భళా... తాటాకు చప్పుళ్ల తాండవం! | Sakshi Editorial On TDP Chandrababu and Andhra Pradesh Politics | Sakshi
Sakshi News home page

భళా... తాటాకు చప్పుళ్ల తాండవం!

Published Sun, Jan 7 2024 4:53 AM | Last Updated on Sun, Jan 7 2024 7:07 AM

Sakshi Editorial On TDP Chandrababu and Andhra Pradesh Politics

‘ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి’ – ఘటోత్కచుని వేషంలో ఎస్వీ రంగారావు చెప్పిన డైలాగ్‌ ఇది – ఆల్‌టైమ్‌ గ్రేట్‌ మూవీ ‘మాయాబజార్‌’ క్లైమాక్స్‌ సీన్‌లో! కుట్రలతో, కుయుక్తులతో, కపటంతో, వంచనతో పాండవులను వేధిస్తున్న దుష్టచతుష్టయ కౌరవ ముఠాకు ఘటోత్కచుడు తన ఇంద్రజాలంతో బుద్ధి చెబుతాడు. అతని మాయాజాలంలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటూ పలాయన మంత్రం పఠిస్తున్న ఆ కౌరవ మూకను చూసి పగలబడి నవ్వుతాడు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఉరఫ్‌ వెన్నుపోటు బాబు అనే కాలం చెల్లిన నాయకుడు మనుగడ కోసం ప్రదర్శి స్తున్న గారడీ విద్యలు కూడా వినోదం పుట్టిస్తున్నవి. ఏఐ టెక్నాలజీ కాలంలో కూడా కనికట్టు టెక్నిక్‌ల దశను ఈ వృద్ధ నేత దాటలేకపోతున్నారు. ఈ తరహా బేసిక్‌ మోడల్‌ నాటు విద్య లనే... బాబు చాణక్యాలు, బాబు ‘చక్ర’ వ్యూహాలుగా యెల్లో మీడియా ప్రచారం చేసిపెట్టింది. ఇప్పుడు కూడా యెల్లో పిల్లి కళ్లు మూసు కొని పాలు తాగే వ్యూహాలను అమలు చేస్తున్నది. తాటాకు చప్పుళ్లను కూడా అణుబాంబు విస్ఫోటాలుగా ప్రచారం చేసే పనిలో యెల్లో మీడియా నిమగ్నమై ఉన్నది.

మార్చి నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తి కావచ్చని వినబడుతున్నది. అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఈరోజు వరకు కూడా యాభై శాతానికి పైగా ఓటింగ్‌ బలం ఉన్నది. ముఖ్యమంత్రి రేటింగ్‌లో చంద్రబాబు అందుకోలేనంత దూరంలో జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారు 58 శాతం మంది ఉన్నారు. ఇటువంటి క్షేత్ర వాస్తవికత గురించిన స్పష్టమైన అవగాహన టీడీపీ కూటమికి ఉన్నది. అయిననూ ఎన్నికల్లో గెలిచి తీరవలె! ఎలా?

వీలైనన్ని ఎక్కువ పొత్తులు పెట్టుకొని తమ కూటమి బలాన్ని ఎంతో కొంత పెంచుకోవాలి. ఇదొక్కటే సరిపోదు. వైసీపీ ఓటింగ్‌ బలంలో కోతపెట్టాలి. ఈ రెండంచెల వ్యూహాన్ని చాలాకాలంగానే టీడీపీ పెద్దలు అమలు చేస్తున్నారు. ఈ కార్య క్రమానికి వ్యూహం లాంటి గొప్ప మాటలు అనవసరం. ఇదో అనైతిక ఎత్తుగడ. దిగజారుడు విధానం. చంద్రబాబు ఆశించే పొత్తులకు సైద్ధాంతిక ప్రాతిపదిక అవసరం లేదు. భావజాల సారూప్యత గురించిన చింతే లేదు.

తనకు ఐడియాలజీలు లేవని ఆయనే ప్రకటించుకున్నారు. కమ్యూనిజం అంతరించిందనీ, టూరిజమే అసలైన ఇజమనీ ఓ దివ్య సందేశాన్ని కూడా ఆయన వెలువరించారు. అయినా సరే, మన ఏపీ కమ్యూనిస్టుల్లో కొందరు ఎర్రజెండాలను చంద్ర బాబుకు వింజామరలుగా ఉపయోగించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇదేమి సంబంధమో సామాన్యులకు అర్థం కాదు. అదో దేవ రహస్యం. ‘ఏ బంధమో ఇది ఏ బంధమో, ఏ జన్మబంధాల సుమ గంధమో’ అని నిట్టూర్పులతో పాడుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.

కోస్తా జిల్లాల్లో ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు చంద్రబాబుకు సహజ శత్రువులు. ఈ వ్యతిరేక ప్రవాహం తనను రాజకీయంగా ముంచేయకుండా ఉండటానికి పవన్‌ కల్యాణ్‌ ద్వారా ఒక డైవర్షన్‌ స్కీమ్‌ను తయారు చేసుకున్నారు. తన అవసరాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకో, చీలడం కోసమో ఈ డైవర్షన్‌ స్కీమ్‌ను ఆయన వినియోగిస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీయే గనుక తెలుగుదేశం పొత్తు కోసం నిలబడే తొలి పార్టీ – జనసేన. అదొక్కటే సరిపోదు. బీజేపీ కూడా తోడు రావాలి. 

ఐదేళ్ల కింద ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుంచే చంద్రబాబు బీజేపీతో సయోధ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌ వగైరా పలువురు నాయకులను ఢిల్లీ లాబీయింగ్‌ కోసం కమలం పార్టీలో ప్రవేశపెట్టారు. పవన్‌ కల్యాణ్‌తో తాను పెట్టించిన పార్టీని ఎన్‌డీఏలో చేర్పించారు. పూర్వాశ్రమంలో తాను ఎన్డీఏలో ఉన్న కాలం నాటి కొందరు సావాసగాళ్ల తోడ్పాటును కూడా పొందు తున్నారు. బీజేపీ వాళ్లకు కూడా ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు ఎన్నో కొన్ని సీట్లు రావాలని ఉంటుంది కనుక తమ పొత్తుకు అంగీకరించక తప్పదని తెలుగుదేశం అంచనా.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించేలా చంద్రబాబు కూటమి పావులు కదిపింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి బాబు అప్పగించిన ‘మిషన్‌’పైనే  ఆమె పనిచేస్తున్నారు. ఈ పండుగలోపునే ‘మిషన్‌ ఎకాంప్లిష్డ్‌’ అనే ప్రకటన ఆమె చేసే అవకాశం ఉన్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కటాక్ష వీక్షణాల కోసం ఇంతగా పరిత పిస్తున్న బాబు బృందం మరి ఆరేళ్ల కింద ఎందుకు విడి పోయినట్టు? మోదీతో సహా బీజేపీ నాయకత్వంపై ఎందుకు తీవ్రమైన విమర్శలు చేసినట్టు? బాబు రాజకీ యాల్లో సిద్ధాంతాలే కాదు లాజిక్‌ కూడా ఉండదు. అవకాశ వాదమే ఎజెండా! అధికారమే అంతిమ లక్ష్యం!!

చంద్రబాబు ఆకాంక్షల మేరకు, పురంధేశ్వరి అభిలషి స్తున్నట్టుగా... బీజేపీతో కూడా పొత్తు కుదిరితే ఇంతటితో ప్రత్యక్ష పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్టే! ఇక పరోక్ష పొత్తుల కార్యక్రమాన్ని చాలాకాలంగా టీడీపీ నరుక్కొస్తున్నది. బీజేపీ ఉన్న కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేరే అవకాశం ఉండదు కనుక వీరిని అధికార పార్టీ ఓట్లు చీల్చేందుకు ఉపయో గించుకోవాలనే చావు తెలివితేటలతో టీడీపీ ప్లాన్‌ రూపొందించుకున్నది. కాంగ్రెస్‌ పార్టీకి గత కొంతకాలంగా వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్‌ కనుగోలు సహకారాన్ని కూడా చంద్ర బాబు తీసుకుంటున్నారట! సునీల్‌ కూడా చంద్రబాబు సామా జిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.

కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చంద్రబాబు మైత్రీ బంధం ఈనాటిది కాదు. గడిచిన పుష్కరకాలంగా అది బలపడుతూనే వస్తున్నది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును మొగ్గలోనే తుంచేయడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో పనిచేశాయి. ఉమ్మడిగా ఆయనపై కేసులు వేశాయి. ఆయనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన న్యాయ మూర్తిని పదవీ విరమణ అనంతరం మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్‌గా ప్రతిష్ఠించారు. జాతీయ స్థాయిలో చిక్కి శల్యావశిష్ట స్థితికి చేరిన కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు కల్పించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ఆయన మరణానంతరం ఎఫ్‌ఐఆర్‌లో ముద్దాయిగా చేర్చి కాంగ్రెస్‌ హైకమాండ్‌ దారుణమైన కృతఘ్నతకూ, నమ్మకద్రోహానికీ పాల్పడింది. చంద్రబాబు సలహా సంప్రదింపులు కూడా ఈ వంచన వెనుక ఉన్నాయి.

విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలో ఎన్టీఏతో నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు చంద్రబాబు ఆ కూటమి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో మరోసారి కాంగ్రెస్‌కు చేరువై ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆర్థిక సహకారం అందించినట్టు కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్‌లోనైతే ఆయన మాటే చెల్లుబాటైంది. ఆయనే ఆర్థిక సహకారం అందించి కలిసి పోటీ చేశారు.

తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వాన్ని సమకూర్చడమే గాక ఆర్థికంగానూ తోడ్పడ్డారనేది బహిరంగ రహస్యమే. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచడానికి వివేకానందరెడ్డి రూపంలో ఆయన కుటుంబాన్ని చీల్చినట్టే ఇప్పుడు ఆయన సోదరి షర్మిలను తెలంగాణ కార్య క్షేత్రం నుంచి ఏపీలోకి దించాలనే కాంగ్రెస్‌ ప్రయత్నాల వెనుక వ్యూహం కూడా చంద్రబాబుదే!

తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిలకు భాగస్వామ్యం కల్పించడానికి రేవంత్‌రెడ్డి వ్యతిరేకించడం, ఆమె ఇడుపులపాయ, విజయవాడల పర్యటనలకు సీఎం రమేశ్‌ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం, పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉండే బీటెక్‌ రవి కడప ఎయిర్‌పోర్టులో బ్రదర్‌ అనిల్‌తో రాజకీయ చర్చలు జరపడం... ఇవన్నీ చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తున్నాయి. అడ్రస్‌ గల్లంతయిన కాంగ్రెస్‌ పార్టీకి ఆశ్రయం కల్పించడం కోసం చంద్రబాబు ఎందుకు తాపత్రయపడు తున్నట్టు? కాంగ్రెస్‌ పార్టీ ఎంతో కొంత వైసీపీ ఓట్లను చీల్చక పోతుందా అన్న ఆశ. కుళ్లిపోయి కంపు గొడుతున్న పాతకాలపు రాజకీయ చతురత ఇది.

ఏపీ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ పార్టీనీ, హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగవేసిన బీజేపీనీ కుడిఎడమల నిలబెట్టుకొని అధికార పార్టీపై యుద్ధం చేయాలనుకోవడమే ఒక దిక్కుమాలిన ఆలోచన. మెదడు పూర్తిగా పాడైతే తప్ప ఈ తరహా ఆలోచనలు ఎవరూ చేయలేరు. నెగెటివ్‌ ఓటును చీల్చాలంటే ఒక అర్థం ఉంటుంది. పాజిటివ్‌ ఓటును ఎట్లా చీల్చగలుగుతారు? అది ప్రభుత్వం పట్ల అభిమానంతో వేసే ఓటు కదా? మరో పార్టీతో ఎట్లా పంచుకుంటారు?

అది పక్కన పెడితే, జగన్‌ ప్రభుత్వం ఈ దేశం ముందుకు ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చింది. మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలందరూ సాధికారత సంతరించుకోవడమే ఆ ఎజెండా. ఈ సరికొత్త నమూనా ఇప్పుడు ప్రపంచంలోని అభ్యుదయ శక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నది. రాష్ట్రంలోని బహుజనులంతా జగన్‌ పార్టీ గొడుగు కిందకు సమీకృతమవుతున్నారు. పాచిపోయిన వ్యూహాలతో, ఊకదంపుడు హామీలతో వారిని చీల్చడం కలలోని మాట.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార శైలి కూడా సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నమైనది. సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొనిపోవడం, స్థానిక ప్రజల ఆకాంక్షలనూ, సామాజిక వర్గాల ఆకాంక్షలనూ గౌరవించడం, ప్రజా ప్రతినిధులను ప్రజలకు జవాబుదారీగా నిలపడం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎజెండాలో భాగం. టిక్కెట్ల పంపిణీలోనూ ఇది ప్రతిఫలిస్తున్నది. ఈ కొత్త ఒరవడిని ఊహించలేని యెల్లో మీడియా, సాంప్రదాయ రాజకీయ పరిశీలకులు హరాయించు కోలేకపోతున్నారు. ఏదో జరిగిపోతున్నదని తాటాకు చప్పుళ్లతో హడావిడి చేస్తున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రం కూల్‌గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.

యెల్లో మీడియా సంగతి తెలిసిందే. అది చేసే గోబెల్స్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌ తరహా దుష్ప్రచారం సంగతీ తెలిసిందే. చంద్ర బాబు పరిపాలనలో అభివృద్ధి అంతరిక్షాన్ని తాకిందనీ, జగన్‌ మోహన్‌రెడ్డి దాన్ని పాతాళంలోకి తోసేసాయనీ రాయని రోజు లేదు. అమరావతి అనే రాజధాని నగరం అలనాటి విజయ నగరంలా వెలిగిపోయిందనీ, ఇప్పుడు మసకబారిందనీ రాస్తున్నారు.

‘కత్తులును ఘంటములు కదనుదొక్కినవిచట... అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట...’ అంటూ గ్రాఫిక్‌–డిజైన్లను చూపెడుతున్నారు. ఇప్పుడు రాజధాని రాళ్లపాలైందని వాపోతు న్నారు. నిజానికి రాష్ట్రంలోని ఏ పట్టణాన్ని తీసుకున్నా చంద్ర బాబు ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఈ అయిదేళ్లలో జరిగిన అభివృద్ధే ఎక్కువ. మౌలిక వసతుల రంగంలో గడిచిన డెబ్బయ్యేళ్ల అభివృద్ధిని సవాల్‌ చేసేదిగా ఈ ఐదేళ్ల కాలం నిలబడిపోతుంది.

ఏకకాలంలో నాలుగు ఓడరేవులు శరవేగంగా పూర్తవు తున్నాయి. పది ఫిషింగ్‌ హార్బర్లు రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖ సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జరుగుతున్నాయి. 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణ మవుతున్నాయి. 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పల్లె ఒక మినీ రాజధానిగా మారింది. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లు, విలేజ్‌ క్లినిక్‌లు వగైరా వేలాది కొత్త భవనా లతో గ్రామసీమలు కళకళలాడుతున్నాయి. పేద బిడ్డలకు అధు నాతనమైన బడులు అందుబాటులోకి వచ్చాయి.

ఇంటి ముందటే ఆధునిక వైద్యం లభిస్తున్నది. ఇటువంటి మార్పులను యెల్లో మీడియా డార్లింగ్‌ విజనరీ కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే కలవరపడుతున్నారు. తాటాకుల చప్పుళ్లు చేస్తున్నారు. ఐదు వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చి ఒక మౌత్‌ పబ్లిసిటీ వింగ్‌ (మూతి ప్రచారంగాళ్లు)ను ఏర్పాటు చేసి జనంలోకి వదిలారు. రాబిన్‌ శర్మ టీమ్‌తో పాటు ఒక రిటైర్డ్‌ డీఐజీ ఈ వింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.

నలుగురు కూడిన ప్రతి చోటకు ఈ మూతి ప్రచారంగాళ్లు చేరుకుంటారు. జగన్‌ ప్రభు త్వానికి వ్యతిరేక గాలి వీస్తున్నదని, అన్నిచోట్లా ఓడిపోతారని చెబుతారు. ఎన్నికలయ్యేంత వరకూ వీరి పని ఇదే! ఈ ప్రచారంతో జనం ప్రభావితం కావాలనే అథమస్థాయి ఎత్తుగడ. వీరి ఆపసోపాలూ, ఆయాస ప్రయాసలూ వినోదభరితంగానే ఉన్నాయి. గెలుపు మీద నమ్మకం లేక గిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటే గమ్మత్తుగానే కనిపిస్తున్నది. ఔను! వారి ఆర్తనాదములు శ్రవణా నందకరముగా నున్నవి!!

వర్ధెల్లి మురళి

vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement