ఏపీలో సామాజిక పెన్షన్ల రాజకీయం తమాషాగా ఉంది. గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ప్రాంతం చూడం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం.. అని స్పష్టంగా చెప్పి ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా కార్యక్రమాలు అమలు చేసింది. అందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పెన్షన్లను వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. ఎక్కడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ప్రమేయం లేకుండానే సాగిపోయేది. వలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగం కనుక వివాదం, పబ్లిసిటీ లేకుండా పెన్షన్లు పంచేవారు. అయినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓటమిపాలైంది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తాను చెప్పిన విధంగా ఈ నెలకైతే పెంచిన సామాజిక పెన్షన్ లు ఇచ్చింది. అంతవరకు ఒకే. మిగిలిన స్కీముల గురించి ఇంకా చెప్పకపోయినప్పటికీ ఇప్పటికే అమలులో ఉన్న పెన్షన్ కు మరో వెయ్యి రూపాయలు పెంచి, మూడు నెలల బకాయిలు చెల్లించారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. కానీ ఇదేదో ఇప్పుడే సరికొత్తగా కనిపెట్టినట్లు, మొత్తం రాజకీయ కార్యక్రమంగా మార్చి టీడీపీ ప్రచారానికి వాడుకోవడం మాత్రం ఆక్షేపణీయమే.
జూలై ఒకటిన జరిగిన తంతు చూశాకా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమాయకత్వంగా చిత్తశుద్దితో రాజకీయాలకు అతీతంగా వలంటీర్లు ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారా అనే భావన ఎవరికైనా రావచ్చు. అదే చంద్రబాబు అయితే ఫక్తు తనదైన రాజకీయ శైలిలో గతంలో జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈసారి తన పార్టీ కార్యకర్తల ద్వారా వీటిని పంపిణీ చేయించారు. వలంటీర్లు లేకుండానే పంపిణీ చేయగలం చెప్పుకోవడంతో పాటు ప్రచారం కూడా భారీగా రావాలన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేశారన్నది అర్ధం అవుతూనే ఉంది.
ఇప్పటికే పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా పార్టీ కార్యకర్తల ద్వారా డబ్బు పంపిణీ చేయించవచ్చా అని అడిగితే ఎవరు బదులు ఇస్తారు. వారికి ఉన్న చట్టబద్దత ఏమిటని ఎవరు ప్రశ్నిస్తారు? పైగా టీడీపీ కేంద్ర కార్యాలయమే దీనిపై ఆదేశాలు ఇచ్చి మరీ కార్యకర్తలను రంగంలోకి దింపింది. పేరుకు సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇస్తారని తెలిపినా, హడావుడి చేసి ఫోటోలు దిగింది మాత్రం టీడీపీ, జనసేన కార్యకర్తలే. కొన్ని చోట్ల వీరి మధ్య గొడవలు కూడా జరిగాయట. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలో, సిబ్బందో ఐదువందల రూపాయలు కట్ చేసుకుని పెన్షన్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. మరికొన్నిచోట్ల వృద్ధుల ఇళ్లకు వెళ్లకుండా, అందరిని ఒక చోటకు పోగు చేసి పెన్షన్లు అందచేశారు. వైఎస్సార్‌సీపీకి సంబంధించినవారని చెప్పి పలాస తదితర కొన్నిచోట్ల పెన్షన్ ఇవ్వకుండా నిలుపుదల చేశారు. భవిష్యత్తులో పెన్షన్ దారుల సంఖ్యలో కోత పెట్టబోతున్నారని కూడా సమాచారం వస్తోంది.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సైతం స్వయంగా ఒక లబ్దిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం విశేషం. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా చేయలేదు. ఈసారి అలా చేయవలసి వచ్చిందంటే అది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వ్యవస్థ ప్రభావమే అని చెప్పాలి. అంతకు ముందు పద్నాలుగేళ్లు తాను సీఎంగా ఉన్నప్పుడు మాదిరి ఇప్పుడు కూడా లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని చంద్రబాబు చెప్పి ఉంటే నానా రభస అవుతుందని భయపడి ఇళ్లవద్దే పెన్షన్ పంపిణీ చేశారు. చివరికి ఆయన కూడా వలంటీర్ పాత్ర పోషించారని వైఎస్సార్‌సీపీవారు చమత్కరిస్తున్నారు.
ఇక్కడే చంద్రబాబు అనండి.. తెలుగుదేశం వారు అనండి.. తమదైన శైలిలో అసత్యాలు చెప్పే యత్నం చేశారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఇదే తొలిసారి అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లలో చివరి మూడు నెలలు తప్ప మిగిలిన కాలం అంతా వృద్దులు, వికలాంగులు, తదితర వర్గాలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చిందే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనే సంగతి దాచేస్తే దాగని సత్యం. ఎన్నికల సమయంలో వలంటీర్లు ఈ కార్యక్రమం జరపకుండా అడ్డుపడిందే కూటమి నేతలు అనే సంగతి తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వలంటీర్లు లేకపోతే పంపిణీ ఆగిందా అని ప్రశ్నించడం ద్వారా తన నైజం ప్రదర్శించుకున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల వద్ద లంచాలు తీసుకున్నారని ఆరోపించి వారిపై విషం కక్కారు. వారిపై ఇంకా తన అక్కసు తీరలేదని రుజువు చేసుకున్నారు. తీరాచూస్తే ఇప్పుడు కొంతమంది చేతివాటం ప్రదర్శించారని వీడియో సహితంగా తేలింది. అదే టైమ్ లో వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చంద్రబాబుతో పాటు తాను ఎందుకు హామీ ఇచ్చింది మాత్రం పవన్ కల్యాణ్ వివరించలేదు. పైగా వారిని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇస్తున్నారు. వారికి ప్రత్యామ్నయా ఉపాధి చూపుతారట.
ఉన్న ఉద్యోగం పీకి కొత్తగా ఏదో చేస్తామంటే నమ్మడానికి జనం పిచ్చివారా! అబద్దాలు చెప్పినా జనం ఓట్లు వేసి గెలిపించారు కనుక వారు పిచ్చోళ్లే అని పవన్ కల్యాణ్ భావిస్తుండవచ్చు. తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పారు. లబ్దిదారుల అర్హతలపై రీసర్వే చేయించాలని అన్నారు. అంటే దాని అర్థం.. లబ్దిదారులలో కోత పెడతామనే కదా! ఈ సంగతి ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు. కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని మాత్రమే ఎందుకు ప్రచారం చేశారు. ఇది జనాన్ని మాయ చేయడం కాదా? అని అడిగితే జవాబు ఏమి ఉంటుంది. ఇక్కడే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందరికి గుర్తుకు వస్తారు. ఆయన పార్టీలు చూడకుండా ప్రజలకు మేలు చేయాలని తలపెట్టి దెబ్బతిన్నారు.
చంద్రబాబు నాయుడు అయితే యథా ప్రకారం ప్రవచనాలు వల్లించారు. పేదరికం లేని సమాజం సృష్టించడమే ఆయన లక్ష్యమట. ఈ మాట 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. కాలం ఆయనకు కలిసి వచ్చి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ, పేదరికం మాత్రం పోలేదు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. ఆ బ్రహ్మ పదార్ధం ఎలా ఉంటుందో ఎవరికి కనిపించదు. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా ఉంటాయి ఈ మాటలు. పోలవరం పూర్తి అయితే సంపద వచ్చేసేదట. పేదరికం పోయేదట. ఆయన పాలన ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా! అయినా పేదరికం ఎందుకు కొనసాగుతోంది. జనాన్ని మభ్య పెట్టడానికి ఇలాంటివి మాట్లాడుతుంటారు. అందులో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిందని విమర్శించిన చంద్రబాబు తాను పవర్ లోకి వచ్చిన ఇరవైరోజులలోనే ఏడువేల కోట్ల అప్పు చేశారు. ఈ అప్పులనే సంపద అని ప్రజలు అనుకోవాలి కాబోలు. ఈ అప్పులలో తమకు ఎంతో కొంత వాటా వస్తుంది కనుక, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కూడా ఈ అప్పులపై నోరు విప్పడం లేదు. చంద్రబాబుకు అనుభవం ఉంది కనుకే పెన్షన్లు ఇవ్వగలిగారని పవన్ కల్యాణ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే మరి గత ఐదేళ్లలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దగా ప్రచారం లేకుండానే ప్రతి నెల మొదటితేదీకే పెన్షన్లు ఇచ్చింది కదా! అది గొప్ప విషయం కాదా? చంద్రబాబు తన అనుభవంతో అప్పులు తెచ్చారని పవన్ భావిస్తున్నారా! ఈ అప్పులతో రాష్ట్రం శ్రీలంక అవ్వదని కూడా ఆయన చెప్పి ఉండాల్సింది.
ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించిన చంద్రబాబు ఈసారి ఒక్క పవన్ కల్యాణ్ కు మాత్రమే ఆ పదవి కట్టబెట్టి వెయిట్ పెంచారని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత అన్నిచోట్ల పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయన ఫోటోలు సైతం ఉంచాలని చంద్రబాబు చెప్పినట్లు లీకులు వచ్చాయి. కానీ వారంతా భావిస్తున్న ఇంత ప్రతిష్టాత్మక కార్యకమం ప్రచార ప్రకటనలో మాత్రం పవన్ కల్యాణ్ ఫోటో కనిపించలేదు. ఒక్క చంద్రబాబు ఫోటోనే ప్రచురించారు. రామోజీరావు సంస్మరణ సభ ప్రకటనలో కూడా పవన్ కల్యాణ్ పేరే వేయలేదు. అదేదో చంద్రబాబు రాజగురువు సంస్మరణ సభ కనుక పవన్ కల్యాణ్ పేరు వేయలేదులే అని అనుకున్నారు. కానీ పెన్షన్లు పంపిణీ ఇది ప్రభుత్వపరంగా చేసిన ప్రతిష్టాత్మక కార్యక్రమం కదా! అయినా పవన్ కల్యాణ్ పోటో వేయలేదేమిటా అని జనసేన వారు ఆవేదన చెందుతున్నారు.
పవన్ కల్యాణ్ వెనుక ఉన్న సామాజికవర్గం వారు కూడా మదన పడుతున్నారు. ఆయా రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా ప్రచారంలో వాడుతుంటారు. అయినా పవన్ కల్యాణ్ దీనిని అవమానంగా భావించకపోవచ్చు. టీడీపీ వారు ఏమి చేసినా పడి ఉండడానికి ఆయన ఎప్పుడో సిద్దపడిపోయారన్న భావన ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ రహితంగా ఇలాంటి సంక్షేమ స్కీములు ఎన్నిటినో అమలు చేసి తన మంచిని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తే తద్విరుద్దంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దీనిని ఫక్తు రాజకీయం చేసి పార్టీ కార్యక్రమం చేశారు. ఒక్క స్కీము అమలు చేసి, సూపర్ సిక్స్ అయిపోయినంతగా బిల్డప్ ఇచ్చే యోచనలో ఉన్నారు. చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు ఏమి చెప్పినా, ఏమి చేసినా అంతా రైటే అని జనం ఒప్పుకుంటారా!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment