సినీ, రాజకీయ సెలబ్రిటీల జీవిత చరిత్ర వెండితెరకెక్కడం పరిపాటిగా మారింది. గతంలో కామరాజర్, జయలలిత, గాంధీజీ, క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని ఇలా పలువురు ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా రూపొందాయి. తాజాగా పీఎంకే నేత రామదాస్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు భారతి కనమ్మ, వెట్రిక్కోడి కట్టు, పాండవ భూమి, ఆటోగ్రాఫ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన చేరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది.
పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లోనూ కథానాయకుడిగా నటించిన చేరన్ ఇటీవల జర్నీ అనే వెబ్ సీరీస్‌కు దర్శకత్వం వహించారు. తాజాగా దర్శకత్వం పైనే దృష్టిపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సుదీప్ హీరోగా తమిళం, కన్నడం భాషల్లో ఒక చిత్రం చేస్తున్నారు. దీన్ని పూర్తిచేసిన తరువాత డా.రామదాస్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో డి.రామదాస్ పాత్రలో శరత్‌కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. రామదాస్ ఒక్కపక్క వైద్యవృత్తి నిర్వహిస్తునే మరో పక్క అణగారిన వన్నియార్ సామాజిక వర్గం న్యాయ హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడడం, అలా పాట్టాలి మక్కల్ కట్చి పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడం వంటి అంశాలతో బయోపిక్‌ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment