వై నాట్ 175 ప్రచారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును భయపెడుతోందా? వచ్చే ఎన్నికల్లో కుప్పం కూడా జారిపోతుందని ఆందోళన చెందుతున్నారా? కుప్పం గురించి చంద్రబాబు సొంత సర్వేలు ఏం చెబుతున్నాయి? ఎన్నడూ లేనిది పచ్చపార్టీ బాస్ ఎందుకింత భయపడుతున్నారు? హఠాత్తుగా కుప్పానికి కమిటీలు ఎందుకు వేస్తున్నారు?
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి గడపను తాకుతున్నాయి. ప్రతి ఇంటికి లంచాలకు తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాలు గెలవలేమని సీఎం జగన్ ప్రశ్నించుకున్నారు. 175 సీట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఇదే నినాదంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇటీవల టైమ్స్ నౌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 24 లేదా 25 ఎంపీ స్థానాలు వస్తాయని తేలింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే అది కచ్చితంగా చేసి తీరుతాడని భావించిన చంద్రబాబుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గురించి భయం పట్టుకుంది. కుప్పంలో 2014 ఎన్నికల్లో 47 వేల మెజార్టీ సాధించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో 30 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది.
చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు చేయని విధంగా కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా సీఎం జగన్ చేసి చూపించారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇదంతా చూస్తున్న చంద్రబాబుకు కుప్పం భయం వెంటాడుతోంది. అందుకే సొంతంగా చేయించుకున్న అంతర్గత సర్వేలో కుప్పంలో కూడా టీడీపీకి ఎదురుగాలి వీస్తుందని తేలింది. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైతం గెలవడం కష్టమేనని పార్టీ నేతలు కూడా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఉన్నఫలంగా కమిటీ..
కుప్పం గురించి ఆందోళన చెందుతున్న చంద్రబాబు ఉన్నఫలంగా పార్టీ తరపున ముగ్గురితో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. మరో 31 మందితో జంబో కమిటీ వేసుకున్నారు. అంతేకాకుండా కుప్పం పట్టణంలో టీడీపీ బలోపేతం కోసం ఎనిమిది మందితో మరొక కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలను వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ సాధించడం కోసం ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఏడాది క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో కూడా టీడీపీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడమే కారణం. నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీతో సహా, పంచాయితీలు, మండలాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి.
గత ఎన్నికల్లో చంద్రబాబుకు 30 వేల మెజారిటీ వస్తే..స్థానిక ఎన్నికల్లో నాలుగు మండలాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు 62 వేల మెజారిటీ వచ్చింది. స్థానిక ఎన్నికలు జరిగినప్పటినుంచి చంద్రబాబులో కుప్పం భయం మొదలైంది.
ఎన్నికలకు ఏడాది సమయమే ఉండడంతో కుప్పం నియోజకవర్గం అయినా చేజారిపోకూడదని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమి బాగోలేదని, సర్వేలు కూడా ఆశాజనకంగా లేవని లోకేష్ సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కుప్పంలో తనకు ఎదురుగాలి వీస్తున్నదని చంద్రబాబుకు స్పష్టంగా అర్థమైంది. అందుకే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. చూడాలి ఏం జరుగుతుందో..?
చదవండి: ఓటమిలో టీడీపీ రికార్డు.. 50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ పరాజయం!
Comments
Please login to add a commentAdd a comment