నెల్లూరు (టౌన్): వచ్చే ఎన్నికల్లో తాను కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జ్ లు, పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మా ట్లాడుతూ రానున్న రోజుల్లో ఫండ్ రైజింగ్ పేరుతో రూ.5 వేలు చెల్లిస్తే పార్టీ పర్మినెంట్ మెంబర్‌షిప్ ఇస్తామన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో వైఎస్సార్‌సీపీ పతనం ప్రారంభమైందన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు 175 నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించి వైఎస్సార్‌సీపీని ఇంటికి పంపిస్తారని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైనాట్ కుప్పం అని చెబుతున్నారని, తాము వైనాట్ పులివెందుల అనే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో క్లస్టర్, మండల, బూత్ ఇన్‌చార్జిలు ఎన్ని ఓట్లు సంపాదిస్తామో అన్న ప్రణా ళికను రచించుకోవాలన్నారు. ప్రజా సంబంధాలు ముఖ్యమని, ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్ ప్రజలతో సంబంధం లేకనే లోక్‌సభ ఎన్నికల్లో గెలవలేదన్నారు. తనకు మనుషులే లేరని చెబుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులను ప్రజలే ఇచ్చారన్నారు.
తాము 7.70 లక్షల ఇళ్లు పేదలకు కట్టిస్తే వాటిని గత నాలుగేళ్లుగా వారికి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. జగనే రాష్ట్రానికి దరిద్రం, శని, సైతాన్ అని అన్నారు. పోస్టింగ్‌లు పెట్టినా, వార్తలు రాసినా జైలుకు పంపిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీని ప్రజలు నిలదీయాలన్నారు. వలంటీర్ వ్యవస్థ ప్రజల కోసం పెట్టారని, ప్రజలు కట్టిన పన్నులతోనే వారికి జీతాలు ఇస్తున్నారన్నారు. వలంటీర్లు జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి సేవలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
వలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకించడంలేదని, వారు జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. వైఎస్సార్‌సీపీకి పనిచేసే వారిని క్లస్టర్ ఇన్‌చార్జ్ లు, మండల, గ్రామ నాయకులు నిలదీయాలన్నారు. దేశంలో 100 నగరాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. 100వ కార్యక్రమంలో భాగంగా మే 31న రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
నాలుగేళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారు
సాక్షి, అమరావతి : ఈ నాలుగేళ్లలో మీరు ఎన్ని ఇళ్లు కట్టారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ట్విటర్‌లో ప్రశ్నించారు. నెల్లూరులో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగి దాన్ని సీఎం జగన్ ట్విటర్‌కు ట్యాగ్ చేసారు. తమ ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే వేలాదిగా కట్టిన టిడ్కో ఇళ్లు ఇవేనని, లక్షల టిడ్కో ఇళ్లకు ఇవి సజీవ సాక్ష్యాలని తెలిపారు. మీరు కట్టిన ఇళ్లు ఎన్నో చెప్పాలని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment