లాఠీ ప్రతాపం
- 15 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు
- చర్చలకు పిలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
- కడప కలెక్టరేట్‌ను ముట్టడించిన కార్మికులు
- లోపలకు చొచ్చుకెళుతుండగా అడ్డుకున్న పోలీసులు.. తోపులాట
- లాఠీలు ఝళిపించిన పోలీసులు.. 25 మందికి గాయాలు
- ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
కడప సెవెన్‌రోడ్స్ : తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ను ముట్టడించిన మున్సిపల్ కార్మికులపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీలు ఝుళిపించారు. మహిళలని కూడా చూడకుండా తోసివేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. కిందపడిపోయి కొందరు, పోలీసుల లాఠీచార్జ్‌లో మరికొందరు మొత్తం 25 మంది గాయపడ్డారు. వీరిలో కొందరిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపాలిటీ ఒప్పంద కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతకూ స్పందించక పోవడంతో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు వందలాది మంది కార్మికులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
ప్రధాన రహదారిపై మండుటెండలో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల ఆందోళనతో కలెక్టరేట్ వైపు వెళ్లే ఒక రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. వైఎస్సార్‌సీపీ, అనుబంధ సంఘాల నాయకులు ఆందోళనకు మద్దతు ప్రకటించారు. కార్మికులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకుంటున్న సమయంలో కొంత మంది మహిళలు కిందపడగా, పోలీసులు ఒక్కసారిగా లాఠీ ఝళిపించడంతో ఎక్కడికక్కడ చాలామంది కిందపడిపోయారు. పోలీసులు ఇష్టానుసారంగా కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. పారిశుద్ధ్య కార్మికులు, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు సుమారు 25 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమందిని చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు.
సొమ్మసిల్లిన కార్మికుడు: కడప నగర పాలక సంస్థలో పనిచేస్తున్న శ్రీనివాసులు అనే పారిశుద్ధ్య కార్మికుడు తోపులాటలో సొమ్ముసిల్లి పడిపోయాడు. దీంతో ఆందోళన కారులు కొంతమేర ఉద్రిక్తతకు గురైనా, తొలున శ్రీనివాసులును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కార్మికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ పోలీసు వలయాన్ని చేధిం చుకుని కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో పోలీసులు తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి : సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకటశివలు మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్లు రెండు వారాలుగా సమ్మె చేస్తుంటే చర్చలకు ఆహ్వానించి పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశానికి అంటుతూ జీవన వ్యయం పెరిగిపోయిన పరిస్థితిలో కార్మికులు కనీస వేతనం కోరుతున్నారన్నారు.
ఆర్థిక పరిస్థితి నిజంగా సరిలేకపోతే సీఎం చాంబర్ ఏర్పాటుకు, ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రలకు వెళ్లడానికి, ప్రచారాలకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 వేల మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారని, ఒక్కొక్కరికి రూ. 5 వేలు చొప్పున వేతనాలు పెంచినప్పటికీ ఏడాదికి రూ.300 కోట్లు మాత్రమే అవుతుందని విశ్లేషించారు. కోట్ల రూపాయలు దుబారా చేస్తున్న ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. సమ్మె విరమించకపోతే తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం సహించబోమని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ మద్దతు: కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రత్యక్ష ఆందోళనలో భాగంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజాద్‌బాషలు మద్దతు తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏడెనిమిది వేల రూపాయలతో ఈ రోజుల్లో ఒక కుటుంబం బతకడం సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు తాము ఏడెనిమిది వేల రూపాయల జీతంతో బతుకుతామని చెబితే ఉద్యమాన్ని విరమిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని చంద్రబాబు మరిచారని విమర్శించారు.
సంపద సృష్టించే కార్మికులకు కడుపునిండా తిండిలేకుండా చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఒక్కో ఎమ్మెల్యేకు లక్షా 25 వేల రూపాయలు జీతం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే జీవితాంతం పెన్షన్ వస్తుందన్నారు. మరణిస్తే భార్యకు 50 శాతం పెన్షన్‌గా ఇస్తున్నారని తెలిపారు. కానీ నిత్యం మలినాలను తొలగించే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం వహించడం సహించరాని విషయమన్నారు. ప్రచారం కోసం గోదావరి పుష్కరాల్లో 1600 కోట్ల రూపాయలు తగిలేసిన ముఖ్యమంత్రి.. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల వివక్ష చూపడం అన్యాయమన్నారు. సర్కార్ మెడలు వంచైనా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని రాష్ర్ట బంద్‌కు సైతం సిద్ధం కావాల్సిన అవసరముందని సూచించారు. ఇందుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.
కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు కనీస వేతనాలు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. పక్కనున్న రాష్ట్రంలో మాదిరి ఇక్కడ కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మాత్రమే పెంచుతామని చెప్పడం సహేతుకం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, కేసీ బాదుల్లా, సీఐటీయూ నాయకులు శంకర్, బీఎం ఎస్ నాయకులు లక్ష్మినారాయణరెడ్డి, సీపీఐ నేత ఎల్.నాగసుబ్బారెడ్డి, సీపీఎం నాయకులు సావంత్ సుధాకర్‌రావు, పాపిరెడ్డి, సిద్దిరామయ్య, ైవె ఎస్‌ఆర్‌సీపీ నాయకులు నిత్యానందరెడ్డి, యూత్ నేత రాజశేఖర్, ఎస్సీ ఎస్టీ సెల్ నేత సునీల్‌కుమార్, మైనార్టీ నేత షఫీ, ఎస్టీ విభాగం నాయకుడు వేణుగోపాల్ నాయక్, మహిళా నాయకులు వెంకట సుబ్బమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.