మధురై: తమిళనాడు రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవ్వడంపై పీఎంకే మండిపడింది. రాష్ట్రంలో శృతిమించుతున్న నేరాలకు అడ్డుకట్టవేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పీఎంకే అధ్యక్షుడు రాందాసు విమర్శించారు. ప్రత్యేకంగా మహిళలపై అత్యాచారాలు, టీనేజ్ బాలికలపై దుండగుల ఆగడాలు పెట్రేగి పోతున్నా.. జయలలిత ప్రభుత్వం మాత్రం వారిపై కఠిన వైఖరి అవలంభించడం లేదన్నారు. నేషనల్ క్రైం బ్యూరో నివేదిక ప్రకారం చూసినా రాష్ట్రంలో రోజుకో బాలిక మరియు ముగ్గురు మహిళలు లైంగిక వేధింపుల బారిన పడుతున్నారన్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన పునీత అనే అమ్మాయిపై అత్యాచారం-హత్య ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదన్నారు.
ఆ ఘటన జరిగిన రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం తరుపున న్యాయవాదిని నియమించడం నిజంగా సిగ్గు చేటన్నారు. గత రెండు రోజుల క్రితం కాలేజీ అమ్మాయిపై నలుగురు అతి పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనతో ప్రభుత్వం అసమర్ధత స్పష్టంగా కనబడుతోందన్నారు.