వీ ఫర్ విక్టరీ | V for Victory | Sakshi
Sakshi News home page

వీ ఫర్ విక్టరీ

Published Thu, Apr 3 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

V for Victory

 సాక్షి, చెన్నై:‘‘వీ ఫర్ విజయకాంత్.... వీ ఫర్ వైగో... వీ ఫర్ ఓట్స్... వీ ఫర్ విక్టరీ.. ఇదే మా పేర్లలోని మొదటి అక్షరం’’ అంటూ రెండు రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ఒకే వేదిక మీద నుంచి ఓటర్లను అలరించారు. ఆ ఇద్దరు ఎవరో కాదు..ఒకరు డీఎండీకే అధినేత విజయకాంత్, మరొకరు ఎండీఎంకే అధినేత వైగో. ఒకరికి మద్దతుగా మరొకరు ప్రచారంలో దిగిన అపూర్వ కలయికకు బుధవారం విరుదునగర్ వేదిక అయింది. బీజేపీ కూటమి తరపున ఎండీఎంకే నేత వైగో విరుదునగర్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. తన గెలుపు లక్ష్యంగా వైగో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే కూటమిలోని డీఎండీకే అధినేత విజయకాంత్  రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ వస్తున్నా రు. కూటమి గెలుపు లక్ష్యంగా ఆయన ప్రచారం ఆసక్తికరంగా సాగుతోంది. తన దైన స్టయిల్లో ప్రసంగాలతో ఆకట్టుకునే పనిలో ఉన్న విజయకాంత్ బుధవారం విరుదునగర్‌లో పర్యటించారు. ఒక పార్టీ అధినేతకు మద్దతుగా మరో పార్టీ అధినేత ప్రచారానికి రావడంతో విరుదునగర్‌లో సందడి వాతావరణం నెలకొంది. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఉదయాన్నే విరుదునగర్ చేరుకున్న విజయకాంత్ కళింగ పట్టిలోని వైగో ఇంటికి వెళ్లారు. వైగో తల్లి మారియమ్మల్ ఆశీస్సులను విజయకాంత్ అందుకున్నారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తనకు మద్దతుగా ప్రచారానికి వచ్చిన విజయకాంత్‌ను నిలువెత్తు మాలతో వైగో సత్కరించారు. 
 
 వీ ఫర్ విక్టరీ: ఇద్దరు అధినేతలు ఒకే ఓపెన్ టాప్ వాహనంలో శివాకాశి, విరుదునగర్‌లలో ప్రచారానికి కదిలారు. ప్రచారానికి వెళ్లిన చోటంతా ఈ ఇద్దరు నేతలకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ ఇద్దరు నేతలు కలసికట్టుగా ఒకే వేదిక మీదకు రావడం ఇదే ప్రపథమం. ఒక పార్టీ అధినేతకు మద్దతుగా మరోపార్టీ అధినేత ఓట్ల వేటకు రావడంతో ప్రచారం అంతా ఆసక్తికరంగా సాగింది. విజయకాంత్ తన దైన బాణిలో ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించారు. వైగో రాజకీయాల్లో తన కన్నా సీనియర్ అని, ఆయనకు మద్దతుగా ప్రచారం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందంటూ విజయకాంత్ పేర్కొనడం, ప్రచార మార్గం అంతా చప్పట్లతో మార్మోగడం విశేషం. తమ ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరం ఁవీరూ. గురించి విజయకాంత్ విశదీకరించారు. వీ ఫర్ విజయకాంత్ అని, వీ ఫర్ వైగో అని, వీ ఫర్ ఓట్స్ అని, వీ ఫర్ విక్టరీ అన్న ఛలోక్తులతో ప్రచారం సాగింది. వైగో పేరును, వారి చిహ్నం బొంగరాన్ని ఓటర్ల చేత చెప్పిస్తూ తన దైన బాణిలో ప్రసంగాలు చేసిన విజయకాంత్, చివరకు పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాలు ఎన్డీఏ కూటమిదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు డీఎంకే, అన్నాడీఎంకేలకు మార్చి మార్చి అధికారాలు అప్పగించింది చాలు అని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎన్డీఏ కూటమి ఆవిర్భవించిందని, ఈ కూటమి విజయపు కూటమిగా ప్రకటిస్తూ ధీమా వ్యక్తం చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement