‘వర్తమాన స్థితిగతులను చూస్తుంటే ఈ దేశం ఏమైపోతుందోనన్న ఆవేదన కలుగుతోంది. నా కళ్ల వెంట రక్తాశ్రువులు స్రవిస్తున్నాయి’ అని ఆయన అన్నాడు. మన ఇల్లు, మన చదువు మనకు వివేకం నేర్పించలేనప్పుడు కనీసం భగత్ సింగ్ వంటి నిష్కళంక దేశభక్తుల పలుకులైనా స్ఫురణకు రావాలి. కానీ ఇతరత్రా రోజుల మాట అటుంచి ఆయన బలిదానం చేసిన మాసంలోనైనా కొందరికి యుక్తాయుక్త విచక్షణ ఉండటం లేదని కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటకలో ఆలయ పరిసరాల్లో అన్య మతస్తుల దుకాణాలుండటానికి వీల్లేదని హిందూత్వ సంఘాలు వీరంగం వేస్తుంటే... కేరళలో ఒక దేవస్థానం బోర్డు హైందవేతర మహిళన్న కారణంతో ఒక భరతనాట్య కళాకారిణి ప్రదర్శనను అడ్డుకుంది. దుకాణదారులను మతం ప్రాతిపదికన దూరంపెట్టే పోకడల్లో తాము జోక్యం చేసుకోలేమని సాక్షాత్తూ ప్రభుత్వమే కర్ణాటక అసెంబ్లీలో భగత్‌సింగ్ వర్ధంతి రోజున ప్రకటించింది. ఆ మర్నాటినుంచి హిందూత్వ సంస్థలు మరింతగా రెచ్చిపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలో మొదలైన ఈ తంతు రాష్ట్రమంతా విస్తరిస్తోంది. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారుంది. అక్షరాస్యతలో ఆ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. కానీ మత వివక్ష మాత్రం అక్కడ రాజ్య మేలుతోంది! ఈ దేశ చరిత్ర తిరగేస్తే తమ తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికీ సాధారణ పౌరు లంతా సామరస్యంతో, సుహృద్భావంతో మెలగడం కనబడుతుంది. ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొనడం, ఊరేగింపులు, ఉత్సవాల్లో భాగస్తులు కావడం దర్శనమిస్తుంది. ఈ ఆచరణలో నుంచే మన రాజ్యాంగంలోని సెక్యులర్ భావనలు మొగ్గతొడిగాయి. రాజ్యాంగ నిర్ణాయక సభలోని సభ్యుల్లో అత్యధికులు అన్ని ఒత్తిళ్లనూ అధిగమించి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు ప్రాతిపదికగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ రాజకీయ పక్షాల నాయకులు, పాలకుల్లో కొందరు దీనికి తూట్లు పొడిచే దురాలోచన చేస్తున్నారు. అన్య మతస్తులపై లేనిపోని నిందలు మోపి, పరమత విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను విడదీసి తమ అధికారం శాశ్వతం చేసుకోవాలని కలగంటున్నారు. ఇది ఆందోళన కలిగించే పరిణామం. కర్ణాటకలో హిజాబ్ వివాదం రేపి నెల్నాళ్లు దాటింది. ఆ వివాదం పర్యవసానంగా వేలాదిమంది ముస్లిం బాలికల చదువులు ఆగిపోయాయి. వార్షిక పరీక్షలు రాద్దామనుకునే సమయానికి ఈ అనవసర వివాదాన్ని సృష్టించడం వల్ల వారికి ఏడాది చదువూ వృధా అయింది. తమ చర్యలు బేటీ పఢావో, బేటీ బచావో స్ఫూర్తికి విరుద్ధమైనవని కూడా అక్కడి పాలకులకు తోచలేదు. ఆ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఇప్పుడు చిరు వ్యాపారులను మత ప్రాతిపదికన వేరు చేసి కొందరికి అవకాశాలు నిరాకరిస్తున్నారు. కర్ణాటకలో మార్చి మొదలుకొని మే నెల వరకూ వివిధ ఆలయాల్లో జాతరలు జరుగుతాయి. ఇందులో వేలాదిమంది భక్తులు పాల్గొంటారు. అలాంటి సమ యాల్లో వివిధ రకాల వస్తువులు అమ్మి లాభపడదామని ఎవరైనా ఆశిస్తారు. కానీ చాలా ఆలయాలు ముస్లిం దుకాణదారులకు డిపాజిట్లు వెనక్కిస్తున్నాయి. హిందూత్వ సంస్థల ఒత్తిళ్లతో ఇలా చేయక తప్పడం లేదని ఆలయ నిర్వాహకులు తమకు చెబుతున్నారని ముస్లింలు అంటుండగా, వారు స్వచ్ఛందంగా డిపాజిట్లు వెనక్కి తీసుకుంటున్నారని ఆలయాల బాధ్యులు చెబుతున్నారు. ఇలాంటి భయానక వాతావరణానికి దోహదపడినందుకు కాస్తయినా సిగ్గుపడాలన్న ఇంగిత జ్ఞానం పాలకు లకు లేదు. ఈ మతిమాలిన ఆలోచనలపై సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినబడటం బీజేపీలో కనిపిస్తున్న సరికొత్త పోకడ. ముస్లిం దుకాణదారులపై నిషేధం విధించడం పిచ్చితనమని పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ విశ్వనాథ్, పార్టీ శాసనసభ్యుడు అనిల్ బెనకే విమర్శించారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్య స్ఫూర్తి అంతో ఇంతో మిగిలి ఉన్నదని ఇలాంటి స్వరాలు భరోసా ఇస్తాయి. మన దేశ పౌరులు కోట్లాదిమంది తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికీ ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛగా వ్యాపార వ్యవహారాలు సాగిస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. అసంబద్ధ ఆలోచనలు చేసేవారికి ఈ వాస్తవాలు కూడా అర్థమ వుతున్నట్టు లేదు. కేరళలో భరతనాట్య కళాకారిణి మాన్సియా జన్మతహా ముస్లిం. భరతనాట్యంలో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేసిన మాన్సియా ఆ విశ్వవిద్యాలయానికే టాపర్‌గా నిలిచారు. ఆమె, ఆమె సోదరి భరతనాట్యాన్ని అభ్యసించడం ద్వారా మత విరుద్ధమైన పోకడలు పోతున్నారని ముస్లిం మత పెద్దలు ఆగ్రహించి చాన్నాళ్ల క్రితమే ఆ కుటుంబాన్ని వెలివేశారు. ఇన్నాళ్లకు హిందూ ఛాందసులు కూడా అదే బాటలో ఆమెకు అవకాశాన్ని నిరాకరించారు. తాను హిందువును పెళ్లాడిన వైనాన్నీ,ప్రస్తుతం హేతువాదిగా ఉంటున్న వాస్తవాన్నీ చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ‘మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును’ అన్నాడు మహా కవి గురజాడ. కానీ కాలం గడుస్తున్నకొద్దీ మన అజ్ఞానం ఊడలు వేస్తున్న ధోరణులు కనబడు తున్నాయి. ఇది ప్రమాదకరం. -
చైనా నేర్వాల్సిన పాఠం
భారత్–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శుక్రవారం మన దేశం వచ్చారు. అయితే ఎప్పుడూ ఉండే హడావుడి ఈ సారి కనబడకపోవడం, ప్రభుత్వం సైతం ఆయన రాకకు పెద్దగా ప్రాధాన్యతనివ్వకపోవడం గమనించదగ్గ పరిణామం. సాధారణంగా ఇలాంటి పర్యటనలకు వారం పదిరోజుల ముందునుంచే మీడియాలో కథనాలు వెలువడతాయి. ఇరుదేశాల మధ్యా రెండున్నరేళ్లుగా ఉద్రిక్తతలు ఉన్నందువల్ల చర్చల ఫలితాలపై అందరిలో ఆసక్తి ఏర్పడు తుంది. ఈమధ్యే భారత్–చైనాల మధ్య సైనికాధికారుల స్థాయిలో సంప్రదింపులు జరిగినా ఎలాంటి పురోగతీ లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అనంతర పరిణామాల విషయంలో యాదృచ్ఛికం గానే కావొచ్చు.. మన దేశమూ, చైనా దాదాపు ఒకే రకమైన అడుగులు వేశాయి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతోపాటు భద్రతామండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో రష్యాను అభిశంసించే తీర్మానాలపై జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మన దేశమైతే ‘ఉక్రెయిన్ పౌరుల తరలింపు, వారికి అందాల్సిన మానవతా సాయం’పై భద్రతా మండలిలో రష్యా ప్రతిపాదించిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు కూడా దూరంగా ఉంది. భారత్ – చైనాల ఆచరణలోని సామ్యాన్ని గమనించి ఇరు దేశాలూ భవిష్యత్తులో దగ్గర కావొచ్చని కొందరు భావించారు. అయితే మన నిర్ణయాలకు స్వీయ ప్రయోజనాలే గీటురాయి. రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలు, ఇంధనం, రక్షణ తదితర అంశాల్లో ఆ దేశం అందిస్తున్న సహాయ సహకారాలు మన నిర్ణయాలను ప్రభావితం చేశాయి. చైనా తీరు వేరు. చైనా, రష్యాలు రెండూ గత కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాయి. ఇక ఉక్రెయిన్‌లో రష్యా పెట్టిన కుంపటి వెనక చైనా పాత్ర ఉన్నదన్న సంశయం చాలామందిలో ఉండనే ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో 2020 ఏప్రిల్‌లో అయిదు చోట్ల చైనా దళాలు ఎల్ఏసీని అతిక్రమిం చడం మనకు ఊహించని పరిణామం. అక్కడ గస్తీ తిరుగుతున్న మన జవాన్లపై అకారణంగా దాడి చేయడం, 21 మంది ప్రాణాలు తీయడం విషాదకర ఘటన. సరిహద్దు సమస్యలున్నా మూడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్యా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సుహృద్భావ వాతా వరణాన్ని ఉన్నట్టుండి దెబ్బతీసింది చైనాయే. వాస్తవానికి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించు కునే ప్రయత్నం చేస్తూనే.. వాణిజ్య రంగంలో సహకరించుకుందామని, ఆర్థికంగా లాభపడదామని చైనా కోరినప్పుడు మన దేశం హృదయపూర్వకంగా స్వాగతించింది. రెండు దేశాల మధ్యా ఎన్నో ఒప్పందాలు కుదిరాయి. సహజంగానే వీటివల్ల అత్యధికంగా లాభపడింది ఆ దేశమే. సరిహద్దు ఘర్షణల తర్వాత ఆ దేశం సరుకులు బహిష్కరించాలన్న పిలుపులు వినబడినా, మన ప్రభుత్వం చైనా యాప్‌లు కొన్నింటిని నిషేధించినా 2020–21 మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో వృద్ధి నమోదైంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చైనా సరుకులపై అధిక సుంకాలు వేసినా దిగుమతులపై దాని ప్రభావం పెద్దగా పడలేదు. అంతక్రితం మన దేశం నుంచి చైనాకు 5.3 శాతంగా ఉన్న ఎగుమతులు 2020–21 మధ్య 7.3 శాతానికి ఎగబాకగా.. మన దిగుమతుల్లో చైనా వాటా అంతక్రితం కన్నా 3 శాతం పెరిగి 16.6 శాతానికి చేరింది. చైనాలో పరిశ్రమల సంఖ్య ఎక్కువ. పైగా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల లాక్డౌన్లు అమలై తయారీ రంగ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కరోనా నుంచి అందరికన్నా ముందు తేరుకున్న చైనా యధాప్రకారం ఉత్పాదక రంగాన్ని పరుగులెత్తించింది. కనుక మన దేశం కూడా దానిపై ఆధారపడక తప్పలేదు. ఎల్ఏసీ వివాదం అనంతరం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యాక నిరుడు ఫిబ్రవరిలో గాల్వాన్, ప్యాంగాంగ్ సో, స్పంగూర్ సో ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఆ ప్రాంతాల్లో గస్తీ తిరొగద్దని నిర్ణయిం చాయి. సైనికాధికారుల మధ్య అనంతర కాలంలో జరిగిన చర్చలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు. పైగా కుదిరిన అవగాహనకు భిన్నంగా డెస్పాంగ్‌లో 900 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తన అధీనంలోకి తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని చైనా ఆశిస్తున్నట్టు కనబడుతోంది. భారత్‌తో మళ్లీ ‘సాధారణ సంబంధాలు’ పునరుద్ధరించుకోవాలని తహతహలాడుతోంది. అయితే అదంతా గతం. సరిహద్దుల స్థితిగతులే దేశాల మధ్య స్నేహ సంబంధాలను నిగ్గు తేలుస్తాయని జైశంకర్ ఆమధ్య తేల్చి చెప్పారు. వచ్చే జూన్‌లో చైనాలో బ్రిక్స్ దేశాల సదస్సు, ఆ తర్వాత భారత్, రష్యా, చైనాల శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. ఈ రెండింటిలో మన దేశం పాల్గొనడం అంతర్జాతీయంగా రష్యా, చైనాలకు ఎంతో అవసరం. వాటిల్లో పాల్గొనవద్దని అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎటూ మన దేశంపై ఒత్తిళ్లు తీసుకొస్తాయి. ఆ అంశంలో అంతిమంగా మన నిర్ణయం ఏమిటన్న సంగతలా ఉంచి, ముందుగా ఎల్ఏసీలో చైనా దుందుడుకు పోకడలు విడనాడవలసి ఉంటుంది. వాంగ్ యీ ఈ విషయంలో ఏం హామీ ఇచ్చారో, ఎలాంటి ప్రతిపాదన తెచ్చారో చూడాల్సి ఉంది. అది త్వరలో జరిగే తదుపరి సైనికాధికారుల స్థాయి సమావేశంలో ప్రతిఫలిస్తుంది. ఒకసారంటూ సుహృద్భావ సంబంధాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే వాటిని పునరుద్ధరించడం అంత సులభం కాదని చైనా గుర్తించకతప్పదు. -
బెంగాల్‌పై నెత్తుటి మరక
పశ్చిమబెంగాల్లో మరోసారి రక్త చరిత్ర పునరావృతమైంది. ఈనెల 21 రాత్రి అక్కడి బీర్భూమ్ జిల్లాలోని రామ్‌పూర్‌హట్‌లో సాయుధులైన వందమంది దుండగులు చెలరేగి, ఇళ్లకు నిప్పంటించి ఎనిమిది నిండు ప్రాణాలు బలిగొన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రాణాలతో ఉన్నవారు బతుకు జీవుడా అనుకుంటూ ఆ గ్రామం వదిలిపోయారు. దారుణాతి దారుణ హింస పశ్చిమ బెంగాల్‌కు కొత్తగాదు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది తప్పడం లేదు. అక్కడ పార్టీల్లో ఏర్పడే అంతర్గత కలహాలు, పార్టీల మధ్య రాజుకునే ఆధిపత్య సమరాలు తరచూ హింసకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. నాటు బాంబుల వాడకం రివాజైంది. ముఖ్యంగా బీర్భూమ్ జిల్లా అందుకు పెట్టింది పేరు. గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారన్న భయాందోళనలతో ఇళ్లలో తలదాచుకున్నవారిని బయటకు లాగి గొడ్డళ్లతో తీవ్రంగా గాయపరిచి, ఆ తర్వాత వారిని లోపలికి నెట్టి, ఆ ఇళ్లకు నిప్పంటించారని వస్తున్న కథనాలు వింటే ఒళ్లు గగుర్పొడు స్తుంది. అసలు అక్కడ అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేస్తోందా... శాంతిభద్రతల పరిరక్షణ తన ప్రాథమిక కర్తవ్యమన్న సంగతి దానికి గుర్తుందా అన్న సంశయం కలుగుతుంది. హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న తృణమూల్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబాలతో మాట్లాడాక ఆమె ఆదేశించడంతో స్థానిక తృణమూల్ నాయకుడు అనారుల్ హుస్సేన్‌ను అదుపులోనికి తీసుకున్నారు. మారణకాండ సంగతి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ప్రస్తుతానికి అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సూత్ర ధారి కూడా అతగాడేనా అన్నది మున్ముందు తేలాల్సి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం తాపీ పనిచేసుకుని బతుకీడ్చిన హుస్సేన్ ఇప్పుడు ఖరీదైన మోటార్ బైక్‌లు, కార్లు, ఐఫోన్లతో... కళ్లు చెదిరే రెండంతస్తుల భవంతితో దర్జాగా ఉన్నాడంటే ఆ ప్రాంతంలో ఇన్నాళ్లుగా ఏం జరుగుతున్నదో ఊహించడం కష్టమేమీ కాదు. తృణమూల్ అంతర్గత కలహాల పర్యవసానంగా అంతకుముందు రోజు ఒక నాయకుడు హత్యకు గురికాగా, అందుకు ప్రతీకారంగా ఈ మారణకాండ జరిగింది. హత్య సంగతి తెలిసినా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నదన్న ఆలోచన పోలీసులకు కలగలేదు. పైగా రాత్రి 9.35కు ఈ రాక్షసకాండ సంగతి తెలిస్తే పది గంటల ప్రాంతంలోగానీ పోలీసులు అక్కడికి చేరుకోలేదు. పోలీస్ స్టేషన్ అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది. అంతేకాదు... స్వయంగా మమతా బెనర్జీ ఆదేశించేవరకూ ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకోలేదంటే వారి నిర్వాకమేమిటో అర్థమవుతుంది. జనరంజక విధానాలతో, మెరుగైన హామీలతో ప్రజల మనసులు గెల్చుకుని అధికారంలోకి రావాలని విపక్షాలు ఆలోచించడం లేదు. ప్రజానుకూల విధానాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మాత్రమే తిరిగి గద్దెనెక్కడం సాధ్యమవుతుందని పాలకులు ఆలోచించడం లేదు. నయానో భయానో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకునే స్థానిక పెత్తందార్ల అండతో గెలుపు శాశ్వతం చేసుకోవచ్చు నని భావించే ధోరణులు పుట్టుకొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అదే సమస్య. ఇంతక్రితం పాలించినవారితో విసుగెత్తి తృణమూల్‌ను గెలిపిస్తే గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు మింగేవాడు వచ్చిన తీరుగా అక్కడ పల్లెల్లో కొత్త పెత్తందార్ల హవా మొదలైంది. తమకెదురు తిరిగినవారిని నక్సలైట్ల పేరుమీదనో, మరే ఇతర పార్టీ పేరుమీదనో కేసుల్లో ఇరికించడం సర్వసాధారణంగా మారింది. స్థానికంగా దొరికే వనరులను దోచుకుంటున్న క్రమంలో పంపకాల్లో తేడా రావడం వల్లనో, ఆ దోపిడీని ప్రశ్నించడం వల్లనో కక్షలు బయల్దేరుతున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఆగ్రహం కలుగుతుందన్న కారణంతో పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా ఇదే తరహాలో ఆధిపత్య పోరు నడిచేది. అది తరచూ హింసాకాండకు దారితీసేది. దీన్నంతటినీ సమూలంగా మారుస్తానని, పల్లెసీమలు ప్రశాంతంగా మనుగడ సాగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మమత అధికారంలోకి వచ్చారు. కానీ జరిగింది వేరు. పల్లెటూళ్లలో గూండాల ప్రాబల్యం పెరిగింది. సాధారణ పౌరుల బతుకులు పెనం మీంచి పొయ్యిలో పడిన తీరుగా మారాయి. ఇప్పుడంతా అయ్యాక ఈ విషాద ఘటనకు కారకులని భావిస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా ఉన్న ఆయుధాలను పదిరోజుల్లోగా స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అన్నిచోట్లా గాలింపు మొదలైంది. గ్రామం విడిచి వెళ్లిపోయినవారు వెనక్కొస్తున్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్రం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అన్ని వివరాలనూ సీబీఐకి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ అంతటితో ఆగకూడదు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దారుణ విషాద ఘటన మరెక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలకు ఉపక్రమించాలి. మారుమూల ప్రాంతాలవరకూ విస్తరించి ఉండే పోలీసు, నిఘా వ్యవస్థల మొద్దు నిద్రను వదిలిం చేలా సమూల ప్రక్షాళన చేయాలి. హింసకు పాల్పడేవారికి రాజకీయ ప్రాపకం లభించబోదన్న సందేశం వెళ్లాలి. ఇలాంటి ఉదంతాలు తన పాలనకు మచ్చ తీసుకురావడమే కాదు... అంతర్జాతీయంగా మన దేశానికి అప్రదిష్ట తెస్తాయని మమత గుర్తించాలి. -
తప్పుల... అప్పుల... కుప్ప
Sri Lanka Economic Crisis: కప్పు టీ వంద రూపాయలు... కోడిగుడ్డు 35 రూపాయలు... కిలో చికెన్ వెయ్యి రూపాయలు... పచారీ కొట్ల దగ్గర క్యూలు... రోజూ ఏడెనిమిది గంటల విద్యుత్ కోతలు... నిత్యావసరమైన పాలు, పంచదార, బియ్యానికి రేషన్లు... ఆసియాలోనే గరిష్ఠ స్థాయికి ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యో ల్బణం పెరిగిన శ్రీలంకలో పరిస్థితికి ఇవి మచ్చుతునకలు. పెట్రోల్, కిరోసిన్‌ల కోసం కొండవీటి చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడి ఇద్దరు వృద్ధులు మరణించారట. ఆఖరికి ప్రింట్ చేసే కాగితం దిగుమతి చేసుకొనేందుకు విదేశీ మారక ద్రవ్యం కరవై, లక్షలాది స్కూలు విద్యార్థుల పరీక్షల రద్దు చేయాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన 1948 నాటి నుంచి ఎన్నడూ లేనంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక దుఃస్థితి ఇది. 2.2 కోట్ల జనాభా ఉన్న ఈ దక్షిణాసియా దేశం ఆదుకొనే దేశాలు, అంతర్జాతీయ సంస్థల కోసం ఆశగా చూస్తోంది. తరిగిపోతున్న దేశ ఆదాయ నిల్వలు, పెరిగిపోతున్న అప్పుల కుప్పల మధ్య తన ప్రధాన ఋణదాత చైనా మొదలు తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాకా పలువురి సాయం కోరాల్సి వచ్చింది అందుకే! శ్రీలంకలో ఇవాళ చివరకు జ్వరానికి వేసుకొనే పారాసెటమాల్ సహా అనేక ఔషధాల ధరలు 30 శాతం పైనే పెరిగాయి. ఒకప్పుడు పచారీ సరుకులకు 2 వేలైతే, ఇప్పుడు అంతకు మూడు రెట్లు ఎక్కువ చెల్లిస్తే కానీ ఆ మాత్రం ఇంటికి రావట్లేదు. శ్రీలంకలోని ఇలాంటి సామాన్యుల కష్టాల వెనుక పెద్ద కథే ఉంది. 2019లో గొటబయా రాజపక్స శ్రీలంక అధ్యక్షుడయ్యారు. అప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా ఉంది. తీవ్రవాదుల దాడులు, రాజకీయ సంక్షోభాలు దెబ్బతీశాయి. 2001 నాటి నుంచి ఎన్నడూ లేనంతగా వృద్ధి రేటు పాతాళానికి పడిపోయింది. ద్వీపదేశానికి విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టే ఆదాయ వనరు పర్యాటకులే. దాదాపు దశాబ్ద కాలం పాటు పెరుగుతూ వచ్చిన వారి సంఖ్య బాగా పడిపోయింది. ఆ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడు పన్నులకు కోత పెట్టారు. కరెన్సీ ప్రింట్ చేయడం మొదలెట్టారు. అధ్యక్షుడు, మంత్రులైన ఆయన సోదరులు, మేనల్లుళ్ళ అనాలోచిత చర్యలతో ద్రవ్యోల్బణం హెచ్చింది. పన్ను రాబడి పడిపోయింది. బడ్జెట్ లోటు పెరిగిపోయింది. శ్రీలంకను పాలించిన వరుస ప్రభుత్వాలు అధిక వడ్డీ బాండ్లు అప్పు తీసుకున్నాయి. దానికి చైనా, జపాన్ తదితర దేశాల నుంచి తీసుకున్న వందల కోట్ల అప్పులు తోడయ్యాయి. అలా తిరిగి చెల్లించాల్సిన విదేశీ ఋణభారం ఇంతలంతలు అయింది. వేలాది కోట్ల ఖర్చుతో కూడిన మౌలిక వసతి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం, ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ కావడంతో శ్రీలంక ఇప్పుడు 600 కోట్ల డాలర్ల వాణిజ్య లోటుతో బండి నెట్టుకొస్తోంది. ముడి చమురు తీసుకొచ్చి నౌకాశ్రయంలో నౌకలు వేచి ఉన్నా, వాటికి చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డాలర్లు లేని పరిస్థితి. బస్సులు ఆగి, ప్రజా రవాణా సైతం స్తంభించే దశకు వచ్చింది. ఈ సంక్షోభ వేళ సర్కారీ బ్యాంక్ సైతం చేతులెత్తేయడంతో, డాలర్ మారకం విలువ ఇప్పుడు 280 రూపాయల స్థాయికి చేరింది. క్రెడిట్ రేటింగ్‌లో కిందకు జారిపోవడంతో, అప్పులు చేయలేని పరిస్థితి. సహజంగానే ఈ పరిణామాలన్నీ ప్రజల్లో ఆగ్రహావేశాలు రేపాయి. అధ్యక్షుణ్ణి ఇంటి ముఖం పట్టమంటూ అనేక పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరగడమే అందుకు నిదర్శనం. కరోనాతో సహా అనేక కష్టాలు మీద పడినప్పటికీ, దక్షిణాసియాలో తమ దేశం ఒక్కటే నెగటివ్ వృద్ధిలోకి రావడమేమిటని వారి ప్రశ్న. ఆర్థికంగా ప్రభుత్వం చేసిన అనేకానేక తప్పులు, నిర్వహణ లోపాలు, అవినీతి దీనికి ప్రధాన కారణాలని కార్యకర్తల మాట. రాజపక్సకు ఓటు బ్యాంకైన బౌద్ధ సింహళీయుల్లోనే ఆయనను వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. విదేశీ ఋణాల పునర్వ్యవస్థీకరించడంలో ప్రభుత్వం విఫలమైంది. గతంలో చేసినట్టు ఐఎంఎఫ్ నుంచి శ్రీలంక అత్యవసర ఋణం తీసుకోవాల్సింది. కానీ, ఆ పనీ చేయలేదు. ఐఎంఎఫ్ పెట్టే షరతుల వల్ల పొదుపు చర్యలు చేపట్టాలనీ, ప్రజాకర్షక వాగ్దానాల్ని పక్కన పెట్టాల్సి వస్తుందనీ, రాజకీయంగా నష్టపోతామనీ పాలకులు ఇష్టపడ లేదు. అనేక నెలల తర్జనభర్జన తర్వాత చివరకు ఇప్పుడు ఐఎంఎఫ్ సాయం కోరారు. అయితే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విదేశీ పర్యాటకుల సంఖ్య మళ్ళీ పెరుగుతుందనీ, ఎగుమతులు పెరుగుతాయనీ శ్రీలంక పాలకులు ఆశ పడుతున్నారు. కానీ, అది వట్టి దింపుడు కళ్ళం ఆశేనని నిపుణుల మాట. పైగా, దాని వల్ల ప్రస్తుత సంక్షోభం సమసిపోయే పరిస్థితి లేదు. తప్పుడు విధానాలతో ఆదాయాన్ని వృథా చేసిన పాలకుల వల్ల కొలంబో కష్టాల కడలిలో మునిగింది. ఆ మధ్య బీజింగ్‌కు దగ్గరవుతున్నట్టు కనిపిం చిన కొలంబో సంక్షోభవేళ మన దేశ సాయం కోరింది. మనం సాయం చేయడంతో గత ఏడాదితో పోలిస్తే ఇరుదేశల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. అయితే, 2019 నవంబర్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా తమిళ ఎంపీలను ఒక్కసారైనా కలవని రాజపక్స, శ్రీలంక సర్కారు తమిళ అంశంపై రాజకీయ పరిష్కారాన్ని సుదీర్ఘంగా సాగదీస్తూనే ఉంది. ఏమైనా, ఓటేసి ప్రస్తుత శ్రీలంక సర్కారును గద్దెనెక్కించిన వారంతా ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం అంటున్నారు. ఖర్చు లకు జీతాలు చాలక, ఉద్యోగమయ్యాక సాయంత్ర వేళల్లో ఆటో నడుపుతున్న ఇంజనీర్ల కథలిప్పుడు బోలెడు. ఇలాగైతే కష్టమని బతుకుతెరువు కోసం సౌదీ సహా వివిధ దేశాలకు ప్రయాణం కడుతున్న వారూ అనేకం. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి రావడమంటే ఇదే! వెరసి, ద్వీపదేశానికి ఇది అగ్నిపరీక్షా సమయం. పాలకుడు రాజపక్సకు భవిష్యత్తు గడ్డుకాలం. -
నేరమే అధికారమై..!
నేరమే అధికారమై నేరం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడే అన్నాడొక మహానుభావుడు. నేరమే అధికారమై నేరం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఒకానొక పాపిష్టి ఘటన ఇంకా మన జ్ఞాపకాల్లో సజీవంగానే నిలిచి ఉన్నది. ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’! అధికార పీఠమెక్కిన నేరస్వరానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఆడియో!! ఆ కంఠస్వరం అక్షరాలా ‘ఆయన’దేనని ఆడియోను పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. అంత చక్కని ఇంగ్లీష్ భాషలో ‘ఆయన’ తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ రోజుల్లోనే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి నేరం చేస్తూ దొరికిపోయిన జుగుప్సాకర సన్నివేశం అది. పొరుగు రాష్ట్ర శాసనసభ్యుడిని కొనుగోలు చేస్తూ, ఆడియో – వీడియోల సాక్షిగా నోట్ల కట్టల సూట్‌కేసుతో బుక్కయిన ఒక అసభ్య చిత్రమది. కొన్ని కోట్లమంది ‘బ్రీఫ్డ్ మీ’ ఆవాజ్‌ను విని ఉంటారు. ఆ గొంతు ఎవరిదీ అనే అనుమానం ఎవరికీ వచ్చి ఉండే ఆస్కారం లేదు. ఒకవేళ వచ్చినా ఫోరెన్సిక్ నివేదిక దాన్ని పటాపంచలు చేసింది. అయినా ఆ నాయకుడి మీద కేసు పడలేదు. ఆయన ఆదేశాలు పాటించిన వారి మీద మాత్రమే ఇప్పుడు కేసు నడుస్తున్నది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలను విజయవంతంగా నడిపించడంలో, ఇతరేతర సంస్థలను, వ్యవస్థలను మెప్పించడంలో గొప్ప దిట్టగా చంద్రబాబుకు పేరున్నది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్నీ, పార్టీనీ కబ్జా చేసిన చంద్రబాబు ఆ తర్వాత బాజప్తా న్యాయస్థానం ద్వారానే సైకిల్ గుర్తునూ, పార్టీ జెండానూ, పార్టీ బ్యాంక్ అక్కౌంట్స్నూ స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ స్వయంగా తన చేతుల మీదుగానే పార్టీని నిర్మించారనీ, ప్రభుత్వాన్ని స్థాపించారనీ, పార్టీ పతాకాన్ని డిజైన్ చేశారనీ, సైకిల్ గుర్తును ఎంపిక చేసుకున్నారనీ తెలుగు ప్రజలందరికీ తెలుసు. అయినా కోట్లాదిమంది కామన్సెన్స్ను ఓడించి, కోర్టులో గెలవగలిగారు. ఆయన వ్యాజ్య నైపుణ్యం అటువంటిది. ఒక నాయకుడిపై వచ్చిన ఆరోపణల్ని దర్యాప్తు చేయాలని సాక్షాత్తూ హైకోర్టు కోరినప్పుడు తమ దగ్గర తగినంత సిబ్బంది లేదని సీబీఐ తప్పించుకున్న ఘటన ఇంకోటి ఏదైనా ఉన్నదా? చంద్రబాబు విషయంలో మాత్రమే అలా జరిగింది. అందువల్ల ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరు లేకపోవడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయించిన ‘ఐటి గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ముందుపెట్టి, కోట్లాది మంది ఓటర్ల సమస్త సమాచారాన్ని అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ తస్కరింపజేశారనీ ఆధారాలతో సహా వెల్లడైంది. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్న అధారాలు కూడా దొరికాయి. వాటిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్ష నేతలు, ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ దొంగిలించడం కోసం అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ పలుమార్లు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లి, ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. మరో ఇద్దరు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సాఫ్ట్వేర్ సామర్ధ్యాన్ని పరిశీలించి వచ్చారని సమాచారం. ఆ సాఫ్ట్వేర్ మరేదో కాదు పక్కా పెగసస్ అనేదానికి మరో తిరుగులేని రుజువు ఇప్పుడు దొరికింది. గురువారం నాడు బెంగాల్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ సందర్భానుసారం పెగసస్ ప్రస్తావన తెచ్చారు. పెగసస్‌పై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన నేపథ్యంలో ఈ ప్రస్తావన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఈ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు ఇజ్రాయెల్ సంస్థ తమ పోలీస్ విభాగాన్ని కూడా సంప్రదించిందనీ, విషయం తన దృష్టికి రావడంతో తాను తిరస్కరించాననీ ఆమె చెప్పారు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారని కూడా ఆమె కుండబద్దలు కొట్టారు. చంద్రబాబుతో ఆమెకు విరోధమేమీ లేదు. గడచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రంలో ఆమె ప్రచారం కూడా చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న కీలక నేత కావడం, చంద్రబాబుతో స్నేహ సంబంధాలు కలిగి ఉండడం మూలంగా ఆమె ప్రకటనకు విశ్వసనీయత చేకూరింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’ అవసరాల కోసం ఎన్ఎస్ఓ అనే రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసింది. ప్రపంచ దేశాల గూఢచార సంస్థలన్నింటిలోకి సమర్థత ప్రాతిపదికన ‘మొసాద్’ అగ్రస్థానంలో ఉన్నది. ఎంతో విస్తృత ప్రచారమున్న సీఐఏ, కేజీబీ వగైరా సంస్థలన్నీ మొసాద్ ముందు దిగదుడుపే! మొసాద్ చేతికి ఈ సాఫ్ట్వేర్ అందిన తర్వాత ఇరుగు–పొరుగు మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల్లో వందలాదిమంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ఎన్జీవోల ప్రతినిధులు హత్యలకు గురికావడం, ప్రమాదాల్లో మరణించడం సంభవించిందని అంచనా. గ్రీకు పురాణాల్లో దివ్య మహిమలు గల రెక్కలగుర్రం పేరు – పెగసస్. అంతటి శక్తిమంతమైనదన్న ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌కు ఆ పేరు పెట్టి ఉంటారు. పెగసస్ సాఫ్ట్‌వేర్‌కు నిజంగానే ఊహాతీతమైన మహిమలున్నాయి. ఎవరి ఫోన్ నంబర్‌ను అయినా సరే, తమ సర్వర్‌లో ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్‌కు ఒక ఎస్ఎమ్ఎస్నో, వాట్సప్ మెసేజ్‌నో, ఒక మెయిల్నో పంపిస్తారు. మీరు దాన్ని ఓపెన్ చేసినా, చేయకపోయినా పెగసస్ అప్లికేషన్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక ఫోన్‌కాల్‌తో కూడా ఇన్స్టాల్ చేయవచ్చు, మీరు ఫోన్ ఎత్తకపోయినా సరే! ఇక అక్కడి నుంచి మీ ప్రతి కదలికా... అవతలి వారికి తెలిసిపోతుంది. తమ ఫోన్ ట్యాప్ అవుతున్నదని అనుమానం వచ్చిన వాళ్లు ఫోన్లో మాట్లాడకుండా వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడాలనుకోవచ్చు. చేతిలో ఫోన్ పట్టుకుని వెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఫోన్లో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ దాని పనిని అది చేస్తుంది. మీ ఎదుటి వ్యక్తి ఫోటోను తీస్తుంది. మీ మాటల్నీ, అతడి మాటల్నీ రికార్డు చేస్తుంది. వాట్సప్ మెసేజ్‌లు, ఈ–మెయిల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లూ, ఫేస్ బుక్ వగైరా అన్నిరకాల సమాచారాన్నీ సంగ్రహిస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరున్న సోర్స్ కోడ్‌కు వెళ్తుంది. అక్కడ్నుంచి క్లయింట్‌కు చేరుతుంది. అంటే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన క్లయింట్లు ఈ దేశ ప్రముఖుల రహస్యాలనూ, ప్రజల సమాచారాన్నీ విదేశీ సంస్థ గుప్పెట్లో డబ్బులిచ్చి మరీ పెడుతున్నారన్నమాట! ఈ లెక్కన చంద్రబాబు కూడా ఈ పని చేశారు. ఆయన ఏటా 35 కోట్ల రూపాయల చొప్పున చెల్లించి మూడేళ్లపాటు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని తెలుస్తున్నది. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కుట్రపూరితంగా తెలుసుకోదలిచినా, అతడి కదలికలను కనిపెట్టే ప్రయత్నం చేసినా... భారత రాజ్యాంగం 21 (ఎ) అధికరణం, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్, ఐటీ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (1872)ల ప్రకారం అది పెద్ద నేరం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి టెలిఫోన్‌ను ట్యాప్ చేయాలి అంటే అతడు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నాడనీ, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగస్థుడనీ స్పష్టమైన సమాచారం ఉండాలి. ఐటీ యాక్ట్ ప్రకారం రాష్ట్ర డీజీపీ కేంద్ర హోంశాఖకు లేఖ రాసి, ఫోన్ ట్యాపింగ్ అనుమతిని తీసుకోవాలి. అందుకు అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ నుంచి సదరు లేఖ టెలికామ్ నోడల్ ఏజెన్సీకి చేరుతుంది. అప్పుడు అనుమానిత వ్యక్తి డేటాను రికార్డు చేసి రాష్ట్ర పోలీసు శాఖకు పంపిస్తారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి మనదేశంలో పాటించే విధానం ఇది. ఇక్కడ కేంద్రంతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ సంస్థ ద్వారా పెగసస్ గూఢచర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నడిపించినట్టు అర్థమవుతున్నది. ఇది దేశద్రోహం కంటే పెద్ద నేరమవుతుంది. నేరమే అధికారమై, ప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటే ఊరక కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఇక్కడ నేరమే అధికారమై, ప్రత్యర్థుల్ని నేరస్థులుగా ముద్రవేసి వేటాడిన దుర్దినాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం దాటి వచ్చింది. అధికారం కోల్పోయినా నేరస్వభావం మారలేదు. ప్రత్యర్థులపై ముద్రలు వేసి గగ్గోలు పుట్టించాలని చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న ఎకో సిస్టమ్ ఇప్పటికీ సర్వశక్తులూ ఒడ్డుతూనే ఉన్నది. దాని ఉపాంగమైన మీడియా సింఫనీ నిర్విరామంగా సాగుతూనే ఉన్నది. అధికార పీఠం మీద ఉన్నప్పుడు రచించిన అవినీతి పురాణం డజన్ల కొద్దీ అధ్యాయాలతో ఒక పుస్తకంగానే వెలుగు చూసింది. రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్, భూములతో గేమింగ్, రాజధాని నిర్మాణం పేరుతో స్విస్ ఛాలెంజ్ కుంభకోణం, విశాఖపట్నంలో సృష్టించిన భూకంపం, సదావర్తి సత్రం నిలువు దోపిడీ, అస్మదీయులకు కారుచౌకగా భూ నజరానాలు, మద్యం సిండికేట్ల నుంచి పిండుకున్న ముడుపుల గుట్టలు, అగ్రిగోల్డ్ ఆస్తుల నిలువు దోపిడీ – బాధితులకు పంగనామాలు, ఇసుక మాఫియా పిండుకున్న ‘తైలం’, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడుకోవడం, నీరు – చెట్టు పేరుతో నిత్యశఠగోపం, గ్రానైట్ ఫలహారానికి స్కెచ్‌లు, బరైటీస్ దందాల బిందాస్, విదేశీ బొగ్గును భోంచేయడం... ఇలా ఇదో గాథాసప్తశతి! బృహత్కథా మంజరి!! తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత దాని చుట్టూ ఒక ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తన పార్టీతోపాటు ఇతర పార్టీల్లోని కొన్ని స్వార్థపూరిత శక్తులు, సొంత ప్రయోజనాల కోసం పనిచేసే మీడియా పెద్దలు, వివిధ సంస్థల్లో, వ్యవస్థల్లో కీలక పదవుల్లో ఉండే తనవారు ఈ సిస్టమ్‌లో భాగం. చంద్రబాబుకు అవసరమైనప్పుడు వీరంతా ఎవరి పాత్రను వారు పోషిస్తారు. చూసేవాళ్లకు అంతా యాదృచ్ఛికమనే భావన కలుగుతుంది. కానీ అంతా ఒక పకడ్బందీ స్క్రిప్ట్ ప్రకారమే నాటక ప్రదర్శన జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నేరాలకు, ఘోరాలకు మూల్యం చెల్లించవలసిన సమయమిది. రచ్చబండ వద్ద నిలబెట్టి ప్రశ్నించవలసిన తరుణమిది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రకూటమి ఎజెండాను పక్కదారి పట్టించే పనిలో బిజీగా నిమగ్నమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, విద్య – వైద్యరంగాల్లో మొలకెత్తిన విప్లవం, వ్యవసాయరంగంలో కనిపిస్తున్న సుస్థిరాభివృద్ధి నాగేటి చాళ్లు, పేదవర్గాల ప్రజల్లో పరుచుకుంటున్న కులాతీత సాధికార చైతన్యం... ఇవన్నీ గొప్ప సామాజిక – ఆర్థిక పరిశోధనాంశాలు. దేశవ్యాప్తంగా ఈ మార్పుల మీద చర్చ జరగడం ఒక చారిత్రక అవసరం. కానీ తెలుగుదేశం నడిపించే మీడియాలో ఈ నిశ్శబ్ద విప్లవానికి ఏనాడూ సెంటీమీటర్ చోటు లభించదు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పులుముకున్న అవినీతి అరాచక పాలన బురదను మరిచిపోవడానికి అధికార పార్టీపై బురదను కుమ్మరించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. దాని లక్ష్యం సుస్పష్టం. గడచిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం ఓట్లు పడ్డాయి. దాని ఓటింగ్ బలం ఇంకొంత పెరిగిందని ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. దాని ఓటింగ్ బలాన్ని ఓ ఐదారు శాతం మేరకు తగ్గించగలగాలి. అందుకోసం దుష్ప్రచారాల దండోరా! లేకపోతే... వైఎస్ వివేకా హత్య ఎప్పుడు జరిగింది? ఆ హత్య జరిగిన తర్వాత రెండున్నర నెలలపాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పోలీసులే దర్యాప్తు జరిపారు. వైఎస్ జగన్‌ను ఇరుకున పెట్టగలిగే ఏ ఒక్క ఆధారం దొరికినా చంద్రబాబు వదిలేవాడేనా? రెండున్నరేళ్ల తర్వాత ఈ కొత్త పాటేమిటి? కొత్త ప్రచారం ఏమిటి? మొదట్లో తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోసిన వివేకా కూతురు హఠాత్తుగా ప్లేటు మార్చడం ఏమిటి? ఆమెకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం టిక్కెట్టిస్తారన్న ప్రచారం ఎందుకొస్తున్నది? ఇదంతా ఒక స్కీమ్‌లా కనిపించడం లేదా? మిగిలిన దుష్ప్రచారాలన్నీ ఈ తరహావే! ఒక్కో ఆరోపణను సాంగోపాంగంగా తర్కించి పరిశీలిస్తే తేలేది బోగస్ కథనాలే! ఈ ప్రచారాల ద్వారా అధికార పార్టీ ఓట్లను తగ్గించడం వ్యూహంలో ఒక భాగం. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చూడటం రెండో భాగం. వ్యూహంలో రెండో భాగాన్ని మొన్ననే పవన్ కల్యాణ్ నిర్ధారించారు. చంద్రబాబు పవన్ మీద తనకున్న ఒన్ సైడ్ లవ్‌ను ప్రకటించిన మూడు మాసాలకు పవన్ స్పందించారు. ఆ ప్రేమను స్వీకరిస్తూ, ఓట్లు చీలకూడదని సందేశాన్నిచ్చారు. పాలక పార్టీ మీద తొడగొట్టినంత తీవ్రంగా దాడి చేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39 శాతం ఓట్లు వస్తే జనసేనకు వచ్చింది ఏడు శాతమే. మరి కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి? ఓట్ల శాతం ప్రకారం పవన్ పార్టీ కూరలో కరివేపాకే కదా! మరి కరివేపాకులే తొడలు కొడితే బాలయ్య బాబులు ఏం చేయాలి? విశాల ప్రజానీకం దైనందిన జీవితాల్లో వస్తున్న మార్పులే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి తప్ప కరివేపాకులు, కలగూరగంపలు చేయగలిగిందేమీ ఉండదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నోళ్లు తెరిచిన జైళ్లు
క్రిమినల్ కేసుల్లో అసలైన దోషులను గుర్తించి శిక్షించడానికీ, అమాయకులకు న్యాయం అందించేం దుకూ న్యాయస్థానాలు సాగించే సుదీర్ఘ విచారణల పర్యవసానంగా జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయని మానవ హక్కుల సంఘాలు మాత్రమే కాదు... సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ ఈ పోకడ ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తున్నదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పదేళ్లక్రితం వరకూ మొత్తం ఖైదీల్లో విచారణ ఖైదీల శాతం సగటున అత్యధికంగా 65 వరకూ ఉండగా, ఇప్పుడది 76 శాతానికి పెరిగిందని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. లెక్కకుమించి ఖైదీలను జైళ్లలో కుక్కితే సంస్కరణాలయాలు కావలసిన ఆ కారాగారాలు కాస్తా పశువుల కొట్టాలుగా మారతాయనీ, సరికొత్త నేరగాళ్లు పుట్టుకొచ్చేందుకు అవి దోహదపడతాయనీ పాలకులు గుర్తించకపోవడం విచారకరం. ఒకపక్క కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా విలయం సృష్టిస్తోంది. పర్యవసానంగా అన్ని విభాగాల పనితీరూ కుంటుబడింది. అవి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. న్యాయవ్యవస్థ సైతం అనివార్యంగా సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు. సహజం గానే జైళ్లపై దీని ప్రభావం పడుతోంది. శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలయ్యేవారితో పోలిస్తే కొత్తగా కేసుల్లో ఇరుక్కుని జైలుపాలవుతున్న వారి సంఖ్య 2020 తర్వాత తీవ్రంగా పెరిగిందని జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ)లోని గణాంకాల ఆధారంగా ‘ఇండియా జస్టిస్ రిపోర్టు’ నివేదిక నిర్ధారించింది. దాని ప్రకారం ఢిల్లీ జైళ్లలో 2019లో విచారణ ఖైదీలు 82 శాతం ఉండగా, మరుసటి సంవత్సరానికి అది 90.7 శాతమైంది. జమ్మూ కశ్మీర్లో 83.4 శాతం నుంచి 90.5 శాతానికి పెరిగింది. అంతక్రితం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ లలో విచారణలో ఉన్న ఖైదీల శాతం గణనీయంగా పెరిగింది. పంజాబ్‌లో 2019లో విచారణ ఖైదీలు 66 శాతం ఉండగా, అది కాస్తా 85 శాతమైంది. హరియాణాలో 64.4 నుంచి 82 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 54.2 నుంచి 70 శాతానికి పెరిగింది. నిజానికి ఈ గణాంకాలన్నీ 2020 నాటి లెక్కలు. ఆ సంవత్సరం న్యాయస్థానాలు సైతం సరిగా పనిచేసే పరిస్థితులు లేకపోవడం వల్ల విచారణలు మందగించాయి. ఆ తర్వాతైనా పెద్దగా మెరుగుపడింది లేదు గనుక ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ విచారణలు జరపడం వల్ల కొంత ప్రయోజనం కనబడిన మాట వాస్తవమే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 అమలు చేయడంతో కేసుల సంఖ్య అపారంగా పెరిగింది. 2019తో పోలిస్తే 2020లో అదనంగా 16,43,690 కేసులు నమోదయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వాస్తవంగా శిక్షార్హమైన వారెందరో, అమాయకులెవరో తేల్చడం న్యాయ వ్యవస్థకు తలకుమించిన పని. పరిమితికి మించి ఖైదీలుండటం వల్ల సాధారణ పరిస్థితుల్లోనే జైళ్లలో ఎన్నో సమస్యలేర్పడ తాయి. కరోనా వంటి మహమ్మారి విరుచుకుపడినప్పుడు ఆ సమస్యలు మరింత ఉగ్రరూపం దాల్చడంలో ఆశ్చర్యంలేదు. ఏళ్ల తరబడి విచారణలు కొనసాగుతుండటం వల్ల 200 శాతానికి మించి ఖైదీలున్న జైళ్లు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటిచోట కరోనాను అరికట్టేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? కారాగారాల్లో కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నా మని ప్రభుత్వాలు చెబుతూనే వచ్చాయి. క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, కొత్తగా వచ్చిన ఖైదీలను కొన్ని రోజులపాటు అక్కడ ఉంచటం, జైలు మాన్యువల్ అమలును ఆపి, విజిటర్స్ రాకుండా కట్టడి చేయడం అందులో కొన్ని. కానీ ఖైదీల మానవ హక్కులు ఆవిరికావడం మినహా వీటి వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. న్యాయవాదులుగానీ, వారి బంధువులుగానీ నేరుగా ఖైదీలను కలిసే అవకాశాలు తగ్గిపోయాయి. లాకప్ డెత్‌లు, అసహజ మరణాల విషయంలో అంతకుముం దున్న జవాబుదారీతనం కూడా అడుగంటింది. కనుకనే 2020లో లాకప్ డెత్‌లు ఏడు శాతం పెరగ్గా, ఆత్మహత్యలు, ప్రమాదాలు, హత్యలు వంటి అసహజ మరణాలు 18.1 శాతం హెచ్చయ్యాయి. తగినన్ని అధికారాలున్న స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తే మన జైళ్లలో ఎంతటి దారుణమైన పరిస్థితులున్నాయో వెల్లడవుతుంది. దేశమంతా లాక్డౌన్ అమలైన కాలంలో సర్వోన్నత న్యాయస్థానం ఒక ముఖ్యమైన సూచన చేసింది. రాష్ట్రాల్లో అత్యున్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నది దాని సారాంశం. అందువల్ల విడుదలైనవారి శాతం అంతకుముందుతో పోలిస్తే మెరుగైంది. కానీ ఆరోగ్యపరమైన కారణాలు, పెద్ద వయసు, జండర్ వంటి ప్రాతిపదికలు కాక, ఖైదీల విడుదలను పాలనాపరమైన వ్యవహారంగా కమిటీలు పరిగణించడంవల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. పరిమితికి మించి ఖైదీలుండటం, అదే సమయంలో తగినంతగా సిబ్బంది లేకపోవడం జైళ్లలో అవినీతికి, అమానవీయతకు, ఇతర వైపరీత్యాలకూ దారితీస్తోంది. జైళ్లు సంస్కర ణాలయాలని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా అందులో చిత్రహింసలు విడదీయరాని భాగమని ‘డిసిప్లిన్ అండ్ పనిష్: ద బర్త్ ఆఫ్ ద ప్రిజన్’ పుస్తకంలో మైఖేల్ ఫాకల్ట్ అంటాడు. మనిషిలో అమానవీయతను పెంచి, నేర ప్రవృత్తికి అలవాటు చేసే జైళ్ల స్థితిగతులను చక్కదిద్దడానికి సిబ్బందిని పెంచడం, పటిష్టమైన పర్యవేక్షణ ఉండేలా చూడటం, జవాబుదారీతనాన్ని పునఃప్రతిష్టించడం కీలకం. వీటిపై న్యాయస్థానాలు, ప్రభుత్వాలు దృష్టి సారించడం తక్షణావసరం. -
అసంతృప్తి జాడలు
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పకడ్బందీ విధాన రూపకల్పన కొరవడితే పర్యవసానాలెలా ఉంటాయో నాలుగు రోజులుగా ఆగ్రహంతో రగులుతున్న ఉత్తరప్రదేశ్, బిహార్ యువత నిరూపిస్తున్నారు. త్వరలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలి. యువ జనాభా అధికంగా ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లోనూ చోటుచేసుకుంటున్న ఘటనలను విపక్షాల కుట్రగా కొట్టిపారేయడం లేదా యాదృచ్ఛికంగా తలెత్తిన సమస్యగా భావించడం సులభం. కానీ నిరుద్యోగ భారతంలో అంతర్లీనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని ఆ ఉదంతాలు వెల్లడిస్తున్నాయని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆగ్రహోదగ్రులైన యువత బిహార్‌లోని గయలో ఒక ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టగా... ఆ రాష్ట్రంలోని సమస్తీ పూర్, బక్సార్, భోజ్‌పూర్, ముజఫర్‌పూర్, పట్నా తదితర నగరాల్లో వేలాదిమంది యువకులు ధర్నా చేశారు. రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ తదితరచోట్ల రైలు పట్టాలపై ధర్నాలు జరిగాయి. రిపబ్లిక్ డే రోజున అక్కడి ప్రయాగ్‌రాజ్‌లో యువకులున్న హాస్టళ్లపై పోలీసులు దాడికి దిగారు. ఉద్యమ మూలాలు గమనిస్తే యువత ఆగ్రహానికి కారణం అర్థమవుతుంది. రైల్వే శాఖలో సాంకేతికేతర విభాగాల సిబ్బంది నియామకాల కోసం ఎప్పుడో 2019 మార్చిలో 35,281 పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప్రవేశ పరీక్షకు కోటి 25 లక్షలమంది దరఖాస్తు చేసు కున్నారు. కరోనా విజృంభణతో చాలా ఆలస్యంగా సంబంధిత పరీక్షను ఆన్లైన్లో నిరుడు నిర్వ హించారు. ఈ నెల 14న విడుదల చేసిన ఫలితాల్లో ఏడు లక్షలమంది అర్హులుగా తేలారు. అంటే ఒక్కో పోస్టుకు 20 మంది పోటీ పడాలి. కానీ తొలుత నోటిఫికేషన్లో చెప్పినదానికి భిన్నంగా వచ్చే నెల 14, 18 తేదీల్లో మరో అర్హత పరీక్ష నిర్వహించబోతున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఆ పరీక్షలో ఒక్కో పోస్టుకు 8 మందిని ఎంపిక చేసి వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. ఇదే అభ్యర్థులకు ఆగ్రహం కలిగించింది. నోటిఫికేషన్లో కేవలం ఒక్క అర్హత పరీక్ష ఉంటుందని ప్రక టించి, ఇప్పుడు దాన్నెలా మారుస్తారని యువత నిలదీసింది. దానికితోడు పరీక్షల్లో గోల్మాల్ జరిగిందన్న వదంతులు వ్యాపించాయి. వారి అభ్యంతరాలు మీడియాలో ప్రముఖంగా రాకపోయి ఉండొచ్చుగానీ... పక్షం రోజులుగా ట్విటర్, ఫేస్బుక్ తదితర మాధ్యమాల్లో అవి హోరెత్తు తున్నాయి. అర్హులుగా తేలినవారికి తక్షణం ఇంటర్వ్యూలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పోస్టులకు టెన్త్, ఇంటర్ అర్హతలుగా ప్రకటించి, పట్టభద్రులకు ఎందుకు చోటిచ్చారని ప్రశ్నిం చారు. రెండేళ్లపాటు నిద్రాహారాలు మాని చదువుకున్నామని, కోచింగ్ కేంద్రాల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టామని మొరపెట్టుకున్నారు. కానీ నిలువెల్లా కళ్లున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. కనీసం రైల్వే మంత్రిత్వ శాఖలోని బాధ్యులైనా ఈ సమస్యపై దృష్టి పెట్టలేక పోయారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు రెండో పరీక్షను ఇప్పుడు తాత్కాలికంగా నిలిపే శారు. అభ్యంతరాల పరిశీలనకు కమిటీ ఏర్పాటైంది. దేశంలో వాస్తవ పరిస్థితులేమిటో ప్రభుత్వ పత్రాల్లో కనబడకపోవచ్చు... అంతా సవ్యంగానే ఉన్నదని అధికారపక్షం పదే పదే చెబుతూ ఉండొచ్చు. కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలు వేరుగా ఉన్నాయని భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగిత రేటు డిసెంబర్ 2016లో 43 శాతం ఉంటే 2021 డిసెంబర్ నాటికి అది 37 శాతానికి పడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో అది 32.8 శాతం మించి లేదు. పైగా అనేకులు క్రమబద్ధంగా జీతా లొచ్చే ఉద్యోగాలు కోల్పోయి, రోజు కూలీలుగా మారారు. ప్రభుత్వ ఉద్యోగాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. రిటైరవుతున్నవారి సంఖ్యకు అనుగుణంగా నియామకాలు ఉండటం లేదు. ఇప్పటికీ ఉద్యో గాలివ్వడంలో అగ్రభాగంలో ఉన్న రైల్వే శాఖలో పదేళ్లక్రితంతో పోలిస్తే సుమారు అయిదు లక్షల ఉద్యోగాలు మాయమయ్యాయి. దానికితోడు పబ్లిక్ రంగ సంస్థలు క్రమేపీ ప్రైవేటు పరమవుతున్నాయి. అక్కడా ఉద్యోగావకాశాలు పెద్దగా ఉండటం లేదు. ఉన్నా ప్రభుత్వో ద్యోగంతో పోలిస్తే అక్కడ ఉద్యోగ భద్రత తక్కువ. ఇది చాలదన్నట్టు లేబర్ కోడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిరుడు తీసుకొచ్చిన 3 చట్టాలు అమల్లోకొస్తే ఆ భద్రత మరింత దిగజారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతలో ప్రభుత్వోద్యోగం సంపాదించాలన్న ఆత్రుత పెరగడంలో ఆశ్చర్యం లేదు. అది వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నదన్న అభిప్రాయం కలిగితే ఇక చెప్పేదేముంది? కోర్కెల సాధన కోసం హింసామార్గం అవలంబించడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు. కానీ ఇందుకు దారితీసిన కారణాలేమిటో పాలకులు సానుభూతితో అర్థం చేసుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రభుత్వ గణాంకాలు ఏం ఊదరగొడుతున్నా, తయారీ రంగ పరిశ్రమలు ఊపందు కోనిదే ఉద్యోగావకాశాలు పెరగవు. రోజు కూలీలుగా బతుకీడుస్తున్న యువతకు భద్రత కలిగిన, గౌరవప్రదమైన ఉపాధి దొరకనిదే వారిలోని అసంతృప్తీ, ఆగ్రహమూ చల్లారవు. కనుక ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను పదునెక్కించాలి. వచ్చే బడ్జెట్లో నికరమైన పథకాలకు చోటీయాలి. ప్రసంగాలతో పొద్దుపుచ్చి, ఎన్నికల్లో ఇతరేతర భావోద్వేగాలను రెచ్చగొడితే నాలుగు ఓట్లు రాలవచ్చేమోగానీ... సమస్యలు మాయం కావని గ్రహించాలి. -
నిద్రపోనివ్వని నిజాలు!
కొన్ని నిజాలు అంతే! కూర్చోనివ్వవు, నిలుచోనివ్వవు. కంటి నిండా కునుకుపట్టనివ్వవు. దేశంలోని నిజమైన పరిస్థితి మనసుకు తెలుసు కాబట్టే కావచ్చు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు కూడా నిద్ర పట్టడం లేదట. ఆ మాట ఆయన ఇటీవల ప్రజలతో ప్రత్యక్ష ప్రసారంలో బాహాటంగా చెప్పారు. అధికారంలోకి వచ్చేనాటికే ఒకవైపున భారీ కరెంటు ఖాతా లోటు, ఇప్పుడు కరోనా వేళ ప్రపంచ వ్యాప్త ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో దేశానికి ఆర్థిక కష్టాలు అలా ఉన్నాయని ఆయన మాట. కొద్ది రోజుల క్రితమే... ఈ నెలలోనే భారత్ కన్నా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితే బాగుందని బీరాలు పలికారాయన. తీరా ఇప్పుడిలా భావోద్వేగంతో బేలతనం చూపడం విచిత్రం. నిద్ర పట్టడం లేదంటూనే అసలు నిజాలను ఇమ్రాన్ దాస్తున్నారు. ప్రపంచంలోనే ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న దేశాల్లో అర్జెంటీనా, టర్కీ, బ్రెజిల్ తర్వాత 4వదైన పాక్ గురించి ప్రపంచంలోనే చౌకయిన దేశాల్లో తమది ఒకటనడం హాస్యాస్పదమే. ఇప్పటికే 500 కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఆ దేశాన్ని పీడిస్తోంది. తాజాగా సుకుక్ బాండ్ ద్వారా 100 కోట్ల డాలర్ల మేర అప్పు చేసింది. అదీ... రికార్డు 7.95 శాతం వడ్డీకి! అంతేకాక, అప్పు కోసం ఏకంగా లాహోర్ – ఇస్లామాబాద్ మోటార్ మార్గంలోని కొంత భాగాన్ని కుదువ పెట్టడానికీ ఒప్పుకుంది. అదీ వాస్తవ పరిస్థితి. అస్తుబిస్తయిన ఆర్థిక పరిస్థితికి ప్రభుత్వ రంగంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి జాడ్యాలు తోడయ్యాయి. ‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్’ మంగళవారం వెల్లడించిన ‘అవినీతి భావనాత్మక సూచిక’ (సీపీఐ) తాజా లెక్కలే అందుకు సాక్ష్యం. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది పాకిస్తాన్ మరింత అవినీతిలో కూరుకుపోయింది. 180 దేశాల ఈ లెక్కల్లో 2020లో 124వ స్థానంలో ఉన్న పాక్ ఇప్పుడు 16 స్థానాలు మరింత దిగజారి, 140వ స్థానంలో నిలిచిందన్న తాజా వార్త నిష్ఠురసత్యం. నవాజ్ షరీఫ్ ఏలుబడిలో (అప్పటి ర్యాంకు 117) కన్నా దిగజారడం గమనార్హం. స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఇమేజ్‌కు ఇది పెద్ద దెబ్బే. తెస్తానన్న ‘నయా పాకిస్తాన్’ ఇదేనా అని ప్రశ్నిస్తుంటే, జవాబివ్వలేని పరిస్థితి వచ్చిపడింది. 86 శాతం దేశాల్లో గత పదేళ్ళలో అవినీతి స్థాయి దాదాపు యథాతథంగా ఉండగా, పాక్‌కే ఈ దుర్గతి ఎందుకు పట్టినట్టు? చట్టబద్ధ పాలన లేకపోవడం, హస్తగతం చేసుకున్న అధికారం లాంటివి పాక్ దిగజారుడుకు కారణమట! ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక, మేధావుల లాంటి వివిధ వర్గాల నుంచి సేకరించిన డేటాతో ఇచ్చే ర్యాంకు గనక దీన్ని కాకిలెక్క అనుకోలేం. గతంలో ఇదే సూచికను చూపి, అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన సంగతి ఇమ్రాన్ మర్చిపోయినా, సోషల్ మీడియా పోస్టులు మర్చిపోనివ్వడం లేదు. గత 20 ఏళ్ళ రికార్డుల్ని బద్దలుకొట్టి, ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో 5వ అత్యంత అవినీతి దేశంగా పాక్ పేరుమోసేలా చేశారని విమర్శిస్తున్నాయి. మరోపక్క అవినీతి ఆరోపణలతో లండన్‌లో తలదాచుకున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వైపు సైన్యం మొగ్గుతున్నట్టు వార్త. దేశ రాజకీయాల్లో అవసరం ఉందనీ, స్వదేశానికి తిరిగొచ్చేయమనీ షరీఫ్‌కు సైన్యం కబురంపినట్టు కథనం. నిజానికి, సైన్యం, సైనిక గూఢచారి సంస్థ (ఐఎస్ఐ)ల దయాదాక్షిణ్యాల మీదే ఇమ్రాన్ సర్కార్ నడుస్తోందనేది లోకవిదితం. పాకిస్తానీ సైన్యం రిగ్గింగ్ వల్లనే 2018 నాటి ఎన్నికలలో ఇమ్రాన్ అధికారం చేజిక్కించుకున్నారనీ, సైన్యం చేతిలో ఆయన ఓ ‘కీలుబొమ్మ’ అనీ ప్రతిపక్షాల వాదన. అయితే, ఐఎస్ఐ కొత్త డైరెక్టర్ జనరల్ నియామకంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌కూ, ఆ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ బజ్వాకూ మధ్య బంధం బెడిసింది. ఈ ఏడాది నవంబర్ ఆఖరులో పదవీకాలం పూర్తయ్యాక, రావాల్సిన కొత్త సైనిక వారసుణ్ణి కాదని ప్రస్తుత ఐఎస్ఐ అధినేతనే కొనసాగించాలన్నది ఇమ్రాన్ భావించడంతో ఇబ్బంది తలెత్తిందని కథనం. ఇమ్రాన్ పదవీ కాలంలో మునుపెన్నడూ లేనంతటి ద్రవ్యోల్బణంతో దేశం చిక్కుల్లో ఉంది. ధరలు వంటనూనె 130 శాతం, పెట్రోలు 55 శాతం పెరిగాయి. పాకిస్తానీ రూపాయి విలువేమో 44 శాతం పడిపోయింది. మూడేళ్ళ క్రితం రూ. 122కే డాలరైతే, ఇప్పుడు రూ. 176 పెట్టాల్సి వస్తోంది. క్రితంనెలలో ద్రవ్యోల్బణ రేటు 12.3 శాతమై, గత 21 నెలల్లోకెల్లా పతాక స్థాయికి చేరింది. అధికారిక నివాసాన్ని వదులుకొని, అద్దెకివ్వడం లాంటి కంటితుడుపుతో ఇమ్రాన్ దీనికి అడ్డుకట్ట వేయలేరు. అదేమంటే, నిరాశాపూర్వక కథనాలిస్తున్నాయంటూ ఆయన తప్పంతా మీడియాపై నెట్టేస్తుండడం విచిత్రం. అందుకే పత్రికా రచనా స్వేచ్ఛ సూచిలో పాక్‌కు 145వ స్థానమే దక్కడం వింతేమీ కాదు. నిజానికి, దశాబ్దాలుగా పాక్ వైఖరి ప్రస్తుత సంక్షోభానికి కారణం – సైన్యంపై అతిగా ఖర్చు, దూరదృష్టి లేకుండా భారీగా అప్పులు తేవడం, పెట్టుబడుల నిర్వహణలో అసమర్థత లాంటి తప్పులెన్నో. దానికిప్పుడు కరోనా కాటు తోడైంది. ఏమైనా, అవినీతి రహిత పాలన అందిస్తానని వచ్చి, మూడేళ్ళ పైచిలుకులో ప్రతిపక్షాలతో ‘అవినీతి సమ్రాట్’ అనిపించుకొనే దశకు అప్రతిష్ఠ పాలవడం ఎవరికైనా నిద్ర పట్టనివ్వని పరిస్థితే! దాని నుంచి బయటపడాలంటే – భారత్‌తో పోలికలు మానేసి, పాలనలో ప్రక్షాళన చర్యలు చేపట్టడం, తీవ్రవాద ప్రోత్సాహక చర్యలను వదిలేయడమే మార్గం. లేదంటే, ఇప్పటికే పదవీ గండం పొంచి ఉన్న ఇమ్రాన్ వచ్చే ఎన్నికల దాకా అధికారం నిలుపుకోగలిగినా, ప్రతిపక్షాలన్నీ దగ్గరవుతూ, తీవ్రవాదులు విజృంభిస్తూ, సైన్యం శత్రువుగా మారుతున్న వేళ మళ్ళీ గెలవడం కష్టమే! -
అద్భుత ఘట్టం
‘రాశి చక్రగతులలో/ రాత్రిందివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో/ప్రభవం పొందిన’ మానవాళి తన జైత్రయాత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన క్షణాలను నమోదు చేసుకుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతోపాటు యూరప్, కెనడా అంతరిక్ష సంస్థలు అహరహం శ్రమించి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను మొన్న సోమవారం అనుకున్న సమయానికి, అనుకున్న రీతిలో, నిర్దేశించిన కక్ష్యలో ప్రవేశపెట్టి ప్రపంచాన్ని అబ్బురపరిచాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా వేలాదిమంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సమష్టిగా కృషి చేసి సాధించిన అద్భుత విజయమిది. గత నెల 25న క్రిస్మస్‌నాడు అంతరిక్ష యాత్ర ప్రారంభించి, 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ టెలిస్కోప్ కోసం ప్రయోగించిన అంతరిక్ష నౌకకు వేయి కోట్ల డాలర్లు (సమారు రూ. 75,000 కోట్లు) వెచ్చించారు. అంతరిక్షంలో మరెక్కడయినా భూమిని పోలిన గ్రహాలున్నాయా... అక్కడ జీవరాశి ఉనికి ఉన్నదా అనే ప్రశ్నలు మానవ మస్తిష్కాన్ని చిరకాలంగా వేధిస్తున్నాయి. మన దేశంతోపాటు చైనా, గ్రీస్, రోమ్, మధ్యప్రాచ్య అరబ్ దేశాల్లో అంతరిక్షాన్ని పరిశీలించడం, అక్కడ ఏముందో తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం చరిత్రలో నమోదయ్యాయి. సాధారణ దృష్టికి తారసపడని అంతరిక్ష వింతలూ విశేషాలూ ఇతరేతర పరికరాల సాయంతో తెలుసుకోవచ్చునన్న ఆశ టెలిస్కోప్‌లతో మొదలుపెట్టి రేడియో టెలిస్కోప్, ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్, గామా టెలిస్కోప్ తదితరాల ఆవిష్కరణలకు దారితీస్తే... ఇవి విశ్వంలో నిరంతరం ప్రసారమయ్యే అనేక రకాల తరంగాలను పసిగట్టి వాటి ఆధారంగా ఎక్కడెక్కడ ఏముందో, విశ్వంలో ఏం జరుగుతున్నదో గ్రహించడానికి తోడ్పడుతున్నాయి. ఇప్పుడు ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేక విధాల ప్రత్యేకతలున్నది. సుదూర తీరాల్లో మరెన్ని పాలపుంతలు దాగున్నాయో అన్వేషించటానికీ, మన సౌర కుటుంబానికి ఆవల గ్రహాల ఆచూకీ రాబట్టడానికీ, ఇప్పుడు విశ్వంలో ఆవరించి ఉన్న నక్షత్ర ధూళిలో భవిష్యత్తు నక్షత్రాలుగా రూపుదిద్దుకోగల అవకాశమున్నవి ఉన్నాయో లేదో తెలుసు కోవడానికీ అవసరమైన సమాచారాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎప్పటికప్పుడు భూమికి చేరేస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే విశ్వం పుట్టకకు దారితీసిన పరిస్థితులేమిటో నిర్ధారణగా చెప్పడం సాధ్యమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట. విశ్వాంతరాళంలో ఇప్పుడు తిరుగాడే రకరకాల టెలిస్కోప్‌లకు ప్రధాన సమస్య సూర్యకాంతి. సూర్యుడికి అటువైపు ఏముందో చూడటానికి ఆ కాంతి ప్రధాన ఆటంకం. సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం తక్కువగా ఉండే ప్రాంతాలు అయిదున్నాయని, అక్కడికి టెలి స్కోప్లను చేరేస్తే తక్కువ ఇంధన వినియోగంతో దీర్ఘకాలం పని చేయించడం సులభమవుతుందని ఎన్నడో 1772 లోనే ఫ్రాన్స్‌కు చెందిన ఖగోళ, గణిత శాస్త్రవేత్త జోసెఫ్ లూయీ లాగ్రాంజ్ కనుక్కున్నాడు. ఆ అయిదు ప్రాంతాలనూ ఆయన పేరిటే ఎల్1, ఎల్2 వగైరాలుగా పిలుస్తున్నారు. వాటిలో ఎల్2 అనేకవిధాల ప్రయోజనకరమని మూడు దశాబ్దాలక్రితం నిర్ణయించారు. సూర్యుడు, భూమి, చంద్రుడు కాంతులు పెద్దగా విరజిమ్మని ప్రాంతమది. ఆ దట్టమైన చీకటి ప్రాంతానికి అంతరిక్ష నౌకను పంపగలిగితే అనేక ప్రయోగాలకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు గ్రహించారు. అయితే అక్కడ గురత్వాకర్షణ శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అదొక పెద్ద అవరోధం. అలాంటి చోటకు సకల హంగులతో ఉన్న టెలిస్కోప్‌ను పంపడం శక్తికి మించిన పని అని కొన్నాళ్లకే అర్థమైంది. ఎందుకంటే అక్కడుండే మైనస్ 233 డిగ్రీల ఉష్ణోగ్రతలో అందులోని పరికరాలను పనిచేయించడం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు గుర్తించారు. చివరకు అనేక రకాల ప్రయోగాల తర్వాత అత్యంత శీతల ప్రదేశంలో పనిచేసే పరికరాల తయారీ ఒక కొలిక్కి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తయితే, వాటన్నిటినీ అమర్చిన టెలిస్కోప్‌ను సురక్షితంగా ఎల్ 2 వద్దకు చేరేయడం మరో పెద్ద విన్యాసం. దాదాపు 350 రకాల ప్రక్రియలు పరస్పరం అనుసంధానించుకుంటూ సాగవలసిన ఈ ప్రయోగం విషయంలో చివరిదాకా శాస్త్రవేత్తలకు భయాందోళనలున్నాయి. మనిషి అంచనాకు అందని ఊహించని చిన్న లోపం చోటు చేసుకున్నా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రయోగం, మూడు దశాబ్దాల కాలం వృధా అవుతాయి. కానీ అంతా అనుకున్నట్టే పూర్తయింది. అది ఎల్2 కక్ష్యలోనే తిరుగాడటానికీ, ఎటూ జారిపోకుండా చూడటానికీ మూడు వారాలకొకసారి చిన్న చిన్న సర్దుబాట్లు చేయాల్సివస్తుంది. అంతా సవ్యంగా పూర్తయితే విశ్వరహః పేటిక తెరుచుకుని, విశ్వాంతరాళంపై మన అవగాహన కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. మనిషి రోదసిలోకి ప్రవేశించి, రకరకాల అంతరిక్ష నౌకలను ప్రవేశపెట్టి ఆరు దశాబ్దాలు దాటుతోంది. అలా చూస్తే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వంటి అపురూపమైన, సంక్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేయగలగడం ఖగోళ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో, నిరంతర అంతరిక్ష అన్వేషణలో కీలకమైన మలుపు. ఈ ప్రయోగం మున్ముందు మరిన్ని అరుదైన అద్భుతాలను ఆవిష్కరించగలదనీ, ఈ విశ్వానికి సంబంధించి మన విజ్ఞానాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనీ నిస్సం దేహంగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఖగోళ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, భిన్న రంగాలకు చెందిన నిపుణులు ప్రశంసనీయులు. -
ఇది ఘన ‘తంత్ర’మా?
భారతావనికి 73వ గణతంత్ర దినోత్సవ ఘడియలివి. సర్వసత్తాక, సార్వభౌమాధికార దేశంగా ఈ సంతోష వేళలోనూ అనవసర వివాదాలు రాజుకోవడమే విచారకరం. ఇండియా గేట్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం, పాకిస్తాన్‌పై యుద్ధంలో గెలిపించి ప్రాణాలర్పించిన 3,483 మంది జవాన్ల గౌరవార్థం 1972లో ఇందిరా గాంధీ ఏర్పాటుచేసిన ‘అమర్ జవాన్ జ్యోతి’ని ఆ దగ్గరే కొత్తగా 2019లో మోదీ సర్కారు పెట్టిన నేషనల్ వార్ మెమోరియల్ జ్యోతిలో విలీనం చేయడం, గణతంత్ర ఉత్సవాల నుంచి మహాత్మా గాంధీకి నచ్చిన ‘ఎబైడ్ విత్ మి’ పాట తొలగింపు – ఇలా ఒకటికి మూడు ప్రభుత్వ నిర్ణయాలు జరిగాయి. వీటన్నిటి కన్నా ముందే తమ రాష్ట్రాల ప్రత్యేక శకటాలకు ఉద్దేశపూర్వకంగా రిపబ్లిక్ డే కవాతులో అనుమతి నిరాకరించారంటూ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ఆరోపించాయి. వెరసి, ఈసారి ప్రతిదీ ఏదో ఒక రకంగా వివాదాస్పదమైంది. ఏటా గణతంత్ర వేడుకల ముగింపుగా జనవరి 29 సూర్యాస్తమయ వేళ సైనిక సంప్రదాయంగా బ్యాండ్ వాద్యవిన్యాసాల ‘బీటింగ్ రిట్రీట్’ ఆనవాయితీ. ఇంగ్లండ్‌లో 17వ శతాబ్దిలో మొదలైన ఈ శతాబ్దాల కాలపు వేడుక పద్ధతిని ఇప్పటికీ బ్రిటన్, అమెరికా, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలతో పాటు మనమూ అనుసరిస్తున్నాం. మన దేశపు వేడుకలో మహాత్మా గాంధీకి ప్రియమైన క్రైస్తవ ప్రార్థన ‘ఎబైడ్ విత్ మి’ ఏళ్ళుగా వస్తోంది. కానీ, ఈసారి మోదీ ప్రభుత్వం ఆ పాట తీసేసి, దాని బదులు 1962 భారత – చైనా యుద్ధంలో ఓటమి తర్వాత వీరజవాన్లలో స్థైర్యం నింపుతూ, హిందీ సినీకవి ప్రదీప్ రాసిన పాపులర్ దేశభక్తి గీతం ‘యే మేరే వతన్ కే లోగోం...’ పెట్టింది. గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు సి. రామచంద్రల మధ్య కొన్నేళ్ళ ప్రచ్ఛన్న యుద్ధానికి తెర దించిన ఘనత ఆ పాటదే. ప్రధాని నెహ్రూని కదిలించి, నేటికీ మనసులు కరిగించే ఆ పాట గొప్పదే. కానీ గాంధీకి ప్రియమైన ప్రార్థన మార్చి, దాన్ని పెట్టాల్సిన అత్యవసరమేంటి? ఇప్పటి దాకా మరుగునపడిన చరిత్రను జనానికి చాటి, జరిగిన లోపాన్ని సరిచేయడానికే ఈ ప్రయత్నమన్నది ప్రధాని మోదీ ఉవాచ. చరిత్రలో ప్రాధాన్యం దక్కకుండా పోయిన ఘటనలకూ, వ్యక్తులకూ తగిన గుర్తింపు తేవాల్సిందే. అందుకోసం ఇప్పటికే జనంలో జ్ఞాపకంగా మిగిలినవాటిని గుర్తులే లేకుండా చేయాలా అన్నది విమర్శ. అందరికీ ప్రేరణ అయిన కొందరిని తమ వారిగా మలుచుకొని, సంఘ్‌పరివార్ భావజాలానికి సర్వజన అంగీకారం తేవడమనే కుట్ర దీనిలో ఉందని ఆరోపిస్తున్నవారూ ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ఆవిర్భావ స్వర్ణోత్సవ సందర్భంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని నేటి పెద్దలు కనీసం స్మరించుకోలేదు. దానిపైనా విమర్శలు రేగాయి. ఎవరి ఘనత, ఎవరి స్థానం వారిదే. కానీ, గాంధీని కాదని లాల్ బహదూర్నీ, నెహ్రూను వద్దని పటేల్‌నూ ఇతరేతర కారణాలతో తలకెత్తుకోవడం ఎలా సమర్థనీయం? కొందరు ఆరోపిస్తున్నట్టు ఇందిరా గాంధీ హయాంలో వచ్చింది కాబట్టి అమర జ్యోతిని ఆర్పేశారన్నది నిజమే అయితే, ఆ చర్య ఏ రకంగా హర్షణీయం? స్వాతంత్య్రానంతర యుద్ధాల్లో మరణించిన జవాన్ల పేర్లున్న వార్ మెమోరియల్ సరే, అంతకు మునుపటి యుద్ధాల్లో అమరులైన 15 వేల మందికి పైగా వీరుల గౌరవం మాటేమిటి? ఇది చరిత్ర నిర్మాణమా, వినిర్మాణమా అన్న విమర్శ వినిపిస్తోంది అందుకే. కేంద్రం పెట్టాలనుకుంటున్న పాతికడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పు గ్రానైట్ విగ్రహానికి మించి సమున్నతమైనది నేతాజీ చరిత్ర. ఆ వీరుడి 125వ జయంతి వేళ గణతంత్ర ఉత్సవం మూడు రోజుల ముందుగా జనవరి 23 నుంచే జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గాంధీ, నెహ్రూలతో విభేదాలుండి, జర్మనీ, జపాన్ల సాయంతో బ్రిటీషు పాలకులపై యుద్ధానికి దిగిన నేతాజీ నామస్మరణను కేంద్రం ఇప్పుడే ఎందుకు చేస్తోంది? నిరుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పాలకపక్ష నేతలకు ఈ బెంగాలీ బిడ్డపై ప్రేమ పొంగుకు రావడంలో అంతరార్థమేంటి? ప్రతిపక్షాలపై పైచేయి కోసం చరిత్రను మార్చేందుకు పాలకపార్టీ ప్రయత్నిస్తోందని కొన్నేళ్ళుగా ఓ ఆరోపణ. ఈ నేపథ్యంలో హడావిడి నిర్ణయాల బదులు నిపుణులతో సంప్రతించాల్సింది. ప్రజాభి ప్రాయం తెలుసుకోవాల్సింది. అలా చేస్తే వివాదం ఉండేది కాదు. చివరకు ఇటు నేతాజీ, అటు కవి ప్రదీప్‌ల వారసులు తమ వారికి దక్కిన అనూహ్య గౌరవానికి సంతోషిస్తూనే, మతనిగ్రహం లేకుండా విగ్రహాలు, గాంధీని కాదని కొత్త పాట పెట్టడాలను వ్యతిరేకిస్తుండడం కొసమెరుపు. సంక్షుభిత కాలంలో పరిష్కరించాల్సిన సమస్యలెన్నో ఉండగా, ఈ వివాదాస్పద చర్యల అవసరమేంటో అర్థం కాదు. వలసవాద కాలం నాటి పద్ధతులను మార్చాలని చెబుతున్న పాలకులు ముందుగా తమలోని వలసవాద పాలక మనస్తత్వాన్ని మార్చుకొనే ప్రయత్నం చేయాలి కదా అన్న సోషల్ మీడియా ప్రశ్నకు జవాబు లేదు. ప్రపంచమంతటా పాలకులు తమకు అనుకూల కథనాలే మిగలాలనీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమ హీరోలను నిలపాలనీ తాపత్రయపడడం తరతరాలుగా తెలిసిందే. కానీ, భిన్న సంస్కృతులు, విభిన్న ఆలోచనల సంగమమైన భారతావనిలో ఏకరూప అజెండాను సాధించాలనుకోవడం సరికాదు. ‘చరిత్ర అడగకు... చేస్తున్నది చూడు’ అనేది అధికారంలో ఉన్నవారి ధోరణి అయితే, అది ప్రజలకూ, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికీ నష్టమే. అలా ఎవరైనా ప్రవర్తిస్తే, ఆనక వారి స్థానమేంటో కాలమే తేలుస్తుంది. ఎందుకంటే, అందరి కన్నా అతి నిరంకుశమైనది కాలం! అది వలసవాద కాలానికి ముందెప్పటి నుంచో చరిత్ర చెప్తున్న పాఠం! -
మన చేతుల్లోనే... చేతల్లోనే...
ఒక దుర్వార్త... ఆ వెంటనే ఓ శుభవార్త. కరోనాపై దేశంలో తాజాగా వినిపిస్తున్న విషయాలివి. విజృంభిస్తున్న కరోనా మూడోవేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశలో ఉందని ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్2 జీనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియమ్) ఆదివారం హెచ్చరించింది. కరోనా ప్రమాద స్థాయి ఇప్పటికీ అలానే ఉందనీ అప్రమత్తం చేస్తోంది. ఇది ఎవరూ ఇష్టపడని వార్త. కాగా, భయపెడుతున్న ఈ థర్డ్ వేవ్‌కు ఫిబ్రవరి మధ్యకల్లా తెరపడుతుందని ప్రభుత్వ వర్గాల తాజా మాట. ప్రతి ఇంటా ఒకరికి ఇద్దరు జ్వరం, జలుబు లాంటి కరోనా లక్షణా లతో బాధ పడుతున్న వేళ ఇది చెవికి ఇంపైన మాట. రానున్న పక్షం రోజుల్లో ఈ వేవ్ తారస్థాయికి చేరుతుందనే ఐఐటీ మద్రాసు ప్రాథమిక అంచనాతో అప్రమత్తత తప్పనిసరి అని అర్థమవుతోంది. గత తొమ్మిదివారాల్లో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది ఒమిక్రాన్ బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్క. 170కి పైగా దేశాలకు పాకిన ఈ వేరియంట్, వేవ్ విస్తృతికి ఇదే ఉదాహరణ. అలాగే, ఒమిక్రాన్ పోతే ఇక ప్రపంచానికి కరోనా పీడ విరగడ అయినట్టేనని అందరిలో నెలకొంటున్న ఉదాసీనత పెద్ద పొరపాటు. ఒమిక్రాన్ తర్వాత మరిన్ని కొత్త వేరియంట్లు రావ చ్చంటూ డబ్యూహెచ్ఓ చేసిన తాజా ప్రకటన ఓ పారాహుషార్. మన దేశంలో ఇప్పటికీ రోజుకు 3 లక్షల కేసుల పైనే వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 20కి పైనే ఉంది. ఢిల్లీ, ముంబయ్ లాంటి నగరాల్లో ముందుగానే తడాఖా చూపిన థర్డ్ వేవ్ అక్కడ కాస్తంత తగ్గుముఖం పట్టినా, దేశంలోని పలుచోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు విస్తరిస్తూ ఉండడం ఆందోళనకరం. వేర్వేరు భౌగోళిక పరిస్థితులున్న విశాల భారతావనిలో అంతటా ఒకేసారి కరోనా ఉద్ధృతి కనిపించి, ఒకేసారి తగ్గి పోదనే విషయం గమనంలో ఉంచుకోవడం అవసరం. పెరుగుతున్న కేసులతో వైద్యం మొదలు అన్ని రంగాల్లో సిబ్బంది తగ్గి, పని ఒత్తిడి పెరుగు తుండడం మరో పెద్ద చిక్కు. ఒక పక్క డెల్టా ప్రభావం పూర్తిగా పోలేదనీ, నూటికి 10 – 20 కేసులు ఆ వేరియంట్వీ ఉన్నాయనీ ఓ అంచనా. డెల్టా ఉండగానే ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది గనక రెండిందాలా జాగ్రత్త తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశంలో ఇప్పటికి 162 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేయడం సంతోషకరం. దేశంలో 15 ఏళ్ళ పైబడినవారిలో ఇప్పటికి 67.2 శాతం మందికి పూర్తిగా, 91.3 శాతం మందికి కనీసం ఒక డోసు వేసినట్టు లెక్క. కానీ, దురదృష్టవశాత్తూ లోటుపాట్లూ లేకపోలేదు. తొలి డోసే వేస్తున్నా, రెండో డోసు టీకా వేస్తున్నట్టు సర్టిఫికెట్లలో నమోదు చేయడం లాంటి వార్తలు రాజధానుల్లో సైతం రావడం నివ్వెరపరుస్తోంది. చిత్తశుద్ధి లేకుండా లెక్క ల్లోనే టీకా డోసులు చూపించడమనే తప్పిదానికి పాల్పడితే, అది మొదటికే మోసం తెస్తుంది. ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకుంటే తప్ప, ఏ ఒక్కరూ సురక్షితం కాదని ప్రపంచమే ఘోషిస్తున్న వేళ కాకి లెక్కలకు దిగితే కష్టం. జనాన్ని మోసం చేయచ్చేమో కానీ, జాలి లేని మహమ్మారిని మోసం చేయలేం. జీవనం దెబ్బతినకుండా ప్రజల్లో, ఆర్థిక వ్యవస్థలో ధైర్యం కలిగించాల్సింది పాలకులైతే, మహమ్మారిని సైతం జయించగలమని ఆత్మవిశ్వాసం ప్రోది చేయాల్సింది వైద్యనిపుణులు. రోజుకో మాట, పూటకో రకం ప్రోటోకాల్... సందేహాలకు దారి తీస్తున్నాయి. మోల్నుపిరావర్ లాంటి ఔష ధాల వాడకంపై వచ్చిన పరస్పర భిన్నమైన ఆదేశాలే అందుకు నిదర్శనం. కోట్ల జనాభా కారణంగా రోగానికి సత్వర చికిత్సపై పరిశోధకులపై ఒత్తిడి ఉండడం సహజమే కానీ, పరిశోధనా ఫలితాలు మన అవసరాలకు తగ్గట్టుగానే ఉండాలని ఒత్తిడి పెడితే సరి కాదు. సెకండ్ వేవ్‌లో లాగా థర్డ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరం రాకపోవడం సంతోషించాల్సిందే. కానీ, ఒమిక్రాన్ సాధారణ జ్వరం – జలుబు లాంటిదేననీ, మహమ్మారి కాస్తా మామూలు జలుబులా మారిపోతోందనీ అతి ప్రచారం నిర్లక్ష్యానికి బాటలు వేస్తోంది. పాక్షిక నిజమైన ఆ ప్రచారాన్ని పట్టుకొని, అశ్రద్ధ చూపితే అది ప్రమాదమని నిపుణుల మాట. మరి, ఈ సీరియస్ విషయం జనంలోకి మొదటి ప్రచారమంత బలంగా వెళుతోందా అన్నది ప్రశ్న. తొందరపడి ముందే కూసిన కోయిలలా చేస్తే కష్టం, నష్టం మనకే! మన దేశంలో కరోనా మొదటి వేవ్‌కు కారణమైన ఆల్ఫా వేరియంట్ కన్నా, రెండో వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువ చూపింది. 18 ఉత్పరివర్తనాలున్న డెల్టాతో పోలిస్తే, 50 మ్యుటేషన్లున్న ఒమిక్రాన్ 70 రెట్లు అధికంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్‌తో ప్రాణహాని లేదని నిర్లక్ష్యంగా తిరిగి, వ్యాప్తిని పెరగనిస్తే చిక్కే. ఒమిక్రాన్ నుంచి కొత్త వేరియంట్లు తలెత్తే ప్రమాదం ఉంది. టీకా వేసుకున్నా సరే దెబ్బ కొడుతున్న ఒమిక్రాన్‌తో పోలిస్తే, ఆ కొత్తవి మునుపటి డెల్టాలా తీవ్రమైనవి కావచ్చని వైద్యుల హెచ్చరిక. అందుకే, థర్డ్ వేవ్ విజృంభణ వేళ అలకు ఎదురెళ్ళ కుండా, తల వంచుకొని తప్పించుకోవాలి. చేజేతులా కొత్త వేరియంట్‌కు కారణం కారాదు. కరోనా అనంతర దీర్ఘకాలిక కోవిడ్ ఇబ్బందులుంటాయనీ విస్మరించరాదు. కరోనా లెక్కల్లో మనం ఒక అంకె మాత్రమే. కానీ, మన కుటుంబానికి... మనమే సర్వస్వం. తోటివారి పట్ల కూడా బాధ్యతతో కరోనా జాగ్రత్తలు పాటించడమే ప్రస్తుత కర్తవ్యం. ఆఫ్రికాలోని కెన్యా, నైజీరియా లాంటి మధ్యాదాయ దేశాల్లో సైతం టీకాకరణ 10 శాతం లోపలే అయింది. ఈ ఏడాది మధ్యకల్లా ప్రతి దేశంలో కనీసం 70 శాతం జనాభాకు టీకాలేయడం పూర్తయితేనే, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ సురక్షితం! -
ఉద్యోగపర్వం... మిత్ర వైరుధ్యం!
సమానత్వం పొడగిట్టని అన్యాయమైన పంపిణీ విధానం నేడు ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఈ తరహా పంపిణీ పునాదిపై విరాజిల్లుతున్న ఆర్థిక వ్యవస్థలో సమస్త వృత్తులవారు, సబ్బండ వర్ణాల వారు, వైట్‌కాలర్ నుంచి బ్లూ కాలర్ వరకు ఉండే కర్మచారులందరూ బాధితులే! కొందరు ఎక్కువ బాధితులు, కొందరు తక్కువ బాధితులు. అంతే తేడా! వేగంగా పెరుగు తున్న సంపద అంతరాలను కరోనా మహమ్మారి పూడ్చలేని అగాధాలుగా మార్చివేసింది. దావోస్‌లో ప్రతియేటా ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు ముందు సంపద పంపిణీలో అంతరాలపై ‘ఆక్స్‌ఫామ్’ అనే స్వతంత్ర సంస్థ ఒక నివేదికను ఆనవాయితీగా విడుదల చేస్తున్నది. ఈ సంవత్సరం కూడా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 99 శాతం మంది ఆదాయాలు కరోనా వేళ గణనీయంగా పడిపోయాయి. ఒక్క శాతం సంపన్నుల ఆస్తులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. మధ్యతరగతి శ్రేణుల్లో ఉన్న 16 కోట్లమంది కొత్తగా పేదరికంలోకి జారిపోయారు. భూగోళం జనాభాలో 50 శాతంగా ఉన్న 400 కోట్లమంది పేదలు ఉమ్మడిగా సంపాదించిన దానికంటే ఒక్కశాతం మంది సంపన్నులు ఎక్కువ సంపాదించారు. పేదలు – ధనికుల మధ్య జెట్ స్పీడ్‌తో పెరుగుతున్న అంతరాలను తగ్గించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాలకు ‘ఆక్స్‌ఫామ్’ విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఈ పరిణామం అమానవీయ పర్యవసానాలకు దారితీస్తుందని అది హెచ్చరిస్తున్నది. ఇలా చెబుతున్నది ఒక్క ‘ఆక్స్‌ఫామ్’ మాత్రమే కాదు. ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్తలందరిదీ ఇదే మాట! వారిలో పెట్టుబడిదారీ విధాన ప్రబోధకులున్నారు. సోషలిస్టు ప్రవచ కులూ ఉన్నారు. సంక్షోభం వేళ పేద ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా చూడాలనీ, వారి చేతుల్లో తగినంత నగదును ఉంచే ఏర్పాటు చేయాలనీ వారు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ నగదు చలామణీలోకి రాకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలు తుందని వారు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా తరతమ భేదాలతో చాలా ప్రభుత్వాలు ఈ హెచ్చరికలను స్వీకరించాయి. మనదేశంలోనూ కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా కొన్ని చర్యలను చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో అగ్రభాగాన నిలబడింది. ఇప్పటికే అది సుమారు ఒక లక్షా పాతికవేల కోట్ల రూపాయలకు పైగా నగదును పేద ప్రజలకు బదిలీ చేసింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా నిలబడగలిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం మరో విలక్షణమైన కోణాన్ని జోడించింది. మహిళలూ, బలహీన వర్గాల ప్రజలను సాధికారికంగా శక్తిమంతం (ఎంపవర్డ్) చేసే కార్యక్రమాలను ఏకకాలంలో చేపట్టింది. తిండి, గుడ్డకు ఢోకా లేకుండా చూడటమొక్కటే కాదు. దాంతోపాటు సమస్త ప్రజలు విద్య, వైద్యం, విజ్ఞాన, వికాసాలతో కూడిన ఆత్మగౌరవ జీవనాన్ని అందుకోవడానికి దోహదపడే కార్యక్రమాలను ప్రారంభించింది. కరోనా సంక్షోభం ఫలితంగా అన్ని రాష్ట్రాలూ, అన్ని దేశాలూ ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ది రెట్టింపు సమస్య. రాష్ట్ర విభజనతో రాజధానిని కోల్పోవడం వలన రెవెన్యూలో సింహభాగాన్ని కోల్పోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి చంద్రబాబు ప్రభుత్వం మోపిన అప్పుల భారం వలన ఏటా రూ. ఇరవైవేల కోట్ల వడ్డీల భారం మీద పడింది. అదనంగా మరో అరవై వేల కోట్ల బకాయిల బరువు. ఈ బరువును మోస్తూనే కరోనా సంక్షోభాన్ని ఈదవలసి వచ్చింది. సంక్షోభం మొదటి రెండేళ్లలో రాష్ట్రం ఇరవై రెండు వేల కోట్ల రెవెన్యూను కోల్పోవలసి వచ్చింది. అదే సమయంలో కరోనాను ఎదుర్కోవడం కోసం వైద్యరంగంలో ఎనిమిదివేల కోట్ల ఖర్చును ప్రభుత్వం అదనంగా పెట్టవలసి వచ్చింది. మొత్తం కలిపి రెండేళ్లలో కరోనా మహమ్మారి ముప్పయివేల కోట్ల రూపాయలను భోంచేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ సమస్య ముందుకు వచ్చింది. జగన్మోహన్రెడ్డి స్వభావం చంద్రబాబుకు పూర్తిగా భిన్నమై నది. ఉద్యోగ వ్యవస్థ, వారికిస్తున్న జీతభత్యాల పట్ల చంద్రబాబుకు మొదటి నుంచీ వ్యతిరేకత ఉండేది. ఈ వ్యతిరేకతను ఆయనెక్కడా దాచుకోలేదు కూడా! ‘మనసులో మాట’ పేరుతో ఆయన తన మనోభిప్రాయాలను ఒక పుస్తకంగా కూడా వేసుకున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగ వ్యవస్థ గుదిబండగా మారిందని అందులో ఆయన అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో, తక్కువ వేతనాలిచ్చి పని చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వతంగా ఉండకూడదు. పనితీరును బట్టి ఉద్యోగులను కొనసాగించాలని అభిప్రాయ పడ్డారు. ఆయన అధికారంలో ఉన్నంతకాలం అదే వైఖరితో కొనసాగారు. పెట్టిపోతల్లో జగన్మోహన్రెడ్డి చేతికి ఎముక లేదంటారు. ఆ ఒరవడిలోనే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతాన్ని మధ్యంతర భృతి (ఐఆర్)గా ప్రకటించారు. అప్పటికింకా కరోనా సంక్షోభం చుట్టుముట్టలేదు. మరే ఇతర రాష్ట్రమూ ఐఆర్‌ను ప్రకటించక పోయినప్పటికీ, కొత్త వేతన సవరణ అమలులోకి వచ్చేలోగా ఉద్యోగులు ఇబ్బందిపడకుండా చూసేందుకోసమని ఆయన ప్రకటించారు. ఉద్యోగులందరూ ఈ చర్యను స్వాగతించారు. కరోనా అనంతర ఆర్థిక పరిస్థితులను సమీక్షించుకున్న అనంతరం ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణ ప్యాకేజీ ఉద్యోగ సంఘాలకు రుచించలేదు. అవిప్పుడు ఆందోళన బాట పట్టాయి. కొత్త వేతన సవరణ ప్యాకేజీలోని ఐదు అంశాలపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. 1. ఐఆర్‌గా 27 శాతాన్ని ప్రకటించి అంతకన్నా తక్కువగా 23 శాతం ఫిట్మెంట్ ఎలా ఇస్తారు? 2. ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)లను తగ్గించడం సమంజసం కాదు. 3. పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇచ్చి, జీతం తగ్గలేదని చెబుతున్నారు. ఈ లెక్క తప్పు. 4. వేతన సవరణ ఇక మీదట పదేళ్లకోసారి అని చెప్పడాన్ని అంగీకరించం. 5. పెన్షన్‌లో అదనపు శ్లాబును పొందే వయోపరిమితిని 70 నుంచి 80 ఏళ్లకు మార్చారు. దీనివల్ల 70–80 ఏళ్ల మధ్యన ఉన్న పెన్షనర్లు నష్టపోతున్నారు. ఉద్యోగ సంఘాలకున్న ప్రధానమైన ఈ ఐదు అభ్యంత రాలపై వివిధ సందర్భాల్లో ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. వారి వివరణ ప్రకారం 1. మధ్యంతర భృతి (ఐఆర్)ని ఉద్యోగ సంఘాలు జీతంగా పరిగణిస్తున్నాయి. అది తప్పు. పీఆర్సీ (వేతన సవరణ) నుంచి పీఆర్సీ వరకు వేతన వ్యత్యాసాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. పీఆర్సీ వచ్చేవరకు ఉద్యోగుల సౌకర్యార్థం అమలుచేసిన ఏర్పాటు ఐఆర్. దాన్ని జీతంగా పరిగణించి అంతకు మించి రావాలనడం సమంజసం కాదు. 2. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే హెచ్ఆర్ఏ శ్లాబుల సవరణ జరిగింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నాయి. 3. వేతన ప్యాకేజీలో ఒకచోట తగ్గి ఒకచోట పెరిగినా... మొత్తంగా పెరిగిందా లేదా అనేది చూసు కోవాలి. ఆ లెక్క ప్రకారం కొత్త పే స్లిప్స్‌లో జీతం పెరుగుదల కనిపిస్తుంది. ఐఆర్‌గా ప్రకటించిన రూ. 18 వేల కోట్లకు అదనంగా పీఆర్సీ వల్ల మరో 10 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. 4. పదేళ్లకోసారి పీఆర్సీ అనేది కేంద్ర ప్రభుత్వ విధాన ప్రకటన మేరకే! 5. పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పొడిగించినందు వల్ల రెండేళ్లపాటు అదనపు జీతం లభిస్తుంది. సర్వీస్ పెరగడం వల్ల పెన్షన్ కూడా పెరుగుతుంది. గ్రాట్యుటీ రూపంగా ఇప్పుడిస్తున్న రూ. 12 లక్షలను 16 లక్షలకు పెంచడం జరిగింది. ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్’లో 10 శాతం స్థలాలను ఉద్యోగులకూ, 5 శాతం స్థలాలను పెన్షనర్లకూ 20 శాతం రిబేట్‌పై ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పీఆర్సీతో సంబంధం లేకుండా ఈ రెండున్నరేళ్లలో పది పన్నెండు కేటగిరీల ఉద్యోగులకు పెంచిన వేతన వివరాలను కూడా ప్రభుత్వ ప్రతినిధులు ఏకరువు పెట్టారు. రాష్ట్ర విభజన, కోవిడ్ సంక్షోభాల కారణంగా రాష్ట్ర సొంత ఆదాయం బాగా పడిపోయింది. కానీ ఉద్యోగుల జీతభత్యాల వ్యయం ఆదాయాన్ని మించి పెరిగింది. 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం రూ. 60,688 కోట్లయితే, ఉద్యోగుల జీతభత్యాల వ్యయం 67,340 కోట్లకు పెరిగింది. పీఆర్సీ అమలు తర్వాత ఈయేడు వ్యయం మరింత పెరుగుతుంది. ఆదాయం ఎంత పెరుగుతుందో చెప్పలేము. ప్రభుత్వం చేస్తున్న వార్షిక వ్యయంలో 36 శాతం జీతభత్యాలకే పోతున్నది. ఇది అన్ని రాష్ట్రాలలోకీ అత్యధికం. ఈ ఆర్థిక విషయాలన్నింటినీ ప్రభుత్వం బలంగానే ఉద్యోగ సంఘాల ముందుంచింది. అయితే ఉద్యోగ సంఘాలు ఈ గణాంకాలకు సంతృప్తి చెందలేదు. తమ వాదనకే కట్టుబడి ఉన్నాయి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులను సంతృప్తిపరచాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఒక్కటే. పేద ప్రజల సంక్షేమం, వారిని సాధికార శక్తులుగా మలచడం కోసం అమలుచేస్తున్న పలు కార్యక్రమాల్లో కొన్నింటికి కోతవేయడం! ఇది అభిలష ణీయమా? ఈ చర్య వలన నష్టపోయే వర్గానికీ, ఉద్యోగ వర్గానికీ మధ్య వైరుధ్యం ఏర్పడదా? వైరుధ్యం ఏర్పడకూడదు. పెరుగుతున్న ఆర్థిక అంతరాల విభజనలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా సాధారణ ప్రజల పక్షాన నిలబడవలసినవారే! వారి లాగే పెరుగుతున్న ధరల బాధితులే! విద్య, వైద్యం వంటి అంగడి కోరలకు గాయపడిన క్షతగాత్రులే! కానీ, ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రైతులు, కూలీలు, కార్మికులతో పోల్చినప్పుడు ఎంతోకొంత స్థితిమంతులు, భద్ర జీవులు. ఐటీ రంగంలో జీతాలు ఎక్కువైనప్పటికీ ఉద్యోగ భద్రత తక్కువ. తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లల్ని ప్రభుత్వో ద్యోగులుగా చూసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ ఉద్యోగంలో ఉన్న భద్రత, గౌరవం, హోదా అలాంటివి. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులే జీతభత్యాల కోసం రోడ్డెక్కితే మిగిలిన ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ప్రభుత్వోద్యోగులు సమ్మెకు దిగితే సమస్యలనెదుర్కొనేది సామాన్య ప్రజలే కదా! ఆ ప్రజల మద్దతు లేకుండా సమ్మె పోరాటాలు విజయం సాధిస్తాయా?... ఉద్యోగుల కోర్కెలు గొంతెమ్మ కోర్కెలేమీ కాకపోవచ్చు. అవి న్యాయమైనవే! సందేహం లేదు. కానీ న్యాయం ఎప్పుడూ సాపేక్షమే! అటువంటి న్యాయాన్ని సమాజంలోని మిగిలిన అన్నివర్గాలూ కోరుకుంటాయి. సాధారణ ప్రజలు ఉద్యోగులకు మిత్రులే. శత్రువులు కాదు. మిత్రవైరుధ్యం వలన నష్టాలే తప్ప విజయాలు సిద్ధించవు. మిత్రులతో నిరంతర సమన్వయం లేకుండా ఏ ఒక్క వర్గమూ విడిగా సాధించగలిగేదేమీ ఉండదు. ఉద్యోగ సంఘాల సంఘటిత శక్తి గొప్పదే! కానీ కొన్ని సందర్భాల్లో ఆ శక్తిని నాయకులు తప్పుగా అంచనా వేసుకుంటారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 55కు తగ్గించారు. దానిపై పెద్దయెత్తున ఉద్యోగులు ఉద్యమించారు. ఎన్జీవో నేతగా స్వామినాథన్ ఉండేవారు. బలమైన నాయకుడు. ‘చెన్నారెడ్డి వంటి హేమాహేమీలతోనే తల పడ్డాము. ఈ రామారావు మాకో లెక్కా’ అంటూ సమ్మె సందర్భంగా రాజకీయ ప్రసంగాలు చేసేవారు. సుదీర్ఘంగా సాగిన ఆ సమ్మె చివరకు విఫలమైంది. అసలు డిమాండ్‌ను పక్కనపెట్టి సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించాలని విజ్ఞప్తులు చేయవలసి వచ్చింది. రాజకీయ ఉపన్యాసాలు సత్ఫలితాలను ఇవ్వలేదు. సమ్మె తర్వాత రెండేళ్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్టీ రామారావు మరోసారి గెలవకుండా స్వామినాథన్ నిరోధించ లేకపోయారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చంద్రబాబు.. ది గ్రేట్ వన్‌సైడ్ లవర్!
సావిరహే తవదీనా రాధా!... యమునా తీరమునా సంధ్యా సమయమునా వేయి కనులతో రాధా వేచియున్నది కాదా!... ఇది క్లాసికల్ ప్రేమసందేశం. కాలక్రమంలో కవులు, కళాకారులు, రచయితలు, సినిమా దర్శకులు ప్రేమ సందేశాల వ్యక్తీకరణలో విప్లవాత్మక ప్రయోగాలు చేపట్టారు. పెక్కు సంస్కరణలు మోసుకొచ్చారు. తాజాగా రాజకీయ ప్రేమ సందేశాలు కూడా రంగప్రవేశం చేశాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ధనప్రభావాన్ని జొప్పించిన నాయకుడు, ఓట్లను కొనుగోలు చేసే పద్ధతికి ఆద్యుడు, వెన్నుపోటును ప్రజాస్వామ్య పరిరక్షణగా మెప్పించగలిగిన దిట్ట, మీడియాను మచ్చిక చేసుకుని అచ్చికబుచ్చికలాడుతున్న నేర్పరి ఎవరైతే ఉన్నారో వారే ఈ రాజకీయ ప్రేమరాకెట్ను కుప్పం అంతరిక్ష కేంద్రం నుంచి మొన్న ప్రయోగించారు. పాతతరం సినిమా ‘మరోచరిత్ర’లో దర్శకుడు బాలచందర్ చెప్పినంత వెరయిటీగా, కొత్తతరం దర్శకుడు ‘జాతిరత్నాలు’ సినిమాలో చెప్పినంత ఆఫ్బీట్గా చంద్రబాబు రాజకీయ ప్రేమ సందేశాన్ని చెప్పగలిగారు. ముందుగా ‘ఇట్లు తమ విధేయుడు’ అనదగ్గ కార్యకర్త ఒకరు లేచి ‘మనం జనసేనతో పొత్తు పెట్టుకుందాం సార్’ అని టాపిక్‌ను అందించాడు. మామూలు గానైతే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇలాంటి సందర్భాల్లో కొన్ని స్టాండర్డ్ సమాధానాల్లో ఏదో ఒకటి చెబుతారు. ఒకటి: ఆ పార్టీ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నది కదా! వాళ్లు విడిపోతే చూద్దాం. రెండు: ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఇప్పుడే పొత్తుల గురించి ఎందుకు? మూడు: పొత్తులు అవసరమా లేదా అనే అంశాన్ని పార్టీ కార్యవర్గంలో చర్చించవలసి ఉన్నది. చంద్రబాబు వీటిలో ఏదీ చెప్పలేదు. ‘నువ్వొక అమ్మాయిని ప్రేమిస్తున్నావనుకో తమ్ముడూ... అది వన్‌సైడ్ లవ్వయితే కుదరదు కదా! అటునుంచి కూడా ప్రేమించాలి కదా’ అంటూ తన మనసులో ఉన్న ప్రేమ కథను వెల్లడించారు. తానిప్పుడు వన్‌సైడ్ లవ్‌లో ఉన్నట్టు అంగీక రించారు. తాను ప్రేమిస్తున్న పార్టీ మరో పార్టీతో సహజీవనం చేస్తున్నా సరే, కలిసి డ్యూయెట్ పాడేందుకు తాను సిద్ధమేనని పరోక్షంగా కుండ పగలగొట్టారు. అవతలి పార్టీ కూడా మరో కుండ పగలగొట్టి ‘సై’ అంటుందా, ‘ఛీ పో’ అంటుందా అన్నది ఇంకా తేలవలసి ఉన్నది. చంద్రబాబు రాజకీయ ప్రేమకథలన్నీ ఎప్పుడూ వన్‌సైడ్ లవ్‌గానే ప్రారంభమౌతాయి. తన అవసరాన్ని బట్టి ముందుగా తాను ప్రేమిస్తాడు. తర్వాత సదరు పార్టీ ప్రేమించవలసి వస్తుంది. నయానో భయానో మీడియా ద్వారానో ఒప్పుకునేలా చేస్తారు... ఈతరం యాసిడ్ బాటిల్ ప్రేమికుడి తరహాలో!... అయితే యాసిడ్ బాటిల్ తన చేతిలో ఉండదు. పెంపుడు మీడియా చేతిలో ఉంటుంది. ఆయన ప్రేమకు స్పందించక పోయినా, లేదా ఆయనకే మొహం మొత్తినా అవతలి పార్టీపై యాసిడ్ చల్లే బాధ్యత పెంపుడు మీడియాదే! వాజ్‌పేయి ప్రతిష్ఠతో ఎన్నికల్లో గట్టెక్కాలనుకున్నప్పుడు పెంపుడు మీడియాకు బీజేపీ అభ్యుదయ పార్టీగా కనబడింది. పొత్తు వద్దనుకున్నప్పుడు అదే పార్టీ మసీదులు కూల్చే పార్టీగా కనిపిం చింది. కమ్యూనిస్టులు అవసరమైనప్పుడు కమ్యూనిజం గ్రేట్! అవసరం తీరిన తర్వాత టూరిజం గ్రేట్! ఓడ మల్లయ్య – బోడి మల్లయ్య థియరీ! గడిచిన మూడు నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీకి బహిరంగ ప్రేమకథలు లేవు... లోపాయకారీ వ్యవహారాలు తప్ప! ‘విరహము కూడా సుఖమే కాదా, విరహపు చింతన మధురము కాదా’ అని పాడుకుంటూ ఈ కాసింత కాలాన్ని నెట్టుకొచ్చేసింది. ఇక విరహ వేదన తన వల్ల కాదనే నిర్ణయానికి వచ్చేసినట్లుంది. కాళిదాసు మేఘసందేశాలనూ, శ్రీనాథుడి హంస రాయబారాలనూ మొదలుపెట్టింది. ఈ మార్పునకు కారణమేమిటి? తెలుగుదేశం పార్టీ అధినేతల అసలు సిసలైన విరహ వేదన అధికారంతో! రాజకీయ పొత్తుల కోసం కాదు!! దూరమైన అధికారం దరికి మళ్లీ చేరడం అంత సులభసాధ్యం కాదని బోధపడింది. తత్వం అవగతమైంది. సాధారణ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మధ్య పది శాతానికి పైగా ఓట్ల తేడా కనబడింది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఈ తేడా రెండు రెట్లు పెరిగింది. ప్రతిపక్ష పార్టీ చేయించుకున్న సర్వేల్లోనే అధికార పార్టీ బలం 50 శాతానికంటే తగ్గే అవకాశం, తమ ఓట్లు 35 శాతం కంటే పెరిగే అవకాశం లేదని వెల్లడైనట్లు సమాచారం. మరిప్పుడెలా? అధికారాన్ని అందుకోవడానికి ఉన్న దారులే మిటి? ఈ అంశంపై జరిగిన అనేక మేధోమథనాల తర్వాత ఒక ద్విముఖ వ్యూహాన్ని ఆ పార్టీ రూపొందించినట్టు తెలుస్తున్నది. చిన్నాచితకా పార్టీలైనా సరే వీలయినన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి. చినుకు చినుకునూ ఒడిసిపట్టి ఓట్ల శాతాన్ని పెంచుకోవాలి. ఇది వ్యూహంలో పార్ట్ వన్! అధికార పార్టీ బలం యాభై శాతంకంటే తగ్గకపోతే ఎన్ని ఓట్లను పెంచుకున్నా ఏం ఫాయిదా? అందుకని వాళ్ల ఓట్లు తగ్గేలా నిందాప్రచారం చేయాలి. ఇది పార్ట్ టూ! ఈ ద్విముఖ వ్యూహాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రారంభించారు. ఉన్మాదం ఊరేగుతున్నట్టుగా, అబద్ధాలు అంబారీనెక్కినట్టుగా ఉధృత స్థాయిలో నిందాప్రచారం మొదలైంది. ఈ నిందలకు ఒక ఆధారం లేదు, ఒక తర్కం లేదు, ఒక విచక్షణ లేదు. బట్ట కాల్చి మీద వేయడమే సింగిల్ పాయింట్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్‌కు విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్మోహన్రెడ్డి వల్ల జరిగిన నష్టమే ఎక్కువట? ఎలా అని వివరాలడగొద్దు. చెప్పింది వినండి అంతే! రాజధానిని కోల్పోయి ఖండిత శరీరంతో మిగిలిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదనీ, అదేమీ సంజీవని కాదనీ చెప్పిందెవరు? ఢిల్లీ దర్బార్ కటాక్ష వీక్షణాల కోసం తాకట్టు పెట్టిందెవరు?.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉపయోగించుకునే సౌలభ్యాన్ని వదిలేసుకుని, ఉమ్మడి ఆస్తుల లెక్క తేల్చకుండా రాత్రికి రాత్రి పారిపోయి వచ్చిందెవరు? దీనివల్ల జరిగిన నష్టమెంత? చరిత్ర అడగొద్దు, చెప్పింది వినాలంతే! ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళ్లడం, ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలవడం రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల విషయంలో విజ్ఞప్తులు చేయడం సహజమైన విషయం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్తే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం! జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా ఢిల్లీ వెళ్తే అది కేసుల మాఫీ కోసం!! ఇదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బాబు, ఆయన పెంపుడు మీడియా ఉన్మాద స్థాయికి చేర్చిన విష ప్రచారం. ఏం కేసులవి? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? జనరంజక పరిపాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దుర్వార్తను తట్టుకోలేక వందలాదిమంది గుండె పగిలి చనిపోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే శిఖరాయమానుడైన తండ్రిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న వైఎస్ జగన్‌ను ఈ పరిణామం మరింత కలచివేసింది. ఉద్వేగం కట్టలు తెగింది. చనిపోయిన వాళ్లంతా తన బంధువులే నని ఆయన ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన నల్లకాలువ ప్రాంతంలో జరిగిన సంస్మరణ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఒక ఆత్మబంధువుగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరినీ స్వయంగా వచ్చి కలుస్తానని అదే సభలో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ‘ఓదార్పు యాత్ర’ను ప్రారంభించారు. పోయిన ప్రతిచోటా అఖండ ప్రజాదరణ వెల్లువెత్తింది. కొందరు నేతలకిది కంటగింపుగా మారింది. ఢిల్లీకి ఫిర్యాదులు చేశారు. ‘ఓదార్పు యాత్ర’ ఆపేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని కలుసుకున్నారు. తాను ఏ సమయంలో ఆ మాటను ఇవ్వాల్సి వచ్చిందో, దాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో ఆమెకు నివేదించారు. అప్పుడు ప్రపంచం లోనే అత్యంత శక్తిమంతులైన టాప్ ఫైవ్ నేతల్లో ఆమె ఒకరు. వైఎస్ జగన్ విజ్ఞప్తికి మూల విరాట్టు ససేమిరా అన్నది. ఆమె మాట వినకుంటే ఇబ్బందులపాలవుతావనీ, వింటే కొంతకాలం తర్వాత ముఖ్యమంత్రి అవుతావనీ హైకమాండ్ ముఖ్యులు తేల్చిచెప్పారు. అయినా జగన్మోహన్రెడ్డి మాటకే కట్టుబడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఎదుర్కొంటున్న కేసులు ఆ పరిణామాల పర్యవసానాలు. కేసుల రూపకల్పనలో అతి ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ, దాని పెంపుడు మీడియా తోడ్పాటును అందించాయి. కాంగ్రెస్ మైనస్ జగన్ మోహన్‌రెడ్డి తమ రాజకీయ ప్రత్యర్థిగా ఉండాలని బాబు కోరుకున్నారు. అందుకోసమే ఈ కుట్రలో ముఖ్య పాత్ర పోషించారు. ‘కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్‌ను సీఎం చేసే వాళ్లం, మా మాట వినలేద’ని ఒక బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత గులామ్ నబీ ఆజాద్ ప్రకటించిన విషయం ఒక్కటి చాలదా ఈ కేసుల బాగోతం తేల్చడానికి? ఇటువంటి కేసుల బూచిని చూపెడుతూ గత పదేళ్లుగా తెలుగుదేశం పార్టీ తన రాజకీయ బతుకును ఈడ్చు కొస్తున్నది. తెలుగుదేశం పార్టీ ద్విముఖ వ్యూహం ఆత్మతృప్తికి తప్ప ఫలితమిచ్చేది కాదు. ఆయన సీజనల్ ప్రేమల సంగతి తెలియని వారు లేరు. స్వీయానుభవం కలిగిన బీజేపీ గానీ కమ్యూనిస్టులు గానీ మరోసారి బాబు ఉచ్చులో పడేందుకు సిద్ధపడరు. సిద్ధపడితే వారి ఖర్మ. ప్రస్తుతానికైతే బాబు చిరకాల మిత్రుడు పవన్ కళ్యాణ్ వైపునకు మాత్రమే లవ్సిగ్నల్స్ ప్రసారమ య్యాయి. తన ముఖం చూసి కాకపోయినా అమరావతి ముఖం చూసైనా కలిసి పనిచేద్దామని తెరవెనుక రాయబారాలను నడుపుతున్నట్టు వినికిడి. ఇందుకు తొలిమెట్టుగా ఒక కార్యక్ర మాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికై తెలుగుదేశం, దాని పెంపుడు మీడియా పంచన చేరిన ఒక విదూషకుడి చేత రాజీనామా చేయించి, అమరావతి పేరుతో మళ్లీ నిలబెడతారట! అతనికి అందరూ మద్దతునిచ్చి ఏకైక రాజధాని నినాదాన్ని చాటాలని బాబు దూతలు వ్యవహారం నడుపుతున్నారట! బ్యాంకులను మోసం చేసి, వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న ఈ విదూషకుడికి మద్దతునివ్వడమంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే నని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అవసరార్థం కలిగే సీజనల్ ప్రేమలతో ఏర్పాటయ్యే అవకాశవాద పొత్తులు ఫలితమివ్వబోవని ఉమ్మడి రాష్ట్రంలోని చివరి ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం చాటిచెప్పింది. అయినా సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన చంద్రబాబు గుణపాఠం తీసుకోలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అమరావతి భూములను మాత్రమే ప్రేమించి, ఆ భూముల్లో పేదవర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అడ్డుతగిలేవారిని ప్రజలెట్లా ప్రేమిస్తారు? ప్రజల ప్రేమను చూరగొనకుండా అధికారం ఎట్లా సంప్రాప్తిస్తుంది? ఇంత చిన్న లాజిక్‌ను సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ఎలా మిస్సయ్యారు? ఇదొక్కటే కాదు పేద ప్రజల స్వావలంబనకు, సాధికారతకు, ఆత్మగౌరవానికి ఆలంబనగా నిలబడుతున్న ప్రతి కార్యక్రమానికీ తెలుగుదేశం పార్టీ అడ్డు తగులుతున్నది. ఈ ధోరణి ప్రజలను ద్వేషించడమే అవుతుంది. ప్రజలను ద్వేషిస్తూ, పవన్ కళ్యాణ్‌ను మాత్రం ప్రేమిస్తే ఒరిగేదేమీ ఉండదు. ''తెలుగుదేశం పార్టీ ద్విముఖ వ్యూహం ఆత్మతృప్తికి తప్ప ఫలితమిచ్చేది కాదు. ఆయన సీజనల్ ప్రేమల సంగతి తెలియనివారు లేరు. స్వీయానుభవం కలిగిన బీజేపీ గానీ కమ్యూనిస్టులు గానీ మరోసారి బాబు ఉచ్చులో పడేందుకు సిద్ధపడరు. సిద్ధపడితే వారి ఖర్మ. ప్రస్తుతానికైతే బాబు చిరకాల మిత్రుడు పవన్ కళ్యాణ్ వైపునకు మాత్రమే లవ్సిగ్నల్స్ ప్రసారమయ్యాయి. తన ముఖం చూసి కాకపోయినా అమరావతి ముఖం చూసైనా కలిసి పనిచేద్దామని తెరవెనుక రాయబారా లను నడుపుతున్నట్టు వినికిడి. ఇందుకు తొలిమెట్టుగా ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికై తెలుగు దేశం, దాని పెంపుడు మీడియా పంచన చేరిన ఒక విదూషకుడి చేత రాజీనామా చేయించి, అమరావతి పేరుతో మళ్లీ నిలబెడతారట! అతనికి అందరూ మద్దతు నిచ్చి ఏకైక రాజధాని నినాదాన్ని చాటాలని బాబు దూతలు వ్యవహారం నడుపుతున్నారట! బ్యాంకులను మోసంచేసి, వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న ఈ విదూషకుడికి మద్దతునివ్వడమంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమేనని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అవసరార్థం కలిగే సీజనల్ ప్రేమలతో ఏర్పాటయ్యే అవకాశవాద పొత్తులు ఫలితమివ్వబోవని ఉమ్మడి రాష్ట్రంలోని చివరి ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం చాటిచెప్పింది. అయినా సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన చంద్రబాబు గుణపాఠం తీసుకోలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.'' వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎర్త్ టూ మార్స్.. వయా మూన్!
చంద్రుడిపై ఓ వెయ్యి గజాలు కొని పెట్టేస్తే బెటరేమో! అలాగే అమ్మాయి పేరు మీద అంగారకుడిపై ఓ ఎకరం కొని పెడితే పెళ్లి టైమ్‌కి పరుగులు ఉండవు మరి!! ఇక భూమ్మీద ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి కబుర్లు చెప్పుకోవలసిన సమయం దగ్గర్లోనే ఉందంటున్నారు. ఎందుకంటే.. భూమ్మీద కొన్నేళ్లుపోతే నిలబడ్డానికే చోటు ఉండదు. ఈ వెధవ కాలుష్యం... గొడవలూ ఎవడు పడతాడు. శుభ్రంగా మరో గ్రహంపై సెటిలైపోతే విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉంటుందని లెక్కలు వేసుకునే కాలం వచ్చేస్తోంది. అంగారక అలియాస్ అరుణ గ్రహం లేదంటే ఇంగ్లిష్‌లో మార్స్! పేర్లేవైతేనేం...అక్కడో పెద్ద మంచుగడ్డ సైంటిస్టులకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ మంచు నిధిని చూసినప్పటి నుంచి ఖగోళశాస్త్ర వేత్తలు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. పొరుగూరి కెళ్లినంత తేలిగ్గా మార్స్ వెళ్లిపోదాం సామాను సర్దుకుని రెడీగా ఉండండంటున్నారు. ఎందుకంటే అంతరిక్షంలో మనిషి మకాం వేయడం ఖాయమనే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మరీ ముఖ్యంగా మనిషి జీవించడానికి చంద్రుడితో పాటు.. అంగారకుడిపైనా అవకాశాలున్నాయని పరిశోధకులు టెలిస్కోప్ గుద్ది మరీ చెబుతున్నారు. భూమ్మీద ఉన్న మావయ్యని.. చందమామపై ఉన్న అత్తయ్య దగ్గరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అందరూ కలిసి... అంగారకుడిపై వినోదయాత్రకు బయలు దేరదాం అని ఇప్పుడెవరైనా అంటే పిచ్చి పట్టిందేమో అని భయం భయంగా చూస్తారేమోకానీ.. మరో యాభై ఏళ్ల తర్వాత అది అత్యంత సహజమైన పరిణామమవుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది. ఆ మధ్య చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా నీటి జాడలు కచ్చితంగా ఉన్నాయని తేలడం తోనే అక్కడ మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ముందుగా చంద్రుడిపై గ్రామాలు కట్టేస్తారట. ఆ గ్రామాల్లో చక్కటి ఇళ్లు నిర్మించేసి భూమి నుంచి వలస వచ్చేవారి కోసం సిద్ధంగా ఉంచుతారట. చంద్రుడిపై విస్తారంగా ఇళ్లు కట్టేశాక కాలనీ కోసం అంగారకుడిపైకి వెళ్తారట. అంగారకుడి పైనా విశాలమైన కాలనీలు నిర్మించి.. మనుషులు మకాం పెట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తారట. ఇదంతా ఎందుకంటే... ఇప్పటికే మితిమీరిన జనాభాతో భూమి కిక్కిరిసిపోతోంది. మరో యాభై ఏళ్లు దాటితే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. భూమిపై కాలు మోపడానికి కూడా ఖాళీ స్థలం ఉండకపోవచ్చు. అప్పుడు కొత్తగా పుట్టబోయే వారికి భూమ్మీద నివసించడానికి చోటే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాల భూగ్రహ వాసులు ఏం చేయాలి? దానికి సమాధానంగానే చంద్రుడు, అంగారకుడిపై దృష్టి సారించారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ కాలనీలు కానీ కట్టడం పూర్తయితే... భూమి నుంచి పెద్ద సంఖ్యలో జనం కొత్త గ్రహాలకు వలసపోతారన్నమాట! మరో వందేళ్లు దాటిందనుకోండి భూమిపై ఉన్న వారికి చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా చుట్టాలు ఉండచ్చు. భూమిపై ఉండేవారు మునుముందు తమ చుట్టాలను చూసి రావడానికి చంద్రుడిపైకి, అంగారకుడిపైకి అంతరిక్ష నౌకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భూమ్మీద జనాభా పెరిగిపోవడంతో పాటు.. రోజురోజుకీ పెరిగిపోతోన్న కాలుష్యం భూమిని ప్రమాదకరమైన గ్రహంగా మార్చేస్తోంది. భూమి చుట్టూరా ఉన్న వాతావరణమంతా విషమయమై పోతోంది. అంతులేని భూతాపం భూమిపై మానవ జాతి మనుగడకే సవాల్ విసురుతోంది. గాలితో పాటు భూమిలోని నీరు, అంతరిక్షం కూడా కలుషితమైపోతున్నాయి. వీటికితోడు మానవాళి వినాశనానికి దారి తీసే అణ్వాయుధాల భయమూ పెరుగుతోంది. ఏ క్షణంలో ఏ దేశం అణు బాంబును ప్రయోగిస్తుందో తెలీని ఉత్కంఠ నెలకొంది. అడిలైడ్‌లో 4వేల మంది అంతరిక్ష పరిశోధకులతో జరిగిన వార్షిక సమావేశంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ కొత్త గ్రహాలపై కాలనీల ఏర్పాటు గురించి ఆశావహ దృక్పథంతో ప్రచారం చేసింది. అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అందులో 17 ఏళ్లుగా నివసిస్తున్నామని ఈ సమావేశంలో స్పేస్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత ఆవాసాల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందనే తాము భావిస్తున్నామని ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. రానున్న పదేళ్లల్లో చంద్రుడిపై గ్రామం నిర్మాణానికి సంబంధించి అనువైన సమాచారాన్ని సేకరించి ప్రణాళికలు రూపొందించేందుకు మిషన్లను తయారు చేస్తున్నట్లు మెస్సినా పేర్కొన్నారు. మొత్తం మీద ‘మా పెద్దబ్బాయి భూమ్మీద పని చేస్తున్నాడు. రెండో అబ్బాయి చంద్రుడిపైనా... మా అమ్మాయి అంగారకుడిపైనా ఉద్యోగాలు చేసుకుంటున్నారు’ అని తల్లిదండ్రులు మురిసి పోయే రోజులు దూరంలో లేవన్నమాట. అప్పుడు మూడు గ్రహాలపైనా చుట్టాలుంటారు. అన్నీ బానే ఉన్నాయి కానీ... అసలు సౌర వ్యవస్థలో ప్రాణులు జీవించడానికి ఆస్కారమున్న గ్రహాలున్నాయా అని? మనిషి ఆశాజీవి కదా! అసాధ్యమన్నదే తన డిక్షనరీలో లేదనుకుంటాడు. ప్రకృతినీ తాను శాసించేయగలనని అనుకుంటూనే ఉంటాడు. సాధ్యం కాని ఎన్నో ఘనతలను ఇలాంటి ధీమాతోనే సాధించి పారేశాడు కూడా! మరయితే మనిషి వేరే గ్రహాలపై కాపురం పెట్టేస్తాడా? ఏమో... గుర్రం ఎగరావచ్చు!! -
ఇదేనా ప్రజాస్వామ్యం?
మరో విడత పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అధికార–ప్రతిపక్షాల వాదోపవాదాలు... సభా మధ్యంలో నిరసనలు... అనివార్యమైన వాయిదాలు... మళ్ళీ అవే సన్నివేశాలు. డిసెంబర్ 23 వరకు జరగాల్సిన శీతకాల సమావేశాలు ఒకరోజు ముందే బుధవారమే ముగిశాయి. వెనక్కి తిరిగి చూస్తే, చట్టసభలు సాగిన తీరులో ఏమున్నది గర్వకారణం అనిపించక మానదు. సభాసమయంలో వృథానే ఎక్కువగా కనిపిస్తుంది. కీలక బిల్లులు ఆమోదం పొందినా, వాటిపై చర్చ జరగలేదనే చేదు నిజం వెక్కిరిస్తుంది. ఎవరి పాలెంతనేది పక్కనపెడితే, అధికార, ప్రతిపక్షాలు రెంటిలో తప్పు కనిపిస్తుంది. నవంబర్ 29న సభ మొదలైన రోజు నుంచే పరిస్థితి అదుపు తప్పింది. వర్షాకాల సమావేశాల్లోని ప్రవర్తన తీరుకు దండనగా 12 మంది ప్రతిపక్ష సభ్యులను మొత్తం ఈ శీతకాల సమావేశాల నుంచి బహిష్కరించడం వివాదాస్పదమైంది. దాని చట్టబద్ధతా ప్రశ్నార్థకమైంది. పలుమార్లు సభలో అంతరాయాలకూ, సభ బయట ధర్నాలకూ కారణమైంది. ఒక రకంగా ప్రతిపక్షాల్లో అనూహ్య ఐక్యతకూ దారి తీసింది. 22 రోజుల పాటు గాంధీ విగ్రహం పాదాల చెంత ప్రతిపక్ష సత్యాగ్రహం సాగింది. సామూహిక పశ్చాత్తాపం కాదు... వ్యక్తిగతంగా ఎవరికి వారు క్షమాపణలు చెబితేనే సభలోకి అనుమతిస్తామన్న అధికార పక్షం మంకుపట్టు ఆఖరి దాకా కొనసాగింది. అదీ విచిత్రం. ఈ విడతలో లోక్‌సభ, రాజ్యసభ– చెరి 18 సార్లు సమావేశమయ్యాయి. కానీ, అంతరాయాలతో లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాలు వృథా. అంతరాయాలు, వాయిదాలతో రాజ్యసభలో ఏకంగా 49 గంటల 32 నిమిషాలు కృష్ణార్పణం. మొత్తం మీద లోక్‌సభ ఉత్పాదకత 77 శాతమైతే, రాజ్య సభది 43 శాతమేనని చట్టసభలపై స్వచ్ఛంద పరిశోధనా సంస్థ పీఆర్ఎస్ లెక్కేసింది. ప్రభుత్వం లెక్క మాత్రం అంతకన్నా కాస్తంత మెరుగ్గా ఉంది (లోక్‌సభ 82 శాతం, రాజ్యసభ 47 శాతం). ఏ లెక్కనైనా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదనేది నిర్వివాదాంశం. ఈ సమావేశాల్లో 12 బిల్లులు లోక్‌సభలో, ఒక బిల్లు రాజ్యసభలో– మొత్తం 13 బిల్లుల్ని ప్రవేశ పెట్టారు. వాటిలో 11 ఉభయసభల ఆమోదం పొందాయి. అందులో అద్దె గర్భం, సహాయ పునరు త్పాదక టెక్నాలజీ (ఏఆర్టీ), నార్కోటిక్ డ్రగ్స్ లాంటి కీలక బిల్లులున్నాయి. లోక్‌సభలో మెజారిటీ ఉండడంతో వీటిని పాస్ చేయించుకోవడం పాలకపక్షానికి కష్టమేమీ కాదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే ఇప్పటికీ స్వల్ప మెజారిటీ (ప్రతిపక్షాలు 120, ఎన్డీఏ సభ్యులు 118). అందుకే, ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాత తప్పుల సాకుతో 12 మంది విపక్ష సభ్యుల్ని ఇప్పుడు సస్పెండ్ చేసి, కృత్రిమ మెజారిటీ సంపాదించి, బిల్లులను పాస్ చేయించుకుందనేది కాంగ్రెస్ ఆరోపణ. నిందారోపణలు ఏమైనా, చర్చ లేకుండా నిమిషాల వ్యవధిలోనే అనేక బిల్లులకు ఆమోద ముద్ర పడడం మటుకు నిజం. సమావేశాల మొదట్లోనే తెచ్చిన కొత్త సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు మొదలు చివరలో తెర మీదకు తెచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు దాకా అనేకం అర్థవంతమైన చర్చ ఏమీ లేకుండా, అరగంటలో పాలకపక్షం మమ అనిపించినవే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు గుర్తింపు కార్డునూ – ఆధార్‌నూ అనుసంధానించడానికి వీలు కల్పించే అత్యంత కీలక ఎన్నికల చట్టం మార్పుపై చర్చించడానికి అధికార పక్షానికి సమయమే లేదా అన్నది విమర్శకుల ప్రశ్న. భిన్నాభిప్రాయాల చర్చావేదికగా నిలవడం, ఆ చర్చల్లో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోవడం పార్లమెంట్ ప్రాథమిక లక్షణం. కానీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రజాస్వామ్య వేదిక ఆ గుణాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోందన్నది కొందరి విమర్శ. 17వ లోక్‌సభలోని తాజా 7వ విడత సమావేశాల్లో సగటున ప్రతి బిల్లూ లోక్‌సభలో 10 నిమిషాల్లో, రాజ్యసభలో అరగంటలో పాసైపోయాయి. చట్టసభల్లో పరిఢవిల్లాల్సిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీజేపీ పరిహసించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. బిల్లులపై భిన్నాభిప్రాయాలున్నప్పుడు వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపడం సాధారణం. ఇటీవల ఆ ధోరణి కూడా తగ్గుముఖం పడుతోంది. తాజా సమా వేశాల్లో 6 బిల్లుల్ని మాత్రం పార్లమెంటరీ కమిటీలకు నివేదించారు. ఆడపిల్లల వివాహ వయస్సును పెంచే ప్రతిపాదనపై సందేహాలు వ్యక్తమయ్యాక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. ఇక, ప్రజాసమస్యలను ప్రస్తావించి పాలకపక్షాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశమున్న కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలోనూ 60 శాతం సమయం వృథా తప్పలేదంటే, ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రంగస్థల ప్రదర్శనలా మారిపోతున్న తమ సభావ్యూహాన్ని పునరాలోచించుకోవాలి. నిజానికి, ఈసారి సభలో గట్టిగా చర్చ జరిగింది – కోవిడ్ పైన, పర్యావరణ మార్పుల పైనే! రైతుల ప్రాణాలు బలిగొన్న లఖిమ్‌పూర్ ఖేరీ ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో, కన్నకొడుకే నిందితుడైన హోమ్ శాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు చివరి దాకా పట్టుబట్టాయి. కానీ, కీలక అంశాల చర్చకు ప్రభుత్వాన్ని ఒప్పించడమూ అంతే ముఖ్యమని గ్రహించాల్సింది. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే సమావేశాలు మరింత మెరుగ్గా జరిగి ఉండేవి. రాజ్యసభ ఛైర్మన్ అన్న ఆ మాట నిజమే. కానీ, అందుకు పాలకపక్షం కూడా కలసి రావాలి. పట్టువిడుపులతో ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ఎంతైనా, ఒంటి చేతితో చప్పట్లు కొట్టలేం కదా! పాలకులు ఏకపక్ష ప్రకటనలు చేయడానికీ, అనుకున్నవాటికి రబ్బరు స్టాంపు రాజముద్రలు వేయడానికీ పార్లమెంట్ సమావేశాలతో పని ఏముంది! -
ఆ కళ్లలో వాటర్లూ..!
బాబు ఏడ్చారు. మీడియా సమావేశం పెట్టి మరీ పబ్లిగ్గా రోదించారు. కన్ను తడిచిందా? కన్నీరు కనిపించిందా వంటి సందేహాలు అనవసరం. గుండె తడిగా ఉంటేనే కన్ను తడిచే అవకాశం ఉంటుంది. ఆర్ద్రత ఉంటేనే అది ఉబికి కనురెప్పల మత్తడి దూకుతుంది. అందువలన తడి కనిపించినా కనిపించక పోయినా ఆయన కన్నీరు పెట్టుకున్నట్టే లెక్క. అతడనేక యుద్ధ ముల ఆరియుతేరినటువంటి వృద్ధ నాయకుడు. నాలుగున్నర దశాబ్దాల అనుభవంలో ఏడిపించుటయే గానీ, ఏడ్చుట ఎరుగని రాజకీయ చతురుడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఏడ్చారు? ‘గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు’ అంటారు ఆత్రేయ. తన గుండెల్లో రగులుతున్న మంటలను చల్లార్చుకునే ప్రయత్నంలో కన్నీరు కార్చారా? శుక్రవారం నాడు అసెంబ్లీలో జరిగిన మాటల యుద్ధమే ఆయన కన్నీళ్లకు కారణమని తెలుగు దేశం వారు చెబుతున్నారు. తన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలే బాధించాయని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ జాగ్రత్తగా విశ్లేషిస్తే ఈ వాదనలో సత్తా కనిపించడం లేదు. ఇంకేదో కారణం ఉందన్న అభిప్రాయం కలుగుతున్నది. శుక్రవారం నాటి ఏపీ అసెంబ్లీ పరిణామాలనే తీసు కుందాం. సభలో అల్లరి చేసి, ఆ తర్వాత ఈ సెషన్ మొత్తాన్ని బహిష్కరించాలనే ముందస్తు వ్యూహంతోనే ఆ పార్టీ శాసన సభాపక్షం వ్యవహరించిందని విశ్వసనీయ సమాచారం ఉన్నది. ఆ వ్యూహానికి అనుగుణంగానే టీడీపీ సభ్యుల ప్రవర్తన కూడా ఉన్నది. స్వయానా ప్రతిపక్ష నేతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యు లను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ‘బాబాయ్ – గొడ్డలి, తల్లికి మోసం, చెల్లికి మోసం’పై చర్చిద్దామంటూ ఆయనే నిప్పు రాజే శారు. తెలుగుదేశం పార్టీ బృందం దాన్నే రన్నింగ్ కామెంట్రీగా అందుకొని ఆజ్యం పోసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి సభలో లేరు. దక్షిణ జిల్లాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై అధికారు లతో సమీక్షిస్తూ సహాయ చర్యలను నిర్దేశిస్తున్నారు. రైతుల సమస్యలపై మాట్లాడుతున్న మంత్రికి పదేపదే తెలుగుదేశం సభ్యులు అడ్డు తగిలారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్ చేయడం పైనే దృష్టి పెట్టి దాడికి దిగారు. ఈ దాడికి స్వయానా ప్రతిపక్ష నేత నాయకత్వం వహించారు. అసెంబ్లీ రికార్డుల సాక్షిగా ఇది సత్యం. తెలుగుదేశం పార్టీ దాడిని సహజంగానే పాలకపక్షం కౌంటర్ చేసింది. మీరు అడిగేవాటితో పాటు, మరిన్ని విషయా లను చర్చిద్దామని సవాల్ చేసింది. రంగా హత్యోదంతం, మాధవరెడ్డి విషయం కూడా మాట్లాడదామని అంబటి రాంబాబు అన్నారు. మాధవరెడ్డి ప్రస్తావనతో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన సమయంలో కీలకపాత్ర పోషించిన నేతల్లో మాధవరెడ్డి ఒకరు. చంద్రబాబు కేబినెట్లో హోం మంత్రిగా నెంబర్ టూగా చెలామణి అయ్యారు. ఒక బలమైన సామాజిక వర్గం నాయకుడైనందువల్ల భవిష్యత్తులో తన పదవికి ఆయన నుంచి ముప్పు ఉంటుందనే అభద్రతాభావం చంద్రబాబుకు ఉన్నదని అప్పట్లో ఒక ప్రచారం ఉండేది. కేవలం ప్రచారం మాత్రమే కావచ్చు. రాజకీయ ప్రత్య ర్థుల సృష్టి కూడా కావచ్చు. కానీ, ఆ ప్రచారం ఉన్న మాట వాస్తవం. ఆ సమయంలోనే మాధవరెడ్డి హత్య జరిగింది. దీంతో ఈ ప్రచారం మరోసారి షికారు చేసింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ‘బాబాయ్–గొడ్డలి’ వ్యాఖ్యలు తెలుగుదేశం సభ్యులు చేసినప్పుడు ప్రతిగా రంగా, మాధవరెడ్డిల పేర్లను రాంబాబు ప్రస్తావించారు. టీవీలో అసెంబ్లీ సమావేశాలు తిలకించిన వారికి అర్థమైన విషయం ఇది. అసెంబ్లీ రికార్డులు పరిశీలించినా కూడా ఇదే విషయం స్పష్టమవుతున్నది. ముఖ్య మంత్రి సైతం ఈ మేరకు సభలో ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. అధికార సభ్యుల రన్నింగ్ కామెంటరీలో భాగంగా ఒక సభ్యుడు గౌరవ ప్రతిపక్ష నేత సతీమణిని ఉద్దేశించి మాట్లాడా రని టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి ఒక టీవీ చర్చా వేదికలో చెప్పారు. అదే వేదికగా ఆ ఆరోపణలను సదరు సభ్యుడు తీవ్రంగా ఖండించారు. తాను ఆ ప్రస్తావనే తేలేదని ఆ సభ్యుడు ఘంటాపథంగా చెప్పారు. గౌరవ మహిళను కించపరిచే విధంగా ఎవరూ మాట్లాడిన దాఖలా కూడా నిన్నటి అసెంబ్లీ ప్రొసీ డింగ్స్‌లో కనిపించలేదు. ఎందుకు ఈరకమైన ప్రచారం ముందుకు వచ్చిందో, చంద్రబాబు ఎందుకు అంత విపరీతంగా స్పందించారో తెలియవలసి ఉన్నది. మహిళా సాధికారత విష యంలో ఈ దేశంలో ఇంతవరకు యూనియన్ ప్రభుత్వం గానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ చేయనంత కృషిని ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ ప్రభుత్వం చేసింది. మహిళలకు 50 శాతం పద వుల దిశగా అడుగులు వేస్తున్నది. అటువంటి ప్రభుత్వం ఒక గౌరవ మహిళపై అనుచిత వ్యాఖ్యలను ఉపేక్షిస్తుందని అను కోవడం కేవలం అవివేకం అవుతుంది. చంద్రబాబు కంట తడి తర్వాత అనేక పాత విషయాలు సోషల్ మీడియా వేదికగా ముందుకొస్తున్నాయి. చంద్రబాబుకు తన కూతురునిచ్చి వివాహం చేసి, ఆయన రాజకీయ జీవితానికి రాచబాట వేసిన తెలుగు ప్రజల ప్రియతమ నాయకుడు నంద మూరి తారక రామారావు కన్నీరు పెట్టుకున్న సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. 1995 ఆగస్టు 27వ తేదీన సరిగ్గా మీడియా సమావేశంలోనే ఆయన కన్నీరు కార్చారు. ‘‘నేను నా జీవితంలో ఏనాడూ కంటతడి పెట్ట లేదు. ఎన్ని కష్టాలు – నష్టాలు ఎదురైనా, ఆప దలు ముంచుకొచ్చినా బేలగా ఏడవలేదు. కానీ ఈ రోజున 74 ఏళ్ల వయసులో నా అనుకున్న వాళ్లు, నా వాళ్ళు మోసానికి దిగితే, వెన్నుపోటు పొడిస్తే తట్టుకోలేకపోతున్నాను’’ అంటూ విలపించారు. ఎన్టీఆర్ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన పేపర్ కటిం గ్స్‌ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వృద్ధాప్యంలో చేదోడు కోసం ఎన్టీఆర్ వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతి చంద్రబాబుకు అత్త గారు. ఆమెపై చంద్రబాబు ఎంత నీచ ప్రచారాన్ని చేయించా రన్న అంశంపై కూడా చర్చ జరుగుతున్నది. చంద్రబాబు నేతృత్వంలో వైఎస్ జగన్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన కుట్రలను, విషప్రచారాలను కూడా ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌తో కుమ్మ క్కయి వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించి కుట్రపూరిత వ్యవహారాలు నడిపి, ఆయనను పదహారు నెలలు జైలుపాలు చేసిన సంగతిపై ఇప్పుడు మళ్లీ జనం మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కాదు. పత్రికలూ, టీవీ చానెళ్ల ద్వారానే (ఎల్లో మీడియా) వైఎస్ జగన్‌పై జరిగిన వ్యక్తిత్వ హనన దాడి ఈ దేశ చరిత్రలో నభూతో నభవిష్యతి! పత్రికా ప్రమాణాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మార్గదర్శకాలనూ ‘థూ... నాబొడ్డు’ ప్రమాణంగా నేలకేసి కొట్టి వైఎస్ జగన్‌ను ఒక నేరస్థుడిగా చిత్రించడం కోసం పడిన ప్రయాస వెనుక ఉన్న సూత్రధారిపై కూడా ప్రజలు మరోసారి మాట్లాడుతున్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఫ్యాక్షనిస్టు ముద్ర వేయ డానికి చేయని ప్రయత్నం లేదు. మాస్ ఇమేజ్ ఉన్న వైఎస్ఆర్తో ప్రత్యక్షంగా ఎన్నికల్లో తలపడటం కష్టం అనే ఉద్దేశంతో నిత్యం మంత్రులు, నాయకుల చేత ప్రెస్మీట్లు పెట్టించి మరీ ఆరోపణలు చేయించేవారు. ఆరోపణలు చేయ డానికి రెడ్డి సామాజికవర్గం నేతలనే ఎంపిక చేసుకునే వారు. ప్రెస్మీట్లకు కూడా కులస్పృహను జోడించిన తొలి నాయకుడు చంద్రబాబు. అప్పట్లోనే వైఎస్ఆర్ను వేధించడం కోసం ధర్మ వరం సూట్‌కేసు బాంబు కేసులో జగన్మోహన్రెడ్డిని ఇరికించ డానికి చేయని ప్రయత్నం లేదు. నిండా ముప్పయ్యేళ్ల వయసు కూడా లేని జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి దూరంగా వ్యాపారం చేసుకుంటున్న సందర్భం అది. అ«ధికార బలంతో గతంలో చంద్రబాబు ప్రత్యర్థుల కుటుంబాలను వెంటాడి వేటాడిన జ్ఞాప కాలను ఇప్పుడు జనం నెమరువేసుకుంటున్నారు. వైఎస్ షర్మిల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సరిగ్గా ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం అనుకూల వెబ్సైట్ల ద్వారా జరిగిన దుష్ప్రచారాన్ని కూడా ప్రజలు ఇప్పుడు ఉదాహరిస్తున్నారు. ఆమెపై జరిగిన ప్రచారాన్ని పోలీసులు శోధించినప్పుడు నంద మూరి బాలకృష్ణ ఇంటి అడ్రస్ వైపే చూపుడు వేలు మళ్లింది. అదే బాలకృష్ణ ఆధ్వ ర్యంలో శనివారం నాడు నందమూరి కుటుంబ సభ్యుల ఉమ్మడి ప్రెస్‌మీట్ ఏర్పాటైంది. తమ సోదరి మీద జరుగుతున్న ప్రచా రాన్ని ఇంకెంత మాత్రమూ సహించబోమని వారు హెచ్చరిం చారు. నిజమే, ఎంతమాత్రమూ సహించకూడదు. ఆమె పేరును పబ్లిగ్గా బయటకీడ్చి ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించి దోషిగా నిలబెట్టాలి. ఎన్టీ రామారావు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో కూడా కుటుంబ సభ్యులలో ఇదే విధంగా తండ్రికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టించారు. ఇప్పుడూ అదే వ్యూహం కనబడిందని సోషల్ మీడియా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అప్పుడాయన వేధించారు కనుక, ఇప్పుడాయనను వేధిం చాలని ఎవరూ అనడం లేదు. అది భావ్యం కూడా కాదు. ‘ఒక్క వేలు చూపి ఒరులను నిందించ, వెక్కిరించు నిన్ను మూడువేళ్లు’ అనే నీతి సూత్రాన్ని ఇప్పుడాయనకు గుర్తు చేస్తున్నారు. చంద్ర బాబు ఆరోపిస్తున్నట్టు వారి సతీమణిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే అది కచ్చితంగా క్షమార్హం కాని విష యమే! కానీ, శుక్రవారం నాటి అసెంబ్లీలో ఎవరూ అలా మాట్లా డినట్టు ఎటువంటి రుజువూ లేదు. మరి ఈ సీనియర్ రాజకీయ వేత్త ఎందుకు షాడో బాక్సింగ్ రింగ్‌లోకి దిగినట్టు? రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించేవారికి చంద్రబాబు ప్రస్తుత పరిస్థితిపై ఇప్పటికే ఒక స్పష్టత ఏర్పడింది. ఆయన ఆవేదన నిజం. నిర్వేదం నిజం. గుండె మంట నిజం. దుఃఖం నిజం. అది తన రాజకీయ భవిష్యత్తు, తన కుమారుని రాజకీయ భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిపాలన ప్రజాదరణ పొందింది. రెండున్నరేళ్ల లోనే ప్రభుత్వాన్ని ప్రజల గుమ్మం దగ్గరకు ఆయన చేర్చగలి గారు. విద్య, వైద్యం, వ్యవ సాయ రంగాల్లోనూ – మహిళలూ, బలహీనవర్గాల సాధికారత లోనూ విప్లవాత్మక సంస్కరణలను ఆయన ప్రవేశపెట్టారు. ఫలితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ 55 శాతానికి తగ్గని ఓటు బ్యాంకు ఇప్పటికే ఆయనకు స్థిరపడి పోయింది. మరోపక్క టీడీపీ ఓటు బ్యాంకు 30 శాతానికి పడిపోయింది. స్థానిక సంస్థ లకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల రికార్డు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగనటువంటిది. రాజ్యాంగ సంస్కరణల అనంతరం ఇప్పుడున్న పద్ధతిలో ఐదు సార్లు స్థానిక ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు మరో ఐదు సార్లు జరిగాయి. ఈ పది ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ సాధించిన విజయాల శాతం ఏ పార్టీ సాధించలేదు. ఈ ఎన్నికల్లో నూటికి నూరుశాతం మునిసిపల్ కార్పొరేషన్లను, 96 శాతం మునిసి పాలిటీలను ఆ పార్టీ గెలిచింది. రెండు మునిసిపాలిటీలను మాత్రమే (తాడిపత్రి, దర్శి) టీడీపీ గెలిచింది. ఈ రెండుచోట్ల కూడా టీడీపీకి వార్డులు ఎక్కువ వచ్చినా పాపులర్ ఓటు వైసీపీకే ఎక్కువగా నమోదైంది. ‘టై’గా మిగిలిన కొండపల్లిలో కూడా పాపులర్ ఓటు వైసీపీకే ఎక్కువ. నూటికి నూరుశాతం జిల్లా పరిషత్ పీఠాలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాలు, 86 శాతం ఎంపీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో పడ్డాయి. పార్టీ ప్రాతిపదికపై జరగని సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 90 శాతం గ్రామాల్లో గెలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్‌రెడ్డిని ఓడించడం సాధ్యం కాదన్న విషయం అనుభవ జ్ఞుడైన చంద్రబాబుకు సులభంగానే అర్థమవుతున్నది. రెండు పార్టీల మధ్య 20 శాతానికి పైగా ఏర్పడిన అగాథం ఇప్పుడ ప్పుడే పూడ్చడం సాధ్యం కాదు. చివరికి మూడు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కుప్పం అవమానం’ ఆయన్ను తీవ్రంగా క్రుంగదీసి ఉంటుంది. అక్కడ జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ సంపూర్ణ పరాజయాన్ని మూటగట్టుకున్నది. 2024 ఎన్నికల్లో తనకు సురక్షిత స్థావరం కూడా మిగల్లేదు. ఇప్పటికే వయోభారం మీద పడు తున్నది. 2029 ఎన్నికల నాటికి ఆయన వయసు 80 ఏళ్లకు చేరుకుంటుంది. వారసుడు ఇంకా తన సమర్థతను నిరూపించు కోలేదు. రాజకీయ చిత్రం ముగింపు దశకు చేరుకుంటున్నది. ఆర్థికంగా కూడా అమరావతి మీద ఆయనకు చాలా ఎక్కువ స్టేక్స్ ఉన్నాయని చెబుతున్నారు. కుప్పం ఫలితం ఆయన ఆశలను పూర్తిగా హరింపజేసింది. ఐరోపా ఖండమంతటా జైత్రయాత్రలు నడిపిన నెపోలియన్ ఒక్క వాటర్లూ యుద్ధంతో కుప్పకూలిపోయాడు. కుప్పంలో చంద్రబాబుకు తన వాటర్లూ కనిపిస్తున్నది. ఆయన కళ్లలోనూ అదే కనిపించింది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అక్షర పాలకులు
రాజ్యాలు, వైభవాలు ఉన్నాయి కదా అని పొద్దంతా విలాసాల్లో మునిగి తేలితే గొప్పేముంది? జనం పది కాలాల పాటు గుర్తుంచుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి ఆలోచనే కొందరు పాలకులకు చరిత్రలో ప్రత్యేక పేజీలను కేటాయించింది. రాచరికాలు కావచ్చు, ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు... పాలనా దక్షత ఒక్కటే ఉంటే పాలకుడిగానే మిగిలిపోతారు. పాలనతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ప్రత్యేకంగా వెలిగిపోతారు. చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు ప్రజారంజకంగా పాలించారు. కొందరు ప్రజాకంటక పాలన అందించి కాలగర్భంలో కలిసిపోయారు. చాలా కొద్దిమంది మాత్రం మంచి పాలన అందించడంతో పాటు ‘కూసింత కలాపోసన’ చేసి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి సాహితీ పాలకుల్లో అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలే! ప్రజాసంక్షేమ పాలనకు పెట్టింది పేరు అయిన కృష్ణదేవరాయల హయాంలో సాహిత్యానికి పట్టం కట్టారు. ‘భువన విజయం’ పేరుతో అష్ట దిగ్గజ కవులను కొలువు తీర్చిన కృష్ణదేవరాయలు వారికి ఏమాత్రం తీసిపోకుండా తానూ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. తెలుగు, కన్నడ, తుళు, తమిళ భాషలతో పాటు సంస్కృతంలోనూ రాయలు పండితుడు. సంస్కృతంలో జాంబవతీ కల్యాణం, మదాలస చరితం, రసమంజరి వంటి గ్రంథాలు రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అను గోదాదేవి కథ అన్న అద్భుత కావ్యాన్ని జాతికి కానుకగా ఇచ్చాడు. భారత దేశపు చివరి చక్రవర్తిగా నిలిచిపోయిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ అద్భుతమైన సూఫీ కవి. ఉర్దూభాషా పండితుడైన బహదూర్ షా కలం పేరు జఫర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మీర్జా గాలిబ్, ఇబ్రహీం జౌఖ్... బహదూర్ షా ఆస్థానంలోని కవులే. బ్రిటిష్ పాలకులు తనను బర్మాలో నిర్బంధించినప్పుడు, తన నిస్సహాయతను దృష్టిలో ఉంచుకుని బహదూర్ షా రాసిన ‘నా కిసీకీ ఆంఖోం కా నూర్ హూం’ అనే గజల్ ఇప్పటికీ కచ్చేరీలలో మార్మోగుతూ ఉంటుంది. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన విన్స్టన్ చర్చిల్ అద్భుతమైన రచయిత. సైద్ధాంతికంగా చర్చిల్‌ను ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు; ఆయన రచనల్లోని ఆలోచనలనూ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన శైలిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించి ఎన్నో కీలక ఘట్టాలను అక్షరబద్ధం చేసిన చర్చిల్ తిరుగులేని చమత్కారి కూడా! బ్రిటన్ను పాలించిన ప్రధానులందరిలోకీ సమర్థుడిగా పేరు తెచ్చుకున్న చర్చిల్ రచయితగా నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సాహితీ పిపాసి. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను రాసిన నెహ్రూను ‘పొయట్ ఎట్ హార్ట్’ అని ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు కీర్తించారు. ఆ ఒక్కముక్క చాలదూ... నెహ్రూ మంచి రచయిత అనడానికి! చైనాను సుదీర్ఘ కాలం పాలించిన మావో జెడాంగ్ కవులు మెచ్చిన రొమాంటిక్ పొయెట్. వియత్నాం విప్లవ యోధుడు హోచిమన్ కవిత్వం అత్యంత సహజంగా ఉంటుందని పండితులే మెచ్చుకున్నారు. భారత ప్రధానుల్లో నెహ్రూ తర్వాత పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయ్ సాహితీ స్రష్టలే. భావోద్వేగాలు, భావావేశాలు కలగలిసిన వాజ్‌పేయ్ కవితలు కదం తొక్కిస్తాయి. అలాగని పీవీ తక్కువ వాడేమీ కాదు. పండితులకే కొరకరాని విశ్వనాథ ‘వేయిపడగల’ను హిందీలోకి అనువదించిన మేధావి. ఒడిశా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఉన్నత పదవుల్లో వెలిగిన గిరిధర్ గమాంగ్ సకల కళావల్లభుడే. గిరిజన సంగీతం గొప్పతనాన్ని యావత్ లోకానికీ చాటి చెప్పాలన్న కసితో దశాబ్దాల తరబడి కృషి చేసిన గమాంగ్ స్వతహాగా అద్భుత సంగీతకారుడు. రక రకాల గిరిజన సంగీత వాద్య పరికరాలు వాయించడంలో పండితుడు. ఒరియాలో మంచి కవి. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన మఖ్దూమ్ మొహియుద్దీన్ నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు, అనంతరం ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. విశ్వ విఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షా రాసిన ఓ నాటకాన్ని మఖ్దూమ్ ఉర్దూలోకి అనువదించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సమక్షంలో ఈ నాటకాన్ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. నాటకం ఆద్యంతం ఆసక్తిగా వీక్షించిన రవీంద్రుడు ఆనందం పట్టలేక వేదికపైనున్న మఖ్దూమ్‌ను కౌగలించుకున్నాడు. మఖ్దూమ్ రచనలను ప్రముఖ రచయిత గజ్జెల మల్లారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఒకప్పుడు మంచి సాహిత్యాన్ని అందించిన పాలకులు ఉండేవారు. ప్రపంచం అసూయతో రగిలిపోయేంత పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఇçప్పుడు అటువంటి అక్షర పాలకులు లేరు. మంచి కవిత్వమో, కథో రాయడం మాట దేవుడెరుగు... నేడు పలువురు పాలకులకు మంచి పుస్తకం ఇస్తే కనీసం చదవలేని దుఃస్థితి. మళ్లీ నిరుటి మెరుపులు కొత్త వెలుగులు కాయిస్తాయనీ, నిరుడు మురిపించిన హిమసమూహాలు చల్లటి కబురందిస్తాయనీ ఆశిద్దాం. గతం వలె మళ్లీ సాహితీ కుసుమాలు వికసిస్తాయని కాంక్షిద్దాం. -
అయినా... నిఘా కళ్లు నీపైనే!
తీరు మారకుండా పేరు మారితే చేసిన పాపం కడుక్కుపోతుందా? ఇది సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్బుక్’కు ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న! సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో దాని అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. కానీ, ఆయన కొత్త అవతారంతో వస్తూ.. పాత విమర్శల్ని పాతరేయ చూస్తున్నారు. గుర్రుగా తనవైపు నిఘా కళ్లతో చూస్తున్న అంతర్జాతీయ సమాజం దృష్టిని ఏమార్చాలనుకుంటున్నారు. మనుషుల్ని సామాజికంగా కలుపుతూ అద్భుతాలు సృష్టించే ఓ మహత్తర వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫేస్బుక్ నేతృత్వంలో ఇప్పుడున్న ‘ఫేస్బుక్’ ‘వాట్సాప్’ ‘ఇన్‌స్టగ్రామ్’ వేదికలు, ఆ పేర్లతోనే ప్రస్తుతం ‘మెటా వర్స్’గా పేరుమార్చుకునే మాతృసంస్థ ఛత్రఛాయలో డిసెంబరు 1 నుంచి పనిచేస్తాయి. నేటి యువతరం భవిష్యత్ ఆశలు, అంచనాల్ని పరిగణనలోకి తీసుకొని నిజమనిపించే కృత్రిమ ప్రపంచం సృష్టి ఆ ప్రకటన సారం! యువతకు ఉద్యోగ అవకాశాల ఆశ చూపిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులో పదివేల మంది ఇంజనీర్లు ఒక్క ఐరోపాలోనే పనిచేస్తారని చెప్పారు. సరే, అంతమంది సాంకేతిక నిపుణుల్ని వాడుకుంటూ, వివాదస్పదమౌతున్న తన ప్రస్తుత వేదికల్లోని ‘విషయాన్ని’ ముందు సంస్కరించు కొని, అటుపై కొత్త వేదిక కడితే బాగుంటుందని సామాజిక వేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలంటు న్నారు. పలు దేశాల స్థానిక భాషలకు చెందిన నిపుణులు వారి వేదికల్లో లేక, నిర్వహణ–నియంత్రణ లోపించి అవాంఛనీయ సమాచారం జనబాహుళ్యంలోకి విచ్ఛలవిడిగా వస్తోందనేది! ఇదంతా బహి రంగ రహస్యమవడంతోనే అమెరికాలో ఆదరణ తగ్గిందని, దాంతో ఇతర ప్రాంతాలకు విస్తరించే పథకాల్ని యాజమాన్యం రచించి, అమలుచేస్తోందనేది ఘాటైన విమర్శ. స్వీయ లాభార్జనకే పెద్ద పీటవేస్తూ, సమాజంలోకి తప్పుడు సమాచారం వరదలై పారుతున్నా, ద్వేష భావాల్ని రేపే విష యాలు పరివ్యాప్తమౌతున్నా... ఫేస్బుక్ యాజమాన్యం ఉపేక్షించడాన్ని యావత్ ప్రపంచం తప్పు బడుతోంది. ఇవి యథాలాపంగానో, యాదృచ్ఛికంగానో జరుగుతున్నవి కావని..తెలిసి నిర్వాహ కులు కళ్లు మూసుకుంటే, కొన్నిమార్లు పనిగట్టుకొని ‘నిర్వహిస్తే’ జరుగుతున్న అనర్థాలని బయటకు వెల్లడైన ఫేస్బుక్ అంతర్గత పత్రాలే చెబుతున్నాయి. ప్రపంచమే నివ్వెరపోయింది! తమ వేదికల నుంచి వచ్చే ‘విషయం’ ముఖ్యంగా పిల్లలు, కౌమారంలోని వారిపై విపరీత దుష్పభావం చూపు తోందని తెలిసినా ఫేస్బుక్ నిర్వహకులు పట్టించుకోకపోవడాన్ని విశ్వ సమాజం తప్పుబడుతోంది. ఆయా వేదికల నిర్వహణ, వాటి నుంచి వస్తున్న సమాచారం, దాని ప్రభావాలపై నిరంతర నిఘా ఉండాలని, తనిఖీలు జరగాలని, స్థానిక చట్టాల్ని ఉల్లంఘించినపుడు తగు చర్యలుండాలని ప్రపంచం నలువైపులా ఒత్తిళ్లు పెరిగాయి. ఈ సంక్షోభ సమయంలోనే జుకెర్‌బర్గ్ కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. నిజమనిపించే కృత్రిమ ప్రపంచాన్ని, ఇప్పుడున్నట్టు తెరపైన చూడటం కాకుండా... ఇకపై ఎవరికి వారు నేరుగా అందులోకి ప్రవేశించి–పాల్గొనే వ్యవస్థను తాజా మెటావర్స్ కింద ఆవిష్కరించనున్నారు. రియాలిటీ హెడ్ సెట్స్, రియాలిటీ కళ్లజోళ్లు, స్మార్ట్ఫోన్లు, ఆప్‌లు... ఇలా పలు సాంకేతిక ప్రక్రియల్ని సమీకృతం చేసి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మెటావర్స్ అంటే, ఫేస్బుక్ ట్వీట్ ప్రకారం... ‘ఇప్పుడు సాధ్యమయ్యే దానికి మించి, సామాజిక సంబంధాల నూతన శకం. ప్రపంచ ప్రజలే ఉమ్మడిగా ఏర్పరచుకొని, ఎవరైనా స్వేచ్ఛగా పాల్గొనగలిగే ప్రాజెక్టు. కృత్రిమంగానే అయినా పరస్పరం కలుసుకోవడం, నేర్చుకోవడం, కంటెంట్‌ను ఉత్పత్తి చేయడం, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్ని సృష్టించుకోవడం, ఆడుకోవడం... వంటివన్నీ ఇక్కడ సాధ్యమవుతాయి’. రానున్న దశాబ్ద కాలంలోనే వందకోట్ల మందికి మెటావర్స్ చేరువవుతుందనే విశ్వాసాన్ని జుకెర్‌బర్గ్ వ్యక్తం చేస్తున్నారు. ‘సామాజిక మాధ్యమ వేదికగానే మాకు పేరున్నా, నిజానికి మనుషుల్ని సామాజికంగా కలిపే అత్యున్నత సాంకే తికతను అందించే గుణం మా డీఎన్ఏలోనే ఉంది’ అని ఆయన సగర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే, సామాజిక కార్యకర్తలడిగే పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలివ్వాల్సి ఉంటుంది. బాధ్య తతో, పారదర్శకంగా ఇచ్చే సమాధానాన్ని బట్టే, ప్రపంచం మెటావర్స్‌ని చూస్తుంది. వాస్తవాలు అంగీకరించడానికి, తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఫేస్బుక్ ముందుకు రావాలి. ఈ వివాదాస్పద వేదికల నుంచి జరిగే తప్పిదాలన్నీ ఉద్దేశపూర్వకం అనడానికి లేదు. కొన్నిసార్లు కృత్రిమ మేథా సాంకేతికతను వాడే క్రమంలో, ఆల్గోరిథమ్స్‌ని సమగ్రంగా వాడకపోవడం, వాడిన పుడు అవీ, స్థానిక భాషాపదాల్ని, పదబంధాల్ని సరైన అర్థంలో, అన్వయంలో గుర్తించకపోవడం వంటివి తప్పిదాలకు కారణమవుతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో మతపరమైన సున్నితాంశాల్లో చిక్కులొచ్చాయి. ఫేస్బుక్ వేదికని వాడి, పనిమనుషుల విక్రయాలు–రవాణా జరగటం విమర్శలకు కారణమైంది. భారత్‌లోనూ ఫేస్బుక్ వేదిక నుంచి వచ్చే సమాచారంతో మతపరంగా, రాజకీ యంగా సమస్యలు వస్తున్నాయి. కొన్ని విషయాల్లో నిర్వాహకుల ‘చేతివాటం’ కూడా ఉన్నట్టు వెల్లడైన అంతర్గత పత్రాల్లో తేలింది. లోగడ ఫేస్బుక్లో పనిచేసి, ప్రజావేగుగా మారిన ఫ్రాన్సెస్ హెగెన్ కథనం, జర్మనీ వేదికగా పనిచేసిన పరిశోధనా సంస్థ చేసిన వెల్లడి ప్రకారం... ఫేస్బుక్ చేతులు స్వచ్ఛంగా లేవు. తీరు మారకుండా పేరు మాత్రమే మారితే, కొత్త ప్రాజెక్టులోనూ పాత సమస్య పునరావృతం ఖాయం! ఈ సత్యాన్ని జుకెర్‌బర్గ్ ఎంత వేగంగా గ్రహిస్తే అంత మంచిది! -
చైనా చట్టం... దేని కోసం?
వారం రోజుల క్రితం... గత శనివారం చైనా చేసిన కొత్త చట్టం అది. ఈ ఏడాది మార్చిలో ప్రతిపాదించి, ఏడు నెలల్లో ఆమోదమే పొందిన ఆ సరిహద్దు చట్టం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజింగ్ ‘సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రత సమున్నతం. వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదు’ అని 62 క్లాజులతో కూడిన ఈ 7 అధ్యాయాల కొత్త ‘భూ సరిహద్దు చట్టం’ పేర్కొంటోంది. భారత్ కోసమే ఈ చట్టం చేసినట్టు పైకి కనిపించకపోయినా, దీని పర్యవసానాలపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. అక్టోబర్ 23న చైనా జాతీయ చట్టసభ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ అంగీకరించిన ఈ చట్టానికి, ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అదే రోజు ఆమోదముద్ర వేశారు. ఆ చట్టం పూర్తిగా ‘ఏకపక్ష చర్య’ అనీ, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సరిహద్దుల నిర్వహణలో ఉన్న ద్వైపాక్షిక ఏర్పాట్లపై ఇది దుష్ప్రభావం చూపుతుందనీ భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా మాత్రం ‘ఇప్పుడున్న సరిహద్దు ఒప్పందాల అమలులో ఈ చట్టం ప్రభావమేమీ ఉండదు’ అంటూ కొట్టిపారేస్తోంది. ఇప్పటికే 17 నెలలుగా రెండు దేశాల సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన నెలకొంది. కొత్త చట్టం పరిష్కారానికి మరిన్ని అడ్డంకులు సృష్టిస్తుందన్నది పెద్ద భయం. భారత్‌తో సరిహద్దు వివాదాల పరిష్కారంలో చైనా ఇటీవల అనుసరిస్తున్న మొండి వైఖరి ఈ భయాలకు మరింత ఆజ్యం పోస్తోంది. భారత్ సహా మొత్తం 14 దేశాలతో... 22,457 కి.మీ. మేర చైనాకు భూ సరిహద్దు ఉంది. ఆ దేశానికి మంగోలియా, రష్యాల తర్వాత మూడో సుదీర్ఘమైన సరిహద్దు భారత్‌తోనే నెలకొంది. ఆ రెండు దేశాలతో చైనాకు సరిహద్దు సమస్యలేమీ లేవు. భారత్ తర్వాత చైనాకు భూ సరిహద్దు తగాదాలున్నది 477 కి.మీ. మేర హద్దులు పంచుకుంటున్న భూటాన్‌తోనే. సరిహద్దు చర్చలను వేగిరం చేయడానికి భూటాన్ ఈ నెలలోనే చైనాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అదీ మనకు కొంత దెబ్బే. ఇక, మిగిలిందల్లా మనమే. ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్ఏసీ) వెంట 3,488 కిలోమీటర్ల పొడవునా చైనాతో భారత్‌కు సరిహద్దు వివాదం ఉంది. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే 5 నాటి ఘటనలు, వెంటనే జూన్ 15న గాల్వన్ లోయ పరిణామాలతో పీటముడి బిగిసింది. భారత భూభాగంపై చైనా తిష్ఠ వేసింది. పరిష్కారానికి సైనిక, దౌత్యస్థాయి చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏదీ తేలకుండానే చైనా కొత్త చట్టం తెచ్చింది. భారత, చైనాల సరిహద్దు సమస్య సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో ఇప్పటికి 20 విడతలుగా చర్చలు జరిగాయి. తుది పరిష్కారం మాటెలా ఉన్నా, ముందుగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగించడం అవసరమని ఇరుపక్షాలూ అంగీకరించాయి. కానీ, ఇప్పుడీ చట్టం కింద చైనా తప్పుకు తిరుగుతుంది. వివాదాస్పద ప్రాంతాలను సైతం ఈ చట్టం కింద చైనా తన భూభాగమనే అంటుంది. ఆ మాట మనం అంగీకరించం. 1963 నాటి ఒప్పందం కింద అక్సాయ్‌చిన్ ప్రాంతంలోని షక్స్గమ్ లోయను సైతం చైనాకు పాక్ అప్పగించింది. కానీ, అది చట్ట విరుద్దమనీ, అక్సాయ్‌చిన్ సహా జమ్మూ కశ్మీర్ మొత్తం మనదేననీ భారత్ ప్రకటించింది. ఇప్పుడు అదీ చిక్కు. హోమ్ శాఖ, రక్షణ శాఖల్లో సరిహద్దుల నిర్వహణ బాధ్యత ఎవరిదనే స్పష్టత మన దగ్గర కొరవడుతుంటే, చైనా ఈ కొత్త చట్టంతో తమ హద్దుల బాధ్యత పూర్తిగా ఆర్మీ మీద పెడుతుంది. దీంతో, చర్చలు క్లిష్టమైపోతాయి. వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇక చైనా సైనిక ఉపసంహరణ కష్టమే. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే ఈ సరికొత్త ‘చైనా భూ సరిహద్దు చట్టం’ ఆ దేశ యుద్ధోన్మాదానికీ, ఆక్రమణవాదానికీ సంకేతమని విశ్లేషకుల విమర్శ. ఆ మాటకొస్తే, ఎల్ఏసీ వెంట అన్ని సెక్టార్ల ప్రాంతాల్లోనూ చైనా 2016 నుంచి పటిష్ఠమైన సరిహద్దు రక్షణ గ్రామాలను నిర్మిస్తోంది. ఈ ఏడాది జూలైలో అరుణాచల్ ప్రదేశ్‌కు దగ్గరలో టిబెట్‌లో కట్టిన ఓ గ్రామాన్ని షీ జిన్‌పింగ్ స్వయంగా సందర్శించారు. అసలీ పౌర ఆవాసాల నిర్మాణం, పౌరుల ఉనికి చైనా భారీ వ్యూహం. ఈ సరిహద్దు గ్రామాలను పౌర, సైనిక అవసరాలు రెంటికీ చైనా వాడుకో నుంది. ఈ గ్రామాలు ఆర్మీకి గస్తీ స్థానాలుగా ఉపకరిస్తాయి. మరోపక్క దెమ్చోక్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ‘కొత్త పౌరులు’ ఎల్ఏసీ వెంట భారత భూభాగంలో గుడారాలు వేసుకున్నారు. చైనా జనాభా ఇలా మన ప్రాంతాల్లోకి ఎగబాకితే కష్టమే. భవిష్యత్తులో సరిహద్దుల గురించి భారత్ చర్చిం చడం మొదలుపెడితే, ‘ఆ ప్రాంతం మాదే. మా జనాభా అక్కడున్నార’ని చైనా వాదించే ప్రమాదం ఉంది. అంటే, సరిహద్దు వెంట వివాదాస్పద భూభాగాల్లో శాశ్వత వసతి సౌకర్యాలు, నియంత్రణ వ్యవస్థలు నిర్మించి, ఆ భూభాగాలు తమవేనంటూ చైనా చట్టబద్ధం చేయనుందన్న మాట. భారత్, భూటాన్‌ల విషయంలో సరిహద్దుల వెంట చట్టబద్ధంగా బలగాలను చైనా వాడే వీలు కల్పిస్తోందీ చట్టం. అలా ఈ చట్టంతో ఇన్నాళ్ళ భారత, చైనా సరిహద్దు చర్చల వ్యవస్థకు దాదాపు తెరపడినట్టే. చైనా మరింత చొచ్చుకురాకుండా అడ్డుకోవడానికి ఎల్ఏసీ వెంట దీర్ఘకాలం పాటు, భారీయెత్తున సైనిక బలగాలను భారత్ మోహరించాల్సి వస్తుంది. ఇది మరింత శ్రమ, ఖర్చు. అలాగే, సరిహద్దు సమస్యలతో ద్వైపాక్షిక సంబంధాలను ముడిపెడుతున్న భారత్ వాదనను ఈ కొత్త చట్టంతో చైనా తోసిపుచ్చినట్టయింది. ఇప్పుడిక జగమొండి చైనాతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చు కొనే ఆచరణాత్మక వ్యూహాలను భారత్ ఆలోచించక తప్పదు! -
అలను ఆపటమా? రేపటమా?
భయపడి జాగ్రత్తలు మానేయడమా? జాగ్రత్త పడుతూ భయాన్ని వీడటమా? ఎప్పుడైనా రెండోదే అనుసరణీయం! మనం మరింత జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. కరోనా మూడో అల రాక, ఉధృతి వంటివన్నీ మనం–మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాయని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు, హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాల్సిన తరుణమిది. సరికొత్త వైవిధ్యాలతో కోవిడ్ మళ్లీ కోరలు చాస్తోంది. ఐరోపాలో కేసుల సంఖ్య, మరణాల రేటు రమారమి పెరిగింది. రష్యాతో పాటు ఉక్రెయిన్, బ్రిటన్, రుమేనియా తదితర దేశాల్లో కరోనా కలత సృష్టిస్తోంది. రష్యాలో 24 గంటల్లో 1100 మందిపైనే మరణించడంతో అన్నీ మూసేసి, పది రోజుల వేతనంతో కూడిన సెలవును ప్రకటించారు. చైనాలో కొత్త కేసులు పెరుగుతున్న తీరుకు ఆందోళన చెందిన ప్రభుత్వం నలభై లక్షల జనాభా కలిగిన వాయవ్య ప్రావిన్స్ గన్షు రాజధాని లాన్‌జువో నగరంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది. నగరంలోకి రైళ్లు, విమానాలను పూర్తిగా నిలిపివేసింది. కోవిడ్–19 వైరస్ కొత్త వైవిధ్యం ఏవై.4.2 కేసులు భారత్‌లోనూ బయటపడ్డాయి. కర్ణాటకలో ఈ కేసుల్ని నిర్ధారించి, అధికా రికంగా ప్రకటించారు. కేసులు పెరుగుతున్నట్టు వైద్యారోగ్య నిపుణులు ప్రకటించారు. ఈ వైరస్ బారినపడ్డ వారిని గుర్తించి, ప్రాథమిక, ద్వితీయ ప్రభావితులపై పరిశోధనలకు నమూనాలను ఇప్పటికే ప్రయోగశాలలకు చేర్చారు. ఇది డెల్టా ప్లస్ రకానికి చెందిన సరికొత్త్త వైవిధ్యం. దీని ప్రభావంపై జరుగుతున్న పరిశోధన ఫలితాలను బట్టి ఇదెంత ప్రమాదకారి? వైరస్ వ్యాప్తి, వ్యాధి విస్తరణ–తీవ్రత! వంటిని నిర్ధారిస్తారు. లోగడ బి.1.617 వైవిధ్యం భారత్‌లో సృష్టించిన అలజడి కోవిడ్–19 రెండోఅల ఉధృతిలో మనమంతా కళ్లారా చూశాం! అపార ప్రాణ నష్టం జరిగింది. గత కొంతకాలంగా మొత్తమ్మీద దేశంలో కేసుల సంఖ్య తగ్గినట్టే కనిపిస్తున్నా... అక్కడక్కడ తగ్గక పోవడం, కేరళ వంటి ప్రాంతాల్లో మళ్లీ పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కేరళతో పాటు పొరుగు నున్న కర్ణాటక, తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే మరింత అప్రమత్తమయ్యాయి. కేంద్రం కూడా తరచూ రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. కోవిడ్ ప్రభావం తగ్గిందనే తలంపుతో అలక్ష్యం చేయొద్దని, పౌరులు కోవిడ్‌కు తగ్గ ప్రవర్తన (సిఎబి)తో కనీస జాగ్ర త్తలు పాటించాలని సూచిస్తోంది. ఒకటో అల ఉధృతి తగ్గుతున్న క్రమంలో మన నిర్లక్ష్యానికి, సర్కార్ల అలసత్వానికి తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. రెండో అలలో పెరిగిన ఉధృతి, జరిగిన ప్రాణ నష్టం అనుభవాల్ని గుణపాఠంగా గ్రహించి అప్రమత్తంగా ఉండాల్సిన సంధికాలపు సందర్భమిది. ప్రభుత్వాలు నిర్ణయాల పరంగా, వైద్య విభాగం సన్నద్ధతపరంగా, పౌరసమాజం స్వీయ నియంత్ర ణతో వ్యవహరించాలి. రాగల ప్రమాద ఆస్కారాన్ని తగ్గించాలి. ఇది మనందరి ఉమ్మడి కర్తవ్యం! అక్కడక్కడ కోవిడ్ కేసులు పెరుగుతూ, కొత్త వైవిధ్యాలు పొడచూపుతున్న ఈ సమయంలోనే ఉపఎన్నికలు, పండుగలు, ఇతర శుభకార్యాలున్నాయి. వాటిల్లో పాల్గొనేవారి సంఖ్యా పరిమితులకు మనవాళ్లెప్పుడో తిలోదకాలిచ్చారు. ఎక్కడ చూసినా, జనం ఏ బెరుకూ–జాగ్రత్తలు లేకుండా పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. జనాభాలో 75 శాతానికి పైబడి మాస్కులు లేకుండానో, నామ మాత్రంగా ధరించో ఉంటున్నారని ఒక అధికారిక సర్వేనే వెల్లడించింది. భౌతిక దూరాలు పాటిం చడం, శానిటైజర్ల వినియోగం కూడా తగ్గింది. ఇప్పుడు దాదాపు ఏ కట్టడీ (లాక్‌డైన్) లేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ ఇంకా అమలవుతోంది. దేశమంతా బడులు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్ని తెరిచారు. సినిమాలు, మాల్ సెంటర్లు, వాణిజ్యం, వర్తకం వంటి కార్యకలాపాల కేంద్రాల న్నింటినీ తెరచుకొమ్మన్నారు. విధి–నిషేధాలతో జనహితంలో కట్టడి పాటించడం ఒకవైపు, రోజు వారీ కార్యకలాపాల్ని పునరుద్ధరించి, ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించడం మరోవైపు... ప్రభుత్వాలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాంశాలు! పరిస్థితులు చెయిదాటి మళ్లీ కట్టడి విధించాల్సిన పరిస్థితులే వస్తే... పౌరులు, ముఖ్యంగా పేద–అల్పాదాయ వర్గాలు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దినకూలీలు! ఇది పునరావృతం కాకుండా పౌరసమాజమే చొరవ తీసుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, నిరంతర పరిశుభ్రత బాధ్యతగా భావించి, పాటించాలి. సామూహిక రోగనిరోధకతపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. బూస్టర్ డోస్‌ల అవసరం పెరుగు తోంది. వివిధ దేశాల్లో అందుకోసం ప్రత్యేక అనుమతులు ఇస్తున్నారు. వెనుకబడిన పలు దేశాల్లో ఇంకా తొలి విడత టీకా ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఈ అసమానతలు మంచిది కాదు. మనం వంద కోట్ల టీకాలివ్వడం ఇటీవలే పూర్తిచేసుకున్నాం. మూడో అల వచ్చినా తట్టుకునేలా ఆక్సిజన్ సరఫరా, పడకల అందుబాటు, ఇతర వైద్య వ్యవస్థల్ని రాష్ట్ర–కేంద్ర స్థాయిలో సమకూర్చుకుం టున్నాం. రెండు టీకాలు తీసుకున్న తర్వాత కొన్ని నెలలకు రోగనిరోధకత పడిపోయి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఓ అధ్యయన నివేదిక చెబుతోంది. దానికి విరుగుడుగా అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందనే ప్రచారం మిన్నంటింది. కోవిడ్‌ని ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ జనమంతా ఇలా నిరంతరం టీకాలు, బూస్టర్లు తీసుకుంటూనే ఉండాల్సి వస్తే, ఇదొక ఫార్మా కార్పొరేట్–పారిశ్రామిక రంగం దీర్ఘకాలిక కుట్రేమో? అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇలాంటి అరిష్టాలన్నీ అధిగమించి గట్టెక్కాలంటే పౌరుల అప్రమత్తత, జాగ్రత్తలే ప్రధానం! -
ఆ‘పరేషాన్’ కశ్మీర్!
‘‘నాకు బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లేదు... సెక్యూరిటీ లేదు... మీ ముందు నిల్చొని మనసు విప్పి మాట్లాడుతున్నా!’’ మూడు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఓ సభలో అన్న మాటలివి. అక్కడున్న కశ్మీరీ జనం మీద నమ్మకం కనబరుస్తూ, ప్రతీకాత్మకంగా ఆయన అలా బుల్లెట్ ప్రూఫ్ కవచం అడ్డు తీసేసి తమ ప్రభుత్వ దృఢసంకల్పాన్ని వ్యక్తం చేశారు. సరిహద్దు వెంట పూంఛ్ సెక్టార్లో రక్తపాతం కొద్దిరోజులుగా ఆగని నేపథ్యంలో అమిత్ షా పర్యటన, ఆయన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి–నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటూ గడచిన మూడు రోజుల్లో రెండు సార్లు సూచించారు. కానీ, పలుమార్ల పాకిస్తాన్ ద్రోహాలతో, మరీ ముఖ్యంగా పుల్వామా దాడితో కేంద్రానికి మబ్బులు వీడి, కేంద్రమంత్రి ఆ సూచనల్ని తోసిపుచ్చారు. ‘నయా కశ్మీర్’ కోసం కశ్మీరీ యువతరంతోనే మాట్లాడతానంటూ తెగేసి చెప్పడం గమనార్హం. ప్రతిపక్ష కశ్మీరీ నేతలపై విరుచుకు పడడమే కాక సోమవారం డల్ సరస్సులో మిరుమిట్లు గొలిపే దీపకాంతుల మధ్య సాంస్కృతిక ప్రదర్శనల్లో షా పాల్గొన్నారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే భావన కలిగించేందుకు శతవిధాల ప్రయత్నించారు. షార్జాకు విమాన సర్వీసు, ఐఐటీ కొత్త ప్రాంగణం ప్రారంభోత్సవం వగైరా చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో అవినీతి, బంధుప్రీతి, తీవ్రవాదం నశించి, మునుపెన్నడూ లేని అభివృద్ధి జరుగుతోందని తన పర్యటనలో కశ్మీరీ యూత్ క్లబ్ సభ్యులతో నమ్మబలికారు. కానీ, కశ్మీర్లో అల్పసంఖ్యాకులైన పండిట్లు, సిక్కులు, వలస కార్మికుల ఊచకోత... పదిహేను రోజులుగా తీవ్రవాదులపై ఆగని సైనిక చర్య – క్షేత్రస్థాయి ఉద్విగ్నతను కళ్ళకు కడుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లతో మూన్నాళ్ళ పర్యటనకు వచ్చిన మంత్రి మాటల్లోని ధైర్యం అక్కడి సామాన్యులకు ఉంటుందా అన్నది అనుమానమే. సోమవారం సైతం పుల్వామాలో పోలీస్‌స్టేషన్‌పై జరిగిన గ్రెనేడ్ దాడి లాంటివి కశ్మీర్ నిజంగా సురక్షితమేనా, గుండెలపై చేతులేసుకొని బతికే పరిస్థితి ఉందా అని భయం రేపుతున్నాయి. హింసాకాండ, భయం కశ్మీర్‌తో పుట్టిన కవలపిల్లలు. 2019 ఆగస్టు 5న కేంద్రం రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దుతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. తద్వారా పరిస్థితి చక్కబడి శాంతి నెలకొంటుందని ఆశించింది. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, ఎన్నికల సంఘం ఓకే అనగానే రెండు రాష్ట్రాలకూ ఎన్నికలు పెడతామనీ చెప్పింది. కానీ, రెండేళ్ళు దాటినా పరిస్థితి అలా లేదు. పైగా, కొద్ది రోజులుగా తీవ్రవాదులు ఎంచుకొని మరీ చేస్తున్న హత్యల్లో డజను మంది సామాన్యులు, అధీన రేఖకు దగ్గరలోని రాజౌరీ– పూంఛ్ సెక్టార్లో 9 మంది దాకా సైనికులు బలయ్యారు. ఇది చొరబాటుదారులైన పాకిస్తానీ తీవ్రవాదుల పనే అన్నది అంచనా. బీహార్, యూపీల నుంచి వచ్చిన వలస కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత రెండేళ్ళలో తొలిసారిగా అమిత్‌షా కశ్మీర్లో పర్యటిస్తున్నది అక్కడి పరిస్థితిని కళ్ళారా చూడడానికే అనిపిస్తుంది. షా కన్నా కొన్నాళ్ళ ముందే సాక్షాత్తూ భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ ఎం.ఎం. నరవానే సైతం కశ్మీర్ పర్యటించారు. దాన్నిబట్టి విషయ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. శ్రీనగర్‌లో అనేక గంటల ఉన్నతస్థాయి సమావేశంలో భద్రతా వ్యవహారాలను షా సమీక్షించారు. మోదీకి కుడిభుజంగా, అధ్యక్షస్థానంలో లేకున్నా బీజేపీ ఎన్నికల ప్రచారాల చుక్కానిగా, కశ్మీర్‌కు కిరీటం లేని కార్యనిర్వాహకుడిగా పేరున్న షా వస్తున్నారంటే, వెయ్యి మంది యువకులను అరెస్టు చేయాల్సి వచ్చింది. భద్రతకు డ్రోన్ కెమేరాలు, స్నైపర్లు, స్పీడ్‌బోట్లను దింపాల్సి వచ్చింది. నూటికి 70 మంది 35 ఏళ్ళ లోపు వారే ఉన్న కశ్మీర్లో నిరుద్యోగ రేటు ఇప్పటికీ దేశంలోనే అత్యధికం. మరి, ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తోందంటే నమ్మేదెలా? అభివృద్ధి ఫలాల కోసం కర్ఫ్యూలు, ఇంటర్నెట్ అవరోధాలు, మీడియాపై ఆంక్షల లాంటి చేదు మాత్రలను సహించి, భరించాలన్న మంత్రివర్యుల మాటను అర్థం చేసుకొనేదెలా? అఫ్గాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో కశ్మీర్లో మళ్ళీ హింస పేట్రేగడం గమనార్హం. కాబూల్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు తమకు కశ్మీర్‌ను కట్టబెట్టడంలో సాయపడతారన్న పాకిస్తానీ మంత్రి మాటనూ మర్చిపోలేం. అందుకే, పర్యటన సమయాన్ని పొడిగించుకొని, సోమవారం రాత్రి కూడా అక్కడే గడిపి, కశ్మీర్‌పై సీరియస్‌గా ఉన్నామన్న సంకేతాలిచ్చారు షా. కానీ, కశ్మీర్ భవితవ్యం ఇప్పుడు ఓ విషవలయంలో చిక్కుకుంది. తీవ్రవాదం తగ్గితే కానీ, పునర్విభజన, ఎన్నికలు సాధ్యం కావు. ఎన్నికలు జరిగితేనే కానీ, తీవ్రవాదానికి ముకుతాడు వేయడం కుదిరేలా లేదు. వెరసి, కథ మళ్ళీ మొదటికే వచ్చింది. దాన్ని మార్చాలంటే, ఎంతో చేయాలి. ముందుగా లోయలో భద్రతనూ, నిఘా విభాగాన్నీ పటిష్ఠం చేయాలి. క్షేత్రస్థాయికి దూరంగా శ్రీనగర్ సుందర రాజభవనాల్లోని గవర్నర్ వ్యవస్థ కన్నా ఎన్నికలతో జనం మనసు గెలిచిన ప్రజాపాలకులపై బాధ్యత మోపాలి. పర్యటనలు, మాటలు సరిపోవు. మాటల్లోని సంకల్పం చేతల్లో చూపాలి. ముఖ్యంగా ప్రేమ, కారుణ్యాలతో స్థానికుల మనసును గెలుచుకొని, వారిని తమతో కలుపుకొనిపోతేనే పరిస్థితుల్లో మార్పు సాధ్యం. 370 రద్దు వేళ జరగనిది అదే! లేదంటే, ఎన్నేళ్ళయినా ‘మిషన్ కశ్మీర్’ సశేషమే! -
ఎల్లలు దాటించే కళ
నిత్యం మధుర ఫలాలు తినేవాడికి పులుపు మీద మనసు పుడుతుందట. మనిషి స్వభావాన్ని అత్యంత సన్నిహితంగా చూసినవాడు మాత్రమే చెప్పగలిగే ఈ వాక్యాన్ని కవులకే కవి అయిన కాళిదాసు పదిహేను వందల సంవత్సరాల క్రితం అన్నాడట. ఈ అట ఎందుకంటే, సంస్కృతంలో దీన్ని చదివినవాళ్లు ఎంతమందో మనకు తెలియదు. తక్కువమంది అని మాత్రమే నిశ్చయంగా చెప్పగలం. ఆ కాళిదాసుకు వెయ్యి సంవత్సరాల ముందు, మనిషికి శాంతిలోని సౌఖ్యాన్ని తెలియ జేయడానికి బుద్ధ భగవానుడు చెప్పాడని చెప్పేదంతా పాళీ భాషలో ఉంది. అయినా అదంతా మనకు చేరింది. బైబిల్, ఖురాన్ తమ మూలభాషలైన హీబ్రూ, అరబిక్‌లను దాటుకొని ప్రపంచ మూలమూలలకూ వ్యాపించాయి. ఒక్కమాటలో దీనంతటికీ కారణం: అనువాదం. గ్రీకు సోక్రటీసు మనకు సన్నిహితుడే. పారశీక రూమీ కావాల్సినవాడే. గోర్కీ రష్యాలో రాస్తే ఇక్కడి పల్లెటూళ్లలో సమోవార్ల వెచ్చదనం అనుభవించాం. మావో చైనాలో ఏదో చెబితే మన పక్కనే ఉండి మనకు చెప్పాడనుకుని కార్యరంగంలోకి దూకాం. మపాసా ఫ్రాన్సులో చెప్పినదానికి మన చలం చెప్పేవాటితో పోలికలు వెతికాం. పక్కనే కన్నడ దేశంలో ఉన్న భైరప్ప ఏం రాశాడో; పొరుగున మరాఠా ప్రాంతంలో ఉన్న శరణ్ కుమార్ లింబాలే ఏం చేశాడో అనాయాసంగా తెలుసుకోగలం. బహుశా ప్రపంచంలోని సారస్వతం అంతా అనువాద రూపంలోనే బతికి ఉంది. ఈ ప్రపంచం నిలిచింది, వివేకవంతమైంది అనువాదంతోనే. ఒక భాషలోని రచనను ఇంకో భాషవాళ్లకు తెలియజేయాలని ఒక అనువాదకుడు ఎందుకు ఉవ్విళ్లూరుతాడో దానికి తనవైన కారణాలు ఉండొచ్చు. భావజాల వ్యాప్తి మొదలు తాను అనుభవించిన సంతోషాన్ని ఇంకొకరికి పంచడం దానికి ప్రేరేపకాలు కావొచ్చు. మూల భాషలోంచి లక్ష్య భాషలోకి ఎలా తేవాలో చెప్పడానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తెచ్చిన దాని పట్ల అన్నే నిరసనలూ ఉన్నాయి. పోయే గింజంతా పోగా మిగిలిన పొల్లు మాత్రమే అనువాదం అని చెప్పేంతగా. పూలనే కాదు, ఆ రాళ్లను ముఖాన కొట్టించుకోవడానికి కూడా అనువాదకుడు సిద్ధపడతాడు. పుష్కిన్ కవిత్వాన్ని అనువదించ లేమంటారు. ఆ కారణంగా ఎవరూ అనువాదానికే పూనుకోకపోతే, ఆ అమృతం తాగలేకపోయిన ఇతర భాషీయులకు సువాసన అయినా పీల్చే అవకాశం ఉండదు కదా. అయితే అనువాదకుల వల్ల కూడా లక్ష్యభాషలు వృద్ధి చెందాయి. కొత్త పదాలు పుట్టాయి. కొత్త వ్యక్తీకరణలు పరిచయం అయ్యాయి. ఒక్క మాటలో రచన ఒక కళ అయితే, అనువాదం దాదాపుగా అంతకు తగ్గని కళ. ఆ స్వీయాభిమానంతోనే, ఈ మధ్య కొందరు అనువాదకులు ‘ట్రాన్స్‌లేటర్స్ ఆన్ ద కవర్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ఉద్యమం చేపట్టారు. ప్రచురణ సంస్థలు రచయితల పేర్లను మాత్రమే కవర్ పేజీ మీద వేస్తున్నాయనీ, తమ పేర్లను కూడా గౌరవంగా ముఖపత్రం మీద ముద్రించాలనీ లండన్‌లోని ‘ద సొసైటీ ఆఫ్ ఆథర్స్’ ప్రచారం ప్రారంభించారు. సెప్టెంబర్ 30 నాటి అంతర్జాతీయ అనువాద దినోత్సవం దీనికి ఒక ట్రిగ్గర్‌గా పనికొచ్చింది. దానికి కొనసాగింపుగా చర్చలు జరుగుతున్నాయి. రచయితల సమూహం ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. దానికి బలం పెరిగేలా సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఎందరో ప్రసిద్ధ అనువాదకులు సమ్మతి తెలిపారు. పదకొండు వేల మంది సభ్యులున్న అమెరికాకు చెందిన ‘ఆథర్స్ గిల్డ్’ కూడా వీరికి మద్దతుగా నిలిచింది. యాభై లక్షల రూపాయల నగదు కలిగిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజును రచయితతో పాటు అనువాదకులకూ 2016 నుంచి సమంగా పంచుతున్నారు. ఇది అనువాద ప్రతిభను గొప్పగా గౌరవించడమే. అయితే, 2018లో ‘ఫ్లైట్స్’ పుస్తకానికి గానూ ఈ పురస్కారం గెలుచుకున్న పోలండ్ రచయిత్రి ఓల్గా తొకార్చుక్ పేరును కవర్ మీద వేశారు గానీ, దాన్ని ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్ క్రాఫ్ట్ పేరును వేయలేదు. పుస్తకం లోపల వేస్తారు; కానీ చూడగానే అనువాదం అని తెలియకుండా అదో చిన్న యుక్తి అనేది కొంత మంది ప్రచురణకర్తల వాదన. అదే సంవత్సరం సాహిత్యంలో అత్యున్నత గౌరవమైన నోబెల్ పురస్కారం కూడా పొందిన తొకార్చుక్ కూడా ముఖపత్రం మీద అనువాదకుల పేరు వేయాలన్న వాదనకు మద్దతునివ్వడం గమనార్హం. భిన్న అనువాదాల్లో వెలువడే అదృష్టం ఉన్న రచయితలు కొంతమంది ఉంటారు. అలాంట ప్పుడు అడిగినా అనువాదకుల పేరు కవర్ మీద వేయడం జరగకపోవచ్చు. కానీ వారి ప్రతిభతో నిమిత్తం లేకపోయినా అనువాదం కావడమే గొప్ప అదృష్టం అయ్యే రచయితలు మరికొందరు ఉంటారు. అలాంటప్పుడు ఆ డిమాండ్ సులువుగానే అంగీకారం పొందుతుంది. అయితే రచయిత, అనువాదకుడు సమానం అవుతారా? కచ్చితంగా కాదని ఆ సంతకాలు పెడుతున్న అనువాదకులు కూడా ఒప్పుకుంటారు. రచయితకూ అనువాదకుడికీ మధ్య ఒక గౌరవప్రదమైన దూరం ఉండాలి. అయితే, కవర్ పేజీ మీద పేరు వేయడం అనేది మరింతమందిని అనువాదంలోకి దిగేలా పురిగొల్పడానికీ, ఏదో భాషలో చీకట్లో ఉండిపోయిన అద్భుతమైన రచనను ప్రపంచానికి తెలియ జెప్పడానికి కావాల్సిన డ్రైవ్ ఇవ్వడానికీ కారణం కాగలదేమో. ‘అనువాదం గనక లేకపోతే, నేను నా దేశ సరిహద్దులకే పరిమితమయ్యేవాణ్ణి’ అన్నాడు స్పానిష్ రచయిత సెర్వాంటెజ్. కదా! అందువల్లే ఆయన ‘డాన్ కిహోటీ’ మనదాకా వచ్చాడు. ప్రపంచ ఎల్లలను చెరపడంలో రచయితల కన్నా అను వాదకుల పాత్రే ఎక్కువనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహం లేదు. -
ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన
రాజసభలో ఒక వేడుక. అతిథి రాజులంతా ఉచితాసనాలను అధిష్ఠించారు. అందులో ఒక రాజుగారి తల తెగిపడింది. ఉత్సవంలో రక్తపు మరకలు. ఈ ఘటనకు కారకులెవరు? దోషి ఎవరు?... బూతులు తిట్టిన శిశుపాలుడా? చక్రం తిప్పిన శ్రీకృష్ణుడా? తప్పు శిశుపాలుడిదేననీ, అతడు దండనార్హుడని,యుగయుగాలుగా తరతరాలుగా భారత సమాజం నమ్ముతూ వస్తున్నది. ఇప్పుడా కేసును తిరగదోడాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నది. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి అప్పీలు చేయ దలచుకున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షానంతర భాషణలో భాగంగా అభిభాషించారు. అనగనగా ఒకరాజు ఉదంతం సందర్భంగా కొద్దినెలల క్రితమే ఈ తర్క మీమాంసకు ఆ పార్టీ తెరతీసింది. ఆయన రాజంటే రాజు కాదు. దొరల యందు పిట్టల దొరలు వేరయా అన్నట్టు రాజుల్లో ఆయన తేడా రాజు. శత్రువుల తరఫున పనిచేసే కోవర్టులు రహస్యంగా ఉంటారు. ఈయన బహిరంగ కోవర్టు. అదీ తేడా. అతడు శల్యుని పరంపర. అఖండ మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని బజారు భాషలో తిట్టించడం తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల పంథాలో ఒక ముఖ్యమైన అంశం. ఈ కర్తవ్య నిర్వహణకోసం ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’గా ‘తేడా రాజు’ను ఆ పార్టీ నియో గించింది. ఒక డజన్ దుర్భాష దండకాల తర్వాత అతడి మీద పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. తిట్టిన రాజుది తప్పు కాదు, అరెస్ట్ చేసిన పోలీసులదే తప్పని అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా హడావుడి చేసింది. శిశుపాలోపాఖ్యానంలో కృష్ణుడిని విలన్‌గా ప్రకటించే వరకు నిద్రపోరాదని అప్పుడే చంద్రబాబు వర్గం కంకణం కట్టుకున్నది. తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల్లో భాగంగా పట్టాభి అనే ఔత్సాహికుడిని అధికార ప్రతినిధిగా రంగంలోకి దించింది. ‘నా బూతే నా భవిష్యత్తు’ అన్నంత దీక్షతో ఆయన తన కెరీర్‌ను ప్రారంభించాడు. సంస్కృత భాషలో భవభూతి ఎంతటి పండి తుడో బజారు భాషలో ఈ ‘బండబూతి’ కూడా ఇంచుమించు అంతటివాడనే ఖ్యాతికోసం ఆయన తహతహలాడుతున్నాడు. టీడీపీ అవసరాలకు అచ్చుగుద్దినట్టు పట్టాభి కుదురుకున్నాడు. ‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డం వచ్చినది’. ఇది పాత కథ. ఆ గడ్డిపోచను పట్టుకొని కథ మూలాల్లోకి వెళితే చేప ఎందుకు ఎండలేదో కారణం తెలుస్తుంది. చీమ పుట్టలో పెట్టిన వేలు విలన్‌గా తేలుతుంది. ఇప్పుడు మన ఎల్లో చేపల్ని కూడా ప్రశ్నించుకుంటూ వెళితే బూతు రహస్యాలను కనిపెట్టవచ్చును. ‘చేపా చేపా బూతులెందుకు మాట్లాడుతు న్నావు?’ ‘ఫ్రస్ట్రేషన్’... ‘ఎందుకు?’... ‘కిక్కు లేదప్పా!’. ‘చేపా చేపా అబద్ధాలెందుకు చెబుతున్నావు?’... ‘డబుల్ ఫ్రస్ట్రేషన్’... ‘ఎందుకు?’ ... ‘కిక్కు లేదప్పా’. ఏమిటా కిక్కు?... అది గంజాయి వనం నుంచే వీచే ధన మారుతం జేబుల్లో ప్రవహిస్తున్నప్పుడు కలిగే పరవశాల కిక్కు. లేటరైట్ ముసుగులో బాక్సైట్‌ను తవ్వుతున్నప్పుడు నట్టింట్లో ధనలక్ష్మి కాలిగజ్జెలు మోగుతున్నట్టు అనుభూతినిచ్చే కిక్కు. వాడవాడనా వెలసిన బెల్టు షాపుల్లో పారిన పేదవాడి నెత్తురు అత్తరు రూపంలో హత్తుకున్నప్పుడు వెలువడే పరిమళాల కిక్కు. వగైరా వగైరాలెన్నో ఉన్నాయి ఈ కిక్కుల్లో. కానీ మొన్న మన ఎల్లో ఫిష్ చేసిన బూతు ప్రవచనంలో గంజాయి, డ్రగ్స్‌ల పలవ రింతే ఎక్కువగా ఉన్నది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్‌లకు సంబంధించిన వృత్తాంతాన్ని ఒకసారి పరిశీలించడం అవసరం. ‘ఆంధ్రప్రదేశ్ ఈశాన్య ప్రాంతం దేశ గంజాయి రాజధానిగా మారుతున్నది’ అనే శీర్షికతో 2018 సెప్టెంబర్ 2న ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక పరిశోధనా కథనాన్ని ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి కథనాన్నే వేసింది. తెలుగు పత్రికల్లో, చానల్స్‌లో పుంఖాను పుంఖాలుగా ఈ వార్తలు వచ్చాయి. చంద్రబాబు ముఖ్య మంత్రిగా పనిచేసిన 2014 – 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవిదేశాలకు గంజాయి అక్రమ రవాణా పెద్దఎత్తున సాగిందని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. శ్రీలంకలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడిన సంఘటనపై ఆ దేశ ప్రభుత్వం విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచే ఆ సరుకు రవాణా అయినట్టుగా విచారణలో వెల్లడైంది. ఆ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం కేంద్రానికి చేరవేసింది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాన్ని అప్రమత్తం చేసింది. అప్పుడే కాదు మరో రెండు మూడు సందర్భాల్లో కూడా కేంద్రం గంజాయి రవాణాపై బాబు ప్రభు త్వాన్ని హెచ్చరించింది. అయినా రాష్ట్రం పెడచెవిన పెట్టింది. అంతేకాదు, గంజాయి అక్రమ రవాణాకు కొమ్ము కాసింది. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేసిన అప్పటి నర్సీ పట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడుపై మొదటి నుంచి అనేక ఆరోపణలున్నాయి. గంజాయి స్మగ్లింగ్ కింగ్ అయ్యన్నేనని ఆయన మంత్రివర్గ సహచరుడు గంటా శ్రీనివాసరావు బహి రంగంగా చెప్పిన వైనం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దా లుగా మావోయిస్టులకు గట్టిగా పట్టుంది. వారి భౌగోళిక విభ జనలో ఈ ప్రాంతానికి ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్)గా నామకరణం చేసుకున్నారు. వారికి కూడా ఆదాయ వనరుగా మారడంతో పెద్దఎత్తున ఇక్కడ గంజాయి సాగుకు అండగా నిలబడ్డారు. మావోయిస్టు ప్రాంతం కావడంతో రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఈ సాగును ఏమీ చేయలేక పోయారు. మావోయిస్టుల వేటకు వెళ్లే కూంబింగ్ పార్టీలు కూడా గంజాయి వనాల జోలికి వెళ్లేవి కావు. అలా చేస్తే గిరిజనులు మావోయిస్టులకు మరింత దగ్గరవుతారని వారి భయం. ఇక్కడ విస్తారంగా పండించిన పంటను దేశవిదేశాలకు తరలించడానికి ఉన్నది ఒకటే దారి. ఏవోబీ నుంచి నర్సీపట్నం, రంపచోడవరం, జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్. అక్కడినుంచి అన్నివైపులకు పంపిణీ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రవాణా కార్యక్రమం సాఫీగా సాగి పోయేది. ‘నర్సీపట్నం – ఫార్టీ పర్సెంట్’ అనే అనధికార ఒడంబ డిక ఇందుకు కారణమని స్థానికులు చెబుతారు. ఏవోబీ నుంచి మొదటి ఎగ్జిట్ పాయింట్ (నర్సీపట్నం) దగ్గర అక్కడ వుండే వీఐపీకి సరుకులో 40 శాతం విలువచేసే సొమ్ము చెల్లిస్తే హాయిగా చేరవచ్చు. ఈ ఫార్టీ పర్సెంట్‌లో ఏ స్థాయి వరకు ఎంత శాతం చేరుకునేదో ఆ వీఐపీలకు మాత్రమే ఎరుక. నామ్‌కే వాస్తే కొన్ని కేసులను మాత్రం నమోదు చేసేవారు. ఆ కేసుల్లో పురో గతి ఏమీ ఉండదు. అప్పుడప్పుడూ కొంత సరుకు సీజ్ చేసినట్టు చూపేవారు. గంజాయి స్మగ్లింగ్, మద్యం దొంగరవాణా, డ్రగ్స్ తదితర వ్యవహారాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ కర్తవ్య సాధనకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో’ (ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసింది. మెరికల్లాంటి సిబ్బం దిని ఈ బృందంలో నియమించింది. స్వయంగా సీఎం ఈ బృందం పని తీరును సమీక్షిస్తున్నారు. అనతికాలంలోనే ఎస్ఈబీ అద్భుతమైన పని తీరును కనబరిచింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంతో పాటు, రవాణా మార్గం అంతటా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఇన్ఫార్మర్ల వ్యవస్థను నిర్మించుకున్నది. దాడులు, తనిఖీలను పెంచింది. ఫలితంగా కేసుల సంఖ్యలో కూడా వృద్ధి కనిపించింది. కేసులు పెరిగినా ఫరవాలేదు, కానీ ఈ దుర్వా్యపారాన్ని మాత్రం అరికట్టాలని ముఖ్యమంత్రి ఆదే శాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు గంజాయి కథలో దోషి చంద్రబాబు ప్రభుత్వం. ఆ పాపాన్ని కడిగేస్తున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ ఇక్కడ దొంగే అందరికంటే ముందుగా ‘దొంగా దొంగా’ అని అరుస్తున్నాడు. చంద్రబాబు నేతృత్వం లోని తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చూస్తున్నవారికి ఇదే మంత పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. డ్రగ్స్ వ్యవహారం లోనూ అదే తంతు. గుజరాత్లో పట్టుబడిన డ్రగ్స్ రాకెట్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఒక అడ్రస్ కనిపించిందట. అది దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ఇచ్చిన ఉత్తుత్తి అడ్రస్‌గా అధికారులు తేల్చారు. ఈ డ్రగ్స్ రాకెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఏరకమైన సంబంధమూ లేదని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేసింది. కానీ మన తెలుగుదేశం పరివారానికి ఇవేమీ తలకెక్కవు. గంజాయి రవాణాపై కేంద్రం నిజంగా హెచ్చ రించినప్పుడు మౌనం పాటించిన ఈ పరివారం, ఇప్పుడు కేంద్రం అసత్యమని ఖండించిన అంశాన్ని మాత్రం నిజమే అన్నట్టుగా చాటింపు వేయిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వలన తెలుగుదేశం పరివారానికి మూసుకుపోయిన దొంగ వ్యాపారాల దారుల్లో గంజాయి అక్రమ రవాణా ఒకటి. మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు అవి అందనప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తారు. పిచ్చిగా మాట్లాడతారు. అటువంటి లక్షణాలు ఇప్పుడు ఎల్లో పరివార్‌లో కనిపిస్తున్నాయి. ఆరునూరైనా, నూరు ఆరైనా∙సరే, ఎంత ఖర్చయినా సరే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలనే సంక ల్పాన్ని తెలుగుదేశం తీసుకున్నట్టు పరిణామాలను బట్టి అర్థమ వుతున్నది. రాజు భాష, పాత్రుడు భాష, పట్టాభి భాష – ఇందుకు సాక్ష్యాలు. పాలక పక్షాన్ని కవ్వించాలి. వారు రెచ్చి పోవాలి. తెలుగుదేశం వారిపై దాడులు చేయాలి. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదంటూ గగ్గోలుపెట్టాలి. ప్రభు త్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టించాలి. తెలుగుదేశం పరివారంలోని అన్ని విభాగాల లైన్ ప్రస్తుతానికి ఇదే. పట్టాభి బూతులు, చంద్రబాబు దీక్ష, దీక్ష ముగింపు సందర్భంగా జరిగిన సభ – ఈ వ్యూహానికి అద్దం పట్టాయి. డెబ్బయ్ రెండేళ్ల వృద్ధుడు, మధుమేహ పీడితుడైన వ్యక్తి 36 గంటలపాటు నిరాహారంగా వుండి కూడా గంటన్నర పాటు ఆవే శంతో ఊగిపోతూ ఎలా మాట్లాడగలిగారని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయనే ప్రశ్నలు వేస్తారు, ఆయన్నెవరూ ప్రశ్నించకూడదు, సందేహించ కూడదు అనే నియమం కొన్ని దశాబ్దాలుగా అమల్లో వుంది. కనుక సజ్జల ప్రశ్నకు సమాధానం దొరికే ఛాన్స్ లేదు. ఈ సభలో చినబాబు వీరంగం చూసి తరించవలసినదే. పనిలో పనిగా మంగళగిరి లోని ఒక మండలంలో తాను ఐదుగురు ఎంపీ టీసీలను గెలిపించిన విషయాన్ని చినబాబు చాటుకున్నారు. అదే ఊపులో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి సీటును గెలిచి మీకు కానుకగా అర్పిస్తానని తండ్రిగారికి హామీ ఇచ్చారు. ఈ వీరాలాపన వింటుంటే భలే ముచ్చటేసింది. ఇదే సభలో ఒక నాయకురాలు నాగమ్మ మాట్లాడుతూ ‘మీరు ఒక రెండు నిమిషాలు మాకు అనుమతివ్వండి. ఏం చేస్తామో చూపిస్తామ’ని సవాల్ విసిరారు. ‘టైమ్ మీరు చెబుతారా, నన్ను చెప్పమం టారా?, ప్లేస్ మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా? కొట్టుకో వడానికి మేం రెడీ’ అని కేశినేని నాని సవాల్ విసిరారు. నాని విసిరిన సవాల్ పార్టీలోని తన వ్యతిరేకులకా, వైసీపీ వారికా అనేది అర్థంకాక సభికులు అయోమయానికి గురయ్యారు. చివరగా మాట్లాడిన చంద్రబాబు ఈ రాజ్యాంగ వ్యవస్థ మీద దాదాపు యుద్ధ ప్రకటనే చేశారు. తన నలభై మూడేళ్ల రాజకీయ అనుభవాన్ని కూడా ఆయన పక్కన పెట్టేశారు. స్థానిక ఎన్నికలపై విషాన్ని వెళ్లగక్కారు. ‘థూ... ఇవి ఎన్నికలా’ అని ఈసడించుకున్నారు. తన జేబులోని మనిషి ఎన్నికల కమిష నర్గా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల ఫలితాలే ఆ తర్వాత కూడా పునరావృతమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించే ఇంగితాన్ని కూడా ఆయన కోల్పోయారు. ముందుగా మాట్లాడిన తన వారసుడు తాను ఐదు ఎంపీటీసీలను గెలిపించిన విషయాన్ని చెప్పుకుంటుంటే ఆనందించిన వ్యక్తి, ఈ విధంగా మాట్లాడట మేమిటి? ఎన్నికల్లో తాను గెలవలేననే నిర్ధారణకు వచ్చారా? గెలవకపోయినా గద్దె కావాలని తహతహలాడుతున్నారా? అందుకోసమే వీధి పోరాటాలకు సిద్ధమవుతున్నారా? చివర్లో ‘కార్యకర్తలారా! మీరు పోరాడండి’ అని పిలుపునిచ్చింది అందు కేనా? కేసులు వస్తే నేను చూసుకుంటానని చెప్పడంలోని అర్థమేమిటి? తాను న్యాయవ్యవస్థను మేనేజ్ చేయగలడని కార్యకర్తలు అనుకోవాలా? ఇది న్యాయ వ్యవస్థను అవమా నించడం కాదా? ఎన్నికలను తూర్పారబట్టి తిట్లకూ, ఘర్షణ లకూ వీరతాళ్లు వేయడం దేనికి సంకేతం? రాజ్యాంగ వ్యవస్థ లను అవహేళన చేస్తున్నారా? ఇటువంటి మనోవికారంతో బయల్దేరి రాష్ట్రపతికీ, కేంద్ర పెద్దలకు ఏమని విజ్ఞప్తి చేస్తారు? వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని మీరు రద్దుచేయక పోతే వీధి పోరాటాల ద్వారా నేనే రద్దు చేయిస్తానని చెబుతారా? ఈ వైఖరి రాజ్యాంగ వ్యవస్థలపై యుద్ధ ప్రకటన కాదా? ఆ ప్రభుత్వాన్ని అత్యవసరంగా తప్పించవలసినంత భయంకరమైన ఒత్తిడి ఆయన మీద ఏమైనా ఉన్నదా? గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా రాకెట్ అంతా అంతర్జాతీయ మాఫియా ముఠాల కనుసన్నల్లో జరుగుతుంది. చంద్రబాబు హయాంలో సాఫీగా సాగిన గంజాయి కదలికలు ఇప్పుడు కష్టసాధ్యంగా పరిణ మించాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమ రవాణాపై కేంద్రం దర్యాప్తు జరిపితే చాలా సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చివరి కాంగ్రెస్ మొఘల్?
చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్. పాపం, ఆయన పేరుకే చక్రవర్తి. పట్టుమని పదిమైళ్ల విస్తీర్ణం కూడా లేని షాజహానాబాద్ (పురానా ఢిల్లీ)కే ఆయన అధికారం పరిమిత మైంది. ఒకపక్క మరాఠాల దూకుడు, మరోపక్క ఈస్టిండియా కంపెనీ పెత్తనం. ఉర్దూ గజల్స్ రాసుకోవడం మినహా ఏ నిజ మైన అధికారం లేని పరిస్థితి ఆయనది. ‘న కిసీ కి ఆంఖ్ కా నూర్ హూ’ (నేను ఎవరి కంటి వెలుగునూ కాదు) అనే అద్భు తమైన గజల్‌తో తన నిస్సహాయతను అలంకరించుకున్నాడు. మధ్యయుగ భారత చరిత్రలో మొఘల్ రాజు వంశం ఎంతటి జగత్ ప్రసిద్ధమో, ఆధునిక ప్రజాస్వామ్య భారతంలో కాంగ్రెస్ పాత్ర కూడా అంతటి ప్రభావవంతమైనది. డెబ్బయ్యేళ్ల భారత రిపబ్లిక్లో యాభయ్యేళ్లు కాంగ్రెస్‌దే అధికారం. మరో ఇరవై సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి నెహ్రూ – గాంధీ కుటుం బాన్ని వేరు చేయడం ఇప్పటిదాకా సాధ్యం కాలేదు. ఈ సాధ్యం కాకపోవడమనే బలహీనతే ఆ పార్టీని ఇప్పుడొక రాచపుండులా కెలుకుతున్నది. ఈ పుండు మానదనీ, పార్టీ అవసాన దశకు చేరు కున్నదనీ సర్వేసర్వత్రా ఒక అభిప్రాయం ఇప్పుడు బలపడు తున్నది. ఆ పార్టీకి ఇప్పుడు అధినేత ఎవరు? గత సాధారణ ఎన్ని కల్లో ఓడిపోయిన వెంటనే రాహుల్ కాడి పారేశారు. ఎవరెంత బతిమాలినా, బామాలినా అలకవీడలేదు. గత్యంతరం లేక మరోసారి సోనియా గాంధీయే అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకున్నది. కానీ వాస్తవానికి పార్టీ దైనందిన కార్యక్రమా లన్నిటికీ ఆమె దూరంగా ఉంటున్నారట. కీలక నిర్ణయాలన్నీ రాహుల్‌గాంధీయే తీసుకుంటున్నారనీ, ఆయనకు కొంతమంది కన్సల్టెంట్లు, మార్కెటింగ్ నిపుణులు, సోదరి ప్రియాంక సహక రిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ శ్రేణుల్లో అందరికీ తెలిసిన విషయమే ఇది. బాధ్యత లేని అధికారాన్ని కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీయే చెలాయిస్తున్నారు. పంజాబ్ సంక్షోభం చల్లా రకముందే తలెత్తిన ఛత్తీస్‌గఢ్ తలనొప్పి సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఢిల్లీకి వచ్చారు. ‘సోనియాజీ ఢిల్లీలో లేనట్టున్నారు’ అనే నర్మగర్భమైన కామెంట్‌ను చేశారట. ‘సోనియాగాంధీ పాత్ర ఏమీ లేదు, అంతా రాహుల్‌జీనే చూస్తు న్నార’నేది బఘేల్ కామెంట్‌కు తాత్పర్యమని చెప్పుకుంటు న్నారు. ఆఖరి మొఘల్కు నెత్తిన కిరీటం తప్ప చేతిలో అధికారం లేదు. ఈ కాంగ్రెస్ మొఘల్కు మకుటం లేదు గానీ మంత్ర దండం చేతిలోనే ఉన్నది. ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ వయసు నూట ముప్పయ్యారు. పార్టీల లెక్కల్లో మంచాన పడాల్సిన వయసేమీ కాదు. అమెరికా, ఐరోపాల్లో రెండొందల యేళ్లు దాటిన పార్టీలు కూడా నిండు యవ్వనంతో పరుగులు పెడుతున్నాయి. మరి మన కాంగ్రెస్‌కు ఎందుకు ఈ దుర్గతి? ప్రస్తుత పార్టీ నాయకత్వమే ఇందుకు కారణమని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్ అంతఃకలహాల నేపథ్యంలో కపిల్ సిబల్ ఒక ఆసక్తి కరమైన ప్రకటన చేశారు. ‘మేము జీ–ట్వంటీత్రీ (గ్రూప్ ఆఫ్ 23) నిజమే. కానీ, జీ–హుజూర్ 23 కాదని’ పార్టీ నాయకత్వా నికి పరోక్ష హెచ్చరికను పంపించారు. ఇంతమంది సీనియర్ నాయకులు ఒక గ్రూప్‌గా ఏర్పడి నాయకత్వాన్ని అభిశంసిం చడం గతంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో రెండుసార్లు పార్టీ చీలిన సందర్భాలు ఇందుకు మినహాయింపు. గత సంవత్సరం ఆగస్టులో ఇరవై మూడు మంది కాంగ్రెస్ ప్రముఖ నాయకులు సోనియాగాంధీకి ఒక లేఖ రాశారు. వారిలో కొందరు కోర్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఉద్దేశ పూర్వకంగానే మీడియాకు కూడా లేఖ లీకయింది. పార్టీ నాయ కత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరాన్ని వారు ఆ లేఖలో ప్రస్తావించారు. వరుస పరాజయాలను, పార్టీ ప్రభావం తగ్గిపోతున్న విషయాలను వారు ప్రస్తావించారు. ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవలసిన అవస రాన్ని గుర్తించాలని వారు అధినేత్రికి సూచించారు. లేఖపై సంత కాలు చేసిన వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, శశి థరూర్, ఆనంద్‌శర్మ తదితర 23 మంది సీనియర్లు ఉన్నారు. ఈ లేఖ రాయడానికి కొన్ని నెలలు ముందుగానే కొందరు ముఖ్యనేతలు సోనియాగాంధీని కలిశారట. లేఖలో సంతకాలు చేయని ఒకరిద్దరు ప్రముఖులు కూడా ఈ బృందంలో ఉన్నారు. రాహుల్‌గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవనీ, బలవంతంగా అతడి నాయకత్వాన్ని రుద్దితే కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయ మని ఆమెకు స్పష్టంగా చెప్పారట. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నాయకత్వాన్ని ఎన్నుకోవడం ప్రారంభిస్తే గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని కూడా తిరిగి పార్టీలోకి తీసుకు రావచ్చునని కూడా ఆమెకు చెప్పారని వినికిడి. అయితే పుత్ర ప్రేమ వలన ఆమె వీరి రాయబారాన్ని తిరస్కరించారు. పుత్రుని మనసులో ఏముందో ఆమెకు తెలుసు. ఓటమి బాధ్యత నుంచి దృష్టి మళ్లించడానికి అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడే గానీ, దానికి శాశ్వతంగా దూరం కావడం ఆయన ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. కొంతకాలం పాటు ఇలా గడిపేస్తే, అధ్యక్ష పదవిని స్వీకరించవలసిందిగా తనపై పార్టీ శ్రేణుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ, జరిగిన పరిణామం ఆయన అంచనాకు యాంటీ క్లైమాక్స్. ‘జీ–23’ లేఖ బహిర్గతం కాగానే రాహుల్జీ ఆగ్రహోదగ్రుడయ్యాడట. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషించడం మొదలుపెట్టా రని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నిర్ణయాలన్నీ కన్సల్టెంట్ల సహకారంతో తానే తీసుకోవడం మొదలుపెట్టారు. లేఖ రాసిన సీనియర్లను పూర్తిగా దూరం పెట్టారు. ఏ సమస్య ఎదురైనా కోర్ కమిటీ కూర్చొని చర్చించడం కాంగ్రెస్ పార్టీలో ఒక ఆనవాయి తీగా ఉండేది. 2004లో తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ప్రతి శుక్రవారం సాయంత్రం కోర్ కమిటీ సమావేశమై ముఖ్య విషయాలను చర్చించేది. పార్టీ అధ్యక్షురాలు, ప్రధాన మంత్రి సహా ఐదారుగురు ముఖ్యనేతలు ఈ కోర్ కమిటీలో సభ్యులుగా ఉండేవారు. తుది నిర్ణయం పార్టీ అధినేత్రిదే అయినా, అది ఉమ్మడి నిర్ణయంగా బయటకు వచ్చేది. ఇప్పుడు ఆ కోర్ కమిటీ ఊసేలేదు. వేర్వేరు భాషలు, చరిత్రలు, సంస్కృతులు, భిన్నమైన సామాజిక జీవనాలతో కూడిన బహువిధమైన మన దేశం కాలక్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించగలిగింది. భార తీయత అనే ఏకత్వ సాధనకు ఎన్నో పరిణామాలు దోహద పడ్డాయి. అన్నిటిలోకి ముఖ్యమైనది భారత జాతీయ కాంగ్రెస్. విరుద్ధ ప్రయోజనాలున్న శక్తులను ఉమ్మడి ప్రయోజనమైన స్వాతంత్య్ర సాధనకోసం ఏకతాటిపై నడిపిన అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ అనుభవమే స్వాతంత్య్రం తర్వాత కూడా జాతి నిర్మాణానికి దోహదపడింది. ఆ అనుభవమే కాంగ్రెస్ పార్టీని సుదీర్ఘకాలం పాటు దుర్భేద్యంగా నిలబెట్టగలి గింది. భారతదేశంలో ఎన్ని విరుద్ధ వర్గాలున్నాయో కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని వర్గాలుండేవి. వారితో నిరంతరం సంభా షించి, సమన్వయపరిచి, అసంతృప్తిని చల్లార్చే ఒక ఎకోసిస్ట మ్ను కాంగ్రెస్ పార్టీకి చరిత్ర బహూకరించింది. అతివాద – మితవాద భావజాల శక్తులను కూడా మిళితం చేసుకునే మధ్యే వాద మార్గం కాంగ్రెస్ ఎకోసిస్టమ్‌లో ఒక ప్రధానాంశం. సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమంగా కాంగ్రెస్ ఎకోసిస్టమ్ బీటలు వారడం ప్రారంభమైంది. రాహుల్ చురుకైన పాత్ర పోషించడం ప్రారంభమైన తర్వాత ఇది మరింత వేగవంతమైంది. శరద్ పవార్, మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి వంటి బలమైన నాయకులను దూరం చేసుకొని కాంగ్రెస్ పార్టీ మూడు పెద్దరాష్ట్రాలను పోగొట్టుకున్నది. వరుసగా రెండు సార్లు యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పోషించిన పాత్రను కాంగ్రెస్ సరిగ్గా అర్థం చేసుకోలేక పోయింది. జనాకర్షణ గల ప్రాంతీయ నేతలను తక్కువ అంచనా వేసి కాంగ్రెస్ నాయకత్వం భారీ మూల్యం చెల్లించింది. ఇప్పుడు ఆ పార్టీ ప్రభావం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. అదృష్టం కలిసివస్తే మొదటి స్థానం, లేదంటే రెండో స్థానమైనా దక్కించుకోగలిగిన రాష్ట్రాలు ఒక డజన్ కూడా లేవు. బలంగా ఉన్న పంజాబ్‌ను అపరిపక్వ రాజకీయ వ్యూహంతో కాల దన్నుకున్నారు. దళిత ముఖ్యమంత్రి ప్రయోగం కనీసం ఒక ఏడాది ముందు చేసి ఉంటే ఏమైనా ఫలితముండేదేమో! ఎన్నికలకు మూడు నెలల ముందు ఆయన చేయగలిగేది ఏమీ లేదు. ప్రధాన ప్రతిపక్షంగా గెలిపించిన తెలంగాణను ఒక ఊసర వెల్లి రాజకీయవేత్తకు ఫ్రాంచైజ్ కింద ఇచ్చేసినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ బండారం బయటపడితే అక్కడ భంగపాటు తప్పదు. ఇక మిగిలినవి కేరళ (కూటమి), కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అస్సాం మాత్రమే. ఈ రాష్ట్రాలన్నింటిలో కలిపి ఉన్న లోక్‌సభ స్థానాలు 172. మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్యలో ఇది 31 శాతం మాత్రమే. ఇక్కడే కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉంటుంది. జాతీయ పార్టీకి తక్కువ, ప్రాంతీయ పార్టీకి ఎక్కువ అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ. ఈ పరిస్థితి వల్ల నష్ట పోయేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు. మొత్తం భారత ప్రజా స్వామ్య వ్యవస్థకే అది గుదిబండగా తయారైంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైనా సరే, ప్రతిపక్షం లబ్ధిపొందడానికి కాంగ్రెస్ అడ్డంకిగా మారింది. ప్రధాన ప్రతి పక్షంగా ఉన్నందువల్ల నరేంద్రమోదీ ప్రత్యామ్నా యాన్ని జనం కాంగ్రెస్‌లోనే వెతుకుతారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్‌గాంధీ నాయకుడు. రాహుల్ వర్సెస్ మోదీ పోటీలో ఎవరు గెలుస్తారో చెప్పడానికి జ్యోతిష్యుడో, సెఫాలజిస్టో కావ లసిన అవసరం ఉండదు. ఎవరైనా చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టి మిగిలిన పార్టీలన్నీ ఏకం కావడం ఒక ప్రత్యామ్నాయం. గతంలో కేసీఆర్ చెప్పిన ‘ఫెడరల్ ఫ్రంట్’ వంటిదన్నమాట. మమతా బెనర్జీ ప్రస్తుతానికి ఈ ప్రయత్నాల్లో ఉన్నట్టు కన్పిస్తున్నారు. కానీ, కలగూరగంప ప్రాంతీయ పార్టీ లను జాతీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు అంగీకరించగలరా? ఆ ప్రభుత్వ సుస్థిరతపై నిశ్చింతగా ఉండగలరా?... చాలా కష్టం. రాకెట్ల మాదిరిగా దూసుకుపోతున్న నిత్యావసరాల ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు, ప్రజా సంపదను శ్రీమంతులకు దోచిపెట్టడం యథేచ్ఛగా సాగి పోతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం ఒక విదూషక పాత్రలో ఒరిగిపోవడం ఒక విషాదం. ఇప్పటికిప్పుడు ఒక సరైన ప్రత్యా మ్నాయం తయారు కావాలంటే ఉన్న మార్గాలు రెండు. ఒకటి: తెల్లారే సరికల్లా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలంగా విస్త రించాలి. ప్రస్తుత నాయకత్వాన్ని తొలగించి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. ఇది జరగాలంటే అల్లావుద్దీన్ దగ్గర్నుంచి అద్భుత దీపాన్ని అరువు తెచ్చుకోవాలి. ఇది అసాధ్యం. రెండు: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్న ఎకోసిస్టమ్‌ను పునరుద్ధ రించుకుంటూ ఒక కొత్త రాజకీయ శక్తి ఏర్పడాలి. అలా ఏర్పడా లంటే ఇప్పుడున్న కాంగ్రెస్ అదృశ్యం కావాలి. వైద్య రంగంలో ఇటువంటి సందర్భాలకోసం ‘మెర్సీ కిల్లింగ్’ అనే తరుణో పాయం ఉన్నది. చావలేక, బతకలేక, బతకడానికి హింస పడు తున్న రాజకీయ పార్టీలకు దీన్ని వర్తింపజేసే అవకాశాలు లేవు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ నిస్సహా యుడైతే కావచ్చు కానీ గొప్ప దేశభక్తుడు. ప్రథమ స్వాతంత్య్ర సమరానికి ఊపిరిపోసినవాడిగా ఆయన పేరు నిలబడుతుంది. గొప్ప ఉర్దూ కవిగా కూడా ఆయన చిరస్థాయిగా నిలబడి పోతాడు. భవిష్యత్తు రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ మనుగడ సాగించలేకపోతే చివరి కాంగ్రెస్ మొఘల్‌గా రాహుల్ గాంధీ ముద్రపడతారు. రాహుల్ దేశభక్తిని కూడా శంకించ వల సిన పనిలేదు. తాతముత్తాతల దగ్గర్నుంచీ దేశభక్తుల కుటుంబం వారిది. బహదూర్ షాకు కవిత్వ వ్యాపకమున్నట్టు రాహుల్‌కు ఏవైనా ఉన్నాయేమో పెద్దగా తెలియదు. కొన్ని ఉన్నా అవి జనా నికి పెద్దగా అర్థంకావు. పార్లమెంట్ సమావేశాల్లో ఆవేశపూరి తంగా మాట్లాడి, ఆ వెంటనే తన ప్రధాని దగ్గరకు వెళ్లి ఆయన్ని లేపి గట్టిగా ఆలింగనం చేసుకోవడం వంటి హాబీలు కొన్ని ఆయ నకు ఉన్నాయి. అయితే వాటి ప్రయోజనం ఏమిటి? పరమార్థ మేమిటి అనేవి సామాన్యులకు ఎప్పటికీ అర్థం కావు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎల్లో కాంగ్రెస్ గేమ్స్!
‘‘సానిదాన్నయితే మాత్రం నీతి వుండొద్దా? మా పంతులు గార్ని పిలిచి తెగదెంపులు చేసుకునేంతదాకా పరాధీననే’’ అంటుంది మధురవాణి ‘కన్యాశుల్కం’ నాటకంలో. అప్పటి వరకు తన జోలికి రావద్దని రామప్పంతులుకు సుద్దులు చెబు తుంది. ఎప్పుడో నూట పాతికేళ్ళనాటి ఫ్యూడల్ సమాజంలో కూడా ఇటువంటి స్వచ్ఛంద కట్టుబాట్లు ఉండేవన్న మాట. ఏక కాలంలో... అదీ ఒకరికి తెలియకుండా మరొకరితో వ్యవహారం నడపడం పాడి కాదన్నది మధురవాణికి తెలిసిన నీతి. మనదిప్పుడు గొప్పగా పరిణతి సాధించిన నాగరిక సమా జమని అనుకుంటున్నాము. సమాజాన్ని నడిపించే రాజకీయ వ్యవస్థ మరింత గొప్పగా నీతులతో, నియమాలతో, నిష్ఠలతో ఉండాలని ఆశిస్తుంటాము. కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు మనల్ని ఈ విషయంలో అడుగడుగునా నిరాశ పరుస్తూనే ఉన్నారు. ఊర్ధ్వలోకాల్లో ఉన్న మధురవాణిని పిలి పించి వీళ్ళకి గట్టి ట్యూషన్ పీకించాలన్నంత కోపాన్ని పదే పదే తెప్పిస్తూనే ఉన్నారు. ఆ జాబితాలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక రాజకీయ పార్టీ కూడా ఉన్నది. దాని నాయకుడు ఈ విషయంలో జాతీయస్థాయి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజా తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరితో ఉన్నది? ఎవరో ఒకరితో కలిసి ఉండవలసిందేనా... ఒంటరిగా ఉండకూడదా?... ఉండవచ్చు. కానీ టీడీపీ అలా ఉండలేదు. అదే దాని ప్రత్యేకత. ప్రత్యక్షమో... పరోక్షమో ఏదో ఒక పొత్తు ఇతర పార్టీలతో లేకుండా, గోబెల్స్ మీడియా రక్షణ లేకుండా, ప్రజా స్వామ్య వ్యవస్థల్లోని వివిధ ఉపాంగాల్లో నిద్రిస్తున్నట్టు నటించే స్లీపర్ సెల్స్ సహకారం లేకుండా ఆ పార్టీ బతకలేదు. ఇంతకూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరితో స్నేహంగా ఉన్నది? ఏ జాతీయ పార్టీతో సఖ్యతగా ఉన్నది? సమాధానం చెప్పమంటే సాధారణ పౌరుడు చటుక్కున చెప్పలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు అది కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో జట్టుకట్టింది. కాంగ్రెస్ కూటమికి చంద్రబాబు ఒక సేనాపతి లాగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలో తిరిగి ప్రచారం కూడా నిర్వహించారు. అంతకు ముందు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్‌ను లూటీ చేసి ఆ సొమ్ములో కొంత రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మళ్లించారని ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపించాయి. సాధారణ ఎన్నికల్లో బీజేపీ కూటమికి బ్రహ్మాండమైన మెజా రిటీ లభించిన వెంటనే తన కాంగ్రెస్ మైత్రిని చంద్రబాబు మంచం కిందికి నెట్టారు. నరేంద్ర మోదీపైనా, బీజేపీపైనా అపారమైన ప్రేమను బహిరంగంగా ఒలకపోశారు. ఆంతరంగి కులైన తన ఎంపీలను అత్తవారింటికి పంపించినంత భద్రంగా బీజేపీలోకి చేర్చారు. కనుసైగ చేస్తే చాలు, పార్టీ మొత్తం బీజేపీ ఒడిలో వాలేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపించారు. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు చంద్రబాబు తరఫున ఆ పార్టీ ముఖ్యనేతలతో లాబీయింగ్ నడిపారు. వాజ్‌పేయి హయాం లోనూ, మోదీ తొలి ఇన్నింగ్స్ సందర్భంగానూ ఏర్పడిన సంబం ధాలను ఉపయోగించుకొని రాయ‘బేరాలు’ నడిపారు. చంద్ర బాబు తన పంచమాంగదళ బృందాన్ని మొత్తం ఢిల్లీ లాబీ యింగ్‌లకు తోడుగా మోహరించారని చెబుతారు. ఎందుకంటే విభజిత రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఫాదర్ అండ్ సన్స్ పాల్పడిన అవినీతిని ‘మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్స్’గా నిపు ణులు పరిగణిస్తున్నారు. ఈ అంశాలపై కేంద్రం దృష్టిసారిస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇక మంగళం పాడినట్టేనని వారికి స్పష్టంగా తెలుసు. లాబీయింగ్‌ల ఫలితంగా ఇప్పటి వరకు అటు వంటి పరిస్థితి రాకుండా నెట్టుకొని రాగలిగారు. కానీ, బీజేపీ కూటమిలో చేరే ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. ఒక పక్క బీజేపీతో పొత్తు కోసం విరహగీతాలు పాడుతున్న సమయంలోనే, మంచం కిందకు నెట్టిన కాంగ్రెస్ స్నేహాన్ని పున రుద్ధరించడం మొదలుపెట్టారు. మధురవాణికి ఉన్నపాటి నీతి మనకు లేదని రుజువు చేశారు. గడిచిన శీతాకాలంలోనే చంద్ర బాబు రాహుల్‌ను రహస్యంగా కలిసి వచ్చారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో గుప్పుమంది. ఈ పర్యటనకు ఆయన ఒక ప్రైవేట్ విమానాన్ని ఉపయోగించారట. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ వ్యవహారాల్లో చంద్రబాబు మాటే చెల్లుబాటు అవుతుంది. ఆయన అభీష్టం మేరకే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వ మార్పిడి జరిగిందనేది జగమెరిగిన విష యమే. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా బాబు ఒక పేరును సూచించారట. విభజనకు ముందు రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వ వ్యవహారాల్లో చక్రం తిప్పిన వ్యక్తి ఆయన. ఈ మార్పునకు ఇంకొంచెం సమయం ఉందట. ఈలోగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ‘చక్కదిద్దే’ పనుల్లో బాబు బిజీగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో క్రియా శీలంగా వ్యవహరిస్తున్న ఒక మహిళా నాయకురాలికి కూడా ఈ మధ్య బాబు ఫోన్ చేశారట. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారట. కాంగ్రెస్ పార్టీలో చేరాలని చంద్రబాబు ఆహ్వా నించడం ఏమిటని ఆమె ఆశ్చర్యానికి లోనయ్యారట. గతంలో తన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఒక సీనియర్ నేతకు చాలాకాలం తర్వాత బాబు ఫోన్ చేశారట. కుశల ప్రశ్నల అనంతరం తెలుగుదేశం మాజీలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేయవలసిన ‘చారిత్రక’ అవసరాన్ని గురించి బోధించారట. బీజేపీ కండువా కప్పుకున్న తన ఆంత రంగిక మంత్రులను కూడా బాబు రంగంలోకి దించినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వివా దాస్పద వ్యాపారాల ఎంపీగా పేరున్న బాబు ఆంతరంగికుడు ఒకరు ఈ మధ్యన ఒక తెలంగాణ బీజేపీ నాయకునికి ఫోన్ చేశారట. ఈ బీజేపీ నేత పూర్వాశ్రమంలో కాంగ్రెస్ ఎంపీ, పారి శ్రామికవేత్త. బీజేపీలో ఉన్న తనను కాంగ్రెస్‌లో చేరమని సలహా ఇవ్వడం పట్ల సదరు నేత కూడా ఆశ్చర్యపోయారట. బీజేపీలో ఉన్న మాజీ తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడం ‘మిషన్ తెలంగాణ కాంగ్రెస్’లో తొలిభాగం. టీఆర్ఎస్లో ఉన్న మాజీ తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి నేతలను కాంగ్రెస్‌లోకి చేర్పించడం రెండోదశ. ఇప్పటికీ చంద్రబాబుతో టచ్‌లో ఉంటున్న టీఆర్ఎస్ తెలుగుదేశం నాయకులకు ఈ ఆప రేషన్‌పై పూర్తి క్లారిటీ ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్లో చేరిన ‘బీటీ’ (బంగారు తెలంగాణ) బ్యాచ్ టార్గెట్‌గా కొంత కాలం తర్వాత ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ప్రారంభించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న బీజేపీని పూర్తిగా నిర్వీర్యం చేయడం, కాంగ్రెస్‌కు మద్దతుగా ఇతర చిన్నా చితకా పార్టీలను సమీక రించడం ప్రస్తుతం ఎల్లో కాంగ్రెస్ రాజకీయ వ్యూహంగా కన బడుతున్నది. ఇప్పటికే మోదీ వ్యతిరేక పోరాటం పేరుతో లెఫ్ట్ పార్టీలను దరిచేర్చుకోవడం మొదలైంది. మిగిలిన పార్టీలను, గ్రూపులను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఎల్లో మీడియా పెద్దలతో సహా సిండికేట్‌లోని వివిధ విభాగాలు ఓవర్ టైమ్ పని చేస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్, బీజేపీ, ఎమ్ఐఎమ్ మినహా మిగిలిన ముఖ్య పార్టీలన్నిటినీ ఒక గూటికి చేర్చాలన్నది ఎల్లో కాంగ్రెస్ ఆశయంగా చెబుతున్నారు. ఇది ఏ మేరకు నెరవేరుతుందో కాలమే సమాధానం చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల ఆ పార్టీ నాయక శ్రేణులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాము వలస పాలనలో జీవిస్తున్నట్టుగా ఉన్నదని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వాపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు చంద్రబాబుది ఇంకొంతకాలం పాటు చుట్టపుచూపు వ్యవహా రంగానే ఉంటుందని సమాచారం. ఇప్పుడు అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో వరస ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బతిని ఉన్నది. బహుశా దేశంలో ఏ ప్రధాన ప్రతిపక్షం ఎన్నడూ ఎరుగ నంతటి శృంగభంగం ఏపీలో టీడీపీకి ఎదురైంది. అభ్యర్థులను నిలబెట్టి బీఫామ్‌లు ఇచ్చి, ప్రచారం చేయించిన పిదప ఘోర పరాజయాన్ని పసిగట్టి, తాము ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు బొంకవలసి వచ్చింది. పోనీ ఆ మాట మీద కూడా నిలకడలేదు. మూడు మండల పరిషత్తులను దక్కించుకోవడా నికి పార్టీ ఎంపీటీసీలకు విప్‌ను సైతం జారీ చేశారు. ఇంతటి దయనీయ పరిస్థితిలోకి దిగజారిన కారణంగా కోలుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని స్థితిలో ఆ పార్టీ ఉన్నది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి ఇంకో రెండు నెలల్లో సగం పదవీకాలం పూర్తవుతుంది. అంటే రాజకీయంగా ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం మొదలవుతుం దన్నమాట. ఇక మోదీ ప్రభుత్వం ఫోకస్ మొత్తం వచ్చే ఎన్ని కలపై ఉంటుందని బాబు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన అవినీతిపై కేంద్రీకరించకపోవచ్చని ఆయన ఆశ. దీన్ని అవకా శంగా తీసుకొని కాంగ్రెస్ కూటమిలోకి బహిరంగంగా చేరిపోవ చ్చని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చి, కేంద్రంలో కాంగ్రెస్ కూటమి బలపడి, ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తెచ్చుకోగలిగితే తనకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన ఆలోచిస్తున్నారు. కనుక వచ్చే ఐదారు మాసాల్లో ఆయన కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ల వ్యూహాలు– జమా ఖర్చులూ అన్నీ బాబు బాధ్యతే ఇక! ఇక్కడ మోదీ వ్యతిరేక, కేసీఆర్ వ్యతిరేక కూటమిని స్ధిరపరిచిన తర్వాతనే, మొత్తం కూటమి అండదండలతో ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రవేశించాలని ఆయన చూస్తున్నట్టు అర్థమవుతున్నది. జనసేన, సీపీఐలతో ఆయనకు ఇప్పటికే సఖ్యత ఉన్నది. సీపీఎం కొంత వ్యతిరేకత కనబరుస్తున్నది. ‘మోదీ వ్యతిరేక ఫ్రంట్’ సాకుతో ఆ పార్టీని కూడా కూటమిలోకి చేర్చవచ్చని బాబు భావిస్తుండవచ్చు. అయితే, ఎన్ని పార్టీలతో కూటమి కట్టినా 24 శాతం ఓట్ల నుండి 50 శాతం ఓట్లకు ఎగబాకి గెలుపును అందు కోవడం సాధ్యం కాదన్న సంగతి అర్థం కానంత అపరిపక్వత చంద్రబాబుకు లేదు. ‘ఓదార్పు యాత్ర’ కొనసాగించడం కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ జగన్, విజయమ్మలు స్వతంత్రంగా బరి లోకి దిగినప్పుడే భవిష్యత్తు పరిణామాలను చంద్రబాబు కొంత మేరకు ఊహించగలిగారు. అందువల్లనే ఆ రోజు నుంచే కుట్ర లకు సానబట్టారు. అందువల్లనే కాంగ్రెస్‌తో కుమ్మక్కయి, అక్రమ కేసులు బనాయించారు, అందుచేతనే ఎల్లో మీడియాను ప్రయో గించి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అందుచేతనే ఆనాడే కుటుంబంలో చిచ్చుపెట్టడానికి ఒడిగట్టారు. ఇప్పుడు కూడా ఈ కుట్రలన్నీ ప్రయోగిస్తూ కూటమి తోడ్పాటుతో అడుగులు వేస్తే గెలుపు దక్కకపోయినా, తన కుమారుడికి రాజకీయాల్లో మిగిలి ఉండే చాన్సయినా ఉంటుందని ఆయన ఆలోచనగా ఉంది. అందుకోసమే తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ కాయాన్ని అద్దెకు తీసు కొని, దాని సాయంతో గేమాడేందుకు సిద్ధపడుతున్నారు. - వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
గంజాయి తాగి, మందు కొట్టినవా?
రాయలవారి ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల్లో తెనాలి రామకృష్ణ కవి మోస్ట్ పాపులర్. ఆయనకు వికటకవిగా పేరు. తెనాలి రామలింగడు అనే పేరుతో ఆయన మీద అనేకానేక జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటి సందర్భానికి కూడా పనికివచ్చే ఒక చిన్న కథను ఒకసారి గుర్తు చేసు కుందాము. కృష్ణదేవరాయల వారు హాస్యప్రియుడు. సమయస్ఫూర్తి, సరస సంభాషణా చతురత కలిగిన రామకృష్ణుడంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. మిగిలిన కవులకు, కొలువులోని ఉన్నతోద్యోగులకు ఇది కంటగింపుగా ఉండేది. రామకృష్ణ కవి మీద అడపాదడపా చాడీలు చెబుతుండేవారు. కుట్రలు చేస్తుండే వారు. తన తెలివితేటలతో వాటి నుంచి ఎప్పటికప్పుడు రామకృష్ణుడు బయటపడేవారు. ఒక రోజు రాజుగారిని కలవడానికి తెనాలి రామకృష్ణుడు బయల్దేరాడు. రాజాశ్రయంలో అతని ప్రభ వెలుగుతున్న రోజు లవి. అపాయింట్మెంట్ లేకపోయినా సరే భటులు అతడిని ఆపేవారు కాదు. వినయంగా నమస్కరించి లోపలికి పంపించే వారు. ఈసారి ఎందుకనో తేడా కొట్టింది. భటుడు నిర్లక్ష్యపు చూపు విసిరాడు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డు కున్నాడు. మొదట ఖంగుతిన్న రామకృష్ణ కవి వెంటనే తేరుకొని తనకు అపాయింట్మెంట్ ఉన్నదని చెప్పాడు. అయితే నేనొక సమస్యనిస్తాను, దాన్ని పూరించి పద్యం చెప్పమన్నాడు భటుడు. ఇప్పుడు మనం చూస్తున్న అవధాన ప్రక్రియల్లో ఈ సమస్యాపూరణం కూడా ఒకటి. భటుడు సమస్యాపూరణం అడగటమేమిటని సందేహిస్తూనే సరే, అడగ మంటాడు రామకృష్ణ కవి. ‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’ అనే సమస్య నిస్తాడు భటుడు. ఒక ఏనుగుల గుంపు దోమ గొంతులోకి దూరిందట. ఆ వాక్యాన్ని అలాగే ఉంచి మిగతా పద్యం చెప్పాలి. ఆ సమస్య ఎక్కడి నుంచి భటుడికి చేరి వుంటుందో రామకృష్ణ కవికి అర్థమైంది. దాని వెనుక ఉన్న కుట్ర కథ కూడా అర్థమైంది. భటుడికి భారీగా లంచం ఎరవేసిందెవరో కూడా కనిపెట్టగలి గాడు. బాగా కోపమొచ్చింది. భటుణ్ణి బండ బూతులు తిడు తూనే సమస్యను పూరించి వెళ్లిపోయాడు. ‘గంజాయి తాగి దుష్టుల సంజాతము చేత, కల్లు చవి గొన్నావా .......కొడక, ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్’ అని పూరణ రూపంలోనే కవి ప్రశ్నించాడు. ‘ఏనుగులు దోమ గొంతులోకి పోవడమేమిట్రా! గంజాయి దమ్ముకొట్టి, మద్యం సేవించి డ్యూటీ కొచ్చినావా’ అని కళ్లెర్ర జేశాడన్నమాట. విషయం తెలుసుకున్న రాయలవారు ఇదే సమస్య మీద మహాభారత కథతో పద్యం చెప్పమని కోరగా ఒక అందమైన పద్యం చెబుతాడు. అదంతా వేరేకథ. రాజుల దగ్గరనే కాదు, రాజకీయ నాయకుల దగ్గర కూడా భటులుంటారు. హీరోల దగ్గరే కాదు కాదు, విలన్ల దగ్గర కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్లను బంటులని పిలుస్తున్నాము. ఉచ్చనీచాలెంచకుండా స్వామి కార్యం నెరవేర్చడమే ఈ బంటుల తక్షణ కర్తవ్యం. తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర కూడా కొందరు బంట్లున్నారు. ఆంబోతుల్ని ఊరిమీద వదిలేసే చందంగా అధికారంలో ఉన్నప్పుడు వీరిని జిల్లాల మీద వదిలేసే వారు. ఈ ఆంబోతులు ఎవరి చేన్లోనైనా దూరవచ్చు. మేత మేయవచ్చు. తొక్కేయవచ్చు. సర్వాధికారాలుంటాయి. బదులుగా బాస్ ఎవరిపేరు చెబితే వారి మీదకు కాలుదువ్వడం, కొమ్ము విసరడం లాంటి విద్యల్ని ఆంబోతులు ప్రయోగించాలి. బంట్లు కూడా అంతే. అయ్యన్న పాత్రుడు అనే బంటు రెండు రోజుల కింద కాలు దువ్వాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మీదనే చిల్లర కామెంట్లు విసిరాడు, మంత్రులను, పోలీసు అధికారులను, ఎమ్మెల్యేలను కూడా వదల్లేదు. ఆ వేదిక మీద చంద్రబాబు కూడా ఉన్నారు. ఆ సమయంలో బంటును ప్రోత్సహిస్తున్నట్టుగా ఆయన హావ భావాలున్నాయని ప్రత్యక్ష సాక్షుల సమాచారం. నర్సరావు పేటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్న వాడిన భాష పత్రికల్లో రాయడానికి అభ్యంతరకరమైనది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మీద అభ్యంతరకరమైన ఒక్క కామెంట్ చేసినందుకే ఐదు సెక్షన్ల కింద కేసులు పెట్టి కేంద్రమంత్రిని సైతం జైలుకు పంపించారు. అటువంటప్పుడు ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే యథేచ్ఛగా తిట్లవర్షం ఎలా కురిపించగలిగాడు? బాస్ కట్టిన తావీజు మహిమ. తెనాలి రామలింగడి కథలో ఉన్నట్టే, ఇక్కడ కూడా కుట్ర నేపథ్యం ఉన్నది. గంజాయి దమ్ము ఉన్నది. మద్యం దందా ఉన్నది. లంచాలు మేయడం ఉన్నది. ఒక్కొక్కటే బయటకొస్తున్న అయ్యన్న ఘనకార్యాల చిట్టాను చూస్తుంటే ఔరా అనిపిస్తున్నది. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో ఉన్న లేటరైట్ ఖనిజ నిక్షేపాలను అయ్యన్న కొడుకు తవ్విపోసి వందల కోట్ల మేరకు సొమ్ము చేసుకున్నాడని ఆధారాలతో కూడిన ఆరోపణలున్నాయి. అయ్యన్న కొడుకు నిర్వాకంలో లోకేశ్‌బాబు కూడా భాగస్వామేనని నర్సీపట్నం ప్రాంతంలో చెప్పుకుంటారు. ఈ మైనింగ్ కోసం రెండు కిలోమీటర్ల రోడ్డు వేయడానికి వందలాది అత్యంత విలువైన అటవీ వృక్షాలను కొట్టి వేయిం చారనీ, ఎటువంటి అనుమతుల్లేకుండానే సుందరకోట నుంచి అక్రమ రోడ్డును వేసుకొని ఖనిజాన్ని తరలించారన్న ఆరో పణలకు ఆధారాలున్నాయి. మన్యంలోని దట్టమైన అడవుల్లో వందల ఎకరాల్లో గంజాయి పండించి స్మగ్లింగ్ చేయించడంలో అయ్యన్న దిట్ట అని ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడే చెప్పారు. గతంలో ఒకసారి తన మాట వినలేదని ఒక మహిళా అధికారిని బట్టలూడదీసి కొడతానని బహిరంగంగానే అయ్యన్న బెదిరించారు. చంద్రబాబు జమానాలో విశాఖ మన్యం ఇలాఖా అయ్యన్న ఇష్టారాజ్యంగా మారింది. ఆడింది ఆట, పాడింది పాటగా నడిచిపోయింది. అందుకు కృతజ్ఞతగానే నర్సరావుపేట సభలో అయ్యన్న పూనకాన్ని ప్రదర్శించారని అనుకోవచ్చు. ఇది సహజమైన పూనకం కూడా కాదు. ఇందులో ఎమోషనల్ ఎలి మెంట్ కనిపించలేదు. బాబు ఇషారా అందగానే అయ్యన్న విషం కక్కడం మొదలుపెట్టాడని సాక్షుల కథనం. ఈ సభ జరగడానికి కేవలం రెండు గంటల ముందే స్థానిక సంస్థల కౌంటింగ్‌కు సంబంధించిన తీర్పు వెలువడింది. ఆదివారం కౌంటింగ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయ బోతున్నది. మీడియా స్థలాన్ని, సమయాన్ని ఈ వార్త రోజంతా ఆక్రమించకూడదు. తెలుగుదేశంలో మిగిలిన శ్రేణుల నైతిక బలం దెబ్బతినకూడదు. ఇదీ లక్ష్యం. అప్పటికప్పుడు సిద్ధమైన వ్యూహం ప్రకారమే అయ్యన్న పూనక ప్రదర్శన జరిగింది. ముఖ్యమంత్రిపైనే తిట్ల వర్షం కురిపించిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమీ మాట్లాడకుండా గమ్మున కూర్చోవు కదా! వాళ్లూ కౌంటర్ విమర్శలు చేశారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే జోగి రమేశ్ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటిముందు నిరసన తెలపడానికి వెళ్లాడు. వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాన్ని ముందే ఊహించింది. బాబు ఇంట్లో ఉన్న పార్టీ మందను ఉసిగొల్పింది. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు. కార్యకర్తలకు గాయాల య్యాయి. ఎల్లో మీడియా అండతో ఈ ఎపిసోడ్‌కు తాము కోరు కున్న ట్విస్టును తెలుగుదేశం పార్టీ ఇచ్చుకున్నది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై దాడి చేయడానికే జోగి రమేశ్ బృందం వచ్చిందనే ప్రచారాన్ని లేవ దీశారు. ఎల్లో మీడియా, అనుంగు సోషల్ మీడియా శోకాలు పెట్టడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టింది తెలుగుదేశం వారే. నిరసన తెలపడానికి వచ్చినవారిపై దాడిచేసి కొట్టింది తెలుగుదేశం వారే. ఇప్పుడు లబలబలాడుతున్నదీ తెలుగుదేశం వారే. ఆదివారం నాడు ఎల్లో మీడియాలో ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉంటుంది. సాయం త్రానికైనా సద్దుమణుగుతుందో లేదో చూడాలి. తమ పార్టీకి మింగుడుపడని సన్నివేశాలు ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ జనం దృష్టిని మళ్లించే ప్రయత్నాలను తెలుగు దేశం పార్టీ చేస్తున్నది. గత రెండేళ్లలో కనీసం డజన్ సంద ర్భాలను ఉదాహరణగా చూపెట్టవచ్చును. 2019 నవంబర్ 14 రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనబడి నాడు – నేడు కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించారు. విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన గావించే విప్లవాత్మక కార్యక్రమం ఇది. ఒకపక్క ముఖ్యమంత్రి కార్యక్రమం జరుగుతుండగానే గుంటూరులో దుర్గ గుడిని కూల్చివేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది. అక్కడ జరిగిందేమి టంటే రోడ్డు విస్తరణ కోసం ప్రజల సమ్మతితో, పోలీసుల అనుమతితో గుడిని కొంచెం పక్కకు జరిపి నిర్మించారు. గడిచిన సంవత్సరం జనవరిలో ముఖ్యమంత్రి 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే పిఠాపురంలోని ఓ ఆలయంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయని బీభత్సమైన ప్రచారం జరిగింది. విచారణలో అది తప్పుడు వార్తని తేలింది. ‘దిశ’ పోలీస్ స్టే్టషన్లను ప్రారంభించిన తర్వాత వరసగా నాలుగు రోజులపాటు ఆలయాల మీద దాడులు జరిగాయని ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేశారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మరుసటి రోజున, జగనన్న విద్యాకానుక ప్రారంభానికి రెండు రోజుల ముందు బీసీలకు, 56 కార్పొరేషన్లు ప్రకటించిన మరునాడు ఇటువంటి వార్తల్నే వ్యాప్తిలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల నాలుగు నెలలైంది. ఎన్నికల ముందు జనం ముందుంచిన మేనిఫెస్టోను దాదాపుగా అమలు చేసింది. మరో రెండున్నరేళ్లలో జరగబోయే ఎన్నికల కోసం జనంలోకి వెళ్లేం దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరకలెత్తుతున్నది. ఈ పద్ధతిలో ముఖాముఖి పోటీపడగల స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. మబ్బుల చాటు నుంచి యుద్ధం చేసే ఇంద్రజిత్తు వ్యూహాన్ని ఆశ్రయించబోతున్నది. అది వ్యవస్థల మాటున దాక్కొని దాడులు చేయాలని చూస్తున్నది. మీడియా భుజాలపై తుపాకులు పెట్టి కాల్పులు జరపాలని ఆలోచిస్తున్నది. విషప్రచారాలతో కూడిన ఒక కృత్రిమ సుడిగాలిని సృష్టించే సన్నాహాల్లో ఉన్నది. కవ్వింపులకు, రెచ్చగొట్టే చర్యలకు దిగబోతున్నది. ఈ రెండున్నరేళ్లు అరాచక – అప్రజాస్వామిక చర్యలకే అది బరితెగించబోతున్నది. చైతన్యవంతులైన ప్రజలు ఆ పార్టీ పోకడలను అర్థం చేసుకుంటున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పతన హాస్యం
‘ఫుల్లుమూను నైటటా.. జాసుమిన్ను వైటటా.. మూను కన్న మొల్ల కన్న నీదు మోము బ్రైటటా.. టా! టా! టా!’ అంటాడు గిరీశం ‘కన్యాశుల్కం’లో. ‘నేను వట్టి తెలివితక్కువ వాడిననా నీ అనుమానం’ అని కాంతం కథల్లో భర్త అంటే అందుకు కాంతం ‘అహహ అనుమానమేమీ లేదు.. గట్టి నమ్మకమే’ అంటుంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారబోశాను’ అని శ్రీశ్రీ రాస్తే జరుక్శాస్త్రి పేరడీగా ‘నేను సైతం కిళ్లీ కొట్లో పాతబాకీలెగరగొట్టాను’ అని రాశాడు. ‘నవ్వవు జంతువుల్.. నరుడు నవ్వును’ అంటాడో కవి. నవ్వు మానవ ప్రవృత్తి. సకల జీవజాలం నుంచి మనిషిని వేరు చేయగల ఒకే ఒక స్పందనాగుణం– నవ్వు. ‘నాకు గనక సెన్సాఫ్ హ్యూమర్ లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉందును’ అన్నారు గాంధీజీ. ఓ పెద్దాయన ‘ఏ మేన్ ఈజ్ నాట్ పూర్ ఇఫ్ హి కెన్ స్టిల్ హీ లాఫ్’ అన్నాడు. ‘నవ్వుకు చోటు దొరకనంత సేపు అది ఎంత పెద్ద గది అయినా ఇరుకే’ అని ఇంగ్లిష్ వ్యాఖ్య. బతకడానికి నవ్వు అవసరం అని సామాన్యుడేమిటి చక్రవర్తి కూడా అనుకున్నాడు. అందుకే విదూషకుణ్ణి ఆస్థానంలో పెట్టుకున్నాడు. తెనాలి రామలింగడు, బీర్బల్ తమ చక్రవర్తులను ఏమో కాని నేటికీ ఆబాలగోపాలాన్ని నవ్విస్తున్నారు. మనుషులు నిత్య జీవితంలో పరాచికాలతో నవ్వుతారు. వెక్కిరించి నవ్వుతారు. తప్పులకు, అబద్ధాలకు నవ్వుతారు. అవివేకులను, మందబుద్ధులను, అతి తెలివిగల వారిని చూసి నవ్వుతారు. అధికారంలో ఉన్నవారిని ఏమీ అనలేక గేలి చేసి నవ్వుతారు. చాలక పుస్తకాలు చదివి, నాటకాలు చూసి, సినిమాలకు వెళ్లి కూడా నవ్వుతారు. అయినా కూడా గౌరవం పొందే విషయంలో హాస్యానిది ద్వితీయ స్థానమే. గంభీరంగా ఉండే అధికారినీ, గంభీరమైన ఉపన్యాసకుణ్ణీ గౌరవించినట్టుగా హాస్యం మిళితం చేసేవారిని గౌరవించరు. సాహిత్యంలో గొప్ప రచనలన్నీ గంభీరమైన విషయాలవే. హాస్యం రాస్తే ‘హాస్య రచయిత’. గంభీరమైన విషయాలు రాస్తే ‘రచయిత’. అతి తక్కువ మందే హాస్యంతో గంభీరమైన విషయాలు రాసి గౌరవం పొందారు. తెలుగులో తొలి వచన సాధకులలో ఒకౖరైన వీరేశలింగం నవ్విస్తూ తొడపాశం పెట్టే శిల్పంలో తెలుగువారిని స్మిత వచనా సముద్రంలోకి ప్రవేశ పెట్టారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు ‘హాస్యత్రయం’ అనిపించుకున్నారు. చిలకమర్తి ప్రహసనాలు, పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలు క్లాసిక్స్. ఆ తర్వాతి రోజుల్లో ముళ్లపూడి వెంకటరమణ ‘బుడుగు’, పురాణం ‘ఇల్లాలి ముచ్చట్లు’, నండూరి పార్థసారథి ‘రాంబాబు డైరీ’... ఈ హాస్యధారను బలంగా ముందుకు తీసుకెళ్లాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, తెలిదేవర భానుమూర్తి తదితరులు మాండలిక రచనతో హాస్యం ఎంత నేటివ్ రుచిగా ఉంటుందో చూపించగలిగారు. అయితే ఆది నుంచి స్త్రీకి హాస్యం ‘అదుపు చేయబడినది’. నవ్వుకు ప్రధాన వాటాదారు పురుషుడే. స్త్రీ కాదు. ద్రౌపది కాలం నుంచి స్త్రీ నవ్వుకు అపఖ్యాతి, అపసవ్య వర్తనను ఆపాదిస్తూ వచ్చారు. నవ్వే, నవ్వించే స్త్రీలు నేటికీ తక్కువ. ఇలాంటి సంఘ అంకుశాలను కూడా ధిక్కరించి స్త్రీలు రాశారు. భానుమతి ‘అత్తగారి కథలు’, రంగనాయకమ్మ ‘స్వీట్‌హోమ్’ నవ్వించాయి. పొత్తూరి విజయలక్ష్మి, మృణాళిని, సోమరాజు సుశీల... పాఠకులను తమ ఫిక్స్డ్ ఖాతాల్లో వేసుకోగలిగారు. కాని నవ్వించడం ఏమాత్రం జోక్ కాదు. ఆరోగ్యకరమైన హాస్యంతో నవ్వించడం కొద్దిమందికే చేతనవుతుంది. సమాజంలో కానీ, రచనల్లో కానీ చాలామటుకు హాస్యం స్త్రీలను, బలహీనులను, వెనుకబడినవారిని దూషించడం వల్ల గేలి చేయడం వల్ల పుడుతూ ఉంటుంది. ఆస్తిత్వ రాజకీయ ఉద్యమాల వల్ల కలిగిన చైతన్యం ఇప్పుడు ఇవేవీ చేయడానికి వీల్లేని సంస్కారాన్ని ఇస్తున్నాయి. ఈ సంస్కార పరిధిలో ఉంటూ హాయిగా నవ్వుకోగల హాస్యాన్ని పుట్టించడం నవ్వు మీద సాముగా మారింది. ఈ సమయంలోనే నేటి తరం ఎటువంటి హాస్యానికి సామీప్యంలో ఉన్నదీ గమనించుకోవాలి. నిత్య ఒత్తిడి వల్ల పాఠకులు ప్రేక్షకులుగా మారి చదవడానికి బదులు చూడటానికి ఇష్టపడుతున్న సమయంలో హాస్యం వ్యాపార వనరుగా మారింది. అభినవ విదూషకులు పుట్టుకొచ్చారు. నిత్యం ప్రతి చానల్లో గంటో అరగంటో హాస్య కార్యక్రమం ఉంటోంది. అయితే అది ఎటువంటి హాస్యం? స్త్రీల రూపాలను, ఎదుటివారి ఆకారాలను పదే పదే హీనపరచడమే హాస్యంగా ఉంది. తెలుపు నలుపులను, పొడవు పొట్టిలను, భాషా యాసలను హీనపరచడమే హాస్యంగా ఉంది. ‘ఒరే దరిద్రుడా’ అనేది హాస్య సంబోధన. దరిద్రుడంటే పేదవాడు. పేదవాడు ఎవరికి హాస్య వస్తువు? ఎందుకు హాస్య వస్తువు? సమాజం లైంగిక అపక్రియల్లో మునిగినట్టుగా వాటి చుట్టూ అల్లిన హాస్యానికి రేటింగులు వస్తున్నాయి. మాటలతో సాగే రతిని హాస్యం అంటున్నారు. ఇవి ఇళ్లల్లో ఉండి చూస్తున్న పిల్లలకూ, యువతీ యువకులకూ ఏం నేర్పిస్తున్నాయి? ఆరోగ్యకరమైన హాస్యాన్ని అలవర్చుకోని పిల్లలు తమక్కావాల్సిన హాస్యాన్ని వెతుక్కోవడంలో ఎదుటివారి దుఃఖానికి హేతువు అవుతారు. బాధించడాన్ని ‘ఎంజాయ్’ చేస్తారు. సత్యానికి, హేతువుకు, వాదనకు నిలబడలేక ‘ముఖాన్నో, మూతినో’ కామెంటు చేసి పారిపోతారు. సాంస్కృతిక దాడి చేస్తారు. ఉన్నతమైన విషయాన్ని కూడా పతనానికి తెచ్చి నవ్వుదామనుకుంటారు. పతన హాస్యపు ప్రతిఫలనం ఇది. ఇప్పుడు చలామణిలో ఉన్నదానిని అపహాస్యం అనడానికి కూడా లేదు. ఇది దుర్మార్గ హాస్యం! -
పులోకేశి ఘోషయాత్ర!
దుష్ట సంకల్పంతో కౌరవులు చేసిన ఘోషయాత్ర గుర్తుకొస్తున్నది. మాయాజూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తుంటారు. ద్వైతవనమనే నిర్జనారణ్యంలో వారు అష్టకష్టాలు పడుతున్నారనే మాట ఆనోటా ఈనోటా కౌరవుల చెవిన పడుతుంది. కర్ణపేయంగా తోచిన ఈ కబురు విని సంతోషిస్తారు. పాండవులు నివసించే ప్రాంతానికి వెళ్లి, వారి ఎదుట తమ అష్టఐశ్వర్యాలను ప్రదర్శిస్తే వారు మరింత కుళ్లికుళ్లి చస్తారని శకుని మామ సలహా ఇస్తాడు. ‘భళారే మామా’ అంటాడు దుర్యోధనుడు. ఐతే మందీమార్బలాన్ని తరలించు కొని వెళ్లాలంటే రాజుగారైన ధృతరాష్ట్రుని అనుమతి కావాలి. అప్పట్లో రాజుల ప్రధాన ఆదాయ వనరు పశుసంపదే. అర ణ్యాల్లో అక్కడక్కడా ఆలమందలుండేవి. గోపాలకులు రక్షణగా ఉండేవాళ్లు. ఆలమందల్ని, వాటి సంతాన వృద్ధి లెక్కల్నీ తనిఖీ చేసుకోవడానికి రాజ్యాధికారులో, రాజకుమారులో తరచుగా వెళ్లడం ఒక ఆనవాయితీ. పాండవులు నివసిస్తున్న ద్వైతవనం చేరువలో కూడా కురు రాజ్యానికి ఒక ఆలమంద ఉన్నది. దాని తనిఖీకి వెళ్లదలచుకున్నామని ధృతరాష్ట్రుని అనుమతి కోరతారు. గోవుల పరిశీలనకు వెళ్లే యాత్ర కనుక ‘ఘోషయాత్ర’ అనే అర్థం ఉన్నది. స్వయంగా యువరాజులవారు బయల్దేరినప్పుడు కొన్ని వందలమంది భటులను రక్షణకోసం తీసుకొనిపోవడం ఒక సంప్రదాయం. కానీ ఈసారి మాత్రం ఒక మహా సామ్రాజ్యంపై దండయాత్రకు వెళ్లినట్టుగా సమీకరణ జరిగింది. రథ గజతురగ పదాతి దళాలతో కూడిన వేలాదిమంది సైనికులు బయల్దేరారు. అంతఃపుర కాంతలూ, దాసదాసీ జనం, నర్తకీమణులు, గాయకులు, విడిది భవ నాలు నిర్మించడానికి శిల్పులూ తదితరులంతా పయనమ య్యారు. పాండవుల కుటీరానికి చేరువలోనే విడిది భవనాల నిర్మాణానికి ఉపక్రమించారు. ఇది తమ ప్రాంతమంటూ గంధర్వులు వారిని అడ్డుకుంటారు. గంధర్వ సేనల ధాటికి కౌరవసేన చెల్లాచెదురవుతుంది. సోదరులతో సహా దుర్యోధనుడు గంధర్వ రాజు చిత్రసేనుడికి బందీలుగా చిక్కుతారు. విషయం తెలుసు కున్న ధర్మరాజు తన నలుగురు సోదరులను దుర్యోధనుడి రక్షణకోసం పంపిస్తాడు. పాండు కుమారులు గంధర్వ సేనను ఓడించి చిత్రసేనుడి చెర నుంచి దాయాదుల్ని విడిపిస్తారు. సిగ్గుతో, అవమానభారంతో దించిన తలలు ఎత్తకుండానే కౌర వులు ఇంటి దారి పడతారు. ఇది అందరికీ తెలిసిన కథే. కానీ ఈ కథలోని నీతిని గురించి మాత్రం తప్పక తెలుసుకోవాలి. కడు పులో దుష్ట సంకల్పాన్ని పెట్టుకొని పైకి మాత్రం పరిశీలన యాత్ర, పరామర్శ యాత్ర, పలకరింపు యాత్ర అనే మారు పేర్లతో దొంగయాత్రలు చేస్తే భంగపాటు తప్పదు. ఒక సమర్థుడైన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందడా నికి చాలాకాలంగా లోకేశ్‌బాబు తంటాలుపడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అదృష్టవశాత్తు అధికారం దక్కడంతో చంద్ర బాబు అన్ని జాగ్రత్తలూ తీసుకుని లోకేశ్‌బాబును నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. పార్టీ మొత్తాన్ని ఆయన గుప్పెట్లో పెట్టారు. అధికారులంతా ఆయన మాట వినేలా ఏర్పాట్లు జరి గాయి. సీనియర్ మోస్ట్ మంత్రులున్న శాఖల్లో కూడా మంత్రు లకంటే లోకేశ్‌బాబు ప్రభే ఎక్కువగా వెలిగింది. అయినప్పటికీ రాజధాని ప్రాంతంలో పోటీచేసి, కోట్లు గుమ్మరించినా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆయన నాయకత్వం పట్ల నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. భవిష్యత్తులో పార్టీ పగ్గాలు స్వీకరించడానికి ఆయన పనికిరారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా ఉన్నది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కార్యకర్తలు ఈమేరకు తమ మనోభావాలను చంద్రబాబుకు తెలియజేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీడియా అండదండలు పూర్తిగా ఉన్నప్పటికీ, ధనబలం ఉన్నప్పటికీ, చంద్రబాబు ఆశీస్సులు వందశాతం ఉన్నప్పటికీ లోకేశ్‌బాబు నెగ్గుకురాలేకపోవడంపై తీవ్రస్థాయిలోనే అంతర్మ థనం జరిగిందని వినికిడి. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికంటే తనయుని ఓటమే చంద్రబాబును ఎక్కువగా బాధించిందట. ఆంతరంగికులు, సలహాదారుల సూచన మేరకు లోకేశ్‌బాబుకు తర్ఫీదును ఇచ్చేందుకు కన్సల్టెంట్లను నియమించారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తన స్వీయ చేష్టల వల్ల నైతేనేమి, రాజకీయ ప్రత్యర్థుల ప్రచారం ఫలితంగానైతేనేమీ, ఆహార విహార వాచిక ఆహార్యాది అలవాట్ల వల్లనైతేనేమీ ఆయ నకు ‘పప్పు’ అనే ముద్ర పడింది. రాజకీయాల్లో ‘సమర్థత’ అనే మాటకు పూర్తి వ్యతిరేక అర్థం ఈ ఇమేజ్ వల్ల వస్తుంది. జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీ కూడా ఇదే ఇమేజ్ వల్ల ఎదగలేక పోయారు. బర్మాకు వెళ్లి బౌద్ధ సన్యాసుల శిక్షణలో భావాతీత ధ్యానాన్ని అభ్యాసం చేసి వచ్చారట. కానీ, ఎందుకో ఫలితం మాత్రం కలుగలేదు. పిండికొద్దీ రొట్టే కదా! ఈరకమైన జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను రంగరించి లోకేశ్‌బాబుకు సిలబస్‌ను తయారుచేశారట. ఇప్పుడా యన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉండట్లేదట. కొండాపూర్‌లోని సొంత ఫామ్‌హౌస్‌లో ఎక్కువగా ఉంటున్నారట. ఫామ్‌హౌస్ అనగానే అదేదో సిటీకి దూరంగా ఉండే వ్యవసాయ క్షేత్రం అనుకోవద్దు. ‘హార్ట్ ఆఫ్ ద ఐటీ సిటీ’గా పేరున్న కొండాపూర్ లోని పన్నెండెకరాల స్థలంలో ఉన్న లగ్జరీ హౌస్. ఈమధ్య వేలం పాటలో ఎకరం 50 కోట్లు పలికిన కోకాపేట భూముల కంటే కొండాపూర్ భూముల ఖరీదు చాలా ఎక్కువ. ఈ లెక్కన కొంచెం అటూఇటు వెయ్యికోట్లు ఖరీదు చేసే పర్ణశాలలో ఆయనకు థియరీ క్లాసులు చెబుతున్నారు. నెలకోసారి మాత్రం ప్రాక్టికల్స్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తుంటారు. శిక్షణలో భాగంగా ఆయన శరీర బరువు కొంచెం తగ్గింది. గడ్డం కొంచెం పెరిగింది. ఉపన్యాసాల్లో ఏకాగ్రత చెదరకుండా ఉండడం, వివిధ విష యాల పట్ల ప్రాథమిక అవగాహన ఏర్పరచడం, భాషలో తప్పులు దొర్లకుండా చూడటం అనే మూడు అంశాలపై కన్స ల్టెంట్లు కుస్తీలు పడుతున్నారు. లోకేశ్‌బాబు బ్రాండ్ ఇమేజ్ను మార్చడమే ఇప్పుడు కన్సల్టెంట్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్. ఇందుకోసం వాళ్లీ మధ్యన ఒక చిట్కాను కనిపెట్టారు. ప్రాక్టికల్స్ కోసం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ఏమాత్రం మిస్సవ కుండా ఆయన ఒక డైలాగ్‌ను వాడుతున్నారు. ‘నన్ను చూసి ఈ ప్రభుత్వం భయపడుతున్నది. నేనంటే ఎందుకంత భయం?..’ ఏకకాలంలో కనుబొమలెగరేస్తూ ఈ వాక్యాల్ని ఆయన చూడ కుండా చదువుతున్నారు. లోకేశ్‌బాబును చూసి ప్రభుత్వం భయ పడటమేమిటి? అనే కామన్సెన్స్ ప్రశ్న ఇక్కడ అనవసరం. ఏదో తెలుగు సినిమాలో నాజర్‌ను ఉద్దేశించి బ్రహ్మానందం ఒక సెటైర్ వేస్తాడు. ‘వీళ్ల ఇంటిపేరు పిల్లి. దాన్నెటూ మార్చుకోలేరు. అందుకని పేర్ల వెనక సింహా, సింహా అని తగిలించుకుంటారు’. ఆ కథలో అదొక చిట్కా. ఈ కథలో కన్సల్టెంట్లు కనిపెట్టిన చిట్కా ఇది. అంతే!ప్రాక్టికల్స్ కోసం రెండురోజుల కింద లోకేశ్‌బాబు ఆంధ్రప్రదేశ్‌లో చేసిన పర్యటన ఒకసారి పరిశీలిద్దాం. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఫిబ్రవరి నెలలో అనూష అనే యువతి హత్యకు గురైంది. ఏడు నెలలు గడిచిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఏడు నెలల తర్వాత పరామర్శ ఏమిటి? ఇక్కడ పరామర్శ అనేది ఒక సాకు. మనసులో ఉన్న సంకల్పం వేరు. ఫామ్‌హౌస్ శిక్షణలో నేర్చు కున్న ‘పోరాట పటిమ’ను ప్రాక్టికల్‌గా ఆంధ్రప్రదేశ్ వీధుల్లో ప్రదర్శించాలి. ఈ ప్రదర్శనకు సంబంధించిన ఆదేశాలు అధినేత నుంచి ముందుగానే పార్టీ శ్రేణులకు చేరుకున్నాయి. ఆరుగురు మాజీమంత్రులు, ఐదుగురు మాజీ ఎంపీలు, ఐదుగురు ప్రస్తుత ఎమ్మెల్యేలు, 21 మంది మాజీ ఎమ్మెల్యేలు, మూడు వేలమంది పార్టీ కార్యకర్తలు ఈ స్ట్రీట్ ప్లేలో పాల్గొనేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. రోజంతా ఎల్లో మీడియా ఈ కార్యక్రమానికే అంకితమయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. వీధి భాగోతం మాటున విధ్వంసం జరిగే అవకాశముందని పోలీసులకు కొంత ఆల స్యంగా ఉప్పందినట్లుంది. చివర్లో కొంతమంది నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. వీధి భాగోతాన్ని అడ్డుకున్నారు. షరా మామూలుగా ‘ఈ ప్రభుత్వానికి నేనంటే భయం’ అంటూ లోకేశ్‌బాబు ప్రెస్‌మీట్ పెట్టుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు ఆశించిన ఫలితం నెరవేరలేదు. దక్షిణ భారత చరిత్రలో దండ యాత్రల స్పెషలిస్టుగా పేరొందిన చాళుక్య చక్రవర్తి రెండో పులకేశి స్థాయి బిల్డప్‌ను వారు ఆశించారు. తమిళ కమెడియన్ వడివేలు టైటిల్ రోల్ పోషించిన ‘హింసించే రాజు 23వ పులకేశి’ స్థాయి ఇమేజ్ మాత్రమే దక్కింది. అనేక లింకులతో అల్లిన ఇనుప గొలుసు బలమెంత? అత్యంత బలహీనమైన లింకుకు ఉండే బలమెంతో ఆ గొలుసు బలం కూడా అంతే! ఇది సైన్స్ సూత్రం. ఇది సామాజిక, రాజకీయ, యుద్ధతంత్ర సూత్రం కూడా! జగద్విజేతలందరూ కూడా ఈ సూత్రాన్ని పాటించే విజేతలయ్యారు. బలమైన శత్రువును ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ శత్రువు బలహీన తలను వెతికి పట్టుకోవాలి. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. లోకేశ్‌బాబు ఎదుర్కోవాలని భావి స్తున్న శత్రువు వైఎస్ జగన్మోహన్రెడ్డి. అత్యంత బలీయమైన శక్తి. శత్రుదుర్భేద్య దుర్గం ఆయన ప్రభుత్వం. లోకేశ్‌బాబు దుర్బలుడు. అటువంటప్పుడు యుద్ధవ్యూహం ఎలా ఉండాలి? దాడికోసం లోకేశ్‌బాబు ఎంపిక చేసుకున్న లింకేమిటి? మహిళల రక్షణ. వైఎస్ జగన్ ప్రభుత్వ గొలుసులో ఇది బలమైన లింకు. మహిళల రక్షణ, సాధికారత, బలహీన వర్గాల సాధికారత, సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాల్లో ప్రభుత్వం వంక తేరిపార చూసే అవకాశమే లేదు. ఈ ఏడు రంగాల్లోనూ అభివృద్ధి బెంచి మార్కులను ఈ ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించింది. ఈ రంగాల మీద కత్తి దూయడానికి పూనుకోవడం ఆత్మహత్యా సదృశం కాదా? మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని ట్రాక్ రికార్డు పరమ దరిద్రంగా ఉన్న రంగాల్లో మహిళల రక్షణ, సాధికారత అగ్ర స్థానంలో ఉన్నాయి. తాము ఎంపిక చేసుకున్న ముద్దుల రాజ ధాని నీడలోనే చెలరేగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ ఒక హేయమైన అధ్యాయం. మహిళా గౌరవాన్ని మంటగలిపిన దుర్మార్గపు చర్య. అప్పుల ఊబిలోకి దింపి వేధింపులు, లైంగిక దాడులకు పాల్ప డిన ఈ నికృష్ట చర్య వెనుక పాలక పార్టీ పెద్దల పాత్ర ఉండడం విషాదాల్లోకెల్లా విషాదం. వందలాది అత్యాచారం ఘటనల్లో కేసులు రిజిస్టర్ చేయడానికి కూడా పోలీసు యంత్రాంగం మొరాయించిన అరాచక పాలన. మహిళా తాసిల్దార్ మీద పాలక పార్టీ ఎమ్మెల్యే పబ్లిగ్గా దాడిచేస్తేనే నో కేస్. నో పోలీస్. ముఖ్య మంత్రి స్వయంగా జోక్యం చేసుకొని కేసు లేకుండా సర్దుబాటు చేశారు. బాధితులు పెద్దఎత్తున ఆందోళన చేస్తేనే అప్పట్లో కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ కేసుల కోసమే దిశ పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న మహిళ వెంటనే పోలీస్ రక్షణ కోరే విధంగా దిశ యాప్‌ను రూపొందించింది. ఇప్పటికే 45 లక్షలమంది మహిళలు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. జిల్లాకొకటి చొప్పున 13 దిశ కోర్టులు ఏర్పాటయ్యాయి. ఇందుకోసం 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం నియమించింది. 148 మంది దోషు లకు ఇప్పటికే శిక్షలు కూడా పడ్డాయి. మహిళలపై లైంగిక దాడు లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుకాలం 2019 నాటికి సగటున 200 రోజులకు పైగా ఉండేది. ఇప్పుడది 42 రోజులకు తగ్గింది. మూడు వారాల్లోనే దోషులకు శిక్ష పడేలా రూపొం దించిన దిశ బిల్లు కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది. ఆమోదం లభించగానే చట్టం రూపుదాల్చుతుంది. ఇంకా చట్టం కాని ఈ చట్టం ప్రకారం ఎందుకు శిక్షించడంలేదంటూ లోకేశ్ బాబు దిశ బిల్లు ప్రతులను తగలబెట్టారు. పౌర హక్కులను హరించే నల్ల బిల్లుల, నల్ల చట్టాల తాలూకు ప్రతులను తగు లబెట్టడం గతంలో చూశాము. ప్రగతిశీలమైన బిల్లు ప్రతులను, అదీ అమలుచేయాలని తామే డిమాండ్ చేస్తున్న బిల్లు ప్రతులను తగలబెట్టడం ఇక్కడే చూస్తున్నాము. వారి మేధస్సు చిరకాలం వర్ధిల్లు గాక! -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పురిటి బిడ్డ పురోగమనం!
రైతాంగ పోరాటం దేశంలో కొత్త రూపు సంతరించుకుంటోంది. దేశ రాజధాని, పరిసరాలను దాటి విస్తరించే సన్నాహాల్లో ఉంది. ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ (అనుబంధ అంశాల) చట్టాలకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం, ఇప్పటికే పలు ఆటుపోట్లను చవిచూసింది. దేశంలో ఎక్కడికక్కడ నిరసించినా... ఢిల్లీని చుట్టుముట్టి ఓ ఆందోళన నిరవధికంగా సాగుతోంది. ఏకరీతిన నవమాసాలు గర్భస్థ స్థితిలో ఢిల్లీ, శివార్లకే పరిమితమైన శైశవ దశ నుంచి... ఆందోళన తాజాగా గడపదాటుతోంది. మహాపంచాయతీల రూపంలో అడుగు బయటకు వేసింది. వారం కిందటి ముజఫర్‌నగర్ (ఉత్తర్‌ప్రదేశ్), నిన్నా ఇవాళ్టి కర్నల్(హర్యానా) రైతు ఆందోళనలు సంకేతం. వారం కింద, మితిమీరిన పోలీసు లాఠీ దెబ్బకు ఒకరు మరణించి, పదిమంది రైతులు గాయపడ్డ దాష్టీకాన్ని నిరసించిన ఆందోళన, హర్యానా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలో రోజురోజుకు బలపడుతోంది. వివిధ రాష్ట్రాలకు, జిల్లా కేంద్రాలకు విస్తరించే రైతు ఉద్యమ కార్యాచరణ ఐక్య పోరాట వేదిక, ఇతర రైతు సంఘాల వ్యూహాల్లో రూపుదిద్దుకుంటోంది. పాలకపక్షమైన భారతీయ జనతాపార్టీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికినా... ఉద్యమాన్ని నిరాఘాటంగా సాగించిన రైతు సంఘాలు, ఇంతకాలం వ్యూహాత్మకంగా రాజకీయ పక్షాలను దూరం పెట్టాయి. తమ వేదికలనెక్కనివ్వలేదు! అందుకే, ఎంతో విశ్వసనీయత పొంది ప్రపంచ దృష్టిని ఆకర్షించిందీ ఉద్యమం. కానీ, ఉత్తరాది వివిధ రాష్ట్రాలు ఎన్నికలకు సమాయత్తమౌతున్న ప్రస్తుత తరుణంలో... ఆయా పార్టీలు రైతాంగ ఉద్యమాంశాన్ని ఇప్పుడు తమ ప్రచారాస్త్రంగా మలచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. చిత్రమేమంటే, పాలకపక్షం బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ రైతు విభాగమైన భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) కూడా దేశవ్యాప్త నిరస నల కార్యాచరణ ప్రారంభించింది. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కాలని, చట్టబద్దత కావా లని కోరుతూ, మచ్చుకి 500 జిల్లా కేంద్రాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టింది. ఇది వ్యూహాత్మక చర్య అన్నది ప్రత్యర్థుల వాదన! ఒక మహాఉద్యమం నుంచి, మూడు చట్టాలు ఎత్తివేయాల్సిందేననే తమ ప్రధాన డిమాండ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ అని, ఇన్నాళ్లు రైతు సంఘలెన్నింటినో ఏకీకృతం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) అంటోంది. వారు సెప్టెంబరు 27న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చి ఉన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి, మరోవైపు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఒత్తిడి పెరుగుతోంది. రైతు సంఘ నాయకులు, కేంద్ర ప్రభుత్వం... ఇరువురితో సంప్రదింపులు జరిపి, నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టే ఏర్పాటు చేసిన సంఘ సభ్యుడొకరు, సుప్రీం ప్రధాన న్యాయ మూర్తికి తాజాగా లేఖ రాసి సంచలనం సృష్టించారు. తామిచ్చిన నివేదికను బయటపెట్టాలని, ప్రతిష్టంభనను తొలగించి, సమస్యను పరిష్కరించేట్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయ స్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. తగిన సంప్రదింపులు లేకుండా, తమ ప్రయోజనాలకు వ్యతి రేకంగా తెచ్చిన ఆ మూడు చట్టాలను ఎత్తివేయాల్సిందేనని రైతాంగం పట్టుబట్టడంతో పోరాటం తీవ్రరూపం దాల్చినపుడు, గత జనవరిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. చట్టాల అమలును పక్కనపెట్టమని కేంద్రాన్ని ఆదేశించింది. చట్టాలను మాత్రం ఎత్తివేసేది లేదని కేంద్రం భీష్మించి, ప్రతిష్టంభన ఏర్పడటంతో సుప్రీం ఒక కమిటీని నియమించి రెండు మాసాల్లో నివేదిక ఇవ్వాలంది. మార్చి 19న సీల్డు కవర్లో ఆ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను సుప్రీం ఇంతవరకు విప్పలేదు. చట్టాలు రైతు వ్యతిరేకమైనందున వాటిని పూర్తిగా ఎత్తివేయాలనేది ఒక వాదనైతే, అంత అవసరం లేదు సవరిస్తే చాలనేది మరోవాదన. మెజారిటీ రైతు సంఘాలు చట్టాలను ఎత్తివేయాలనే కోరుతున్నాయి. భారత్ కిసాన్ సంఘ్ మాత్రం, ఆ మేరకు సవరిస్తే చాలంటోంది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదనేది పాలకపక్షపు అనుకూల రైతు సంఘం వాదన. రైతుకు గిట్టుబాటు ధర (ఆర్పీ) లభించాలని, శాస్త్రీయంగా దాన్ని ఖరారు చేసి, వ్యవసాయో త్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియకు చట్టబద్ధత తీసుకురావాలని ఈ సంఘం కోరు తోంది. ప్రభుత్వమైనా, ప్రయివేటు వ్యాపారులైనా... రైతు ఉత్పత్తుల్ని ముందే ఖరారు చేసిన గిట్టు బాటు ధరకు తగ్గి కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించి, ఆ మేర శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తోంది. పెరిగే పెట్టుబడి వ్యయాన్ని, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని సదరు గిట్టుబాటు ధర ఖరారు చేయాలనే వాదన సముచితం. అది లేక, దేశానికి అన్నం పెట్టే రైతు నానాయాతన అనుభవించాల్సి వస్తోంది. రైతు ఆదాయం రెట్టింపేమో కానీ, ఉత్పత్తి వ్యయంలో 40, 50 శాతం కూడా లభించక రైతు అప్పుల్లో పడి కునారిల్లుతున్నాడు. తమనీ దుస్థితికి తెచ్చిన పాలకపక్షాల పట్ల ఆగ్రహమే కాకుండా తమ శ్రమశక్తిని దోచుకోజూస్తున్న కార్పొరేట్లపై కోపం కూడా రైతు ఉద్యమానికి కొత్త ఊపిరులు పోస్తోంది. కేంద్రం, అది తెచ్చిన కొత్త చట్టాలే ఊతంగా... వ్యవసాయోత్పత్తులతో పాటు, వాటి నిల్వ, మార్కెటింగ్ రంగాల్లోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వస్తున్న కార్పొరేట్ శక్తులనూ రైతు ఉద్యమాలు లక్ష్యం చేసుకుంటున్నాయి. మద్దతు పెరగటంతో బలోపేతమౌతున్నాయి. రేపటి పరిస్థితేమిటో వేచి చూడాల్సిందే! -
వ్యూహంతోనే ఉపశమనం
అసాధారణ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడక్కడ వరద ప్రమాద పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. పంటలు నష్టపోయే ప్రమాదముంది. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి తీవ్రం. ప్రకృతి విపత్తుల నుంచి పౌరులకు భద్రత కల్పించడానికి, పంటల్ని కాపాడటానికి సంప్రదాయ విధానాలు పనికిరావడం లేదు. ప్రత్యేక ప్రణాళిక–చర్యలు అత్యవసరమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముందు జాగ్రత్తలు, సహాయక పనులు, నష్ట నివారణ–నష్టం అంచనా, విపత్తు అనంతర చర్యలు, నష్టపరిహారాలివ్వడం... ఇలా అన్నీ సమన్వయంతో చేపడితే గాని పౌర సమాజానికి విముక్తి లేదు. నిరుటి వర్షతీవ్రతకు నష్టపోయిన వారికి పరిహారాల చెల్లింపు కేసును విచారిస్తూ, కౌంటర్ దాఖలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు మంద లించింది. ‘మా బాధ్యత కాదు’ అంటే ఎలా? అని కేంద్ర వ్యవసాయ శాఖను తప్పుబట్టింది. తదు పరి విచారణ బుధవారం జరుగనుంది. ఇవి ప్రకృతిపరమైన సాధారణ వర్షాలు కావని, ‘వాతావ రణ మార్పు’ (క్లైమెట్ చేంజ్) ఫలితంగా తలెత్తిన అసాధారణ పరిణామాలని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి, ఈ సంవత్సరం జూన్‌లో కురిసిన వర్షాలే ఇందుకొక సంకేతం! ఇవేం అనూహ్యంగా కురుస్తున్న ఆకస్మిక వర్షాలు కాదు. రాగల ఆరు మాసాల పరిస్థితుల్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగానే చెప్పింది. ప్రతి తుఫాను, అల్పపీడనం గురించి సమా చారం తగినంత ముందే వెల్లడిస్తోంది. అల్పపీడనానికి ఉపరితల ద్రోణి తోడవడం వల్ల ఇప్పుడు వర్షతీవ్రత ఎక్కువైంది. ప్రభుత్వాల వైపు నుంచి ముందస్తు పక్కా ప్రణాళిక, సన్నద్దత లేకపోవడం లోపమే! జిల్లాలకు జిల్లాలే నీట మునిగి, పెద్దఎత్తున పంట, ఆస్తుల నష్టాలు చోటుచేసుకుంటు న్నాయి. ఉత్తర తెలంగాణ అయిదు జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు (రెడ్ అలర్ట్)జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, ఇతర తీర జిల్లాల్లో వర్షం ఎక్కువ పడింది. కాకినాడ, పరిసరాల్లో సోమవారం కొన్ని గంటల్లోనే 12 సెంటిమీటర్ల వర్షం కురిసి హడలెత్తించింది. వరంగల్ పరిధి నడికుడలో ఏకంగా 38.8 సె.మీ వర్షం కురిసింది. లోగడ రోజంతా కురిసిన వర్షం, ఇప్పుడు గంట లోనే పడిపోతోంది. వాతావరణ మార్పుల వల్ల భూతాపోన్నతి పెరిగి, అతి వేడి వల్ల అల్పపీడనాలు పెరుగుతున్నాయి. అవి ఎక్కడున్న తేమను, గాలుల్ని లాఘవంగా లాగుతున్నాయి. ఫలితంగా జరిగే ‘మేఘ విచ్ఛిత్తి‘ (క్లౌడ్ బరస్ట్) కుంభవృష్టికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఇప్పటికే నిండి, భూగర్భజల మట్టాలు పైకి చేరాయి. భూమి తడిగా ఉంది. అందుకే, చిన్న వర్షం వచ్చినా నదులు, వాగులు, వంకలు, చెరు వులు పొంగి పారే పరిస్థితి. వరదల వల్ల భూక్షయం, భూసార క్షయం జరుగుతోంది. మరోపక్క గ్రామాలకు గ్రామాలు నీట మునగటం వల్ల పనులుండవు. కరోనాతో దెబ్బతిన్న దిన కూలీ కుటుంబాలకు ఇది అదనపు కష్టం! ఒక్కసారిగా వేడి–తడి వాతావరణ మార్పుల వల్ల వైరస్ క్రియాశీలంగా మారి, జబ్బులు ప్రబలే ప్రమాదం ఉంది. పైగా కరోనా కాలం అయినందున పౌరులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. వైద్య వ్యవస్థల్ని సర్కారు సమాయత్తపరచాలి. వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే, అందుకు అవసరమైన వ్యవస్థ, వనరులున్నాయా? అన్నది పెద్ద ప్రశ్న! సిరిసిల్లాతో సహా పాత కరీనంగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలపై ప్రస్తుతం దృష్టి సారించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీయెంయే)తో రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం నెరపాల్సిన సందర్భమిది. విపత్తు ఎదుర్కొ నేలా, ఎవరికి వారు భద్రతా చర్యల్ని పాటించే ‘పౌరరక్షణ’లో ప్రజలందరికీ శిక్షణ ఇప్పించాల్సి ఉండింది. కానీ, అదెందుకో సవ్యంగా జరుగటం లేదు. మొత్తంగా ఇది ఒకరోజు వ్యవహారం కాదు. శాశ్వత ప్రాతిపదికన కార్యాచరణకు ఓ వ్యూహ రచన ఉండాలి. ఐఎండీ క్యాలెండర్ ప్రకారం... ముందస్తు చర్యలు, వార్నింగ్ తర్వాత ఆపత్కాలం అనుసరించాల్సిన వ్యూహం, విపత్తు వేళ నిర్దిష్ట సహాయక చర్యలు, అనంతర దిద్దుబాటు కార్యక్రమాలు, నష్టం శాస్త్రీయ అంచనా–నష్టపరిహార చర్యలు, భవిష్యత్తులో విపత్తు తీవ్రత నివారణకు ప్రణాళిక.... ఇలా షట్సూత్ర కార్యాచరణ ప్రభు త్వాలకు తక్షణావసరం. అతివృష్టి–అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్టాల్ని తగ్గించేందుకు పంటల వ్యూహం ఉండాలి. పరిస్థితుల్ని తట్టుకునే పంటల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. నష్టాల అంచనాకు శాస్త్రీయ విధానం పాటించాలి. వర్షాన్ని, వాతావరణాన్ని గణించే వ్యవస్థను మండలస్థాయి వరకు విస్తరించాలి. అన్నిస్థాయిల్లో పౌర భాగస్వామ్యంతో జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. దొంగలు పడ్డ ఆరునెల్లకి కుక్కలు మొరిగినట్టు రెండు, మూడు సీజన్లు దాటాక అధ్యయన బృందాలు రావటం, అప్పటికి పరిస్థితులు పూర్తిగా మారి ఉండటం, చాలా అశాస్త్రీయం! ఎమ్మెల్యేలో, మరో రాజకీయ నాయకులో పంటనష్టాల్ని అంచనా వేయడం తప్పు. ఏపీ అనుసరిస్తున్న ఉచిత పంటల భీమా, సీఎం నిర్దేశించినట్టు... కనీసం తదుపరి సీజన్ నాటికి పరిహారం అందే వ్యవస్థ ఎంతో ఆదర్శం. దీన్ని దేశమంతటికీ విస్తరించాలి. వాతావరణ మార్పుతో తలెత్తిన కొత్త సమస్యలకు సరి కొత్త సమాధానాలు, పరిష్కారాలు వెతుక్కుంటేనే ప్రకృతి విపత్తుల నుంచి పౌర సమాజానికి రక్ష! -
జపాన్‌లో అస్థిరత
వెనకవుండి సలహాలు, సూచనలు అందిస్తూ అధినేత విజయపథంలో పయనించడానికి తోడ్పడటం వేరు...తానే నాయకుడై పాలించడం వేరు. నిరుడు సెప్టెంబర్ 16న జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యొషిహిడే సుగా తొందరలోనే ఈ తత్వాన్ని బోధపరుచుకుని ఆ పదవికి గుడ్ బై చెప్పారు. పర్యవసానంగా పట్టుమని ఏడాది కాకముందే ఆయన వారసుడి ఎంపిక కోసం అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) అన్వేషణ ప్రారంభించక తప్పలేదు. జపాన్‌కు రాజకీయ అస్థిరత కొత్తగాదు. 2006–12 మధ్య ఆ దేశం ఆరుగురు ప్రధానులను చూసింది. అందులో షింజో అబే కూడా ఒకరు. కానీ 2012లో రెండోసారి అధికారంలోకొచ్చాక అబే తీరు మారింది. అయిదేళ్లపాటు సుస్థిర పాలన అందించడమేకాక, 2017లో మరోసారి మంచి మెజారిటీతో అధికారంలోకొచ్చి మూడేళ్లు పాలించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో నిరుడు తప్పుకున్నారు. ఆయన వారసు డిగా వచ్చిన సుగాపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, తెరవెనకుండి షింజో అబేను విజయపథంలో నడిపించింది ఆయనే. అబే తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం వెనకా ఆయ నదే కీలకపాత్ర. కేబినెట్ రూపురేఖలు నిర్ణయించటంలో, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో, విదేశాంగ విధానం రూపకల్పనలో, పర్యాటక రంగాన్ని పరుగులెత్తించడంలో సుగా ప్రమేయ ముంది. అస్థిర ప్రభుత్వాలతో, ఆర్థిక ఒడిదుడుకులతో, వరస విపత్తులతో కుంగిపోయిన జపాన్‌కు ఈ నిర్ణయాలు జవసత్వాలిచ్చాయి. సమస్యలు ముంచుకొచ్చినప్పుడు ప్రజాదరణ దండిగా ఉన్న రాజకీయ నేత స్పందించే తీరుకూ, ఒక ఉన్నతాధికారి ఆలోచించే తీరుకూ వ్యత్యాసముంటుంది. అది తన సొంత ఆలోచనైనా, ఎవరి సలహాల పర్యవసానమైనా దాన్ని అందరితో ఒప్పించడంలో, ముందుకు నడిపించడంలో, ఆ నిర్ణయం సమర్థవంతంగా అమలు చేయడంలో, మెరుగైన ఫలితాలు రాబట్టడంలో రాజకీయ నాయ కుడి శైలి భిన్నంగా ఉంటుంది. ఉన్నతాధికారిగా అబే తరఫున అన్నీ చక్కబెట్టి, ఆయనకు పేరుప్రఖ్యా తులు రావడంలో ప్రధాన పాత్ర పోషించిన సుగా నేరుగా పాలనా పగ్గాలు చేపట్టాక వైఫల్యాలను మూటగట్టుకోవడంలోని సూక్ష్మం ఇదే. వాస్తవానికి రెండు శిబిరాలుగా చీలిన పాలక పార్టీలో సుగా అందరివాడుగా నిరూపించుకోగలిగారు. పార్టీ ఎంపీలు 151 మందిలో అబే వర్గానికి చెందిన 96 మంది, ఆర్థికమంత్రి తారో అసో అనుకూలురైన 55 మంది ఆయనకు అండదండలందించారు. ఈ రెండు వర్గాలకూ సుగా తన కేబినెట్లో సమాన ప్రాతినిధ్యమిచ్చి, అన్నిటా వారి సలహాలు తీసుకు న్నారు. ఎవరినీ నొప్పించకుండా పనిచేశారు. ప్రధాని పదవికి తామే అర్హులమని భావించే నేతలు ఎల్డీపీలో అరడజనుమంది వరకూ ఉన్నారు. కానీ కరోనా విలయంతోపాటు, ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వక తప్పని పరిస్థితులు ముంచుకొస్తుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీ యంగా దెబ్బతింటామేమోనన్న భయాందోళనలు వారందరిలోనూ ఉన్నాయి. అందుకే అబేను విజయపథంలో నిలిపిన సుగావైపే ఇరుపక్షాలూ అప్పట్లో మొగ్గుచూపాయి. ప్రధానిగా వచ్చిన సుగా తనకంటూ సొంత ఎజెండా ఉన్నదని నిరూపించుకోలేకపోయారు. అంతక్రితం అబే అమలు చేసిన విధానాలు తనవే కావొచ్చుగానీ, వాటి లోటుపాట్లను సరిదిద్దకుండా కొనసాగిస్తుండటం, కరోనా కట్టడిలో వైఫల్యాలు ఎదుర్కొనడం, వ్యాక్సిన్లు అందరికీ అందించలేక పోవడం సుగా ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. లాక్డౌన్ల కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినా, సాధారణ ప్రజానీకాన్ని ఆదుకొనడానికి పకడ్బందీ ప్రణాళికలు కొరవడ్డాయి. ఇప్పటికీ కొన్ని నగ రాలు కొవిడ్ ఎమర్జెన్సీలో కాలం గడుపుతున్నాయి. కరోనా రోగులను చేర్చుకునేది లేదంటూ ఆసు పత్రులు వెనక్కి పంపిన ఉదంతాలు జనంలో ఆగ్రహాన్ని రగిల్చాయి. ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్ నిర్వహించడమేమిటన్న ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. ఏతావాతా అధికార పగ్గాలు చేపట్టేనాటికి 70 శాతం రేటింగ్ ఉన్న సుగా ప్రస్తుతం 26 శాతానికి దిగజారారు. ఒకప్పుడు తెరవెనక సలహాలిచ్చిన అనుభవమున్న నేత... ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న సందేహంలో పడ్డారు. తీసుకున్న నిర్ణయంలోని మంచిచెడ్డలను ప్రజలకు సమర్థవంతంగా చెప్పి ఒప్పించే నేర్పు ఆయనకు లేదు. దాని కితోడు వచ్చే నెలతో ప్రస్తుత సభ కాలపరిమితి ముగుస్తోంది. నవంబర్‌లోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి.అటు ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించటం, ఇటు పాలనాపరంగా లోటుపాట్లు సరి దిద్దటం తనకు కత్తి మీద సాము అవుతుందని సుగా సరిగానే గ్రహించారు. దాదాపు 13 కోట్ల జనాభాగల జపాన్‌లో జనం నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఎల్డీపీ జాతీయవాద పార్టీయే అయినా వారిని సమ్మోహన పరిచి, ఒప్పించి మెప్పించగల మంత్రదండమేదీ దాని దగ్గర లేదు. విపక్షం బలహీనంగా ఉండటమే ప్రస్తుతానికి ఆ పార్టీకున్న ఏకైక బలం. ఈ నెలా ఖరులోగా కొత్త సారథిని ఎన్నుకోవటం, వారి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లటం ఒకరకంగా ఎల్డీపీకి అగ్ని పరీక్ష. చైనా, దక్షిణ కొరియాలతో సంబంధాలు, రక్షణ రంగాన్ని పటిష్టం చేయడం, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, నిరుద్యోగిత తగ్గించటం వంటి అంశాల్లో ఏమేం చేయదల్చుకున్నదీ కొత్త ప్రధాని ప్రజలకు వివరించాల్సి వుంటుంది. పరిణత ప్రజాస్వామ్యం ఉన్న జపాన్‌లో జాగ్రత్తగా అడుగులేయకపోతే ఎంతటి నేత అయినా, పార్టీ అయినా పల్టీలు కొట్టడం ఖాయమని సుగా ఉదంతం నిరూపించింది. కొత్తగా వచ్చే నేత ఎలాంటివారైనా దీన్ని విస్మరించటం అంత తేలిక కాదు. -
అద్దెకిస్తాం! అమ్మేస్తాం!!
బహుశా ఇది కనివిని ఎరుగని విషయం. ఇంకా చెప్పాలంటే, ఊహకైనా అందని అంశం. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి (పీఎం) అధికారిక నివాస భవనాన్ని అద్దెకిస్తామని ఓ ప్రభుత్వం ప్రకటించడం ఎక్కడైనా విన్నారా? కార్ల మొదలు పాడి గేదెల దాకా ప్రభుత్వమే అమ్మేయడం ఎక్కడైనా కన్నారా? అవి ఇప్పుడు మన సోదరదేశం పాకిస్తాన్లో చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లోని తన అధికారిక నివాస భవనాన్ని ఇప్పుడు విందు వినోదాలు, వివిధ విద్యా, సాంస్కృతిక, ఫ్యాషన్ ప్రదర్శనలకు అద్దెకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ రకంగా వచ్చే డబ్బు కొంతలో కొంతయినా ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలను తగ్గిస్తే అదే పదివేలని భావిస్తున్నారు. కానీ, అధికారిక నివాసాలకు వచ్చే కిరాయి డబ్బులతో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు తీరతాయా అన్నది ప్రశ్న. ఇమ్రాన్ సారథ్యంలోని పాలక ‘పాకిస్తాన్ తెహరీక్–ఎ–ఇన్సాఫ్’ (పీటీఐ) సర్కార్ 2019 ఆగస్టులోనే అధికారిక నివాసాన్ని విశ్వవిద్యాలయంగా మార్చాలని భావించింది. అప్పట్లోనే అలాగే, వివిధ రాష్ట్రాల గవర్నర్లు సైతం అధికారిక నివాసాలలో కాకుండా, మామూలు ఇళ్ళలో ఉంటూ ఖర్చు తగ్గిస్తామన్నారు. అధికారిక నివాసాన్ని వదిలేసి, మరో ఇంటికి ఆ ఏడాదే ఆయన మారిపోయారు. పీఎం నివాసాన్ని నిర్వహించడానికి ఏటా రూ. 47 కోట్లు ఖర్చవుతాయి. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ ఆ ఇల్లు ఖాళీ చేస్తే, ఖర్చు కలిసొస్తు్తందన్నది ఆలోచన. అంతకు ముందు 2018 సెప్టెంబర్‌లోనూ ఇమ్రాన్ ఇలాంటి పనే చేశారు. అంతకు ముందు ప్రధాని నవాజ్ షరీఫ్ పీఎం నివాసంలో పెట్టుకున్న ఎనిమిది పాడిగేదెల్ని రూ. 23 లక్షలకు అమ్మేశారు. గత వారమేమో 61 లగ్జరీ కార్లు అమ్మేసి, రూ. 20 కోట్లు ఆర్జించారు. ఇంకా 102 కార్లు, నాలుగు హెలికాప్టర్లను వేలం వేయాలని ప్లాన్. వీటి వల్ల కలిసొచ్చిన ఖర్చు, చేతికొచ్చిన సొమ్మెంతో కానీ, నెగిటివ్‌గానో, పాజిటివ్‌గానో ఇమ్రాన్‌కు ప్రచారమైతే దక్కింది. ఇవన్నీ పొదుపు చర్యలని పాలకులంటే, వట్టి జిమ్మిక్కులన్నది ప్రతిపక్ష వాదన. వర్ధమాన దేశమైన పాక్ కొండంత అప్పుల్లో ఉంది. అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం సాక్షాత్తూ ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ సంస్థ (ఐఎంఎఫ్) ఇచ్చిన ప్యాకేజీలో ఆ దేశం ఇప్పటికే భాగం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు, నిరుడు మొదలైన కరోనా ఆ దేశం నడ్డి విరిచింది. పంచదార, గోదుమల మొదలు టమోటాలు, ఉల్లిపాయలు, మాంసం, కోడిగుడ్లు – నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి. ఒకదశలో అక్కడ డజను కోడిగుడ్లు రూ. 200 నుంచి 240 దాకా పలికాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టడానికి తగినంత డబ్బు లేదని మూడేళ్ళ క్రితం ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడే ఇమ్రాన్ ఖాన్ కుండబద్దలు కొట్టారు. కానీ, పేరుకున్న అప్పులలో ఓ పంటి కిందకు కూడా రాని తాజా పొదుపు చర్యలు ఆ దేశ ఆర్థిక దురవస్థకు మచ్చుతునకలు. అంతర్జాతీయ సమాజంలో మర్యాదను తగ్గించే మరకలు. అసమర్థ నాయకత్వం, అవినీతి, అనవసరమైన యుద్ధ ప్రియత్వం, అంతకంతకూ పెరుగుతున్న జనాభా, ఆర్థిక రంగంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, పెంచిపోషిస్తున్న తీవ్రవాదం లాంటివన్నీ పాకిస్తాన్ ప్రస్తుత దుఃస్థితికి కారణాల్లో కొన్ని. వాటిని సరిదిద్దుకోకుండా, అప్పుల కోసం చైనాతో దోస్తీ కడుతూ, అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లకు తానాతందానా అంటూ, భారత్‌తో కయ్యానికి దిగుతూ... పాకిస్తాన్ మరింత ఊబిలోకి దిగబడిపోతుండడమే విచిత్రం. గాయం ఒకచోటైతే, మందు మరొకచోట రాయడమంటే ఇదే! పాకిస్తాన్‌ను దిగువ మధ్యతరగతి ఆదాయ దేశంగా 2008 నుంచి వర్గీకరించారు. ఉపఖండంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటున్నదీ పాక్‌లోనే! అలాగే, ప్రపంచంలోకెల్లా అధిక జనాభా ఉన్న దేశాల్లో అయిదో స్థానమూ పాక్‌దే. 1951 నుంచి 2017 మధ్య కాలంలో పాక్ జనాభా ఆరు రెట్లు పెరిగింది. 3.4 కోట్ల నుంచి 20.8 కోట్లు అయింది. జనాభా పెరుగుదలను అరికట్టి, సరైన చర్యలు తీసుకోకపోతే 2017 నుంచి 2050 మధ్య జనాభా ఏకంగా 84 శాతం మేర పెరుగుతుందని ఊహ. అదే సమయంలో ఆర్థిక వృద్ధి ఏమో కనాకష్టం. కనీసం మరో నాలుగైదేళ్ళ పాటు పరిస్థితి దయనీయంగా ఉంటుందని అంచనా. విద్య, ఉపాధిలోనే కాదు... చివరకు మహిళలకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారాల్లోనూ పాక్ వెనుకబడి ఉంది. ఉన్నంతలో సేవారంగాల్లో ఉపాధి దొరుకుతోంది కానీ, పారిశ్రామిక, వస్తూత్పత్తి రంగాలు బలహీనమే. ఇవన్నీ పాక్‌ను పట్టిపీడిస్తున్న పెను సమస్యలు. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వీటిని చక్కదిద్దడంలో సఫలం కాలేదు. అందుకు సరైన ప్రయత్నమూ చేసినట్టు కనిపించలేదు. చివరకు, ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్’ (ఎఫ్ఏటీఎఫ్) దేశాల ‘గ్రే లిస్టు’ నుంచైనా ఆ దేశం బయట పడనే లేదు. ఇలా చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉంటే, అద్దెలు, అమ్మకాల కంటితుడుపు చర్యలతో ఏం లాభం? మొత్తం మీద క్రికెట్ కెప్టెన్సీ కన్నా దేశనాయకత్వం కష్టమని 1992లో పాక్‌కు ఏకైక క్రికెట్ వరల్డ్ కప్ సాధించి పెట్టిన సారథి ఇమ్రాన్‌కు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆర్థికంగా దేశం గాడిన పడాలంటే ప్రచారం కోసం చేసే ప్రతీకాత్మక చర్యలు చాలవని ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. తీసుకోవాల్సిన అసలు చర్యలు, చేపట్టాల్సిన ఆర్థిక వ్యూహాలు, మార్చుకోవాల్సిన రాజకీయ వైఖరుల మీద ఇప్పటికైనా దృష్టి పెడితే పాకిస్తాన్‌కు మంచిది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు కావస్తున్నా దాయాది దేశం ఇలా మిగలడం మాత్రం ఇప్పటికీ సోదరభావం ఉన్నవారికి విచారకరమే. -
Photosynthesis : (ఛాయాచిత్రం చెప్పిన కథ)
పచ్చని ఆకు మీద ఆన. దాని పత్రహరితం మీద ఒట్టు.Photosynthesis అనే కిరణజన్య సంయోగక్రియ నడుచుకుంటూ వెళ్లే దృశ్యాన్ని నా కంటితో నేను తిలకించాను. నేను ఒక్కడినే కాదు. ఆంధ్ర దేశంలో ఒక కోటిమంది అబ్బురంగా చూసి ఉండవచ్చు. చూడనివాళ్లుంటే పై ఫొటోలో చూడవచ్చు. శ్రమజీవన సౌందర్యం సహజంగా, ప్రస్ఫుటంగా ఉట్టిపడే ఈ చిత్రం కెమెరా కంటికి చిక్కిన ‘సోషల్ ఫొటోసింథెసిస్’. చెట్టు కొమ్మలూ, వాటి రెమ్మల్లోని ప్రతి ఆకూ ప్రకృతి నుంచి సూర్యకాంతినీ, గాలినీ, నీటినీ గ్రహిస్తాయి. వాటి సమ్మేళనం ఆకు అంతరంగంలో కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తుంది. ఫలితంగా పచ్చనాకు నిస్వనంలోంచి మానవా ళికి ప్రాణాధారమైన ప్రాణవాయువు పుడుతుంది. ప్రాణవాయువుకు తోబుట్టువుగా జనించే పిండి పదార్థాన్ని చెట్టు స్వీకరిస్తుంది. బదులుగా తన వంటి నిండా పువ్వుల్ని, కాయల్ని, పండ్లని ధరిస్తుంది. ఈ అలంకరణ తనకోసం కాదు. లోక కల్యాణం కోసం. పరోపకారార్థం ఇదం శరీరం అన్న సుభాషితానికి నిలువెత్తు చిరునామా పచ్చని చెట్టు. అడుగు తీసి అడుగువేసే వైశాల్యంలో ప్రసరించే వెయ్యి వాట్ల సూర్యకాంతిలో ప్రకాశిస్తూ, నలభై ఐదు డిగ్రీల మహోగ్ర ఉష్ణంలో కాలిపోతూ, ఉరుములు– మెరుపుల సాయుధ వర్షంలో ప్రవహిస్తూ కోటీ ఇరవై లక్షల అడుగుల దూరాన్ని కాలినడకతో కొలిచిన సుదీర్ఘ ‘కిరణజన్య సంయోగక్రియ’కు దృశ్యరూపం ఈ ఛాయాచిత్రం. ఎంత సుదీర్ఘమంటే... శేషాచలం, నల్లమల అడవులు, తూరుపు కొండల అరణ్యాలు ఉమ్మడిగా స్వీకరించినంత సూర్యకాంతిని ఒకేఒక్క యాజ్ఞి కుడు స్వీకరించినంతకాలం. వర్షంలో ఆ అడవులు తడిసినంతకాలం. అంత కాంతినీ, నీటినీ, గాలినీ స్వీకరించిన ఒకేఒక్క ‘శక్తి’లో జరిగే ఫోటోసింథెసిస్ ఫలితం ఎట్లా ఉంటుంది? ఆంధ్రదేశంలో నివసించే ప్రజలకు సరిపోయేంత ప్రాణవాయువును, పువ్వుల్నీ, కాయల్నీ, పండ్లనీ సమకూర్చే విధంగా ఉంటుంది. పరోపకారార్థం ఇదం జీవితం అన్నది ఈ పచ్చనయ్య ఇచ్చిన సందేశం. సుమారు పన్నెండేళ్ల కిందట నిండు జనసభలో ఇచ్చిన ఒకే ఒక్క మాట. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే పరమధర్మమనే విశ్వాసం. అందుకోసం పడిన ఆరాటం. అదొక పోరాటంగా మారుతున్నా మడమ తిప్పని ధీశక్తి. విశ్వసనీయతను నిలబెట్టుకునే దారిలో ఎదురుగా అధికారమనే ఎవరెస్టు. అధిగమించే బాటలో ఎన్నో అగాధాలూ, ప్రమాదకరమైన లోయలు... తొమ్మిదేళ్లపాటు కష్టాల కొలి మిలో కాల్చిన తర్వాత తనను తాను సానబెట్టుకున్న కోహినూర్ వజ్రం పాద యాత్రగా బయల్దేరింది. ఆ యాత్ర ఒక చరిత్ర. అడుగడుగునా కష్టజీవుల వెతలను ఆ యాత్రికుడు కథలు కథలుగా విన్నాడు. ఆ కథలకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాజకీయం లేదు. ఏటేటా రైతెందుకు ఓడిపోతున్నాడో అర్థం చేసుకున్నాడు. అధికార పీఠం పైనున్నవారు ఏ సాయమందిస్తే పేదవర్గాల ఆత్మగౌరవం ఇనుమడిస్తుందో, ఆర్థిక వృద్ధికి అడుగులు పడతాయో అవగతమైంది. ఆకాశంలో అర్ధరాజ్యాన్ని అక్క చెల్లెమ్మలు పరిపాలించాలంటే ఏ విధాన నిర్ణయాలు తీసుకోవాలన్న అంశంపై మస్తిష్కంలో మథనం జరిగింది. అవ్వాతాతల మోముల్లో నిరంతరం నవ్వుల్ని ఎట్లా పూయించాలని తపనపడ్డాడు. ఆబాలగోపాలాన్ని హృదయానికి హత్తు కుంటూ, దారిపొడుగునా వారి గుండె సవ్వడులతో సంభాషిస్తూ వెళ్లిన ప్రజా నాయకునికి జనం జైకొట్టారు. చరిత్రాత్మక విజయాన్ని కానుకగా ఇచ్చారు. విలువలతో కూడిన సరికొత్త తరం రాజకీయాలకు శ్రీకారం చుడుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు. దేశచరిత్రలో ఏ రాజకీయ నాయకునికి లేనంత విస్తృత జనసంపర్క అనుభవం అక్కరకొచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంటింటి గడప దాకా ప్రసరించింది. విద్య–వైద్యరంగాల్లో విప్లవశకం మొదలైంది. రైతుకు భరోసా ఏర్పడింది. అక్కచెల్లెమ్మల ఐక్య సంఘాలు కళకళలాడుతున్నాయి. అవ్వాతాతలను పలకరించడమంటే ఇప్పుడు బోసి నవ్వు లతో కరచాలనం చేయడమే. అధికారంలోకి రాగానే కొంతకాలం ఆర్థిక మందగమనం అడ్డుతగిలింది. దాని వెనువెంటనే తరుముకుంటూ వచ్చిన కోవిడ్ మహమ్మారి గత 15 నెలలుగా తిష్టవేసి సవాళ్లు విసురుతున్నది. వీటిని మించి ప్రతిపక్షం ప్రయోగించిన ఎల్లో మహమ్మారి. గోబెల్స్ టు ది పవర్ ఆఫ్ థౌజండ్ గిగాబైట్ల సామర్థ్యంతో ఎల్లో మీడియా దుష్ప్రచార యుద్ధాన్ని ప్రారంభించింది. ఆధిపత్య వర్గాల దన్నుతో వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నది. ప్రజా ప్రభుత్వం మీద వాటిని గురిపెడు తున్నది. ఇడుములెన్ని ఎదురవుతున్నా సరే, సంకల్ప పథం నుంచి ఈ రెండేళ్లలో ప్రభుత్వం పక్కకు జరగలేదు. ‘బారు ఫిరంగులు మోగినా... బాంబుల వర్షం కురిసినా, ఎత్తిన జెండా దించమోయ్’ అనే మార్చింగ్ సాంగ్ స్ఫూర్తితో సాగి పోతున్నది. అందుకే రెండేళ్ల పాలనకు జనం స్థానిక ఎన్నికల్లో తిరుగులేని మద్దతును ప్రకటించారు. ఆంధ్రరాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక పరివర్తన చరిత్రలో పైనున్న చిత్తరువు ఒక మేలిమలుపునకు గుర్తుగా నిలబడిపోతుంది. – మురళి -
ఇంద్రధనుసుపై కుట్ర!
‘ఇప్పటివరకూ నడిచిన మానవ సమాజ చరిత్రంతా వర్గపోరా టాల చరిత్రే’నని జర్మన్ తత్వవేత్తలు కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్‌లు ప్రకటించారు. వారు రచించిన కమ్యూనిస్టు మేని ఫెస్టో అనే కరపత్రం 1848లో అచ్చయింది. సమాజంలోని ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను కాపాడ టానికే రాజ్యం (State) పనిచేస్తున్నదని వారు అభిప్రాయ పడ్డారు. రాజ్యమంటే... ప్రభుత్వం, దాని ఉపాంగాలు, కోర్టులు, పోలీస్ వగైరా టెంటకిల్స్ అన్నీ. ఇవన్నీ కూడా ఆధి పత్య వర్గాల ప్రయోజనాలకోసమే పనిచేస్తాయని మార్క్సిజం చెబుతుంది. రాజ్యం, దాని యంత్రాంగం చేతిలో సమాజంలోని మెజారిటీ ప్రజలైన కష్టజీవులు, కార్మికులు, ఉద్యోగులు ఇతర పేదవర్గాల వారు అన్యాయానికీ, అణచివేతకు గురవుతారు. వీరంతా సమష్టిగా పోరాడి ఆధిపత్య వర్గాన్ని అధికారం నుంచి కూలదోసి శ్రామికవర్గ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసు కుంటారు. ఈ ప్రభుత్వం సోషలిస్టు సమాజ స్థాపనకు పాదు చేస్తుంది. సోషలిస్టు సమాజపు అత్యున్నత దశనే కమ్యూనిజం అంటారు. సమాజం ఆ దశకు చేరుకున్న తర్వాత రాజ్యం, దాని యంత్రాంగాలతో పని వుండదు. రాజ్యం అంతరించిపోతుంది. ఇది రాజ్యం, దాని యంత్రాంగంపై మార్క్సిస్టుల మౌలిక అవగాహన. కమ్యూనిస్టు మేనిఫెస్టో అచ్చయిన తర్వాత సరిగ్గా వందేళ్లకు భారత రాజ్యాంగం ముసాయిదా సిద్ధమైంది. నాటి రాజ్యాంగ సభలో రచనా సంఘానికి నాయకత్వం వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ రాజ్యాంగ ముసాయిదా సిద్ధంచేసి, ప్రజాభిప్రాయం కోసం 1948 జనవరిలో విడుదల చేశారు. కొన్ని మార్పుచేర్పుల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ ఆమో దించింది. ఐరోపా సమాజాన్ని కార్ల్‌మార్క్స్ ఎంత విస్తృతంగా అధ్యయనం చేశారో, అంతే విస్తారంగా భారతీయ సమాజాన్ని డాక్టర్ అంబేడ్కర్ అర్థం చేసుకున్నారు. పెట్టుబడిదారీ వర్గం లాభాలకోసం, ప్రయోజనాలకోసం అణచివేతకు, దోపిడీకి గురవుతున్న కార్మికవర్గాన్ని విముక్తం చేయాలని కార్ల్‌మార్క్స్ కలలుగన్నారు. భారతదేశంలో ఆధిపత్య వర్గాలు, అణచివేతకు గురవుతున్న వర్గాలు కూడా వర్ణవ్యవస్థ–కులవ్యవస్థల్లో ఘనీ భవించిన వాస్తవికతను అంబేడ్కర్ గమనించారు. ఈ అణచి వేతకు సమ్మతిని తెలియజేసే ధర్మ శాస్త్రాలు–కర్మసిద్ధాంతాల ప్రభావాన్ని కూడా ఆకళింపు చేసుకున్నారు. మన సమాజంలోని అణచివేతకు గురవుతున్న కులాలు కేవలం ఆర్థిక దోపిడీయే కాకుండా ఆత్మగౌరవ దోపిడీకి కూడా తరతరాలుగా గురవుతు న్నారని అంబేడ్కర్ భావించారు. పీడితవర్గం తన విముక్తికోసం హింసాయుత విప్లవ పోరాటాలకు సిద్ధం కావాలని కార్ల్‌మార్క్స్ పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో తర్వాత వందేళ్ల కాలగమనంలో వచ్చిన మార్పులు, భారతీయ సమాజంలోని ప్రత్యేక లక్షణాల దృష్ట్యా ప్రజాస్వామ్య ప్రక్రియలోనే పీడిత కులాలు విముక్తం కావాలని అంబేడ్కర్ ఆలోచించారు. ఇందుకోసం రాజ్యాంగ రచనా అవకాశాన్ని ఒక ఆయుధంగా ఆయన మలుచుకున్నారు. రాజ్యాంగ సభలోనే పలుమార్లు ఆయన అభిప్రాయాలకు ఆలో చనలకు వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. వాదోపవాదాలు జరి గాయి. చరిత్ర గమనంపై సంపూర్ణ అవగాహన–అభ్యుదయ భావాలూ కలగలసి వున్న పండిత జవహర్లాల్ నెహ్రూ వంటి వారు రాజ్యాంగ సభలో కీలకపాత్ర పోషించిన కారణంగా అంబే డ్కర్ లక్ష్యం కొంత సులువైంది. సామాజిక ఆర్థిక పురోగతికీ, వంచిత వర్గాల విముక్తికీ దోహదం చేయగల రాజ్యాంగం మనకు సిద్ధమైంది. రాజ్యాంగ లక్ష్యాలను, రాజ్యాంగ రచయితల ఉద్దేశాలనూ ఒక పేజీలో గుదిగుచ్చి రాజ్యాంగ ప్రవేశిక (Preamble)ను తయారుచేశారు. మన రాజ్యాంగం తాత్విక పునాదిని అర్థం చేసుకోవడానికి ప్రవేశిక ఉపయోగపడుతుంది. ఈ దేశ ప్రజ లందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించడం రాజ్యాంగ లక్ష్యంగా ప్రవేశిక ప్రకటించింది. సమాజంలో సమా నత్వం,స్వేచ్ఛ, సోదరభావం వెల్లివిరియడం రాజ్యాంగం మరో లక్ష్యమని ప్రకటించింది. రాజ్యాంగ అధికరణాలకు సంబంధించి ఎప్పుడైనా సందిగ్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రవేశిక ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుందంటారు. జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి వంటి న్యాయమూర్తులు ఈవిధంగా ప్రగతి శీలమైన తీర్పులను అనేకం వెలువరించారు. కొందరు యథా తథవాద న్యాయమూర్తులు అధికరణాలకు యాంత్రిక భాష్యం చెబుతూ భిన్నమైన తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆదేశించినట్టుగా ప్రజలందరికీ సంపూర్ణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందుబాటులోకి రాలేదు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం ఇంకా సంతృప్త స్థాయిలో నెలకొనలేదు. ఆధిపత్యవర్గం అనేది ఒకటి ఇంకా కొనసాగడం, ఆ వర్గానికి యధాతథ స్థితిలో ఉండే స్వార్థప్రయో జనం ఇందుకు కారణం. ఆర్థిక–సామాజిక అంతరాలు మరింత విస్తరిస్తున్న కారణంగా రాజ్యాధికారం ఆధిపత్య వర్గాల చేతు ల్లోనే ఇంకా కేంద్రీకృతమై ఉన్నది. అందువల్ల రాజ్య సంబం ధమైన అన్ని విభాగాల్లోనూ, సంస్కృతి, సంప్రదాయాల్లోనూ, ఆలోచనల్లోనూ ఆధిపత్య భావజాలమే పెత్తనం చేస్తున్నది. ఇందుకు చట్టసభలూ, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, ఫోర్త్ ఎస్టేట్, కవులు, రచయితలూ, మేధావులు... ఎవరూ మినహా యింపు కాదు. ప్రగతిశీల ఆలోచనాపరులు, స్వచ్ఛమైన ప్రజా స్వామ్యప్రియులు అన్నిరంగాల్లోనూ ఎప్పుడూ ఉంటారు. కాక పోతే అల్పసంఖ్యాకులు కావడం వల్ల, ఆధిపత్య భావజాలంతో పోటీపడి నెగ్గే పరిస్థితి లేదు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలందరి సమాన పురోగతికి ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వాలు గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ లేకపోలేదు. కాకపోతే ఆధిపత్యవర్గాల ప్రభావం వల్ల ఒకడుగు ముందుకువేస్తే రెండడుగులు వెనక్కు అన్న చందంగా సమతావాద ప్రస్థానం మిగిలిపోయింది. సరిగ్గా రెండు సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్‌లో అఖండ ప్రజాభి మానంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఈ దేశంలోని పీడిత వర్గాలు, అణచివేతకు గురవుతున్న వర్గాలన్నింటికీ ఒక ఆశాదీపంగా కని పిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోకు ఆ పార్టీ అధినేత ఆపాదించిన పవిత్రత, అందులోని హామీలను అమలుచేస్తున్న తీరు ఈ దేశ రాజకీయాల్లో నిస్సంశయంగా ఒక కొత్త శకాన్ని ఆవిష్కరిం చాయి. వెనుకబడిన, బలహీనవర్గాల ప్రజల ఆర్థికాభ్యున్నతితో పాటు, వారి ఆత్మగౌరవ ఉద్దీపనకు కూడా వైఎస్ జగన్ ప్రణా ళికలు రచించి ఆచరణలో పెట్టారు. ఆరకంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనల్ని సంపూర్ణంగా అమలుచేస్తున్న ఏకైక నాయకునిగా వైఎస్ జగన్ మిగిలిపోయారు. మూగకు గొంతివ్వడానికి ఐదేళ్లలోపు మూగ–చెవిటి పిల్ల లందరికీ వైఎస్ జగన్ ప్రభుత్వం కాక్లియర్ ఇంప్లాంటేషన్లు చేస్తున్నది. చీకటిలో చూపునిచ్చినట్టుగా కంటి సమస్యలను మొగ్గలోనే తుంచేసే కంటి వెలుగు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఉడిగిన వయసుకు ఊతకర్ర మాదిరిగా అవ్వతాత లందరికీ ఒకటో తేదీన సూర్యోదయంతోపాటు సగౌరవంగా పెన్షన్ డబ్బులను ఇంటివద్దనే అందజేస్తున్నారు. ప్రస్తుతం 2,250 రూపాయల పెన్షన్ వచ్చే జనవరి నుంచి 2,500కు పెంచుతూ బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు. తరతరాలుగా రెట్టింపు అణచివేతకు గురవుతున్న శ్రామిక మహిళల శిరస్సుల మీద మకుటధారణ చేసినంత ఘనమైన కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడామె పేరు మీద సొంతింటిని ప్రభుత్వం సమ కూర్చుతున్నది. ఇల్లంటే ఏదో మురికివాడ ఇల్లు కాదు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కేబుల్ కనెక్షన్లు, విశాలమైన బీటీ రోడ్లతో ఓ ఆదర్శ కాలనీ ఇల్లు. ఇంటి నిర్మాణం జరిగిన వెంటనే కనీసపక్షం ఆరేడు లక్షల ఆస్తి ఆమె చేతిలో ఉంటుంది. పిల్లల చదువులో నిర్ణయాధికారం ఆమెదే. అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం ఏటా పదిహేను వేల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. కన్నబిడ్డల చదువు సంధ్యలు ఆమె ఆకాంక్షల మేరకు నెరవేరబోతున్నాయి. పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు జమానా వరకున్న బ్యాంకు బకాయిలు రూ. 27 వేల కోట్లను వాయిదాల ప్రకారం చెల్లించి ప్రభుత్వం వారికి ‘ఆసరా’గా నిలబడింది. పిల్లలు పెద్దవాళ్లయి పోయి, పనిచేసే శక్తి తగ్గిపోతూ, అస్వతంత్ర ఆర్థిక స్థితిలో ఉండే 45–60 ఏళ్ల మహిళలకు ప్రభుత్వం ‘చేయూత’నివ్వడం గొప్ప మానవీయ కార్యక్రమం. ఆత్మగౌరవాన్ని ఇనుమ డింపజేసే చర్య. ఈ కార్యక్రమాన్ని బలహీనవర్గాల వారితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా ప్రభుత్వం వర్తింపజేసింది. కృత్రిమ వ్యవసాయ సంక్షోభాన్ని సృష్టించిన గత పాలకుల పుణ్యమా అని మన రైతులు చితికిపోయారు. ఆ చితికిన రైతును ఇప్పుడు మీసం మెలేసి బతికిన రైతుగా నిలబెట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, అందుబాటులో నాణ్యతా ప్రమాణాల పరీక్ష కేంద్రాలు, ధరల స్థిరీకరణ నిధి వగైరాలన్నీ రైతు జీవితాన్ని గౌరవపూర్వకంగా నిలబెట్టేవే. విద్యా – వైద్య రంగాల్లో మనదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విప్లవాత్మక కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారం భించింది. మరో ఒకటి రెండేళ్లలోనే ఈ కార్యక్రమాల పూర్తి ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. మారుమూల పల్లెలో ఉన్నా సరే, నెలకు రెండుసార్లు ప్రభుత్వ డాక్టర్ ప్రతి ఇంటి గడపనూ తొక్కబోతున్నాడు. అనారోగ్యాన్ని ఆదిలోనే గుర్తించి నయం చేసే వెసులుబాటు కలుగబోతున్నది. ఇంటింటి ఆరోగ్య డైరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండబోతున్నది. నాడు– నేడు పేరుతో ఇప్పటికే ప్రభుత్వ ఆరోగ్యరంగం పరుగును ప్రారం భించింది. ప్రభుత్వ విద్యారంగం సరికొత్త జవజీవాలను సంతరించుకుంటున్నది. నాడు–నేడు పేరుతో సర్కారు బళ్లు ముస్తాబవుతున్నాయి. ఇప్పటివరకు మూడో వంతు స్కూళ్ల రూపుమారింది. ప్రతి పిల్లవాడికి పైసా భారం లేకుండా ఉన్నత విద్య వరకూ ప్రభుత్వమే బాసటగా నిలబడుతున్నది. పేద బిడ్డలందరికీ ఇంగ్లిష్ మీడియంలో చదివే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రానున్న రోజుల్లో ఒక గొప్ప గేమ్ చేంజర్ కాబోతున్నది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవన్నీ రాబోయే రోజుల్లో గొప్ప సామాజిక మార్పులను తీసుకుని వచ్చే కార్యక్రమాలు. కేవలం సంక్షేమ చర్యలు కావు మానవీయ అభివృద్ధికి నమూ నాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా చెబుతు న్నట్టుగా ‘అభివృద్ధి అంటే రెండు మూడు భవనాలు కట్టడం కాదు, అభివృద్ధి అంటే ప్రజలందరికీ నిన్నటికంటే ఈరోజు బాగుండటం, రేపు మరింత బాగుంటుందన్న నమ్మకం కల గటం’. శ్రీశ్రీ చెప్పినట్టు ‘కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్’ ... ఈ అభి వృద్ధిలో భాగం కాబోతున్నాయి. సబ్బండ వర్ణాలు, కులాలతో కూడిన ఇంద్రధనుస్సు ఒకటి అధికార కేంద్రం మీదుగా ఆకా శంలో పరుచుకుంటున్నది. ‘అలగా’ జనాలంతా హరివిల్లుగా మెరిస్తే ఆధిపత్య వర్గాలు ఊరుకుంటాయా మరి? లోక కల్యాణంకోసం యజ్ఞాలు చేస్తే త్రేతాయుగం నాటి రాక్షసులే సహించలేదు. ఇప్పుడు ఇంత పెద్దఎత్తున జరుగుతున్న జనకల్యాణోత్సవాన్ని ఎందుకు సహిస్తారు? ఆధిపత్యవర్గాల భావజాలం అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. మీడియా అదే మాట్లాడుతుంది. కోర్టులు ఆ ధోరణిలోనే ఆలోచిస్తాయి. ఎంపీ స్థాయి వ్యక్తులు న్యూస్చానళ్లను వేదికలుగా చేసుకుని పచ్చిబూతులు మాట్లాడతారు. అటువంటి వ్యక్తులకు కేవలం ఏడాది కిందట హృద్రోగం కారణంగా మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే మీడియా విరుద్ధమైన కథనాలు అల్లుతుంది. కొన్ని కోర్టుల్లో కామన్సెన్స్ను సవాల్‌చేసే తీర్పులు వినవలసి వస్తుంది. ఇప్పటికే పూర్తయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ కోవిడ్ కల్లోలం ఎంతకాలం ఉంటుందో తెలియదు. మూడో వేవ్ రాదనే గ్యారంటీ లేదు. అదెంతకాలం ఉంటుందో తెలియదు. మళ్లీ ఎన్నికలు పెట్టే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రజాప్రతినిధులు లేకుండా స్థానిక సంస్థలు ఇంకెంత కాలం వేచివుండాలో తెలియదు. ఈరోజున ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై జరుగుతున్న దాడి ఈ దేశచరిత్రలో కనీవినీ ఎరుగనిది. పీడిత ప్రజలను సాధికార శక్తులుగా మార్చడానికి ప్రయత్నించడమే ఆ ప్రభుత్వం చేసిన పాపం. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను పవి త్రంగా భావించడం, అంబేడ్కర్ ఆశయాలను అనుసరించమే ఆ ప్రభుత్వం చేసిన నేరం. ఐక్యరాజ్య సమితి ప్రబోధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్లను రూపొందించ డమే ఆ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను శిరోధార్యంగా భావించడమే ఆ ప్రభుత్వం చేసిన ఘోరం. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ఈ పొరపాట్లకు గాను ఆధిపత్య వర్గాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. అందువల్లనే సబ్బండ వర్ణాలతో ఏర్పడిన ఇంద్రధనుసుపై కుట్రపన్నాయి. ఆ ఇంద్రధనుసును ఆవిష్కరించినందుకు ఏపీ ప్రభుత్వ పెద్దపై భయంకరమైన కుట్రకు తెరతీశాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘సుప్రీం’ స్ఫూర్తికి విరుద్ధం
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులకూ, చట్టసభలకూ ఎనలేని ప్రాధాన్యత వుంటుంది. దేశ రాజధాని కావటం వల్ల కావొచ్చు... ఢిల్లీకి సంబంధించినంతవరకూ అక్కడి అసెంబ్లీకి మొదటి నుంచీ పరిమితమైన అధికారాలే వున్నాయి. పేరుకు ముఖ్యమంత్రి, మంత్రులు వున్నా, దానికి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా ప్రశ్నిస్తూనే వున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా వున్నవారితో ఆయనకు భిన్న సందర్భాల్లో ఘర్షణలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు మరింత కోతపెడుతూ కేంద్ర ప్రభుత్వం మొన్న సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుపై సహజంగానే ఆగ్రహావేశాలు రగుల్కొ న్నాయి. దీనిపై పాలక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఉద్యమం ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ జాతీయ రాజధాని ప్రాంత చట్టం,1991ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం ఇకపై అక్కడ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే. పాలనాపరమైన ఏ చర్య తీసుకోవటానికైనా అక్కడి ప్రభుత్వం ఎల్జీని సంప్రదించాలి. ఈ బిల్లు చట్టమైతే అసెంబ్లీ, దానికి సంబంధించిన కమిటీలు రాజధాని ప్రాంతంలో రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం సాధ్య పడదు. మూడేళ్లక్రితం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కూ, ఎల్జీకీ మధ్య వివాదం తలెత్తినప్పుడు అధికారాల విభజనకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఆ ప్రకారమే తాము తాజా సవరణలు తెస్తున్నామని బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా వుందని చెప్పటానికి లేదు. 1992లో ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ 69వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన 239ఏఏ అధికరణ ప్రకారం తనకు సర్వాధికారాలూ వున్నాయని ఎల్జీ వాదన. ఢిల్లీ హైకోర్టు ఆయన వాదనను అంగీకరించింది. తాము తీసుకుంటున్న వివిధ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ఎల్జీ ఎటూ తేల్చకుండా అవరోధాలు సృష్టిస్తున్నారని కేజ్రీవాల్ సర్కారు వాదించగా, పాలనాపరంగా ఆయనే సర్వాధికారి అని, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆయన సమ్మతి అవసరమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఇందుకు భిన్నమైన తీర్పునిచ్చింది. ఎల్జీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసు కోవటానికి లేదని, ఆయన మంత్రి మండలి సలహాలు, సూచనలమేరకు పనిచేయాలని స్పష్టం చేసింది. అయితే ఇందుకొక మెలిక పెట్టింది. ఏ నిర్ణయాన్నయినా రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతిరేకించేందుకు ఎల్జీకి హక్కుందని, తుది నిర్ణయం కోసం ఆయన రాష్ట్రపతికి నివే దించవచ్చునని తెలిపింది. అదే సమయంలో ఈ నిర్ణయాధికారాన్ని యాంత్రికంగా ఉపయో గించరాదని వివరించింది. 239ఏఏ అధికరణ ప్రకారం ప్రజా భద్రత, పోలీసు, భూ సంబంధ అంశాలు మినహా మిగిలిన విషయాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ అసెంబ్లీకి అధికారాలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సున్నితమైన అంశాలు ఇమిడివున్నవీ, ప్రభుత్వ స్తోమతకు మించి ఆర్థిక భారం పడేవీ, కేంద్రంతో లేదా పొరుగు రాష్ట్రాలతో రాజకీయ సమస్యలకు తావిచ్చేవీ ఎల్జీ రాష్ట్రపతికి నివేదించవచ్చు. కానీ ఆ తీర్పు ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి లభించిన పరిమిత ఉపశ మనాన్ని కాస్తా తాజా సవరణ బిల్లు హరిస్తోంది. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టు అది చట్టమైతే ఢిల్లీ ప్రతిపత్తి మున్సిపాలిటీకన్నా మిన్నగా ఏమీ వుండదు. ఢిల్లీకి 1956కు ముందు పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల మాటేమోగానీ... 1993లో అక్కడ మళ్లీ అసెంబ్లీని పునరుద్ధరించినప్పటినుంచీ తగినన్ని అధికారాలివ్వాలన్న డిమాండ్ పదే పదే వస్తూనేవుంది. బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా, ఆ తర్వాత అదే పార్టీకి చెందిన సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ వంటివారు సీఎంలుగా పనిచేసినప్పుడు మాత్రమే కాదు...కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సైతం ఎన్నికైన ప్రజా ప్రతినిధులను చిన్నచూపు చూస్తున్నారని, తాము నామమాత్రం అవుతున్నామని ఆరోపించేవారు. అయితే తమ పార్టీకి చెందిన ప్రభుత్వాలే కేంద్రంలో అధికారంలో వుండటం వల్ల చివరకు ఎప్పుడూ వారిదే పైచేయి అయ్యేది. కానీ ప్రస్తుత ముఖ్య మంత్రి కేజ్రీవాల్ పరిస్థితి వేరు. ఆయనకు వర్తమానంలో సరేసరి... యూపీఏ పాలనాకాలంలోనూ కష్టాలు తప్పలేదు. బస్తీల్లో క్లినిక్‌ల ఏర్పాటు మొదలుకొని టీచర్ పోస్టుల భర్తీ, వారి పదోన్నతులు, కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ వరకూ అనేక అంశాలు ఎల్జీ వద్ద దీర్ఘకాలం పెండింగ్‌లో పడ్డాయి. ఢిల్లీకున్న ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అధికారాలు కేంద్రం వద్దనే వుండాలనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ టీచర్ల నియామకం, బస్తీ క్లినిక్‌ల వంటి ప్రజానుకూల అంశాల్లో సైతం ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోరాదనటం... అందుకు తమ ఆమోదముద్ర అవసరమనటం అప్రజా స్వామికం. తమను గెలిపిస్తే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని బీజేపీ గతంలో వాగ్దానం చేసింది. అది నెరవేర్చకపోగా వున్న అధికారాలను కూడా హరించటం సరైంది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి తగిన అధికారాలివ్వాలి. ఆ నిర్ణయాల్లో తప్పొప్పులుంటే ఎటూ జనం ప్రశ్ని స్తారు. వాటి రాజ్యాంగబద్ధతను న్యాయస్థానాలు తేలుస్తాయి. అంతేతప్ప ఆ ప్రభుత్వాలను నామ మాత్రావశిష్టం చేయటం ఎంతమాత్రం భావ్యం కాదు. -
శిఖండి యుద్ధం!
చెట్టుకు కాసిన కుక్కమూతి పిందె గురించి కాదు, ఆ చెట్టుకు సోకిన తెగులు గురించి మాట్లాడుకోవాలి. భీష్ముడిని అస్త్ర సన్యాసం చేయించిన శిఖండి గురించి కాదు, ఆ శిఖండి వెనుక దాక్కొని బాణంవదిలినవాడి ‘వీరత్వం’ గురించి మాట్లాడు కోవాలి. ‘ఏక్ దిన్ కా హీరో’ సైంధవుడి ‘పరాక్రమం’ ముఖ్యం కాదు. ఆ సైంధవుడిని పావుగా వాడుకొని పంతం నెగ్గించుకున్న ద్రోణాచార్యుడి కపటత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అడవి జంతువులు పంటచేలలో చొరబడితే ఏమవుతుంది? ప్రజాస్వామ్య సమాజంలో రాజ్యాంగ వ్యవస్థలు పరిధులు దాటి చెలరేగితే అదే జరుగుతుంది. అదే జరుగుతున్నది కూడా. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వ్యవహారాలను రెండు రాజ్యాంగ వ్యవస్థల నడుమ జరుగుతున్న ఘర్షణగా చిత్రిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా ఈ దురభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నవారు కొంద రైతే, యథాలాపంగా, మీడియా రిపోర్టుల ఆధారంగా నిర్ధార ణకు వస్తున్నవాళ్లు కొంతమంది. దురభిప్రాయాన్ని ప్రచారంలో పెడుతున్న వారెవరో తేలిగ్గా ఊహించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడి యాగా ప్రచారంలో ఉన్న ఆ పార్టీ అనుబంధ సంస్థలు, చంద్ర బాబుకు అవసరమైనప్పుడల్లా టోకున మద్దతు తెలిపే కొన్ని మిత్రపక్షాలు, ఇతర పార్టీల్లో మారువేషాల్లో ఉన్న స్లీపర్‌సెల్స్... వగైరాలు ఈ రాజ్యాంగ ‘వివాదం’ పట్ల ప్రస్తుతానికి కలత చెంది నట్లు కనిపిస్తున్నాయి. ఆసక్తి కలిగిన వారెవరైనా, జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే వాస్తవ దృశ్యం కనిపిస్తుంది. ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వంపై రాజ్యాంగ వ్యవస్థ ముసుగులో జరు గుతున్న ఒక శత్రుదాడి కనిపిస్తుంది. ఆ దాడిని నిర్దేశిస్తూ, నియంత్రిస్తున్న ఒక క్షుద్ర రాజకీయ కనికట్టు విద్య కనిపిస్తుంది. మచ్చుకు నాలుగైదు దృష్టాంతాలను గుర్తుకు చేసుకుందాం. గత మార్చి నెలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ మధ్యలో హఠాత్తుగా ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికే నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయింది. ఎన్నికలను నిర్వహించ డానికి గానీ, వాయిదా వేయడానికి గానీ ప్రభుత్వంతో, అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరపాలన్న రాజ్యాంగ ధర్మాన్ని, సంప్రదాయాన్ని అతిక్రమించారు. అందుకు కోవిడ్‌ను కారణంగా చూపెట్టారు. అప్పటికి రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏ దశలో ఎన్నికలను వాయిదా వేస్తున్నారో అదే దశ నుంచి తిరిగి ప్రారంభిస్తానని ఆ సందర్భంగా కమిషనర్ మీడియా సమక్షంలో ప్రకటించారు. తిరిగి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెట్టి పంచా యతీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.తానే చెప్పిన మాట ప్రకారం నామినేషన్ల ఘట్టం దగ్గర ఆగి పోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వదిలేసి పంచాయి తీలకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆ పంచాయతీలకు జరిగే ఎన్నికలు పార్టీ రహితమని తెలిసినప్పటికీ, ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడం ఆనవాయితీ అని తెలిసినప్పటికీ ఒక వితండ వాదాన్ని లేవదీసి ఏకగ్రీవాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ రహిత పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోను ప్రకటించింది. ఇదొక దుష్ట సంప్రదాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పంచాయతీల పరిధిలో లేని అనేక అంశాలపై మేనిఫెస్టోలో వాగ్దానాలు గుప్పించారు. లక్షల సంఖ్యలో ఆ మేనిఫెస్టో కాగితాలను పంపిణీ చేశారు. దీనిపై వైసీపీ అభ్యంతరం చెప్పింది. కమిషనర్ దీనిపై వెంటనే స్పందిం చలేదు. చంద్రబాబు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ పెట్టి కర పత్రాలు ఇంటింటికీ చేరాయని నిర్ధారణ చేసుకున్నరోజు సాయంత్రానికి కమిషనర్ స్పందించారు. మేనిఫెస్టోను విడుదల చేయడాన్ని తప్పుపట్టారు. ఆ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే సదరు మేనిఫెస్టో కరపత్రం అప్పటికే ఇంటింటికీ చేరిపోయింది. కొంతమందైనా చదివి ఉంటారు. ఎలా రద్దు చేస్తారు? ఇంటింటికీ వెళ్లి ఎలా వెనక్కు తెస్తారు? చదివిన వాళ్ల మస్తిష్కంలోంచి ఎలా వెలికి తీస్తారు? ఇవి సమాధానం దొరకని ప్రశ్నలు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఏ దశ లోనూ ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపిన దాఖలా ల్లేవు. కానీ మంత్రి ఏదో సందర్భంలో మాట్లాడిన మాటల వల్ల ఎన్ని కల ప్రక్రియకు భంగం కలగబోతున్నదని ఎన్నికల కమిషనర్ భావించారు. అలా భావించడమే తడవుగా మంత్రిపై ఆంక్షలు విధించారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నంత కాలం పంచాయతీరాజ్ మంత్రి ఇంట్లోనే కూర్చోవాలట. మీడియాతో కూడా మాట్లాడకూడదట. మంత్రి వ్యాఖ్యలు అంత ప్రమాద కరమైనవని కమిషనర్ భావించినప్పుడు ముందుగా ఒక నోటీస్ ఇవ్వాలి కదా! ఆయన వివరణ కోరాలి కదా! అవేమీ లేకుండానే ఒక సీనియర్ మంత్రిపై ఆంక్షలు విధించడ మేమిటి? స్వయంగా ఎన్నికల కమిషన్ తప్పు పట్టిన టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది చంద్రబాబు. విడుదల చేయడమే కాదు, దాన్ని ఇంటింటికీ చేర్చి గట్టిగా ప్రచారం చేయాలని కూడా కార్యకర్తలకు పిలుపుని చ్చారు. మరి చంద్రబాబు మీద చర్యలేవి? రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు ఎంత సీనియరో పెద్దిరెడ్డి కూడా అంతే సీనియర్. చంద్రబాబుకు ఒక న్యాయం, పెద్దిరెడ్డికి ఒక న్యాయం ఎలా కుదురుతుంది? రెండు వారాలు వెనక్కు పోదాం. సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణల మీద ఆరో పణలు చేస్తూ ఎన్నికల కమిషనర్ గవర్నర్‌కు ఒక లేఖ రాశారు. తమపై లేఖ రాయడమే కాక, దాన్ని మీడియాకు లీక్ చేయ డాన్ని, ఉద్దేశపూర్వకంగా తమ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిం చడమేనని మంత్రులు భావించారు. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. దానిపై విచారణ జరగనున్నది. ఇప్పుడు తప్పు చేసినట్టు రుజు వైన చంద్రబాబుపై ఏ చర్యా లేకుండా, పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించడం, అదీ.. ఎటువంటి నోటీసు లేకుండా విధించడం ప్రజలకు ఏ సందేశాన్నిస్తుంది? ప్రివిలేజ్ కమిటీ విచారణకు ఇది ప్రతీకారమని జనం భావిస్తే అది తప్పెలా అవుతుంది? తర్వాత వరుసలో బొత్స సత్యనారాయణ కూడా ఉంటారా? ఎన్నికల కమిషనర్ మొన్న ఆవిష్కరించిన ఈ–వాచ్ అనే యాప్ కూడా తీవ్రంగా విమర్శలపాలైంది. ఈ యాప్ రూప కల్పన, నిర్వహణ విషయాల్లో ఏమాత్రం పారదర్శకత లేని కారణంగా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకే హక్కుల కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం ప్రకారం ఈ యాప్‌ను గురించిన సమాచారం అందజేయాలని ఎన్నికల కమి షన్ను అభ్యర్థించారు. అందుకు కమిషన్ సమ్మతించలేదు. దాంతో ఆ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి పలు విషయాలను తీసుకొని వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘సీ–విజిల్’, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘నిఘా’ యాప్‌లు ఉండగా కొత్త యాప్ అవసరమేమిటని పిటిషనర్ ప్రశ్నించారు. ఏ యాప్‌కైనా ఏపీటీఎస్ఎల్ (ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) నుంచి ధ్రువీ కరణ పత్రం తప్పనిసరి. కానీ, ఆ ధ్రువీకరణ లేకుండానే ఈ యాప్‌ను ఆవిష్కరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఏపీటీఎస్ఎల్ నుంచి ఆడిట్ సెక్యూ రిటీ సర్టిఫికెట్‌ను తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు సూచిం చింది. ఈలోగా 9వ తేదీ వరకు యాప్‌ను వినియోగించరాదని ఆదేశించింది. ఏపీటీఎస్ఎల్ పరిశీలనలో యాప్ వెనుకనున్న మాయలఫకీరు చిలక బండారం బయటపడవలసి ఉన్నది. రేషన్ సరుకులను ప్రజల ఇంటికి చేర్చే ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఇది కొన్ని జిల్లాల్లో అమలవుతున్నది. మిగిలిన జిల్లాల్లో ఈనెల ఒకటిన ప్రారంభం కావలసింది. దీన్ని కూడా ఎన్నికల కమిషనర్ అడ్డుకో వాలనుకున్నారు. కమిషనర్ నిర్ణయాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది. పేదల ఆహార కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరి కాదని అభిప్రాయపడింది. ఐదు రోజుల్లో పునఃపరిశీలన చేయాలని కోరింది. గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఆయన స్పందించారు. వాహనాల రంగుల్ని, ముఖ్యమంత్రి బొమ్మను తొలగించి తనకు చూపెట్టాలనీ, తాను సంతృప్తి చెందిన తర్వాత మిగిలిన అన్ని వాహనాల రంగులు తొలగించి అప్పుడు పథ కాన్ని ప్రారంభించుకోవచ్చునని సెలవిచ్చారు. అయినా పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి చిత్రాన్ని తొల గించవలసిన అవసరం ఏమిటని కానీ, ఎప్పుడో ప్రారంభమైన పథకంపై ఇప్పుడు ఆంక్షలేమిటని కానీ ఆయన్ను అడగరాదు. ఆయన సమాధానం చెప్పరు. సాక్షాత్తూ, ఒక ముఖ్యమంత్రిపై ప్రత్యర్థులు కూడా వాడ కూడని భాషలో విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసు కోవడం, దాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేయడం, మంత్రుల మీద, సలహాదారుల మీద ఆరోపణలు చేస్తూ గవ ర్నర్‌కు లేఖ రాయడం, లీక్ చేయడం, మంత్రులపై ఆంక్షలు విధించడం, ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేయాలనుకోవడం, సంక్షేమ పథకాలను అడ్డుకోవడం... ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నేత ఆదేశిస్తారు ఈ నిమ్మగడ్డ పాటిస్తాడు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకొనిపోయింది. స్వతంత్రంగా వ్యవహ రించవలసిన ఎన్నికల సంఘాన్ని ఒక పార్టీ అధినేతకు తాకట్టు పెట్టి ఆయన ఆదేశాల మేరకు పరిధులు దాటి చెలరేగితే బహుశా బాస్‌కు కొంత ఊరట కలుగుతుందేమో. ఎన్నికల్లో దారుణ పరాభవం ఫలితంగా గాయపడ్డ అహానికి ఈ చర్యలు కొంత సాంత్వననిస్తాయేమో! వియత్నాం వంటి చిన్న దేశంలో సుదీర్ఘకాలం జరిగిన యుద్ధంలో అమెరికా అవమానకరంగా ఓడిపోయిన తర్వాత అమెరికా జాత్యహంకారుల అహం బాగా దెబ్బతిన్నది. వారి అహాన్ని చల్లార్చడానికి అప్పట్లో రాంబో అనే సినిమా వచ్చింది. సల్వెస్టర్ స్టలోన్ ఒక్కడే బాణాలతోవెళ్లి వియత్నాంలో వీరవిహారం చేస్తాడు. ఈ సినిమా దెబ్బతిన్న వారి అహాన్ని కొంత చల్లార్చింది. చంద్రబాబు, లోకేశ్ బాబులు తమ పాలిటి సల్వెస్టర్ స్టలోన్ను రాజ్యాంగ వ్యవస్థల్లో చూడాలను కోవడం ఒక అమానుషమైన ఆలోచన. ఒక రాజ్యాంగ వ్యవస్థ తానే సర్వాధికారినని, తన పరిధులు దాటి కూడా వ్యవహారం చేయవచ్చనీ భావిస్తే అది చెల్లదని మన దేశ చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. అందుకు మన దేశ రాజ్యాంగం కూడా అంగీకరించదు. ముగ్గురు ఎంపీల సభ్యత్వా లను రద్దుచేస్తూ లోక్‌సభ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసు కోవడానికి ప్రయత్నించిన సుప్రీంకోర్టునే అప్పటి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ధిక్కరించారు. సోమనాథ్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు న్యాయ వాదిగా పనిచేశారు. పదిసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, రాజ్యాంగ నిష్ణాతు నిగా, మేధావిగా వాసికెక్కారు. పార్లమెంట్ వ్యవ హారాల్లో తలదూర్చే బదులు పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టండని సర్వోన్నత న్యాయస్థానానికి సలహా కూడా ఇచ్చారు. రాజ్యాంగంలోని అధికరణం 105 ప్రకారం సభలో సభ్యుడు వేసిన ఓటును ప్రశ్నించే అధికారం ఏ వ్యవస్థకూ లేదు. సభ్యులు తమ ఓటు ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రశ్నించే అధికారం లేదని ఛటర్జీ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర శాసనసభ అక్కడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను జైల్లో పెట్టిన ఉదంతం ఉండనే ఉన్నది. ఏ వ్యక్తయినా, వ్యవస్థయినా పరి ధులు దాటి రెచ్చిపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. పాత్రధారులు మూల్యం చెల్లిస్తారు సరే! మరి సూత్ర ధారుల సంగతి? ఇప్పుడు మాట్లాడవలసింది సూత్రధారుల మనోగతం గురించే. ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచే మన సూత్రధారులు ఏదోరకంగా మళ్లీ గద్దెనెక్కాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఎందుకు కూలదోసే కుట్రలు రచిస్తున్నారు? అమరావతి భూకుంభకోణంమీద విచారణ జరక్కుండా ఎందుకు వ్యూహాలు పన్నుతున్నారు? సమాధుల్లోంచి పిశాచాలను లేపినట్టుగా స్లీపర్ సెల్స్‌ను నిద్రలేపి ఎందుకు అరాచకం సృష్టించాలనుకుంటు న్నారు? యజ్ఞవాటికల మీద రక్తమాంసాలు వెదజల్లే అసురుల మాదిరిగా ప్రజా పాలనకు విఘ్నాలు సృష్టించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఈ అంశాల మీద జరగాలి చర్చ. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
తీరు మారని చైనా
నిరుడు ఏప్రిల్‌లో గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి మన భూభాగంలోకి ప్రవేశించినప్పటినుంచీ చైనా ఎడతెగకుండా లడాయి కొనసాగిస్తోంది. 3,440 కిలోమీటర్ల ఎల్ఓసీ పొడవునా వేర్వేరుచోట్ల వేర్వేరు సందర్భాల్లో ఒక పథకం ప్రకారం తన దళాలతో అతిక్రమ ణలు చేయించటానికి ప్రయత్నించి ఉద్రిక్తతలను పెంచుతోంది. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో నిరుడు జూన్‌లో అకారణంగా మన జవాన్లపై రాళ్లు కర్రలతో దాడిచేసి 20మంది సైనికుల ఉసురుతీసింది. 45 సంవత్సరాల్లో ఎల్ఓసీలో నెత్తురొలకటం అదే ప్రథమం. ఆ తర్వాత అంత క్రితంవరకూ మన సైనికుల నియంత్రణలో వున్న డెస్పాంగ్, హాట్ స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమ ణలకు దిగి అక్కడ మన జవాన్లు గస్తీ తిరగటానికి వీల్లేదంటూ పేచీ పెట్టింది. సైనిక కమాండర్ల స్థాయిలో ఇప్పటికి తొమ్మిదిసార్లు రెండు పక్షాలమధ్యా చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి లేదు. బలగాల మోహరింపు, ఉద్రిక్తతలు పెరగటం వంటివి ఆగలేదు. ఈలోగా కొత్త కొత్త ప్రాంతాల్లో చైనా గాల్వాన్‌లోయ తరహా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సిక్కింలో గతవారం ఇదే పునరావృతమైంది. అక్కడ కూడా చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే మన జవాన్లు అడ్డగించారు. మొత్తమ్మీద మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి, మన జవాన్లను రెచ్చగొట్టి దాడి చేయటమో, మానటమో నిర్ణయించుకోక తప్పని స్థితిలోకి మనల్ని నెడుతోంది. ఎల్ఓసీలో యధా తథ స్థితిని నెలకొల్పాలంటే అక్కడ సైనిక దళాలను మోహరించటం, మన భూభాగాన్ని వెనక్కి తీసుకొనే ప్రయత్నం చేయటం తప్ప మనకు మార్గాంతరంలేని స్థితిని సృష్టించింది. ఇదంతా పద్ధతి ప్రకారం చేస్తోంది. అందుకే గత తొమ్మిది దఫాలుగా చర్చలు విఫలమవుతూ వస్తున్నాయి. చొర బాటు ప్రాంతం నుంచి వెనక్కెళ్లి, యధాతథ స్థితి పునరుద్ధరణకు సహకరించమని మన దేశం కోరటం... కాదు, ఆ ప్రాంతంలో మోహరించిన దళాలను మీరే వెనక్కి తీసుకోమని చైనా చెప్పటం రివాజుగా మారింది. సిక్కింలో తాజాగా జరిగిన తంతు ఆ పరంపరలో భాగమే. సాధారణంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరినప్పుడు రెండు పక్కలా సైన్యాలు మోహరించి తలపడతాయి. ఎదుటివారి భూభాగంలోకి ప్రవేశించి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఎల్ఓసీ పొడవునా పరిమిత ప్రాంతాల్లో అక్కడక్కడ తమ సైన్యంతో చడీచప్పుడూ లేకుండా చొరబాట్లు చేయించి, అక్కడినుంచి కదలకపోవటమనే కొత్త ఎత్తుగడకు చైనా తెరతీసిందని గత ఏడాది అనుభవం చెబుతోంది. అలా ప్రవేశించినచోట శిబిరాలు నిర్మించటం, అక్కడ సైనికుల్ని వుంచటం రివాజైంది. తాను సన్నిహితం చేసుకోవాలనుకుంటున్న నేపాల్ విషయంలోనూ చైనాది ఇదే ఎత్తుగడ. నిరుడు తమ భూభాగంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్న చైనాను ఏం చేయలేక అది నిస్సహాయంగా వుండి పోయింది. మన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్సిరి జిల్లాలో ఒక చిన్న గ్రామాన్నే అది సృష్టించింది. అక్కడ 120 ఆవాసాలతో రెండువేలమంది జనాన్ని పోగేసింది. ఈ క్రమంలో అది ఏ మర్యాదలూ పాటించటం లేదు. అరుణాచల్‌లోని చుశాల్ గ్రామానికి సమీపం లోనే మన భూభాగంలో చైనా సైనికులు శిబిరాలు వేసుకుని, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారని తూర్పు లద్దాఖ్ కౌన్సిలర్ ఒకరు ఇటీవలే చెప్పారు. దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో అమెరికా సైనిక విమానమో, మరొకటో గగనతలంలో కనిపిస్తే రెచ్చిపోయి ప్రకటనలు చేసే చైనా భారత్ విషయంలో మాత్రం చడీచప్పుడూ లేకుండా వుండిపోతుంది. ఎల్ఏసీలో చైనా ఏదో ఒక చేష్టకు పాల్పడినప్పుడల్లా మనవైపు నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆక్రమణదారులకు సరైన గుణపాఠం చెబుతామన్న హెచ్చరికలుంటున్నాయి. కానీ అందులో చైనా ప్రస్తావన వుండదు. చైనా కూడా ఆ హెచ్చరికలు తమనుద్దేశించినవే అన్న అభిప్రాయం ప్రపంచానికి కలగనీయదు. తనను కానట్టు వుండిపోతుంది. దాని చెప్పుచేతల్లో పనిచేసే ‘గ్లోబల్ టైమ్స్’ అనే పత్రిక మాత్రం తననే హెచ్చరించినంతగా బాధపడుతూ భారత్‌కు జవాబిస్తుంటుంది. 1962నాటి భంగపాటు గుర్తులేదా అంటూ ఎత్తిపొడుస్తుంది. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలొస్తుంటాయి. వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలూ జరుగుతుంటాయి. అయితే రెండు పక్షాల్లోనూ చిత్తశుద్ధి వున్నప్పుడే ఎంతో కొంత ఫలితం వుంటుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో అయిదారు నెలలక్రితం ఎలాంటి పరిస్థితి వుందో, ప్రస్తుతం ఎలావుందో చెప్పే ఉపగ్రహ ఛాయాచిత్రాలు సాక్ష్యాధారాలుగా చూపిస్తున్నా చైనా మాత్రం తన మంకుపట్టు మానటం లేదు సరిగదా... కొత్త కొత్త ప్రాంతాల్లో అదే మాదిరి ఎత్తుగడలకు పాల్పడుతోంది. శాంతి కేవలం ఒక పక్షం మాత్రమే కోరుకుంటే ఏర్పడేది కాదు. వివాదంలో భాగస్వాములైన రెండు పక్షాలూ అందుకు సిద్ధపడాలి. చైనా పోకడలు చూస్తుంటే అందుకు సిద్ధపడుతున్న దాఖలా లేదు. వచ్చే జూలైలో చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుగు తున్నాయి. అందుకోసం భారీయెత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం కూడా అందులో తలమునకలై వున్నాయి. తన హయాంలో కమ్యూనిస్టు పార్టీ, చైనా కూడా సమర్థవంతంగా వున్నాయన్న అభిప్రాయం శ్రేణుల్లో కలగజేయటం అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అవసరం కాబట్టే ఆయన దూకుడుగా వున్నట్టు కనబడుతున్నారని ఆసియాలో ఆధిపత్యాన్ని స్థిరపరుచు కుంటున్నామన్న భావన కలగజేయటానికి ప్రయత్నిస్తున్నారని కొందరు నిపుణుల అంచనా. ఆ తర్వాత చైనా వైఖరి సడలే అవకాశం వున్నదని వారి విశ్లేషణ. వాటి సంగతలా వుంచితే చైనా పోకడలను ప్రపంచానికి తెలియజెప్పటానికి, ఇలాంటి ఘర్షణాత్మక పోకడల వల్ల సమస్యలేర్పడతాయని నేరుగా చెప్పటానికి అంతర్జాతీయ వేదికల ద్వారా మన దేశం ప్రయత్నించాలి. -
కవ్వింపు... బెదిరింపు!
రాజ్యాంగబద్ధమైన సంస్థలను స్వార్థ రాజకీయ శక్తులు కబ్జా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తేటతెల్లమైంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఇచ్చిన సూచనను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం కచ్చితంగా కవ్వింపు చర్యేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2018లో జరగవలసిన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను అప్పటి సీఎం చంద్రబాబు అభీష్టం మేరకు జరపకుండా ఎన్నికల కమి షన్ ఏడాదిపాటు కాలయాపన చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధపడినప్పుడు, నామి నేషన్ల ఘట్టం కూడా ముగిసిన తర్వాత ఇంకా రాష్ట్రంలోకి ప్రవే శించని కరోనాను సాకుగా చూపి వాయిదా వేసింది. ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ప్రజాసంక్షేమం దృష్ట్యా కొద్ది కాలం వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను పెడచెవిన పెట్టింది. ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాల వెనుక ఒక రాజకీయ ఎజెండా వుందన్న నిజం ప్రజాస్వామ్యప్రియులకు ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సలహా సంప్రదింపులతో వ్యవహరించాలన్న రాజ్యాంగ నిర్దేశకత్వాన్ని తుంగలో తొక్కి ఎన్నికల కమిష నర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ శనివారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటల్లో ఉద్యోగులపట్ల బెదిరింపు ధోరణి ధ్వనించింది. ఆ తర్వాత మీడియా సందేహాలకు సమాధానం చెప్పకుండానే ఆయన నిష్క్రమించారు. స్థానిక ఎన్నికల వ్యవహారంపై కమిష నర్ మొదటినుంచీ వ్యవహరిస్తున్న తీరుపట్ల జన సామాన్యంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటిని కమిషనర్ దృష్టికి మీడియా తీసుకొనిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం తనకు లేదని ఆ నిష్క్రమణ ద్వారా వెల్లడైంది. తన ఏకపక్ష ప్రసంగంలో స్థానిక ఎన్నికల నిర్వహణ తన రాజ్యాంగ బాధ్యతగా, ప్రజాస్వామ్య కర్తవ్యంగా ఆయన చెప్పుకున్నారు. ఈ అంశంపై మీడియా దగ్గర ప్రశ్నాస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. వాటికి తన దగ్గర సమాధానం లేదని కూడా తెలుసు. అందుకే కాలికి బుద్ధి చెప్పారు. స్థానిక ఎన్నికల కాలపరిమితి 2018లోనే పూర్తయింది. ఆ సంవత్సరం జూన్‌లోనే ఎన్నికలు జరగాలి. కానీ అప్పటి ప్రభుత్వం అందుకు సిద్ధపడలేదు. ఆ తర్వాత ఏడాదిపాటు అదే ప్రభుత్వం అధికారంలో వుంది. ఇదే కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కిమ్మనలేదు. నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. రాజ్యాంగ బాధ్యత అప్పుడెందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. అందుకనే ముందుగానే ‘ఇచ్చట ప్రశ్నించరాదు’ అనే నిబంధన పెట్టుకుని తన ధర్మోప న్యాసం పూర్తికాగానే వడివడిగా వెళ్లిపోయారు. ప్రస్తుత ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధపడింది. మార్చిలో ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. గణనీయమైన సంఖ్యలో ఏకగ్రీవాలు కూడా జరిగాయి. అప్పటికి రాష్ట్రంలో ఇంకా కరోనా ప్రవేశించలేదు.. రోజుకు ఒకటి రెండు కేసులు కూడా నమోదు కావడం లేదు. ఈ దశలో ఉన్నట్టుండి హఠా త్తుగా ఎక్కడినుంచో ఒక సందేశం అందినట్టుగా ఎన్నికల కమిషనర్ మీడియాను పిలిచారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదాకు ముందు ప్రభు త్వాధికారులతో సంప్రదింపులు జరపాలన్న రాజ్యాంగ బాధ్యత ఆ క్షణం ఆయనకు గుర్తుకు రాలేదు. కరోనా భయంతోనే ఎన్ని కలు వాయిదా వేసినప్పుడు ఆ కరోనాపై పోరాడిన ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’కు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమ యంలోనే ఎన్నికలకు వెళ్లడం వైరుధ్యం కాదా? ఇది ద్వంద్వ ప్రవృత్తి కాదా? ఈ ప్రశ్నలకు ఆయన స్క్రిప్టులో సమాధానం లేదు. అందుచేత స్క్రిప్టు మాత్రమే చదివి విలేకరులు అభ్యంతరం చెబుతున్నా వినకుండా చకచకా వెళ్లిపోయారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సగంలో ఉండగా వాయిదా వేసి, ఇప్పుడు వాటి ఊసు లేకుండా పంచాయతీ ఎన్నికలను ప్రారంభించడం వెనుక రహస్యమేమిటో వెల్లడిచేయాలని ప్రశ్నిస్తే చెప్పలేని అసహ్యకరమైన పరిస్థితిని తప్పించుకోవాలని కావచ్చు.. ఆయన దాదాపుగా పరుగుపెట్టినట్టుగా వెళ్లిపోయారు. ‘మీరు మాత్రం విలేకరుల సమావేశానికే మాస్క్ ధరించి వచ్చి, గ్లాస్ షీల్డ్ వెన కాల కూర్చొని సకల జాగ్రత్తలతో స్క్రిప్టు చదివారే... మరి లక్ష లాదిమంది ఉద్యోగులు వారాల తరబడి కోట్లాదిమంది ఓటర్లు పాల్గొనే క్రతువులో ఎలా పాల్గొంటారని’ ప్రశ్నిస్తే ఏమని సమా ధానం చెప్పగలరాయన. అందుకే ఎవరూ ‘ప్రశ్నించగూడని’ మీడియా సమావేశంలో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారతదేశ చరిత్రలో ఏ ఎన్నికల కమిషనర్ కూడా ప్రశ్నలు నిషేధించి మీడియా సమావేశం నిర్వహించిన ఘటన ఒక్కటి కూడా జరగలేదు. ప్రజాస్వామ్యానికి అండగా నిలవ వలసిన ఎన్నికల సంఘమే ప్రజలకున్న తెలుసుకునే హక్కు కాలరాయడం ఏరకంగా సమర్ధనీయమవుతుంది? ఉద్యోగులను బెదిరించే ధోరణిలో కమిషనర్ ప్రసంగం నడి చింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని, మరి కొన్ని రాష్ట్రాల్లో ఈ సంవత్సరం జరగబోతున్నాయనీ, ఆ రాష్ట్రాల ఉద్యోగులకు లేని అభ్యంతరం మీకెందుకని నిమ్మగడ్డ ప్రశ్నిం చారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన మాట వాస్తవమే. ఎన్నికల ఫలితంగా మళ్లీ మా రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభించిందని కేరళ, మహారాష్ట్ర మంత్రులే స్వయంగా ప్రకటించారు. అంత కంటే ముఖ్య విషయం: ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే నాటికి దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాలేదు. వ్యాక్సి నేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌పై పోరాడిన ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’ తొలి రెండు దశ ల్లోనే వ్యాక్సిన్ తీసుకోవలసి వుంటుంది. స్థానిక ఎన్నికల్లో క్రియా శీలక పాత్ర పోషించవలసిన లక్షలాదిమంది ఉద్యోగులు ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ కేటగిరీలోకి వస్తారు. వ్యాక్సిన్‌ను రెండు డోసు లుగా తీసుకోవాలి. ఈ రెండు డోసుల నడుమ నాలుగు వారాల వ్యవధి ఉండాలి. ఈ వ్యవధిలో వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తకుండా ఉండటానికి వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. రెండో డోసు తర్వాత 60 రోజులకు వారిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతాయి. అంటే మొత్తం 3 నెలల షెడ్యూల్ ఈ కార్యక్రమం. ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’గా పనిచేసిన మెజారిటీ ఉద్యోగులు వ్యాక్సినేషన్ షెడ్యూల్ పీరియడ్‌లో ఉండగా ఎన్నికల విధుల్లో వేలాదిమంది జనసందోహంతో ఎలా క్రియాశీలకంగా వ్యవహ రించగలరు?. వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల తేదీలు కూడా ఫ్రంట్‌లైన్ వారియర్స్కిస్తున్న వ్యాక్సిన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాతనే ఉన్నాయనే విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి. కనుక ఇతర రాష్ట్రాల ఉదాహర ణలు చూపెట్టి ఉద్యోగులను బెదిరించడానికి కమిషనర్ చేసిన వాదన చెల్లదు. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న రెండో దశలో యాభయ్యేళ్లు దాటిన వయోధికులందరికీ వ్యాక్సిన్ ఇవ్వ నున్నారు. వీరితోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్న ఇతరులు కూడా వ్యాక్సిన్ తీసుకోవలసి ఉంటుంది. ఈ సెక్షన్స్ మీదనే కరోనా మహమ్మారి ఎక్కువగా తన ప్రతాపాన్ని చూపెట్టింది. వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న జనాభా ఇది. వ్యాక్సిన్ షెడ్యూల్ పూర్తయ్యేవరకు వీళ్లెవరూ ససేమిరా జనసందోహం లోకి వెళ్లరు. వీళ్లెవరూ పోటీ చేయడానికి కానీ, ప్రచారం చేయ డానికి కానీ, ఓటేయడానికి కానీ సాహసించరు. వీళ్లందరి ప్రజా స్వామిక హక్కును హరించే అధికారం మీకెవరిచ్చారు?. ఎన్ని కల కమిషన్ ప్రజాస్వామ్యానికి అండగా ఉన్నట్టా? గుది బండగా మారినట్టా? ఆలోచించవలసిన తరుణమిది. వివిధ రాజ్యాంగ సంస్థల నడుమ ఏర్పడే వివాదాల్లో సాధారణంగా న్యాయస్థానాలు ఎక్కువ జోక్యం చేసుకోకుండా సాంకేతిక అంశాల ఆధారంగా ప్రొసీజర్‌ను ఫాలో అవుతుం టాయి. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా క్రియాశీలకంగా ఉండే తీర్పులను సైతం కొన్ని సందర్భాల్లో ఇస్తుంటాయి. న్యాయ స్థానాల్లో ఇప్పటికీ వర్చువల్ పద్ధతిలోనే విచారణలు జరుగు తున్న వాస్తవికత కూడా దేశంలోని కోవిడ్ పరిస్థితికి అద్దంపడు తున్నది. కేరళలో ఒక దశలో నియంత్రణలోకి వచ్చిన కోవిడ్, స్థానిక ఎన్నికల తర్వాత ఆందోళనకరంగా విస్తరించింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ప్రశంసనీయమైన పనితీరు కనబరి చిన కేరళ ఆరోగ్యమంత్రి శైలజా టీచర్ స్వయంగా ఈ విష యాన్ని ప్రకటించారు. మహారాష్ట్రలోను ఇదే పరిస్థితి ఎదురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి ఇప్పుడు మళ్లీ విజృంభించి రోజుకు నాలుగు వేలమంది చనిపోతున్నారు. క్షేత్రస్థాయి వాస్తవికతను సరిగ్గా అంచనా వేయ గలిగినవారు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన ప్రభుత్వో ద్యోగులు మాత్రమే. ఆ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే అన్ని రకాల సంఘాలు ముక్తకంఠంతో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొ నబోమని చెబుతున్నాయి. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఇప్పటికే ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖే 109 మంది ప్రాణాలను బలిపెట్టింది. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలనూ ఇటువంటి విషాదమే వెన్నాడుతున్నది. అందుకే వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే ఎన్నికల్లో పాల్గొం టామని వారు ఖండితంగా చెబుతున్నారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం వారిస్తున్నా, ఉద్యోగులు హెచ్చరి స్తున్నా, వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలని కేంద్రం ఆదేశాలిస్తున్నా వినకుండా ఎన్నికల కమిషన్ ఇంత మొండిగా ఎందుకు వ్యవహ రిస్తున్నది?. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత సూచనల మేరకే ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నదని రాష్ట్రంలోని అత్య ధిక ప్రజానీకం బలంగా విశ్వసిస్తున్నది. అందుకు స్వయంగా ఆయన వ్యవహార శైలే అవకాశం కల్పించింది. ఢిల్లీలో తన లాబీ యింగ్కోసం స్వయంగా చంద్రబాబే బీజేపీలో ప్రతిష్టించిన ఆయన కోటరీ సభ్యులను హైదరాబాద్‌లోని ఒక సెవెన్‌స్టార్ హోటల్లో రహస్యంగా కలవాల్సిన అవసరం ఎన్నికల కమిషన ర్కు ఏముంటుంది? ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత కూడా ఆయన ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం వలన బాబుతో ఆయన బంధంపై ఉన్న అనుమానాలు బలపడ్డాయి. స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రిపై చౌకబారు ఆరోపణలతో కేంద్ర హోం శాఖకు ఒక లేఖ వెళ్లింది. అందులో వాడిన భాష తెలుగుదేశం నేతల స్థాయికి తగినట్టుగా ఉండడమే కాక, ఆ పార్టీ కార్యా లయం నుంచే ఎంపిక చేసుకున్న మీడియాకు లీకయింది. ఆ లేఖపై ఎన్నికల కమిషనర్ పేరుతో సంతకం వుంది. తానే ఆ లేఖను రాసినట్టు ఆ తర్వాత ఆయన స్వయంగా ప్రకటించు కోవలసి వచ్చింది. ఇక స్థానిక సమరానికి సంబంధించి వేర్వేరు సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఆయనకు తెలుగు దేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని మరింత రూఢీ చేసింది. ఆ పార్టీ అధినేత సూచన ప్రకారమే ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఆయన తహతహలాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీకి ఎందుకంత ఉత్సాహం? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టబోతున్నదా? అటువంటి భ్రమలేమీ ఆ పార్టీకి లేవు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెలతో ఇరవై నెలల కాలం పూర్తవుతుంది. ఇందులో ఎక్కువ కాలాన్ని కరోనా కాటే సింది. అయినప్పటికీ ఆయన పరిపాలనా తీరుకు ప్రజలు హర్షా మోదాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి సంస్థలు జరిపిన అన్ని సర్వేల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వరసగా టాప్ ‘త్రీ’లో వైఎస్ జగన్ స్థానం సంపాదిస్తున్నారు. నిండా రెండేళ్ల పదవీ కాలం కూడా పూర్తికాకుండానే ఒక యువ ముఖ్యమంత్రి సాధిం చిన అసాధారణ ఘనత ఇది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ ఉన్న కేరళను కూడా అధిగమించి ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో నంబర్ వన్‌గా నిలబడింది. ముఖ్యమంత్రికి లభిస్తున్న ఆదరణ, పెరుగుతున్న ఇమేజ్ చంద్ర బాబుకు దుర్భరంగా తయారయ్యాయి. అసూయా రుగ్మత ఆయన్ను దహించివేస్తున్నది. బహుశా నిద్రాహారాలకు కూడా దూరమై ఉంటారు. అందువల్లనే కాబోలు, శ్రీకాకుళం జిల్లాలో కొందరు తెలుగుదేశం నాయకులు నంది విగ్రహాన్ని దొంగిలిం చిన కేసులో చాలా విచిత్రంగా మాట్లాడారు. ‘అయితే తప్పేంటి?’ అనే డైలాగ్ ‘మావాళ్లు బ్రీఫ్డ్ మీ’ స్థాయిలో పాపు లర్ అయింది. ఈ రుగ్మత తగ్గాలంటే జగన్ ప్రభుత్వానికి ఎంతో కొంత చెడ్డపేరు తీసుకురావాలి. అందుకు మార్గమేమిటి?. ఎన్ని కల పేరుతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భ్రష్టుపట్టిస్తే, మళ్లీ కరోనా వ్యాపించి ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట పలచనవుతుందనే ఒక కుత్సిత ఆలోచన. చంద్రబాబు వేసిన ఈ ఎన్నికల ఎత్తు గడకు ఇంతకుమించి మరో కారణం కనిపించడం లేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఒక అపరిపక్వత @ 245
ఔరా... ట్రంపు ఎంతటి చతురుడో కదా! అనుకునేవాళ్లు మన దేశంలో కూడా చాలామందే వున్నారు. ఇండియా గురించి ఎన్ని సంగతులు తెలుసునో రమారమి అన్ని సంగతులూ అమెరికా గురించి కూడా తెలుసునని మనవాళ్లకు ఒక గట్టి నమ్మకం. మన నవయువతరానికి అమెరికాతో ‘సంబంధం’ కుదిరిన తర్వాత, మనం సారెగా పంపించిన పచ్చళ్లు, పలావులు అమెరికా వాళ్లు చప్పరించిన తర్వాత రెండు దేశాల మధ్య బంధం బాగానే బలపడింది. పైగా అగ్రరాజ్యం కూడా కావడంతో అక్కడి పరిణా మాలపై వాళ్లకు ఉండేటంత ఆసక్తి మనవాళ్లక్కూడా ఏర్పడింది. అందుకే ఇక్కడా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ట్రంపు అను కూలం, ట్రంపు వ్యతిరేకం. భారతీయులకు ఏటా యిచ్చే హెచ్1బీ వీసాలను ట్రంపు కత్తిరించడం మనవాళ్లకు నచ్చలేదు. చదువు పూర్తయిన వారు ఖాళీగా అక్కడ ఉండటానికి వీల్లేదు వెళ్లిపోవాలనడం కూడా నచ్చలేదు. అమెరికా ఫస్ట్ అనడం అస్సలు నచ్చలేదు. అమెరికన్లదే అమెరికా అంటాడేమిటి? అమెరికా మన పిల్లలది కూడా కదా అనే ధర్మసందేహం మన పేరెంట్స్ అసోసియేషన్ బుర్రల్ని బాగానే తొలిచింది. ఇన్ని నెగెటివ్ పాయింట్లు ఉన్నప్పటికీ, నెగెటివిజం ఈ యుగధర్మంగా భావించేవాళ్లు ఉన్నారు కనుక ట్రంపులోని తెంపరితనం మనవాళ్లలో కొందరికి బాగానే నచ్చింది. కాల మహిమ కారణంగా ‘రామా ఈజ్ గుడ్‌బాయ్’ కంటే ‘రావణా ది డిక్టేటర్’కు ఎక్కువ లైకులు వచ్చే రోజులివి. అందువలన ట్రంపు ఏం చేసినా మెచ్చే సెక్షన్ ఒకటి ఏర్పడిపోయింది. పైగా, మన సారథి–మన సచివుడు–మన వియ్యము–మన సూపర్ స్టార్– మన రాంబో అయినటువంటి నరేంద్ర మోదీకి ప్రియ మిత్రుడు కావడం వలన కూడా మనలో కొందరికి ట్రంపంటే వల్లమాలిన అభిమానం. కనులతో చూసి, చెవులతో విని, నాసికతో ఆఘ్రాణించి మనం అమెరికా పట్ల కొన్ని అభిప్రా యాలను ఏర్పాటు చేసుకున్నాము. పత్రికలు, టెలివిజన్లు, సోషల్ మీడియా–మనవాళ్ల చాట్స్ అండ్ కాల్స్ వగైరాలే మన కళ్లూ, చెవులూ, నాసికలు. ఈ రకమైన ఇంద్రియ జ్ఞానంతో సముపార్జించిన సమాచారం స్థూలంగా ఇలా ఉంటుంది : డొనాల్డ్ ట్రంప్ అనే సంపన్న వ్యాపారవేత్త 2016లో రిప బ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి అనూహ్యంగా గెలుపొందాడు. ఈయన గెలుపుకోసం రష్యావాళ్లు ఒక భారీ సోషల్ మీడియా కర్మాగారాన్ని స్థాపించి అమెరికా ఓటర్లను ప్రభావితం చేశారన్న అపవాదు కూడా ఉన్నది. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు సజావుగా సాగకుండా ట్రంప్ మోకాలడ్డుతున్నారు. అమెరికా ఫస్ట్ నినాదా నికి అనుగుణంగా మెక్సికన్ల వలసలను నిరోధించడానికి అక్కడో మహాకుడ్యం నిర్మాణాన్ని ప్రారంభించాడు. అమెరికా వాళ్లకే ఎక్కువ ఉద్యోగాలు లభించడం కోసం విదేశీయులకు ఇచ్చే వీసా లను తగ్గించాడు. ఇలా చేస్తే తమకు చౌకగా పనిచేసే సిబ్బంది లభించదని ఐటీ కంపెనీలు గగ్గోలు పెట్టినా వినలేదు. ఇరాన్‌పై ఆంక్షలు విధించి పశ్చిమాసియాలో కుంపట్లు రాజేశాడు. అఫ్గాని స్తాన్‌లో తాలిబన్లకు పాలుపోసి ఉపఖండంలో భారత్‌కు సరి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాడు. ఒక్క చైనా దూకుడు వ్యవహా రంలో మాత్రం భారత్‌కు బాసటగా నిలబడ్డాడు. ఇందులో భారత్‌పై ప్రేమకన్నా తన ఆధిపత్యానికి ముంచుకొస్తున్న ముప్పుపై బెంగే ఎక్కువ. తన అగ్రరాజ్య హోదాను చైనా సవాల్ చేస్తున్నదని అమెరికా భావిస్తున్నది. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రస్తావించే థుసిడైడ్ థియరీ ప్రకారం ఇటువంటి సందర్భాల్లో సదరు రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యం. ఆ పరిస్థితి ఏర్పడినట్లయితే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చెలరేగకుండా చైనాను నిరోధించడం కోసం భారత్–ఆస్ట్రేలియా–జపాన్ల మధ్య అప్పటికే ఉన్న అవగాహనను మరింత పటిష్టం చేశాడు. దేశంలో ఆరోగ్య బీమా సౌకర్యానికి నోచుకోని వారికోసం ప్రెసి డెంట్ ఒబామా తీసుకొచ్చిన ఒబామా కేర్ చట్టాన్ని అటకెక్కించే ప్రయత్నం చేశాడు. తన ప్రత్యర్థి కాబోతున్న జోబైడెన్‌పై అక్రమ కేసులు పెట్టాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చాడు. తన నాలుగేళ్ల కాలంలో దేశంలో శ్వేత దురహంకారాన్ని రెచ్చగొట్టాడు. ఆఫ్రో –అమెరికన్లపై దాడులు పెరిగాయి. చివరికి ఎన్నికల్లో ఓడిపో యినా, తానే గెలిచినట్టు దబాయించాడు. రీకౌంటింగ్‌లో తనకే ఎక్కువ ఓట్లు వచ్చినట్టు ప్రకటించాలని జార్జియా ఎన్నికల అధికారులను బెదిరించాడు. ఫలితాలు ప్రకటించినా ఓటమిని అంగీకరించలేదు. జోబైడెన్ ఎన్నికను లాంఛనంగా నిర్ధారించ డంకోసం కాంగ్రెస్ సభ్యులు సమావేశమైన క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడికి తన అనుయాయులను పురికొల్పాడు. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌లో అభిశంసనను ఎదుర్కొంటున్నాడు. తన పదవీ కాలంలో రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న ఏకైక అధ్యక్షు నిగా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. గడిచిన మూడు దశా బ్దాల కాలంలో జార్జి బుష్ సీనియర్ తర్వాత రెండోసారి ఎన్నిక కాలేక చేతులెత్తేసిన వాడిగా చరిత్రకెక్కాడు. అభిశంసనను ఇప్పటికే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. పదిమంది రిపబ్లికన్లు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. మంగళ వారంనాడు సెనేట్‌లో ఓటింగ్ జరుగుతుంది. అక్కడా ఆమోదం పొందితే తన పదవీకాలం ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు గెంటివేయించుకున్న వాడిగా రికార్డుల కెక్కుతాడు. ఇదీ జరిగిన కథ. అమెరికా : అంతస్సారం ప్రజాస్వామ్య వ్యవస్థలకు పుట్టినిల్లు అమెరికా. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన వెలువడి ఇప్పటికి 245 సంవత్సరాలు. మరో ఐదేళ్లకు రెండున్నర శతాబ్దాల ఉత్సవాలు జరుగను న్నాయి. ‘‘సృష్టిలో మనుషులందరూ సమానమే, ప్రతి మనిషికీ స్వేచ్ఛగా, సుఖసంతోషాలతో జీవించే హక్కు ఉంద’ని స్వాతంత్య్ర ప్రకటన వక్కాణించింది. ఈ ప్రకటన ప్రపంచాన్ని ఉత్తేజపరిచింది. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలు ప్రతిధ్వనించిన ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తినిచ్చింది. కృతజ్ఞతగా వందేళ్ల తర్వాత అమెరికాకు స్వేచ్ఛా ప్రతిమను ఫ్రాన్స్ బహూకరించింది. కానీ, ఆచరణలో అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ‘తెల్లవారందరూ’ సమానమే అనే సంకుచి తార్ధంగా క్రమేణా పరిణమించింది. బానిస వ్యవస్థ అంతం కావడానికి ఎన్ని వేల బలిదానాలు అవసరమయ్యాయో లెక్కించే పనిని చరిత్ర సక్రమంగా చేయలేదు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా మరెన్నో వేల ప్రాణాలను బలిపెట్టవలసి వచ్చింది. చివరికి ఈ శతాబ్ది ఆరంభంలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో అమెరికా ప్రజాస్వామ్యం పరిణతి చెందిం దన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. ట్రంప్ జమానా ప్రారంభమైన తర్వాత అటువంటి భ్రమ పటాపంచలైంది. జాతి దురహంకారంతో బుసలుకొడుతున్నవారు శ్వేతజాతీయుల్లో ఇంకా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారన్న సత్యం బోధప డింది. వారు కేవలం జాతి దురహంకారులే కాదు, పురుషా హంకారులు కూడా. శ్వేతజాతి స్త్రీల హక్కులను కూడా ఈ బృందం సహించదు. ‘ప్రౌడ్ బాయ్స్’ వంటి పేర్లతో వెలసిన శ్వేతనాగుల సంఘాలే ఇందుకు నిదర్శనం. ట్రంప్ అధికారం లోకి రావడంతో ఈ దురహంకార గుంపులు చెలరేగిపోయాయి. ఒక ఖండిత రాజ్యంగా, విభజిత సమాజంగా అమెరికా సాక్షాత్క రించింది. జాతి వివక్షను మించి ‘కులవివక్ష’ అమెరికాలో అమలవుతున్నదని ఇసాబెల్ విల్కిన్సన్ తన caste’ పుస్తకంలో నిరూపించింది. తెల్లవాళ్లకే ప్రాధాన్యం అనేది ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ నినాదం వెనుక అసలు రహస్యమని అచిరకాలం లోనే ప్రజలకు అర్థమైంది. యూరప్ నుంచి బతుకుదెరువుకోసం వచ్చిన తమ తాతముత్తాతలు స్థానికులైన రెడ్ ఇండియన్లను ఊచకోత కోసి వారి స్థావరాలను ఆక్రమించారన్న సత్యాన్ని ఈ దురహంకారులు విస్మరించారు. ఆఫ్రికా ఖండం నుంచి వేల సంఖ్యలో పడవల మీద తరలించుకొని వచ్చిన నల్లజాతి ప్రజ లను బానిసలుగా మార్చి వారి శ్రమశక్తిని ఇంధనంగా వాడి సంపన్నులమైపోయామన్న యదార్ధాన్ని కూడా వీరు మరుగు పరుస్తున్నారు. తమ దేశం తెల్లవాళ్ల సొంత జాగీరు అనే పూనకం ఈ ముఠాలను ఊపేస్తున్నది. వారు ట్రంప్‌లో తమ దైవాన్ని చూసుకుంటున్నారు. డెవిల్ డ్రాగన్‌తో పోరాడుతున్న సెయింట్ జార్జి వారికి ట్రంప్‌లో కనబడుతున్నాడు. క్యూఏనాన్ (QA non) పేరుతో ఒక కుట్ర సిద్ధాంతం విపరీతంగా ప్రచారంలో పెట్టారు. సైతాన్ శిష్యులు ప్రపంచంలో ఆధిపత్యం చేస్తున్నారని, వారిని ఓడించే వీరుడు ట్రంప్ మాత్రమేనని క్యూఏనాన్ సిద్ధాంత తాత్పర్యం. ఈ సిద్ధాంతపు విషప్రచారం ఫలితంగానే ఆఫ్రో అమెరికన్లపై దాడులు పెరిగాయి. ట్రంప్ ఒక్క పిలుపుతో వేలాది మంది ఉన్మాదులు తుపాకులూ, మారణాయుధాలతో కేపిటల్ భవనంపై దాడికి దిగారు. ఈ ఘటన జర్మన్ పార్లమెంట్ భవనం రైక్స్టాగ్ (Reichstag) అగ్నిప్రమాదం సన్నివేశాన్ని గుర్తు చేసింది. ఈ సంఘటనను ఉపయోగించుకునే నాజీ హిట్లర్ జర్మన్ నియంతగా బాటలు వేసుకున్నాడు. కేపిటల్‌పై దాడి వెనుక కూడా అటువంటి వ్యూహమేదో ఉండవచ్చునని పలు వురు భావించారు. అదృష్టవశాత్తు అది విఫలమైంది. బహుశా రేపు ట్రంప్ మీద పెట్టిన అభిశంసన తీర్మానం కూడా సెనేట్‌లో నెగ్గవచ్చునేమో. కానీ, అమెరికా సమాజంలో ఏర్పడిన విభజ నకూ, వీధుల్లో ఊరేగుతున్న ఉన్మాదానికీ ముగింపు ఎప్పుడు? అమెరికా : ఒక సందేశం రాజ్యం (State) అనేది పుట్టిన తర్వాత అనేక రూపాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాచరికాన్ని, మూకస్వామ్యాన్ని, నియంతృత్వాన్ని, కార్మికవర్గ లేదా పార్టీ నియంతృత్వాన్ని, మిలటరీ పాలననూ మానవజాతి చూసింది. ఈ అన్నిరకాల ప్రభుత్వాల్లోకల్లా శ్రేష్టమైనది ప్రజాస్వామ్యమేనని మేధావుల అభిప్రాయం. కానీ, రెండొందల యాభై ఏళ్లు గడిచినా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిణతి రాలేదని, అనేక రకాలుగా ఇంకా వివక్ష కొనసాగుతున్నదని ఇటీవల పరిణామాలు చాటి చెబుతున్నాయి. వివక్షలు పోవాలంటే, వర్ణం, వర్గం ప్రాతిపది కన ఈసడింపు ధోరణి సమసిపోవాలంటే అణగారిన పీడితవర్గా లన్నీ అత్యున్నతస్థాయి అభివృద్ధిని అందుకోవడమే ఏకైక మార్గం. అప్పుడే ఈ వర్గాల ప్రజలు సమాన గౌరవాన్ని పొంద గలుగుతారు. పేదరికంతో వెనుకబడిపోయిన ఆఫ్రో అమెరిక న్లను వెలివాడల (ghettos)కు పరిమితం చేయకుండా అభివృ ద్ధిలో మిళితం చేసి ఉన్నట్లయితే శ్వేతనాగులు ఇప్పుడిలా బుసలు కొట్టగలిగి ఉండేవి కావు. ప్రజాస్వామ్య పరిణతికి పీడిత తాడిత వర్గాల అభ్యున్నతి ఒక ప్రధాన షరతు. ఈ షరతును నెరవేర్చకపోతే మన ప్రజాస్వామ్యాలు ఏనాటికైనా మూకస్వా మ్యాలుగానో, నియంతృత్వ రాజ్యాలుగానో పతనమయ్యే ప్రమాదం మన తలపై వేలాడుతూనే ఉంటుంది. అమెరికా పరిణామాలు నేర్పుతున్న పాఠం అదే. vardhelli1959@gmail.com -
పౌర స్వేచ్ఛకు పట్టం
యుక్త వయసొచ్చిన జంట కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదంటూ బుధవారం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ద్వారా పౌర స్వేచ్ఛకు మరోసారి ఉన్నత న్యాయస్థానం పట్టం కట్టింది. ప్రత్యేక వివాహ చట్టంలోని 30 రోజుల నోటీసు గడువు నిబంధన తప్పనిసరి కాదని, ఐచ్ఛికం మాత్రమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమకిచ్చే నోటీసును ప్రచురించటం అవసరమో కాదో ఆ జంట తెలిపితే దాని ప్రకారం వ్యవహరించాలని వివరించింది. నోటీసు బహిరంగపరచటం వల్ల పెళ్లాడే జంట విష యంలో అన్యుల జోక్యం ఎక్కువైందని ధర్మాసనం భావించింది. మన దేశంలో వివిధ మతాలవారికి వేర్వేరు వివాహ చట్టాలున్నాయి. అయితే కుల, మతాల్లో విశ్వాసం లేనివారికీ లేదా వేర్వేరు మతా లకు చెందిన జంటలకు, తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లాడదల్చుకున్నవారికి వర్తించే విధంగా 1954లో ప్రత్యేక వివాహ చట్టం అమల్లోకొచ్చింది. ద్రవిడ ఉద్యమం జోరుగా వున్న సమ యంలో వివాహ సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు పాటించకుండా బహిరంగ వేదికలపై కేవలం దండలు మార్చుకుని అనేక జంటలు ఒక్కటయ్యాయి. అలాంటి దంపతుల మధ్య కాలం గడిచాక విభేదాలు రావటం, మహిళ జీవితం అనిశ్చితిలో పడటం పర్యవసానంగా ఇలాంటి చట్టం వుండటం అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే ప్రత్యేక వివాహ చట్టం నిస్సహాయులైన మహిళలకు తోడ్పడినా, దానివల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. పెళ్లాడదల్చుకున్నవారు దర ఖాస్తు ఇచ్చాక వివాహ నమోదు అధికారి 30 రోజుల నోటీసు ఇవ్వాలని, ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే వివాహాన్ని నమోదు చేసుకుని జంటకు ధ్రువీకరణ పత్రం అందజేయాలని ఆ నిబంధన నిర్దేశిస్తోంది. ఆచరణలో ఇది అనేక సమస్యల్ని సృష్టిస్తోంది. అంతవరకూ తమ తమ తల్లిదండ్రుల వద్ద వుండే జంట సహజంగానే నోటీసు పంప టానికి ఆ చిరునామాలు ఇవ్వాల్సివుంటుంది. దాని కాపీ నోటీసు బోర్డులో కూడా పెడతారు. ఇంటి కొచ్చే నోటీసును తల్లిదండ్రుల కంటబడకుండా చేయటం సాధ్యమవుతున్నా, రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద ప్రదర్శించే నోటీసుతో జంటకు తిప్పలొచ్చిపడుతున్నాయి. ఛాందసవాదులు ఆ నోటీసుల్లో వున్న చిరునామాలు చూసి నేరుగా అక్కడికి పోయి సమాచారం ఇవ్వటం లేదా ఫోన్ చేసి చెప్పటం రివాజ వుతోంది. దాంతో ఇరు కుటుంబాలవారూ యువతీయువకుల్ని నిర్బంధంలో వుంచుతున్నారు. ఛాందసవాదుల వేధింపులు సరేసరి. పైగా నిబంధన ప్రకారం పెళ్లికి ముగ్గురు సాక్షులుండాలి. వివా హంపై 30 రోజుల్లో అభ్యంతరాలు వ్యక్తమైన పక్షంలో వారొచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. దీంతో సాక్షు లుగా వుండటానికి అనేకులు సంశయిస్తారు. హైకోర్టు తీర్పు పర్యవసానంగా నోటీసు నిబంధన తమకు సమ్మతం కాదని తెలియజేస్తే వివాహ నమోదు అధికారి ఇతరత్రా గుర్తింపు పత్రాల ఆధా రంగా వారి వివాహాన్ని నమోదు చేయాల్సివుంటుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో విలువైనది. నిరుడు నవంబర్ 24న ఇదే కోర్టు యుక్తవయసొచ్చినవారికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వుంటుందని, అందులో జోక్యం చేసుకోవటం రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించటమే నని స్పష్టం చేసింది. సరిగ్గా అదే రోజు ‘పెళ్లి కోసం మతం మార్చుకోవటాన్ని’ నిరోధిస్తూ యూపీ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకొచ్చింది. భిన్న మతాలకు చెందిన జంటలో ఎవరో ఒకరు అవతలివారి మతానికి మారుతున్నట్టు ప్రకటించటం, అందుకు అనుగుణంగా తమ పేరు మార్చుకోవటం రివాజు అవుతున్నందున ఆర్డినెన్సు అవసరమైందని ప్రభుత్వం తెలిపింది. మతాంతర వివాహాలను నిరో ధించే ఉద్దేశంతోనే దాన్ని తీసుకొచ్చారని స్పష్టమవుతూనే వుంది. ఇప్పుడు ప్రత్యేక వివాహ చట్టం విషయంలో ఇచ్చిన తీర్పు ప్రేమికుల జంటకుండే రాజ్యాంగపరమైన హక్కును మరోసారి తేటతెల్లం చేసింది. ఆర్డినెన్సు వచ్చాక యూపీలో మతాంతర వివాహం చేసుకునే జంటలకు వేధింపులు ఎక్కు వయ్యాయి. మూడేళ్లక్రితం పెళ్లి చేసుకున్న జంటలను సైతం పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆర్డినెన్సు ప్రకారం నేరం రుజువైతే పదేళ్లవరకూ జైలు శిక్ష పడుతుంది. వాస్తవానికి మతాంతర, కులాంతర వివాహాలు చేసుకునే జంటలు మన దేశంలో చాలా స్వల్పం. ఆ కొద్దిమందికీ కూడా ప్రత్యేక వివాహ చట్టం నిబంధనలు అవరోధంగా వున్నాయని, వాటి కార ణంగా ఆ జంటలు వేధింపులు ఎదుర్కొనవలసి వస్తున్నదని 2012లో లా కమిషన్ నివేదిక తెలి పింది. వివాహంతో ఒక్కటవుదామనుకునే వారిపై ఎటూ కుటుంబాల ఒత్తిడి వుంటుంది. తల్లిదండ్రుల్లో అత్యధికులు తాము ఎంపిక చేసినవారినే పిల్లలు జీవిత భాగస్వాములుగా అంగీకరించాలని ఆశిస్తారు. అందుకు అంగీకరించని పిల్లలపై వారి ఆగ్రహావేశాలూ సర్వసాధారణమే. కానీ బల వంతంగా తాము అనుకున్నవారితో పెళ్లి జరిపించటానికి ప్రయత్నించటం... కక్షలకు పోయి హతమార్చేందుకు వెనకాడకపోవటం ఇటీవల పెరిగింది. పిల్లల చర్యతో తమ పరువు పోయిందని ఆ తల్లిదండ్రులు భావించటమే కారణం. ఇది ఆందోళక కలిగించే ధోరణి. ఇది చాలదన్నట్టు అందులో తలదూర్చాలని యూపీ సర్కారుతోపాటు మరికొన్ని బీజేపీ ప్రభుత్వాలు నిర్ణయించటం దారుణం. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆర్డినెన్సులపై ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో యుక్తవయసొచ్చిన జంట వివాహ నిర్ణయంలో రాజ్యం లేదా రాజ్యేతర శక్తుల జోక్యం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వటం మెచ్చదగ్గది. రెండేళ్లక్రితం కేరళకు చెందిన హదియా కేసులో సుప్రీంకోర్టు సైతం ఇటువంటి తీర్పే ఇచ్చింది. ఒక అంశంలో న్యాయస్థానాలు పదే పదే íß తబోధ చేయాల్సిరావటం, బాధ్యతగల ప్రభుత్వాలే వాటిని పెడచెవిన పెడుతుండటం విచారకరం. -
పండుగ అందరిదీ కావాలి
ఒకరూ ఇద్దరూ కాదు... ఎటుచూసినా బాధాసర్పదష్టులే కనిపిస్తున్నప్పుడు, జీవితంపై ఒక రకమైన అనిశ్చితి అలుముకున్నప్పుడు, చుట్టూ చీకట్లు ఆవరించినప్పుడు సమష్టిలో సేద తీరాలనుకోవటం మనిషి లక్షణం. అందుకు పండుగను మించిన శుభ సందర్భం మరేముంటుంది? అందునా సంక్రాంతి తెలుగింట పెద్ద పండుగ. పట్టణమంతా పల్లెకు తరలే సందర్భం. సరిగ్గా పంటలు చేతికందే సమయం కనుక ఇతర పండుగల కన్నా ఎప్పుడూ ఇది రెట్టింపు కాంతులీనుతుంది. పల్లె పల్లెనా పంటల పరిమళాలు, ప్రతి ముంగిటా రంగవల్లుల సొబగులు, వాటిల్లో గొబ్బెమ్మలు, తెల్లార కుండా రంగురంగుల వస్త్రధారణతో ముస్తాబై సూర్యుడితోపాటే అందరినీ పలకరించటానికొచ్చే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు అందరినీ సమ్మోహనపరుస్తాయి. ఇంట్లో అమ్మ చేసే పిండివంటలు, నాన్న కొనిపెట్టిన కొత్త బట్టలు, దూరప్రాంతాలనుంచి తరలివచ్చే బంధుగణం పిల్లలకు ప్రీతిపాత్రమైతే...ఈ పెద్ద పండుగనాడు రకరకాల దానాలతో తరించాలని పెద్దలు భావి స్తుంటారు. మకరరాశిలో వుండే శ్రవణ నక్షత్రానికి శని అధిపతి గనుక అతణ్ణి శాంతింపజేయడానికి నువ్వులు దానమిస్తారు. ధనుర్మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి క్రమేపీ ఉత్తరాభిముఖుడై కదులుతూ కర్కాటక రాశికి చేరతాడు. ఈ ఆరునెలలకాలాన్ని ఉత్తరాయణమంటారు. ఈ ఆర్నెల్లూ దేవతలకు పగలు కనుక ఆ సమయంలో వారు మేల్కొనివుండి కోర్కెలు నెరవేరుస్తారన్న విశ్వాసం సనాతన సంప్రదాయం పాటించేవారికుంటుంది. అందుకే దీన్ని దేవయానం అని, పుణ్యకాలమని కూడా అంటారు. భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్య ఘడియల కోసమే అంపశయ్యపై వేచి చూశాడు. దక్షిణాయనం పితృదేవతలు సంచరించే కాలం. ఇది నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ నింపు తుందని... సంక్రాంతితో ఈ పితృయానం ముగిసి వారు తమ తమ స్థానాలకు వెళ్తారని భావిస్తారు. అందుకే వారినుద్దేశించి కృతజ్ఞతాపూర్వక తర్పణాలు వదులుతారు. అందుకే ఇది ‘పెద్దల పండుగ’ కూడా. సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణంలో సూర్యుడు తేజోమయమూర్తిగా రూపుదిద్దుకోవ టంతో ప్రకృతి ఉత్సాహం, ఉల్లాసం నింపుకుంటుందంటారు. తమ సంపదకూ, సుఖసంతోషాలకూ కారణమైన భూమికి, తోటి రైతులకూ, పాలేర్లకూ, కూలీలకూ, పశుపక్ష్యాదులకూ రైతులు కృతజ్ఞ తలు చెప్పుకునేదీ ఈ సంక్రాంతినాడే. ఇంకా నింగితో సయ్యాటలాడే గాలిపటాల సందడి, కోడి పందేలు, ఎడ్ల పరుగుల పోటీ, గొర్రెపొటేళ్ల పోటీలు... అన్నిటికీ సంక్రాంతే సందర్భం. ఇతర పండగ లన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకుంటే, సంక్రాంతిని సూర్యగమనం ఆధారంగా జరుపుకోవటం మరో విశిష్టత. మానవాళికి స్థిర వ్యవసాయం అలవాటైన కాలం నుంచే సూర్యుణ్ణి ఆరాధించే సంప్రదాయం అన్నిచోట్లా అలవడింది. ఇది ఇప్పటి అర్థంలో ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితమైనది కాదు... భూగోళం నలుచెరగులా విస్తరించిన అఖండ విశ్వాసమే. సూర్యుణ్ణి జగత్సాక్షిగా, కర్మసాక్షిగా భావిం చటం అన్నిచోట్లా మనిషికి పరంపరగా వస్తున్న సంప్రదాయం. ఈ జగత్తుకంతటికీ ఆదిత్యుడే మూల కారకుడని ఆదిత్యహృదయం అంటుంది. భూమ్మీద వుండే సమస్త జీవజాలం, భూ లోపలి పొరల్లో లభ్యమయ్యే రకరకాల ఖనిజాలు, ఇంధనాలు... అన్నీ సూర్యుడులో సంభవించే వివిధ మార్పుల పర్యవసానంగా ఏర్పడినవే. సూర్యుడి గమనంలో ఏర్పడే మార్పులు వేడిమిని, శీతగాలుల్ని, వర్షపా తాన్ని నిర్ణయిస్తాయి. అందువల్లే పర్షియన్లు, గ్రీకులు, యూరొపియన్లు, ఈజిప్షియన్లు, మెక్సికన్లు కూడా సూర్యారాధన చేసేవారు. వారూ తొలి పంటను సూర్యుడికి నివేదించేవారు. అన్ని ఖండాల్లోని ప్రాచీన సమాజాల్లోనూ ఇప్పుడు మనం జరుపుకునే సంక్రాంతి తరహాలోనే రకరకాల వేడుకలతో పండగ జరిపేవారు. గాలి పటాలను ఎగరేయటమూ ఇంతే. సూర్యుడి సుముఖానికి వెళ్లి ప్రణమి ల్లడానికి ఇదొక ప్రతీక. ఇవన్నీ మానవాళిలో వుండే విశ్వాసాల అఖండతనూ, వారి మధ్య సాంస్కృ తిక సారూప్యతనూ వెల్లడిస్తాయి. ఉగ్రరూపంతో విరుచుకుపడిన కరోనా మహమ్మారితో భూగోళమంతా ఏడాదికాలంగా తలపడుతోంది. ఈ పోరు ముగిసిట్టేనా లేక ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదముందా అనేది తేల డానికింకా సమయం పడుతుంది. ఉన్న కొలువులు పోయినవారూ, కొలువులున్నా వేతనాల కోతతో విలవిల్లాడేవారూ, తమ బంధువులో, మిత్రులో కరోనా కాటుతో కనుమరుగయ్యారన్న వేదనతో విషాదంలో మునిగినవారూ, వ్యాపారాలు సజావుగా నడవని వారూ, అనుకున్నవన్నీ తలకిందు లయ్యాయని బాధపడేవారూ... ఇలా ఎటుచూసినా ఈ కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యమైనా, పడుతూ లేస్తూ సాగే బడుగు దేశమైనా కాస్త హెచ్చుతగ్గులతో ప్రపంచ పౌరుల బాధలన్నీ ఒక్కటే. ప్రకృతి పగబట్టి కరువు విలయతాండవం చేయటమో, అకాలవర్షాలు ముంచెత్తి పంట నష్టానికి దారితీయడమో రివాజుగా సాగుతోంది. దానికితోడు ప్రభు త్వాల విధానాలతో విత్తనాలు మొదలుకొని పురుగుమందుల వరకూ అన్నిటి ధరలూ ఆకాశాన్నంటి వ్యవసాయం భారమవుతోంది. ఇవన్నీ రైతులను అప్పుల ఊబిలోకి దించుతున్నాయి. కొత్తగా వచ్చిన సాగు చట్టాల వల్ల తమకు మరింత ముప్పు ముంచుకురాబోతున్నదని శంకించిన వేలాది మంది రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో రెండు నెలలుగా బైఠాయించారు. ఆ చట్టాల రద్దు తప్ప తమకేదీ సమ్మతం కాదంటున్నారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా చూస్తే ఒక విధమైన నిరాశానిస్పృ హలే వ్యాపించాయి. బతుకుబండి మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందోనన్న ఆందోళన అందరిలోనూ వుంది. ఇలాంటి సమయంలో ఒక పలకరింపు, ఒక ఓదార్పు సాంత్వననిస్తాయి. అందరిలోనూ మనం ఒంటరికామన్న భరోసానిస్తాయి. సంక్రాంతి వంటి పెద్ద పండుగ ఇందుకొక సందర్భం కావాలని, అందరిలోనూ కొత్త ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ నింపాలని మనసారా కోరుకుందాం. -
దారికొచ్చిన సౌదీ
మూడున్నరేళ్లుగా ఎడమొహం, పెడమొహంగా వున్న సౌదీ అరేబియా, ఖతార్‌లు చేయి కలిపాయి. గత కొన్నాళ్లుగా సాగుతున్న కువైట్ రాయబారాలు ఫలించాయి. దాంతో ఈ నెల 5న జరిగిన గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) శిఖరాగ్ర సమావేశానికి ఖతార్ హాజరైంది. సౌదీ మాటతో యూఏఈ, ఈజిప్టు, బహ్రైన్‌లు సైతం ఆ దేశాన్ని అక్కున చేర్చుకున్నాయి. ఖతార్ పాలకుడు తమిమ్ అల్ థానీకి జీసీసీలో ఘనస్వాగతం లభించింది. అమెరికాలో జరిగే పరిణామాలు గల్ఫ్ పాలకులనూ, అక్కడి విధానాలనూ... ముఖ్యంగా పశ్చిమాసియా తీరుతెన్నులనూ ఎంతగా నిర్దేశిస్తాయో తెలియడానికి ఈ వివాదం పుట్టి గిట్టిన తీరే ఉదాహరణ. జీసీసీ తనపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఖతార్ పెద్దగా ఇబ్బందులు పడకుండానే అధిగమించగలిగింది. సౌదీ, ఖతార్‌ల మధ్య చిచ్చు రగలడానికి మూల కారణం చాలా చిన్నది. ఖతర్ పాలకుడు తమిమ్ బిన్ హమద్ అల్ థానీ ఇరాన్‌ను ప్రశంసించినట్టు, ఆ దేశంపై అమెరికా చర్యలు సరికాదని అన్నట్టు ఖతార్ అధికారిక వార్తా సంస్థ వెబ్సైట్లో వచ్చిన వార్తే దానికి మూలం. ఇరాన్‌తో లడాయి వున్న సౌదీకి ఈ వార్త ఆగ్రహం తెప్పించింది. గల్ఫ్‌లో సాగుతున్న తన ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఖతార్ తీరు వున్నదని, పైగా తన బద్ధ శత్రువు ఇరాన్‌కు అది వంతపాడుతున్నదని అది కత్తులు నూరింది. వాస్తవానికి తమ వెబ్‌సైట్‌ను ఎవరో ఆకతాయిలు హ్యాక్ చేసి, దాన్ని సృష్టించారని ఆ వార్తా సంస్థ సంజాయిషీ ఇచ్చింది. తమిమ్ కూడా ఖండించారు. కానీ సౌదీ చల్లారలేదు. ఇదే అదునుగా ఖతార్‌పై చర్యలకు సిద్ధపడింది. వాస్తవానికి ఇది సాకు మాత్రమే. గల్ఫ్ దేశాల్లో ఇరాన్‌తో సాన్నిహిత్యం నెరపుతున్న ఖతార్‌పై చర్య తీసుకుంటే అది అమెరికాకు సంతోషం కలిగిస్తుందని, ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవటానికి తోడ్పాటునందిస్తుందని సౌదీ భావించింది. ఖతార్‌పై ఈ చర్య తీసుకోవటానికి నెలరోజుల ముందు ట్రంప్ సౌదీ అరేబియా పర్యటించారు. ఉగ్రవాదంపై సమష్టి పోరు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా తన వెనక దృఢంగా నిలబడుతుందని సౌదీ అంచనా వేసింది. అయితే ఆ లెక్కలు తప్పాయి. ఎందుకంటే ఖతార్‌తోనూ అమెరికాకు మంచి సంబంధాలే వున్నాయి. పైగా ఖతార్‌లో దానికి అతి పెద్ద సైనిక స్థావరం వుంది. ఖతార్‌ను వెలేసినప్పుడు జీసీసీ తరఫున 13 డిమాండ్లు పెట్టారు. సిరియాలోని అల్ కాయిదాతో, ఈజిప్టులోని ముస్లింబ్రదర్హుడ్తో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని, ఇరాన్‌తో సాన్నిహి త్యాన్ని వదులుకోవాలని, ఖతార్ ఆధ్వర్యంలో నడుస్తున్న అల్ జజీరా చానెల్‌నూ, ఇతర వార్తా సంస్థలనూ నిలిపివేయాలని, టర్కీతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని ఆ డిమాండ్లలో హుకుం జారీ చేశారు. పదిరోజుల్లో వీటి సంగతి తేల్చకపోతే డిమాండ్ల చిట్టా మరింత పెరుగు తుందని కూడా హెచ్చరించారు. కానీ ఖతార్ ఆ చిట్టాను కాస్తయినా ఖాతరు చేసిన జాడ లేదు. సరికదా టర్కీతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఇరాన్‌తోనూ యధావిధిగా సంబంధాలు కొనసాగిస్తోంది. జీసీసీ ఖతార్‌తో తెగదెంపులు చేసుకున్న 2017లోనే ఆ దేశానికి టర్కీ సేనలు మరిన్ని వచ్చాయి. ఇరాన్నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. మరి ఎందుకని జీసీసీ వెనక్కి తగ్గింది? అమెరికాలో ట్రంప్ పదవీకాలం ముగుస్తున్న తరుణంలోనే ఇలా ఎందుకు జరిగింది? ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం వల్ల అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ వచ్చాక అవి మళ్లీ యధాతథ స్థితికొచ్చాయి. ఆయన చొరవతో గల్ఫ్ దేశాలకూ, ఇజ్రాయెల్‌కూ మధ్య అనుబంధం ఏర్పడింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మొన్న నవంబర్‌లో సౌదీలో రహస్యంగా పర్యటించారు. అంతేగాక యూఏఈ, బహ్రైన్, సూడాన్, మొరాకోలతో సైతం ఇజ్రాయెల్ చెలిమి చేస్తోంది. కానీ బైడెన్ రాకతో అమెరికా–ఇరాన్ సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయి. ఆ మేరకు అమెరికా–ఇజ్రాయెల్ మధ్య పొరపొచ్చాలు పెరుగుతాయి. ఈ పరిణామాలు సౌదీ అరేబియాకు ఏమాత్రం ఉపయోగపడేవి కాదు. అమెరికాను కాదని గల్ఫ్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించటం సౌదీకి అసాధ్యం. అటు ట్రంప్ సలహాదారు కుష్నర్ కూడా ఖతార్‌తో వైషమ్యం కొనసాగించటం మంచిది కాదని సౌదీకి సూచించినట్టు ఇటీవలే వార్తలొచ్చాయి. కనుకనే ఇరాన్, టర్కీలతో ఖతార్ మునుపటికన్నా ఎక్కువగా సంబంధాలు మెరుగుపరుచుకున్నా జీసీసీకి గానీ, సౌదీకి గానీ అభ్యంతరం కనబడలేదు. సౌదీ యువరాజు మునుపటితో పోలిస్తే దూకుడు తగ్గించుకున్నారు. తన మాటే నెగ్గి తీరాలన్న పట్టుదలకు బదులు ఇప్పుడు అన్ని కోణాలనుంచే ఆలోచించే తత్వాన్ని అలవర్చుకున్నారు. అందుకే అన్నీ దిగమింగుకుని రాజీకి వచ్చారు. గల్ఫ్ తాజా పరిణామాలు ఆ ప్రాంతానికే కాకుండా భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నిటికీ ఏదోమేరకు తోడ్పడేవే. ఖతార్‌పై అమలవుతున్న ఆంక్షల వల్ల ఆ ప్రాంతంలో వ్యాపార వ్యవహారాలు కుంటుపడ్డాయి. యూఏఈలో భాగమైన దుబాయ్కిది పెను సమస్యగా మారింది. దానికి ఖతార్ పెట్టుబడులు నిలిచిపోవడంతో వ్యాపారం దెబ్బతింది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడింది. ఈ స్థితిలో ఖతార్‌పై ఆంక్షలు తొలగటం దుబాయ్‌కి కలిసొచ్చే అంశం. అలాగే మన దేశానికి చెందిన అశోక్ లేలాండ్, డాబర్ వంటి వ్యాపార సంస్థలకు మూడేళ్లుగా ఎదురవుతున్న చికాకులు పోతాయి. యూఏఈలో వున్న అశోక్ లేలాండ్ బస్సు యూనిట్‌కు ఖతార్ నుంచి రావలసిన ఆర్డర్లు ఆంక్షలతో నిలిచిపోయాయి. అలాగే యూఏఈలో వున్న డాబర్ కర్మాగారం ఉత్పత్తులు ఖతార్‌కు వెళ్లటం లేదు. విమాన ప్రయాణికుల సమస్యలు సరేసరి. ఇవన్నీ ఇప్పుడు దారిలో పడతాయి. గల్ఫ్ దేశాల మధ్య మళ్లీ మునుపటిలా సాన్నిహిత్యం ఏర్పడటం స్వాగతించదగ్గదే అయినా ఆ దేశాలు తమ ప్రయోజనా లను బట్టికాక, అమెరికా పరిణామాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే స్థితి ఉండటం విచారించ దగ్గదే. ఇక నుంచి అయినా ఇలాంటి ధోరణి మారాలి. సమష్టి తత్వాన్ని అలవరుచుకోవాలి. -
పారదర్శకతే ప్రాణప్రదం
దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగి పోయాయి. దీనికి సంబంధించి ఇంతవరకూ కొనసాగిన చర్యలన్నీ చట్టబద్ధమైనవేనని, ఇందులో రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘనేదీ లేదని 2–1 తేడాతో సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. ఒక న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మాత్రం ఈ తీర్పుతో ఏకీభవించకుండా విడిగా తీర్పునిచ్చారు. ఇప్పుడున్న పార్లమెంటు భవనంకన్నా విశాలంగా, మరింత సౌకర్యవంతంగా కొత్త పార్లమెంటు భవనం... దాంతోపాటు ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలు, ప్రధాని కార్యాలయం, కేంద్ర సచివాలయం భవనాలను నిర్మించటం సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగం. వచ్చే ఏడాది 75వ స్వాతంత్య్రదినోత్సవం జరగబోతోంది గనుక అప్పటికల్లా పూర్తి చేయాలని సంకల్పించిన ఈ ప్రాజెక్టును నిరుడు ఏప్రిల్‌లో సెంట్రల్ విస్టా కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్(డీయూఏసీ), హెరిటేజ్ కన్సర్వేటివ్ కమిటీలు కూడా ఆమోదముద్ర వేశాయి. ఆనాటినుంచి దీని చుట్టూ ఎన్నో వివాదాలు రాజుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు మొన్న డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ గల దాదాపు 4 కిలోమీటర్ల ప్రాంతంలో చేపట్టే నిర్మాణాల వల్ల అనేక కీలకమైన భవంతుల జాడలు కనుమరుగవుతాయని, అందులో యునెస్కో చరిత్రాత్మకమైనవిగా గుర్తించినవి కూడా వున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడున్న వృక్షాలను తొలగించటం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ఆ సమీప ప్రాంతాల్లోనివారికి ఉపయోగపడే పార్కులు, క్రీడా స్థలాలు, ఇతర బహిరంగ స్థలాలు మాయమవుతాయని కూడా పిటిషనర్లు వాదించారు. ఈ ప్రాజెక్టుకు మూలమైన 2019 డిసెంబర్నాటి నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లన్నీ దాఖలయ్యాయి. సెంట్రల్ విస్టా పరిధిలోని భూ వినియోగంలో మార్పులు చేయడానికి ఆ నోటిఫికేషన్ వీలు కల్పించింది. ఈ ప్రాజెక్టు వల్ల 86 ఎకరాల భూ వినియోగంలో ‘సమూలమైన’ మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదన్నదే ధర్మాసనం తరఫున మెజారిటీ తీర్పు వెలువరించిన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిల నిశ్చితాభిప్రాయం. ఇదొక అనుమాపనమైన ప్రాజెక్టు గనుక దీనిపై న్యాయ సమీక్ష అవసరమన్న పిటిషనర్ల వాదనతో కూడా ధర్మాసనం ఏకీభవించలేదు. అలాగే ప్రజా వసరమైన ఇతర ప్రాముఖ్యతలెన్నో వుండగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకన్న ప్రశ్నను కూడా ధర్మాసనం అంగీకరించలేదు. దాఖలైన పది పిటిషన్లలోనూ ప్రధానంగా చర్చకొచ్చిన అంశాలు... ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గోప్యత, ఎవరినీ సంప్రదించకపోవటం, అనుమతుల మంజూరులో పాటించిన విధానాలు సక్రమంగా లేకపోవడం వగైరాలు. మన ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగా వున్న వర్తమానంలో ఇంత భారీ వ్యయమయ్యే ప్రాజెక్టు అవసరమా అన్న ప్రశ్న కూడా వాటిల్లో వుంది. ఈ వ్యవహారంలో తాము కేవలం చట్టబద్ధత ఎంతన్నది చూస్తాం తప్ప ప్రభుత్వ విధానం సబబా కాదా అన్న జోలికి వెళ్లబోమని, దాన్ని పార్లమెంటులో చర్చించుకోవాలని మెజారిటీ తీర్పు రాసిన న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మెజారిటీ తీర్పునిచ్చిన న్యాయమూర్తులైనా, విడిగా తీర్పునిచ్చిన న్యాయమూర్తి అయినా ఒక విషయంలో మాత్రం ఏకీభవించారు...అది పారదర్శకత. ప్రజాస్వామ్యానికి అదెప్పుడూ ప్రాణప్రదమైనది. దురదృష్టవశాత్తూ మన దేశంలో ఆ పారదర్శకతే లోపిస్తోంది. పార్లమెంటు మొదలుకొని అసెంబ్లీల వరకూ దేనిపైనా కూలంకషమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగటం లేదు. గొడవలు, గందరగోళం తప్ప మరేం కనబడటం లేదు. పర్యవసానంగా ఎంతో కీలకమనుకున్న ఆర్థిక బిల్లులు కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. వేల కోట్ల రూపాయలు వ్యయమయ్యే ప్రాజెక్టులు నామమాత్రం చర్చతో చట్టసభల్ని దాటుకొస్తున్నాయి. పార్లమెంటులో సాగు బిల్లులపై సవివరమైన చర్చ జరిగివుంటే, అవి సెలెక్ట్ కమిటీకి వెళ్లివుంటే రైతుల ఉద్యమం ఈ స్థాయిలో రేగేది కాదు. కనుక సుప్రీంకోర్టు చెప్పినట్టు సెంట్రల్ విస్టాపై పార్లమెంటులో విస్తృత చర్చ జరిగితే బాగుండేది. అందువల్ల ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త అంశాలూ ప్రజానీకానికి అర్థమయ్యేవి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్నప్పుడూ ఇదే ధోరణి. అందులో ఆవగింజం తైనా పారదర్శకత లేదు. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి జరిగే నష్టమెంతో వెల్లడించలేదు. అటు రైతులకు మాత్రం వారి భూముల విలువ అపారంగా పెరిగి కోట్లాది రూపాయలు వచ్చి పడతాయని మభ్యపెట్టారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమన్న కేంద్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూనే...దాని నిర్మాణం వల్ల పర్యావరణానికి తలెత్తగల సమస్యలను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అందుకే కాలుష్య నియంత్రణ కోసం స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని, నిర్మాణ సమయంలో దుమ్మూధూళి వల్ల వాతావరణం దెబ్బతినకుండా స్మాగ్ గన్లు వినియోగించాలని సూచించింది. అయితే ఇవి మాత్రమే పర్యావరణానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయా అన్నది ప్రశ్నార్థకం. వృక్షాలకు హాని కలగకుండా వాటిని కొత్త నిర్మాణాలకు అనుగుణంగా అక్కడే మరోచోటుకు లేదా వేరే ప్రాంతానికి భద్రంగా తరలించగలిగితే మంచిదేమో ఆలోచించాలి. కొన్ని దేశాల్లో ఈ మాదిరి చర్యలు విజయ వంతమయ్యాయి. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో కొన్ని భవంతులను యధాతథంగా వుంచుతారని, మరికొన్నిటిని తొలగించి కొత్తవి నిర్మిస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన సమస్త వివరాలనూ ప్రజానీకానికి అందుబాటులో వుంచటం అవసరమని, సుప్రీంకోర్టు తాజా తీర్పు స్ఫూర్తి కూడా అదేనని కేంద్రం గుర్తించాలి. -
వివాదంలో ‘అనుమతులు’
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరోనా వ్యాక్సిన్‌కు ‘రాజకీయ వైరస్’ అంటింది మొదలు దానిచుట్టూ రాజకీయాలు షికారు చేస్తున్నాయి. తాజాగా మన దేశంలో అనుమతులు లభించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు కూడా ఆ సమస్యలో చిక్కుకున్న జాడలు కనబడుతున్నాయి. తగిన డేటా లేకుండా కోవాగ్జిన్‌కు ఎలా అనుమతించారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటే... కోవిషీల్డ్‌కు సైతం మన దేశం డేటాకాక, వేరే దేశాలకు సంబంధించిన డేటా మాత్రమే వుందని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పైగా కోవిషీల్డ్‌తోపాటు పారాసిటమాల్ కూడా ఇవ్వాల్సివుంటుందన్న సూచన వారికి సంతృప్తికలిగించటం లేదు. గత ఏడాది జనవరి 30న కేరళలో తొలి కరోనా వైరస్ కేసు బయటపడ్డాక అది దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ స్వైరవిహారం చేసింది. ఇంతవరకూ మొత్తంగా కోటి 3 లక్షల మందికిపైగా దాని బారినపడగా, 1,49,756 మంది మరణించారు. ఇలాంటి సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు అనుమతులు లభించాయన్న వార్త అందరికీ ఉప శమనం కలిగించాలి. హర్షామోదాలు వ్యక్తం కావాలి. కానీ అందుకు భిన్నమైన స్పందనలు వినబడ్డాయి. ఈ వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది కాగా... ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంస్థ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసుకుని పూణేలోని సీరం సంస్థ కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోంది. పాత కరోనా ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. ఈలోగా అది సరికొత్త వేషంతో అందరిలో భయాందోళనలు కలిగిస్తోంది. దాని తీవ్రత ఎంతో, అది కలగజేయగల నష్టమేమిటో ఇంకా పూర్తిగా నిర్ధారణకాని సమయంలో వివాదం రేగటం ఆందోళనకరమే. అందరూ టీకాలు తీసుకుంటే వైరస్ పీడ త్వరలో సమసిపోతుందన్న ఆశ వుంటుంది. అదే సమయంలో ఆ వైరస్ వల్ల కరోనా బెడద మాయంకావటం మాట అటుంచి దుష్పరిణామాలేవీ కలగవు కదా అన్న సందేహాలుంటాయి. వ్యాక్సిన్లు అన్నివిధాలా సురక్షితమైనవని, భద్రమైనవని నిపుణులు నిర్ధారించుకున్నాకే సాధారణంగా వాటికి అనుమతులు లభిస్తాయి. దానికితోడు రాజకీయ నాయకులు సైతం స్వయంగా ఆ టీకాలు తీసుకుంటే జనంలో మరింత విశ్వాసం పెరుగు తుంది. జరగాల్సింది ఇది కాగా... అందుకు భిన్నమైన రీతిలో పలువురిలో ఎన్నెన్నో సందేహాలు తలెత్తు తున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లనూ ‘అత్యవసర పరిస్థితుల్లో, కొన్ని షరతులకు లోబడి’ వాడొచ్చునని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఆదివారం ప్రకటించింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) నిపుణుల సంఘం సిఫార్సు ఆధారంగా ఈ అనుమతి ఇస్తున్నట్టు వివరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తక్షణావసరమే. అలాగని వ్యాక్సిన్ల సమ ర్థతకు సంబంధించిన డేటా అందుబాటులో వుంచకుండా అనుమతులివ్వటం వల్ల జనంలో అయోమయం ఏర్పడుతుంది. ‘అత్యవసర పరిస్థితుల్లో, కొన్ని షరతులకు లోబడి’ అంటూ అనుమ తులివ్వటం వల్ల వాటిని నిర్ణయించేదెవరన్న సమస్య తలెత్తుతుంది. దానికితోడు వైద్యులు ప్రధానంగా కోవిషీల్డ్ టీకానే ఇస్తారని, అది పనిచేయకపోతే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మాత్రమే కోవాగ్జిన్‌ను ఉపయో గిస్తారని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చేసిన ప్రకటన మరింత గందరగోళానికి దారితీసింది. ప్రత్యామ్నాయం అంటే ఏమిటి... దాన్ని నిర్ణయించేదెవరువంటి ప్రశ్నలన్నీ సహజం గానే తలెత్తాయి. తమ టీకాను కేవలం ప్రత్యామ్నాయం మాత్రమేనని చెప్పటం కోవాగ్జిన్ ఉత్పత్తి దారైన భారత్ బయోటెక్‌కు ఆగ్రహం కలిగించింది. ఇక దీనిపై రాజకీయ రగడ సరేసరి. భారత్ బయోటెక్తోసహా మన ఫార్మసీ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలున్నాయి. ప్రాణావసర ఔషధాలను చవగ్గా ఉత్పత్తి చేయగలగటం వాటి సుగుణాల్లో ఒకటి. బ్రిటన్ గత నెల 3న అనుమతులిచ్చిన ఫైజర్ వ్యాక్సిన్ సంగతే చూస్తే అది బాగా ఖరీదైనది. పైగా దాన్ని మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే పంపిణీ చేయటం, టీకా వేయటం కూడా పూర్తి చేయాలి. అందుకు ప్రత్యేక రిఫ్రిజిరేటర్లు సమకూర్చుకోవాలి. కానీ కోవిషీల్డ్, కోవాగ్జిన్ అందుకు విరుద్ధం. వాటిని 2–8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలో భద్రపరిస్తే సరిపోతుంది. పైగా ధర కూడా దాంతో పోలిస్తే చాలా తక్కువ. ఇవి స్వాగతించదగ్గ అంశాలే అయినా టీకాతో ముప్పు వుండబోదన్న హామీయే కీలకమైనది. ఈ రెండూ 110 శాతం సురక్షితమైనవని డీసీజీఐ సోమాని చెబుతున్నారు. బాధ్యతాయుత స్థానంలో వున్న ఆయనకు ఆ రెండు వ్యాక్సిన్లూ అంత విశ్వాసం కలగజేశాయంటే సంతోషించాల్సిందే. కానీ ఆ విశ్వాసానికి ప్రాతిపదికగా వున్న డేటాను కూడా విడుదల చేసివుంటే ఇన్ని సమస్యలు తలెత్తేవి కాదు. అందుబాటులో వున్న సమాచారాన్నిబట్టి కోవిషీల్డ్ నిబంధనల ప్రకారం మూడు దశల ప్రయోగాలనూ పూర్తి చేసుకోగా, కోవాగ్జిన్ నిర్వహించిన మూడో దశ ప్రయోగ ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడాల్సివుంది. ఇంతవరకూ రెండు వ్యాక్సిన్లకూ సంబంధించి క్లినికల్ ప్రయోగాలు మాత్రమే జరిగాయి. అంటే ఎంపికచేసినవారికి టీకాలందించి, వారిని వైద్యుల నిశిత పర్యవేక్షణలో వుంచి పరిశీలించే ప్రక్రియ. ఇలా ఇచ్చే టీకాల సామర్థ్యాన్ని నిర్ణయించేదెవరన్న ప్రశ్న వస్తుంది. అందుకనుసరించే ప్రోటోకాల్ ఏమిటో, ఆ ప్రోటోకాల్‌కు తగినట్టే ఫలితాలున్నాయని తేల్చేదెవరో తెలిస్తే తప్ప ఈ క్లినికల్ ప్రయోగాల ఫలితాలను విశ్వసించటం కష్టమే. వాస్తవానికి మన దేశంలో మాత్రమే కాదు...బ్రిటన్‌లో ఫైజర్ వ్యాక్సిన్‌ను అనుమతించినప్పుడూ ఇలాంటి ప్రశ్నలే తలెత్తాయి. తగినంత సమయం తీసుకుని నిశితంగా పరీక్షించకుండా జనంలోకి వదిల్తే దుష్పరిణామాలకు దారితీస్తుందని ఫైజర్ మాజీ సైంటిస్టు మైకేల్ ఈడెన్ హెచ్చరించారు. కనుకే ఎలాంటి అనుమ తులైనా పారదర్శకంగా వున్నప్పుడే ప్రజానీకం సాదరంగా ఆహ్వానించగలుగుతుంది. అప్పుడే కరోనా వంటి ప్రమాదకర వ్యాధులను శాశ్వతంగా తరమగలం. -
సాక్షి సంపాదకుడు వర్ధెల్లి మురళికి విశిష్ట పురస్కారం
సాక్షి, హైదరాబాద్: సామాజిక ధృక్పథం కలిగిన జర్నలిస్టులు ప్రస్తుతం అరుదైపోతున్నారని పలువురు సీనియర్ పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ్‌సాగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరుణ్ సాగర్ విశిష్ట పురస్కారాల ప్రదాన కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక సంపాదకుడు వర్ధెల్లి మురళిని విశిష్ట పాత్రికేయ పురస్కారంతో సన్మానించారు. వారసత్వంగా అందిపుచ్చుకున్న వామపక్ష భావజాలంతో సామాజిక ధృక్పథం ఉన్న పాత్రికేయుడిగా ఆయన కొనసాగుతున్నారని పలువురు పాత్రికేయులు ఆయన్ను కొనియాడారు. అనంతరం మురళి మాట్లాడుతూ.. దివంగత పాత్రికేయుడు అరుణ్సా గర్ది, తనది కుటుంబ, రాజకీయ నేపథ్యాలు ఒకటేనన్నారు. ప్రత్యేకమైన ఆలోచనలు, రచనాశైలితో అరుణ్‌సాగర్ ఒక తరం ముందే పుట్టా రని కొనియాడారు. అటువంటి మిత్రుడి పేరుతో నెలకొల్పిన అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక విశిష్ట సాహితీ పురస్కారం అందుకున్న కవి, అధ్యాపకుడు ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ.. అరుణ్‌సాగర్ ఆదివాసీల జీవన వైవిధ్యానికి అద్దం పట్టారని ప్రశంసించారు. ఈ సందర్భంగా అరుణ్‌సాగర్ రాసిన కొన్ని కవితలను ఆయన చదివి వినిపించారు. తెలంగాణ ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, కవి, సరస్వతీ సమ్మాళ్ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్, తెలంగాణ సమాచార కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సినీ దర్శకుడు శంకర్, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు అరుణ్సాగర్తో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా–ఫేక్ న్యూస్ అంశంపై న్యాయ నిపుణుడు, రిటైర్డ్ సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న ఫేక్‌న్యూస్ అత్యంత ప్రమాదకర పరిణామమని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన మీడియాలో పెయిడ్ న్యూస్ వంటి అవాంచిత ధోరణులు ఉంటుండగా.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ దాన్ని మించిన ప్రమాదకారిగా తయారైందని పేర్కొన్నారు. -
రాకేశ్, లోకేశ్ – ఆంధ్రప్రదేశ్!
‘ది హేగ్’ నగరంలోని ప్రాచీన టౌన్హాల్లో వున్న మధ్య యుగాల నాటి ప్రసిద్ధ పెయింటింగ్ ఒకటి మొన్న టపీమని పడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ పెయింటింగ్ కింద 'Audi alteram partem' అనే లాటిన్ వాక్యం రాసి ఉంటుంది. ‘అవతలిపక్క వాణిని కూడా వినాలి’ అని ఆ వాక్యానికి అర్థం. ఈ వాక్యాన్ని సహజ న్యాయపు ప్రథమ సూత్రంగా ప్రపంచం లోని ప్రముఖ న్యాయ వ్యవస్థలన్నీ పరిగణిస్తాయి. భారత రాజ్యాంగం కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్ 14 నుంచి 21 వరకు సహజ న్యాయానికి పట్టం కట్టే అంశాలను చేర్చుకున్నది. కింది కోర్టుల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు ఈ సూత్రాన్ని గౌరవిస్తూనే వస్తున్నాయి. పదవీ విరమణకు సరిగ్గా ఒక్కరోజు ముందు గౌరవరిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ ఏపీ హైకోర్టులో సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా, విరుద్ధంగా కొత్తపుంతలు తొక్కారు. సహజ న్యాయసూత్రాల మార్గాన్ని వదిలేయడమే కాదు. మనబోటి సామాన్యులకుండే కామన్సెన్స్ లాజిక్ కూడా ఈ సందర్భంలో పట్టాలు తప్పింది. కొద్దిరోజుల క్రితం ‘మిషన్ బిల్డ్ ఏపీ’ కార్యక్రమంపై పలు పిటిషన్లు పడ్డాయి. జస్టిస్ రాకేశ్ కుమార్ నాయకత్వంలోని డివిజన్ బెంచ్ ఆ కేసుపై విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా ఒక సందర్భంలో జస్టిస్ రాకేశ్ కుమార్ ఈ రాష్ట్రం దివాళా తీసిందా? అని ప్రశ్నించారు. ఇక్కడ రాజ్యాంగం అమలు జరుగుతున్నట్టు లేదని వ్యాఖ్యా నించారు. దీనికి కొద్దిరోజులముందు తెలుగుదేశంవారు దాఖలు చేసిన పిటిషన్లతోపాటు మరికొన్ని హెబియస్ కార్పస్ పిటిష న్లను విచారిస్తూ రాష్ట్రంలో రాజ్యాంగం బ్రేక్ డౌన్ అయిందని తేల్చేస్తానని జస్టిస్ రాకేశ్ కుమార్ హెచ్చరించారు. ఈ ఉత్తర్వు లపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ రాకేశ్ కుమార్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు విస్మయాన్ని, ఆందోళననూ వ్యక్తం చేస్తూ వాటిపై స్టే ఇచ్చింది. మిషన్ ఏపీ బిల్డ్ కేసుపై తన రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు తీర్పును ఇస్తూ కేసు పరిధిలో లేని అనేక అంశాలపై ఆయన యథేచ్ఛగా వ్యాఖ్యానాలు చేయడం జ్యుడీషియల్ వర్గాల్లో తీవ్ర సంచలనానికి కారణమైంది. మిషన్ ఏపీ బిల్డ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ కాదు. అటువంటప్పుడు ఆయన మీద తీవ్రమైన వ్యాఖ్యలను పరుష పదజాలంతో చేయడం ద్వారా న్యాయమూర్తి లక్ష్మణరేఖను దాటినట్టు కాదా? వ్యక్తిగత గౌరవాన్ని గాయపరచడం కాదా? సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా? ముఖ్యమంత్రిపై ఉన్న పెండింగ్ కేసుల గురించి ఈ కేసులో సదరు పిటిషనర్ ప్రశ్నించారా? లేదే! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్య మంత్రి లేఖ రాయడం తప్పా... ఒప్పా అని సదరు పిటిషనర్ న్యాయస్థానం అభిప్రాయాన్ని అడిగారా? లేదే! విచారణ పరి ధిలో లేని అంశంపై గౌరవ ముఖ్యమంత్రి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసేముందు ఆయన వాణిని విన్నారా? లేదుగాక లేదు. ఇది సహజ న్యాయసూత్రానికి వ్యతిరేకం కాదా? అంత ర్జాతీయ న్యాయస్థానాలకు నెలవైన ‘ది హేగ్’ నగరంలోని 'Audi alteram partem' పటం పగలకుండా ఉంటుందా? ఏపీ ముఖ్యమంత్రిపై ఉన్న కేసులు ఎందుకు పెట్టారో... ఎవరు పెట్టారో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ తెలుసు. పిటిషన్లో ఏముందో కూడా ఆ కేసు పిటిషనర్, కాంగ్రెస్ నేత శంకర్రావుకు తెలియదు. ఈ సంగతి ఆయనే స్వయంగా వెల్లడిం చారు. హైకమాండ్ సంతకం పెట్టమంటే పెట్టానని ఆయన చెప్పారు. పిటిషన్లలోని అభియోగాలపై సీబీఐ విచారణకు ఆదేశించిన న్యాయమూర్తికి ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే కేంద్రం ఆదేశాలతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక గౌరవప్రదమైన మరో పదవిని ఏర్పాటు చేసింది. సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కై ఈ కేసులో ఎన్ని మ్యానిపులేషన్లకు పాల్పడ్డారో కూడా ప్రజలం దరూ చూశారు. ఆ కేసులపై విచారణ జరుగుతున్నది. న్యాయ శాస్త్ర సూత్రాల ప్రకారం అభియోగాలు నిరూపితమయ్యేంత వరకు ఎవరూ తప్పుచేసినట్టు కాదు. రేపు కేసులు వీగిపోయి నిర్దోషిగా తేలితే, చేసిన కామెంట్లను ఎలా వెనక్కు తీసుకో గలుగుతారు? న్యాయమూర్తికీ నిగ్రహం ఉండాలి కదా! గౌరవ న్యాయమూర్తి తన తీర్పులో పొందుపరచడానికి గూగుల్‌ను ఎంచుకున్న తీరుపై కూడా న్యాయనిపుణులు ఆశ్చ ర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల గురించి గూగుల్ ద్వారా తెలుసుకున్నానని గౌరవ న్యాయమూర్తి చెప్పారు. ఓపిగ్గా సెర్చి చేస్తే గూగుల్‌లో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఆరోజుల్లో పప్పు అని టైప్ చేస్తే ఏ ఫిగర్‌ను గూగుల్ చూపెట్టేదో తెలియనిదెవరికి? గూగుల్ చెప్పింది కనుక ఆ ఫిగర్ నిజంగానే పప్పవుతుందా? ఫోర్ట్వంటీ, వెన్నుపోటు అని కొడితే ఎవరు ప్రత్యక్షమయ్యేవారో మనకు తెలియదా? ఇంతెందుకు... జస్టిస్ రాకేశ్ కుమార్ ఏపీ హైకోర్టుకు బదిలీ మీద వచ్చిన సందర్భంలో ఆయన గురించి తెలుసుకోవాలనుకున్న వారు గూగుల్‌లో శోధించే ఉంటారు కదా? ఆయన గురించి గూగుల్‌లో తెలిసే విషయాల్లో అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదే ఆయన బిహార్ హైకోర్టు నుంచి బదిలీ అయిన సంగతి. ఈ న్యాయమూర్తి తన పరిధిలో లేని అంశాల్లో జోక్యం చేసుకుంటున్నాడని 11 మంది జడ్జీలు సభ్యులుగా ఉన్న విస్తృత ధర్మాసనం తప్పుపట్టింది. ఈ న్యాయమూర్తి వ్యవహార శైలిని ధర్మాసనం తీవ్రస్థాయిలో ఎండగట్టింది. న్యాయమూర్తికి కొంతకాలం ఏ పనీ అప్పగించకుండా ప్రధాన న్యాయమూర్తి దూరం పెట్టవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఆంధ్ర ప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. మన సంస్కృతిలో న్యాయం, ధర్మం సాక్షాత్తు దైవంతో సమానం. అందువల్లనే న్యాయస్థానాలను ధర్మదేవతలుగా పరి గణిస్తాము. లిటిగెంటు వ్యూహాలతో, మ్యానిపులేషన్లతో దైవ సమానమైన న్యాయస్థానాలను కూడా బురిడీ కొట్టించి తనక్కా వలసిన ఫలితాలను పొందగలిగే కళను రూపొందించిన తొలి రాజకీయవేత్త చంద్రబాబు. ఎన్టీ రామారావు స్వార్జితాలైన తెలుగుదేశం పార్టీని, పతాకాన్ని, పార్టీ బ్యాంకు ఖాతాలను కోర్టు ద్వారా బాబు దక్కించుకోవడం ద్వారా ఈ కళ తొలి ప్రయోగం విజయవంతమైంది. అప్పటినుంచి ఆయన ఈ కళను దినదినా భివృద్ధి చేస్తూ వచ్చారు. ప్రత్యర్థులపై ప్రజాకోర్టులో గెలవలే నప్పుడు కోర్ట్ ఆఫ్ లా మాటున దాక్కుని లిటిగెంట్ రాళ్లను విసరడం రివాజుగా మార్చుకున్నారు. ఇప్పుడాయన రాజకీ యాల నుంచి రిటైర్ కావాల్సిన దశకు చేరుకున్నారు. ఇక వారసు నికి వేట నేర్పాలి. ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేస్తుందా? ససేమిరా మేయదు. చేనుతో చెడుగుడు ఆడేయాల్సిందే. న్యాయ దేవత కళ్లకున్న గంతలను అవకాశంగా తీసుకుని ఆమె ముందే తండ్రి మాయాజూదం ఆడితే, కొడుకు సాక్షాత్తూ దేవుళ్లనే రాజకీ యాల్లోకి లాగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వారాంతం స్పెషల్‌గా లోకేశ్‌బాబు ఓ సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలు తప్పని తాను సింహాచలం పుణ్య క్షేత్రంలో ప్రమాణం చేస్తాననీ, అందుకు ప్రతిగా ముఖ్యమంత్రి కూడా సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒంటిచేత్తో యాభై శాతం ఓట్లను, 85 శాతం సీట్లను గెలిపించిన ముఖ్యమంత్రి ఎక్కడ? అధికారంలో ఉండి, కోట్లు గుమ్మరించి కూడా పోటీచేసిన సొంత స్థానంలో చతికిలపడ్డ లోకేశ్‌బాబు ఎక్కడ? ఇద్దరి మధ్యా ఈ సవాల్ ఏమిటి? అని ఎవరూ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే రాజకీ యాల్లో లోకేశ్‌బాబుకు తనదైన ఒక సొంత కామెడీ ట్రాక్ ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో తనకు ఆయన సొంత మామ తప్ప మరెవరూ సాటిరారు. కాకపోతే ఈ సవాల్ వల్ల ఒక రాజకీయ కుట్ర గుట్టు రట్టయింది. గత రెండు వారా లుగా జిల్లాలవారీగా తెలుగుదేశం–వైసీపీ నేతల మధ్య ఇటు వంటి ప్రమాణాల సవాళ్ల పర్వం నడుస్తున్నది. ఈ పర్వాన్ని క్లైమాక్స్‌కు తీసుకునివెళ్లడానికి లోకేశ్‌బాబు తాపత్రయపడ్డారు. సవాళ్ల టైమింగ్ గమనించండి. డిసెంబర్ 25 నుంచి జనవరి 7 వరకు రెండు వారాలపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు పట్టాలను అందజేస్తున్నది. అదీ మహిళల పేరు మీద. 30 లక్షల మందికి లబ్ది చేకూర్చబోతున్నారు. జనసంక్షేమ కార్యక్రమాల్లో కనీవినీ ఎరుగని విప్లవాత్మక ముందడుగు ఇది. ఈ కార్య క్రమానికి ప్రచారం దక్కరాదని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహజంగానే కోరుకున్నది. ఇప్పుడు ఆ పార్టీకి వెలుగులు మింగే ఒక రాహువు కావలసి వచ్చింది. పున్నమి చంద్రుడిని కబళించే గ్రహణం కావలసి వచ్చింది. అదిగో ఆగ్రహణమే ఈ గుడి ప్రమాణాల జాతర. గుడి ప్రమాణాలు మేడిన్ టీడీపీ ఆఫీస్ అనే సంగతి లోకేశ్ సవాల్‌తో పూర్తిగా బోధపడింది. ఈ లోగుట్టు తెలి యని వైసీపీ నేతలు కూడా సవాళ్లలో ఇరుక్కుని తొడలు చరచ డంతో మీడియా అటెన్షన్ మొత్తం అటువైపు మళ్లింది. మహో త్కృష్టమైన మానవీయ కార్యక్రమానికి ప్రచారం కరువైంది. కరోనా కాలం తండ్రీకొడుకులకు ఒకరకంగా బాగా కలిసొ చ్చింది. ఆరేడు నెలలపాటు ఎక్కడికీ వెళ్లలేదు. ‘జూమ్ బరాబర్’ అనుకుంటూ గడిపేశారు. ఈ కాలంలోనే మాకియవెలియన్ రాజకీయ వ్యూహంలో కొత్త వేరియంట్ పురుడుపోసుకుంది. ఈ వేరియంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రాణావసరం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాదిన్నర పరిపాలన కాలంలో అడ్మిని స్ట్రేషన్ విషయంలో గానీ, సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లోగానీ వేలెత్తి చూపే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించగలిగే అవకాశం లేదు. తరుణోపాయం కావాలి. ఆ తరుణోపాయమే దేవుడు. ఆ న్యాయదేవతను ఉపయోగించుకోవడం ద్వారా తండ్రి జమానా ప్రారంభమైనట్టే, దేవుడి సెంటిమెంట్‌తో కొడుకు రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభం కావాలని నిర్ణయం జరిగిపోయింది. గత కొంతకాలంగా అక్కడక్కడా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, దానిపై మీడియా గోరంతలు కొండంతలు చేయడం అంతా ఒక రాజకీయ వ్యూహంలో భాగమే. పథకం ప్రకారం, చీకటి ముసుగులో నిర్మానుష్య వేళల్లో దాడులు చేసే దొంగలను సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి పోలీసులకు కొంత సమయం పట్టవచ్చు. కుట్రదారులకు ఈ మాత్రం సమయం చాలు. ఈలో గానే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టవచ్చు. జనాన్ని ఆందోళనకు పురి కొల్పవచ్చు. అల్లర్లను రాజేయవచ్చు. శాంతిభద్రతలు సన్న గిల్లాయని మీడియాలో వీరంగం వేయవచ్చు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినంత విధ్వంసం హిందూ దేవాలయాల్లో ఎన్నడూ జరగ లేదు. తాము రాజధానిగా ప్రకటించుకున్న ప్రాంతానికి కూత వేటు దూరంలో నలభై గుళ్లను స్వయంగా ప్రభుత్వమే బుల్డో జర్లు పెట్టి కూల్చేసింది. కూల్చేసిన ప్రాంతాల్లో కొన్నిచోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. దేవాలయ భూములను కబళించేం దుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. క్షుద్ర పూజలు చేయించి పెద్దపెద్ద దేవాలయాలను అపవిత్రం చేశారు. తిరుమల హుండీ సొమ్ముతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాలు తమిళనా డులో దొరికాయి. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. కానీ ఆరోజుల్లో మీడియా కిమ్మన్నాస్తిగా ఉండిపోయింది. ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో రెండు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగితే ఆ రెండూ తెలుగుదేశం కీలక నేతల కనుసన్నల్లోనివి కావడం గమనించవలసిన విషయం. డిసెంబర్ 28న శ్రీరాముని విగ్రహం ధ్వంసం అయిన రామతీర్థం ఆలయానికి చైర్మన్ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. రాజమహేంద్రవరం శ్రీరాం నగర్లో వున్న వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం దేవాదాయ శాఖకు సంబంధంలేని చిన్న గుడి. అది గతంలో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గన్ని కృష్ణ అజమాయిషీలో వుండేది. అక్కడ డిసెంబర్ 31న సుబ్రహ్మ ణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం చేశారు. దేవుడి వ్యూహంతోపాటు మరో కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. వివిధ సామాజిక వర్గాల మధ్య ముఖ్యంగా, దళిత–గిరిజన–బీసీ వర్గాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వర్గాల ప్రజలు గుండు గుత్తగా వైసీపీకి ఓట్లు వేసే అవకాశాలున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ వర్గాల మధ్య ఘర్షణలు జరగాలి. ఇందుకోసం వారి మధ్యన ఉండే చిన్నచిన్న అపోహలు, విభేదాలు, పంచా యతీలపై ఆ పార్టీ అధ్యయనం చేస్తున్నది. అవకాశమున్న ప్రతి చోట ఘర్షణలను ప్రేరేపించి శాంతి–భద్రతల సమస్యను సృష్టిం చడానికి ఇప్పటికే శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. శాంతి– భద్రతల సమస్య తలెత్తకుండా ఉండా లంటే తెలుగుదేశం పార్టీ కదలికలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం అవసరం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం!
విశ్వరహస్య పేటిక గుట్టుమట్లు తెలిసిన రెండే రెండు శక్తులు టైమ్ అండ్ స్పేస్. ఆ రెండు శక్తులపై అదుపు సాధించడం ఇప్పటిదాకా మనిషికి సాధ్యం కానే లేదు. అందుబాటులో ఉన్న జ్ఞానం మేరకు అవి ఆదిమధ్యాంత రహితాలు. అందువలన కాలమూ, స్థలమూ అనే ఆ శక్తులు మనకు దైవ సమానాలు. కాలయానం ఒక అనంతగమనం. ఆ గమనంలో రెండువేల ఇరవై అనే సంవత్సరం ఒక లిప్తపాటు. మానవాళి చేసిన తప్పిదాలకు గాను ఆ లిప్తపాటు కాలం విధించిన శిక్ష మనకు ఓ పదేళ్ల జైలుశిక్షతో సమానం. ఎందుకంటే, రెండువేల ఇరవైలో మన ఆర్థిక రంగానికి కోవిడ్ చేసిన గాయం మరో పదేళ్లపాటు బాధిస్తుందని నిపుణులు చెబుతున్నారు గనుక. ఒక్క మన దేశంలోనే లక్షలకొలది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. చిరు వ్యాపారులు చితికిపోయారు. ఆతిథ్య నిర్మాణ రంగాలు కుదేలైనాయి. కోట్లాదిమంది ఉపాధి, ఉద్యోగాలను కోల్పో యారు. వారంతా యుద్ధంలో ఓడిపోయి గాయపడిన సైనికుల మాదిరిగా కనిపించారు. నెత్తురోడే పాదాలతో నడక పందెంలో పాల్గొంటున్నట్టుగా నడిచారు. వారి తిరోగమన యాత్ర నెలల తరబడి సాగింది. కోవిడ్ నామ సంవత్సరంగా పరిణమించిన రెండువేల ఇరవై మన జీవన గమనాలను కూడా దారి మళ్లించింది. విద్యారంగం ఆన్‌లైన్‌గా మారింది. లేదా అటకెక్కింది. ఉద్యోగాల్లో కొన్ని ఆన్‌లైన్‌కే పరిమితమైపోయాయి. చెప్పుకుంటూపోతే చాలా మార్పులను మోసుకొచ్చింది ఈ సంవత్సరం. ఏడాది పొడవునా నెత్తుటి మరకల్ని చేసినప్పటికీ, పోతూపోతూ కొన్ని మెరుపుల్ని కూడా వెలిగించింది. భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక ఆశ్చర్యం మొలకెత్తింది. అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో, ఆశ్చర్యం ఢిల్లీ సరిహద్దుల్లో. క్రిస్మస్ పర్వదినం, వైకుంఠ ఏకాదశి జమిలిగా వచ్చిన డిసెంబర్ 25వ తేదీనాడు 30 లక్షల మందికి పైగా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాలను ప్రదానం చేయడాన్ని ప్రారంభించారు. రెండు వారాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇంత స్వల్పకాలంలో ఇన్ని లక్షలమందికి ఇళ్ల పట్టాలివ్వడమే ఒక ప్రపంచ రికార్డు. ఆ రికార్డుకు మించి ఇక్కడొక విప్లవాత్మక పరిణామం చోటుచేసుకున్నది. ఆ పట్టాలన్నీ మహిళల పేరుమీదనే ప్రదానం చేయడం ఆ పరిణామం. మరో మూడేళ్లలో వారందరికీ నయాపైసా ఖర్చులేకుండా ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వ బోతున్నది. మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘నా అక్క చెల్లెమ్మలు’ అంటూ ఆప్యాయంగా సంబోధిస్తారు. ‘అనగనగా ఒక అన్నయ్య, తాను తోబుట్టువులుగా భావించే 30 లక్షలమందికి వారి లైఫ్‌టైమ్ కలల్ని నెరవేర్చే కానుకల్ని ఆడబిడ్డ కట్నంగా ఏకకాలంలో సమకూర్చాడు...’ అని భవిష్యత్తులో తరతరాలు ఈ వృత్తాంతాన్ని కథలుగా చెప్పుకునేంత కీలక పరిణామం ఇది. సమాన హక్కుల కోసం, ఆస్తిలో వాటా కోసం, సమానమైన పనికి పురుషులతో సమానంగా జీతం కోసం, బండెడు ఇంటి చాకిరీకి కనీస గుర్తింపు కోసం, ఆత్మగౌరవం కోసం మహిళలు పడుతున్న తపన ఏనాటిది? ఆ తపన క్రియాశీలక ఉద్యమ రూపం దాల్చి కూడా ఆరు దశాబ్దాలు కావస్తున్నది. ఈ ఆరు దశాబ్దాల ప్రస్థానంలో మహిళలకు లభించిన అతిపెద్ద విజయం ఇదే. ఆస్తిని సమకూర్చడం మాత్రమే కాదు. ఆ ఆస్తి దానవిక్రయాది సమస్త హక్కులతో భుక్తమైనప్పుడే నిజమైన ఆస్తిగా పరిగణన పొందుతుందని ముఖ్యమంత్రి భావించారు. అందుకోసం పక్కాగా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లనే ఆడపడుచులకు అందజేసేలా ప్రణాళికను తయారు చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం అమలైతే ముఖ్యమంత్రికి మంచి పేరొస్తుందన్న ఒకే ఒక దుగ్ధతో తెలుగుదేశం పార్టీ అధినేత కోర్టుల్లో కుంటిసాకులతో పిటిషన్లు వేయించారు. కోర్టు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని, సామాజిక న్యాయాన్ని చూడకుండా సాకుల ఆధారంగా స్టేలు ఇవ్వడం ఒక విషాదం. అయినప్పటికీ న్యాయస్థానాల్లో పోరాడి పక్కా రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను అందజేస్తామని, ఈలోగా అక్కచెల్లెమ్మలకు డి–పట్టాలను అందజేయడాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిదొక పెద్ద సందడి. గొప్ప పండుగ సందడి. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశితో ప్రారంభమై సంక్రాంతి సీజన్ వరకు రెండు వారాలపాటు ఇళ్ల పండుగ కొనసాగబోతున్నది. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో రూపొందుతున్న ఈ ఇళ్లు నిజానికి కాలనీలు మాత్రమే కాదు.. కొత్త ఊళ్లు. ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడమే కాదు, ఇళ్లను నిర్మించి ఇవ్వడం, మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రభుత్వ ఖర్చుతో కల్పించడం ద్వారా 17,005 కొత్త ఊళ్లనే జగన్ ప్రభుత్వం నిర్మించబోతున్నది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కలిపి ఇప్పటికే ఉన్న గ్రామాల సంఖ్య 17,128. అంతకు సమానమైన సంఖ్యలో కొత్త గ్రామాల నిర్మాణాన్ని ప్రభుత్వం తలకెత్తు కున్నది. ఏ దేశ చరిత్రలోనైనా ఈ రికార్డు నభూతో నభవిష్యతి. ఈ కొత్త గ్రామాల్లో ఇళ్లన్నీ మహిళల పేర్ల మీదనే ఉంటాయి కనుక రాష్ట్రంలోని సగం గ్రామాలకు మహిళలే మహరాణులన్నమాట. ‘గృహిణి’ అనే మాటకు సార్థకత చేకూరనున్నది. కొత్త ఊళ్లలో జనాభా ప్రాతిపదికన ఇరవైకి పైగా మునిసిపాలిటీల స్థాయిని అందుకునే అవకాశం ఉన్నది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయి, మౌలిక వసతులన్నీ సమకూరిన తర్వాత మరో నాలుగేళ్లలో ఇళ్ల మార్కెట్ విలువ ఇబ్బడిముబ్బడిగా పెరగబోతున్నది. ఒక్కో ఇల్లు హీనపక్షం ఎనిమిది నుంచి పదిలక్షల కిమ్మత్తు చేయవచ్చు. అంటే ఇప్పుడు నిర్మించబోతున్న ఊళ్లు పూర్తయ్యేసరికి మూడు లక్షల కోట్ల విలువ చేస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు తన అక్కచెల్లె మ్మలకు ఆడపడుచు లాంఛనంగా అందజేస్తున్న కానుక ఖరీదు అక్షరాల త్రీ ట్రిలియన్ రూపీస్! ప్రతి మహిళను లక్షాధికారిని చేయడం తన కల అని డాక్టర్ రాజశేఖరరెడ్డి గారు అనేవారు. రాబోయే కొద్దికాలంలోనే సుమారు పది లక్షల ఖరీదు చేసే ఇళ్లకు యజమానులుగా 30 లక్షలమంది మహిళలు ‘మిలియనీర్లు’ కాబోతున్నారు. ఇంటి యాజమాన్యంతోపాటు పిల్లల భవిష్యత్తును నిర్ణయించడంలో కూడా తల్లులదే కీలకపాత్ర కాబోతున్నది. అమ్మఒడి పథకం మహిళలకు ఈ ప్రివిలేజ్‌ను కల్పించింది. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడం కోసం నామినేటెడ్ గౌరవ పదవుల్లోనూ, నామినేషన్‌పై చేసే కాంట్రాక్టు పనుల్లోనూ 50 శాతం మహిళల హక్కుగా చట్టబద్ధం చేశారు. తాగుబోతు భర్తల ఆగడాల నుంచి విముక్తి చేయడంకోసం మద్య నియంత్రణ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. మహిళలపై పోకిరీల ఆగడాలకు ముకుతాడు వేయడానికి దేశంలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టాన్ని తీసుకొని వచ్చారు. 45 నుంచి 60 యేళ్ల మధ్య వయసున్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ ఆసరా కింద ఏటా 18,750 రూపాయలను నాలుగేళ్లపాటు ఇస్తున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా సంఘాలు బ్యాంకులకు బకాయిపడిన 27 వేల కోట్ల రూపాయలను దశలవారీగా జగన్ ప్రభుత్వం సంఘాలకు చెల్లిస్తున్నది. ఫలితంగా 8 లక్షల 71 వేల డ్వాక్రా సంఘాలు ప్రయోజనం పొందాయి. సున్నా వడ్డీ పథకం కింద కూడా జగన్ ప్రభుత్వం చెల్లింపులు చేసింది. ఈ ప్రోత్సాహాల కారణంగానే పొదుపు ఉద్యమంలో ఏపీ డ్వాక్రా సంఘాలు దేశంలోనే అగ్రభాగాన నిలబడ్డాయని నాబార్డ్ నివేదిక చాటిచెప్పింది. మహిళా సాధికారత కోసం జరిగే కృషిలో నిస్సందేహంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉన్నది. ఇక ఏపీ మహిళాలోకం నిండైన ఆత్మ విశ్వాసంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించవచ్చు. ఢిల్లీ సరిహద్దులను పంజాబ్ రైతులు దిగ్బంధం చేయడం ప్రారంభించి నెలరోజులు దాటింది. వారికి క్రమంగా హరి యాణా, పశ్చిమ యూపీ రైతులు కూడా తోడయ్యారు. సహజంగానే రాజకీయ పక్షాలు కూడా ప్రవేశించాయి. ఢిల్లీ నుంచి హరియాణాకు, రాజస్తాన్‌కు, యూపీకి దారితీసే రహదారులు నెలరోజులుగా ఆందోళనకారుల అధీనంలోనే ఉన్నాయి. ఏడెనిమిది క్యాంపులుగా రైతులు ఆందోళనకు దిగారు. దీర్ఘకాలంపాటు ఆందోళన కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లనూ వారు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన మూడు చట్టాలను బేషరతుగా రద్దుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా రెండు అంశాల్లో పంజాబ్ రైతులు భయ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టాల ఫలితంగా భవిష్యత్తులో కనీస మద్దతు ధర రద్దవుతుందని మొదటి భయం. మండీ (మార్కెట్) వ్యవస్థ అంతరించి కార్పొరేట్ కంపెనీల పెత్తనం పెరుగుతుందని రెండో భయం. ఈ రెండూ కచ్చితంగా కొనసాగుతాయని ప్రభుత్వం గట్టిగా హామీ ఇచ్చింది. అయినా రైతులు నమ్మడం లేదు. ఇందుకు కారణం ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టడమేనని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఇక్కడ చర్చ ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాల్లోని గుణదోషాల గురించి కానీ, రైతుల కోర్కెల్లోని ఉచితానుచితాల గురించి కానీ కాదు. ఇందిరాగాంధీ ప్రభుత్వం తర్వాత అంతటి బలమైన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది. ప్రతిపక్షం పూర్తిగా నిర్వీర్యమై, నిస్తేజమైన స్థితిలో ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో బలమైన కేంద్ర సర్కార్‌ను లెక్క చేయకుండా రైతాంగం తెగించి శాంతియుత సమరానికి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ తెగింపు ఈ దేశ ప్రజాస్వామ్య పునాదుల మీద నమ్మకాన్ని కలిగిస్తున్నది. మన ప్రజాస్వామ్యం భవిష్యత్తు మీద ఆశను ఎర్రకోటపై ఎగురుతున్న జాతీయ పతాకమంత ఎత్తున నిలబెడుతున్నది. ప్రతిపక్షం కునారిల్లినంతమాత్రాన ప్రశ్నించే గొంతుక మూగబోదనే సింహకంఠనాదం ఆ రైతుల నినాదాల్లో ప్రతిధ్వనిస్తున్నది. ఈ దేశంలో అత్యధిక జనాభాకు ఆశ్రయం కల్పిస్తూ కూడా నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతున్నది వ్యవసాయ రంగమేనని అందరూ అంగీకరిస్తారు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా లేదని కూడా అంగీకరిస్తారు. అయినా రైతులు ఆందోళనకు దిగడం చాలా అరుదు. ‘‘అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు...’’ ఏమవు తుంది? అజాతశత్రువు ఇప్పుడు అలిగాడు. ఫలితం... ఎదురులేదనుకున్న మోదీ సర్కార్ మోకాళ్లపై కూర్చుని రైతులను బతిమిలాడుతున్నది. బుజ్జగిస్తున్నది. ఈ ఆందోళనకు ఒక అర్థవంతమైన ముగింపు తక్షణ అవసరం. ముగింపు ఎలా ఉన్నా ప్రశ్నించే గొంతుక జీవించే ఉంటుందన్న ఒక్క ఆశ చాలు... కొత్త సంవత్సరాన్ని స్వేచ్ఛగా శ్వాసించడానికి! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com