హిందూధర్మ పరిరక్షణ పేరుతో ఒక సాంస్కృతిక సంస్థగా పుట్టిన ఆరెస్సెస్ గాంధీజీ హత్యానంతరం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో తనకో రాజకీయ వేదిక అవసరమన్న భావనతో 1951లో ‘భారతీయ జనసంఘ్’ అనే పార్టీకి జన్మనిచ్చింది. సినిమాలో కర్ణుడి పెంపుడు తల్లి రాధ ఆలపించినట్టు ‘అజస్త్ర సహస్ర నిజప్రభలతో అజేయుడవు కావలెరా’ అని ఆరెస్సెస్ కూడా బిడ్డను ఆశీర్వదించే ఉంటుంది. పుట్టిన వెంటనే జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో జనసంఘ్ మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలవగలిగింది. జనసంఘ్ పేరుతో ఉండగా ఆ పార్టీ అత్యధికంగా 35 లోక్‌సభా సీట్లను 1967లో సంపాదించింది. తొమ్మిది శాతానికి పైగా ఓట్లను కూడా అప్పుడే అది రాబట్టగలిగింది.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఏర్పాటైన జనతా పార్టీలో సంస్థా కాంగ్రెస్, భారతీయ లోక్‌దళ్, కొందరు సోషలిస్టులు వగైరాలతో కలిసి విలీనమైన తర్వాత జనసంఘ్ పునాదులు విస్తరించాయి. జనతా ప్రభుత్వం హయాంలో ఆరెస్సెస్ శ్రేణులు అన్ని కీలక విభాగాల్లోకి వ్యాపించాయన్న అభిప్రాయం ఏర్పడింది. ఆరెస్సెస్ విస్తృతి జనతా పార్టీలోని మిగతా భాగస్వామ్య పక్షాలకు మింగుడు పడలేదు. జనతా పార్టీలో సభ్యులుగా ఉన్నవారు ఇంకో సంస్థలో (ఆరెస్సెస్) కూడా సభ్యులుగా ఉండకూడదన్న వాదాన్ని తీసుకొచ్చాయి. ఈ ద్వంద్వ సభ్యత్వ వివాదమే జనతా పార్టీ పతనానికి కారణమైంది. 1980లో ఇందిరాగాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పేరుతో పాత జనసంఘ్‌ను పునరుద్ధరించారు. కరుడుగట్టిన హిందూ మత పార్టీగా జనసంఘ్‌కు ఉన్న ముద్రకు భిన్నంగా కొంత ఉదారవాద ముఖోటాను పార్టీ తగిలించు కుంది. ఆ ముఖోటా పేరు – అటల్ బిహారీ వాజపేయి.
జనతా ప్రయోగం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఆరెస్సెస్‌తో సంబంధం లేని ఇతరేతర రాజకీయ నేతలనేక మంది బీజేపీలో చేరిపోయారు. ఇందిరాగాంధీ హత్యానంతర సానుభూతి ప్రభంజనంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు మాత్రమే గెలవగలిగింది. అందులో ఒకటి తెలంగాణ నుంచి, మరొకటి గుజరాత్ నుంచి! ఇక అక్కడి నుంచి బీజేపీ విజయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. మూడు దశాబ్దాలు గడిచేసరికి కాంగ్రెస్ పార్టీని చిత్తుచేసి ఆధిపత్య స్థానాన్ని దక్కించు కోగలిగింది. ఈ విజయాలు యాదృచ్ఛికమైనవి మాత్రం కావు. ఒక అరడజన్ కారణాలు ఈ పరిణామానికి దోహదపడ్డాయి. 1. కాంగ్రెస్ పార్టీ పతనం, 2. నాన్–కాంగ్రెస్, నాన్–బీజేపీ పక్షాల వైఫల్యం. 3. ఆరెస్సెస్ వ్యూహాలు – కృషి, 4. మారుతున్న కాలానికి అనుగుణమైన ఎత్తుగడలు, 5. హిందూయిజంతో పాటు సబ్ కా వికాస్, ఐదు ట్రిలియన్ డాలర్ల అభివృద్ధిని ఎజెండాలో చేర్చడం, 6. నరేంద్ర మోదీ.
కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణాలేమిటంటే ఏమని చెప్పగలం? ‘నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్, ధరచేత భార్గవుచేత, నరయంగ కర్ణుడీల్గె నార్గురి చేతన్’ అన్నట్టు.... కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేంత దాకా కాంగ్రెస్ ఒక ఉద్యమ పార్టీ. అది రాజకీయ అధికారాన్ని చేపట్టిన తర్వాత రాజకీయ పార్టీ తరహా సంస్థాగత స్వరూపాన్ని సంతరించుకోలేదు.
రాజ్యాంగాన్ని పూర్తిగా అవగతం చేసుకొని, రాజ్యాంగం ద్వారా నిర్మితమైన వ్యవస్థలతో కలిసి పనిచేయవలసిన తీరును అలవర్చుకోలేదు. మంత్రులు, ముఖ్యమంత్రుల్లో కొందరు సామంత రాజులుగా మారి ఢిల్లీకి కప్పం చెల్లించే సంప్రదాయానికి తెరతీశారు. పార్టీ వ్యవస్థను పక్కనబెట్టి పైరవీకార్లకు పెద్దపీట వేశారు. స్వతంత్ర దేశంలో తాము భాగస్వాములం కాగలమని ఎదురుచూసిన బలహీనవర్గాల ఆకాంక్షలను, ఆశలను విస్మరించారు. రెండు బర్రెలు, నాలుగు గొర్రెలు, జానెడు ఇంటి జాగాకు మాత్రమే బడుగుల వికాసాన్ని పరిమితం చేశారు. ఆర్థిక వృద్ధికి చేపట్టిన చర్యలను అవినీతి తిమింగలం మింగేసింది.
ఆధునిక భారత నిర్మాణానికి అడుగులు వేసినప్పటికీ, ప్రభుత్వరంగంలో భారీ పరిశ్రమలను నెలకొల్పినప్పటికీ, బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించినప్పటికీ వాటి ఫలితా లను అనుభవించే అవకాశం చిక్కని విశాల ప్రజానీకం అభ్యున్నతికి దూరంగా ఉండిపోయారు. ప్రధానంగా జనాభాలో సగభాగమైన ఓబీసీలకు కాంగ్రెస్ ప్రణాళికలో తగిన ప్రాతి నిధ్యం లభించలేదు. మరొకపక్క రాజ్యాంగ నిబద్ధతను, ప్రజాస్వామిక స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించలేదు. గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసే కుటిల నీతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీయే! నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఇందిరాగాంధీ చేపట్టిన మొదటి కార్యక్రమం కేరళలో నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయించడం. గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలను బ్లాక్‌మెయిల్ చేయడం, రాష్ట్రాల అధికారాల్లో తల దూర్చడం వంటి చర్యలన్నీ కాంగ్రెస్ హయాంలోనే పొడసూపాయి.
రాజీవ్‌గాంధీ హయాం నుంచి పార్టీ నాయకత్వ స్థానాలు క్రమంగా పైరవీకార్ల పరమయ్యాయి. అధికారం కోల్పోయినప్పుడు ఈ పైరవీకార్ల పునాదులు పేక మేడల్లా కూలిపోయాయి. ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఉన్నా అందిపుచ్చుకోవడానికి లేచి నిలబడలేని అశక్తతలోకి కాంగ్రెస్ జారిపోయింది. దాని అశక్తత బీజేపీకి ‘శ్రీరామ’రక్ష.
భావజాలపరంగా కాంగ్రెస్ మధ్యేవాద పార్టీగా ఉండేది. లౌకికత్వానికి కట్టుబడి ఉండేది. ఆ పార్టీకి వామహస్తం వైపు లెఫ్ట్ పార్టీలుంటే, దక్షిణ హస్తంవైపు బీజేపీ ఉండేది. ఎనభయ్యో దశకం తొలిభాగం వరకు ఈ రెండు శిబిరాలదీ దాదాపు సమాన బలం.
భారతదేశంలో కులం ప్రాధాన్యాన్ని అర్థం చేసు కోవడంలో విఫలమైన కమ్యూనిస్టులు బలహీనవర్గాలను నాయకత్వ శ్రేణుల్లోకి ప్రమోట్ చేయలేక వారి విశ్వాసాన్ని కోల్పోయారు. అక్కడే బీజేపీ స్కోర్ చేసింది. తొలిరోజుల్లో బీజేపీకి బ్రాహ్మిణ్ – బనియా పార్టీగా ముద్ర ఉండేది. మందిర్ ఉద్యమం దాని పునాదిని కొంత విస్తృతం చేసింది. పదిశాతం బ్రాహ్మణ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ పీఠం దక్కగానే దానిపై ఓబీసీ వర్గానికి చెందిన కల్యాణ్‌సింగ్‌ను కూర్చోబెట్టింది. క్రమంగా ఓబీసీల్లో, గిరిజనుల్లో పలుకుబడిని విస్తరించుకుంటూ వెళ్లింది. 2019 ఎన్నికల్లో నూటికి 44 మంది ఓబీసీలు బీజేపీకే ఓటేశారని ఒక అంచనా వచ్చింది.
మహాభారత యుద్ధంలో అర్జునుని సారథిగా శ్రీకృష్ణుడు పోషించిన పాత్రను బీజేపీ ఎన్నికల విజయాల్లో ఆరెస్సెస్ పోషిస్తున్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందిస్తూ, బీజేపీ ఎన్నికల పోరాటాల్లో ఆరెస్సెస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నదనే విషయం జగమెరిగిన సత్యం. అలక్ష్యానికి గురైన వర్గాల్లోని వ్యక్తులకు ఉన్నతాసనాలు వేయడం ద్వారా ఆయా వర్గాలను ఆకట్టు కోవాలనే ఎత్తుగడ ఆరెస్సెస్‌దే! ఎన్నికలు జరగబోయే కీలక రాష్ట్రాలకు ఆరు నెలల ముందుగానే స్వయంసేవకుల సేనలు తరలివెళ్తాయి. క్షేత్ర స్థాయిలో జెండాలు మోసే బీజేపీ కార్యకర్తలే మనకు కనిపిస్తారు. కానీ కనిపించకుండా ఇల్లిల్లూ తిరిగి ప్రజలను ప్రభావితం చేయడంలో స్వయంసేవకులదే కీలక పాత్ర. రామజన్మభూమి ఉద్యమం దగ్గర్నుంచి, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విడుదల చేయడం దాకా అనేకం – మధ్యతరగతి ప్రజలను తనవైపునకు తిప్పుకోవడం కోసం ఆరెస్సెస్ పన్నిన వ్యూహాలనే చెబుతారు.
హిందూ సెంటిమెంట్లను క్యాష్ చేసుకుంటూ మధ్యతరగతి శ్రేణుల్లో చొచ్చుకుపోయిన బీజేపీని క్రమంగా ఓబీసీలు, గిరిజనుల్లోకి కూడా విస్తరింపజేసిన ఘనత ఆరెస్సెస్‌దే! ఈ వ్యూహాన్ని అమలుచేయడంలో సంఘ్‌కు దొరికిన వజ్రాయుధం నరేంద్ర మోదీ. ‘సంఘ్’ చెక్కిన బాహుబలి శిల్పం మోదీ. ఈ శిల్పం జీవం పోసుకుంటుందా? మరో పదేళ్లో ఇరవయ్యేళ్లో దేశ రాజకీయాల్లో బీజేపీ బాహుబలి పాత్ర పోషించగలదా? ఇప్పుడున్న బలాన్ని బేరీజు వేసుకున్నప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై పెద్దగా అనుమానాల్లేవు. నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన ప్రధానిగా మోదీ రికార్డులకెక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్ మాదిరిగా దీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగగలుగు తుందా అన్నది మాత్రం సందేహాస్పదమే. ఎంతమేరకు ఆ పార్టీ విశాల దృక్పథాన్ని అలవర్చుకోగలదన్న వాస్తవికతపైనే దాని దీర్ఘయాత్ర ఆధారపడి ఉంటుంది.
బలహీనవర్గాల ప్రతినిధులను నాయకత్వ స్థానాల్లోకి ప్రమోట్ చేసే కార్యక్రమం అవిచ్ఛిన్నంగా సాగించవలసి ఉంటుంది. ప్రపంచ దేశాల్లో గౌరవనీయ స్థానం దక్కాలన్నా, ఈ దేశ యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలన్నా ఆర్థిక వృద్ధి లక్ష్యాలను అందుకోవలసి ఉంటుంది. ఆరెస్సెస్ లక్ష్యాల్లో ‘అఖండ భారత్’ కూడా ఒకటి. దక్షిణ సముద్రానికి ఉత్తరాన హిమాలయ శ్రేణులకు మధ్యనున్న భాగమంతా భారత ఖండమేనని మన పురాణాలు కూడా చెబుతున్నాయట! ఇటీవల ఎస్.వీ. శేషగిరిరావు రాసిన ‘భారతదేశ చరిత్ర – సంస్కృతి’ అనే పుస్తకంలో ఇందుకు ఉదాహరణలిచ్చారు. ఆ లెక్కన అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంకలు కూడా భారత ఖండంలో భాగమే. అవన్నీ ఇండియాలో కలిసిపోవడం ఇప్పుడు అసాధ్యం. కానీ, ఈ దేశాలతో స్నేహ సంబంధాలు మెరుగైతేనే అంతర్జాతీయంగా భారత్‌కు గౌరవం. బీజేపీ సర్కార్ ఈ సవాల్‌ను ఎదుర్కోగలదా!
‘సబ్‌కా సాథ్... సబ్‌కా వికాస్’ మాటల గారడీగా మారకుండా చూసుకోవాలి. కేంద్ర – రాష్ట్ర సంబంధాల విష యంలో కాంగ్రెస్ వ్యవహార శైలికీ, బీజేపీ వ్యవహార శైలికీ పెద్ద తేడా లేదు. వాస్తవానికి బీజేపీయే మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది. ఇవన్నీ ఒక ఎత్తు, భిన్న గళాల మీద అసహనం ఒక ఎత్తు. యావత్తు భారతదేశాన్ని ఒకే జాతిగా గుర్తించి గౌరవిస్తేనే బీజేపీ ప్రతిష్ఠ పెరుగుతుంది. అందులోని కులాలు, మతాలు, తెగలు, భాషలు, సంస్కృతులు, ఆరాధనా పద్ధతులు, విశ్వాసాలు సమాన గౌరవాన్ని, ఆదరణను పొందినప్పుడే ఈ దేశం బలపడుతుంది. బీజేపీ బలపడుతుంది. ఆ పార్టీ దక్షిణాది మిషన్‌లో ఇప్పుడు తెలంగాణ చేరింది. వాస్తవానికి ప్రజాదరణ రీత్యా చూస్తే తెలంగాణలో ఇప్పటికిప్పుడు బీజేపీది మూడో స్థానం. ఎకాఎకిన మొదటి స్థానానికి చేరుకోవాలంటే హైజంప్ ప్రాక్టీస్ చాలదు. పోల్‌వాల్ట్ చేయాలి.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment