MDMK
-
TN: పురుగుల మందు తాగిన ఎంపీ కన్నుమూత
చెన్నై: లోక్‌సభ ఎన్నికల కోసం ఆ సిట్టింగ్ ఎంపీకి సీటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. అయినా మృత్యువు ఆయన్ని వదల్లేదు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) పార్టీ ఎంపీ గణేశమూర్తి గురువారం ఉదయం 5.05 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మార్చి 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. #UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2 — ANI (@ANI) March 28, 2024 డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించక పోవడంతో మనస్తాపం చెందారాయన. పరుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆయన గురువారం ఉదయం కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతి చెందారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి గణేశమూర్తి డీఎంకే టికెట్‌పై గెలుపొందారు. ఆయన మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్‌కు పిలుపు ఇచ్చారు. రాజకీయ నేపథ్యం: 1947 జూన్‌లో జన్మించిన గణేశమూర్తి.. 1993 నుంచి ఎండీఎంకే పార్టీలోనే ఉన్నారు. ఆయన 1998లో తొలిసారి పళని పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. దీంతో ఇక్కడ దాదాపు 2 లక్షల భారీ మేజార్టీతో గెలుపొందారు. -
రేపే నామినేషన్; ఏడాది జైలు, జరిమానా!
చెన్నై : రాజద్రోహం కేసులో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే) చీఫ్ వైగోనకు చెన్నై కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జె. శాంతి ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా శనివారం రాజ్యసభ సభ్యత్వానికై నామినేషన్ వేసేందుకు వైగో సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఆయనను ఇరకాటంలో పడేసింది. అయితే ప్రజాప్రతినిధి చట్టం- 1951లో రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్లు లేవు కాబట్టి వైగో నామినేషన్ వేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా 2009లో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా వైగో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈలంకు ఏమైంది’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటం ఆపకపోయినట్లైతే భారత్ ఒక్కటిగా కలిసి ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైగోపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2017లో అరెస్టైన ఆయన నెలరోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ఇక 1978 నుంచి 1996 మధ్య కాలంలో వైగో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ.. దాదాపు 23 ఏళ్ల తర్వాత డీఎంకే మద్దతుతో పెద్దల సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూలై 18న తమిళనాడులో ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం. -
బీజేపీ మహిళా కార్యకర్తపై దాడి
-
మహిళా కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి!
సాక్షి, చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనకు నిరసన తెలుపుతున్న ఎండిఎంకె కార్యకర్తలు విచక్షణారహితంగా ప్రవర్తించారు. మోదీ పర్యటనకు నిరసన తెలుపుతున్న సమయంలో బీజేపీ కార్యకర్త శశికళపై కర్రలతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన శశికళను ఆసుపత్రికి తరలించారు. నిరసన తెలుపుతున్న ఎండిఎంకె కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతల నడుమ తిరుపూర్‌లో మోదీ పర్యటిస్తున్నారు. -
సత్యజిత్రేలా ఉంది!
తమిళసినిమా: సత్యజిత్‌రే చిత్రం చూస్తున్నట్లు అనిపించిందని ఎండీఎంకే నేత వైగో ఒరు కుప్పై కథైపై ప్రశంసల వర్షం కురిపించారు. నవ దర్శకుడు కాళీ రంగస్వామి దర్శకత్వంలో అస్లామ్ నిర్మించిన చిత్రం ఒరు కుప్పై కథై. నృత్య దర్శకుడు దినేశ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో నటి మనీషా యాదవ్ కథానాయకిగా నటించింది. గత వారం తెరపైకి వచ్చిన ఒరు కుప్పై కథై చిత్రాన్ని ఎండీఎంకే నేత వైగో ఇటీవల తిలకించారు. అనంతరం ఆయన చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఒరు కుప్పై కథై చిత్రాన్ని అందరూ, ముఖ్యంగా మహిళలు చూడాలన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడడం, వివాహేతర సంబంధం కారణంగా భార్య హత్య, ఈ కాలంలో భర్తను కొట్టి చంపిన భార్య లాంటి వార్తలు చదువుతుంటే వేదన కలుగుతోందన్నారు. 50 ఏళ్ల క్రితం ఇలా ఉండేది కాదన్నారు. సాయం చేయడమే ఎరిగిన దేశం మనదన్నారు. ఈ సమాజంలో బయట పడని అంతరంగ ఆపదలు ఎలా జరుగుతున్నాయన్నది ఎక్కడా అసహనానికి గురి కాకుండా ఒరు కుప్పై కథై చిత్రంలో దర్శకుడు కాళీ రంగస్వామి అద్భుతంగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా ఆయన చాలా మంచి సందేశాన్ని చెప్పారన్నారు. మనం సమాజంలో సంసార జీవితాన్ని ఎలా సాగించాలి, ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అన్న విషయాలను చక్కగా చెప్పారన్నారు. భర్త ధనవంతుడైనా సమాజంలోని పరిస్థితుల గురించి అవగాహన లేకుంటే ఎంత కష్టం అన్ని విషయాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దర్శకుడు కాళీ రంగస్వామి ఇంత మంచి చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం అన్నారు. చిత్రంలో నటీనటులు నటించలేదని, పాత్రకు ప్రాణం పోశారని అన్నారు. ఈ చిత్రంలో చూపించిన ప్రాంతాలను చూసి ఏంటి ఇలా ఉంది అని తొలుత అనిపించినా నిజానికి అదే జీవితం. అయితే మరో జీవితం కూడా చిత్రంలో చూపించారు. నక్షత్ర హోటళ్లు, ఆడంబర జీవితాలు ఉంటాయన్నారు. అయితే మురికి వాడలు, అక్కడి ప్రజల జీవితాలు ఉన్నయే అవే వాస్తవం అన్నారు. దర్శకుడు సత్యజిత్‌రే తన చిత్రాల్లో ఇలాంటి విషయాలను తెరపై ఆవిష్కరించే పలు అవార్డులను అందుకున్నారన్నారు. ఈ ఒరు కుప్పైకథైకి అవార్డులు రాకపోయినా ప్రజలు చూసి ఆదరించాలన్నారు. -
కూటమికి షాకిచ్చిన వైగో
చెన్నై: ఎండీఎంకే చీఫ్ వైగో తాజాగా ప్రజాసంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్)కి షాక్ ఇచ్చారు. కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు. కూటమిలోని కొన్ని పార్టీలతో తమ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ పార్టీ హైలెవల్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వైకో తెలిపారు. కూటమి కన్వీనర్ గా ఉన్న వైగోనే ఏకంగా తప్పుకోవడంతో పీడబ్ల్యూఎఫ్ భవిష్యత్తు ఏమిటన్నది అగమ్యగోచరంగా మారింది. మిగతా పార్టీలైనా కూటమిలో కొనసాగుతాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిముందే భారీ అంచనాలతో ప్రజాసంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్) ఏర్పడింది. విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూడా కూటమితో జతకలువడంతో అన్నాడీఎంకే, డీఎంకేకు గట్టి ప్రత్నామ్నాయం అన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే, ఎన్నికల్లో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కూటమి గెలువలేకపోయింది. -
సంక్షేమ కూటమిలో తమాకా
ఎన్నికల పొత్తుపై ఎన్నోపార్టీలతో తర్జన భర్జనలు పడిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) ఎట్టకేలకు ప్రజా సంక్షేమ కూటమిలో చేరింది. తమాకా అధ్యక్షుడు జీకే వాసన్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరినట్లు ఎండీఎంకే అధినేత వైగో ఆదివారం అధికారికంగా ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్ని పార్టీలు ఏదో ఒక పంచన చేరిపోగా తమాకా వైఖరి ఏమిటో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. ఎక్కువ శాతం మంది ఊహించినట్లుగానే అన్నాడీఎంకేతో పొత్తు చర్చలు సాగాయి. ఎంతో వేగంగా, గోప్యంగా తెరవెనుక సాగిన చర్చలు అంతే వేగంగా బైటకు వచ్చాయి. తమాకా అధినేత కోరినన్ని సీట్లు దక్కకపోవడం, అదికూడా రెండాకుల గుర్తుపై పోటీచేయాలని జయలలిత విధించిన షరతుకు జీకే వాసన్ తలొగ్గలేదు. సీట్ల సంఖ్యను తగ్గించేందుకైనా సుముఖంగా ఉండిన జీకే వాసన్ తమ పార్టీ ఎన్నికల గుర్తై కొబ్బరితోపుపై కాకుండా రెండాకుల గుర్తుపై పోటీచేయడం తమ పార్టీ ఉనికికే భంగకరమని భావించారు. మరో రెండువారాల్లో నామినేషన్లు ప్రారంభం కానుండగా ఇంతవరకు కూటమి ఖరారు కాలేదని తమాకా శ్రేణులు సైతం అసహనం ప్రకటించాయి. ఇదిగో అదిగో అంటూ దాటవేసిన జీకే వాసన్ శనివారం ఉదయం సైతం మీడియా అడిగిన ప్రశ్నలను దాటవేశారు. మధ్యాహ్నం సమయానికి బహిరంగ ప్రకటన ఖాయమని చెప్పారు. సంక్షేమ కూటమిలో సందడి ః సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జీకే వాసన్ తన అనుచర వర్గంతో ప్రజాసంక్షేమ కూటమి కార్యాలయంగా ఉన్న కోయంబేడులోని డీఎండీకే ఊరేగింపుగా చేరుకోవడం ద్వారా తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చిన జీకే వాసన్‌కు సంక్షేమ కూటమి సారధి, ఎండీఎంకే అధినేత వైగో స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఎండీఎంకే అధినేత విజయకాంత్, ఇతర మిత్రపక్షాలు జీకేవాసన్ను స్వాగతించారు. కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకున నేతలు ఆ తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. సంక్షేమ కూటమిలో తమాకా చేరినట్లుగా వైగో ప్రకటించారు. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎండీకే 104, ఎండీఎంకే 29, తమాకా 26 సీపీఐ, సీపీఎం, వీసీకే తలా 25 స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. సంక్షేమ కూటమిలో చేరినపుడు డీఎండీకేకు 124 సీట్లు కేటాయించగా, తమాకా ప్రవేశంతో ఆ సీట్ల సంఖ్య 104కు తగ్గింది. అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలంటూ తమిళనాడు ప్రజల 50 ఏళ్ల కోర్కె ఈ ఎన్నికల్లో నెరవేరనుందని జీకేవాసన్ పేర్కొన్నారు. సంక్షేమ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా విజయకాంత్ ఖాయమని వైగో అన్నారు. తమాకా కూటమి ఖరారు కావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు. -
కరుణకు కోపం వచ్చింది
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత కరుణానిధికి కోపం వచ్చింది. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన ఎండీఎంకే అధినేత వైగోకు నోటీసులు పంపించారు. తనపై అసత్య పూర్వకంగా చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు ఆఫర్ చేశాయని ఎండీఎంకే అధినేత వైగో.. డీఎంకే, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. డీఎంకే.. 500 కోట్ల రూపాయల డబ్బు, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ.. ఎన్నికల ఖర్చుకు కావాల్సినంత డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వైగో ఆరోపణల్లో పేర్కొన్నారు. దీనికి వెంటనే స్పందించిన కరుణానిధి అది తమపై చేసిన అసత్య ప్రచారమని అన్నారు. వెంటనే వివరణ ఇవ్వాలంటూ పరువు నష్టం దావా వేశారు. -
'రూ. 500 కోట్లు ఇస్తామన్నా తిరస్కరించారు'
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎండీఎంకే అధినేత వైగో.. డీఎంకే, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ ఈ రెండు పార్టీలు డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు ఆఫర్ చేశాయని చెప్పారు. డీఎంకే.. 500 కోట్ల రూపాయల డబ్బు, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ.. ఎన్నికల ఖర్చుకు కావాల్సినంత డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వైగో ఆరోపించారు. అయినా విజయ్‌కాంత్ వీటిని తిరస్కరించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అధికార అన్నా డీఎంకేలకు ఓటమి తప్పదని అన్నారు. విజయ్‌కాంత్ నేతృత్వంలోని తమ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో నాలుగు పార్టీల కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్) నాయకులు.. వైగో(ఎండీఎంకే), తోల్ తిరుమవలవన్(వీసీకే), జీ. రామకృష్ణన్(సీపీఎం), ఆర్. ముతరాసన్(సీపీఐ)లు.. కెప్టెన్ ఆధ్వర్యంలోని డీఎండీకేతో పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. డీఎండీకే 124 స్థానాల్లో, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ అభ్యర్థులు 110 స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తు కుదిరింది. డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమికి కెప్టెన్ విజయ్‌కాంత్ సీఎం అభ్యర్థిగా ఖరారయ్యారు. -
సర్దుకుందాం
ఎండీఎంకే-40,వామపక్షాలు -35 వీసీకే -35 కెప్టెన్ రాకతో సెటైర్లు ప్రజా సంక్షేమ కూటమే: నల్లకన్ను ఇదేంటీ : సీపీఎం ఎమ్మెల్యే సాక్షి, చెన్నై : కెప్టెన్ రాకతో తమ బలం పెరిగినా, సీట్ల పందేరంలో మాత్రం సర్దుకోవాల్సిన పరిస్థితి ప్రజా కూటమి నేతలకు తప్పలేదు. ఎండీఎంకే 40, వామపక్షాలు 35, వీసీకే 35 సీట్లు చొప్పున పంచుకునే పనిలో పడ్డాయి. ఇక, ప్రజా కూటమిపై సెటైర్లు సంధించే వాళ్లు పెరగడంతో విమర్శల్ని తిప్పికొట్టేందుకు ఘాటుగా స్పందించే పనిలో వైకో, తిరుమా నిమగ్నమయ్యారు. ఇది కెప్టెన్ టీం కాదు, ప్రజా సంక్షేమ కూటమి అని సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను పెదవి విప్పడం గమనార్హం. ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో కలసి సాగుతున్న ప్రజా సంక్షేమ కూటమిలో బుధవారం ఆనందంకర క్షణాలు చోటు చేసుకున్నాయి. డీఎండీకే రాకతో తమ బలం పెరిగిందని జబ్బలు చరిచే పనిలో ఎండీఎంకే నేత వైకో, సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ పడ్డారు. వచ్చి రాగానే 124 సీట్లను లాక్కుని , తమకు 110 సీట్లను విజయకాంత్ ఇవ్వడంతో వాటిని పంచుకోవడంలో సర్దుకోవాల్సిన పరిస్థితి మిగిలిన నేతలకు తప్పలేదు. కూటమిలో ఎలాంటి విబేధాలకు ఆస్కారం ఇవ్వని విధంగా సమష్టిగానే సర్దుకునే పనిలో పడ్డారు. ఆ మేరకు ఎండీఎంకే 40, వీసీకే 35, సీపీఎం, సీపీఐలు కలిసి 35 చోట్ల బరిలోకి దిగేందుకు నిర్ణయించి ఉన్నాయి. ఇక, వైకో, రామకృష్ణన్ ఎన్నికల బరిలో దిగేందుకు ఆస్కారం లేదని ఆ కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుమావళవన్ మాత్రం పోటీకి నిర్ణయించగా, అధిష్టానం అనుమతి కోసం ముత్తరసన్ ఎదురు చూపుల్లో ఉన్నట్టు సమాచారం. ఇక, ఇతర పార్టీలు కూటమిలోకి వచ్చిన పక్షంలో సీట్లను విజయకాంత్ సర్దుబా టు చేసుకోవాల్సిందే అన్న నిర్ణయానికి మిగిలిన నేతలు వచ్చి ఉన్నారు. ఇంత వరకు నేతల మధ్య ఐక్యతతో పయనం సాగినా, అసలు సమస్య సిట్టింగ్ ఎమ్మెల్యేల రూపంలో వామపక్షాలకు ఎదురు అయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సీపీఎంకు పది, సీపీఐకు తొమ్మిది మంది సిట్టింగ్ లు ఉండగా, ఒక్క సభ్యుడ కూడా లేని ఎండీఎంకే, వీసీకేలకు మాత్రం అన్ని స్థానాలు ఎందుకో అని పెదవి విప్పే వాళ్లు వామపక్షాలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే తన ఫేస్ బుక్‌లో సీపీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే బాల భారతి స్పందించి ఉండటం గమనించాల్సిన విషయం. అదే సమయంలో విజయకాంత్ రాకతో ఇది కెప్టెన్ టీం అని వైకో స్పందించడంతో, దానిని ఖండించే విధంగా సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను స్పందించి ఉన్నారు. ఎంత మంది నాయకులు కూటమిలోకి వచ్చినా, పేరు మాత్రం ప్రజా సంక్షేమ కూటమి అన్న విషయాన్ని గు ర్తుంచుకోవాలని హితవు పలకడం ఆలోచించాల్సిందే. సెటైర్లు : విజయకాంత్ రాకతో మిత్ర పక్షాల్లో ప్రధానంగా సీపీఎం,సీపీఐలలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓ వైపు పెదవి విప్పుతుంటే, సీనియర్లు డొంక తిరుగుడు వ్యాఖ్యలకు సిద్ధం అవుతోంటే, సోషల్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో ఈ కూటమి మీద సెటైర్లు బయలు దేరి ఉన్నాయి. కొత్త రకం కార్టూన్లతో వ్యంగ్యంగా చిత్రీకరించి, కొత్త టాగ్ లైన్లతో విమర్శించే వాళ్లు పెరిగారు. ఇది ఓ వైపు సాగుతుంటే, మరో వైపు బిజేపీ నేతలు తీవ్రంగానే ప్రజా కూటమిని టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. ఆ పార్టీ జాతీయ నేత ఇలగణేషన్ తీవ్రంగా విరుచుకు పడుతూ, ప్రజా సంక్షేమ కూటమిలోకి విజయకాంత్ రాకతో అది, ప్రజా వ్యతిరేక కూటమిగా మారిందని ఎద్దేవా చేశారు. ఇలా సెటైర్లు, విమర్శలు, ఆరోపణలు బయలు దేరడంతో ఘాటుగానే సమాధానాలు ఇచ్చేందుకు వైకో, తిరుమా సిద్ధమయ్యారు. తమ కూటమిని చూసి ఓర్వ లేక, తమ బలం పెరగడంతో భయంతో విమర్శలు ఆరోపణలు సంధిస్తున్నారని మండి పడ్డారు. ప్రచారం: ఇప్పటికే ప్రజా కూటమి నేతలు ప్రచారంలో దూసుకెళుతుంటే, తన వంతుగా ప్రచార బాటకు విజయకాంత్ రెడీ అయ్యారు. కూటమి తరపున విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావ మరిది సుదీష్ వేర్వేరుగా రోడ్ షోకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ పర్యటన మ్యాప్ రూపకల్పనలో డీఎండీకే వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. అలాగే, వీరి ముగ్గురి కోసం ప్రత్యేక సౌకర్యాలు, వసతులతో మూడు ప్రచార వాహనాలు మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇక, ఘాటుగా, తీవ్ర పదజాలలతో, తన భర్త ప్రసంగాల్ని తలదన్నే రీతిలో విజయకాంత్ సతీమణి ప్రేమలత ప్రసంగాలు సాగిస్తున్న విష యం తెలిసిందే. కొన్ని చోట్ల ఈ ప్రసం గాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ల సంఖ్య పెరగడంతో ఆమెకు భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెకు ప్రత్యేక భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈసీకి డీఎం డీకే నేతలు వినతి పత్రం సమర్పించారు. -
ప్రచారానికి రెడీ!
సాక్షి, చెన్నై : ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రజాకూటమి కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈనెల 26వ తేదీన మదురై వేదికగా జరగనున్న మహానాడుతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పు సంతరించుకోనున్నదని ఆ కూటమి వర్గాలు ప్రకటించాయి. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి కూటమి నేతలు కలసి కట్టుగా ప్రచార బాటకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకేలతో కలసి ప్రజా కూటమి ఇటీవల ఆవిర్భవించిన విషయం తెలిసిందే. తమతో దోస్తీ కట్టాలని ఇప్పటికే డీఎండీకే అధినేత విజయకాంత్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్లకు ప్రజా కూటమి నేతలు పిలుపునిచ్చి ఉన్నారు. విజయకాంత్ మాత్రం ఆ కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నా, జీకేవాసన్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మదురై వేదికగా ఈ నెల 26వ తేదీన బ్రహ్మాండ మహానాడుకు ఈ కూటమి చర్యలు చేపట్టింది. ఈ వేదిక మీద విజయకాంత్, వాసన్ ప్రత్యక్షమైన పక్షంలో రాష్ట్రంలో మెగాకూటమిగా ప్రజా కూటమి అవతరించడం ఖాయం. అయితే, ఇది సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న సైతం బయలు దేరి ఉన్న వేళ గురువారం ప్రజా కూటమిలోని ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి మార్పున కు వేదికగా ఆ మహానాడు నిలవబోతున్నదని ధీమా వ్యక్తం చేయడం విశేషం. ప్రచారానికి సిద్ధం: ఈ నలుగురు నేతలు ఉదయం సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్లు, ప్రచార పర్వానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. తదుపరి మీడియాతో నలుగురు నేతలు మాట్లాడారు. మదురై వేదికగా జరగనున్న మహానాడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పును తీసుకురాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి బీటలు తప్పవని వ్యాఖ్యలు చేసిన వాళ్లు,వ్యాంగ్యాస్త్రాలు సంధించిన వారికి చెంప పెట్టుగా ఈ మహానాడు నిలవబోతున్నదన్నారు. తమ కూటమి వర్గాలు సమష్టిగా ప్రజా సమస్యలపై పోరుబాటను ఉధృతం చేశారని వివరించారు. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా కార్యక్రమాల్ని విస్తృతం చేసినట్టు పేర్కొన్నారు. తమ కూటమి ఎన్నికల ప్రచారానికి ఫిబ్రవరి ఏడో తేదీన శ్రీకారం చుట్టబోతున్నదని వివరించారు. ఆరో తేదీన పుదుచ్చేరిలో భారీ బహిరంగ సభకు చర్యలు చేపట్టామని, ఏడో తేదిన ఎన్నికల ప్రచారానికి కడలూరు వేదికగా శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. అదే రోజు నాగపట్నంలో, ఎనిమిదో తేదిన తిరువారూర్, తంజావూరుల్లో, తొమ్మిదో తేదిన పుదుకోట్టై, శివగంగైలలో ఎన్నికల ప్రచారం సాగుతుంద న్నారు. తదుపరి పర్యటనల వివరాలు ఆ సమయంలో వెలువరిస్తామని, తొలి విడత పర్యటనలో అందరూ కలసి కట్టుగానే ప్రజల్లోకి వెళ్తామని, తదుపరి ఆయా ప్రాంతాల్లో గెలుపు లక్ష్యంగా నేతలందరూ తలా ఓ వైపుగా పర్యటనలు సాగిస్తారని చెప్పారు. -
సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్
♦ వైగో ప్రకటనపై అప్రమత్తం ♦ చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు ♦ రోజంతా పోలీసుల పడిగాపులు ♦ కలెక్టరేట్ వద్ద మోహరింపు సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో తమిళ కూలీలను పోలీసులు కాల్చివేసినందుకు నిరసనగా శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామంటూ తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వై.గోపాలస్వామి ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు సరిహద్దులతో పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని పళ్లిపట్టు, కాలువపల్లె, పలమనేరు, వి.కోట, నాగలాపురం, పుత్తూరు, గుడిపాల, యాదమరి తదితర సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించి తనిఖీలు నిర్వహించారు. వైగో ఏ క్షణంలోనైనా కలెక్టరేట్‌కు చేరుకుంటారనే ప్రచారంతో అక్కడి పోలీసులు టెన్షన్‌తో గడిపారు. కుప్పం నియోజకవర్గం గాంధీనగర్ సరిహద్దు వద్ద విడుదలై చిరుతైగల్ కచ్చి పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా, ఆంధ్రా పోలీసులు అడ్డుకున్నారు. సరిహద్దులో ఉన్న తమిళ పోలీసులు వారిని అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పళ్లిపట్టు చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. పలమనేరు కాలువపల్లె సరిహద్దు, వి.కోట పేర్నంబట్టు సరిహద్దు, సత్యవేడు నాగలాపురం, సురుటి పల్లె చెక్‌పోస్టులతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని రహదారుల్లో పెద్ద ఎత్తున పోలీసులు మకాం వేశారు. తమిళ ఆందోళనకారులు సరిహద్దు దాటకుండా భారీ బందోబస్తు నిర్వహించి తనిఖీలు చేశారు. ఎట్టకేలకు మధ్యాహ్నం తమిళనాడులోని వేలూరులో వైగోను పోలీసులు అరెస్టు చేశారనే వార్తతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయినా సరిహద్దుతో పాటు కలెక్టరేట్ వద్ద సాయంత్రం వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రకూలీలను జిల్లాకు చెందిన టాస్క్ఫోర్సు పోలీసులు ఈ నెల 7న తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. పోలీసులు ఏకపక్షంగా కూలీలను పట్టుకెళ్లి కాల్చి చంపారంటూ తమిళనాడు ఎండీఎంకే నేత వై.గోపాలస్వామి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులను తమిళనాడుకు పంపి వైగో కదలికలపై నిఘా పెట్టారు. వైగో తమిళనాడు పరిధిలో వేలూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 500 మందితో అక్కడే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వైగో చిత్తూరుకు చేరుకోనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ తరువాత వైగోను వేలూరులోనే పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలుసుకుని ఇక్కడ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరిహద్దులతో పాటు చిత్తూరు కలెక్టరేట్ వద్ద వందలాది పోలీసులు సాయంత్రం 6 గంటల వరకు బందోబస్తు కొనసాగించారు. -
బాబు సర్కారును రద్దు చేయాలి
ఎండీఎంకే నేత వైగో డిమాండ్ వేలూరులో భారీ ధర్నా, అరెస్ట్ సాక్షి ప్రతినిధి, చెన్నై/వేలూరు/చిత్తూరు: శేషాచలం అడవుల్లో 20 మంది అమాయక కూలీలను కాల్చి చంపడానికి కారణమైన ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మరుమలచ్చి ద్రవిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.గోపాలస్వామి(వైగో) డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల చర్యలను ఖండిస్తూ తమిళనాడులోని వేలూరులో ఎండీఎంకే ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ధర్నా చేపట్టారు. వైగో మాట్లాడుతూ.. దేశంలో పిట్టలను, జంతువులను కాల్చేందుకు కూడా అనుమతి కావాలని అలాంటిది అమాయక కూలీలను కాల్చేందుకు అనుమతి ఏ చట్టంలో ఉందని ఘాటుగా ప్రశ్నించారు. ఏపీ మంత్రి ఒకరు ‘ఇది ఆరంభమే’ అనడం సరికాదని హితవు పలికారు. అనంతరం, కార్యకర్తలతో కలసి చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన వైగోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరని జ్వాలలు: ఏపీ ప్రభుత్వంపై తమిళనాడు ప్రజల్లో ఆగ్రహం చల్లారడం లేదు. బాబు ప్రభుత్వంపై ప్రజలు, ప్రజా సంఘాల నేతలు నిప్పులుగక్కుతూనే ఉన్నారు. బాబు దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. పుదుచ్చేరి రహదారిపై నిలిచి ఉన్న రెండు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఒకదానిపై గురువారం అర్థరాత్రి దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టారు. మద్రాసు హైకోర్టులోని జననాయక న్యాయవాదుల సంఘం సభ్యులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు డీఎంకే అధినేత కరుణానిధి రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించారు. చెన్నైలో బిక్కుబిక్కుమంటున్న ఆంధ్రులు ఏపీ, తమిళనాడుల మధ్య నిత్యం రాకపోకలు సాగించే 90 బస్సులు 4 రోజులుగా నిలిచిపోయాయి. ఆందోళనకారులు ఆంధ్రావాళ్లను తమిళనాడులో బయట తిరగనీయబోమంటూ హెచ్చరికలు జారీచేయడంతో చెన్నయ్‌లోని తెలుగు వాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. 17 వరకు మార్చురీలోనే 6 మృతదేహాలు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆరుగురి మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేయాలన్న అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఘటన తమ పరిధిలోకి రాదని తెలిపింది. ఏపీ హైకోర్టు లేదా సుప్రీంలను ఆశ్రయించాలని సూచించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు మృతదేహాలకు అంత్యక్రియలు జరపరాదం టూ కేసును 17కి వాయిదా వేశారు. ఆరుగురి మృతదేహాలను తిరువణ్ణామలై ఆసుపత్రిలో భద్రపరిచారు. ఢిల్లీలోనూ ప్రజాసంఘాల ఆందోళన ఏపీ, తెలంగాణల్లో జరిగిన ఎన్కౌంటర్లు బూటకమని, వాటిపై న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఢి ల్లీ సొలిడారిటీ గ్రూప్ సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీ భవన్ వద్ద పలు ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. విచారణ జరుపుతున్నాం తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ శేషాచలం ఎన్‌కౌంటర్‌పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు తెలిపారు. పన్నీర్ సెల్వం మంగళవారం రాసిన లేఖకి చంద్రబాబు శుక్రవారం ప్రత్యుత్తరం రాశారు. హక్కుల కమిషన్ విచారణ మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ నెల 22 నుంచి 24 వరకు హైదరాబాద్‌లో బహిరంగ విచారణ చేపట్టనుంది. తెలంగాణలో సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్, ఏపీలో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్లపై కమిషన్ తనంతట తానుగా స్పందించి నోటీసులు జారీచేసింది. వీటితోపాటు ఈ రెండు రాష్ట్రాలకూ చెందిన 84 కేసులపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ చేపట్టనుంది. -
కలెక్టరేట్ ముట్టడిస్తామని వైగో హెచ్చరిక
-
'బొజ్జల సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు'
చిత్తూరు : ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి ఎండీఎంకే అధినేత వైగో శుక్రవారం వేలూరు నుంచి భారీ ర్యాలీగా బయల్దేరారు. ఆయనతో పాటు తమిళనాడులోని ఇతర పార్టీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు మానవత్వానికి దూరంగా ఉన్నాయన్నారు. అంతం కాదు...ఆరంభం మాత్రమే అని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సినిమా డైలాగులు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు చెల్లించాలని వైగో డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కావాలనే బయట ఉన్న కూలీలను తీసుకువెళ్లి ఎన్కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఉన్న కూలీల బాధ్యతను తమిళనాడు ప్రభుత్వానిదే అని వైగో అన్నారు. కాగా తమిళనాడు-ఏపీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీగా వస్తున్న వైగో సహా పలువురు కార్యకర్తలను వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కలెక్టరేట్ ముట్టడిస్తామని వైగో హెచ్చరిక
చిత్తూరు : తమిళనాడు ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడిస్తామని ఎండీఎంకే అధినేత వైగో హెచ్చరించారు. వైగో హెచ్చరికల నేపథ్యంలో ఆయన్ని చిత్తూరు జిల్లా సరిహద్దులోనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వ్యూహం రచించారు. గుడిపాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు వైగో రాయవేలూరులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరోవైపు వైగోకు మద్దతుగా తమిళనాడులోని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. చిత్తూరులో భారీ బందోబస్తు చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వైగో చేసిన ప్రకటన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఎన్‌కౌంటర్‌పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయని ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి చిత్తూరు: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళనాడు వాసులు చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడి చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని గాంధీనగర్ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళవాసుల్ని సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రా పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. -
కమలంతో కటీఫ్
చెన్నై, సాక్షి ప్రతినిధి : గడిచిన పార్లమెంటు ఎన్నికల సమయంలో రాష్ట్ర బీజేపీ శాఖ ఏడు ప్రాంతీయ పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేర్చుకుని బరిలోకి దిగింది. ఎండీఎంకే, పీఎంకే, డీఎండీకే తదితర పార్టీలన్నీ పార్లమెంటు సీట్లను పంచుకుని పోటీకి దిగాయి. బీజేపీ, పీఎంకేలు చెరొక స్థానం దక్కించుకున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల వరకు కూటమి కొనసాగుతుందని బీజేపీ ఆశించింది. అయితే ఇటీవల తమిళనాడు, శ్రీలంకల మధ్య చోటుచేసుకున్న వివాదాస్పద పరిణామాలతో బీజేపీ కూటమిలో బీటలు మొదలయ్యూయి. తమిళుల ఆత్మాభిమానం దెబ్బతినేలా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారంటూ ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో విమర్శలు గుప్పించడంతో రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. మోదీని విమర్శిస్తే రాష్ట్రంలో క్షేమంగా తిరగలేవని వైగోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ రాజా హెచ్చరించారు. మోదీని విమర్శించేందుకు ప్రతిపక్షాలే భయపడుతున్నాయి, కూటమిలో ఉంటూ విమర్శలు తగవని వైగోకు బీజేపీ జాతీయ నేత ఇల గణేశన్ హితవు పలికారు. విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్న తరుణంలో కూటమిలో చీలిక తప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషించారు. ఉన్నత స్థాయి సమావేశం చెన్నై ఎగ్మూరులోని ఎండీఎంకే కేంద్ర కార్యాలయంలో సోమవారం 12 మంది సభ్యులతో కూడిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభంకాగా ఎన్డీఏలో కొనసాగడమా లేక వైదొలగడమా అనే ఏకైక అజెండాపై చర్చించారు. వైదొలగడమే మంచిదని అధికశాతం సూచించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులతో వైగో సమావేశమై ఉన్నతస్థాయి కమిటీ చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర కార్యదర్శులు సైతం కమిటీ తీర్మానాన్ని బలపరచడంతో ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు వైగో ప్రకటించారు. వైదొలగడానికి కారణాలు ఇవే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడం, త్వరలో జరగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సే గెలుపు కోరుతూ మోదీ శుభాకాంక్షలు తెలపడం, ముల్లైపెరియార్ వ్యవహారంలో కేంద్రం ఏకపక్ష తీరు, అనేక ఇతర అంశాల్లో తమిళుల ఆత్మాభిమానం దెబ్బతినేలా కేంద్రం వ్యవహరించడం వంటి అంశాలను కమలనాథుల కూటమి నుంచి వైదొలగడానికి వైగో కారణాలుగా చూపారు. -
ఎన్డీఏ సర్కారు నుంచి వైదొలగిన ఎండీఎంకే
చెన్నై: వైగో నేతృత్వంలోని ఎండీఎంకే పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఎండీఎంకే ఒక తీర్మానం చేసింది. శ్రీలంకకు అనుకూలంగా మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడుతో కేరళ, కర్ణాటక జలవివాదాల్లో కేంద్రం వైఖరిపైనా ఎండీఎంకే గుర్రుగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమితో కలసి ఎండీఎంకే పయనం సాగించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీతో జత కట్టిన తొలిపార్టీ ఎండీఎంకే కావడం గమనార్హం. ఎండీఎంకే వైదొలగడం సంతోషించదగ్గ పరిణామం కాదని కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ వ్యాఖ్యనించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. -
టాటా చెప్పేద్దామా?
సాక్షి, చెన్నై : బీజేపీ కూటమికి టాటా చెప్పేందుకు ఎండీఎంకే సిద్ధం అవుతోంది. సోమవారం జరిగే పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశంలో కూటమిలో కొనసాగాలా? వద్దా! అన్న అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మెజారిటీ సభ్యులు టాటా చెప్పాలన్న డిమాండ్ తో ఉన్న దృష్ట్యా, ఇక బీజేపీ కూటమి చీలినట్టేనన్న ప్రచారం బయలు దేరింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూట మితో కలసి ఎండీఎంకే పయనం సాగించిన విషయం తెలిసిందే. అయి తే, ఇటీవల కేంద్రం శ్రీలంకకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైగో స్వరం పెంచారు. పీఎం మోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో కూటమి నుంచి వైదొలగాలన్న ఒత్తిడి వైగో మీద పెరి గింది. పార్టీ శ్రేణులందరూ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే పనిలో పడ్డారు. అయితే, కూటమి కొనసాగాలన్న కాంక్షతో ఎండీఎంకే నేత వైగోపై చేసిన వ్యాఖ్యల్ని హెచ్ రాజా వెనక్కు తీసుకున్నారు. తామిద్దరం మిత్రులం అన్న పల్లవిని అందుకున్నారు. ఈ క్రమంలో ఆగమేఘాలపై పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశానికి వైగో పిలుపు నివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నేడు సమావేశం సోమవారం ఉదయం ఎగ్మూర్‌లోని తాయగంలో పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశం జరగనుంది. అన్ని జిల్లాల కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలన్న ఆదేశాల్ని వైగో ఇచ్చారు. దీంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. బీజేపీ తమతో అనుసరించిన విధానాన్ని ఖండిస్తూ ఆ కూటమి నుంచి వైదొలగుతూ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజా వెనక్కు తగ్గినా, కూటమిలోని వైగోను హెచ్చరించే విధంగా కమలనాథులు చేసిన వ్యాఖ్యల్ని ఖండించే విధంగా బీజేపీ అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయక పోవడాన్ని ఎండీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణించా యి. ఆ కూటమికి టాటా చెప్పేసి, భవిష్యత్తు కార్యాచరణ దిశగా అడుగులు వేసేందుకు ఈ సమావేశం వేదిక కానుందని ఎండీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
బీజేపీ కూటమిలో చీలిక
చెన్నై, సాక్షి ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమిలో లుకలుకలు మొదలయ్యూయి. కూటమి నుంచి ఎండీఎంకే వైదొలగడం దాదాపు ఖరారు కాగా, మరో రెండు పార్టీలు కూటమితో కటీఫ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా పార్లమెంటు ఎన్నికల సమయంలో మోడీ ప్రభావంతో రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన శక్తిగా మారింది. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్ పార్టీలంటే పడని ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీఏ(బీజేపీ) కూట మిలో చేరిపోయాయి. పొత్తు పార్టీల వల్ల పార్లమెంటు సీట్లు గెలవకు న్నా, గణనీయమైన ఓట్లు లభిం చాయి. కూటమిలోని పీఎంకే మాత్రం ఒక్క సీటు దక్కించుకుంది. 2016లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే కూటమి కొనసాగుతుందని అందరూ ఆశించారు. రాజపక్సేతో రగడ: శ్రీలంక అన్నా, ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే పేరు చెప్పినా తమిళులు, తమిళ పార్టీల వారు మండిపడతారు. -
‘టాడా’ రద్దు
ఎండీఎంకే నేత వైగోతో సహా తొమ్మిది మందిపై నమోదైన టాడా కేసు రద్దు చేస్తూ పూందమల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను ముగిస్తూ, సోమవారం తన తీర్పును న్యాయమూర్తి మోని వెలువరించారు. సాక్షి, చెన్నై: మదురై జిల్లా తిరుమంగళం వేదికగా జరిగిన బహిరంగ సభలో ఎండీఎంకే నేత వైగో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎల్‌టీటీఈలకు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటి ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆయన్ను, ఆ వేదిక మీదున్న మరో 8 మందిపై తీవ్రవాద నిరోధక చట్టం(టాడా) ప్రయోగించారు. ఎండీఎంకే నేత వైగోతో సహా 9 మందిని అరెస్టు చేసి కటకటాల్లో పెట్టారు. ఏడాదిన్నరపాటు కారాగారావాసాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎట్టకేలకు బెయిల్ మీద బయటకు వచ్చిన వైగో తనతో పాటుగా 9 మందిపై దాఖలు చేసిన కేసును వ్యతిరేకిస్తూ ఆ చట్టం వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక కమిటీని ఆశ్రయించారు. రద్దు: ఏళ్ల తరబడి సాగిన ఈ విచారణలో వైగోతో సహా ఎనిమిది మందికి విముక్తి కల్పించే విధంగా ఆ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో గత్యం తరం లేక ఆ కేసును వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయినా, టాడా కోర్టు వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ కోర్టు తిరస్కరించి, విచారణ కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పన్నెండేళ్లుగా ఈ కేసు నుంచి విముక్తి పొందేందుకు న్యాయ స్థానంలో వైగో అండ్ బృందం పోరాడుతూనే ఉంది. ఈ కాలంలో ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మరణించారు. ఎట్టకేలకు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ రూపంలో వైగో అండ్ బృందానికి విముక్తి కలిగింది. కేసు కొనసాగింపునకు టాడా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో మళ్లీ టాడా కోర్టును ఈ నెల 21న వైగో ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను వివరిస్తూ వైగో అండ్ బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను టాడా కోర్టు న్యాయమూర్తి మోని పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు రద్దుకు నిర్ణయించడం, తమ ఉత్తర్వుల్ని హైకోర్టు రద్దు చేయడాన్ని పరిగణనలోకి తీసుకుని ఇక, విచారణను ముగిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. వైగోతో సహా మిగిలిన వారిపై నమోదైన టాడా చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు తీర్పు వెలువరించారు. దీంతో ఆ కేసు నుంచి వైగోతో సహా ఏడుగురికి పూర్తిగా విముక్తి కల్గినట్టు అయింది. -
నాది ద్రోహమా?
సాక్షి, చెన్నై: పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక వేదికగా సాగిన ఆసక్తికర పరిణామాలు డీఎంకే బహిష్కృత నేత అళగిరికి ఆగ్రహాన్ని తెప్పించాయి. తాను కలిస్తే ద్రోహం-వాళ్లు కలిస్తే స్నేహమా అంటూ శుక్రవారం డీఎంకే అధిష్టానంపై అళగిరి విరుచుకు పడ్డారు. డీఎంకే నుంచి ఎంకే అళగిరి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో అళగిరి తెర మీదకు రావడం పరిపాటే. లోక్‌సభ ఎన్నికల సమయంలో అళగిరి, ఎండీఎంకే నేత వైగోలు కలిసిన వేళ డీఎంకే వర్గాలు తీవ్రంగానే స్పందించాయి. అళగిరిని ద్రోహిగా పేర్కొంటూ మండిపడ్డాయి. గతంలో శత్రువుగా ఉన్న వైగోను మిత్రుడిగా మార్చుకునేందుకు డీఎంకే పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. డీఎంకేను రెండుగా చీల్చిన వైగో ఓ మారు ఎన్నికల సమయంలో ఆ పార్టీతో కలిసినా, ఆ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. ప్రస్తుతం 2016లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న డీఎంకే, ఎండీఎంకే బలాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడింది. అలాగే, పీఎంకేను సైతం తమతో కలిసి నడిపించే రీతిలో కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడింది. నేను ద్రోహి...వాళ్లు మిత్రులు: తన వ్యూహాల అమలు లక్ష్యంగా కరుణ చేస్తున్న ప్రయత్నాలకు పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక కలిసి వచ్చింది. ఆ వేడుకలో పొగడ్తల పన్నీరును పాతమిత్రులు చల్లుకున్నారు. ఒకరినొకరు కరచాలనంతో పలకరించుకున్నారు. ఇక, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే నేత వైగోలు చెప్పనక్కర్లేదు. పాత స్నేహాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టుగా వ్యవహరించారు. ఒకే విమానంలో మదురైకు సైతం బయలుదేరి వెళ్లారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ పరిణామాలన్నీ బహిష్కృత నేత అళగిరిలో ఆగ్రహాన్ని రేపాయి. తనకో న్యాయం....వారికో న్యాయమా అని విరుచుకు పడ్డారు. శుక్రవారం మదురైలో ఓ మీడియాతో మాట్లాడిన అళగిరి తీవ్రంగానే స్పందించారు. వారికి వద్దనుకుంటే ద్రోహం, కావాలనుకుంటే మిత్ర బంధం అని మండి పడ్డారు. వైగోను తాను కలిస్తే, అదో పెద్ద ద్రోహం అన్నట్టు చిత్రీకరించారని, ఇప్పుడు స్టాలిన్ చేసిందేమిటో మరి అని ప్రశ్నించారు. వైగోను కలిసిన తాను ద్రోహి అయినప్పుడు, ఆయన మాత్రం ఎలా మిత్రుడు అవుతాడోనని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ పరిణామాలు చూస్తుంటే, రాజకీయాలు ఎటు వెళ్తున్నాయోనన్న విస్మయం కలుగుతోందన్నారు. గోపాలపురానికి వైగో: ఓ వైపు అళగిరి విమర్శలు గుప్పించే పనిలో పడితే, మరో వైపు గోపాలపురం మెట్లు ఎక్కేందుకు వైగో సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎండీఎంకే వస్తే ఆహ్వానిస్తామని కరుణానిధి చేసిన వ్యాఖ్యలు వైగోను పులకింతకు గురి చేసినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకేకు తాను చెడు తలబెట్టినా, తనకు కరుణానిధి మాత్రం మంచే చేశారన్న భావనలో ఉన్న వైగో, త్వరలో పూర్వపు తన అధినేతను కలుసుకునేందకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా ఎండీఎంకేలో చర్చ సాగుతోంది. మరికొద్ది రోజుల్లో కరుణానిధి నివాసం గోపాలపురం మెట్లు ఎక్కడం లక్ష్యంగా కార్యాచరణను వైగో సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. -
‘మెగా’ సాధ్యమే!
రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భావం సాధ్యమేనని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం మహాబలి పురం వేదికగా మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీదకు రానుండడంతో రాజకీయ పరిణామాలు ఏ మలుపులు తిరగనున్నాయో..! అన్న చర్చ బయలు దేరింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మెగా కూటమి ఏర్పాటు లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి పావులు కదుపుతున్నారు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచనల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఆయా పార్టీల మనోగతాలు మాత్రం అంతు చిక్కడం లేదు. ఏ క్షణాన ఏ పార్టీ ఎవరికి మద్దతుగా వ్యాఖ్యానిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మెగా కూటమి సాధ్యమే అన్న భావనను కలిగించాయి. ఎద్దేవా: రాష్ట్రంలో డీఎంకే , అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆ ఇంటర్వ్యూలో స్టాలిన్ విమర్శలు గుప్పించారు. గతంలో తమతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్నప్పుడే నాలుగు స్థానాలకు పరిమితమైన బీజేపీ, తాజాగా అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి రాష్ట్రంలో ఎదుగుతుందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం సాధ్యం కాని పనిగా పేర్కొన్నారు. పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకున్నా, వెలుపల మాత్రం అందరు ఎంపీలు స్నేహ పూర్వకంగానే ఉంటారన్నారు. అయితే, అలాంటి పరిస్థితి తమిళనాడు అసెంబ్లీలో లేదని, స్నేహ పూర్వక వాతావరణం లక్ష్యంగా డీఎంకే ప్రయత్నిస్తోందని చెప్పారు. అళగిరి పార్టీలో లేనందున ఆయన గురించి తానేమీ మాట్లాడబోనంటూ దాట వేశారు. ఎండీఎంకే నేత వైగోతో తనకు ఎలాంటి విబేధాలు లేవని, స్నేహ పూర్వకంగా తాము మెలుగుతామన్నారు. ఇటీవల అసెంబ్లీలో డీఎండీకేకు ఇబ్బందులు తలెత్తినప్పుడు తాము అండగా నిలిచామని, అదే విధంగా తమకు ఇబ్బందుల్ని అధికార పక్షం కల్పించినప్పుడు వాళ్లు అండగా నిలిచారని గుర్తు చేస్తూ, ఇలాంటి స్నేహ పూర్వక వాతావరణం అసెంబ్లీలో మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మెగా కూటమి సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, డీఎంకేలు కలసికట్టుగా మెగా కూటమి ఏర్పాటుకు ఆమోదిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే వేదిక మీదకు : మెగా కూటమి సాధ్యమే అన్నట్టుగా స్టాలిన్ వ్యాఖ్యానించడం ఓ వైపు చర్చకు దారి తీస్తే, ఇందుకు అనుకూలించే పరిస్థితులు మరో రెండు రోజు ల్లో రానున్నాయి. మహాబలి పురం వేదికగా గురువా రం పీఎంకే అధినేత రాందాసు మనవడు, మనవరాలి వివాహం జరగనుంది. ఇందుకు కరుణానిధి నేతృత్వం వహించబోతున్నారు. ఈ వేడుకకు ఎండీఎంకే నేత వైగో సైతం హాజరయ్యేందుకు నిర్ణయించారు. ఈ దృష్ట్యా, మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కాబోతోండటం గమనార్హం. అదే సమయం లో డీఎండీకే నేత విజయకాంత్ సైతం ఈ కల్యాణ వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నా, ఆయన వేదిక ఎక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇప్పటికే రాందా సు, వైగోను తమ వైపు తిప్పుకునే విధంగా డీఎంకే వర్గాలు వ్యాఖ్యలు చేశారుు. ఈ వేదిక మీద ఏ మేరకు పొగడ్తల వర్షం కురిసి మెగా కూటమికి దారి తీస్తాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం మీద వైగో, రాందాసు గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన విందుకు సైతం దూరంగానే ఉన్నారు. విజయకాంత్ సైతం ఈ విందు కు దూరంగా ఉన్నా, తరచూ మోదీ జపం అందుకోవడం ఆయన మదిలో నిర్ణయం ఏమిటోనన్నది అంతు చిక్కడం లేదు. ఈ కల్యాణ వేదికను అస్త్రంగా చేసుకుని ఁమెగారూ.మార్గాన్ని సుగమం చేసుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి తన రాజతంత్రాన్ని ప్రయోగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
నల్ల జెండాలతో వైగో నిరసన, అరెస్ట్!
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స పర్యటనకు నిరసనగా దేశరాజధానిలో ఆందోళన చేపట్టిన ఎండీఎంకే చీఫ్ వైగోను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ లో నల్ల జెండాలతో కార్యక్రమంలో వైగో నిరసన కార్యక్రమాలను నిర్వహించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్సను ఆహ్వానించడాన్ని వైగో వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజపక్సను ఆహ్వనించిన నిర్ణయంపై నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ను పునఃసమీక్షించుకోవాలని వైగో కోరారు. ఏబీ వాజ్ పేయి ప్రమాణస్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించలేదనే విషయాన్ని వైగో గుర్తు చేశారు. రాజపక్స ను ఆహ్వనించడంపై విచారం వ్యక్తం చేస్తూ మోడీకి వైగో లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాజపక్స రావడాన్ని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి జే. జయలలిత లు కూడా వ్యతిరేకిస్తున్నారు. -
నల్ల జెండాలతో వైగో నిరసన!
-
అతిథుల రాకపై మిత్రుల అలక
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందే.. బీజేపీ మిత్ర పక్షాల్లో లుకలుకలు మొదలయ్యాయి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టమే వారికి వేదిక కాబోతోంది. మోడీ తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడమే మిత్రపక్షాల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్షే, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్లను పిలవడం రెండు పార్టీలకు సుతారమూ ఇష్టం లేదు. లంకతో తమిళులను అణచివేస్తున్న రాజపక్షేను ఆహ్వానించడమేంటంటూ తమిళనాడుకు చెందిన ఎండీఎంకే అధ్యక్షుడు వైకో ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్ల బ్యాడ్జీ ధరించి రాజపక్షేకు నిరసన తెలియజేస్తానని ప్రకటించారు. ఇక పాక్ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడే శివసేనకు.. నవాజ్ షరీఫ్ రాక మింగుడుపడటం లేదు. మోడీ సర్కార్ పాక్‌పై దూకుడుగా వ్యవహరిస్తుందని శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. అయితే షరీఫ్ రాకపై స్పందించేందుకు శివసేన నిరాకరించింది. మీ పార్టీ వైఖరేంటన్న ప్రశ్నకు మౌనమే సమాధానమైంది. పాక్ ప్రధాని రాకను అడ్డుకోవాలంటూ సరభ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కూడా పిలుపునిచ్చారు. కొసమెరుపు ఏంటంటే.. బీజేపీ మిత్రపక్షాలు రాజకీయ కారణాల వల్లే తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయే తప్ప కాదు కూడదని చెప్పే సాహసం చేయలేదు. లంక, పాక్ అధినేతలకు ఆహ్మానం వద్దంటూ బీజేపీ, మోడీ ఎదుట డిమాండ్ చేయలేకపోయాయి. కారణమేంటంటే గతంలో మాదిరి బీజేపీని బెదిరించే పరిస్థితి లేకపోవడమే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పరిపూర్ణమైన మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. మోడీ సునామీ ప్రభావంతో 282 ఎంపీ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. మంత్రి పదవులు మొదలు ఇతరత్రా పనుల కోసం మిత్రులే మోడీ ప్రాపకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ కారణం వల్లే ఎన్డీయే మిత్రులు బెదిరింపులకు పోకుండా అసంతృప్తితో సరిపెట్టాయి. -
ఎన్ డీఏకు 320, బీజేపీకి 272 సీట్లు ఖాయం: వైగో
ధర్మపురి: రానున్న లోకసభ ఎన్నికల్లో ఎన్ డీఏకు 320 సీట్లు ఖాయమని ఎండీఎంకే నేత వైగో జోస్యం చెప్పారు. తమిళనాడుతోసహా దేశమంతా మార్పును కోరుతున్నారని వైగో తెలిపారు. ప్రజా వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను ఓటర్లు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మాజీ మంత్రి, పీఎంకే అభ్యర్థి అంబుమణి రాందాస్ విజయానికి ప్రచారం చేపట్టిన ఆయన మాట్లాడుతూ..బీజేపీ ఒంటరిగానే 272 సీట్లు గెలుచుకుంటుంది అని అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా మోడీ హవా కొనసాగుతోందని వైగో అన్నారు. ప్రధాని కావాలని కలలుకంటున్న జయలలిత కలలు కలలుగానే మిగిలిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. -
వీ ఫర్ విక్టరీ
సాక్షి, చెన్నై:‘‘వీ ఫర్ విజయకాంత్.... వీ ఫర్ వైగో... వీ ఫర్ ఓట్స్... వీ ఫర్ విక్టరీ.. ఇదే మా పేర్లలోని మొదటి అక్షరం’’ అంటూ రెండు రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ఒకే వేదిక మీద నుంచి ఓటర్లను అలరించారు. ఆ ఇద్దరు ఎవరో కాదు..ఒకరు డీఎండీకే అధినేత విజయకాంత్, మరొకరు ఎండీఎంకే అధినేత వైగో. ఒకరికి మద్దతుగా మరొకరు ప్రచారంలో దిగిన అపూర్వ కలయికకు బుధవారం విరుదునగర్ వేదిక అయింది. బీజేపీ కూటమి తరపున ఎండీఎంకే నేత వైగో విరుదునగర్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. తన గెలుపు లక్ష్యంగా వైగో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే కూటమిలోని డీఎండీకే అధినేత విజయకాంత్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ వస్తున్నా రు. కూటమి గెలుపు లక్ష్యంగా ఆయన ప్రచారం ఆసక్తికరంగా సాగుతోంది. తన దైన స్టయిల్లో ప్రసంగాలతో ఆకట్టుకునే పనిలో ఉన్న విజయకాంత్ బుధవారం విరుదునగర్‌లో పర్యటించారు. ఒక పార్టీ అధినేతకు మద్దతుగా మరో పార్టీ అధినేత ప్రచారానికి రావడంతో విరుదునగర్‌లో సందడి వాతావరణం నెలకొంది. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఉదయాన్నే విరుదునగర్ చేరుకున్న విజయకాంత్ కళింగ పట్టిలోని వైగో ఇంటికి వెళ్లారు. వైగో తల్లి మారియమ్మల్ ఆశీస్సులను విజయకాంత్ అందుకున్నారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తనకు మద్దతుగా ప్రచారానికి వచ్చిన విజయకాంత్‌ను నిలువెత్తు మాలతో వైగో సత్కరించారు. వీ ఫర్ విక్టరీ: ఇద్దరు అధినేతలు ఒకే ఓపెన్ టాప్ వాహనంలో శివాకాశి, విరుదునగర్‌లలో ప్రచారానికి కదిలారు. ప్రచారానికి వెళ్లిన చోటంతా ఈ ఇద్దరు నేతలకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ ఇద్దరు నేతలు కలసికట్టుగా ఒకే వేదిక మీదకు రావడం ఇదే ప్రపథమం. ఒక పార్టీ అధినేతకు మద్దతుగా మరోపార్టీ అధినేత ఓట్ల వేటకు రావడంతో ప్రచారం అంతా ఆసక్తికరంగా సాగింది. విజయకాంత్ తన దైన బాణిలో ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించారు. వైగో రాజకీయాల్లో తన కన్నా సీనియర్ అని, ఆయనకు మద్దతుగా ప్రచారం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందంటూ విజయకాంత్ పేర్కొనడం, ప్రచార మార్గం అంతా చప్పట్లతో మార్మోగడం విశేషం. తమ ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరం ఁవీరూ. గురించి విజయకాంత్ విశదీకరించారు. వీ ఫర్ విజయకాంత్ అని, వీ ఫర్ వైగో అని, వీ ఫర్ ఓట్స్ అని, వీ ఫర్ విక్టరీ అన్న ఛలోక్తులతో ప్రచారం సాగింది. వైగో పేరును, వారి చిహ్నం బొంగరాన్ని ఓటర్ల చేత చెప్పిస్తూ తన దైన బాణిలో ప్రసంగాలు చేసిన విజయకాంత్, చివరకు పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాలు ఎన్డీఏ కూటమిదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు డీఎంకే, అన్నాడీఎంకేలకు మార్చి మార్చి అధికారాలు అప్పగించింది చాలు అని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎన్డీఏ కూటమి ఆవిర్భవించిందని, ఈ కూటమి విజయపు కూటమిగా ప్రకటిస్తూ ధీమా వ్యక్తం చేశారు. -
డీఎంకే నుంచి అళగిరి బహిష్కరణ
చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరిపై బహిష్కృత వేటు పడింది. డీఎంకే పార్టీ నుంచి అళగిరిని మంగళవారం కరుణానిధి బహిష్కరించారు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలోనే పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్‌తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి లోక్‌సభ ఎన్నికల్లో తన మద్దతుదారులకు సీట్లు దక్కుతాయా? అని ఎదురు చూశారు. అయితే, స్టాలిన్ వర్గంపై చేయిగా నిలిచింది. దీంతో డీఎంకే అభ్యర్థులపై విమర్శలు, స్టాలిన్‌పై ఆరోపణాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు. సీట్ల కోసం కోట్లు దండుకున్నారంటూ ఆరోపించడం, దక్షిణాదిలో డీఎంకే డిపాజిట్లు గల్లంతు తథ్యం అన్న హెచ్చరికలు ఇస్తుండటం, ఇతర పార్టీల్లో ఆనందాన్ని నింపినట్టు అయింది. దాంతో అళగిరి మద్దతు ఇవ్వాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే మినహా మిగతా పార్టీ నేతలు ఆయన నివాసానికి క్యూ కట్టారు. బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు నిన్న అళగిరిని కలుసుకుని మద్దతు ఇవ్వాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆయనపై డీఎంకే వేటు వేయటం గమనార్హం. -
అళగిరి ఇంట క్యూ
సాక్షి, చెన్నై: అయ్యా... మద్దతు ఇవ్వండి అంటూ అళగిరి ఇంటి వద్ద క్యూ కట్టే పనిలో రాజకీయ పక్షాలు పడ్డాయి. బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు అళగిరిని కలుసుకుని మద్దతు ఇవ్వాలని విన్నవించారు. డీఎంకే, అన్నాడీఎంకే మినహా తక్కిన పార్టీల వాళ్లంతా అళగిరి మద్దతు కోసం క్యూ కడుతుండడంతో మదురై రాజకీయం ఆసక్తికరంగా మారింది. మదురై అంటే ఆధ్యాత్మికంగా అరుుతే అందరికీ గుర్తుకు వచ్చేది మీనాక్షి అమ్మవారి ఆలయం.రాజకీయంగా అయితే, అళగిరి అడ్డా. ఇక్కడి నుంచే దక్షిణాది జిల్లాల్లో డీఎంకే కింగ్ మేకర్‌గా అళగిరి అవతరించారు. డీఎంకే అధికారంలో ఉన్నా,లేకున్నా సరే మదురై అడ్డాగా అళగిరి చక్రం తిప్పేవారు. అయితే, ఇప్పుడు ఆయన అవసరం డీఎంకేకు లేదు. అళగిరి కోటను దాదాపుగా దళపతి, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ చీల్చేయడం ఇందుకు ఓ ఉదాహరణ. దక్షిణాదిలో సగం మంది అళగిరి వెంట, మిగిలిన వారు స్టాలిన్ వెంట సాగుతున్నారు. ఈ ఆధిపత్య రాజకీయమే కరుణానిధి కుటుంబంలో చిచ్చు రేపుతూ వ చ్చింది. చివరకు ఇటీవల పార్టీ నుంచి అళగిరిని బిహ ష్కరించారు. ఆరోపణాస్త్రం: పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి లోక్‌సభ ఎన్నికల్లో తన మద్దతుదారులకు సీట్లు దక్కుతాయా? అని ఎదురు చూశారు. అయితే, స్టాలిన్ వర్గంపై చేయిగా నిలిచింది. దీంతో డీఎంకే అభ్యర్థులపై విమర్శలు, స్టాలిన్‌పై ఆరోపణాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు. సీట్ల కోసం కోట్లు దండుకున్నారంటూ ఆరోపించడం, దక్షిణాదిలో డీఎంకే డిపాజిట్లు గల్లంతు తథ్యం అన్న హెచ్చరికలు ఇస్తుండటం, ఇతర పార్టీల్లో ఆనందాన్ని నింపినట్టు అయింది. డీఎంకే అభ్యర్థులను అళగిరి వ్యతిరేకిస్తున్న దృష్ట్యా, ఆయన్ను ప్రసన్నం చేసుకుని, ఆయన మద్దతుదారుల ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు రాజకీయ పక్షాలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం అళగిరిని ఎండీఎంకే నేత వైగో కలిశారు. అనధికారికంగా అళగిరిని అనేక మంది కలుస్తున్నా, అధికారికంగా వైగో భేటీ కావడం చర్చకు దారితీసింది. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అళగిరి వర్గం మద్దతు ఎటో? అన్న ప్రశ్న బయలు దేరింది. డీఎంకేను, అధినేత కరుణానిధిని మాత్రం రక్షించుకుంటానని అళగిరి తేల్చిన దృష్ట్యా, ఆ పార్టీ అభ్యర్థులకు ఆయన ఆశీస్సులు ఇక లేనట్టేనని తేలింది. మద్దతు కోసం...: అళగిరిని కలిసి వైగో మద్దతు కోరారో లేదో ఉదయాన్నే అళగిరి ఇంటి వద్ద క్యూ పెరిగింది. వాతావరణం అంతా సందడి సందడిగా మారింది. సినీ తరహాలో అయ్యా...తమకంటే, తమకు మద్దతు ఇవ్వాలన్నట్టుగా రాజకీయ పక్షాల అభ్యర్థులు బారులు తీరారు. ఉదయాన్నే బీజేపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు, శివగంగై అభ్యర్థి హెచ్ రాజా అళగిరిని కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. శివైగంగైలో తన గెలుపు లక్ష్యంగా సహకారం అందించాలని విన్నవించారు. దక్షిణాది జిల్లాల్లోని లోక్ సభ బరిలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించే రీతిలో మద్దతు సంకేతం ఇవ్వాలని విన్నవించారు. వెలుపలకు వచ్చిన హెచ్ రాజా మీడియాతో మాట్లాడుతూ, అళగిరిని మర్యాద పూర్వకంగా కలిసినట్టు తెలిపారు. తమ అధినేత రాజ్ నాథ్ సింగ్‌తో ఆయన ఢిల్లీలో సమావేశం అయ్యారని, మోడీ పీఎంగా వస్తే ఆహ్వానిస్తామని అళగిరి గతంలో ప్రకటించిన విషయూన్ని గుర్తు చేశారు. అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడంతో పాటుగా, తమ గెలుపున కు మద్దతు ఇవ్వాలని వేడుకున్నట్టు తెలిపారు. అనంతరం ఎండీఎంకే తేని అభ్యర్థి అలగు సుందరం అళగిరితో భేటీ అయ్యారు. తన గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు అళగిరిని కలిసిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు సైతం అళగిరిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ప్రసన్నం: డీఎంకే అభ్యర్థులను ఓడించడం లక్ష్యంగా అళగిరి కంకణం కట్టుకున్న దృష్ట్యా, ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ మదురైకు పయనం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన అళగిరి మద్దతు కోరే విషయాన్ని మదురైలో ప్రకటిస్తానన్నారు. మదురై కాంగ్రెస్ అభ్యర్థి సీఎన్ భరత్నాచ్చియప్పన్ మధ్యాహ్నం అళగిరిని కలిశారు. యువతకు పెద్ద పీట వేయాలని యువకుడైన భరత్ నాచ్చియప్పన్ అళగిరిని విజ్ఞప్తి చేశారు. దక్షిణాదిలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక శాతం మంది యువకులే ఉన్నారని మీడియాతో మాట్లాడుతూ భరత్ వివరించారు. కేంద్ర కేబినెట్లో పనిచేసిన మంత్రుల్లో అళగిరి ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. తాను మంత్రి పదవిలో లేనప్పటికీ, తనకు అవకాశం ఇచ్చినందుకు గాను ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రత్యేకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేయడం ఆయన మనస్సుల్లో మంచితనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. మదురైలో తన గెలుపు కోసం అళగిరి మద్దతు తప్పని సరిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అళగిరికి మద్దతు వినతుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతున్నారుు.మదురై వేదికగా కింగ్ మేకర్ రాజకీయం రక్తికట్టిస్తోంది మరి. అళగిరి వార్తకు కలుపుకోవాలి మళ్లీ ఫైర్: డీఎంకే అభ్యర్థులపై అళగిరి మళ్లీ విరుచుకు పడ్డారు. ఉదయం నుంచి అళగిరిని పలు పార్టీల నాయకులు కలవడంతో సాయంత్రం ఆయన్ను మీడియా కలిసింది. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అని ప్రశ్నించగా, ముందే చెప్పానుగా మద్దతుదారుల భేటీ అనంతరం వెల్లడిస్తానన్నారు. డీఎంకే అభ్యర్థులు కోట్లు చల్లి మరీ సీట్లు తెచ్చుకున్నారని, వీరందరికీ ఓటర్లు గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. తెన్కాశి బరిలో నిలబడ్డ పుదియ తమిళగం నేత కృష్ణ స్వామిని ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి పనికి రాని ఆయనకు ఒక పదవి చాలదా? అని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మరొకరికి అవకాశం ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించారు. పార్టీ తన చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా చేస్తానని హెచ్చరించడం గమనార్హం. -
ఇండియా పేరు మారుస్తా
నాకే అధికారం వస్తే ఇండియా పేరు మార్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చేస్తానని అంటున్నారు తమిళనాట ఎండీఎంకె అధినేత వైగో. అసలు భిన్నత్వంలో ఏకత్వం అంటూ మాట్లాడేవారు క్రమేపీ అధికారమంతా ఢిల్లీలోనే కేంద్రీకృతం అయ్యేలా చేశారని, అందుకే దేశాన్ని శక్తివంతంగా చేసేందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని దేశం పేరు మారుస్తానని వైగో తన పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. అంతే కాదు. అసలు తమిళ ఈళంపై రిఫరెండం జరగాలని, ఎల్ టీ టీ ఈ పై నిషేధాన్ని తొలగిస్తామని కూడా ఆయన తన పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. పైగా ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేయిస్తామని కూడా ఆయన వాగ్దానం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే వైగో తమిళనాట బిజెపితో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. బిజెపి మరి ఈ విధానాలను ఆమోదిస్తుందా లేదా అన్నది అసలు ప్రశ్న. అయినా మారిస్తే దేశం తీరు మార్చాలి కానీ, పేరు మారిస్తే ఏమవుతుందని అంటున్నారు రాజకీయ పండితులు. -
కూటమి ఖరారు
బీజేపీ జాబితా విడుదల 25 స్థానాలు ఖాయమని పార్టీ ధీమా ఒకే వేదికపై రాజ్‌నాథ్, విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్ చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీలో సీట్ల కేటాయింపులో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి ఎట్టకేలకు కూటమి ఖరారైంది. సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగడంతో అభ్యర్థుల జాబితా గురువారం విడుదలైంది. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడింది. అయితే అదే స్థాయిలో తలనొప్పులకు కారణమైంది. ఎవరికి వారు ప్రతిపక్ష పార్టీలుగా చలామణి అవుతున్న డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మిత్రపక్షాలుగా మారిపోక తప్పలేదు. కూటమి ధర్మం ప్రకారం మిత్రులైనా పాత వైరుధ్యాలను పక్కన పెట్టలేకపోయిన ఆ పార్టీ నేతలంతా సీట్ల కోసం పట్టుపట్టారు. ఒకరు కోరిన స్థానాన్ని మరొకరు కోరడమే కాదు, చివరికి బీజేపీ ఎంచుకున్న స్థానాల కోసం సైతం పట్టుపట్టారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కూటమిలో చేరడానికే ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై సీట్ల కోసం పట్టుబట్టారు. ఒక దశలో కూటమి చీలిపోతుందని, పీఎంకే,కూటమి ఖరారు డీఎండీకేలు వైదొలగిపోతాయనే ప్రచారం జరిగింది. మిత్రులకు నచ్చజెప్పేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర రావు, జాతీయ నేత ఇల గణేశన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 10 రోజుల క్రితమే వెల్లడి కావాల్సిన జాబితా వాయిదాపడుతూనే వచ్చింది. సారొచ్చారు పోలింగ్‌కు నెల రోజులుండగా బీజేపీ కూటమి జాబితాలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్న రాజ్‌నాథ్ వచ్చీ రాగానే మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడ్డారు. విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. స్వల్ప వ్యవధిలోనే అందరి మధ్య సఖ్యత సాధ్యమవుతుందని ఆశించిన రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి మిత్రులు చుక్కలు చూపించారు. సీట్ల ఖరారు చేసుకుని 12 గంటలకు ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో వెల్లడి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. మీడియా వారు అరగంట ముందుగానే అంటే 11.30 గంటలకే చేరుకోగా ప్రతి అరగంటకు ఒకసారి పొడిగిస్తూ వచ్చారు. ఆ తరువాత అందరూ భోజనాలు చేసి రండని ప్రకటించారు. మిత్రులతో చర్చలు కొలిక్కిరాకపోవడమే మీడియా సమావేశం గంటలకొద్దీ వాయిదాకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. సాయంత్రం 4 గంటలు దాటుతుండగా రాజ్‌నాథ్ సింగ్ వచ్చి మీడియాతో మాట్లాడారు. 25 స్థానాల్లో గెలుపు ఖాయం బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏర్పడిన బలమైన కూటమి అభ్యర్థులు 25 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మరో రెండుసార్లు తమిళనాడులో పర్యటిస్తారని చెప్పారు. తమిళనాడు ప్రజల సమస్యలను, ముఖ్యంగా శ్రీలంక, తమిళ జాలర్ల వివాదాన్ని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ పాలనలో ఒక్క తమిళనాడు మాత్రమే కాదు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీరుతాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద కూటమిగా ఏర్పడటం వల్ల మిత్రపక్షాల్లో కొన్ని అసంతృప్తులు సహజమని అన్నారు. అయితే అవన్నీ వైదొలిగాయని, కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి పార్టీ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుందని చెప్పారు. డీఎండీకే 14, బీజేపీ 8, పీఎంకే 8, ఎండీఎంకే 7, ఐజేకే, కేఎండీకే ఒక్కో స్థానం కేటారుుస్తూ జాబితా ఖరారైందని ఆయన తెలిపారు. తమిళనాడు జాబితాను అధికారికంగా ఆయన విడుదల చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన బావమరిది సుదేష్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ రాజ్నాథ్తోపాటూ వేదికకెక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు. -
పొత్తులతో బీ(జే)పీ
బలమైన పార్టీలతో పొత్తు కుదిరిందని సంబరపడుతున్న బీజేపీకి మిత్ర పక్షాలు బీపీ పుట్టిస్తున్నారుు. ఎండీఎంకే, పీఎంకే మధ్య సయోధ్య ‘కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది. సీట్ల కేటాయింపులో ఇరు పార్టీలు పట్టుబట్టడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తద్వారా అభ్యర్థుల జాబితా విడుదల వాయిదా పడింది. ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు, పొత్తులతో ప్రతిపక్ష పార్టీలను చిత్తు చేసేందుకు బలమైన కూటమిగా ఏర్పడాలని అన్ని పార్టీలతోపాటు బీజేపీ సైతం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆశించినట్లుగానే రాష్ట్రంలో బలమైన కూటమిగా ఏర్పడడం తో ఆ పార్టీ నేతల్లో సంతోషం ఉరకలేసింది. రాష్ట్రంలోని రెండు బలమైన ప్రత్యర్థులుగా చలామణి అవుతున్న డీఎండీకే, పీఎంకేలు బీజేపీ కూట మిలో చేరడం వల్ల మిత్రపక్షాలుగా మారిపోయాయి. ఆ రెండు పార్టీలు తమతో జతకట్టడం వల్ల బీజేపీ నేతల్లో నెలకొన్న సంతోషం సీట్ల సర్దుబాటు చేయడంలో ఆవిరైపోయింది. నియోజకవర్గాల పంపకాలపై బీజేపీ కూటమి మిత్ర పక్షాలతో నెల రోజులుగా సాగిన చర్చ లు దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఈ క్రమం లో శుక్రవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల ఆధ్వర్యంలో జాబితాను ప్రకటించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్‌రాధాకృష్ణన్ నిర్ణయించుకున్నారు. ఉదయం 6.15 గంటలకు చెన్నై నుంచి ఢిల్లీకి విమానం టికెట్టు కూడా బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డీఎండీకే, పీఎంకే సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాంబు పేల్చారుు. సమష్టిగా సాగిన చర్చలతో రూపొందించిన తాత్కాలిక జాబితా ప్రకారం డీఎండీకేకు 14 స్థానాలు, బీజేపీకి 8, పీఎంకేకు 8, ఎండీఎంకేకు 6 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఐజేకే, కొంగునాడు, పుదియనీది కట్చి, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. నాలుగు స్థానాల్లో కిరికిరి: సీట్ల సర్దుబాటులో దాదాపు ఓకే అనిపించుకున్న బీజేపీకి నాలుగు స్థానాలు తలనొప్పిగా మారాయి. పొత్తు దశలోనే పీఎంకే పది స్థానాలను ఖరారు చేసుకుంది. బీజేపీ విజ్ఞప్తి మేరకు వాటిలో రెండిం టిని వదిలేసేందుకు సిద్ధమైంది. ఆరణి, అరక్కోణం డీఎండీకే కోరుతోంది. సేలంను డీఎం డీకే, బీజేపీ రెండూ కోరుతున్నారుు. కృష్ణగిరి స్థానంపై కూడా మిత్రపక్షాల్లో పోటీ నెలకొం ది. ఆరణిలో కేంద్ర మాజీ మంత్రి ఏకే మూర్తి, కృష్ణగిరిలో జీకే మణి, సేలంలో పీఎంకే యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి అరుళ్ ఆరునెలలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆరణి, అరక్కోణం, సేలం, కృష్ణగిరి స్థానాలపై నెల కొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం తెల్లవారుజాము 3.30 గంటల వరకు చర్చలు జరిపారు. అయినా డీఎండీకే, పీఎంకే భీష్మిం చుకోవడంతో తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ రెండు పార్టీలు బీజేపీ కూటమి నుంచి వైదొలుగుతాయా అనే అనుమానం నెలకొంది. దీంతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరరావు హుటాహుటిన శుక్రవారం చెన్నై చేరుకుని పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మిత్రపక్ష పార్టీలకు సీట్లు పంపకాల విషయంలో ప్రతిష్టంభన నెలకొన్నందున శుక్రవారం ప్రకటించాల్సిన పార్టీ జాబితాను రెండు రోజులు వాయిదా వేసినట్లు తెలిపారు. -
కమల వికాసం
సీట్ల పందేరం డీఎండీకేకు పద్నాలుగు పీఎంకే, బీజేపీలకు తలా ఎనిమిది ఎండీఎంకేకు ఏడు రెండు రోజుల్లో అధికారిక {పకటన బీజేపీలోకి ఎన్ఆర్ కాంగ్రెస్ సాక్షి, చెన్నై: రాష్ర్టంలో కమలం వికసించింది. మెగా కూటమికి పునాదులు పడడంతో సీట్ల పందేరంలో బీజేపీ మిత్రులు బిజీ బిజీగా ఉన్నారు. డీఎండీకేకు 14, పీఎంకేకు ఎనిమిది, బీజేపీకి ఎనిమిది, ఎండీఎంకేకు ఏడు, ఇతర మిత్రులకు మూడు సీట్లు కేటాయించేలా చర్చలు సాగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల ఎంపికలో పార్టీలు పట్టువీడడం లేదు. మరో రెండు రోజుల్లో అధికారికంగా కూటమిని ప్రకటించి, ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. పుదుచ్చేరిలోని ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో పొత్తుకు సిద్ధ పడింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు డీఎంకే, అన్నాడీఎంకేలు తమను అక్కున చేర్చుకునేనా...! అన్న ఎదురు చూపుల్లో బీజేపీ వర్గాలు ఉండే వారు. ఆ రెండు ప్రధాన పార్టీలు తిరస్కరించడంతో చివరకు ఒంటరిగా రాష్ట్రంలో మిగిలారు. గత లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఒంటరిగానే ఎదుర్కొవాల్సి వచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు తెరమీదకు రావడంతో రాష్ర్టంలోని కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎం కేలకు ప్రత్యామ్నాయంగా తమ నేతృత్వంలో మెగా కూటమి లక్ష్యంగా ప్రయత్నాల్లో పడ్డారు. వైగో నేతృత్వంలోని ఎండీఎంకే, పచ్చముత్తు పారివేందన్ నేతృత్వంలోని ఐజేకేలతో పాటు కొంగు మక్కల్ కట్చి, కొంగు దేశీయ కట్చి, పుదియ నిధి కట్చి తదితర పార్టీలు బీజేపీ వెంట నడిచేందుకు సిద్ధపడ్డాయి. మరింత బలం చేకూరాలంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకేను, వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన పీఎంకేను తమ వెంట తిప్పుకోవడమే లక్ష్యంగా బీజేపీ వర్గాలు తీవ్రంగా కుస్తీలు పట్టారు. ఆ పార్టీ నాయకులు ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చివరకు బీజేపీ అధిష్టానం పెద్ద రంగంలోకి దిగారు. ఫలించిన మంతనాలు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి పావులు కదిపారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సైతం డీఎండీకే నేత విజయకాంత్, పీఎంకే నేత రాందాసుతో వేర్వేరుగా మాట్లాడినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలోని బిజేపి ప్రధాన నేతలు పొన్ రాధాకృష్ణన్, ఇలగణేషన్ , మోహన్ రాజ్ తదితరులు గురువారం ఢిల్లీకి ఉరకలు తీశారు. ఢిల్లీ నుంచి ఎలాంటి రాయబారం సాగించారో ఏమోగానీ అదే రోజు రాత్రి తాము బీజేపీతో కూటమికి రెడీ అవుతూ, సీట్ల పందేరానికి సిద్ధమని డీఎండీకే, పీఎంకే అధినేతలు విజయకాంత్, రాందాసు ప్రకటించారు. సీట్ల పందేరం: డీఎండీకే, పీఎంకే బీజేపీలోకి చేరడంతో కమలనాథుల ఆనందానికి అవధులు లేకుండా పోయూరుు. ఇన్నాళ్లు అన్నాడీఎంకే, డీఎంకేల మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉండడం, ఇప్పుడు ఆ రెండు ప్రధాన కూటముల్ని తాము ఢీకొట్టబోతోండడంతో బీజేపీ వర్గాలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.పొత్తుకు రెడీ అని గురువారం రాత్రి ప్రకటించారో లేదో శుక్రవారం ఉదయం నుంచి సీట్ల పందేరం ప్రారంభమైంది. ఢిల్లీ వెళ్లిన నేతలు హుటాహుటిన చెన్నైకు ఉదయాన్నే చేరుకున్నారు. కమలాలయంలో సీట్ల పందేరం చర్చల్లో బిజీ బీజీ అయ్యారు. పీఎంకే అధ్యక్షుడు జీకే మణి నేతృత్వంలోని ఆ పార్టీ బృందం టీ నగర్‌లోని కమలాలయంలో రెండు గంటల పాటు సీట్ల పంపకాల చర్చల్లో మునిగారు. తమకు పది సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టగా, చివరకు ఎనిమిదికి సర్దుకున్నట్టు తెలిసింది. అలాగే సాయంత్రం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయూనికి చేరుకున్న బీజేపీ కమిటీ సభ్యులు సీట్ల పంపకాలపై చర్చించారు. తమకు 18 సీట్లు కావాలని డీఎండీకే డిమాండ్ చేయగా, 14 సీట్లకు ఒకే అయినట్టు తెలిసింది. కొన్ని స్థానాల్ని బీజేపీ, డీఎండీకే, పీఎంకే ఆశిస్తుండడంతో సీట్ల పందేరం కొలిక్కి రావాల్సి ఉంది. ఇవే సీట్లు ఇప్పటికే పీఎంకే పది స్థానాల బరిలో అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. వాటినే తమకు కేటారుుంచాలని పట్టుబడుతోంది. కూటమి ధర్మం మేరకు రెండు స్థానాల్ని వదులుకునేందుకు సిద్ధ పడుతున్నా, ధర్మపురి సీటును కేటారుుంచాల్సిందేనని కోరుతోంది. ఇక్కడి నుంచి ఆ పార్టీ యువజన నేత అన్భుమణి బరిలోకి దిగనున్నారు. డీఎండీకే కాంచీపురం, శ్రీ పెరంబదూరు, తిరువళ్లూరు, ధర్మపురి, ఆరణి, విల్లుపురం, కళ్లకురిచ్చి, సేలం, దిండుగల్, విరుదునగర్, కృష్ణగిరి, ఈరోడ్, కడలూరు, తిరునల్వేలి స్థానాల్ని ఆశిస్తోంది. ఇందులో ధర్మపురి కోసం పీఎంకే, శ్రీ పెరందూరు కోసం బీజేపీ, కాంచీపురం కోసం ఎండీఎంకేలు పట్టుబడుతున్నాయి. ఈ సీట్లను వదలు కోవాల్సి వస్తే, తమకు ప్రత్యామ్నాయంగా అరక్కోణం, తిరుప్పూర్, తిరువణ్ణామలై సీట్లను కేటాయించాలన్న డిమాండ్‌ను డీఎండీకే తెరపైకి తెచ్చింది. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై మల్లగుల్లాలు ఎదురుకావడంతో త్వరితగతిన సీట్ల పందేరం ముగించేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగనుంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల్లో చెన్నై రానున్నారని, ఆయన సమక్షంలో అధికార పూర్వకంగా కూటమి ప్రకటన వెలువడనున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్ఆర్ కాంగ్రెస్ పుదుచ్చేరిలోని ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో దోస్తీకి సిద్ధ పడింది. పుదుచ్చేరి సీటును ఆ పార్టీ ఆశిస్తుండడంతో బీజేపీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ సీటును పీఎంకే సైతం కోరుతుండడం గమనార్హం. తాము బీజేపీతో దోస్తీ కట్టనున్నామని, ఈ నెల పన్నెండున అధికార పూర్వకంగా అభ్యర్థిని ప్రకటించనున్నామని ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి పేర్కొన్నారు. -
నీరా‘జనం’
సాక్షి, చెన్నై : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ సత్తాను నిరూపించుకునేందుకు కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. తమ నేతృత్వంలో మెగా కూటమికి కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడు తదితర పార్టీలు కలసి రావడంతో, రాష్ట్రంలో తమకు పట్టున్న చోట్ల గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ పవనాలు దేశంలో వీస్తుండడంతో ఆయన నేతృత్వంలో కూటమి మహానాడుకు బీజేపీ వర్గాలు నిర్ణయించాయి. వండలూరు వేదికగా వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేశారు. మోడీని చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినే ందుకు పెద్ద ఎత్తున జన సందోహం తరలి వచ్చింది. ఆ పరిసరాల్లోని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జనం మహానాడు ఆవరణలోకి ప్రవేశించారు. విచిత్ర వేషధారణలతో, మోడీ మాస్కులతో, కమలం చిహ్నాన్ని చేత బట్టిన పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహానాడుకు బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు, జాతీయ కార్యదర్శి మురళీ ధర్ రావు, రాష్ట్ర నేతలు ఇలగణేశన్, పొన్ రాధాకృష్ణన్, తమిళిసై సౌందరరాజన్, హెచ్ రాజా, ఎండీఎంకే నేతలు మలై్ల సత్య, గణేషమూర్తి, ఐజేకే నేత పచ్చముత్తు పారివేందన్, కొంగునాడు నేత ఈశ్వరన్ తదితరులు వేదిక మీద ఆశీనులయ్యారు. తొలుత బీజేపీ స్థానిక నాయకులు, కూటమి పార్టీల నాయకుల ప్రసంగాలు సాగాయి. మోడీని పీఎం చేయడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ తమ కూటమి విజయ ఢంకా మోగించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మరో ఉద్యమం: కొంగునాడు నేత ఈశ్వరన్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం కోసం, ఓట్ల కోసం మోడీ నేతృత్వంలో మహానాడు జరగడం లేదన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు మోడీ మహోద్యమం చేపట్టారని, ఆయన నాయకత్వంలో అందరూ సైనికుల్లా కాంగ్రెస్‌పై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ఐజేకే నేత పచ్చముత్తు పారివేందన్ మాట్లాడుతూ, దేశాన్ని పట్టి పీడిస్తున్న, దోచుకుంటున్న కాంగ్రెస్‌ను తరిమి కొట్టేందుకు మరో స్వాతంత్య్ర ఉద్యమానికి మోడీ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఆ నాడు బ్రిటీషు వారిని దేశం నుంచి తరిమి కొట్టేందుకు గాంధీ స్వాతంత్య్ర సంగ్రామానికి ఏ విధంగా పిలుపునిచ్చారో, అదే తరహాలో కాంగ్రెస్‌ను దేశం నుంచి తరిమికొట్టేందుకు మోడీ నడం బిగించారని చెప్పారు. ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు యూపీఏ సర్కారుపై ధ్వజమెత్తారు. ఆ పార్టీకి చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందని, మోడీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రధాని అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించామని, కాంగ్రెస్‌కు ఆ దమ్ము ఉందా అని సవాల్ చేశారు. ఆరు గంటలకు చెన్నై చేరుకోవాల్సిన నరేంద్ర మోడీ రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు చేరుకున్నారు. ఆయన రాక ఆలస్యం అయినా, ఆయన ప్రసంగాన్ని వినేందుకు జనం ఎదురు చూడటం విశేషం. అలాగే, తన ప్రసంగాన్ని ఆరంభించే సమయంలో తమిళంలో మాట్లాడి ఆకట్టుకున్నారు. నిరసనలు : మోడీ చెన్నై పర్యటనను నిరసిస్తూ, ఇండియూ దేశీయ లీగ్ నేతృత్వంలో పలు చోట్ల నల్ల జెండాల ప్రదర్శన నిర్వహించారు. మధ్యాహ్నం టీ నగర్‌లోని కమలాలయాన్ని ముట్టడి చేందుకు యత్నించిన ఓ బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. టీ నగర్ బోగ్ రోడ్డులో మోడీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తాంబరం పరిసరాల్లోనూ నల్ల జెండాల ప్రదర్శనకు యత్నించిన వాళ్లను ముందుగానే పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మోడీ సభకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. మోడీ సభకు ముందుగా ఉదయాన్నే ఆ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మద్యనిషేధం అమలు చేయూలి
టీనగర్, న్యూస్‌లైన్:రాష్ట్రంలో టాస్మాక్ దుకాణాలు మూసివేసి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయూలంటూ ఎండీఎంకే సర్వసభ్య సమావేశంలో తీర్మానం చే శారు. చెన్నై వానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి కల్యాణ మండపంలో ఎండీఎంకే సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ప్రిసిడీయం చైర్మన్ దురైస్వామి దీనికి అధ్యక్షత వహించారు. సర్వసభ్య కమిటీ, కార్యవర్గ కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శులు సుమారు 1500 మంది పాల్గొన్నారు. ముందుగా ఈ సమావేశానికి ఉదయం 10.20 గంటలకు చేరుకున్న ప్రధాన కార్యదర్శి వైగోకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తర్వాత 10.30 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఎండీఎంకే సర్వసభ్య సమావేశంలో మొత్తం 17 తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ఈ సమావేశంలో తిరువళ్లూరు నగర కార్యదర్శి కేఎం వేలు, కే సెల్వపాండియన్, మైలై ఎస్ వెంకటేషన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య తీర్మానాలు.- పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తొలగించే విధంగా బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయూలి. శ్రీలంకలో సాధారణ ఓటింగ్ జరపాలని, ఈ ఓటింగ్ ద్వారా శ్రీలంక తమిళులు, రాష్ట్రంలో గల ప్రత్యేక శిబిరాలలో నివసిస్తున్న తమిళులు ఓటు వేసేందుకు ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలు సాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. కావేరి ట్రిబ్యునల్ తీర్పును అమలు జరిపేందుకు కావేరి మేనేజ్మెంట్ కమిటీ, కావేరి డిసిప్లినరీ కమిటీ వంటి ఇరు కమిటీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి.కేన్సర్ కారకంగా మారిన టాస్మాక్ దుకాణాలను మూసివేసి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదం అమలు జరపాలి. -
పొత్తు ఖరారు
సాక్షి, చెన్నై: ఎండీఎంకే, బీజేపీల పొత్తు ఖరారు అయింది. సీట్ల పందేరం కొలిక్కి రావడంతో ఇక రెండు పార్టీలు చెట్టాపట్టాల్ వేసుకుని తిరగనున్నాయి. మోడీ సభ సక్సెస్ లక్ష్యంగా రెండు పార్టీల నేతలు ఆదివారం చెన్నైలో సమీక్షించారు. కమలాలయానికి వచ్చిన ఎండీఎంకే నేత వైగోకు బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ ఘన స్వాగతం పలికారు. బీజేపీ నేతృత్వంలో కూటమి ఏర్పాటుకు కమలనాథులు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేతో కలసి గెలుపు కూటమి లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. తొలి విడతగా ఎండీఎంకేతో చర్చలు జరిపారు. తమతో దోస్తీకి ఎండీఎంకే నేత వైగో ముందుగానే సుముఖం వ్యక్తం చేయడం, రెండు పార్టీల ముఖ్య నాయకుల చర్చలు సత్ఫలితాల్ని ఇవ్వడంతో దాదాపుగా సీట్ల పందేరం కొలిక్కి వచ్చింది. కమలాలయంలో వైగో: చాలా కాలం తర్వాత ఆదివారం ఎండీఎంకే నేత వైగో కమలాలయంలో అడుగు పెట్టారు. తమ కార్యాలయానికి వచ్చిన వైగో, ఆయన పార్టీ నాయకులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, జాతీయ నాయకులు మురళీధర్ రావు, ఇలగణేశన్, మహిళా నాయకులు తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మోడీ సభ విజయవంతంపై సమీక్షించారు. గుజరాత్లో మోడీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు. మీడియా సమావేశంలో వైగో, పొన్ రాధాకృష్ణన్, మురళీ ధర్‌రావు మాట్లాడారు. కలసికట్టుగా...: ఫిబ్రవరి 8న వండలూరులో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేతృత్వంలో సభ జరగనున్నదని గుర్తు చేశారు. ఈ సభ విజయవంతానికి రెండు పార్టీలు కలసికట్టుగా కృషి చేస్తాయని చెప్పారు. ఎండీఎంకే, బీజేపీల బంధం ఇప్పటిది కాదని, 1998 నుంచి స్నేహ పూర్వకంగానే వ్యవహరిస్తున్నాయన్నారు. యువతను ఆకర్షించడం లక్ష్యంగా రాష్ట్రంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. ఎండీఎంకే , బీజేపీల పొత్తు ఖరారు అయిందని, డీఎండీకే, పీఎంకేలతో చర్చలు జరపాల్సి ఉందన్నారు. చర్చలు ఆశాజనకంగా ఉంటాయన్నారు. బీజేపీ, ఎండీఎంకే సీట్ల పందేరం గురించి ప్రశ్నించగా, అందుకు ఓ కమిటీ ఉందని, అది చూసుకుంటుందంటూ వైగో దాట వేశారు. మోడీ పేరిట దుకాణాలు: నరేంద్ర మోడీ పేరిట దుకాణాల ఏర్పాటుకు బీజేపీ సిద్ధం అయింది. తమ ప్రచారంలో భాగంగా సరికొత్తగా మోడీ నామంతో టీ దుకాణాలు, హోటళ్లు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన అనేక దుకాణాలు ఉన్న దృష్ట్యా, వాటి పేర్లు మార్చే రీతిలో చర్యలు చేపట్టారు. మదురైలోని నాయకులు, కార్యకర్తలు మోడీ పేరును తమ దుకాణాలకు నామకరణం చేయడం విశేషం. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు మాట్లాడుతూ, టీ దుకాణాల్ని కాంగ్రెస్ వర్గాలు అవహేళన చేశాయని గుర్తు చేశారు. దీనికి ప్రతిగా తమ నేతలు చక్కటి సమాధానాలే ఇచ్చారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆ దుకాణాలకు మరింత పేరు కల్పించడంతో పాటుగా మోడీ నామంతో తమ పార్టీకి ప్రచార అస్త్రం దక్కినట్టైందని పేర్కొన్నారు. -
డీల్ ఓకే !
చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్రంలో అధికారం మాదేనన్న ధీమాతో ముందుకు వెళుతున్న భారతీయ జనతా పార్టీ పొత్తుల ఖరారులో సైతం వడివడిగా అడుగులేస్తోంది. ఎండీఎంకేతో పొత్తు ఇప్పటికే ఖరారైపోగా సీట్ల సర్దుబాటుపై గురువారం చర్చలకు శ్రీకారం చుట్టారు.కేంద్రంలో అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలతోనే పీఠం దక్కించుకోగలమనే సత్యాన్ని గ్రహించాయి. కాంగ్రెస్ మద్దతును కోరేవారు కరువైపోగా, బీజేపీవైపు అనేక పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీ సైతం వారి చెంత చేరేందుకు చొరవచూపుతోంది. అన్నాడీఎంకే, డీఎంకేలు రెండునూ తమ కూటమిలో చేరే అవకాశం లేకపోవడంతో ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడంపై బీజేపీ దృష్టి సారించింది. పొత్తు సూత్రప్రాయంగా ఖరారైపోగా వాటికి తుదిరూపు ఇచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ ఎండీఎంకే కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. పార్టీ అధినేత వైగోను దుశ్శాలువతో సన్మానించి చర్చలు ప్రారంభించారు. రాష్ట్రంలో బీజేపీ ఇటీవలే కొంత పుంజుకున్నా తమిళ భాషాపరమైన ఓటు బ్యాంకు స్థాయికి చేరుకోలేదు. ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న రాష్ట్రంలో ఆయా నేతలదే ఆధిక్యతగా ఉంది. ఈ కారణంగా బీజేపీ నుంచి తమ వాటాగా అధికశాతం సీట్లు పొందేందుకు వైగో పట్టుపట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 39, పుదుచ్చేరి ఒకటి కలుపుకుని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. అయితే బీజేపీ కూటమిలోకి ఇంకా ఏఏ పార్టీలు వస్తాయో ఇంకా తేలలేదు. ఈ పరిస్థితుల్లో వైగో కోరుతున్న శాతం సీట్లపై బీజేపీ ఇప్పుడే హామీ ఇవ్వలేదు. పీఎంకే, డీఎండీకే పార్టీలు సైతం బీజేపీ పంచన చేరిన పక్షంలో మొత్తం 40 సీట్లను నాలుగు భాగాలు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సంకట స్థితిలో బీజేపీ, ఎండీఎంకే పార్టీల మధ్య గురువారం సాగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అయినా ఆ రెండు పార్టీలు శుక్రవారం మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉంది. డీఎండీకే అధినేత విజయకాంత్ పొత్తులపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తేగానీ రాష్టంలోని అన్ని పార్టీల చర్చలు కొలిక్కిరావు. ఎండీఎంకే చర్చల్లో పాల్గొనాల్సిన బీజేపీ డిల్లీ దూత మురళీధర్‌రావు అనివార్య కారణాల వల్ల చెన్నై చేరుకోలేకపోయారు. -
పొత్తులపై చర్చలకు సిద్ధం
లోక్‌సభ ఎన్నికల పొత్తులపై చర్చకు బీజేపీ సిద్ధం అయింది. ఈనెల 23న ఎండీఎంకేతో సీట్ల పందేరం, పొత్తులపై చర్చించనున్నది. ఆ తర్వాత డీఎండీకే, పీఎంకేతో చర్చలకు కమలనాథులు నిర్ణయించారు. ఎన్నికల్లో కూటమిపై తమ నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తామని పీఎంకే నేత రాందాసు మంగళవారం ప్రకటించారు. సాక్షి, చెన్నై : తమ నేతృత్వంలో కూటమి ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. వారితో కలిసి నడిచేందుకు ఎండీఎంకే నేత వైగో సిద్ధమయ్యారు. తమ కూటమిలోకి డీఎండీకే, పీఎంకేలను ఆహ్వానించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, సీనియర్ నేత ఇలగణేశన్ నేతృత్వంలో ఓ కమిటీ సైతం ఏర్పాటైంది. ఈ నెల 23న కమలాలయంలో ఎండీఎంకేతో చర్చలకు ఈ కమిటీ సిద్ధమైంది. ఎండీఎంకే నేత వైగో నేతృత్వంలోని ఆ పార్టీ నాయకులు మాశిలామణి, గణేష్ మూర్తితో కూడిన బృందం బీజేపీ కమిటీతో చర్చలకు నిర్ణయించింది. ఏడు స్థానాల్లో పోటీ లక్ష్యంగా ఎండీఎంకే ముందుకెళుతోంది. ఈ చర్చల ద్వారా ఆ స్థానాల కేటాయింపుపై తుది నిర్ణ యం తీసుకుంటారా? లేదా మరో చర్చకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. అదే రోజు ఈశ్వరన్ నేతృత్వంలోని కొంగునాడు పార్టీ సైతం బీజే పీతో చర్చలు జరుపనున్నది. ఈ చర్చల అనంతరం డీఎండీకేను నేరుగా కలవడం లేదా, ఢిల్లీ దూతల ద్వారా విజయకాంత్‌కు గాలం వేయడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. పీఎంకేను తమ వైపు తిప్పుకునేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లో నిర్ణయం: తమ కోసం బీజేపీ తలుపులు తెరవడం, డీఎంకే సైతం అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాల్లో ఉండటంతో పీఎంకే అధినేత రాందాసు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించే పనిలో పడ్డారు. ద్రవిడ పార్టీలతో చేతులు కలిపేది లేదని గతంలో చెప్పారు. మంగళవారం సైతం అదే పల్లవి అందుకున్నారు. అయితే, కూటమిపై తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని, ఒంటరిగా పోటీ చేయడమా లేదా, తమను ఆహ్వానిస్తున్న వారి తో చర్చలకు సిద్ధ పడటమా..? అన్నది తేలుస్తామని పేర్కొనడం గమనార్హం. -
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చెలిమికి ఎండీఎంకే
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చెలిమికి ఎండీఎంకే నేత వైగో ఆసక్తిగా ఉన్నారు. పార్టీ మహానాడు వేదికగా పరోక్షంగా సంకేతాలు పంపారు. పొత్తు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమతో చెలిమికి ఎండీఎంకేను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్.రాజా తెలిపారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ద్రవిడ పార్టీలు బీజేపీ, ఎండీఎంకేలను పక్కన పెట్టేశాయి. అసెంబ్లీ ఎన్నికల్ని బీజేపీ ఒంటరిగా ఎదుర్కొంది. ఎన్నికలకే దూరంగా ఉండిపోయింది ఎండీఎంకే. ఎన్డీఏ హయూంలో తమిళనాట బీజేపీ రాష్ట్ర నేతలు చక్రం తిప్పారు. ప్రస్తుతం బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించిన నేపథ్యంలో నేతల్లో నూతనోత్సాహం నిండింది. తిరుచ్చి వేదికగా జరగనున్న మోడీ సభను విజయవంతం చేయడంలో నేతలు నిమగ్నమయ్యూరు. మరోవైపు ఒంటరిగా ఉన్న ఎండీఎంకే పొత్తులపై దృష్టి పెట్టింది. రెండు రోజుల క్రితం విరుదునగర్ మహానాడు వేదికగా ఎండీఎంకే నేత వైగో తన సత్తా చాటారు. దక్షిణాదిలోని కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో తనకు పట్టుందని నిరూపించుకున్నారు. బీజేపీకి సైతం దక్షిణ తమిళనాడులో ఓటు బ్యాంక్ ఆశాజనకంగా ఉంది. దీంతో ఇద్దరూ కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని వైగో గ్రహించారు. ఈ క్రమంలో బీజేపీతో కలిసి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు. పరోక్ష సంకేతాలు బీజేపీతో దోస్తికి సిద్ధమని విరుదునగర్ మహానాడు వేదికగా వైగో పరోక్ష సంకేతాలు పంపారు. మహానాడులో ప్రసంగించిన వైగో డీఎంకేపై దుమ్మెత్తి పోశారు. అన్నాడీఎంకే చీత్కారంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈలం తమిళుల్ని పొట్టన పెట్టుకుందంటూ కాంగ్రెస్‌పై సమరభేరి మోగించారు. చివరగా బీజేపీ పాలనను పొగడ్తలతో ముంచెత్తారు. ఈలం తమిళుల కోసం మాజీ ప్రధాని వాజ్‌పేయి కృషి చేశారంటూ ప్రశంసించారు. అలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు ద్వారానే ఈలం తమిళులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రత్యర్థితో కలిసి పనిచేయడానికి సిద్ధమంటూ బీజేపీతో చెలిమికి పరోక్షంగా సంకేతాలిచ్చారు. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకేతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర నేతలు అంత ఆసక్తిగా లేరు. ఆ పార్టీలు ఇచ్చే ఒకటి రెండు సీట్లు వద్దనే తలంపులో ఉన్నారు. ఈలం మద్దతు పార్టీల్ని ఏకం చేసి తమ నేతృత్వంలోనే ఓ కూటమి ఏర్పాటుకు యోచిస్తున్నారు. దక్షిణాది జిల్లాల్లో పట్టున్న పార్టీలతో కలసి గెలుపు తథ్యంగా కూటమి ఆవిర్భావానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆహ్వానం వైగో సంకేతాల గురించి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్.రాజాను మీడియూ కదిపింది. తమతో చెలిమికి ఎండీఎంకేను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఈలం తమిళుల సంక్షేమం కోసం వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన కృషి తమిళాభిమానులందరికీ తెలుసునని వివరించారు. ఈలం సంక్షేమాన్ని కాంక్షిస్తూ దక్షిణ తమిళనాడు వేదికగానే ఉద్యమాలు బయలుదేరాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పన డిమాండ్‌తో బీజేపీ సైతం ఉద్యమిస్తోందని వివరించారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈలం తమిళులు, జాలర్ల సమస్యలపై కీలక నిర్ణయూలు తీసుకుంటామని ప్రకటించారు. ఈలం తమిళుల్ని అభిమానించే పార్టీలు, సంఘాలు తమతో కలిసి రావాలనుకుంటే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
'మద్రాస్ కేఫ్' రాజీవ్ హత్యకు సంబంధించినది కాదు
శ్రీలంకలో సాగుతున్న అంతర్యుద్ధంపై తాను తీస్తున్న 'మద్రాస్ కేఫ్' చిత్రంలో రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉన్నమాట వాస్తవమే గానీ, ఆ సినిమా మాత్రం రాజీవ్ గురించి కానే కాదని చిత్ర దర్శకుడు షూజిత్ సర్కార్ తెలిపారు. చిత్ర నిర్మాత, బాలీవుడ్ హీరో, ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి జాన్ అబ్రహంతో కలిసి ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ హత్యకు సంబంధించిన సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అనుమతి ఏమైనా తీసుకున్నారా అని విలేకరులు సర్కార్‌ను ప్రశ్నించారు. దీనిక.. ఇది రాజీవ్ జీవిత చిత్రం కాదని, ఆయన పాత్రధారికి, రాజీవ్ గాంధీకి కొన్ని పోలికలు ఉన్నమాట మాత్రం వాస్తవమేనని తెలిపారు. ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం సభ్యుల దాడిలో రాజీవ్ మరణించగా, అలాంటి సంఘటననే సినిమా ట్రైలర్లో చూపించారు. అయితే, తాము వార్తాపత్రికలలో చదివి మాత్రమే ఆ సంఘటనను తీసుకున్నామని, ఇక దానిచుట్టూ ఉన్న మిగిలిన సంఘటనలను మాత్రం స్క్రిప్టు రచనలో ఊహాత్మకంగా రూపొందించినవేనని సర్కార్ చెప్పారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదని, అయితే.. ప్రతి ఒక్కరికీ ఆ సంఘటన జరిగిందని మాత్రం తెలుసని ఆయన అన్నారు. మద్రాస్ కేఫ్ చిత్రం ఈనెల 23న విడుదల కానుంది. అయితే, దీనిపై ఇప్పటికే నామ్ తమిళర్, ఎండీఎంకే లాంటి పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎల్టీటీఈ కార్యకర్తలను ఇందులో ఉగ్రవాదులుగా చూపించారంటూ వారు మండిపడుతున్నారు. అయితే.. ఇప్పటికే ఈ చిత్ర ప్రాజెక్టుపై ఏడు సంవత్సరాలు వెచ్చించిన సర్కార్ మాత్రం.. ఈ సన్నివేశం చిత్రానికి చాలా కీలకమని వాదిస్తున్నారు. తమ చిత్రంలో జాతికి జరిగిన నష్టం గురించి మాత్రమే చెబుతున్నామన్నారు. చాలామంది పౌరులు అక్కడ ప్రాణాలు కోల్పోయారని, ఇంకా చాలామంది నిరాశ్రయులుగా మారిపోయారని, అక్కడి సజీవ చిత్రాన్నే తాము చూపిస్తున్నామని అన్నారు.