ఒక్క ఇంట్లోనే 150 మంది ఓటర్లా?
హైదరాబాద్: చిత్తూరు జిల్లా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఓటర్ల జాబితా రూపకల్పలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఒక్క ఇంట్లోనే 150 మంది నివసిస్తున్నట్లు తప్పుడు పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని ఈ అవకతవకలను సవరించి, తాజాగా ఓటర్ల జాబితా తయారు చేసేంత వరకు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని తిరుపతికి చెందిన పదిరి ద్వారకనాథ్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
తిరుపతి పట్టణంలోని 6/2/ఎస్12/342 ఇంటి నెంబర్‌లో 150 మంది నివసిస్తున్నట్లు పేర్కొంటూ వారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చారని తెలిపారు. ఇవన్నీ కూడా బోగస్ ఓట్లేనని ఆయన పేర్కొన్నారు. గోపాల్‌రాజు కాలనీలో 11 వీధులు ఉంటే ఓటర్లు జాబితాలో అదనంగా 12, 13 వీధులను జతచేసి, ఈ రెండు వీధుల్లో పలు డోర్ నెంబర్లను సృష్టించి అక్కడ ఓటర్లున్నట్లు ఓటర్ల జాబితాలో చేర్చారని తెలిపారు. 1300 నుంచి 1424 వరకు ఉన్న ఓటర్ల పేరన్నీ అధికారులు సృష్టించినవేనన్నారు.
బైరాగిపట్టెడ ప్రాంతంలోని డోర్ నెంబర్ 19/44/ఎస్/15 నుంచి 80 వరకు 30 ప్లాట్లు ఉన్నాయని, 101 నుంచి 504 వరకు ప్లాట్లకు నెంబర్లు ఇచ్చారని, కాని అధికారులు 1942 నుంచి 2008 వరకు నెంబర్లను సృష్టించడమే కాకుండా ఆ మేర భారీగా ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని వివరించారు. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో అక్రమాలు జరిగాయన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఓటర్ల జాబితాను రద్దు చేసి, తాజాగా ఓటర్ల జాబితా తయారీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని ద్వారకనాథ్‌రెడ్డి హైకోర్టును అభ్యర్ధించారు.