‘అపరేషన్‌ అకర్ష్‌’​ | BJP Steps Up Campaign To Beat BJD In Orissa | Sakshi
Sakshi News home page

‘అపరేషన్‌ అకర్ష్‌’​..

Published Fri, Mar 30 2018 10:56 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

BJP Steps Up Campaign To Beat BJD In Orissa - Sakshi

బరంపురం : రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒడిస్సాలో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. 2019లో రానున్న సాధారణ ఎన్నికలకు ముందుగా ఒడిస్సాలో మరో నాలుగు నెలల్లో జరగనున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావించి ఒకవైపు అధికార పార్టీ బీజేడీ..మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ పరస్పర ఎన్నికల యుద్ధానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి.

ఇందుకు ప్రధానంగా ఒక వైపు దక్షిణ ఒడిస్సా కేంద్ర బిందువు బరంపురం..మరోవైపు పశ్చిమ ఒడిస్సా ప్రాణకేంద్రం సంబల్‌పూర్‌ నగరాలు  వేదికలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 4న బీజేడీ బరంపురం నగరంలోను, 5వ తేదీన బీజేపీ సంబల్‌పూర్‌లోను మిశ్రమ సమ్మేళన్‌ పర్బ్‌ పేరుతో ‘అపరేషన్‌ అకర్ష్‌’​ చేపట్టి తమ తమ ప్రత్యర్థి పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలనుపోత్సహించేందుకు ఇరు పార్టీలు తమదైన రాజకీయ శైలిలో పావులు కదుపుతున్నాయి.  

అమిత్‌ షా–నవీన్‌ ‘ఢీ’ 
ఏప్రిల్‌ 4, 5 తేదీల్లో బీజేడీ, బీజేపీ  చేపట్టే మిశ్రమ సమ్మేళన్‌   వేర్వేరు బహిరంగ మహాసభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ‘ఢీ’ కొడుతున్నారు. ఏప్రిల్‌ 4వ తేదీన అధికార రాష్ట్ర బీజేడీ పార్టీ బరంపురం కళ్లికోట్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న  మిశ్రమ సమ్మేళన్‌ పర్బ్‌కు  ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ హాజరుకానుండగా..మరుసటి రోజు 5వ తేదీన సంబల్‌పూర్‌లో బీజేపీ మిశ్రమసమ్మేళన్‌ పర్బ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్గొంటున్నారు.

గత ఎన్నికల్లో పశ్చిమ ఒడిస్సాలో బీజేపీ తన ఓటు బ్యాంక్‌ను పెంచుకుని రెండో స్థానంలో ఉండగా వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు అమిత్‌ షా ఎన్నికల చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇందుకు 5వ తేదీన పశ్చిమ ఒడిస్సా, సంబల్‌పూర్‌లో జరగనున్న బీజేపీ మిశ్రమ సమ్మేళన్‌ సభలో భారీ స్థాయిలో యువ శక్తిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే రీతిలో 4వ తేదీన దక్షిణ ఒడిస్సా, బరంపురంలో  జరగనున్న  అధికార పార్టీ బీజేడీ మిశ్రమ సమ్మేళన్‌ పర్బ్‌లో స్థానిక రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర  మాజీ మంత్రి, స్థానిక మాజీ ఎంపీ చంద్ర శేఖర్‌ సాహు, ఏఐసీసీ సభ్యుడు విక్రమ్‌ పండా, డీసీసీ అధ్యక్షుడు భగవాన్‌ గంతాయత్‌లతో పాటు కాంగ్రెస్‌ నాయకులు బీజేడీలో చేరనున్నారు.  

కాంగ్రెస్‌ కంచుకోటకు బీటలు? 
ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గంజాం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. గంజాం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రముఖ నాయకులంతా అధికార పార్టీ బీజేడీ పార్టీలోకి వలస పోతుండడంతో  జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా కానరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో బరంపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆర్‌.జగన్నాథ్‌ రావు 7 సార్లు పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఘనత ఉంది.

మరోవైపు అత్యధికంగా తెలుగు ప్రజల ఓట్లు ఉండే బరంపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి అప్పటి దేశ ప్రధాని పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో దేశంలోనే  కాంగ్రెస్‌ పార్టీకి బరంపురం కంచుకోటగా నిలిచింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఘనచరిత్ర ఉన్న బరంపురం ప్రస్తుత వలసలతో జిల్లాలో కాంగెస్‌ కానరాకుండా పోయే దయనీయ పరిస్థితి ఏర్పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement