PMK
-
విధ్వంసంతో రిజర్వేషన్లు సాధ్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో కులాల డేటాను సేకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులను సూచించేందుకు త్వరలోనే ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించిన విషయం తెల్సిందే. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెన్నియార్ సామాజిక వర్గానికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ కేంద్ర మంత్రి అంబుమణి రాందాస్ నాయకత్వంలో పట్టాలి మక్కల్ కాట్చి ప్రతినిధి బృందం కలసి వెళ్లాక పళనిస్వామి ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం వెన్నియార్ సామాజిక వర్గం తమిళనాడులో ఎక్కువ వెనక బడిన వర్గాల (ఎంబసీ) జాబితాలోన కొనసాగుతోంది. ఓటర్లలో కూడా వారిది చాలా బలమైన వర్గం. 2021, ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెన్నియార్ వర్గం తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్ తీసుకొచ్చింది. తమిళనాడులో ఇప్పటికే 69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టాలి మక్కల్ కాట్చి (పీఎంకే), ఏఐఏడిఎంకే, బీజేపీలతో కలసి పోటీ చేయాలనుకుంటోంది. 2019లో ఏఐఏడీఎంకేతో కలసి పొత్తు పెట్టుకోవడం వల్లనే రామదాస్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. (కొత్త పార్టీ: రజనీకాంత్ కీలక ప్రకటన) వెన్నియార్ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పీఎంకే ఆందోళన ప్రారంభించిన రోజునే కులాల డేటా సేకరణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తానంటూ పళనిస్వామి ప్రకటించారు. తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేంత తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు పార్టీ వ్యవస్థాపక నాయకుడు రామదాస్ పిలుపునివ్వడంతో ఆందోళన విధ్వంసం చోటు చేసుకుంది. చెన్నై నగరంలోకి ఎక్స్‌ప్రెస్ రైలు రాకుండా శివారులోనే దానిపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. ప్రధాన రహదారులన్నింటిని మూసివేశారు. దీంతో పీఎంకేను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి. మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకొని విధ్వంసానికి బాధ్యులను చేస్తూ రామదాస్‌తోపాటు ఆయన కుమారుడు అంబుమణి రామదాస్‌లపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. (బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే) ఆందోళనల్లో విధ్వంసం సష్టించడం పీఎంకేకు కొత్త కాదు. వెనకబడిన వర్గాల (బీసీ) జాబితా నుంచి ఎక్కువ వెనకబడిన వర్గాల (ఎంబీసీ) జాబితాను వేరు చేయాలంటూ 1987లో పీఎంకే ఆందోళనలో విధ్వంసకాండకు పాల్పడగా 21 మంది మరణించారు. ఆ నేపథ్యంలోనే 1989లో అప్పటి డీఎంకే ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లతో ఎంబీసీ కోటాను ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి పీఎంకే ఆందోళనలను ఆపేందుకే కులాల డేటా సేకరణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. దీనవల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది. (నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్ ) తమిళనాడు కమిషన్ వేసినా కులాల డేటాకు సర్వే నిర్వహించక పోవచ్చు. ఒకవేళ నిర్వహించినా దాన్ని విడుదల చేయకపోవచ్చు. కులాల ప్రాతిపదికన కాకుండా దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటు ప్రాతిపదికన 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా విడుదల చేసేందుకు సాహసించలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కూడా 2015లో ప్రజల సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం మీద చేసిన సర్వేను ఇంతవరకు విడుదల చేయలేదు. ఇందుకు కారణం ఎఫ్‌సీ, బీసీ, ఓసీ, ఎంబీసీల డేటాకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉజ్జాయింపుగా చెబుతున్న లెక్కలకు, ఆయా సామాజిక వర్గాలు చెబుతున్న లెక్కలకు, సర్వే లెక్కలు భిన్నంగా ఉండడమే. సర్వే వివరాలను బయటకు వెల్లడించడం వల్ల ప్రభుత్వాలకు, పార్టీలకు మధ్య గొడవలే కాకుండా, సమాజంలో కూడా అశాంతి పరిస్థితులు ఏర్పడుతాయన్న భయమే ప్రధాన కారణం. తమిళనాడులో సర్వే నిర్వహిస్తే రాష్ట్ర జనాభాలో వెన్నియార్ సామాజిక వర్గం వారు 20 శాతం కూడా లేరని తెలిస్తే గొడవలు జరగుతాయి. ఎంబీసీ జాబితా నుంచి వారిని వేరు చేసి, ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నట్లు వారికి ప్రత్యేక క్యాటగిరీ కింద 20 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఇతర సామాజిక వర్గాలు ఆందోళనలకు దిగుతాయి. అప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లు కూడా 89 శాతం చేరుకుంటాయి. రిజర్వేషన్లు 50 శాతం కోటాను మించకూడదంటూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు సూచించిన విషయ తెల్సిందే. -
కంచుకోటలో ‘సూర్యుడు’ ఉదయించేనా?
తమిళనాడు రాజధాని చెన్నై ప్రతిపక్ష డీఎంకేకు మొదటి నుంచీ కంచుకోట. నగరం పరిధిలోని చెన్నై సెంట్రల్ నియోజకవర్గం 1977లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2014 వరకూ జరిగిన 11 ఎన్నికల్లో డీఎంకే ఏడుసార్లు విజయం సాధించింది. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో దివంగత ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత ప్రభంజనంలో ఇక్కడ ఈ పార్టీ అభ్యర్థి ఎస్సార్ విజయ్‌కుమార్ తన సమీప డీఎంకే అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌ను ఓడించారు. అంతకు ముందు వరుసగా రెండుసార్లు దయానిధి డీఎంకే టికెట్‌పై ఎన్నికై యూపీఏ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. డీఎంకే నేత, మాజీ సీఎం ఎం.కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్ చిన్న కొడుకు దయానిధి. మురసోలి మారన్ ఇదే నియోజకవర్గం నుంచి 1996, 98, 99 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. నగరంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు చెన్నై సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ స్థానంలో 13, 32, 135 మంది ఓటర్లు ఉన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ లోక్ నియోజకవర్గంలో ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన హిందీ, ఉర్దూ మాట్లాడే ప్రజలతో పాటు చెపాక్–తిరువల్లికేని, ఎగ్మోర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు లక్షల మందికి పైగా ముస్లిం జనాభా ఉంది. తెలుగువారు, మలయాళీలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. అన్నానగర్ వంటి అత్యంత సంపన్న ప్రాంతాలతో పాటు పక్కనే జీహెచ్ క్వార్టర్స్ వంటి మురికివాడలు ఉన్న నియోజకవర్గం ఇది. మళ్లీ డీఎంకే చేతికి చిక్కేనా? మధ్య చెన్నై సీటు డీఎంకేకు గతంలో కంచుకోటగా పేరున్నా ఈ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమీప బంధువైన దయానిధి మారన్ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ‘చెన్నై సెంట్రల్లో డీఎంకేకు నల్లేరుపై నడకే. కాని, 2014లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎస్సార్ విజయ్‌కుమార్ గెలిచాక పరిస్థితి మారిపోయింది’ అని తమిళ రాజకీయ విశ్లేషకుడు సీఎస్ కోటీశ్వరన్ అభిప్రాయపడ్డారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న పాలక ఏఐఏడీఎంకే కూటమి తరఫున పీఎంకే అభ్యర్థి ఎస్ఆర్ శామ్ పాల్ పోటీ చేస్తున్నారు. కరుణానిధి సమీప బంధువైన దయానిధి మన్మోహన్సింగ్ కేబినెట్లో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. ఆయన అన్న కళానిధి మారన్ ఆసియాలోనే అతిపెద్ద టీవీ నెట్వర్క్ సన్ గ్రూప్ అధిపతి. జయలలిత మరణానంతరం డీఎంకేకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఇక్కడ దయానిధి మారన్ గెలుపు ఖాయమని యూపీఏ భావిస్తోంది. బరిలో ముస్లింల పార్టీ అభ్యర్థి ముస్లింలలో పలుకుబడి ఉన్న సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కేకేఎస్‌ఎస్‌ఎం దెహ్లాన్ బకావీని ఇక్కడ నిలబెట్టింది. సినీ నటుడు కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్ నీతి మయ్యమ్ (ఎంఎన్ఎం) అభ్యర్థిగా కమీలా నాసర్ పోటీచేస్తున్నారు. కానీ, పోటీ ప్రధానంగా దయానిధి మారన్, శామ్ పాల్ మధ్యనే ఉంటుంది. పీఎంకే అభ్యర్థిగా వ్యాపారి పాల్ ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి తరఫున వన్నియార్ల పార్టీగా అందరికీ తెలిసిన పీఎంకే పోటీ చేస్తోంది. పీఎంకేకు నగరంలో చెప్పుకోదగ్గ బలం లేకున్నా అన్నాడీఎంకే కూటమిలోని ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడింది. పీఎంకే అభ్యర్థి శామ్ పాల్ మైనారిటీ మతానికి చెందిన ధనిక వ్యాపారి. ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే మొదటిసారి. అయితే, బంధుప్రీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తనను గెలిపిస్తారని ఆయన చెబుతున్నారు. మురికివాడల ప్రజల సంక్షేమానికి పాటుపడతానని, నియోజకవర్గంలో మంచినీటి సమస్య పరిష్కరిస్తానని పాల్ హామీ ఇస్తున్నారు. గణనీయ సంఖ్యలో ఉన్న అల్ప సంఖ్యాక వర్గాల మద్దతు తమ కూటమికే ఉందని ఆయన ప్రకటించారు. అవినీతిపరుడుకాని అందుబాటులో ఉండే నాయకుడినే మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారన్న ధీమా పాల్ వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు.. ►3,33,296 ఎస్సార్ విజయకుమార్ (ఏఐఏడీఎంకే) ►2,87,455దయానిధి మారన్(డీఎంకే) ►1,14,798కాన్స్టాంటిన్ రవీంద్రన్ (డీఎండీకే) ►25,981సీడీ మెయ్యప్పన్(కాంగ్రెస్) ►45,841విజయ్‌కుమార్ మెజారిటీ -
పొత్తుల ఎత్తులతో బీజేపీ దూకుడు..!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి ఓ పక్క మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ఆపసోపాలు పడుతుండగానే పాలక పక్ష బీజేపీ రెండంటే రెండు రోజుల్లోనే కీలకమైన మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో పొత్తులు కుదుర్చుకుంది. లోక్‌సభలోని 543 సీట్లకుగాను ఈ రెండు రాష్ట్రాల్లోనే 87 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎప్పుడు విమర్శనాస్త్రాలను సంధించే పాత మిత్రపక్షం శివసేనతో బీజేపీ సోమవారం పొత్తు కుదుర్చుకోగా, తమిళనాడులో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (ఏఐఏడిఎంకే), పట్టాలి మక్కల్ కాట్చి (పీఎంకే) పార్టీలతో మంగళవారం పొత్తు ఖరారు చేసుకుంది. గత అక్టోబర్ నెలలోనే బీహార్‌లోని ఆర్జేడీతో బీజేపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెల్సిందే. మహా కూటమిని ఏర్పాటుచేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఇంకా గందరగోళంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ సీట్ల పంపకాల విషయంలో ఇంకా గందరగోళం నెలకొని ఉంది. బీహార్‌లో మహాకూటమిని ప్రకటించినప్పటికీ సీట్ల పంపకాల కసరత్తును ఇంకా చేపట్టాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు చిన్నా చితక పార్టీలను కూటమిలో స్థానం కల్పించేందుకు సతమతం అవుతున్నాయి. తమిళనాడులో కాంగ్రెస్-ద్రావిడ మున్నేట్ర కళగంతో కలవాల్సిన పట్టాలి మక్కల్ కట్చీ బీజేపీ కూటమిలోకి వెళ్లడం అన్ని రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్న విషయం. ఎస్ రామదాస్ నాయకత్వంలోని ఈ పార్టీకి ఉత్తర తమిళనాడులో మంచి బలం ఉంది. వన్నియార్లు, ఇతర వెనకబడిన వర్గాల ప్రజల్లో ఈ పార్టీ సముచిత స్థానాన్ని సంపాదించుకుంది. కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీకి ప్రాతినిధ్యం కల్పించలేదన్న కారణంగా కాంగ్రెస్-డీఎంకే కూటమిలో చేరుతానని ఈ పార్టీ ఇదివరకే సంకేతాలు ఇచ్చింది. అయితే ప్రతిపక్ష కూటమి ఇస్తానన్న సీట్లకన్నా ఎక్కువగా, ఏకంగా ఆరు సీట్లు ఇస్తామంటూ బీజేపీ ప్రతిపాదన తీసుకురావడంతో రామదాస్ పార్టీ పునరాలోచనల్లో పడింది. గత నాలుగేళ్లుగా వరుసగా బీజేపీని విమర్శస్తూ రావడమే కాకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని జనవరి నెలలోనే తీర్మానం చేసినప్పటికీ శివసేన.. మళ్లీ బీజేపీతోని కలసిపోవాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామమే. 2014 ఎన్నికల సందర్భంగా శివసేనకు 20 సీట్లు కేటాయించిన బీజేపీ, ఈసారి 23 సీట్లు ఇవ్వడానికి ముందుకు రావడమే పొత్తుకు కారణమైందన్నది తెలుస్తోంది. మిగతా 25 సీట్లకు పోటీ చేయడానికి బీజేపీ సిద్ధపడింది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నందున బీజేపీ ఒంటరిగా పోటీ చేసినట్లయితే మహారాష్ట్రలో ఎక్కువ నష్టపోయే అవకాశం ఉండడంతోనే తప్పనిసరి శివసేనతో పొత్తుకు తలొగ్గాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. శివసేనతో ఒప్పందం కుదిరిన మరునాడే తమిళనాడులో ఏఐఏడిఎంకే, పీఎంకేలతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రంలోని 39 సీట్లకుగాను బీజేపీ ఐదు స్థానాలకు, పీఎంకే ఆరు స్థానాలకు పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. అయితే మిగతా అన్ని స్థానాలకు ఏఐఏడిఎంకేనే పోటీ చేస్తుందా? వాటి నుంచి కొన్ని సీట్లను బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందా? అన్న అంశం ఇంకా స్పష్టం కావడం లేదు. పొత్తులను కుదుర్చుకోవడమే కాకుండా పుల్వామా ఉగ్రదాడి అనంతరం జాతి జనుల దష్టిని తనవైపు తిప్పుకునేలా చేయడంలో కూడా బీజేపీ విజయం సాధించిందని మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కీ అద్వానీల వద్ద సలహాదారుగా పనిచేసిన సుధీంద్ర కులకర్ణి చెప్పారు. మహాకూటమికి లేనిది బీజేపీకి ఉన్నది రాజకీయాలపై స్పష్టతని, తనకు అన్నింటికన్నా విజయం ముఖ్యం అన్న విషయాన్ని బీజేపీ బాగా గ్రహించడం వల్ల చిన్న పార్టీలకు అవసరమైతే రెండు సీట్లు ఎక్కువ ఇచ్చయినా పొత్తు కుదుర్చుకుంటోందని స్వరాజ్ ఇండియా పార్టీ నాయకుడు, సామాజిక శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. -
ఆ రెండు పార్టీలకు కమల్ ఆహ్వానం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘కొన్నిపార్టీలు మమ్మల్ని పిలిచాయి, ప్రజలకు ఇష్టం లేదని వదులకున్నాం, మరి కొన్నింటిని మేమే వద్దనుకున్నాం, ఒంటరిగానే పోటీచేస్తాం, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు’. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ రెండురోజుల క్రితం చెప్పిన మాటలు ఇవి. అయితే అంతలోనే బాణీ మార్చారు. రెండు ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు పంపడం ద్వారా సరికొత్త స్వరం ఆలపించారు. ఎన్నికల బరిలో నిలిచి నెగ్గుకురావడం ఆషామాషీ కాదు. అసెంబ్లీ ఎన్నికలైతే ఎంతో కొంత ప్రాంతీయతా భావం ఉంటుంది. దీంతో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. అదే పార్లమెంటు ఎన్నికలైతే ఓటర్లు జాతీయస్థాయిలో ఆలోచిస్తారు. అందుకే రాష్ట్రంలోని అన్నాడీఎంకే, డీఎంకే వంటి బలమైన ప్రాంతీయపార్టీలు సైతం బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి నడిచేందుకు రంగం సిద్ధమైంది. కొత్త పార్టీ, ఎన్నికలను ఎదుర్కొనడం కొత్తైన కమల్‌హాసన్ కాంగ్రెస్–డీఎంకే కూటమిలో చేరేందుకు ఆశపడ్డారు. పార్టీని స్థాపించిన కొత్తల్లోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అప్పటి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్ దేశంలోని పలువురు జాతీయనేతలను కమల్ కలుసుకున్నారు. వీరంతా కాంగ్రెస్ మిత్రపక్షాలే కావడం గమనార్హం. దీంతో రాబోయే ఎన్నికల్లో కమల్ కాంగ్రెస్‌తో జతకడతారని అందరూ నమ్మారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో పావులు కదిపినా రాష్ట్రస్థాయిలో ఆయనకు పిలుపురాలేదు. అన్నిపార్టీలూ పొత్తులు, సీట్లసర్దుబాట్లలో తలమునకలై ఉన్న తరుణంలో కమల్‌కు దిక్కుతోచలేదు. ఇక ఒంటరిపోరే శరణ్యమని నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరీలోని ఒక్కటి మొత్తం 40 స్థానాల్లో ఏపార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా తమపార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని ఈనెల 6న ఆయన మీడియా వద్ద అధికారికంగా ప్రకటించారు. అనుకున్నదానికంటే వేగంగా అన్నిగ్రామాల్లోనూ పార్టీ బలపడిందని చెప్పారు. మాపార్టీ సిద్ధాతాలను ఇతర పార్టీలు కాపీకొట్టే స్థాయికి ఎదిగామని చెప్పుకున్నారు. ప్రజలకు తమ పార్టీపై నమ్మకం పెరిగింది, ఆ ధీమాతోనే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమయ్యామని తెలిపారు. పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వారి పలకిని నేను మోయాల్సి ఉంటుందని, ఎవ్వరినీ భుజాలపై మోసేందుకు తాము సిద్ధంగా లేమని కూడా వ్యాఖ్యానించారు. రెండో రోజునే రెండు పార్టీలకు పిలుపు: కమల్ ధైర్యానికి అందరూ ఆశ్చర్యపడుతున్న వేళ ఒంటరి పోరుపై వెనక్కు తగ్గడం ద్వారా ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు ఎవరికివారు కొన్ని పార్టీలతో కూటమిగా ఏర్పడిపోగా డీఎండీకే, పీఎంకేలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎవరివైపు వెళదామా అని ఆలోచిస్తున్నాయి. ఇదే అదనుగా కమల్‌హాసన్ కూటమి ఆలోచనలు మొదలుపెట్టారు. ఈరెండు కూట ముల వైపు వెళ్ల వద్దు, కొత్త కూటమిగా కలిసుందాం రండి అంటూ శుక్రవారం అకస్మాత్తుగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డీఎంకే, అన్నాడీఎంకే రెండునూ అవినీతి మచ్చపడినవి, ఇది తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో మార్పురావాలి, మంచి తేవాలి అనే మంచి ఉద్దేశంతో రాజకీయపయనం చేస్తున్నపుడు అవినీతిమయమైన పార్టీలు మనకొద్దని అన్నారు. డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్‌లతో కమల్ పొత్తు చర్చలు ప్రారంభించారు. ఈ రెండుపార్టీలూ ఇప్పటి వరకు అన్నాడీఎంకే–బీజేపీ కూటమి వైపు మొగ్గి ఉన్నాయి. అనారోగ్యం కుదుటపడి త్వరలో అమెరికా నుంచి చెన్నైకి చేరుకోనున్న విజయకాంత్‌ను ఫోన్ ద్వారా కమల్ సంప్రదించినట్లు సమాచారం. -
రైలింజన్ పైకెక్కి నిరసన.. ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలతో జనజీవనం దాదాపు స్తంభించింది. కడలూర్, ధర్మపురి, మెట్టూరు, విల్లుపురం ప్రాంతాల్లోనైతే ఆందోళనలు హోరెత్తాయి. బోర్డు ఏర్పాటుచేయమని సుప్రీంకోర్టు చెప్పినా వినిపించుకోకుండా మోదీ సర్కార్ ఒంటెత్తుపోకడ పోతున్నదని తమిళపార్టీలు ఆరోపించాయి. కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పార్టీ రైల్‌రోకోకు పిలుపివ్వగా, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మద్దతు తెలిపింది. ఈ రెండు పార్టీలకుతోడు వందలాది సంఘాలు, వేల మంది రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. ఊహించని షాక్: రైల్‌రోకో ఆందోళనలో భాగంగా పీఎంకే కార్యకర్త ఒకరు ఆగిఉన్న రైలింజన్ పైకి ఎక్కి నిరసన తెలుపుతుండగా, ఊహించని కరెంట్ షాక్ తగిలి, మంటలు అంటుకున్నాయి. విల్లుపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. షాక్‌కు గురైన వ్యక్తి పేరు రంజిత్(32)గా గుర్తించారు. హైవోల్టేజ్ ధాటికి అతను మాడి మసైపోయాడని తొలుత వార్తలు వచ్చినా, అది నిజం కాదని వైద్యులు పేర్కొన్నారు. ‘‘హైటెన్షన్ వైర్లను అతను ముట్టుకోలేదు. కానీ అత్యంత సమీపానికి వెళ్లడంతో ఒక్కసారే షాక్ కొట్టి, మంటలు చెలరేగాయి. ఒక మోస్తారుకు మించి బాధితుడు గాయపడ్డాడని, ప్రాణాపాయం లేనప్పటికీ, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. -
తమిళనాడు రైల్‌రోకో ఆందోళనలో ఊహించని ఘటన
-
అన్బుమణి రాందాస్‌కు గుండెపోటు..!
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ సభ్యుడు అన్బుమణి రాందాస్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు. పీఎంకే యూత్వింగ్ అధ్యక్షుడిగా ఉన్న అన్బుమణి రాందాస్ ప్రస్తుతం తమిళనాడులోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. -
చతుర్ముఖ పోటీ
► ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే, ► డీఎంకేలే ప్రధాన ప్రత్యర్థులు ► బీజేపీ అభ్యర్థుల ఎంపిక ► పోలింగ్ సమయం కుదింపు సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చతుర్మఖ పోటీ నెలకొంది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టారనే ఆరోపణలతో అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దయిన విషయం తెలిసిందే. తిరుప్పరగున్రం ఎమ్మెల్యే శీనివేల్ మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ మూడు నియోజకవర్గాలకు వచ్చే నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. అన్నా డీఎంకే, డీఎంకే, పీఎంకే ఇప్పటికే తవ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగాయి. బీజేపీ అభ్యర్థులు వీరే : మూడు నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ గురువారం ఢిల్లీ నుంచి ప్రకటించింది. తంజావూరు నుంచి ఎమ్ఎస్.రామలింగం, అరవకురిచ్చి నుంచి ఎస్.ప్రభు, తిరుప్పరగున్రం నుంచి ప్రొఫెసర్ శ్రీనివాసన్ పోటీకి దిగుతున్నారు. ఫిర్యాదులు, పిటిషన్లు : ఉప ఎన్నికలు జరగనున్న మూడు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు డీఎంకే ఫిర్యాదు చేసింది. గడిచిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులనే అన్నాడీఎంకే, డీఎంకే తదితర పార్టీలు మళ్లీ పోటీకి దింపినందున తంజావూరు, అరవకురిచ్చిల్లో ఉప ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ మధురై హైకోర్టు శాఖలో సీనియర్ న్యాయవాది ప్రకాష్ గురువారం పిటిషన్ వేశారు. పోలింగ్ సమయం కుదింపు : తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చీలో వచ్చే నెల 19న జరగనున్న ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంట పాటూ కుదించనున్నట్టు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని గతంలో ప్రకటించి ఉన్నారు. తాజాగా పోలింగ్ వేళలను సవరిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. నేడు అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల నామినేషన్లు : ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజవర్గాల్లో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అరవకురిచ్చీలో సెంథిల్ బాలాజీ(అన్నాడీఎంకే), కేసీ.పళని స్వామి, తంజావూరులో రంగస్వామి(అన్నాడీఎంకే), అంజుగం భూపతి(డీఎంకే), తిరుప్పరగున్రంలో ఏకే.బోస్ (అన్నాడీఎంకే), డాక్టర్ శరవణన్(డీఎంకే) నా మినేషన్లు వేయనున్నారు. రెండు పార్టీల అభ్యర్థులు మధ్యాహ్నం 1-3 గంటల మధ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. -
'తమిళనాడులో పోలింగ్ వాయిదా వేయండి'
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి పీఎంకే నేత అన్బుమణి రాందాస్ విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని, సోమవారం(మే 16) జరగనున్న ఎన్నికల పోలింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. 'తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు పంచారు. వీరి నామినేషన్లు రద్దు చేసి ఎన్నికల పోలింగ్ ను తాత్కాలికం గా వాయిదా వేయాల'ని లేఖలో రాందాస్ కోరారు. డబ్బులు పంచుతున్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులను పట్టిచ్చిన తమ అభ్యర్థిపై కేసు పెట్టారని ఆయన ఈసీకి తెలిపారు. -
సినిమా వాళ్లే ముఖ్యమంత్రి కావాలా?
వేలూరు: సినిమా నుంచి వచ్చిన వారే ముఖ్యమంత్రి కావాలా చదివిన వారికి ఒక్కసారి అవకాశం కల్పించాలని పాట్టాలి మక్కల్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రామదాస్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పామాకా ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాల అభ్యర్థుల పరిచయ కార్యక్రమం వేలూరులో శుక్రవారం రాత్రి జరిగింది. అన్బుమణి మాట్లాడుతూ ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రతిఒక్కరిని వేడుకుంటున్నానని ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా రాష్ట్రంలో మార్చి మార్చి పాలన చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అవసరం లే దని రాష్ట్రంలో మార్పు అవసరమని ఆ మార్పు అన్బుమణితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రాష్ర్టంలో ఎవరితోనూ కూటమి పెట్టుకోకుండా పోటీ చేస్తున్న పార్టీ పామాకా మాత్రమే అన్నారు. తమకు ఎవరూ వ్యతిరేకం కాదని రాష్ట్రంలో ఒక్కసారి అన్బుమణికి అవకాశం కల్పించండి, పాలన సక్రమంగా చేయకుంటే రెండేళ్లోనే తాను రాజీనామా చేస్తానన్నారు. జయలలిత ప్రచార సమావేశంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారని ఇందుకు జయలలితపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతున్నా మద్యనిషేధం గురించి పట్టించుకోకుండా ప్రస్తుతం ఎన్నికలు రావడంతో మద్య నిషేధం జపం చేస్తున్నారన్నారు. పామాకా అధికారానికి వస్తే ఒక చుక్క కూడా మద్యం రాష్ట్రంలో ఉండదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని తనకు ఒక్కసారి అవకాశం కల్పించండి, ప్రతి నియోజక వర్గంలోనే తాను పోటీ చేస్తున్నట్లుగా భావించి మామిడి పండు చిహ్నంపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం అభ్యర్థులను పరిచయం చేశారు. వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాలకు చెందిన పామాకా అభ్యర్థులు పాల్గొన్నారు. -
పీఎంకే మేనిఫెస్టో విడుదల
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశ ఎన్నికల చరిత్రలో మేనిఫెస్టోను ఒక ప్రజాశాసనంగా విడుదల చేసిన ఘనత పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)ది మాత్రమేనని ఆ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ రాందాస్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు పీఎంకే కూడా ఒక సాధారణ మేనిఫెస్టో విడుదల చేయడం లేదు, ఇది ప్రజల ఆకాంక్షలకు అద్దమని అభివర్ణించారు.రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూటములుగా ఏర్పడగా, ఒంటరిపోరుతో ధైర్యంగా రంగంలోకి దిగిన పీఎంకే శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వినూత్న రీతిలో మేనిఫెస్టో తొలి ప్రతిని మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రమణియన్‌కు అందజేశారు. రాందాస్ మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరిలోనే పీఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగిన అన్బుమణి రాందాస్ ఆనాటి నుంచి ప్రజలను కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారని తెలిపారు. ఇలా ప్రజలతో మమేకమై ప్రభుత్వం నుంచి వారు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుని మేనిఫెస్టో సిద్ధం చేశామని చెప్పారు. ఇది కేవలం మేనిఫెస్టో, ఎన్నికల హామీలతో కూడిన బడ్జెట్ ఎంతమాత్రం కాదని అన్నారు. బడ్జెట్ రూపకల్పనలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారమని అన్నారు. తమిళనాడు ప్రగతి తమ మేనిఫెస్టోలో స్పష్టంగా గోచరిస్తుందని తెలిపారు. చేనేతలు, పారిశ్రామిక వేత్తలు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు ఇలా ఏ ఒక్క కేటగిరిని విస్మరించలేదని అన్నారు. అన్బుమణి అందరినీ కలుసుకుని వారితో చేసుకున్న ఒప్పందం నుంచే తమ మేనిఫెస్టో ఆవిర్భవించిందని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తొలుత సిద్ధం చేసిన మేనిఫెస్టోలో 96 అంశాలు మాత్రమే ఉండగా, ఈ తాజా మేనిఫెస్టో 144 అంశాలకు పెరిగిందని తెలిపారు. సంపూర్ణ మద్య నిషేధం, అవినీతి నిర్మూలన, వికలాంగుల సంక్షేమం, ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, మానవ హక్కుల పరిరక్షణ ఇలా అన్ని అంశాలను సృజించామని అన్నారు. అలాగే ఉచిత, నాణ్యమైన, విధిగా విద్యాభ్యాసం చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. తాత్కాలిక ప్రయోజనాలు కల్పించే ఆకర్షణీయమైన ఉచితాల జోలికి పోకుండా ఆ నిధులను విద్యా ప్రయోజనాలకు వెచ్చిస్తామని తెలిపారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కోటి ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని క్షేత్రస్థాయిలో చూపిస్తామని, మొత్తం 386 గ్రామపంచాయతీలకు సమ ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. విద్యుత్‌లోటును తీర్చి ప్రకాశవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వీధి కుళాయిల్లో సైతం మినరల్ వాటర్ లభించేలా చర్యలు చేపడతామని అన్నారు. అన్ని అధికారాలు ప్రజలకే ఉండేలా పరిపాలనలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. పథకం అమలును సమీక్షించేందుకు వీలుగా అసెంబ్లీలో ఓ యాక్షన్ టేకన్ రిపోర్టు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న పీఎంకే ప్రభుత్వానికి ఇది ఒక కార్యాచరణ ప్రణాళికగా ఆయన అభివర్ణించా రు. పీఎంకే ప్రభుత్వం వల్ల అన్ని కోర్కెలు నెరవేరాయనే భావన ప్రజలకు కలుగుతుందనే ధీమాను వ్యక్తం చేశారు. మద్యంబాబులకు జైలు శిక్ష: అన్బుమణి తమ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే తొలి సంతకం సంపూర్ణ మద్య నిషేధంపైనేనని పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ హామీ ఇచ్చారు. మద్యం అమ్మకాలపై వెంటనే ఉక్కుపాదం మోపి సమూలంగా నిర్మూలిస్తామని తెలిపారు. చాటుమాటుగా మద్యం తాగేవారి గురించి ఫిర్యాదు చేసిన వారికి రూ.10వేలు బహుమానం, తాగిన వారికి ఆరు నెలల జైలు శిక్ష అని చెప్పారు. తమ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి మద్యం నిషేధం పోరాటం చేస్తూ కేసులు కూడా పెట్టించుకుందని అన్నారు. అధికారంలో ఉన్నపుడు కిమ్మన కుండా ఉన్న జయలలిత నేడు ఎన్నికల వేళ మద్యం నిషేధం పాటపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఎన్నికలు అమ్మ వర్సెస్ అన్బుమణి అని సవాల్ చేశారు. -
వైఎస్ పాలనే ఆదర్శం
సాక్షితో పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ సాక్షి, చెన్నై: ‘అందరికీ అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందరికీ ఆదర్శనీయుడు. అందుకే తమిళనాడు రైతులకూ అటువంటి పాలనను అందించేందుకు వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని అసెంబ్లీకి పోటీ చేస్తున్నా’ అని పాట్టాలిమక్కల్ కట్చి (పీఎంకే) యువజన విభాగ అధ్యక్షుడు, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో రాందాస్‌ను ‘సాక్షి’ కలిసింది. ఐదు దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్బుమణి అన్నారు. ఈ రెండు పార్టీలు ఎంతటి దుర్భరమైన పాలన అందించినా భరించాల్సిందేనా, తమకు మరో గత్యంతరం లేదా అనేంతగా ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు పీఎంకే ముందుకొచ్చిందన్నారు. రైతన్నలను అక్కున చేర్చుకోవడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఆదర్శమని చెప్పారు. రైతు సంక్షేమం కోసం ఆయన అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఏపీ వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి రూ.18వేల కోట్లు కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పీఎంకే అధికారంలోకి వస్తే ఇదే పద్ధతిని అనుసరిస్తానని రైతులకు చెప్పినట్లు పేర్కొన్నారు. -
నిర్ణయం వారిదే!
సాక్షి, చెన్నై : సంప్రదింపులతో చర్చలు సాగాయని, ఇక నిర్ణయం వారి చేతుల్లో అంటూ పీఎంకే, డీఎండీకేలకు పొత్తు విషయంగా కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. తమ వెంట పన్నెండు పార్టీలు ఉన్నాయని, ఆ ఇద్దరు కలసి వస్తే బలం పెరిగినట్టేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక, సీనియర్ నటుడు విజయకుమార్ కమలంకు మద్దతు ప్రకటించారు. రాష్ర్టంలో అధికారం తమదే అన్నట్టుగా గతంలో ధీమా వ్యక్తం చేసిన కమలనాథులు, ఇక మౌనముద్రతో ముందుకు సాగుతున్నారు. ప్రాంతీయ పార్టీలు షాక్ ఇచ్చినా, చివరి క్షణంలో తమతో కలసి వస్తాయన్న ఆశతో ఎదురు చూపుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి తమతో కలిసి వచ్చిన చిన్నా చితక పార్టీల్ని అక్కున చేర్చుకున్న బీజేపీ పెద్దలు, వారికి సీట్ల పంపకాల మీద దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ కసరత్తుల్లో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పూర్తిగా నిమగ్నమయ్యారు. బుధవారం అఖిల భారత ముస్లిం మున్నేట్ర కళగం నేత సదర్ అబ్దుల్లా, ఇండియ మున్నేట్ర కల్వి కళగం నేత దేవనాదం, దక్షిణ భారత ఫార్వడ్ బ్లాక్ నేత తిరుమగన్లతో సీట్ల పంపకాల చర్చల్లో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పొన్ రాధాకృష్ణన్‌ను మీడియా కదిలించగా, తమ వెంట పన్నెండు పార్టీలు నడిచేందుకు సిద్ధమయ్యాయని ఆయన వివరించారు. బలమైన కూటమి ఏర్పాటు చేయాలన్న కాంక్షతో ఆ దిశగా ప్రయత్నాలు సాగించామని, డీఎండీకే, పీఎంకేలతోనూ చర్చలు సాగాయని పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం అవుతున్నదని, ఈనెలాఖరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రజాహితం కాంక్షించే దిశగా ఈ మేనిఫెస్టో ఉండబోతోందని, కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ద్వారానే రాష్ర్ట సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యం అని తద్వారా ప్రజల్లోకి వెళ్లబోతున్నామన్నారు. డీఎండీకే, పీఎంకేలతో సంప్రదింపులు, చర్చలు సానుకూలంగానే సాగాయని, అయితే, నిర్ణయం అన్నది వారి చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. వారి నిర్ణయాల మేరకు తుది నిర్ణయాన్ని బీజేపీ ప్రకటిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక, సీనియర్ నటుడు విజయకుమార్ పొన్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. తన మద్దతును బీజేపీకి ప్రకటించారు. ఇప్పటికే పలువురు నటీ మణులు, నెపోలియన్ వంటి నటులు బీజేపీలో చేరిన దృష్ట్యా, త్వరలో వారు అధికారికంగా కమలం తీర్థం పుచ్చుకునేందుకు విజయకుమార్ సిద్ధమవుతున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరఫున ప్రచారం సాగించేందుకు విజయకుమార్ వ్యాఖ్యానించినట్టుగా కమలాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
జాబిత సిద్దం
సాక్షి, చెన్నై : ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితాను పీఎంకే సిద్ధం చేసింది. 120 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసిన పీఎంకే అధినేత రాందాసు, ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ప్రయత్నాల్లో పడ్డారు. ప్రతి ఎన్నికల్లోనూ కూటములను మారుస్తూ వచ్చిన పీఎంకే అధినేత రాందాసు, ఈ సారి గతంలో చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదన్న నిర్ణయానికి వచ్చారు. కూటములను మారుస్తూ రావడంతో బలహీన పడడంతో, ఇక తమ బలాన్ని చాటుకునేందుకు ఒంటరి పయనానికి సిద్ధ పడ్డారు. అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాల పార్టీల్ని కలుపుకుని ఓ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. తన కూటమి సీఎం అభ్యర్థిగా తనయుడు అన్భుమణి రాందాసును ప్రకటించేశారు. అన్ని పార్టీల కన్నా ముందుగా ఎన్నికల ప్రచారంలో పీఎంకే పరుగులు తీస్తోంది. ప్రజాకర్షణకు అన్భుమణి తీవ్రంగానే కుస్తీలు పడుతూ వస్తున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల తరహాలో తమతో కలసి రావాలని బీజేపీ, పీఎంకే చుట్టూ తిరుగుతూ వస్తోంది. బీజేపీతో దోస్తీ కట్టడం కన్నా, తమతో చేతులు కలపాలని, అన్భుమణిని సీఎం అభ్యర్థిగా అంగీకరించాలన్న మెళికను రాందాసు పెట్టి ఉన్నారు. దీంతో కమలం వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు తమతో కలిసి వచ్చినా, రాకున్నా, సరే తమ పయనం ఆగదన్నట్టుగా అభ్యర్థులు జాబితాను రాందాసు సిద్ధం చేశారు. తమకు బలం ఉన్న అన్ని నియోజవకవర్గాల్లో బలమైన అభ్యర్థిని ఎంపిక చేసి పోటీకి రంగంలోకి దించనున్నారు. బీజేపీ నిర్ణయంతో తమకు పని లేదన్నట్టుగా ముందుగా 120 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసి ఉన్నారు. ఆశావహుల్ని వచ్చిన దరఖాస్తుల మేరకు కొందర్ని, పార్టీ కోసం శ్రమిస్తూ వస్తున్న నాయకుల్ని ఆయా సీట్లకు ఎంపిక చేశారు. ఈ జాబితా తదుపరి మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టనున్నారు. తొలి జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు తగ్గ కసరత్తులతో రాందాసు ముందుకు సాగుతున్నారు. -
అన్నాడీఎంకే వర్సెస్ పీఎంకే
టీనగర్ : వందవాసిలో బ్యానర్ ఏర్పాటు చేయడంలో అన్నాడీఎంకే, పీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వందవాసి తేరడి ప్రాంతంలో ముఖ్యమంత్రి జయలలిత జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక ప్రాంతాలలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పీఎంకే తరఫున వండలూరులో జరిగే మహానాడును పురస్కరించుకుని బ్యానర్లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి పీఎంకే కార్యకర్తలు మరికొన్ని బ్యానర్లను తేరడి ప్రాంతంలో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వందవాసి వెస్ట్ యూనియన్ అన్నాడీఎంకే ఉంచిన బ్యానర్‌ను తొలగించారు. ఆ స్థానంలో పీఎంకే బ్యానర్ ఏర్పాటుచేశారు. ఆ విషయం తెలిసి అన్నాడీఎంకే కార్యదర్శి అర్జునన్ వందవాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరిపారు. శుక్రవారం రాత్రి కూడా మళ్లీ పీఎంకే కార్యకర్తలు తేరడి ప్రాంతంలో అన్నాడీఎంకే బ్యానర్ ముందు తమ బ్యానర్ ఏర్పాటుచేశారు. అన్నాడీఎంకే - పీఎంకే ఘర్షణ : ఈ విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు వంద మందికి పైగా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా వంద మందికి పైగా పీఎంకే కార్యకర్తలు కూడా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇది పార్టీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న డీఎస్పీ బాలచంద్రన్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల నేతలతో చర్చలు జరిపారు. దీంతో పీఎంకే రెండవ సారి ఏర్పాటు చేసిన బ్యానర్‌ను తొలగించింది. అన్నాడీఎంకే నేతలు మొదటిసారి ఏర్పాటుచేసిన బ్యానర్ కూడా తొలగించాలని కోరారు. దీన్ని పీఎంకే కార్యకర్తలు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆపై ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. స్వల్పంగా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు మళ్లీ జోక్యం చేసుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్ధరాత్రి వరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. -
అమ్మే దిక్కు
పొత్తుకు డీఎండీకే, పీఎంకేలు దిగిరాకపోవడంతో, ఇక అమ్మ శరణు కోరేందుకు కమలనాథులు సిద్ధమవుతునట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ సీనియర్ నేత ఇలగణేషన్ స్పందించారు. అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలకు అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించడం, ఇందుకు ఢిల్లీ నుంచి పెద్దలు రానుండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. * అన్నాడీఎంకేతో పొత్తుకు బీజేపీ ప్రయత్నం * ఢిల్లీ నుంచి కమలం పెద్దలు సాక్షి, చెన్నై: లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఆ రెండు కూటములకు తామే ప్రత్యామ్నాయం అని అప్పట్లో కమలనాథులు జబ్బలు చరిచారు. ఎన్నికల అనంతరం ఆ కూటమి పటాపంచేలు అయింది. లోక్ సభ ఎన్నికల్లో కమలం గొడుగు నీడన చేరేందుకు ఉరకలు తీసిన వాళ్లు, తాజాగా చీత్కార ధోరణితో ముందుకు సాగుతున్నారు. తమ నేతృత్వంలో ఎలాగైనా కూటమి ఏర్పాటు చేయాలని విశ్వప్రయత్నాల్ని బీజేపీ వర్గాలు చేస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. డీఎండీకే, పీఎంకేలు తమతో కలసి వస్తాయన్న ఆశ ఇన్నాళ్లు కమలనాథుల్లో ఉన్నా, ప్రస్తుతం నమ్మకం సన్నగిల్లినట్టుంది. ఆ రెండు పార్టీల వ్యవహారం కమలనాథులకు అంతు చిక్కని దృష్ట్యా, ఎక్కడ ఒంటరిగా మిగులుతామోనన్న బెంగ బయలు దేరినట్టుంది. డీఎంకే గొడుగు నీడ కాంగ్రెస్, ప్రజా కూటమిలో వామపక్షాలు ఉన్న దృష్ట్యా, వారితో పొత్తుకు ఆస్కారం లేదు. పీఎంకే, డీఎండీకేలు మెట్టుదిగని దృష్ట్యా, చివరకు అమ్మే దిక్కు అన్నట్టుగా అన్నాడీఎంకే గొడుగు నీడన చేరడానికి కమలనాథులు కసరత్తులకు సిద్ధమవుతున్నారు. ఇందు కోసం ఢిల్లీ నుంచి ప్రతినిధులు రానున్నడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేతో కమలం పొత్తు కుదిరేనా అన్న చర్చ బయలు దేరింది. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్ శుక్రవారం మీడియాతో స్పందిస్తూ, తమ ప్రయత్నం తాము చేశామని, ఇక ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని వ్యాఖ్యానించడం గమనించాల్సిందే. అమ్మే దిక్కా : తమతో పొత్తుకు ఎవ్వరూ కలిసి రాక పోవడంతో ఒంటరిగా మిగలడం కన్నా, అమ్మ శరణం కోరడం మంచిదన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చినట్టు ప్రచారం బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఇలగణేషన్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్ నేతృత్వంలో ఎన్నికల కమిటీ రంగంలోకి దిగనున్నదని సూచించారు. ఈ కమిటీ చివరి ప్రయత్నంగా డీఎండీకే, పీఎంకేలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దల రాకతో రాజకీయంగా మార్పులు, అన్నాడీఎంకేతో పొత్తు విషయంగానూ సంప్రదింపులకు అవకాశం ఉందని స్పందించడంతో ఇక, పాత మిత్రులు కొన్నేళ్ల అనంతరం మళ్లీ ఏకం అయ్యేనా అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. అన్నాడీఎంకే గొడుగు నీడన చేరడానికి ఇక కమలం సిద్ధ పడ్డట్టే అన్న ప్రచారం సాగుతున్నది. జయలలిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోది ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేయడం, తాజాగా అన్నాడీఎంకేతోనూ పొత్తు సంప్రదింపులకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగనున్నడం గమనించాల్సిన విషయం. అయితే, ఏ నిర్ణయాన్ని అయినా, నిర్భయంగా తీసుకునే పురట్చి తలైవి తాజా రాజకీయ పరిస్థితులు, కర్ణాటక అప్పీలు విచారణ వేగం పెరిగిన నేపథ్యంలో కమలంతో పొత్తు విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
ఇప్పుడు రజనీకాంత్ వంతు
‘న్యాయం’కు వ్యతిరేక వ్యాఖ్య కోర్టులో పిటిషన్ పీఎంకే తరపున దాఖలు సాక్షి, చెన్నై : నిన్నగాక మొన్న సినీ రచయిత వైరముత్తును కోర్టుకు లాగితే నేడు కథానాయకుడు రజనీకాంత్‌ను టార్గెట్ చేశారు. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ పీఎంకే తరపున రాణిపేట ముని సిఫ్ కోర్టులో గురువారం పిటిషన్ దాఖ లు అయింది. ఇటీవల న్యాయ లోకానికి వ్యతిరేకంగా సినీ రచయిత వైరముత్తు తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వైరముత్తుకు కోర్టు సమన్లు సైతం జారీ చేసింది. ఈ విచారణ ఓ వైపు సాగుతున్న సమయంలో ఇటీవల రజనీకాంత్ న్యాయమూర్తులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పీఎంకే నాయకుడు, న్యాయవాది జానకీరామన్ రాణిపేట మునిసిఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రజనీకాంత్‌పై పోలీసులు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ తన పిటిషన్ ద్వారా కోర్టుకు ఆ నాయకుడు విజ్ఞప్తి చేశాడు. ఇటీవల చీటికి మాటికీ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే వాళ్లు పెరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం ప్రచా రం కోసం దాఖలు చేస్తున్నట్టుందని అక్షింతలు వేయడంతో పాటుగా జరిమానాలు విధించిన సందర్భాలూ ఉన్నా యి. ఈ పరిస్థితుల్లో అశేషాభిమాన లోకాన్ని కలిగి ఉన్న దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్‌కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలై ఉండటంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. జానకీరామన్ దాఖలు చేసిన ఆ పిటిషన్లో సెప్టెంబరు పన్నెండో తేదీన చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ న్యాయలోకాన్ని, న్యాయమూర్తుల్ని కించపరిచే విధంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారని వివరించి ఉన్నారు. దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టినా, ప్రజలు చెడ్డవాళ్లుగా మారినా, న్యాయమూర్తులు నిజాయితీతో వ్యవహరిస్తే దేశం బాగుంటుందని రజనీకాంత్ స్పందించడం బట్టి చూస్తే, న్యాయమూర్తులను ఆయన ఏ మేరకు కించపరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయంగా తొలుత రాణిపేట పోలీసులకు, తదుపరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని, వారెవ్వరు చర్యలు తీసుకోని దృష్ట్యా కోర్టును ఆశ్రయించినట్టు తన పిటిషన్లు వివరించి ఉన్నారు. ఈ పిటిషన్‌ను కోర్టు పరిశీలించి, తదుపరి విచారణకు పరిగణించాల్సి ఉంది. దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. -
బెంగాల్ నిర్ణయాన్ని స్వాగతించిన పీఎంకే
చెన్నై: భారత స్వాతంత్ర్య సమర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన పత్రాలను బయటపెట్టాలన్న పశ్చిమ బెంగాల్ నిర్ణయాన్ని పీఎంకే అధినేత ఎస్ రాందాస్ స్వాగతించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉందన్నారు. నేతాజీకి సంబంధించిన 64 డాక్యుమెంట్లు బయటపెడతామని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రకటించడం స్వాగతించతగ్గ పరిణామమని అన్నారు. నేతాజీ అదృశ్యం పరిష్కారం కాని మిస్టరీగా ఉండిపోయిందని అన్నారు. -
నిషేధించాల్సిందే
- కదంతొక్కిన మహిళా లోకం - మద్యానికి వ్యతిరేకంగా పీఎంకే నిరసన సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మద్య నిషేధం నినాదంతో ఏళ్ల తరబడి పీఎంకే ఉద్యమిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అధికార అన్నా డీఎంకే మినహా ప్రతి పక్షాలన్నీ వేర్వేరుగా మద్య నిషేధ బాటలో పయనిస్తున్నాయి. మద్య నిషేధ నినాదం రాష్ట్రంలో ఉద్యమం ఉప్పెనలా ఎగసి పడుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో మద్యనిషేధంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని బహిర్గతం చేయాలన్న డిమాండ్ బయలు దేరింది. ఇదే డిమాండ్‌తో పీఎంకే నేతృత్వంలో సోమవారం చెన్నైలో భారీ నిరసనకు పిలుపు నిచ్చారు. ఇందుకు జాతీయ స్థాయిలో మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ నేతృత్వం వహించారు. చేపాక్కం వేదికగా జరిగిన ఈ నిరసనకు తిరువళ్లువర్, కాంచీపురం, చెన్నైల నుంచి పీఎంకే మహిళా సేన కదం తొక్కింది. మద్యం వద్దు చేపాక్కం అతిథి గృహాల వద్ద జరిగిన నిరసనకు వేలాదిగా మహిళా లోకం తరలి రావడంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అటువైపుగా వాహన సేవల్ని పూర్తిగా నిలుపుదల చేశారు. ఈ నిరసనలో పీఎంకే సీఎం అభ్యర్థి, ఎంపీ అన్భుమణి రాందాసు మట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని వింత ఇక్కడ సాగుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వమే మద్యం విక్రయాలను సాగించి ప్రజల జీవితాలతో చెలగాటమాడటం విచారకరంగా పేర్కొన్నారు. విద్యార్థులు, యువతీ యువకులు మద్యం మత్తులో రోడ్డులో వీరంగాలు సృష్టిస్తున్న ఘటనలు చూస్తుంటే, రాష్ట్రం ఎటెళ్తోన్నదో అన్న ఆందోళన కల్గుతున్నదన్నారు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ తీరేనని మండిపడ్డారు. ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్య, అభివృద్ధి పరంగా దోహద పడాల్సిన పాలకులు మద్యం రక్కసి ద్వారా వారీ జీవితాల్ని, కుటుంబాల్ని సర్వనాశనం చేస్తున్నదని ధ్వజమెత్తారు. మద్యం ద్వారా ఆదాయం కోట్లాది రూపాయల మేరకు వస్తున్నదని ప్రభుత్వం పేర్కొనడం సిగ్గు చేటుఅని విమర్శించారు. మూడు దశాబ్దాలుగా మద్య నిషేధం నినాదంతో పీఎంకే ఉద్యమిస్తూ వస్తున్నదని, ఇందుకు ఫలితాలు త్వరలో చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లబొల్లి మాటల్ని పక్కన పెట్టి, అసెంబ్లీ వేదికగా మద్య నిషేధం నినాదంపై స్పష్టతను తెలియజేయాలన్నారు. నిషేధం లక్ష్యంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పీఎంకే అధ్యక్షుడు జికే.మణి, నాయకులు ఏకే మూర్తి, కేఎం శేఖర్, ఆర్ముగం, బాల తదితరులు పాల్గొన్నారు. -
నేడే ఓట్ల లెక్కింపు
సాయంత్రానికి ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం రాణీమేరీ కళాశాల వద్ద భారీ బందోబస్తు జయ మెజార్టీపైనే సర్వత్రా ఉత్కంఠ చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికపై నెలరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. మంగళవారం ఉదయం ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమై, సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. ఒక ఉప ఎన్నికకు సహజంగా ఇంత చర్చ అవసరం ఉండదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలు కావడమే కాక మరో పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హతను సైతం చేజార్చుకున్నారు. అయితే ఆ తీర్పుపై అప్పీలు చేసి నిర్దోషిగా బయటపడడం ద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి పూర్వవైభవం పొందారు. అధిరోహించిన ముఖ్యమంత్రి పీఠాన్ని మరో ఏడాదిపాటు శాశ్వతం చేసేందుకు ఆర్కేనగర్ నుంచి ఆమె మళ్లీ పోటీ చేయక తప్పలేదు. జయ నిర్దోషిగా బయటపడడాన్ని జీర్ణించుకోలే క కారాలు మిరియాలు నూరుతున్న పార్టీలు ఆశ్చర్యకరంగా ఉప ఎన్నికలో ఆమెపై పోటీ పెట్టలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే సహా కాంగ్రెస్, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, బీజేపీ తదితర పార్టీలన్నీ ఎన్నికలను బహిష్కరించాయి. ప్రధాన పార్టీల జాబితాలో సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ మాత్రమే పోటీ చేశారు. మరో 26 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. ఈ నెల 27వ తేదీన 74.4 శాతంతో పోలింగ్ పూర్తయింది. పాత వన్నార్పేటలో ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ శాతం పోల్ కావడంతో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల నుంచి భారీ బందోబస్తుతో తరలించిన ఈవీఎంలను రాణీమేరీ కాలేజీలో భద్రం చేశారు. గదికి సీలు వేసి మూడంచెల భ ద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు. జయ గెలవడం ఖాయమని తేలిపోగా ఆమెకు లభించే మెజార్టీపైనే ఉత్కంఠ నెలకొంది. ఆర్కేనగర్ అన్నాడీఎంకే అభ్యర్థిగా తనకు అఖండ మెజార్టీని అందివ్వాలని ముఖ్యమంత్రి జయలలిత పోలింగ్‌కు ముందురోజునే ఓటర్లను అభ్యర్థించారు. ప్రధాన పార్టీలేవీ పోటీలో లేనందున దేశ చరిత్రలో నిలిచిపోయేలా అత్యధిక మెజార్టీ రావాలని అన్నాడీఎంకే ఆశిస్తోంది. -
మద్దతు వేట
సాక్షి, చెన్నై: శ్రీరంగం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే పనిలో ప్రతిపక్షాలు పడ్డాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రె ఫరెండంగా ఈ ఎన్నికలను మలచుకునేందుకు ఉరకలు తీస్తున్నాయి. డీఎండీకే, కాంగ్రెస్ మద్దతును కూడగట్టుకుని ఎన్నికల్లో గెలుపునకు డీఎంకే వ్యూహ రచనల్లో పడింది. డీఎండీకే, పీఎంకే మద్దతుతో అభ్యర్థిని దించి తమ సత్తా చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నాల్లో పడింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన శ్రీరంగం స్థానానికి ఉప ఎన్నిక రాజకీయ పక్షాల్లో ఉరుకులు పరుగులు తీయిస్తోంది. తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవశం చేసుకునేందుకు జయలలిత ఆదేశాలతో ఆ పార్టీ నేతలు, మంత్రులు నియోజకవర్గ బాట పట్టే పనిలో పడ్డారు. తమ అభ్యర్థి వలర్మతి గెలుపు లక్ష్యంగా సుడిగాలి పర్యటనతో ప్రచారంలో దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. శ్రీరంగం గెలుపుతో తమ అధినేత్రి జయలలిత ఏ తప్పూ చేయలేదని చాటే దిశగా అన్నాడీఎంకే శ్రేణులు పరుగులు తీస్తున్నారు. జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో వస్తున్న తొలి ఎన్నిక కావడంతో ఈ గెలుపును 2016 అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా మార్చుకునే పనిలో డీఎంకే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలంటే, ఈ స్థానంలో అన్నాడీఎంకేను ఓడించి, ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద ఏ మేరకు ప్రజల్లో వ్యతిరేకత ఉందో తెలియజేసేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి వ్యూహ రచనల్లో ఉన్నారు. బీజేపీ విషయానికి వస్తే తమిళనాడులో తమ బలం పెరిగిందని నిరూపించుకునేందుకు ఈ ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టే పనిలో పడింది. అయితే, గెలుపు లక్ష్యంగా డీఎంకే, బీజేపీలు డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ ప్రదక్షిణలకు సిద్ధం కావడం గమనార్హం. కీలకంగా విజయకాంత్ : ఈ ఉప ఎన్నిక బరిలో డీఎండీకే అధినేత విజయకాంత్ తన అభ్యర్థిని నిలబెట్టేది అనుమానమే. ఈ దృష్ట్యా, ఆ పార్టీ మద్దతును తమకు అనుకూలంగా మలచుకునేందుకు డీఎంకే, బీజే పీలు పరుగులు తీస్తున్నాయి. డీఎండీకే అధినేత విజయకాంత్ మద్దతుతోపాటుగా కాంగ్రెస్‌ను తమ వైపు తిప్పుకున్న పక్షంలో ఆ ఓటు బ్యాంక్ కలసి వస్తే గెలుపు సునాయాసం అవుతుందన్న ధీమా డీఎంకే అధినేత కరుణానిధిలో నెలకొంది. పీఎంకే సైతం తమకు మద్దతు ఇస్తుందన్న ఆశాభావంతో తమ అభ్యర్థి ఆనంద్‌కు అండగా నిలవాలని ఇప్పటికే ప్రతి పక్షాలకు కరుణానిధి పిలుపు నిచ్చారు. మిగిలిన పక్షాల ఓట్లు తమ ఖాతాలో వేసుకోవడం సులభ మార్గమైనా విజయకాంత్ ఏ సమయంలో ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ డీఎంకేలో నెలకొంది. ఈ దృష్ట్యా, ఆయన్ను ఇప్పుడే తమ వైపు తిప్పుకుని, అసెంబ్లీ ఎన్నికల కూటమికి మార్గం సుగమం చేసే విధంగా డీఎంకే వర్గాలు కోయంబేడులోని డీఎండీకే కార్యాలయంలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యూరట!. ఇక బీజేపీ విషయానికి వస్తే విజయకాంత్ మద్దతు రాబట్టడం లక్ష్యంగా కసరత్తుల్లో సాగుతున్నాయి. అయితే, బీజేపీ మీద విజయకాంత్ ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ఆయన్ను శాంతింప చేసి ఆ పార్టీ మద్దతును చేజిక్కించుకునేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ మంతనాల్లో మునిగారు. విజయకాంత్‌తో సంప్రదింపులకు స్వయంగా తమిళిసై సిద్ధమవుతున్నారు. ఈ దృష్ట్యా, శ్రీరంగం ఉప ఎన్నిక మద్దతు వ్యవహారంలో డీఎండీకే అధినేత విజయకాంత్ కీలకంగా మారడం విశేషం. -
వైగో రచ్చ
సాక్షి, చెన్నై : ఎండీఎంకే నేత వైగోకు కమలనాథుల బెదిరింపు రచ్చకెక్కింది. బీజేపీ జాతీయ నేత రాజా ఇంటిని ముట్టడించేందుకు ఎండీఎంకే వర్గాలు ప్రయత్నింయి. సుబ్రమణ్య స్వామి ఏమైనా అమిత్ షానా? అని వైగో ప్రశ్నించారు. ఇకనైనా మోదీని విమర్శించొద్దంటూ ఎండీఎంకే, పీఎంకే నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. వైగో తమ కూటమిలోనే ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి ఎండీఎంకే పయనించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం బీజేపీ తీరుపై ఎండీఎంకే నేత వైగో శివాలెత్తారు. ఈలం తమిళులు, జాలర్ల విషయంలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం వైగోకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే పనిలో పడ్డారు. ఇది కాస్త కమలనాతుల్లో ఆగ్రహాన్ని రేపింది. బీజేపీ జాతీయ నేతలు సుబ్రమణ్య స్వామి, హెచ్ రాజా వైగోను టార్గెట్ చేసి తీవ్రంగానే స్పందించారు. తమ కూటమిలో నుంచి వెళ్లకుంటే గెంటాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే, మోదీని టార్గెట్ చేసి విమర్శలు మానుకోకుంటే, వైగోకు భద్రత కరువు అవుతుందని, కేంద్రంలో ఉన్నది తామన్న విషయాన్ని గుర్తెరగాలంటూ రాజా తీవ్రంగానే స్పందించారు. ఇది ఎండీఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది. తమ నేత భద్రతను ప్రశ్నార్థకం చేసే విధంగా రాజా వ్యాఖ్యలు చేయడాన్ని ఎండీఎంకే వర్గాలు తీవ్రం గా పరిగణించాయి. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆదివా రం ఉదయం రాజా ఇంటిని ముట్టడించేందుకు యత్నిం చారు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. రాజా ఇంటిని ముట్టడించే ఎండీఎంకే వర్గాలను అరెస్టు చేయకుంటే, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ రద్దు కు తాను సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని సుబ్రమణ్య స్వామి హెచ్చరికలు జారీ చేయడం ఆ పార్టీ వర్గాల్లో కలవరాన్ని రేపింది. దీంతో ఎండీఎంకే వర్గాల్ని అడ్డుకునే విధంగా పోలీసులు రంగంలోకి దిగారు. రాజా ఇంటి ముట్టడికి యత్నించిన ఎండీఎంకే వర్గాలను మార్గ మధ్యలోనే అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన విషయాన్ని సుబ్రమణ్య స్వామికి సమాచారం రూపంలో పంపినట్టు తెలిసింది. సుబ్రమణ్య స్వామి అమిత్ షానా: కమలనాథుల చర్యపై ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా స్పందించారు. తాను గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తీవ్రంగానే విమర్శించానని గుర్తు చేశారు. అయితే, ఆయన్ను తాను కలుసుకున్నప్పుడు మర్యాద పూర్వకంగా వ్యవహరించారన్నారు. ఆ సమయంలో తాను చేసిన విమర్శలు గుర్తు చేయగా, సిద్ధాంత పరంగా చేసే విమర్శల జోలికి తాను వెళ్లబోనని పేర్కొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అదే విధంగా తాను మరెందర్నో విమర్శించానని, ఆరోపణలు గుప్పించానని, వారెవ్వరూ ఇంత వరకు తనను బెదిరించిన దాఖలాలు లేవన్నారు. అయితే, తమిళుల కోసం తాను పోరుడుతూ కేంద్ర తీరును విమర్శిస్తే బెదిరించడం శోచనీయమన్నారు. తనను బెదిరించడం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం బెదిరింపులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాజా ఇంటిని ముట్టడించే వాళ్లను అరెస్టు చేయకుంటే, జయలలిత బెయిల్ రద్దు చేయిస్తానని సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించడం శోచనీయమని, దీన్ని బట్టి చూస్తే కొందరు కమలనాథులు ఏ మేరకు బెదిరింపులతో పబ్బం గడుపుతున్నారో స్పష్టం అవుతోందన్నారు. తనను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లమని చెప్పడానికి సుబ్రమణ్య స్వామి ఏమైనా అమిత్ షానా? ఆయనెవ్వరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు వద్దు : ఎన్డీఏ కూటమిలో ఉంటూ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించ వద్దని ఎండీఎంకే , పీఎంకే నేతల్ని బీఊసీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. విమర్శలు వివాదాలకు దారి తీయకూడదని, అందరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు. అయితే, హెచ్ రాజా, సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలపై స్పందించక పోవడం గమనార్హం. ఎండీఎంకే నేత వైగో తమ కూటమిలోనే ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. అయితే, వైగోను టార్గెట్ చేసిన కమలనాథుల చర్యల్ని పలు పార్టీల నాయకులు, తమిళాభిమాన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వైగోకు బెదిరింపు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆయనకేదైనా జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ హెచ్చరించారు. -
నాది ద్రోహమా?
సాక్షి, చెన్నై: పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక వేదికగా సాగిన ఆసక్తికర పరిణామాలు డీఎంకే బహిష్కృత నేత అళగిరికి ఆగ్రహాన్ని తెప్పించాయి. తాను కలిస్తే ద్రోహం-వాళ్లు కలిస్తే స్నేహమా అంటూ శుక్రవారం డీఎంకే అధిష్టానంపై అళగిరి విరుచుకు పడ్డారు. డీఎంకే నుంచి ఎంకే అళగిరి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో అళగిరి తెర మీదకు రావడం పరిపాటే. లోక్‌సభ ఎన్నికల సమయంలో అళగిరి, ఎండీఎంకే నేత వైగోలు కలిసిన వేళ డీఎంకే వర్గాలు తీవ్రంగానే స్పందించాయి. అళగిరిని ద్రోహిగా పేర్కొంటూ మండిపడ్డాయి. గతంలో శత్రువుగా ఉన్న వైగోను మిత్రుడిగా మార్చుకునేందుకు డీఎంకే పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. డీఎంకేను రెండుగా చీల్చిన వైగో ఓ మారు ఎన్నికల సమయంలో ఆ పార్టీతో కలిసినా, ఆ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. ప్రస్తుతం 2016లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న డీఎంకే, ఎండీఎంకే బలాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడింది. అలాగే, పీఎంకేను సైతం తమతో కలిసి నడిపించే రీతిలో కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడింది. నేను ద్రోహి...వాళ్లు మిత్రులు: తన వ్యూహాల అమలు లక్ష్యంగా కరుణ చేస్తున్న ప్రయత్నాలకు పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక కలిసి వచ్చింది. ఆ వేడుకలో పొగడ్తల పన్నీరును పాతమిత్రులు చల్లుకున్నారు. ఒకరినొకరు కరచాలనంతో పలకరించుకున్నారు. ఇక, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే నేత వైగోలు చెప్పనక్కర్లేదు. పాత స్నేహాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టుగా వ్యవహరించారు. ఒకే విమానంలో మదురైకు సైతం బయలుదేరి వెళ్లారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ పరిణామాలన్నీ బహిష్కృత నేత అళగిరిలో ఆగ్రహాన్ని రేపాయి. తనకో న్యాయం....వారికో న్యాయమా అని విరుచుకు పడ్డారు. శుక్రవారం మదురైలో ఓ మీడియాతో మాట్లాడిన అళగిరి తీవ్రంగానే స్పందించారు. వారికి వద్దనుకుంటే ద్రోహం, కావాలనుకుంటే మిత్ర బంధం అని మండి పడ్డారు. వైగోను తాను కలిస్తే, అదో పెద్ద ద్రోహం అన్నట్టు చిత్రీకరించారని, ఇప్పుడు స్టాలిన్ చేసిందేమిటో మరి అని ప్రశ్నించారు. వైగోను కలిసిన తాను ద్రోహి అయినప్పుడు, ఆయన మాత్రం ఎలా మిత్రుడు అవుతాడోనని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ పరిణామాలు చూస్తుంటే, రాజకీయాలు ఎటు వెళ్తున్నాయోనన్న విస్మయం కలుగుతోందన్నారు. గోపాలపురానికి వైగో: ఓ వైపు అళగిరి విమర్శలు గుప్పించే పనిలో పడితే, మరో వైపు గోపాలపురం మెట్లు ఎక్కేందుకు వైగో సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎండీఎంకే వస్తే ఆహ్వానిస్తామని కరుణానిధి చేసిన వ్యాఖ్యలు వైగోను పులకింతకు గురి చేసినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకేకు తాను చెడు తలబెట్టినా, తనకు కరుణానిధి మాత్రం మంచే చేశారన్న భావనలో ఉన్న వైగో, త్వరలో పూర్వపు తన అధినేతను కలుసుకునేందకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా ఎండీఎంకేలో చర్చ సాగుతోంది. మరికొద్ది రోజుల్లో కరుణానిధి నివాసం గోపాలపురం మెట్లు ఎక్కడం లక్ష్యంగా కార్యాచరణను వైగో సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. -
‘మెగా’ సాధ్యమే!
రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భావం సాధ్యమేనని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం మహాబలి పురం వేదికగా మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీదకు రానుండడంతో రాజకీయ పరిణామాలు ఏ మలుపులు తిరగనున్నాయో..! అన్న చర్చ బయలు దేరింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మెగా కూటమి ఏర్పాటు లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి పావులు కదుపుతున్నారు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచనల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఆయా పార్టీల మనోగతాలు మాత్రం అంతు చిక్కడం లేదు. ఏ క్షణాన ఏ పార్టీ ఎవరికి మద్దతుగా వ్యాఖ్యానిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మెగా కూటమి సాధ్యమే అన్న భావనను కలిగించాయి. ఎద్దేవా: రాష్ట్రంలో డీఎంకే , అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆ ఇంటర్వ్యూలో స్టాలిన్ విమర్శలు గుప్పించారు. గతంలో తమతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్నప్పుడే నాలుగు స్థానాలకు పరిమితమైన బీజేపీ, తాజాగా అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి రాష్ట్రంలో ఎదుగుతుందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం సాధ్యం కాని పనిగా పేర్కొన్నారు. పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకున్నా, వెలుపల మాత్రం అందరు ఎంపీలు స్నేహ పూర్వకంగానే ఉంటారన్నారు. అయితే, అలాంటి పరిస్థితి తమిళనాడు అసెంబ్లీలో లేదని, స్నేహ పూర్వక వాతావరణం లక్ష్యంగా డీఎంకే ప్రయత్నిస్తోందని చెప్పారు. అళగిరి పార్టీలో లేనందున ఆయన గురించి తానేమీ మాట్లాడబోనంటూ దాట వేశారు. ఎండీఎంకే నేత వైగోతో తనకు ఎలాంటి విబేధాలు లేవని, స్నేహ పూర్వకంగా తాము మెలుగుతామన్నారు. ఇటీవల అసెంబ్లీలో డీఎండీకేకు ఇబ్బందులు తలెత్తినప్పుడు తాము అండగా నిలిచామని, అదే విధంగా తమకు ఇబ్బందుల్ని అధికార పక్షం కల్పించినప్పుడు వాళ్లు అండగా నిలిచారని గుర్తు చేస్తూ, ఇలాంటి స్నేహ పూర్వక వాతావరణం అసెంబ్లీలో మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మెగా కూటమి సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, డీఎంకేలు కలసికట్టుగా మెగా కూటమి ఏర్పాటుకు ఆమోదిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే వేదిక మీదకు : మెగా కూటమి సాధ్యమే అన్నట్టుగా స్టాలిన్ వ్యాఖ్యానించడం ఓ వైపు చర్చకు దారి తీస్తే, ఇందుకు అనుకూలించే పరిస్థితులు మరో రెండు రోజు ల్లో రానున్నాయి. మహాబలి పురం వేదికగా గురువా రం పీఎంకే అధినేత రాందాసు మనవడు, మనవరాలి వివాహం జరగనుంది. ఇందుకు కరుణానిధి నేతృత్వం వహించబోతున్నారు. ఈ వేడుకకు ఎండీఎంకే నేత వైగో సైతం హాజరయ్యేందుకు నిర్ణయించారు. ఈ దృష్ట్యా, మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కాబోతోండటం గమనార్హం. అదే సమయం లో డీఎండీకే నేత విజయకాంత్ సైతం ఈ కల్యాణ వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నా, ఆయన వేదిక ఎక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇప్పటికే రాందా సు, వైగోను తమ వైపు తిప్పుకునే విధంగా డీఎంకే వర్గాలు వ్యాఖ్యలు చేశారుు. ఈ వేదిక మీద ఏ మేరకు పొగడ్తల వర్షం కురిసి మెగా కూటమికి దారి తీస్తాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం మీద వైగో, రాందాసు గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన విందుకు సైతం దూరంగానే ఉన్నారు. విజయకాంత్ సైతం ఈ విందు కు దూరంగా ఉన్నా, తరచూ మోదీ జపం అందుకోవడం ఆయన మదిలో నిర్ణయం ఏమిటోనన్నది అంతు చిక్కడం లేదు. ఈ కల్యాణ వేదికను అస్త్రంగా చేసుకుని ఁమెగారూ.మార్గాన్ని సుగమం చేసుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి తన రాజతంత్రాన్ని ప్రయోగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
అన్నాడీఎంకే, పీఎంకే ఘర్షణ
తిరువళ్లూరు: జయను విడుదల చేయాలని చేస్తున్న నిరాహారదీక్షలో అన్నాడీఎంకే నేతల ప్రసంగంలో పీఎంకే నేత రాందాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆగ్రహించిన పీఎంకే నేతలు, అన్నాడీఎంకే నేతలతో స్వల్ప ఘర్షణ పడ్డారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో సమస్య సద్దుమణిగింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతంలో జయలలితను విడుదల చేయాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు నిరాహారదీక్షను ఉదయం 8 గంటల నుంచి నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా జయకు మద్దతుగా పలువు రు నేతలు ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో పీఎంకే అధ్యక్షుడు రాందాస్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు ఏకవచనంతో సంభోదించా రు. దీంతో ఆగ్రహం చెందిన పీఎంకే నేతలు అన్నాడీఎంకే నేతలు నిరాహారదీక్ష చేస్తున్న స్థలం వద్దకు చేరుకుని జయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరిని ఒకరు తోసుకుంటూ దాడులకు ప్రయత్నించడంతో పోలీసులకు ఇరు వర్గాలను శాంతింప చేయడం కష్టతరంగా మారింది. విషయాన్ని డీఎస్పీ చంద్రశేఖర్‌కు తెలపడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పీఎంకే నేతలను అక్కడి నుంచి పంపించి వేశారు. పీఎంకే, అన్నాడీఎంకే నేతల మధ్య దాదాపు మూడు గంటల పాటు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. -
బర్తరఫ్ చేయూలి
రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని పీఎంకే అధినేత రాందాసు డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే చేస్తున్న వీరంగంతో రూ.వెయ్యి కోట్ల మేరకు ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఈ నష్టాన్ని ఆ పార్టీ నుంచి భర్తీ చేసేవిధంగా న్యాయం కోసం పీఎంకే ఉద్యమిస్తుందని ప్రకటించారు.సాక్షి, చెన్నై : బుధవారం చెన్నైలో విలేకరులతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు మాట్లాడారు. అన్నాడీఎంకే వర్గాల వీరంగాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధినేత్రి జయలలిత తప్పు చేశారు కాబట్టే న్యాయ స్థానం శిక్ష విధించిందని, ఈ తీర్పును ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే, న్యాయ స్థానం పనిగట్టుకుని, క్షక్ష సాధింపుతో తీర్పు ఇచ్చినట్టుగా అన్నాడిఎంకే శ్రేణులు ఆరోపించడం శోచనీయమని విమర్శించారు. న్యాయమూర్తులను కించ పరిచే విధంగా పోస్టర్లను ముద్రించడం, ఇందుకు పలువురు మంత్రులు వత్తాసు పలకడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం లక్ష్యంగా కొందరు మంత్రు లు వ్యవహరించారని, వీరిపై న్యాయ పోరాటం చేయనున్నామని వివరించారు. ఇళ్లపై దాడులు చేశారు జయలలితకు శిక్ష పడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు అన్నాడీఎంకే వర్గాలు సృష్టించిన ఆరాచకాలతో రూ. వెయ్యి కోట్ల మేరకు ప్రజా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. వర్తకులు కూడా తీవ్ర నష్టాన్ని చవి చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక బస్సులు ధ్వంసం అయ్యాయని, రాజకీయ పక్షాల కార్యాలయాలు, ప్రజల ఇళ్లపై సైతం దాడులు జరిగాయని వివరించారు. ఈ దాడులకు పాల్పడ్డ అన్నాడీఎంకే శ్రేణులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన నష్టాన్ని ఆ పార్టీ నుంచి రాబట్టే విధంగా న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నామన్నారు. శాంతి భద్రతలేవీ?: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. అరాచకాలు, వీరంగాలు సాగుతున్నా, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరించడం విచారకరంగా పేర్కొన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, భయ పెట్టి, బెదిరించి నిరసనల బాట పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తు త పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాలంటే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని, రాష్ట్రపతి పాలన దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జయ నీతివంతురాలా?: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఉత్తమురాలా..? నిజాయితీ పరురాలా? అని వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. ఆమె మీద ఎన్నో కేసులు ఉన్నాయని వివరిస్తూ, అన్ని కేసుల్లోనూ అప్పీలు మీద అప్పీలు, వాయిదాల మీద వాయిదాలతో కాలం గడుపుతున్నారని చెప్పా రు. చేసిన తప్పుకు శిక్ష పడిందని, ఆ శిక్షను అనుభవించక తప్పదన్నారు. రాష్ర్టంలో రాజకీయంగా ఇక జయలలిత శకం ముగిసిందని, ఇకనైనా ఆమె జపం మానుకుని ప్రజలకు ఇబ్బం దులు కల్గించే ప్రయత్నాలు చేయొద్దంటూ అన్నాడీఎంకే శ్రేణులకు హితవు పలికారు. తొలగించాల్సిందే: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పథకాల్లో జయలలిత చిత్ర పటాలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యాలయాల్లో మొక్కుబడిగా ఆమె ఫొటోల్ని అక్కడక్కడ తొలగించారేగానీ, పూర్తి స్థాయిలో తొలగించ లేదని ఆరోపించారు. ఆమె మాజీ కాబట్టి ఆమె చిత్ర పటాలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవానీ సింగ్ వద్దే వద్దు: కర్ణాటక ప్రభుత్వ న్యాయవాదిగా భవానీ సింగ్‌ను నియమించొద్దని రాందాసు డిమాండ్ చేశారు. జయలలిత బెయిల్ విషయంలో ఆయన ఎలాంటి అభ్యంతరం తెలపలేదని చెప్పారు. జయలలిత శిక్ష ఖరారుపై బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం, డీఎంకే అధినేత కరుణానిధి ఆచితూచి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. -
బ్యాలెట్ కోసం ఆందోళన
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానం ప్రవేశ పెట్టాలన్న నినాదంతో పీఎంకే ఆందోళనకు శ్రీకారం చుట్టింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతృత్వంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిం చారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని నాయకులను కలుపుకుని ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్టు రాందా సు ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు. ఈవీ ఎంలపై నమ్మశక్యం లేదని బ్యాలెట్ పద్ధతిని మళ్లీ అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉదయాన్నే ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, అధ్యక్షుడు జికే మణి, సీనియర్ నేత ఏకే మూర్తిల నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. బ్యాలెట్ విధానం కోసం పట్టుబడుతూ నినాదాలతో నిరసన కారులు హోరెత్తించారు. ఈవీఎంలలో చోటు చే సుకుంటున్న అవకతవకలను ఎత్తి చూపుతూ నిరసన వ్యక్తం చేశారు.ఉద్యమం: ఈ నిరసనలో రాందాసు ప్రసంగిస్తూ, ఈవీఎంలలో భారీ అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉందని ఆరోపించారు. ప్రపంచ దేశాలు ఈవీఎంలను వ్యతిరేకిస్తుంటే, భారత దేశంలో మాత్రం అమలు చేయడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. అమెరికా, జర్మనీ దేశాలు ఈవీఎంలను పక్కన పెట్టి మరలా బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తున్నాయని, దీన్ని పరిగణనలోకి తీసుకుని దేశంలో మళ్లీ బ్యాలెట్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం జయలలిత 2001లో కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు వరుస విజయాలతో ఈవీఎంలను ఆమె ఆహ్వానించడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమానికి పీఎంకే శ్రీకారం చుడుతుందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. తమిళనాడులో జరిగిన లోక్ సభ ఎన్నికలపై సీబీఐ విచారణ చేపట్టాలన్న డిమాండ్‌తో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయనున్నామని ప్రకటించారు. -
అధికారం మాదే!
2016 అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు దొందు దొందేనని, ఆ పార్టీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం తథ్యమని జోస్యం చెప్పారు. మౌళి వాకం ఘటన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సాక్షి, చెన్నై :పీఎంకే చెన్నై జిల్లా సర్వ సభ్య సమావేశం ఆదివారం ఎంఎండీఏలోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. కేంద్ర మాజీ మంత్రి ఏకే మూర్తి నేతృత్వం వహించిన ఈ సమావేశానికి అధినేత రాందాసు, యువజన నేత అన్భుమణి రాందాసు, పార్టీ అధ్యక్షుడు జీకే మణి హాజరయ్యారు. ఇందులో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. పోరూర్ మౌళి వాకం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు. అలాగే, ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆందోళనకు నిర్ణయించారు. ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, మంగళవారం చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద భారీ నిరసనకు నిర్ణయించారు. మద్య నిషేధం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఒక్కో జిల్లాలో లక్ష మంది మహిళలతో సంతకాల సేకరణకు తీర్మానించారు. గెలుపు మనదే: రాందాసు సభను ఉద్దేశించి ప్రసంగి స్తూ, 2016 ఎన్నికల్లో అధికారం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు దొందుదొందేనని, ఆ పార్టీలతో కూటమి పెట్టుకుని పెద్ద తప్పు చేసినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఇందుకు ఉదాహరణ లోక్ సభ ఎన్నికలేనన్నారు. ఆ ఎన్నికల్లో ఆ రెండు కూట ములకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన కూటమి గణనీయమైన ఓటు బ్యాంక్‌ను కైవశం చేసుకుందని గుర్తు చేశారు. అలాగే, మార్పు అన్నది అటు కన్యాకుమారి నుంచి, ఇటు ధర్మపురి నుంచి బయలు దేరిందని పేర్కొన్నారు. స్థానాల్లో ప్రత్యామ్నాయ కూటమి గెలుపొందడం నిదర్శనంగా గుర్తు చేశారు. ధర్మపురిలో గెలిచామని, ఈ గెలుపు ప్రభంజనం 2016 ఎన్నికల్లోపు ప్రతిబంబించడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో పీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ జోస్యం చెప్పారు. ఒరిగింది శూన్యం : పీఎంకే యువజన నేత అన్భుమణి రాందాసు ప్రసంగిస్తూ, రాష్ట్రం నుంచి 37 మంది అన్నాడీఎంకే సభ్యులు పార్లమెంట్లో అడుగు పెట్టారని గుర్తు చేశారు. వారి ద్వారా తమిళులకు ఒరిగింది శూన్యమేనన్నారు. పార్లమెంట్లో తమిళుల వాణి ఊసే ఎత్తలేదని విమర్శించారు. తాను ఈలం తమిళుల సమస్యపై ప్రస్తావించడంతో పాటుగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యానని గుర్తు చేశారు. చెన్నై జిల్లాలో ఇంత వరకు పీఎంకే గెలవలేదని, ఈ సారి తప్పని సరిగా ఇక్కడి నుంచి ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం అన్నారు. ఇందు కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు ఇప్పటి నుంచి శ్రమించాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. ఈలం తమిళుల సమస్యను రాజకీయం చేయని ఒకే ఒక నేత రాందాసు మాత్రమేనని, మిగిలిన వాందరూ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. తమిళుల సంక్షేమ నినాదంతో ముందుకెళుతున్న పీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద పీట వేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. -
'మహిళలపై నేరాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం'
మధురై: తమిళనాడు రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవ్వడంపై పీఎంకే మండిపడింది. రాష్ట్రంలో శృతిమించుతున్న నేరాలకు అడ్డుకట్టవేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పీఎంకే అధ్యక్షుడు రాందాసు విమర్శించారు. ప్రత్యేకంగా మహిళలపై అత్యాచారాలు, టీనేజ్ బాలికలపై దుండగుల ఆగడాలు పెట్రేగి పోతున్నా.. జయలలిత ప్రభుత్వం మాత్రం వారిపై కఠిన వైఖరి అవలంభించడం లేదన్నారు. నేషనల్ క్రైం బ్యూరో నివేదిక ప్రకారం చూసినా రాష్ట్రంలో రోజుకో బాలిక మరియు ముగ్గురు మహిళలు లైంగిక వేధింపుల బారిన పడుతున్నారన్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన పునీత అనే అమ్మాయిపై అత్యాచారం-హత్య ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదన్నారు. ఆ ఘటన జరిగిన రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం తరుపున న్యాయవాదిని నియమించడం నిజంగా సిగ్గు చేటన్నారు. గత రెండు రోజుల క్రితం కాలేజీ అమ్మాయిపై నలుగురు అతి పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనతో ప్రభుత్వం అసమర్ధత స్పష్టంగా కనబడుతోందన్నారు. -
అన్నాడీఎంకే, పీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: నాగపట్నం సమీపంలో ఎన్నికల కక్షల కారణంగా అన్నాడీఎంకే, పీఎంకే కార్యకర్తల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఆరుగురు కత్తిపోట్లకు గురయ్యారు. నాగపట్టణం, కొల్లిడం, పాలూరాన్ పడుగైకు చెందిన లండన్ అన్బళగన్ (50). పీఎంకే నాయకుడు ఇతను అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నాయకుడు దయాలన్ (50) మధ్య ఎన్నికలకు సంబంధించి పాత కక్షలు ఉన్నాయి. దయాలన్‌కు చెందిన తాటాకుల కొట్టం బుధవారం రాత్రి నిప్పు అంటుకుని దగ్ధమైంది. దీనికి కారణం అన్బళగన్ అని దయాలన్ అనుమానించాడు. ఈ క్రమంలో దయాలన్ అతని సహోదరుడు శంకర్, బంధువులు, తిరుజ్ఞానం అరుణ్, ప్రభాకరన్, అళగు, కన్నన్, చక్రపాణి మారణాయుధాలు తీసుకుని అన్బళగన్ ఇంటిలోకి చొరబడి అక్కడున్న వస్తువులు ధ్వంసం చేశారు. అన్బళగన్, భార్య కవిత, చెల్లెలు తమిళరసిలపై దాడి చేశారు. ఈ ఘటనలో అన్బళగన్‌కు గాయాలయ్యాయి. అతన్ని పుదుచ్చేరి బిమ్స్ ఆస్పత్రికి తరలించా రు. అన్బళగన్ వర్గం వారు చేసిన దాడిలో ప్రత్యర్థి వర్గానికి చెందిన తిరుజ్ఞానం, శంకర్, అరుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని చిదంబరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై కొల్లిడం పోలీసులు ఇరు వర్గానికి చెందిన 20 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
కూటమి ఖరారు
బీజేపీ జాబితా విడుదల 25 స్థానాలు ఖాయమని పార్టీ ధీమా ఒకే వేదికపై రాజ్‌నాథ్, విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్ చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీలో సీట్ల కేటాయింపులో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి ఎట్టకేలకు కూటమి ఖరారైంది. సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగడంతో అభ్యర్థుల జాబితా గురువారం విడుదలైంది. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడింది. అయితే అదే స్థాయిలో తలనొప్పులకు కారణమైంది. ఎవరికి వారు ప్రతిపక్ష పార్టీలుగా చలామణి అవుతున్న డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మిత్రపక్షాలుగా మారిపోక తప్పలేదు. కూటమి ధర్మం ప్రకారం మిత్రులైనా పాత వైరుధ్యాలను పక్కన పెట్టలేకపోయిన ఆ పార్టీ నేతలంతా సీట్ల కోసం పట్టుపట్టారు. ఒకరు కోరిన స్థానాన్ని మరొకరు కోరడమే కాదు, చివరికి బీజేపీ ఎంచుకున్న స్థానాల కోసం సైతం పట్టుపట్టారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కూటమిలో చేరడానికే ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై సీట్ల కోసం పట్టుబట్టారు. ఒక దశలో కూటమి చీలిపోతుందని, పీఎంకే,కూటమి ఖరారు డీఎండీకేలు వైదొలగిపోతాయనే ప్రచారం జరిగింది. మిత్రులకు నచ్చజెప్పేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర రావు, జాతీయ నేత ఇల గణేశన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 10 రోజుల క్రితమే వెల్లడి కావాల్సిన జాబితా వాయిదాపడుతూనే వచ్చింది. సారొచ్చారు పోలింగ్‌కు నెల రోజులుండగా బీజేపీ కూటమి జాబితాలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్న రాజ్‌నాథ్ వచ్చీ రాగానే మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడ్డారు. విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. స్వల్ప వ్యవధిలోనే అందరి మధ్య సఖ్యత సాధ్యమవుతుందని ఆశించిన రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి మిత్రులు చుక్కలు చూపించారు. సీట్ల ఖరారు చేసుకుని 12 గంటలకు ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో వెల్లడి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. మీడియా వారు అరగంట ముందుగానే అంటే 11.30 గంటలకే చేరుకోగా ప్రతి అరగంటకు ఒకసారి పొడిగిస్తూ వచ్చారు. ఆ తరువాత అందరూ భోజనాలు చేసి రండని ప్రకటించారు. మిత్రులతో చర్చలు కొలిక్కిరాకపోవడమే మీడియా సమావేశం గంటలకొద్దీ వాయిదాకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. సాయంత్రం 4 గంటలు దాటుతుండగా రాజ్‌నాథ్ సింగ్ వచ్చి మీడియాతో మాట్లాడారు. 25 స్థానాల్లో గెలుపు ఖాయం బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏర్పడిన బలమైన కూటమి అభ్యర్థులు 25 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మరో రెండుసార్లు తమిళనాడులో పర్యటిస్తారని చెప్పారు. తమిళనాడు ప్రజల సమస్యలను, ముఖ్యంగా శ్రీలంక, తమిళ జాలర్ల వివాదాన్ని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ పాలనలో ఒక్క తమిళనాడు మాత్రమే కాదు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీరుతాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద కూటమిగా ఏర్పడటం వల్ల మిత్రపక్షాల్లో కొన్ని అసంతృప్తులు సహజమని అన్నారు. అయితే అవన్నీ వైదొలిగాయని, కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి పార్టీ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుందని చెప్పారు. డీఎండీకే 14, బీజేపీ 8, పీఎంకే 8, ఎండీఎంకే 7, ఐజేకే, కేఎండీకే ఒక్కో స్థానం కేటారుుస్తూ జాబితా ఖరారైందని ఆయన తెలిపారు. తమిళనాడు జాబితాను అధికారికంగా ఆయన విడుదల చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన బావమరిది సుదేష్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ రాజ్నాథ్తోపాటూ వేదికకెక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు. -
సీట్లకు పట్టు
సీట్ల పందేరం కమలనాథులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఒక రాజ్యసభతో పాటుగా తమకు పది లోక్‌సభ సీట్లు ఇస్తే దోస్తీకి రెడీ అన్న సంకేతాన్ని పీఎంకే పంపింది. తమకు పట్టున్న స్థానాలకు సైతం మిత్రులు పట్టుబడుతుండటంతో కమలనాథులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమిగా వెళ్లాలంటే ఇలాంటి చిక్కులు తప్పవని బీజేపీ గుర్తించి సర్దుబాటు చేయూలని భావిస్తోంది. సాక్షి, చెన్నై : తమ నేతృత్వంలో కూటమికి బీజేపీ ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ కూటమిలోకి ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడు, మక్కల్ దేశియ కట్చి, పుదియ నిధి కట్చి చేరాయి. పీఎంకే, డీఎండీకేలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. డీఎండీకే తమ చేతికి చిక్కకుండా నాన్చుడు ధోరణి ప్రదర్శించడంతో ఇక ఆ పార్టీతో మంతనాలు ముగించేద్దామన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చా రు. పీఎంకే ఆచితూచి అడుగులు వేసి చివరకు దోస్తీకి రెడీ అవుతోంది. అయితే, సీట్ల పందేరం చిక్కుల్లో పడే వేస్తోంది. రెండు రోజుల క్రితం వండలూరు వేదికగా జరిగిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం కావడంతో కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పవనాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ో తమకు పలాన అంటే, పలాన సీటు కావాలంటూ మిత్రులు పట్టుబడుతుండడంతో కమలనాథులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. సీట్లకు పట్టు: బంధం పదిలం కావడంతో సీట్ల పంపకాలపై బీజేపీ మిత్రులు దృష్టి కేంద్రీ కరించారు. తమకు ఏడంటే ఏడు సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌తో ఎండీఎంకే నేత వైగో చర్చల్లో ఉన్నారు. ఆ సీట్లు ఇచ్చేందుకు సానుకూలత బీజేపీలో ఉన్నా, అందులో కొన్ని స్థానాలు తమకు పట్టున్న నియోజకవర్గాలు కావడంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఐజేకే ఏకంగా ఐదు సీట్లను కోరుతుండటం కమలనాథుల్ని విస్మయంలో పడేసినట్టు సమాచారం. ఈ పార్టీ నేత, ఎస్ఆర్ఎం అధినేత పచ్చముత్తు పారివేందన్కు ఆర్థిక బలం ఉన్నా, ఐదు సీట్లు ఆశించడంపై పెదవి విరుస్తున్నారు. ఆ పార్టీకి ఐదు సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కొంగునాడు తదితర పార్టీలు తలా రెండు సీట్లు ఆశిస్తున్నా, పీఎంకే పది సీట్లను, ఒక రాజ్య సభ సీటును కోరుతుండటం కమలనాథులను ఉక్కిరి బిక్కి రి చేస్తున్నట్టు సమాచారం. తాము పన్నెండు లేదా, పదమూడు సీట్లలో పోటీకి ముందుగానే నిర్ణయం తీసుకున్నా, మిత్రుల పట్టుతో తమ సీట్లకు గండి పడే ప్రమాదం ఉందన్న ఆందోళనను బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టున్న స్థానాల మీదే మిత్రులు కన్నేసి ఉండటంతో వారికి నచ్చ చెప్పేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సీట్ల పందేరం ఎక్కడ బెడిసి కొడుతుందో, ఇది కూటమి మీద ఎక్కడ ప్రభా వం చూపుతుందోనన్న ఆందోళన సైతం కమలనాథులు వెంటాడుతుండటం గమనార్హం. నాగర్ కోవిల్ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, దక్షిణ చెన్నై నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వానతీ శ్రీనివాసన్, అరక్కోణం నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు చక్రవర్తి పోటీకి ఉత్సాహాన్ని చూపుతున్నట్టు కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. -
పీఎంకే షాడో బడ్జెట్
సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యల్ని తీసుకెళుతూ పీఎంకే షాడో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేయాలని డిమాం డ్ చేస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించారు. దీన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు సోమవారం విడుదల చేశా రు. పొత్తుకు ఇంకా సమయం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్‌ను దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని దాఖలుకు ముందుగా పీఎంకే షాడో బడ్జెట్‌ను విడుదల చేస్తోంది. అందులో ప్రజా సమస్యలు, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, కొత్త అంశాల్ని విశదీకరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 13న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో తమ షాడో బడ్జెట్‌ను పీఎంకే విడుదల చేసింది. చెన్నై ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన సమావేశంలో షాడో బడ్జెట్‌ను రాందాసు విడుదల చేశారు. బడ్జెట్లోని అంశాల గురించి ఆయన వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో తాము సరికొత్త నిర్ణయాలతో బడ్జెట్లో కేటాయింపులు చేశామన్నారు. జాతీయ స్థాయి విద్యా బోధనలు, టెట్ రద్దు, తాత్కాలిక ఉద్యోగుల పర్మినెంట్ తదితర అంశాల్ని వివరించామని పేర్కొన్నారు. విద్యకు రూ.30 వేల కోట్లు కేటాయించాలన్న డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామన్నారు. అలాగే ఆరోగ్య సేవలు మెరుగుపరచడమే లక్ష్యంగా రూ.18 వేల కోట్లు, వ్యవసాయానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక్కో పంచాయతీకి ఒక్కో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి ఇవ్వాలని, దీనిని ఆయూ గ్రామాల్లో రైతుల అవసరాలకు ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉచితంగా ఎరువులు, విత్తనాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మద్య నిషేధం, అవినీతి నిర్మూలన, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులపై విచారణకు ఐఏఎస్ అధికారిని నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కోరారు. మదు రై, కోయంబత్తూరు, తిరుచ్చిలో మెట్రో రైలు పనులు చేపట్టాలని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల నిధి రూ. 3 కోట్లకు పెంచాలని, పదవీ విరమణ రోజే సంబంధిత ఉద్యోగికి అన్ని రకాల సెటిల్మెంట్లు పూర్తి చేయాలని కోరామన్నారు. ఈ షాడో బడ్జెట్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నామని తెలిపారు. సమయం ఉంది పొత్తు గురించి సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇంకా సమయం ఉందని, సరైన సమయంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఇది వరకు పది మంది అభ్యర్థులతో చిట్టాను ప్రకటించామని, ఆ స్థానాల బరిలో తాము పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు గాలాలు వేయడం సాధారణమని, అందులో భాగంగా తాము వేచి ఉన్నామంటూ బీజేపీతో పొత్తుపై సంధించిన ప్రశ్నకు పరోక్ష వ్యాఖ్య చేశారు. పొత్తు కుదిరిందా..? అని ప్రశ్నించగా ఈ విషయూన్ని బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌ను అడగాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీఎంకే నాయకులు జీకే మణి, అరుణ్, ధనపాలన్, రాం ముత్తుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పది లక్షలు లక్ష్యం
నరేంద్ర మోడీ మహానాడుకు పది లక్షల మంది సమీకరణ లక్ష్యంగా కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. వినూత్న రీతిలో ప్రచార సీడీలు రూపొందించారు. మహానాడు దిగ్విజయవంతానికి సన్నాహాలు శరవేగంగా సాగుతున్నా, పొత్తుల వ్యవహారం తేలేనా అన్న ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం మరో విడతగా పీఎంకే, డీఎండీకే శ్రేణులతో చర్చకు సన్నాహాల్లో ఉన్నారు. మహానాడుకు బస్సుల్లో మాత్రం జనాన్ని తరలించొద్దంటూ రవాణా శాఖ హుకుం జారీ చేసింది.స సాక్షి, చెన్నై : రాష్ట్రంలో తమ సత్తా చాటుకోవడం లక్ష్యంగా కమలనాథులు కసరత్తుల్లో ఉన్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా మెగా కూటమికి వ్యూహ రచనలు చేస్తున్నా, ఫలితం శూన్యం. ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడు పార్టీలు కలసి వచ్చి నా, ప్రధాన ప్రతి పక్షం డీఎండీకే, వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన పీఎంకేలు మాత్రం మెట్టు దిగడం లేదు. ఈ రెండు పార్టీల్ని తమ వెంట తిప్పుకుని, మోడీ నేతృత్వంలో శనివారం జరిగే మహానాడులో కూటమి ని ప్రకటించేందుకు కమలనాథులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించకుండా, దాట వేత ధోరణితో ముందుకెళ్తోంటే, పీఎంకే వర్గాలు అదిగో పొత్తు, ఇదిగో సీట్లు అన్నట్టు కాలయాపన చేస్తుండటం కమలనాథుల్లో ఆందోళనరేకెత్తిస్తున్నది. ఒక్క రోజే గడవు: మోడీ నేతృత్వంలో వండలూరు వేదికగా జరిగే మహానాడుకు శుక్రవారం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆ రెండు పార్టీలతో మలి విడతగా చర్చలు జరపడంతో పాటుగా, భారీ జన సమీకరణ లక్ష్యంగా కమలం కూటమి కసరత్తుల్లో పడింది. ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడుతో కలసి కమలనాథులు మహానాడు సక్సెస్‌కు పరుగులు తీస్తున్నారు. వంద ఎకరాల స్థలంలో జరుగుతున్న మహానాడుకు కనీసం రాష్ర్ట వ్యాప్తంగా పది లక్షల మందిని తరలించాలని కమలనాథులు కంకణం కట్టుకున్నారు. ఆయా జిల్లాల నుంచి చెన్నై వైపుగా వచ్చే వాహనాల్ని తరలించేందుకు అధికారుల అనుమతులు పొందే పనిలో పడ్డారు. వ్యాన్లు, కార్లకు అనుమతి ఇస్తున్న అధికారులు, బస్సులకు బ్రేక్ వేయడానికి నిర్ణయించారు. మహానాడు వేదిక జాతీయ రహదారిలో ఉండటం, రాజధాని నగర ప్రవేశ మార్గంలో వేదిక ఉండటంతో బస్సులను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. వ్యాన్లు, కార్లను పార్కింగ్ చేయడానికి ఎస్ఆర్ఎం వర్సిటీ పరిసరాలు, వండలూరు పరిసరాల్లో స్థలాలు ఉన్నా, బస్సుల్ని నిలపడం కష్టతరం అన్న విషయాన్ని అధికారులు గ్రహించారు. దీంతో బస్సుల్లో జనాన్ని తరలించేందుకు వీలు లేదంటూ రవాణా శాఖ అధికారులు నిరాకరించడం కమలనాథుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. బస్సుల్లో అరవై మందికి పైగా తరలించేందుకు వీలుండటంతో, ఎక్కడ జన సమీకరణకు అధికారుల ఆంక్షలు అడ్డు తగులుతాయోనన్న బెంగ వెంటాడుతోంది. మోడీ సభకు, మోడీ పర్యటించే ప్రాంతాల్లో కనివినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. ప్రచార సీడీ: గుజరాత్లో మోడీ అభివృద్ధి గాథ, పీఎం పదవికి ఆయన అర్హుడేనని వివరిస్తూ పలు ప్రచార గీతాల్ని తిరువళ్లూరుకు చెందిన బీజేపీ నేతలు సిద్ధం చేశారు. ఈ ప్రచార సీడీలు గురువారం కమలాలయంలో విడుదల చేశారు. తొలి సీడీని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ విడుదల చేయగా, సీనియర్ నాయకుడు ఇల గణేశన్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా నాయకుడు తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. కొంగునాడు నేత ఈశ్వరన్ బీజేపీ శ్రేణుల్ని కలుసుకున్నారు. మహానాడులో జన సమీకరణ, ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మీడియాతో పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, కూటమిలోకి వచ్చే పార్టీలకు తాము ఎలాంటి నిబంధనలు పెట్టలేదని స్పష్టం చేశారు. డీఎండీకే, పీఎంకేలు తమ కూటమిలోకి వస్తాయన్న ఆశాభావంతో ఎదురు చూస్తున్నామన్నారు. మరో మారు ఆ పార్టీ వర్గాలతో చర్చించేందుకు సిద్ధం అవుతున్నామని పేర్కొన్నారు. -
తమిళనాడులో కూటమిగా ఏర్పడ్డ సీపీఐ,అన్నాడీఎంకే
-
బహిష్కరణ!
అసెంబ్లీ సమావేశాన్ని శనివారం డీఎంకే, డీఎండీకే, పీఎంకేలు బహిష్కరించాయి. సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ గురించి మాట్లాడేందుకు సభలో అనుమతినిస్తారా? అంటూ స్పీకర్ ధనపాల్‌ను డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం రాష్ర్ట గవర్నర్ రోశయ్య ప్రసంగాన్ని డీఎంకే బహిష్కరించింది. శుక్రవారం వాగ్యుద్ధాల నడమ సభ రసాభాసగా సాగింది. శనివారం సమావేశం సజావుగా సాగినా, డీఎంకే, డీఎండీకే, పీఎంకేలు బహిష్కరించాయి. తొలి రోజు నుంచి పీఎంకే ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. మహానాడు బిజీతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని డీఎండీకే ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం అసెం బ్లీకి డీఎంకే సభ్యులందరూ హాజరయ్యారు. ఉదయా న్నే స్టాలిన్ నేతృత్వంలో అందరూ సభ్యులు అసెంబ్లీ వద్దకు రావడంతో సభ వాడీవేడిగా సాగడం ఖాయం అని సర్వత్రా ఎదురు చూశారు. అయితే, అసెంబ్లీ సమావేశ మందిరంలోకి అడుగు పెట్టకుండానే డీఎంకే సభ్యులు బయటకు వచ్చేశారు. తాము అసెంబ్లీని బహిష్కరించామని, సోమవారం కూడా ఇదే పంథాను అనుసరించనున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంకే స్టాలిన్ స్పీకర్ ధనపాల్కు సవాల్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. జయ,శశిపై చర్చకు అవకాశం ఇస్తారా? అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. శుక్రవారం నాటి సమావేశంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ తన ప్రసంగంలో డీఎంకేపై, తమ అధినేత కరుణానిధిపై విరుచుకు పడ్డారని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని తాము పట్టుబట్టినా, స్పీకర్ ఖాతరు చేయలేదని ధ్వజమెత్తారు. తమను తిట్టి పోయడానికి మాత్రం స్పీకర్ అనుమతులు ఇచ్చేస్తారని, అదే ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతి పక్షాల గళాన్ని మాత్రం నొక్కేస్తారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు మాట్లాడితే గొం తు నొక్కేస్తున్నారుగా! అందువలన ఇతర అంశాలపై మాట్లాడేందుకు తాము సిద్ధంగా నే ఉన్నామన్నారు. ఇందుకు అనుమతి ఇస్తారా? అని స్పీకర్ ధనపాల్‌ను సవాల్ చేస్తూ నాలుగు ప్రశ్నలు సంధించారు. ప్రశ్నలు: తమ పార్టీ, తమ నేత గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి నప్పుడు, సీఎం జయలలిత, ఆమె నెచ్చిలి శశికళ గురించి చర్చించేందుకు అవకాశం ఇస్తారా? శశికళ, వారి బంధువుల వల్ల తనకు ప్రాణహాని ఉందని సీఎం జయలలిత ఇది వరకు పేర్కొన్నారని, శశికళను పోయెస్ గార్డెన్ నుంచి గెంటేసిన విషయం అని గుర్తు చేశారు. ఇప్పుడు ఆమెను మళ్లీ పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కించారు. దీనిపై మాట్లాడుకునే అవకాశం ఇస్తారా? ఓ మీడియాతో ఇది వరకు మాట్లాడిన సీఎం జయలలిత, తెలుగు నటుడు శోభన్ బాబు గురించిన ప్రస్తావన తెచ్చారని గుర్తు చేస్తూ... దీనిపై చర్చించుకునేందుకు అవకాశం ఇస్తారా? ఎంజీయార్‌కు వ్యతిరేకంగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి జయలలిత ఓ లేఖ రాశారని గుర్తు చేశారు. ఎంజీయార్ మృతికి కారణం ఆయన సతీమణి అంటూ గతంలో పేర్కొన్నారని, వీటిపై అసెంబ్లీ వేదికగా మాట్లాడుకుందామా? చెప్పండి అంటూ స్పీకర్‌కు సవాల్ విసిరారు. పుదియ తమిళగం, మనిదనేయ మక్కల్ కట్చి ఎమ్మెల్యే సైతం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. -
ఒంటరేనా?
సాక్షి, చెన్నై :గతం నేర్పిన గుణపాఠంతో ద్రవిడ పార్టీలకు దూరంగా ఉండేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇక తమది ఒంటరి సమ రం అని చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో తన నేతృత్వంలో సమూహ జననాయగ కూట్టని (సోషియల్ డెమోక్రటిక్ అలయన్స్)ను అక్టోబరులో ప్రకటించారు. తమ కూటమిలో పోటీ చేయనున్న పదిహేను మంది అభ్యర్థుల చిట్టాను తొలి విడతగా విడుదల చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించే కార్యక్రమా ల్ని వేగవంతం చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు పీఎంకే నిర్ణయించింది. దీంతో బీజేపీతో జత కట్టేందుకు మంతనాలు జరుగుతున్నట్టు, సీట్ల పందేరం ఒప్పందాలు ముగిసినట్టుగా ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారానికి బ్రేక్ వేస్తూ బుధవారం జరిగిన పీఎంకే సర్వసభ్య సమావేశంలో పార్టీ నాయకుల ద్వారా రాందాసు ప్రతిజ్ఞ చేయించడం గమనార్హం. సర్వ సభ్యసమావేశం: కామరాజర్ అరంగంలో ఉదయం సర్వ సభ్య సమావేశం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పీఎంకే వర్గాలు తరలి రావడంతో ఆ పరిసరాలు కోలాహలంతో నిండాయి. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, అధ్యక్షుడు జికే మణి, యువజన నేత అన్బుమణి రాందాసు, వన్నియర్ సంఘం నేత కాడు వెట్టి గురు, పార్టీ సీనియర్లు ఏకే మూర్తి తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల్ని రాందాసు స్వీకరించారు. కొందరు బీజేపీతో జత కడుదామని అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కూటమి అన్నది పార్టీ నేతృత్వంలోనే ఉంది కదా..! అన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరికొందరు సర్వ సభ్య సమావేశం దృష్టికి తెచ్చారు. ఝలక్: అభిప్రాయ సేకరణానంతరం ప్రసంగించిన రాందాసు, కేంద్రంలో ఏర్పడ బోయే ప్రభుత్వానికి పీఎంకే మద్దతు తప్పని సరి అని, ఆ కేబినెట్లో పీఎంకేకు చోటు దక్కుతుందని పేర్కొనడం విశేషం. తమ మద్దతు కోసం మరొకరు ఎదురు చూడాలే గానీ, ఇతరుల మద్దతు కోసం తాము ఎదురు చూడాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీకి ఝలక్‌లు ఇచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. చివరగా 17 తీర్మానాలు చేశారు. సమూహ జననాయగ కూట్టని అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని, శ్రమిస్తామని నినదిస్తూ అందరి చేత పార్టీ అధ్యక్షుడు జికే మణి ప్రతిజ్ఞ చేయించడం గమనార్హం. అయితే, ఈ ప్రతిజ్ఞ వెనుక ఆంతర్యం ఉందని పలువురు పీఎంకే నేతలు పేర్కొంటున్నారు. సీట్ల పందేరంలో బీజేపీ పట్టు వీడని దృష్ట్యా, వారికి ఝలక్ ఇవ్వడం లక్ష్యంగా ఈ ప్రతిజ్ఞ ఉండొచ్చంటున్నారు. అయితే, చివరి క్షణంలో మళ్లీ పునఃసమీక్ష జరిగేనా లేదా ఎస్డీఏ బరిలోకి దిగేనా, బీజేపీతో జత కట్టేనా..? అన్నది ఎన్నికల నాటి వరకు వేచి చూడాల్సిందే.తీర్మానాలు: అక్టోబరులో ప్రకటించిన మేరకు సమూహ జననాయగ కూట్టని అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలి. జాలర్లపై, ఈలం తమిళులపై శ్రీలంక పైశాచికత్వానికి నిరసన తెలుపుతూ తీర్మానం. రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణింపుపై ఆగ్రహం, విద్యుత్ కోతలపై మండి పాటు, ధరల పెంపుపై ఖండన. ఇసుక, గ్రానైట్ కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్. మద్య నిషేధం లక్ష్యంగా ఉద్యమం ఉధృతం. ఎస్సీ, ఎస్టీ చట్టంలో సవరణలకు డిమాండ్ వంటి తీర్మానాలు చేశారు. -
బీజేపీ కొత్త కూటమి
చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల కోసం అన్ని పార్టీల్లో కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొత్త కూటమి ఏర్పాటుకు తెరలేపింది. వైగో నాయకత్వంలోని ఎండీఎంకే, డాక్టర్ రాందాస్ నేతృత్వంలోని పీఎంకేతో పొత్తు ఖరారైనట్లు వార్తలు అందాయి. రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ తిరుచ్చిలో నరేంద్ర మోడీ సభ, ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో విజయబావుటా ఎగురవేసిన తర్వాత పుంజుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అనేక ప్రాంతీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించినా వామపక్షాలు జతకలిసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. 2జీ స్పెక్ట్రం కేసు, శ్రీలంకలో ఈలం తమిళుల సమస్య తదితరాలతో కాంగ్రెస్‌కు దూరమైన డీఎంకే బీజేపీకి స్నేహ హస్తం ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిలో ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 12వ తేదీన ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ ఉన్నత స్థాయి సమావేశంలో తమిళనాడులో పొత్తుల అంశంపై ప్రధానంగా చర్చ చేపట్టారు. ఇందులో పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, అగ్రనేత అద్వానీ, మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కారి, అరుణ్‌జెట్లీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీఎంకే, పీఎంకేలతో పొత్తు ఖరారైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు సైతం బీజేపీ ఆహ్వానం పలుకుతోందని ఆ సమావేశం ప్రకటించింది. తమిళనాడుకు చెందిన ఒక ప్రాంతీయ పార్టీ నేత ఢిల్లీలో కొత్త పొత్తుల పనిలో మునిగితేలుతున్నట్లు సమాచారం. ఆయన చొరవతోనే బీజేపీ ఈ కొత్త పొత్తుల నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. బీజేపీ కోశాధికారి ఖండన ఢిల్లీ సమావేశంలో తీసుకున్నట్లుగా చెబుతున్న ప్రాంతీయ పొత్తులను బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎస్ఆర్ శేఖర్ శుక్రవారం ఖండించారు. పొత్తులపై తమిళ మీడియాలో వచ్చిన కథనాలపై సాక్షి వివరణ కోరగా పొత్తులపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఎండీఎంకే, పీఎంకేలతో పొత్తు ఖరారైనట్లు రాష్ట్ర శాఖకు సమాచారం లేదన్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా అనేక పార్టీలతో చర్చలు జరపడం సహజమని, అంతమాత్రాన పొత్తు కుదిరినట్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు. -
15 స్థానాల్లో పోటీ
లోక్‌సభ ఎన్నికలు తమకు చావోరేవో కావడంతో గెలుపు లక్ష్యంగా పీఎంకే కుస్తీలు పడుతోంది. తమకు పట్టున్న 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు నిర్ణయించింది. ఇతర పార్టీల కన్నా ముందుగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే దిశగా జాబితా సిద్ధం చేస్తోంది. సాక్షి, చెన్నై: గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే ఘోర పరాజయం పాలైంది. ఎన్నికల్లో తరచూ కూటములను మార్చడమే ఈ పరిస్థికి కారణమనే వాదన వినిపించింది. దీంతో ఇకపై ఏ కూటమిలోకీ వెళ్లమని, ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని పీఎంకే అధినేత రాందాస్ ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాల్లో తలమునకలయ్యూరు. ఇతర పార్టీల కన్నా ముందుగానే ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల జాబితానూ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడే పోటీ ఇది వరకు అసెంబ్లీ, స్థానిక సంస్థల వారీగా వచ్చిన ఓట్లను ఆధారంగా చేసుకుని పదిహేను లోక్‌సభ నియోజకవర్గాల బరిలో అభ్యర్థుల్ని దించేందుకు రాందాసు నిర్ణయించారు. ఇందులో ఉత్తర చెన్నై, శ్రీ పెరంబదూరు, తిరువళ్లూరు, చిదంబరం, కంచి, విల్లుపురం, ధర్మపురి, కృష్ణగిరి, ఆరణి, తిరువణ్ణామలై, కడలూరు, కళ్లకురిచ్చి, అరక్కోణం తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ బరిలోకి దిగబోయే అభ్యర్థుల జాబితాను తయూరు చేయడంలో రాందాస్ బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాల్లోని పార్టీ సీనియర్ల సహకారం తీసుకుంటున్నారు. ఆయూ నియోజకవర్గాల్లో ఆర్థికంగా పట్టున్న, జనాదరణ కలిగిన నేతల వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెలాఖరులోపు అభ్యర్థుల పేర్లను ప్రకటించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. విజయమే లక్ష్యం లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలుపుతో తమ సత్తా చాటుతామని రాందాసు ధీమా వ్యక్తం చేశారు. చెన్నై నగరంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమానికి రాందాసు హాజరయ్యారు. ఆయన మీడియూతో మాట్లాడుతూ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇక తమ పార్టీ పయనం సాగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా కార్యాచరణ రూపొం దించామని వెల్లడించారు. ముందుగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన రాందాసు ప్రేమ పవిత్రమైందన్నారు. ప్రేమ ముసుగులో సాగుతోన్న మోసం, అన్యాయూన్నే తాను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. గృహ హింసా చట్టంలో సవరణలు చేయాలని కోరారు.