కుప్పం పచ్చ కోట కూలిపోతోందా? కుప్పం నా అడ్డా అన్న చంద్రబాబు వేరే దారి చూసుకుంటున్నారా? ముఖ్యమంత్రి జగన్ సభ తర్వాత తెలుగు తమ్ముళ్ళు తీవ్ర నిరాశలో కూరుకుపోయారా? కుప్పంలో పచ్చ పార్టీ పని ముగిసిందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తోంది. కుప్పంలో వైఎస్ జగన్ టూర్ తర్వాత రాజకీయ సమీకరణాల్లో జరిగిన మార్పులేంటి?
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఒకప్పుడు పచ్చ పార్టీకి కంచుకోట. మూడు దశాబ్దాలకు పైగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కుప్పంకు నాన్ లోకల్‌గా పేరుపడ్డ చంద్రబాబు ఏనాడూ కుప్పం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. రెవిన్యూ డివిజన్ ఏర్పడింది. కుప్పం మున్సిపాలిటీ అయింది. చంద్రబాబు ఏలుబడి కంటే వైఎస్ జగన్ పాలనలోనే తమ జీవితాలు బాగుతున్నాయని కుప్పం ప్రజలు భావిస్తున్నారు. అందుకే జగన్ వచ్చాక జరిగిన స్థానిక ఎన్నికలన్నింటా తెలుగుదేశం దారుణంగా ఓడిపోయింది. ముప్పయి సంవత్సరాలుగా కుప్పం నా అడ్డా అని చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబును అక్కడి ప్రజలు ఘోరంగా తిరస్కరించారు.
ఇక కుప్పంలో నిర్మించుకున్న పచ్చ కోటలన్నీ కూలిపోతుండటంతో కళ్ళు తెరిచిన చంద్రబాబు కొంతకాలం క్రితం అక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గూండాగిరీ కూడా చేయించారు పచ్చ పార్టీ నేతలు. కుప్పం ప్రజలు తనను మర్చిపోతున్నారనే భయం, ఆందోళన చంద్రబాబులో మొదలయ్యాయి. వారం క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం టూర్‌తో టీడీపీ పతనం పరిపూర్ణం అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ సభకు వచ్చినంత మంది ప్రజలు గతంలో ఏనాడూ చంద్రబాబు సభలకు రాలేదని అందరూ ఏకోన్ముఖంగా చెబుతున్నారు. కుప్పంను తన సొంత నియోజకవర్గం మాదిరిగా అభివృద్ధి చేస్తానని జగన్ ఇచ్చిన హామీతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పం లో సీఎం వైఎస్ జగన్ సభ సూపర్ సక్సెస్ కావడంతో టిడిపి శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. కుప్పంలో వారం రోజులుగా ఎక్కడ చూసినా సీఎం సభ గురించే చర్చ జరుగుతుండడం విశేషం. చంద్రబాబు రాజకీయ జీవితంలో కుప్పంలో నిర్వహించిన సభలకు ఎప్పుడూ ఇంత జనం హాజరు కాలేదని టిడిపి కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. కుప్పంతోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారో చూడాలి అని టిడిపి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. ఇదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. నియోజవర్గంలోని 4 మండలాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమరోత్సహంలో ఉన్నారట. గతం కంటే సీఎం సభ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
కుప్పంలో సీఎం జగన్ సభ సూపర్ సక్సెస్ కావడంతో టిడిపి వర్గాల్లో గుబులు ప్రారంభమైంది. చంద్రబాబు అడ్డాలో కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడే పరిస్థితులు కనిపిస్తుండటంతో... చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై టిడిపి వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అందుకే కుప్పంతో పాటు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారని పచ్చ పార్టీలో టాక్ నడుస్తోందట.
Comments
Please login to add a commentAdd a comment