‘‘తమ కార్యంబు బరిత్యజించియు బరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్, తమ కార్యంబు ఘటించుచున్ బర హితార్థ వ్యాప్తుల్ మధ్యముల్, తమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భం గము గావించెడి వారలెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్?’’ భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషితాలకు ఏనుగు లక్ష్మణకవి చేసిన తెలుగు సేతలో ఒక పద్యం ఇది. సొంత పనిని పక్కన పెట్టయినా సరే అవసరంలో ఉన్నవారికి తోడ్పడేవాడు సజ్జనుడు. తన పని చేసుకుంటూనే ఇతరులకు కూడా తోడ్పడే వాడు మధ్యముడు. తన స్వార్థం కోసం ఇతరులను పణంగా పెట్టేవాడు దైత్యుడు... అంటే రాక్షసుడు అని ఈ సుభాషితానికి అర్థం.
ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తన తదుపరి స్థానం తన వారసుడైన లోకేశ్‌బాబుకే దక్కాలనేది చంద్రబాబు సంకల్పం. కానీ ఆ పార్టీలోని దిగువశ్రేణి కార్యకర్తల నుంచి నాయకుల దాకా ఈ వ్యవహారం మింగుడుపడటం లేదనేది బహిరంగ రహస్యం. ఆయనకు నాయకత్వ ప్రతిభ లేనే లేదని పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయం. ఈ పూర్వరంగంలో ఎల్లో మీడియా రుషిపుంగవులు చంద్రబాబు చెవిలో ఒక తరుణోపాయాన్ని ఉపదేశించారట. కాశీయాత్ర చేసి గంగలో మునకేస్తే చేసిన పాపాలన్నీ కొట్టుకొని పోయి పుణ్యాత్ముడుగా తిరిగి వస్తారన్న నమ్మకం పూర్వకాలంలో ఉండేది. అలాగే, ‘‘మన లోకేశ్‌బాబును రోడ్ల వెంట నడిపిస్తే ఎల్లో మీడియా ప్రతిరోజూ టాప్ న్యూస్‌గా ప్రచారంలో పెడుతుంది. ఏడాది తిరిగేసరికల్లా నాయకుడిగా తయారుచేసే బాధ్యత మాదేన’’ని విశ్వామిత్రుడు దశరథ మహారాజుకు ఇచ్చినంత గట్టి హామీని ఇచ్చారట!
ఇంతవరకు బాగానే ఉన్నది. లోకేశ్‌బాబు పాదయాత్ర అనుకున్నట్టుగానే ప్రారంభమైంది. పది అడుగులు పడ్డాయో లేదో, లోకేశ్ వెనకనే నడుస్తున్న నందమూరి తారకరత్న దురదృష్టవశాత్తు కుప్పకూలిపోయాడు. వెంటనే స్పృహ కూడా కోల్పోయాడు. పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు అర్థమౌతూనే ఉన్నది. అయినా లోకేశ్ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే కదిలారు. నందమూరి వారసుడూ, ఎన్టీఆర్ మనుమడూ మీకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చి ప్రమాదంలో చిక్కు కున్నప్పుడు, మీ కార్యక్రమాన్ని కాస్సేపు పక్కన పెట్టడం సంస్కారం కదా? కనీసం సాయంత్రం జరిగే సభనైనా రేపటికి వాయిదా వేద్దామని కొందరు సూచించారట. జనసమీకరణ కోసం పేమెంట్లు కూడా పూర్తయినందున ఆపేయలేమని నిర్వాహకులు అంగీకరించలేదు. ఏడాదిపాటు చేయవలసిన పాదయాత్రకు ఆదిలోనే అపశ్రుతి దొర్లినందున కనీస సంస్కారాన్నయినా ప్రదర్శించి ఉంటే ఎంతోకొంత ప్రాయశ్చిత్తం లభించేదేమో. భర్తృహరి వర్గీకరణ ప్రకారం ఈ రకమైన కుసంస్కారం దైత్యుల కిందకు వస్తుందా? ఇంతకంటే కఠినమైన మాటను ఉపయోగించాలా?
పూర్వకాలంలో రాజులు దండయాత్రలు చేసినట్టే ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు రథయాత్రలు, పాదయాత్రలు చేయడం రివాజుగా మారింది. ఇందులో తప్పులెన్నవలసిన అవసరం కూడా లేదు. రథ గజ తురగ పదాతి తదాది యాత్రికులందరినీ స్వాగతించవలసినదే. విరాట రాజకుమా రుడూ – ప్రగల్భ వీరుడైన ఉత్తర కుమారుడు మహావీరులైన కౌరవ సేనపైకి యుద్ధానికి వెళ్తానంటే ఎవరు అడ్డుకున్నారు? అంతఃపుర కాంతలు ఆశీర్వచనాలు చెప్పి హారతులు కూడా ఇచ్చారు. బృహన్నల రూపంలో ఉత్తర కుమారుడికి ఓ తోడు దొరకడం వేరే కథ. ఇక్కడ అప్రస్తుతం. లోకేశ్‌బాబు పాద యాత్రకు కూడా ఆలయాల్లో ఆశీర్వచనాలు, అంతఃపురంలో హారతులు, వీరతిలకాలు వగైరాలన్నీ సమకూరాయి. ఈ పాదయాత్రలో తాను ఒంటరిని కాదనీ, పవన్ కల్యాణ్ వారాహి రథయాత్ర కూడా తన వెంట తోడుగా ఉంటుందనీ పరోక్షంగానైనా సభాముఖంగానే ప్రకటించారు. వారాహినీ, యువ గళాన్నీ ఆపలేరంటూ గట్టిగా హెచ్చరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని గజగజలాడించేందుకు లోకేశ్‌బాబు శక్తి మేరకు ప్రయత్నించారు. రిపబ్లిక్ డే నాడు అచ్చుగుద్దినట్టు ఇదే ప్రయత్నాన్ని పవన్ కల్యాణ్ కూడా చేశారు. ‘ఎవడ్రా నా వారాహిని ఆపేద’ని ఆయన గర్జించారు. నాటకాల్లో రాజు వేషం వేసే నటుడు గట్టిగా చప్పట్లు చరిచి ‘ఎవరక్కడ?’ అంటాడు. ఎవరూ రారు. ఇదీ అంతే! వారాహిని అడ్డుకుంటామని అధికార పార్టీ వారు గానీ, ప్రభుత్వంలోని వారుగానీ ఎవ్వరూ అనలేదు. పైపెచ్చు స్వాగతించినట్టున్నారు కూడా!
మనసు నిండా మాలిన్యం నింపుకొని గంగలో మునకేసినంత మాత్రాన ఎవరూ పవిత్రులు కాలేరు. సహజంగా నాయ కత్వ లక్షణాలున్న వారిని, ప్రజల పట్ల అంకితభావం, సమాజంపై ప్రేమ ఉన్నవారిని పాదయాత్రలు మరింత సాన బడతాయి. అంతే తప్ప అసమర్థుడిని సమర్థుడిగా మలచలేవు. లోకేశ్‌బాబు పాదయాత్ర నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో పోల్చడానికి ఎల్లో మీడియా తెగ ప్రయాస పడిపోతున్నది. కొంతమంది తటస్థులమని చెప్పు కునే విశ్లేషకులు కూడా వీరి మాయలో పడి పోతున్నారు. ఇద్దరి మధ్యన ఉన్న హస్తిమశ కాంతారాన్ని గుర్తించకపోవడం కళ్లకు గంతలు కట్టుకోవడంతో సమానం.
తాతగారు నిర్మించిన పార్టీని నాన్నారు కబ్జా చేస్తే, ఆ కబ్జాను వంశపారంపర్యం చేసుకోవడానికి తండ్రి చాటున నిలబడి, ఎల్లో మీడియా నీడలో ఆపసోపాలు పడుతున్నవారు లోకేశ్‌బాబు. సొంతంగా పార్టీని నిర్మించుకొని తొమ్మిదేళ్లపాటు అధికార పీఠాలకు, గోబెల్స్ మీడియాలకు ఎదురొడ్డి పోరాడి, ఒంటిచేత్తో తన పార్టీని విజయ తీరాలకు చేర్చిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి, తన చేతికో మూడు కీలక శాఖల్ని అప్పజెప్పి, అప్రకటిత నెంబర్ టూగా చలామణి చేసినా ఎమ్మెల్యేగా గెలవలేక చతికిలబడిన గతం లోకేశ్‌బాబుది. అధినేత్రి అహంభావానికి నిరసనగా ఆ పార్టీ టిక్కెట్‌పై లభించిన పార్లమెంట్ సభ్యత్వాన్ని గడ్డి పరకలా విసిరేసి, స్వతంత్రంగా నిలబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ధనప్రవాహం, శత్రు మీడియాలను తట్టుకొని అఖండ మెజా రిటీతో జాతీయ రికార్డులను బద్దలుకొట్టిన చరిత్ర జగన్ మోహన్‌రెడ్డిది.
వారసత్వ రాజకీయాల కోటాలో లోకేశ్‌తోపాటు జగన్ మోహన్‌రెడ్డిని కూడా చేర్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వీరిలో బీజేపీ వగైరా పార్టీలతోపాటు విశ్లేషకులమని చెప్పు కునేవారు కూడా కొందరున్నారు. ఇందుకు కారణం వారి అజ్ఞానమైనా కావచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా విషం చిమ్మడ మైనా కావచ్చు. తండ్రిగారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్‌మోహన్‌రెడ్డి లోక్‌సభకు ఎన్నికైన విషయం వాస్తవం. గెలిచిన నాలుగు నెలలకే వైఎస్సార్ మరణించారు. ఆ తర్వాత ఏడాదిపాటు కాంగ్రెస్ నాయకత్వంతో ఒకపక్క పోరాడు తూనే మరోపక్క ఓదార్పు యాత్ర చేయవలసి వచ్చింది. చివరకు పార్టీ నుంచే నిష్క్రమించవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నిండా ఏడాదిన్నర కూడా ఆయన లేరు. ఆ పదవికి కూడా పార్టీతో పాటు రాజీనామా చేసి స్వతంత్రంగా నిలిచి గెలిచి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. ఆ పార్టీని నిల బెట్టడం కోసం, ఆ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొనడం కోసం ఎండనకా, వాననకా తొమ్మిదేళ్లపాటు కాలికి బలపం కట్టుకొని పడిన కాయకష్టం ఫలితమిచ్చింది. కష్టార్జితం మీద లోకేశ్‌తో సమానంగా వారసత్వం ముసుగు కప్పేందుకు ఎల్లో మీడియా చేస్తున్న కుయుక్తుల్నీ, దగుల్బాజీ విశ్లేషకుల జిత్తులమారితనాన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాము.
తన పాదయాత్రను ప్రారంభించే నాటికే రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నెంబర్‌వన్ రాజకీయ నాయ కుడిగా జగన్ ఎదిగారు. అందుకు కారణాలున్నాయి. కష్టాలు న్నాయి. కన్నీళ్లున్నాయి. కడగండ్లున్నాయి. అడుగడుగున మందు పాతరల్లా పొంచివున్న గండాలున్నాయి. ఆ గండాలను అధిగమించి సాగిన ప్రస్థానం ఉన్నది. ప్రజలకు ఇచ్చిన ఒక్క మాట కోసం ఆనాడు ప్రపంచంలో సర్వశక్తిమంతురాలుగా చలా మణి అవుతున్న అధినేత్రి ముందు తలవంచని ఆత్మస్థైర్యం ప్రజలకు నచ్చింది. ఒక లక్ష్యం కోసం పదవుల్ని గిరాటేయడాన్ని జనం మెచ్చారు. లక్షలాదిమంది అవ్వాతాతలను, అక్కా చెల్లె ళ్లను కలిసి వారి గుండె చప్పుళ్లను ఆత్మీయంగా ఆలకించి నప్పుడు, ఇంటింటికి వెళ్లి తడారని కళ్లను తుడిచినప్పుడు, పుండ్లు పడిన దేహాలను సైతం ఆదరాలింగనం చేసుకున్న ప్పుడు ఆ మానవీయ స్పర్శకు ఆంధ్ర దేశం పులకరించింది.
పాదయాత్రను ప్రారంభించే నాటికే అఖండ ప్రజా దరణతోపాటు ఆయన చేతిలో ఒక ప్రత్యామ్నాయ మేనిఫెస్టో ఉన్నది. ఆ మేనిఫెస్టోలో పేదరికం నుంచి ప్రజలను విముక్తి చేసే మార్గాలున్నాయి. వాటికి ‘నవరత్నాల’నే పేరును ఆయన పెట్టుకున్నారు. ఆ మేనిఫెస్టోను ఆయన భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా ప్రకటించుకున్నారు. దానికితోడు ఆనాటి ప్రభుత్వపు వైఫల్యాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఎగవేత ఉన్నది. రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేయడం ఉన్నది. డ్వాక్రా మహిళలను వంచించడం ఉన్నది. ఇంటికో ఉద్యోగం వాగ్దాన భంగంగా మిగిలింది. జన్మభూమి కమిటీల దాష్టీకం అసహ్యం పుట్టిస్తున్నది. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో పాలక పార్టీ నేతలే దుశ్శాసనులై వెదజల్లిన దుర్గంధం ముక్కుల్ని బద్దలు కొడు తున్నది. బీసీ కులాలను, ఎస్‌సీ కులాలను ఈసడించుకుంటున్న రాజకీయ పెత్తందార్ల పుండాకోర్ చేష్టలు జుగుప్స కలిగిస్తున్నవి. ఇదిగో... ఈ నేపథ్యంలో నెంబర్‌వన్ ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడు తన మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటిస్తూ పాదయాత్ర ప్రారంభించాడు. అది సూపర్ హిట్‌గా చరిత్రలో నిలబడిపోయింది. సముద్ర తీరాలను కలుపుతూ జనవారథులను నిర్మించినట్టు, వీధులన్నీ జీవనదులై పోటెత్తి నట్టు ప్రజలు పాలుపంచుకున్నారు.
మరి లోకేశ్‌బాబు పాదయాత్ర సంగతి? ఆయన నాయ కుడుగానే ఎదగలేదు. ఎమ్మెల్యేగానే గెలవలేదు. ఆయన వారసత్వంపై పార్టీలోనే అంగీకారం లేదు. ఆయన చేతిలో ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు. జగన్‌మోహన్‌రెడ్డి పాద యాత్రకు ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను దాచేసి నట్టుగా ఈ ప్రభుత్వం దాచేయలేదు. పటాలు కట్టించి ఆఫీసుల్లో పెట్టింది. 98 శాతం హామీలను నెరవేర్చినట్టు ప్రకటించింది. ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను రద్దుచేస్తామని లోకేశ్ చెప్పలేడు. గోబెల్స్ విషప్రచారం తప్ప మరో కార్యక్రమమే లేదు. ఎల్లో మీడియా అందజేసే తప్పుడు కథనాల సారాంశమే తప్ప ఆయన మెదడంతా నిస్సారమే! అయినప్పటికీ తొలిరోజు పాదయాత్రను ‘ఘనంగా ముందడుగు’ అనే పతాక శీర్షికతో ‘ఈనాడు’ ప్రకటించింది. వారెవ్వా... కాకిపిల్ల కాకికి ముద్దు. రామోజీరావుకు ‘తాను మునిగిందే గంగ, తాను వలచిందే రంభ’. పాఠకుల్ని కూడా అదే నమ్మమంటాడు, ఖర్మ!
‘యువగళం’ పాదయాత్ర భూపాలం పాడితే... ‘వారాహి రథయాత్ర’ కోరస్ పాడుతుందా! లోకేశ్ మాటల్ని వింటే అంతే అనుకోవాలి. వారాహి, యువగళాలను ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు. రెండూ తమ ఆస్తులేనన్నంత ధీమాగా ఆ రెంటినీ ఎవరూ తాకలేరని చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే పవన్ కల్యాణ్ ఉపన్యాసాలు కూడా సాగుతున్నాయి. పవన్ కల్యాణ్ ఉపన్యాసాలను మొదటి నుంచీ వింటున్న వారికి ఒక మనిషిలో ఇన్ని వైరుద్ధ్యాలు ఎలా సాధ్యమన్న అనుమానం రాకుండా ఉండదు. మొదట్లో చేగువేరా మీద తనకున్న అభిమా నాన్ని ఆయన దాచుకునేవాడు కాదు. అప్పుడప్పుడూ ఆయన చేతిలో కన్పించే పుస్తకాల్లో, ఆయన నటించే సినిమాల్లో బొమ్మలు కనిపించేవి. ఇప్పుడెందుకో చేగువేరాకు గుడ్‌బై చెప్పినట్టు కనిపిస్తున్నది. ఇటీవల గువేరా కూతురు తెలుగు రాష్ట్రాల్లో పాల్గొన్న సభల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులూ పాల్గొన్నారు – ఒక్క జనసేన తప్ప! పవన్ కల్యాణ్ నుంచి ఏదైనా పత్రికా ప్రకటనైనా వస్తుందేమోనని చూశారు. అలాంటిదేమీ లేదు.
రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లవుతున్నా ఆయన ఉపన్యా సాలపై సినిమాల ప్రభావం పోలేదు. ఆయన చెబుతున్న చాలా విషయాలు వినేవాళ్లకు నమ్మశక్యంగా అనిపించవు. ఇటీవల తానొక బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు వర్ణవివక్షను ఎదుర్కొన్నాననీ, ఎయిర్ హోస్టెస్ తనకు మంచినీళ్లు ఇవ్వలేదనీ చెప్పారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో వేలమంది భారతీయులు ఎకానమీ క్లాస్‌లో కూడా ప్రయాణిస్తుంటారు. ఎవ్వరూ ఇటీవలి కాలంలో ఇలాంటి ఆరోపణ చేయలేదు. అలాంటిది బిజినెస్ క్లాసులో ఉన్న పవన్‌కు అవమానం జరగడమేమిటి?... మహాత్మాగాంధీ కూడా తొలి నాళ్లలో దక్షిణాఫ్రికా రైల్లో వర్ణవివక్షను ఎదుర్కొన్నట్టే తాను కూడా ఎదుర్కొన్నట్టు చెబితే సెంటిమెంట్ బాగా పండుతుంది, సినిమా గ్రాండ్‌గా ఉంటుందనుకున్నారా? ఇలాంటి అనేక నమ్మశక్యం కాని విషయాలను పవన్ ప్రసంగాల నుంచి వెతికి మరీ ఔత్సాహికులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. సుమారు ఒక డజన్ వరకు ఇటువంటి కామెడీ పీస్‌లు చక్కర్లు కొడుతున్నాయి.
రిపబ్లిక్ డే నాడు మాట్లాడుతూ కమ్యూనిస్టు భావాలు కలిగిన వారి తండ్రిగారు దీపారాధనతో సిగరెట్ వెలిగించు కున్నారని చెప్పారు. కమ్యూనిస్టు భావజాలం మీద ద్వేషం కలిగించడానికి కాకపోతే ఈ సంగతి ఎందుకు చెప్పినట్టు? తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు భావజాలం కలిగినవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. ఎవరైనా ఈ రకంగా ప్రవర్తించినట్టు ఎప్పు డైనా ఒక వార్త వచ్చిందా? అలాంటప్పుడు నిన్న మొన్నటి దాకా తనకు చేగువేరా ఆదర్శమనీ, నక్సలైట్ అవుదామని అనుకున్నా ననీ ఎందుకు చెప్పుకున్నట్టు? ఒక స్థిరత్వం లేదా? నాయకు డన్నవాడు నిజాయితీగా ఉండాలని జనం కోరుకుంటారు. నిజాలు మాట్లాడాలని కోరుకుంటారు. ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం చూపాలని కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా పట్ల పవన్ కల్యాణ్ చేసిన∙వ్యాఖ్యలు, చూపిన హావభావాలు గౌరవపూర్వకంగానే ఉన్నాయా? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడే తీరేనా? యువగళం, వారాహి యాత్రలు రెండూ ఆదిలోనే సంస్కారం అనే పట్టాలను తప్పాయి. పట్టాలు తప్పిన ఈ ప్రయాణాలను ఎవరూ ఆపలేరట! ఈ యాత్రలు ఏ తీరాలకు చేరుతాయో చూడాలి.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment