వాగు పోరంబోకును ఆక్రమించి మంగళగిరిలో ‘ఎన్టీఆర్ భవన్’
అనుమతి లేకుండా ఎనిమిది అంతస్తులతో విలాస భవనం
ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యాలయం అదే
దీనిపై కోర్టులో కొనసాగుతున్న విచారణ
రాష్ట్రవ్యాప్తంగా రాజకోటల్లా టీడీపీ ఆఫీసులు.. జీవోలన్నీ బాబు హయాంలోనే
ఏకంగా ఉండవల్లిలోని అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసం
విజయవాడ ఆటోనగర్‌లో ఇరిగేషన్ స్థలాన్ని లాక్కుని టీడీపీ ఆఫీసు ఏర్పాటు
విశాఖలో దసపల్లా కొండను తొలిచి కార్యాలయాన్ని కట్టేసిన టీడీపీ
కాకినాడలో జెడ్పీ భవనాన్ని స్వాధీనం చేసుకుని టీడీపీ ఆఫీసు నిర్మాణం
శ్రీకాకుళంలో దళితులకు కేటాయించిన భూముల్లో ఎన్టీఆర్ భవన్
తమకు అనుకూలంగా గతంలోనే పార్టీలకు భూముల కేటాయింపు విధానం తెచ్చిన చంద్రబాబు
వాటి ఆధారంగానే కేటాయింపులు.. పక్కనున్న పేదల స్థలాలు సైతం కబ్జా
తన నిర్వాకాలను కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీ కార్యాలయాలపై తప్పుడు ప్రచారాలు
సాక్షి, అమరావతి: సర్కారు స్థలాలు, పేదల భూములను లాక్కుని పచ్చ భవనాలు నిర్మించుకున్న టీడీపీ పెద్దలు సుద్దులు వల్లించడం గురివింద సామెతను గుర్తు చేస్తోంది. అధికారంలో ఉండగా ఎన్టీఆర్ భవన్‌ల పేరుతో అత్యాధునిక కార్యాలయాలు సమకూర్చుకున్న టీడీపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాగు పోరంబోకు, రైతుల భూమిని కబ్జా చేసి మంగళగిరిలో అత్యంత విలాసవంతమైన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకోగా విశాఖలో దసపల్లా భూముల్లో పాగా వేసి పచ్చ భవనాలు కట్టుకున్నారు.
విజయవాడ ఆటోనగర్‌లో ఇరిగేషన్ స్థలం.. శ్రీకాకుళంలో దళితులకు కేటాయించిన భూమి.. కాకినాడలో జెడ్పీ స్థలం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్క చాంతాడును తలపిస్తుంది. ఇవన్నీ ఎన్టీఆర్ భవన్‌లే. అధికారం మాటున చంద్రబాబు సమకూర్చుకున్న పార్టీ కార్యాలయాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి కరకట్ట నివాసమే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటిది. నిబంధనలు, చట్టాలకు తూట్లు పొడిచి కృష్ణా నది ఒడ్డున కట్టిన ఆ విలాస రాజ భవనంలోనే చంద్రబాబు ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నారు. అక్రమాల బాటలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భవన్‌ల పేరుతో విలాసవంతమైన కోటలు కట్టేశారు. వీటిని కప్పిపుచ్చి నిస్సిగ్గుగా వైఎస్సార్‌సీపీ కార్యాలయాలపై బురద జల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
పార్టీలకు భూముల జీఓ ఇచ్చిందే బాబు
నిజానికి చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడే రాజకీయ పార్టీలకు భూములు కేటాయించే విధానాన్ని తెచ్చారు. ఇందుకోసం 2016 జూలై 21న జీఓ నెంబర్ 826 విడుదల చేశారు. రాజధానిలో మూడు కేటగిరీలుగా పార్టీలకు భూములు కేటాయించాలని అందులో పేర్కొన్నారు. మొదటి కేటగిరీలో జాతీయ రాజకీయ పార్టీ / గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీకి అసెంబ్లీలో 50 శాతానికి పైగా బలం ఉంటే 4 ఎకరాలు కేటాయించాలి. రెండో కేటగిరీ కింద అసెంబ్లీలో 25 నుంచి 50 శాతం బలం ఉన్న పార్టీలకు అర ఎకరం కేటాయించాలి.
మూడో కేటగిరీలో 25 శాతం కంటే తక్కువ ఉన్న పార్టీలకు వెయ్యి గజాల స్థలం కేటాయించాలి. దీని ప్రకారం అప్పట్లో టీడీపీకి 4 ఎకరాలు, నాడు 67 స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీకి అర ఎకరం పొందే అర్హత లభించింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం మొదటి కేటగిరీలో ఉన్న పార్టీలకు రెండు ఎకరాలు, రెండో కేటగిరీలో ఉన్న పార్టీలకు వెయ్యి గజాలు, మూడో కేటగిరీలో ఉన్న పార్టీలకు 300 గజాలు ఇవ్వాలన్నది జీవో సారాంశం. ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజుకు ఈ విధానంలో భూములు కేటాయించాలని నిర్ణయించారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం 30 సెంట్లు కేటాయించాలని 2017 డిసెంబర్ 8న మరో జీఓ 340 జారీ చేశారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో
రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు సంబంధించి 2016లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో
లీజు నిబంధనలు బేఖాతర్
తాను ఇచ్చిన జీవోకు అనుగుణంగా రాజధానితోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ కార్యాలయాల కోసం చంద్రబాబు వరసగా భూములు కేటాయించుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట ఈ భూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి చాలాచోట్ల భూములు కేటాయించి ఆగమేఘాల మీద భవనాలు కూడా కట్టేశారు. నాడు చంద్రబాబు ప్రకటించిన విధానం ప్రకారం 33 ఏళ్ల లీజుకు భూములు కేటాయించాలి.
అయితే ఆ నిబంధనను కొన్నిచోట్ల ఉల్లంఘించి ఏకంగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేసుకున్నారు. మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళంలో 99 ఏళ్ల లీజుకు భూములు తీసుకున్నారు. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో అత్యంత విలువైన భూముల్లో స్థలాలు కేటాయించుకొని కార్యాలయాలు నిర్మించి ఇప్పుడు అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. అదే జీవో ప్రకారం వివిధ జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ 33 ఏళ్లకు లీజుకు తీసుకుంటే అదేదో ఘోరం అనే రీతిలో దుష్ప్రచారానికి తెర తీశారు.
హైదరాబాద్‌లో రాత్రికి రాత్రే
ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అత్యంత ఖరీదైన ఎకరం స్థలాన్ని రాత్రికి రాత్రే కేటాయించేసుకున్నారు. వాణిజ్య భూమిగా హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) చేతిలో ఉన్న ఆ స్థలాన్ని 1997 ఏప్రిల్ 30న జూబీ్లహిల్స్ మున్సిపాలిటీ నుంచి షేక్‌పేట ఎమ్మార్వోకు బదలాయించారు. ఆయన అదేరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీగా ఉన్న డి.శ్రీనివాసరావు పేరు మీదకు మార్చారు.
అదే రోజున ట్రస్టుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటం గమనార్హం. ఈ పనులన్నీ గంటల వ్యవధిలో జరిగిపోయాయి. అంతటి విలువైన స్థలాన్ని నెలకు రూ.7,500 అద్దెకు చంద్రబాబు కేటాయించుకున్నారు. హైటెక్ సిటీ నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా అత్యాధునిక హంగులతో ఎన్టీఆర్ భవన్‌ను నిర్మించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల వారీగా టీడీపీ కార్యాలయాలకు భూములు కేటాయించుకున్న చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరును కొనసాగించారు.
పోరంబోకు భూమికి మంగళం!
ప్రస్తుతం చంద్రబాబు, టీడీపీ నేతలు సకల విలాసాలతో దర్జాగా మీడియా, పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం స్థలం కోల్‌కతా–చెన్నై హైవేను ఆనుకుని ఉంది. 3.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ రూ.75 కోట్లకుపైనే ఉంటుంది. ఇందులో వాగు పోరంబోకు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డి పట్టా భూములూ ఉన్నాయి. కాలువను పూడ్చి... పోరంబోకు భూమిని ఆక్రమించి... రైతుల భూములను కబ్జా చేసి మరీ టీడీపీ జాతీయ కార్యాలయం కట్టారు.
99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎకరాకు రూ.1,000 మాత్రమే. నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేర 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట 1.75 ఎకరాలను డి పట్టాలుగా ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి సాగు చేస్తున్న పంటలను పొక్లెయిన్లతో దున్నేసి రాత్రికి రాత్రే టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు.
బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు. ఆ రైతుల తరపున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. 8 అంతస్తుల విలాసవంతమైన ఈ ఎన్టీఆర్ భవన్‌ను అనుమతి లేకుండా నిర్మించేశారు. ఉల్లంఘనలు, అక్రమాలకు పర్యాయపదం టీడీపీ జాతీయ కార్యాలయం.
గుంటూరులోనూ గుటకాయ స్వాహా
తొలుత 2015లో గుంటూరు అరండల్‌పేటలోని పిచుకలగుంటలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ భవనాన్ని నిర్మించారు. మున్సిపల్ స్థలాలను లీజుకు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు బలవంతంగా ఈ భూమిని లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్‌లో తీర్మానం చేయించి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకుని పార్టీ భవనం కట్టేశారు.
సిక్కోలులో దళితుల భూమిలో పాగా
శ్రీకాకుళంలో ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ సేకరించిన భూమిని టీడీపీ కార్యాలయానికి తీసుకున్నారు. ఉడా, కార్పొరేషన్ అధికారుల అనుమతి లేకుండా పార్టీ భవనాన్ని నిర్మించారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని ఆక్రమించేశారు. 80 అడుగుల ప్రధాన రోడ్డులో ఉన్న ఈ స్థలం విలువ 2017లోనే అనధికారికంగా రూ.20 కోట్లు ఉంది. ఏడాదికి రూ.25 వేల చొప్పున 99 సంవత్సరాల లీజుకు తీసుకున్న ఈ స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు స్వయంగా చంద్రబాబే ప్రారంభించారు.
కాకినాడలో జెడ్పీ స్థలంపై కన్నేసి..
కాకినాడలో విలువైన జిల్లా పరిషత్ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుని విలాసవంతమైన భవనాన్ని కట్టారు. మేడలైన్ ఆఫ్ కాకినాడ ప్రాంతంలో 2 వేల గజాలను 99 ఏళ్ల లీజుకి జిల్లా పరిషత్ తీర్మానం ద్వారా టీడీపీ పరం చేశారు. ఈమేరకు 2016 నవంబర్ 1న భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. దీని విలువ రూ.10 కోట్లకు పైమాటే.
బెజవాడ నడిబొడ్డున రూ.40 కోట్ల స్థలం
విజయవాడ నడిబొడ్డున ప్రజావసరాలకు ఉపయోగపడే విలువైన భూమిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఒత్తిడితో టీడీపీ కార్యాలయానికి అప్పగించారు. గుణదల పరిధిలోకి వచ్చే ఆటోనగర్–గురునానక్ కాలనీకి ఆనుకుని ఇరిగేషన్ శాఖకు 95 సెంట్ల భూమి ఉంది. ఇరిగేషన్ విభాగం ఫ్లోరేజి, ఇతర పనుల కోసం దీన్ని వినియోగించేవారు. ఇందులో కార్యాలయం కూడా ఉండేది.
అయితే టీడీపీ ఆఫీసు కోసం దీన్ని ఇవ్వాలని అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి కూల్చేశారు. ఇరిగేషన్ మెటీరియల్, యంత్రాలను మరోచోటకు తరలించారు. అన్ని అభ్యంతరాలనూ తోసిరాజని 99 ఏళ్ల లీజుకిచ్చేశారు. ఆటోనగర్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాలనే నిబంధన ఉన్నా ఐలా పాలకవర్గాన్ని బెదిరించి నోరు మూయి ంచారు. వాణిజ్య భూమిగా కన్వర్షన్ చేసి టీడీపీ కార్యాలయం నిర్మించుకున్నారు. దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే.
విశాఖలో దసపల్లా కొండను తొలచి..
విశాఖపట్నంలో దసపల్లా కొండను తొలిచి మరీ టీడీపీ కార్యాలయాన్ని కట్టేశారు. దసపల్లా భూముల్లో 2 వేల గజాల్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు లీజు చొప్పున 2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీకి కేటాయించింది. ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న కొండను (మరో వెయ్యి గజాల మేర) కూడా ఆక్రమించి 2016లో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండానే జీ+3 భవనం నిర్మించి 2018లో లోకేశ్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment