హుజూర్‌నగర్ (సూర్యాపేట)/ సింగరేణి(కొత్తగూడెం): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈనెల 27 నుంచి మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామంలో రూ 37.70 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ...ఈనెల 27 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ పథకాలకు చేవెళ్లలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ శ్రీకారం చుడతారని చెప్పారు.
త్వరలో రాష్ట్రంలోని మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.సభ అనంతరం దొండపాడుకు వెళ్తూ మార్గమధ్యలో మిరపతోట వద్ద మంత్రులు కారు దిగి వెళ్లి కూలీలతో ముచ్చటించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారా.. టికెట్ తీసుకుంటున్నారా అని మహిళలను అడిగారు. అందుకు వారు బదులిస్తూ ఉచితంగానే ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఈ పొలం ఎవరిది, కూలీ ఎంత ఇస్తున్నారని వారు మహిళలను ఆరా తీశారు.
నేడు సోలార్ ప్లాంట్ ప్రారంభం
సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలోని కొత్తగా నిర్మించిన సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను భట్టి విక్ర మార్క, ఇతర మంత్రులు ఆదివారం ప్రారంభించనున్నారు. కొత్తగూడెం ఏరియాలో సింగరేణి సంస్థ ఇప్పటికే త్రీఇంక్‌లైన్‌లో 48 ఎకరాల్లో రూ.56.76 కోట్లతో 10.5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ నిర్మించింది. త్రీఇంక్లైన్, గరిమెళ్లపాడు ప్రాంతాల్లో 37 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment