బీజేపీ జాబితా విడుదల
25 స్థానాలు ఖాయమని పార్టీ ధీమా
ఒకే వేదికపై రాజ్‌నాథ్, విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్
చెన్నై, సాక్షి ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీలో సీట్ల కేటాయింపులో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి ఎట్టకేలకు కూటమి ఖరారైంది. సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగడంతో అభ్యర్థుల జాబితా గురువారం విడుదలైంది. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడింది.
అయితే అదే స్థాయిలో తలనొప్పులకు కారణమైంది. ఎవరికి వారు ప్రతిపక్ష పార్టీలుగా చలామణి అవుతున్న డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మిత్రపక్షాలుగా మారిపోక తప్పలేదు. కూటమి ధర్మం ప్రకారం మిత్రులైనా పాత వైరుధ్యాలను పక్కన పెట్టలేకపోయిన ఆ పార్టీ నేతలంతా సీట్ల కోసం పట్టుపట్టారు.
ఒకరు కోరిన స్థానాన్ని మరొకరు కోరడమే కాదు, చివరికి బీజేపీ ఎంచుకున్న స్థానాల కోసం సైతం పట్టుపట్టారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కూటమిలో చేరడానికే ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై సీట్ల కోసం పట్టుబట్టారు. ఒక దశలో కూటమి చీలిపోతుందని, పీఎంకే,కూటమి ఖరారు డీఎండీకేలు వైదొలగిపోతాయనే ప్రచారం జరిగింది.
మిత్రులకు నచ్చజెప్పేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర రావు, జాతీయ నేత ఇల గణేశన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 10 రోజుల క్రితమే వెల్లడి కావాల్సిన జాబితా వాయిదాపడుతూనే వచ్చింది.
సారొచ్చారు
పోలింగ్‌కు నెల రోజులుండగా బీజేపీ కూటమి జాబితాలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్న రాజ్‌నాథ్ వచ్చీ రాగానే మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడ్డారు. విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. స్వల్ప వ్యవధిలోనే అందరి మధ్య సఖ్యత సాధ్యమవుతుందని ఆశించిన రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి మిత్రులు చుక్కలు చూపించారు.
సీట్ల ఖరారు చేసుకుని 12 గంటలకు ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో వెల్లడి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. మీడియా వారు అరగంట ముందుగానే అంటే 11.30 గంటలకే చేరుకోగా ప్రతి అరగంటకు ఒకసారి పొడిగిస్తూ వచ్చారు. ఆ తరువాత అందరూ భోజనాలు చేసి రండని ప్రకటించారు. మిత్రులతో చర్చలు కొలిక్కిరాకపోవడమే మీడియా సమావేశం గంటలకొద్దీ వాయిదాకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. సాయంత్రం 4 గంటలు దాటుతుండగా రాజ్‌నాథ్ సింగ్ వచ్చి మీడియాతో మాట్లాడారు.
25 స్థానాల్లో గెలుపు ఖాయం
బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏర్పడిన బలమైన కూటమి అభ్యర్థులు 25 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మరో రెండుసార్లు తమిళనాడులో పర్యటిస్తారని చెప్పారు. తమిళనాడు ప్రజల సమస్యలను, ముఖ్యంగా శ్రీలంక, తమిళ జాలర్ల వివాదాన్ని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఎన్‌డీఏ అధికారంలోకి రాగానే ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు.
బీజేపీ పాలనలో ఒక్క తమిళనాడు మాత్రమే కాదు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీరుతాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద కూటమిగా ఏర్పడటం వల్ల మిత్రపక్షాల్లో కొన్ని అసంతృప్తులు సహజమని అన్నారు. అయితే అవన్నీ వైదొలిగాయని, కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి పార్టీ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుందని చెప్పారు.
డీఎండీకే 14, బీజేపీ 8, పీఎంకే 8, ఎండీఎంకే 7, ఐజేకే, కేఎండీకే ఒక్కో స్థానం కేటారుుస్తూ జాబితా ఖరారైందని ఆయన తెలిపారు. తమిళనాడు జాబితాను అధికారికంగా ఆయన విడుదల చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన బావమరిది సుదేష్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ రాజ్‌నాథ్‌తోపాటూ వేదికకెక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు.