'మద్రాస్ కేఫ్' రాజీవ్ హత్యకు సంబంధించినది కాదు
శ్రీలంకలో సాగుతున్న అంతర్యుద్ధంపై తాను తీస్తున్న 'మద్రాస్ కేఫ్' చిత్రంలో రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉన్నమాట వాస్తవమే గానీ, ఆ సినిమా మాత్రం రాజీవ్ గురించి కానే కాదని చిత్ర దర్శకుడు షూజిత్ సర్కార్ తెలిపారు. చిత్ర నిర్మాత, బాలీవుడ్ హీరో, ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి జాన్ అబ్రహంతో కలిసి ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ హత్యకు సంబంధించిన సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అనుమతి ఏమైనా తీసుకున్నారా అని విలేకరులు సర్కార్ను ప్రశ్నించారు. దీనిక.. ఇది రాజీవ్ జీవిత చిత్రం కాదని, ఆయన పాత్రధారికి, రాజీవ్ గాంధీకి కొన్ని పోలికలు ఉన్నమాట మాత్రం వాస్తవమేనని తెలిపారు.
ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం సభ్యుల దాడిలో రాజీవ్ మరణించగా, అలాంటి సంఘటననే సినిమా ట్రైలర్లో చూపించారు. అయితే, తాము వార్తాపత్రికలలో చదివి మాత్రమే ఆ సంఘటనను తీసుకున్నామని, ఇక దానిచుట్టూ ఉన్న మిగిలిన సంఘటనలను మాత్రం స్క్రిప్టు రచనలో ఊహాత్మకంగా రూపొందించినవేనని సర్కార్ చెప్పారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదని, అయితే.. ప్రతి ఒక్కరికీ ఆ సంఘటన జరిగిందని మాత్రం తెలుసని ఆయన అన్నారు.
మద్రాస్ కేఫ్ చిత్రం ఈనెల 23న విడుదల కానుంది. అయితే, దీనిపై ఇప్పటికే నామ్ తమిళర్, ఎండీఎంకే లాంటి పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎల్టీటీఈ కార్యకర్తలను ఇందులో ఉగ్రవాదులుగా చూపించారంటూ వారు మండిపడుతున్నారు. అయితే.. ఇప్పటికే ఈ చిత్ర ప్రాజెక్టుపై ఏడు సంవత్సరాలు వెచ్చించిన సర్కార్ మాత్రం.. ఈ సన్నివేశం చిత్రానికి చాలా కీలకమని వాదిస్తున్నారు. తమ చిత్రంలో జాతికి జరిగిన నష్టం గురించి మాత్రమే చెబుతున్నామన్నారు. చాలామంది పౌరులు అక్కడ ప్రాణాలు కోల్పోయారని, ఇంకా చాలామంది నిరాశ్రయులుగా మారిపోయారని, అక్కడి సజీవ చిత్రాన్నే తాము చూపిస్తున్నామని అన్నారు.