యథేచ్ఛగా హింసాకాండ.. ఇదేమి రాజ్యం?: వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP MPs Fires On TDP activists and Chandrababu | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా హింసాకాండ.. ఇదేమి రాజ్యం?: వైఎస్సార్‌సీపీ నేతలు

Published Thu, Jun 13 2024 4:32 AM | Last Updated on Thu, Jun 13 2024 8:34 AM

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. చిత్రంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,  మిథున్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, రఘునాథరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు, గురుమూర్తి, తనూజరాణి

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. చిత్రంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, రఘునాథరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు, గురుమూర్తి, తనూజరాణి

వైఎస్సార్‌సీపీ ఎంపీల ధ్వజం.. ఏపీలో అరాచక శక్తుల స్వైర విహారం

ఆటవిక పాలనకు బాబు నాంది 

ప్రమాణ స్వీకారానికి ముందే దాడులకు ఉసిగొల్పారు

ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలి

రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్‌హెచ్‌ఆర్సీ 

కార్యాలయాలకు లిఖితపూర్వకంగా ఎంపీల ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజు లుగా అరాచక శక్తులు సాగిస్తున్న హింసాకాండను చూస్తుంటే టీడీపీ కార్యకర్తలా? గూండాలా? అన్న ప్రశ్న తలెత్తుతోందని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడంతోపాటు ఇళ్లు, ఆస్తుల విధ్వంసాలకు పాల్ప డటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. 

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇలాంటి దారుణాలు జరిగాయంటే రాబోయే ఐదేళ్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు. టీడీపీ గూండాల దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్‌హెచ్‌ఆర్సీ కార్యాలయాల్లో బుధవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందచేసిన అనంతరం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు, రఘునాధరెడ్డి, బాబూరావు, తనూజరాణి, గురుమూర్తిలతో కలిసి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మూకల దాడులకు సంబంధించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..

చంద్రబాబుది ఆటవిక పాలన
టీడీపీ అధినేత చంద్రబాబుది ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. టీడీపీ గూండాల అకృత్యాలను రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో చట్టాలు, స్వేచ్ఛ, న్యాయ పాలన లేదు. అన్యాయం రాజ్యమేలుతోంది. కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా అధికారులు జంకడం చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో బోధపడుతుంది. ప్రమాణ స్వీకారం కంటే ముందే రాష్ట్రాన్ని అత్యంత భయానక వాతావరణంలోకి నెట్టారు. ఇప్పటి వరకూ ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి కానీ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు నాంది పలికింది చంద్రబాబే.

ముందే దాడులకు పురిగొల్పి..
ఎన్నికల కోడ్‌ వచ్చిన నాటి నుంచి మొదలైన దాడులు ఫలితాల తర్వాత తీవ్రరూపం దాల్చాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల ప్రాణాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అంటేనే గూండాగిరీ అని రుజువు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే దాడులకు పురిగొల్పి చంద్రబాబు బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ వేశారు. వీటిని అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది. బాధితుల ఆక్రందనలు తమ కుటుంబ సభ్యులివిగానే భావించి ఈ రక్త చరిత్రను అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.

మూడుసార్లూ బీజేపీతో అండతో పీఠం
1999, 2014, 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడుసార్లూ బీజేపీ సహకారం వల్లే పీఠం దక్కించుకున్నారు. హింసాకాండకు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. భావితరాలకు హింసా సంస్కృతిని నేర్పడం ఎవరూ హర్షించరు. అధికారం అంటే బాధ్యత అని గుర్తుంచుకోవాలి. అధికారం అంటే రౌడీయిజం గూండాయిజం కాదు. బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదలపై టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ సభ్య సమాజం తలదించుకొనేలా ఉంది. యూనివర్సిటీలు, వీసీలపై దాడులు తగవు. 

అమానవీయ ఘటనలకు పాల్పడడమే కాకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త రాజ్‌కుమార్‌పై లోకేష్‌ మనుషులు చేసిన దాడిని సోషల్‌ మీడియాలో అందరూ చూశారు. బంగారం లాంటి రాష్టం తగలడుతుంటే బాధగా ఉంది. ఏపీలో ఘటనలకు కేంద్రం కూడా తలవంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మీడియాపైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. టీవీ 9, ఎన్‌టీవీ, సాక్షి తదితర చానెళ్లను ఎంఎస్‌వోల నుంచి తొలగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్న భావన కలుగుతోంది. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని మరోసారి నేరుగా కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తాం.

రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యం
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి రాష్ట్రం, దేశ ప్రయోజనాలే పరమావధిగా వైఎస్సార్‌సీపీ వ్యవహరిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ అదే రీతిలో బిల్లులకు మద్దతు ఇచ్చామని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉభయ సభల్లో టీడీపీకి 16 మంది ఎంపీలుండగా వైఎస్సార్‌ సీపీకి 15 మంది సభ్యులున్నారని చెప్పారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి అటు టీడీపీ, ఇటు వైఎస్సార్‌సీపీ అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీదే బలమెక్కువ అని తెలిపారు. 

ఎన్డీఏ కూటమా? ఇండియా కూటమా? అనేది కాకుండా రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా బిల్లులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఎన్డీఏ సంఖ్యాబలం ఆధారంగా కొద్ది మెజారిటీతోనైనా లోక్‌సభ స్పీకర్‌ ఎంపిక జరిగిపోతుందని చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫైడ్‌ సివిల్‌ కోడ్‌)కి తాము మద్దతు ఇవ్వబోమన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నికలపై తమ పార్టీ అధినేత సూచనలు తీసుకొని ముందుకెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపడతామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్‌ఎస్‌.. ఇలా దేశంలో అన్ని పార్టీలతోనూ జత కట్టిన మహానాయకుడు చంద్రబాబు మినహా మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. 
 
నూతన ప్రభుత్వానిదే బాధ్యత: ఎంపీ మిథున్‌రెడ్డి 
రాష్ట్రంలో కొద్ది రోజులుగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలకు నూతన ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేయడం సరికాదు. ప్రజాతీర్పును గౌరవిస్తూ హామీలను నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకోవాలి. 
వైఎస్సార్‌సీపీకి 40 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. కొత్త ప్రభుత్వం అందరినీ సమాన దృష్టితో చూడాలి.

న్యాయ పోరాటం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 
రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యంపై రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ, ఎన్‌హెచ్‌ఆర్సీలకు ఫిర్యాదు చేశాం. తగిన స్పందన లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ గూండాయిజం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయి. కుట్రపూరితంగా ప్రమాణ స్వీకారం కంటే ముందే కార్యకర్తల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఉసిగొల్పారు. మా కార్యకర్తల్ని కాపాడుకుంటాం. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటాం. అల్లరి మూకలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నందున కేంద్రం తక్షణమే స్పందించి శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలను పార్లమెంట్‌ దృష్టికి తెస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement