నేలకొండపల్లి శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆలయ నిర్మాత రామదాసు ఎలా ఉండేవారు, ఆయన ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న నివాసంలో కొనసాగుతున్న ధ్యాన మందిరంలోని కాంస్య విగ్రహం, ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉన్న మరో విగ్రహాన్ని కళాకారులు తమ ఊహల మేరకు రూపొందించారు.
ఈ క్రమంలో తాజాగా నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఆవరణలోని రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించారు. దీంతో ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, కోకన్వినర్ కట్టా శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై బి.సతీశ్ చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించగా ధ్యానమందిరంలో ఏర్పాటు చేశారు. రామదాసు జయంతి ఉత్సవాల నాటికి ఈ విగ్రహం ప్రతిష్టాపనపై భద్రాచలం దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించాలని వారసులు కోరారు.
విగ్రహం ఎలా ఉందంటే..
కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది. కాగా, ఈ విగ్రహం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడుభక్త రామదాసుదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్టేషన్‌కు ఎలా చేరింది?
నేలకొండపల్లిలో పాత సెంటర్‌గా పేరున్న రావిచెట్టు బజార్‌లో చాలా ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్ ఉండేది. 1997లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌కు పాత స్టేషన్ నుంచి ఫరి్నచర్, తాజాగా బయటపడిన విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు తొర్రలో భద్రపర్చగా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఆ విగ్రహం పాత పోలీసుస్టేషన్‌కు ఎలా చేరింది? ఎవరు తీసుకొచ్చారనే అంశంపై ఎక్కడా రికార్డులు లేవని చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment