బొబ్బిలిలో టీడీపీ కార్యకర్తలతో నినాదాలు చేయించిన చంద్రబాబు
సాక్షి, విజయనగరం: ‘సంక్షేమ పాలన కావాలంటే సైకిల్ పోవాలి’ అని సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబే తన పార్టీ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. తరువాత తమాయించుకొని సైకిల్ రావాలని చెప్పించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం రాత్రి జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ సభలో చంద్రబాబు ప్రసంగమంతా అబద్ధాలు, తడబాట్లతో సాగింది.
రాష్ట్రానికి తాను చేసిన మేలేమీ లేకపోవడంతో ఎన్.టి.రామారావు హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను, ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రస్తావించారు. తన పాలనలో ప్రైవేటుపరం చేసిన ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ పాలనలో నష్టాల పాలైందంటూ అబద్ధాలు చెప్పడంతో అంతా నిర్ఘాంతపోయారు. ప్రజలు ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్‌ను గెలిపించారని, ఆయన భష్మాసురుడై జనం నెత్తిన చేయిపెడుతున్నాడని ఆరోపించారు. జగన్ తనకే రాజకీయాలు నేర్పిస్తున్నారని వాపోయారు.
చదవండి: (CM Jagan: కొత్త వ్యూహాలతో.. ప్రత్యర్థులకు సర్రున కాలేలా..)
జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. తెలుగు ప్రజల కోసం తెలంగాణలోనైనా, అమెరికాలోనైనా, ఆస్ట్రేలియాలోనైనా ఎక్కడైనా ఉంటానని అన్నారు. తనకు మళ్లీ అధికారం ఇచ్చి ఉంటే పింఛను రూ.3,000 చేసేవాడినన్నారు. రూ.3 వేలు ఇస్తానన్న జగన్‌మోహన్‌రెడ్డికన్నా తానే గొప్పంటూ చెప్పుకోవడం గమనార్హం.
విశాఖ రాజధాని పేరుతో ఆస్తులను రాయించుకున్నారన్నారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, దీనికి సంఘీభావం ప్రకటించాలని కార్యకర్తలను పదేపదే వేడుకొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును తానే ప్రారంభించా నని, తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసిందీ, ప్రారంభించిందీ తానేనని, ఇప్పుడు అవన్నీ పడకేశాయంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేయడంతో కార్యకర్తలే నిర్ఘాంతపోయారు. మహిళలకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు తానే అమలు చేశానన్నారు. ఇంకా ప్రసంగించాలని ఉన్నా తనకు అలర్జీ ఉందని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తన అశక్తతను బయటపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment