హామీల అమలులో ‘కూటమి’ ఘోర వైఫల్యం: మేరుగు నాగార్జున | Ysrcp Is Voice Of The Voiceless: Merugu Nagarjuna | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ‘కూటమి’ ఘోర వైఫల్యం: మేరుగు నాగార్జున

Published Tue, Apr 29 2025 7:36 PM | Last Updated on Tue, Apr 29 2025 7:47 PM

Ysrcp Is Voice Of The Voiceless: Merugu Nagarjuna

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ‘వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌లెస్‌’గా వైఎస్సార్‌సీపీ పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించారని మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని  ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు

ఆ బాధ్యత పార్టీపై ఉంది:
రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజాసమస్యలపై ఉద్యమించేందుకు సిద్దంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై, ప్రజల గోడు పట్టించుకోని నిర్లక్ష్యం తాండవిస్తోందని, దీనిపై ప్రజలకు  అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్‌ గుర్తు చేశారు.

వాటిపై దృష్టి సారించాల్సి ఉంది:
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉండాలనే కోణంలో సమావేశంలో జగన్‌ పలు అంశాలు నిర్దేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు పూర్తి సమన్వయంతో పని చేయాలని కోరారు.

హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి:
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్‌ఆర్‌సీపీ ఉండాలని వైయస్‌ జగన్‌ సూచించారు. ప్రజలకు కూటమి పార్టీలు 143 వాగ్ధానాలను ఇచ్చాయి. సూపర్‌ సిక్స్‌ కాస్తా గాలికి వదిలేశారు. గత వైయస్‌ఆర్‌సీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు, ప్రజల జీవన ప్రమాణాల్లో తీసుకువచ్చిన మార్పులను మరోసారి గుర్తు చేసుకోవాలి.

ఇప్పుడు వాగ్దానాల అమలు అనేది ఎక్కడా లేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు జరుగుతోంది. సంక్షేమ పథకాలు పేదలకు చేరువ కావడం లేదు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేదలు తమ పిల్లలను చదివించుకోలేక, బడికి పంపాల్సిన పిల్లలను కూలికి పంపుతున్నారు. ఇటువంటి స్థితిలో వైయస్సార్‌సీపీ వారికి అండగా నిలబడుతుంది.

రైతుల్లో భరోసా కల్పించాలి:
రైతులను పట్టించుకునే తీరికే కూటమి ప్రభుత్వానికి లేదు. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయంలో రైతేరాజుగా ప్రాధాన్యత ఇచ్చాం. రైతుభరోసా  ద్వారా రైతులకు అండగా నిలిచాం. విత్తనం నంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా ఆనాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదుకుంది. నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవలే గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్ళిన వైఎస్‌ జగన్‌కి మిర్చిరైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీనిపై వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాసి, కేంద్రం ద్వారా మిర్చి కొనుగోళ్లు చేయిస్తామంటూ ఒక ప్రకటన చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత మిర్చి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇప్పుడు మిర్చి రైతులు కనీస ధరలు లేక, అప్పులపాలై దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మిర్చి రైతులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ కూటమి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకుంటామో కూడా వారికి ఒక భరోసాను కల్పించాలని వైఎస్‌ జగన్‌ నిర్ధేశించారు.

పొగాకు రైతుల గోడు కూటమి సర్కార్‌కు పట్టడం లేదు:
పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొగాకు రైతులు తమ పంటను వ్యాపారులు కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదని చెబితే, సదరు వ్యాపారుల ఫ్యాక్టరీలకు కరెంట్‌ తీసేస్తాను అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడారు. పొగాకు రైతులను అప్పటికప్పుడు నమ్మించి పంపి, ఆ తరువాత వారి గోడును కనీసం పట్టించుకోని ఘనుడు చంద్రబాబు.

అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పొగాకు రైతుల విజ్ఞప్తులకు స్పందించి వ్యాపారులు తప్పకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి, మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.200 కోట్లకు పైగా వెచ్చించి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. అదీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చిత్తశుద్ది. ఈరోజు మార్కెట్‌లో క్వింటా పొగాకు రూ.36 వేలు ధర పలకాల్సి ఉండగా, మార్కెట్‌లో రూ.22 వేలకు కూడా కొనడం లేదు. అందుకే పొగాకు రైతుల పక్షాన ఉద్యమించడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉండాలని సమావేశంలో వైఎస్‌ జగన్‌ నిర్దేశించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement