Ramdas
-
భక్తరామదాసు విగ్రహం ఇదిగో!
నేలకొండపల్లి శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆలయ నిర్మాత రామదాసు ఎలా ఉండేవారు, ఆయన ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న నివాసంలో కొనసాగుతున్న ధ్యాన మందిరంలోని కాంస్య విగ్రహం, ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉన్న మరో విగ్రహాన్ని కళాకారులు తమ ఊహల మేరకు రూపొందించారు. ఈ క్రమంలో తాజాగా నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఆవరణలోని రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించారు. దీంతో ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, కోకన్వినర్ కట్టా శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై బి.సతీశ్ చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించగా ధ్యానమందిరంలో ఏర్పాటు చేశారు. రామదాసు జయంతి ఉత్సవాల నాటికి ఈ విగ్రహం ప్రతిష్టాపనపై భద్రాచలం దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించాలని వారసులు కోరారు. విగ్రహం ఎలా ఉందంటే.. కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది. కాగా, ఈ విగ్రహం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడుభక్త రామదాసుదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టేషన్‌కు ఎలా చేరింది? నేలకొండపల్లిలో పాత సెంటర్‌గా పేరున్న రావిచెట్టు బజార్లో చాలా ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్ ఉండేది. 1997లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌కు పాత స్టేషన్ నుంచి ఫరి్నచర్, తాజాగా బయటపడిన విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు తొర్రలో భద్రపర్చగా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఆ విగ్రహం పాత పోలీసుస్టేషన్‌కు ఎలా చేరింది? ఎవరు తీసుకొచ్చారనే అంశంపై ఎక్కడా రికార్డులు లేవని చెపుతున్నారు. -
త్వరలోనే రామదాస్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే?
సినీ, రాజకీయ సెలబ్రిటీల జీవిత చరిత్ర వెండితెరకెక్కడం పరిపాటిగా మారింది. గతంలో కామరాజర్, జయలలిత, గాంధీజీ, క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని ఇలా పలువురు ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా రూపొందాయి. తాజాగా పీఎంకే నేత రామదాస్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు భారతి కనమ్మ, వెట్రిక్కోడి కట్టు, పాండవ భూమి, ఆటోగ్రాఫ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన చేరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లోనూ కథానాయకుడిగా నటించిన చేరన్ ఇటీవల జర్నీ అనే వెబ్ సీరీస్‌కు దర్శకత్వం వహించారు. తాజాగా దర్శకత్వం పైనే దృష్టిపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సుదీప్ హీరోగా తమిళం, కన్నడం భాషల్లో ఒక చిత్రం చేస్తున్నారు. దీన్ని పూర్తిచేసిన తరువాత డా.రామదాస్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో డి.రామదాస్ పాత్రలో శరత్‌కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. రామదాస్ ఒక్కపక్క వైద్యవృత్తి నిర్వహిస్తునే మరో పక్క అణగారిన వన్నియార్ సామాజిక వర్గం న్యాయ హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడడం, అలా పాట్టాలి మక్కల్ కట్చి పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడం వంటి అంశాలతో బయోపిక్‌ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
గంజాయి విక్రేతల అరెస్ట్
జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా)/ కోనేరుసెంటర్ (కృష్ణాజిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి 1,760 కిలోల గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం పాడేరు ఏఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు. జూన్1, 2023లో ఎండీఎస్, చెన్నై జోన్ యూనిట్ 13 ఎన్సీబీ కేసులో తమిళనాడుకు చెందిన సురేష్ 160 కిలోల గంజాయితో రాగమటన్పల్లి వేపనహీళి పోలీస్‌లకు పట్టుబడ్డాడు. ఈ గంజాయిని పాడేరు ప్రాంత సుందరరావు వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పాడు. చెన్నై నుంచి వచ్చిన బృందం పాడేరు వచ్చి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా ఎస్పీ, ఏఎస్పీ సూచనల మేరకు స్థానిక పోలీసులు పెదబయలు మండలం, ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన సుందరరావు ఇంట్లో తనిఖీ చేయగా.. 1,760 కిలోల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. సుందరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ పట్టివేత.. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు జిల్లాలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న మరో ముగ్గురు వ్యాపారులనూ అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ పి.జాషువా తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువ మండలం చత్వా గ్రామానికి చెందిన కొర్రా రాందాస్ అలియాస్ భట్టుభాయ్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ గంజాయి సరఫరా చేయడం మొదలెట్టాడు. దీనిలో భాగంగా గుడివాడ, అవనిగడ్డ, ఘంటసాల తదితర ప్రాంతాలకు రాందాస్ గంజాయిని సరఫరా చేస్తుంటాడు. మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న బడుగు నాగరాజును పలుమార్లు పోలీసులు పట్టుకున్నారు. అతని నేర చరిత్రను పరిశీలించిన ఎస్పీ.. నాగరాజుతో పాటు గుడివాడకు చెందిన మందాల కిరణ్‌రాజు, పమిడిముక్కలకు చెందిన చీకుర్తి నాని అలియాస్ బీస్ట్‌పై పీడి యాక్టును అమలుపరిచి జైలుకు పంపారు. పై ముగ్గురు పట్టుబడిన కేసులో రాందాస్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న ఎస్పీ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా మచిలీపట్నంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా రాందాస్ కంటబడ్డాడు. వెంటనే పోలీసులు రాందాస్‌ను అదుపులోకి తీసుకుని బ్యాగు సోదా చేయగా పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. రాందాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తక్షణం అతని వద్ద గంజాయి కొనుగోలు చేసిన గుడివాడలో ఒకరిని, ఘంటసాలలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి ఆరు కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. -
బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా నిజమైన సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంకురార్పణ చేశారని తమిళనాడుకు చెందిన పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే) వ్యవస్థాపక నేత ఎస్ రామదాస్ ప్రశంసించారు. 56 కార్పొరేషన్లలో 29 కార్పొరేషన్లకు మహిళలను చైర్మన్లుగా నియమించడంతో పాటు, 50% డైరెక్టర్ పదవులను మహిళలకు కేటాయించడం అభినందనీయమని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌కు ‘ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సంరక్షకుడు’ అనే బిరుదును తాను ప్రదానం చేస్తున్నానని రామదాస్ తెలిపారు. ఈ మేరకు సీఎంకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. ‘మీరు తీసుకుంటున్న చర్యలు బీసీ వర్గాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. సామాజికాభివృద్ధి సాధించే దిశగా సామాజిక న్యాయాన్ని నిలబెట్టేందుకు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ప్రగతిశీల ఆలోచనల పేరుతో సమాజంలో నకిలీ రాజకీయ మర్యాదల సంస్కృతి, వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొందరు కులాన్ని ఒక తిరోగమన సంకేతంగా చూస్తున్నారు. కానీ మీరు.. కులాన్ని సామాజిక న్యాయ సాధనకు పునాదిగా చూస్తున్నారు. కులాభివృద్ధిని రాష్ట్రాభివృద్ధికి ఒక సూచికగా మీరు పరిగణిస్తున్నారు. నిజమైన విప్లవం అంటే ఇదే. ఈ చర్య ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ‘సామాజిక న్యాయ సంరక్షకుడు’ స్థాయికి మీరు ఎదిగారు. ఈ సందర్భంగా మీకు (సీఎం వైఎస్ జగన్‌కు) ‘ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సంరక్షకుడు’ అనే బిరుదును ప్రదానం చేస్తున్నందుకు ఎంతగానో గర్విస్తున్నాను.. ఆనందిస్తున్నాను.’ అని రామదాస్ తన లేఖలో పేర్కొన్నారు. పేదరికం నుంచి బీసీ వర్గాలకు విముక్తి... ‘ఉన్నతమైన ఆలోచనలు రాజును ఉన్నతుడిగా చేస్తాయి’ అనే తమిళ రచయిత్రి అవ్వయార్ కవితను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆమె ఆశయాలను ఆచరణలో పెడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. 30 వేల జనాభా గల కులాల వారికి సైతం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం.. అంత తక్కువ సంఖ్యలో ఉన్నవారి అవసరాలను కూడా గుర్తించి పరిష్కరించడం కోసమేనన్నది స్పష్టమవుతోంది. ఐదేళ్లలో ఈ కార్పొరేషన్లకు రూ.75,000 కోట్లు ప్రభుత్వం నుంచి అందడం అంటే ఇది కేవలం వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు మాత్రమే కాదు, వారి ఆర్థిక వికాసం కోసం తీసుకుంటున్న చర్యలని చెప్పాలి. అంతేకాదు 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు కూడా మీరు ఇస్తున్న రూ.18,750ల సాయం వారిని ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చేస్తాయి. అలాగే 2024 నాటికి ఏపీని మద్య రహిత రాష్ట్రంగా చేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు చేపట్టిన ఇలాంటి చర్యల వల్ల మరి కొన్నేళ్లలో రాష్ట్రంలోని బీసీ వర్గాలు పేదరికం నుంచి, రుణాల ఊబి నుంచి బయట పడతాయని మేం విశ్వసిస్తున్నాం. వివిధ కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు మీ ముందు చూపునకు నిదర్శనంగా భావిస్తున్నాం..’ అని రామదాస్ తెలిపారు. -
ఎక్కడో బద్దలైతే ఇక్కడ కంపిస్తుంది!
సాక్షి, హైదరాబాద్: వేల మైళ్ల దూరంలో అగ్నిపర్వతం బద్దలైతే మన దగ్గర భూమి కంపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూప్రకంపనలకు అదే కారణమన్న విషయాన్ని కొట్టిపారేయలేమని వారు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఆ ప్రభావం కారణంగా కంపనాలు చోటుచేసుకోవచ్చని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్ విభాగం విశ్రాంత అధిపతి ప్రొఫెసర్ జి.రాందాస్ అభిప్రాయపడుతున్నారు. ‘కచ్చితంగా అదే కారణం అని చెప్పలేకున్నా.. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూఅంతర్భాగంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమై భూ పొరల్లో చలనం ఏర్పడుతుంది. దీంతో భూ ఫలకాలు కదిలి పరస్పరం ఢీకొని ప్రకంపనలు జరిగే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్భవించిన ప్రకంపనలకు అది కారణం కాదని కూడా చెప్పలేం’అని పేర్కొన్నారు. క్వారీ పేలుళ్ల వల్ల మాత్రం ఈ ప్రకంపనలు ఏర్పడలేదని పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రమాదమేమీ కాదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలు భూకంప ప్రభావిత ప్రాంత పరిధిలో ఉన్నాయి. కానీ, ప్రమాదకర జోన్లో మాత్రం లేవు. ప్రస్తుతం భూమి కంపించిన ప్రధాన ప్రాంతమైన సూర్యాపేట పరిసరాలు సహా తెలంగాణ పరిధి భూకంప ప్రభావం అంతగా లేని రెండో జోన్ పరిధిలో ఉండగా, ఏపీ ప్రాంతం రెండో జోన్లో, విజయవాడ పరిసరాలు లాంటి కొన్ని ప్రాంతాలు మూడో జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ, ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదు కావటం కొంత ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇంత తీవ్రతతో భూమి కంపించలేదు. జోన్ పరిధి మారనుందా.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రమాదం కాని జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ తాజా ప్రకంపనలు కొంత శక్తిమంతమైనవే. అంత తీవ్రతతో మళ్లీ కొన్నిసార్లు ప్రకంపనలు వస్తే మాత్రం కచ్చితంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గుర్తించాల్సి ఉంటుంది. ప్రమాదం తరచూ సంభవించదు. కానీ ఉన్నట్టుండి భారీ ప్రకంపనలు చోటు చేసుకుంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అలా అని భయాందోళనలు చెందాల్సిన పనిలేదు. మళ్లీ ఆ స్థాయి ప్రకంపనలు తక్కువ సమయంలో పలుసార్లు ఏర్పడితేనే ఆందోళన చెందాలి. అమరావతి వైపు వస్తే భారీ నష్టమే.. ఆదివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా వెల్లటూరు కేంద్రంగా ఏర్పడ్డ భూ ప్రకంపనలు తెలంగాణ వైపు ప్రభావం చూపాయి. కానీ, ప్రకంపనల దిశ అమరావతి వైపు ఉండి ఉంటే అక్కడ కచ్చితంగా నష్టం జరిగి ఉండేది. ఇక్కడ నమోదైన 4.7 ప్రభావం అమరావతి పరిసరాల్లో ఏర్పడితే భవనాలు కూలి ఉండేవి. తెలంగాణ వైపు గట్టి నేల ఉండటంతో పాటు, సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీటర్ల ఎత్తుతో భూమి ఉపరితలం ఎగుడు దిగుడుగా ఏర్పడి ఉంది. భూమి పొరల్లో కలిగిన మార్పులే దీనికి కారణం. అవి భూకంప తరంగాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రకృతిసిద్ధ ఏర్పాటు అమరావతివైపు లేదు. ఫలితంగా ప్రకంపనల ప్రభావం తగ్గదు. సాధారణంగా రిక్టర్‌స్కేల్‌పై 4 నమోదైతే భారీ నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఢిల్లీ ప్రమాదకర 4వ జోన్ పరిధిలో ఉన్నా, అక్కడి నేల గట్టిది. ఫలితంగా ఢిల్లీ కంటే విజయవాడ పరిసరాలే ప్రమాదకరంగా మారతాయి. అప్పుడే హెచ్చరించారు ఎన్జీఆర్ఐ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త చడ్డా గతంలోనే విజయవాడ పరిసరాలపై భూకంప ప్రభావం ఉండే అవకాశం ఉండొచ్చని హెచ్చరించారు. గరిష్టంగా రిక్టర్‌స్కేల్‌పై 6.5 వరకు నమోదయ్యే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. కానీ అది ఎప్పుడోతప్ప నమోదయ్యే అవకాశం లేదన్నారు. నదీ సంగమాల ప్రభావం కూడా ప్రకంపనాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుందని, మూసీ–కృష్ణా సంగమం ఉండే సూర్యాపేట జిల్లా పరిధిలో భూగర్భంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కృష్ణాతీరం కూడా దీనికి మినహాయింపు కాదు. మేం వజ్రాలకు సంబంధించి ఈ ప్రాంతంలో పరిశోధన జరిపినప్పుడు, భూమి పొరల్లో భారీ పగుళ్లున్న విషయాన్ని గుర్తించాం. భూగర్భంలోని కోర్ ప్రాంతంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమైనప్పుడు అది ఈ పగుళ్ల నుంచే వెలుపలికి వస్తుంది. అది ప్రకంపనలకు అవకాశం ఇస్తుంది. విజయవాడ చుట్టు ఇలాంటి భారీ పగుళ్లు దాదాపు 22 వరకు ఉన్నట్టు గతంలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడవైపు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన బోరు తవ్వకాలు మంచిది కాదు ప్రస్తుతం హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ల కోసం 1,200 నుంచి 2 వేల అడుగుల వరకు బోర్లు వేస్తున్నారు. అలాగే నీటి ప్రవాహానికి ఉన్న సహజసిద్ధ మార్గాలను మూసేస్తున్నారు. ఈ రెండు చర్యలు భూమి పొరల్లో మార్పులకు కారణమవుతాయి. అవి కూడా భూకంపాలకు అవకాశం కలిగించొచ్చు. ఈ తీరును నిరోధించే చర్యలు కచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే ఎప్పటికైనా ప్రమాదాలు తప్పవు. -
ఎమ్మెల్యే ప్రియురాలి హల్చల్
మైసూరు: ఎన్నికల సమయంలో హంగామా సృష్టించిన ఎమ్మెల్యే రామదాసు ప్రియురాలుగా వార్తల్లోకెక్కిన ప్రేమకుమారి గురువారం హఠాత్తుగా ఎమ్మెల్యే రామదాసు కార్యాలయం ఎదుట ప్రత్యక్షమయ్యారు. మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యే రామదాసు తన భర్తని తాను బతికి ఉన్నంత కాలం రామదాసుతోనే కలసి జీవిస్తానంటూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా రామదాసు కోసమే పోటీ నుంచి తప్పుకొన్నామని అయితే ఎన్నికల ఫలితాల వెలువడినప్పటి నుంచి రామదాసు తమకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆరోపించారు. అందుకే ఇవాళ తాడోపేడో తేల్చుకోవడానికి వచ్చామని రామదాసుకు పట్టిన దెయ్యాన్ని విడిపిస్తానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. -
ప్చ్.. ముందే చెప్తే బాగుండేది
న్యూఢిల్లీ: తనను ఇంటర్నల్ లోక్‌పాల్ నుంచి తొలగిస్తున్నట్లు ముందే చెప్తే బావుండేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అడ్మిరల్ ఎల్ రామ్ దాస్ అన్నారు. తనకు తెలియకుండా పార్టీ అధిష్టానం ఇలా నిర్ణయించడం చాలా బాధాకరంగా ఉందని, దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. గతంలో అనధికారికంగా జరిగిన ఓ సమావేశంలో తనను మరో ఐదేళ్లపాటు కొనసాగాల్సిందిగా వారే కోరారని చెప్పారు. వివిధ వార్తా చానెళ్లలో ఈ వార్తలు రావడం చూసి తనకు ఆశ్చర్యం వేసిందని, అనంతరం కొంత బాధకలిగిందని.. అయినా, ఫోన్ కాల్ కోసం ఎదురుచూశానని తెలిపారు. ఆప్‌లో పరిణామాలు తీవ్రంగా బాధించాయని అన్నారు. -
'మహిళలపై నేరాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం'
మధురై: తమిళనాడు రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవ్వడంపై పీఎంకే మండిపడింది. రాష్ట్రంలో శృతిమించుతున్న నేరాలకు అడ్డుకట్టవేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పీఎంకే అధ్యక్షుడు రాందాసు విమర్శించారు. ప్రత్యేకంగా మహిళలపై అత్యాచారాలు, టీనేజ్ బాలికలపై దుండగుల ఆగడాలు పెట్రేగి పోతున్నా.. జయలలిత ప్రభుత్వం మాత్రం వారిపై కఠిన వైఖరి అవలంభించడం లేదన్నారు. నేషనల్ క్రైం బ్యూరో నివేదిక ప్రకారం చూసినా రాష్ట్రంలో రోజుకో బాలిక మరియు ముగ్గురు మహిళలు లైంగిక వేధింపుల బారిన పడుతున్నారన్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన పునీత అనే అమ్మాయిపై అత్యాచారం-హత్య ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదన్నారు. ఆ ఘటన జరిగిన రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం తరుపున న్యాయవాదిని నియమించడం నిజంగా సిగ్గు చేటన్నారు. గత రెండు రోజుల క్రితం కాలేజీ అమ్మాయిపై నలుగురు అతి పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనతో ప్రభుత్వం అసమర్ధత స్పష్టంగా కనబడుతోందన్నారు. -
సోనియా... దేశద్రోహి కుమార్తె
సాక్షి,బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓ దేశద్రోహి కుమార్తె అని మాజీ మంత్రి రాందాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. మైసూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ తండ్రి ఇటలీ సైన్యంలో పనిచేసే సమయంలో ఆ దేశ రక్షణ విభాగానికి చెందిన రహస్యాలను ఇతర దేశాలకు డబ్బు కోసం విక్రయించారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి కుమార్తె దేశంలోని ఓ పార్టీ ఉన్నత స్థానంలో ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. తాను ప్రత్యక్షరాజకీయాల నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన ఇతర పార్టీ నాయకులకు మద్దతు ఇస్తున్నట్లు కాదన్నారు. ఈ విషయంలో కొంతమంది నాయకులు ప్రజలను, కార్యకర్తలను అనవసరంగా గందరగోళానికి గురిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తల్లితో సమానమన్నారు. అందువల్ల రాజకీయాల్లో కొనసాగితే అది బీజేపీతో మాత్రమేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేదన్నారు. ఇదిలా ఉండగా సోనియగాంధీపై తన వాఖ్యల పట్ల రాందాస్ విషాదం వ్యక్తం చేశారు. ఆవిధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. -
తిరుపతి, శ్రీకాళహస్తిలను తమిళనాడులో కలపాలి: రాందాస్
పీఎంకే అధినేత రాందాస్ డిమాండ్ సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయిన దృష్ట్యా గతంలో ఉమ్మడి సంయుక్త రాష్ట్రం నుంచి విడిపోయిన తిరుపతి, శ్రీకాళహస్తిలను తిరిగి తమిళనాడులో కలపాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ బుధవారం డిమాండ్ చేశారు. మద్రాసు రాజధాని నుంచి 1956లో విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు తమిళనాడులోని 9 మండలాలు దూరమయ్యూయన్నారు. పెద్ద ఎత్తున పోరాటాలు సాగించి కేవలం తిరుత్తణిని మాత్రమే తిరిగి దక్కించుకోగలిగామని వివరించారు. పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు, తిరుపతి తదితర 8 మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండిపోయాయన్నారు. మెజారిటీ సంఖ్యలో ఉన్న ఈ 8 మండలాల్లోని తమిళులు ద్వితీయశ్రేణి పౌరులుగా దుర్భర జీవితం అనుభవిస్తున్నందున వారికి న్యాయం జరిగేలా తమిళనాడులో తిరిగి కలపాలని, ఇందుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాందాస్ డిమాండ్ చేశారు. -
వచ్చే ఖరీఫ్‌లో రూ.150కోట్ల పంట రుణాలు
మంచాల, న్యూస్‌లైన్: జిల్లాలో వచ్చే ఖరీఫ్ కోసం రూ.150 కోట్ల పంట రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) సీఈఓ రాందాస్ అన్నారు. శుక్రవారం ఆయన మంచాలలో సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. బకాయిలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈఏడాది 80శాతం బకాయిలు వసూలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 49 సంఘాలకు గాను సకాలంలో బకాయిలు చెల్లించని 27 సంఘాలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందన్నారు. 50శాతం రికవరీ చేసిన సంఘాలకు రూ.50 కోట్లు, 75శాతం రికవరీ చేసిన సంఘాలకు అడిగినన్ని రుణాలు ఇస్తామన్నారు. గతంలో స్వల్ప కాలిక రుణాలు రూ.102 కోట్లు ఇచ్చామన్నారు. సంఘాల అభివృద్ధిలో భాగంగా స్ట్రాంగ్ గది నిర్మాణం, ఎరువుల వ్యాపారం కోసం కూడా రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. మంచాల సహకార సంఘం మూడేళ్లుగా దీర్ఘకాలిక రుణాలు చెల్లించడం లేదన్నారు. రూ.కోటి 53లక్షల వరకు దీర్ఘకాలిక బకాయిలు ఉన్నాయన్నారు. పంట రుణాలు రూ.4కోట్ల 82లక్షలు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిలో 50శాతం రికవరీ చేస్తేనే తిరిగి కొత్తగా రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు. పంట రుణాలు తీసుకున్న వారు ఈనెల 31లోపు బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుందన్నారు. సకాలంలో రుణాలు చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ దయాకర్‌రెడ్డి, నోడల్ అధికారి రమణ, మంచాల బ్యాంక్ సీఈఓ సీహెచ్ శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
యువతకు మార్గదర్శకంగా నిలవండి
సాక్షి, ముంబై: శివసేనలో అసంతృప్తితో కొనసాగే కంటే యువతరానికి మార్గదర్శకుడిగా నిలవడానికి కృషి చేయాలని సీనియర్ నాయకుడు మనోహర్ జోషికి ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే హితబోధ చేశారు. ఠాణేలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘గత సంవత్సరం నవంబర్‌లో శివసేన అధినేత బాల్‌ఠాక్రే అంత్యక్రియలు శివాజీపార్కు మైదానంలో జరి గాయి. ఈ తంతు పూర్త్తయిన రెండు, మూడు రోజుల్లోనే అదే మైదానంలో ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని జోషీ డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించకుండా ఇలా తొందరపడి డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదు. జోషీ డిమాండ్‌తో ఇటు ఉద్ధవ్‌ను అటు పార్టీని ఇబ్బందుల్లో పడేసింది’ అని అన్నారు. . జోషీ పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఉద్ధవ్ తప్పకుండా క్షమించే అవకాశాలున్నాయని, పార్టీని విడనాడవద్దు’’ అని జోషీకి అఠవలే సలహా ఇచ్చారు. శివసేన నేతృత్వంపై జోషీ బహిరంగంగా విమర్శలు చేసిన ఫలితంగా శివసైనికుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. శివాజీ పార్కు మైదానంలో జరిగిన దసరా ర్యాలీలో జోషీకి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలుచేసి ఆయన తనంతట తానుగా వేదిక దిగిపోయేలా చేశారు. దీంతో జోషీ రాజకీయ భవితవ్యమేమిటనే అంశంపై వివిధ పార్టీల నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. ఇదిలాఉండగా ఏ లోక్‌సభ నియోజక వర్గం కావాలంటూ జోషి ఇంత రాద్ధాంతం సృష్టించారో అదే నియోజక వర్గాన్ని శివసేన, బీజేపీలో మిత్రపక్షంగా కొనసాగుతున్న ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే డిమాండ్ చేయడంతో కొత్త వివాదానికి దారితీసే పరిస్థితి నెలకొంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ మధ్య ముంబై, కల్యాణ్, పుణే, సాతారా, రామ్‌టెక్, వర్ధా స్థానాలు కావాలని ఆఠవాలే డిమాండ్ చేశారు. ఇం దులో కనీసం మూడు లోక్‌సభ నియోజక వర్గాలు, ఒక రాజ్యసభ స్థాన ం ఇవ్వాలని పట్టుబట్టనున్నట్లు అఠవాలే చెప్పారు. వచ్చే వారంలో తను ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండేలతో సమావేశమవుతానన్నారు. అప్పుడే పోటీ చేసే నియోజక వర్గాల విషయంలో తుది నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు.