సాధారణంగా రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థికి చెందిన నియోజకవర్గంలో పర్యటించేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎంతసేపూ తమకు చెల్లుబాటు అయ్యే ప్రాంతాలు, తమకు ఆదరాభిమానాలు మెండుగా ఉండే చోట్లకు మాత్రమే వెళ్లేందుకు ఇష్టపడతారు. పైగా వైరిపక్షమన్న పేరుతో ఆయా నియోజకవర్గాలకు పనులు చేయని సందర్భాలూ గతంలో కోకొల్లలు. రాజకీయ వైరి అయిన నాయకుడి ఇలాకాలోకి వెళ్ళడానికి ఇష్టపడరు.. ఎందుకంటే అక్కడి ప్రజల అప్పటికే తన ప్రత్యర్థిని తమ నాయకుడిగా ఎన్నుకుని ఆదరించారని, తాను ఇప్పుడు అక్కడికి వెళ్లినా తనను అక్కడి ప్రజలు ఆత్మీయంగా రిసీవ్ చేసుకోరని, పైగా ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల నుంచి తిరస్కారం.. వ్యతిరేకత వంటి అనుభవాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న సందేహంతో అక్కడికి వెళ్లరు.
వెళ్లినా ఎక్కువసేపు అక్కడ గడపడానికి ఇష్టపడరు.. ఇలా వెళ్లి అలా సేఫ్‌గా వచ్చేద్దాం అనుకుంటారు.. అయితే ఇప్పుడు రాజకీయం మారిపోయింది. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేరుగా రాజకీయ ప్రత్యర్థి బాబు ఇలాకాలోనే సింహనాదం చేశారు. చంద్రబాబును 1989 నుంచి వరుసగా గెలిపిస్తూ వస్తున్న కుప్పంలో కాసేపటి క్రితం పర్యటించారు. హంద్రీ నివా కాలువ ద్వారా కుప్పానికి సాగు నీరుతోబాటు నాలుగైదు లక్షలమందికి తాగునీరు అందించే ప్రాజెక్టును ప్రారంభించారు.
అంతేకాకుండా ఆ తరువాత అయన సుదీర్ఘంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత 35 ఏళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్న ప్రజలను చంద్రబాబు ఏ విధంగా వాడుకుని వదిలేశారు..? వాళ్ళను ఎలా మోసం చేస్తూ వచ్చింది అన్నది పూసగుచ్చినట్లు జగన్ వివరించారు.. కుప్పాన్ని తమ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా అభివృద్ధి చేసిందీ... అప్పట్లో కేవలం పంచాయతీగా ఉన్న కుప్పాన్ని తామే మున్సిపాలిటీగా,, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా.. పోలీస్ డివిజన్ కేంద్రంగా అప్ గ్రేడ్ చేసిన విషయాన్నీ అయన వివరించారు. అంతేకాకుండా బాబు హయాంలో ప్రాజక్టుల పనులను చంద్రబాబు , అయన అనుచరులు ఏ విధంగా వాడుకుని లబ్ది పొందినది చెబుతూనే తాము వచ్చాక పథకాలు, సంక్షేమం ఇంటింటికీ ఎలా అందిస్తున్నది ప్రతి పాయింటునూ వివరించారు.
జగనన్న ఇళ్ళు, పెన్షన్లు, ఉద్యోగాలు, ఉపాధి వ్యవసాయం, రైతుభరోసా కేంద్రాలు... చిత్తూరు డైరీ ఇలా ప్రతి అంశంలోనూ తన ప్రభుత్వ పనితీరును, దాని ద్వారా లబ్ధిపొందిన విధానాన్ని లెక్కలతో వివరించారు. తాను చంద్రబాబు మాదిరిగా తనవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగించే నాయకుడిని కాదని, ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ అందర్నీ సమదృష్టితో చూస్తూ అందరికీ ప్రభుత్వ సేవలు, పథకాలు అందిస్తాం అని చెబుతూ వారి నుంచి చప్పట్ల రూపంలో మద్దతు పొందారు. అంతేకాకుండా మీ నియోజకవర్గానికి ఏమీ ఉపయోగపడని చంద్రబాబును ఇన్నేళ్లు మోసిన ప్రజలకు జోహార్లు అనడం ద్వారా మీరంతా ఇలాంటి పనికిరాని నాయకుడిని ఇన్నాళ్లూ ఎలా మోశారబ్బా అనే ప్రశ్న కూడా వేసినట్లయింది.
ఇక ఆయన్ను వదిలించుకోవాలని, సమర్ధుడైన భరత్‌ను గెలిపించుకుని కుప్పాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడాలని కోరారు. భరత్ గెలిస్తే ఆయనకు మంత్రిపదవి ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా కుప్పాన్ని తన సొంత ప్రాంతంగా భావిస్తానని చెప్పేసారు. తాను ఎన్నడూ కుప్పం ప్రజలను పల్లెత్తు మాట అనలేదు కానీ చంద్రబాబు మాత్రం నిత్యం రాయలసీమతోబాటు పులివెందుల ప్రజలను చిన్నచూపు చూస్తూ కించపరుస్తుంటారు అని గుర్తు చేసారు.. అలా చెప్పడం ద్వారా 'చూసారా... అయన మన ప్రాంతాన్ని ఎలా అవమానిస్తున్నారో' అని ప్రజలకు గుర్తు చేసారు.. ఫైనల్ గా జగన్ కుప్పంలో అడుగుపెట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే చంద్రబాబును కడిగిపారేశారు.
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment