కొండపై నుంచి కిందకు దొర్లే బండరాయి ప్రయాణం ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. అక్కడ సుత్తి దెబ్బలకు ముక్కలైపోవడమే దాని తదుపరి మజిలీ. మళ్లీ కొండపైకి మాత్రం ఎక్కలేదు. కొన్ని దశాబ్దాల కిందట తెలుగునాట మొదలైన ఒక రాజకీయ బేతాళయానం దిగజారడానికి ఇకలోతుల్లేని దశకు మొన్ననే చేరు కొన్నది. మిగిలింది పాతాళమే. ఆ బేతాళ రాజకీయం తదుపరి మజిలీ పాతాళ సమాధి మాత్రమే. అదొక దిగ్భ్రాంతికర ఘటన. అతి జుగుప్సాకరమైన సన్నివేశం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడైన వ్యక్తి పెదాలు పలికిన అసభ్య పదజాలం విని సభ్యసమాజం మ్రాన్పడిపోయింది.
కొన్నేళ్ల కిందట ఆకాశవాణిలో ‘కేయూరాణి, న భూషయన్తి....’ అనే భర్తృహరి సుభాషితం ప్రతిరోజూ ప్రసారమయ్యేది. దాని అర్థం ‘భుజకీర్తులు గానీ, చంద్రహారాలు గానీ, పన్నీటి స్నానాలు గానీ, సుగంధ లేపనాలు గానీ పురు షుడికి నిజమైన అలంకారాలు కావు. సంస్కా రవంతమైన సంభాషణ మాత్రమే నిజమైన అలం కారం’. ముఖ్యమంత్రి పదవులూ, ప్రతిపక్షనేత హోదాలూ చిరసంపదలు కావు. వాగ్భూషణమే శాశ్వత స్థిరాస్తి. సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉన్నవారి వాక్కు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు.
సామాజిక మాధ్యమ విస్ఫోటనం సమాచార విప్లవంతో పాటు అనేక చెడుగులను కూడా మోసుకొచ్చింది. నచ్చనివాళ్ల వ్యక్తిత్వ హననానికి ఇది వేదికైంది. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రచారానికి ఈ వేదికను వాడుకోవడం మొదలైంది. ఈ వ్యవహారంలో అగ్ర తాంబూలం తెలుగుదేశం పార్టీదే. తన రాజకీయ ప్రత్యర్థి అయిన వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులపై నీచాతి నీచమైన ప్రచారం చేస్తూ చేసిన కొన్ని పోస్టింగులు తెలుగుదేశం పార్టీ కార్యా లయాలు, ఆ పార్టీ ప్రముఖుల నివాసగృహాల నుంచే జనించాయని దర్యాప్తుల్లో వెల్లడి కావడమే ఆ పార్టీ సంస్థాగతంగా పోషించిన పాత్రకు రుజువు.
ఎన్నికల ముందే కాదు, ఆ తర్వాత కూడా నెల జీతంపై వేలాది మందిని సోషల్ మీడియా ఆర్మీగా రిక్రూట్ చేసుకొని ప్రత్యర్థుల మీద తప్పుడు ప్రచారాలతో ‘సోషల్ పొల్యూషన్’కు తెలుగుదేశం పార్టీ తెరతీసిందని బల మైన ఆరోపణలు ఉన్నాయి. న్యూటన్ థర్డ్ లా కేవలం ఫిజికల్ సైన్సే కాదు. సోషల్ సైన్స్ కూడా. సహజంగానే ఒక రాజకీయ పార్టీ తరపున జరిగే ప్రచారాలను వ్యతి రేకించే వ్యక్తులు, శక్తులూ కూడా సమాజంలో వుం టాయి. వారిలో కొందరు హద్దులు మీరవచ్చు. అటు వంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయ వచ్చు.
ఇటీవల ఒక ఆకతాయి ఎవరో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా వున్న ఒక మహిళా నాయకురాలిపై అసభ్య పదాలతో కూడిన పోస్టింగ్ పెట్టాడని ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు మొన్న గుంటూరులో ఆరోపించారు. ఆ పోస్టింగ్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసితీరాలి. తప్పులేదు. కానీ, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మీడియా సమావేశంలో టీవీ కెమెరాల ఎదుట ఒక స్క్రీన్‌పై ఆ పోస్టింగ్‌ను ప్రదర్శిస్తూ మహిళల సమక్షంలోనే అసభ్య పదాలను ఒత్తి పలకడం ఎటు వంటి సందేశాన్ని పంపించింది?
అంతకుముందు ఏ కొద్దిమందికో తెలిసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ వినేలా ఉచ్చరించిన నాయకుడు, ఆ మహిళా నాయ కురాలి గౌరవాన్ని ఏ రకంగా కాపాడినట్టు? సాధా రణంగా ఇటువంటి పదాలను పత్రికలు ఎప్పుడూ ప్రచు రించవు. తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చినప్పుడు ‘రాయ డానికి వీల్లేని భాష’ అని మాత్రమే చెబుతాయి. బాబు ఈ సంప్రదాయానికి నీళ్లొదిలారు. ఆ నాయకురాలు ఒక బీసీ మహిళ కాబట్టే చంద్రబాబు ఇలా బజారున పెట్టా రనీ, తమ వాళ్లయితే ఇలా చేయగలరా అని ప్రశ్నిస్తున్న ఆ పార్టీ బీసీనేతలకు ఏమని సమాధానం చెబుతారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో విలు వలపతనం వేగంగా ప్రారంభమైంది వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్‌తో. ఈ ఎపిసోడ్ సూత్రధారి చంద్రబాబు. ప్రధాన పాత్రధారి ఎల్లోమీడియా. కేవలం ఒక పది మంది అనుయాయుల్ని ఆ హోటల్‌లో కూర్చోబెట్టి, 70 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వైస్రాయ్ హోటలో సమావేశమయ్యారని మీడియా ద్వారా ప్రచారం చేశారు. అసలేం జరుగుతుందో తెలు సుకుందామని వైస్రాయ్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలను అక్కడే బంధించారు. సెల్‌ఫోన్లు లేనికాలం... జరు గుతున్నదేమిటో వేగంగా తెలిసేదికాదు.
ప్రజా ప్రతి నిధులు సమాచారం కోసం పత్రికా ప్రతినిధులనే ఆశ్రయించేవారు. కొందరు పత్రికా ప్రతినిధులు అదే పనిగా ల్యాండ్‌లైన్ల ద్వారా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఇప్ప టికే నూటాయాభై మంది ఇక్కడ వున్నారనీ, రాకపోతే మీరు నష్టపోతారనీ బెదిరింపులకు దిగారు. ఇటువంటి క్రూరమైన నాటకంతో ఎన్టీరామారావును పద వీచ్యుతుడిని చేసి, ఆయన పెట్టుకున్న పార్టీనే హైజాక్ చేశారు. ఆయన స్వయంగా డిజైన్ చేసుకున్న పార్టీ పతా కాన్ని, ఎంపిక చేసుకున్న సైకిల్ గుర్తును వ్యవస్థలను ప్రభావితం చేయడం ద్వారా లాగేసుకున్నారు. గుండెపగిలి ఆయన చనిపోవడానికి కారకులయ్యారు. అప్పుడు మొదలైన క్షుద్ర రాజకీయ సిండికేట్ మాయో పాయాలు పాతికేళ్లుగా తెలుగునేలను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. రాజకీయ విలువలను వలువలూడ్చినట్టు ఈ సిండికేట్ విడిచేస్తూ వచ్చింది. మొన్నటి చంద్రబాబు సంభాషణతో ఆఖరి అంగవస్త్రాన్ని కూడా విప్పే సినట్లయింది. ఒక మిగిలిందేమీలేదు. భీతిగొలిపే బేతాళ రాజకీయ స్వరూపం తప్ప.
‘ఒరులేయవి యొనరించిన/ నరవరయప్రియము తన మనంబునకగుదా/నొరులకు నవి సేయకునికి/ పరాయణము పరమధర్మ పథములకెల్లన్’... మహా భారతంలోని ఒక పద్యం ఇది. ‘ఇతరులు ఏమేమి చేస్తే తనకు బాధకలుగుతుందో, తాను ఇతరులకు అవి చేయ కపోవడమే గొప్పధర్మమని’ అర్థం. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే తెలుగు పత్రికారంగంలో విస్తృత స్థాయిలో ప్రారంభమైన తొలి పెద్ద పత్రిక ఆంధ్రపత్రిక. అంతకుముందు నుంచి తెలుగు పత్రికలు ఉన్నప్పటికీ, స్థాయి రీత్యా ఆంధ్రపత్రిక స్థానం ప్రత్యేకం. ఆ పత్రిక తన సంపాదకీయ పేజీలో, సంపాదకీయానికి మకుటం లాగా ఈ పద్యాన్ని ప్రచురించేది. అకారణంగా ఎవరి మనసునూ కష్టపెట్టడం మా లక్ష్యం కాదు అని తన ఎడి టోరియల్ పాలసీని ఆ రకంగా ఆంధ్రపత్రిక ప్రకటించింది.
అలా ప్రారంభమైన తెలుగు పత్రికల ప్రస్థానం చంద్రబాబు నాయకత్వంలో ఎల్లో సిండికేట్‌గా అవత రించే నాటికి తలకిందులైంది. తమ ప్రయోజనాల పరి రక్షణ కోసం ఇతరులను వేధించడం, బాధించడమే తమ తక్షణ కర్తవ్యాలని సంకల్పం చెప్పుకున్నట్టుగా ఈ సిండి కేట్ మీడియా ప్రవర్తించింది. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు భవిష్యత్తు ఐటి రంగంలో అగ్ర స్థానంలో నిలబడే అవకాశాన్ని హైదరాబాద్ నగరానికి ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాను హైదరాబాద్‌లో స్థాపించి ఆ నగరంపై తనకున్న ప్రేమ ను చాటుకున్నారు. కానీ, ఆ తర్వాత ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నిర్వాకం ఫలి తంగా బెంగళూరు నగరం కంటే ఎంతో వెనకబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబు అధికారం నుంచి తప్పుకునే నాటికి హైదరాబాద్ ఐటీ ఎగుమతుల విలువ 15 వేల కోట్లు ఉంటే, బెంగళూరు ఐటీ ఎగుమతుల విలువ ఇంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ. వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్ ఎగుమతులు 36 వేల కోట్లు దాటాయి. వాస్తవాలు ఇలా వుంటే, కంప్యూటర్‌ను కనిపెట్టింది చంద్రబాబే అనే స్థాయిలో సిండికేట్ మీడియా ప్రచారాన్ని చేసిపెట్టింది. గడిచిన పాతికేళ్లుగా చంద్రబాబును ఇంద్రుడిగా, ఆయన అనుయాయులను దేవతలుగా, ఆయన ప్రత్యర్థులను రాక్షసులుగా చూపడానికి ఈ మీడియా చేయని ప్రయ త్నం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలను తుంగలో తొక్కితే ప్రాప్తకాలజ్ఞతగా కీర్తించారు. అవకాశవాద పొత్తులు పెట్టుకుంటే రాజకీయ చతురతగా శ్లాఘిం చారు. చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షేమ కార్య క్రమా లను అమలుచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పరి పాలనను ప్రజాకంటకమైనదిగా చిత్రించి మహాకూటమి ద్వారా ఓడించే ప్రయత్నం చేశారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనే ఒకే ఒక వ్యక్తి టార్గె ట్‌గా ఎల్లో సిండికేట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూట మి కట్టి వ్యవస్థలను ప్రభావితం చేస్తూ చేసిన దాడి, సాగించిన దుష్ప్రచారం ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇంకెక్కడా కనిపించదు. దారుణమైన వ్యక్తిత్వహననానికీ, నిర్బంధానికి లోనై కూడా ఆయన వజ్ర సంకల్పంతో విజేతగా నిలవడం సిండికేట్‌ను నిస్పృహకు గురిచేసింది. దీనికి తోడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పరిపాలనలో బడుగు బలహీన వర్గాలను, మహి ళలను భాగస్వాములను చేస్తూ, ప్రభుత్వ యం త్రాంగాన్ని ప్రజల ఇంటిగడప తొక్కిస్తున్న తీరును చూసి బెంబేలెత్తిపోతున్నారు. భవిష్యత్తు అంధకారమయంగా తోస్తున్నది.
చంద్రబాబునాయుడు, ఆయన అనుయాయులు మాట్లాడుతున్న తీరును ఈ కోణంలోనే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ‘ఎటు చూస్తే అటు చీకటి/అటు దుఃఖం, పటునిరాశ...’అనే స్థితిలో సంయమనం కోల్పో యినట్లు కనిపిస్తున్నది. మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు వలంటీర్లు వచ్చి తలుపు తడతారు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య అత్యంత దుర్మార్గమైనది. ఇది యావ దాంధ్ర మహిళాలోకాన్ని దారుణంగా అవమానిం చడమే. కేరళవంటి రాష్ట్రంలో ఇదే వ్యాఖ్య ఎవ రైనా ఓ సీనియర్ రాజకీయ నేత చేసినట్లయితే ఈపాటికి శంకరగిరి మాన్యాలు పట్టేవాడు.
ఇక్కడ చుట్టూ బలంగా అల్లుకున్న ఎల్లో సిండికేట్ ఈ వ్యాఖ్యను జనంలోకి వెళ్ల కుండా ఆపగలిగింది. ‘కామాతురాణం న భయం న లజ్జా...’ అన్నట్టుగానే నిస్పృహ, నిర్వేదం గుండెనిండా ఆవరించినప్పుడు వివేకం నశిస్తుంది. ఇంగితం లయ తప్పుతుంది. వైఎస్ జగన్ నాలుగు మాసాల పాలనపై ఎల్లో మీడియా పలుకుతున్న అపస్వరాలకు అటువంటి అచేతన స్థితే కారణం. ఇప్పటికే పాతాళానికి జారి పోయిన క్షుద్ర బేతాళ రాజకీయాలను అక్కడే పాతే సినట్లయితే తెలుగునాట మళ్లీ సరికొత్త విలువలతో కూడిన రాజకీయం చిగురుతొడుగుతుందని ఆశిద్దాం.
-వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment