సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో కుప్పంతో సహా ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా వెళ్దాం. ఏ రంగాన్ని అయినా తీసుకుందాం. ఏ సామాజిక వర్గాన్ని అయినా అడుగుదాం. 2014 నుంచి 2019 వరకు.. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఎంత మేలు జరిగిందో ఒక్కసారి పోల్చి చూడండని చెబుదాం. చంద్రబాబు ప్రభుత్వం చేసిన చెడే కనిపిస్తుంది. మన ప్రభుత్వం చేస్తున్న మంచే కనిపిస్తుంది. దాదాపు 34 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి సుపరిపాలన అందిస్తున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, పరిపాలనా సంస్కరణలు, గ్రామాల్లో స్పష్టంగా మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామాల స్వరూపం మారుతోంది. జిల్లాల స్వరూపం మారుతోంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ వేదికగా ఘంటాపథంగా పేర్కొన్నారు.
‘సుపరిపాలన అందిస్తున్నందునే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైఎస్సార్‌సీపీని భారీ మెజార్టీతో గెలిపించారు. తద్వారా 14 ఏళ్లలో ఏం చేశావని ప్రజలు చంద్రబాబును నిలదీశారు. ఇచ్చిన మాట తప్పని జగన్ పాలనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు’ అని చెప్పారు. రాజధానిని వికేంద్రీకరిస్తామంటే చంద్రబాబుకు తన భూములు, తన వారి భూములు, వాటి ధరలే గుర్తుకు వస్తాయి గానీ ప్రజల ఆకాంక్షలు, మూడు ప్రాంతాల సమానాభివృద్ధి గుర్తుకు రావని ధ్వజమెత్తారు. ‘రాజధాని, ఇంగ్లిష్ మీడియం, 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు.. ఇలా ప్రజలకు మేలు జరిగేది ఏది చేస్తున్నా సరే చంద్రబాబు తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుంటారు’ అని దుయ్యబట్టారు.
‘టీడీపీ చేసిన అప్పులను తీరుస్తున్నాం. వారి పాపాలను ప్రాయశ్చిత్తం చేస్తున్నాం’ అని గణాంకాలతో సహా వివరించారు. చంద్రబాబుది ఆర్థిక అరాచకమని విరుచుకుపడ్డారు. చంద్రబాబు బుర్ర తక్కువ పాలనే ఆమోఘం, అద్భుతం అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 బుర్రకథలు చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. శాసనసభలో గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఆయన్ను అవమానించి దాడి చేసినంత పని చేసిన టీడీపీ సభ్యుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఇంకా ఇలా సాగింది.
గవర్నర్‌ను అవమానించడం దారుణం
►ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను వివరిస్తారు. అందులో ఏమైనా అంశాలపై విభేదించాలనుకుంటే, విపక్షానికి సమయం ఇస్తారు. అప్పుడు మాట్లాడాలి. చంద్రబాబును సభకు రావొద్దని మేము చెప్పలేదు. ఆయనే ముఖం చూపించలేకే రావడం లేదు.
►గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైంది. ఆయన రాష్ట్రానికి పెద్ద. పైగా వయసులోనూ 87 ఏళ్ల పెద్దాయన. ప్రొటోకాల్‌లో మొదటి స్థానంలో ఉన్న గవర్నర్‌ను టీడీపీ సభ్యులు అవమానపర్చడమే కాకుండా దాదాపు దాడి చేసినంత పని చేశారు. ప్రసంగం తర్వాత గవర్నర్ తిరిగి వెళ్తున్నప్పుడు కూడా నినాదాలు చేశారు.
►రాజ్యాంగ వ్యవస్థ అంటే చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం లేదు. మేము విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. గవర్నర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అయినా ఆయన్ను దారుణంగా అవమానించారు. చంద్రబాబు సభకు రాకపోయినా తన పార్టీ వారిని, తన కొడుకును అక్కడ నిలబెట్టి 87 ఏళ్ల వయసున్న పెద్దాయనను అవమానించారు. దిగజారి వ్యవహరించారు.
వెన్నుపోటే చంద్రబాబు పథకం
►టీడీపీని నేను నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏమిటి? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే కనీసం ఒక్క సంక్షేమ ప«థకం అయినా ఉందా? ఆయన పేరు చెబితే వెన్నుపోటు గుర్తుకు వస్తుందని మా సభ్యులంతా చెబుతున్నారు. వెన్నుపోటే ఆయన పథకం.
►ఎన్టీ రామారావు మొదలు ప్రధాని మోదీ వరకు ఆయన ఎవరినీ వదల్లేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక వాటికి చంద్రబాబు ఇచ్చిన విలువ ఏమిటో అందరికీ తెలుసు.
ప్రతి ఎన్నికలోనూ ఫ్యాన్‌కే ఓటు
►అదే మన ప్రభుత్వం.. ఎన్నికల వాగ్దానాలకు ఎంతటి విలువ ఇస్తుందో దాదాపు 34 నెలల పాలనలో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలను గెల్చుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటేశారు.
►మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీటీసీ, మండల, పంచాయతీ ఎన్నికలతోపాటు తిరుపతి ఎంపీ, బద్వేల్ ఎమ్మెల్యేల ఉప ఎన్నికలు ఇలా అన్నింటిలోనూ ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు. 87 మున్సిపాలిటీలలో వైఎస్సార్‌సీపీ 84 చోట్ల గెల్చింది. వాస్తవానికి 85 చోట్ల గెల్చాం. కోర్టు కేసు వల్ల ఒక చోట ఫలితాలు వెల్లడించ లేదు.
►12 కార్పొరేషన్లు, 13 జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం వైఎస్సార్‌సీపీ గెల్చింది. 9,702 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 8,298 స్థానాల్లో అంటే 86 శాతం వైఎస్సార్‌సీపీ గెల్చింది. 652 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 639 చోట్ల అంటే 98 శాతం వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 648 ఎంపీపీలకు ఎన్నికలు జరిగితే 639 ఎంపీపీలు అంటే 98.6 శాతం వైఎస్సార్ కాంగ్రెస్ గెల్చుకుంది. చివరికి కుప్పం ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీనే విజయం సాధించింది.
చంద్రబాబును ప్రశ్నించిన ప్రజలు
►ఇంతలా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేయడం ద్వారా ప్రజలు చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగారు. చంద్రబాబూ.. మీరు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. కోవిడ్ సహా, ప్రపంచమే ఊహించని కష్టాలు ఎదురై ఆర్థిక పరిస్థితులు తలకిందులైనా జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రజలు తీర్పు ఇచ్చారు.
►మేనిఫెస్టోలో 95 శాతం వాగ్దానాలు నిలబెట్టుకున్నాం. అందుకే ప్రజలు ఆశీర్వదించారు. దీని అర్థం చంద్రబాబు గత వికృత పాలనను, ఆయన ప్రస్తుత వైఖరికి ప్రజలు ఛీకొడుతూ ఇచ్చిన తీర్పు ఇది.
లంచం లేకుండా ఒక్క పథకం ఇచ్చారా?
►చంద్రబాబు పాలనలో ఏ పథకాన్ని అయినా కులం, మతం, వర్గం చూడకుండా శాచురేషన్ పద్ధతిలో అమలు చేశారా? ఏ పథకం అయినా లంచం లేకుండా ఇచ్చారా? ఇవాళ ప్రజలకు కావాల్సింది లంచాలతో పని చేసే జన్మభూమి కమిటీలా? లేక అవినీతి లేని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థనా?
►ప్రతి నెల ఒకటో తేదీన ఆదివారం అయినా, పండగ అయినా సరే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అంటే 2019 జనవరి వరకు చంద్రబాబు పెన్షన్‌గా ఇచ్చింది నెలకు రూ.1000 మాత్రమే.
మారుతున్న గ్రామాల స్వరూపం
►రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా ప్రతి 2 వేల మందికి పౌర సేవలందించే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అక్కడ 10 మంది యూనిఫామ్‌తో సేవలందిస్తున్నారు. అదే గ్రామంలో రైతులకు విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు రైతుకు తోడుగా నిల్చే రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి.
►నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి. అక్కడే 24గంటల పాటు నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఉంటారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఆయా గ్రామాల బాధ్యత వారిది. అదే గ్రామంలో ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్ ఉంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి.
►ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లుగా మెరుగులు దిద్దుకుంటున్న అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి మండలంలో 108 సర్వీసు, 104 సర్వీసులు, రెండు పీహెచ్‌సీలు ఉన్నాయి. కేవలం 34 నెలల కాలంలో మన ప్రభుత్వం మార్చిన, మారుస్తున్న గ్రామ స్వరూపం ఇది. చంద్రబాబుకు గ్రామం అంటే అభిమానం, ప్రేమ లేదు. ప్రజల స్వభావం తెలుసుకునే తత్వమూ లేదు.
జిల్లాలూ మారుతున్నాయి..
►జిల్లాల స్వరూపం కూడా మారుతోంది. ఆరు నుంచి 8 నియోజకవర్గాలకు ఒక జిల్లా ఏర్పాటు కానుంది. కొత్త జిల్లాలతో చేస్తున్న పరిపాలనా వికేంద్రీకరణ ఇది. రాజధాని వికేంద్రీకరణ వద్దంటున్న వారు కూడా తమకు జిల్లా కేంద్రం కావాలని కోరుతున్నారు.
►చంద్రబాబు బావమరిది కూడా ఆయనను కాకుండా మనల్ని అడుగుతున్నారు. హిందూపూర్‌ను జిల్లా కేంద్రం చేయమని అడుగుతున్నారు. చివరకు చంద్రబాబు కూడా కుప్పంలో రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారు. ఆయన సీఎంగా ఉండగా కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయని ఆయన ఇప్పుడు మనల్ని చేయమని అడుగుతున్నారు. దీన్ని బట్టి ఎవరికి ఎంత విజన్ ఉందో ప్రజలకు అర్థం అవుతుంది.
మూడు ప్రాంతాల అభివృద్ధి పట్టని చంద్రబాబు
►రాజధాని వికేంద్రీకరిస్తామంటే మా భూములు, మా వారి భూములు, వాటి ధరలే చంద్రబాబుకు గుర్తుకు వస్తాయి. ప్రజల ఆకాంక్ష, మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి వంటివి ఆయన ఏనాడూ ఆలోచించలేదు. ఇక్కడ మనం చట్టాలు చేస్తాం. ప్రజల సభలో తీసుకున్న నిర్ణయాలవి.
►ఇంగ్లిష్ మీడియమ్ చదువులు కావొచ్చు.. పేదలకు ఇళ్ల స్థలాలు కావొచ్చు.. రాజధాని కావొచ్చు.. ఏ కోర్టులో అయినా వ్యతిరేకంగా తీర్పు వస్తే సంతోషపడేది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబే. ఎందుకంటే ఆయన కేసులు వేయిస్తారు. ప్రజలకు జరిగే మంచిని ఆయనే అడ్డుకుంటారు.
ప్రభుత్వ బడులను చంపేసిన బాబు
►ప్రభుత్వ బడులను చంపేయాలని గతంలో చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆయన హయాంలో ప్రభుత్వ బడులను చాలా వరకూ మూసేశారు. మనం వాటిని బతికించడమే కాకుండా వైభవం తీసుకువస్తున్నాం.
►చంద్రబాబు ప్రభుత్వం నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం పని చేస్తే.. మనం ప్రభుత్వం బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకుపోవడం కోసం పని చేస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో పిల్లలు తెలుగు మీడియమ్‌లో మాత్రమే చదవాలి.. తమ పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియమ్‌లో చదవాలనుకునే చంద్రబాబు విధానం మంచిదా... లేక నిరుపేదల పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియమ్‌లో చదవాలన్న మా విధానం మంచిదా? అని అడుగుతున్నాను.
►ఈ తరం పిల్లలు కూడా వారి పొలాల్లో కూలీలుగా, వారి వ్యాపారం, పరిశ్రమల్లో వెట్టిచాకిరి చేయాలన్న చంద్రబాబు అన్యాయమైన ఆలోచన మంచిదా లేక రాబోయే ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు, ఎదిగేందుకు అవకాశం ఉన్న చదువులు చదివించాలన్న మా విధానం సరైందా.. ఒక్కసారి ఆలోచించండి. అమ్మ ఒడి అనే పథకాన్ని చంద్రబాబు ఏనాడైనా కలలో అయినా ఊహించారా? పేదింటి పిల్లలు మధ్యలో చదువులు ఎందుకు మానేస్తున్నారో ఏనాడైనా ఆలోచించారా?
బడుల్లో పిల్లలు పెరుగుతున్నారు
►కోవిడ్ సమయంలో కూడా ప్రభుత్వ బడుల్లో పిల్లలు పెరిగారు. చంద్రబాబు హయాంలో బడులు
శిథిలాలుగా మారితే.. ఇవాళ నాడు-నేడుతో బడుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి.
కొత్తగా స్కూల్ టీచర్లే కాకుండా సబ్జెక్ట్ టీచర్లు కూడా రాబోతున్నారు.
►10 హంగులతో రూపం మారిన, మారుతున్న బడులు, వాటిని తెరిచే సమయానికి యూనిఫామ్స్, బైలింగ్వువల్ టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్‌తోపాటు, గోరుముద్ద పథకంతో మంచి ఆహారం ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టే బడుల్లో పిల్లలు పెరుగుతున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు 2018-19లో ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో కలిపి 70.43 లక్షల మంది పిల్లలు ఉంటే, ప్రస్తుతం 73.05 లక్షల మందికి పెరిగారు.
►అదే ప్రభుత్వ బడుల్లో 2018-19లో 37.20 లక్షల మంది పిల్లలు ఉంటే ప్రస్తుతం 43.43 లక్షల మంది ఉన్నారు. అంటే ఆరున్నర లక్షల మంది పిల్లలు ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ బడులకు మారారు.
►ప్రభుత్వ బడుల్లో చదివేందుకు ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు చేయించాల్సి వస్తోంది కూడా. ఆ స్థాయిలో ప్రభుత్వ బడులు మారుతున్నాయి.
బాబు హయాంలో జరిగి ఉంటేనా!
చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల సంఖ్య ఒక్క లక్ష పెరిగినా చాలు.. ప్రపంచ విద్యా రంగానికే చంద్రబాబు చుక్కాని... చుక్కా రామయ్య కంటే చంద్రబాబు గొప్ప విద్యావేత్త.. 100 శాతం అక్షరాస్యత ఉన్న దేశా«ల అధ్యక్షులు, ఐక్యారాజ్యసమితి ప్ర«ధాన కార్యదర్శి కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం కరకట్ట మీద పడిగాపులు కాస్తున్నారు.. ఇలా ఎల్లో మీడియాలో నెలల తరబడి కథనాలను మనం చూసే వాళ్లం. చంద్రబాబు పాలనలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చినా బ్రహ్మాండంగా ఉందని, రెండేళ్లు బకాయి పెట్టినా చాలా బాగుందని ఎల్లో మీడియా ప్రచారం చేసేది.
దుష్ప్రచారమే ఎల్లో మీడియా ఎజెండా
►దాదాపు రూ.1800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టి పోయినా చంద్రబాబు పాలన బాగుందని.. అదే జగన్ వాటిని చెల్లించి టైమ్ టు టైమ్ పూర్తి ఫీజు ఇస్తున్నా కూడా ఏమీ బాగా లేదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒకే రోజు రెండు స్టోరీలు ఇచ్చాయి.
►ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడుకు అనిపిస్తుంది. కానీ పిల్లలు, వారి తల్లిదండ్రులకు కాదు. చంద్రబాబు మధ్యాహ్న భోజన పథకంలో 8 నెలలు బకాయి పెట్టి పోయారు. అప్పుడు నీళ్ల చారు ఇస్తే, ఇవాళ రోజుకొక మెనూతో పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నాం. కానీ కాకి పిల్లకు కాకి ముద్దు అన్నట్లుగా ఎల్లో మీడియాకు చంద్రబాబు ముద్దు.
అక్క చెల్లమ్మలకు అండగా ఉన్నాం
►అక్కచెల్లెమ్మల విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో చంద్రబాబు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, ఆ పని చేయకపోగా, వారికి సున్నా వడ్డీ పథకం కూడా అమలు చేయలేదు. చాలా డ్వాక్రా సంఘాలను ఎన్‌పీఏలుగా మార్చాడు. మరి ఆ చంద్రబాబు పాలన బాగుందా?
►డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి.. వారి రూ.25 వేల కోట్లకు పైగా రుణాలను నాలుగు వాయిదాల్లో వారి చేతుల్లో పెడతామని చెప్పి.. ఇప్పటికే అందులో సగం రూ.12,758 కోట్లు దాదాపు 80 లక్షల అక్కచెల్లెమ్మలకు నేరుగా అందించి.. మిగతా మొత్తం కూడా ఇస్తున్న వైఎస్సార్ ఆసరా బాగుందా అని అడుగుతున్నాను.
►సున్నా వడ్డీ పథకం ఎగ్గొట్టిన చంద్రబాబు పాలన బాగుందా.. సున్నా వడ్డీ పథకానికే రూ.2,354 కోట్లు మనమే చెల్లించి ఇస్తున్న వైఎస్సార్ సున్నా వడ్డీ బాగుందా.. అని అడుగుతున్నాను.
►ఇసుక లూటీని ఆపిన ఎమ్మార్వో వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పడ్చుకుని ఈడ్చాడు. అలాగే ఆర్థికంగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రోడ్డు మీదకు ఈడ్చిన చంద్రబాబుకు అక్కచెల్లెమ్మలు, మహిళల గురించి మాట్లాడే అర్హతే లేదు. వారు ఆయన్ను అంతగా అసహ్యించుకుంటున్నారు.
అన్నీ ఆయనే చేశారంటూ డాంభిక ప్రచారం
►స్కూళ్లలో కనీస సదుపాయాలు లేకపోవడంతో ఆడ పిల్లలు చదువులు మానేస్తున్నారని చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? ఆడపిల్లల రక్షణ గురించి 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? బడులలో టాయిలెట్ల గురించి యోచించారా?
►ఇటువంటి ఈ పెద్దమనిషి సెల్‌ఫోన్ నేనే కనిపెట్టా.. హైదరాబాద్ నేనే కట్టా.. అదిగో హైపర్ లూప్.. ఇదిగో బులెట్ ట్రైన్.. ఇక్కడే ఎయిర్ బస్.. బిల్‌గేట్స్ నా కంప్యూటర్ నాలెడ్జ్ చూసి మూర్ఛబోయాడు.. సత్య నాదెళ్లకు నేనే చదువులు చెప్పించాను.. పీవీ సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించాను.. అని బడాయిలు, కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతారు.
►దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రతి 2 వేల జనాభాకు సచివాలయంలో మహిళా పోలీస్.. ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?
దిశ యాప్‌తో మహిళా భద్రత
►ఇప్పటి వరకు కోటి 13 లక్షల మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసిన ఫోన్‌ను 5సార్లు ఊపితే చాలు 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 10 నిమిషాల్లోపు పోలీసులు వస్తున్నారు.
►ఈ సమయాన్ని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటికే 900 మంది అక్కచెల్లెమ్మలు రక్షణ పొందారు. అయితే దీన్ని మేము ఏనాడూ మా ఘనతగా చెప్పుకోలేదు. ఒక బాధ్యతగా మహిళల భద్రత కోసం ఆలోచిస్తున్నామని గర్వంగా చెబుతున్నాం.
బాబు బుర్ర తక్కువ పాలన
అయినా చంద్రబాబు బుర్ర తక్కువ పాలనే అద్భుతమని, అమోఘమని బుర్రకథలు చెప్పడానికి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు.. ఇలా ప్రత్యేకమైన కళాకారులు, వారి కింద బృందాలను తయారు చేసుకున్నారు. ప్రజలకు మంచి చేసి, వారి మన్ననలు పొందాలన్న ఆలోచనే చేయ లేదు.
అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యం
►45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండి, కుటుంబ బాధ్యతలు తీసుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కచెల్లెమ్మల జీవితాల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించ లేదు. వారికి ఆర్థికంగా అండగా నిలబడితే ఆ కుటుంబాలకు మేలు జరుగుతుందని పట్టించుకోలేదు.
►25 లక్షల పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో మనం ఇస్తున్న డబ్బు అక్షరాలా రూ.75 వేలు. ఏటా రూ.18,750 చొప్పున ఇస్తున్నాం. ఈ రెండేళ్లలో వైఎస్సార్ చేయూత కింద రూ.9 వేల కోట్లు వ్యయం చేశాం. ఇంకా రిలయెన్స్, పీ అండ్ జీ, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేలా చర్యలు తీసుకున్నాం.
కోవిడ్ కష్టకాలంలోనూ..
►కోవిడ్ కష్ట కాలంలో కూడా జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, 31 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు, ఇళ్ల నిర్మాణం వంటివి చేస్తూనే చేయూత పథకం అమలు చేశాం. అదే స్ఫూర్తితో ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అమలు చేస్తున్నాం. పేదరికంలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన అక్కచెల్లెమ్మలను ఆదుకుంటున్నాం. చంద్రబాబు తన పాలనతో ఏనాడైనా ఆ ఆలోచన చేశారా? చేయలేదు ఎందుకంటే ఆయనకు ఆ మనసు లేదు.
►ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం. చంద్రబాబు పార్టీ పుట్టి 40 ఏళ్లు అయింది. కానీ వారు ఏనాడైనా ఈ పని చేసిన చరిత్ర ఉందా? రెండు దశల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. ఇప్పటికే తొలి దశ ఇళ్లు దాదాపు పూర్తవుతున్నాయి. అవన్నీ పూర్తయితే ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి పెట్టినట్లు అవుతుంది. ఉభయ గోదావరి జిల్లాలలో అయితే ఆ ఆస్తి విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుంది.
పుట్టగతులుండవనే భయంతోనే విమర్శలు
►ఇవన్నీ పూర్తయితే తమకు పూర్తిగా పుట్టగతులు ఉండవని, ఇప్పుడు వచ్చిన 23 సీట్లు కూడా రావని భావించి టీడీపీ భయంతో ప్రతి పనిని అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తోంది. ఆ ప్రయత్నాలు, విమర్శలు తప్ప, ఏనాడూ పేద ప్రజలను గుండెలో పెట్టుకోలేదు.
►చంద్రబాబు పార్టీ జెండా, గుర్తులోనే గుడిసె ఉంటుంది. పేదలు ఆ గుడిసెలోనే ఉండాలని కోరుకుంటారు తప్ప వారికి పక్కా ఇళ్లు ఉండాలని అనుకోరు. చివరకు కట్టీకట్టని టిడ్కో ఇళ్లు కూడా తామే కట్టామని డ్రామాలు ఆడతారు. అసలు వారు మొదలు పెట్టినవి కేవలం 2.63 లక్షల ఇళ్లు మాత్రమే. వాటికీ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు లేదు. 80 వేల ఫ్లాట్లు ఒక స్టేజ్‌కు వచ్చాయి. మిగతా వాటిలో అవీ లేవు. వాటిని మేము పూర్తి చేస్తుంటే దానిపైనా దుష్ప్రచారం చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న తర్వాత కూడా 31 లక్షల మంది పక్కా ఇళ్లు లేకుండా ఎందుకు మిగిలిపోయారన్న దానికి చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా?
అన్ని పదవుల్లోనూ సామాజిక న్యాయం
►నామినేటెడ్ పదవులు, నామినేషన్ పద్ధతిలో ఇచ్చే పదవుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వడంతో పాటు మొత్తం మీద 50 శాతం మహిళలకు కేటాయిస్తూ దేశంలోనే తొలిసారిగా చట్టం చేశాం. బీసీలకు చంద్రబాబు ఏం చేశారన్నది ప్రజలు ఆలోచించాలి. ఆయన ఏనాడైనా నేతన్న నేస్తం, చేదోడు, మత్స్యకార భరోసా, తోడు వంటి పథకాల గురించి ఆలోచించారా?
►చంద్రబాబు పాలనలో అగ్రిగోల్డ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. మన ప్రభుత్వం ఆ బాధితులకు రూ.905 కోట్లు చెల్లించింది. అదీ ఆయన పాలనకు, మన పాలనకు మధ్య ఉన్న తేడా.
అందుకే చిచ్చు పెట్టే ప్రయత్నం
►ఇవన్నీ ఆయన చేయలేదు కాబట్టే, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, నిత్యం ఏదో ఒకటి తీసుకోవడం.. ప్రభుత్వానికి ఏ సంబంధం లేకపోయినా కూడా పొగ వేయాలని నానా తంటాలు పడుతున్నారు. ఆయనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 డబ్బా కొడుతున్నాయి. చంద్రబాబును సీఎం చేయాలన్న తపన, తాపత్రయంతో స్థాయి మరచి పని చేస్తున్నాయి.
►అధికారంలో ఉండగా విజయవాడలో పట్టపగలు గుడులు కూలగొట్టిన చరిత్ర వారిది. అధికారం పోయినప్పుడు రథాలు తగలబెట్టడం, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. మేము రథాలు తిరిగి తయారు చేయడం, విగ్రహాలు ప్రతిష్టించడం చేస్తుంటే వారు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి.
ఆయనకు నైతిక హక్కు లేదు
►అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మనది. అది వారికి లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకున్న చరిత్ర మనది. వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 30 వేల పోస్టులు భర్తీ చేస్తున్న చరిత్ర మనది.
►టీడీపీ ప్రభుత్వంలో ఆ ఆస్పత్రుల్లో పిల్లలను ఎలుకలు కొరకడం చూశాం. ప్రభుత్వ సంస్థలను పప్పు బెల్లాలకు అమ్ముకున్న చరిత్ర వారిది. ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు.
ఎన్నో ఉద్యోగాలు.. అందరి శ్రేయస్సు
►2.70 లక్షల మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. లక్ష మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాం. మెరుగైన వేతనాలు సక్రమంగా వచ్చేలా చూస్తున్నాం. 20 వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 34 నెలల్లోనే ఈ విధంగా 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
►కాంట్రాక్ట్ ఉద్యోగులకు మంచి వేతనాల కోసం టైమ్ స్కేల్ ఇచ్చాం. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక నెల ముందు మాత్రమే ఆ జీఓ ఇచ్చి, అది కూడా జూన్ నుంచి అమలు చేస్తామన్నారు.
►అలాంటి వ్యక్తి ఇవాళ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు తానా అంటే తందానా అంటున్నారు కమ్యూనిస్టు నాయకులు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటరీ వర్కర్లు, హోంగార్డులు, పారిశుద్ధ్య కార్మికులు, 108, 104 సర్వీసుల సిబ్బంది.. అలా చాలీచాలని వేతనంతో పని చేస్తున్న 3,07,727 మందికి మేలు చేస్తూ జీతాలు పెంచాం.
►గతంలో వారి జీతాలకు రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తే ఇవాళ రూ.3 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ఇబ్బందులు ఎన్నో ఉన్నా, ఉద్యోగుల సంతోషం కోసం వీలైనంత వరకు వారి వేతనాలు పెంచాం.
ఆరోగ్య ప్రదాయిని ఆరోగ్యశ్రీ
►ఆరోగ్యశ్రీని టీడీపీ గతంలో సక్రమంగా అమలు చేయలేదు. మన ప్రభుత్వంలో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి ఈ పథకం ఇస్తున్నందు వల్ల దాదాపు 95 శాతం ప్రజలకు ఈ పథకం వర్తిస్తోంది. గతంలో ఈ పథకంలో కేవలం వేయి చికిత్సలు మాత్రమే ఉండగా ఇవాళ 2,600 చికిత్సలకు వర్తింపచేస్తున్నాం.
►చికిత్స తర్వాత వైద్యులు సూచించినంత కాలం నెలకు రూ.5 వేల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. దీని గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.680 కోట్లు బకాయి పెడితే మన ప్రభుత్వమే చెల్లించింది. ఇవాళ నెలలోపే బిల్లులు ఇస్తున్నాం.
అత్యుత్తమ వైద్య వసతులు
►దాదాపు 1,100 అంబులెన్సులు (108, 104 సర్వీసులు) ఒకేసారి ప్రవేశపెట్టాం. గ్రామ గ్రామాన వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు పెడుతున్నాం. కోవిడ్ సమయంలో టెస్టులు, చికిత్సలో మన రాష్ట్రం టాప్‌లో ఉంది. కోవిడ్ మరణాలు మన దగ్గర చాలా తక్కువ.
►గ్రామ స్థాయిలో వలంటీర్లు, ఆశా వర్కర్లు బాగా పని చేశారు. దాదాపు 36 ఇంటింటి సర్వేలు చేశాం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ 11 టీచింగ్ ఆస్పత్రులు ఉంటే మనం కొత్తగా 16 ఆస్పత్తులు ఏర్పాటు చేస్తున్నాం.
►ప్రభుత్వ ఆస్పత్రులను గతంలో శిథిలావస్థకు చేర్చగా వాటిని పూర్తిగా మెరుగు పరుస్తున్నాం. నాడు-నేడులో దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి, ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నాం. చరిత్రలో లేని విధంగా 39 వేల మంది డాక్టర్లు, నర్సులను నియమిస్తున్నాం. కాబట్టి వైద్య రంగం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు.
మాది రైతు రాజ్యం
►రైతులను చంద్రబాబు మోసం చేస్తే మేము వారిని ఆదుకుంటున్నాం. ప్రతి రైతుకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినా.. దాన్ని రూ.13,500కు పెంచి 5 ఏళ్లు ఇస్తున్నాం. కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ రైతులకు కూడా ఇస్తున్నాం. దాదాపు అర కోటి రైతులకు ఈ పథకం అమలు చేస్తున్నాం.
►చంద్రబాబు ఏనాడూ ఆ ఆలోచన చేయలేదు. ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. విద్యుత్ బకాయిల కోసం రైతులను పీడించారు. ఇవాళ పాడి రైతులకు మేలు చేయడం కోసం అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుంటే దాన్నీ విమర్శిస్తున్నారు. రైతు భరోసా సహాయం అందిందని రైతులు చెబితే దాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు.
చంద్రబాబు పెట్టిన బకాయిలూ తీర్చాం
►చంద్రబాబు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తనాల బకాయిలు రూ.380 కోట్లు, ఇంకా రూ.9 వేల కోట్లు కరెంటు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. వాటిని చెల్లించాం. ఎన్నికల సమయంలో రైతు మాదిరిగా వేషం కడతారు. తలపాగా చుట్టి ఫొటోలకు ఫోజులు ఇస్తారు. హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోగానే మోసం చేస్తారు. అలాంటి వ్యక్తి మన వ్యవసాయ విధానాన్ని విమర్శించడం సిగ్గుచేటు.
►రైతులను మోసం చేసి, వారి బంగారాన్ని వేలం వేసే పరిస్థితి తీసుకువచ్చారు. అలాంటి చంద్రబాబుకు
మనం ఉచిత పంటల బీమా, ప్రభుత్వమే ప్రీమియమ్ చెల్లింపు, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు, వేగంగా బీమా పరిహారం ఆలస్యం లేకుండా చెల్లిస్తున్నా ఏవీ కనిపించడం లేదు.
►రైతులకు విత్తనం మొదలు పంటలు అమ్ముకునే వరకు ఈక్రాప్ ద్వారా అడుగడుగునా అండగా ఉన్నాం. ఇది విప్లవాత్మక మార్పు. రైతులను అన్ని రకాలుగా మోసం చేసింది చంద్రబాబు అయితే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోంది మన ప్రభుత్వం.
చంద్రబాబుది ఆర్థిక అరాచకం
►రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేస్తున్నారు. 2014 నాటికి రాష్ట్రానికి రూ.1,20,556 కోట్ల అప్పులు ఉంటే, 5 ఏళ్లలో అంటే 2019 నాటికి అవి రూ.2,68,225 కోట్లకు చేరుకున్నాయి. అవే కాకుండా చంద్రబాబు చెల్లించకుండా దాదాపు రూ.39 వేల కోట్ల బకాయిలు పెట్టారు.
►ప్రభుత్వ గ్యారెంటీ మీద 2014 నాటికి చేసిన అప్పులు రూ.14,028 కోట్లు ఉంటే, చంద్రబాబు హయాంలో 2019 నాటికి అవి రూ.58 వేల కోట్లకు చేరాయి. విద్యుత్ సంస్థల పంపిణీకి బకాయిలు 2014 నాటికి రూ.2,893 కోట్లు ఉంటే 2019 నాటికి రూ.21,540 కోట్లకు పెరిగాయి.
►వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు అప్పు 2014 నాటికి రూ.20,703 కోట్లు ఉంటే.. 2019 నాటికి అవి రూ.68,596 కోట్లకు పెరిగాయి. దీన్ని ఆర్థిక వ్యవస్థ అంటారా.. ఆర్థిక అరాచకం అంటారా.. అన్నది ఈనాడు, ఆంధ్రజ్యోతికి తెలియాలి.
వెంటాడుతున్న టీడీపీ పాపాలు
►రాష్ట్రం మీద చంద్రబాబు ప్రభుత్వం ఇంత భారం మోపి ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. అంతా అవినీతికే పోయింది. అదే మనం చేసింది ప్రజల జేబుల్లోకి వెళ్తోంది. టీడీపీ హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి, జీఎస్డీపీ గరిష్ట పరిమితి 3 శాతానికి మించి మరీ ఏటా అప్పులు చేశారు.
►2014-15లో 3.5 శాతం, 2015-16లో 3.65 శాతం, 2016-17లో 4.52 శాతం, 2017-18లో 4.12 శాతం, 2018-19లో 4.07 శాతం అప్పులు ఎక్కువగా చేశారు. ఇలా ఎక్కువ అప్పులు చేయడంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులో రూ.16,419 కోట్ల కోత పెట్టారు. దానిపై కేంద్రంతో యుద్ధం చేయాల్సి వస్తోంది. చంద్రబాబు చేసిన పాపాలు మనల్ని వెంటాడుతున్నాయి.
పాపాలు బాబువి.. ప్రాయశ్చిత్తం మనది
చంద్రబాబు హయాంలో ప్రతి ఏటా అప్పులు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 17.33 శాతం చొప్పున పెరిగినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కు కనిపించదు. ఆ అప్పు మనం కడుతున్నాం. మన హయాంలో పెరిగిన అప్పు 14.88 శాతం మాత్రమే. పాపాలు చంద్రబాబువి. ప్రాయశ్చితం మనది. ఈ నిజాన్ని దాచి మన ప్రభుత్వం మీద నిందలు వేస్తున్న వారిది జర్నలిజం అంటారా?
చేతగాని వాడికి కోపం ఎక్కువట..
►మరోవైపు చేతకాని వాడికి కోపం ఎక్కువ అన్నట్లు రోజుకో జూమ్ మీటింగ్, నాలుగు ప్రెస్‌మీట్లు పెట్టి, పెట్టించి తిట్టించడం.. వాటిని ఎల్లో మీడియాలో జోరుగా ప్రచారం చేయడం ఇదీ వరస.
చంద్రబాబు, ఆయన పార్టీ.. ప్రజలకు చేసిన మేలు ఏమిటో అందరూ ఆలోచించాలి.
►తమకు అధికారం పోయి 1000 రోజులు అయిన సందర్భంగా రగిలిపోతున్న చంద్రబాబు పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు, ఎల్లో మీడియా వారికి, వేర్వేరు పార్టీల్లో ఉంటూ చంద్రబాబు బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారికి ట్యామ్-40 ట్యాబ్లెట్లు (బీపీ తగ్గడం కోసం), జెలిసిల్ సిరప్, ఈనో ప్యాకెట్లు (కడుపు మంట తగ్గడానికి) విరివిగా లభించాలని కోరుకుంటున్నా. ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడి దయ మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని ఆశిస్తున్నా.
►సీఎం ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment