జనతంత్రం
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్‌పాట్ మీకు రోల్‌మోడల్‌గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?
ఏముందా రెడ్‌బుక్‌లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు...
అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్‌బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్క్‌ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది.
ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్‌ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్‌ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.
అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్‌బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.
ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్‌బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.
1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్‌రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్‌బుక్‌ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్‌లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.
హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.
ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు.
వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.
ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్ నెంబర్‌వన్ బీజేపీ, ఛాంపియన్ నెంబర్ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.
రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్‌మెంట్ ఎకనామిక్స్ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.
నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.
వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.
కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్‌బుక్‌తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్‌బుక్ రాజ్యాంగం చెల్లదు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment