చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైకిల్ పార్టీ కనుమరుగవుతుందా? గత ఎన్నికల్లో కుప్పంలో మాత్రమే గెలిచి ఎలాగో ఒడ్డున పడ్డారు చంద్రబాబు. కానీ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లభిస్తున్న ఆదరణ చూసి పచ్చ పార్టీకి చెమట్లు పడుతున్నాయని టాక్. మదనపల్లిలో జగన్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. కనీవినీ ఎరుగని రీతిలో జనం హాజరయ్యారు. దీంతో టీడీపీ కేడర్‌లో గుబులు మొదలైంది.
చావు తప్పి కన్ను లొట్టబోయి
రాష్ట్రంలో 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలిచింది ఒకే ఒక స్థానం. అది కూడా కుప్పంలో చంద్రబాబు బొటా బొటి మెజారిటీతో ఒడ్డునపడ్డారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వశమైంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామని వైఎస్ఆర్సీ నేతలు శపథం పూనారు.
దానికి అనుగుణంగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. మదనపల్లిలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభకు పోటెత్తిన జనాన్ని చూసి టీడీపి శ్రేణుల్లో వణుకు ప్రారంభమైంది. ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో వైఎస్ జగన్ సభకు ప్రజలు హాజరుకావడమే ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమిని పచ్చ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారట. వైఎస్ జగన్ చెప్పినట్లు వై నాట్ 175 ప్రకటనకు తగ్గట్టుగానే సభ జరిగిందని టిడిపి క్యాడర్ చెవులు కొరుక్కొంటోందని టాక్.
మదనపల్లి దెబ్బ మామూలుగా లేదు కదా
మదనపల్లిలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ జరిగినప్పటినుంచీ.. ఏ ఇద్దరు టిడిపి కార్యకర్తలు కలిసినా సభ గురించే మాట్లాడుకుంటున్నట్లు చెబుతున్నారు. మదనపల్లితో పాటు తంబళ్లపల్లి, పీలేరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సీఎం వైఎస్ జగన్ సభ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. చంద్రబాబు సైతం తమ పార్టీ శ్రేణులతో ఫోన్లో మాట్లాడి..సభ జరిగిన తీరు గురించి తెలుసుకున్నారట. ఇంత భారీగా జగన్ సభ ఎలా జరిగిందంటూ ఆరా తీస్తున్నారట. మదనపల్లిలో జగన్ సభ తర్వాత టిడిపి క్యాడర్ ఇక తమ పార్టీ బతికి బట్ట కట్టే అవకాశం లేదని నిర్ధారించుకున్నారట.
అందుకే ఎవరిదారి వారు చూసుకునే ప్రయత్నాలు ప్రారంభించారనతి తెలుస్తోంది. మొత్తం మీద మదనపల్లిలో సీఎం జగన్ సభ టిడిపి క్యాడ తీవ్ర నిరాశలోకి నెట్టేసిందని ప్రచారం జరుగుతోంది. ఇక ముందు చంద్రబాబును నమ్ముకుంటే రాజకీయంగా భవిష్యత్ ఉండదని గ్రామస్థాయి నాయకులు, కేడర్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎదగాలంటే మరో పార్టీలో చేరాల్సిందేనని పచ్చ పార్టీ కేడర్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సీఎం వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సభకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. జగన్కు వస్తున్న ప్రజల్ని చూసి తెలుగుదేశం కేడర్లో ఆందోళన పెరుగుతుంటే..వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత జోష్ పెరుగుతోంది.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment