ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో అభివాదం చేస్తున్న చంద్రబాబు. చిత్రంలో పురందేశ్వరి, పవన్
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తామని, ప్రతి అడుగు ప్రజల కోసమే వేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజా వేదికలా కూల్చి వేతలు, మూడు రాజధానుల పేరుతో ఆటలు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో మంగళవారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్డీయే శానససభాపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పాజిటివ్ ప్రభుత్వం ఉంటుందని, అశాంతికి తావుండదని చెప్పారు.
రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, ఆ తీర్పును నిలబెట్టుకునే బాధ్యత ఎమ్మెల్యేలందరిపైనా ఉందన్నారు. ప్రమాదంలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని.. ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము ఓడింది కేవలం 11 సీట్లలో మాత్రమేనని, 93 శాతం స్ట్రైక్ రేట్‌తో 57 శాతం ఓట్లను కూటమి సాధించిందని తెలిపారు. ఇలాంటి విజయం, ఇంతటి సంతోషం ఎప్పుడూ లేదని, ఫలితాలతో ఏపీ ప్రతిష్ట, గౌరవం పెరిగిందని చెప్పారు.
తనను జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును ఎప్పుడూ మరిచిపోనన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని గతంలో చెప్పారని, జైల్లో తనను కలిసిన అనంతరం పొత్తు ప్రకటించారని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని, మళ్లీ ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సహకారం కూడా అవసరమని, ఈ మేరకు కేంద్రం కూడా హామీ ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, దెబ్బతినని వర్గమంటూ లేదన్నారు.
కక్షపూరిత రాజకీయాలు ఉండవు
రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలీదని, ఎక్కడ నుండి తెచ్చారో తెలీదని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని చంద్రబాబు అన్నారు. సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని, వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో ఉందన్నారు. పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష పూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజయాలు పాటిద్దామని చెప్పారు. పోలవరం డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని, మళ్లీ కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని తెలిపారు.
రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ
ఏపీకి రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ ఉంటుందని బాబు స్పష్టం చేశారు. న్యాయ రాజధాని కర్నూలు అంటూ మోసం చేశారని, రాయలసీమలో వన్ సైడ్‌గా ఎన్నికలు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషేనని, తాను సీఎంగా ఉన్నా, పవన్ కళ్యాణ్ ఏ పదవిలో ఉన్నా సామాన్యుల్లా ప్రజల్లో ఒకరిగానే ఉంటామని తెలిపారు. హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదన్నారు. తమ ప్రభుత్వంలో ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదని, స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళతామన్నారు.
కేంద్రంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కిందన్నారు. పదేళ్ల మోదీ పాలన దేశ ప్రతిష్టను పెంచిందని, గతంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి వచ్చిందని తెలిపారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు బాధ్యత తీరిపోయిందనుకోకుండా నిత్యం తమను ఆశీర్వదించి ముందుకు నడపాలన్నారు. తప్పు చేస్తే ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, కలిసి ముందుకు సాగి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని కోరారు. తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉండాలనేది తన కల అని తెలిపారు. నిర్ధిష్ట సమయంలోనే ఏపీని నంబర్ వన్‌గా చేసుకుందామన్నారు.
హామీలన్నీ నెరవేర్చేలా పాలన : పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఐదు కోట్ల మందికిపైగా ప్రజలు తమపై నమ్మకం పెట్టుకున్నారని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదన్నారు. అన్నింటా బలంగా నిలబడతామని చెప్పి అధికారంలోకి వచ్చామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. నాలుగు దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని, వివిధ దేశాధి నేతల దృష్టిని సైతం తెలుగు రాష్ట్రాల వైపు మళ్లించే సమర్ధత చంద్రబాబుకు ఉందన్నారు. చంద్రబాబు ఎంతో నలిగిపోయారని, జైల్లో ఆయన్ని చూశానని, మంచి రోజులు వస్తాయని చెప్పానని, వచ్చాయని తెలిపారు.
ఆయన అద్భుతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. కలసికట్టుగా చేసిన కృషితో ఏన్డీయే కూటమి అద్భుత మెజారిటీతో 164 శాసన సభ స్థానాలు దక్కించుకుందన్నారు. ఒక్క ఓటు చీలకుండా అలయెన్స్ ఎలా ఉండాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలిసి కట్టుగా చూపించారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయం సాధించామన్నారు. ఈ విజయం నుంచి తాము కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో పని చేయాలని, మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమమని తెలిపారు.
ఎన్డీయే సభాపక్ష నేతగా చంద్రబాబు
ఈ సమావేశంలో చంద్రబాబును ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తొలుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం పవన్ కళ్యాణ్, చంద్రబాబును ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపరిచారు. సమావేశం తర్వాత అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురందేశ్వరిలు రాజ్‌భవన్‌కు వెళ్లి 164 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తెలిపి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
అనంతరం చంద్రబాబు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో బుధవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 30 నిముషాల పాటు సమావేశమయ్యారు. తనకు మద్దుతు ప్రకటించిన 163 మంది ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబును లాంఛనంగా ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment