guarantees implementation
-
బాబు ‘బిల్డప్’ షురూ.. సూపర్ సిక్స్ అయిపోయినట్లేనా..!?
ఏపీలో సామాజిక పెన్షన్ల రాజకీయం తమాషాగా ఉంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ప్రాంతం చూడం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం.. అని స్పష్టంగా చెప్పి ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా కార్యక్రమాలు అమలు చేసింది. అందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పెన్షన్లను వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. ఎక్కడా వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రమేయం లేకుండానే సాగిపోయేది. వలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగం కనుక వివాదం, పబ్లిసిటీ లేకుండా పెన్షన్లు పంచేవారు. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓటమిపాలైంది.కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తాను చెప్పిన విధంగా ఈ నెలకైతే పెంచిన సామాజిక పెన్షన్ లు ఇచ్చింది. అంతవరకు ఒకే. మిగిలిన స్కీముల గురించి ఇంకా చెప్పకపోయినప్పటికీ ఇప్పటికే అమలులో ఉన్న పెన్షన్ కు మరో వెయ్యి రూపాయలు పెంచి, మూడు నెలల బకాయిలు చెల్లించారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. కానీ ఇదేదో ఇప్పుడే సరికొత్తగా కనిపెట్టినట్లు, మొత్తం రాజకీయ కార్యక్రమంగా మార్చి టీడీపీ ప్రచారానికి వాడుకోవడం మాత్రం ఆక్షేపణీయమే.జూలై ఒకటిన జరిగిన తంతు చూశాకా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమాయకత్వంగా చిత్తశుద్దితో రాజకీయాలకు అతీతంగా వలంటీర్లు ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారా అనే భావన ఎవరికైనా రావచ్చు. అదే చంద్రబాబు అయితే ఫక్తు తనదైన రాజకీయ శైలిలో గతంలో జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈసారి తన పార్టీ కార్యకర్తల ద్వారా వీటిని పంపిణీ చేయించారు. వలంటీర్లు లేకుండానే పంపిణీ చేయగలం చెప్పుకోవడంతో పాటు ప్రచారం కూడా భారీగా రావాలన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేశారన్నది అర్ధం అవుతూనే ఉంది.ఇప్పటికే పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా పార్టీ కార్యకర్తల ద్వారా డబ్బు పంపిణీ చేయించవచ్చా అని అడిగితే ఎవరు బదులు ఇస్తారు. వారికి ఉన్న చట్టబద్దత ఏమిటని ఎవరు ప్రశ్నిస్తారు? పైగా టీడీపీ కేంద్ర కార్యాలయమే దీనిపై ఆదేశాలు ఇచ్చి మరీ కార్యకర్తలను రంగంలోకి దింపింది. పేరుకు సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇస్తారని తెలిపినా, హడావుడి చేసి ఫోటోలు దిగింది మాత్రం టీడీపీ, జనసేన కార్యకర్తలే. కొన్ని చోట్ల వీరి మధ్య గొడవలు కూడా జరిగాయట. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలో, సిబ్బందో ఐదువందల రూపాయలు కట్ చేసుకుని పెన్షన్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. మరికొన్నిచోట్ల వృద్ధుల ఇళ్లకు వెళ్లకుండా, అందరిని ఒక చోటకు పోగు చేసి పెన్షన్లు అందచేశారు. వైఎస్సార్సీపీకి సంబంధించినవారని చెప్పి పలాస తదితర కొన్నిచోట్ల పెన్షన్ ఇవ్వకుండా నిలుపుదల చేశారు. భవిష్యత్తులో పెన్షన్ దారుల సంఖ్యలో కోత పెట్టబోతున్నారని కూడా సమాచారం వస్తోంది.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సైతం స్వయంగా ఒక లబ్దిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం విశేషం. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా చేయలేదు. ఈసారి అలా చేయవలసి వచ్చిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వ్యవస్థ ప్రభావమే అని చెప్పాలి. అంతకు ముందు పద్నాలుగేళ్లు తాను సీఎంగా ఉన్నప్పుడు మాదిరి ఇప్పుడు కూడా లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని చంద్రబాబు చెప్పి ఉంటే నానా రభస అవుతుందని భయపడి ఇళ్లవద్దే పెన్షన్ పంపిణీ చేశారు. చివరికి ఆయన కూడా వలంటీర్ పాత్ర పోషించారని వైఎస్సార్‌సీపీవారు చమత్కరిస్తున్నారు.ఇక్కడే చంద్రబాబు అనండి.. తెలుగుదేశం వారు అనండి.. తమదైన శైలిలో అసత్యాలు చెప్పే యత్నం చేశారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఇదే తొలిసారి అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లలో చివరి మూడు నెలలు తప్ప మిగిలిన కాలం అంతా వృద్దులు, వికలాంగులు, తదితర వర్గాలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే సంగతి దాచేస్తే దాగని సత్యం. ఎన్నికల సమయంలో వలంటీర్లు ఈ కార్యక్రమం జరపకుండా అడ్డుపడిందే కూటమి నేతలు అనే సంగతి తెలిసిందే.జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వలంటీర్లు లేకపోతే పంపిణీ ఆగిందా అని ప్రశ్నించడం ద్వారా తన నైజం ప్రదర్శించుకున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల వద్ద లంచాలు తీసుకున్నారని ఆరోపించి వారిపై విషం కక్కారు. వారిపై ఇంకా తన అక్కసు తీరలేదని రుజువు చేసుకున్నారు. తీరాచూస్తే ఇప్పుడు కొంతమంది చేతివాటం ప్రదర్శించారని వీడియో సహితంగా తేలింది. అదే టైమ్ లో వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చంద్రబాబుతో పాటు తాను ఎందుకు హామీ ఇచ్చింది మాత్రం పవన్ కల్యాణ్ వివరించలేదు. పైగా వారిని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇస్తున్నారు. వారికి ప్రత్యామ్నయా ఉపాధి చూపుతారట.ఉన్న ఉద్యోగం పీకి కొత్తగా ఏదో చేస్తామంటే నమ్మడానికి జనం పిచ్చివారా! అబద్దాలు చెప్పినా జనం ఓట్లు వేసి గెలిపించారు కనుక వారు పిచ్చోళ్లే అని పవన్ కల్యాణ్ భావిస్తుండవచ్చు. తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పారు. లబ్దిదారుల అర్హతలపై రీసర్వే చేయించాలని అన్నారు. అంటే దాని అర్థం.. లబ్దిదారులలో కోత పెడతామనే కదా! ఈ సంగతి ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు. కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని మాత్రమే ఎందుకు ప్రచారం చేశారు. ఇది జనాన్ని మాయ చేయడం కాదా? అని అడిగితే జవాబు ఏమి ఉంటుంది. ఇక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికి గుర్తుకు వస్తారు. ఆయన పార్టీలు చూడకుండా ప్రజలకు మేలు చేయాలని తలపెట్టి దెబ్బతిన్నారు.చంద్రబాబు నాయుడు అయితే యథా ప్రకారం ప్రవచనాలు వల్లించారు. పేదరికం లేని సమాజం సృష్టించడమే ఆయన లక్ష్యమట. ఈ మాట 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. కాలం ఆయనకు కలిసి వచ్చి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ, పేదరికం మాత్రం పోలేదు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. ఆ బ్రహ్మ పదార్ధం ఎలా ఉంటుందో ఎవరికి కనిపించదు. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా ఉంటాయి ఈ మాటలు. పోలవరం పూర్తి అయితే సంపద వచ్చేసేదట. పేదరికం పోయేదట. ఆయన పాలన ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా! అయినా పేదరికం ఎందుకు కొనసాగుతోంది. జనాన్ని మభ్య పెట్టడానికి ఇలాంటివి మాట్లాడుతుంటారు. అందులో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిందని విమర్శించిన చంద్రబాబు తాను పవర్ లోకి వచ్చిన ఇరవైరోజులలోనే ఏడువేల కోట్ల అప్పు చేశారు. ఈ అప్పులనే సంపద అని ప్రజలు అనుకోవాలి కాబోలు. ఈ అప్పులలో తమకు ఎంతో కొంత వాటా వస్తుంది కనుక, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కూడా ఈ అప్పులపై నోరు విప్పడం లేదు. చంద్రబాబుకు అనుభవం ఉంది కనుకే పెన్షన్లు ఇవ్వగలిగారని పవన్ కల్యాణ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే మరి గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దగా ప్రచారం లేకుండానే ప్రతి నెల మొదటితేదీకే పెన్షన్లు ఇచ్చింది కదా! అది గొప్ప విషయం కాదా? చంద్రబాబు తన అనుభవంతో అప్పులు తెచ్చారని పవన్ భావిస్తున్నారా! ఈ అప్పులతో రాష్ట్రం శ్రీలంక అవ్వదని కూడా ఆయన చెప్పి ఉండాల్సింది.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించిన చంద్రబాబు ఈసారి ఒక్క పవన్ కల్యాణ్ కు మాత్రమే ఆ పదవి కట్టబెట్టి వెయిట్ పెంచారని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత అన్నిచోట్ల పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయన ఫోటోలు సైతం ఉంచాలని చంద్రబాబు చెప్పినట్లు లీకులు వచ్చాయి. కానీ వారంతా భావిస్తున్న ఇంత ప్రతిష్టాత్మక కార్యకమం ప్రచార ప్రకటనలో మాత్రం పవన్ కల్యాణ్ ఫోటో కనిపించలేదు. ఒక్క చంద్రబాబు ఫోటోనే ప్రచురించారు. రామోజీరావు సంస్మరణ సభ ప్రకటనలో కూడా పవన్ కల్యాణ్ పేరే వేయలేదు. అదేదో చంద్రబాబు రాజగురువు సంస్మరణ సభ కనుక పవన్ కల్యాణ్ పేరు వేయలేదులే అని అనుకున్నారు. కానీ పెన్షన్లు పంపిణీ ఇది ప్రభుత్వపరంగా చేసిన ప్రతిష్టాత్మక కార్యక్రమం కదా! అయినా పవన్ కల్యాణ్ పోటో వేయలేదేమిటా అని జనసేన వారు ఆవేదన చెందుతున్నారు.పవన్ కల్యాణ్ వెనుక ఉన్న సామాజికవర్గం వారు కూడా మదన పడుతున్నారు. ఆయా రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా ప్రచారంలో వాడుతుంటారు. అయినా పవన్ కల్యాణ్ దీనిని అవమానంగా భావించకపోవచ్చు. టీడీపీ వారు ఏమి చేసినా పడి ఉండడానికి ఆయన ఎప్పుడో సిద్దపడిపోయారన్న భావన ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రహితంగా ఇలాంటి సంక్షేమ స్కీములు ఎన్నిటినో అమలు చేసి తన మంచిని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తే తద్విరుద్దంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దీనిని ఫక్తు రాజకీయం చేసి పార్టీ కార్యక్రమం చేశారు. ఒక్క స్కీము అమలు చేసి, సూపర్ సిక్స్ అయిపోయినంతగా బిల్డప్ ఇచ్చే యోచనలో ఉన్నారు. చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు ఏమి చెప్పినా, ఏమి చేసినా అంతా రైటే అని జనం ఒప్పుకుంటారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..
మారుమూల గ్రామాల నుంచి కలల మూటలు మోసుకొనొచ్చి, సర్కార్ కొలువుల కోసం పుస్తకాలతో పెనుగులాడే యువలోకానికి ఎన్నో బాసలు చేసింది హస్తం పార్టీ. ఆర్ట్స్ కాలేజీ ముందు రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని, అశోక్ నగర్లో రాహుల్ గాంధీ వరకూ కాంగ్రెస్ నాయకులందరూ ఉద్యోగాల ఉట్టి కొడతామని నమ్మబలికారు. చివరికి సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీతో ‘యూత్ డిక్లరేషన్’ పేరిట తెలంగాణ రాష్ట్ర యువతకు నిర్దిష్టమైన హామీలిచ్చారు.ఆనాటి యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ యువతకు వ్రాసిస్తున్న బాండ్ పేపర్‌గా రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాకమ్మ కథలు కాదనీ, కమిట్మెంట్కు నిదర్శనంగా యూత్ డిక్లరేషన్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేసి చూపిస్తామనీ ప్రియాంక గాంధీని సాక్షిగా పెట్టి నమ్మబలికారు. ఆ సభ ఉపన్యాసాలను నేడు నిరుద్యోగులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ వైఖరిని నిలదీస్తున్నారు.వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు కొత్తగా ఏవీ కోరడం లేదు. విపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఉద్యోగాలనే భర్తీ చేయమని కోరుతున్నారు. ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామనీ, గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 1:100 విధానంలో క్వాలిఫై చేస్తామనీ, 4 వేల నిరుద్యోగ భృతి ప్రతి నెలా అందజేస్తామనీ హస్తం పార్టీ అధిష్టానమే హామీ ఇచ్చింది కదా? వాటితో పాటు మెగా డీఎస్సీ, నిరుద్యోగులకు రూ. 10 లక్షల వడ్డీలేని రుణాలు, ఉద్యమ అమరుల కుటుంబాలకు నెలనెలా 25 వేల పింఛన్లు, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ... ఇలా ఎన్నో హామీలను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.వాటి కోసమే ఏడు నెలలు ఎదురుచూసిన తర్వాత, నేడు యువలోకం నిలదీస్తున్నది. గురుకులాల ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ ప్రక్రియలో మళ్ళీ బ్యాక్ లాగ్‌లు మిగలకుండా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. వీటి కోసం అడిగీ, అడిగీ, ఏడు నెలలుగా హస్తం పార్టీ ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి, ప్రయోజనం లేకనే నిరుద్యోగులు ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమిస్తున్నారు. మోతీలాల్ నాయక్ వంటి వారు నిరాహార దీక్షకు దిగుతున్నారు.వినతిపత్రాలు చెత్త బుట్టల పాలై, కోదండరాం కానరాక, మల్లన్న మర్లి చూడక, ధర్నా చౌక్‌లో దినా రాత్రులు నినదించినా కనీసం పట్టించుకునే నాథుడే లేకపోవడంతో, పోరు దారి తప్ప మరో దారి లేక నవతరం నడిరోడ్డుపై నిలబడి నినదిస్తున్నది. నమ్మిన నిరుద్యోగులను కనీసం పిలిపించుకొని చర్చించే తీరిక కూడా కాంగ్రెస్ సర్కార్‌కు లేకపోడాన్ని ఏమనాలి? పరాయి పార్టీ ఎంఎల్ఏ లపై చూపుతున్న ప్రేమలో, పదోవంతు కూడా ప్రభుత్వం అప్పగించిన యువతరంపై ప్రదర్శించడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ నిజరూప దర్శనం యువలోకానికి కనువిప్పు కలిగించింది.ఊరించిన నోరే వెక్కిరించినట్లుగా మెగా డీఎస్సీ పేరుతో ఆర్భాటం చేసి, తీరా కేవలం 11వేల ఖాళీలు చూపెట్టడం మోసం కాదా? గ్రూప్–2 నోటిఫికేషన్‌కు అదనంగా 2 వేలు, గ్రూప్–3 నోటిఫికేషన్‌కు మరో 3 వేల ఉద్యోగ ఖాళీలను కలిపి భర్తీ చేపట్టాలని లక్షలాది నిరుద్యోగులు కోరుతున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల నినాదాలుగా మారిన వీటిని అన్యాయమైన డిమాండ్లు అని సర్కార్ భావిస్తున్నట్లున్నది.రాజకీయ అంశాలపై తప్ప, రాష్ట్ర వర్తమాన అంశాలపై లోతైన దృష్టి కోణమే కనుమరుగైపోయింది. మాసాలు గడుస్తున్నా వీసీల నియామకం లేక, ఇంఛార్జీల ఏలుబడిలో విశ్వవిద్యాలయాలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. గురుకులాల నుంచి వర్సిటీల వరకూ అన్ని విద్యాసంస్థలూ సమస్యల వలయంలోకి జారుకుంటున్నాయి. అవగాహన లేమితోనో లేక నిర్లక్ష్యంతోనో గానీ కాంగ్రెస్ సర్కార్ విద్యార్థి, యువజనులతో చెలగాటమాడుతున్నది. ఇది సరికాదు. ఇప్పటికైనా వారికిచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో కార్యాచరణ చేపట్టాలి.– డా. ఆంజనేయ గౌడ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్, 9885352242 -
27 నుంచి మరో 2 గ్యారంటీల అమలు
హుజూర్నగర్ (సూర్యాపేట)/ సింగరేణి(కొత్తగూడెం): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈనెల 27 నుంచి మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామంలో రూ 37.70 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ...ఈనెల 27 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ పథకాలకు చేవెళ్లలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ శ్రీకారం చుడతారని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.సభ అనంతరం దొండపాడుకు వెళ్తూ మార్గమధ్యలో మిరపతోట వద్ద మంత్రులు కారు దిగి వెళ్లి కూలీలతో ముచ్చటించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారా.. టికెట్ తీసుకుంటున్నారా అని మహిళలను అడిగారు. అందుకు వారు బదులిస్తూ ఉచితంగానే ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఈ పొలం ఎవరిది, కూలీ ఎంత ఇస్తున్నారని వారు మహిళలను ఆరా తీశారు. నేడు సోలార్ ప్లాంట్ ప్రారంభం సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలోని కొత్తగా నిర్మించిన సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను భట్టి విక్ర మార్క, ఇతర మంత్రులు ఆదివారం ప్రారంభించనున్నారు. కొత్తగూడెం ఏరియాలో సింగరేణి సంస్థ ఇప్పటికే త్రీఇంక్లైన్లో 48 ఎకరాల్లో రూ.56.76 కోట్లతో 10.5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ నిర్మించింది. త్రీఇంక్లైన్, గరిమెళ్లపాడు ప్రాంతాల్లో 37 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. -
27నే మరో 2 గ్యారంటీలు
మేడారం గద్దెలపై సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఆసీనులు కావడంతో శుక్రవారం పోటెత్తిన భక్తజనం(ఇన్సెట్లో) సమ్మక్క గద్దె వద్ద మొక్కుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రూ.500కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డున్న పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గ్యారంటీలను 27న ప్రారంభిస్తాం. కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఇచ్చిన ప్రతి హామీ అమలుచేస్తాం. – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను సీఎం శుక్రవారం దర్శించుకున్నారు. తల్లులకు ఆయన నిలువెత్తు బంగారం (66 కిలోల బెల్లం), పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని చెప్పారు. రూ.2లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతామన్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మార్చి 2న మరో 6వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదంటూ మామాఅల్లుడు, తండ్రీకొడుకు తమ ప్రభుత్వంపై గోబెల్స్‌లా అబద్ధపు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ దోపిడీపై బీజేపీ స్పందించలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ, అక్రమాలు, నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు చూపామని, కేసీఆర్ కళ్లు మూసుకొని ఫాంహౌస్‌లో ఉండటంతోనే ఏపీ సీఎం కృష్ణాజలాలు తరలించుకుపోయారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో కేసీఆర్ దివాలా తీయించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్లుగా దోపిడీకి పాల్పడుతుంటే పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా ఏనాడూ ప్రధాని నరేంద్రమోదీ అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డపై తాము జ్యుడీషియల్ విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత దానిని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని, పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, ఆ కుటుంబంపై కేసు పెట్టారా, సీబీఐ, ఈడీ, ఐటీ అన్నీ కేంద్రం దగ్గరే ఉన్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీలో వాటా కోసమే తప్ప దానిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన బీజేపీ నేతలకు లేదన్నారు. త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల ఆధ్వర్యంలో సాగే విచారణను బీఆర్ఎస్ నాయకులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ నివేదికలు సిద్ధం చేస్తోందని, ఆ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ ఇచ్చాం గతంలో జర్నలిస్టులను సచివాలయంలోకి రానివ్వలేదని, ఇప్పుడు ప్రతీ చాంబర్‌కు వెళ్లే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తనను, సీతక్కను గతంలో సచివాలయానికి వెళ్లనివ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ సచివాలయానికి వెళ్లే స్వేచ్ఛ ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఆ స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి నిరంతరం చేస్తామని, జాతర వచ్చినప్పుడే కాకుండా నిరంతరం మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహాయంతో ఈ ప్రాంత అభివృద్ధిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగుల్లో న్యాయం జరిగిందా లేదా అని ప్రభుత్వ ఉద్యోగులను అడగాలని ఆయన ప్రజలకు సూచించారు. గతంలో నెల చివర వరకు జీతాలు వచ్చేవికావని, మొదటి నెల నాలుగో తేదీన, రెండో నెలలో మొదటి తేదీన ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. మీడియా అకాడమీకి త్వరలో చైర్మన్ త్వరలోనే మీడియా అకాడమీకి చైర్మన్‌ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదని, పదేళ్లు ఓపిక పట్టారని, త్వరలోనే జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని తేవడంతోనే జర్నలిస్టుల పని అయిపోలేదని కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సహకరించాలని కోరారు. వాళ్ల ఇద్దరి (బీజేపీ–బీఆర్ఎస్నుఉద్దేశించి) సమన్వయం మీకు తెలుసని, ఉదయం, సాయంత్రం మాట్లాడుకుంటున్నారన్నారు. పది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్‌కు మాట్లాడుకొని ఎన్నికలకు రాబోతున్నారని, ఆ చీకటి ఒప్పందాన్ని మీడియా మిత్రులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.చేవెళ్ల సభతో శ్రీకారం..: చేవెళ్లలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. ఆ సభలోనే రూ.500కే గ్యా స్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించను న్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కలె క్టర్ శశాంక, ఇతర అధికారులు పరిశీలించారు. మేడారం సందర్శనకు మోదీ, అమిత్ షా రావాలి దక్షిణ కుంభమేళాలాంటి మేడారం మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం జాతీయ పండగగా గుర్తించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము ఎన్నిసార్లు కోరినా అలా కుదరదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వివక్ష చూపడం సరికాదని హితవు పలికారు. దక్షిణ భారతమనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క–సారలమ్మ జాతరకు ఒక గుర్తింపు ఉందని, వారి వీరోచిత పోరాటానికి చరిత్ర పుటల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని, ప్రధానమంత్రి వచ్చి దర్శించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
TS: మరో రెండు గ్యారెంటీల అమలుకు ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. గృహలక్ష్మీ, రూ.500కే సిలిండర్ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. మార్చి నెల నుంచి 200 యూనిట్లు లోపు కరెంట్ వాడే వారికి జీరో బిల్లు వేయాలని ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అర్హుల ఖాతాలో వేయాలా లేక ఏజెన్సీకి ఇవ్వాలా అనేదానిపై అధికారులు ఈజీ ప్రాసెస్ చేయాలని సూచించారు. సబ్సిడీ నిధులు వెంట వెంటనే చెల్లించే విధానం ఏర్పాట్లు చేయాలన్నారు. రేషన్ కార్డు, లేక ఇతర కారణాల వల్ల పథకాలకు దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం ఇస్తామని సీఎం పేర్కొన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో రేవంత్ కొత్త పోకడలు! -
బఘెల్‌కు ‘బోనస్’ దక్కలేదు
ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. రెండు పారీ్టలూ అంతే పోటాపోటీగా సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను ప్రకటించాయి. వరికి దేశంలోనే అత్యధికంగా అందిస్తూ వస్తున్న బోనస్ తమను గట్టెక్కించి అధికారాన్ని నిలబెడుతుందని ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. మోదీ హామీల పేరుతో బీజేపీ ప్రకటించిన పథకాలకే ప్రజలు జై కొట్టారు. ఎదురుదెబ్బ నేపథ్యంలో.. వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గట్టి దెబ్బ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ వెంటనే సీఎం బఘెల్ పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాల అమలు ప్రారంభించారు. రైతులు, గిరిజనులు, పేదలను ఎవరినీ వదలకుండా అందరికీ సాయం అందేలా చూశారు. ముఖ్యంగా వరికి ఆయన అందిస్తున్న బోనస్ సూపర్ హిట్టయింది. మళ్లీ గెలిస్తే పథకాన్ని మరింత విస్తరిస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఇది ఒక దశలో బీజేపీని బాగా కలవరపరిచింది. దీనికి తోడు భూమిలేని కార్మికులకు వార్షిక ఆర్థిక సాయం రూ.10,000కు పెంచుతామని, కేజీ టు పీజీ ఉచిత విద్య, 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ సహా పలు హామీలెన్నో కాంగ్రెస్ ఇచి్చంది. దాంతో ‘మోదీ గ్యారంటీలు’ పేరుతో బీజేపీ దూకుడుగా ఎన్నో పథకాలు ప్రకటించింది. క్వింటాకు రూ.3,100 చొప్పున ఎకరాకు 21 క్వాంటాళ్లను సేకరిస్తామని పేర్కొంది. ప్రతి వివాహితకూ ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్ల నిర్మాణం, పేదలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, కాలేజీ విద్యార్థులకు ప్రయాణ భత్యం, నిరుపేద కుటుంబంలో పుట్టే ఆడపిల్లకు రూ.1.5 లక్షలు తదితరాలెన్నో ప్రకటించింది. వీటికి తోడు ప్రధాని మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. డబుల్ ఇంజన్ సర్కారుకు చాన్సిస్తే అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ప్రజలపై బాగా ప్రభావం చూపాయి. చివరికి బఘెల్ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ కొత్త హామీల కంటే బీజేపీ ‘మోదీ గ్యారంటీ’ల వైపే ప్రజలు మొగ్గు చూపారు. ముంచిన ‘మహదేవ్’ ఆరోపణలు... మోదీ గ్యారంటీలకు తోడు, పోలింగ్ సమీపించిన వేళ సీఎం బఘెల్‌పై ముసురుకున్న బెట్టింగ్ యాప్ ముడుపుల ఆరోపణలు కాంగ్రెస్‌కు బాగా చేటు చేశాయి. ఈ ఉదంతంలో ఒక కొరియర్‌ను అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించడం, దుబాయ్‌కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి బఘెల్‌కు ఏకంగా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందించినట్టు అతడు చెప్పాడని పేర్కొనడం సంచలనం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్వేతపత్రం విడుదల చేయాలి
♦ హామీల అమలుపై షబ్బీర్‌అలీ డిమాండ్ ♦ సర్కారు ఫిరాయింపులు, ఉప ఎన్నికలు, ఉత్సవాలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, అమలైన కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు టి.జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం పూర్తిగా అబద్ధమన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పార్టీ ఫిరాయింపులు, ఉప ఎన్నికలు, ఉత్సవాలు చేయడం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా రాష్ర్ట అవతరణ ఉత్సవాల ఏర్పాట్లులో మునిగిపోయిందన్నారు. తీవ్రమైన కరువులో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఉత్సవాల పేరిట కాలయాపన చేస్తున్నారని షబ్బీర్‌అలీ ఆరోపించారు. భౌగోళిక పరిస్థితులు, జనాభా, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయంగా కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని కోరారు. దీనికోసం అన్ని పార్టీలను, నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఇళ్లకు నిధులేవీ?: జీవన్‌రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి నిధులు ఇవ్వకుండా ఎలా పూర్తిచేస్తారని సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక ఇంటికి కేవలం రూ.5.40 లక్షలను కేటాయించారని, వీటితో పూర్తిచేయడం సాధ్యంకాదని అన్నారు. వచ్చే మార్చిలోగా 2 లక్షల ఇళ్లను నిర్మించి పాపాలను కడిగేసుకోవాలని సూచించారు. రహస్య ఎజెండా: పొంగులేటి ఆర్డీఎస్ విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలను పెంచడం వెనక టీఆర్ఎస్, టీడీపీల రహస్య ఎజెండా ఉందని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. నదీ జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఎందుకు జఠిలం చేస్తున్నారని ప్రశ్నించారు.