♦ వైగో ప్రకటనపై అప్రమత్తం
♦ చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు
♦ రోజంతా పోలీసుల పడిగాపులు
♦ కలెక్టరేట్ వద్ద మోహరింపు
సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో తమిళ కూలీలను పోలీసులు కాల్చివేసినందుకు నిరసనగా శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామంటూ తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వై.గోపాలస్వామి ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు సరిహద్దులతో పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని పళ్లిపట్టు, కాలువపల్లె, పలమనేరు, వి.కోట, నాగలాపురం, పుత్తూరు, గుడిపాల, యాదమరి తదితర సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించి తనిఖీలు నిర్వహించారు.
వైగో ఏ క్షణంలోనైనా కలెక్టరేట్‌కు చేరుకుంటారనే ప్రచారంతో అక్కడి పోలీసులు టెన్షన్‌తో గడిపారు. కుప్పం నియోజకవర్గం గాంధీనగర్ సరిహద్దు వద్ద విడుదలై చిరుతైగల్ కచ్చి పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా, ఆంధ్రా పోలీసులు అడ్డుకున్నారు. సరిహద్దులో ఉన్న తమిళ పోలీసులు వారిని అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పళ్లిపట్టు చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు.
పలమనేరు కాలువపల్లె సరిహద్దు, వి.కోట పేర్నంబట్టు సరిహద్దు, సత్యవేడు నాగలాపురం, సురుటి పల్లె చెక్‌పోస్టులతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని రహదారుల్లో పెద్ద ఎత్తున పోలీసులు మకాం వేశారు. తమిళ ఆందోళనకారులు సరిహద్దు దాటకుండా భారీ బందోబస్తు నిర్వహించి తనిఖీలు చేశారు. ఎట్టకేలకు మధ్యాహ్నం తమిళనాడులోని వేలూరులో వైగోను పోలీసులు అరెస్టు చేశారనే వార్తతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయినా సరిహద్దుతో పాటు కలెక్టరేట్ వద్ద సాయంత్రం వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రకూలీలను జిల్లాకు చెందిన టాస్క్‌ఫోర్సు పోలీసులు ఈ నెల 7న తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
పోలీసులు ఏకపక్షంగా కూలీలను పట్టుకెళ్లి కాల్చి చంపారంటూ తమిళనాడు ఎండీఎంకే నేత వై.గోపాలస్వామి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులను తమిళనాడుకు పంపి వైగో కదలికలపై నిఘా పెట్టారు. వైగో తమిళనాడు పరిధిలో వేలూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 500 మందితో అక్కడే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వైగో చిత్తూరుకు చేరుకోనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ తరువాత వైగోను వేలూరులోనే పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలుసుకుని ఇక్కడ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరిహద్దులతో పాటు చిత్తూరు కలెక్టరేట్ వద్ద వందలాది పోలీసులు సాయంత్రం 6 గంటల వరకు బందోబస్తు కొనసాగించారు.
సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్
Published Sat, Apr 11 2015 4:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement