నీరా‘జనం’ | BJP Mahanadu IN Chennai | Sakshi
Sakshi News home page

నీరా‘జనం’

Published Sun, Feb 9 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

BJP  Mahanadu IN Chennai

సాక్షి, చెన్నై : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ సత్తాను నిరూపించుకునేందుకు కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. తమ నేతృత్వంలో మెగా కూటమికి కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడు తదితర పార్టీలు కలసి రావడంతో, రాష్ట్రంలో తమకు పట్టున్న చోట్ల గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ పవనాలు దేశంలో వీస్తుండడంతో ఆయన నేతృత్వంలో కూటమి మహానాడుకు బీజేపీ వర్గాలు నిర్ణయించాయి. వండలూరు వేదికగా వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేశారు. మోడీని చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినే ందుకు పెద్ద ఎత్తున జన సందోహం తరలి వచ్చింది.
 
ఆ పరిసరాల్లోని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జనం మహానాడు ఆవరణలోకి ప్రవేశించారు. విచిత్ర వేషధారణలతో, మోడీ మాస్కులతో, కమలం చిహ్నాన్ని చేత బట్టిన పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహానాడుకు బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు, జాతీయ కార్యదర్శి మురళీ ధర్ రావు, రాష్ట్ర నేతలు ఇలగణేశన్, పొన్ రాధాకృష్ణన్, తమిళిసై సౌందరరాజన్, హెచ్ రాజా, ఎండీఎంకే నేతలు మలై్ల సత్య, గణేషమూర్తి, ఐజేకే నేత పచ్చముత్తు పారివేందన్, కొంగునాడు నేత ఈశ్వరన్ తదితరులు వేదిక మీద ఆశీనులయ్యారు. తొలుత బీజేపీ స్థానిక నాయకులు, కూటమి పార్టీల నాయకుల ప్రసంగాలు సాగాయి. మోడీని పీఎం చేయడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ తమ కూటమి విజయ ఢంకా మోగించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 
 
మరో ఉద్యమం: కొంగునాడు నేత ఈశ్వరన్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం కోసం, ఓట్ల కోసం మోడీ నేతృత్వంలో మహానాడు జరగడం లేదన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు మోడీ మహోద్యమం చేపట్టారని, ఆయన నాయకత్వంలో అందరూ సైనికుల్లా కాంగ్రెస్‌పై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ఐజేకే నేత పచ్చముత్తు పారివేందన్ మాట్లాడుతూ, దేశాన్ని పట్టి పీడిస్తున్న, దోచుకుంటున్న కాంగ్రెస్‌ను తరిమి కొట్టేందుకు మరో స్వాతంత్య్ర ఉద్యమానికి మోడీ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఆ నాడు బ్రిటీషు వారిని దేశం నుంచి తరిమి కొట్టేందుకు గాంధీ స్వాతంత్య్ర సంగ్రామానికి ఏ విధంగా పిలుపునిచ్చారో, అదే తరహాలో కాంగ్రెస్‌ను దేశం నుంచి తరిమికొట్టేందుకు మోడీ నడం బిగించారని చెప్పారు. ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు  యూపీఏ సర్కారుపై ధ్వజమెత్తారు. 
 
ఆ పార్టీకి చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందని, మోడీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రధాని అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించామని, కాంగ్రెస్‌కు ఆ దమ్ము ఉందా అని సవాల్ చేశారు.  ఆరు గంటలకు చెన్నై చేరుకోవాల్సిన నరేంద్ర మోడీ రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు చేరుకున్నారు. ఆయన రాక ఆలస్యం అయినా, ఆయన ప్రసంగాన్ని వినేందుకు జనం ఎదురు చూడటం విశేషం. అలాగే, తన ప్రసంగాన్ని ఆరంభించే సమయంలో తమిళంలో మాట్లాడి ఆకట్టుకున్నారు. 
 
నిరసనలు : మోడీ చెన్నై పర్యటనను నిరసిస్తూ, ఇండియూ దేశీయ లీగ్ నేతృత్వంలో పలు చోట్ల నల్ల జెండాల ప్రదర్శన  నిర్వహించారు.  మధ్యాహ్నం టీ నగర్‌లోని కమలాలయాన్ని ముట్టడి చేందుకు యత్నించిన ఓ బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు.  టీ నగర్ బోగ్ రోడ్డులో మోడీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తాంబరం పరిసరాల్లోనూ నల్ల జెండాల ప్రదర్శనకు యత్నించిన వాళ్లను ముందుగానే పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మోడీ సభకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.  మోడీ సభకు ముందుగా ఉదయాన్నే ఆ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement