రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఏ ఒక్క చోట చంద్రబాబు హయాంలో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. విద్యుత్ సౌకర్యం కల్పించడం కోసం స్తంభాలు కూడా పాతలేదు. మంచి నీటి కుళాయిల ఊసే లేదు. చాలా వాటికి దారి కూడా సరిగా లేదు. సగం ఇళ్లకు పునాదులు కూడా వేయలేదు. అయినా అన్నీ పూర్తయిపోయాయని ఎలా చెబుతున్నారు? అలాంటి చోట మనుషులనే వారు ఎలా నివశిస్తారు చంద్రబాబూ? ఇవన్నీ విస్మరించి తగుదునమ్మా అంటూ.. ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్ల వద్ద నిస్సిగ్గుగా సెల్ఫీ దిగడం మీకే చెల్లింది.
సాక్షి, అమరావతి: నిజాలు చెప్పాలన్నా, చూపించాలన్నా ఆధారాలు కావాలి.. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాత్రం అవేవీ అక్కర్లేదు. చీమ దూరేంత సందు ఉంటే చాలు.. అందులోంచి ఏనుగు వెళ్లిందని జనాన్ని నమ్మించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇందుకు టిడ్కో ఇళ్ల నిర్మాణమే ప్రత్యక్ష ఉదాహరణ. జనం ఏమనుకుంటారోనన్న ఆలోచన ఇసుమంతైనా లేకుండా కళ్లార్పకుండా అబద్ధం చెప్పేస్తుండటం ఆయనకే చెల్లింది.
ప్రజలకు అన్ని విధాలా మంచి చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లుతూ రాగం తీస్తే.. దానికి ఎల్లో మీడియా తాళం వేస్తుంది. పట్టణ పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లపై తాజాగా సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి తెరతీశారు. వాస్తవానికి అప్పట్లో కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా బాబు అడుగులు ముందుకు వేశారు. ఇందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి.
బాబు ఆరోపణ
టిడ్కో ఇళ్లన్నీ మా హయాంలో కట్టినవే
వాస్తవం: టిడ్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు హయాంలోని అప్పటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. 2019 మే నాటికి 1,22,888 ఇళ్లను పునాదుల్లో, మరో 38,416 యూనిట్లు సగం శాతం కంటే తక్కువ పనులు చేసి వదిలేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రూ.3,232 కోట్లు ఖరారు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా దానిని రూ.2,840 కోట్లకు తగ్గించింది. అంటే రూ.392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. దీనికి తోడు 1,33,480 యూనిట్లను నూరు శాతం పూర్తి చేయడంతో పాటు ఇప్పటికే 48,416 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. మరో 40 వేల టిడ్కో ఇళ్లను రెండు నెలల్లో ఇచ్చేందుకు సిద్ధం చేస్తోంది.
బాబు ఆరోపణ
అంతటా అవినీతే
వాస్తవం: పట్టణ పేదలు 300 చ.అ. ఇల్లు పొందాలంటే చంద్రబాబు ప్రభుత్వం రూ.7.5 లక్షలు భారం మోపింది. అదీ 20 ఏళ్లపాటు వాయిదాలు కట్టేలా షరతు పెట్టింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం అదే పేదలకు 1.43 లక్షల టిడ్కో ఇళ్లను రూ.1కే ఇస్తోంది. పైగా ఇళ్లను అక్క చెల్లె్మమల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. 365 చదరపు అడుగుల్లో నిర్మించే 44,304 యూనిట్లకు, 430 చదరపు అడుగుల్లో నిర్మించే 74,312 యూనిట్లకు గత ప్రభుత్వం లబ్ధిదారుల వాటా కొంత మొత్తం చెల్లించాలని చెప్పింది. అయితే, ఆ వాటాను ప్రస్తుత ప్రభుత్వం 50 శాతానికి తగ్గించింది.
బాబు ఆరోపణ
నెల్లూరులో మేమే అన్ని ఇళ్లు నిర్మించాం
వాస్తవం: చంద్రబాబు హయాంలో నెల్లూరులో మొత్తం ఏడు ప్రాంతాల్లో టిడ్కో గృహాలను నిర్మించాలని భావించారు. అలిపురంలో 11,376 ఇళ్లు, అక్కచెరువుపాడులో 3,696, కల్లూరుపల్లిలో 2,496, కొండలపూడి ఫేజ్ –1, 2లో 2,496, వెంకటేశ్వరపురం ఫేజ్–1లో 4,800, వెంకటేశ్వరపురం ఫేజ్–2లో 3,024, ఇరుకులమ్మ టెంపుల్ ఫేజ్–2లో 48 ఇళ్లు నిర్మించాలని తలపెట్టారు. ఇందులో కేవలం వెంకటేశ్వరపురం ఫేజ్–1లో చేపట్టిన ఇళ్లలో కొన్ని మాత్రమే చంద్రబాబు హయాంలో నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
మిగిలిన ఆరు ప్రాంతాల్లోనూ పనులు పూర్తిగా వదిలేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు టీడీపీ ‘షో’లో భాగంగా వెంకటేశ్వరపురం ఫేజ్–1 నివాస సముదాయాలను ప్రారంభించారు. వాటికి తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండానే హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. అందువల్లే ఒక్క కుటుంబం కూడా అక్కడ దిగలేదు.
ఇప్పుడు వాటన్నింటినీ దాచిపెట్టి చంద్రబాబు సెల్ఫీతో రాజకీయం చేస్తున్నారు. ఒక్క చోట ఫొటో దిగి.. ‘మొత్తం నేనే కట్టేశా’నని చెప్పుకోవడం చూసి నెల్లూరు వాసులు ఇదేం రాజకీయం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏడు ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్ల కోసం ప్రస్తుత ప్రభుత్వం రూ.628.5 కోట్లు ఖర్చు చేసింది. పైగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించని రూ.90 కోట్ల బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment